ఆనందాల జాడీ
ఎప్పుడైనా గమనించారా? కష్టం గుర్తున్నంత వివరంగా సుఖం గుర్తుండదు. కష్టాలు ఎన్ని గుర్తుంటాయో అన్ని సుఖాలు గుర్తుండవు. కష్టాలు మన మీద పడేసే ప్రభావం సుఖాలు పడెయ్యవు. సుఖాలు - 30 సెకన్ల యాడ్ లా, కష్టాలు డాక్యుమెంటరీ లాగా ఎందుకు అనిపిస్తాయి? సుఖాలు చిన్నగా, కష్టాలు పెద్దగా ఎందుకు కనిపిస్తాయి? ఈ పరిణామాన్ని 'నెగిటివిటీ బయాస్' ( Negativity Bias ) అంటారట. అంటే ప్రతికూలత పట్ల పక్షపాతం. అంటే, ఒక నెగిటివ్ సంఘటన/అనుభవం, అదే ఉధృతి గల పాజిటివ్ సంఘటన/అనుభవం మనకు జరిగితే, ఆ ప్రతికూల సంఘటనే మన మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది - ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది అని. ఓ పక్క నుంచొని 'బాగా పాడావమ్మాయి' అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే .. ఇంకో వైపు ఒకరు పెదవి విరిస్తే నేను కాంప్లిమెంట్ ని పట్టించుకోకుండా కేవలం ఆ విమర్శ నే గుర్తుంచుకొని పదే పదే నెమరువేసుకోవడం అన్నమాట (ఇది నా వ్యక్తిగత అనుభవం అని మీరు ఊహిస్తే మీరు కరెక్టే. బాగా పాడలేదు అనలేదు కానీ నేనెంచుకున్న పాట ఆ సందర్భానికి సరిపోలేదు అన్నారు) ఇది మన మెదడు కి బాగా అలవాటేనట. (మన తప్పు కాదన్నమాట! హమ్మయ్య!)