16, అక్టోబర్ 2024, బుధవారం

పొంగనాలు-సాంబారు నేర్పిన జీవిత పాఠాలు

పొంగణాలు/పొంగనాలు/పొంగడాలు ఇలా రకరకాల వ్యవహారాలు ఉన్న ఈ తెలుగు టిఫిన్ సాంబారు తో కలిసి బోల్డు కబుర్లు చెప్పింది నిన్న రాత్రి నాకు. అవి మీకు కూడా చెప్దామని! 

ముందుగా ఒక్క మాట. ఈ కాంబినేషన్ విధి రాత వల్ల కలిసి వచ్చింది కానీ మా ఇంట్లో ఈ సంప్రదాయం లేదు, నా ఫేవరెట్టూ కాదు. ఇది గమనించాలి. 

అదుగో అదే మొదటి జీవిత సత్యం. దోసెల పిండి పులిసిపోక ముందే వాడేయాలి అనే తొందర, సాంబారు వ్యర్థం చేయకూడదనే తాపత్రయం, దోసెల తో సాంబారు తింటే తక్కువ ఖర్చవుతుంది కాబట్టి ఇలా ఇడ్లి సాంబారు, వడ సాంబారు లాగా పొంగనాల తో తింటే రెండూ ఖర్చవుతాయి అనే ఆలోచన నుంచి పుట్టింది ఈ కాంబినేషన్. జీవితం లో ఇలా ఎన్ని సార్లు జరగదు మనకి! పరిస్థితుల ప్రభావం వల్ల, కొన్ని మనమే పెట్టుకున్న పరిధులు/విలువల వల్ల కొన్ని చేసేస్తుంటాం. వాటి నుంచి ఒక్కో సారి ఇలా ముందు తెలియని కాంబినేషన్ పుట్టేస్తుంది. క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ నుంచే పుడుతుంది అని నిరూపితమవుతుంది! 

హిరణ్యకశిపుడు ఓ వంద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు కదా .. నేను ఇలా చావను అలా చావను అని. అప్పుడు కదా నరసింహ అవతారం ఉద్భవించింది! అలా అన్నమాట! (నరసింహావతారాన్ని పొంగనాల తో పోల్చట్లేదు ... క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ .... దానికి ఉదాహరణ! నమో నరసింహ!)


ఇక రెండో పాఠం. మొన్న ఒక కొటేషన్ చూసాను. మీరు మీ ప్రాబ్లమ్ లాగా కనిపించక్కర్లేదు అని. డబ్బుల్లేకపోతే డబ్బుల్లేనట్టు కనిపించక్కర్లేదు. శుభ్రమైన బట్టలు వేసుకొని తల దువ్వుకోవచ్చు!  చెల్లగొట్టాల్సిన ఆహారం తినాలి అనుకున్నప్పుడు మొహం ఒకలా పెట్టుకొని చేతికి దొరికిన ప్లేట్ లో పెట్టుకుని అయిందనిపించక్కర్లేదు. ఓ మంచి ప్లేట్ తీస్కొని బాగా కనిపించేలా ప్రెజెంట్ చేసుకుంటే మనకి కూడా తినాలి అనిపిస్తుంది. ఇదిగో ఇలా ఫోటోలు పెట్టుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. :) 

మూడో పాఠం... కళాకారులకి ప్రతీదీ ఓ ఇన్స్పిరేషనే! ఉదాహరణ కి ఈ కాంబినేషన్ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర ని గుర్తు చేసింది. సాంబారు నిజానికి ఇడ్లి కో, వడ  కో, దోసె కో జతవ్వాలి.  ఎన్టీఆర్ జమున గారిలా. పొంగనాలు పచ్చడి నో, పొడి నో పెళ్లి చేసుకోవాలి. కాంతారావు కె ఆర్ విజయ గారిలా. కానీ ముందే చెప్పినట్టు గా విధి వల్ల కలిసిన ఈ ఎన్టీఆర్ కె ఆర్ విజయ గార్ల జోడి ఎలా ఉంటుంది? వాళ్ళు అన్నీ మర్చిపోయి అన్యోన్యంగా ఉన్నా, ప్రపంచం వారిని ఇడ్లి సాంబారు కి ఇచ్చిన విలువ ఇస్తుందా? ఓ మంచి జోడీ గా గుర్తిస్తుందా? ఇలా కొంత సేపు ఆలోచిస్తూ ఉండిపోయాను నేను! 

నాలుగో పాఠం. దేవుడెందుకో ఒకే ఫామిలీ లో ఒకలాంటి వాళ్ళని పుట్టించడు. ఒకరు పొద్దున్నే లేచేస్తారు. ఇంకొకరు రాత్రి మేల్కొనే ఉంటారు. వాళ్ళకీ వీళ్లకీ రోజూ గొడవ. అలాగే మా ఇంట్లో క్రిస్పీ గా ఉండే చిరు తిండి ని సాంబారు లో వేసేసి మెత్తగా చేసేస్తే అస్సలు నచ్చదు. నాకేమో అలాగే ఇష్టం! పకోడీ చేస్తే కడి-పకోడీ చేసుకుంటాను.  కరకరలాడే కారప్పూస/జంతికల తో మరమరాల మసాలా చేసుకుంటాను.  బిస్కెట్టైతే పాలలో ముంచుకొని తినాల్సిందే. ఇలా క్రిస్పీ వాటిని మెత్తగా  చేసేస్తూ ఉంటే చూడటమే ఇబ్బంది మా ఇంట్లో వాళ్ళకి! ఎన్ని డిఫెరెన్సెస్ ఉన్నా కలిసే ఉండాలి మరి ... పొంగనాలు సాంబారు లాగా! 

ఐదో పాఠం. నువ్వు జీవితం అంతా చూసేసా అనుకుంటున్నావు కానీ ఇంకా అంతా చూడలేదు. ప్రపంచాన్ని చుట్టేసిన వాళ్ళైనా, పుస్తకాలన్నీ చదివేసి వాళ్ళైనా .. ఇంకా ఏదో కొత్త అనుభవం, కొత్త కాంబినేషన్ ఉంటూనే ఉంటుంది మనని ఆశ్చర్యపరచడానికి! ఇది గుర్తుంచుకుంటే చాలు. జీవితం డెడ్ ఎండ్ లాగా బోర్ గా అనిపించదు. కొంచెం ఈగో కూడా కంట్రోల్ లో ఉంటుంది.... మనం అన్నీ చూసెయ్యలేదని! 

ఇంక చివరిది, ముఖ్యమైనది అయిన పాఠం. ఆన్లైన్ లో మనం చూసేదేదో పూర్తి పిక్చర్ కాదు. నా పొంగనాల ఫోటో చూసి నోరూరుతుంది. ట్రై చెయ్యాలని కూడా అనిపించచ్చు. కానీ నిజం ఏంటంటే ఆ సాంబారు  లో ఉప్పెక్కువైంది. నేను పొంగనాల పిండి లో ఉప్పు తక్కువేస్కున్నా లాభం లేకపోయింది. తర్వాత సాంబారు లో నీళ్లు కలిపి మరిగించాము. ఆ పల్చటి సాంబారు ఫోటో కి నోచుకోలేదు. అదీ పూర్తి కథ. 

నేను ఈ సారి ఏం చేశా అంటే ఇదే భాగోతం ఇంగ్లిష్ లో వెళ్ళగక్కాను. అది నా ఇంగ్లిష్ బ్లాగ్ లో ఉంటుందన్న మాట. తెలుగు చదవటం రాదనే వంక తో నా రాతల్ని తప్పించుకోకుండా నేను వేసిన మాస్టర్ ప్లాన్ ఇది! కింద నా ఇంగ్లీష్ బ్లాగ్ కి లింక్ ఇచ్చాను. దాని పేరు సౌమ్యాటిక్ లైఫ్ :)

My English Blog

మళ్ళీ కలుద్దాం. మీరు ట్రై చేసిన/చెయ్యాల్సొచ్చిన కాంబినేషన్స్ ఏంటి? అవి మీకు నేర్పిన జీవిత పాఠాలేంటి? ప్లీజ్ చెప్పండి. 

లేబుళ్లు: , , , , , , ,

14, ఆగస్టు 2023, సోమవారం

విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్.....

కాంప్లిమెంట్లు. ఈ టాపిక్ మీద నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఇక్కడ ఒలకబోస్తున్నా ఈ రోజు. 

ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంప్లిమెంట్ లా కనిపించేవన్నీ కాంప్లిమెంట్స్ కావు. 

ఇంగ్లీష్ లో compliment .... complement ఒకలాగే ఉంటాయి. ఒకే అక్షరం తేడా. ప్రశంస అనే అర్ధం వచ్చేది compliment. రెండో దానికి అర్ధం వేరు. Her dancing complemented his singing. ఆమె నాట్యానికి, అతని గానానికి జోడీ కుదిరింది. ఇలాంటి అర్ధం లో వాడతారు. కానీ స్పెల్లింగ్ రాసేటప్పుడు ఒక దాని బదులు ఇంకోటి రాసేస్తూ ఉంటారు. stationery ..stationary లాగా. 

ఆ రెండు పదాలకీ ఎంత తేడా ఉందో ... నిజం ప్రశంసలకి, ప్రశంస లా విన్పించే వాటికీ అంత తేడా ఉంది. 

"ఎంత సన్నబడ్డావు తెలుసా! ఒకప్పుడు ఎంత లావుగా అసహ్యంగా ఉండేదానివి! పెద్ద పొట్ట, టైర్లు... చేతులు కూడా ఇంత లావుగా ఉండేవి కదూ!" ఇది కాంప్లిమెంట్ కాదు. 

"నువ్వు కాఫీ చాలా బాగా చేస్తావు .. ఏదీ ఓ కప్పు ఇచ్చుకో" ఇది కూడా కాంప్లిమెంట్ కాదు


"వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఒకప్పుడు వీళ్ళ ఇల్లు, బట్టలు ఎలా ఉండేవో తెలుసా?" అన్నారోసారి ఎవరో. అదేంటండి అలా అంటున్నారు అంటే "మీరు బాగా పైకొచ్చారు అని కాంప్లిమెంట్ ఇస్తున్నా" అన్నారు. "నీకు మంచి తెలివితేటలు వచ్చాయి మీ(కులం/మతం/లింగం/ప్రాంతం/కుటుంబం) లో ఇలా అరుదు కదా" ఇవి కాంప్లిమెంట్ లు కావు ... చులకన భావం నుంచి, వివక్ష నుంచి వచ్చినవి. 


అసలైన ప్రశంస గుర్తింపు నుంచి వస్తుంది. మొదటి ఉదాహరణ లో సన్నబడటం లో ఉన్న కష్టాన్ని, డిసిప్లిన్ ని గుర్తించినప్పుడు, రెండో దాంట్లో స్వప్రయోజనానికి కాకుండా ప్రశంసించినప్పుడు, మూడో సందర్భం లో పైకొచ్చిన వ్యక్తి సంకల్పబలాన్ని గుర్తించినప్పుడు అవి కాంప్లిమెంట్స్ అవుతాయి. 

మంచి ప్రశంస మనసుకి చల్లగా తాకాలి.  అంతే గానీ "వీడిప్పుడు ఎందుకు పొగుడుతున్నాడు?" అనో "ఇది అసలు కాంప్లిమెంటా కాదా" అనో అనిపించకూడదు. 

ఒక్కో సారి ప్రశంస మాటల్లో ప్రకటించబడదు ... ఇది బెస్ట్ కాంప్లిమెంట్ అనిపిస్తుంది. ఓ కనుబొమ్మ ఎగరేయడం .... వండింది తిని కళ్ళు మూసుకొని ఆస్వాదించడం .... ఇలా మాటల్లో వర్ణించలేని ఎన్నో నాన్ వెర్బల్ ప్రశంసలు ఉంటాయి. 

ప్రశంసలకి ఇది స్వర్ణ యుగం నిజానికి. సోషల్ మీడియా వల్ల. ఇల్లు నీట్ గా సద్దుకొని ఫోటో పెట్టినా, మంచి చీర కట్టుకున్నా (చీర కట్టు బాగా కుదిరినా), పాడినా, డాన్స్ చేసినా మంచి ప్రశంసలు అందుకొనే ప్లాట్ఫారం సోషల్ మీడియా. 

ఓ సినిమా లో కోట శ్రీనివాస్ రావు గారు బ్రహ్మానందం గారు ఓ మంచి కాంప్లిమెంట్ ఇస్తే ఒక్కొక్కరినీ పిలిచి వాళ్ళకి కూడా తెలిసేలా పొగిడించుకుంటారు చూడండి ... సేమ్ మాటర్ .... ఆ అవసరం సోషల్ మీడియా తీసేసింది. చక్కగా ఉన్న కాంప్లిమెంట్లన్నీ అందరికీ తెలిసేలా, ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటాయి. ట్రోలింగ్/నెగిటివ్ కామెంట్లు ఉన్నా అవి డిలీట్ చేసుకొనే/ బ్లాక్ చేసుకొనే సౌకర్యం ఉండనే ఉంది కదా!

ఈ జన్మ లో దేవుడు నన్ను కొన్ని మంచి ప్రశంసలు తీసుకొనే స్థానం లో కూర్చోబెట్టాడు. దానికి ఎప్పటికీ నేను కృతజ్ఞురాలిగానే ఉంటాను. ఏదో ఒక రోజు ... ముఖ్యంగా కళాకారుల జీవితం లో .. ఏదో అప్సెట్ గా ఉన్నరోజో, మూడ్ ఆఫ్ లో ఉన్న రోజో బ్లాగ్ మీదో ... వీడియోల మీదో ఏదో మంచి కామెంట్ కనిపించినప్పుడు ఆ రోజు రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది! 

కానీ ఆ ప్రశంసలు ప్రత్యక్షంగా తీస్కోడం లో నాకు కొంచెం మొహమాటం. ఇప్పుడు నయం. ఒకప్పుడు నాకెవరైనా కాంప్లిమెంట్ ఇస్తే అదేదో టెన్నిస్ బాల్ లాగా ఎదురు ప్రశంస ఇస్తే కానీ ఊరుకునే దాన్ని కాదు. ఇది చాలా ఎబ్బెట్టు గా ఉంటుంది ... హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యు అన్నట్టుగా. 

ఒక్కోసారైతే అసలు కాంప్లిమెంట్ ని స్వీకరించడానికి ఒప్పుకొనేదాన్ని కాదు! ఒక సారి త్యాగరాజ ఆరాధన లో పాడాను. చాలా మంది గొప్పవాళ్ళు పాల్గొన్నారు ఆ ఆరాధన లో. ఒక వాద్యకారులు వచ్చి "బాగా పాడారమ్మా" అంటే "మీరేదో వాత్సల్యం తో అంటున్నారు" అన్నా నేను! ఆయన వేరే వాళ్ళ ముందు నా గురించి చెప్తూ "ఆ అమ్మాయి ఒప్పుకోదు కానీ బాగా పాడింది" అని నవ్వారు. 

అపజయానికే కాదు విజయానికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి అని మొన్న ఎక్కడో చదివాను. ఓ మంచి గమకం పాడితే "భలే!" అని ఎవరో అనేసరికి ఓ నిముషం బ్లాంక్ అయిపోయా చిన్నప్పుడు. అనుభవం మీద ఇలాంటి కొన్ని విషయాలు తెలిశాయనుకోండి.  

ఇంకో పాత అలవాటు ఏంటంటే ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళ మాట పూర్తవకుండా థాంక్ యూ చెప్పడం. వాళ్ళు ఓ పేరాగ్రాఫ్ ప్రశంస తో రెడీ గా ఉంటే నేను మొదటి మాట కే థాంక్ యూ అనేయటం ... వాళ్ళు కూడా మొహమాటస్థులే అయితే ఆ ప్రశంస అక్కడ తుంచివేయబడటం. కాదు .. వాళ్ళు అలాగే కొనసాగిస్తూ ఉంటే నేను లైన్ లైన్ కీ థాంక్ యూ చెప్పడం. (అలాగే ఏం మాట్లాడకుండా వింటూ ఉంటే పొగరు అనుకుంటారేమో అని భయంతో). ఇప్పుడు కొంచెం కాంప్లిమెంట్ హుందా గా రిసీవ్ చేస్కోవడం అలవాటు చేసుకుంటున్నాను. 

ప్రొఫెషనల్ జీవితం లో ఇంకో విషయం కూడా అనుభవం మీద తెలుసుకున్నాను. ఒక్కో సారి సీనియర్ల నుంచి చేతల ద్వారా వచ్చే ప్రశంసే ముఖ్యం. అంటే మన పని నచ్చితే కాంట్రాక్టు కొనసాగించడమే ప్రశంస. అంతే గానే నోటితో పొగిడేసి పని దగ్గరకి వచ్చేసరికి ఇంకొకరిని ప్రిఫర్ చేస్తే అది ప్రశంస కాదని. 

పెద్దయ్యాక తెలిసే విలువైన పాఠాల్లో ఇంకోటి... ప్రశంసలు లభించకపోయినా నువ్వు చెయ్యాల్సిన పని చేస్తూనే ఉండాలి అని. అవి పాయసం లో అప్పుడప్పుడూ వచ్చే జీడిపప్పు లాంటివి అంతే అని. 

కాంప్లిమెంట్ ల లో కాంప్లి 'మంట' అనిపించేవి రోడ్ సైడ్ పోరంబోకుల కామెంట్లు. వాళ్ళు వేసే విజిల్స్ కానీ, వెకిలి సౌండ్స్ కానీ, పొగడ్తలు కానీ అస్సలు పాజిటివ్ గా అనిపించవు. నువ్వు బాగున్నావు కాబట్టే వాళ్ళు అలా చేస్తున్నారు అంటే ఒళ్ళు మండుతుంది. అప్పుడే అనిపిస్తుంది కాంప్లిమెంట్ ఇచ్చే వాడికి అర్హత ఉండాలి.. సమయం, సందర్భం కూడా ఉండాలి అని. 

కమర్షియల్ సినిమా వాళ్ళు "అమ్మాయిలకి కూడా ఇలాంటివి ఇష్టమే" అని పాటల్లో, డైలాగుల్లో చెప్పేస్తూ ఉంటారు. ఆరోగ్యకరమైన విధమేంటో ఇరువర్గాలకీ తెలీకపోవడం వల్ల, ఈ కామెంట్లు చాలా నార్మల్ అనే అపనమ్మకం వల్ల ఇలా అంటారు. ప్రశంసలు ఎవరికైనా ఇష్టమే. రోడ్డు మీద కనిపించిన అమ్మాయి/ అబ్బాయి  బట్టలో,జుట్టో ఏదైనా నచ్చిందనుకుంటే హుందాగా ఎందుకు ప్రకటించకూడదు. అది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కూడానూ! 

అమ్మాయిలకి ఎలా కాంప్లిమెంట్ ఇవ్వాలి అనే విషయం మీద ఓ పుస్తకం రాయచ్చు. కానీ అది ఎవరు చదవాలో వాళ్ళు చదవరేమో అని డౌట్. పుస్తకం చదివే సంస్కారం ఉంటే అది అమ్మాయిల పట్ల ప్రవర్తన లో సున్నితత్వాన్ని కూడా తీసుకొస్తుంది కదా. (దానికీ దీనికీ సంబంధం లేదంటారా?)

కొంత మంది కాంప్లిమెంట్లని భలే వాడుకుంటారు. సంభాషణ ని కాంప్లిమెంట్ తో ఓపెన్ చేస్తారు. అవతలి వ్యక్తి దాన్ని స్వీకరించగానే వీళ్ళ అసలు అజెండా మొదలవుతుంది. దానికి, ఓపెనింగ్ లో చేసిన ప్రశంస కి సంబంధం ఉండదు. అలాగే ఇంకో కేటగిరి ... అతి గా పొగిడే వారు. ముత్యాల ముగ్గు లో, మాయాబజార్ లో చూపించిన భజన బ్యాచ్. వీళ్ళ వల్లే ఒక్కో సారి అసలు ప్రశంసలంటేనే భయం వేసేస్తుంది. పొగడ్త వేరు ప్రశంస వేరనుకోండి. 

మన సమాజం లో ప్రశంసలు అంత ఫ్రీ గా  ఫ్లో అవ్వవు.  మంచి ఉంటే వెనక మాట్లాడు అనే సమాజం మనది. ఇది కూడా ఓ రకంగా మంచిదే. అలాగే చిన్నవాళ్ళని పొగడకూడదు ... ఆయుక్షీణం అని ... దిష్టి అని .. ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయి. తల్లి, గురువు, తండ్రి అయితే అసలు పొగడకూడదు అంటారు. కానీ నా అనుభవం లో సరైన సమయం లో సరైన మోతాదు లో చేసే ప్రశంస పిల్లలకి టానిక్కే. 

తెలుగు/సంస్కృతం అంతగా రాని పిల్లలకి సంగీతం నేర్పించే అప్పుడు వాళ్ళు పెద్ద పదాలు పలికినప్పుడు "భలే పలుకుతున్నావే" అంటే వాళ్ళ మొహాలు వెలిగిపోవడం చూసా నేను. ఆ ప్రశంస కోసం వాళ్ళు కష్టపడి పెద్ద పెద్ద స్తోత్రాలు ఇష్టంగా సులువుగా నేర్చుకోవడం నా అనుభవం లో చూసాను. 

మన దగ్గర సంబంధాల్లో కూడా ప్రశంసలు చాలా ముఖ్యం. ముందే చెప్పినట్టు ప్రశంస లో ఉన్న గుర్తింపు సంతోషాన్నిస్తుంది. Mrs. Doubtfire సినిమా లో ఓ సీన్ ఉంటుంది. (ఆ సినిమా నుంచి inspire అయి తీసిన 'భామనే సత్యభామనే' సినిమా లో ఈ సీన్ ఉండదు.) ఆడ వేషం మార్చుకొని భర్త తన ఇంట్లోనే పనికి చేరతాడు. మీ వంటిల్లు భలే నీట్ గా పెట్టుకున్నారు అని ప్రశంసిస్తాడు. అప్పుడు ఆవిడ "థాంక్స్. నా భర్త ఇదెప్పుడూ గుర్తించలేదు" అని బాధపడుతుంది. మారువేషం లో ఉన్న భర్త ఇది విని తను కూడా బాధపడతాడు. చాలా మంచి సన్నివేశం ఇది. 

శుభలేఖ ల్లో విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్.....అని రాస్తారు చూడండి.... అక్కడ తో ఆగిపోకుండా సందర్భం వచ్చినప్పుడు మంచి ప్రశంసలు అందరూ ఇచ్చి పుచ్చుకోవాలని ఆశిస్తూ.... ఐడియలిస్టు నైన నేను సెలవు తీసుకుంటున్నాను. 








లేబుళ్లు: , , , , , , ,

19, మే 2023, శుక్రవారం

ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి ..


నాకు ఇంటి పని తో చాలా పేచీలున్నాయి. 

ఒకటి ఆ పని కి ఉన్న రిపిటీటివ్ నేచర్. ఒక్క రోజు, ఒక్క సారి చేస్తే సరిపోదు. చేస్తూనే ఉండాలి. చేస్తే మామూలుగా ఉంటుంది కానీ చెయ్యకపోతే కనిపిస్తుంది ఏవిటో. ఇంటి శుభ్రానికి శత్రుత్రయం ... దుమ్ము, చెత్త, మట్టి. అందులో దుమ్ము రక్తబీజుడి జాతికి చెందినదే అనిపిస్తుంది నాకు. టెడ్డీ బేర్, బార్బీ బొమ్మలు ఇష్టంగా కొనుక్కొని ఈ రాక్షసుడికి భయపడే వాటికి ప్లాస్టిక్ కవర్ ముసుగులు వేసేస్తూ ఉంటాం కదా. ఈ దుమ్ము అటక ల మీదా, ఫాన్ల మీద ఓ రకంగా, నేల మీద ఇంకో రకంగా, ఎలక్ట్రానిక్స్ మీద మరో రకంగా ఏర్పడుతూ ఉంటుంది. ఒకదానికి ఉపయోగించిన ఆయుధం ఇంకో దానికి ఉపయోగించలేం. అమెజాన్ లో కి వెళ్తే దోమల మెష్ తుడవడానికి ఓ బ్రష్, కార్పెట్ తుడవడానికి ఇంకోటి ఇలా అమ్ముతాడు. కానీ మనం ఆ ట్రాప్ లో పడకూడదు. మా  నాన్నగారు పాత దిండు గలీబు తో ఫాన్ తుడిచే వారు. ఇవి ఇండియా లో మనకే సాధ్యమైన జుగాడ్ చిట్కాలు. 

కొంతలో కొంత చెత్త ఫర్వాలేదు. ఇంట్లో ఫంక్షన్ లాంటివి పెట్టుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది. లేకపోతే మామూలే. ఇంక మట్టి ...  పిల్లలు, మొక్కలు, పెంపుడు జంతువులు ఉన్నప్పుడూ, వానాకాలం లోనూ వస్తుంది అనుకోవచ్చు. ఇవి కాక పొరపాటున కిందపడి పగిలిపోయేవి, పౌడర్ డబ్బాల్లాగా చిమ్మబడేవి, నూనెలాగా రుద్దిరుద్ది కడగాల్సి వచ్చేవి .. ఇలాంటివి బోనస్. చిట్కాలు అవసరం అయ్యే పనులు ఇవి! 

ఈ మూడింటిని దాటితే ప్రత్యక్షమవుతాయి జీవులు... బొద్దింకలు, ఎలకలు, దోమలు, ఈగలు etc. నేను చచ్చిపోతాను.. మిమ్మల్ని కూడా తీసుకు పోతాను అనే సినిమా సైకోల్లాగా ఇవి పోవాలంటే మనక్కూడా ప్రమాదకరమైన కెమికల్స్ వాడాల్సిందే! 

ఇంటికొచ్చిన ప్రతీ సామాను నువ్వు మెయింటైన్ చెయ్యాల్సిన ఇంకో వస్తువే అని తెలియడమే పెద్దరికమ్. ఇది తెలియక వస్తువులు కొనుక్కుంటూ వెళ్లిపోవడం కుర్రతనం. ఈ కుర్రతనమే ఫాబ్రిక్ సోఫా కొనమంటుంది.  శిల్పారామం లో, హోమ్ సెంటర్ లో రకరకాల వస్తువులు కొనమంటుంది. మన దేశానికి సంబంధం లేని వాళ్ళు ఇళ్ళు ఎలా సద్దుకుంటారో చూసి వాళ్ళలాగా ఇల్లు సద్దుకోమంటుంది. వాళ్ళకి దుమ్ము తక్కువేమో.. అన్నీ ఓపెన్ గా ప్రదర్శించుకుంటారు. మన ఇళ్లలో ఒకేఒక షో కేస్ ఉంటుంది. అందులోనే అన్నీ పెట్టుకోవాలి. ఈ మధ్య ఈ రాగి పాత్రలు, ఇత్తడి  బిందెలు,బాయిలర్లు హాల్లో పెట్టుకోవడం ఒక క్రేజ్. కానీ వాటిని అలా మెరిపించాలంటే రెగ్యులర్ గా చింతపండు తో తోముకుంటూ ఉండద్దూ! మళ్ళీ అదో పని!

అభిరుచి ఉండి, ఆసక్తి ఉండి, చేసుకోగలిగిన శక్తీ ఉంటే ఇవన్నీ పనుల్లా అనిపించవు. అలాంటి వారి ఇళ్ళు కూడా భలే చక్కగా చూడముచ్చట గా ఉంటాయి. May God bless them! అలాంటి ఓ ఆంటీ మాకు ఉన్నారు. ఆవిడ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో! మనిళ్ళలో ఓ వాడుక ఉంది చూడండి.. నేల మీద పడ్డ పాలెత్తుకు తాగచ్చు అని ... అలా అన్నమాట. ఇద్దరి ఇళ్ళకి ఒకే అమ్మాయి తడిగుడ్డ పెడుతుంది. కానీ ఆవిడ నేల మెరిసిపోతూ ఉంటుంది. మా నేల మీద తడిగుడ్డ పెట్టిన ఆనవాలు కనిపిస్తాయి. (ఇది ఓ మాప్ యాడ్  లాగా అనిపిస్తోంది కదూ. కానీ కాదు. మేము వాడే మాప్ కూడా ఒకే కంపెనీ.. ఎందుకంటే అది మా హెల్ప్ తనే తెచ్చుకుంటుంది) ఓ రోజు అంటీ ని అడిగితే చెప్పారు ... అమ్మాయి తడిగుడ్డ పెట్టాక ఆవిడ మళ్ళీ పెట్టుకుంటారట! ఇలా శ్రద్ధగా, ఓపిక గా చేసుకున్న ఇళ్ళు చూడగానే తెలుస్తూ ఉంటాయి.  

ఓ వాడుక ఉంది చూసారా ... ఇల్లు చూసి ఇల్లాలిని చూడాలని.. చూడాలి, కానీ జడ్జ్ చెయ్యద్దు. ఇది నా పాయింటు.  ప్రతి కుటుంబానికి ఓ లైఫ్ స్టైల్ ఉంటుంది. అది వారి పరిస్థితులని బట్టీ,  ప్రయారిటీలని బట్టీ ఏర్పడుతుంది. అవి పూర్తిగా తెలుసుకోకుండా కేవలం ఇల్లు శుభ్రంగా లేదని ఒకరిని తక్కువ గా చూడకూడదు కదా. 

ఇన్స్టాగ్రామ్ లో యూరోప్ కి చెందిన ఓ అమ్మాయి కి ఇళ్ళు క్లీన్ చెయ్యడం ఎంత ఇష్టమంటే వారాంతాల్లో వేరే వాళ్ళ ఇళ్ళు శుభ్రం చేసేస్తోంది.  (ఆ అమ్మయి అకౌంట్ లింక్ ఇచ్చాను. పేరుకుపోయిన చెత్త చూడలేని సున్నితమైన సెన్సిబిలిటీ ఉంటే క్లిక్ చెయ్యకండి). వాళ్ళ ఇళ్ళలోకి బలవంతంగా దూరిపోయి కాదు లెండి. మానసిక పరిస్థితి బాలేకో, అంగ వైకల్యం వల్లో తమ ఇల్లు శుభ్రం చేసుకోలేక ఇల్లు చెత్త కుండీ లాగా అయిపోయిన వాళ్ళ ఇళ్ళు మంచి మనసు తో శుభ్రం చేసి పెడుతుంది. ఉచితంగానే. దేనితో ఏది తుడిస్తే ఎలా శుభ్రం అవుతుందో అనే కోర్స్ చేసింది కూడా ఆ అమ్మాయి! (మన దగ్గర హోమ్ సైన్స్ అంటారు... అది ఇలాంటి కోర్సెనా?). వారి దేశాల్లో మరీ పరిస్థితి ఘోరంగా ఉంది అని ఆ అమ్మాయి క్లీన్ చేసే ఇళ్ళు చూస్తే తెలుస్తుంది...  మన దగ్గర మరీ పరిస్థితి అంత దిగజారదు. 

దీనికి నాకు తోచిన ఓ కారణం ... ఇంటి శుభ్రత ని లక్ష్మి దేవి కి ముడిపెట్టేయడం. డబ్బులు మెండుగా ఉండాలంటే రోజూ ఇల్లు తుడుచుకోవాలి, పాచి చేసుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి అనేది మనకి బ్రెయిన్ వాష్ చేసేసారు. సాక్ష్యం కావాలంటే "ఉండమ్మా బొట్టు పెడతా" సినిమా చూడండి.  

సొంత ఇళ్ళ వాళ్ళకి ఇల్లు వారిదే కాబట్టి శ్రద్ధ ఉంటుంది. అద్దె వాళ్ళకి ఇంటి వాళ్ళ భయం ఉంటుంది. ఇవేవీ లేకపోయినా పని చెయ్యడానికి డొమెస్టిక్ హెల్ప్ వ్యవస్థ ఉంది. వాళ్ళకి తోచినట్టు తుడిచి పెట్టేస్తారు.

పశ్చిమం లో మోటివేషన్ గురు లు ఈ మధ్య చెప్తున్నారు .. లేచాక వెంటనే పక్క శుభ్రంగా వేసేసుకోండి.. దాని వల్ల మీ రోజు బాగా గడుస్తుంది అని. ఇది ప్రత్యేకంగా చెపుతున్నారంటే వాళ్ళకి అలవాటు లేదా అనిపించింది నాకు. మన ఇళ్లలో పిల్లల వీపులు బద్దలు కొడతారు కదా పక్కలు తియ్యకపోతే! అది కూడా పొద్దున్నే!  

నిజానికి శుభ్రంగా ఉన్న ఇల్లు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కొంత మంది విషయం లో ఈ మాట కి రివర్స్ కూడా పని చేస్తుంది. మనసు ప్రశాంతంగా అవ్వటానికి ఇల్లు క్లీన్ చేసే అలవాటు చాలా మందికి ఉంది మనలో. కానీ ముందు చెప్పినట్టు మానసిక స్థితి బాగోకపోతే అస్సలు ఇంటిని శుభ్రం చేసుకోలేం. ఆ పని భారంగా అనిపిస్తుంది. విసుగ్గా అనిపిస్తుంది. అలాగే కెరీర్ కొంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడు కూడా ఇంటి పని కి అస్సలు సమయం కేటాయించలేం. ఈగ ఇల్లలుకుతూ పేరు మర్చిపోయింది అనేది సామెత. ఇల్లలికే పనుల్లో పడితే పేరేంటి .. కెరీర్, వర్క్ గోల్స్ .. ఇవన్నీ మర్చిపోయే ప్రమాదం లేకపోలేదు. 

ఇల్లలకడం అంటే గుర్తొచ్చింది... నేను ముందు చెప్పినట్టు ... ఈ ఇల్లు శుభ్రత విషయం లో బ్రెయిన్వాష్ చిన్నప్పుడే మొదలవుతుంది .. ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి .. అని మొదలవుతాయి కదా చిన్న పిల్లల ఆటలు. ఇల్లలకగానే పండగ కాదు అంటారు.. ఈ సామెత కి నాకు మొత్తం వ్యాసం లో ఎక్కడా సందర్భం కుదర్లేదు. ఊరికే పడుంటుంది అని రాస్తున్న అంతే 😄

ఇంటర్నెట్ లో ఇల్లు మైంటైన్ చెయ్యడానికి క్లీనింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. రోజూ గదులు తుడుచుకోవటం, వారానికోసారి బాత్రూమ్స్, నెలకోసారి మంచం దులుపుకోవడం, కర్టెన్స్ గట్రా మార్చుకోవటం.. ఇలా. కానీ ఈ షెడ్యూల్ ఇంటింటికీ మారుతుంది కదా. ఇంటి ముందు రోడ్డు వేసినా, కన్స్ట్రక్షన్ పని జరిగినా ఇంట్లోకి బోల్డు దుమ్ము, ధూళి వస్తుంది. అలాగే ఇంట్లో పిల్లలూ, పెంపుడు జంతువులూ ఉంటే ఆ షెడ్యూల్ వేరు! అందుకే అవి పెద్దగా ఉపయోగ పడవు మనకి. అలాగే  వెస్ట్ వాళ్ళు కనిపెట్టిన వాక్యూం క్లీనర్లు, ఇల్లు తుడిచే రోబోలు కూడా మనకి పనిచేయవని నా అభిప్రాయం. 

మన దగ్గర దీపావళి, ఉగాది లాంటి పండగలకి ఇళ్ళు నిగనిగలాడేలా చేసుకుంటాం. మంచు దేశాల్లో స్ప్రింగ్ క్లీనింగ్ అంటారు ... ఓహో ఓహో వసంతమా అంటూ బూజులు దులుపుకుంటారన్నమాట అక్కడి వారు. 

ఇంటర్నెట్ లో అందరం చూసాం ఓ ఫార్వార్డ్ .. జపాన్ లో స్కూల్  పిల్లల కి టాయిలెట్స్ శుభ్రం చేయడం నేర్పిస్తారని. మన దగ్గర ఇది ఎంత పెద్ద వివాదం అవుతుందో నేను చెప్పక్కర్లేదు. గాంధీ సినిమా లో ఓ సీన్ ఉంటుంది... సబర్మతీ ఆశ్రమం లో టాయిలెట్స్ శుభ్రం చేసే పని వారానికి ఒకరు చెయ్యాలి. ఓ సారి కస్తూర్బా గారి వంతు వస్తుంది. ఆవిడ అస్సలు చెయ్యడానికి ఇష్టపడదు. గాంధీ ఆ సమయం లో ఆవిడ మీద కన్నెర్ర చేస్తారు కూడా!   

సంపన్నుల ఇళ్లలో టీపాయ్ ల మీద, బల్లల మీద, గోడల మీద ఉండే ఖరీదైన  గృహాలంకరణ వస్తువులు, ఇండోర్ ప్లాంట్స్ మీద ఆకులకి సైతం దుమ్ములేకుండా చూసినప్పుడు "తాజ్ మహల్ కు రాళ్ళెత్తిన కూలీలు" గుర్తొస్తారు నాకు.  మనం సొంతగా మెయింటైన్ చేసుకోలేని ఇళ్ళు కట్టుకుని ఇంకో జాతి మీద మనం డిపెండ్ అయ్యి .. వారు మన మీద డిపెండ్ అయ్యేలా చేస్కున్నామని  అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కానీ నేను ఈ బ్లాగ్ ప్రశాంతంగా రాయగలుగుతున్నాను అంటే నా ఇల్లు శుభ్రం చేసుకొనే పని నుంచి నేను ఫ్రీ అవ్వడం వల్లే అని కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ విషయం గురించి మాట్లాడటానికి నా అనుభవం తక్కువ... ఇంటి మెయింటెనెన్స్ లాగే. 😁

ఇంటి పని అదే పని గా చేసి కొంతమంది మైండ్సెట్ ఇరుకైపోతుందని అని నా అబ్సర్వేషన్.  తమ ఇల్లు తుడుచుకొని రోడ్డు మీద దుమ్ము పడేసే వాళ్ళు ఈ బ్యాచే అనిపిస్తుంది. బతుకంతా ఇంటి శుభ్రత చుట్టే తిరుగుతుంది ఇలాంటి వాళ్ళకి.  దానికి అనువైన నిర్ణయాలే తీసుకుంటూ ఉంటారు కూడా. ఇల్లు పాడవుతుంది అని కుక్కని పెంచుకోకపోవడం, సోషల్ లైఫ్ లేకుండా ఇల్లు అదే పనిగా తుడుచుకుంటూ ఉండటం, ఇంటికొచ్చిన అతిథుల వల్ల ఏదైనా ఒలికినా, మరక పడినా నిర్మొహమాటంగా వాళ్ళ ముందే మొహం మటమట పెట్టుకోవడం, పిల్లల్నయితే తిట్టేయడం... ఇవన్నీ ఈ మైండ్సెట్ వల్ల కలిగే పైత్యాలే.  ఫ్రెండ్స్ సీరియల్ లో మోనికా పాత్ర ఈ బాపతే. 

ఆడవాళ్లు ఇంటిపనులు, ఆఫీసు పనులూ 'బ్యాలెన్స్' చెయ్యలేక చస్తూ ఉంటే 'మగవాళ్ళు చీపురు పట్టుకోకూడదు' అనే మాటలు విన్నా, అసలు ఆ సదరు మగవాళ్ళకి ఇంట్లో చీపురు కట్ట ఎక్కడుందో తెలీదన్నా నాకు వారి మీద ఈర్ష్య, ఆగ్రహం ఒకేసారి వస్తాయి. ఇదే మగవాడికి ఓ షాపు ఉండి ఆ రోజు బాయ్ రాకపోతే చీపురుతో తన కార్యక్షేత్రాన్ని తుడుచుకుంటాడు! ఇప్పుడు పరిస్థితి లో చాలా మార్పు వచ్చింది .. కాదనట్లేదు. కానీ ఇప్పటికీ ఇంటి నిర్వహణ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేని ప్రివిలేజ్ లో ఎంతమంది మగవారు ఉన్నారో కదా! 

జీవితాన్ని కాచి వడబోయలేదు కానీ ... గోరువెచ్చ గా సిప్ చేసిన అనుభవం తో నాకు తెలిసిందేంటంటే .. దీపం కిందే చీకటి ఉన్నట్టు ...మనం సుఖం అనుకునే ప్రతి దాని వెనక ఓ నస ఉంటుంది. సౌకర్యం కోసం, సెక్యూరిటీ కోసం మనిషి ఇళ్ళు నిర్మించుకుంటే ఆ వెనకే వస్తుంది ఎడతెగని ఇంటిపని. కనిపించదు కానీ మన దినచర్య లో చాలా భాగం ఇదే ఆక్రమించుకుంటుంది. ఇష్టంగా చేసుకున్న రోజు exercise, టైం పాస్. లేనిరోజు విసుగు, చాకిరీ.  

లేబుళ్లు: , , , , , , , , ,

25, నవంబర్ 2022, శుక్రవారం

నాలుగు కళ్ళు రెండయినాయి ...

... రెండు మనసులు ఒకటయినాయి .. ఈ పాట గుర్తుందా? ఈ పోస్టు ఆ పాట గురించి కాదు. 

విషయం ఏంటంటే నాకు కళ్ళజోడు ఉంది.  

మనకి తెలిసి కళ్లజోడు తలనొప్పికి గాని, సైట్ కి గాని పెట్టుకుంటారు. సైట్ అన్నప్పుడు మనం ఉద్దేశం సైట్ ప్రాబ్లమ్ అని. సైట్ అంటే చూపు. అదే ఉంటే కళ్ళజోడు ఎందుకు? వాషింగ్ పౌడర్ ని సర్ఫ్ అనేసినట్టు, మధు అనే రాక్షసుడిని చంపి మధుసూదనుడైన విష్ణువు పేరు పెట్టుకున్న వ్యక్తి ని ఆ రాక్షసుడి పేరు తో మధు అని పిలిచినట్టు, కర్ణాటక సంగీతాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంగీతం అనుకున్నట్టు ... సైట్ ని కూడా అలా వేరే అర్ధం (పై పెచ్చు వ్యతిరేక అర్ధం) లో వాడటం మనకి అలవాటైపోయింది. 

ఎలా వాడితే ఏం .. నాకు సైట్. అదే సైట్ ప్రాబ్లమ్. 

చిన్న విషయం గా అనిపిస్తుంది కానీ, అద్దాలు ఉండటం వల్ల దైనందిన జీవితం వేరే వారి లా ఉండదు. ఇది అద్దాలు వాడే వారికే తెలుస్తుంది. 

వేడి కాఫీ/టీ తాగే అప్పుడు ఉఫ్ అని ఊదగానే కళ్ళజోడు మీద ఆవిరి వచ్చేస్తుంది. కొన్ని రకాల మాస్క్ పెట్టుకుంటే కూడా కళ్ళజోడు మీద ఫాగ్ వచ్చేస్తుంది ఊపిరి వదిలినప్పుడల్లా. అదో న్యూసెన్స్. త్రీ డీ సినిమాలు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు త్రీ డీ గ్లాసెస్ ఇస్తారు కదా ... అవి మా కళ్ళజోడు మీద పెట్టుకోవాల్సి వస్తుంది. సైట్ ప్రాబ్లమ్ ని బట్టి, తీవ్రత ని బట్టి డ్రైవింగ్ లాంటివి చెయ్యలేం. పైలట్ లాంటి ఉద్యోగాలు చెయ్యలేం. డిఫెన్స్ లో కూడా కొన్ని పోస్టులకి సైట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళని తీసుకోరు. క్రీడల్లో అద్దాలున్న ఆటగాళ్లు లేకపోలేదు కానీ అంతగా సూటబుల్ ప్రొఫెషన్ కాదు అది కూడా. ఇంతలా లైఫ్ ఛాయిసెస్ ని మార్చేస్తుంది కళ్ళజోడు. 

LASIK ఆపరేషన్ మినహా సైట్ ప్రాబ్లమ్ ఇంకెలాగూ తగ్గదు. అద్దాలు వాడుతూ ఉండాలి. అంతే. కానీ వాడకపోతే పెరుగుతుందట కూడా. 

యోగా లో కొన్ని కంటి exercises చెప్పి వీటి వల్ల చూపు బెటర్ అవుతుంది అనటం చూసాను. కానీ అవి సాధన చెయ్యడం కుదర్లేదు. 

ఆ లెవెల్ సమస్య కాదు కానీ నాకు అనిపించే ఇంకో సమస్య ... తెలుగు ట్రెడిషనల్ బట్టలు వేసుకొని, పాపిట తీస్కొని జడ వేసుకోని, పూలు పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకుంటే నప్పదు ఏంటో. సరే ... ఫాషన్ అంటే మనం అనుకొనేదే కదా అని సరిపెట్టుకుంటూ ఉంటాను నేను. ఇలాంటి ఫాషన్ సమస్య ఇంకోటి ... మేము స్టైల్ గా సన్ గ్లాసెస్ రెడీమేడ్ గా పెట్టుకోలేం. ప్రిస్క్రిప్షన్ వి చేయించుకోవాలి. కళ్ళజోడు పెట్టుకొని ఎండలోకి వెళ్తే కళ్ళజోడు షేప్ లో టాన్ అయిపోతాం తెలుసా .. చూడటానికి ఏం బాగోదు ఇది. అలా అని వానా కాలం కూడా బెటర్ కాదు .. వానలో తడవాల్సి వస్తే కళ్ళజోడు మీద పడ్డ చినుకులు తుడుచుకుంటూ కూర్చోవడం .. ఇంతే గా.  

ఫ్రేమ్ లేని కళ్లజోళ్లు పోతే వెతకడం ఎంత కష్టమో తెలుసా. అసలు కళ్ళజోడు వెతకడం అంటేనే క్యాచ్ - 22 సిట్యుయేషన్.  స్పష్టంగా కనిపించాలంటే కళ్ళజోడు కావాలి, కావాలంటే వెదకాలి, వెదకాలంటే  స్పష్టంగా కనిపించాలి... పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లవ్వదు.

జోకుల్లో చెప్పినట్టు ఒక్కో సారి తలమీదే ఉంటుంది అనకండి. నిజానికి అద్దాలు తల మీద కొందరే పెట్టుకోగలరు. పెద్ద జుట్టున్న ఆడవారు తల మీద అద్దాలు పెట్టుకుంటే వాటి నోస్ పాడ్స్ లో జుట్టు చిక్కు పడిపోతుంది తెలుసా. బట్టతల/పొట్టి జుట్టు ఉన్నవారికే ఏం అవ్వదు. అయినా తల కి నూనె రాసుకున్నప్పుడు ఇలా జోళ్ళు పైకి పెట్టుకుంటే మసకబారిపోవూ? 

కళ్ళజోడు కష్టాలకి మిడిల్ క్లాస్ కష్టాలు తోడైతే ఇంక చెప్పేదేముంది? చూస్కోకుండా కళ్ళజోడు మీద కూర్చోవడం, అది వంకర పోవడం, కానీ అది ఈ మధ్యే తీసుకున్నాం కదా అని అలా వంకర గానే పెట్టుకొని అడ్జస్ట్ అయిపోవడం! 

నేను ఫొటోల్లో కళ్ళజోడు తీసేస్తాను. నేను ఫొటోల్లోనే కళ్ళజోడు తీస్తాను. కొంత మంది సైట్ ఉండి కూడా కళ్ళజోడు పెట్టుకోరు తెలుసా.  కొంత మందికి తలనొప్పి వస్తుందట. ఇది అర్ధం చేస్కోవచ్చు. కానీ కొంతమందికి స్టైల్ కూడా ఒక కారణం.. ఇలాంటి వాళ్ళని నేను చాలామందినే చూసాను. దీనికి పూర్తి వ్యతిరేకం ఇంకో విచిత్ర జాతి. వీళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవడం సరదా. కానీ పాపం దేవుడు వీళ్ళకి సైట్ ప్రాబ్లమ్ ఇవ్వలేదు. వీళ్ళు ప్లెయిన్ గ్లాసెస్ పెట్టుకొని ఫీలయిపోతూ ఉంటారు. తిండి దొరకని వాళ్ళూ, తిన్నది అరగని వాళ్ళూ .. ఇలాగ .. ఈ ప్రపంచం లో ఈ రెండు రకాల వాళ్ళూ ఉన్నారు. ప్చ్ .. 

ఖద్దరు వేసుకున్న ప్రతీవాడూ గాంధేయ వాది కాదన్నట్టు కళ్ళజోడు లేని ప్రతీ వ్యక్తి 20/20 విజన్ తో ఉన్నవారేమి కాదు. గాంధేయ వాదం అంటే గుర్తొచ్చింది... ఓ కళ్ళ జోడు కి ఎంత గౌరవం, విలక్షణత, ఐడెంటిటీ లభించగలదో  గాంధీ గారి కళ్ళజోడు ని చూస్తే తెలుస్తుంది. కళ్లజోడుల ప్రపంచం లో ఈ కళ్ళజోడే మెగా స్టార్ అనుకోవచ్చు.  

సినిమాల్లో కళ్ళజోడు చిత్రీకరణ గురించి నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో. 

కవలల్లో ఒకడు మంచి బాలుడు, చదువుకున్న వాడు అని చెప్పడానికి కళ్ళ జోడు పెడతారు గమనించారా? అమాయకత్వానికి, చదువరితనమ్ చూపించడానికి కూడా దీన్ని వాడతారు. 

హీరోలకి పైన చెప్పిన సందర్భాల్లోనే కాక వేషాలు మార్చినప్పుడు, గ్లామర్ తగ్గించాలి లేదా వయసు పెరిగింది అన్నప్పుడు తప్ప కళ్ళజోడు ఉండదు. హీరోయిన్ లకి కూడా. (ఇది ఇంకా పాపం గా భావిస్తారు ఏంటో). శుభలేఖ సినిమాలో సుమలత గారు కళ్ళజోడు తోనే కనిపిస్తారు. ఇలా ఇంకేమైనా ఉదాహరణలు ఉన్నాయా తెలుగు సినిమాలో? (ఒక సినిమాలో హీరోయిన్ కి కళ్ళజోడు ఉంటుంది కానీ ఒకటి రెండు సీన్ల వరకే ... మేక్ ఓవర్ లో ఆమె లెన్స్ లోకి వచ్చినట్టు చూపిస్తారు). 

నాకు గుర్తుండీ హీరో కి కళ్ళజోడు ఉండి బాగా హిట్ అయి కోట్ల డాలర్లు వసూలు చేసిన సినిమా హారీ పాటర్. అతను అన్ని ఫైట్లు అలా కళ్ళజోడు తోనే చేస్తాడు. కళ్ళజోడు లేకపోతే ఎలా కనిపిస్తుందో ఆ సినిమాలో చాలా సార్లు చూపిస్తారు కూడా. 

స్పైడర్ మాన్  పీటర్ పార్కర్ గా ఉన్నప్పుడు కళ్ళజోడు ఉంటుంది. కానీ అతన్ని సాలీడు కుట్టి స్పైడర్ మాన్ అయ్యాక సైట్ ప్రాబ్లమ్ పోయినట్టు చూపిస్తారు. మరి మాస్క్ మీద కళ్ళజోడు పెట్టుకున్నట్టు చూపించలేకేమో మరి. 

సినిమాల్లో కళ్ళజోడు ఉన్న సీన్లలో కూడా వాటిని స్టైల్ కే ఎక్కువ వాడతారు ... 

షాక్ అయినప్పుడు కళ్ళజోడు తీసి షాక్ అవుతారు ... షాక్ అంటేనే స్థబ్దుగా అయిపోవడం .. అలాంటప్పుడు కళ్ళజోడు తీసెయ్యటం ఎలా గుర్తుంటుంది మెదడు కి? 

అలాగే కళ్ళజోడు ఒక చేత్తో తీసి దాని కాడ ని పంటి మధ్య పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు. 

నేను గత ఇరవై ఏళ్ళ నుంచి కళ్ళజోడు వాడుతున్నాను. ఇలా ఒక్కసారి కూడా చెయ్యలేదు. తట్టక కాదు. ప్రాక్టికల్ గా ఇది పనికి రాదు. ఒక చేత్తో కళ్ళజోడు పదే పదే తీస్తే చెవుల దగ్గర లూజ్ అయిపోతుంది. నాకు అద్దాలు వచ్చినప్పుడు నా ఆప్టిషియన్ చెప్పిన మొదటి మాట ఇది. ఇంక చెవి వెనక భాగం లో జుట్టు ఉంటుంది. చెమట పడుతుంది. డాండ్రఫ్ సమస్య ఉండచ్చు. అక్కడ ఉండే కళ్ళజోడు కాడ ని నోట్లో ఎవడు పెట్టుకుంటాడు చెప్పండి? 

ఇంకో కళ్ళజోడు మేనరిజం ..జారిన కళ్లజోడు ని ముక్కు పైకి తోసుకువడం. ఇది ఒకే .. ఇది నిజ జీవితం లో కూడా చేసేదే. 

కళ్ళజోడు ఉన్న హీరోయిన్ ని హీరో ఇష్టపడితే ఆమె దగ్గరికి వెళ్లి ఆమె అద్దాలు తీసేస్తాడు. అవేవో ఆమె ఆకర్షణ ని తగ్గించేట్టు. పోనీ అలా తీసాక ఆమె ముక్కు మీద అద్దాల వల్ల కలిగిన నొక్కులు ఉండవు. 

ఇన్ని సినిమాలు చూసాను.. ఒక్క సారి కూడా కళ్ళజోడు మీద కూర్చుంటే అవి ఎలా వంగిపోతాయో చూపించలేదు.  

కొంత మంది నటులు, కొన్ని సినిమాల్లో మాత్రం సహజ సిద్ధంగా కళ్ళజోడు వాడారు. (నాకు హిందీ నటులు అశోక్ కుమార్ గారు గుర్తొస్తారు ఈ విషయంలో.) 

సినిమాలు సమాజం యొక్క ప్రతిబింబాలు అనుకుంటే, ఈ విషయం లో సమాజం లో వివక్ష బానే ఉంది. 

వెధవ జోకులు, కామెంట్లు .. ఎన్ని వినలేదు? 

తెల్లగా ఉన్న వాళ్ళు 'కర్రోడా' అనడం  ... డబ్బున్న వాడు 'బ్లడీ పూర్ పీపుల్' అనడం .... సన్నగా ఉన్న వాళ్ళు 'ఏ బోండం' అనడం ... కళ్ళజోడు లేకుండా స్పష్టంగా చూడగలిగే వాళ్ళు  అద్దాలు  ఉన్న వాళ్ళని 'నాలుగు కళ్ళు... సోడా బుడ్డి' అని, కళ్ళజోడు తీసేసినప్పుడు 'నేను కనిపిస్తున్నానా .. ఇవి ఎన్ని వేళ్ళు' అనడం, స్పెక్స్ తీస్కొని వాళ్ళు పెట్టుకొని 'అబ్బో ... నీకు చాలా సైట్ ఉంది' అనడం ... ఇవన్నీ ఒకే కేటగిరి కి చెందిన పాపాలు నా ప్రకారం. వీళ్ళకి నరకం లో ప్రత్యేకమైన శిక్షలు ఉంటాయి అని నా ప్రగాఢ విశ్వాసం. మాకేమీ సరదా అయ్యి సైట్ ప్రాబ్లమ్ తెచ్చుకోలేదు కదా మేము. 

సైట్ గురించిన కొన్ని అపోహలు కూడా ఉండేవి. మైనస్ లో ఉంటే ఎక్కువ అని, ప్లస్ లో ఉంటే తక్కువ అని. అలాంటిదేమీ లేదట. 

ఇందాక ఫాషన్ గురించి మాట్లాడుకున్నాం కదా ... కొంత మంది ఈ సైట్ కళ్లజోడునే ఎంత బాగా వాడతారో .. జావేద్ జాఫ్రీ (బాలీవుడ్ లో మంచి డాన్సర్, యాంకర్, కమెడియన్) ఏ డ్రెస్ కి ఆ స్పెక్స్ పెట్టుకుంటాడు. ఏ మొహానికి ఏ ఫ్రేమ్ బాగుంటుందో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో ఇంటర్నెట్ లో.  

లెన్స్, lasik వంటి సౌకర్యాలు మెండుగా ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు సిలిండ్రికల్ సైట్ ప్రాబ్లమ్ ఉన్నవారికి లెన్స్ చేసే వారు కాదు .. ఇప్పుడు అవి కూడా దొరుకుతున్నాయి. కానీ లెన్స్ తో పోలిస్తే కళ్లజోడే సేఫ్ ఛాయిస్. 

ఒకప్పుడు కళ్ళజోడు ఫ్రేమ్స్ ఎంత బరువుండేవంటే చాలా ఏళ్ళు పెట్టుకున్న వాళ్ళ ముక్కు మారిపోయేది. అలాంటిది ఇప్పుడు లైట్ వెయిట్ వి వస్తున్నాయి, ప్లాస్టిక్ వి వస్తున్నాయి .. చెమట కి మెటల్ అయితే తుప్పు పడుతుంది కదా .. ప్లాస్టిక్/ఫైబర్ వి అయితే తేలిక గా ఉంటాయి, తుప్పు సమస్య ఉండదు. 

ఫ్రేమ్స్ కాక అద్దాల్లో మంచి టెక్నాలజీ వచ్చింది ... బై ఫోకల్స్ వారికి పైనో అద్దం, కిందో అద్దం అతికించినట్టు కనపడేది అప్పుడు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. టివి, ఫోన్, లాప్టాప్ స్క్రీన్స్ నుంచి వచ్చే హానికారకమైన వెలుతురు, సూర్యుడి యూవీ కిరణాలు - వీటిని కూడా అడ్డుకొనే అద్దాలు వచ్చేసాయి. 

తొంభై ఏళ్ళ వయసు లోనూ సూది లో దారం ఎక్కించగల బామ్మలకి చిన్న వయసులోనే కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతున్న వారిని చూస్తే బాధ కలగక మానదు. అన్ని విషయాల్లో టెక్నాలజీ పెరిగినట్టే ఏదో ఒక రోజు సైట్ ప్రాబ్లమ్ ఉన్నవారు అసలు ఉండకపోవచ్చు. జన్యు స్థాయి లోనే ఈ సమస్య  లేకుండా చేసే రోజు రావచ్చు. 

ఆ రోజు ఎప్పుడు వస్తుంది ... నాలుగు కళ్ళు రెండెప్పుడు అవుతాయి .. అని కళ్ళజోడు కాడ ని పంటి తో పట్టుకొని ఎదురుచూడటం, ఆ రోజు వచ్చాక కళ్ళ జోడు తీసేసి షాక్ అవ్వడం తప్ప ఇంకేం చెయ్యగలం చెప్పండి. 

లేబుళ్లు: , , , , ,

16, జులై 2022, శనివారం

ప్రకృతి మాత నన్ను వెక్కిరించిన గాధ (యాభయ్యో పోస్టు!)

బ్లాగు మొదలు పెట్టిన చాలా రోజులకి ఈ తరుణం వచ్చినా ... మైలు స్టోన్ మైలు స్టోనే కదా! అసలు యాభై ఇన్నేళ్లకి వస్తుందనుకోలేదు. అసలు యాభై వస్తుందనీ అనుకోలేదు. ఈ రెండు కారణాల పరంగా ఇది చాలా గుర్తుండిపోయే పోస్టు. 

అయితే ఈ సందర్భంగా ఏ విజయ గాధో, మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమో చెయ్యాలి కానీ ఇలా ఒకరి చేత పరాభవం చెందిన విషయం తలుచుకోవడం ఏంటి అనుకోవచ్చు.  కానీ పరాభవించింది ప్రకృతి. ఇంకెవరో అయితే  నేను ఎందుకు పట్టించుకుంటాను .. పట్టించుకుని ఫీల్ అయినా ఇలా ఎందుకు అందరి ముందు చెప్పుకుంటాను? 

సంగతేంటంటే ... నాకొక నమ్మకం ఉంది .... నాకూ ప్రకృతికి అంత మంచి స్నేహం లేదని. 

నేను పల్లెటూరి లో పెరగలేదు. కొన్ని ఊళ్ళు కొండల పక్కన, వాగుల పక్కన, సముద్రం పక్కన ఉంటాయి చూడండి ... అలాంటి ఊళ్ల లో అసలే పెరగలేదు. అంత పెద్ద ట్రావెలింగ్ కూడా చేసెయ్యలేదు. 

కొంత మంది బాగా మొక్కలు పెంచుతారు. లేదా పెంపుడు జంతువులు ఉంటాయి. వాటి తో మంచి బంధం ఉన్నందువల్ల సిటీల్లో ఉండి కూడా ప్రకృతి తో టచ్ లో ఉంటారు. 

నేను పువ్వులు, మబ్బులు, ఆవులు, చెట్లు... వీటిని చూసి ఆనందించగలను, పులకించగలను, వాటి గురించి వర్ణించి రాయగలను, పాడగలను, కెమెరా లో చూపించగలను. ఇంతే. ఇంతకంటే ఆవిడ కి నేను తెలియను అని నా అభిప్రాయం. 

ఎవరి తో ఎలా ఉండాలో తెలిసిన జాణ లాగా ప్రకృతి మాత నన్ను ఇంత వరకే పరిచయం చేసుకున్నారు. 

నేను ఆ మధ్య ఈ పరిచయం కొంచెం పెంచుకుందాము అని ఆశ పడ్డా. దీని గురించి ఈ బ్లాగు లో ఓ సారి రాసా కూడా .. చెత్త టాపిక్ అనే పోస్టు లో. 

చాలా రోజుల నుంచి నేను వంటింటి లో వచ్చే చెత్త ని కంపోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మే నెలలో మొత్తానికి ధైర్యం చేసి ఈ దిశ గా ఓ అడుగు వేసాను. 

నాకు తోట పని అంటే ఇంట్రస్ట్ ఉంది టైం లేదు, ఓపిక లేదు. టాలెంట్ కూడా లేదు. పోనీ సాధన చేసే ఓర్పు, దానికి కావాల్సిన మైండ్ సెట్ కూడా  లేదు ఏంటో. నేను మొక్కని పెంచింది లేదు. గింజ వేస్తే మొలిచిందీ లేదు. మొక్క నాటితే బతికిందీ లేదు.  

అలాంటి నేను ... కంపోస్ట్ చేయాలనుకోవడం. ఇక్కడే గ్రామర్ మిస్టేక్ జరిగింది అసలు. కానీ భారత దేశం లాంటి కర్మ భూమి లో పుట్టాం కదా .... కర్మ చేయక తప్పదు కదా... అందుకే ఏమీ లేకపోయినా ధైర్యం మాత్రం ఉండటం తో ఉపక్రమించా ఈ పనికి. 

చాలా రీసెర్చ్ చేశా ఈ విషయం లో. 

యూట్యూబ్ లో మంచి వీడియోలు ఉన్నాయి ఈ టాపిక్ మీద. అసలే కొరుకుడు పడని సబ్జెక్టు... పరభాష కూడా ఎందుకని తెలుగు వీడియోలే చూసాను.  (అసలు ఎంత మంది ఉన్నారండి బాబు .. చక్కగా తమ తోట వీడియోలు చూపిస్తూ, వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చి మరీ అందరి సందేహాలు తీరుస్తూ!) 

అందులో నాకు నచ్చిన పద్ధతి ఎంచుకున్నాను. 

నిజానికి కంపోస్ట్ చేయాలంటే మనం వేసే చెత్త ని చిన్న చిన్న పదార్ధాలు గా కరిగించడానికి ప్రకృతి ఎంతో ప్రాసెస్ చేస్తుంది. అందులో పుల్ల మజ్జిగ నుంచి వాన పాముల దాకా చాలా క్యారెక్టర్లు తమ పాత్ర నిర్వహించాలి. 

నాకేమో పాములంటే భయం. వాన పాములంటే అసహ్యం. చిన్నప్పటి మట్టి ముట్టుకున్నది లేనే లేదు. 

(ఇదంతా చెప్తుంటే నేనేదో మహల్లో పెరిగిన రాజకుమారి లాగా అనిపిస్తున్నాను కానీ కాదండీ బాబు. విచారకరమైన విషయం ఏంటంటే పట్టణం లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల లో చదివే పిల్లలు మట్టి లో కాదు దుమ్ములో పెరుగుతారు. తింటున్న తిండి ఎక్కడినుంచి వస్తోంది అనే సంగతే తెలీకుండా పెంచుతారు ఏంటో! ఒక్క పొలానికి తీసుకెళ్లరు.... బియ్యం వడ్ల రూపం లో ఎలా మొలుస్తుంది ఇప్పటి దాకా చూడలేదు నేను. ఆవాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. ధనియాల మొక్క ఎలా ఉంటుందో తెలియదు. ధనియాల నుంచి కొత్తిమీర వస్తుందని మాత్రం తెలుసు. కానీ ధనియాలు ఎక్కడి నుంచి వస్తాయి? తెలీదు. దూరదర్శన్ లో చిన్నప్పుడు చూసిన రైతుల కార్యక్రమాలు తప్ప. ఆ మధ్య ఓ రోడ్ ట్రిప్ లో పత్తి తోట కనిపిస్తే ఆగి, ముట్టుకొని ఫోటో తీసుకున్నాం. అక్కడే వరి పొలాలు కూడా ఉన్నాయి కానీ అప్పటికే ధాన్యం కుప్పలు గా పోసేసారు. అక్కడ ఉన్న ఒకాయన 'అదేం బియ్యం చెప్పు' అన్నాడు చనువుగా. నా చదువంతా వేస్ట్ అనిపించింది ఆ క్షణం లో .... నేను, నా ముందు కనీసం ఓ పది తరాల వారు రోజూ తినే బియ్యం లో ఏ రకాలు ఉంటాయి, చూసి ఎలా చెప్పచ్చు ... తెలీదు. మా లాంటి వాళ్ళకి రైతు సమస్యలు తెలీక పోవడం లో ఆశ్చర్యం లేదు. ఒకే భూమి మీద ఉంటూ వేరే ప్రపంచాల్లో ఉండటం ... ఎందుకిలా జరుగుతుందో! )

సరే ఇంక ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు అని మనసు దిటవు చేసుకున్నాను. 

నా దగ్గర ఉన్న రిసోర్సెస్ తో ఎలా మొదలు పెట్టచ్చో తెలుసుకున్నాను. నా దగ్గర మట్టి ఎక్కువ గా ఉంది. మట్టి తో కూడా కంపోస్ట్ చేయచ్చు అని చెప్పారు. అప్పుడు మనం వేసే చెత్త లో దుర్గంధం, decompose అయ్యే అప్పుడు కారే రసాలు .. అన్నీ మట్టే పీల్చుకుంటుంది అన్నారు. 

ఒక బకెట్ తీస్కొని పొరలు పొరలు గా చెత్త, మట్టి, చెత్త, మట్టి ... బర్త్ డే కేక్ లాగా వేసుకుంటూ పోవడమే అని చెప్పారు. 

నాకు కొంత ప్రోత్సాహ కరంగా అనిపించింది ఈ పద్ధతి. 

ఈ పద్ధతి తో పుల్ల మజ్జిగ లాంటి వి వేయక్కర్లేదు. అలాగే ఎంత గ్రీన్ చెత్త వేస్తున్నామో అంత బ్రౌన్ చెత్త ఉండేలా చూస్కోక్కర్లేదు. పరమ సింపుల్ అన్నమాట. 

ఇంగ్లీష్ లో కొన్ని పుస్తకాలుంటాయి. 'ఫర్ డమ్మీస్' అని. 'ఫిలిం మేకింగ్ ఫర్ డమ్మీస్' 'కుకింగ్ ఫర్ డమ్మీస్' 'మ్యూజిక్ ఫర్ డమ్మీస్' ఇల్లా. 

అంటే ఏవీ తెలియని పామరులకు అని. 

నాకు ఈ పద్ధతి నాలాంటి డమ్మీస్ కే అనిపించింది. 

మేము శాకాహారులమే కాబట్టి వంటింటి చెత్త తొంభై శాతం వేసేయచ్చు కంపోస్ట్ లో. వండాక మిగిలిపోయినవి మాత్రం వేయద్దన్నారు. పాచిపోయినవి కూడా. కూరగాయలు, పళ్ళ తొక్కులే ఎక్కువ కదా రోజూ వచ్చే వంటింటి చెత్త లో. అలాగే కొబ్బరి కాయ పీచు కూడా వేసుకోవచ్చు అన్నారు. 

ఓ రెండు మూడు రోజులు చాలా జోరుగా జరిగింది వ్యవహారం. నేను వేసే మట్టి లో అప్పటికే వాన పాములు ఉన్నాయి .. నాకు ఇది శుభ సూచకంగా తోచింది. వాటికేం కాకుండా, నాకూ అవి తగలకుండా ....ఎలాగో మేనేజ్ చేసి వేసేసాను. 

బకెట్ నిండాక అది పక్కన పెట్టేసి ఇంకోటి తీస్కోండి. ఆ మొదటి బకెట్ ఇరవై రోజుల తర్వాత చూస్కోండి అన్నారు. 

వంటింటి చెత్త అంతా అటు వెళ్తూ ఉంటే భలే తృప్తి కలిగిందండీ ఆ రెండు మూడు రోజులు. 

ఏమేం వేసానో నాకు గుర్తుంది కూడా. 

ఇదే కదా కంపోస్ట్ అంటే! అనిపించింది. 

కరెక్ట్ గా నాలుగో రోజు జోరున వాన. 

కంపోస్ట్ లో వాన నీళ్లు పడకూడదు అని క్లియర్ గా చెప్పారు. 

నేను ఆ ముందు రాత్రి అనుకుంటూనే ఉన్నా .. మూత పెట్టాలి అని. అంత చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష భరించాల్సి వచ్చింది. 

వాన నీళ్ళ వల్ల అంతా మురుగు వాసన వచ్చేయడం మొదలు పెట్టింది. 

ముళ్ళపూడి రమణ గారు ఓ కథ లో ఓ ఉపమానం వాడారు. 'పై షడ్జమం దాకా రాగాలాపన చేసి ఆ పైన ఏం చెయ్యాలో తెలియని గాయకుడి లాగా' అని. నాదీ అదే పరిస్థితి. 

పారేయడానికి అదే పూర్తి గా చెత్త కాదు. బోల్డు మట్టి కూడా ఉంది. ఆ మట్టి ని తూములో పారబోస్తే బ్లాక్ అయిపోదూ! అలాగని అలా వదిలెయ్యలేం. వాసన! ఆ బకెట్ కి డ్రైనేజీ చిల్లు లేదు. అలా ఉండక్కర్లేదని అన్నారు. 

ఏ మురుగు వాసన ని అస్సలు అనుభవించకుండా కంపోస్ట్ చేద్దామనుకున్నానో నాలుగో రోజు అదే ఎదుర్కోవాల్సి వచ్చింది. సరే ప్రకృతి తో పెట్టుకుంటే ఇంతే అని మనసు రాయి చేసుకున్నాను. 

పైన నిలిచిన నీళ్లు పారబోసేసాను. ఎండ బాగా పడేలా చూస్కుంటే సరిపోతుంది అనుకున్నాను. కానీ ఆ వారమంతా వానలు, మబ్బే. 

తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం - కొత్త చెత్త వేయకపోవడం.

ఆ మట్టి ఇరవై రోజులు ఉంచి అదొక శాంపిల్ గా అనుకుందాం. ఎలా కంపోస్ట్ అయిందీ చూద్దాం అని అలా వదిలేసాను. 

ఈ లోపు మంచి ఎండలు. ఎప్పటికప్పుడు తీసి చూద్దాం అనుకుంటూండగానే వానా కాలం వచ్చేసింది. దానికొక మూత లాంటిది పెట్టాను కానీ మొన్న వరుసగా నగరం లో కురిసిన వానలకి ఆ మూత నిలబడలేదు. 

రెండు నెలలు కంపోస్ట్ అయిన మట్టి లో మళ్ళీ వాన నీరు. మళ్ళీ మురుగు వాసన. 

ఈ సారి నేనైతే బాధ్యతా రహితంగా ప్రవర్తించాను. దాని సంగతే పట్టించుకోవడం మానేసాను. నన్ను కన్న పాపానికి మా అమ్మ గారు ఈ సారి దాని పని చూసారు. 

ఇంగ్లీష్ సినిమాల్లో డాన్ ల అనుయాయులు వచ్చి 'ఇట్స్ టేకెన్ కేర్ ఆఫ్' అంటారు. డాన్ తలూపుతాడు. అంటే ఎవడినైనా చంపేసారా, కిడ్నాప్ చేసారా, బెదిరించారా .... ఈ వివరాలు డాన్ అడగడు, వీళ్ళు చెప్పరు. 

నేను కూడా ఏం చేసావని మా అమ్మ గారిని వివరాలు అడగలేదు. అది ప్రకృతి మాత కి, నా మాత కి మధ్య ఉండిపోయే రహస్యం. 

నాకు ఈ పరాజయం ... అంటే నేచర్ చేతిలో ఓడిపోవడం కొత్త కాదు. అందుకే ఎక్కువ అవమానం అనిపించలేదు. ఆవిడ మళ్ళీ నాకు  నా ప్లేస్ చూపించింది అంతే. 'నువ్వు పాటలు పాడుకోవే .. నీకెందుకు ఇవన్నీ' అన్నట్టుగా. 

నాకిప్పుడే ఒక ఆలోచన తట్టింది .. మొక్కలు పెంచడం తెలిసిన వాళ్ళు ఇదంతా చదివితే? ఈ అమ్మాయి ఏంటి ఇంత అజ్ఞాని! అనుకుంటారు కదా. నిజమే నండి. 

ఈ ఉదంతం తర్వాత నాకు అర్ధమైన విషయాలు కొన్ని ఉన్నాయి 

1. ఈ తోట పని, కంపోస్టు .. వీటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. అలా బాధ్యత తీసుకుంటేనే మొదలెట్టాలి. లైఫ్ స్టైల్ లో ఓ భాగం అవ్వాలి. 

2. నలుగురు పెద్ద వాళ్ళు, శాకాహారులు ఉన్న ఇంట్లో వంటింటి చెత్త ఎక్కువ గా వస్తుంది. దానికి సరిపడా మట్టి, బకెట్లు రెడీ చేసుకోవాలి కంపోస్ట్ కి. 

3. నాకు ఇప్పుడిప్పుడే వీటికి అస్సలు టైం లేదు. 

4. ప్రకృతి లో ఎవరి పాత్రలు వారికి ఉన్నాయి. చేప ఎగరదు. ఎగరక్కర్లేదు. నేను మొక్కలు పెంచక్కర్లేదు. ప్రకృతి తో పరిచయం నాకు ఇచ్చిన టాలెంట్ల తో చేసుకున్నా చాలు. 

నాలుగు రోజులు కంపోస్ట్ చేసి ఫెయిల్ అయ్యా ... అయినా నాలుగు మంచి విషయాలు నేర్పింది  మట్టి తల్లి. 

ఆ మధ్య ఓ క్యాబేజి తరుగుతున్నాను. సగానికి కోసినప్పుడు గమనించాను ... గులాబీ రేకుల్లా అందంగా అమర్చినట్టున్నాయి పొరలు. అంత పర్ఫెక్ట్ క్యాబేజి నేనెప్పుడూ చూడలేదు. అదే నా వాట్సాప్ బాక్గ్రౌండ్ గా పెట్టుకున్నాను. 




ఇదే నా ప్రకృతి ఆరాధన. ప్రస్తుతానికి :) 

లేబుళ్లు: , , , , ,

13, జూన్ 2020, శనివారం

ప్లేట్లో వేడి వేడి టిఫిన్...

2008.... 

అప్పుడే పన్నెండేళ్ళు గడిచిపోయాయా? నిట్టూర్చింది సౌమ్య. 

తెల్లబడుతున్న తన ముంగురులని వెనక్కి తోసుకుని మళ్ళీ రాయనారంభించింది. 

కాలానికి ఏమి? అది అలా వెళ్లిపోతుంటుంది .. అవి మిగిల్చే అనుభవాలతో, జ్ఞాపకాలతో బ్రతకడమే మన పని ... ఏదో ఓ రోజు మనం కూడా కాలం చేస్తాం .. మన తర్వాతి వారికి ఏది మిగిల్చి వెళ్తాము అనేదే  మన చేతిలో ఉన్నది. 

ఇంతవరకూ రాసి కలం పక్కన పెట్టి కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. రైటింగ్ టేబుల్ మీద పెట్టిన కాఫీ ఎప్పుడో చల్లారిపోయింది... తన ఆవేశాల్లాగా ... 

2008... 

అవి నేను బ్లాగ్ లో ఫిక్షన్ అంటే కాల్పనిక సాహిత్యం రాసే రోజులు! కానీ పైన రాసిన లాంటి డ్రమాటిక్ ఫిక్షన్ కాదనుకోండి ... వ్యంగ్యం. (పైన రాసింది కూడా వ్యంగ్యమే అని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. 😉)

ఫిక్షన్ రాయడం నాకు మహా బోర్ .... నేను చెప్పాలనుకున్న విషయానికి ఓ కథ అల్లి, పాత్రల చిత్రణ చేసి, ఓ ప్రపంచం సృష్టించి.... ఆ పాత్రల చేత అనుకున్న మెసేజ్ ని చెప్పీ చెప్పకుండా చెప్పించడం ... అది దానంతట అదే పాఠకుడికి తట్టేలా చెయ్యడం .. అబ్బో .. చాలా డబుల్ పని. దాని బదులు .. ఇది ఇది .. అది అది .. అని సూటిగా చెప్పేస్తే బోల్డు పేపర్ సేవ్ అవుతుంది అని నా అభిప్రాయం 😁 ('చారు ఎలా వండాలో ఓ పాత్ర చేత చెప్పించి' అనే జంధ్యాల గారి జోకు గుర్తొచ్చింది ఇది రాస్తుంటే!)

ఇదంతా కూడా కొంత వ్యంగ్యమే అండీ బాబు .. కాల్పనిక సాహిత్యం అంటే నాకు బోల్డు ప్రేమ ఉంది. అసలు నేను ఫిక్షనేతర పుస్తకం చేతిలో కి తీసుకోవడం చాలా తక్కువ! రాయడం దగ్గరకొచ్చేసరికి ఫిక్షన్ అంటే కొంత బద్ధకం .. అంతే. కానీ ఒక్క విషయం .. చదవడమైనా .. పేరాలు పేరాలు, పేజీలు పేజీలు సాగే వర్ణనలు, చైతన్య స్రవంతులు (stream of consciousness ... స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్ నెస్ అనే రచనా ప్రక్రియ .. ఇందులో రచయిత కి ఏది తడితే అది ఏ మాత్రం ఎడిటింగ్ లేకుండా రాసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట!), 

మూస వాడుకలు కొన్ని ఉంటాయి .. అవి భరించడం కష్టం! అలాంటి మూస వేడుకలు కొన్ని - 

1. ప్లేట్లో వేడి వేడి టిఫిన్... టిఫిన్ ప్లేట్లో పెట్టడం కూడా వర్ణించాలా? అంత చెప్పిన వాళ్ళు ఆ వేడి వేడి టిఫిన్ ఏంటో చెప్పరు ... నేను అలా చెప్పనప్పుడల్లా ఉప్మా ఊహించుకుంటాను. 

2. కాఫీ (నాకసలే అలవాటు లేదేమో ... ఇంకా ఇది అనవసరమైన అంశం గా అనిపిస్తుంది!)

3. కాటన్ చీర, మల్లె పూలు 

4. సూర్యోదయ, సూర్యాస్తమయ ఉపమానాలు, 

5. 'ముందుకు వెళ్తున్న బస్సు/రైలు/పడవ/విమానం నన్ను గతం లోకి తీస్కెళ్ళాయి'

6. 'చెప్పొద్దూ' ... ఎన్ని కథల్లో నవలల్లో చదివానో బాబోయ్ ఈ వాడకం  

 ('చివరకు మిగిలేది' .. సుమారు ఇంకో ఇరవై పేజీల్లో నవల అయిపోతుంది అనగా ఓ సుదీర్ఘ వర్ణన ఉంటుంది .. అది ఆ నవల హీరో అయిన దయానిధి 'చైతన్య స్రవంతి'. ఎంత చదివినా ఆ స్రవంతి తెగదు ... సరిగ్గా పాఠకుడికి విసుగొచ్చే వేళకి నిధి డైలాగ్ ఉంటుంది 'ఏవిటీ ఎడతెగని వర్ణనలు' అని!😊)   

2008 లో ఓ బ్లాగ్ స్టార్ట్ చేసాను నేను. అందులో నాకిష్టం వచ్చినవి రాస్కొనేదాన్ని .. కొన్ని ఇంగ్లీష్ లో, కొన్ని తెలుగు లో .. కొంత ఇంగ్లీష్ కవిత్వం, తెలుగు చిట్టి ఫిక్షన్, పొలిటికల్ సెటైర్ వగైరా రాసేదాన్ని. 

నా ఇంగ్లీష్ నాటకం 'ఫైవ్ విమెన్ అండ్ ఎ బిల్' ఆ బ్లాగు లోనే ఓ పోస్టు గా మొదట రాసాను. దీని గురించి నాటకాల జగతి లో రాసాను ఇది వరలో. (తెలుగులో నాటకాల జగతి అని టైప్ చేస్తే గూగుల్ లో మొదటి రిజల్ట్ నా బ్లాగే నండోయ్!!!!!!!!😀 కానీ ఈ పదాలు గూగుల్ చేసే వారెవరూ ఉండరనుకోండి .. అది వేరే విషయం😄)

2015 వరకూ అప్పుడొక పోస్టు ఇప్పుడొక పోస్టు రాసాను. తర్వాత పని బాగా పెరగడం వల్ల టైం కుదిరేది కాదు. 

ఈ రోజు ఎందుకో అందులో ఒక పోస్టు షేర్ చేసుకుందాము అనిపించింది. ఆ బ్లాగ్ పోస్టు పేరు 'జడ' ... చిన్న ఫిక్షనల్ పీస్. దాన్ని కథ అనలేం ..  చిన్నది కాబట్టి. (ఇప్పుడే చూసాను .. ఈ బ్లాగ్ రాసింది జూన్ పదకొండు .. అంటే రెండు రోజులు అటూ ఇటూ గా సరిగ్గా పన్నెండేళ్ళు!)


ఆ బ్లాగ్ పోస్టు 'జడ' ఈ రోజు మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. 

దానికి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో. 

పన్నెండేళ్ళ క్రితం, ఇంకో బ్లాగు లో రాసిన ఓ పాత పోస్టు షేర్ చేసుకోవడానికి ఇంతెందుకమ్మా రాయడం ... ముఖ్యంగా ఆ మొదటి నాలుగు పేరాలు? 'ఇది చదవండి' అని లింక్ పోస్టు చేస్తే సరిపోతుంది కదా అంటారా? 

ఇప్పుడర్ధమైందా ఫిక్షన్ తో నా సమస్య ఏంటో!!! 

లేబుళ్లు: , , , , , , ,

24, ఆగస్టు 2018, శుక్రవారం

నోబెల్ సాధించాలంటే ఏం చెయ్యాలి?

చిన్నప్పుడు ఓ కార్టూన్ నాకు ఓ గొప్ప విషయాన్ని పరిచయం చేసింది. 

ఆ కార్టూన్ లో ఓ సైంటిస్ట్ కి బండ రాళ్ళు కొట్టే పని చెయ్యవలసి వస్తుంది. మిగిలిన వాళ్ళు రోజులు రోజులు ఒకే బండ రాయిని సుత్తులతో కొట్టి కొట్టి చిన్న చిన్న ముక్కలు చేస్తూ ఉంటారు. ఈ సైంటిస్ట్ మాత్రం ఆ బండ రాతిని అన్ని వైపులా గమనించి, తడిమి దాని సెంటర్ పాయింట్ ని కనుక్కొని దాని మీద సుత్తి తో చిన్నగా తడతాడు. అంతే. అంత పెద్ద బండ రాయి పొడి పొడి అయిపోతుంది! 

నన్ను ఈ కార్టూన్ చాలా ప్రభావితం చేసింది. ఒక పని ని నేను approach చేసే విధమే మార్చేసింది. 

నా అనుభవం ప్రకారం hard work is over-rated అండి. 

కష్టపడటాన్ని ఎందుకో అనవసరంగా glorify చేసేసారు. 

కష్టపడి చదువుకోవాలి. కష్టపడి ఇల్లు కట్టుకోవాలి. కష్టపడి పెళ్లి చేసుకొని కష్టపడి భరించి కష్టపడి షష్టి పూర్తి జరుపుకోవాలి. కష్టపడి పిల్లల్ని పెంచాలి. ఆ పిల్లలకి...  కష్టపడి...  వాళ్ళు కష్టపడే చదువులు చెప్పిస్తే అతి కష్టం మీద ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ కష్టపడి పెళ్లిళ్ళు  చెయ్యాలి. ఎందుకండీ ఇంత కష్టం? 

అంటే చదువుకోవద్దా? ఉద్యోగాలు.. పెళ్లి ... పిల్లలు? 

కష్టపడద్దు అన్నాను కానీ మానెయ్యమనలేదు కదండీ .. కష్టం అనే పదం తో ఇవన్నీ ఎంత ముడిపడిపోయాయి అంటే కష్టపడకపోతే ఈ పనులు అసలు కావు అనే brain-washed స్థితి లో ఉన్నాం అన్న మాట! 

కష్టపడి పనిచేయడానికి వ్యతిరేక పదం .. బద్ధకించడం కాదు .. సులువు గా పనిచెయ్యడం.

Working with EASE  

దీనికి example గా ఓ కథ ఉంది. 

విక్రమార్కుణ్ణి స్వర్గం పిలిపించారట .. ఇద్దరు అప్సరస ల మధ్య ఎవరు గొప్పో తేల్చటానికి. 

అప్పటికి అందరూ వారిని పరీక్షించి .. ఇద్దరూ రూపం లో, నృత్య కళ లో సమానంగా ఉండటం చూసి ఎటూ తేల్చుకోలేకపోయారట. 

విక్రమార్కుడు ఇద్దరినీ పిలిపించి వారి మెడలో పూలమాలలు వేయించి నృత్యం చెయ్యమన్నాడట. 

ఇద్దరు అప్సరసలు గొప్పగా నృత్యం చేశారు. కొన్ని పగళ్లు, కొన్ని రాత్రులు .. అలా చేస్తూనే ఉన్నారట .. ఇద్దరిలో అలుపు కనపడటం లేదు. పోటాపోటీ గా చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత నృత్య ప్రదర్శన పూర్తయింది. మళ్ళీ చూసే వారికి ఎవరు గొప్పో తెలియలేదు. 

విక్రమార్కుడు మాత్రం వారి మెడలో వేసిన మాలలు తెప్పించుకొని చూశాడట. 

మొదటి అప్సరస మెడలో వేసిన మాల లో పూలు వాడిపోయిఉన్నాయి. రెండో అప్సరస మెడ లోని మాల తాజా గా ఉంది! 

మొదటి అప్సరస ఒత్తిడి కి లోనైంది .. ఆ వేడికి పూలు వాడిపోయాయి. రెండో అప్సరస కి నృత్యం మంచినీళ్ల ప్రాయం .. అందుకనే ఆమె పూలు తాజాగా ఉన్నాయి. కేవలం ఈ ఒక్క తేడా తోనే ఇద్దరి లో 'ఈజ్' తో ఉన్నది ఎవరో నిర్ణయించాడు విక్రమార్కుడు.

ఇది మన జీవితాల కి అన్వయించవచ్చు. అవే పనులు. కానీ ఆ పనులు చేసే విధం లో కొంత మంది మాత్రమే కనబరిచే సరళత్వం.

అయితే మనకి ఏళ్ళ తరబడి చేసిన brain wash ప్రకారం కష్టపడటం నిజాయితీ కి తార్కాణం. అంతే కాదు 'easy come, easy go' లాంటి సామెతల వల్ల సులువు గా వచ్చిన దానికి మనం విలువ ఇవ్వము అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.  

కానీ ఒక్క సారి చుట్టూ చూడండి .. ప్రకృతి వైపు. 

ప్రకృతి లోనే కష్టం లేదు. గడ్డి కష్టపడి మొలవట్లేదు. నీళ్లు 'నేను కష్టపడి పైకే వెళ్ళాలి' అనుకోవట్లేదు .. సులువుగా పల్లానికే ప్రవహిస్తున్నాయి. చేప పిల్ల ఈదడం కోసం కష్టపడట్లేదు. కోయిల కొన్ని సంవత్సరాలు కష్టపడి సాధన చేసి, ఆడిషన్ గట్రా ఇచ్చి పాటలు పడట్లేదు. వేట సింహానికి క్రీడే కానీ కష్టం కాదు. వేట సింహానికి కష్టమైన నాడు .. ప్రకృతి దాన్ని తనలో కలిపేసుకుంటోంది. 

చీమల్ని, తేనెటీగల్ని చూపించి కష్టపడమంటారు కానీ అసలు అవి కష్టపడట్లేదు .. వాటి పని అవి ఇష్టంగానే చేస్తున్నాయి. అవి ఇష్టంగా చేస్తున్నాయి అని నాకెలా తెలుసంటారా? వాటికి హై బిపి, హైపర్ టెన్షన్, stress వల్ల వచ్చే అనేక వ్యాధులు లేవు కనుక. (ఇంగ్లీష్ లో 'disease' అంటే రోగం. అసలు ఆ పదం ఎలా ఏర్పడింది తెలుసా? Dis -ease ... అంటే 'Ease' లేకపోవడమే.)

కావాలని కష్టపడేది మనిషొక్కడే. 

అది కూడా తనే సృష్టించుకున్న complications కి hard work అనే పేరు పెట్టి. 

సృష్టి లో ఏ పనీ కష్టం కాదు. కానీ అది కష్టంగా మార్చబడుతుంది. కారణాలు కొన్నే ఉంటాయి. 

1. ఇష్టాయిష్టాలు - ఒక పని చెయ్యడం అసలు నాకు ఇష్టం లేదు. మొక్కుబడి గానో, ఇంకో దారి లేకో చేస్తున్నాను. అంతే. ఇంక ఆ పని లో ease చచ్చినా రాదు. ఇష్టమైన పని చేయలేకపోవడం .. చేసే పనిని ఇష్టపడలేకపోవడం  

2. భయం - అసలు నేను ఈ పని చేయగలనా? అని భయపడగానే నా ఆలోచనా సామర్ధ్యం సగానికి సగం తగ్గిపోతుంది. ఇంక పనిని సులువు చేసే ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి? 

3. Conformism - అందరూ ఆ పని ఎలా చేస్తున్నారో నేను  కూడా ఆ పని అలాగే చెయ్యాలి అనుకోవడం .. నా వ్యక్తిత్వం, నా బలాలు.. ఇవేవీ పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేస్కుంటూ పోవడం 

4. ముతక పద్ధతులు - ఈ పని ఎన్నో ఏళ్ళ నుంచి ఇలాగే జరుగుతోంది .. ఇప్పుడు కూడా ఎంత కష్టమైనా ఇలాగే జరగాలి అనుకోవడం ... update చేసుకోకపోవడం. వాటిని పక్కన పెట్టలేని అధైర్యం. 

5. టైం పాస్ - ఇది షాకింగే కానీ నిజం .. ఒక పని సులువు గా అయిపోతే మిగిలిన టైం లో ఏం చెయ్యాలి? అని పని ని కష్టంగా ఉంచుకుంటూ ఉండటం. 

6. ఫలం తీపి - హిందీ లో 'మెహనత్ కా ఫల్ మీఠా హోతా హై' అని సామెత ఉంది కదా .. కష్టపడకపోతే ఆ పండు తియ్యగా ఉండదేమో అని కొంతమంది అనుమానం. కష్టపడిన వాళ్ళకి వచ్చే పేరు రాదేమో అని ఇంకో అనుమానం. 

ఇవి కాక ఈగోలు, పాలిటిక్స్, హిడెన్ అజెండాలు .. పని ని బోల్డు కష్టంగా మార్చేస్తాయి. 

చెయ్యాల్సిన పని లోంచి వీటన్నటిని తీసేస్తే వచ్చేదే EASE. 

పోపెయ్యడం దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు దాకా ఈ ఫార్ములా ఉపయోగించచ్చు.  

అందరూ కొంచెం కంగారు పడిపోయే పెళ్లి లాంటి తంతులని కొంత  మంది ఈజ్ తో ఎలా చేయగలుగుతున్నారు? మన దేశం లో చాలా కష్టాలకి గురి చేసే కొన్ని పనులు కొన్ని దేశాల్లో ఎందుకంత సులువుగా జరుగుతున్నాయి? 

ఇవి తీసెయ్యడం ఈజీ కాదు అని అనచ్చు. చూసారా? ease ని సాధించడం అంత 'ఈజీ' కాదు ... అసలు ఇదే కష్టమైన మార్గం (ఇలా అంటే అయినా ఈ దారిలోకి వస్తారని ఆశ 😒)

మనందరికీ ఈ సరళత్వం అనే కాన్సెప్ట్ తెలుసు. మనం admire చేసే వ్యక్తుల్లో ఇది ఉండి తీరుతుంది. 

ఆ హీరో ఎంత ఈజ్ తో డాన్స్ చేస్తాడు కదా అంటాం. 

ఎంత పని చేసినా ఆవిడ చిరునవ్వు చెక్కు చెదరదండి అని మెచ్చుకుంటాం. 

రిక్షా తొక్కి చెల్లి పెళ్లి చేద్దామనుకొనే హీరో ని చూసి నవ్వుకుంటాం. 

EFFORTLESS అనే పదాన్ని compliment గా వాడతాం. 

గాలిని బంధించడం, హఠ యోగం, క్రతువులు అంటూ కష్టపడక్కర్లేదు .. 'మాధవా మధుసూదనా అని మనసున తలచిన చాలు గా' అని భగవంతుణ్ణి పొందటానికే  సులువు మార్గం చెప్పేసాడు ప్రహ్లాదుడు! 

మరి ఈజీ అంటే అనీజీ ఎందుకు? 

ఎంత గొప్ప పనైనా ఈ సరళమార్గం లో చెయ్యచ్చు అనటానికి నేను సంధించే ఆఖరి అస్త్రం .. ఈ కింది ఫోటో. 






నోబెల్ సాధించడానికి ఏం చెయ్యాలి?

'కష్ట'పడకూడదు. 

లేబుళ్లు: , , , , , , , , , ,

10, ఆగస్టు 2018, శుక్రవారం

అంట్లు తోమడం - ఓ అధ్యయనం

ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు నేను అంట్లు తోమాలి.

మా ఇంట్లో అంట్లే.

మా డొమెస్టిక్ హెల్ప్ పెళ్లి కి వెళ్ళింది. అందుకని.

First things first, నాకు పనిమనిషి అనే పదం కంటే డొమెస్టిక్ హెల్ప్ అనటమే ఇష్టం (ఈ టాపిక్ మీద తర్వాత మాట్లాడుకుందాం) మా 'హెల్ప్' రాకపోవటం వల్ల ఆమె చేసే ఇంటెడు పని ని మాలో మేమే పంచుకోవడం లో - నేను ఇష్టం గా తీసుకున్న పని అంట్లు తోమడం. ఎందుకు ఇష్టమో .. చివర్లో చెప్తాను.

ఏ పని చేసినా నా షరతుల మీద చెయ్యటం నాకు అలవాటు.

1. నేను రోజుకి ఒక్క సారే తోముతాను. ఎన్ని పడినా ఫర్వాలేదు.
2. పెద్ద కుక్కర్ తోమను. అది తోమాలంటే నీరసం... తోమాక ఆయాసం. అందుకే.
3. నేను తోముతుంటే మధ్యమధ్య లో కొత్త అంట్లు వెయ్యకూడదు. అన్నీ ఒకే సారి వేసేయాలి.
4. మధ్యమధ్యలో ఆ గరిట కావాలి, ఈ ప్లేట్ కావాలి అని అడగకూడదు. అన్నీ అయ్యాకే వాడుకోవాలి.

ఇంట్లో వాళ్ళు కాబట్టి ఇన్ని షరతులకీ ఒప్పుకొని పని చేయించుకుంటారు పాపం. ఒక్కోసారి మా 'హెల్ప్' వచ్చే వరకూ కంచాలు, టిఫిన్ ప్లేట్లు throw-out వి వాడటం కూడా కద్దు! మా వాళ్ళు అంత దయార్ద్రహృదయులు 😊

నేను అంట్లు తోమాలంటే పీచు, విమ్ సరిపోవు.

Laptop, blue tooth earphones (wireless) కావాలి. saavn.com లో నా ప్లే లిస్ట్ ఒకటి ఉంటుంది. అది నా చెవుల్లో ప్లే అవుతూ ఉండగా నేను అంట్లు తోముతాను. పాట లేనిదే పని లేదు. ఒక్కో సారి ఒకే పాట లూప్ లో ప్లే అవుతూ ఉంటుంది ... ఆ ఒక్క పాట తో టబ్బుడు అంట్లు తోమేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇవేవీ లేకుండా కూడా అంట్లు తోమాలి అంటే నా మెదడు లో రేడియో స్టేషన్ ఆన్ అవుతుంది. ఎఫెమ్ రేడియో లో లాగా అక్కడ కూడా పాటలు తక్కువే. మిగిలిన గోల ఎక్కువ. అందుకే ఇది ఎక్కువ prefer చెయ్యను.

బ్లూ టూత్, వైఫై లాంటి టెక్నాలజీ రాక ముందు తోమలేదా అంటే తోమాను. అప్పుడు నా Entertainment Partner - వివిధ భారతి.

Running water సౌకర్యం లేనప్పుడు, పంపు washer పోయి .. అయితే ఎక్కువ నీళ్లు లేకపోతే బొట్టు బొట్టు గా నీళ్లు వస్తూ, అందరూ పడుకున్నారు కాబట్టి ఎక్కువ చప్పుడు చెయ్యకుండా ఉంటూ, సింక్ లో నీళ్లు నిలిచిపోతే ముందు అది క్లీన్ చేసి, చలి కాలం లో చల్ ల్ ల్ ల్లటి నీళ్ల తో .. 120 రూపాయల నెయిల్ పాలిషో, అందమైన అరబిక్ డిజైన్ లో గోరింటాకో పెట్టించుకుని... ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా అంట్లు తోమిన అనుభవం ఉంది నాకు. ఒక్కోసారి apron, gloves తో సరదాగా కూడా తోమాను. Ads లో లాగా చూడటానికి బాగుంది కానీ gloves తో టైం ఎక్కువ పట్టింది.

అప్పుడప్పుడూ చేస్తే సరదాగా ఉంటుంది కానీ వరసగా ఎక్కువ రోజులు తోమవలసి వచ్చేప్పుడు కొన్ని కొన్ని points of view అర్ధం అవుతాయి. రోజూ ఇదే పని చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు? గంట పాటు కష్టపడి తోమిన అంట్లు ఒక్కొక్కటి తీసి వాడేస్తుంటే బాధగా ఉంటుందా? అవి అలాగే ఉంచెయ్యచ్చు కదా అనిపించదా? ఈ వంటలు అవీ వండుకోవటం వల్లనే కదా ఇంత పని ... ఇందుకేనేమో బిజీ గా ఉన్న కొన్ని ఇళ్ళల్లో వంటలు మానేస్తున్నారు/తగ్గిస్తున్నారా? వెంకటేశ్వర స్వామి ని 'తోమని పళ్యాల వాడే' అని ఇందుకే అన్నాడా అన్నమయ్య?

ఇదంతా చదువుతున్న ప్రవాస భారతీయులకి నవ్వు రావచ్చు. వాళ్ళు రోజూ అంట్లు తోముకోవాలి మరి. అక్కడ మనలా servant వ్యవస్థ లేదు కదా . కానీ అక్కడ వాళ్ళతో నేను ఈ విషయం మీద మాట్లాడిన మీదట నాకు కొన్ని విషయాలు తెలిసాయి.

అక్కడ ease of operation ఉందిట. అంటే ఇవే అంట్లు .. కానీ సులువులు ఎక్కువ.

ఒకటి ... అసలు వాళ్ళు 'అంట్లు తోమడం' అనరు ... చక్కగా 'doing the dishes' అంటారు .. పేరు నుంచే pleasantness మొదలయిపోలేదూ?

రెండు .. dish washers వారి వంటింటి సామాగ్రి లో భాగం .. ఫ్రిజ్, స్టవ్ లాగా.

ఒక వేళ అవి లేకపోయినా హైట్ సరిగ్గా ఉండి, స్క్రాప్ కలెక్టర్స్ వల్ల ఎక్కువ బ్లాక్ అవ్వని సింక్ డిజైన్లు, ఎక్కువ సార్లు తిప్పుకోడానికి వీలు గా ఉండే పంపులు, పుష్కలంగా నీళ్లు, (వేడి నీళ్లు!), తోమిన సామాను కోసం పక్కనే రాక్ లు .. ఇలాంటి కొన్ని సౌకర్యాల వల్ల తోమినట్టు ఉండదని వినికిడి. ఇంకో option లేకపోవడం కూడా సద్దుకుపోవడానికి ఇంకో కారణం అయ్యుండొచ్చు 😉

Note to self: అమెరికా వెళ్లి అంట్లు తోమి ఇది నిజమో కాదో తేల్చుకోవాలి .. కాకపోతే వీసా ఇంటర్వ్యూ లో 'అమెరికా లో అంట్లు తోమడాన్ని రీసెర్చ్ చెయ్యడానికి వెళ్తున్నాను' అని చెప్తే వాళ్ళు ముందు GRE TOEFL పరీక్షలు రాసి రమ్మంటారో ఏంటో ? పోనీ అంట్లు తోమడానికి వెళ్తున్నాను అంటే మాకేం అక్కర్లేదు అనేస్తారు. టూరిస్ట్ వీసా తీస్కొని ఈ రీసెర్చ్ కానివ్వాలి. End of 'Note to Self'.

ఇంటి పనులన్నిటిలో అంట్ల పని ఎందుకు ఇష్టమో చెప్తా అన్నాను కదా ..

అంట్లు తోమడం ఒక్కోసారి నా లైఫ్ లో humbling experience గా ఉపయోగపడింది. ఓ పెద్ద ప్రోగ్రాం లో పాడో, ఓ అవార్డు తీసుకొనో వచ్చిన మర్నాడు ఒక్కోసారి ఈ పని చెయ్యవలిసి వచ్చేది.

సింహాసనం మొదటి సారి ఎక్కిన కృష్ణదేవరాయల్ని అప్పాజీ చాచి చెంపకాయ కొట్టాడట .. అహం ఏవైనా వచ్చిందేమో చూడటానికి. దానికంటే ఇదే బెటర్ కదా... అహింసా మార్గం లో అహాన్ని చంపే అంట్లు!

అంట్లు తోమడం 'MINDFUL MEDITATION' కి అనువైన పని అని ఓ అభిప్రాయం ఉంది .. దీనితో నేను పూర్తి గా ఏకీభవిస్తాను

ఏ పని చేస్తూ అయినా మెడిటేషన్ చెయ్యచ్చు అనే కాన్సెప్ట్ ఏ ఈ 'MINDFUL MEDITATION'

గతం, భవిష్యత్తు .. ఈ రెంటి నుంచి ఆలోచనల్ని ఉపసంహరించి 'ఇప్పుడు' లో ఉండటమే కదా మెడిటేషన్ అంటే ..

పంపు తిప్పగానే వచ్చే నీటి ధార ... ఒక్కొక్క సామాను మీద పడి ఒక్కోలా శబ్దం చేస్తూ .. లోతు ఎక్కువ ఉన్న గిన్నె లో మంద్రంగా .. పళ్లాల మీద తారస్థాయి లో ... విమ్ లిక్విడ్ నీటి తో కలిసినప్పుడు ఏర్పడే చిక్కటి నురగ, scotch brite scrub pad తో మమేకమై ... ఒక్కో సామాను మీద అరచేతుల కదలిక…

వింత ఆకారం లో ఏర్పడిన పాల గిన్నె లో మాడు .. స్టీల్ డబ్బా మీద engrave చేసిన అమ్మమ్మ పేరు ... అన్నం వండాలంటే అవసరం అయ్యి తీరే కొలత సోల, నీళ్ల చెంబు ... పుట్టినరోజు కి అక్క కొనిచ్చిన 'happy birthday' మగ్ ... కాఫీ ఫిల్టర్ చిల్లుల లోంచి జారుతున్న సహస్ర ధారలు ... seven sisters లాంటి ఒకే లాంటి నీళ్ల గ్లాసులు - ఒక దాంట్లో ఇంకొకటి చక్కగా పట్టేస్తూ... గోడ ఉన్న డాడీ కంచం... అలాంటిదే కొంచెం చిన్నది .. కొంచెం సొట్ట పడింది ... అమ్మ కంచం ... పచ్చడి/ఊరగాయ వేసుకోడానికి సెపరేట్ గుంట ఉండే టిఫిన్ ప్లేట్లు...

కొన్ని సెకన్ల క్రితం 'అంట్లు' .. ఇప్పుడు స్నానం చేసిన పాపాయి బుగ్గ లాగ మెరిసిపోతున్న బాసన్లు ...

'అదో పనా' అని చులకనగా చూస్తే - చాకిరీ

'అదే పని' గా చేస్తే ఓ అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతి

లేబుళ్లు: , , , , , , , , ,

'ఫ్రెలసీ'

ఫ్రెండ్షిప్ డే అయింది కదా కొన్ని రోజుల క్రితం ... 

అసలు ఈ ఫ్రెండ్షిప్ డే ఎందుకొచ్చింది లాంటివి నేను చెప్పాల్సిన అవసరం లేదు .. 

ఇక్కడ చదువుకోవచ్చు ... 

ప్రతి 'రోజు' లాగానే ఎఫ్ ఎం రేడియోల ప్రోగ్రామ్స్..... మాల్స్ లో డిస్కౌంట్స్, వాట్సాప్ లో అవే అవే మెసేజులు ... ఈ టాపిక్ మీద సినిమాల్లో అవే అవే పాటలు ....  సెలెబ్రిటీ స్నేహాల మీద ఆర్టికల్స్ ... 

 ఇంకో వైపు 'ఈ దినాలు ఏవిటండీ?' అంటూ అవే అవే వాపోవడాలు ... 

అందుకే 'హ్యాపీ ఫ్రెండ్షిప్ డే' లోంచి 'డే' తీసేస్తున్నాను నేను .. 

హ్యాపీ ఫ్రెండ్షిప్ గురించి మాత్రం మాట్లాడుకుందాం 

ఫ్రెండ్షిప్ కి హ్యాపీ గా ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ అడుగడుగునా స్వేఛ్చ ఉంది. (ఈ గూగుల్ లో చ కి ఛ వత్తు ఇచ్చుకునే స్వేఛ్చ మాత్రం లేదు 😞)  

1. స్నేహితుడ్ని ఎంచుకోవడం లో స్వేఛ్చ.. (బలవంతంగా మన మీద పడేసిన రక్తసంబంధాల్లా కాక) 

2. ఆ స్నేహం ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేఛ్చ ... (మా మావయ్య ఫ్రెండ్ ఆదివారాలు ఇంటి కొచ్చి ఒక్క మాట మాట్లాడకుండా న్యూస్ పేపర్ మొత్తం చదువుకుని, కాఫీ తాగి వెళ్ళిపోయేవారు. ఇది వాళ్ళ ఫ్రెండ్షిప్.)

3. Quantity లో స్వేఛ్చ .... ఒకే సారి ఎంత మంది ఉన్నా 'యారో( కా యార్' అని పొగుడుతారు. ఒకరి తర్వాత ఒకరు అయినా ఎక్కువ మంది boy friends/girl friends ఉన్న వాళ్ళకి, ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళకి, ఎక్కువ మంది పిల్లల్ని కనేసిన వాళ్ళకి ఈ అదృష్టం లేదు కదా ..   

4. ఒక స్నేహం టైం అయిపోయినప్పుడు చాలా అందంగా ఫేడ్ అవుట్ అయిపోతుంది ... పాటల్లో చివరి లైన్ లా గా ... స్కూల్ ఫ్రెండ్స్ తో 'టచ్' పోతుంది ... ఊరు మారిపోయినప్పుడు మాంఛి farewell party తో end అవుతుంది. Divorce లాంటి painful process లు ఉండవు. అలాగే తల్లిదండ్రుల నుంచి విడిపోయినప్పుడు ఉండే societal judgments ఉండవు. 

ఈ వదిలేయబడ్డ ex-స్నేహితులు కూడా వదిలేయబడ్డ ప్రేమికుల్లాగా కాక హుందాగా ప్రవర్తిస్తారు ... ఫ్రెండ్ వదిలేసిన వాడు దేవదాసు అవ్వడం అరుదు. ఇంటి బయట నుంచొని హంగామా చేయడం ఇంకా అరుదు. ఫ్రెండ్షిప్ కి ఒప్పుకోకపోతే యాసిడ్ పోయాడాల్లాంటివి అరుదారుదు. (ఇది నేను కనిపెట్టిన పదం). 

ముగింపు కూడా అందంగా ఉండే బంధం ఇది! 

కానీ నేను కూడా ఎఫెమ్, మాల్స్, వాట్సాప్ చేసే తప్పే చేస్తున్నాను .. 

నేను కూడా 'స్నేహబంధమూ ... ఎంత  మధురమూ' 'స్నేహమేరా జీవితం .. స్నేహమేరా శాశ్వతం' అని ప్రతి సంవత్సరం వేసే పాటలే పాడుతూ, పిజ్జా హట్  లో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ డిస్కౌంట్ లో ఒకటికి రెండో పిజ్జా తింటూ, మళ్ళీ ఇద్దరు సినీ తారల మధ్య ఫ్రెండ్షిప్ మీద రాసిన ఆర్టికల్ చదువుతూ కూర్చుంటే friendship లో complications గురించి ఎవరు మాట్లాడతారు? 

అవును, ఫ్రెండ్షిప్ లో complications ఉంటాయి. 

అందులో నాకు తెలిసి జెలసీ ఒకటి ... ఫ్రెండ్స్ మధ్య జెలసీ కి నేను 'ఫ్రెలసీ' అని పేరు పెట్టాను. 

ఇది చాలా కామన్. దీని గురించి మాట్లాడకపోవడం కూడా అంతే కామన్. 

ఇది కామన్ కాబట్టి మాట్లాడకుండా ఉంటారు అనేది నిజం కాదు. జెలస్ ఫీలయినందుకు గిల్టీ ఫీలయ్యి మాట్లాడకుండా ఉంటారు అనుకుంటాను. 

నా ఫ్రెండ్ మీద నేను అసూయ చెందాలి అని ఎవరూ ప్లాన్ చేసుకోరు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అలా జరుగుతూ ఉంటుంది. 

మన ఫ్రెండ్ ఏదైనా గొప్పది సాధిస్తే చాలా ఆనందంగా ఫీలవుతాం. 

కానీ అదే మీరు కూడా సాధించాలని చాలా ఏళ్ళు గా కృషి చేస్తూ అది మీకు అందకుండా మీ ఫ్రెండ్ కి అందేసినప్పుడు ... అప్పుడు అసూయ కలుగుతుంది. 

మన తో ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్ ని పొగిడితే కొంచెం గర్వంగా అనిపించినా, కొంచెం అసూయ కూడా కలుగుతుంది.  

ఒక్కో సారి ఈ అసూయ కి కారణం కూడా అక్కర్లేదు. 

ఒకవేళ ఈ అసూయ కలగకపోతే మంచిదే. 

కానీ కలగటం లో అసహజం ఏమి లేదు. సొంత అక్కా చెల్లెళ్ళ మధ్యా, అన్నదమ్ముల మధ్యా కూడా ఇలాంటివి కలుగుతాయి కదా. 

అంత మాత్రాన మన స్నేహితుడి మీద మన కి ప్రేమ తగ్గిపోయినట్టు కాదు.

అసూయ కి పెట్టింది పేరైన దుర్యోధనుడు కర్ణుడి పట్ల ఎంత మంచి ఫ్రెండ్ గా ఉన్నాడో చూడండి ... ఇద్దరూ దారుణంగా చచ్చిపోయారనుకోండి .. (bad example 🙊) 

General గా సినిమాల్లో ఈ అసూయ చెందిన ఫ్రెండ్స్ ని విలన్ల పక్కన చేరి హీరో కి వెన్ను పోటు పొడిచే వారి  గా చూపిస్తారు..  పెద్ద మనసున్న హీరో వాళ్ళ దగ్గరకు వెళ్లి తన వల్ల కలిగిన అసూయ కి క్షమాపణ చెప్పుకున్నా వాళ్ళు కరగరు... పాపం హీరో అయిష్టంగా వాళ్ళని చంపాల్సి వస్తుంది (కొన్ని సినిమాల్లో మారినట్టు కూడా చూపించారు లెండి) 

సినిమా లో చూపిస్తే చూపించారు కానీ అసూయ చెందగానే నెగటివ్ క్యారెక్టర్ గా మనని మనం మాత్రం చూసుకోకూడదు అని నా అభిప్రాయం. 

అసూయ కలిగింది. దానితో మనం ఏం చేస్తాం అన్నదే ముఖ్యం. 

నేను మనిషినే కదా అని నవ్వుకొని ఆ ఫీలింగ్ ని పట్టించుకోకపోతే దానిలోంచి పవర్ తీసేసిన వాళ్ళం అవుతాం. 

ఎవరి వల్ల అసూయ కలిగిందో వాళ్ళని ఏదో ఒకటి అంటే కసి తీరుతుంది అంటే .. ముందు ఆ 'కసి' అనే ఫీలింగ్ పోయే వరకూ ఆ వ్యక్తి ని కలవకపోవటమే బెటర్. 

'అసలు ఈ అసూయ ని నేను ignore చెయ్యలేక పోతున్నాను' అంటే మీరు ఆ స్నేహం నుంచి తప్పుకోవడమే మంచిది. 

మీ లో అనుక్షణం అసూయ ని కలిగించే స్నేహం మీకెందుకు? అలాగే అసూయ నిండిన ఫ్రెండ్ మీ స్నేహితుడికి ఎందుకు? 

కానీ ఒక్క విషయం. 

అసలు మీలో ఎటువంటి అసూయ కలిగించని ఫ్రెండ్ ఎందుకు? మిమ్మల్ని challenge చెయ్యని బంధాలు ఎందుకు? తను లక్ష్యాలు సాధిస్తూ మిమ్మల్ని కూడా ఘనకార్యాలు చెయ్యమని చెప్పకనే చెప్పే ఫ్రెండ్ కన్నా ఇంకేం కావాలి? 

అంటే స్నేహం లో ఇంకో స్వేఛ్చ కూడా ఉంది .. 

అసూయ పడే స్వేఛ్చ! 

లేబుళ్లు: , , , , , , , , ,