నాటకాల జగతి

తాడేపల్లిగూడెం లో మా పక్కింటి మల్లాది సూర్యనారాయణ మాస్టారు 'పాప దిద్దిన కాపురం' అనే నాటకం లో ఓ తొమ్మిదేళ్ళ  నన్ను టైటిల్ రోల్ లో తీసుకున్నప్పుడు నాకు రంగస్థలం తో మొదటి సారి పరిచయం ఏర్పడింది. 

కట్నం పేరుతో మా వదిన ని వేధిస్తున్న మా అమ్మ, ఆవిడ ఫ్రెండు గురించి అమెరికా లో మా అన్న కి ఫోన్ చేసి చెప్పి వాళ్ళ ఆట కట్టించే పాత్ర నాది. మైకు ఎక్కడున్నా నీ వాయిస్ క్యాచ్ చేస్తుందమ్మా అని వాళ్ళు ఎంత చెప్పినా చాదస్తంగా మైకు దగ్గరకు వెళ్లి డైలాగులు చెప్పడం బాగా గుర్తు నాకు😄

చిన్నప్పటి నుంచి స్టేజి మీద పాడటం అలవాటు కాబట్టి స్టేజి ఫియర్ ఉండేది కాదు నాకు. డైలాగులు కూడా బాగా గుర్తుపెట్టుకోగలను. పైగా నాటకం లో నాకు రెండు డ్రెస్ ఛేంజులు! (తెర వెనక అక్క నా డ్రెస్ పట్టుకొని  నుంచొని ఉంటే అమ్మ గబగబా మార్చేసింది) ఈ నాటకం అనుభవాన్ని చాలా ఎంజాయ్ చేసాను. 


పురుష పాత్రలు లేకపోవడం గమనించారా? 
తాడేపల్లిగూడెం లోనే ఆదర్శ బాల మందిర్ అని స్కూల్ ఉండేది... పమ్మి వీరభద్రరావు గారని ఆ స్కూల్ హెడ్ మాస్టర్. సాహిత్య/నాటక రంగం వారికి ఈ పేరు తెలిసి ఉండచ్చు. ఆయన  ఓ మ్యూజికల్ డాన్స్ డ్రామా డైరెక్ట్ చేశారు. అందులో నేను కృష్ణుణ్ణి. పాడుతూ, డాన్స్ చేస్తూ చెయ్యాలి. వయోలిన్, మృదంగం లైవ్ ఉండేవి. చొట్టప్ప అనే కృష్ణుడి ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది ఆ నాటకం లో. నీ ఫ్రెండ్ పాత్ర కి ఎవరు సరిపోతారో నువ్వే సెలెక్ట్ చేస్కో అని మా హెడ్ మాస్టర్ అనడం తో నా ఫ్రెండ్ స్వాతి అనే అమ్మాయి ని సెలెక్ట్ చేస్కోవడం బాగా గుర్తు నాకు. 

ఒకబ్బాయి తాలూకు సిల్క్ బ్లూ లాల్చీ ... తెల్ల పంచె, కాళ్ళకి డాన్స్ గజ్జెలు, మా ఇంటి ఎదురుగా ఉండే ఇంకో మాస్టారు కిరీటం చేశారు... ముత్యాల గొలుసులు, నామాలు, వేణువు (ఈ వేణువు మా ఇంటెదురుకుండా మాస్టారి ఇంట్లో కృష్ణుడి విగ్రహం నుంచి తీసి మరీ ఇచ్చారు!) ... మొహానికి నీలం రంగు ... పమ్మి వీరభద్రరావు గారు స్వయంగా అంతా చూసుకున్నారు. మనం కూర్చొని తయారు చేయించుకోవడమే! హహ్హ! ఆ experience కూడా నాకు బాగా నచ్చింది. 

అమ్మా, అక్కా 'నువ్వు కృష్ణుడి గా భలే ఉన్నావే' అని మురిసిపోయారు. దీని జ్ఞాపకం గా ఫోటో ఏమీ లేదు ఏవిటో. 

తర్వాత హైద్రాబాద్ కి వచ్చాక ఓ క్రిస్టియన్ స్కూల్ లో జీసస్ జననం నాటకం లో మనం 'ఏంజెల్' వేషం అన్నమాట. అది నా మొదటి ఇంగ్లీష్ నాటకం. పెద్ద పెద్ద లైన్లు .. అది కూడా బైబిల్ ఇంగ్లిష్ 'Hail! You are highly favoured!' ఇలా ఉంటాయి డైలాగ్స్. మదర్ మేరీ కి ఈ డైలాగ్ చెప్తా అన్నమాట. (నిజానికి బైబిల్ లో ఈ మాట చెప్పే దేవదూత . మగాడు ... ఏంజెల్ గేబ్రియల్) ఈ పాత్ర కి నన్ను తెల్ల చీరల్లో ముంచేశారు మా మేరీ మిస్. ఆడియన్స్ లో ఉన్న అమ్మ కి స్టేజి మీద నుంచి హాయ్ చెప్పడం గుర్తు. ఇది ఇంకో ఫోటో లేని జ్ఞాపకం. 

మా తాత గారు నిట్టల శ్రీరామ మూర్తి గారు ... సికింద్రాబాద్ కోర్టు లో అడ్వకేట్ గా చేసేవారు. బార్ అసోసియేషన్ నాటకాలు వేసేవారు. పోతుకూచి సాంబశివరావు గారు (ఈ పేరు కూడా నాటకరంగం వారికి సుపరిచితమే) తాతగారి స్నేహితులు. నాకెప్పుడూ తాతగారి నాటకం చూసే అవకాశం కలగలేదు. కానీ నాటకాల పుస్తకాలు ఇంటికి తీసుకొచ్చే వారు. అందులో ఒక నాటకం 'గుండీలు మార్చబడును' .. గుండెలు మార్చబడును అనే బోర్డు  ని అలా రాస్తారు అన్నమాట. అది చదివి బాగా నవ్వుకున్నాం! 

తర్వాత డిగ్రీ కాలేజీ లో ఓ ఇంగ్లీష్ స్కిట్ లో ఎందుకూ పనికిరాని అబ్బాయి వేషం వేసాను.

తర్వాత 'నాటకం' గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎమ్మే ఇంగ్లీష్ లిటరేచర్ లో గొప్ప నాటకాల గురించి చదువుకున్నా, మీడియా లో నే ఉంటున్నా కూడా .... టివి, సినిమాల మీద పని చేస్తున్నాను కానీ ఆ వైపు ఎటువంటి స్పృహ లేదు. 

ఈ సౌమ్యవాదం కంటే ముందు నాది ఇంకో బ్లాగు ఉండేది. అప్పుడు FIVE WOMEN AND A BILL అని ఓ వ్యంగ్య రచన చేశాను .. ఐదుగురు ఆడవారి మధ్య సాగే సంభాషణ అది. నా ఫ్రెండ్స్ చదివారు. బాగుందని మెచ్చుకున్నారు. ఓ ఫ్రెండ్ (ఈ అమ్మాయి పేరు కూడా స్వాతే) దీన్ని డ్రామా లాగా వెయ్యచ్చు .. ఆలోచించు అని ఎంకరేజ్ చేసింది. 

తను అన్నది కానీ రాసి ఏం చెయ్యాలి? డ్రామా వెయ్యడం గురించి నాకేం తెలియదు కదా అని ఊరుకున్నాను. 

అప్పుడే నాకు తెలిసిన ఓ ఎన్జీఓ వాళ్ళు 'లామకాన్' అనే ప్లేస్ కి నన్ను పిలిచారు. బంజారాహిల్స్ లో ఉంటుంది ఇది. అక్కడ వేదిక, మైకులు, లైట్స్ అన్నీ ఫ్రీ. కళల కోసం, సామజిక సమస్యలు, పర్యావరణం ... ఇలా మనకి మంచి చేసే ఏ విషయానికోసం ఏ ప్రోగ్రాం చేసినా దాన్ని ఫ్రీ  గా వాడుకొనే వెసులుబాటు కల్పించారు! ఇది చూడగానే నాకు తెలిసిపోయింది .. నేను డ్రామా రాయడమే ఆలస్యం .. ఇక్కడ వేసేసుకోవచ్చు అని! 

అప్పుడు నా మొదటి ఇంగ్లిష్ ప్లే రాసాను ... ఫైవ్ విమెన్ అండ్ ఏ బిల్ ... మహిళా బిల్లు గురించి ఓ మహిళా రాజకీయ నేత, ఓ ఫెమినిస్టు, ఓ పుస్తకాల పురుగు, ఓ మోడల్ కావాలనుకునే అమ్మాయి, ఓ గృహిణి .. ఈ పాత్రల మధ్య సాగే వ్యంగ్య రచన ఇది. 


దీనికి మేము ఎంచుకున్న నటులు .. మా పరిచయస్తులలో మహిళలే. రంగస్థల అనుభవం అంతగా లేకపోయినా ఫరవాలేదు అనుకున్నాం. 45 పేజీల స్క్రిప్ట్ ని ఆ బంగారు తల్లులు ఉద్యోగాలు చేస్కుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఎంత బాగా నేర్చుకున్నారో! అంతకు ముందు నాటకం చేసిన అనుభవం లేకపోయినా స్టేజి మీద హాస్యం ఎంత బాగా పండించారో! ఆ రోజు జోరున వాన. అయినా చూసేవాళ్ళు కుర్చీలు లేకపోయినా నుంచొని నాటకం ఆసాంతం చూడటం ఓ మరపురాని జ్ఞాపకం! 




ఇదే నాటకాన్ని పన్నెండు నిమిషాలకి కుదించి ఓ నాటికల పోటీ లో వేసాం. ప్రిలిమ్స్ లో జ్యూరీ ఫేవరేట్, ఆడియన్స్ ఫేవరేట్ మేమే! ఫైనల్స్ లో మూడో స్థానం లో నిలిచాం. 




ఈ స్క్రిప్ట్ ని సిటీ లో కొన్ని గర్ల్స్ కాలేజీల వాళ్ళు వేసుకున్నారు. హైద్రాబాద్ లోనే కొన్ని థియటర్ గ్రూప్స్ ఈ నాటకాన్ని వేసుకోవడం నాకు భలే ఆనందాన్ని ఇచ్చింది. 

ఇప్పుడే యూట్యూబ్ లో ఈ లింక్స్ కూడా కనిపించాయి !

https://www.youtube.com/watch?v=j8pjQgo85vg

https://www.youtube.com/watch?v=5aNdgT2rWwY

మనం రాసిన ఓ నాటకం ఇలా అందరి నోటిలో నానడం కంటే ఏం కావాలి చెప్పండి! 

ఇది 2012 నాటి మాట. 

సంతృప్తి ఎక్కువయిపోయింది అనుకుంటా .... ఇంకో నాటకం వెయ్యలేదు. 

కానీ రాసాను. అదే 'సైడ్ ట్రాక్'. అటక మీద దొరికింది .... అని చెప్పానే? అదే ఇది! ఇది కూడా ఇంగ్లిష్ నాటకమే. [నా బ్లాగ్ భాష తెలుగు. నా రంగస్థల భాష ఇంగ్లిష్. నా లో కవి భాష ఉర్దూ :)]

దేవుడు.. నమ్మకం...  వీటికి సంబంధించి మనకి తెలిసినవి రెండే కేటగిరీలు ... ఆస్తికులు, నాస్తికులు. 

కానీ నిజానికి చాలా కేటగిరీలు ఉన్నాయి. నేను మచ్చుకి ఓ మూడు తీసుకున్నాను ఈ నాటకం లో. 

aethist (ఏథిస్ట్) -  నాస్తికుడు 

skeptic (స్కెప్టిక్) - సంశయవాది .. ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తాడు ... 

agnostic (యాగ్నోస్టిక్) - దేవుడు ఉన్నాడని తెలుసుకొనే అవకాశం లేదంటాడు  

వీళ్ళు ముగ్గురూ, ఓ పురోహితుడు, ఓ సగటు మానవుడు కలిసి ఓ రైలు కంపార్ట్మెంట్ లో ప్రయాణిస్తూ వాళ్ళ భావజాలాలే ఆయుధాలుగా ఓ ప్లగ్ పాయింట్ కోసం కొట్టుకోవడమే ఈ హాస్య  నాటకం ఇతివృత్తం. ఇదే కూపే లో ఆరో పాసెంజర్ గా వచ్చిన ఓ మహిళ అసలు ఎవరు? అనే సస్పెన్స్ కూడా ఉంటుంది.

ఈ సారి కూడా వేదికే ప్రేరణ అయింది. ఫీనిక్స్ అరేనా అనే ఓ మంచి సాంస్కృతిక ప్రాంగణం ఉంది హైటెక్ సిటీలో. చుట్టూ సాఫ్ట్వేర్ ఆఫీసుల మధ్య ఓ పచ్చని సాంస్కృతిక ద్వీపం లాగా! చూడ చక్కగా, మంచి వసతులతో, ఫ్రెండ్లీ గా ఉంటుంది ఈ ప్లేస్. వీరు కూడా నామమాత్రపు రుసుము తో సాంస్కృతిక, సామజిక కార్యక్రమాలకి వేదికనిస్తున్నారు. 

గత మూడు నెలలుగా నటుల కోసం గాలించాం అక్కా, నేను. ఇందులో డబ్బుల ప్రస్తావన లేదని తెలిసినా కేవలం నాటకం అంటే ఇష్టం, స్క్రిప్ట్ పట్ల నమ్మకం, అక్కా, నేను అంటే గౌరవం తో ఓ మంచి కాస్ట్ కుదిరారు! 

ఈ నాటకం లో ఓ ఇంగ్లీష్ తత్వం ఉంటుంది! అది అక్కే రాసింది! 

ఈ ఆదివారమే ఈ నాటకం మొదటి ప్రదర్శన. 


ఇదే మా ఆహ్వానం!

అక్కా, నేను అనుకున్నాం ... ఇక నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ లో మా నుంచి ఓ నాటకం ఉంటుంది అని. సిగరెట్ లాంటి చెడలవాట్లు మానేసేముందు చెప్పి మానేస్తారు కదా .. అకౌంటబిలిటీ కోసం. ఇలాంటి మంచి అలవాట్లు కూడా చెప్పి మొదలుపెడితే, నీరసించిపోకుండా .. మర్చిపోకుండా ... 'ఎందుకులే' అని లైట్ తీసుకోకుండా ఈ స్ఫూర్తి ఇలాగే ఉంటుంది కదా అని ఇక్కడ చెప్పే ధైర్యం చేస్తున్నా! 

నిజానికి నాటకం కొంచెం కష్టమైన ప్రాసెస్సే. సెట్, మైకులు, నటీనటులు పాపం పారితోషకం తీసుకోకపోయినా రిహార్సల్స్ లో ఉండే ఖర్చులు, కాస్ట్యూమ్స్, సంగీతం, లైట్స్ , పబ్లిసిటీ ... అందులో లైవ్ పెర్ఫార్మ్ చెయ్యడం! ఇదే ఖర్చు కి ఓ షార్ట్ ఫిల్మ్ తీసేసుకొని యూట్యూబ్ లో పెట్టేస్తే పడుంటుంది కదా అని సలహాలూ వస్తాయి .. మనకీ అనిపిస్తుంది. 

రోటి పచ్చడి శ్రమ అని మిక్సీ లో వేసేసుకున్నట్టే. 

కానీ కొంచెం ఓపిక చేసుకుంటే రోటి పచ్చడి రుచే వేరు! 

ఆ రుచి తింటేనే తెలుస్తుంది. 

మన లో చాలా మందికి నాటకాలంటే భయం ఉంది. 'నాటకాల పిచ్చి' అనే మాట ఎన్ని సార్లు వినలేదు? ఏదైనా వ్యసనంగా మారితే తప్పే కదండీ. నేను మాట్లాడుతోంది నాటకాల పట్ల ఓ ఆరోగ్యకరమైన అభిరుచి గురించి మాత్రమే. 

ఈ సందర్బంగా ఇది చదివేవారందరికీ నేను ఓ విజ్ఞప్తి చెయ్యదలుచుకున్నాను. 

ఓ నాటకం వెయ్యండి. రాయగలిగితే రాసేయండి. నాకు దొరికినట్టే మీకు కూడా వనరులు దొరకకపోవు. (కావాలంటే నన్ను ఈ బ్లాగ్ ద్వారా సంప్రదించండి) డబ్బులుంటే మా లాంటి వాళ్ళ ప్రయత్నాలకి ఆర్ధిక ఆలంబన ఇయ్యండి. (మనం వాడే చాలా విలాసాలకంటే ఓ నాటకం వేయడం చవక). నటించగలిగితే నటించండి. పాటలు, సంగీతం .. సెట్లు వేయడం, రిహార్సల్స్ చేసుకోడానికి మీ ఇంట్లో హాల్/వరండా ఇవ్వటం, ఫోటోలు తియ్యడం, నాటకానికి పది మందిని తీసుకెళ్లడం, నాటకం ఎవరైనా చేస్తున్నారని ఇన్వైట్ వస్తే లైక్, షేర్ చెయ్యడం, మీరెళ్ళిన నాటకం రివ్యూలు సోషల్ మీడియా లో పెట్టడం.. ఫోటోలు పెట్టడం ... ఏ విధంగా నైనా .... ఏ స్కిల్ తో నైనా .. ఏ భాష దైనా ... ఓ నాటకం లో పాల్గొనండి. 

థియేటర్ గ్రూప్స్ వారు యాక్టింగ్ వర్క్ షాప్స్ పెడుతూ ఉంటారు .. పిల్లలకి, పెద్దలకి. ఎప్పుడైనా సరదాగా వాటిలో పాల్గొనండి. పిల్లల్ని తీసుకెళ్లండి. నేను చిన్నప్పుడు వేసిన నాటకాలు నాకు తెలియకుండానే నన్ను ఈ రంగం వైపు నడిపాయి. వేరే మతాలు, సంస్కృతులు .. వీటి గురించి తెలిసే అవకాశం కల్గించాయి. 

నాటకం టీం వర్క్ ని పెంపొందిస్తుంది అని కార్పొరేట్ వాళ్ళు ఈ వర్కుషాప్స్ ని ప్రోత్సహిస్తున్నారు కూడా! 

ఇప్పటి వర్ధమాన సినిమా నటులు/టెక్నీషియన్స్ ఒక్క సారైనా నాటకం వైపు వస్తే కూడా చాలా బాగుంటుంది .... వారి స్కిల్ మెరుగవుతుంది అనడంలో సందేహం లేదు! స్కిల్ ఏమీ పెరగకపోయినా 'బాబోయ్ మన సినిమాలే ఈజీ బాబూ!' అనైనా అనిపిస్తుంది 😉

ఇది నాటక రంగానికి మనం చేసే సేవ ఏమీ కాదు అని నా మనవి. ఇది మనకి మనం చేసుకొనే మేలు.

[నేను రాసిన నాటకాలు ఎవరైనా వేసుకోవచ్చు. నాకు చెప్తే పూర్తి స్క్రిప్ట్ పంపిస్తాను. నాటకం వేసిన ఫోటోలు పంపిస్తే నా ఫేస్ బుక్ పేజీలో పెట్టుకుంటాను. నో కండిషన్స్ అప్లై 😊.] 

Comments

  1. మీ చిన్నప్పటి నాటకాల జ్ఞాపకాలతో మొదలుపెట్టి క్రితం ఆదివారం మీ కొత్త నాటక ప్రదర్శన దాకా మీరు రాసిన విశేషాలు బోల్డంత బావున్నాయి. మీ ఆదివారపు నాటక ప్రదర్శన బాగా జరిగి వుంటుందని అనుకుంటున్నాను. మీకూ, మీ అక్కగారికీ శుభాభినందనలు.

    ReplyDelete
    Replies
    1. baaga jarigindandi... thank you! akka ki kooda cheppaanu :)

      Delete

Post a Comment