విశ్వనాథ్ గారికి స్మృత్యంజలి

విశ్వనాథ్ గారి తో నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పుకోవడం ఓ అదృష్టం గా భావిస్తున్నాను. 

తెలుగు వారి గా పుట్టి విశ్వనాథ్ గారి గొప్పతనం తెలియకపోవడం అసంభవం. మన ఇళ్లలో పిల్లలకి పరిచయం చేసే తెలుగు సంస్కృతి లో ఆయన సినిమాలు, పాటలు, సన్నివేశాలు  ఎప్పుడో ఓ భాగమైపోయాయి. 

నా పోస్టు గా .. మా .. నీ.. లో విశ్వనాథ్ గారు సృష్టించిన సాగర సంగమం లో 'బాలు' పాత్ర గురించి రాసే అప్పుడు 'మొదటి సారి సాగర సంగమం ఎప్పుడు చూశానో  గుర్తులేదు ... .. మొదటి ఆవకాయ ఎప్పుడు తిన్నానో గుర్తులేనట్లే' అని రాసుకున్నాను. 

విశ్వనాథ్ గారి సినిమా ఆయన పాటల ద్వారా అమ్మ వల్ల పరిచయమయింది.  విశ్వనాథ్ గారు అనగానే కొన్ని శంకరాభరణం .. తదనంతర సినిమాలు ఎక్కువ తలుచుకుంటాం కానీ అంతకు ముందు ఆయన తీసిన సినిమాలు అమ్మ మాకు చెప్పడం వల్ల బాగా తెలుసు. ముఖ్యంగా 'ఉండమ్మా బొట్టు పెడతా' 'చెల్లెలి కాపురం' 'శారద' ... ఇలా. 

ఇంట్లో కర్ణాటక సంగీతం, సాహిత్యం .. ఈ వాతావరణం ఉన్నందువల్ల ఆయన సినిమాలు చిన్నప్పుడు  పరిచయమయ్యాయి. పెద్దయ్యాక నేను సినిమా రంగం ఎంచుకోవడం వల్ల ఇంకొంత అనుబంధం పెరిగింది అని చెప్పవచ్చు. చిన్నప్పుడు నచ్చిన ఆయన సినిమాలు పెద్దయ్యాక అధ్యయనం చేసే అవకాశం కలిగింది. 

ఒకప్పుడు నా  నైజం ఎలా ఉండేదంటే నాకెవరైనా కళాకారులు బాగా నచ్చినా, వారి కళను నేను ఎంత admire చేసినా, వారిని కలవాలని అనుకొనే దాన్ని కాదు. కలిసినా మాట కలిపే దాన్ని కాదు. వారి కళ నాకెందుకు ఇష్టమో వారితో షేర్ చేసుకొనేదాన్ని కాదు. బిడియమో మొహమాటమో తెలీదు. 'వాళ్ళకి చెప్పేవాళ్ళు తక్కువుంటారా' అని కూడా అనిపించేది. కానీ నన్ను వారి కళ ఎలా ప్రభావితం చేసిందో అది నేనే చెప్పగలను అని తర్వాత తెలిసింది. నేను కళాకారిణి అయ్యాక మన కళ నచ్చి genuine గా ఎవరైనా appreciate చేస్తే ఆ మాటల విలువ ఏంటో కూడా తెలిసింది. కొంచెం ఓపెన్ అయ్యాను ఈ  విషయంలో. 

ఓ సినిమా ప్రివ్యూ లో విశ్వనాథ్ గారు నా వెనక సీటే. ఇంటర్వెల్ లో వెళ్లి ఆయన పక్కన కూర్చొని మాట్లాడేసాను. మా ఇంట్లో అనుకునే వాళ్ళం .. అయన పాత్రలు ఎప్పుడూ .. కూర్చొని డైలాగ్ చెప్పరు ... ఏదో ఒక పని చేస్తూ మాట్లాడతారు.. మనం నిజ జీవితం లో మాట్లాడినట్టే. మొక్కలకి నీళ్లు పోస్తూనో, కళ్ళజోడు తుడుచుకుంటూనో, ఏదైనా చాక్లెట్ రాపర్ విప్పి తింటూనో ... ఇలా. అదే ఆయనకి చెప్పాను. సినిమాల్లో దాన్ని 'బిజినెస్' అంటారు. ఓ పాత్ర ఏదో ఒక బిజినెస్ ఇవ్వడం. దాని గురించి మాట్లాడుకున్నాము. 

ఇంట్లో ఇంకో విషయం కూడా అనుకొనే వాళ్ళం .. ఆయనకి సంగీతం వచ్చేమో .. అందుకే ఇంత బాగా అర్ధం చేసుకుంటారు కళాకారులని .. అందుకే అంత మంచి సంగీతం కూడా బయటికి వస్తుంది అని. అదే మాట ఆయన్ని అడిగా. నాకు రాదు కానీ ఇయర్ (చెవి) ఉంది .. నేను సంగీతాన్ని బాగా గ్రహించగలను అన్నారు.  

స్వాతి కిరణం లో మమ్ముట్టి లాంటి క్యారెక్టర్ కళాకారుల జీవితం లో చాలా పరిచయమైన పాత్రే. అన్ని రంగాల్లో లాగే ఇక్కడ అసూయ ఉంటుంది.  కానీ ఆయనకి అలాంటి వ్యక్తి ఎవరైనా తెలుసా అని అడుగుదామనుకున్నా. కుదర్లేదు. 

ఇంతలో ఎవరో బిస్కెట్లు తెచ్చిచ్చారు ఆయనకి టీ తో పాటు. ఆయన 'ఈ బిస్కెట్లలో ఏది బాగుంటుంది' అన్నారు. గ్లూకోజ్ బిస్కెట్లు వద్దు, కుకీ లాంటివి తీస్కోండి అని అవి తీసిచ్చా. ఆయనకి ఇచ్చిన వాటిలో నాకోటి ఇచ్చారు. నేను ఆ కుకీ ని తినకుండా ఫోటో తీస్కొని నా బాగ్ లో పెట్టుకున్నా చాలా రోజులు. (ఆ ఫోటో దొరకలేదు ఏంటో .. హార్డ్ డిస్కులు వెదికినా). నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని అని చెప్తే.. నన్ను పెట్టి సినిమా తియ్యి మరి అన్నారు. బాలు ని మాధవి తిట్టినట్టు నేను ఎంత మాడెస్ట్ అంటే 'ఆ.. నేను ఆయన్ని పెట్టి తియ్యడమేంటి' అని నవ్వుకున్నాను. పిచ్చి దాన్ని. 

నేను బిడియం వదిలి ఇంత మాట్లాడటమే ఎక్కువ. ఇంక పరిచయం ఏర్పరుచుకోవడం ఇవన్నీ తెలీదు. అందుకే ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. 

లక్కీ గా మరో సారి జీవితం ఇంకో అవకాశం ఇచ్చింది. ఈ సారి గాయని గా. 

అక్కా, నేను బాపు రమణ గారి స్మృతి సభలో 'సా పా సా' చేసాం . (అంటే ఒక థీమ్ తీస్కొని దాని గురించి మాట్లాడుతూ పాటలు పాడతాం అన్నమాట) అక్కడ మమ్మల్ని విన్న ఒకాయన విశ్వనాథ్ గారి ఇంట్లో ఆయన పుట్టిన రోజు సందర్బంగా మా కచ్చేరి పెట్టించారు. విశ్వనాథ్ గారి ముందు పాడటానికి మేము ఎంచుకున్న థీమ్ 'విశ్వనాథ శ్రీకృష్ణ తత్వం'. ఆయన సినిమాల్లో కృష్ణుడి మీద పాటల్ని ఎంచుకొని 'సా పా సా' చేసాం. అక్కడ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి లాంటి ఒక గూటి పక్షులు చాలా మంది ఉన్నారు ఆ రోజు. వారి ముందు వారి పాటల గురించి మేము వివరిస్తూ పాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. 

విశ్వనాథ్ గారి సినిమాలు, వాటిలో సంగీతం మాకు ఎంత విలువైనదో, అది మాకు ఎంత ఇష్టమో ఆయనతో స్వయంగా షేర్ చేసుకున్న మధుర క్షణాలవి. అంత కన్నా ఓ అభిమాని కి ఏం కావాలి? 

మళ్ళీ పిచ్చి 'మాడెస్టీ' వల్ల 'ఆ .. ఆయన ఎంత గొప్ప కళాకారులని వినలేదు .. మనం కూడా ఈ రోజు తర్వాత మళ్ళీ కలుస్తామా ఏంటి' అనుకున్నాం. కానీ ఆ తర్వాత విశ్వనాథ్ గారి గణం లో ఆయన మమ్మల్ని లెక్కపెట్టేసుకున్నారు ఆ రోజు నుంచి!

ఆయన కి 'దాదాసాహెబ్ ఫాల్కే' ప్రకటించిన రోజు మళ్ళీ ఆయన నుంచి పిలుపు వచ్చింది. ఆరోజు ఖర్మ కాలి మేము ఇంకో చోట కి వెళ్లాల్సిన పరిస్థితి. మళ్ళీ మేము 'ఆ.. ఇంత మంది లో మనని పట్టించుకుంటారా ... ఆయనకి అభినందనలు చెప్పి జారుకోవచ్చు' అని అనుకున్నాం. సబిత గారు (సప్తపది లో హీరోయిన్) అంటూనే  ఉన్నారు .. ఆయన పాడకుండా మమ్మల్ని పంపించరు అని. అదే జరిగింది. అభినందనల వెల్లువ మధ్యే ఎన్నో పాటలు పాడించుకున్నారు. మాకు ఆ పాటల వెనక కథలు చెప్పారు. మేము తొందరగా వెళ్ళాలి అని తెలిసి అలిగారు కూడా! కార్యక్రమం అయ్యాక 'ఇంక మీరు పరిగెత్తండి' అన్నారు. మేము ఆ రెండో చోటకి వెళ్లలేకపోయాం. ఏం నష్టం లేదు అనిపించింది. ఇదే ముఖ్యం అనిపించింది. 

విశ్వనాథ్ గారితో ఇంకో అనుభవం ... ఆయన తో కూర్చొని స్వర్ణ కమలం చూడటం. ఆ రోజు సినిమా స్క్రీనింగ్ అయ్యాక మా ఫామిలీ తో కూర్చొని మా అమ్మ గారిని కూడా పాడమని ఎన్నో పాటలు పాడించుకున్నారు. 

విశ్వనాథ్ గారి వల్లే సీతారామశాస్త్రి గారి ప్రేమ ను కూడా పొందే అవకాశం కలిగింది. ఆయన ఏదో ఇంటర్వ్యూ లో మా ఇద్దరి సిస్టర్స్ గురించి ప్రస్తావించారని విన్నాను. మేము విశ్వనాథ్ గారి ముందు పాడిన మొదటి సారి ఆయనే శాలువాలు కప్పి సత్కరించారు. ఎంత భాగ్యం! 

కోవిడ్ తర్వాత విశ్వనాథ్ గారిని ఇంక కలిసే అవకాశం కలగలేదు. సముద్రం దగ్గర ఎంత సేపు కూర్చున్నా తనివి తీరనట్టే వారిలాంటి కళాకారుల దగ్గర ఎన్ని సార్లు సమయం గడిపినా సరిపోదు. కానీ నాకు ఆయన తో దొరికిన జ్ఞాపకాల విలువ తెలుసు. అందుకే తృప్తి గా ఉంది. 

విశ్వనాథ్ గారు ఎంత గొప్ప దర్శకులో నాకన్నా పెద్దవారు ఇంకా బాగా చెప్పగలరు. కానీ ఆయన నాకేంటో నేనే చెప్పగలను. 

సినిమా కి నేను ఆకర్షితురాలిని అయ్యాను అంటే అది ఆయన సినిమాల వల్లే. సంగీతం, సాహిత్యం, నృత్యం .. వీటిలో పెరిగిన నాకు ..  ఆయన సినిమాలు చాలా బాగా అర్ధమయ్యేవి .. ఆ హాస్యం.. ఆ కథలు.. 

ఓ మంచి సినిమా తన రహస్యాలన్నీ ఒకే సారి విప్పదు అని ఓ కొటేషన్ ఉంది. విశ్వనాథ్ గారి సినిమా అలాంటిదే. వయసు పెరిగే కొద్దీ ఆయన సినిమాల్లో ఇంతకు ముందు చూడని, అర్ధమవ్వని అంశం ఇంకోటేదో కనిపిస్తుంది. ఆయన సినిమాల మీద థీసిస్ రాసేంత మ్యాటర్ ఉంది అక్కడ. 

సినిమా తియ్యాలనుకుంటున్న ఓ వర్ధమాన దర్శకురాలిగా ఆయన దగ్గర్నుంచి నేను నేర్చుకున్నది చాలా ఉంది. నీకు తెలిసిన కథ .. నువ్వు చెప్పాలనుకున్న కథ .. అది మార్కెట్ లో ట్రెండ్ లోనిది కాకపోయినా సరే .. అది తియ్యాలి అనే ధైర్యం ఆయనే ఇచ్చారు. 

వంద కోట్లు వసూల్ చేసిన సినిమా గురించి మహా అయితే ఐదేళ్లు చెప్పుకుంటాం. ఈ లోపు దాని రికార్డ్ ని ఇంకో సినిమా బద్దలు కొట్టేస్తుంది. కానీ విలువలున్న సినిమా ఎంత కాలమైనా నిలబడుతుంది అని అనడానికి ఆయన సినిమానే సాక్ష్యం. ఇప్పటికీ క్లాస్ సినిమా మాస్ హిట్ అయింది అంటే శంకరాభరణం ఒక్కటే ఉదాహరణ ఏంటో. 

ఈ మధ్యే ఓ ఇంగ్లీష్ పదానికి అర్ధం తెలుసుకున్నాను. seminal .. సెమినల్ . సెమినల్ వర్క్ అంటే .. దాని తర్వాత ఎన్నో మార్పులకి కారణమైంది అని అర్ధమట. ఆయన సినిమా కి ఇదే కరెక్ట్ పదం. 

'అడుగడుగున గుడి ఉంది' పాట మా అమ్మగారు సంగీతం పిల్లలకి ఇప్పటికీ నేర్పిస్తారు .. కీర్తనలు, కృతులతో బాటు. ఆయన సినిమా పాటలు సంప్రదాయ కృతి కీర్తనలకు దీటుగా ఉంటాయి మరి! 

ఆయన స్మృతులతో ఓ వీడియో చేసాం. ఆయన ముందు పాడిన 'విశ్వనాథ కృష్ణ తత్వం' కొంత భాగం కూడా ఇందులో చూడచ్చు. 



ప్రభావశీలురైన ఇటువంటి మహనీయులు వెళ్ళిపోయాక .. ఓ శకం ముగిసింది అంటాం. కానీ ఈ శకం ముగియకూడదు. ఆయన చూపించిన విలువల సినిమాలు ఇంకా రావాలి. ఇదే నా ప్రార్ధన. 

Comments

  1. మీరు ధన్యజీవులు 👌.
    విశ్వనాథ్ గారిని ఒక్కసారే చూశాను - “మూగమనసులు” చిత్రం అవుట్-డోర్ షూటింగ్ కోనసీమలో జరుగుతున్నప్పుడు. నాకప్పుడు 13 యేళ్ళు. ఆదుర్తి సుబ్బారావు గారు విశ్వనాథ్ గారిని దగ్గరకు పిలిచి “ఇతను విశ్వనాథ్ అని. మా సాండ్ ఇంజనీరండీ” అని మా నాన్నగారికి పరిచయం చేశారు. అప్పుడు నేను పక్కనే ఉన్నాను. తరవాతెప్పుడూ కలవడానికి అవకాశం రాలేదు. My loss 😔.

    ReplyDelete
    Replies
    1. నా లిస్ట్ లో కూడా ఒక్క సారి కలవకుండా నే వెళ్లిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి... ఏం చెయ్యగలం

      Delete
  2. నాకు సంగీతం లో ఓనమాలు కూడా తెలియవు , రాగాలు అయితే చైనా భాషే , శంకరాభరణం నచ్చేసింది ఎందుకు అడిగితె తెల్లమొహం వేస్తాను . ఇష్టం ఉండటం , దానిని అక్షరాలలో పెట్టడం కూడా ఒక అదృష్టమే . బాగా రాశారు .

    ReplyDelete
  3. నాకూ సంగీతం రాదండీ. సాహిత్యం కూడా అంతంత మాత్రం పరిచయం. శివకేశవాదులతో కొంచెం పరిచయభాగ్యం. విశ్వనాథ్ గారి గొప్పదనం గురించి బాగా చెప్పారు. శంకరా తరించరా అన్న సంబోధన విన్నాక శంకరాభరణం సినీమాపై వైమనస్యం కలిగింది. అదెప్పటికీ పోదు.

    ReplyDelete
    Replies
    1. హిందీ వాళ్ళ పౌరాణికాల్లో ' ప్రభూ... ఆప్ ధన్య హో ' అనే డైలాగ్ విని మేము చిన్నప్పుడు ఇలాగే ఫీలయ్యమండి 😊

      Delete
  4. ఇంతకన్నా చక్కటి నివాళి ఆమహనీయుడికి ఎవ్వరివ్వగలరు? పాటని అనుభవిస్తూ, ఆర్తితో మీరుచేసిన కార్యక్రమం చాలా అభినందనీయం.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ వెరీ మచ్ అండి

      Delete
  5. ఇంతకు ముందు మీరు రాసిన సియోస్తా చదివాను ఈనాడు సండే మ్యాగజిన్ లో.ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ "పెంపకాలు" అని ఈ రోజు చదివాను. చాలా సంతోష్ వేసింది.మీ సియోస్తా చదివే నేను కూడా కథలు రాయడం ప్రారంభించాను మూడు సంవత్సరాల క్రితం. క్రమం తప్పకుండా ఈనాడు కు పంపుతున్నా రిజెక్ట్ అవుతూ వస్తున్నాయి. ఓ నెల క్రితం పంపిన కథకి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.కాబట్టి నా కున్న కింది సందేహాలు నివృత్తి చేయగలరని మనవి.

    1.మీరు "పెంపకాలు" కథ పంపి ఎన్ని రోజులవుతుంది.

    2.ప్రచురణకు సెలెక్ట్ అయిన తర్వాత ఏమైనా రిప్లై ఒస్తుందా మనకి ఈనాడు నుండి



    ReplyDelete
    Replies
    1. ఓ కథ ని ఇన్నాళ్లు గుర్తు పెట్టుకున్నందుకు చాలా సంతోషం అండి. మీరు అడిగిన ప్రశ్నల విషయానికొస్తే... నేను పంపి approx ఓ నెల అవుతోంది.
      ప్రచురణ కి సెలెక్ట్ అయిందని పుస్తకం చూస్తేనే తెలుస్తుంది. Wishing you the best in your writing journey.

      Delete

Post a Comment