18, మే 2025, ఆదివారం

'ప్రియమైన ఆవార్ గీ' - బహుమతి పొందిన నా కథ

ఉదయిని అనే ఆన్లైన్ సాహిత్య పత్రిక వారు ఉగాది కి కథల పోటీ నిర్వహిస్తే అందులో పాల్గొన్నాను. 

ఎన్నాళ్ళ నుంచో నాకిష్టమైన పాటలు వింటున్నప్పుడల్లా వాటికో ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉండేది. అలా పుట్టిందే 'ప్రియమైన ఆవార్ గీ'.  

ఈ కథ రాయడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది. ఇప్పటి దాకా రాసిన కథల తో పోలిస్తే. కథా శిల్పం తో నేనొక రకంగా ఇందులో experiment చేసాను అని చెప్పచ్చు. మామూలు కథ లాగ కాక ఓ ఘజల్ పల్లవి చరణాల తో దీన్ని అల్లడం జరిగింది. ఘజల్ ని, కథని కలిపి చేసిన ఈ ప్రయత్నం  నాకు సంతృప్తినిచ్చింది అనే చెప్పాలి (పొగరు అనుకోకపోతే). 

250 పై చిలుకు కథలు వచ్చాయట. వాటిలో బహుమతి పొందిన ఒక కథ గా ఎంపిక అవ్వడం నిజంగా ఆనందాన్నిచ్చింది. ఈ పోటీ లో గెలిచిన కథలని పక్షానికి కొన్ని చొప్పున పబ్లిష్ చేస్తున్నారు. నేను ఇప్పటి వరకూ చదివిన కథల్లో ఝాన్సీ పాపుదేశి గారి 'మన్నుబోసే కాలం', అయోధ్య రెడ్డి గారి 'రెండు స్వప్నాల నడుమ గోడ' కథలు నాకు చాలా బాగా నచ్చాయి. మొదటి బహుమతి పొందిన కథ నా సెన్సిబిలిటీస్ కి అందలేదేమో అనుకుంటున్నాను. 

ఈ కథ ప్రచురించి ఇప్పటికి రెండు మూడు రోజులైంది. బ్లాగు లో షేర్ చెయ్యడానికి ఇప్పుడు కుదిరింది. 


 

కథ కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు https://udayini.com/2025/05/15/priyamaina-avargi/

కొన్ని మంచి కామెంట్స్ వచ్చాయి... కథ చదివే వారికి రీచ్ అయ్యినప్పుడు కలిగే ఆనందం బహుమతి పొందిన ఆనందానికి బోనస్ కదా! 

వాడ్రేవు చినవీరభద్రుడు గారు చదివి ఇలా రాశారు "చాలా చక్కగా రాశారు. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సిస్టమేటిగ్గా చెప్పుకొచ్చారు. ఒక కవితలో లాగా ప్రతిసారి తిరిగి మళ్ళా ఆ పల్లవిని చేరుకుంటూ ఉన్నట్టు ఆ పాట దగ్గరకి తీసుకు వెళ్తూ వచ్చారు. నిజానికి ఇది కథ కాదు. కవిత కాదు. ఈనాటి సమాజంలో, ఈనాటి పరిస్థితుల్లో ఒక సున్నిత మనస్కురాలి హృదయ విశ్లేషణ. అయితే ఆమెకి ఆమె తండ్రి అలా ఉండి ఉండకపోయినా, ఆ తండ్రి ఆమె పట్ల మరింత ప్రేమగా ఉన్నా కూడా ఆమె అనుభవాలు ఆ విధంగానే ఉండి ఉండేవి. ఎందుకంటే అప్పుడు తన తండ్రి కన్నా మించిన ప్రేమ ఎవరు చూపిస్తారు అని ఆలోచించేదేమో. నిజానికి ఇది తల్లిదండ్రుల నీడ పడే అమ్మాయి కథ కాదు. వ్యక్తిత్వం, సౌకుమార్యం ఉన్నటువంటి ఏ భావుకురాలి ఆలోచనలైనా ఇలాగే ఉంటాయి.
కథలు రాస్తూ ఉండండి."

ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అయిన మృణాళిని గారు "Very unusual narration. impressive. enjoyed thoroughly. for anyone who is familiar with the song, the story gives beautiful moments" అని ప్రోత్సాహం అందించారు.

వెబ్ సైట్ లోనే కథ కింద ఓ మంచి కామెంట్ పెట్టారు

ఫేస్బుక్ మిత్రులు కూడా మంచి కామెంట్స్ తో ఆదరించారు.

Very Grateful.

ఇక నా బ్లాగు బాంధవుల స్పందన కోసం ఎదురుచూస్తుంటాను. 😊

లేబుళ్లు: , , , , ,

30, జూన్ 2022, గురువారం

మూడు పాటల కథ

అనగనగా నేను. 

ఘజళ్ళ పిచ్చి దాన్ని. 

నాకు జరిగిన కథే ఇది. 

ఎన్నో మలుపులు, మిస్టరీ, నవలల్లో లాగా సంఘటనలు వెంటవెంటనే అవ్వకుండా ... మధ్యలో కొన్ని సంవత్సరాల గాప్ .... ఊహాతీతంగా, థ్రిల్ కలిగించిన కథ ఇది. 

పైన వర్ణించిన అనుభూతులన్నీ మీకు కూడా కలగుతాయి ఈ కథ మీరు చదివితే. మీరు సంగీత ప్రియులవ్వాలి అంతే. 

కథా క్రమం లో ముందుగా 2007-2008 ప్రాంతం ... 

మా అక్క సుష్మ వరల్డ్ స్పేస్ రేడియో లో రేడియో జాకీ, ప్రోగ్రాం డైరెక్టర్ (అసిస్టెంట్) గా చేస్తూ ఉండేది. 

లలిత సంగీత సామ్రాట్ చిత్తరంజన్ గారు ఆ రేడియో కి ఓ సంగీత పరమైన షో చేసేవారు. 

నేను అక్కడ పని చెయ్యకపోయినా మా అక్క ని పికప్ చేసుకోడానికి వెళ్లేదాన్ని. రచయిత్రి మృణాళిని గారు అప్పుడు అక్కడ ప్రోగ్రాం డైరెక్టర్. మా మధ్య చాలా సాహితీ, సంగీత చర్చలు జరుగుతూ ఉండేవి. 

ఒక సారి నేను వెళ్ళినప్పుడు చిత్తరంజన్ గారు వచ్చి ఉన్నారు. ఆయన ఓ తెలుగు సినిమా పాట  కి ఒరిజినల్ ఓ ఘజల్ అని ... ఆ ఘజల్ గుర్తు రావట్లేదు అని అన్నారు. నా ఘజళ్ళ పిచ్చి తెలిసిన మృణాళిని గారు ... ఇదిగో ఈ అమ్మాయి ని అడుగుదాం అన్నారు. 

ఆయన తెలుగు పాట పాడారు. అది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫేవరేట్ పాట! మా అమ్మ గారు చిన్నప్పుడే ఆ పాటని పరిచయం చేశారు మాకు. (ఇంకొంత సేపట్లో ఆ పాటేంటో చెప్తా). 

కానీ దానికి ఓ ఒరిజినల్ ఉంది అని నాకు తెలియదు. అప్పటి వరకూ నేను విన్న ఘజళ్ళ లో ఆ పాటకి దగ్గరగా వచ్చినవేవి నేను వినలేదు. అప్పటికీ అదే రాగం లో ఏమైనా ఉన్నాయా అని దగ్గర రాగం లో ఒకటి రెండు పాడితే ... 'ఇవి దగ్గరగా ఉన్నాయి కానీ అది అచ్చం అలాగే ఉంటుంది' అన్నారు. 

చివరికి ఆయనకే గుర్తొచ్చింది. వెంటనే యూట్యూబ్ లో కి వెళ్లి ఆ ఒరిజినల్ ఘజల్ విని నోరెళ్ళబెట్టేసాం ... మధ్య లో స్వరాలతో సహా అదే ఘజల్! 

ఇంతకీ ఆ తెలుగు పాట ... మంచు పల్లకీ లో మేఘమా దేహమా




దాని ఒరిజినల్ జగ్జీత్ సింగ్ గారి 'తుమ్ నహీ ఘం నహీ' 




లింక్స్ ఇస్తున్నాను ... ఎంజాయ్ చేయండి వాటి సారూప్యాన్ని! 

ఇక్కడి తో కథ అయిపోయిందనుకున్నాను నేను. కానీ ఇది ఇంటర్వెల్ మాత్రమే అని అప్పట్లో నాకు తెలియదు. 

నేను ఒరిజినల్ విని ఉన్నదాన్ని ఉన్నట్టుండక ... ఇది టిపికల్ జగ్జీత్ సింగ్ ఘజల్ లా లేదేంటి ... గులాం అలీ గారు పాడితే ఇంటర్నెట్ లో కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటున ఆయన బొమ్మ తో వీడియో ఎక్కించేసారా అని అనుమాన పడ్డాను. 

ఈ అనుమానానికి కొంత బాక్గ్రౌండ్ వివరించాలి. లేకపోతే నేను కొన్ని వర్గాల ఫాన్స్ మనోభావాల్ని కించపరిచిన దాన్నవుతాను. 

2007/2008 లో ఇంకా గూగుల్ ఇంత వికసించలేదు. చాలా పాటలకి సెర్చ్ రిజల్ట్స్ వచ్చేవే కావు అసలు. చాలా పాటలు తప్పుడు సమాచారం తో ఎక్కించేసేవారు. కామెంట్ పెట్టినా రెస్పాన్స్ ఉండేది కాదు. సోషల్ మీడియా కమ్యూనిటీ లు ఇంత ఆక్టివ్ గా లేరు. ఇది మొదటి వివరణ. 

నాకు ఘజళ్ళు నచ్చడం మొదలవ్వగానే నేను మొదట అభిమానించి ఫాలో అయిపోయిన గాయకులూ జగ్జీత్ సింగ్ గారు. ఆయన గాత్రం, గమకం, బాణీలు.. అన్నీ నాకు చాలా నచ్చేవి .  సో నేను కూడా ఫ్యాన్ నే. అందువల్లే ఆయన ఘజళ్ళు ఎలా ఉంటాయో బాగా తెలుసు. సామాన్యులకి ఘజల్ ని చేరువ చేసిన వారు జగ్జీత్. ఇది అందరూ ఒప్పుకుంటారు. 

అలాగ నేను గులాం అలీ ఫాన్ ని కూడా. ఆయన శైలి ... హిందుస్తానీ సంగీతానికి ఒక్క సెంటీమీటర్ దూరం లో ఉంటుంది. ఆయన కచేరీల్లో చెప్తారు కూడా. నేను బడే గులాం అలీ సాబ్ దగ్గర హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. నా ఘజళ్ళ  లో ఆ చిక్కని సంగీతాన్ని తెస్తూ ఉంటాను .. కానీ నాకే బోర్ కొట్టేలా సాగదీత ల తో కాక ... ఆడుతూ పాడుతూ స్వరాలతో, చమక్కుల తో ఉండేలా చూస్కుంటా అని. 

ఒకరి సంగీతం జలపాతం కింద నుంచున్నట్టు ఉంటుంది. చల్ల దనం తో పాటు ఉద్ధృతి కూడా ఉంటుంది. మరొకరిది సెలయేటి ఒడ్డున కూర్చున్నట్టు ఉంటుంది. హాయైన ప్రశాంతత. 

ఇదే తేడా. 

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జగ్జీత్ సింగ్ గారు స్వయంగా గులాం అలీ గారి ఫ్యాన్. ఆయన భారత దేశం లో కచ్చేరి ఇచ్చినప్పుడల్లా మొదటి వరస లో జగ్జీత్ సింగ్ గారు కూర్చొని ఉండేవారట! 

వారి ఆత్మీయ సంబంధానికి నా దగ్గర కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. 










(ఒక్క అనుమానానికి ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది.... మరి అనుమానించింది ఇద్దరు గొప్ప కళాకారుల్ని కదా!)

ఆవేశం ఆపుకోలేక నేను ఆ వీడియో పైన అప్పట్లో కామెంట్ పెట్టేసాను. ఇది గులాం అలీ గారిదేమో .. మీరు పొరబడుతున్నారేమో అని. ఆ కామెంట్ కి చాలా ఘాటైన విమర్శలు వచ్చాయి. నా పేరు గూగుల్ చేస్తే అప్పట్లో ఆ కామెంటే కనిపించేది. మా అక్క 'ఎందుకొచ్సిన గొడవ... తీసేయ్' అంది. నేను డిలీట్ చేసేసాను. 

ఆ తర్వాత గూగుల్ వికసించాక ఆ ఘజల్ ముమ్మాటికీ జగ్జీత్ సింగ్ గారిదే అని రూఢి అయింది. నేను నా ఇన్స్టింక్ట్స్ నోరు మూయించి కూర్చోపెట్టేసాను. 

కట్ టు 

2021 సంవత్సరం 

ఇప్పటికీ ఇద్దరికీ ఫ్యాన్ నే ... ఘజళ్ళ పిచ్చి కూడా అలాగే ఉంది ... జగ్జీత్ సింగ్ గారే లేరు. (నేను చాలా ఏడ్చాను ... అది వేరే సంగతి) గులాం అలీ గారు అన్నారట ... 'మొదటి వరస లో నువ్వు లేని లోటు తెలుస్తూ ఉంటుంది ఇంక నాకు' అని.  

ఇన్స్టా గ్రామ్ లో నేను చేరి గులాం అలీ, జగ్జీత్ సింగ్ గార్ల హాష్ టాగ్ ఫాలో అవుతున్నాను. 

ఒక రోజు ... ఈ ఘజల్ వీడియో కనిపించింది. 

దర్ద్ ఏ దిల్ దర్ద్ ఏ ఆష్నా జానే






ఏ కొద్దిపాటి సంగీతం తెలిసిన వారికైనా తెలిసిపోతుంది ... ఇది 'తుం నహీ' ని ముమ్మూర్తులా పోలి ఉంటుంది అని. 

తేడా ఏమయినా ఉంటే అది శైలి లోనే. గులాం అలీ గారు తన స్టైల్ లో ... చకితుల్ని చేసే  గమకాల తో, ఊహించని సంగతులతో ఈ ఘజల్ ని నింపేస్తే .... జగ్జీత్ సింగ్ గారు ... నెమ్మదైన నడక తో సాగేలా చేశారు. 

ఇద్దరూ ఎంచుకున్న సాహిత్యం కూడా వేరు. 

గులాం అలీ గారిది బహదూర్ షా జఫర్ సాహిత్యం 

జగ్జీత్ గారిది సయీద్ రాహీ గారి షాయరీ 

ఇది వినగానే ముందు నాకు మాటల్లేవు 

నాకు కలిగిన ఆలోచనలు/అనుభూతులు ఒక లిస్ట్ గా రాస్తే... 

1. రెండే ఉన్నాయనుకున్న అపురూపమైన వజ్రాలు ..  ఇంకోటి ఉందని తెలిస్తే కలిగే థ్రిల్! 

2. నా మ్యూజిక్ ఇన్స్టింక్ట్స్ అనండి .... ఎప్పుడూ కలిసి మాట్లాడని వారితో .. వారి  కళ తో నాకున్న అభిమానపు బంధం అనండి ... ఎవరి సంగీతం ఎలా ఉంటుందో  తెలిసిన ఆర్టిస్టిక్ ఇంటిమసీ అనండి ... ఏమైనా అనండి ...  నాకు అప్పుడు అనిపించింది నిజమే! ఇంత నిలకడ మీద తెలుస్తుంది అని నాకప్పుడు తెలీదు .. కానీ భలే ఫీలింగ్ కలిగింది!

3. రాజన్ నాగేంద్ర గారిది జగ్జీత్ సింగ్ గారి ఘజల్ నుంచి తీసుకున్న పాట అని తెలుసు. కానీ జగ్జీత్, గులాం అలీ లలో మొదట ఈ బాణీ కట్టింది ఎవరు? నా బెట్  అయితే గులాం అలీ గారే మొదట ఈ పాట కట్టారు అని. ఘజళ్ళు లైవ్ కచ్చేరిల్లో ఎక్కువ పాడతారు. అవే ఆల్బమ్స్ గా వస్తాయి. కచేరీ తారీఖు కి, ఆల్బమ్ రిలీజ్ కి సంబంధం ఉండదు. అందుకని మొదట ఎవరు పాడారో నేనైతే రుజువు చెయ్యలేను. కానీ జగ్జీత్ సింగ్ గారికి గులాం అలీ గారంటే ఉన్న గురు భావన వల్ల  ఈ బాణీ ని తనదైన శైలి లో కి తెచ్చుకొని పాడారు అంటే ఆశ్చర్యంగా అయితే లేదు. కానీ ఆ కథ తెలుసుకోవాలని మాత్రం ఉంది ... ఎప్పుడైనా చిత్రా జగ్జీత్ సింగ్ గారిని కలిసే అవకాశం వస్తే నేను ఖచ్చితంగా అడుగుతాను. 

4. ఇలా ఇంకేమైనా ఉన్నాయా? నా ఇద్దరు ఆరాధ్య గాయకుల బాణీల్లో ఇలాంటి ఇచ్చిపుచ్చుకోడాలు ఇంకేమైనా జరిగాయా? 

5. ఒక బాణీ ... కేవలం ఒక ట్యూన్ .... ఇంత మందిని కదిలించింది ... ఒకరు పాడితే ... ఇదే నేను పాడితే ఎలా ఉంటుంది ఇంకొకరు. వారి పాట విని ... మా సినిమా కి కరెక్ట్ గా ఉంటుంది అని మరొకరు ... ఇవేమీ తెలియని మనం .. తెలుగు పదాల్లో కూడా ఎంతో చక్కగా అల్లుకుపోయిన ఆ మెలోడీ ని వింటూ మైమరిచిపోవడం ... ఎవరన్నారు పాటలు జీవం లేనివని ... వాటికి కూడా ఓ డెస్టినీ, ఓ జర్నీ ఉంటాయి .. 

ఈ పాట .. నది లా .. ఒక చోట మొదలై ప్రవహిస్తూ మన తెలుగు వారి దాకా చేరుకుంది చూడండి... 

ఈ పాట జర్నీ లో నన్ను సాక్షి ని చేసుకున్నందుకు నాకు ఎవరికి  ధన్యవాదాలు చెప్పుకోవాలో అర్ధం కావట్లేదు. 

ఎప్పుడైనా డబ్బుల్లేనప్పుడు, ఒంట్లో బాలేనప్పుడు, చికాగ్గా ఉన్నప్పుడు 'నా లైఫ్ ఏంట్రా బాబు .. ఏం బాలేదు' అనిపిస్తుంది. 

కానీ ఇలాంటివి జరిగినప్పుడు 'ఐ లవ్ మై లైఫ్' అనిపిస్తుంది. 

ఏదో ఎమోషనల్ గా ఈ కథ చెప్పేసాను. 

ఇప్పుడు ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు ... 

నా కంటే వీర ఫాన్స్ ఉన్నారు నేను పైన చెప్పిన కళాకారులకి. ఎక్కడైనా వారికి నా ఈ పోస్ట్ అంత రుచించక పోయి ఉన్నట్టయితే క్షమించండి.  మన అభిమాన కళాకారుడంటే కొంత పొసెసివ్ నెస్ సహజం. మీరు వారిని చూసినట్టు నేను చూడక పోవచ్చు. Let's agree to disagree :) 

ఇంకొక ముఖ్య విషయం ... స్వయంగా మంచి విద్వత్తు ఉన్న రాజన్ నాగేంద్ర గార్లు కానీ, జగ్జిత్ సింగ్ గారు కానీ, లేదా గులాం అలీ గారు కానీ ... ఒక బాణీ నచ్చినప్పుడు ... భేషజాలు లేకుండా కేవలం ఆ బాణీ ని ప్రేమించి దాన్ని అనుభూతి చెందాలనుకొని ఇలా చేస్తారు కానీ పామర భాష లో 'కాపీ' అనే మాట అంటే నేను అస్సలు ఒప్పుకోను. అందుకే ఈ మాట నేను ఎక్కడా వాడలేదు కూడా. వారెవ్వరికీ ఆ అవసరం లేదు అని నా గట్టి నమ్మకం. 

ఇదండీ మూడు పాటల కథ. 

మొదట నేను దర్ద్ ఏ దిల్ ఘజల్ విన్నప్పుడు నేను ఇంట్లో ఎవరితో మాట్లాడట్లేదు ... యేవో గొడవలు పడుతున్నాను. 

ఈ విషయం చెప్పలేక... ఎవరితో షేర్ చేసుకోలేక ... ఇన్ని రోజులు నాలోనే పెట్టేసుకున్నాను. ఇప్పుడు చెప్పాక చాలా హాయిగా, తేలిక గా, ప్రశాంతంగా ఉంది.... ఈ పాట లాగే! 



లేబుళ్లు: , , , ,

3, ఆగస్టు 2018, శుక్రవారం

నేను రాసిన ఓ ఉర్దూ ఘజల్

నాకు ఘజల్స్ అంటే చాలా ఇష్టం.  

నాకు సంగీతం ఎంత ఇష్టమో సాహిత్యం అంత ఇష్టం ... అందుకే ఈ ప్రక్రియ అంటే అంత అనుబంధం ఏర్పడింది. 

మొహసిన్ నఖ్వీ , గాలిబ్, నాసిర్ కాజ్మి ఇలాంటి ఉర్దూ కవులు రాసిన పదాలకి ... జగ్జీత్ సింగ్, గులాం అలీ, మెహదీ హాసన్ వంటి వారి స్వరాలు, గళాలు తోడైనప్పుడు ఒక అందమైన ఘజల్ పుడుతుంది 

(ఈ కింది ఘజల్స్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ కి వెళ్ళచ్చు )

దిల్ ధడక్ నే కా సబబ్ యాద్ ఆయా .. 
వొ తేరి యాద్ థీ .. అబ్ యాద్ ఆయా 

రంజిష్ హీ సహీ ... దిల్ హీ దుఖానే కేలియే ఆ ... ఆ ఫిర్ సే ముఝే ఛోడ్ కే జానే కేలియే ఆ .

తుమ్ నహీ ... ఘమ్ నహీ .. షరాబ్ నహీ ... ఏసి తన్ హాయి కా జవాబ్ నహీ ... 


వివిధ భారతి లో అప్పుడప్పుడూ ఘజల్స్ వినిపిస్తూ ఉంటారు ..  అలా surprise గా దొరికిన ఒక rare ఘజల్ .. రూపా గాంగూలి పాడిన 'తేరే కరీబ్ ఆకే .. బడీ ఉల్ఝనో( మే హూ .. మే దుష్మనో మే హూ కే తేరే దోస్తో మే హూ' అనే ఘజల్! 

ఘజల్ అంటే చేతిలో మందు సీసా ఉండాల్సిందే అంటే నేను ఒప్పుకోను 

ఘజలే ఒక మందు సీసా 😉😉

అన్ని ఘజల్స్ విరహం, రాతి గుండె ప్రేయసి, ఒంటరి తనం, మోస పోవటం .. ఇలాంటి వాటి చుట్టూనే ఉండవు .. కొన్ని కొన్ని సమాజం పోకడల్ని సున్నితంగా గుచ్చుతాయి .. కొన్ని జీవితం లోని అందాన్ని ఆస్వాదించమంటాయి .. కొన్ని 'నీకేమిటోయ్ .. నువ్వు గొప్పవాడివి' అని కూడా motivate చేస్తాయి. 

ఘజల్స్ లో ఉపమానాలు, అతిశయోక్తులు, ప్రాసలు ... భలే ఉంటాయి 

ఇంక నా ఘజల్ విషయానికి వస్తే ... ఇది ఈ మధ్యే రాసాను 

ప్రేమ లో స్వార్ధం ఉండదు .. త్యాగం తప్ప అంటారు కదా .. 

కానీ త్యాగం చేసే ముందు .. ఒక stage ఉంటుంది .. ప్రేమ లో. 

ఎందుకు ఆ ప్రేమ నా సొంతం కాకూడదు? ఏ? నేనేం తక్కువ? అని అడిగే ego hurt అయిన ప్రేమ అది. 

ఇంకా త్యాగం చేసేంత పరిణితి రాని ప్రేమ అది 

ఇంకా ఆశలు వదులుకొని ప్రేమ అది  

అలాంటి ప్రేమ గురించి ఉంటుంది నా ఈ ఘజల్ - 'అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై'   


Urdu Ghazal in Telugu text: 

అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  

అభీ యే నహీ కహా జాతా కె ... జావ్ ఖుష్ రహో 
అభీ యే నహీ సహా జాతా కె .. జాకే తుమ్ ఖుష్ రహో 
అభీ దిల్ - ఏ - నా(దా ( కో  సంఝానా హై 
కె కుర్బానీ మొహబ్బత్ కా ఫర్జ్ హై 

అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  

 బొహత్ సారీ ఖుషియా( దీ హై తూనే ముఝే ... బొహత్ సారె ఘమ్ భీ 
మైనే తుఝే ఓర్ తూనే ముఝే సంఝా ... కుచ్ జ్యాదా భీ కుచ్ కమ్ భీ 
యాదో ( కా వాదో ( కా బాతో ( కా రాతో ( కా 
తుఝే చుకానే కర్జ్ హై 

అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  

కుచ్ మొహబ్బతే( హారే హువే .. జిన్ పే లాచారీ కా కఫన్ హై 
కుచ్ మొహబ్బతే( ఐసి భీ... జో సంగె మర్ మర్ మే దఫన్ హై 
ఇష్క్ కె అబ్ర్ కో సబ్ర్ కా హవా దేనా 
కుచ్ హీ మొహబ్బతో ( కా తర్జ్ హై 

అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  

నిభాకే దేఖా భులాకే భీ ... పాస్ రెహ్కే దేఖా దూర్ జాకే భీ 
సెహ్ కె దేఖా కెహ్ కె భీ ... తైర్ కె దేఖా బెహ్ కె భీ 
యే ఇష్క్ భీ కైసా 
బిన్ దవా -ఎ - మర్జ్ హై 

అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  

యే ఇష్క్ ముఝే నహి ( ఛోడ్తా ... మేఁ తుఝే నహి ( ఛోడ్తా
తుమ్ భీ కహా కమ్ హో ... తూ భీ తో జిద్ నహి( ఛోడ్తా
తుమ్ మేఁ ఔర్ ప్యార్ .... సబ్కో అప్నే ఆప్ సే గర్జ్ హై 

తభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై  

English Text: 

Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai

Abhi ye nahin kahaa jaatha ke 'jaao, khush raho'
Abhi ye nahin sahaa jaatha ke jaake tum khush raho 
Abhi dil-e-naadaa ko samjhaanaa hai
Ke qurbani mohabbat ka farz hai 

Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai

Bahut saari khushiyaa dee hain tumne mujhe
Bahut saare ghum bhi
Maine tujhe aur tune mujhe samjhaa
Kuch zyaada bhi aur kuch kam bhi 
Yaadon kaa.. vaadon kaa.. baathon kaa... raathon kaa.. 
Tumhe chukaane karz hai

Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai

Kuch mohabbatein haare huey... jinpe laachaari ka kaphan hai
Kuch mohabbatein aisi bhi ... jo sang-e-marmar main daphan hai
Ishq ke abr ko sabr kaa hawaa denaa
Kuch hi mohabbathon ka tarz hai

Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai

Nibhaake dekha bhulaake bhi... paas rehke dekha door jaake bhi
Sehke dekha kehke bhi... thair ke dekha behke bhi 
Ye ishq bhi kaisa bin-dawa-e-marz hai

Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai

Ye ishq mujhe nahin chodtha .. main tujhe nahin chodtha
Tu bhi kaha kam ho... tu bhi tho zidd nahin chodtha
Tum, main aur pyaar... sab ko apne aap se garz hain

Tabhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai


Telugu translation: 

ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే 
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే

'వెళ్ళు .. ఆనందంగా ఉండు' అని ఇంకా అనలేను 
నువ్వు వెళ్ళి ఆనందంగా ఉంటే తట్టుకోలేను 
ఇంకా ఈ అమాయకమైన మనసు కి చెప్పాలి 
త్యాగం చేయడమే ప్రేమ కర్తవ్యం అని 

ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే 
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే

చాలా ఆనందాలని ఇచ్చావు నువ్వు నాకు ... చాలా బాధల్ని కూడా 
నువ్వు నన్ను .. నేను నిన్ను అర్ధం చేసుకున్నాం ... కొద్దో గొప్పో 
జ్ఞాపకాల, ప్రమాణాల, మాటల, రాత్రుల 
ఋణం ఇంకా తీర్చుకోవాలి నువ్వు 

ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే 
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే

కొన్ని ప్రేమలు ఓడి పోయి శవాల్లా పడున్నాయి 
కొన్ని ప్రేమలు పాల రాతిలో పూడ్చబడి ఉన్నాయి 
ప్రేమ అనే మేఘానికి ఓర్పు అనే గాలి ని జత చేయడం 
కొన్ని ప్రేమలకే చెల్లిందేమో 

ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే 
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే

నిభాయించి చూసా మర్చిపోయి చూసా .. నీ తో ఉంది చూసా నీకు దూరం వెళ్లి చూసా 
భరించి చూసా .. వచించి చూసా ... ఎదురీది చూసా .. తేలి కూడా  
ఈ ప్రేమ ఎంతైనా 
మందులేని జబ్బు కదా 

ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే 
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే

ఈ ప్రేమ నన్ను విడువదు ... నేను నిన్ను వదలను 
నువ్వు కూడా తక్కువ కాదు కదా .. నువ్వు పట్టు విడువవు 
నువ్వు, నేను, ప్రేమ .. 
మన ముగ్గురం ముగ్గురమే 

అందుకే.. .  

ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే 
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే

లేబుళ్లు: , , , , , , , , , , ,