10, నవంబర్ 2025, సోమవారం

సప్తపది

ఇంటర్నెట్ లో చూసిన ఓ పోస్ట్ కి నా లో కదిలిన ఆలోచనలే ఈ పోస్టు… ఆ పోస్టు లో ఇలా రాసుంది

"Before you get married... discuss bills, parenting styles, credit, debt, religion, how to deal with family, what beliefs will be instilled in your children, childhood traumas, sexual expectations, partner expectations, financial expectations, family health history, mental health history, bucket list, dream home, careers and education, political views and whatever else comes to mind. Love alone is not enough"

పెళ్ళవ్వక ముందు 'అన్నీ' మాట్లాడుకోవాలి అంటారు కానీ ఇంత స్పష్టంగా ఆ 'అన్నీ' ఏంటో ఎవరూ చెప్పలేదు కదా. 

కొన్నేళ్ల క్రితం అసలు ఈ ఆలోచనే సాధ్యం కాదు. కట్నాలు/కన్యా శుల్కాలూ, ఆస్తి కాపాడుకోవడానికి చేసే మేనరికాలు, మగవాడి జీవితానికి ఓ సపోర్టింగ్ క్యారెక్టర్ ని అతికించి 'పెళ్ళి' అని పేరు పెట్టే సంప్రదాయాల మధ్య ఈ ప్రశ్నలు అడిగే చోటెక్కడిది? ‘వంద అబద్ధాలు ఆడైనా పెళ్ళి చేసెయ్యాలి’ అనే వాడుక ఉన్న సంస్కృతి లో ఇంత నిజాయితీ గా మాట్లాడుకోడానికి అవకాశం ఎక్కడ? అప్పుడు పెళ్ళి నుంచి బైటికి రావటం సులభం కాదు కదా... ఊహాతీతం. అందుకే ఇలాంటి వాడుకలు వచ్చాయి అనుకుంటాను. ఈ వంద అబద్ధాల బారిన పడి పెళ్ళి తర్వాత ఎంత మంది మనసు చంపుకొని 
రాజీ పడిపోలేదూ?

ఇప్పుడు వివాహ వ్యవస్థ అలా లేదు. చాలా పోరాటాల తర్వాత వివాహం ముఖ్యోద్దేశం లో భారీ మార్పులు వచ్చాయి. చదువుకుని సంపాదించుకొనే అమ్మాయి/అబ్బాయి కి కేవలం జీవితం లో తోడు కోసం, ఓ కుటుంబం ఏర్పడటం కోసమే పెళ్ళి అవసరం ఇప్పుడు. మగవారికి పని మనిషి/వంట మనిషి స్థానం లో, ఆడవారికి ఏ టీ ఎమ్ గా మగవారు ఇప్పుడు అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలు గా వివాహ వ్యవస్థ లో వచ్చిన మంచి సంస్కరణ ఇది.

ఈ తరుణం లో ఇప్పుడు వివాహానికి సిద్ధపడుతున్న ఆడవారికి మగవారికి ఎంతో గైడెన్స్ అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకూ ఉన్న అనుభవాలూ, ఇన్ఫర్మేషన్ పాతబడిపోయాయి. ఇప్పుడు అమ్మాయిని కానీ అబ్బాయి ని కానీ 'ఓర్పు వహించు' అనలేం. 'కాంప్రమైజ్' అనే మాట వింటేనే చిర్రెత్తుకొచ్చేస్తుంది ఈ తరానికి .. తమ తల్లిదండ్రుల ని, చుట్టుపక్కల దాంపత్య జీవితాలని దగ్గరగా చూస్తూ పెరిగిన వీళ్ళకి  ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. తమ ముందు తరాల వారు పడిన బాధ ఇంక మేము పడం అని. 

అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. ఇన్ని సమస్యలున్నా మన వివాహ వ్యవస్థ ఇంకా నిలబడి ఉంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

దీని గురించి 'ప్రియమైన ఆవార్ గీ' https://udayini.com/2025/05/15/priyamaina-avargi/లో నేను ఇలా రాసాను

"ప్రేమ లోని మృగత్వాన్ని మచ్చిక చేసుకొని తమ అధీనం లో కి తెచ్చుకోవడమే పెళ్ళి అనే పద్ధతి కి నాంది ఏమో? అలాగే వదిలేస్తే ప్రేమ ఓ అడవి జంతువు. వావివరసలు, సమయాసమయాలూ, హద్దులూ ఏవీ తెలీని ఓ విశృంఖల శక్తి. దాని మెడకో బరువు, ముక్కుకో తాడూ వేసి ఓ జత ని వెదికి … ఇద్దరూ ఏదైనా పనికొచ్చేది చెయ్యండని సంసారవ్యవసాయం లో కి దింపారేమో పెద్దవాళ్ళు. ఇదిగో … వీడ్ని ప్రేమించచ్చు. వీడు నీ కుటుంబానికి కూడా నచ్చాడు. వీడి తో నువ్వు ఏ హద్దూ పెట్టుకోక్కర్లేదు. వీడి తో నీ ప్రేమ కి ఓ గమ్యం ఉంది. అది పిల్లలైనా, ఇద్దరికీ సమానంగా ఉన్న ఆశయాలైనా. ఇలా పెళ్ళి ని డిజైన్ చేశారేమో."

ఐడియల్ గా పెళ్ళి చాలా మంచి అరేంజ్మెంట్. ఓ జంట కి సెక్యూరిటీ - ఆస్తి పాస్తుల విషయాలలో, శారీరక సంబంధాల విషయం లో, దైనందిన జీవితాన్ని సాఫీ గా గడిపే విషయం లో, సంతానాన్ని కని పెంచే విషయం లో... ఇలా. మళ్ళీ ఆ సంతానానికి కూడా అన్ని విధాలు గా భద్రత కల్పిస్తుంది ఈ వ్యవస్థ.

మనుషుల మనస్తత్వాలలో, కుసంస్కృతుల్లో సమస్యల వల్ల ఇంత మంచి వ్యవస్థ కి  చెడ్డ పేరొచ్చేసింది. జగ్గీ వాసుదేవ్ గారు అన్నారు.. వివాహానికి ప్రత్యామ్నాయం చూపెట్టండి.. అది దీనికంటే బాగుంటే ఇది తీసెయ్యండి అని. ఈ వ్యవస్థ ని సంస్కరించుకోగలిగామే కానీ ఇప్పటి వరకూ దీనికి ప్రత్యామ్నాయం ఏమీ కనిపెట్టలేకపోయాం కదా మనం. అందుకే నాకెప్పుడూ భయం వేయదు .... భవిష్యత్తు లో ఈ వ్యవస్థ ఉండదేమో అని.

ఇందులో నాకు తమాషా గా అనిపించే ఇంకో విషయం... LGBT కమ్యూనిటీ ల లో వారు వివాహం చేసుకొనే హక్కు కోసం పోరాడటం! 'మాకు కూడా వివాహం చేసుకొని కుటుంబం గా మారే హక్కు ని ఇవ్వండి' అని అడగటం ఈ వ్యవస్థ విజయం అనుకుంటాను.

పెళ్ళి లోనే మొదటి సారి చూసుకొనే రోజుల నుంచి పెద్దవాళ్ళే 'టైం స్పెండ్ చెయ్యండి పెళ్ళి కి ముందు' అని పర్మిషన్ ఇస్తున్న ఈ రోజుల వరకూ వచ్చాము. బానే ఉంది. కానీ నా అనుభవం లో, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొనే జంటలు చాలా తక్కువ. ఎలా ఉపయోగించుకోవాలో తెలీక పోవడం దానికి ముఖ్య కారణం అనిపిస్తుంది.

ఫోన్ కాల్స్ లోనో డేట్స్ లోనో ఏం మాట్లాడుకోవాలో తెలీక ... నువ్వు చెప్పంటే నువ్వు చెప్పని మాట్లాడుకొనే మాటలని స్వీట్ నథింగ్స్ అంటారు కదా. ఈ నథింగ్స్ మధ్య కొన్ని సంథింగ్స్ జొప్పించాల్సిందే.

ఈ సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసినప్పుడు దొరికిన అంశాలతో సప్తపది అని 'ఆరున్నొక్క' అత్యవసరమైన విషయాల తో ఓ లిస్టు తయారు చేసాను. (శుభమా అని పెళ్ళి అనుకుంటుంటే ఏడు అని ఎందుకు అనడం అని 😆)   


సప్తపది


1. ఆర్ధికం - డివోర్స్ లాయర్స్ ని అడగండి... ఎన్ని వివాహాలు ఈ ఒక్క విషయం లో మనస్పర్ధలతో కూలిపోతున్నాయో. ఇద్దరూ సంపాదిస్తున్నా ఇలా జరుగుతోంది అంటే డబ్బు కాదు సమస్య... అవి ఎలా ఖర్చు పెట్టాలో ఓ దిశా నిర్దేశం లేనితనం వల్ల వస్తున్నాయి సమస్యలు. ఇద్దరిలో ఒకరే సంపాదిస్తున్నారనుకుందాం, అప్పుడు కూడా ఇద్దరికీ తెలియాల్సిన విషయం .... ఆ డబ్బు ఇద్దరిదీనూ. నిర్ణయాలు తీసుకొనే హక్కు ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరూ ఒక టీమ్ కాబట్టి. అప్పటి వరకూ వారి ఆర్ధిక అలవాట్లు ఏంటి, అందులో ఇంకొకరికి నచ్చనివి ఏంటి.... ఇవన్నీ తప్పకుండ మాట్లాడుకోవాలి. ఇద్దరిలో ఎవరి పేరు మీదైనా అప్పులు, ఆర్ధికపరమైన కమిట్మెంట్స్ ఉన్నాయా? ఇవి పారదర్శకంగా మాట్లాడుకోవాలి. ఇలాంటి విషయాలు ఒకరి గురించి ఒకరికి స్పష్టంగా తెలిసినప్పుడు పెళ్ళయ్యాక గొడవలు జరిగినా, విడదీసేంత సమస్య అవ్వదు.

2. కుటుంబ పరిధులు - డబ్బు తర్వాత ఎప్పుడూ వచ్చే సమస్య .. కొత్త గా కలుపుకున్న బంధాలతో నే. 'ఇన్ లా' ల తో గొడవలు. ఒక విషయం గుర్తు చేస్తే చాలా మంది షాక్ అవుతారు. పెళ్ళయ్యాక ఆ మొగుడూ, పెళ్ళామే కుటుంబం అంటే. మిగిలిన వాళ్ళందరూ బయట వాళ్ళే. తల్లిదండ్రులతో సహా. ఈ విషయం ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ముందు వీరిద్దరికీ తెలియాలి. తమ తల్లిదండ్రుల లో ఇబ్బంది కలిగించే స్వభావాలు పిల్లలుగా తెలిసే ఉంటాయి. అయినా భాగస్వామి ఆ లోపాల కి గురై బాధ పడకుండా ప్రొటెక్ట్ చెయ్యరు ఎందుకు? ఇక సమస్యలు ఏమీ లేని తల్లిదండ్రుల విషయం లో అయినా వారి వృద్ధాప్యం విషయం లో ఓ అభిప్రాయానికి ముందే రావాలి. కనీసం మాట్లాడుకోవాలి. తమ మీద ఆధారపడిన వారి గురించి ... చిన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ... వారి బాధ్యతలూ .... ఇవి భాగస్వామి కి ముందే తెలియాలి. (పెళ్ళి పుస్తకం లో సీన్ గుర్తుందా?)

3. పిల్లలు - ఒకప్పుడు 'ఎంత మంది' అనేదే ప్రశ్న. ఇప్పుడు అసలు కావాలా వద్దా అనే ఛాయిస్ కూడా తీసుకుంటున్నారు నవ తరం దంపతులు. పిల్లలు కావాలి అనుకున్నప్పుడు  వారిని ఏ విలువల తో పెంచాలనే ఉద్దేశ్యాలు ఒకరికొకరు బాగా అర్ధం చేసుకోవాలి. అప్పుడు పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా, ఇంట్లో టాక్సిక్ గొడవలు లేని వాతావరణం లో పెరగగలుగుతారు. ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండే తల్లిదండ్రులనే కాక ఆ గొడవలు సామరస్యంగా తీర్చుకొనే తల్లిదండ్రులని చూసి పెరుగుతారు. తమ వంతు వచ్చాక పెళ్ళి అనే వ్యవస్థ ని వ్యతిరేకించరు.

4. ఎలా కొట్టుకోవాలి - ఇది నేను చదివినప్పుడు నాకు చాలా అబ్బురమనిపించింది. ఇది భార్యాభర్తలు కాదు .... ఏ బంధం లో ఉన్న వారైనా తెలుసుకోవాలి. జీవితాన్ని పంచుకునే క్రమం లో గొడవలు తప్పవు. ఇది అందరికీ తెలుసు. ఆ గొడవల్ని స్ట్రెస్ కి గురవ్వకుండా ఎలా తీర్చుకోవాలి అనే విషయాలలో ఎడ్యుకేట్ అవ్వాలి. గొడవ పడుతున్నప్పుడు భార్య vs భర్త గా ఉంటున్నారా? భార్య, భర్త vs సమస్య గా ఉంటున్నారా? రెండో విధం లో ఒకరినొకరు కోపం లోనైనా బ్లేమ్ చేస్కోవడం, హర్ట్ చేస్కోవడం ఉండదు. సమస్య ఆల్రెడీ బాధ పెడుతోంది ... నా పార్ట్నర్ కూడా బాధపెడితే ఎలాగ? అనుకోవక్కర్లేదు. సారీ ఎలా చెప్పాలి (...https://sowmyavadam.blogspot.com/2020/02/blog-post.html) తెలుసుకోవాలి. ఇంకా చాలా టూల్స్ ఉంటాయి ... ఈ సాధనాలు గొడవల్లోని వైషమ్యాన్ని తీసేస్తాయి. డ్రామా ని తీసేస్తాయి. అప్పుడు సమస్య స్పష్టంగా కనిపిస్తుంది.త్వరగా తీరుతుంది. 

5. వ్యక్తిగత బలాలు/బలహీనతలు - ఒక అమ్మాయి విపరీతంగా షాపింగ్ చేస్తుంది, ఆమె క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడూ మాక్స్ అవుట్ అయ్యే ఉంటాయి... ఒకబ్బాయి ఎంత అనుకున్నా  మందు మానలేడు... ఒకరికి ఫ్రెండ్స్ అటాచ్మెంట్ ఎక్కువ.. ఇంకొకరికి కోపమెక్కువ... ఇవి వ్యక్తిగత లోపాలు. పెళ్లయ్యాక ఏదో మంత్రం వేసినట్టు ఎవరూ మారిపోరు. నటిస్తారంతే. కొన్నాళ్ల కి ఆ నటన మానేస్తారు. ఇంక గొడవలు. పార్ట్నర్ కోసం మారకూడదు. నేను ఇలాంటిదాన్ని/ఇలాంటివాడ్ని అనే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. మన తో బ్రతకడానికి వచ్చిన వారికి ఇది నిజాయితీ గా చెప్పాలి. మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే విఫలమైనా పక్క వారికి తెలుస్తూ ఉంటుంది మీ ప్రయత్నం లో నిజాయితీ. ఒకరి తో జీవితం పంచుకోడానికి, వారి లోపాలని భరించడానికి ఈ నిజాయితీ చాలా సహకరిస్తుంది.

6. ఆరోగ్యం - ఒక భార్యా భర్తా ఉన్నంత క్లోజ్ గా ఇంకెవరూ ఉండరు భూమ్మీద. ప్రతి రోజూ ప్రతీదీ పంచుకోవాల్సిన వారు తమ ఆరోగ్యాన్ని గురించిన జెనెటిక్ సమస్యలు కానీ, ఇంకే విషయమైనా కానీ మాట్లాడుకోవాల్సిందే. ఇదే టాపిక్ లోకి వస్తుంది శారీరక బంధం. సెక్స్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేని దేశం మనది. సినిమాలో చూసిందే రొమాన్స్, నీలి చిత్రాలలో చూసిందే సెక్స్. పెళ్ళి కి ముందు ఈ కోణం లో తమకేం కావాలి తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. కానీ ఓ పార్ట్నర్ దొరికినప్పుడు వారి ఊహలకి మన ఊహలని మ్యాచ్ చేసుకుంటే చాలు కదా. కొంత మందికి అస్సలు సున్నితమైన భావాలు ఉండవు. అలాంటి వారికే రొమాంటిక్ గా ఆలోచించే పార్ట్నర్ దొరికితే ఎంత నరకం? ఇంకొకరి తో రొమాంటిక్ గా ఉండటం ఇల్లీగల్ మళ్ళీ! (నాకు తెలిసిన ఓ అబ్బాయి కి పెళ్ళి కుదిరింది. ఎంగేజ్మెంట్ జరిగింది. కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసింది అని తెలిసింది. అబ్బాయి మాకు తెలుసు ....  అలవాట్లు లేవు, సంపాదనా పరుడు ... ఎందుకు అలా జరిగింది అని ఆరా తీస్తే .. ఆ అమ్మాయి సరదాగా మెసేజెస్ పంపిస్తే ఒక్క దానికీ రిప్లై ఇవ్వలేదట. కొంచెం కూడా రొమాన్స్ చూపించలేదట. ఆ అమ్మాయి 'నాకిలాంటబ్బాయి వద్దు' అని చెప్పేసిందట ధైర్యంగా. నాకైతే ఆ అమ్మాయి చాలా నచ్చింది. ఓ జీవితకాలపు నరకాన్ని తానూ తప్పించుకుంది... అతనికీ తప్పించింది!)

ఈ విషయాలు అసలు మాట్లాడుకోక 'గే' అయిన మగవారికి బలవంతంగా అమ్మాయినిచ్చి పెళ్ళి చేయడం, సెక్స్ అడిక్ట్స్/పర్వర్ట్స్ చేతిలో అమ్మాయిలు నరకం అనుభవించడం, పీడో ఫైల్స్ తమ సంతానాన్నే టార్గెట్ చెయ్యడం .. ఈ దారుణాల కి కారణం.. పెళ్ళి కాక ముందే కనీసం ఈ పార్శ్వాన్ని తట్టకపోవడం. ఎంత సున్నితమైన విషయమో... అంత అప్రమత్తంగా ఉండాల్సిన విషయం కూడా.

7. జీవితోద్దేశం - ఎందుకు బ్రతుకుతున్నాం అని ఇద్దరూ ఒక మాట అనుకోవాలి. నాకు తెలిసిన ఓ జంట ఉన్నారు. పెళ్ళి చేసుకొనే సరికి ఇద్దరికీ అంత చదువూ సంపాదనా లేదు. కానీ ఇద్దరూ ఒకరికొకరు రెండు విషయాలు ప్రామిస్ చేసుకున్నారట. ఒకటి, మనం పెళ్లయ్యాక కూడా ఎదుగుతూనే ఉందాం .... చదువుకుందాం, సంపాదన పెంచుకుందాం. రెండోది... ఎప్పుడూ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గానే ఉందాం .... ఈ లంపటాల్లో పడిపోయి మన మధ్య ప్రేమ ని పాతపరుచుకోవద్దు అని. వారి తోబుట్టువుల్లోనే డైవర్స్ లూ, రకరకాల సమస్యలూ ఉన్నా వీరి దాంపత్య జీవితానికి ఆ సెగలు అంటనివ్వలేదు ఇద్దరూ. 

ఒక్క మాట. ఈ విషయాలు మాట్లాడుకున్నంత మాత్రాన ఆ సంసారం సుఖపడిపోతుందని గ్యారంటీ లేదు కదా.  ఆ జంట నిజాయితీ పరులై ఉండాలి. ఓ మంచి దాంపత్య జీవనం కావాలి అని వాళ్ళూ కోరుకోవాలి... వారి చుట్టూ ఉన్న వారు ఇది పడనివ్వాలి! అలా పడనివ్వకపోతే వారితో వీరు తెగతెంపులు చేసుకొనే పరిస్థితులు, ధైర్యం ఉండాలి! అప్పుడు ఏ సాధనమైనా పనికొస్తుంది.

పెళ్ళయితే చాలు అని ఫిక్స్ అయిపోయిన వారు ఇవేవీ ఆలోచించరు. వీరే పెళ్లయ్యాక పార్ట్నర్స్ మీద జోకులు వేస్తారు .. తామెంత మోసపోయామో అని వాపోతారు. 

అలాగే ఈ 'సప్తపది' మోసాల నుంచి రక్షించలేదు. ఎదుటి వారు వినాలనుకొనే మాటలు అందంగా చెప్పి ఎవరు ఎవరినైనా ఇంప్రెస్ చెయ్యచ్చు. ఇది పర్సనల్ గా ఓ వ్యక్తి ని కలిసినప్పుడు మనం చిన్న చిన్న పరీక్షల తో స్వయంగా చూసి తెలుసుకోవాల్సిందే. ఉదాహరణ కి ...  ఈ టాపిక్స్ మీద తమ వైపే మాట్లాడుతూ ఉన్నా, ఎదుటి వారి అభిప్రాయాన్ని కనీసం తెలుసుకోవాలనుకోకపోయినా, అసలు దేనికీ సమాధానం చెప్పలేకపోయినా, మాటల్లో ఒకటి చెప్తూ చేతల్లో ఇంకోటి చేస్తున్నా, మాట్లాడుకోటానికి చికాకు చూపించినా, అవాయిడ్ చేస్తున్నా  .. తెలుసుకోగలగాలి.

ఆహార పదార్ధాల ప్యాకేజీ పైన లేబుల్స్ ఉన్నట్టు గా, ఈ పోస్టు కి కూడా ఓ గమనిక లేకపోలేదు. ఈ పోస్టు రచయిత అవివాహిత. అలా చెప్పగానే, నీకేం తెలుసు పిల్ల కాకి అనకండి. నేను పిల్ల కాకిని, కుర్ర కాకిని కాదు. కుమారి కాకిని అన్న మాట నిజం. ఈ కాకి గోల పక్కన పెడితే, జీవితానుభవం అంతా మనకే స్వయంగా ఏదో జరిగితేనే దొరకదు. చుట్టూ సమాజాన్ని పరిశీలిస్తే కూడా లభిస్తుంది. పైగా భూమి పుట్టినప్పటి నుంచి మన సంస్కృతి లో సన్యాసులూ, బ్రహ్మచారులూ గృహస్థులకు సలహా ఇవ్వటం కద్దు. మంచి మాట ఎక్కడినుంచైనా రావచ్చు. ఎండ్ ఆఫ్ డిస్కషన్.

ఇది సప్తపది .... ఈ సప్తపది దాటితేనే కల్యాణ మండపం లో సప్తపది. అంతే. కమర్షియల్ సినిమా భాష లో చెప్పాలంటే ఈ సప్తపది దాటితే ఆ దంపతుల కి ఇంక జీవితమంతా అష్టపదే. 😄

లేబుళ్లు: , , , ,

5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

జ్ఞానమొసగరాదా - (నేను రాసిన కథ)



 జ్ఞానమొసగరాదా



శారద పాడనంటోందిట. గురువైన వసంత కి చెప్పి ఒకటే ఆందోళన పడిపోతున్నారు ఆమె తల్లిదండ్రులైన అరుణ, మురళి. 


పదకొండేళ్ళుంటాయి శారద కి. అప్పటికే ఆరేళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటోంది వసంత దగ్గర.   సంగీతం మీద పట్టున్న ప్రతీ ఒక్కరూ మంచి గురువు కాలేరు. దానికి కావాల్సిన నైపుణ్యాలు వేరే ఉంటాయి. ప్రతి పిల్ల/పిల్లాడు ఏదో ఒక సైకాలజీ లో ఉంటారు. వారిని అర్ధం చేస్కుంటూ ఓర్పుగా చెప్పుకురావాలి ఈ కళ ని. వసంత ఇందులో సిద్ధహస్తురాలు. ఆ విషయం ఆనందంగా వసంత క్లాసులకి వచ్చే పిల్లలని చూస్తే తెలిసిపోతుంది. వారు వేదిక మీద పాడటం మొదలు పెట్టాక మిగిలిన సంశయాలు కూడా తీరిపోతాయి ఎవరికైనా. 


ఇలాంటి ప్రోగ్రాం ఒకటి చూసారు పెళ్ళైన కొత్తల్లో అరుణ, మురళి. అంతే, నిర్ణయం తీసేసుకున్నారు. తమకి పుట్టబోయే సంతానాన్ని ఆమె దగ్గరే సంగీతానికి పెట్టేయాలని. వారి సంకల్ప బలమో ఏమో శారద కూడా కంచు కంఠం తోనూ సంగీతం పట్ల ఆసక్తి తోనూ పుట్టేసింది. చిన్నప్పటి నుంచి ఏదైనా పాట వింటే పాడగలిగేది. ఇంకేం! అరుణ, మురళుల ఆనందానికి హద్దే లేదు! 


తల్లిదండ్రుల చెయ్యి పట్టుకుని మొదటి సారి వసంత దగ్గరకి వచ్చింది ఐదేళ్ళ శారద. పెద్ద పెద్ద కళ్ళు, పసి బుగ్గలు, పరికిణి, రెండు పిలకలు, ఆ పిలకలు చుట్టూ పూలు, కళ్ళ కి కాటుక, కాళ్ళ కి వెండి పట్టీలు. అప్పటికి క్లాసు లో ఉంది వసంత. తన ఇంట్లో నే హాల్లో క్లాసులు చెప్తుంది. ఐదింటి నుంచి మొదలు పెడితే బ్యాచులు బ్యాచులు గా అయ్యేసరికి తొమ్మిదవుతుంది. శారద వచ్చినప్పుడు మొదటి బ్యాచ్ నడుస్తోంది. శారద అందర్నీ భయం భయం గా చూస్తూ నిలబడింది. 


వసంత ‘రా … కూర్చో’ అనగానే వెళ్ళి వసంత ఒళ్ళో కూర్చుంది. పిల్లలందరూ ఒకటే నవ్వు. 


అరుణ, మురళి షాక్ అయ్యారు. ఎక్కడ వసంత కి కోపం వచ్చి చేర్చుకోదో అని వారి భయం. మురళి అరుణ కి సైగ చేసాడు. అరుణ వెంటనే “అక్కడ కూర్చోకూడదు శారూ… అందరు పిల్లల తో ఇక్కడ చాప మీద కూర్చోవాలి” అని కూర్చోపెట్టింది. వసంత వైపు చూసి సారీ అన్నట్టు గా మొహం పెట్టింది. 


వసంత నిజానికి నవ్వాపుకుంటోంది. ఓ ముప్ఫయి ఐదేళ్ళుంటాయి వసంత కి. అప్పటికే పదేళ్ళ నుంచి ఆ ఏరియా లో సంగీతం చెప్తోంది. ఆ అనుభవం తో నే గాంభీర్యం నటిస్తోంది. తను కూడా నవ్వేస్తే శారద కి సంగీతం పట్ల సీరియస్ నెస్ రాదు. 


ఎలక్ట్రానిక్ శృతి బాక్స్ నుంచి నాదం పలుకుతోంది . ఐదున్నర శృతి. 


తానొక్క సారి కళ్ళు మూసుకొని శృతి చూసుకుంది. ‘మ్ …’ అని హమ్ చేసుకుంది. 


శారద ఇదంతా గమనిస్తోంది. శృతి బాక్స్ ని వింత గా చూస్తోంది. 


వసంత “నేను సా అంటాను … నువ్వు కూడా అనాలి … సరేనా?” 


శారద “సా” అంది. అందరూ మళ్ళీ నవ్వు. 


అరుణ, మురళు లకి టెన్షన్ పెరిగిపోతోంది ఓ పక్క … 


 “సా అనమంటే ఊరికే అనటం కాదు.. శృతి లో పాడాలి…” అని అనగానే శారద “సా…” అని పాడింది. సరిగ్గా షడ్జమం లో గొంతు కలిపింది. 


వసంత కి తెలిసిపోయింది. శారద కి శృతి జ్ఞానం ఉంది. 


“పా …” పాడింది వసంత. శారద పంచమం కలిపింది. 


పై షడ్జమం కూడా సరిగ్గా పాడింది. 


అరుణ, మురళి వసంత కేసి చూస్తున్నారు. వాళ్ళకి తెలీదు శారద కరెక్ట్ గా పాడిందో లేదో. 


గురువు ఎక్కువ మెచ్చుకోకూడదు అంటారు. వసంత గంభీరంగా “ఊఁ… శృతి లో కలుస్తోంది గొంతు” అని మాత్రం అంది పైకి.  


అరుణ మురళి … ఇద్దరి ఆనందానికి అవధుల్లేవు. ఇంటర్నేషనల్ స్కూల్ లో సీట్ దొరికినట్టు ఆనందపడిపోయారు ఇద్దరూ. క్రమం తప్పకుండా క్లాసులకి పట్టుకొచ్చేవారు. “సంగీతం అంతా నేర్చుకోడానికి ఎంత టైమ్ పడుతుందండీ, మా అమ్మాయి సూర్య గాయత్రి లా ఎప్పుడు పాడుతుందండి” లాంటి ప్రశ్నలు అడగలేదు. వసంత మీద పూర్తి నమ్మకం ఉంచారు. 


ఎనిమిదేళ్ళ వయసు వచ్చే సరికి కొంత కుదురుకుంది శారద. ఇక్కడ వచ్చిన చిక్కు.. సాధన. సంగీత సాధన ఎంత అవసరమో - అంత చెయ్యాలనిపించదు పిల్లలకి. ఒకే స్వరం మళ్ళీ మళ్ళీ పాడాలి. విసుగనిపిస్తుంది. 


“నిద్దుర నిరాకరించి ముద్దు గా తంబుర పట్టి” అన్నారు త్యాగరాజ స్వామి. అలా సాధన చేయడం ఎంత కష్టం! అంత కన్నా కష్టం ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లని ఓ చోట కూర్చోపెట్టి ‘కాలాలు’, ‘అ కారం’ సాధన చేయించడం. పెద్ద పాఠాలు నేర్చుకుంటున్న శారద కీ - చిన్న వయసు లో ఉండే చాంచల్యానికీ అస్సలు పొసిగేది కాదు. 


మరి ప్రతిభ కి సాధన తోడవకపోతే ఎలా? ఎన్నో విధాలు గా చెప్పి చూసింది సాధన చేయమని. తనకొచ్చినదే చాలు అన్నట్టు ఉండేది శారద. ప్రతి ప్రోగ్రాం లో ముందు వరస లో మైకు ముందు శారదే. ఆ వయసు కి ఆ పాటలే గొప్ప అని అందరూ ముద్దు చేసే వారు. తాళం తప్పులు, అక్కడక్కడా శృతి తప్పులు, పాఠాలని మర్చిపోవడం… ఇది ఎవరూ గమనించలేదు … వసంత తప్ప. శారద లో చిన్న గా  అహంకారం ప్రవేశించింది. ఇది తెలుస్తోంది వసంత కి. 


ఓ వైపు అరుణ, మురళులు తమ తపస్సు ఫలించింది అని మురిసిపోతున్నారు. శారద ప్రోగ్రాం లో పాడటం మొదలు పెట్టిన రోజు నుంచి ఓ కొత్త ఐ ఫోన్ కొనేశారు. అది కేవలం శారద ప్రదర్శనలకే! వసంత అంటే భయం తో ఎక్కడ పోస్టు చెయ్యట్లేదు కానీ శారద పేరు న ఎప్పుడో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసేసేవారే. 


ఇప్పుడే విరుస్తున్న పుష్పం శారద. ఇంకా గుబాళింపు మొదలవ్వనే లేదు. ఈ నాజూకైన తరుణం లో వసంత కోప్పడితే ఆ గ్రీష్మానికి వడిలిపోవచ్చు ఈ పసి మొగ్గ. అలా అని వదిలేస్తే ఆ శిశిరానికి అసలు విచ్చుకోవడం ఆగిపోయే ప్రమాదం ఉంది. వసంతం లాగానే ఉండాలి తను. ఓ ముఖ్యమైన ప్రోగ్రాం వచ్చింది. ఓ పుణ్య క్షేత్రం లో. వసంత రాసిన పాటల లిస్టు లో శారద సాధన చెయ్యని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి.  రిహార్సల్స్ లోనే శారద తడబడటం మొదలయింది. ఒకటికి పది సార్లు సాధన చేసిన పిల్లలు మాత్రం కాన్ఫిడెంట్ గా పాడేస్తున్నారు. అంతే. శారద ని ఆ ప్రోగ్రాం నుంచి డ్రాప్ చేసేసింది వసంత. మిగిలిన పిల్లలందరి తో ట్రూప్ ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లి జయప్రదంగా ప్రోగ్రాం చేస్కొచ్చింది. 


అరుణ, మురళి … ఇద్దరికీ వసంత అంటే కోపం కూడా వచ్చింది. స్టార్ స్టూడెంట్ లాంటి తమ కూతుర్ని అలా తీసేస్తుందా అని. తల్లిదండ్రుల నుంచి ప్రోగ్రామ్స్ సమయాల్లో ఈ కోపతాపాలు వసంత కి మామూలే. మైక్ ముందు, ముందు వరస లో తమ పిల్లల్ని కూర్చో పెట్టలేదని అలిగి క్లాసులు మాన్పించేసిన వారిని కూడా చూసింది తన అనుభవం లో. కానీ అక్కడ ప్రాధాన్యత వారికి కాదు.సంగీతానికి … సుస్వర బద్ధమైన ప్రదర్శన కి… చూడటానికి వచ్చే ఆహూతులకు. వారికి న్యాయం చెయ్యగలిగే వారే ముందు వరసలో కూర్చుంటారు, మైక్ లో పాడతారు. 


ఈ టూర్ ముగించుకుని వచ్చాక శారద ని క్లాసు కి తీసుకొచ్చింది అరుణ. ముభావంగా  ఉన్నది ఆవిడ. శారద మట్టుకు ఓ రెండు నిముషాలు మౌనంగా ఉండి ఏడ్చేసింది. “నేను ప్రాక్టీస్ చేస్తా మేడం… కోపంగా ఉండకండి” అని కన్నీరు కారుస్తూ వెక్కిళ్ళ మధ్య చెప్తోంది. వసంత కి లోపల ఆనందంగా అనిపించింది. శారద ని దగ్గర కి తీస్కొని కన్నీళ్లు తుడిచింది. “వెళ్ళి కొత్త పాఠం రాసుకో” అని పంపించి అరుణ తో తన ఆనందాన్ని పంచుకుంది వసంత “కళ కోసం కన్నీళ్లు వచ్చాయంటే ఇంక శారద ని ఎవరూ ఆపలేరు. శారద ని అద్భుతమైన శాస్త్రీయ సంగీత కళాకారిణి గా నేను తీర్చిదిద్దుతాను”. 


అరుణ లో ఇందాకటి అలక పోయింది. “మాకు సంగీతం గురించి ఏమీ తెలీదు మేడం. మమ్మల్ని పట్టించుకోకండి. మీరు ఎలా చెప్తే అలానే మేడం” అని వెళ్లిపోయారు ఆవిడ. 


ఇక అప్పటి నుంచి శారద సంగీతం పిల్ల కాలువ నుంచి సెలయేరు లాగా సాగడం మొదలుపెట్టింది.  కృతుల వరకూ వచ్చేసింది శారద.  ఫోన్ లు చూసీ చూసీ పిల్లల మెదళ్ళు మందమయిపోతున్న ఈ సమయం లో నొటేషన్ చూడకుండా, పుస్తకం ముందు లేకుండా సరళీ స్వరాల నుంచి వర్ణాల వరకూ పాడేయగలదు శారద. ఇంక నేర్పవలసింది … మనోధర్మ సంగీతం.. అంటే రాగాలాపనా, స్వరకల్పన, నెఱవు, ఇలాంటివి. అవి నేర్చుకోవటానికి శారద ఇంకొంత పెద్దవ్వాలి అనిపించింది వసంత కి. పైగా మనోధర్మానికి బాగా కచేరీలు వినాలి. రాగాల జ్ఞానం పెరగాలి. దానికి సమయం ఉంది. 


ఇప్పుడు శారద కి కావాల్సింది ప్రదర్శనలు చేసే అనుభవం.. అది కూడా చిన్నప్పటి లాగా గ్రూప్ లో కాదు… ఒక్కతే.  ఏ కళైనా ప్రదర్శనా ప్రధానమైనదే. క్లాసు లో గురువు దగ్గర పాడటం వేరు. తమకు తెలియని ప్రేక్షకుల ముందు వారిని మెప్పించేలా పాడటం వేరు. ప్రతీ గురువు కి తమ శిష్యుల్ని పెర్ఫార్మర్స్ చెయ్యడం ఓ ఛాలెంజ్. అది ఇంకో విద్య నిజానికి. 


మైక్ లో పాడటం తెలియాలి. పక్క వాయిద్యాల తో పాడటం తెలియాలి. ఏ పాటలు ఎంచుకోవాలి, అరగంట పాడినా మొదటి పాట కి ఉన్న గొంతు చివరి పాట వరకూ అలిసిపోకుండా అలాగే ఉండాలి. అంటే ఎంత సాధన చేయించాలి?   ఇది కాక వస్త్రధారణ కూడా గురువే చెప్పాలి. మన సాంప్రదాయ కళలకి సాంప్రదాయ వస్త్రధారణే వేసుకోవాలి అని చెప్పాలి.  శారద వేదికనెక్కే వెనుక ఇంత కృషి జరిగింది.  


వసంత తనకి తెలిసిన వేదికల తో మాట్లాడింది. తెలుగు నాట అచ్చమైన సంగీత అకాడమీలు, వారు నిర్వహించే వేడుకలు తక్కువ. దేవాలయాల్లో దసరా ఉత్సవాలు, వినాయక చవితి పండల్స్, ఇళ్లల్లో జరిగే  ఫంక్షన్స్ …. ఇలాంటి వేదికలను కూడా ఉపయోగించుకోవాలి. అనుభవం వచ్చి ప్రొఫెషనల్ అయ్యి, తన కంటూ ఆడియన్స్ ఏర్పడే దాకా ఎక్కడైనా పాడగలగాలి. 


ఇంకో వైపు అరుణ, మురళులు చక్కటి పట్టు పరికిణీలు కుట్టించారు శారద కి. పాత ఐఫోన్ స్థానం లో ఇప్పుడు DSLR కెమెరా, స్టాండ్ తో పాటు కొనుగోలు చేయబడింది. దీనికి వసంత కూడా పర్మిషన్ ఇచ్చింది. పెరఫార్మెన్స్ చూసుకొని సవరింపులు చేసుకోడానికి ఈ రికార్డింగ్స్ ఉపయోగపడతాయి. అసలు తాను పక్కన లేకుండా ఎలా పాడుతుందో శారద.. కానీ ఇలా మమకారాలు పెట్టుకుంటే తన శిష్యురాలు స్వతంత్రురాలు ఎలా అవుతుంది?   


శ్రావణ మాసం మొదలుకొని వచ్చిన పర్వ దినాలు, ఆ సందర్భాల్లో జరిగే వేడుకలు, పుణ్య క్షేత్రాల్లో కార్యక్రమాలూ.. ఇలా ఓ నాలుగైదు నెలలు వరకూ ఎవరి బిజీ లో వారున్నారు శారదా, వసంతా. మళ్ళీ తీరుబడి దొరికేసరికి  త్యాగరాజ ఆరాధన మాసం …. అదే జనవరి వచ్చేసింది.  ఒక నాడు తీరిక దొరికాక కబురు చేసింది వసంత శారద ని రమ్మనమని. కచ్చేరి అనుభవాలు విందామని, రికార్డింగ్స్ చూద్దామని. 


ఆ రోజు అరుణ, మురళి వచ్చారు. 


“శారద రాలేదా?” వారి వెనక ఉందేమో అని వెదుకుతూ అడిగింది వసంత. 


అరుణ, మురళి మొహాలు మొహాలు చూసుకున్నారు. 


“రానంటోంది మేడం” 


“కచేరీ ల తో ప్రయాణాల తో అలిసిపోయుంటుంది పాపం” నవ్వుతూ అన్నది వసంత. 


“లేదు మేడం … ఇంక పాడదట” 


షాక్ అయింది వసంత. 


“ఏం జరిగింది?” 


“ఏమో మేడం … మీరు చెప్పినట్టు చాలా స్టేజీస్ మీద పాడింది. కానీ ఉన్నట్టుండి ఓ రోజు ఇంక ప్రోగ్రామ్స్ ఇవ్వననేసింది మేడం. మేము ఫోర్స్ చేస్తే స్టేజ్ మీద కి వెళ్ళి నోరే విప్పలేదు.” 


“అవునా? ఎందుకు?” 


అరుణ, మురళి మళ్ళీ మొహాలు మొహాలు చూసుకున్నారు. “మాకైతే అంతా బాగానే జరిగింది అనిపించేది. శారద కి మాత్రం మూడవుట్ అయ్యేది. ఎందుకో చికాకు వచ్చేసేది. ఒక్కో సారి ప్రోగ్రాం మధ్యలోనే. ఇప్పుడు ప్రోగ్రాం కాదు కదా అసలు సంగీతమే వద్దంటోంది.  ఇన్నేళ్లు నేర్చుకున్న విద్య వేస్ట్ అయిపోతుందని చెప్పినా వినట్లేదు  …  మాకేం చెయ్యాలో ఏమీ తెలీట్లేదు మేడం.” 


వసంత కి సమస్యేంటో అర్ధం కాక రికార్డింగులు తెప్పించుకుంది. నాలుగు ప్రదర్శనలు చూసాక రహస్యం అర్ధమయింది.


శారద ఎలా పాడుతోందో తెలుసుకోడానికి పెట్టిన కెమెరా లో ప్రస్తుత సమాజం పోకడ రికార్డ్ అయింది.  శారద అకారణంగా చిన్నబుచ్చుకోలేదు. ప్రదర్శన కి సిద్ధమైన కళాకారుడికి ఎదురయ్యే తొలి చేదు అనుభవమే శారద కూడా రుచి చూసింది. రసజ్ఞులైన ప్రేక్షకులు లేకపోవడం. 


రకరకాల వేదికల మీద పాడింది శారద. ఆలయాల్లో, గణపతి పండల్స్ లో, చుట్టాల మధ్య, పెళ్లిళ్లలో, పేరంటాల లో. ఎక్కడ పాడినా, శారద పాట లో మార్పు లేదు. వేదిక నెక్కే ముందు నమస్కారం చేసుకుంది. తన ని పరిచయం చేసుకుంది. తాను పాడే అంశం గురించి చక్కగా చెప్పింది. శృతి లో నే పాడింది. తాళం తప్పలేదు. ఆహార్యం బాగుంది. కానీ కచేరీలు జరుగుతున్న కొద్దీ మొహం లో కళ తప్పడం మొదలయింది. ఎంతో అమాయకంగా, నవ్వుతూ మొదలుపెట్టింది మొదటి కచేరీ. చివరికొచ్చేసరికి యాంత్రికంగా మారిపోయింది. 


ఏంటి కారణం? అంతా రికార్డ్ అయింది. 


కచేరీ ఎక్కడైనా, ఎనభై శాతం శారద పాట ఎవరూ వినటం లేదు. ఓ ఫంక్షన్ లో శారద పాట మొదలు పెట్టగానే కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టేసారు. ఓ వ్రతం లో హారతి పాడుతోంది శారద. పూజారి గారు, ఆ భగవంతుడు తప్ప ఎవరూ వినలేదు. చుట్టాలెవరో వచ్చారని, కేటరింగ్ అనీ, ఫోటో అనీ ఒకటే హడావుడి. శారద కి పాపం పాడటం కొనసాగించాలో ఆపాలో తెలియలేదు. ఒక చోట ‘లంబోదర లకుమికర’ అనగానే వెకిలి నవ్వులు. ఇంకో చోట ‘సామజ  వరగమనా’ పాడటమే తప్పయిపోయింది. ఆడియన్స్ లో కుర్రాళ్ళు సినిమా లో పాట ని గట్టి గా పాడటం మొదలు పెట్టారు గ్రూప్ గా.  ఒక చోట శారద పాట మధ్య లో మైక్ లాక్కొని ‘మన టీం టోర్నమెంట్  గెలిచింది’ అని అనౌన్స్ చేసేసరికి  ఇంక ఎవరూ కచేరీ వినలేదు.


పోనీ ఇవన్నీ సంగీత పరమైన వేదికలు కావు అనుకుంటే ఉన్న కొద్ది వేదికలలోనూ శారద పెద్ద ఆర్టిస్ట్ కాదన్న నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా తెలిసింది. కొన్ని చోట్ల మైక్ సడన్ గా పని చెయ్యడం ఆగిపోయింది. నిర్వాహకులతో సహా అది బాగు చేసే వారెవరూ అక్కడ లేరు. అలాగే పాడేసింది. ఇంకో చోట భో శంభో పాడింది … తారస్థాయి లో అద్భుతంగా ఆపింది పాటని. అక్కడ ఎవ్వరికీ అందులో చమక్కు  తెలియలేదు. అప్పుడే శారద మొహం చిన్నబోవటం గమనించింది. సభా మర్యాద తెలీని ప్రేక్షకులు పిల్లల్ని స్టేజీ ముందు ఆడుకోటానికి వదిలేస్తే వాళ్ళు కచేరీ జరుగుతున్న సమయం లో  పరుగుపందాలు, ముట్టించుకునే ఆటలు. వారి తల్లిదండ్రులు వారికి సంగీతం వినడం నేర్పించరు. కనీసం సభా సంస్కృతి… అంటే.. ఒకరు పాడుతుంటే మాట్లాడకూడదు, చివర్లో హర్షించాలి, కళాకారులని చప్పట్లతో గౌరవించాలి అని తెలీదు.  


ఒక రికార్డింగ్ లో చూసింది … ఒకావిడ శారద పాడుతుండగా వచ్చి శారద బుగ్గ గిల్లి పక్కన కూర్చున్న అరుణ ని ‘లంగా ఎక్కడ కుట్టించారు, పాప ఏజ్ ఎంత” అని కబుర్లాడుతోంది! ఇంకో దగ్గర ఒకాయన రికార్డ్ చేస్తున్న మురళి దగ్గరకి వచ్చి ఒకరు “ఈ పాటలు బోర్ అంటున్నారండి, సినిమా పాటలు ఏమన్నా వచ్చా …?” అని అడుగుతున్నారు. శారద స్కూల్ లో పాడమని అడిగారట.  చిన్న రాగం తో మొదలు పెట్టబోతే టీచర్ లు గట్టిగా నవ్వేస్తూ “అమ్మా .. నువ్వలా రాగాలు తీస్తే అందరూ పారిపోతారు .. ఏమన్నా సింపుల్ గా పాడు చాలు” అన్నారట. 


ప్రతీ చోట ఒకే సలహా. టివి ప్రోగ్రామ్స్ లో జరిగే సినిమా పాటల పోటీ ల కి పంపించమని. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే విద్యార్థి ని పోనీ మెకానికల్ కూడా చేసేయమంటే ఎలా ఉంటుంది? ఏదైనా పాటే అనుకునే వారికి ఈ తేడా తెలీదు. చెప్పినా వినరు. వారికి తెలిసిన సంగీతం అదే. అది పాడితేనే మెచ్చుకోలు. 


కొన్ని కచేరీల లో మాత్రం కొంత మంది సంస్కారవంతులు వచ్చి, శ్రద్ధగా విని శారద ని ఆశీర్వదించి వెళ్లారు. అప్పుడు శారద మొహం చూడాలి. ఎడారి లో మంచి నీళ్లు దొరికినట్టు. దురదృష్టవశాత్తు వీరి సంఖ్య చాలా తక్కువ. అరుణ, మురళులకి  ఇందులో తప్పేమీ అర్ధం కాలేదు పాపం. ఒకటి రెండు సార్లు శారద చెప్పబోతే ‘అంత సెన్సిటివ్ గా ఉండకూడదు.. పద పద ప్రోగ్రాం టైం అయింది” అని తీస్కెళ్లిపోయారట. అందుకే ఇంక శారద మాటలు లేకుండా భీష్మించుక్కూర్చుంది. 


వసంత బాధ పడింది. ఆ తర్వాత ఆలోచనలో పడింది. శారద సంగీతం మానేస్తుందేమో అనే బెంగ పడింది. ఇంకో వైపు.. ఓ చిన్న అపరాధ భావన. 


“అసలు బైట ప్రపంచం లో వీసమెత్తు విలువ లేని కళ ని నా చేత అంత కూలంకషంగా ఎందుకు సాధన చేయించారు మేడం? ప్రతీ అనుస్వరం శృతి లో కలవాలి, తాళం తప్పకూడదు, కృతి నోటికి రావాలి, అపస్వరాలు దొర్లకూడదు అని చెప్పారే … అసలు వినేవాళ్ళకి ఇవన్నీ తెలుసా?

శాస్త్రీయ సంగీతం మీద జోకులేసే వారి ముందు ఎలా పాడాలి మీరు చెప్పలేదే మేడం?” అని శారద అడిగితే తనేం చెప్తుంది?  


శారద కి ఏం చెప్పాలి అని ఆలోచిస్తోంది వసంత. పదేళ్ళ అనుభవం లో ఇలాంటి సంక్లిష్టత మొదటిసారి ఎదురైంది మరి. ‘నీకెందుకు ఆడియెన్స్ ఎలా అంటే’ అని శారద  బాధ ని తీసిపారేయాలా? ‘ఇదేం చూసావు … ఇంకా ముందు ముందు చాలా బాధలు ఉంటాయి’ అని భయపెట్టాలా? 


“త్యాగరాజ ఆరాధన కి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి… రమ్మన్నాని చెప్పండి” అని మాత్రం చెప్పి పంపించింది శారద తల్లిదండ్రులకి. 


వస్తుందా శారద? రాకపోతే? 

********


ఐదింటి క్లాసు కి బిలబిలమంటూ వచ్చేసారు పిల్లలు. వసంత మనసు మనసులో లేదు అస్సలు.  ముఖ్యంగా మనసు బాగోనప్పుడే సంగీతం పాడాలి అని వసంత అనుభవపూర్వకంగా నేర్చుకున్న జీవిత పాఠం. అందుకే కూర్చుంది క్లాసు కి. ఈ రోజు వసంత అలవోకగా పిల్లల్ని అర్ధం చేసేస్కోనే గురువు కాదు. కొన్ని విషయాలు ఇంకా తెలీని నిత్య విద్యార్థిని. 


ఎంతో ఆలోచించింది వసంత… ఏంటి ఈ సమస్య కి పరిష్కారం అని. ‘ఏ టాప్’ కళాకారులకు కూడా రసజ్ఞులైన ప్రేక్షకుల తో  నిండిన హాల్ కష్టం ఈ కాలం లో. వయసు లో విద్యలో ఆ స్థాయి కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది శారద కి. ఈ లోపు ఏం చెయ్యాలి?  కొన్ని వేదికల ని ఫిల్టర్ చేస్కోవచ్చు కానీ అది కాదు పరిష్కారం. అసలు ఇక్కడ మార్పు రావాల్సినది ఎవరిలో? సంగీతం వినే అలవాటు ఓ జాతి కి ఎలా నేర్పించాలి? అందులో రుచి ఎలా తెలపాలి? అది కళాకారుడి పనేనా?”


ఆమె కళ్ళు సంగీతం క్లాసు లో గోడ కి ఉన్న త్యాగరాజ స్వామి చిత్రం వైపు కి వెళ్లాయి.  మనుషుల్ని నమ్ముకుంటే ఇంతే నని త్యాగరాజ స్వామి లాంటి వారు ఇందుకోసమే భగవంతుని కి తమ కళ ని అంకితం చేశారా? ఈ వైరాగ్యం పదకొండేళ్ళ పాప కి ఎలా చెప్పాలి? 


 ప్రశ్నల తో వసంత మనసంతా వికలమైపోయింది. శృతి వేసి కళ్ళు మూసేసుకుంది. 


ఇంతలో వాకిలి లో అలికిడి… పిల్లలందరి లో గుసగుసలు. కళ్ళు తెరిచి చూసింది వసంత. 


శారద వచ్చింది. 


ఊపిరి పీల్చుకుంది వసంత. కళ కోసం కన్నీళ్ళు కార్చిన పిల్ల … సంగీతానికి ఎలా దూరం ఉండగలదు? 


వసంత ‘కూర్చో’ అంది. శారద పిల్లలతో కూర్చుంది.  ఈ రోజు శారద తన ఒళ్ళో కూర్చుంటే బాగుండనిపించింది. వీపు నిమిరి సాంత్వన చెప్పచ్చు. ఇంతలోనే వసంత కి గుర్తొచ్చింది. తాను తల్లి కాదు. గురువు. 


ఎవరు మర్చిపోయినా, గురువు మర్చిపోనిది … శారద కి ముందు ఏం చెప్పాలి. 


“రికార్డింగ్స్ చూసాను. బాగా వచ్చాయి పాటలు”. అంతకంటే పొగడదు వసంత. 


అది చాలు శారద కి. “థాంక్యూ మేడం” అంది కళ్ళు మెరుస్తుండగా. 


కళ్ళు మూసుకుంది వసంత. ఆ రోజు చెప్పవలసిన పాఠం ఆలోచించుకుంటోంది. ఓ రాగం తట్టింది మనసుకి. 


“పూర్వీకల్యాణి”


ఆరోహణ, అవరోహణ రాయించింది… ‘స రి గ మ ప ద ప స… స ని ద ప మ గ రి స’ 


“వక్ర సంపూర్ణ రాగం .. వెళ్ళేటప్పుడు వంకర టింకర గా ఉంటుంది.. వచ్చేటప్పుడు సాఫీ గా దిగిపోతుంది”  సరళమైన పదాల్లో చెప్పింది వసంత. పిల్లలకి గుర్తుండిపోయేలా, నవ్వొచ్చేలా ఇలాంటి పదాలు వాడుతుంది.  పిల్లలు నవ్వారు. శారద కూడా నవ్వింది. 


“ఈ రాగం లో ఈ రోజు మనం నేర్చుకునే కృతి .. జ్ఞానమొసగరాదా..” 


పిల్లలందరూ రాసుకున్నారు.


“ఎంత గొప్పవాళ్ళైనా, చదువుకున్నవాళ్ళైనా ఎవరికీ అన్నీ తెలీవు. అలాంటప్పుడు ఎవర్ని అడుగుతాం జ్ఞానం ఇమ్మని? దేవుణ్ణి. ఇక్కడ త్యాగరాజ స్వామి రాముణ్ణి అడుగుతున్నారు… ఎలాంటి జ్ఞానం? సుజ్ఞానం… అంటే మంచి జ్ఞానం”


శారద వైపు చూసింది వసంత. అర్ధమయినట్టు చూసింది శారద. 


పిల్లలు రాసుకుంటున్నారు వసంత చెప్తుంటే. 


“పరిపూర్ణ.. నిష్కళంక నిరవధి సుఖదాయక.. వర త్యాగరాజార్చిత..” 

 

క్లాసు నడుస్తోంది. శారద ఈ కొత్త కృతి నేర్చుకోవడం లో అంతా మర్చిపోయింది. నేర్పడం లో 

నిమగ్నమయిపోయింది వసంత.


నాదానికి శక్తి ఉంటుంది. రాగానికి శక్తి ఉంటుంది. త్యాగరాజ స్వామి లాంటి తపోధనులు రాసిన అక్షరానికి శక్తి ఉంటుంది. 


ఆ రోజు ఓ గురువు, ఆమె శిష్యులు ‘జ్ఞానమొసగరాదా?’ అని ఆర్తి తో ఆలపిస్తుంటే వింటోంది విశ్వం. ఆ తరంగాలకు మాటలు వస్తే ఇలా అంటాయేమో. 


“దేశకాలమానపరిస్థితుల కన్నా తాము గొప్పవారం కాదని వినయంగా ఉంటూ, తమ చేతిలో లేని విషయాలని భగవంతుడికి అర్పించి, మళ్ళీ కళాసాధనా మార్గం లో నడిచే సుజ్ఞానం కళాకారులకి అలవర్చావు కదా రామా? 


మరి ఈ సమాజానికి … కళలను వారసత్వం గా వచ్చిన ఆస్తులుగా, అపురూపంగా చూసుకుంటూ, కళాకారుల విలువనెరిగి గౌరవం చూపుతూ, మన కళల నుంచి పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖాన్ని పొందే జ్ఞానమొసగరాదా?”




___________


లేబుళ్లు: , , , , , , ,

16, అక్టోబర్ 2024, బుధవారం

పొంగనాలు-సాంబారు నేర్పిన జీవిత పాఠాలు

పొంగణాలు/పొంగనాలు/పొంగడాలు ఇలా రకరకాల వ్యవహారాలు ఉన్న ఈ తెలుగు టిఫిన్ సాంబారు తో కలిసి బోల్డు కబుర్లు చెప్పింది నిన్న రాత్రి నాకు. అవి మీకు కూడా చెప్దామని! 

ముందుగా ఒక్క మాట. ఈ కాంబినేషన్ విధి రాత వల్ల కలిసి వచ్చింది కానీ మా ఇంట్లో ఈ సంప్రదాయం లేదు, నా ఫేవరెట్టూ కాదు. ఇది గమనించాలి. 

అదుగో అదే మొదటి జీవిత సత్యం. దోసెల పిండి పులిసిపోక ముందే వాడేయాలి అనే తొందర, సాంబారు వ్యర్థం చేయకూడదనే తాపత్రయం, దోసెల తో సాంబారు తింటే తక్కువ ఖర్చవుతుంది కాబట్టి ఇలా ఇడ్లి సాంబారు, వడ సాంబారు లాగా పొంగనాల తో తింటే రెండూ ఖర్చవుతాయి అనే ఆలోచన నుంచి పుట్టింది ఈ కాంబినేషన్. జీవితం లో ఇలా ఎన్ని సార్లు జరగదు మనకి! పరిస్థితుల ప్రభావం వల్ల, కొన్ని మనమే పెట్టుకున్న పరిధులు/విలువల వల్ల కొన్ని చేసేస్తుంటాం. వాటి నుంచి ఒక్కో సారి ఇలా ముందు తెలియని కాంబినేషన్ పుట్టేస్తుంది. క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ నుంచే పుడుతుంది అని నిరూపితమవుతుంది! 

హిరణ్యకశిపుడు ఓ వంద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు కదా .. నేను ఇలా చావను అలా చావను అని. అప్పుడు కదా నరసింహ అవతారం ఉద్భవించింది! అలా అన్నమాట! (నరసింహావతారాన్ని పొంగనాల తో పోల్చట్లేదు ... క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ .... దానికి ఉదాహరణ! నమో నరసింహ!)


ఇక రెండో పాఠం. మొన్న ఒక కొటేషన్ చూసాను. మీరు మీ ప్రాబ్లమ్ లాగా కనిపించక్కర్లేదు అని. డబ్బుల్లేకపోతే డబ్బుల్లేనట్టు కనిపించక్కర్లేదు. శుభ్రమైన బట్టలు వేసుకొని తల దువ్వుకోవచ్చు!  చెల్లగొట్టాల్సిన ఆహారం తినాలి అనుకున్నప్పుడు మొహం ఒకలా పెట్టుకొని చేతికి దొరికిన ప్లేట్ లో పెట్టుకుని అయిందనిపించక్కర్లేదు. ఓ మంచి ప్లేట్ తీస్కొని బాగా కనిపించేలా ప్రెజెంట్ చేసుకుంటే మనకి కూడా తినాలి అనిపిస్తుంది. ఇదిగో ఇలా ఫోటోలు పెట్టుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. :) 

మూడో పాఠం... కళాకారులకి ప్రతీదీ ఓ ఇన్స్పిరేషనే! ఉదాహరణ కి ఈ కాంబినేషన్ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర ని గుర్తు చేసింది. సాంబారు నిజానికి ఇడ్లి కో, వడ  కో, దోసె కో జతవ్వాలి.  ఎన్టీఆర్ జమున గారిలా. పొంగనాలు పచ్చడి నో, పొడి నో పెళ్లి చేసుకోవాలి. కాంతారావు కె ఆర్ విజయ గారిలా. కానీ ముందే చెప్పినట్టు గా విధి వల్ల కలిసిన ఈ ఎన్టీఆర్ కె ఆర్ విజయ గార్ల జోడి ఎలా ఉంటుంది? వాళ్ళు అన్నీ మర్చిపోయి అన్యోన్యంగా ఉన్నా, ప్రపంచం వారిని ఇడ్లి సాంబారు కి ఇచ్చిన విలువ ఇస్తుందా? ఓ మంచి జోడీ గా గుర్తిస్తుందా? ఇలా కొంత సేపు ఆలోచిస్తూ ఉండిపోయాను నేను! 

నాలుగో పాఠం. దేవుడెందుకో ఒకే ఫామిలీ లో ఒకలాంటి వాళ్ళని పుట్టించడు. ఒకరు పొద్దున్నే లేచేస్తారు. ఇంకొకరు రాత్రి మేల్కొనే ఉంటారు. వాళ్ళకీ వీళ్లకీ రోజూ గొడవ. అలాగే మా ఇంట్లో క్రిస్పీ గా ఉండే చిరు తిండి ని సాంబారు లో వేసేసి మెత్తగా చేసేస్తే అస్సలు నచ్చదు. నాకేమో అలాగే ఇష్టం! పకోడీ చేస్తే కడి-పకోడీ చేసుకుంటాను.  కరకరలాడే కారప్పూస/జంతికల తో మరమరాల మసాలా చేసుకుంటాను.  బిస్కెట్టైతే పాలలో ముంచుకొని తినాల్సిందే. ఇలా క్రిస్పీ వాటిని మెత్తగా  చేసేస్తూ ఉంటే చూడటమే ఇబ్బంది మా ఇంట్లో వాళ్ళకి! ఎన్ని డిఫెరెన్సెస్ ఉన్నా కలిసే ఉండాలి మరి ... పొంగనాలు సాంబారు లాగా! 

ఐదో పాఠం. నువ్వు జీవితం అంతా చూసేసా అనుకుంటున్నావు కానీ ఇంకా అంతా చూడలేదు. ప్రపంచాన్ని చుట్టేసిన వాళ్ళైనా, పుస్తకాలన్నీ చదివేసి వాళ్ళైనా .. ఇంకా ఏదో కొత్త అనుభవం, కొత్త కాంబినేషన్ ఉంటూనే ఉంటుంది మనని ఆశ్చర్యపరచడానికి! ఇది గుర్తుంచుకుంటే చాలు. జీవితం డెడ్ ఎండ్ లాగా బోర్ గా అనిపించదు. కొంచెం ఈగో కూడా కంట్రోల్ లో ఉంటుంది.... మనం అన్నీ చూసెయ్యలేదని! 

ఇంక చివరిది, ముఖ్యమైనది అయిన పాఠం. ఆన్లైన్ లో మనం చూసేదేదో పూర్తి పిక్చర్ కాదు. నా పొంగనాల ఫోటో చూసి నోరూరుతుంది. ట్రై చెయ్యాలని కూడా అనిపించచ్చు. కానీ నిజం ఏంటంటే ఆ సాంబారు  లో ఉప్పెక్కువైంది. నేను పొంగనాల పిండి లో ఉప్పు తక్కువేస్కున్నా లాభం లేకపోయింది. తర్వాత సాంబారు లో నీళ్లు కలిపి మరిగించాము. ఆ పల్చటి సాంబారు ఫోటో కి నోచుకోలేదు. అదీ పూర్తి కథ. 

నేను ఈ సారి ఏం చేశా అంటే ఇదే భాగోతం ఇంగ్లిష్ లో వెళ్ళగక్కాను. అది నా ఇంగ్లిష్ బ్లాగ్ లో ఉంటుందన్న మాట. తెలుగు చదవటం రాదనే వంక తో నా రాతల్ని తప్పించుకోకుండా నేను వేసిన మాస్టర్ ప్లాన్ ఇది! కింద నా ఇంగ్లీష్ బ్లాగ్ కి లింక్ ఇచ్చాను. దాని పేరు సౌమ్యాటిక్ లైఫ్ :)

My English Blog

మళ్ళీ కలుద్దాం. మీరు ట్రై చేసిన/చెయ్యాల్సొచ్చిన కాంబినేషన్స్ ఏంటి? అవి మీకు నేర్పిన జీవిత పాఠాలేంటి? ప్లీజ్ చెప్పండి. 

లేబుళ్లు: , , , , , , ,

20, ఆగస్టు 2024, మంగళవారం

జో బాత్ తుజ్ మే హై .....

 చాలా రోజుల నుంచి ఓ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నా.... ఇలా సందర్భం కుదిరింది.... 

ఒకప్పుడు కేవలం మెమరీ కోసం పనికొచ్చే ఫోటోలు ఇప్పుడు వాటి పరిధులు దాటి కొంచెం మితిమీరి మనశ్శాంతి పోగొడుతున్నాయి కదా .... 

కొంత మందికి ఫోటో చూసాక స్ట్రెస్ మొదలవుతుంది.. యాంగిల్, బట్టలు, లైటింగ్... ఇవి మనం రూపాన్ని కెమెరా కి వేరేలా చూపిస్తాయి అని తెలీక ఆ కనిపించేదే నిజమనుకుని చాలా బాధపడుతున్నారు పాపం కొంతమంది. (మగవారు కూడా ఇలా ఫీలవుతున్నారా? ఎక్కువగా ఆడవారేనా? దీనికి జెండర్ తో సంబంధం లేదా? ) 

మీడియా లో పని చేసిన టెక్నీషియన్ గా ఒక ప్రొఫెషనల్ ఫోటో వెనక ఎంత శ్రమ, ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని జిమ్మిక్కులు ఉంటాయో తెలుసు నాకు. అలాంటిది నేను కూడా ఒకో సారి నా ఫోటో చూసి స్ట్రెస్ అయిన రోజులున్నాయి. అలాంటప్పుడు ఎవరు ఎంత చెప్పినా నమ్మబుద్ధి కాదు .. మనం బానే ఉంటామని. 

కొంచెం పెద్దయ్యాక జీవితం బోల్డు కష్టాలు చూపించి ఈ కష్టాన్ని చిన్న గీత చేసినందువల్ల ఇలా ఉన్నా దేవుడి దయ వల్ల 😊 

ఈ పాట విషయానికొస్తే నాకు చాలా ఇష్టమైన పాట .. తాజ్ర మహల్ (1963) చిత్రం లోనిది. రఫీ గారి గొంతు, రోషన్ గారి సంగీతం, సాహిర్ లుధియాన్వీ పలుకులు .... 

ఇందులో 'జో వాదా కియా వో నిభానా పడేగా' పాట ఫేమస్ .. 

'జో బాత్ తుజ్ మే హై' పాట గురించి ఎక్కువ మందికి తెలీదు .. 


ఈ పాట భావం .. నీ లో ఉన్న విషయం నీ చిత్తరువు లో లేదు ... అని. వీడియో లో విశదంగా వివరించే అవకాశం దొరికింది. ఇదిగోండి లింక్ 


ఈ పాట కెమెరా లేదా ఓ చిత్రం యొక్క లిమిటేషన్స్ ని కవితాత్మకంగా భలే చూపిస్తుందండి! 

వీలైతే పాట ఒరిజినల్ కూడా వినండి. చాలా బాగుంటుంది! 

ఫోటోలు చూసి ట్రామా కి డ్రామా కి గురయ్యే అందరికీ అంకితం ఇస్తున్నాను ఈ పాట ని!!! 

We are all beautiful!

లేబుళ్లు: , , , , ,

8, నవంబర్ 2023, బుధవారం

చూడాలని ఉంది

పర్యాటకాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎకో టూరిజం, హెరిటేజ్ టూరిజం ఇలా. నాకు సాంసృతిక  పర్యాటకం, ఆహార పర్యాటకం చాలా ఇష్టం. 

ఈ పోస్టు ద్వారా దేవుడికో బహిరంగ లేఖ రాస్తున్నా అన్నమాట ..ఈ కోరికలు తీర్చమని! 

ముందుగా సాహితీ-సాంస్కృతిక పర్యాటకం ... 

కవులు, రచయితలు, గాయకులూ జీవించిన ఇళ్ళూ ఊళ్ళూ నన్ను చాలా ఆకర్షిస్తాయి. 

మన తెలుగు రాష్ట్రాల తో మొదలు పెడితే ... 

1. తాళ్ళపాక - అసలు అన్నమయ్య పుట్టిన ఊరు ఎలా ఉంటుంది ... ఆ గాలి, ఆ నీరు, ఆ మట్టి... అన్ని కీర్తనలు రాస్తే పర్యావరణమే మారిపోయి ఉంటుంది అని నాకనిపిస్తుంది. అన్నమయ్య కీర్తనలు పాడటం మూడో ఏటే మొదలుపెట్టినా ఆ ప్రదేశం మాత్రం ఇప్పటి వరకూ చూడలేదు. 

2. భద్రాచలం, గోల్కొండ - ఇవి లక్కీ గా రెండూ చూసాను. గోల్కొండ కోట లో రామదాసు చెర, ఏ రంధ్రం ద్వారా ఆహరం పంపేవారో చూసాక "ఎవడబ్బ సొమ్మని" అని రాసేంత కోపం ఎందుకు వచ్చిందో అర్ధం అయ్యింది. అయినా రామభక్తి విడువని ఆయన అసిధారావ్రతానికి అబ్బురం అనిపించింది. భద్రాచలం ఈ మొత్తం అల్లరి కి కారణం అయిన నగలు చూడటం ఇంకో అనుభవం 

3. రాజమండ్రి లో నేను బాల్యావస్థ లో ఉన్నప్పుడు ఓ నాలుగేళ్లు ఉన్నాం. నేను చదువుకున్నది శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తిక పాఠశాల లోనే. (SRI KANDUKURI VEERESALINGAM THEISTIC SCHOOL... SKVT అంటారు దానవాయిపేట లో). కానీ ఆ వయసు లో నాకు వీరేశలింగం గారి గొప్పతనం ఆయన రచనలు .. ఏమీ తెలీవు. ఒకప్పుడు వితంతువుల కి ఆ స్కూల్ స్థలం లోనే ఆశ్రమం ఉండేది అని విన్నాను (ఎంత వరకూ నిజమో తెలీదు). మా పిల్లల ల్లో మాత్రం పిచ్చి రూమర్స్ ఉండేవి .. ఆ వితంతువులు ఆత్మలై తెల్ల బట్టలేస్కోని స్కూల్ లేని టైం లో తిరుగుతూ ఉండేవారని మా ఒకటో క్లాసు లో ప్రభు గాడు చెప్పాడు.  (వాడే కొంగ ని అడిగితే గోళ్ళ మీద గుడ్లు పెడుతుంది అని కూడా చెప్పాడు. అప్పుడే నాకు అర్ధమయ్యి ఉండాల్సింది వాడు ఉత్త అబద్ధాలకోరని.) ఎంతో సామజిక, సాహితీ చరిత్ర ఉన్న రాజమండ్రి లో అసలు ఎన్నో చూడనే లేదు. ఓ సారి అవి చూడాలి 

4. గురజాడ అప్పారావు గారి ఇల్లు చూడాలని ఉంది. విజయనగరం అట కదా. 



5. తనికెళ్ళ భరణి గారితో ఓ సారి ఆంధ్రా సైడ్ వెళ్లాం ఓ కార్యక్రమం లో భాగంగా. మేము పాల్గొన్నది ఓ ఆలయ సంస్థాపన లో. ఆ ఊరి పేరు ఎంత గుర్తుచేసుకున్నా గుర్తురావట్లేదు. అక్కడికి దగ్గరే యండగండి ...  తిరుపతి వెంకట కవుల లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి ఊరు అని తెలిసింది కానీ వెళ్లలేకపోయాం. 

6. తంజావూరు లో తిరువయ్యురు .. మా త్యాగరాజ స్వామి కోవెల ఉన్న ఊరు. ఎన్నో కీర్తనలు నేర్చుకున్నాం. ఆ కీర్తనలలో ఆయనని చూసాం. ఆయన తిరిగిన ఊరు కూడా చూడాలని కోరిక. ఆరాధన టైం లో కాకుండా ప్రశాంతమైన టైం లో వెళ్ళి మైక్, ఆడియన్స్ తో సంబంధం లేకుండా కావేరి తీరాన ఆయన కీర్తనలు చక్కగా పాడుకోవాలని! 

7. హైదరాబాద్ లో నే బడే గులాం అలీ ఖాన్ సాబ్ సమాధి ఉంది. ఆయన చివరి రోజుల్లో బషీర్ బాగ్ ప్యాలెస్ లోనే ఆయనకి ఆశ్రయం లభించింది. నా ఫేవరేట్ ఘజల్ గాయకులూ, ఆయన శిష్యులూ అయిన గులాం అలీ గారు హైద్రాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన దర్శనం చేస్కుంటారట. నేను మాత్రం ఇప్పటివరకూ ఆ ప్రదేశం చూడలేదు. అక్కడికెళ్లి "కా కరూ సజ్ని" పాట పాడాలి!

హైద్రాబాద్ లోనే ఇంకా చూడవలసినవి చూడలేదు అంటే ఇంక నెక్స్ట్ వచ్చేవి ఎలా చూస్తానో మరి! ఎందుకంటే ఇవన్నీ ఖండాంతరాల్లో ఉన్న స్థలాలు. ముఖ్యంగా అమెరికా లో, యూరోప్ లో ఉన్నవి. 

8. వాల్డెన్ - హెన్రీ డేవిడ్ థోరో రాసిన పుస్తకం .. ఈయన అమెరికన్ రచయిత. సమాజం తో నాకేంటని అన్నీ త్యజించి వాల్డెన్ తటాకం ఒడ్డున ఓ చెక్క కాబిన్ లో ఓ రెండేళ్ల పాటు ఉన్న ఆయన తన అనుభవాలతో 'వాల్డెన్' రాసారు. ఆ కాబిన్ ఇంకా ఉందట. కాంకర్డ్ మసాచుసెట్స్ లో. అక్కడి వెళ్లాలని నా కోరిక. 



9. అలాగే లిటిల్ విమెన్ రాసిన Louisa May Alcott గృహం. ఇది కూడా కాంకర్డ్ లోనే ఉందట. 

10. ఇక షేక్స్పియర్ పుట్టిన ఊరు.. Stratford upon Avon. Avon నది ఒడ్డున ఉన్న Stratford అని అర్ధం. అక్కడి ఊరు పేర్లు అలాగే ఉంటాయి. 

11. కాన్సాస్ సిటీ, మిస్సోరి లో పుస్తకాల షేప్ లో ఓ గ్రంధాలయం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి. 



12. యూరప్ లో ఇక్కడ నేను లిస్ట్ చెయ్యలేని చాలా గ్రంధాలయాలు ఉన్నాయి. అవి చూడాలి. నాలాంటి దానికి జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళడానికి ఒక్కో గ్రంథాలయానికి మూడు రోజులు పడుతుంది అని నా అభిప్రాయం. 

13. L.A లో అయితే చాలా పనుంది. నేను చూసిన ఎన్నో ఇంగ్లీష్ సీరియల్స్, సినిమాల లొకేషన్లు అక్కడ ఉన్నాయి. Bosch అనే సిరీస్ లో ఆ డిటెక్టివ్ ఉండే ఇల్లు ... 



లా లా ల్యాండ్ అనే సినిమా లో బెంచ్ ... 

ఇలా చాలా ఉన్నాయ్. 

14. లండన్ కి ఓ గంట దూరం లో ఉండే Highclere castle... 'Downton abbey' అనే సీరియల్ తీసిన చోటు 

15. ప్రపంచ దేశాల జాబితా లో అత్యంత ఆనందకరమైన దేశంగా ఎప్పుడూ ఫస్ట్ వచ్చే ఫిన్లాండ్ చూడాలని ఉంది. 

16.  జాజ్ సంగీతానికి పుట్టినిల్లయిన New Orleans కి వెళ్ళాలి 

17. జేమ్స్ బాండ్ నవలలు ఎక్కువ చదవలేదు కానీ Dr. No నాకు భలే నచ్చింది చిన్నప్పుడు. ఇయాన్ ఫ్లెమింగ్ జమైకా లో ఓ కాటేజీ లో ఉండి రాసేవారట. Dr. No నవల లో కొంత భాగం జమైకా లోనే నడుస్తుంది కూడా. ఆ కాటేజీ ఇప్పుడు అద్దెకి కూడా ఇస్తున్నారట. కేవలం రోజుకి ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు. అంతే. 



మన లో అందరికీ ప్రపంచాన్ని చూడాలని అనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో తరహా. లగ్జరీ ట్రావెల్, క్రూజ్, అడ్వెంచర్, ప్రకృతి, ఆలయాలు... ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఈ భూగోళం లో ప్రదేశాలని తమ అనుభవం లో కి తెచ్చుకోవాలనుకుంటారు. కొంత మంది ట్రెండ్స్ ఫాలో అయిపోతారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మాల్దీవులు వెళ్ళిపోతున్నట్టుగా. ఇంకొందరికి జస్ట్ చూసొచ్చాము అని చెప్పుకోలగితే చాలు. అక్కడ ఓ ఐదు నిముషాలు ఉండరు, ఏమీ తెలుసుకోరు. 

నాకు మాత్రం ఆ ప్రదేశం లో నాకు అనుబంధం ఉన్నది ఏదో లేనిదే ఇల్లు కూడా కదలాలి అనిపించదు. 

ఆహార పర్యాటకం గురించి ఇంకో పోస్టు లో రాయాల్సొస్తోంది. ఈ లిస్టే ఇంతే పొడవైపోతుంది అనుకోలేదు. ఇది భగవంతుడి తప్పు. ఆయన తలిస్తే ఈ లిస్టు ఇట్టే పూర్తయిపోదూ! అందుకే Please pray for me :)!


లేబుళ్లు: , , , , , , , , ,

14, ఆగస్టు 2023, సోమవారం

విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్.....

కాంప్లిమెంట్లు. ఈ టాపిక్ మీద నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఇక్కడ ఒలకబోస్తున్నా ఈ రోజు. 

ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంప్లిమెంట్ లా కనిపించేవన్నీ కాంప్లిమెంట్స్ కావు. 

ఇంగ్లీష్ లో compliment .... complement ఒకలాగే ఉంటాయి. ఒకే అక్షరం తేడా. ప్రశంస అనే అర్ధం వచ్చేది compliment. రెండో దానికి అర్ధం వేరు. Her dancing complemented his singing. ఆమె నాట్యానికి, అతని గానానికి జోడీ కుదిరింది. ఇలాంటి అర్ధం లో వాడతారు. కానీ స్పెల్లింగ్ రాసేటప్పుడు ఒక దాని బదులు ఇంకోటి రాసేస్తూ ఉంటారు. stationery ..stationary లాగా. 

ఆ రెండు పదాలకీ ఎంత తేడా ఉందో ... నిజం ప్రశంసలకి, ప్రశంస లా విన్పించే వాటికీ అంత తేడా ఉంది. 

"ఎంత సన్నబడ్డావు తెలుసా! ఒకప్పుడు ఎంత లావుగా అసహ్యంగా ఉండేదానివి! పెద్ద పొట్ట, టైర్లు... చేతులు కూడా ఇంత లావుగా ఉండేవి కదూ!" ఇది కాంప్లిమెంట్ కాదు. 

"నువ్వు కాఫీ చాలా బాగా చేస్తావు .. ఏదీ ఓ కప్పు ఇచ్చుకో" ఇది కూడా కాంప్లిమెంట్ కాదు


"వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఒకప్పుడు వీళ్ళ ఇల్లు, బట్టలు ఎలా ఉండేవో తెలుసా?" అన్నారోసారి ఎవరో. అదేంటండి అలా అంటున్నారు అంటే "మీరు బాగా పైకొచ్చారు అని కాంప్లిమెంట్ ఇస్తున్నా" అన్నారు. "నీకు మంచి తెలివితేటలు వచ్చాయి మీ(కులం/మతం/లింగం/ప్రాంతం/కుటుంబం) లో ఇలా అరుదు కదా" ఇవి కాంప్లిమెంట్ లు కావు ... చులకన భావం నుంచి, వివక్ష నుంచి వచ్చినవి. 


అసలైన ప్రశంస గుర్తింపు నుంచి వస్తుంది. మొదటి ఉదాహరణ లో సన్నబడటం లో ఉన్న కష్టాన్ని, డిసిప్లిన్ ని గుర్తించినప్పుడు, రెండో దాంట్లో స్వప్రయోజనానికి కాకుండా ప్రశంసించినప్పుడు, మూడో సందర్భం లో పైకొచ్చిన వ్యక్తి సంకల్పబలాన్ని గుర్తించినప్పుడు అవి కాంప్లిమెంట్స్ అవుతాయి. 

మంచి ప్రశంస మనసుకి చల్లగా తాకాలి.  అంతే గానీ "వీడిప్పుడు ఎందుకు పొగుడుతున్నాడు?" అనో "ఇది అసలు కాంప్లిమెంటా కాదా" అనో అనిపించకూడదు. 

ఒక్కో సారి ప్రశంస మాటల్లో ప్రకటించబడదు ... ఇది బెస్ట్ కాంప్లిమెంట్ అనిపిస్తుంది. ఓ కనుబొమ్మ ఎగరేయడం .... వండింది తిని కళ్ళు మూసుకొని ఆస్వాదించడం .... ఇలా మాటల్లో వర్ణించలేని ఎన్నో నాన్ వెర్బల్ ప్రశంసలు ఉంటాయి. 

ప్రశంసలకి ఇది స్వర్ణ యుగం నిజానికి. సోషల్ మీడియా వల్ల. ఇల్లు నీట్ గా సద్దుకొని ఫోటో పెట్టినా, మంచి చీర కట్టుకున్నా (చీర కట్టు బాగా కుదిరినా), పాడినా, డాన్స్ చేసినా మంచి ప్రశంసలు అందుకొనే ప్లాట్ఫారం సోషల్ మీడియా. 

ఓ సినిమా లో కోట శ్రీనివాస్ రావు గారు బ్రహ్మానందం గారు ఓ మంచి కాంప్లిమెంట్ ఇస్తే ఒక్కొక్కరినీ పిలిచి వాళ్ళకి కూడా తెలిసేలా పొగిడించుకుంటారు చూడండి ... సేమ్ మాటర్ .... ఆ అవసరం సోషల్ మీడియా తీసేసింది. చక్కగా ఉన్న కాంప్లిమెంట్లన్నీ అందరికీ తెలిసేలా, ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటాయి. ట్రోలింగ్/నెగిటివ్ కామెంట్లు ఉన్నా అవి డిలీట్ చేసుకొనే/ బ్లాక్ చేసుకొనే సౌకర్యం ఉండనే ఉంది కదా!

ఈ జన్మ లో దేవుడు నన్ను కొన్ని మంచి ప్రశంసలు తీసుకొనే స్థానం లో కూర్చోబెట్టాడు. దానికి ఎప్పటికీ నేను కృతజ్ఞురాలిగానే ఉంటాను. ఏదో ఒక రోజు ... ముఖ్యంగా కళాకారుల జీవితం లో .. ఏదో అప్సెట్ గా ఉన్నరోజో, మూడ్ ఆఫ్ లో ఉన్న రోజో బ్లాగ్ మీదో ... వీడియోల మీదో ఏదో మంచి కామెంట్ కనిపించినప్పుడు ఆ రోజు రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది! 

కానీ ఆ ప్రశంసలు ప్రత్యక్షంగా తీస్కోడం లో నాకు కొంచెం మొహమాటం. ఇప్పుడు నయం. ఒకప్పుడు నాకెవరైనా కాంప్లిమెంట్ ఇస్తే అదేదో టెన్నిస్ బాల్ లాగా ఎదురు ప్రశంస ఇస్తే కానీ ఊరుకునే దాన్ని కాదు. ఇది చాలా ఎబ్బెట్టు గా ఉంటుంది ... హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యు అన్నట్టుగా. 

ఒక్కోసారైతే అసలు కాంప్లిమెంట్ ని స్వీకరించడానికి ఒప్పుకొనేదాన్ని కాదు! ఒక సారి త్యాగరాజ ఆరాధన లో పాడాను. చాలా మంది గొప్పవాళ్ళు పాల్గొన్నారు ఆ ఆరాధన లో. ఒక వాద్యకారులు వచ్చి "బాగా పాడారమ్మా" అంటే "మీరేదో వాత్సల్యం తో అంటున్నారు" అన్నా నేను! ఆయన వేరే వాళ్ళ ముందు నా గురించి చెప్తూ "ఆ అమ్మాయి ఒప్పుకోదు కానీ బాగా పాడింది" అని నవ్వారు. 

అపజయానికే కాదు విజయానికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి అని మొన్న ఎక్కడో చదివాను. ఓ మంచి గమకం పాడితే "భలే!" అని ఎవరో అనేసరికి ఓ నిముషం బ్లాంక్ అయిపోయా చిన్నప్పుడు. అనుభవం మీద ఇలాంటి కొన్ని విషయాలు తెలిశాయనుకోండి.  

ఇంకో పాత అలవాటు ఏంటంటే ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళ మాట పూర్తవకుండా థాంక్ యూ చెప్పడం. వాళ్ళు ఓ పేరాగ్రాఫ్ ప్రశంస తో రెడీ గా ఉంటే నేను మొదటి మాట కే థాంక్ యూ అనేయటం ... వాళ్ళు కూడా మొహమాటస్థులే అయితే ఆ ప్రశంస అక్కడ తుంచివేయబడటం. కాదు .. వాళ్ళు అలాగే కొనసాగిస్తూ ఉంటే నేను లైన్ లైన్ కీ థాంక్ యూ చెప్పడం. (అలాగే ఏం మాట్లాడకుండా వింటూ ఉంటే పొగరు అనుకుంటారేమో అని భయంతో). ఇప్పుడు కొంచెం కాంప్లిమెంట్ హుందా గా రిసీవ్ చేస్కోవడం అలవాటు చేసుకుంటున్నాను. 

ప్రొఫెషనల్ జీవితం లో ఇంకో విషయం కూడా అనుభవం మీద తెలుసుకున్నాను. ఒక్కో సారి సీనియర్ల నుంచి చేతల ద్వారా వచ్చే ప్రశంసే ముఖ్యం. అంటే మన పని నచ్చితే కాంట్రాక్టు కొనసాగించడమే ప్రశంస. అంతే గానే నోటితో పొగిడేసి పని దగ్గరకి వచ్చేసరికి ఇంకొకరిని ప్రిఫర్ చేస్తే అది ప్రశంస కాదని. 

పెద్దయ్యాక తెలిసే విలువైన పాఠాల్లో ఇంకోటి... ప్రశంసలు లభించకపోయినా నువ్వు చెయ్యాల్సిన పని చేస్తూనే ఉండాలి అని. అవి పాయసం లో అప్పుడప్పుడూ వచ్చే జీడిపప్పు లాంటివి అంతే అని. 

కాంప్లిమెంట్ ల లో కాంప్లి 'మంట' అనిపించేవి రోడ్ సైడ్ పోరంబోకుల కామెంట్లు. వాళ్ళు వేసే విజిల్స్ కానీ, వెకిలి సౌండ్స్ కానీ, పొగడ్తలు కానీ అస్సలు పాజిటివ్ గా అనిపించవు. నువ్వు బాగున్నావు కాబట్టే వాళ్ళు అలా చేస్తున్నారు అంటే ఒళ్ళు మండుతుంది. అప్పుడే అనిపిస్తుంది కాంప్లిమెంట్ ఇచ్చే వాడికి అర్హత ఉండాలి.. సమయం, సందర్భం కూడా ఉండాలి అని. 

కమర్షియల్ సినిమా వాళ్ళు "అమ్మాయిలకి కూడా ఇలాంటివి ఇష్టమే" అని పాటల్లో, డైలాగుల్లో చెప్పేస్తూ ఉంటారు. ఆరోగ్యకరమైన విధమేంటో ఇరువర్గాలకీ తెలీకపోవడం వల్ల, ఈ కామెంట్లు చాలా నార్మల్ అనే అపనమ్మకం వల్ల ఇలా అంటారు. ప్రశంసలు ఎవరికైనా ఇష్టమే. రోడ్డు మీద కనిపించిన అమ్మాయి/ అబ్బాయి  బట్టలో,జుట్టో ఏదైనా నచ్చిందనుకుంటే హుందాగా ఎందుకు ప్రకటించకూడదు. అది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కూడానూ! 

అమ్మాయిలకి ఎలా కాంప్లిమెంట్ ఇవ్వాలి అనే విషయం మీద ఓ పుస్తకం రాయచ్చు. కానీ అది ఎవరు చదవాలో వాళ్ళు చదవరేమో అని డౌట్. పుస్తకం చదివే సంస్కారం ఉంటే అది అమ్మాయిల పట్ల ప్రవర్తన లో సున్నితత్వాన్ని కూడా తీసుకొస్తుంది కదా. (దానికీ దీనికీ సంబంధం లేదంటారా?)

కొంత మంది కాంప్లిమెంట్లని భలే వాడుకుంటారు. సంభాషణ ని కాంప్లిమెంట్ తో ఓపెన్ చేస్తారు. అవతలి వ్యక్తి దాన్ని స్వీకరించగానే వీళ్ళ అసలు అజెండా మొదలవుతుంది. దానికి, ఓపెనింగ్ లో చేసిన ప్రశంస కి సంబంధం ఉండదు. అలాగే ఇంకో కేటగిరి ... అతి గా పొగిడే వారు. ముత్యాల ముగ్గు లో, మాయాబజార్ లో చూపించిన భజన బ్యాచ్. వీళ్ళ వల్లే ఒక్కో సారి అసలు ప్రశంసలంటేనే భయం వేసేస్తుంది. పొగడ్త వేరు ప్రశంస వేరనుకోండి. 

మన సమాజం లో ప్రశంసలు అంత ఫ్రీ గా  ఫ్లో అవ్వవు.  మంచి ఉంటే వెనక మాట్లాడు అనే సమాజం మనది. ఇది కూడా ఓ రకంగా మంచిదే. అలాగే చిన్నవాళ్ళని పొగడకూడదు ... ఆయుక్షీణం అని ... దిష్టి అని .. ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయి. తల్లి, గురువు, తండ్రి అయితే అసలు పొగడకూడదు అంటారు. కానీ నా అనుభవం లో సరైన సమయం లో సరైన మోతాదు లో చేసే ప్రశంస పిల్లలకి టానిక్కే. 

తెలుగు/సంస్కృతం అంతగా రాని పిల్లలకి సంగీతం నేర్పించే అప్పుడు వాళ్ళు పెద్ద పదాలు పలికినప్పుడు "భలే పలుకుతున్నావే" అంటే వాళ్ళ మొహాలు వెలిగిపోవడం చూసా నేను. ఆ ప్రశంస కోసం వాళ్ళు కష్టపడి పెద్ద పెద్ద స్తోత్రాలు ఇష్టంగా సులువుగా నేర్చుకోవడం నా అనుభవం లో చూసాను. 

మన దగ్గర సంబంధాల్లో కూడా ప్రశంసలు చాలా ముఖ్యం. ముందే చెప్పినట్టు ప్రశంస లో ఉన్న గుర్తింపు సంతోషాన్నిస్తుంది. Mrs. Doubtfire సినిమా లో ఓ సీన్ ఉంటుంది. (ఆ సినిమా నుంచి inspire అయి తీసిన 'భామనే సత్యభామనే' సినిమా లో ఈ సీన్ ఉండదు.) ఆడ వేషం మార్చుకొని భర్త తన ఇంట్లోనే పనికి చేరతాడు. మీ వంటిల్లు భలే నీట్ గా పెట్టుకున్నారు అని ప్రశంసిస్తాడు. అప్పుడు ఆవిడ "థాంక్స్. నా భర్త ఇదెప్పుడూ గుర్తించలేదు" అని బాధపడుతుంది. మారువేషం లో ఉన్న భర్త ఇది విని తను కూడా బాధపడతాడు. చాలా మంచి సన్నివేశం ఇది. 

శుభలేఖ ల్లో విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్.....అని రాస్తారు చూడండి.... అక్కడ తో ఆగిపోకుండా సందర్భం వచ్చినప్పుడు మంచి ప్రశంసలు అందరూ ఇచ్చి పుచ్చుకోవాలని ఆశిస్తూ.... ఐడియలిస్టు నైన నేను సెలవు తీసుకుంటున్నాను. 








లేబుళ్లు: , , , , , , ,

9, జూన్ 2023, శుక్రవారం

మరపురాని పావుగంట

ఏడేళ్ళ క్రితం ఇదే రోజున ప్రసాద్స్ ఐమాక్స్ లో మా షార్ట్ ఫిల్మ్ 'పెళ్ళివారమండి' ప్రదర్శించాం. 

ఆ సినిమా నిడివి పావుగంట. అయినా దానితో ముడిపడిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవి గుర్తుచేసుకుంటూ ఈ పోస్టు. 

నేను మొదట తీసిన షార్ట్ ఫిలిం 2007 లో. అప్పటికి యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్ ... ఈ హవా ఇంకా మొదలవ్వనే లేదు. ఈ బుజ్జి సినిమా గురించి ఇంకో సారి చెప్తాను. 

కట్ టు 2016. 

ఓ ఫ్రెండ్ చాలా ఏళ్ళ తర్వాత కలిసి మేము సినిమాల్లో ఉన్నాం అని తెలిసి "మీరు ఎందుకు షార్ట్ ఫిలిం చెయ్యట్లేదు?" అని అడిగారు. "అబ్బా... ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసేస్తున్నారు... ప్రొఫెషనల్స్ అయిన మేము కూడా ఈ మూస లో పడితే బాగోదేమో" అని  నసిగాను. కానీ ఆ ఫ్రెండ్ ఊరుకోలేదు. నేను డబ్బు పెడతాను, తియ్యమన్నారు. ఇంక నఖరాలు చెయ్యకుండా అక్కా, నేను పనిలోకి దిగాం. 

నిజానికి ఇది ఓ డ్రీం ప్రాజెక్ట్ అయింది. ఎలా అంటే, డబ్బు పెట్టిన వ్యక్తి ఎవరైనా కథలో వేలు పెడతారు కానీ మా ఫ్రెండ్ అస్సలు ఏమీ పట్టించుకోలేదు. నేను తక్కువలో తీద్దాం అనుకున్నాను. కానీ కథ రెడీ అయ్యాక నిడివి, అది బాగా వచ్చిందనిపించి మూడు రెట్లు బడ్జెట్ పెంచారు మా ఫ్రెండ్. అందుకే దీన్ని సినిమా లెవెల్లో ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రసాద్స్ ఐమాక్స్ లో 'విడుదల' చేయగలిగాము. (ఒక్క షో అయినా. అది కూడా ఫ్రీ టికెట్😆). 

అక్కా, నేను బాగా ఎంజాయ్ చేసే genre కామెడీ కాబట్టి అదే తీద్దామనుకున్నాం. సబ్జెక్టు గురించి ఓవర్ థింక్ చెయ్యద్దు అనుకున్నాం. సరదాగా ఏది వస్తే అదే రాద్దాం అని నియమం పెట్టుకున్నాం. రెండు మూడు వెర్షన్లు రాసుకోవడం లాంటి చాదస్తాలు కూడా పెట్టుకోవద్దనుకున్నాం. అలాగే చేసే ఫ్రీడమ్ దొరికింది మా ఫ్రెండ్ వల్ల. 

2012 లో 'ఫైవ్ విమెన్ అండ్ ఏ బిల్" అనే ఇంగ్లీష్ నాటకం నేను రాసి డైరెక్ట్ చేసాను. ఆ నాటకం తారాగణం నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ నాటకం లో అందరూ స్త్రీ పాత్రలే. వారినే ఈ సినిమాలో తీసుకున్నాను. (ప్రొఫెషనల్ ఆక్టర్స్ తో చేసేంత కాంటాక్ట్స్ కానీ, బడ్జెట్ గానీ లేకపోవడం ఓ కారణం అయితే, తెలిసిన వారితో అయితే comfortable గా ఉంటుంది అనుకోవడం ఇంకో కారణం). వారు కాక ఇంకొంత మంది పరిచయస్తులు కలిశారు. ఇందులో టీనేజర్ గా చేసిన పిల్లవాడు నా మొదటి షార్ట్ ఫిల్మ్ లో కూడా చేసాడు. వాడిని చూస్తే "మనం ఇంత పెద్దవాళ్ళం అయిపోయామా" అనిపించింది! 

షార్ట్ ఫిలిం లో వారి పాత్రలు కూడా వారి నిజజీవితానికి దగ్గరగా ఉంటాయి. ఎవరి పేర్లు వారివే. అవి మార్చలేదు. మలయాళం మాట్లాడే ఆవిడ మలయాళీ.. తెలుగు అబ్బాయి ని పెళ్ళి చేసుకోవడం కూడా అలాగే సినిమా లోకి తీసుకున్నాం. నాట్యం చేసే ఇద్దరూ నిజంగా నాట్యం నేర్చుకున్నవారే. ఫ్రెంచ్ మాట్లాడే అమ్మాయి కి ఫ్రెంచ్ వచ్చు. పంజాబీ అబ్బాయి పాత్ర నిజజీవితం లో మంచి తెలుగు మాట్లాడతాడు. (ఈ షార్ట్ ఫిల్మ్ అతనికి మొదటి అనుభవం. అతనికి ఈ ఫీల్డ్ ఎంతో నచ్చి మా కెమరామెన్ దగ్గరే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని  ఆ ఫీల్డ్ లో కొనసాగుతున్నాడు!) ఇలా వాళ్ళ పాత్రల మూలాలు మాత్రం తీస్కొని దాని మీద కథ అల్లుకున్నాం. అందుకే వీరే ఈ పాత్రలు చెయ్యడం కరెక్ట్ అనిపించింది. 

కాస్ట్ కుదిరింది. అందరికీ స్క్రిప్ట్ బట్టీ వచ్చే దాకా రిహార్సల్స్ చేసుకున్నాం. ఇది చాలా కష్టమయ్యేది .. అందరికీ టైం ఓ సారి కుదరడం చాలా కష్టమయ్యేది. కానీ సాధించాం. 

అందరూ ఒకరికొకరు తెలిసుండటం వల్ల, అంతకు ముందు పని చేసిన అనుభవం ఉండటం వల్ల, నటులకి అక్క మీద నా మీద గౌరవం ఉండటం వల్ల మా పని బాగా సులువైంది. మేకప్, హెయిర్ డ్రెస్ చెయ్యడానికి వచ్చిన వాళ్ళు "మేడం, మిగిలిన షూటింగ్స్ లో షాట్స్ మధ్య  ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు... వీళ్ళందరూ భలే సఖ్యత గా ఉన్నారు మేడం" అనడం మా నిర్ణయం మీద మాకు ధీమానిచ్చింది. 

బడ్జెట్ కారణాల వల్ల తాపీగా షూటింగ్ చెయ్యడం కుదరదు కాబట్టి 48 గంటల పాటు కేవలం 4-5 గంటల విరామం  (నిద్ర కోసం) తప్ప వరసగా షూటింగ్ చేసాం. ఇందులోనే ఓ పాట షూట్ చేసాం! మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేనేజర్ లాంటివారెవ్వరూ లేరు. డైరెక్షన్ మేమే. క్యాటరింగ్ లాంటివి చూసుకోవడం మేమే. షార్ట్ ఫిలిం లో పిల్లవాడి పంచె అక్కే ఇస్త్రీ చేసింది కూడాను. 

షూటింగ్ లో చాలా సవాళ్లు ... మొదటి షాట్ కి భోరున ఏడుపు మొదలుపెట్టాడు చైల్డ్ ఆర్టిస్ట్. కష్టపడి సవరం పెట్టాక ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందని గుర్తొచ్చి అది తీసి ఓ రెండు గంటల పాటు పెర్మిషన్ పెట్టి వెళ్ళిపోయింది ఓ పాత్రధారిణి. ఇంకో ఫ్రెండ్ మాకు ఒకటిన్నర రోజు కాల్షీట్ ఇచ్చింది... మర్నాడు వాళ్ళ చెల్లి పెళ్లి. ఇలాంటి చాలా ఇబ్బందుల వల్ల స్క్రిప్ట్ లో సెట్ మీదే కొన్ని మార్పులు కూడా చెయ్యాల్సి వచ్చింది. 

మొత్తానికి షూటింగ్ అయిందనిపించాం. 48 గంటలు నిర్విరామంగా పనిచేసినా అక్కకి, నాకూ అస్సలు అలుపు రాలేదు. ఇష్టమైన పని, చేతొచ్చిన పని చేస్తే అలాగే ఉంటుంది కదా! 

ఈ సినిమా కి నిజంగా మాకు కాస్ట్ కుదిరినట్టే టెక్నిషన్స్ కూడా మంచివారు కుదిరారు. ఎడిటర్ మాకు ముందు నుంచి తెలిసిన వారే. కెమెరామెన్ మాకు మా సీనియర్ ఈ సినిమా కోసం పరిచయం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ మొదలవ్వక ముందు అక్కకి నాకు కొంత సంశయం ఉంది ..  చిన్న సినిమా కదా... ఏదో ముక్కున పట్టి చేసి పడేస్తారేమో అని. కానీ సబ్జెక్టు చూసి ఇంప్రెస్ అయ్యారో, హైదరాబాద్ లో ప్రొఫెషనల్స్ అంత బాగున్నారో కానీ .. పెద్ద సినిమా కి చూపించినంత  శ్రద్ధ మా సినిమాకు కూడా చూపించారు. మేము పెద్ద సినిమాల లాబ్స్ లోనే చేయించాం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్. కలర్ కరెక్షన్, సౌండ్, డబ్బింగ్ ... అన్నీ టైం కి చాలా బాగా కుదిరాయి. 

అప్పటికే అక్కా, నేనూ కొన్నేళ్లు గా సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాం . ఆ ప్రయత్నాలు ఫలిస్తే ప్రసాద్స్ ఐమాక్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది అని ఎదురు చూసేవాళ్ళం. ఈ సినిమా ఇంత మంచి టెక్నీకల్ విలువలతో వచ్చే సరికి "ఎందుకు ఎదురుచూడాలి?" అనిపించి ఓ థియేటర్ బుక్ చేసి ఓ షో వేసాం. అదే ఈ రోజు ఏడేళ్ల క్రితం. 

అలా ఐమాక్స్ లో సినిమా వేయాలంటే డివిడి తీసుకెళ్తే సరిపోదు. దాన్ని ఐమాక్స్ లో ప్లే అయ్యే ఫైల్ గా కన్వర్ట్ చేసుకోవాలి. శబ్దాలయ లో 'స్క్రాబుల్' ఆఫీస్ కి వెళ్లి అది చేయించుకున్నాం. రాత్రి ఒంటిగంట కి రమ్మన్నారు. మేముండేది సికింద్రాబాద్ లో. అమ్మని, నాన్నగారిని తీసుకెళ్లాం జూబిలీహిల్స్ కి. వాళ్ళిచ్చిన డ్రైవ్ ని రాత్రే ఐమాక్స్ లో చెక్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఐమాక్స్ కి వెళ్తే థియేటర్ లో కేవలం మేము నలుగురం. సినిమా వేశారు. ఆ సినిమా టైటిల్స్ లో అమ్మ,నాన్నల పెళ్ళి ఫోటోలు ఉంటాయి. అది వాళ్ళకి చెప్పలేదు. surprise గా ఉంచాం. పెద్ద తెర మీద వాళ్ళ ఫోటోలు చూసుకొని ఎంతో ఆనందించారు అమ్మా, నాన్న. మేము వాళ్ళిద్దరికీ ఇవ్వగలిగిన ఆనందాల్లో అదొకటి. 

ఇప్పుడనిపిస్తుంది... మంచి పని చేసాం అలా చేసి అని. డాడ్ పోయారు. మా సినిమా విడుదల  చూడకుండానే. కానీ ఆ షార్ట్ ఫిలిం కొంత వరకైనా ఆ కల నిజం చేసింది. 

ఐమాక్స్ తర్వాత ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా వేసాం. మరికొంత మంది చూడగలిగేలా. అయితే ఈ స్క్రీనింగ్ కి టిక్కెట్లు పెట్టాం. షార్ట్ ఫిలిం చూడటానికి ఎవరు డబ్బిస్తారు అనే భయం ఉన్నా, ఎక్స్పెరిమెంటల్ గా అలా చేసాం. మాకు తెలిసిన వారే ఎక్కువ వచ్చారు. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వలేదు కానీ ఎంతో కొంత వసూలైంది 😆

ఈ చిన్న సినిమా 'బెస్ట్ కామెడీ' అవార్డును గెల్చుకుంది. అదే ప్రసాద్ లాబ్స్ వేదిక పై ఆ అవార్డును అక్కా, నేనూ తీస్కున్నాము. 


ITSFF (ఇంటెర్నేషనల్  తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ కామెడీ అవార్డు అందుకుంటూ అక్కా,నేను 


ఈ అవార్డు తో సరితూగుతూ ఓ రివ్యూ కూడా వచ్చింది... కేవలం ఫేస్బుక్ పరిచయం తో మా మీద ఎంతో అభిమానం చూపిస్తూ జర్నలిస్ట్ అయిన భరద్వాజ రంగావజ్ఝల గారు మా సినిమా గురించి ఇలా రాశారు. 

ఈ రోజు పొద్దున్నే సౌమ్య నిట్టెల మరియు సుష్మ కలసి తీసిన షార్ట్ ఫిలిం పెళ్లివారమండి చూశాను. సినిమా చూడ్డానికి థియేటర్ దగ్గరకు వెళ్లడం దగ్గర నుంచీ సినిమాయే …. కోలాహలమే. తెరమీద కనిపించే సినిమా పన్నెండు నిమిషాల చిల్లరే కానీ థియేటర్ నుంచీ బయటకు వచ్చాక కూడా ఆలోచింపచేస్తుందీ సినిమా.
పింగళి కె.వి.రెడ్డిలు పాండవులు లేకుండా మాయాబజార్ నడిపినట్టు … పెళ్లికూతురు లేకుండా పెళ్లి చూపుల ఘట్టాన్ని తీయడం దర్శకురాళ్ల ప్రతిభ.
ఈ అమ్మాయిలు ఇంతకు ముందే ఆరోహి పేరుతో ఓ వెబ్ సిరీస్ చేశారు. చేస్తూన్నారు. సినిమా పాటకూ సంగీత సాహిత్య పరమైన విలువుంటుందని ఆ రోజుల్లో రచయిత ఎమ్వీఎల్ విపరీతంగా వాదించేవాడు. ఈ అమ్మాయిలు అలా సినిమా పాటలు పాడుతూ వాటిలోని సంగీతపు సొగసులు, సాహిత్యపు సొబగులు చాలా మామూలు పదాలతో హాయిగా చెప్పేస్తూ ఆ పాటలు పాడేస్తూ … ఆ కార్యక్రమం చూస్తుంటే పాటల తోటలో విహరించినట్టే ఉంటుంది.
ఎక్కడా అనవసరమైన ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా హాయిగా ఆహ్లాదంగా సాగిపోతుంది వీళ్ల సాపాసా.
అందుచేతే నేను వాళ్లకి నేను అభిమానిగా మారాను. ఈ అభిమానంతోనే ఆ రోజుల్లో బాపు, విశ్వనాథ్, జంధ్యాల, బాలచందర్, భారతీరాజా, బాలూమహేంద్ర తర్వాత రోజుల్లో మణిరత్నం, శంకర్ ఇలా దర్శకుల పేరు చూసి సినిమాలకు వెళ్లినట్టే … వీళ్ల పెళ్లివారమండీ కి కూడా చాలా ఎర్లీగానే వెళ్లిపోయాను.
అందరూ జీవితం నడిపించినట్టు నడిచేసినవారే. ఎప్పటికి ఏది అనువుగా ఉంటే అది చేసుకుంటూ వెళ్లినవాళ్లే. అయితే ఎక్కడో అంతరాంతరాల్లో ఒక వారసత్వానికి చెందిన వాళ్లమనే ఫీలింగ్ నడుస్తూ ఉంటుంది.
ఒక దళితుడు ఒక బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమించడం… ఆ ప్రేమ ఫలించడం … వాళ్లిద్దరూ పెళ్లాడడం అంటే వాళ్లిద్దరూ ధర్మ భ్రష్టులయ్యారని కాదు. వాళ్ల మనసులు కలిసాయంతే … వారు వారి వారసత్వాల్ని వదిలేసుకోవాలనేం లేదు. ఆవిడ వెజిటూరియన్ గానూ ఉండిపోవచ్చు … లేదూ నాన్ వెజ్ గా మారిపోవచ్చు. అది ఆవిడ ఇష్టం.
ఓ తెలుగావిడ అనుకోకుండా ఓ ఫ్రెంచ్ అబ్బాయిని పెళ్లాడేస్తుంది. అలాగే ఓ తమిళమ్మాయిని ఓ తెలుగు కుర్రాడు పెళ్లాడతాడు. అలాగే ఓ ముస్లిం ను పెళ్లాడేస్తుందో హిందూ అమ్మాయి. వీళ్లందరూ ప్రేమించి పెళ్లాడిన వాళ్లే . ఆ మేరకు సంప్రదాయ బందోబస్తుల్ని దాటెళ్లిన వాళ్లే .
కానీ తమ పిల్లల పెళ్లిళ్ల వ్యవహారినికి వచ్చేసరికి కాస్త ట్రెడిషనల్ గా వెళ్తే బాగుంటుందనే ఆలోచన. ఇందుకోసం కొన్ని అబద్దాలు చెప్పడానికి సైతం ట్రైనింగయిపోతారు. వంద అబద్దాలు చెప్పైనా ఓ పెళ్లి చేయమని ఎవరన్నారోగానీ నిజాల పునాదుల మీదే ఇద్దరు మనుషుల సహజీవనం సజావుగా నడుస్తుంది.
అదే విషయాన్ని ఈ దర్శకురాళ్లూ చెప్తారు మనకి.
పెళ్లి చూపులకు వెళ్లేప్పుడు పెళ్లికొడుకు తల్లి కాస్త నెర్వస్ గా ఉంటుంది. బొట్టును పదే పదే చాలా జాగ్రత్తగా దిద్దుకుంటూ ఉంటుంది. అసలెందుకు వచ్చిన గొడవరా … ఇదంతా హాయిగా ప్రేమించి పెళ్లాడేస్తే ఏ గొడవా ఉండదు కదా అంటూంటుంది. ఆ బొట్టు సీన్ సింబాలిక్ గా తీశారు. ఇక ట్రెడిషనల్ గా పెళ్లి చూపులు అనుకున్నాక వీళ్లూ ఓ పెయిడ్ పేరంటాలిని తీసుకొస్తారు.
ఎవరికి వారు తాము చాలా ట్రెడిషనల్ అన్నట్టుగా తాము చాలా బాషాభిమానులమన్నట్టుగా … సంస్కృతి పట్ల మమకారం ఉన్నవాళ్లుగా కనిపించాలనే తాపత్రయం అడ్డగోలుగా ప్రదర్శిస్తారు. ఫైనల్ గా ఎవరి ఐడెంటినీ వాళ్లు చాటేసుకుంటారు. నిజానికి సినిమా ప్రారంభం నుంచీ రెండు కుటుంబాల ఆడవాళ్లూ ఈ అబద్దాల వ్యవహారం పట్ల చాలా నెర్వస్ అవుతూ ఉంటారు.
అలా వీళ్లందరూ నిజమైన తెలుగువారు. నిజంగానే వీళ్లు ట్రెడిషన్ ను ప్రేమించేవాళ్లు. వీళ్లందరూ ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నా … హాయిగా ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నవారే. ఎక్కడో చిన్న గిల్టీ అలా క్యారీ అవుతూంటుంది. ఈ వ్యవహారాన్నంతా పావుగంటలో చెప్పగలగడం దర్శకురాళ్ల టాలెంటు. వీరికి నటీనటులందరూ చాలా బాగా సహకరించారు.
థిల్లానా నృత్యం ఆకట్టుకుంటుంది. చాలా బాగా అభినయించారు కూడా. మదన కదన కుతూహలుడు అంటూ బాలమురళి గాత్రంలో విన్న థిల్లానా వేరొకరి స్వరంలో అయినప్పటికీ బానే ఉంది.
వాస్తవాల్లోకి వచ్చేశాక … ఈ విషయం కొంచెం మన భర్తలకు కన్వే చేద్దామనుకోవడం … ఇక్కడా పెళ్లికూతురు లాగానే ఈ భర్తల పాత్రలనీ డైలాగుకే పరిమితం చేయడం బాగుంది.
ఇలాంటి జోకులు చాలానే ఉన్నాయి. అసలు టైటిల్స్ లోనే మన వివాహ అవస్థకి అనడం …. వీళ్లు మామూలోళ్లు కాదని అర్ధమైపోతుంది.
ఇదే కథను మా రోజుల్లో అయితే మా దాసరి నారాయణరావు రెండున్నర గంటల సినిమా హాయిగా తీసేవారు.

ఓ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎన్నో అసంతృప్తులు ఉంటాయి. ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి. ఇదే సినిమా యూట్యూబ్ లో ఎక్కించి ఇన్నేళ్ళవుతున్నా ఐదంకెల వ్యూస్ ఏమీ లేవు. ఇందులో మేము రాసుకున్న కథ మా బెస్ట్ ఏమీ కాదు. అసలు రాసుకున్న స్క్రిప్ట్ పూర్తిగా తియ్యలేకపోయాం. మేము గౌరవమిచ్చే ఒక సీనియర్ రచయిత కి ఈ సినిమా అస్సలు నచ్చలేదు. (సున్నితంగానే చెప్పారు ఆ విషయం). 

అయినా ఊహించని ఎన్నో గిఫ్ట్స్ ని ఇచ్చింది ఈ సినిమా. ఎడిటింగ్ స్టూడియో నుంచే కాంప్లిమెంట్లు మొదలవడం మాలాంటి బిగినర్స్ కి చాలా ఊతం ఇచ్చింది. అందరూ చూసేది ఓ పావుగంట చిత్రాన్ని. దాని వెనక ఎన్నో చిత్రాలు చూపించింది ఈ ప్రాసెస్ మాకు! 

ఇంతా చెప్పి సినిమా కి లింక్ ఇవ్వకపోతే ఎలా? 

ఇదిగోండి https://www.youtube.com/watch?v=VF5U61ANQ5s&t=1s

ఇంత రాసాను కాబట్టి ఈ సినిమా చూడాలని గానీ, నచ్చాలని గానీ మొహమాటం పెట్టుకోవద్దని నా మనవి. 😊


లేబుళ్లు: , , , , , , ,