చదువులలో మర్మమెల్ల ...

చాలా రోజుల నుంచి చదువులు, విద్యా వ్యవస్థ మీద నా ఆలోచనలు, అనుభవం షేర్ చేసుకుందామనుకుంటున్న. 

విద్యా వ్యవస్థ అంటే అందులో సిలబస్, బడి గంటలు, బడి పరిస్థితులు, ఫీజులు, భారత దేశం లో తల్లి దండ్రుల సైకాలజీ, పరీక్షా పద్ధతులు... ఇలా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఈ రోజు నా ఫోకస్ సిలబస్, బోధన లో నాకు నచ్చని పోకడలు ..... వీటి గురించే ఉంటుంది. 

చాలా విషయాల్లో లాగా ఈ సబ్జెక్టు కూడా బ్రిటిషు వాళ్ళు రాక ముందు, వచ్చాక .. ఇలా ఆలోచించాల్సి ఉంటుంది. 

గురుకుల విద్య మన సంప్రదాయం. తర్వాత స్కూళ్ళు మొదలయ్యాయి. అప్పుడొక మంచి, ఇప్పుడొక మంచి. అప్పుడు గురుకులాలు కొన్ని కులాలకు అందుబాటులో లేక పోయేవి. ఇప్పుడు స్కూళ్ళు అందరివీనూ. 

వృత్తి విద్యలు ఉండేవి. కానీ ఇవి కూడా ఆ వృత్తి కి చెందిన సామాజిక వర్గం వారే నేర్చుకుని సాధన చెయ్యాలనే నియమం ఉండేది. 

ఇవి అంతా మన విద్య ఆంగ్లీకరించక ముందు.  

బ్రిటిష్ వాళ్ళకి క్లర్కులే కావాలి కాబట్టి మన విద్యా వ్యవస్థ కూడా అలాగే డిజైన్ చేయబడింది అని తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏమీ మార్పు రాలేదా అంటే కొంత వచ్చిందని నాకు అనిపిస్తుంది. 

కానీ విద్యా నాణ్యత గురించి మాట్లాడితే నాకు కొన్ని సందేహాలు, పరిశీలనలు, అభ్యంతరాలు ఉన్నాయి. 

సిలబస్ లో ఉన్న ఓ మంచి విషయం.. అన్ని సబ్జక్ట్స్ ని పిల్లలకి పరిచయం చేయడం. స్కూల్ స్థాయి వరకూ ప్రతి ఒక్క బాలుడూ, బాలికా అన్ని సబ్జెక్టులు చదవాలి అని నియమం పెట్టడం మంచిదే నా అభిప్రాయం లో. అందరూ జోకులు వేస్తారు కదా ... ఆల్జీబ్రా జీవితం లో ఏం ఉపయోగపడుతుంది అని. దాని ఉద్దేశం అది కాదు. ఎదుగుతున్న లేత మెదడు ని అన్ని విధాలా వికసింపచేయడం. ఒక్కొక్క సబ్జెక్ట్ మెదడు లో ఒక్కొక్క భాగాన్ని ప్రేరేపిస్తుంది. అది ఎదిగే బ్రెయిన్స్ కి చాలా అవసరం. తర్వాత ఆ చిన్నారి ఆ సబ్జెక్టు ఎంచుకోకపోయినా సరే, ఆ వయసు లో అన్నీ తెలియడం ఎంతో ముఖ్యం. 

విద్యార్థి కి కొరుకుడుపడని సబ్జక్ట్స్ ఉంటాయని, వాటిని ప్రేమగా అతనికి అలవర్చాలని టీచర్ అనుకుంటే చాలు. ఈ విషయం లో తమ పిల్లల మీద ప్రెషర్ పెట్టకుండా తల్లిదండ్రులు ఉంటే చాలు. (కానీ అలా జరగదు. ఇక్కడే నాకో పెద్ద ప్రాబ్లమ్ ఉంది. దీని గురించి ముందు రాస్తా ). 

అసలు నేనైతే ఏ యేడు కా యేడు సిలబస్ ని బాగా ఎంజాయ్ చేసే దాన్ని. ముఖ్యంగా నాకిష్టమైన సబ్జక్ట్స్ ని. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఒకే సారి చదివేసే దాన్ని వచ్చిన వెంటనే. ఎంత మంచి కవులు, రచయితలని  పరిచయం చేసిందో సిలబస్! ఏ వయసు కి తగ్గట్టు అలా ఉండేవి కథలు, వ్యాసాలు. 

సైన్స్, సోషల్, మ్యాథ్స్ అస్సలు కొరుకుడుపడేవి కావు. కొంత స్నేహితుల సహాయం తో, అక్కడక్కడా టీచర్ల సహాయం తో నెట్టుకొచ్చాను. మ్యాథ్స్ ని, సైన్స్ ని నాకు ప్రేమ గా చెప్పిన వాళ్ళెవరూ లేరు ... అలా పరిచయం చేసి ఉంటే తెలుగు లో లాగా తొంభై మార్కులు వచ్చేవి అందులో కూడా. (అప్పటికీ టెన్త్ సైన్స్ లో రెండు పేపర్లు కలిపి 85 మార్కులు వచ్చాయి... నేను ఓ ఐదు మార్కుల డయా గ్రామ్ వదిలేశాక కూడా ... ఇది నాకు ఎప్పటికీ అంతు చిక్కని మిస్టరీ!)

నాకు ఇంకో ప్రాబ్లమ్ కూడా ఎదురైంది. సిలబస్ లో ఉన్నది టీచర్లు కూలంకషం గా చెప్పకపోవడం. 

పదో తరగతి బయాలజీ లో రెండు చాఫ్టర్లు ఉండేవి. ఒకటి మెన్స్ట్రు వల్  పీరియడ్స్ గురించి. రెండోది పునరుత్పత్తి గురించి. చక్కగా శాస్త్రీయంగా బొమ్మల తో సహా. అసలు అవి మాకు చెప్పనే లేదు. మాకే కాదు ... నాకు తెలిసిన స్కూళ్లలో ఎవరూ చెప్పినట్టు లేదు. 

ఇంగ్లీష్ లో ఓ కథ లో ఓ అబ్బాయి అమ్మాయి వేషం వేస్కొని ఒకావిడ ఇంటికి వెళ్తే ఆవిడ రెండు నిముషాల్లో చెప్పేస్తుంది వాడు మరువేషం లో ఉన్నాడని. ఎలా అంటే వాడి ఒళ్ళో కి ఆవిడ ఏదో విసిరితే వాడు గబుక్కున రెండు కాళ్ళూ ఎడంగా పెడతాడు. అమ్మాయిలు అలా చెయ్యరు కదా. ఈ సన్నివేశం ఎంత బాగా చెప్పచ్చు పిల్లలకి.. అమ్మాయిల బాడీ లాంగ్వేజ్ ఎందుకు అలా ఉంటుంది అని. ఓ టీచర్ నుంచి హుందాగా ఈ విషయం చెప్తే ఎంత బాగా తెలుసుకుంటారు పిల్లలు? అబ్బే ... అలాంటివేవీ జరగలేదు. అసలు ఇదో పెద్ద చర్చ. ఇలాంటివి చెప్పాలా వద్దా అని. చెప్పాలి. పెద్దవాళ్ళు హుందాగా మర్యాదగా వివరించాలి. లేకపోతే ఆ క్యూరియాసిటీ చెత్త మార్గాల్లో తీర్చుకోవాల్సి వస్తుంది పిల్లలకి. 

మా బడి లో టీచర్లని విమర్సించట్లేదు. వాళ్ళ ట్రైనింగ్ ని, ప్రాక్టీస్ లో కి వచ్చే సరికి సిలబస్ ఎలా డైల్యూట్ అయిపోతోంది ..ఇది చెప్పడం నా ఉద్దేశం. (మన దగ్గర చాలా స్కూల్స్ లో ట్రైన్ అయినా టీచెర్లేమీ ఉండరు కూడా.. ఇదో సమస్య) 

నాకు ఉన్న ఇంకో అతి పెద్ద సమస్య ... పరీక్షలే దిశగా, మార్కులే గోల్ గా సాగే బోధన. 

నాలెడ్జ్ ఓరియెంటెడ్ గా కాక ఎగ్జామ్ ఓరియెంటెడ్ గా సాగే చదువులు. 

ఉదాహరణ కి ఓ చాప్టర్ లో రెండు మార్కుల ప్రశ్నలే వస్తున్నాయి పరీక్షలో అంటే దానికి అంతే విలువ ఇస్తారు. ఒక చాప్టర్ ఎగ్జామ్స్ లో రాదంటే ఇంక మొహమాటానికి కూడా అది టచ్ చేయరు. అందులో విజ్ఞానం ఎంత బాగున్నా సరే. పైన నేను చెప్పిన బయాలజీ లో జరిగింది కూడా అదే. సిలబస్ లో చేర్చారు కానీ పరీక్ష లో ఆ చాప్టర్ నుంచి ఏవీ రావు. 

నేను లెక్చరర్ గా ఓ రెండేళ్ళు పని చేసాను. అంటే ఈ వ్యవస్థ లో నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఇదే సమస్య ఓ శిక్షకురాలిగా నాకు ఎదురైంది. 

నా క్లాసు లో ఎనభై మంది ఉండే వారు. కొంత మంది చురుకు గా నేర్చుకొనే వారు. కొంత మంది కి ఒకే విషయం రెండు మూడు సార్లు చెప్పి సాధన చేయించాలి. దొరికే వర్కింగ్ డేస్ లో వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే రోజులు తీసేస్తే నిజానికి పిల్లల తో లభించే సమయం తక్కువ. ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకొనే క్రమం లో ముందు ప్రాముఖ్యం పరీక్ష లో వచ్చే చాఫ్టర్లకే ఇవ్వవలసి వచ్చేది. ఇది కాలేజీ యాజమాన్యం నుంచి వచ్చిన పాలసీ కూడా. కానీ మా సీనియర్ లెక్చరర్ ఒకావిడ నాకు చెప్పారు. మిగిలిన చాఫ్టర్లు వదిలేయద్దు. కొంత టైం తీస్కొని చెప్పు అని. ఆవిడ అలాగే చేసే వారు కూడా. నేను అదే పద్ధతి ఫాలో అయ్యాను. 

ఇవి పరీక్ష లో రావు ...  కానీ విస్మరించాల్సిన పని లేదు . ... జ్ఞాన సముపార్జన ప్రధానంగా నేర్చుకుంటే పరీక్షలకి కూడా ఆటోమాటిక్ గా పనికొచ్చేస్తుంది కానీ పరీక్షల కోసమే ముక్కున పడితే చదువుకున్న అజ్ఞానులం అవుతాం ... అని చెప్పి మరీ ఆ చాఫ్టర్లు చెప్పాను. అది తృప్తినిచ్చింది నాకు. ఓ స్టూడెంట్ గా నాకు జరిగిన లోపం ఓ టీచర్ గా నేను రిపీట్ చేయకపోవడమే నా గెలుపు అనుకుంటాను. (త్రీ ఇడియట్స్ లో ఈ పాయింట్ అందరికీ అర్ధం అయ్యేలా బాగా చెప్పారు కూడా). 

కానీ ఈ  సమస్య ఒక్క కాలేజీ ది కాదు. అసలు మన చదువులే ఉద్యోగాల కోసం కదా. ఒక్కో దశకం లో ఒక్కో ట్రెండు నడుస్తుంది చదువుల్లో. ఒకప్పుడు డాక్టర్ అవ్వాలని పిచ్చి, తర్వాత సివిల్స్.. ఇప్పుడు ఇంజనీర్.. 

అంతే గానీ ఒక విద్యార్థి కి నచ్చిన, ఎంజాయ్ చేసే, టాలెంట్ ఉన్న సబ్జెక్టు ఏది? అందులో ఏ విధంగా ఉన్నత స్థాయి కి వెళ్ళచ్చు (సంపాదించుకుంటూనే) అని ఉండదెందుకు? 

టెన్త్ తర్వాత నాకు భాషలు చదువుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. అన్ని సబ్జక్ట్స్ భాషలే ఎందుకు కాకూడదు అనిపించేది. వెతకగా వెతకగా ఓ గవర్నమెంట్ కాలేజీ లో ఓ ఇంటర్మీడియెట్ కోర్స్  కనిపించింది. కోర్స్ పేరు గుర్తు లేదు కానీ.. ఐదు పేపర్లు. అందులో ఓ ఓరియంటల్ లాంగ్వేజ్,  ఇంగ్లీష్, సంస్కృతం, ఓ యురోపియన్ భాష .. ఇలా ఉన్నాయి. ఓరియంటల్ లో ఉర్దూ లాంటివి కూడా ఉన్నాయి. నాకు ఎంత ఆశ పుట్టిందో ఆ కోర్స్ చూసి. కానీ ఆ కోర్స్ కేవలం పేపర్ మీదే ఉంది. ఫాకల్టీ లేరట. ఎందుకంటే అన్నేళ్ళలో ఆ కోర్స్ పైన ఎవరూ ఆసక్తి చూపించలేదు. కారణం ఆ కోర్స్ చేస్తే భవిష్యత్తు ఏంటో తెలియకపోవడమే. నేను చివరికి ఓ జాబ్ ఓరియెంటెడ్ కోర్స్ లోనే జాయిన్ అవ్వాల్సి వచ్చింది. 

ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఎం.ఏ ఇంగిలీషు లో జాయిన్ అయ్యాక కొంత ఆశ తీరింది. కానీ అప్పుడు కూడా అన్ని భాషాలేమీ కాదు. ఒక్క ఇంగ్లీషే. 

అవును. మనది పేద దేశమే. ఇక్కడ ఉద్యోగమే ముఖ్యం. అందుకే మన విద్యా వ్యవస్థ కూడా అలాగే ఉంది. తెలుసు. కానీ జ్ఞానసముపార్జన ఇష్టమైన వాళ్ళకి కూడా వెసులుబాటు ఉంటే బాగుంటుంది కదా అని.  

నాకు తెలిసిన ఒకమ్మాయి జర్మనీ లో రీసెర్చ్ కోసం వెళ్ళింది. ఆ అమ్మాయి చెప్పింది. ఒక సబ్జెక్టు లో కలిగే కుతూహలాన్ని ఫాలో అవుతూ అదెక్కడికి తీసుకెళ్తే అలా వెళ్తూ ఆ సబ్జెక్టు లో మునిగి తేలడం లో ఉండే ఆనందం అక్కడే అనుభవించాను అని. 

ఆ అమ్మాయి లాగా, నా లాగ ఎందరో ఉన్నారు ఇక్కడ కూడా. వ్యవస్థ లో ఏమీ లేక వేరే దేశాలకి వెళ్లగలిగిన వారు వెళ్తున్నారు, నా లాంటి వాళ్ళు తోచిన మార్గం లో జ్ఞాన పిపాస ని తీర్చుకుంటున్నారు. కానీ ఎప్పటికైనా నాలెడ్జ్ ఫర్ నాలెడ్జ్ సేక్ ... జ్ఞానం కోసమే జ్ఞానం.. ధనం కోసం కాదు.. ఉద్యోగం కోసం కాదు... పరీక్ష కోసం అసలు కాదు ... ఇలాంటి జ్ఞానం పంచుకొనే వాతావరణం కలిగించాలి. అలాంటి చోటు నుంచి పుట్టిన జ్ఞానం మళ్ళీ సమాజానికే పనికొస్తుంది. 

ట్రెండు చూసి కోర్సు లో చేరకుండా మనసు కి నచ్చిన కోర్సు చేసి సంపాదించుకొనే వ్యక్తి తన ఉద్యోగం ఎంత ఆనందంగా చేస్తాడు/చేస్తుంది? హమ్మయ్య ఫ్రైడే వచ్చింది.. అబ్బా మండే వచ్చిందా ... ఇలాంటి మాటలు వినపడవు. ఇదే ఆరోగ్యకరమైన సమాజం. కానీ ఇది చెప్తే మరీ ఐడియలిస్టిక్ గా మాట్లాడుతున్నామని అంటారు. 

సిలబస్ లో నాకు నచ్చని ఇంకో అంశం .. ప్రాక్టికల్ విషయాలని చేర్చకపోవడం. పదో తరగతి ఇంగ్లీష్ మీడియం లో పాసైన విద్యార్థికి బ్యాంకు అకౌంట్ గురించి ఏమీ తెలియదు.  ఓటు హక్కు వచ్చేసిన డిగ్రీ విద్యార్థిని కి ఓటింగ్ వ్యవస్థ గురించి ఏమీ తెలియదు (కాలేజీ లో కి పాలిటిక్స్ వచ్చేసినా అవసరమైన విజ్ఞానం ఉండదు). డిగ్రీ పాసయిన పిల్లలకి జాబ్ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఇది బాధేస్తుంది. సమాజం లో మనడానికి స్కూళ్ళు, కాలేజీలు పిల్లల్ని తయారు చేయవు ఏంటో. చదువుకున్న అజ్ఞానులని తయారుచేస్తున్నామా అనిపిస్తుంది. 

ఇంక ఆర్ట్స్ ని అయితే అస్సలు పరిచయం చెయ్యరు. మన కళలు ఏంటో... భారత నాట్యానికి, కూచిపూడి కి తేడా ఏంటి... ఓ సంగీత కచేరి ఎలా వినాలి ... పెయింటింగ్స్ ని ఎలా అర్ధం చేసుకోవాలి... పుస్తకాలు చదవటం ఎలా అలవర్చుకోవాలి... ఆర్టిస్ట్ గా కెరీర్ ఎంచుకుంటే లాభనష్టాలు, పాజిబిలిటీస్ ఏంటి ... ఇవేవీ చెప్పరు అసలు. 

'జనాలు చూస్తున్నారని ఐటమ్ నంబర్స్ పెడుతున్నాము' అనే సినిమా వాళ్ళ లాగా విద్యా వ్యవస్థ కూడా తల్లిదండ్రుల పోకడల మీదే బ్లేమ్ వేసేస్తుంది. ఇది ఇంక చెట్టు ముందా విత్తు ముందా అనే సమస్య లాగా తయారవుతుంది.  

థర్డ్ వరల్డ్ దేశం అయిన మనం గబుక్కున ఫిన్లాండ్, జర్మనీ లాంటి దేశాలతో పోల్చుకోలేం కూడా ఈ విషయం లో. అవును... వాళ్ళు డబ్బున్న దేశాలు.. జనాలు తక్కువ మంది ఉన్న దేశాలు. వాళ్ళకి అలా నడుస్తుంది. 

ఇక్కడ కూడా కొన్ని ఖరీదైన స్కూల్స్ బాగున్నాయి. పుస్తకాలు చదవటం, ప్రాక్టికల్ గా అన్నీ చూపించడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా లోకల్ భాష, విజ్ఞానం, సంస్కృతి  ... వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండదు. 

కడుపు నిండా తిండి తరవాత కడుపు నిండా విద్య అందరి హక్కు. పళ్లెం నిండా  లోక రీతులు, జ్ఞానం, విజ్ఞానము, రకరకాల భారతీయ సంస్కృతులు, కళలు, గణితం, రకరకాల శాస్త్రాలు, దైనందిన జీవనానికి ఉపయోగపడే విద్యలు, కామన్ సెన్స్, డబ్బు ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి, ఆటలు, స్మార్ట్ ఫోన్, టివి ల ని డిసిప్లిన్ గా వాడటం, బాత్రూం ఎలా వాడటం (ట్రస్ట్ మీ ... అస్సలు మన పిల్లలకి తెలీని విద్య ఇది)  .. ఇవన్నీ ఉంటేనే కదా అది సమతుల విద్య అవుతుంది. 

ఈ రోజు కాకపోతే రేపు  ఇలాంటి సమతుల విద్య అందరికీ అందుతుంది అని ఆశిస్తున్నాను. 



Comments

  1. Well this is an evergreen point of debate.

    Though i did try to understand the intricacies, i tried to answer in my own way. Taking the education of my children in my hands.

    Each child is born with multiple intelligences. The responsibility of guardian is to identify and facilitate learning in that area. Previously, there are small number of children and teachers used to take personal interest in children. Also their distractions were less.

    Now, incidentally, teachers are not well trained in psychology and they have less and less time. Thus the responsibility slowly shifts to parents, if they take it(many dont).

    The job(of a parent) starts with identifying the talents and interests of a child. They she can encourage the child in that area. Though it is not easy, at the beginning, it gives beautiful results at the end. It will be a treat to see child grow on his own, after 18 or 20.

    ReplyDelete
  2. మంచి విశ్లేషణ. ప్రస్తుతం విద్య వ్యాపార వస్తువయిపోయింది కాబట్టి మెరుగవుతుందని ఆశించలేం. ప్రభుత్వ పాఠశాలలు ఎలాగూ నిరాదరణకు లోనవుతున్నాయి.

    ఇక పోతే // “ బ్రిటిష్ వాళ్ళకి క్లర్కులే కావాలి కాబట్టి మన విద్యా వ్యవస్థ కూడా అలాగే డిజైన్ చేయబడింది అని తెలిసిన విషయమే. ” // అంటున్నారు మీరు. నా మనవి ఏమిటంటే ఈ వాదనను నమ్మవద్దని.

    నేనేమీ బ్రిటిష్ వాడికి అభిమానిని కాను గానీ ఒక ప్రశ్న అడుగుతాను - ఏం, వాళ్ళ దేశంలో వాళ్ళకు క్లర్కులు అవసరం లేదా? అందరు బ్రిటిషర్లు ICS ఆఫీసర్లు అవలేదు, వైస్రాయిలు అవలేదు. వాళ్ళ దేశంలోనూ వివిధ ప్రభుత్వ కార్యాలయాలుంటాయి (పరిపాలనకు అవసరం), వాటిలోనూ క్లర్క్‌లు ఉంటారు. ఆ క్లర్క్‌లకు కాస్త విద్యార్హతలు ఉండాలి కదా - ఇంగ్లీషులో వ్రాయడం, కొంచెం లెక్కలు, కొంచెం జాగ్రఫీ వగైరా అవగాహన. బ్రిటన్ లోని స్కూళ్ళల్లోనూ అవే బోధిస్తారు కదా. అవే మన దేశంలోనూ ప్రవేశపెట్టారు ఆంగ్లేయులు. మరి ఆ చదువులే చదివిన భారతీయులు కొంతమంది కూడా ఆంగ్లేయులతో పోటీపడి ICS పరీక్షలు వ్రాసి సెలెక్ట్ అయ్యారు కదా. అలాగే ఇంజనీర్లు, డాక్టర్లు, జడ్జీలు, ప్రొఫెసర్లు, నోబెల్ గ్రహీతలు టాగోర్, రామన్ లాంటి వారు కూడా తయారయ్యారు కదా - క్లర్కులు మాత్రమే కాక.

    కాబట్టి ఆ క్లర్క్ ల తయారీ చదువులు అనే వాదన నిరాధారమని నా వ్యక్తిగత అభిప్రాయం.

    ReplyDelete
  3. మన విద్యా విధానం వైట్ కాలర్ జాబ్స్ కోసమే రూపొందించ బడింది. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, భవన నిర్మాణం , ఇత్యాది పనులలో ఫార్మల్ ట్రైనింగ్ లేదు. ఆ పనులు చేయడం పట్ల ఒక విముఖత, చిన్న చూపు ఉంటుంది. నిజ జీవితం లో ఉపయోగపడే పనులు ఏవీ మన చదువుల్లో చెప్పరు. కాల్కులస్, ఆల్జీబ్రా, ఇలాంటివి అందరికీ అవసరం లేదు. ఏదైనా ఉద్యోగం లో చేరిన తరువాత కూడా మనం చదివే చదువు అంతగా ఉపయోగం లేదు. కొంతవరకూ కంప్యూటర్ రంగం నయం. ఎలక్రికల్ ఇంజనీరు కు ఫ్యుస్ వేయడం కూడా రాదు.

    దీనికి తోడు 990 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 80% పైన మార్కులు అందరికీ ఇవ్వకూడదు. మార్కులకు విలువ లేదు.

    ReplyDelete
  4. "వృత్తి విద్యలు ఉండేవి. కానీ ఇవి కూడా ఆ వృత్తి కి చెందిన సామాజిక వర్గం వారే నేర్చుకుని సాధన చెయ్యాలనే నియమం ఉండేది." - ఇది కొంచెం సత్యదూరమైన సూత్రీకరణ.

    మిగిలిన ప్రాంతాల విషయం వదిలేసి చూస్తే తెలుగు నాట మనం చూస్తున్న కులాలు అన్నీ వృత్తుల మీద ఏర్పడినవే.సా.శ 1వ శతాబ్దపు శాతవాహన సామ్రాజ్యంలో ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క శ్రేణి ఏర్పడి ఆయా వృత్తులని స్థిరమైన ఆదాయ వ్యవస్థల కింద మార్చాయి.శాసనాల సాక్ష్యం ప్రకారమే ఈ శ్రేణులు రాజులకి బడ్జెటరీ ఫైనాన్స్ చెయ్యగలిగిన స్థాయిలో ఉండేవి.ఇందులోని ముఖ్యమైన అంశం ఒక వృత్తికి సంబంధించిన వారు ఒక సమూహమై తమకు కావలసిన సౌకర్యాల కోసం లాబీయింగ్ చేసుకుంటూ అంతర్గత ఐక్యత కోసం కొన్ని నియమాలను పాటిస్తూ ఉండటం.ఇవి ఏర్పడిన మొదటి దశలో "ఆ వృత్తి కి చెందిన సామాజిక వర్గం వారే నేర్చుకుని సాధన చెయ్యాలనే నియమం" ఏదీ లేదు.అయితే, ఆ వృత్తిని డెవలప్ చెయ్యడం వేగంగా జరగాలంటే ఆ వృత్తికి సంబంధించిన అందరూ ఒకే చోట చేరాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక చోట చేరి వారిలో వారే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు.

    వృత్తిపరమైన ఐక్యత పెళ్ళిళ్ళు కూడా వారిలో వారే చేసుకోవటం తరాల పాటు కొనసాగి ఈ శ్రేణులు కులాల కింద స్థిరపడిన తర్వాత కూడా ఒక కులం నుంచి ఇంకో కులానికి మారడం కూడా చరిత్రలో రికార్డ్ అయ్యింది.అంటే, కమ్మరి కులంలో పుట్టిన ఒక కుర్రాడికి కుమ్మరి పని నచ్చితే ఆ వృత్తిని నేర్చుకోవడమూ జరిగేది.అయితే, ఆ వృత్తిని డెవలప్ చెయ్యడం వేగంగా జరగాలంటే ఆ వృత్తికి సంబంధించిన అందరూ ఒకే చోట చేరాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కుర్రాడి నివాసం మారేది,ఆ వృత్తివారితో పెరిగిన చనువు వల్ల పెళ్ళిళ్ళకి కూడా అభ్యంతరం ఉండేది కాదు.

    ఇప్పటికీ కాపు కులస్థులు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కులం పట్టింపు చూదరు - చాలా లిబరల్.

    ReplyDelete

Post a Comment