డియర్ దైనందినీ
స్కూల్ అయిపోయి ఇంటర్మీడియేట్ లో చేరినప్పుడు డైరీ రాయడం మొదలుపెట్టాను. ఆత్మ, పునర్జన్మ వంటివి నమ్మినట్లైతే నేనొక మహా ముసలి ఆత్మనని నాకు అనిపిస్తుంది. మా అక్క అప్పుడప్పుడు ఇదే తిట్టు తిడుతుంది కూడా. స్పిరిట్యుయల్ తిట్టు అన్నమాట ... 'ఒసేయ్ ముసలి ఆత్మా!' అనడం. మిగిలిన చాలా తిట్ల లాగా ఇది ఇంగిలీషు లో బాగుంటుంది వినడానికి. Old Soul. అందుకే నావన్నీ కొంచెం ముసలి హ్యాబిట్స్ అన్నమాట. నేను బాల్యం నుంచి స్ట్రెయిట్ గా వృద్ధాప్యం లోకి అడుగుపెట్టేసానేమో అని నా అనుమానం కూడా. లేకపోతే డైరీ రాయటం ఏంటి చెప్పండి? 'పదహారేళ్ళ వయసు' కి తగ్గ హాబిట్టేనా? పదహారేళ్ళ పడుచు పిల్ల కనే కలల మీద సినిమాలు తీసే వాళ్లు ఏమనుకుంటారో అనే విచక్షణ కూడా లేకుండా నేను డైరీ రాయడం మొదలు పెట్టాను. ఓ పది పదకొండేళ్ళు రాసాను. మొదటి సంవత్సరం మామూలు డైరీ లో రాసాను. తర్వాత ఎవరో ఇచ్చిన డైరీ లో కంటిన్యూ చేసాను. ఆ తర్వాత నుంచి మాత్రం ఒక్కో సంవత్సరం ఒక్కో డైరీ... గీతా ప్రెస్ వాళ్ళు 'గీతా దైనందినీ' అని ఓ డైరీ వేస్తారు. డైరీ కి ఎంత మంచి పేరు పెట్టారు చూడండి! అందులో ప్రతి రోజూ రెండు గీతా శ్లోకాలు ఉంటాయి.