'ప్రియమైన ఆవార్ గీ' - బహుమతి పొందిన నా కథ
ఉదయిని అనే ఆన్లైన్ సాహిత్య పత్రిక వారు ఉగాది కి కథల పోటీ నిర్వహిస్తే అందులో పాల్గొన్నాను.
ఎన్నాళ్ళ నుంచో నాకిష్టమైన పాటలు వింటున్నప్పుడల్లా వాటికో ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉండేది. అలా పుట్టిందే 'ప్రియమైన ఆవార్ గీ'.
ఈ కథ రాయడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది. ఇప్పటి దాకా రాసిన కథల తో పోలిస్తే. కథా శిల్పం తో నేనొక రకంగా ఇందులో experiment చేసాను అని చెప్పచ్చు. మామూలు కథ లాగ కాక ఓ ఘజల్ పల్లవి చరణాల తో దీన్ని అల్లడం జరిగింది. ఘజల్ ని, కథని కలిపి చేసిన ఈ ప్రయత్నం నాకు సంతృప్తినిచ్చింది అనే చెప్పాలి (పొగరు అనుకోకపోతే).
250 పై చిలుకు కథలు వచ్చాయట. వాటిలో బహుమతి పొందిన ఒక కథ గా ఎంపిక అవ్వడం నిజంగా ఆనందాన్నిచ్చింది. ఈ పోటీ లో గెలిచిన కథలని పక్షానికి కొన్ని చొప్పున పబ్లిష్ చేస్తున్నారు. నేను ఇప్పటి వరకూ చదివిన కథల్లో ఝాన్సీ పాపుదేశి గారి 'మన్నుబోసే కాలం', అయోధ్య రెడ్డి గారి 'రెండు స్వప్నాల నడుమ గోడ' కథలు నాకు చాలా బాగా నచ్చాయి. మొదటి బహుమతి పొందిన కథ నా సెన్సిబిలిటీస్ కి అందలేదేమో అనుకుంటున్నాను.
ఈ కథ ప్రచురించి ఇప్పటికి రెండు మూడు రోజులైంది. బ్లాగు లో షేర్ చెయ్యడానికి ఇప్పుడు కుదిరింది.
కథ కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు https://udayini.com/2025/05/15/priyamaina-avargi/
కొన్ని మంచి కామెంట్స్ వచ్చాయి... కథ చదివే వారికి రీచ్ అయ్యినప్పుడు కలిగే ఆనందం బహుమతి పొందిన ఆనందానికి బోనస్ కదా!
వాడ్రేవు చినవీరభద్రుడు గారు చదివి ఇలా రాశారు "చాలా చక్కగా రాశారు. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సిస్టమేటిగ్గా చెప్పుకొచ్చారు. ఒక కవితలో లాగా ప్రతిసారి తిరిగి మళ్ళా ఆ పల్లవిని చేరుకుంటూ ఉన్నట్టు ఆ పాట దగ్గరకి తీసుకు వెళ్తూ వచ్చారు. నిజానికి ఇది కథ కాదు. కవిత కాదు. ఈనాటి సమాజంలో, ఈనాటి పరిస్థితుల్లో ఒక సున్నిత మనస్కురాలి హృదయ విశ్లేషణ. అయితే ఆమెకి ఆమె తండ్రి అలా ఉండి ఉండకపోయినా, ఆ తండ్రి ఆమె పట్ల మరింత ప్రేమగా ఉన్నా కూడా ఆమె అనుభవాలు ఆ విధంగానే ఉండి ఉండేవి. ఎందుకంటే అప్పుడు తన తండ్రి కన్నా మించిన ప్రేమ ఎవరు చూపిస్తారు అని ఆలోచించేదేమో. నిజానికి ఇది తల్లిదండ్రుల నీడ పడే అమ్మాయి కథ కాదు. వ్యక్తిత్వం, సౌకుమార్యం ఉన్నటువంటి ఏ భావుకురాలి ఆలోచనలైనా ఇలాగే ఉంటాయి.
కథలు రాస్తూ ఉండండి." ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అయిన మృణాళిని గారు "Very unusual narration. impressive. enjoyed thoroughly. for anyone who is familiar with the song, the story gives beautiful moments" అని ప్రోత్సాహం అందించారు.
వెబ్ సైట్ లోనే కథ కింద ఓ మంచి కామెంట్ పెట్టారు
Very Grateful.
ఇక నా బ్లాగు బాంధవుల స్పందన కోసం ఎదురుచూస్తుంటాను. 😊
Comments
Post a Comment