"యాక్షన్ హీరో"
లేటెస్ట్ సినిమాలు చూసి రివ్యూ లు పెట్టడం అలవాటు లేదు నాకు. కానీ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమా గురించి తప్పకుండా రాయాలనిపించింది.
దీని ట్రైలర్ చూసి థియేటర్ లో చూద్దామనుకున్నా. కుదర్లేదు. ఇంట్లో అమెజాన్ లో చూసాను.
ఇది అంత హిట్ సినిమా కాదు ..... కానీ ఈ కాలానికి చాలా అవసరమైన సినిమా.
ఎప్పుడూ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లని విమర్శిస్తాం కదా .... మీరు కోట్లలో బిజినెస్ చేస్తారు .. పెద్ద స్టార్లందరూ మీ గుప్పెట్లో ఉంటారు .. మంచి సినిమా తీయచ్చు కదా అని. ఈ సినిమా అలంటి విమర్శల కి యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ జవాబు అనిపిస్తుంది. (యష్ రాజ్ కి నాకూ ఏ సంబంధం లేదండి బాబు ... నిజంగా నచ్చే చెప్తున్నా).
ఈ సినిమా హీరో రణ్వీర్ సింగ్. హీరోయిన్ అర్జున్ రెడ్డి లో హీరోయిన్ అయిన షాలినీ పాండే. రత్నా పాఠక్ షా, బోమన్ ఇరానీ ల తో పాటు కొత్త వాళ్ళు మంచి నటులు కనిపించారు ఇందులో.
కథ ఏంటంటే బోమన్ ఇరానీ గుజరాత్ లో ఓ పల్లెటూరి సర్పంచ్. కరడు గట్టిన పురుషాహంకారం, లింగ వివక్ష, పితృస్వామ్యం లో ఉన్న చెత్త అంతా మూర్తీభవించిన వాడు. స్కూల్ ముందు మందు దుకాణం మూయించండి, తాగి ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు అంటే 'ఆడపిల్లలు వాసన వచ్చే సబ్బులు వాడటమే ఇందుకు కారణం .. సబ్బుల్ని బాన్ చేస్తున్నాను' అని తీర్పు ఇస్తాడు. (ఇలాంటి స్టేట్మెంట్స్ రాజకీయ నాయకులు ఇవ్వటం ఎన్ని సార్లు వినలేదు? ఎన్ని ఫత్వాలు చూడలేదు)
అతని కొడుకు హీరో రణ్వీర్ సింగ్. జయేష్ అతని పేరు. ఇతని భావాలు తండ్రికి పూర్తి వ్యతిరేకం. భార్య అంటే ఎంతో ఇష్టం, ఆమె కి రహస్యంగా డ్రైవింగ్ నేర్పిస్తాడు. పదేళ్ల కూతుర్ని ఎంతో ముద్దు గా చూసుకుంటాడు. కానీ తండ్రి అంటే భయం.
జయేష్ వివాహం కుండ మార్పిడి సంప్రదాయం లో జరిపిస్తారు. జయేష్ చెల్లి ని షాలిని పాండే అన్నకే ఇస్తారు. ఇది ఇన్సూరెన్సు కోసం అని వాయిస్ ఓవర్ లో హీరో అంటాడు. షాలిని పాండే అన్న జయేష్ చెల్లిని కొడుతూ ఉంటాడు. ఆమె వీడియో కాల్ లో ఆమె దెబ్బలని చూపించి ఏడుస్తూ ఉంటుంది. దానికి బోమన్ ఇరానీ చెప్పే న్యాయం ఏంటంటే జయేష్ షాలిని పాండే ని కొట్టాలి అని. ఆ ఇంట్లో నా ఆడ బిడ్డ దెబ్బలు తింటే, ఈ ఇంట్లో వాళ్ళ ఆడ బిడ్డ తన్నులు తినాలి. అంతే గాని తన కూతరుని ఆ నరకం నుంచి తప్పించాలి అని మాత్రం అనుకోడు.
జయేష్ హింస కి దూరం. అందులో ఆడదాని మీద అస్సలు చెయ్యి ఎత్తడు. కానీ తండ్రిని నమ్మించడం కోసం తలుపులు వేసి దిండుని కొట్టి భార్య ని అరిచి నటించమంటాడు. కూతురు కూడా కొట్టద్దు "నాన్న అమ్మని కొట్టద్దు నాన్న" అని కేకలు వేస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఉంటుంది.
ఇలా అటు తండ్రినీ, ఇటు భార్య నీ నొప్పించకుండా మేనేజ్ చేసేస్తూ ఉంటాడు జయేష్.
ఇంతలో వీరి పంచాయితీ సీటు ఆడవారి కి రిజర్వ్ చేస్తారు. బోమన్ కోడలైన షాలిని ని ఆ సీట్ లో నిలబెట్టి గెలిపించి తానే యేలేస్తూ ఉంటాడు. ఆమె డమ్మీ కాండిడేటు.
షాలినీ నిండు గర్భవతి. లింగ నిర్ధారణ పరీక్ష నేరం అని తెలిసినా ఉత్తర భారత దేశం లో కొన్ని పల్లెల్లో ఇంకా జరుగుతోందట. డాక్టర్ 'జై మాతా దీ' అంటే ఆడ పిల్ల అని కోడ్. 'జై శ్రీ కృష్ణ' అంటే పుట్టబోయే శిశువు మగ పిల్లవాడు అని. (బాలికా వధు అనే సీరియల్ లో కూడా ఈ దారుణం గురించి చూపించారు) బోమన్ ఇరానీ కి వంశోద్ధారకుడు కావాలి. ఇప్పటికే షాలినీ కి నాలుగైదు అబార్షన్లు అయ్యాయి అని చెప్తారు. ఇంక ఆమె శరీరానికి ఇంకో కాన్పు ని తట్టుకొనే శక్తి లేదని హెచ్చరిస్తుంది లేడీ డాక్టర్.
అల్ట్రా సౌండ్ లో స్పష్టంగా ఏదీ తెలియట్లేదు అని అబద్ధం చెప్తుంది డాక్టర్ పెద్దవాళ్ళ ముందు. జయేష్ ఒక్కడూ ఉన్నప్పుడు 'జై మాతాదీ' అంటుంది.
జయేష్ కి అర్థమయిపోతుంది. తన తండ్రి ఈ బిడ్డని కననివ్వడు. ఇంక షాలిని కి కనే శక్తి లేదు కాబట్టి తనకి ఇంకో పెళ్ళి కూడా చేసేస్తాడు.
షాలిని ని, తన పుట్టబోయే బిడ్డ ని కాపాడుకోడానికి అతను పడే పాట్లే మిగిలిన సినిమా అంతా.
ఈ సినిమా రాసుకొనే అప్పుడు 'యాక్షన్ హీరో' అనే పేరు పెట్టుకున్నారట వర్కింగ్ టైటిల్. ఇది వ్యంగ్యార్థం. ఎందుకంటే అస్సలు ఈ సినిమా లో ఒక్క ఫైట్ కూడా చెయ్యడు హీరో. వీరోచితమైన సీన్లు ఎక్కడా ఉండవు. ఒక బలహీనమైన వ్యక్తి తన కుటుంబాన్ని రక్షించుకోడానికి ఏం చేస్తాడు, ఎలా ఆలోచిస్తాడు ... అలాగే ఉంటుంది సినిమా. పోనీ ఆ ప్లాన్లు అతి తెలివి గా కూడా ఉండవు.
హర్యానా లో ఓ పల్లెటూరిలో ఆడపిల్లలు లేక ఊరు ఊరంతా బ్రహ్మచారులే. వాళ్ళు యూట్యూబ్ లో ఓ వీడియో చేస్తారు ... ఎవరైనా ఆడపిల్లలు తమ ఊరికి వస్తే కంటికి రెప్పలా చూసుకుంటాం అని, వారికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని. వాళ్ళందరూ వస్తాదులు. ఆ ఊరికి తన కుటుంబాన్ని తీసుకెళదామని జయేష్ ప్లాన్. (ఇలాంటి ఊరిని ఆమిర్ ఖాన్ 'సత్యమేవ జయతే' షో లో చూపించారు.)
ఆడవారి సమస్యలు చూపించే అప్పుడు నూటికి తొంభై సినిమాల్లో చాలా తప్పులు దొర్లుతాయి. ఇది రాసే వారికీ తెలీదు ... చూసే వారికీ తెలీదు. (నాకు చాలా ఆవేశం కలిగించే విషయం ఇది .... దీని మీద నేను ఓ సెపరేట్ బ్లాగు పోస్టు రాసినా ఆశ్చర్యపోక్కర్లేదు)
అందులో ప్రప్రథమం .... ఆడవారిని రక్షించడానికి ఓ మగాడు రావడం. దీని వల్ల ఆడవారిని మళ్ళీ బలహీనులుగా, రక్షించాల్సిన అవసరం ఉన్నవారి గా చూపిస్తున్నారు అని ఎవరూ గ్రహించరు.
ఆ రక్షించడానికి వచ్చే మగాడు తను కూడా ఎన్నో తప్పులు చేస్తాడు కానీ అతన్ని ఎవరూ తప్పు పట్టరు ... ఉదాహరణ కి అతను హీరోయిన్ ని వెంటాడి వేధించి ప్రేమిస్తాడు. అదే పని ఇంకోడు చేస్తే ఇతను వెళ్లి కొడతాడు.
అలాగే స్త్రీ సమస్యలు చూపించే అప్పుడు విలన్లు మగాళ్ళే ఉంటారు ... నిజానికి పితృస్వామ్యాన్ని జీర్ణించుకున్న ఆడవాళ్ళు కూడా సమస్య లో భాగమే.
కమర్షియల్ సినిమా పరిధి లో 'మార్పు' కి అవకాశం లేదు. తప్పు చేసిన వాడు విలన్, వాడ్ని చంపేయాలి. కానీ కుటుంబ సమస్యల్లో తండ్రి, తల్లి మారాలి అని కోరుకుంటాం కానీ చచ్చిపోవాలి అనుకోము కదా.
ఒక వేళ కమర్షియల్ సినిమా లో ఎవరైనా మారితే ఆ మార్పు నమ్మశక్యం కాకుండా ఉంటుంది ... అప్పుడే ఎలా మారిపోయారు అనిపిస్తుంది.
ఇలాంటి తప్పుల్ని జయేష్ భాయ్ జోర్దార్ సినిమా చెయ్యలేదు.
ఫెమినిజం టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ సినిమా తీశారనిపిస్తుంది.
భార్య పట్ల ప్రేమ, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని తపన తప్పించి హీరో కి ఇంకే శక్తులు లేవు ఈ సినిమా లో. ఇది చూడటానికి అందరికీ చాలా కొత్త గా ఉండచ్చు. కానీ ఇలాంటి హీరో పాత్రలు రావాల్సిన అవసరం చాలా ఉంది. అందరు ఆడవారి మధ్య కూర్చొని ఏడుస్తూ ఉంటాడు జయేష్. బోమన్ ఇరానీ ఇది చూసి 'ఏడవటం ఆపు' అంటాడు. అతనికి తల కొట్టేసినట్టు ఉంటుంది. పితృస్వామ్యం మగవారిని నుంచి లాగేసుకున్న సున్నితత్వాన్ని హీరో వ్యక్తీకరిస్తే, అదే పితృస్వామ్యానికి ప్రతీక అయినా బోమన్ అస్సలు భరించలేకపోతాడు. ఇది చూపించడం చాలా ముఖ్యం.
హీరోయిన్ పాత్ర కేవలం బాధిత, అమాయకురాలు కాదు. ఓ వైపు 'నేను మీకు కొడుకునివ్వలేకపోయాను' అని ఏడుస్తుంది బేలగా. (అప్పుడు జయేష్ అంటాడు ... కొడుకు పుట్టడానికి కావాల్సిన వై క్రోమోసోమ్ నా నుంచే రావాలి .. కాబట్టి సారీ.. నేనే నీకు కొడుకునివ్వలేకపోయాను అని ... ఈ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. నిజమే కదా మరి!) ఇంకో వైపు వీళ్ళు తప్పించుకొని పారిపోదాం అనుకునే అప్పుడు 'మరి ఊళ్ళో మిగిలిన ఆడవాళ్ళ సంగతి ఏంటి?' అని జయేష్ ని అడుగుతుంది. వారు అలా కష్టాలు పేరుతో ఉండాల్సిందేనా అని బాధపడుతుంది.
జయేష్ పెద్ద కూతురి క్యారెక్టర్ కూడా బాగా రాశారు. అది సీమ టపాకాయ. తండ్రి లో లేని వీరత్వం ఆ పిల్ల లో ఉంటుంది. తండ్రి ని చాలా సార్లు మోటివేట్ చేస్తుంది కూడా.
రత్నా పాఠక్ షా షాలిని అత్తగారు. ఇందాక చెప్పినట్టు పితృస్వామ్యాన్ని జీర్ణించుకున్న స్త్రీ. జయేష్ ఆమె తో చెప్పే మాటలు చాలా బాగుంటాయి. 'అమ్మా .. నిన్నెవరూ సరిగ్గా ప్రేమించలేదమ్మా' అంటాడు. ఆమె ఆ మాటలు విని అతన్ని చెళ్ళున కొడుతుంది. వెంటనే ఆ మాటలు యాక్సెప్ట్ చేయలేకపోతోంది. ఇది చాలా నాచురల్ గా చూపించారనిపిస్తుంది.
సినిమా అంతా ఓ పెద్ద సమస్య కి హీరో చేసే సిల్లీ చిట్కాలు, కలిసొచ్చే కలిసిరాని ప్రయోగాలు .. ఇలాగే గడిచిపోతుంది. వాళ్ళ మూఢ నమ్మకాల ని వాళ్ళకే వ్యతిరేకంగా వాడటం చాలా మంచి పాయింట్ సినిమా లో ...( షాలిని, కూతురు పారిపోతుంటే వాళ్ళ ని వెంబడించడం లో నల్ల పిల్లి ఎదురొస్తే చచ్చినట్టు ఆగి, వెనక్కి రెండు అడుగులు వేసి మళ్ళీ వెంబడించే లోపు వాళ్ళిద్దరికీ తప్పించుకొనే అవకాశం వస్తుంది!! )
జయేష్ చెల్లిని మొగుడు కొడుతూ ఉంటాడు కదా ... ఆ సమస్య కి కూడా సరైన పరిష్కారం చూపించారు. ఆ అమ్మాయి కి ఆ వస్తాదుల్లో ఒకడు నచ్చి పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుంది. అంతే తప్ప మొగుడు ఎలాంటి వాడైనా కాపురం చేసుకోమ్మా అనో .. ఆ మొగుడు మారినట్టో, ఈమో హీరోనో అతన్ని మార్చినట్టో చూపించలేదు.
అన్ని అబార్షన్లు అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టినా భార్య ని కనీసం ముద్దు పెట్టుకోలేదని వాపోతాడు జయేష్. మనవరాలు పుట్టి, కొడుకు కనువిప్పు చేసాక, భార్య నిలదీసి మాట్లాడక తన మంచాన్ని ఆమెకి దగ్గరగా జరుపుతాడు బోమన్. ప్రేమ లేని పెళ్లిళ్లు, సున్నితత్వం లేని సంసారాల్లో ఆడవారు ఎంత బాధ పడుతున్నారో బాగా చూపించారు అనిపించింది.
ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం అవసరం.
ఏ సినిమా అయినా చెయ్యగల స్టార్ ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం అవసరం.
హీరో వీరత్వం కాదు .. అతని స్టార్డం ని ఓ సమస్య ని హైలైట్ చెయ్యడానికి వాడుకోవడం అవసరం.
ప్రధాన తారాగణం తప్ప సహనటులందరూ కొత్తవాళ్ళే. చాలా బాగా చేశారనిపించింది.
సినిమాలో అనవసరంగా పాటల్లేవు. ఇది ఇంకో మంచి విషయం.
సినిమా చూసినంత సేపు వారితో నవ్వడం, ఏడవడం .. ఎమోషనల్ అవ్వడం జరిగింది. కానీ సినిమా సింక్ అయ్యాక చాలా తృప్తి గా అనిపించింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఉంది ఈ సినిమా. తెలుగు సబ్ టైటిల్స్ సౌకర్యం కూడా ఉంది.
నాకు నచ్చిన సినిమాల గురించి ఇంతకు ముందు రాసిన పోస్ట్లు కొన్ని ఇక్కడ లింక్ ఇస్తున్నాను.
http://sowmyavadam.blogspot.com/2020/03/blog-post_28.html
http://sowmyavadam.blogspot.com/2018/12/blog-post.html
http://sowmyavadam.blogspot.com/2018/09/blog-post.html
ఉంటాను. మళ్ళీ కలుస్తాను. జై మాతాదీ ... జై శ్రీ కృష్ణ!
అయితే హీరో జయేష్ కత్తిమీద సాము చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నమాట 🙂? వెరీ గుడ్ 👍. గాట్లు పడకుండా ఉంటే చాలు.
ReplyDelete😊
ReplyDelete