19, మే 2023, శుక్రవారం

ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి ..


నాకు ఇంటి పని తో చాలా పేచీలున్నాయి. 

ఒకటి ఆ పని కి ఉన్న రిపిటీటివ్ నేచర్. ఒక్క రోజు, ఒక్క సారి చేస్తే సరిపోదు. చేస్తూనే ఉండాలి. చేస్తే మామూలుగా ఉంటుంది కానీ చెయ్యకపోతే కనిపిస్తుంది ఏవిటో. ఇంటి శుభ్రానికి శత్రుత్రయం ... దుమ్ము, చెత్త, మట్టి. అందులో దుమ్ము రక్తబీజుడి జాతికి చెందినదే అనిపిస్తుంది నాకు. టెడ్డీ బేర్, బార్బీ బొమ్మలు ఇష్టంగా కొనుక్కొని ఈ రాక్షసుడికి భయపడే వాటికి ప్లాస్టిక్ కవర్ ముసుగులు వేసేస్తూ ఉంటాం కదా. ఈ దుమ్ము అటక ల మీదా, ఫాన్ల మీద ఓ రకంగా, నేల మీద ఇంకో రకంగా, ఎలక్ట్రానిక్స్ మీద మరో రకంగా ఏర్పడుతూ ఉంటుంది. ఒకదానికి ఉపయోగించిన ఆయుధం ఇంకో దానికి ఉపయోగించలేం. అమెజాన్ లో కి వెళ్తే దోమల మెష్ తుడవడానికి ఓ బ్రష్, కార్పెట్ తుడవడానికి ఇంకోటి ఇలా అమ్ముతాడు. కానీ మనం ఆ ట్రాప్ లో పడకూడదు. మా  నాన్నగారు పాత దిండు గలీబు తో ఫాన్ తుడిచే వారు. ఇవి ఇండియా లో మనకే సాధ్యమైన జుగాడ్ చిట్కాలు. 

కొంతలో కొంత చెత్త ఫర్వాలేదు. ఇంట్లో ఫంక్షన్ లాంటివి పెట్టుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది. లేకపోతే మామూలే. ఇంక మట్టి ...  పిల్లలు, మొక్కలు, పెంపుడు జంతువులు ఉన్నప్పుడూ, వానాకాలం లోనూ వస్తుంది అనుకోవచ్చు. ఇవి కాక పొరపాటున కిందపడి పగిలిపోయేవి, పౌడర్ డబ్బాల్లాగా చిమ్మబడేవి, నూనెలాగా రుద్దిరుద్ది కడగాల్సి వచ్చేవి .. ఇలాంటివి బోనస్. చిట్కాలు అవసరం అయ్యే పనులు ఇవి! 

ఈ మూడింటిని దాటితే ప్రత్యక్షమవుతాయి జీవులు... బొద్దింకలు, ఎలకలు, దోమలు, ఈగలు etc. నేను చచ్చిపోతాను.. మిమ్మల్ని కూడా తీసుకు పోతాను అనే సినిమా సైకోల్లాగా ఇవి పోవాలంటే మనక్కూడా ప్రమాదకరమైన కెమికల్స్ వాడాల్సిందే! 

ఇంటికొచ్చిన ప్రతీ సామాను నువ్వు మెయింటైన్ చెయ్యాల్సిన ఇంకో వస్తువే అని తెలియడమే పెద్దరికమ్. ఇది తెలియక వస్తువులు కొనుక్కుంటూ వెళ్లిపోవడం కుర్రతనం. ఈ కుర్రతనమే ఫాబ్రిక్ సోఫా కొనమంటుంది.  శిల్పారామం లో, హోమ్ సెంటర్ లో రకరకాల వస్తువులు కొనమంటుంది. మన దేశానికి సంబంధం లేని వాళ్ళు ఇళ్ళు ఎలా సద్దుకుంటారో చూసి వాళ్ళలాగా ఇల్లు సద్దుకోమంటుంది. వాళ్ళకి దుమ్ము తక్కువేమో.. అన్నీ ఓపెన్ గా ప్రదర్శించుకుంటారు. మన ఇళ్లలో ఒకేఒక షో కేస్ ఉంటుంది. అందులోనే అన్నీ పెట్టుకోవాలి. ఈ మధ్య ఈ రాగి పాత్రలు, ఇత్తడి  బిందెలు,బాయిలర్లు హాల్లో పెట్టుకోవడం ఒక క్రేజ్. కానీ వాటిని అలా మెరిపించాలంటే రెగ్యులర్ గా చింతపండు తో తోముకుంటూ ఉండద్దూ! మళ్ళీ అదో పని!

అభిరుచి ఉండి, ఆసక్తి ఉండి, చేసుకోగలిగిన శక్తీ ఉంటే ఇవన్నీ పనుల్లా అనిపించవు. అలాంటి వారి ఇళ్ళు కూడా భలే చక్కగా చూడముచ్చట గా ఉంటాయి. May God bless them! అలాంటి ఓ ఆంటీ మాకు ఉన్నారు. ఆవిడ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో! మనిళ్ళలో ఓ వాడుక ఉంది చూడండి.. నేల మీద పడ్డ పాలెత్తుకు తాగచ్చు అని ... అలా అన్నమాట. ఇద్దరి ఇళ్ళకి ఒకే అమ్మాయి తడిగుడ్డ పెడుతుంది. కానీ ఆవిడ నేల మెరిసిపోతూ ఉంటుంది. మా నేల మీద తడిగుడ్డ పెట్టిన ఆనవాలు కనిపిస్తాయి. (ఇది ఓ మాప్ యాడ్  లాగా అనిపిస్తోంది కదూ. కానీ కాదు. మేము వాడే మాప్ కూడా ఒకే కంపెనీ.. ఎందుకంటే అది మా హెల్ప్ తనే తెచ్చుకుంటుంది) ఓ రోజు అంటీ ని అడిగితే చెప్పారు ... అమ్మాయి తడిగుడ్డ పెట్టాక ఆవిడ మళ్ళీ పెట్టుకుంటారట! ఇలా శ్రద్ధగా, ఓపిక గా చేసుకున్న ఇళ్ళు చూడగానే తెలుస్తూ ఉంటాయి.  

ఓ వాడుక ఉంది చూసారా ... ఇల్లు చూసి ఇల్లాలిని చూడాలని.. చూడాలి, కానీ జడ్జ్ చెయ్యద్దు. ఇది నా పాయింటు.  ప్రతి కుటుంబానికి ఓ లైఫ్ స్టైల్ ఉంటుంది. అది వారి పరిస్థితులని బట్టీ,  ప్రయారిటీలని బట్టీ ఏర్పడుతుంది. అవి పూర్తిగా తెలుసుకోకుండా కేవలం ఇల్లు శుభ్రంగా లేదని ఒకరిని తక్కువ గా చూడకూడదు కదా. 

ఇన్స్టాగ్రామ్ లో యూరోప్ కి చెందిన ఓ అమ్మాయి కి ఇళ్ళు క్లీన్ చెయ్యడం ఎంత ఇష్టమంటే వారాంతాల్లో వేరే వాళ్ళ ఇళ్ళు శుభ్రం చేసేస్తోంది.  (ఆ అమ్మయి అకౌంట్ లింక్ ఇచ్చాను. పేరుకుపోయిన చెత్త చూడలేని సున్నితమైన సెన్సిబిలిటీ ఉంటే క్లిక్ చెయ్యకండి). వాళ్ళ ఇళ్ళలోకి బలవంతంగా దూరిపోయి కాదు లెండి. మానసిక పరిస్థితి బాలేకో, అంగ వైకల్యం వల్లో తమ ఇల్లు శుభ్రం చేసుకోలేక ఇల్లు చెత్త కుండీ లాగా అయిపోయిన వాళ్ళ ఇళ్ళు మంచి మనసు తో శుభ్రం చేసి పెడుతుంది. ఉచితంగానే. దేనితో ఏది తుడిస్తే ఎలా శుభ్రం అవుతుందో అనే కోర్స్ చేసింది కూడా ఆ అమ్మాయి! (మన దగ్గర హోమ్ సైన్స్ అంటారు... అది ఇలాంటి కోర్సెనా?). వారి దేశాల్లో మరీ పరిస్థితి ఘోరంగా ఉంది అని ఆ అమ్మాయి క్లీన్ చేసే ఇళ్ళు చూస్తే తెలుస్తుంది...  మన దగ్గర మరీ పరిస్థితి అంత దిగజారదు. 

దీనికి నాకు తోచిన ఓ కారణం ... ఇంటి శుభ్రత ని లక్ష్మి దేవి కి ముడిపెట్టేయడం. డబ్బులు మెండుగా ఉండాలంటే రోజూ ఇల్లు తుడుచుకోవాలి, పాచి చేసుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి అనేది మనకి బ్రెయిన్ వాష్ చేసేసారు. సాక్ష్యం కావాలంటే "ఉండమ్మా బొట్టు పెడతా" సినిమా చూడండి.  

సొంత ఇళ్ళ వాళ్ళకి ఇల్లు వారిదే కాబట్టి శ్రద్ధ ఉంటుంది. అద్దె వాళ్ళకి ఇంటి వాళ్ళ భయం ఉంటుంది. ఇవేవీ లేకపోయినా పని చెయ్యడానికి డొమెస్టిక్ హెల్ప్ వ్యవస్థ ఉంది. వాళ్ళకి తోచినట్టు తుడిచి పెట్టేస్తారు.

పశ్చిమం లో మోటివేషన్ గురు లు ఈ మధ్య చెప్తున్నారు .. లేచాక వెంటనే పక్క శుభ్రంగా వేసేసుకోండి.. దాని వల్ల మీ రోజు బాగా గడుస్తుంది అని. ఇది ప్రత్యేకంగా చెపుతున్నారంటే వాళ్ళకి అలవాటు లేదా అనిపించింది నాకు. మన ఇళ్లలో పిల్లల వీపులు బద్దలు కొడతారు కదా పక్కలు తియ్యకపోతే! అది కూడా పొద్దున్నే!  

నిజానికి శుభ్రంగా ఉన్న ఇల్లు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కొంత మంది విషయం లో ఈ మాట కి రివర్స్ కూడా పని చేస్తుంది. మనసు ప్రశాంతంగా అవ్వటానికి ఇల్లు క్లీన్ చేసే అలవాటు చాలా మందికి ఉంది మనలో. కానీ ముందు చెప్పినట్టు మానసిక స్థితి బాగోకపోతే అస్సలు ఇంటిని శుభ్రం చేసుకోలేం. ఆ పని భారంగా అనిపిస్తుంది. విసుగ్గా అనిపిస్తుంది. అలాగే కెరీర్ కొంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడు కూడా ఇంటి పని కి అస్సలు సమయం కేటాయించలేం. ఈగ ఇల్లలుకుతూ పేరు మర్చిపోయింది అనేది సామెత. ఇల్లలికే పనుల్లో పడితే పేరేంటి .. కెరీర్, వర్క్ గోల్స్ .. ఇవన్నీ మర్చిపోయే ప్రమాదం లేకపోలేదు. 

ఇల్లలకడం అంటే గుర్తొచ్చింది... నేను ముందు చెప్పినట్టు ... ఈ ఇల్లు శుభ్రత విషయం లో బ్రెయిన్వాష్ చిన్నప్పుడే మొదలవుతుంది .. ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి .. అని మొదలవుతాయి కదా చిన్న పిల్లల ఆటలు. ఇల్లలకగానే పండగ కాదు అంటారు.. ఈ సామెత కి నాకు మొత్తం వ్యాసం లో ఎక్కడా సందర్భం కుదర్లేదు. ఊరికే పడుంటుంది అని రాస్తున్న అంతే 😄

ఇంటర్నెట్ లో ఇల్లు మైంటైన్ చెయ్యడానికి క్లీనింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. రోజూ గదులు తుడుచుకోవటం, వారానికోసారి బాత్రూమ్స్, నెలకోసారి మంచం దులుపుకోవడం, కర్టెన్స్ గట్రా మార్చుకోవటం.. ఇలా. కానీ ఈ షెడ్యూల్ ఇంటింటికీ మారుతుంది కదా. ఇంటి ముందు రోడ్డు వేసినా, కన్స్ట్రక్షన్ పని జరిగినా ఇంట్లోకి బోల్డు దుమ్ము, ధూళి వస్తుంది. అలాగే ఇంట్లో పిల్లలూ, పెంపుడు జంతువులూ ఉంటే ఆ షెడ్యూల్ వేరు! అందుకే అవి పెద్దగా ఉపయోగ పడవు మనకి. అలాగే  వెస్ట్ వాళ్ళు కనిపెట్టిన వాక్యూం క్లీనర్లు, ఇల్లు తుడిచే రోబోలు కూడా మనకి పనిచేయవని నా అభిప్రాయం. 

మన దగ్గర దీపావళి, ఉగాది లాంటి పండగలకి ఇళ్ళు నిగనిగలాడేలా చేసుకుంటాం. మంచు దేశాల్లో స్ప్రింగ్ క్లీనింగ్ అంటారు ... ఓహో ఓహో వసంతమా అంటూ బూజులు దులుపుకుంటారన్నమాట అక్కడి వారు. 

ఇంటర్నెట్ లో అందరం చూసాం ఓ ఫార్వార్డ్ .. జపాన్ లో స్కూల్  పిల్లల కి టాయిలెట్స్ శుభ్రం చేయడం నేర్పిస్తారని. మన దగ్గర ఇది ఎంత పెద్ద వివాదం అవుతుందో నేను చెప్పక్కర్లేదు. గాంధీ సినిమా లో ఓ సీన్ ఉంటుంది... సబర్మతీ ఆశ్రమం లో టాయిలెట్స్ శుభ్రం చేసే పని వారానికి ఒకరు చెయ్యాలి. ఓ సారి కస్తూర్బా గారి వంతు వస్తుంది. ఆవిడ అస్సలు చెయ్యడానికి ఇష్టపడదు. గాంధీ ఆ సమయం లో ఆవిడ మీద కన్నెర్ర చేస్తారు కూడా!   

సంపన్నుల ఇళ్లలో టీపాయ్ ల మీద, బల్లల మీద, గోడల మీద ఉండే ఖరీదైన  గృహాలంకరణ వస్తువులు, ఇండోర్ ప్లాంట్స్ మీద ఆకులకి సైతం దుమ్ములేకుండా చూసినప్పుడు "తాజ్ మహల్ కు రాళ్ళెత్తిన కూలీలు" గుర్తొస్తారు నాకు.  మనం సొంతగా మెయింటైన్ చేసుకోలేని ఇళ్ళు కట్టుకుని ఇంకో జాతి మీద మనం డిపెండ్ అయ్యి .. వారు మన మీద డిపెండ్ అయ్యేలా చేస్కున్నామని  అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కానీ నేను ఈ బ్లాగ్ ప్రశాంతంగా రాయగలుగుతున్నాను అంటే నా ఇల్లు శుభ్రం చేసుకొనే పని నుంచి నేను ఫ్రీ అవ్వడం వల్లే అని కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ విషయం గురించి మాట్లాడటానికి నా అనుభవం తక్కువ... ఇంటి మెయింటెనెన్స్ లాగే. 😁

ఇంటి పని అదే పని గా చేసి కొంతమంది మైండ్సెట్ ఇరుకైపోతుందని అని నా అబ్సర్వేషన్.  తమ ఇల్లు తుడుచుకొని రోడ్డు మీద దుమ్ము పడేసే వాళ్ళు ఈ బ్యాచే అనిపిస్తుంది. బతుకంతా ఇంటి శుభ్రత చుట్టే తిరుగుతుంది ఇలాంటి వాళ్ళకి.  దానికి అనువైన నిర్ణయాలే తీసుకుంటూ ఉంటారు కూడా. ఇల్లు పాడవుతుంది అని కుక్కని పెంచుకోకపోవడం, సోషల్ లైఫ్ లేకుండా ఇల్లు అదే పనిగా తుడుచుకుంటూ ఉండటం, ఇంటికొచ్చిన అతిథుల వల్ల ఏదైనా ఒలికినా, మరక పడినా నిర్మొహమాటంగా వాళ్ళ ముందే మొహం మటమట పెట్టుకోవడం, పిల్లల్నయితే తిట్టేయడం... ఇవన్నీ ఈ మైండ్సెట్ వల్ల కలిగే పైత్యాలే.  ఫ్రెండ్స్ సీరియల్ లో మోనికా పాత్ర ఈ బాపతే. 

ఆడవాళ్లు ఇంటిపనులు, ఆఫీసు పనులూ 'బ్యాలెన్స్' చెయ్యలేక చస్తూ ఉంటే 'మగవాళ్ళు చీపురు పట్టుకోకూడదు' అనే మాటలు విన్నా, అసలు ఆ సదరు మగవాళ్ళకి ఇంట్లో చీపురు కట్ట ఎక్కడుందో తెలీదన్నా నాకు వారి మీద ఈర్ష్య, ఆగ్రహం ఒకేసారి వస్తాయి. ఇదే మగవాడికి ఓ షాపు ఉండి ఆ రోజు బాయ్ రాకపోతే చీపురుతో తన కార్యక్షేత్రాన్ని తుడుచుకుంటాడు! ఇప్పుడు పరిస్థితి లో చాలా మార్పు వచ్చింది .. కాదనట్లేదు. కానీ ఇప్పటికీ ఇంటి నిర్వహణ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేని ప్రివిలేజ్ లో ఎంతమంది మగవారు ఉన్నారో కదా! 

జీవితాన్ని కాచి వడబోయలేదు కానీ ... గోరువెచ్చ గా సిప్ చేసిన అనుభవం తో నాకు తెలిసిందేంటంటే .. దీపం కిందే చీకటి ఉన్నట్టు ...మనం సుఖం అనుకునే ప్రతి దాని వెనక ఓ నస ఉంటుంది. సౌకర్యం కోసం, సెక్యూరిటీ కోసం మనిషి ఇళ్ళు నిర్మించుకుంటే ఆ వెనకే వస్తుంది ఎడతెగని ఇంటిపని. కనిపించదు కానీ మన దినచర్య లో చాలా భాగం ఇదే ఆక్రమించుకుంటుంది. ఇష్టంగా చేసుకున్న రోజు exercise, టైం పాస్. లేనిరోజు విసుగు, చాకిరీ.  

లేబుళ్లు: , , , , , , , , ,

4, జులై 2020, శనివారం

వీకెండ్ స్వాతంత్రం

సముద్రం లో ఉప్పుకి చెట్టు మీద కాయకి లంకె పెట్టిన ఆ దేవుడే తెలుగు వాళ్ళకి అమెరికా కి కూడా లింకు పెట్టేసాడు.

ఇప్పుడు మనకి చాలా కామన్ అయిపోయింది కానీ అసలు ఎంత విచిత్రం!

ఎక్కడ తెలుగు రాష్ట్రాలు? ఎక్కడ అమెరికా? వేల కిలోమీటర్ల దూరమే కాదు భావజాలాలు, వాతావరణాలు, సంస్కృతుల్లో బోల్డు తేడా. ఏంటో అలా రాసి పెట్టి ఉంది అనుకోవడమే తప్ప లాజిక్ కి అందనిది ఈ పరిణామం!

ఇప్పుడు అమెరికా డాలర్, అమెరికా రాజనైతిక, సామజిక పరిస్థితుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 'కాల్'కలం మొదలైపోతుంది .. 'అంతా బానే ఉన్నారా?' 'మీ ఏరియా లో ఎలా ఉంది?' 'జాగ్రత్త గా ఉండండి' .... కాల్ కట్ .. వర్రీ మొదలు.

తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటికి వెళ్లి సర్వే చేసిన వారి కుటుంబం నుంచో, చుట్టాల నుంచో లేదా కనీసం తెలిసిన వాళ్ళ సర్కిల్ నుంచో ఎవరో ఒకరు అమెరికా లో ఉన్నారని చెప్తారు.

అమెరికా లో ఉన్న తెలుగు వారి ముద్ర మెల్లిగా అన్ని రంగాల్లో కనబడుతోంది .. ఇక్కడా .. అక్కడా కూడానూ.

అందుకే ఈ రోజు అమెరికా స్వాతంత్ర దినం గురించి పోస్టు రాస్తే పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.

అత్తారిల్లు బాగుంటేనే మనమ్మాయి బాగుంటుందని వారి కోసం ప్రార్ధించే ఆడపిల్ల తల్లిదండ్రుల్లా మనం కూడా అమెరికా బాగోవాలని కోరుకోవడం భావ్యం అనుకుంటున్నాను.

నాకు వ్యక్తిగతంగా అమెరికాతో ఏం సంబంధం లేదు. నాకు తెలిసిన/తెలియని ప్రత్యక్ష పరోక్ష విధాలుగా నా జీవితం ప్రభావితం అవ్వడం తప్ప.. కొంత మంది మిత్రబాంధవులు అక్కడ ఉండటం మినహా.

కానీ సాంస్కృతికంగా బోల్డు ఉంది. నేను ఆసక్తి గా ఫాలో అయ్యే దేశాల్లో అమెరికా ఒకటి. వారి సినిమా, టివి, పుస్తకాల్లో నేను అభిమానించేవి చాలా ఉన్నాయి. నేను అభిమానించే వ్యక్తులు కూడా అమెరికాలో చాలా మంది ఉన్నారు. (నాకు వ్యక్తి ఆరాధన ఇష్టం ఉండదు .. అభిమానం అంటే వారి ఆలోచనా సరళి, వారు పాటించి కట్టుబడి ఉండే విలువల గురించే అని నా ఉద్దేశం .. అందులో అసలు సినిమావారెవరూ లేరు అని చెప్పదల్చుకుంటున్నాను). వారి సంస్కృతి లో నాకు నచ్చే అంశాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ విషయాలన్నీ అప్పుడప్పుడూ నా పోస్టుల్లో కనిపిస్తూనే ఉంటాయి కూడా.

నా ఉద్దేశ్యం లో అమెరికా ఓ సంపన్న కుటుంబం లో పుట్టిన వ్యక్తి లాంటిది. (ఇక్కడ నేను బాగా జెనెరలైజ్ చేసేస్తున్నాను ... అందరూ ఇలా ఉంటారని కాదు .. టిపికల్ బిహేవియర్ అన్నమాట) ఎంజాయ్ చెయ్యడం బాగా తెలుసు. (అసలు వీకెండ్ కాన్సప్ట్ వారిదే కదా! మనది అర్ధరాత్రి స్వాతంత్రం అని పిల్చుకుంటాం .. వాళ్ళు ఇండిపెండెన్స్ డే కి లాంగ్ వీకెండ్ సెలవు తీసుకుంటారు!). ఏ పనైనా సులువు చేస్కోవడం తెలుసు. ఎప్పుడూ ఏదో ఒక కొత్తది ట్రై చేయనిదే తోచదు. సంపన్నులలాగే సుపీరియారిటి కాంప్లెక్స్, కంట్రోలింగ్ చేయాలనుకొనే తత్వం... కొంత మొండి తనం .. చేస్తే భారీ తప్పులు .. సహజంగానే వాటికి భారీ మూల్యాలు కూడా చెల్లిస్తుంది.

వాళ్ళ ఇళ్లలో లాగానే ఫుడ్ వేస్టేజి  ఎక్కువ ... బయట ఆహారం ఎక్కువ .. (అమెరికా లో ఫాస్ట్ ఫుడ్ చీప్. వండుకుంటేనే ఖరీదెక్కువ. ట.)

ఆధ్యాత్మికం గురించి నేర్చుకోవాలంటే 'తూర్పు' తిరిగి దణ్ణం పెడుతుంది .. తెలుసుకున్నది టెస్ట్ చేసి పుస్తకాలు గా రాసి ప్రచారం చేసేస్తుంది. తాను నమ్మింది అందరూ నమ్మేలా చేస్తుంది. అక్కడి పి. ఆర్ వ్యవస్థ (పబ్లిక్ రిలేషన్స్ .. అంటే మార్కెటింగ్ లాంటిది, ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేసే పని లో ఉన్నవారు) చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అలాగే కదా వారి జీవన శైలిని, ఫాస్ట్ ఫుడ్ ని, వాళ్ళ కంపెనీలని, ఫ్యాషన్ ని, పాప్ మ్యూజిక్ ని, టివి షో లని, హాలీవుడ్ ని.. అన్నీ మనకి బ్రెయిన్ వాష్ చేసేసి అమ్మేస్తూ ఉంటారు! కాలిఫోర్నియా లో పుట్టిన మెక్ డొనాల్డ్స్ కంపెనీ వి కేవలం కూకట్ పల్లి లో కనీసం ఓ పది రెస్టారెంట్లు ఉన్నాయంటే అతిశయోక్తి కానేకాదు. 


ఏ వెస్టర్న్ కల్చర్ లో మన యువత కొట్టుకుపోతోంది అని మనవాళ్ళు వాపోతుంటారో ఆ 'వెస్టర్న్' కల్చర్ లో సింహ భాగం అమెరికాదే కదా .. 😊(నాకో అనుమానం .. ఈ కేజువల్ డేటింగ్, రొమాంటిక్ ప్రొపోజల్ .. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ .. ఇవి స్వతహా గా ఆకర్షణ ఉండే పద్ధతులా లేక సినిమాల్లో చూసి చూసి బ్రెయిన్ వాష్ అయిపోయామా? లేక ఇవన్నీ మన దగ్గర కూడా జరుగుతూ వచ్చాయి కానీ పేర్లు మాత్రం అమెరికా పెట్టిందా పాపం?) 

ఇప్పుడు ఇలా 'పెద్దన్న' లాగా ప్రవర్తిస్తున్న దేశం ఒకప్పుడు దాస్య శృంఖలాల్లో ఉండేది అంటే ఆశ్చర్యం గా ఉంటుంది. అమెరికా కి, తెలుగు వారికీ ఏదైనా సంబంధం వెతికితే అది చారిత్రకంగా మాత్రమే ఉంది. ఇద్దరి విలన్ ఒకరే. మన మీద జులుం చెలాయించిన బ్రిటిష్ వాళ్ళే వాళ్ళ మీద కూడా పెత్తనం చెలాయించారు. వాళ్ళు సాయుధ పోరాటం చేసి స్వాతంత్రం సాధించుకున్నారు కాకపోతే మనకంటే రెండు శతాబ్దాల ముందే... 1783 లో. మన తో పోలిస్తే స్వతంత్ర దేశం గా అమెరికా కి ఆ విధంగా రెండు శతాబ్దాల లీడ్ దొరికింది.

అమెరికా తనని తాను పెద్దన్న అనుకోవడం సరే కానీ తెలీకుండా మిగిలిన ప్రపంచం ఇది ఫాలో అయిపోతుండటం నాకు నవ్వు తెప్పిస్తుంది.

రాజనీతి, డాలర్ విలువ.. ఇవన్నీ సరే. వీటిలో ఎంతో పవర్ ప్లే ఉంటుంది .. 
కానీ సాంస్కృతిక వ్యవహారాల్లో కూడా! (నా అమాయకత్వం కానీ ఉమ్మడి లో వంటింట్లో ఎవరి పెత్తనం నడుస్తుందో అన్ని పవర్లూ వాళ్ళ చేతుల్లోనే గా ఉండేది!)

ఉదాహరణ కి మన వాళ్ళ 'ఆస్కర్' మోజు! వాళ్ళ దేశం లో వాళ్ళు ఇచ్చుకునే అవార్డులని మనం తలమానికంగా భావించడం ఏవిటో! అసలు ఆ అవార్డుల ప్రదానం లో (మిగిలిన అవార్డుల్లాగే) ఎన్నో లోపాలు ఉన్నాయి ... స్త్రీ దర్శకులకి, నల్లవారికి, కామెడీ, ఫామిలీ సినిమాలకి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం ... అర్హత ఉన్నా నామినేట్ కూడా చెయ్యకపోవడం లాంటి ఎన్నో సమస్యలున్నాయి అక్కడ కూడా.

ఇప్పుడు కొత్తగా కళా రంగం లో కూడా ఈ ట్రెండ్ చూస్తున్నాం .. కవో, గాయకుడో, నర్తకో అక్కడ పెర్ఫార్మ్ చేస్తే ఇక్కడ విలువ పెరుగుతుందట .. ఇది తెలిసి చాలా ఆశ్చర్యపోయాన్నేను ..

మొన్న జగ్గీ వాసుదేవ్ గారు ఒక వీడియో లో అన్నారు .. 'ఈ రోజు నేను చెప్తున్న విషయాలు నేను గత 15 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాను .. నేను ఇన్నేళ్లూ నాలానే ఇలానే ఉన్నాను.. ఒక రోజు హఠాత్తుగా అమెరికా లో ఎవరికో నేను నచ్చాను .. వాళ్ళు చప్పట్లు కొట్టేసరికి ఇప్పుడు నా పాపులారిటీ పెరిగిపోయింది' అని.

ఇలా మన యోగా, పసుపు పాలు.. అన్నీ వాళ్ళే 'ధృవీకరిస్తే' మనం కళ్ళకద్దుకొని వాడుకుంటున్నాము. ఈ భావదాస్యం నాకు అస్సలు ఒప్పదు.

వాళ్ళకి డామినేట్ చెయ్యాలని ఎంత ఉందో మనకి మనోబలం, స్వతః విచక్షణ లేని వెర్రిపుచ్చలు అవ్వాలని అంత ఉంది. వాళ్ళు 'రిచ్' వాళ్ళలాగా ప్రవర్తిస్తే మనం వాళ్ళని ఫాలో అయిపోయే టిపికల్ మిడిల్ క్లాస్ లాగ ప్రవర్తిస్తున్నాం. అందుకే సగమే వారి మీద వేస్తున్నా ఈ పాపం.

పోనీ లెండి .. పుట్టిన రోజు ఇలాంటి మాటలు వద్దు.

స్వామి వివేకానంద ఇంగ్లీష్ లో రాసిన 'ఫోర్త్ ఆఫ్ జులై' అనే కవిత ని అక్కా, నేను మా సా పా సా లో పాడాము. ఇక్కడ చూడచ్చు.

ఇది ఆ కవిత.
Behold, the dark clouds melt away,That gathered thick at night, and hung So like a gloomy pall above the earth! Before thy magic touch, the world Awakes. The birds in chorus sing. The flowers raise their star-like crowns— Dew-set, and wave thee welcome fair. The lakes are opening wide in love Their hundred thousand lotus-eyes To welcome thee, with all their depth. All hail to thee, thou Lord of Light! A welcome new to thee, today, O Sun! Today thou sheddest Liberty! Bethink thee how the world did wait, And search for thee, through time and clime. Some gave up home and love of friends, And went in quest of thee, self-banished, Through dreary oceans, through primeval forests, Each step a struggle for their life or death; Then came the day when work bore fruit, And worship, love, and sacrifice, Fulfilled, accepted, and complete. Then thou, propitious, rose to shed The light of Freedom on mankind. Move on, O Lord, in thy resistless path! Till thy high noon o'erspreads the world. Till every land reflects thy light, Till men and women, with uplifted head, Behold their shackles broken, and Know, in springing joy, their life renewed!


స్థూలంగా దీని అర్ధం - అమెరికా సాధించుకున్న స్వాతంత్య్రాన్ని సూర్యోదయం తో పోల్చారు వివేకానంద. నల్లటి మేఘాలు తొలగిపోయాయి ... నీ అద్భుత స్పర్శ కి ప్రపంచం మేల్కొంటోంది ... ఓ సూరీడా! ఈ రోజు నువ్వు కాంతి నే కాక స్వేచ్చాకిరణాలని ప్రసరిస్తున్నావు! ఎంత ఎదురుచూసింది ఈ ప్రభాతం కోసం ఈ ప్రపంచం! తమకి తామే బహిష్కరణ విధించుకొని ఎందరో ఇంటిని, మిత్రుల ఆప్యాయతల్ని వదిలి నీ సాధన లో బలయ్యారు ... క్రూరమైన మహాసాగరాలు, దట్టమైన అడవులు .. ప్రతి అడుగు జీవన్మరణాల మధ్య పోరాటమే కదా! అప్పుడొచ్చింది .. వారి వ్రతం, ప్రేమ, బలిదానాలు ఫలించిన రోజు. ఓ సూర్యుడా .. ఇలాగే ప్రసరించు .. నీ స్వేచ్చా కిరణాలు మిగిలిన ప్రపంచం మీద కూడా పడనియ్యి .. ప్రతి నేల నీ మధ్యందిన స్వాతంత్ర కాంతి ని ప్రతిబింబించనీ! ప్రతి స్త్రీ, పురుషుడు శృంఖలాలు తెంచుకొని, తలెత్తుకొని, ఉత్సాహాతిరేకలతో కొత్త జీవితాలతో నిన్ను చూడనీ!

ఆయన ఆకాంక్షించినట్టే ఇన్నేళ్లకి ఎన్నో దేశాలు స్వతంత్రులై స్వయం పరిపాలన లో అభివృద్ధి పథాన నడుస్తున్నాయి!

వివేకానంద అంత బాగా చెప్పాక ఇంక మనం ఎక్కువ మాట్లాడితే బాగోదు.

శుభాకాంక్షలు తెలిపే టివి ప్రోగ్రాం భాష లో చెప్పాలంటే 'ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న అమెరికా కి శుభాకాంక్షలు తెలుపుతూ .. ప్రియమైన అమెరికా, ఆనందంగా ఉండు. పెద్దన్న అవ్వాలనుకుంటే ముందు బాధ్యత వహించు. నీ దేశం లోని లింగ, జాతి వివక్ష ని నిర్మూలించుకొని, ఆధిపత్య దాహం, తద్వారా వెలువడుతున్న హింస ని విడనాడి మిగిలిన దేశాలన్నిటికీ ఆదర్శంగా నిలువు. నీ నేటివ్ అమెరికన్స్ ని, వారి చరిత్ర ని పదిలంగా కాపాడుకో. నువ్వంటే ఇష్టపడి వస్తున్న ఇమ్మిగ్రెంట్స్ కి మంచి భవిష్యత్తు, సమానమైన అవకాశాలు కలగచెయ్యి. మా తెలుగు వాళ్ళని బాగా చూస్కో. హాపీ ఇండిపెండెన్స్ డే.... ఇట్లు మీ అమ్మా, నాన్న, చెల్లి- ఇవేమీ కాని నేను.

లేబుళ్లు: , , ,

27, జూన్ 2020, శనివారం

చెత్త టాపిక్

నా బ్లాగ్ క్వాలిటీ ని శంకించకండి.  అక్షరాలా చెత్త టాపిక్ ఇది .. 

చెత్త .. వేస్ట్ .. ట్రాష్ .. ఎన్ని మాటలు ఉపయోగించినా వాటిలో వ్యక్తమయ్యేది తీసిపారేసే, ఛీత్కార భావమే .. అదే చేస్తున్నాం కూడా .. మన జీవన శైలి వల్ల ఏ చెత్త ఎంత ఎలా పేరుకుపోయి అది ఎక్కడికి పోతోందో అని ఆలోచించట్లేదు. మన జీవన శైలే ఆలోచించనియ్యదు కూడా. మనం చాలా బిజీ. వేళాకోళంగా అనట్లేదు. నిజంగానే అంటున్నాను. మనకి చదువుకొనే అప్పుడు దీని గురించి అవగాహన కల్పించరు కదా. అది కూడా ఓ కారణం. 

హిందీ లో ఓ సామెత ఉంటుంది ... 'జబ్ జాగే వహీ సవేరా' (ఎప్పుడు మేల్కొంటే అప్పుడే తెల్లారినట్టు) అని. 

తెలుగు లో కూడా ఈ అర్ధం వచ్చే సామెత ఉండే ఉంటుంది.. ఇప్పుడు గుర్తు రావట్లేదు. (మీరు గుర్తు చేస్తే కృతజ్ఞురాలిని). 

అందుకే ఎప్పుడు మనకి తెలిస్తే అప్పుడే ఈ విషయం కొంచెం పట్టించుకోవడం మొదలుపెడితే మంచిదే. గిల్టీ ఫీలవ్వక్కర్లేదు. 

నగరం లో ఒక నలుగురు సభ్యులు ఉన్న సగటు కుటుంబం నుంచి ఎంత చెత్త వస్తుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది మనకి తెలిసిందే. 

పాల ప్యాకెట్ల నుంచీ మొదలు. సరుకుల కవర్లు, పేపర్లు, షాంపూ బాటిల్స్, సోప్ బాక్సులు, టీవీ, ఫ్రిజ్ లాంటి ఎలక్ట్రానిక్స్ కొన్నప్పుడు వచ్చే ప్యాకేజీలు, అట్టపెట్టెలు, పాతవయిపోయిన ఎలక్ట్రానిక్స్ చెప్పనే అక్కర్లేదు.. ఇప్పుడు ఈ జాబితా లో గాడ్జెట్లు .. వంద రూపాయలకి కొని వారం రోజులే పని చేస్తే పడేసిన ఇయర్ ఫోన్లు ... పాత సెల్ఫోన్లు, శానిటరీ నాప్కిన్స్, మిగిలిన ఆహారం, కూరల పళ్ళ తొక్కులు, మాంసాహారం నుంచి వచ్చే వ్యర్ధాలు... ఇక ఇల్లు వాకిలి తుడిస్తే వచ్చే దుమ్ము ధూళి .. వాకిట్లో చెట్లుంటే సరేసరి .. ఆ ఆకులు.. పుల్లలు, నిత్య పూజ నుంచి వచ్చే వ్యర్ధాలు .. దేవుడి నిర్మాల్యం, నూనె వత్తులు, అగరుబత్తి పుల్లలు.. స్టేషనరీ చెత్త .. పెన్సిల్ చెక్కుళ్ళు, రీఫిల్ కంటే పెన్నే ఛీప్ కాబట్టి కొని వాడి పడేసే వందలాది పెన్నులు, పేపర్లు, రోజూ పిల్లలు స్నాక్స్ గా తినే లేస్, కుర్కురే ప్యాకెట్ల కవర్లు, ఇవి కేవలం ఒక రోజువే! ఒక కుటుంబానివే.

ఒక కాలనీ, ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి ఇంకెంత వస్తుంది? ఒక మహా నగరం నుంచి ఎంత వస్తుంది? అది ఎక్కడకి పోతోంది? 

మన పర్సనల్ భవసాగరాల్లో పడి ఇలాంటివి మనం ఆలోచించం. నిజమే. ఎందుకంటే ఆలోచిస్తే మళ్ళీ గిల్టీ ఫీలింగ్ వస్తుంది. కానీ ఏమైనా చేసే ఓపిక ఉండదు ఈ వైపు. దాని బదులు ఆలోచన స్విచ్ ఆఫ్ చేసేస్తేనే బెటర్. ఐ అండర్స్టాండ్. 

కానీ నేను అసలే రకరకాల చికాకుల్లో ఉండే మనని ఇంకా చికాకుల్లోకి తోయడానికి ఈ టాపిక్ చర్చించట్లేదు. ఏదైనా చేసే అవకాశం ఉంది అని నాకనిపించి, నేను చేసి అది మీకు పరిచయం చేద్దామని ప్రస్తావిస్తున్న టాపిక్ అన్నమాట. 

ఐడియల్ పరిస్థితుల్లో అయితే తడి చెత్త, పొడి చెత్త ని వేరు చెయ్యాలి ... దీనికి హైద్రాబాద్ లో అయితే మన నగరపాలక సంస్థ వారు పాపం సెపరేట్ బిన్స్  ఇచ్చారు కూడా.  కానీ ఆ తర్వాత ఎం జరుగుతోందో తెలిసిందే. మనం ఇంట్లో వేరు చేసి వేసినా అన్నీ వెళ్తోంది ఒకే ఆటో కారియర్ లోకి. నగర పాలనా విధానాల మీద నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు. మనం ఏం చెయ్యచ్చో దాని మీద ఫోకస్ చెయ్యటమే నాకు ఇష్టం. ఒక్కో సారి మార్పు ప్రజల నుంచే రావచ్చు కదా. 

ఐడియల్ పరిస్థితుల్లో నిత్యావసరాల తయారీదార్లు రీసైకిల్ చెయ్యగలిగే పదార్ధాలే ప్యాకేజింగ్ కి వాడాలి... రీఫిల్ ప్యాక్ లు .. ముఖ్యంగా షాంపూ లాంటి వాటికి ఉండేలా చెయ్యాలి .. లేదా అటు వైపు ఏదో ఒక ఆలోచన చెయ్యాలి .. ఒక్కో సారి సేల్స్ ఎక్కువ చేసేయాలని  రీఫిల్ ప్యాక్ లని కంపెనీలే ఎంకరేజ్ చెయ్యవు .. (విమ్ లిక్విడ్ బాటిల్ ఇంట్లో ఉంది .. రీఫిల్ ప్యాక్ తీసుకుందామని వెళ్తే బాటిల్ రీఫిల్ కన్నా ఛీప్ పడుతోంది .. అదే కొంటాం కదా .. పాత బాటిల్ ఏమో డస్ట్ బిన్ పాలు.. చెత్త లో ఇంకో ప్లాస్టిక్ బాటిల్!) 

మహానగరాల్లో చెత్త మహాసాగరాల్లోకి పారి అక్కడి జీవాలని ఎంత ఇబ్బంది పెడుతోందో పాపం (ఆ వీడియోలు చూడలేం బాబోయ్ ..) అంతెందుకు ..ఆవులు ప్లాస్టిక్ కవర్లు తినేసి పడుతున్న వేదనలు మామూలా? (ఇదిగో .. ఇందుకే ఇవన్నీ ఆలోచించం మనం .. ఆర్ట్ సినిమా నిజాలివి). 

ఐడియల్ పరిస్థితుల్లో అసలు ఇంత చెత్త ఉండకూడదు. అది మనకి కొత్తేమి కాదు .. ఓ పదిహేను-ఇరవై సంవత్సరాల క్రితం ఇంత చెత్త ఉత్పత్తి చేసే అలవాట్లు లేవు మనకి. నాకు చిన్నప్పుడు సంచి లేకుండా సరుకులకు వెళ్లడం గుర్తే లేదు ... ఈ మధ్య కదా కవర్లు అలవాటయ్యాయి .. అందరి దగ్గరా రకరకాల సైజుల్లో బుట్టలుండేవి. అలాగే పచారీ దుకాణాలు ఉన్నప్పుడు కాగితపు పొట్లాలు కట్టేవారు. ఎవరికి ఎంత కావాలంటే అంత. నూనె గానుగ కి అమ్మ స్టీల్ బాటిల్ లాంటిది ఇచ్చి పంపేది కొబ్బరి నూనె, నువ్వుల నూనె తీసుకురమ్మని. రోడ్డు మీద పళ్ళు, పూలు అమ్మే వాళ్ళందరూ పొట్లాలే ఇచ్చేవారు. బట్టల దుకాణాలు కూడా కంచి పట్టు చీర కొన్నా బ్రౌన్ కవర్ లో పెట్టివ్వాల్సిందే. 

ప్రపంచీకరణ తెచ్చిన రకరకాల మంచి చెడు ల్లో .. ఈ ప్లాస్టిక్ కవర్ల వ్యాప్తి 'చెడు' జాబితా లోకే వెయ్యాలి మరి. మన తర్వాతి తరాలకి ఎంత తిన్నా తరగని ఆస్తి నివ్వాలని చూస్తుంటాం మనం. కానీ ఎన్ని తరాలు అయినా భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ కవర్లు నిండిన పర్యావరణాన్ని ఇస్తున్నాం ఆస్తి గా. మన తర్వాతి పదో తరం వారు మా ముత్తాత పారేసిన ప్లాస్టిక్ కవర్ ఇది తన ముని మనవడికి చూపించుకోవచ్చు. 

చెత్త పేరుకుపోవడం సమస్య కాదు. అది సహజం. 

దాన్ని ఏం చెయ్యాలో తెలియకపోవడం సమస్య. 

ఒక్కొక్క చెత్తని ఒక్కోలా డీల్ చెయ్యాల్సి ఉంటుంది. 

(నాకు టెన్షన్ కలిగించే కేటగిరి .. దేవుడి పూజకి సంబంధించినవి. పాతపడిపోయిన దేవుడి పటాలు ... బీట వారిన విగ్రహాలు .. క్యాలెండర్లు, దేవుడి బొమ్మలు ప్రింట్ చేసిన శుభలేఖలు, డైరీలు ..  అప్పటికే మన వాళ్ళు గుళ్ళలో ఓ మూల పెట్టేస్తూ ఉంటారు వీటిని.)

గుడ్ న్యూస్ ఏంటంటే మనం రోజూ విడుదల చేసే వ్యర్ధాల లో చాలా వరకూ రీ సైకిల్ చెయ్యచ్చు... మనం వాటిని డస్ట్ బిన్ లో పడెయ్యకుండా విడిగా పెడితే చాలు! 

ఇందులో కొన్ని మనం ఇప్పటికే చేస్తూ ఉంటాం కూడా .. న్యూస్ పేపర్లు, మేగజైన్లు, సీసాలు (అదే అదే .. అన్ని రకాల సీసాలూనూ మరి). గేటెడ్ కాంప్లెక్స్ లో అయితే తెలియదు కానీ కాలనీలలో ఇప్పటికీ ఇవి కొనే వారు ఇంటికే వస్తూ ఉంటారు ... డబ్బిచ్చి తీసుకుపోతూ ఉంటారు. 

ఇదే పని ఇంకొంత సమగ్రంగా, సులువుగా చేస్తోంది ఓ హైదరాబాద్ స్టార్ట్ అప్ (అంకుర సంస్థ అంటారే .. అదన్నమాట). 

మొన్న మా ఇంట్లో ఏం చెయ్యాలో తెలీని కేటగిరీ లో కొన్ని ఇచ్చేసేవి ఉంటే మా నాన్నగారు రీసెర్చ్ చేసి పట్టుకున్నారు వీళ్ళని. 

ఈ సంస్థ పేరు క్రాప్ బిన్ (చెత్త బుట్ట). ఇది వాళ్ళ వెబ్ సైట్



ఇది స్పాన్సర్డ్ పోస్టు కాదు. నాకు నచ్చిన విషయాన్నిషేర్ చేస్కుంటున్నా అంతే. 

పదిహేను కేజీలు కానీ 120 రూపాయల విలువ ఉన్న చెత్త కానీ .. రెండిట్లో ఏదైనా పోగయ్యాక వీళ్ళని ఆన్లైన్ లో మెసేజ్ చేసి పిలవచ్చు. వీళ్ళు ఎలక్ట్రానిక్ తూకాలు తెచ్చి మన ముందే చెత్త తూచి డబ్బులిచ్చి ఆటో కారియర్ లో తీస్కెళ్ళిపోతారు. 

వీళ్ళ సర్వీస్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మనం ఆ డబ్బు తీసుకోకుండా డొనేట్ చెయ్యాలనుకుంటే వీళ్ళు బాగా చదువుకొనే పేద విద్యార్ధులకి ఫీజులు కట్టేస్తారు ఆ డబ్బుతో మన తరుఫున. ఇంకో ఆప్షన్ ఆ డబ్బు తో వీరి వెబ్ సైట్ లో వ్యర్ధాల తో తయారు చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. బలవంతమేమీ లేదు. డబ్బు కావాలంటే అదే ఇస్తారు కూడా. 

పనికి రాని పాత ఎలక్ట్రానిక్స్, షాంపూ బాటిల్స్, పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు .. అన్నీ తీసుకుంటారు. లోహ వ్యర్ధాలు బ్యాటరీలు కూడా తీసుకుంటారు. 

ఏవి తీసుకోరు అంటే తడి చెత్త, ఆహార వ్యర్ధాలు, చెక్క సామాను, చిప్స్ పాకెట్స్ (ఇవి రీసైకిల్ చేయలేరట). 

నేను వీళ్ళ వెబ్ సైట్ కి వెళ్లి మెసేజ్ పెట్టిన మర్నాడే వచ్చి తీసుకెళ్లిపోయారు చెత్త. రెస్పాన్స్ అంత ఫాస్ట్ ఉంది. 

ఈ అంకుర సంస్థ పనే వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందించడం. వీరు కార్పోరేట్ల తో టై అప్ అయ్యి వారి వ్యర్ధాల ని కూడా రీసైకిల్ చేసే పనిలో ఉన్నారు. 

వీరి గురించి ఈ ఆర్టికల్ లో మరిన్ని వివరాలు ఉన్నాయి . గతేడాది రాసారు ఈ ఆర్టికల్. ఆ సరికే వీరు రీసైకిల్ చేసిన వ్యర్ధాలు 470 టన్నులట!  

నెలకో డేట్ చెప్పేసి వచ్చెయ్యమంటే అలా కూడా వచ్చి తీస్కెళ్ళిపోతారట వీళ్ళు. 

ఇది పొడి చెత్త కి సొల్యూషన్. 

ఇంక మిగిలింది .. చెత్తలో అతి చికాకైన తడి చెత్త. అందులో సింహభాగం ఆహార వ్యర్ధాలే. 

కంపోస్ట్ గురించి వినే ఉంటారు. కూరలు, పళ్ళ తొక్కలు తదితర వంటింటి వ్యర్ధాలని ఎరువు గా మారుస్తారు చాలా మంది. దీనికి కూడా చాలా ఓపిక కావాలి. 

ట్రస్ట్ బిన్ అని ఇంకో ఆన్లైన్ సంస్థ ఉంది. వీరు కంపోస్ట్ తయారు చెయ్యడానికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తారు. 

కంపోస్ట్ మేకర్, మట్టి, ఓ బిన్ ... ఏవేం వేసుకోవచ్చో కూడా వారే చెప్తారు. పేపర్లు చిన్న చిన్న ముక్కలు కూడా చేసి వేసేయచ్చట అందులో. 

ఇది స్పాన్సర్డ్ పోస్ట్ కాదు .. నాకు నచ్చిన విషయం షేర్ చేస్కుంటున్నా అంతే 

ఓ పొర చెత్త, ఓ పొర కంపోస్ట్ మేకర్, మట్టి, ఇలా బిన్ నిండే వరకూ వేస్తూ పోవాలి. ఓ పదిహేను రోజులు దాన్ని ముట్టుకోకూడదు. (అందుకే వీళ్ళు రెండు బిన్లు కొనుక్కోమంటారు నెలకి సరిపడా). నెక్స్ట్ పదిహేనురోజులు రెండో బిన్ లో సేమ్ ప్రాసెస్. పదిహేను రోజులకి రెండో నిండుతుంది. మొదటిది ఎరువయ్యి రెడీ గా ఉంటుంది. ఏ దుర్వాసన రాకుండా ఉండటం వీరి ప్రాడక్ట్ ప్రయోజనాల్లో ఒకటి. 

ఈ బిన్ కి పంపు ఉంటుంది. దీన్నుంచి వచ్చే ద్రవం టాయిలెట్ క్లీనింగ్ కి ఉపయోగించుకోవచ్చట. ఇంక ఆ మట్టి సరే సరి .. కుండీల్లో వేసుకోవచ్చు. ఒక వేళ మన ఇంట్లో కుండీలు లేకపోయినా మొక్కలు పెంచే వారికి ఇవ్వచ్చు .. (అమ్మచ్చు కూడా!).

వీరి వెబ్సైటు ఇది 

నేను ఎన్నో రోజుల నుంచి కంపోస్ట్ చెయ్యడం మొదలు పెడదాం అనుకుంటున్నాను. త్వరలోనే ట్రై చేసి ఇక్కడ అప్డేట్ పెడతాను. మొక్కలు బాగా పెంచే మా ఆంటీ ఇంకో చిట్కా చెప్పారు ... వంటింటి వ్యర్ధాల ని ఎండ బెట్టేసి కూడా డైరెక్ట్ గా కుండీల్లో వేసుకోవచ్చట. ఆవిడ కి తెలిసిన ఇంకొక ఆవిడ వ్యర్ధాలన్నిటిని మిక్సీ లో వేసేసి మొక్కల్లో వేసే వారట. 

నాకు మొక్కల పెంపకం గురించి అస్సలు తెలియదు. ఈ కంపోస్ట్ కూడా నేను ఇంకా ట్రై చెయ్యలేదు. నా అజ్ఞానాన్ని మన్నించ ప్రార్ధన. కానీ థియరీ గా అయితే ఈ పరిష్కారాలు బాగున్నాయని అనిపించాయి. 

ఇది కొంచెం ఎక్స్ట్రా పనే. కాదనను. కానీ అలవాటు చేసుకుంటే మన వంతు భూమి కి హాని చెయ్యట్లేదనే తృప్తి ఉంటుందని నా అభిప్రాయం. 

మదర్ థెరెసా ని అడిగారట ... మీరు చేసేది సముద్రం లో ఓ చుక్కంతే కదా . .. ఇంకా బాధితులు, రోగులు ఎంత మంది లేరు .. మీరు ఎంతమందికని చెయ్యగలరు అని. ఆవిడ అన్నారట నేను చేసేది సముద్రంలో చుక్కంతే అయ్యుండచ్చు. కానీ ఆ చుక్క లేకపోతే సముద్రం ఆ చుక్క మేరకు తక్కువే కదా అని. 

అనంతంగా పేరుకుపోతున్న ఈ నగరపు చెత్త లో మా ఇంటి నుంచి ఏమీ రావట్లేదు అనేది అంతే గొప్ప తృప్తి. మన ని చూసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత మంది స్ఫూర్తి పొందుతారో కూడా కదా! 

చెత్తలేని చోట లక్ష్మి ఉంటుందంటారు. అలాంటిది చెత్తని రీసైకిల్ చేసి మరింత లాభం పొందడం ఇంకా ఎంత శ్రీకరం! 

స్వీడన్ దేశం వారు చెత్త ని ఎంతగా రీసైకిల్ చేసేసి జనాల్లో అవగాహన కల్పించేశారంటే వారి దేశం లో చెత్త అయిపోయి వారి స్కాట్లాండ్ తదితర దేశాల నుంచి చెత్త దిగుమతి చేసుకుంటున్నారట!!!!! ఆ దేశం వారు కరెంట్ చెత్త నుంచే ఉత్పత్తి చేస్తారు .. చలి దేశం కాబట్టి ఎన్నో ఇళ్ళకి హీటింగ్ కి కూడా అదే ముడి సరుకు. 1991 నుంచే వీరు సాంప్రదాయ ఇంధన వనరుల మీద భారీగా టాక్సులు పెంచేసి ఇలాంటి పర్యావరణ హితమైన ఇంధన ఉత్పత్తి ని ప్రోత్సహించారు. అక్కడి ప్రైవేట్ సంస్థలు కూడా ఇలా చెత్త నుంచే ఇంధనం ఉత్పత్తి చేసే పనిలో ఉన్నాయి. 

అప్రయత్నంగా అయినా ఇప్పటికి ఈ దేశం గురించి నేను మూడో సారి రాయటం.. (నేను అక్కడ సెటిల్ అయిపోతానేమో అని భయంగా ఉంది) 

ఆనందరాజ్యాల్లో దీని ప్రస్తావన వచ్చింది  (క్లిక్ చేయుడి - ఆనందమే లేదా)

Jonna Jinton అని నేను పరిచయం చేసిన యూట్యూబర్ ఈ దేశానికి చెందిన అమ్మాయే. (క్లిక్ చేయుడి - యే కౌన్ చిత్రకార్ హై)

ఓ బ్లాగ్ లో ఆ దేశం అందం, ఇంకో బ్లాగ్ లో ఆ దేశం ఆనందం బయటపడింది. ఈ బ్లాగ్ లో ఆ రెంటి వెనక రహస్యం బయటపడింది. చెత్త ని కూడా గౌరవించి, దాన్ని కూడా ఇంధనం గా వాడుకునే వారి దీక్షే వారి అందానికీ, ఆనందానికీ పునాది అయ్యింది. కదూ! 

లేబుళ్లు: , , , , , , , , ,

20, జూన్ 2020, శనివారం

పదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన నా కథ

చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టంగా చదివే ఈనాడు పుస్తకం లో నా కథ రావడం నా జీవితం లోని ఆనందాల్లో ఒకటి. 

ఆ కథ చదివి నన్ను ఆన్లైన్ లో వెతికి మరీ నా ఫేస్ బుక్ కి మంచి కాంప్లిమెంట్స్ పంపించారు కొంత మంది. ఇది బోనస్ ఆనందం. 

ఆ కథ ఈ రోజు మీ తో షేర్ చేసుకుంటున్నాను. 





 రెండో వరస ఆఖరు పేరా లో కొన్ని లైన్లు ప్రింట్ అవ్వలేదు. "గాభరాగా ఫోన్ ఎత్తితే 'లోన్ ఏమన్నా కావాలా అండీ?' అంటూ  వినిపించింది అటు నుంచి. కొంచెం ప్రశాంతత...'  







లేబుళ్లు: , , , , ,

13, జూన్ 2020, శనివారం

ప్లేట్లో వేడి వేడి టిఫిన్...

2008.... 

అప్పుడే పన్నెండేళ్ళు గడిచిపోయాయా? నిట్టూర్చింది సౌమ్య. 

తెల్లబడుతున్న తన ముంగురులని వెనక్కి తోసుకుని మళ్ళీ రాయనారంభించింది. 

కాలానికి ఏమి? అది అలా వెళ్లిపోతుంటుంది .. అవి మిగిల్చే అనుభవాలతో, జ్ఞాపకాలతో బ్రతకడమే మన పని ... ఏదో ఓ రోజు మనం కూడా కాలం చేస్తాం .. మన తర్వాతి వారికి ఏది మిగిల్చి వెళ్తాము అనేదే  మన చేతిలో ఉన్నది. 

ఇంతవరకూ రాసి కలం పక్కన పెట్టి కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. రైటింగ్ టేబుల్ మీద పెట్టిన కాఫీ ఎప్పుడో చల్లారిపోయింది... తన ఆవేశాల్లాగా ... 

2008... 

అవి నేను బ్లాగ్ లో ఫిక్షన్ అంటే కాల్పనిక సాహిత్యం రాసే రోజులు! కానీ పైన రాసిన లాంటి డ్రమాటిక్ ఫిక్షన్ కాదనుకోండి ... వ్యంగ్యం. (పైన రాసింది కూడా వ్యంగ్యమే అని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. 😉)

ఫిక్షన్ రాయడం నాకు మహా బోర్ .... నేను చెప్పాలనుకున్న విషయానికి ఓ కథ అల్లి, పాత్రల చిత్రణ చేసి, ఓ ప్రపంచం సృష్టించి.... ఆ పాత్రల చేత అనుకున్న మెసేజ్ ని చెప్పీ చెప్పకుండా చెప్పించడం ... అది దానంతట అదే పాఠకుడికి తట్టేలా చెయ్యడం .. అబ్బో .. చాలా డబుల్ పని. దాని బదులు .. ఇది ఇది .. అది అది .. అని సూటిగా చెప్పేస్తే బోల్డు పేపర్ సేవ్ అవుతుంది అని నా అభిప్రాయం 😁 ('చారు ఎలా వండాలో ఓ పాత్ర చేత చెప్పించి' అనే జంధ్యాల గారి జోకు గుర్తొచ్చింది ఇది రాస్తుంటే!)

ఇదంతా కూడా కొంత వ్యంగ్యమే అండీ బాబు .. కాల్పనిక సాహిత్యం అంటే నాకు బోల్డు ప్రేమ ఉంది. అసలు నేను ఫిక్షనేతర పుస్తకం చేతిలో కి తీసుకోవడం చాలా తక్కువ! రాయడం దగ్గరకొచ్చేసరికి ఫిక్షన్ అంటే కొంత బద్ధకం .. అంతే. కానీ ఒక్క విషయం .. చదవడమైనా .. పేరాలు పేరాలు, పేజీలు పేజీలు సాగే వర్ణనలు, చైతన్య స్రవంతులు (stream of consciousness ... స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్ నెస్ అనే రచనా ప్రక్రియ .. ఇందులో రచయిత కి ఏది తడితే అది ఏ మాత్రం ఎడిటింగ్ లేకుండా రాసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట!), 

మూస వాడుకలు కొన్ని ఉంటాయి .. అవి భరించడం కష్టం! అలాంటి మూస వేడుకలు కొన్ని - 

1. ప్లేట్లో వేడి వేడి టిఫిన్... టిఫిన్ ప్లేట్లో పెట్టడం కూడా వర్ణించాలా? అంత చెప్పిన వాళ్ళు ఆ వేడి వేడి టిఫిన్ ఏంటో చెప్పరు ... నేను అలా చెప్పనప్పుడల్లా ఉప్మా ఊహించుకుంటాను. 

2. కాఫీ (నాకసలే అలవాటు లేదేమో ... ఇంకా ఇది అనవసరమైన అంశం గా అనిపిస్తుంది!)

3. కాటన్ చీర, మల్లె పూలు 

4. సూర్యోదయ, సూర్యాస్తమయ ఉపమానాలు, 

5. 'ముందుకు వెళ్తున్న బస్సు/రైలు/పడవ/విమానం నన్ను గతం లోకి తీస్కెళ్ళాయి'

6. 'చెప్పొద్దూ' ... ఎన్ని కథల్లో నవలల్లో చదివానో బాబోయ్ ఈ వాడకం  

 ('చివరకు మిగిలేది' .. సుమారు ఇంకో ఇరవై పేజీల్లో నవల అయిపోతుంది అనగా ఓ సుదీర్ఘ వర్ణన ఉంటుంది .. అది ఆ నవల హీరో అయిన దయానిధి 'చైతన్య స్రవంతి'. ఎంత చదివినా ఆ స్రవంతి తెగదు ... సరిగ్గా పాఠకుడికి విసుగొచ్చే వేళకి నిధి డైలాగ్ ఉంటుంది 'ఏవిటీ ఎడతెగని వర్ణనలు' అని!😊)   

2008 లో ఓ బ్లాగ్ స్టార్ట్ చేసాను నేను. అందులో నాకిష్టం వచ్చినవి రాస్కొనేదాన్ని .. కొన్ని ఇంగ్లీష్ లో, కొన్ని తెలుగు లో .. కొంత ఇంగ్లీష్ కవిత్వం, తెలుగు చిట్టి ఫిక్షన్, పొలిటికల్ సెటైర్ వగైరా రాసేదాన్ని. 

నా ఇంగ్లీష్ నాటకం 'ఫైవ్ విమెన్ అండ్ ఎ బిల్' ఆ బ్లాగు లోనే ఓ పోస్టు గా మొదట రాసాను. దీని గురించి నాటకాల జగతి లో రాసాను ఇది వరలో. (తెలుగులో నాటకాల జగతి అని టైప్ చేస్తే గూగుల్ లో మొదటి రిజల్ట్ నా బ్లాగే నండోయ్!!!!!!!!😀 కానీ ఈ పదాలు గూగుల్ చేసే వారెవరూ ఉండరనుకోండి .. అది వేరే విషయం😄)

2015 వరకూ అప్పుడొక పోస్టు ఇప్పుడొక పోస్టు రాసాను. తర్వాత పని బాగా పెరగడం వల్ల టైం కుదిరేది కాదు. 

ఈ రోజు ఎందుకో అందులో ఒక పోస్టు షేర్ చేసుకుందాము అనిపించింది. ఆ బ్లాగ్ పోస్టు పేరు 'జడ' ... చిన్న ఫిక్షనల్ పీస్. దాన్ని కథ అనలేం ..  చిన్నది కాబట్టి. (ఇప్పుడే చూసాను .. ఈ బ్లాగ్ రాసింది జూన్ పదకొండు .. అంటే రెండు రోజులు అటూ ఇటూ గా సరిగ్గా పన్నెండేళ్ళు!)


ఆ బ్లాగ్ పోస్టు 'జడ' ఈ రోజు మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. 

దానికి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో. 

పన్నెండేళ్ళ క్రితం, ఇంకో బ్లాగు లో రాసిన ఓ పాత పోస్టు షేర్ చేసుకోవడానికి ఇంతెందుకమ్మా రాయడం ... ముఖ్యంగా ఆ మొదటి నాలుగు పేరాలు? 'ఇది చదవండి' అని లింక్ పోస్టు చేస్తే సరిపోతుంది కదా అంటారా? 

ఇప్పుడర్ధమైందా ఫిక్షన్ తో నా సమస్య ఏంటో!!! 

లేబుళ్లు: , , , , , , ,

6, జూన్ 2020, శనివారం

డూడ్లింగ్ అను పరధ్యాన చిత్రకళ

చిన్నప్పుడు స్కూల్ లో నో, పెద్దయ్యాక ఆఫీసు మీటింగ్స్ లోనో, లేదా ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతూనో చేతి లో పెన్ను పేపర్ ఉంటే ఏవో గీతాలు గీసేస్తూ ఉంటాం చూడండి ... 

ప్రతి చిన్న పని కి పేరు పెట్టేసే ఇంగ్లీష్ భాష లో దీని పేరు డూడ్లింగ్ ... (doodling). ఆ బొమ్మల్ని డూడుల్స్ (doodles) అంటారు. 

పిచ్చి గీతల్లా అనిపించే ఈ డూడుల్స్ కి మనస్తత్వ శాస్త్రానికి, ధ్యానానికి.. ఇలా చాలా లోతైన సంబంధాలున్నాయట .. వాటితో ఈ రోజు మిమ్మల్ని విసిగిస్తానన్నమాట. 😁

ఎప్పుడైనా గమనించండి .. ఇలా గీసే గీతల్లో ఎవరి స్టైల్ వారిది ఉంటుంది .. మా అక్క ఎక్కువగా కళ్ళు వేస్తుంది .... ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు అన్నట్టు మా అక్క ఆలోచిస్తుంటే పేజీ అంతా కళ్ళే ఉంటాయి! (దాని అనుమతి లేకుండా రాసేస్తున్నాను ... ఏం జరుగుతుందో ఏవిటో!) అలాగే కొంత మంది స్టిక్ ఫిగర్స్ .. అంటే ఓ నిలువు గీత .. దాని మీద గుండ్రంగా తల కాయ, ఆ గీత కి అటో రెండు ఇటో రెండు చేతులూ కాళ్ళలాగా గీస్తూ ఉంటారు. మా కజిన్ ఒకమ్మాయి పిచ్చి గీతాలు వెయ్యదు సరికదా ... కళాఖండాలే వేసేస్తూ ఉంటుంది.. ఆ డూడుల్స్ ఏ తాజ్ మహల్ మీదో చెక్కిన చిక్కటి డిజైన్ల లాగా ఉంటాయి .. చిక్కటి అంటే .. సునిశితమైన అల్లికలు, దగ్గర దగ్గర గా ఉండే సూక్ష్మమైన మెలికలు ఇలా అన్నమాట .. ఇంట్రికెట్ డిజైన్స్ .. కొంత మంది పువ్వులు వేస్తారు ... కొంత మంది ఓ చదరం వేసి దానికి 3 డి షేడింగ్ చేస్తూ ఉంటారు .. మీరేం వేస్తుంటారు జనరల్ గా? 

ఒక్కో సారి మనస్తత్వ నిపుణులు తమ దగ్గరికి వచ్చిన రోగి మానసిక స్థితి ని అర్ధం చేసుకోడానికి ఈ డూడుల్స్ ని ఉపయోగిస్తారట. సైకోపాత్ ల ని సైతం వీటి సహాయం తో పట్టుకోవచ్చట .. కొంత వరకూ. 

డూడుల్ సైకాలజీ ప్రకారం కొందరు స్ట్రెస్ కి కానీ, ఆందోళన కి కానీ లోనైపుడు డూడుల్స్ గీస్తూ ఉంటారట. కొందరు లోతైన ఆలోచన లో ఉన్నప్పుడు గీస్తారట. ఇంకొందరు మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇవి వేస్తూ ఉంటారట. 

ఏం వేస్తామో అది కూడా మన ఆంతర్యాల గురించి చెప్తుంది అంటారు. వీటి నిజానిజాలు ఎంత వరకూ అనేది తెలియదు కానీ .. గీసిన డూడుల్ మీదే మళ్ళీ గీయడం పనెక్కువైన వారు చేస్తారట .. సూటి గా ఉండే ఆకారాలు గీసే వారు పోటీ తత్వాన్ని కలిగి ఉండేవారై ఉంటారట.. ఆర్చ్ అంటే వంపు తిరిగిన డిజైన్ గీసేవారు ఏదో దాస్తున్నట్టు అట ... 

డూడుల్స్ మీద వికీ పేజీ ఇక్కడ చదువుకోవచ్చు .. ప్రఖ్యాత పరధ్యాన కళాకారుల్లో మన రవీంద్రనాథ్ టాగోర్ ఒకరట .. ఇది వికీ చెప్పింది అని కాదు కానీ మాకు టాగోర్ జీవితం నాన్ డిటైల్డ్ టెక్స్ట్ ఉండేది. అందులో ఇది చదివాను నేను. ఆయన కవిత్వం రాసిన పేజీ ని పెన్ తోనే గీతలు గీసి ఓ పెయింటింగ్ లాగా చేసే వారని. దాన్ని డూడుల్ అంటారని మాత్రం ఇప్పుడు తెలిసింది.  

గూగుల్ ఈ డూడుల్స్ అనే పదానికి బాగా పేరు తెచ్చి పెట్టింది. ఓ గొప్ప శాస్త్రవేత్తో, మానవహక్కుల ఉద్యమకారుడో, రచయితో పుట్టిన రోజులను, కాలెండర్ లో ప్రాముఖ్యత ఉన్న రోజుల్లోనూ గూగుల్ తన లోగో ని మార్చి ఆ టాపిక్ వ్యక్తమయ్యేలా బొమ్మలు పెడుతూ ఉంటుంది. ముందు కేవలం బొమ్మల్లానే ఉండేవి ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి చిన్న యానిమేషన్లు, గేమ్స్ కూడా అయ్యాయి ఈ గూగుల్ డూడుల్స్. కానీ ఈ డూడుల్స్ పిచ్చి గీతలు కావు .. సరదా బొమ్మలు అనే అర్ధం లో ఈ పేరు పెట్టి ఉండవచ్చు. పైగా డూడ్ల్ అనే పదం గూగుల్ అనే పదానికి ప్రాస కూడా కదా. 

రామకృష్ణ పరమహంస కి నాకు ఒక అలవాటు కామన్ ... ఇద్దరం ఏ పనీ మేము చేయనిదే చెప్పం .. (ఆ స్వీట్ కథ గుర్తుంది కదా. ఓ పిల్లవాడి తల్లి మా వాడు తెగ స్వీట్లు తినేస్తున్నాడు వద్దని చెప్పండి అంటే వారం ఆగి రమ్మంటారు రామకృష్ణులు .. వారం తర్వాత పిల్లవాడికి స్వీట్లు తినద్దని హితవు చెప్తారు ... ఇదేదో వారం క్రితం చెప్పచ్చు కదండీ అంటే నేను చేయనిదే ఎలా చెప్పగలనమ్మా .. ఈ వారం పాటు నేను కూడా మానేసాను కాబట్టే ఈ రోజు చెప్పగలిగాను అంటారు. ఇదే కథ గాంధీ గారికి కూడా ఆపాదిస్తారు. నన్ను ఇద్దరిలో ఎవరితో పోల్చినా అభ్యంతరమేమీ లేదు) 😊

అలాగే ఈ డూడుల్స్ తో  నాకూ అనుభవం ఉంది .. మంచి అనుభవం ఉంది. 

నా టాలెంట్స్ లిస్టు రాస్తే మొదటి పది లో చిత్ర కళ రాదు. చూసి కొన్ని రకాలైన బొమ్మలు,,, కార్టూన్స్ లాంటివి వేస్తా కానీ అంత కంటే పెద్ద ప్రవేశం లేదు. నేర్చుకోలేదు కూడా. నా అంతట నేను ఏ బొమ్మా వెయ్యలేను ... చూసి వెయ్యాల్సిందే. అది కూడా మనిషి, జంతువులు .. ఇవి కష్టం. గడ్డి, పువ్వులు, చూస్తే ఇది చెట్టే అని అర్ధమయ్యే విధంగా చెట్లు, మబ్బులు.. అందరూ వేసే రెండు కొండలు, దాని మధ్య సూర్యుడు .. ఇలాంటివి మేనేజ్ చెయ్యగలను.  ఏదో ఆలోచిస్తూ కొంత మంది వేసే లాగ అస్సలు బొమ్మలు వెయ్యలేను.

పైన చెప్పిన విధంగా ఒక్కొక్కరు ఒక్కో కారణానికి డూడుల్స్ వేస్తారు. 

ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ నా స్నేహితురాలి గైడెన్స్ లో చేసాన్నేను. అందులో ఈ డూడ్ల్ వెయ్యడం ఓ భాగం. మెదడు కి ఒక కొత్త అలవాటు ని చేసే అప్పుడు డూడ్ల్ వేస్తే త్వరగా అది మన తత్వం లో భాగమవుతుందిట. అలా పరిచయమయింది నాకు డూడ్ల్.  

తర్వాత మాత్రం ఈ పరధ్యాన చిత్ర కళ (ట్రేడ్ మార్క్ పెండింగ్ ఈ పేరు కి... నేనే పెట్టా గా మరి!) నాకు 'ధ్యాన' చిత్ర కళ లాగా ఎక్కువ పని చేసింది. 

ఒక్కో సారి కళ్ళు మూసుకొని కూర్చొనే ధ్యానం సాధ్యం కాదు ... మెదడు మొండికేస్తుంది .. చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలించవు ... అలాంటప్పుడు నేను ఇంటర్నెట్ లో ఓ డూడ్ల్ ఎంచుకొని వేస్తూ పోతాను .. వీలైతే ఏదైనా మెడిటేషన్ మ్యూజిక్ వింటూ .. లేదా మామూలుగానే. 

ఆ బొమ్మ వేసినంత సేపూ ధ్యానం దాని మీదే నిమగ్నమవుతుంది. నా అనుభవం - చిందరవందరగా ఉన్న ఆలోచన లు ఈ డూడ్ల్ డిజైన్ లాగా ఓ అమరిక లోకి వస్తాయి. చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. 

ధ్యానం చేసాక మనసు ఎలా ఉంటుందో కంటికి కనిపించదు. కానీ ఈ డూడ్ల్ ధ్యానం లో ప్రూఫ్ కనబడిపోతుంది.. 

ఒక్కో సారి మామూలు బాల్ పెన్ వాడాను. కొన్ని స్కెచ్ ల తో వేసాను. నాకు అన్నిటి కంటే నచ్చినది మాత్రం కలర్ జెల్ పెన్ల తో వేయడం. 

అలా అప్పుడప్పుడూ వేసిన డూడుల్స్ ని ఓ ఫ్రేమ్ లో అతికించుకొని నా వర్క్ టేబిల్ మీద పెట్టుకున్నాను. అవి చూసినప్పుడల్లా అందమైన డిజైన్ కనిపిస్తుంది .. ఎన్ని సార్లు ఎన్ని మానసిక గందరగోళాలని అధిగమించానో గుర్తుకొస్తుంది ... స్ఫూర్తి నింపుతుంది. 


డూడ్ల్ బోర్డు .. 'హకూనా మాటాటా' HAKUNA MATATA (ఎడమ వైపు ఉన్న అక్షరాలు) లయన్ కింగ్ సినిమా నుంచి.   


ఎక్కువ మాట్లాడే పాత్రల్లో ఉన్నవారు, చిన్న పిల్లల తల్లులు, టీచర్లు, మార్కెటింగ్ వాళ్ళు, మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు  .. ముఖ్యంగా అంతర్ముఖులు .. వీరికి మౌనంగా చేసుకొనే ఈ ధ్యానం మంచి రీఛార్జి అవుతుంది అని నా అభిప్రాయం. 

మన సనాతన విజ్ఞానాన్ని ప్రచారం చేసే బాధ్యత పశ్చిమ దేశాలు ఎప్పుడో భుజాన్నేసుకున్నాయి పాపం. మన యోగ శాస్త్రం లో, హైందవ సంప్రదాయాల్లో కనిపించే లాంటి ఆకారాలతో పోలిన 'మండలా' అనే బొమ్మల్ని తెగ వాడేస్తున్నారు అక్కడ. ఇంట్లో గోడల మీద, పిల్లో కవర్ల మీద, టీ షర్టుల మీద ... (గౌరవప్రదంగానే వాడుతున్నారండి నేను చూసినంత వరకూ.. ఈ బొమ్మలన్నీ అల్లికల్లాంటి డిజైన్లే తప్ప మన సంప్రదాయ చిహ్నాలు, అక్షరాలు లేవు) ఈ లెక్కలోనే 'మండల' కలరింగ్ పుస్తకాలు అని పెద్దవాళ్ళకి దొరుకుతున్నాయి మార్కెట్ లో ... ఇవి కొంచెం ఖర్చెక్కువ ఉంటాయి .. కావాలంటే ఫ్రీ గా ఇంటర్నెట్నుంచి ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. అవి కలరింగ్ చేస్కోవచ్చు. మండలాలే కాక అడల్ట్ కలరింగ్ పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్ లో. (ఇక్కడ అడల్ట్ అంటే వేరే అర్ధం ఏమీ లేదు అని మనవి. అందులో మంచి బొమ్మలే ఉంటాయి. ఆశ/భయ పడక్కర్లేదు 😉) అందులో రంగులు వెయ్యటం కూడా ఓ ధ్యానమే అనే అంటున్నారు. ఇది నేను అంగీకరిస్తాను కూడా. 

ముందే చెప్పినట్టు కళ్ళు మూసుకొని కూర్చోమంటే కూర్చోని మతి కి ఈ పని చెప్పేస్తే అది ఈ ఆకారాలని గీస్తూ పోతుంది ... అల్లరి పిల్లలకి ఐ పాడ్ ఇచ్చినట్టు, పని రాక్షసుడి కి కుక్క తోక సరి చెయ్యమని చెప్పినట్టు కాక ఇది ఆరోగ్యకరం. అది దాని ఎనెర్జీ అంతా అటు వైపు పెట్టినప్పుడు మనకి  కొంత సేపు ప్రశాంతత. 

లేబుళ్లు: , , , , , , ,

30, మే 2020, శనివారం

ఈ 'గడ్డ' పై మమకారం

బంగాళా దుంప లేదా ఆలు గడ్డ - ఇది నచ్చని వారిని నేను అనుమానిస్తాను. వీళ్ళు చాలా తేడా మనుషులై ఉంటారు నా అభిప్రాయం లో. కేవలం వాళ్ళకొక ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవటం  కోసం 'ఆ .. మాకు ఆలు అంత గా నచ్చదు' అని అనే రకం. లేకపోతే జీవితం లో అసలైన ఆనందం ఇచ్చేవి - వాన, ఇంద్రధనుస్సు, పువ్వులు .. వీటి తో పాటు 'ఆలు' కూడా పడని రకం. లేకపోతే ఈ దుంప ఎంత తినేసారంటే ఇంక వెగటు పుట్టేసిన రకం. ఇది విశ్వామిత్ర సృష్టి అని జడ్జి చేసే రకం. లేదా మనసు లో ఇష్టం ఉన్నా డైటింగ్ పేరుతో దూరం పెడుతున్న రకం. ఏ రకమైనా వీళ్ళ తో స్నేహం చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. 

లేకపోతే ఏవిటండి .. బంగాళా దుంప ఎంత అపురూపమైన సృష్టి! ఇది లేకపోతే మాత్రం ఖచ్చితంగా సృష్టి లో ఏదో లోపం ఉండేది. అయినా దాని గొప్పతనం వర్ణించ నేనెంత! 

నేను ఈ మధ్యే ఓ ప్రొమోషన్ సంపాదించాను. వంటింట్లో. వంట లో నెక్స్ట్ స్థాయి కి వెళ్ళాను అని అప్పటి నుంచి తెగ విర్రవీగుతున్నాను. 

ఆ ప్రొమోషన్ గురించి చెప్పే ముందు కొంత నేపథ్యం, స్థల పురాణం ... ఇలాంటివి చెప్పుకోవడం చాలా ముఖ్యం. 

బంగాళా దుంపల్లో చాలా రకాలున్నాయి. పంట పండించే వాళ్ళకి, వంట వండే వాళ్ళకి తెలిసిన నిజం ఇది. 

కొన్ని బంగాళా దుంపలకి తొక్కు ఈజీ గా వచ్చేస్తుంది చూసారా .. ఇంకొన్ని బ్రౌన్ రంగులో ఉంటాయి.  కొన్ని బంగారు వర్ణం లో ఉంటాయి. 

కొని ఆలు గడ్డలు కోలగా ఉంటే కొన్ని గుండ్రంగా ఉంటాయి. 

ఇవన్నీ కలిపి అమ్మేస్తూ ఉంటారు కొన్ని సార్లు. లేదంటే ఒక్కో సారి ఒక్కోటి వస్తాయి. 

మనం మాత్రం పెద్ద భేదం చూపకుండా వాడేస్తూ ఉంటాం. చెఫ్ లు, హాట్ చిప్స్ లాంటి ప్రొఫెషనల్స్ కొంత మందే తమకి కావాల్సిన రకాన్ని ఎంచుకుని వాడతారు. 

అవును. కొన్ని రకాల ఆలు గడ్డలు కరకరలాడవు ... వాటిని ఫ్రై చెయ్యడానికి ట్రై చేస్తే మూకుడికి అతుక్కుపోతాయి. 

ఆలు లో రకాలు ఉన్నాయి అని తెలియని వాళ్ళం మన తప్పే అనుకుంటాం. కాదు. 

చిప్స్ కి వాడే ఆలు వేరు. అవి బ్రౌన్ రంగులో ఉంటాయి. 

అలాగే రోస్ట్ పొటాటోస్ అంటే వేపుడు కి కావాల్సిన ఆలుగడ్డ వెరైటీ ని రస్సెట్ పొటాటోస్ అంటారు. ఇవి మన దగ్గర పండవట. 

కానీ వేపుడు కి కావాల్సిన రకాలు మన వాళ్ళు నానా తంటాలు పడీ మొత్తానికి పండించారనుకోండి. 

ఇంతకీ మన దగ్గరకి మార్కెట్ లో వచ్చేవి ఇంత శాస్త్రీయంగా ఒకే రకం లో ఉండవు. వచ్చినవి వాడుకోవాలి. అంతే. 

అయితే ఇక్కడే నేను నా అనుభవాలతో ఎంటర్ ది డ్రాగన్ అవుతాను. 

ఆలు ఫ్రై ఎవరు వండుతున్నారో వాళ్ళే తరుక్కోవాలి. 

తరిగే అప్పుడు కత్తి వీటిలోకి మెత్తగా దిగితే ఇవి ఫ్రై కి అంతగా పనికి రావు అని. 

కత్తి కష్టం గా దిగితే .. (ఆలు రాయి లా ఉండాలన్నమాట) ఇది ఫ్రై కి పర్ఫెక్ట్. 

ఆలు ఫ్రై కి ఫర్ఫెక్ట్ అయితే సరిపోదు .. వండే వాళ్ళు కూడా చాలా విషయాల్లో పెర్ఫెక్ట్ గా ఉండాలి. 

ముందు కళ్ళు మూసుకొని బంగారు వర్ణం లో అన్ని వైపులా ఒకే లా వేగిన, ఉప్పు, కారం సరిపోయిన బంగాళా దుంప ముక్కల్ని మనసులో నిలిపి ధ్యానం చెయ్యాలి. దీన్నే ఈ మధ్య visualization అని కూడా అంటున్నారు. 


(పాత చిత్రం)

ఇప్పుడు సంకల్పం చేసుకోవాలి. 

నేను ఈ పూట ఈ ఆలుగడ్డ ఫ్రై ని తలపెట్ట బోతున్నాను. చేస్తున్నంత సేపు 'ఇది తిని నేను ఎంత లావైపోతున్నాను, ఇది ఈ వారం లో అప్పుడే రెండో సారి, ఎంత నూనె పోస్తున్నానో, దీనిలో ఎన్ని కాలరీలు ఉన్నాయో' అనే తలపులు తలవను. ఆనందంగా చేసుకున్న ఏ పదార్ధమైనా బాగా కుదురుతుంది, శరీరానికి బాగా పడుతుంది అనే నిజాన్ని మననం చేస్కుంటూ ఉంటాను. 

ఇది సంకల్పం. 

ఇప్పుడు కళ్ళు తెరిచి ఆలు ఫ్రై కి సరిపోయే మూకుడు చూసుకోవాలి. ఏ మూకుడంటే ఆ మూకుడు లో ఆలు ఫ్రై చెయ్యలేం అని గుర్తుంచుకోవాలి. ఇష్ట దైవానికి ప్రత్యేక ఆసనం ఏర్పరిచినట్టే దీనికి సరిపడే సరైన మూకుడు ఉండాలి. 

ఇప్పుడు మూకుడు బర్నర్ మీద పెట్టి హై లో ఉంచాలి ... నూనె కావాల్సినంత పోయాలి ... సత్యనారాయణ కథ లో చెప్పినట్టు లోభిత్వం చూపకూడదు. 

ఈ నూనె కూడా హై లోనే కాగాలి. 

కాగాక ముక్కలు వేసేయాలి. మిగిలిన బర్నర్ల మీద అవీ ఇవీ పెట్టి  అష్టావధానం లాగాచేయకూడదు. మనోవాక్కాయకర్మ లు, ఇంద్రియాలన్నీ దీనికే కేటాయించాలి. అదే ధ్యానం అంటే. 

నిముషానికో.. అంత కన్నా తక్కువ సమయానికొక్క సారి కలుపుకోవాలి. 

చూస్తుండగానే రంగు మారి గలగలలాడుతూ బంగారు వర్ణం లో కి వస్తాయి. 

సరైన సమయానికి ఉప్పు, కారం వేసి స్టవ్ ఆఫ్ చేసెయ్యాలి. పూజ పూర్తయింది. ఇంక నైవేద్యమే తరువాయి. 

ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. నైవేద్యం పెట్టడం లో ఆదిత్యాది నవగ్రహ దిక్పాలకులు, ఇంద్రాది సకల దేవతలు - ఎవ్వరికీ ఎలా తక్కువ చెయ్యకూడదో ఇంట్లో ఉన్న వారికీ అంతే. ముందే భాగాలు చేసేయాలి ... ముక్కలు లెక్కపెట్టి భాగాలు చెయ్యవలసి వచ్చినా చాదస్తం కాదని గ్రహించండి. ఇది మీ నిబద్ధత అని గుర్తుంచుకోండి. 

ఆస్తులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. స్థలాలు, నగలు, ఇళ్ళూ, డిపాజిట్లు.. ఒకటి పోతే ఇంకొకటి. 

కానీ ఆలు ఫ్రై అలా కాదు. ఈ రోజు కుదిరినట్టు రేపు కుదరకపోవచ్చు. 

వరస గా ఆలు తినకూడదని అమ్మ ఆంక్ష పెట్టచ్చు. 

ఆలు రేపు స్టాక్ లేకపోవచ్చు. లేదా వరసగా మెత్తటి రకం వే రావచ్చు. 

అందుకే ఈ రోజే.. ఇప్పుడే చేతిలో ఉన్న ఈ ఆలు ఫ్రై విలువ తెలుసుకోవాలి. 

దీని కోసం తండ్రి తో, సోదరుల తో పోరాడవచ్చు .. (ఆలు గీత... పదమూడో అధ్యాయం ఐదవ శ్లోకం). ఇది ధర్మం గానే ఎంచబడుతుంది. 

ఆలు పంపకాలు అయ్యాయి. 

ఇంక నెయ్యి అన్నం లో తింటారో, ఉట్టివే తినేస్తారో... వారి వారి ప్రాంతాల సంప్రదాయాలు, అలవాట్లని బట్టీ. ఇంత శ్రద్ధగా చేసిన వేపుడు మీద మూత పెట్టినా (ఆవిరి కి ముక్కలు మెత్తబడిపోతాయి), కంచం లో వేసినా టివి చూస్తూనో, వీడియో గేమ్ ఆడుతూనో అశ్రద్ధ చేసినా, ఉసిరి పచ్చడి, శొంఠి, వాము పొడుల లాగా మొదటి ముద్ద లో తినకపోయినా అపరాధం అపచారం. అప్పుడు వీరి వాటా వేపుడు నుంచి కొంత తీసేసి ఇష్టంగా తినే కుటుంబ సభ్యులకి పంచవచ్చు అని పొటాటో పీనల్ కోడ్ లో స్పష్టంగా రాసి ఉన్నది.  అలాగే 'మేకర్స్ బోనస్' అంటే వండిన వాళ్ళు కొంత ఎక్కువ వాటా తీసుకోవచ్చు అనే వెసులుబాటు ఉన్నది 'పండించే వాడిదే భూమి' అనే రూలు ని అనుసరించి. 

ఇవండీ ఆలు ఫ్రై కి సంబంధించిన అ 'ఆలు'. ఇవేవీ చేయకుండా యాంత్రికంగా చేసేసుకుంటే కాలరీలు మాత్రం దక్కి తృప్తి దక్కకుండా పోతుంది అని పురాణం హెచ్చరిస్తోంది. 

మీరు నమ్మండి నమ్మకపోండి నాకు ఇది రాస్తుండగా ఆలు ఫ్రై చేసిన వాసన వస్తోంది! 

అన్నట్టు ఓ ముఖ్యమైన గమనిక -  ఈ పోస్టు స్పాన్సర్డ్ పోస్టు కాదు .. ఆలుగడ్డ రైతులు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నాకు డబ్బులిస్తే రాసినది కాదు. 

ఇంతకీ నా ప్రొమోషన్ గురించి చెప్పనే లేదు కదూ. 

ప్రతి కళ లోనూ నైపుణ్యానికి స్థాయులు ఉంటాయి. 

అందులో పతాక స్థాయి .. అంటే మాస్టర్ స్థాయి .. ఈ స్థాయి లో పదార్ధం కంటే చేసే వారి చేతి మహిమ ఎక్కువవుతుంది. 

ఈ స్థాయి కి ఒక మెట్టు దగ్గరకి వచ్చాను. 

మెత్తటి ఆలు గడ్డ ల తో కూడా కరకరలాడే వేపుడు చేసేసాను మొన్న! 

నా టిప్స్ ... మొదటిది ... వండే ముందు గిల్టీ ఫీలింగ్ తీసేయండి. రెండోది నూనె లో ముందు పసుపు వేస్తే ఆలు లో ఉండే తేమ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది. యూ ఆర్ వెల్కమ్. (మీరు థాంక్స్ చెప్పి ఉంటారని గెస్ చేశా)

బంగాళా దుంప వేపుడు లో హీరో స్నేహితుడి స్థానం జీలకర్ర. చిన్న రోలే కానీ కథ కి చాలా ఇంపార్టెంట్ అండి. 

అలాగే ఆప్షనల్ - ఉల్లిపాయ. ఇది వాడితే వేపుడు మెత్తబడుతుంది అంటారు కొంత మంది. లేదు రుచి ఇనుమడిస్తుంది అంటారు ఇంకొంతమంది. ఇది సినిమా లో పాటల్లా అనుకోండి. 

బంగాళా దుంప మీద ఇంత రాయడం అవసరమా అని ఎవరికైనా అనిపిస్తే ఈ పోస్టు ప్రారంభం లో నేను చెప్పిన రకం వాళ్ళన్నమాట వాళ్ళు. 

చూడండి మీకు రెండు విషయాలు చెప్తాను. 

ఒకటి - నేను ఇంకా పిల్లకాకి ని. వీర్ సింఘ్వి లాంటి ప్రముఖ వ్యక్తి బంగాళా దుంప మీద ఎంత పెద్ద వ్యాసం రాసి తన వెబ్ సైట్ లో పెట్టుకున్నారో తెలుసా ... ఈ లింక్ చూడండి కావాలంటే 

రెండోది - నా అభిప్రాయం మార్చుకుంటున్నానండి. మీ లాంటి వాళ్ళతో నేను స్నేహం చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా కలిసి సినిమా కెళ్ళినా, పార్టీలకెళ్లినా నా చిప్స్ పాకెట్ మీతో షేర్ చేస్కో అక్కర్లేకుండా, ఏ కాంపిటీషన్ లేకుండా తినచ్చు కదా! కనుక ఆలు ద్వేషులకి ఇదే నా స్నేహ హస్తం! 

ఇక బంగాళా దుంప ప్రేమికులకి ..ఈ 'గడ్డ' పై మమకారం ఇలాగే వర్ధిల్లాలి అని కోరుకుంటూ .. జై హింద్.  

లేబుళ్లు: , , , , , , ,

23, మే 2020, శనివారం

యే కౌన్ చిత్రకార్ హై ...

ఈ బ్లాగ్ పోస్ట్ లో నా పని చాలా సులువు.

నా ప్రయత్నం ఎప్పుడూ నా మనసు కి తాకిన అనుభూతులని పంచుకోవడమే. అది మాటల్లో పెట్టడం ఒక బాధ్యత గల పని గానే భావిస్తాను.

కానీ ఈ రోజు నేను పంచుకోబోతున్న అనుభూతిని నేను పరిచయం చేస్తే చాలు. వర్ణించక్కర్లేదు. మీకు మీరుగా అనుభూతి చెందే వీలుంది.



ఈ ఫోటో లో అమ్మాయి మోడల్ కాదు. యూట్యూబ్ లో ఒక ఛానెల్ నిర్వహిస్తుంది. ఈ ఛానెల్ లో ఒక్కొక్క వీడియో మన ని ఆమె లోకానికి తీస్కెళ్ళిపోతుందంటే నమ్మండి! 

ఆమె పేరు యోనా. Jonna Jinton. (వాళ్ళ భాష లో 'జె' అక్షరం 'య' గా పలుకుతారు) స్వీడన్ లో పది గడపలు ఉన్న పల్లెటూరిలో ఉంటుంది. ఈ పల్లె ప్రత్యేకత ఉత్తరధృవానికి దగ్గరగా ఉండటం. 

ఇక్కడ భూమి మనకి పరిచయం లేని ఎన్నో రంగులు చూపిస్తుంది .. అక్షరాలా.  ట్రావెలింగ్ ఆసక్తి ఉన్న ఎవరైనా నార్తర్న్ లైట్స్ గురించి వినుంటారు. ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఆకాశం కొన్ని కాలాల్లో రంగురంగులు గా మెరవటమే నార్తర్న్ లైట్స్ అంటే. 

ఇది చూడటానికి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి, కొన్ని లక్షలు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడరు ఔత్సాహికులు. అలాంటిది ఆమె ఇల్లు ఆ లైట్ల కిందే! 

ఇదంతా యాదృచ్చికంగా జరిగిపోయింది మాత్రం కాదు. 

ఆమె చదువు పూర్తయ్యాక సిటీ తనకి పడదని గ్రహించింది. నగరం లో ఉండటమే ఆమె కి స్ట్రెస్ కలిగించేదట. అందుకే ఆమె మనసు సూచించిన దిశ గా అడుగులు వేసింది ధైర్యంగా. 

చేతిలో డబ్బుల్లేవు, ఉద్యోగం లేదు. కేవలం పదిళ్లు ఉన్న పల్లెటూరి లో పెద్దగా సౌకర్యాలు లేవు. కానీ తన కుటుంబం లో పన్నెండు తరాల వారికి అనుబంధం ఉన్న ఊరు అది. అక్కడ ఒంటరిగా ఉండటం మొదలుపెట్టింది. 

బ్రతుకు తెరువు కోసం పక్కనే ఉన్న పొలం లో పని చేసేది. 

ఇలా ఉంటూనే తన చుట్టూ విరగకాచిన ప్రకృతి తో సహజీవనం మొదలుపెట్టింది. ప్రకృతి కూడా ఈ అమ్మాయి తో స్నేహం చేసింది అనిపిస్తుంది ఈమె వీడియో లు చూస్తే. 

వారి ప్రాంతం లో పశువుల కాపరులు సంప్రదాయంగా పశువుల్ని పిలిచే ఓ రకమైన పిలుపు ని సాధన చేసింది. 

ఆమె పిలుపు విని ఆవులు ఆమె వైపు వస్తున్న ఈ వీడియో చూడండి.

ఆమె పాడుతుంది, బ్లాగ్ రాస్తుంది, యూట్యూబ్ లో వ్లాగ్ (వీడియో బ్లాగ్) చేస్తుంది.. వారి ప్రాంతపు సంప్రదాయాలు పరిచయం చేస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రకృతి లో సహజంగా దొరికే పదార్ధాల నుంచి రంగులు తయారు చేసి ఆ రంగులతోనే పెయింటింగ్ వేస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాకపోయినా డ్రోన్ కెమెరా, ప్రొఫెషనల్ లెన్స్ అన్నీ మెల్లగా సమకూర్చుకొని తన ముంగిలి లోని ప్రకృతిని అత్యద్భుతంగా కాప్చర్ చేస్తుంది. 

ఏది చేసినా దానికి స్ఫూర్తి తన చుట్టూ ఉన్న ప్రకృతే అంటుంది. 

తను చేసే పని ఆ అమ్మాయి కి ఎంత ఇష్టం అంటే తన కుగ్రామం లో ఇంటర్నెట్ లేకపోతే 120 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ళ తమ్ముడి సిటీ కి వచ్చి ప్రతి వీడియో అప్లోడ్ చేసేది. 2019 డిసెంబర్ లో వాళ్ళకి ఫైబర్ ఇంటర్నెట్ వచ్చింది. అప్పటి వరకూ ఆమె ఇదే చేసేది. 

అక్కడ దొరికే బిర్చ్ (వీటిని తెలుగు లో ఏమంటారో తెలీదు) చెట్ల నుంచి శాప్ (అంటే ఒక రకమైన నీటి లాంటి ద్రవం) సేకరిస్తుంది. అది బాటిల్స్ లో నింపి తాగుతుంది. 

ఆమె దైనందిన జీవితం ఇదే. 

శివుడి కోసం హిమాలయాల్లో తపస్సు చేసిన పార్వతి ని నేను చూడలేదు. కానీ నాకు అనిపించింది ఆవిడ ఇలాగే జీవించి ఉంటారు అని. 

ఈమె వీడియో ప్రతీది మనని  ప్రకృతి ని ఓ అడుగు దగ్గరచేస్తుంది. మనం జీవిత కాలం లో ఇవన్నీ ప్రత్యక్షంగా చూడలేకపోవచ్చు.  పోనీ వెళ్ళే వీలు కలిగినా ఆ ప్రదేశాలలో ఇంత సమయం ఉండలేకపోవచ్చు. ఆ లోటు లేకుండా చేస్తోంది ఆ అమ్మాయి. ఒక వీడియో లో అంటుంది 'మీ అందర్నీ ఇలా ఈ వీడియో లోంచి లోపలి లాగేసి ఇక్కడ ఈ వాతావరణాన్ని చూపించగలిగితే ఎంత బాగుండో కదా' అని. ఆమెకి తెలియదు తను ఆ పనే చేస్తోందని. 

ఒక వీడియో లో మంచు పాటలు వినిపించింది. నీరు మంచు గడ్డ గా మారినప్పుడు దానిలో బీటలు ఏర్పడతాయి. అప్పుడు వాటి నుంచి వచ్చే సౌండ్స్ ని రికార్డ్ చేసింది ఈ అమ్మాయి. 

రెండు గంటల పాటు ఉన్న రికార్డింగ్ ఏ మెడిటేషన్ మ్యూజిక్ కి తీసిపోదు. (నేను అది వింటూనే ఈ బ్లాగంతా పూర్తి చేసాను) 

ఆ అమ్మాయి ఛానెల్ ద్వారా నే ఓ మంచి అబ్బాయి పరిచయం అయ్యాడు. యోహాన్ ఆ అబ్బాయి పేరు. అతని స్వభావం ఈ అమ్మాయి స్వభావం లాంటిదే. అతను వెండి తో నగలు డిజైన్ చేస్తాడు. ఇద్దరూ పెళ్లి చేస్కుని అక్కడే నార్తర్న్ లైట్స్ కింద కాపురం చేస్తున్నారు. 

ఆమె వ్లాగ్స్ లో అన్నీ వివరంగా చెప్తుంది. అక్కడ వాతావరణం మనకి పరిచయం లేనిది కాబట్టి చాలా సందేహాలు ఉంటాయి మనందరికీ. వాటన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్తుంది. 

అక్కడ ఎలుగుబంట్లు ఉంటాయా అని అడిగారొకరు. ఉంటాయి, నేను వాటి స్పేస్ వాటికి ఇస్తాను' అని చెప్పింది. నా కిలోమీటర్ రేడియస్ లో ఎలుగుబంట్లు ఉంటే నార్తర్న్ లైట్స్ మాట దేవుడెరుగు ... నేను ముందు అక్కడి నుంచి పారిపోతాను! ఈ అమ్మాయి స్పేస్ అంటోంది! ఆమె కి తన చుట్టూ ఉన్న పర్యావరణం తో సహజీవనం అంత బాగా అలవాటైంది. 

ఆమె అనుభవాలన్నీ ఆమె తీసిన ఫోటోలంత అందమైనవి కావు. ఒడిదుడుకులు బాగా ఉంటాయి అని కూడా షేర్ చేసుకుంది తను. ముఖ్యంగా ఆడపిల్ల ఒంటరిగా ఉండటం (పెళ్ళయ్యే ముందు వరకూ) మనందరికీ ముందు భయం కలిగిస్తుంది. అందులో ఆ అమ్మాయి ఒంటరి గా ఉండటమే కాదు అర్ధరాత్రి కెమెరా తీస్కొని ఆ ఊరి లో పారే సెలయేరు దగ్గరకి వెళ్తుంది. ఒక్కతే చుట్టూ ఉన్న అడవి ప్రాంతం లో తిరుగుతుంది. నాకు సెకండ్ హ్యాండ్ భయం బాగా వేసింది. (అంటే నేను ఆ సిట్యుయేషన్ లో లేకపోయినా ఆ అమ్మాయి కోసం భయం వేసింది). 

కానీ ఆమెకి ప్రకృతి నుంచి ఉన్న ప్రమాదాల కంటే ఓ మనిషే డేంజర్ గా మారాడు. 

ముందు ఆన్లైన్ లో ఆ తర్వాత ప్రత్యక్షంగా ఒకడు ఆమె ని స్టాక్ (stalking ... వెంటబడటం) మొదలుపెట్టాడు. ఆమె పోలీసులకి రిపోర్ట్ ఇచ్చి అతన్ని పట్టించింది. అప్పటికే ఆమె భర్త ఆమె తో ఉన్నాడు కూడా. 

ఈ అనుభవం అయ్యాక కూడా ఆమె ఏ మాత్రం బెదరలేదు. తన అనుభవాలు ఓ వీడియో లో షేర్ చేసుకుంది. అతను ఆమె పెయింటింగ్ స్టూడియో ని నాశనం చేస్తే అంతా శుభ్రం చేసుకొని అగర్బత్తులు పెట్టుకుంది. అంతే కానీ తన జీవన శైలిని మార్చుకోలేదు. ఇది చాలా గొప్ప విషయం అనిపించింది నాకు. 


ఇది ఆమె ఛానెల్. ఇయర్ ఫోన్స్ వాడండి వీలుంటే. కంటికి, మనసుకి, ఆత్మకి ఓ చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ రోహిణి కార్తె సమయం లో మరీ అవసరం కదూ మనకి! 

ఇంగ్లీష్ భాష అంత ధారాళంగా రాదు ఆ అమ్మాయికి. కొన్ని కొన్ని పదాలు తెలుసుకొని వాడుతూ ఉంటుంది. 

ఆమె స్వభావం ఎంత సరళంగా ఉంటుందో. వీడియోలు తీసేటప్పుడు ప్రకృతి ఆడే దోబూచులాట ని నవ్వుతూ లైట్ గా తీసుకుంటుంది. ఒక రోజు కుదరకపోతే ఇంకో రోజు ప్రయత్నిస్తుంది. ఆరు నెలల శీతాకాలం ... అరగంట మాత్రం కనిపించే సూర్యుడు, ఆరునెలల ఎండాకాలం ... అస్సలు అస్తమించని సూర్యుడు ... ఈ వాతావరణం లో అనుభవమయ్యే జీవత పాఠాలు మనతో పంచుకుంటూ ఉంటుంది. 

ఇటీవలే ఈమె ఛానెల్ సుబ్స్క్రైబర్స్ ఒక మిలియన్ మంది అయ్యారు. అంత అర్హత ఉంది ఆమెకి. 

ఆమె ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది. ఆమె పేరుతోనే. 

తను బ్రతికేది, మనం బ్రతికేది ఇదే భూమి. 

ఈ భూమి మీద మనం చూడని కొత్త ప్రపంచాలు ఇంకా ఎన్నో కదా! 

హిందీ లో ఓ పాట ఉంటుంది 

'యే కౌన్ చిత్రకార్ హై ... యే కౌన్ చిత్రకార్ హై ...'

ఆ పాట గుర్తొస్తోంది ... 

ఎవరా చిత్రకారుడు .. భూమి కి పచ్చ రంగు, ఆకాశానికి నీలం రంగు .. ప్రతి పువ్వు కి సింగారాలు అద్దిన ఆ చిత్రకారుడెవడు? 

ధ్వజ స్థంభాల్లాంటి దేవదారు వృక్షాలు, గులాబీ సౌరభాలు, వసంత వనాలు ... ఏ కవి కల్పనలో పుట్టిన చమత్కారాలో ఇవి 

ప్రకృతి పవిత్రత ని ఆరాధించు.... 
ఈ గుణాలని మనసు కి అలవర్చు ... 
నీ నుదుటి ఎరుపు మెరిపించు... 
ప్రతి కణం లోంచి తొంగి చూస్తున్న విరాట్రూపాన్ని వీక్షించు .. 
మన కన్ను ఒకటే ... కానీ వాడివి వేయి అని గ్రహించు! 



లేబుళ్లు: , , , , , ,

16, మే 2020, శనివారం

జీవిత పరమావధి


ముందుగా ఓ బొమ్మ చూద్దాం. 


Made into Telugu by Sowmya Nittala for sowmyavadam.blogspot.com
Feel free to use it. ఎవరైనా వాడుకోవచ్చు ఈ బొమ్మని. 

ఆ మధ్య లో ఉన్న పదం 'ఐకగై' IKIGAI అనే జపనీస్ పదం. దీని గురించి మన తెలుగు లోనే మంచి వీడియో చేశారు ఒకళ్ళు. ఇక్కడ చూడండి. ఈ యూట్యూబ్ ఛానల్ లో చాలా మంచి కంటెంట్ ఉంది ... ముఖ్యంగా స్టూడెంట్స్ కి. ఇది వారి ఛానెల్. Telugugeeks 

రెండు విషయాలు ముందే చెప్పాలి. 

ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూసి ఇకిగై అనకూడదు .. ఐకగై అనేది సరైన ఉచ్చారణ 

రెండోది ... ఈ బొమ్మ పూర్తిగా 'ఐకగై' అనే జపాన్ వారి లైఫ్ ఫిలాసఫీ కి సూచిక కాదు. వారి ఫిలాసఫీ ఇంకా లోతుగా, ఇంకా రిలాక్స్ డ్ గా ఉంటుంది. 

ఈ బొమ్మ జీవితం లో పర్పస్ వెతుక్కోడానికి ఉపయోగపడేది ... దాన్ని ఐకగై .. (అంటే జపనీస్ భాష లో 'పొద్దున్నే నువ్వు ఎందుకు నిద్ర లేస్తావో ఆ కారణం' .. ఎందుకు జీవిస్తున్నామో ఆ ఉద్దేశం) కి జోడించారన్నమాట. 

ఇది ఒక అభిప్రాయం లేదా ఒక థియరీ గా మాత్రమే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. 

మానవ జీవితానికి ఉద్దేశం ఏంటి? మనం నమ్మే సిద్ధాంతాల బట్టీ దీనికి జవాబు ఉంటుంది. ఏ ప్రయోజనమూ లేదు .. మనం ఆక్సిడెంట్స్ మాత్రమే అనుకోవచ్చు. సేవ (పరులకో, తల్లిదండ్రులకో, దేశానికో) అనుకోవచ్చు. అసలు సమాధానం ఏమీ తట్టకనూ పోవచ్చు... ఏ ఒక్క సమాధానం ఈ ప్రశ్నకి పూర్తి గా ఆన్సర్ చెయ్యదు అని నా అభిప్రాయం.

ఎలాగూ పుట్టాం కాబట్టి ఈ జన్మ ని పూర్తి గా సార్ధకం చేసుకొనే ప్రయత్నం చేద్దాం అనుకొనే వారికి మాత్రం ఈ బొమ్మ బాగా ఉపయోగపడుతుంది. 

నాకు ఈ బొమ్మ లో నచ్చిన మొదటి అంశం.  .. ఉద్యోగం, వృత్తి, ఆశయం, అభిరుచి .. వీటిని డిఫైన్ చేసిన తీరు. 

రెండోది .... మనకి కెరీర్ పరంగా కలిగే భావాలని కరెక్ట్ గా పట్టుకోవడం. 

9 to 5 ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళం .. అబ్బా . లైఫ్ బోర్ గా ఉంటోంది అని ఎన్ని సార్లు అనుకోలేదు ... అదేంటి? నెల నెలా జీతం వస్తుంటే ఇంకేం కావాలి అని ఎవరైనా అడిగితే సరైన సమాధానం చెప్పలేకపోయే వాళ్ళం కూడా. 

కొంతమందిమి ఆ ఫీలింగ్ ని ఇగ్నోర్ చెయ్యలేక ఉద్యోగం మానేసి మన అభిరుచి లో పడితే మళ్ళీ అక్కడ కూడా ఓ లోటు .... తృప్తి ఉంటుంది కానీ డబ్బులూ ఉండవు .. మన పని మనం చేస్కుంటూ మన లోకం లో ఉంటున్నాం .. జీవితం అంటే ఇంకా ఏదో ఉందనే ఆలోచన. 

ఇంక ఆశయాల వెనక పరిగెడితే చెప్పేదేముంది .. ఆక్టివిస్టు ల కి జీతాలుండవు .... బోల్డు సంతృప్తి ఉంటుందనుకోండి ... కానీ జీవితం లో ఏ సౌకర్యాలూ ఉండవు. 

నాలుగోది .. ప్రపంచానికి అవసరమయ్యేది, డబ్బులొచ్చేది .. ఉద్యోగం.. నాకు తెలిసి ఇది మహా సేఫ్ ఆప్షన్ వీటన్నిటి లోకి. అందుకే ఎక్కువమందిమి ఇక్కడ ఉంటూ ఉంటాం. ఈ బొమ్మ లో నాకు అర్ధం కాని పాయింట్ కూడా ఇక్కడే ఉంది. అనిశ్చితి ఉంటుందని ఎందుకు రాశారు? అంటే ప్రపంచానికి ఆ అవసరం తీరిపోతే ఇంక మన తో పనుండదు అనా? కానీ ఈ పని లో అనిశ్చితి కన్నా కూడా మన తో మనం టచ్ కోల్పోవడం ఒక లోటు. 

(నాకిప్పుడే తట్టింది .. నేను పైన ఉన్నవన్నీ చేసాను... అన్ని ఫీలింగ్స్ అనుభవించాను అని!) 

ఇక్కడ వరకూ మన కి చూచాయ గా తెలుసు ... జీవితం లో ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదులుకోవాలి అనే థియరీ ప్రకారం ఇందులో ఎక్కడో అక్కడ ఇమిడిపోతాం. 

ఇంత వరకూ చెప్పేసి ఊరుకుంటే ఇంతకంటే డిప్రెసింగ్ వ్యాసం ఇంకోటి ఉండదు. 

పేషేంట్ ని కూర్చోపెట్టి నీకు వేడి గా అనిపిస్తున్న దాన్ని జ్వరం అంటారు .. నీకు ముక్కు మీద వచ్చిన దాన్ని సెగ్గడ్డ అంటారు అని మన బాధల కి పేర్లు చెప్పినట్టు అవుతుంది. పేర్లెవడికి కావాలండి ఏదైనా మందు కావాలి కానీ. 

ఇక్కడే వస్తుంది నాకు ఈ బొమ్మ లో నచ్చిన అద్భుతమైన పాయింట్. 

వీటన్నిటి సెంటర్ లో శ్రీ చక్రం మధ్య లో అమ్మవారిలా ఉన్న ఆశ - ఐకగై  (ఏంటో ఈ మాట వింటే 'అయి ఖగ వాహిని మోహిని చక్రిణి' అనే లైన్ గుర్తొస్తోంది హహ్హ) 

అంటే .. కోరుకుంటే, ప్రయత్నిస్తే ..  ఇవన్నీ కలిసొచ్చే పని ఒకటి దొరకకపోదు. 

ఎన్ని సార్లు ఇంటర్వ్యూల లో వినలేదు .. ఈ పని నాకిష్టమైనది.. దానికి ఎదురు డబ్బు రావడం నా అదృష్టం అని ... వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే ఎవరో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు .. అంటే వారు చేస్తున్న పని లో వాళ్ళు నిపుణులు, పైగా వారి మాటలు ప్రపంచానికి కావాలి .. అందరూ వినాలనుకుంటున్నారు. మరి ఇదేగా అయి ఖగ వాహిని అంటే! 😊

నాకనిపిస్తుంది .. టెన్త్ అయ్యాక ఏ కోర్సు చేస్తావు అని ప్రెషర్ పెట్టి అప్పట్లో ఏ డిగ్రీ ఫాషన్ అయితే ఆ చదువులోకి నెట్టేసి బలవంతంగా చదివించేసి, ఉద్యోగం లో కి అంతే బలవంతంగా నెట్టేసి 'మీకు తెలీదు .. ఇదంతా వారి మంచి కోసమే' అని అబద్ధాలు చెప్పుకొని .. ఆనందంగా లేని మనుషులని, మనసు పని లో లేని వర్క్ ఫోర్స్ ని పెంచేసే కంటే... ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది కదూ... ఈ స్పృహ ముందే కలిగిస్తే నిర్ణయం తీసుకోవాల్సిన వయసు కల్లా ఓ క్లారిటీ వస్తుంది ... స్టూడెంట్ కైనా, పేరెంట్ కైనా. 

ఆ వయసు దాటిపోయి ఏదో ఒక ఉద్యోగం లేదా వృత్తి లో కుదిరిపోయిన వారు కూడా నిరుత్సాహపడక్కర్లేదు .. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమి లేదు. రిటైర్ అయినా, పదేళ్లు ఉద్యోగం చేసిన, ఇప్పటికి వారం రోజులే చేసినా .. ఈ సూత్రం అప్లై చేస్కోవచ్చు. 

ఈ మార్గం లో నడిచే  ముందు పారాహుషార్ ... మార్గం సుగమం కాదు .. అన్నిటికి కంటే కష్టమైన ప్రయాణం మన అంతరంగం లోకి మనం చేస్కొనేదే. అందులో ఎన్నో చిక్కు ముడులు ఉంటాయి. మనకి నచ్చిన పని మనకి వచ్చిన పని అయ్యుండక పోవచ్చు. అసలు ఈ రెండూ ఉన్న పని ప్రపంచానికి అవసరం లేకపోవచ్చు ఆ టైం లో.   వంట బాగా వచ్చిన వారు ఎపుడూ ఉంటారు కానీ ఇప్పటి లాగా యూట్యూబ్ లో తమ నైపుణ్యం చూపించి డబ్బు సంపాదించే విధానం లాంటివి లేవు ఒకప్పుడు లేవు కదా పాపం... అన్నిటికి కన్నా కష్టం అన్ని బాక్సు లూ టిక్ అయ్యి డబ్బు మాత్రం రాకపోవడం ... నా బ్లాగు లాగా 😁 (వీటన్నిటికీ భయపడే కదా ఈజీ గా ఉండే ఆప్షన్స్ ఎంచేస్కుంటాం.) కానీ అగాధమవు జలనిధి లోన ఆణిముత్యమున్నటులే .. ఈ ప్రయాణానికి చివర్న నిధి ఉంటుంది. 

ఆఫ్ కోర్స్ .. ఆ నిధి దొరికాక కూడా అంతా సుఖాంతమేమీ కాదు. ఓ వ్యక్తి మనసుకి నచ్చని ఉద్యోగం లో లక్ష రూపాయలు సంపాదిస్తే ఇక్కడ ముప్ఫయి వేలే సంపాదించచ్చు. కానీ ఆ ప్రతి ఒక్క రూపాయి ఆమె కి లక్ష కంటే విలువ అనిపించచ్చు. లక్ష రూపాయల లైఫ్ స్టయిల్ నుంచి ముప్ఫయి వేల లైఫ్ స్టయిల్ కి రావడం కాంప్రమైజే కావచ్చు .. కానీ ఆమె కి అందులో ఏ బాధా ఉండకపోవచ్చు. 

అలాగే బ్రతుకు తెరువు కోసం రోజు భత్యం మీద బ్రతుకుతున్న వాడు ఐకగై ని వెతుక్కొనే  క్రమం లో ఇంకా కష్టపడచ్చు. చేతిలో ఉన్న పని .. తిండి పెట్టే పని ... అది లేకపోతే పస్తులే .. అయినా మనసు ఒక్క సారి 'ఈ పని నాది కాదు .. ఇంకా ఏదో ఉంది' అనుకున్నప్పుడు పస్తులు కూడా పెద్ద కష్టమనిపించవు. 

ఓ కొటేషన్ ఉంది .. నీకు నచ్చిన పని ఎంచుకున్నావా నువ్వు జీవితం లో ఒక్క రోజు కూడా 'పని' చెయ్యక్కర్లేదు .. అంటే నీ పని 'పని' అనిపించదు అని. 

ఒక్క సారి ఊహించండి ... ఉత్సాహంగా ఎగురుకుంటూ పని లో కి వెళ్లే పౌరులు ఎంత ఆనందంగా ఉంటారు ... డెస్క్ కి అవతల కూర్చున్న వ్యక్తి తన పనిని ప్రేమించిన వాడైతే కస్టమర్లకు, కంపెనీ కి ఎంత లాభం! విసుగులు, స్ట్రెస్ ఉండనే ఉండవు. ప్రొడక్టివిటీ అని డెడ్ లైన్స్ అని భయపెట్టక్కర్లేదు. ఎంప్లొయీ మోటివేషన్ అని, రిక్రియేషన్ ని లక్షలు లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు .. ఇన్సెంటివ్ ల కోసం పని చెయ్యడు ఎవడూ ఇంక... వర్క్, లైఫ్ బ్యాలెన్స్ లాంటివి పెద్ద ఛాలెంజ్ కాదు .. నచ్చిన, వచ్చిన పని చెయ్యడానికి అంత సమయం పట్టదు కదా ...  స్ట్రెస్ కీ గురవ్వము ... ఇంటికి బాడ్ మూడ్ లో రాము .. అలిసిపోయి రాము! 

ఆఖరు గా ఓ కేస్ స్టడీ .. 

కటిక పేదరికం లో పుట్టి, ప్లాట్ఫారం మీద పడుకొని, ఎలాగోలాగ పార్ట్ టైం ఉద్యోగం చేస్కుంటూ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి IAS లో 101 వ ర్యాంకు సాధించారు శివగురు ప్రభాకరన్ (అతని కథ ఇక్కడ చదుకోవచ్చు)

1. ఎన్ని కష్టాలు వచ్చినా పట్టు వదల్లేదు కాబట్టి ఇది అతనికి నచ్చిన పని  
2. ర్యాంక్ సాధించాడు కాబట్టి అతనికి బాగా వచ్చిన పని  
3. ఇన్ని కష్టాలు అనుభవించినవాడు మంచి పరిపాలన సాగించే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇది ప్రపంచానికి కావాల్సిన పని
4. IAS ఆఫీసర్ల కి గౌరవం తో బాటు జీతం కూడా ఉంటుంది కాబట్టి డబ్బులు తెచ్చే పని!

ఐకగై థియరీ .. హెన్స్ ప్రూవ్డ్ 😊




లేబుళ్లు: , , , ,