కుళ్ళుమోతు మల్లిమీతు

ఈ సబ్జెక్టు తో నాకు చాలా అనుభవం ఉందండోయ్. అంటే నాకు కుళ్ళుకోవడం అలవాటు అని కాదు నేను చాలా భరించాను అని అర్ధం. అందరూ కొట్టి పడేస్తారు .. ఆ .. అందరికీ కలిగేదే అని. కానీ దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కుళ్ళు మన దగ్గర బంధాల్లోకి ప్రవేశిస్తే ఆ స్ట్రెస్ వేరు కదా. 

నేను బలంగా నమ్మే విషయాల్లో ఒకటి ... లాజిక్ కాదు మనస్థితే మనిషి మనుగడ ని శాసిస్తుంది. లాజిక్ ని నమ్మే జాతి అయితే మనం యుద్ధం, క్షామం, ఆకలి లేకుండా చేసుకొనేవాళ్ళం. ఉండాల్సిన ఒకే భూమి ని సరిగ్గా చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు స్థితి ని చూసి ఏం చేస్తే ఇలా ఉన్నాం అని వెనక్కి calculate చేసుకుంటే తెలుస్తుంది.. పాలకుల, ధనికుల మనోవికారాల ఫలితమే ఈరోజు మన ప్రపంచం. అందులో అసూయ ఒక పెద్ద స్థానాన్ని ఆక్రమించుకుంది.

కుళ్ళు అనే ప్రాసెస్ ని విశదీకరిస్తే దాని మూలం పోల్చుకోవడం లో ఉంది. నువ్వు నీలా బ్రతికేస్తున్నావు .. ఏదో లాగా. ఈ లోపు ఓ చుట్టమో, ఫ్రెండో కనిపిస్తాడు.. లేదా ఏదో వార్త వస్తుంది వాళ్ళ గురించి. అంతే మొదలవుతుంది కుళ్ళు. ఈ మొదలైన జెలసీ ఒక మోతాదు లో చాలా కామన్. దీని వల్ల పెద్ద నష్టం లేదు కూడా. కానీ మోతాదు మించితేనే ఇబ్బంది..ఆ కుళ్ళు కలిగినవాడికీ, ఎవడి వల్ల కలిగిందో వాడికీ. 

కుళ్ళు లోకి లింగభేదాలు ఉండవు. ఆడవాళ్ళకి అసూయెక్కువ అంటే నేను నిజమనుకునే దాన్ని. కానీ ఒక్కసారి ప్రొఫెషనల్ ప్రపంచం లోకి వచ్చాక అది ఎంత అబద్ధమో తెలిసింది. ఈ విషయం లో ఇద్దరూ సమానమే. నాకు ఇంకో అపోహ ఉండేది .. మగవాళ్ళకి మగవాళ్ళంటేనే జెలసీ... ఆడవాళ్ళకి ఆడవాళ్ళంటేనే జెలసీ అని. కానే కాదు. 

నాకున్న ఇంకో అపోహ కూడా బాగా బుద్ధి వచ్చేలా పోగొట్టారు కొంత మంది మనుషులు. సమాజం లో స్థాయి లో ఉన్న వారికి ఇలాంటివి ఉండవనుకొనేదాన్ని నేను .. ముఖ్యంగా వాళ్ళకంటే తక్కువ (ఆర్ధికంగా, పేరుప్రఖ్యాతులు పరంగా etc). కానీ వీళ్ళే 1bhk కట్టుకున్న వాడి దగ్గరకి వచ్చి "నా బంగ్లా తుడుచుకోలేక చచ్చిపోతున్నాను.. నీ ఇల్లంటే నాకు అసూయ గా ఉంది" అంటారు. 

ఒక ఆరోగ్యకరమైన మనసు, బుద్ధి ఉన్న వ్యక్తి కుళ్ళు ని ప్రాసెస్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఆ భావం కలగటం సహజం అని మొదట ఒప్పుకోవడం తో మొదలవుతుంది ఈ ప్రాసెస్. ఆ తర్వాత అదెక్కడి నుంచి వస్తోందో తెలుసుకోవడం ముఖ్యం. నీ తో పాటు పని చేసే కొలీగ్ ఇంకో పక్క పుస్తకం రాసారు  అని తెలిసి అసూయ కలిగితే నీకు కూడా అలాంటి వ్యాపకం ఏదో పెట్టుకోవాలని ఉందన్నమాట. అందుకే నువ్వు చేయలేనిది వారు చేస్తే నీకు బాధ అనిపించింది. ఇలా అయితే ఫర్వాలేదు. మించిపోయిందేది లేదు. మనం కూడా అలాంటిది మొదలుపెట్టుకోవచ్చు. తనలో తనే విస్మరిస్తున్న కోణాలు తెలుసుకోడానికి ఈ కుళ్ళు అనే ఎమోషన్ ని డిటెక్టర్ గా వాడుకుంటుంది వివేకం. 

కానీ అనారోగ్యంగా లేదా బలహీనంగా ఉన్న మనసు లో కుళ్ళు ప్రవేశిస్తే ... అబ్బా .. ఇంక వాళ్ళకి, చుట్టుపక్కవాళ్ళకి అందరికీ నరకం. వీళ్ళు సుఖంగా ఉండరు ... ఇంకొకళ్ళని ఉండనీరు. 

ఇంకో జాతి ఉంటారు. వీళ్ళు చక్కగా పుట్టుకతో అసూయ అనే జీన్స్ తో పుడతారు. వీళ్ళ కుళ్లుకి అసలు లాజిక్ ఉండదు. అలాగే దానికి పరిష్కారం కూడా ఉండదు. వీళ్ళ సాంకేతిక నామం "కుళ్ళుమోతు మల్లిమీతు". మనకి తెలిసిన ఒకడు ఐ ఏ ఎస్ పాసయ్యాడు అనుకుందాం. ఈ మాట తెలీగానే కుళ్ళు కలిగింది. నువ్వు కూడా ఐ ఏ ఎస్ కి ప్రిపేర్ అవుతూ ఆ పరీక్ష ని క్రాక్ చెయ్యలేకపోతే ఆ కుళ్ళు కొంత వరకూ సబబు. కానీ అసలు నువ్వు ఆ పరీక్ష కి ప్రిపేర్ అవ్వట్లేదు సరి కదా ... అది నీ కెరీర్ ఏ కాదు. ఈ మల్లిమీతు టైప్ కుళ్ళు కి వయసు, వావి, వరస, సందర్భం, సంకోచం, విచక్షణ, వివేకం .. ఏవీ ఉండవు. 

కుళ్ళు లో ఇంకో విసుగైన కోణం ... శ్రమ ని కాకుండా దానికి లభించిన ఫలితాలు చూసి కుళ్ళుకోవడం. ఓ వ్యక్తి మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాంగా అరవై ఏళ్ళ వయసు లో షుగర్ లాంటివి లేకుండా ఉన్నాడనుకోండి ... వీళ్ళు ఆహారం వైపు ఎటువంటి డిసిప్లిన్ చూపించకుండా వీళ్ళకి అవే ఫలితాలు కావాలి. ఆ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అంటే కుళ్ళు. 

సత్యాగ్రహం లాగానే ఒక్కోసారి సత్యాసూయ కూడా ఉంటుంది అనిపిస్తుంది. లంచగొండి వాడో, స్వయంగా కుళ్ళుమోతు అయిన వాడో జీవితం లో అంచెలంచెలుగా ఎదుగుతూ పోతుంటే వాడ్ని చూసి కుళ్ళు కలగక మానదు. మనం మంచివాళ్ళయి చేసిందేంటి అనిపిస్తుంది. 

నాకనిపిస్తుంది.. దుర్యోధనుడికి పాండవులతో ఉన్న ప్రధాన సమస్య కుళ్ళే అని. రాజ్యకాంక్ష ఒక్కటే అయితే వాళ్ళకి ఐదు ఊళ్ళు ఇచ్చేయచ్చు. ఆర్యావర్తం ఏలే చక్రవర్తి గా ఐదూళ్ళ రాజుల మీద పెత్తనం చేసి తన పవర్ చూపించుకోవచ్చు. కానీ అతనికి అసలు వాళ్లంత ప్రజ్ఞావంతులు బ్రతికుండడమే ఇష్టం లేదనిపిస్తుంది. (చిన్నప్పటి నుంచి అతను చేసిన హత్యాప్రయత్నాలు ఇందుకు సాక్ష్యం). దుర్యోధనుడు స్వయంగా ఇలాంటి వాడా, శకుని ప్రేరేపించాడా అంటే ..  మనలో అంకురం కూడా లేని భావాన్ని ఎవ్వడూ ప్రేరేపించలేడు అంటా నేను. ఇప్పుడు మన భారతీయులకి రోడ్లు శుభ్రంగా ఉంచమని, లైన్ లో సరిగ్గా నుంచోమని, సమయపాలన చెయ్యమని ఎంత చెప్పినా వినరు చూడండి అలా. 

దుర్యోధనుడి కుళ్ళు అతని వంశాన్ని నాశనం చేసింది. కానీ అది ద్వాపర యుగం. ఇప్పుడు అలా అవ్వట్లేదేమో అనిపిస్తోంది. 

కుళ్ళు తీర్చుకోడానికి పరమ సాధారణమైన సాధకం - మాటలు. చాలా మంది తమ కుళ్ళు ని ఇలాగే ప్రదర్శిస్తారు. వంకర మాటలు, నొక్కులు, బాధాకరమైన కామెంట్లు, ఎదుటి వారి విజయాన్ని acknowledge చెయ్యకపోవడం ... 

ఈర్ష్య, అసూయ, కుళ్ళు ఇలా మన తెలుగులో ఉన్నట్టే ఇంగ్లిష్ లో ఎన్వీ, జెలసీ లాంటి మాటలున్నాయి. కాకపోతే ఎన్వీ కి జెలసీ కి తేడా ఉందట. ఎన్వీ అంటే నువ్వు కావాలనుకున్నది, నీ దగ్గర లేనిది ఒకడి దగ్గర ఉంటే కలిగే భావన. జెలసీ అంటే నీదైన వస్తువుని వేరెవడో వచ్చి తీస్కెళ్ళిపోతాడనే భయం అట! మనం ఒకే అర్ధం లో రెండూ వాడేస్తూ ఉంటాం. 

ఎన్వీ అంటే ఒనిడా టివి యాడ్ గుర్తొస్తుంది ... ఈ ఎమోషన్ ని కూడా సెల్లింగ్ పాయింట్ చేసేసుకున్నారు చూసారు వాళ్ళు! ప్రేమ కథల్లో కూడా ఇలాగే వాడుకుంటారు జెలసీ ని. ఇష్టమైన వ్యక్తి అటెన్షన్ ని పొందడానికి ఇంకొకరి తో చనువుగా ఉన్నట్టు నటించి వాళ్ళని 'జెలస్' చెయ్యడం ఓ నార్మల్ విషయం లో చూపిస్తారు కదా సినిమాల్లో. అలాగే ఒకమ్మాయి ముందు ఇంకొకమ్మాయి ని పొగిడితే ఆమె కి కుళ్ళు అంటారు. నాకనిపిస్తుంది వీళ్ళ ఉద్దేశమే ఆ అసూయ ని ప్రేరేపించడం అని. 

అమ్మాయిల మధ్య అసూయ ని ఓ జోక్ గా కాక జెండర్ పాలిటిక్స్ కోణం నుంచి అర్ధం చేసుకోవాలి అంటాను నేను. వాళ్ళకి చేసిన కండిషనింగ్ లో భాగం ఏంటంటే నీ మగాడు, నీ సంసారం దీనికోసం నువ్వు పోరాడు ఇంకో ఆడదాన్నుంచి అని. ఏదో మగాడు లాలీపాప్ అయినట్టు. అతనిక్కూడా వివేకం ఉంటుంది కదా. తప్పు జరిగితే అది రెండు వైపులా కదా. ప్రేమ దశ లో కూడా మగవాడి అటెన్షన్ ఏదో ట్రోఫీ అయినట్టు దాని కోసం వేరే అమ్మాయిలతో పోటీ పడాలి అనే భావన సృష్టిస్తారు. అమ్మాయిల మనసులని, మెదడులని సంకుచితం చేసే ఇలాంటి పోకడల వల్లే "ఆడవాళ్ళకి అసూయ ఎక్కువ" అనే ప్రాపకం జరిగింది. మనోవికాసం చెందిన సాధికార స్త్రీ ఇంకో స్త్రీ కి చేయూతనిస్తుంది తప్పించి తొక్కేయాలనుకోదు. ఇంద్రా నూయి లాంటి వారు చెప్తోంది కూడా ఇదే. ఇప్పుడు ఆడవాళ్ళకి  ఛాలెంజ్ ఇదే. కొన్నేళ్ల కండిషనింగ్ నుంచి బైట పడి తోటి ఆడవారిలో పోటీ ని కాక సహకారాన్ని ఇవ్వడం, తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. 

ఏ క్లోజ్ బంధం లో ఉన్న వారైనా రకరకాల సందర్భాల్లో  జెలస్ ఫీలవుతారు. ఈ రకమైన జెలసీ అసలు కేటగిరి నే వేరనిపిస్తుంది. తన కూతురొచ్చి వేరొకరి వంట పొగిడితే తల్లికి కుళ్ళు. కొలీగ్ వేసిన జోక్ గురించి నవ్వుతూ చెప్తే భర్త కి కుళ్ళు. తనతో కాక ఇంకొకరి తో కొంచెం చనువుగా ఉన్నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కుళ్ళు. ఎంత సెక్యూర్ గా ఉండే వ్యక్తికైనా ఈ భావన తప్పదేమో అనిపిస్తుంది.

ఒక కొటేషన్ చదివాను ఇటీవల.  నువ్వు ఎవరితో సేఫ్ గా శుభవార్త ని షేర్ చేస్కోగలవో వాళ్ళే నీ శ్రేయోభిలాషులు అని. మిగిలిన వాళ్ళో? సాంకేతిక నామం ఉందిగా వాళ్ళకి! 


Comments

  1. "రావణాసురుడు ఉంటేనే రామబాణానికి కీర్తి"...ఇది లోకోక్తి.
    మీ ప్రతిభకు ఆ అసూయాదృష్టులే శ్రీరామరక్ష.దూసుకు పోదురూ... జండా ఎగరేస్తూ...
    రేపు మీదేనని తల ఎగరేస్తూ...జయోస్తు

    ReplyDelete

Post a Comment