ఆనందాల జాడీ

ఎప్పుడైనా గమనించారా? 

కష్టం గుర్తున్నంత వివరంగా సుఖం గుర్తుండదు. 

కష్టాలు ఎన్ని గుర్తుంటాయో అన్ని సుఖాలు గుర్తుండవు. 

కష్టాలు మన మీద పడేసే ప్రభావం సుఖాలు పడెయ్యవు. 

సుఖాలు - 30 సెకన్ల యాడ్ లా, కష్టాలు డాక్యుమెంటరీ లాగా ఎందుకు అనిపిస్తాయి? 

సుఖాలు చిన్నగా, కష్టాలు పెద్దగా ఎందుకు కనిపిస్తాయి? 

ఈ పరిణామాన్ని 'నెగిటివిటీ బయాస్' (Negativity Bias) అంటారట. అంటే ప్రతికూలత పట్ల పక్షపాతం. 

అంటే, ఒక నెగిటివ్ సంఘటన/అనుభవం, అదే ఉధృతి గల పాజిటివ్ సంఘటన/అనుభవం మనకు జరిగితే, ఆ ప్రతికూల సంఘటనే మన మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది - ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది అని. 

ఓ పక్క నుంచొని 'బాగా పాడావమ్మాయి' అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే .. ఇంకో వైపు ఒకరు పెదవి విరిస్తే నేను కాంప్లిమెంట్ ని పట్టించుకోకుండా కేవలం ఆ విమర్శ నే గుర్తుంచుకొని పదే పదే నెమరువేసుకోవడం అన్నమాట (ఇది నా వ్యక్తిగత అనుభవం అని మీరు ఊహిస్తే మీరు కరెక్టే. బాగా పాడలేదు అనలేదు కానీ నేనెంచుకున్న పాట ఆ సందర్భానికి సరిపోలేదు అన్నారు) 

ఇది మన మెదడు కి బాగా అలవాటేనట. (మన తప్పు కాదన్నమాట! హమ్మయ్య!) 

రాతి యుగం మనిషి నాటి అలవాట్ల లో ఇదొకటి. అప్పటి మనిషి అడవి లో ప్రమాదాల మధ్య బతికేవాడు కదా .. అందుకే అతని మెదడు ప్రతికూల పరిస్థితుల పట్ల ఎక్కువ చురుకుగా తయారయింది .. అలా లేకపోతే చావే కదా! 

కానీ ఇప్పుడు మనం అంత ప్రమాదకర పరిస్థితుల్లో లేము. ఈ విషయం మెదడు కి ఎవరూ చెప్పలేదనుకుంటా. అది పాపం అదే మూస లో పోతోంది. 

దీని వల్ల జరిగే నష్టాల లో ఒకటేంటంటే .. మనని మనము టార్చర్ చేస్కోవడం. ఒకరు మనని చెంప దెబ్బ కొట్టి వెళ్లిపోయారు. ఇది మనం మర్చిపోక పదే పదే గుర్తుచేసుకుంటాం ... వాడు కొట్టింది ఒక సారే. మనం గుర్తుచేసుకుని వాడి చేత కొట్టించుకున్నది కొన్ని లక్షల సార్లు. ఇదే ఒక మంచి విషయమైతే అన్ని సార్లు గుర్తు చేస్కుంటామా? 

ఈ బయాస్ ని కరెక్ట్ గా అర్ధం చేసుకోవాలంటే మనల్ని మనం ఒక్క ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది. 'మీ జీవితం ఎలా గడిచిందనుకుంటున్నారు?' అని. టక్కున గుర్తొచ్చే మొదటి మూడు జ్ఞాపకాలలో పాజిటివ్ వి ఎన్ని? 

మనలో చాలా మందికి మన వైఫల్యాలు, కష్టాలు, మన పట్ల వేరే వాళ్ళు చేసిన ద్రోహాలు, నష్టాలు, రిగ్రెట్స్ ఇలాంటి నెగిటివ్ అంశాలే గుర్తుకు వస్తాయి. అలా గుర్తు రాలేందంటే -  

1. మీరు అబద్ధం చెప్తున్నారు
2. మీరు స్వతహా పాజిటివ్ మనిషి 
3. నెగిటివిటీ ని ఎదుర్కోడానికి మీరు మీ మెదడుని ట్రైన్ చేశారు!
4. మీకు నా ప్రశ్నే అర్ధం కాలేదు 

మెదడు ని ట్రైన్ చెయ్యడం సాధ్యమే. (నేను ఆ కాంప్లిమెంట్ నే మొదట గుర్తు తెచ్చుకోడానికి ట్రై చేస్తూ ఉంటాను... ఇంకా ట్రయల్ నడుస్తోంది). ఇలా ట్రైన్ చెయ్యడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనాలు ఉంటాయి .. మన జీవితాన్ని యథాతథంగా స్వీకరించడం, క్షమించడం, ప్రతీ విషయాన్నీ పాజిటివ్ దృష్టి తో చూడడం .. etc (వీటి గురించి మరో సారి) 

వీటి లో నాకు తెలిసిన ఓ మంచి సాధన .... JOY JAR (జాయ్ జార్)

దీనికి నేను తెలుగు లో 'ఆనందాల జాడీ' అని పేరు పెట్టాను. ఆవకాయ జాడీ లాగా అన్నమాట😋

ఆనందాల జాడీ కి కావాల్సిన పదార్ధాలు - 

1. ఒక కుటుంబం 
2. ఒక జాడీ 
3. పేపర్లు, పెన్నులు 
4. ఒక సంవత్సరం 
5. ఒక సంకల్పం 

ఆ సంకల్పం ఏంటంటే - ఆ కుటుంబం లో ప్రతి సభ్యులూ ఆ సంవత్సరం అంతా వారికి కలిగిన చిన్న పెద్ద ఆనందాల్ని అవి కలిగిన వెంటనే ఫ్రెష్ గా, మర్చిపోకుండా, విస్మరించకుండా, ఆ ఆనందం ఆవిరైపోక ముందే ఒక చీటీ మీద రాసి ఆ జాడీ లో వెయ్యాలి. సంవత్సరం తిరిగాక ఆ చీటీలు తీసి చదువుకోవాలి.  సింపుల్. 

(ఆనందం ఆవిరైపోయింది అంటారు ... ఇలాంటి పోలిక దుఃఖానికి లేదు .. అసలు ఆనందాన్ని ఆవిరయిపోయే పదార్ధం గా ఎందుకు ఊహించారు? ఇది నెగిటివిటీ బయాస్ కి పెద్ద ఉదాహరణ) 

మళ్ళీ సంవత్సరం అదే జాడీ .... మరికొన్ని ఆనందాలు .. 

ఏ రోజైనా కొంచెం మనసు బాలేక పోతే నిండా ఉన్న జాడీ ని చూస్తే బోలెడు ఉత్సాహం వస్తుంది! 

అయిపోయిన యేడు తాలూకు చీటీలని పాత చింతకాయ పచ్చడి లాగా సంవత్సరాల వారీ గా భద్రపరుచుకుంటే ...  అంతే ఆరోగ్యం కూడా! (చెంప దెబ్బ లాగా కాక) 

ఈ ఆనందం ఆవకాయ కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బీపీ, షుగర్, హృద్రోగం .. ఇంకే ఆరోగ్య సమస్య ఉన్నవారైనా ఇది చెయ్యవచ్చు. (చెయ్యాలి!)

ఆవకాయ చూసి నోటి లో నీళ్లు ఊరుతాయి ..  ఈ ఆనందాలు కొన్నేళ్ల తర్వాత చదువుకుంటే కళ్ళ నీరు ఊరుతాయి. (నాలోని కవి హృదయం మేల్కొని ఈ మాటనేసి మళ్ళీ పడుకుంది) 

ఇలా పబ్లిగ్గా కష్టాలైతే చెప్పుకోవచ్చు కానీ సుఖాలు చెప్పుకుంటే దిష్టి కొట్టదూ అనుకుంటే మీ వ్యక్తిగతమైన జాడీ మీరే పెట్టుకోవచ్చు... లేకపోతే ఓ పుస్తకం లో కేవలం పాజిటివ్ అనుభవాల గురించి రాసుకోవచ్చు. అది ఆనందాల జాబితా అవుతుంది అన్నమాట! 

నేను ఇది చేస్తూ ఉంటాను. ఆ అనుభవం మీదే చెప్తున్నాను. ఒక్కో సారి 'అబ్బా .. పోయిన సంవత్సరం ఎంత గడ్డు గా గడిచింది' అంటుంది రాతి యుగం మెదడు రిజిస్టర్ చేసుకున్న జ్ఞాపకం. అదే సంవత్సరం తాలూకు జాడీ నవ్వుకుంటుంది. అది నిజం కాదని. 

'ఉద్యోగం వచ్చింది' 'పెళ్లయింది' లాంటి పెద్ద పెద్ద ఆనందాలే కాదు (పెళ్లి ఆనందమా అనే జోకులొద్దు బాబూ 😐) 'ఆలూ దమ్ బిర్యానీ బాగా కుదిరింది' 'దారిలో అసలు ట్రాఫిక్ లేదు' 'షాపింగ్ భలే జరిగింది' 'టైం కి టీ దొరికింది' ఇలా మనసుకి ఆనందం కలిగించిన ప్రతి విషయం రాసుకోవచ్చు! 

ఇలాంటివి రాస్తుంటే పెరుగుతూ ఉంటాయి అనే ఓ సూత్రం కూడా ఉంది! (దాని గురించి ఇంకో సారి) 

'ఆ టక్కులాడి కి బాగైంది' 'వాడి నడ్డి విరిగింది .. నా కసి తీరింది' ఇలాంటివి కూడా రాసుకోవచ్చు కానీ ఈ కేటగిరి ఆనందాల వల్ల జాడీ కి బూజు పట్టి పాడయ్యి దాని రుచి మారచ్చు .. 

'నా జీవితం అంతా కష్టాలే... ఇందులో వెయ్యడానికి నాకు ఆనందమేమీ లేదు' అని ఎవరైనా అంటే నాకు బాధేస్తుంది. ఎన్ని మంచి విషయాలు వారి గుర్తింపు కి రాకుండా వెళ్లిపోయాయో అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవారైనా పూర్తి గా నెగిటివ్ అనుభవాల బారినే పడటం, ఒక్క చిన్న అందమైనా కలగకపోవడం అసంభవం. 

నా మాట నమ్మకపోతే ఆనీ ఫ్రాంక్ డైరీ చదవండి. 

Comments

  1. Your best blog so far! It doesn't take much efforts to keep ourselves happy. Joy jar is must for everyone

    ReplyDelete
  2. హలో అండీ సౌమ్యా! మీ ఆనందాల జాడీ concept బావుందండి. మీ బ్లాగ్ నచ్చింది. రాయండి ఇంకా - చదువుకుంటా :)

    ReplyDelete

Post a Comment