22, జూన్ 2022, బుధవారం

సెలవు చీటీ.. రెండేళ్లు లేటు గా

 రెండేళ్లు 

2020 జులై నాలుగో తారీఖు న అమెరికా మీద బ్లాగు రాసినప్పుడు నేను ఊహించలేదు ..  ఇంత పెద్ద గాప్ వస్తుంది అని. దీని వెనక అమెరికా కుట్ర కూడా ఉండి ఉండవచ్చు 

ఎందుకు రాయలేదు అని అడిగితే ... నిజమే చెప్తాను. అది కొంత వ్యక్తిగతమైనా. 

ప్రొఫెషనల్ గా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చిందండి. ప్రశాంతంగా రాసే మానసిక స్థితి లేదు. 

నా పని సినిమా. నేను అష్టా చెమ్మా, మిథునం సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి అవార్డులు అందుకున్నాను. రైటర్ డైరెక్టర్ గా మూడు సార్లు సినిమా సైన్ చేసాను కానీ అవి ముందుకు కదల్లేదు. ఈ లోపు కరోనా. చాలా నిరాశలోకి వెళ్ళిపోయాను. 

ఇప్పుడు రాయడం మొదలు పెడుతున్నాను అంటే సినిమా సైన్ చేసేసాను అని కాదు. పరిస్థితి ని accept చేసాను అని. 

ఆ మధ్య నలభయ్యో పుట్టిన రోజు జరుపుకున్నాను. కొంత పరిపక్వత వచ్చి పడిపోయింది. జీవితం లో దేని దారి దానిదే అనిపించింది. 

ఈ బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు నాకేం కావాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక ఆలోచన వచ్చింది.. ఫ్రీ ప్లాట్ఫారం ఉంది కదా అని రాసేసాను. అలా 48 వారాలు రాసాను. 

తెలుగు బ్లాగింగ్ కమ్యూనిటీ ఇంత బాగుంది అని అప్పుడు నాకు తెలియదు. మాలిక లాంటి బ్లాగ్ అగ్గ్రిగేటర్స్ ఉండటం వల్ల  నా బ్లాగ్ తొందరగా ఎక్కువ మందిని, సరైన వారిని రీచ్ అయింది అని నా అభిప్రాయం. కామెంట్స్ లో కూడా ప్రోత్సాహకరమైన స్పందనే లభించింది నాకెప్పుడూ... అది ఒప్పుకొని తీరాలి. 

ఒక సాహితీ సభ కి వెళ్తే ఒక పిల్లవాడు కర్ణాటక సంగీత కచేరీ చేస్తున్నాడు ముచ్చట గా ... అతన్ని కచేరీ తర్వాత కలిసి ఫోటో తీయించుకుంటుండగా వాళ్ళ అమ్మ గారు "మీరు సౌమ్యవాదం సౌమ్య గారా ... మీ ఆనందాల జాడీ మేము చదివి చాలా ఆనందించామండి" అనడం నా బ్లాగ్ జర్నీ లో చాలా ఆనందకరమైన ఘట్టం గా అనుకున్నాను! 

ఇక్కడ అందరూ రాసే కామెంట్స్ కూడా. బ్లాగ్ రాసినప్పుడు సరే... రాయనప్పుడు కూడా రాయమని ప్రేరేపించే వారు ఎంత మంది ఉంటారు చెప్పండి. నా బ్లాగ్ కింద రాసే ప్రతి కామెంట్ నాకు చాలా విలువైనది. 

ఆ మధ్య sowmyavadam.com అనే డొమైన్ కొన్నాను. దాని మీద ఇంకా పని మొదలు పెట్టలేదు. 

ఇక్కడ నా బ్లాగ్ బాంధవులందరికీ ఒక సమాధానం బాకీ ఉన్నాను అని అనిపిస్తూనే ఉంది ఈ రెండేళ్లు. 

ఈ సారి గాప్ వచ్చినా నేను తీసుకోదలుచుకోలేదండి. నో థాంక్స్ అని చెప్పేయదల్చుకున్నాను. 

అలాగే పర్సనల్ బ్లాగ్స్ తో బాటు ఒక సీరియల్ రాయాలనుంది ... అది నా కథ అయినా ... ఇంగ్లీష్ నుంచి అనువదించిన నవల అయినా. 

జేన్ ఆస్టెన్ నవలల పుస్తకం తీసుకున్నాను. ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ నవల తో మొదలు పెడదామని. 

ఆలోచన ఎలా ఉందో చెప్పండి. ఏది చెప్పినా భరించాల్సింది మీరే అని మర్చిపోకండి ... 😀

కాదు ఇంకేమైనా కొత్త ఆలోచనలు ఉంటే చెప్పండి. నా చేతనైనదైతే తప్పకుండా చేస్తాను. 

వచ్చే బ్లాగ్ లో మళ్ళీ కలిసేంత వరకు ... సెలవు... అంటా అనుకున్నారా...  ఇంక నో సెలవ్. ఓన్లీ లవ్. (ఇది తెలుగు సినిమా పంచ్ డైలాగ్ అన్నమాట) 😁