నుమాయిషీవైభవం

హైదరాబాద్ లో ఉంటూ నుమాయిష్ కి వెళ్ళకపోతే ఈ నగరానికి ద్రోహం చేసినట్టే. 

రోడ్డు మీద, బిల్డింగ్ మెట్ల మీద జర్దా ఉమ్ములు ఉమ్మే వాళ్ళ పాపం కంటే పెద్దది ఇది. 

పాప భీతి తో కాకపోయినా షాపింగ్ ప్రీతి తో ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరుల్లో నాంపల్లి లో జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఉరఫ్ ఎగ్జిబిషన్ అని పిలుచుకోబడే నుమాయిష్ కి నేను తప్పనిసరిగా వెళ్తాను. 

గత 20 ఏళ్ళు గా ఏదో ఒకటో రెండో సంవత్సరాలు మిస్ అయ్యుంటానేమో. 

నాకు ఆ వాతావరణం చాలా నచ్చుతుంది. (పైగా మా ఇంటికి దగ్గర.)

మాల్స్ రాక దశాబ్దాల మునుపే ప్రారంభమైన షాపింగ్ కల్చర్ ఇది! 

నగరం లో జరిగే ఈ జాతర సజావు గా సాగడానికి పోలీసులు చాలా కష్టపడతారు! 

ఏసీ లేకపోయినా చలికాలం అవ్వడం వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణం. అంత మంది జనం... అన్ని లైట్ల వల్లనో ఏమో చలి అనిపించదు. 

నుమాయిష్ లో నాకు అత్యంత ప్రీతికరమైన విషయం... పాత హిందీ పాటలు నిరంతరాయంగా స్పీకర్లలో వస్తూ ఉండటం! అంత కన్నా ఇష్టం .. మన చుట్టూ ఉన్న కొంత మంది వాటి తో పాడుతూ ఉండటం!

నిన్న కిషోర్ కుమార్ పాట వస్తోంది 'తేరీ దునియా సే ... హోకే మజ్బూర్ చలా .... మే బహుత్ దూర్ ... బహుత్ దూర్ ... బహుత్ దూర్ .. చలా' 

నేనూ, అక్కా ఆ పాట తో బాటే పాడుకున్నాం సరే ... మా పక్క నుంచి వెళ్తున్న ఇద్దరు ముగ్గురు కూడా అదే హమ్మింగ్ చేస్తూ వెళ్ళారు! 

ఆ హిందీ సినిమా .. ఆ పాట ... ఆ సంగీత దర్శకుడు .. ఆ పాట రాసినయన .. రాయించిన డైరెక్టరు ... పాడినాయన ... ఎంత ఆనందించి ఉంటారు! ఇలా జనాల జీవితాలలో కలిసిపోడానికే కదా కళాకారుడు కళను సృష్టించేది! 

నాకు నుమాయిష్ లో నచ్చేది ఇంకోటి. దాని ముఖ్య ఉద్దేశం. నుమాయిష్ అంటే ప్రదర్శన ... అంటే కొనే ప్రెషర్ లేదు! 

కొనకపోతే కనీసం అటువైపు చూడకూడదు అనే మొహమాటం మా అక్కకి. నాకేమో అన్నీ చూసి తెలుసుకోవాలని కుతూహలం. మేమిద్దరం స్టాల్స్ ముందు తచ్చాడుతుంటే  'ఆయియే మేడమ్ ...దేఖియే ... దేఖ్నే కే పైసే నహీ లగ్తె' (రండి మేడమ్ ... చూడండి .. చూడటానికి డబ్బులేం తీస్కోములెండి) అంటూ ఉంటారు ఫ్రెండ్లీ గా ఉండే స్టాల్ వాళ్ళు! ఇంకేం కావాలి చెప్పండి నాలాంటి పిచ్చోళ్ళకి! 😉

కశ్మీర్, లక్నౌ చికాన్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా వాళ్ళ స్టాల్స్ నాకు చాలా ఇష్టం. శిల్పారామం లాంటివి రాక ముందు ఆ రాష్ట్రాల నుంచి వస్తువులను చూసే, కొనే అవకాశం నుమాయిష్ లోనే ఉండేది. 

డ్వాక్రా, మెప్మా, ఖాదీ ఉద్యోగ్ లాంటి స్టాల్స్ కూడా నచ్చుతాయి. తెలుగు రాష్ట్రాల జిల్లాల నుంచి వారు తీసుకొచ్చే హస్తకళలు, వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు, తేనె, జున్ను, స్నాక్స్ చాలా బాగుంటాయి. ఈ సారి గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళ స్టాల్ లో కొత్తిమీర పచ్చడి (టేస్ట్ కి పెట్టారు ఆవిడ .. ఎంత బాగుందో!), ఊరి మిరపకాయలూ తీసుకున్నాం. ఒక చోట పూర్తిగా తృణధాన్యాల తో చేసిన స్నాక్స్ .. జొన్న, కొర్ర జంతికలు, రాగి మిక్చర్,  లాంటివి మేము మొహమాట పడుతున్నా టేస్ట్ కి పెట్టారు. రుచిగా ఉన్నాయి! జొన్న జంతికలు తీసుకున్నాం. 

కారాగార శాఖ వారి స్టాల్ మేము తప్పకుండా చూస్తాం ప్రతి సంవత్సరం. ఏ ఏటికి ఆ ఏడు ఏదో  ఒక కొత్త వస్తువు కనిపిస్తుంది వారి ఉత్పత్తుల్లో. గత కొన్నేళ్లుగా ఆకు కూరలు, కాయగూరలు, పళ్ళు పెడుతున్నారు. అక్కడ కొన్న తోటకూర నేను జీవితం లో తిన్న బెస్ట్ తోటకూర! ఈ  మధ్య పెయింటింగ్స్ పెడుతున్నారు ఖైదీలు వేసినవి. Stools లాంటి చిన్న ఫర్నిచర్ ఎప్పుడూ ఉండేది .. ఈ సారి అలమరలు, వార్డ్ రోబ్స్ కూడా కనిపించాయి. 

నిన్న తెలంగాణ గిరిజనుల అభివృద్ధి శాఖ వారి చిన్న స్టాల్ కనబడింది. తేనె, సహజమైన పదార్ధాల తో చేసిన సబ్బులు అవ్వీ ఉన్నాయి. 

చిన్నప్పుడు జైంట్ వీల్ ఎక్కేదాన్ని కానీ అసలు ఇప్పుడు పెద్ద ఇంట్రస్ట్ లేదు (భయం అనేకంటే ఇంట్రస్ట్ లేదు అనడం బాగుంది కదూ). వాటి ముందు నుంచొని కొంచెం సేపు చూస్తాను అంతే! ఫన్నీ మిర్రర్స్ ఉండేవి ... ఒక సారి వెళ్ళాను. చాలా నవ్వొచ్చింది .. నేను ఒక్కొక్క అద్దం లో వింత వింతగా కనిపిస్తుంటే! ఎగ్జిబిషన్ ట్రైన్ లో ఇన్ని సార్లలో ఒక్క సారి కూడా ఎక్కలేదు (దీనికి భయం కారణం కాదు లెండి.... ఆ టికెట్ లైన్ లో నుంచోడం బోరు ). కొన్నేళ్ల క్రితం వరకూ ఈ ట్రైన్ పట్టాల మీదే నడిచేది! ఈ మధ్య మామూలు బండి లాగే టైర్ల మీద నడుస్తోంది. 

నేను ఎగ్జిబిషన్ కి ఎందుకు వెళ్తాను అని ఓ ఐదు కారణాలు రాస్తే అందులో ఒకటి .. అక్కడి 'సాత్విక్ ఆహార్' షాపు. ఇది స్టాల్ కాదు. ఖాదీ గ్రామోద్యోగ్ వారి షాపు. ఎప్పుడూ అక్కడే ఉంటుంది. వారు 30 రూపాయలకి వేడి వేడి కిచిడి పెడతారు ... చాలా బాగుంటుంది. వాళ్ళది స్టాండర్డ్ మెనూ అన్నేళ్ళ నుంచి. పెరుగు వడ, అరటి పండు గుజ్జు తో చేసే ఫ్రూట్ సలాడ్, చారు/రసం లాంటి వేడి వేడి సూప్, మొలకలు/ఉడకపెట్టిన పల్లీలు.... ఇలాంటివే. ఇక్కడ తినందే నా యాత్ర కి ఫలితం దక్కదని ఫీలవుతుంటాను. 

నాకు ఎగ్జిబిషన్ లో నచ్చేది ఇంకోటి. డబ్బు తో సంబంధం లేకుండా వినోదాన్నిస్తుంది. నేను టికెట్ డబ్బులు ప్లస్ ఇంకో వంద రూపాయలు తప్ప ఇంకేం ఖర్చు పెట్టనప్పుడు ... ఓ రెండు వేలు ఖర్చు పెట్టినప్పుడు...  అదే ఆనందాన్ని పొందాను. 

ఎడమ నుంచి కుడికి: అక్కా, నేను, నుమాయిష్ వెలుగులు 

కొన్ని కుటుంబాలు పులిహోరలు, పులావులు ఇంట్లో వండుకొచ్చి ఎగ్జిబిషన్ మధ్య ప్లేస్ చూసుకుని దుప్పటి పరుచుకొని పిక్నిక్ చేస్కోవడం చూసాన్నేను. (సినిమా హాల్స్, మాల్స్ లో లాగా కాక ఇంటి నుంచి ఫుడ్ ని అనుమతిస్తారు ఇక్కడ). ఈ మధ్య ఈ ట్రెండ్ బాగా తగ్గింది. వండటానికి ఓపిక తగ్గడం ... బయట ఇన్ని రుచులు దొరకడం .. పిల్లలు బయటి ఫుడ్డే ప్రిఫర్ చెయ్యడం, పర్చేసింగ్ పవర్ పెరగడం లాంటి కారణాలు అయ్యుండొచ్చు.

ఇన్నేళ్ళ నుంచి వెళ్తున్నా నేను చూడని కొన్ని కోణాలున్నాయి ఈ ఎగ్జిబిషన్ కి .. ఉదాహరణ కి ... ఓ రోజు కేవలం ఆడవాళ్లకే ఉంటుందట. ఈ సారి ఆ రోజు వెళ్లి చూడాలి. ఇందాక చెప్పినట్టు ట్రైన్ ఎక్కాలి. మౌత్ కా కువా అనే షో చూడాలి (బావి లాంటి దాంట్లో మోటర్ సైకిల్ నడుపుతారు చూడండి .. అది). 

ఈ సంవత్సరం 'ఎగ్జిబిషన్ మూసే టైం అయింది' అనే అనౌన్స్మెంట్ వినడం కొత్త అనుభవం. (యే నుమాయిష్ కీ ఆవాజ్ హై ... అని మొదలవుతాయి అనౌన్సుమెంట్లు!) ఎప్పుడూ ఇంత లేట్ వరకూ ఉండలేదు! 

ఎగ్జిట్ దగ్గరకి రాగానే యాదృచ్చికంగా స్పీకర్స్ లో ఈ పాట 'చల్తే చల్తే యూన్ హీ కోయీ మిల్ గయా థా .....' 

Comments

  1. నుమాయిష్ లో నాకు అత్యంత ప్రీతికరమైన విషయం... పాత హిందీ పాటలు నిరంతరాయంగా స్పీకర్లలో వస్తూ ఉండటం!

    Me too...

    ReplyDelete
  2. . . . హైదరాబాద్ లో ఉంటూ నుమాయిష్ కి వెళ్ళకపోతే ఈ నగరానికి ద్రోహం చేసినట్టే. . .
    అన్యాయం అండీ. దుమ్ము భయంతో అక్కడికి వెళ్ళ(లే)ని వాళ్ళని మీరు ద్రోహుల్లో జమకటేస్తున్నారు!

    ReplyDelete
    Replies
    1. Hahha..... meeru thappa ani rayamantara cheppandi 😁

      Delete
  3. @ శ్యామలరావు గారు
    // “అన్యాయం అండీ. దుమ్ము ..... “ //

    హ్హ హ్హ, MeToo 😀.

    ReplyDelete
  4. హైదరాబాద్ నగరంలో ఇపుడు మెట్రో ఉంది.హాయిగా నుమాయిష్ కి వెళుతున్నాం.

    ReplyDelete
  5. నుమాయిష్ వెలుగులను కళ్ళకు కట్టినట్టు చూపించిన సౌమ్య గారికి థాంక్స్. మా చిన్నప్పుడు 4 కిమీ నడిచి మరీ వెళ్లే వాళ్ళం, మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వచ్చాయి.

    ReplyDelete
  6. జనాల హంగామా, జైంట్ వీల్, చిరుతిళ్ళు, నిజంగా మీరు అన్నట్టే ఆ వాతావరణం బావుంటుంది.

    ఇప్పటికీ మూడు సార్లు వెళ్ళాను ... వెళ్ళిన ప్రతీసారీ విన్న పాట "గాతా రహే మేరా దిల్ తూహీ మేరీ మంజిల్"

    ReplyDelete

Post a Comment