ప్లేట్లో వేడి వేడి టిఫిన్...

2008.... 

అప్పుడే పన్నెండేళ్ళు గడిచిపోయాయా? నిట్టూర్చింది సౌమ్య. 

తెల్లబడుతున్న తన ముంగురులని వెనక్కి తోసుకుని మళ్ళీ రాయనారంభించింది. 

కాలానికి ఏమి? అది అలా వెళ్లిపోతుంటుంది .. అవి మిగిల్చే అనుభవాలతో, జ్ఞాపకాలతో బ్రతకడమే మన పని ... ఏదో ఓ రోజు మనం కూడా కాలం చేస్తాం .. మన తర్వాతి వారికి ఏది మిగిల్చి వెళ్తాము అనేదే  మన చేతిలో ఉన్నది. 

ఇంతవరకూ రాసి కలం పక్కన పెట్టి కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. రైటింగ్ టేబుల్ మీద పెట్టిన కాఫీ ఎప్పుడో చల్లారిపోయింది... తన ఆవేశాల్లాగా ... 

2008... 

అవి నేను బ్లాగ్ లో ఫిక్షన్ అంటే కాల్పనిక సాహిత్యం రాసే రోజులు! కానీ పైన రాసిన లాంటి డ్రమాటిక్ ఫిక్షన్ కాదనుకోండి ... వ్యంగ్యం. (పైన రాసింది కూడా వ్యంగ్యమే అని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. 😉)

ఫిక్షన్ రాయడం నాకు మహా బోర్ .... నేను చెప్పాలనుకున్న విషయానికి ఓ కథ అల్లి, పాత్రల చిత్రణ చేసి, ఓ ప్రపంచం సృష్టించి.... ఆ పాత్రల చేత అనుకున్న మెసేజ్ ని చెప్పీ చెప్పకుండా చెప్పించడం ... అది దానంతట అదే పాఠకుడికి తట్టేలా చెయ్యడం .. అబ్బో .. చాలా డబుల్ పని. దాని బదులు .. ఇది ఇది .. అది అది .. అని సూటిగా చెప్పేస్తే బోల్డు పేపర్ సేవ్ అవుతుంది అని నా అభిప్రాయం 😁 ('చారు ఎలా వండాలో ఓ పాత్ర చేత చెప్పించి' అనే జంధ్యాల గారి జోకు గుర్తొచ్చింది ఇది రాస్తుంటే!)

ఇదంతా కూడా కొంత వ్యంగ్యమే అండీ బాబు .. కాల్పనిక సాహిత్యం అంటే నాకు బోల్డు ప్రేమ ఉంది. అసలు నేను ఫిక్షనేతర పుస్తకం చేతిలో కి తీసుకోవడం చాలా తక్కువ! రాయడం దగ్గరకొచ్చేసరికి ఫిక్షన్ అంటే కొంత బద్ధకం .. అంతే. కానీ ఒక్క విషయం .. చదవడమైనా .. పేరాలు పేరాలు, పేజీలు పేజీలు సాగే వర్ణనలు, చైతన్య స్రవంతులు (stream of consciousness ... స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్ నెస్ అనే రచనా ప్రక్రియ .. ఇందులో రచయిత కి ఏది తడితే అది ఏ మాత్రం ఎడిటింగ్ లేకుండా రాసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట!), 

మూస వాడుకలు కొన్ని ఉంటాయి .. అవి భరించడం కష్టం! అలాంటి మూస వేడుకలు కొన్ని - 

1. ప్లేట్లో వేడి వేడి టిఫిన్... టిఫిన్ ప్లేట్లో పెట్టడం కూడా వర్ణించాలా? అంత చెప్పిన వాళ్ళు ఆ వేడి వేడి టిఫిన్ ఏంటో చెప్పరు ... నేను అలా చెప్పనప్పుడల్లా ఉప్మా ఊహించుకుంటాను. 

2. కాఫీ (నాకసలే అలవాటు లేదేమో ... ఇంకా ఇది అనవసరమైన అంశం గా అనిపిస్తుంది!)

3. కాటన్ చీర, మల్లె పూలు 

4. సూర్యోదయ, సూర్యాస్తమయ ఉపమానాలు, 

5. 'ముందుకు వెళ్తున్న బస్సు/రైలు/పడవ/విమానం నన్ను గతం లోకి తీస్కెళ్ళాయి'

6. 'చెప్పొద్దూ' ... ఎన్ని కథల్లో నవలల్లో చదివానో బాబోయ్ ఈ వాడకం  

 ('చివరకు మిగిలేది' .. సుమారు ఇంకో ఇరవై పేజీల్లో నవల అయిపోతుంది అనగా ఓ సుదీర్ఘ వర్ణన ఉంటుంది .. అది ఆ నవల హీరో అయిన దయానిధి 'చైతన్య స్రవంతి'. ఎంత చదివినా ఆ స్రవంతి తెగదు ... సరిగ్గా పాఠకుడికి విసుగొచ్చే వేళకి నిధి డైలాగ్ ఉంటుంది 'ఏవిటీ ఎడతెగని వర్ణనలు' అని!😊)   

2008 లో ఓ బ్లాగ్ స్టార్ట్ చేసాను నేను. అందులో నాకిష్టం వచ్చినవి రాస్కొనేదాన్ని .. కొన్ని ఇంగ్లీష్ లో, కొన్ని తెలుగు లో .. కొంత ఇంగ్లీష్ కవిత్వం, తెలుగు చిట్టి ఫిక్షన్, పొలిటికల్ సెటైర్ వగైరా రాసేదాన్ని. 

నా ఇంగ్లీష్ నాటకం 'ఫైవ్ విమెన్ అండ్ ఎ బిల్' ఆ బ్లాగు లోనే ఓ పోస్టు గా మొదట రాసాను. దీని గురించి నాటకాల జగతి లో రాసాను ఇది వరలో. (తెలుగులో నాటకాల జగతి అని టైప్ చేస్తే గూగుల్ లో మొదటి రిజల్ట్ నా బ్లాగే నండోయ్!!!!!!!!😀 కానీ ఈ పదాలు గూగుల్ చేసే వారెవరూ ఉండరనుకోండి .. అది వేరే విషయం😄)

2015 వరకూ అప్పుడొక పోస్టు ఇప్పుడొక పోస్టు రాసాను. తర్వాత పని బాగా పెరగడం వల్ల టైం కుదిరేది కాదు. 

ఈ రోజు ఎందుకో అందులో ఒక పోస్టు షేర్ చేసుకుందాము అనిపించింది. ఆ బ్లాగ్ పోస్టు పేరు 'జడ' ... చిన్న ఫిక్షనల్ పీస్. దాన్ని కథ అనలేం ..  చిన్నది కాబట్టి. (ఇప్పుడే చూసాను .. ఈ బ్లాగ్ రాసింది జూన్ పదకొండు .. అంటే రెండు రోజులు అటూ ఇటూ గా సరిగ్గా పన్నెండేళ్ళు!)


ఆ బ్లాగ్ పోస్టు 'జడ' ఈ రోజు మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. 

దానికి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో. 

పన్నెండేళ్ళ క్రితం, ఇంకో బ్లాగు లో రాసిన ఓ పాత పోస్టు షేర్ చేసుకోవడానికి ఇంతెందుకమ్మా రాయడం ... ముఖ్యంగా ఆ మొదటి నాలుగు పేరాలు? 'ఇది చదవండి' అని లింక్ పోస్టు చేస్తే సరిపోతుంది కదా అంటారా? 

ఇప్పుడర్ధమైందా ఫిక్షన్ తో నా సమస్య ఏంటో!!! 

Comments

  1. Chala baga raasaru

    ReplyDelete
  2. పైన మొదటి 2008 వ్యంగ్యం అంటారా? అలా అనిపించలేదే రెండు సార్లు చదివినా.

    “చైతన్య స్రవంతి” కొంచెం గనక అయితే బాగానే ఉంటుందండి ...పాత్రల భావాలు పాఠకులకు తెలియజెప్పడానికి. ప్రతిదీ సంభాషణగానే వ్రాయలేరు కదా? అన్నట్లు మూసవాడుకలకు మీరిచ్చిన ఉదాహరణల్లో కాఫీని సింపుల్ గా కాఫీ అని వదిలేశారు. మూసలో చెప్పాలంటే “పొగలు గక్కుతున్మ కాఫీ” అనాలి 😁. ఏమిటో నేను కాఫీ వేడిగానే ఇష్టపడతాను గానీ కప్పులో కాఫీ ఈ పొగలు గక్కటం ఎప్పుడూ చూడలేదు 😕.
    “జడ” కథ సరదాగా ఉంది. ఆ పనికి మీరు ఆస్థాన విద్వాంసులు అన్నమాట, గుడ్ 🙂.

    ReplyDelete
    Replies
    1. ఆ పొగ కనపడదండీ. ఫిల్టర్ కాఫీ ఘుమ ఘుమ వంటగది నుండి ఇల్లంతా వ్యాపిస్తుంది.

      పడికట్టు పదాలు అనేవి అవసరమే. సాహిత్యం లో నైనా సంగీతం లో నైనా. The new words or phrases coined or put together by experts keep adding to the lexicon. The great musicians individual style becomes a bani.

      We keep discovering novelty in the routine.

      ప్లేట్ లో వేడి వేడి టిఫిన్ అనగానే ఎవరికి ఇష్టమైన ఉపాహారం వారికి కనిపిస్తుంది.

      Delete

Post a Comment