మరపురాని పావుగంట
ఏడేళ్ళ క్రితం ఇదే రోజున ప్రసాద్స్ ఐమాక్స్ లో మా షార్ట్ ఫిల్మ్ 'పెళ్ళివారమండి' ప్రదర్శించాం.
ఆ సినిమా నిడివి పావుగంట. అయినా దానితో ముడిపడిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవి గుర్తుచేసుకుంటూ ఈ పోస్టు.
నేను మొదట తీసిన షార్ట్ ఫిలిం 2007 లో. అప్పటికి యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్ ... ఈ హవా ఇంకా మొదలవ్వనే లేదు. ఈ బుజ్జి సినిమా గురించి ఇంకో సారి చెప్తాను.
కట్ టు 2016.
ఓ ఫ్రెండ్ చాలా ఏళ్ళ తర్వాత కలిసి మేము సినిమాల్లో ఉన్నాం అని తెలిసి "మీరు ఎందుకు షార్ట్ ఫిలిం చెయ్యట్లేదు?" అని అడిగారు. "అబ్బా... ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసేస్తున్నారు... ప్రొఫెషనల్స్ అయిన మేము కూడా ఈ మూస లో పడితే బాగోదేమో" అని నసిగాను. కానీ ఆ ఫ్రెండ్ ఊరుకోలేదు. నేను డబ్బు పెడతాను, తియ్యమన్నారు. ఇంక నఖరాలు చెయ్యకుండా అక్కా, నేను పనిలోకి దిగాం.
నిజానికి ఇది ఓ డ్రీం ప్రాజెక్ట్ అయింది. ఎలా అంటే, డబ్బు పెట్టిన వ్యక్తి ఎవరైనా కథలో వేలు పెడతారు కానీ మా ఫ్రెండ్ అస్సలు ఏమీ పట్టించుకోలేదు. నేను తక్కువలో తీద్దాం అనుకున్నాను. కానీ కథ రెడీ అయ్యాక నిడివి, అది బాగా వచ్చిందనిపించి మూడు రెట్లు బడ్జెట్ పెంచారు మా ఫ్రెండ్. అందుకే దీన్ని సినిమా లెవెల్లో ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రసాద్స్ ఐమాక్స్ లో 'విడుదల' చేయగలిగాము. (ఒక్క షో అయినా. అది కూడా ఫ్రీ టికెట్😆).
అక్కా, నేను బాగా ఎంజాయ్ చేసే genre కామెడీ కాబట్టి అదే తీద్దామనుకున్నాం. సబ్జెక్టు గురించి ఓవర్ థింక్ చెయ్యద్దు అనుకున్నాం. సరదాగా ఏది వస్తే అదే రాద్దాం అని నియమం పెట్టుకున్నాం. రెండు మూడు వెర్షన్లు రాసుకోవడం లాంటి చాదస్తాలు కూడా పెట్టుకోవద్దనుకున్నాం. అలాగే చేసే ఫ్రీడమ్ దొరికింది మా ఫ్రెండ్ వల్ల.
2012 లో 'ఫైవ్ విమెన్ అండ్ ఏ బిల్" అనే ఇంగ్లీష్ నాటకం నేను రాసి డైరెక్ట్ చేసాను. ఆ నాటకం తారాగణం నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ నాటకం లో అందరూ స్త్రీ పాత్రలే. వారినే ఈ సినిమాలో తీసుకున్నాను. (ప్రొఫెషనల్ ఆక్టర్స్ తో చేసేంత కాంటాక్ట్స్ కానీ, బడ్జెట్ గానీ లేకపోవడం ఓ కారణం అయితే, తెలిసిన వారితో అయితే comfortable గా ఉంటుంది అనుకోవడం ఇంకో కారణం). వారు కాక ఇంకొంత మంది పరిచయస్తులు కలిశారు. ఇందులో టీనేజర్ గా చేసిన పిల్లవాడు నా మొదటి షార్ట్ ఫిల్మ్ లో కూడా చేసాడు. వాడిని చూస్తే "మనం ఇంత పెద్దవాళ్ళం అయిపోయామా" అనిపించింది!
షార్ట్ ఫిలిం లో వారి పాత్రలు కూడా వారి నిజజీవితానికి దగ్గరగా ఉంటాయి. ఎవరి పేర్లు వారివే. అవి మార్చలేదు. మలయాళం మాట్లాడే ఆవిడ మలయాళీ.. తెలుగు అబ్బాయి ని పెళ్ళి చేసుకోవడం కూడా అలాగే సినిమా లోకి తీసుకున్నాం. నాట్యం చేసే ఇద్దరూ నిజంగా నాట్యం నేర్చుకున్నవారే. ఫ్రెంచ్ మాట్లాడే అమ్మాయి కి ఫ్రెంచ్ వచ్చు. పంజాబీ అబ్బాయి పాత్ర నిజజీవితం లో మంచి తెలుగు మాట్లాడతాడు. (ఈ షార్ట్ ఫిల్మ్ అతనికి మొదటి అనుభవం. అతనికి ఈ ఫీల్డ్ ఎంతో నచ్చి మా కెమరామెన్ దగ్గరే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని ఆ ఫీల్డ్ లో కొనసాగుతున్నాడు!) ఇలా వాళ్ళ పాత్రల మూలాలు మాత్రం తీస్కొని దాని మీద కథ అల్లుకున్నాం. అందుకే వీరే ఈ పాత్రలు చెయ్యడం కరెక్ట్ అనిపించింది.
కాస్ట్ కుదిరింది. అందరికీ స్క్రిప్ట్ బట్టీ వచ్చే దాకా రిహార్సల్స్ చేసుకున్నాం. ఇది చాలా కష్టమయ్యేది .. అందరికీ టైం ఓ సారి కుదరడం చాలా కష్టమయ్యేది. కానీ సాధించాం.
అందరూ ఒకరికొకరు తెలిసుండటం వల్ల, అంతకు ముందు పని చేసిన అనుభవం ఉండటం వల్ల, నటులకి అక్క మీద నా మీద గౌరవం ఉండటం వల్ల మా పని బాగా సులువైంది. మేకప్, హెయిర్ డ్రెస్ చెయ్యడానికి వచ్చిన వాళ్ళు "మేడం, మిగిలిన షూటింగ్స్ లో షాట్స్ మధ్య ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు... వీళ్ళందరూ భలే సఖ్యత గా ఉన్నారు మేడం" అనడం మా నిర్ణయం మీద మాకు ధీమానిచ్చింది.
బడ్జెట్ కారణాల వల్ల తాపీగా షూటింగ్ చెయ్యడం కుదరదు కాబట్టి 48 గంటల పాటు కేవలం 4-5 గంటల విరామం (నిద్ర కోసం) తప్ప వరసగా షూటింగ్ చేసాం. ఇందులోనే ఓ పాట షూట్ చేసాం! మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేనేజర్ లాంటివారెవ్వరూ లేరు. డైరెక్షన్ మేమే. క్యాటరింగ్ లాంటివి చూసుకోవడం మేమే. షార్ట్ ఫిలిం లో పిల్లవాడి పంచె అక్కే ఇస్త్రీ చేసింది కూడాను.
షూటింగ్ లో చాలా సవాళ్లు ... మొదటి షాట్ కి భోరున ఏడుపు మొదలుపెట్టాడు చైల్డ్ ఆర్టిస్ట్. కష్టపడి సవరం పెట్టాక ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందని గుర్తొచ్చి అది తీసి ఓ రెండు గంటల పాటు పెర్మిషన్ పెట్టి వెళ్ళిపోయింది ఓ పాత్రధారిణి. ఇంకో ఫ్రెండ్ మాకు ఒకటిన్నర రోజు కాల్షీట్ ఇచ్చింది... మర్నాడు వాళ్ళ చెల్లి పెళ్లి. ఇలాంటి చాలా ఇబ్బందుల వల్ల స్క్రిప్ట్ లో సెట్ మీదే కొన్ని మార్పులు కూడా చెయ్యాల్సి వచ్చింది.
మొత్తానికి షూటింగ్ అయిందనిపించాం. 48 గంటలు నిర్విరామంగా పనిచేసినా అక్కకి, నాకూ అస్సలు అలుపు రాలేదు. ఇష్టమైన పని, చేతొచ్చిన పని చేస్తే అలాగే ఉంటుంది కదా!
ఈ సినిమా కి నిజంగా మాకు కాస్ట్ కుదిరినట్టే టెక్నిషన్స్ కూడా మంచివారు కుదిరారు. ఎడిటర్ మాకు ముందు నుంచి తెలిసిన వారే. కెమెరామెన్ మాకు మా సీనియర్ ఈ సినిమా కోసం పరిచయం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ మొదలవ్వక ముందు అక్కకి నాకు కొంత సంశయం ఉంది .. చిన్న సినిమా కదా... ఏదో ముక్కున పట్టి చేసి పడేస్తారేమో అని. కానీ సబ్జెక్టు చూసి ఇంప్రెస్ అయ్యారో, హైదరాబాద్ లో ప్రొఫెషనల్స్ అంత బాగున్నారో కానీ .. పెద్ద సినిమా కి చూపించినంత శ్రద్ధ మా సినిమాకు కూడా చూపించారు. మేము పెద్ద సినిమాల లాబ్స్ లోనే చేయించాం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్. కలర్ కరెక్షన్, సౌండ్, డబ్బింగ్ ... అన్నీ టైం కి చాలా బాగా కుదిరాయి.
అప్పటికే అక్కా, నేనూ కొన్నేళ్లు గా సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాం . ఆ ప్రయత్నాలు ఫలిస్తే ప్రసాద్స్ ఐమాక్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది అని ఎదురు చూసేవాళ్ళం. ఈ సినిమా ఇంత మంచి టెక్నీకల్ విలువలతో వచ్చే సరికి "ఎందుకు ఎదురుచూడాలి?" అనిపించి ఓ థియేటర్ బుక్ చేసి ఓ షో వేసాం. అదే ఈ రోజు ఏడేళ్ల క్రితం.
అలా ఐమాక్స్ లో సినిమా వేయాలంటే డివిడి తీసుకెళ్తే సరిపోదు. దాన్ని ఐమాక్స్ లో ప్లే అయ్యే ఫైల్ గా కన్వర్ట్ చేసుకోవాలి. శబ్దాలయ లో 'స్క్రాబుల్' ఆఫీస్ కి వెళ్లి అది చేయించుకున్నాం. రాత్రి ఒంటిగంట కి రమ్మన్నారు. మేముండేది సికింద్రాబాద్ లో. అమ్మని, నాన్నగారిని తీసుకెళ్లాం జూబిలీహిల్స్ కి. వాళ్ళిచ్చిన డ్రైవ్ ని రాత్రే ఐమాక్స్ లో చెక్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఐమాక్స్ కి వెళ్తే థియేటర్ లో కేవలం మేము నలుగురం. సినిమా వేశారు. ఆ సినిమా టైటిల్స్ లో అమ్మ,నాన్నల పెళ్ళి ఫోటోలు ఉంటాయి. అది వాళ్ళకి చెప్పలేదు. surprise గా ఉంచాం. పెద్ద తెర మీద వాళ్ళ ఫోటోలు చూసుకొని ఎంతో ఆనందించారు అమ్మా, నాన్న. మేము వాళ్ళిద్దరికీ ఇవ్వగలిగిన ఆనందాల్లో అదొకటి.
ఇప్పుడనిపిస్తుంది... మంచి పని చేసాం అలా చేసి అని. డాడ్ పోయారు. మా సినిమా విడుదల చూడకుండానే. కానీ ఆ షార్ట్ ఫిలిం కొంత వరకైనా ఆ కల నిజం చేసింది.
ఐమాక్స్ తర్వాత ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా వేసాం. మరికొంత మంది చూడగలిగేలా. అయితే ఈ స్క్రీనింగ్ కి టిక్కెట్లు పెట్టాం. షార్ట్ ఫిలిం చూడటానికి ఎవరు డబ్బిస్తారు అనే భయం ఉన్నా, ఎక్స్పెరిమెంటల్ గా అలా చేసాం. మాకు తెలిసిన వారే ఎక్కువ వచ్చారు. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వలేదు కానీ ఎంతో కొంత వసూలైంది 😆
ఈ చిన్న సినిమా 'బెస్ట్ కామెడీ' అవార్డును గెల్చుకుంది. అదే ప్రసాద్ లాబ్స్ వేదిక పై ఆ అవార్డును అక్కా, నేనూ తీస్కున్నాము.
![]() |
| ITSFF (ఇంటెర్నేషనల్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ కామెడీ అవార్డు అందుకుంటూ అక్కా,నేను |
ఈ అవార్డు తో సరితూగుతూ ఓ రివ్యూ కూడా వచ్చింది... కేవలం ఫేస్బుక్ పరిచయం తో మా మీద ఎంతో అభిమానం చూపిస్తూ జర్నలిస్ట్ అయిన భరద్వాజ రంగావజ్ఝల గారు మా సినిమా గురించి ఇలా రాశారు.
ఓ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎన్నో అసంతృప్తులు ఉంటాయి. ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి. ఇదే సినిమా యూట్యూబ్ లో ఎక్కించి ఇన్నేళ్ళవుతున్నా ఐదంకెల వ్యూస్ ఏమీ లేవు. ఇందులో మేము రాసుకున్న కథ మా బెస్ట్ ఏమీ కాదు. అసలు రాసుకున్న స్క్రిప్ట్ పూర్తిగా తియ్యలేకపోయాం. మేము గౌరవమిచ్చే ఒక సీనియర్ రచయిత కి ఈ సినిమా అస్సలు నచ్చలేదు. (సున్నితంగానే చెప్పారు ఆ విషయం).
అయినా ఊహించని ఎన్నో గిఫ్ట్స్ ని ఇచ్చింది ఈ సినిమా. ఎడిటింగ్ స్టూడియో నుంచే కాంప్లిమెంట్లు మొదలవడం మాలాంటి బిగినర్స్ కి చాలా ఊతం ఇచ్చింది. అందరూ చూసేది ఓ పావుగంట చిత్రాన్ని. దాని వెనక ఎన్నో చిత్రాలు చూపించింది ఈ ప్రాసెస్ మాకు!
ఇంతా చెప్పి సినిమా కి లింక్ ఇవ్వకపోతే ఎలా?
ఇదిగోండి https://www.youtube.com/watch?v=VF5U61ANQ5s&t=1s
ఇంత రాసాను కాబట్టి ఈ సినిమా చూడాలని గానీ, నచ్చాలని గానీ మొహమాటం పెట్టుకోవద్దని నా మనవి. 😊
లేబుళ్లు: itsff, Pellivaramandi short film, sowmyavadam, Sushma sowmya, Telugu blog, telugu blogger, Telugu comedy, Telugu short film



3 కామెంట్‌లు:
Arohi Webseries ani raasaaru ? adi ela watch cheyali ? Pellivaramandi bagundi. long back chusanu, evaro fb lo chepthe.
Arohi webseries అంటే సా పా సా musical webseries అండి. సంగీతానికి సంబంధించిన ఏదో ఒక థీమ్ తీసుకొని దాని గురించి మాట్లాడుతూ పాడటం చేస్తూ ఉంటాం అక్కా నేను. యూట్యూబ్ లో ఉంటుంది . Thank you for watching pellivaramandi and for ur comment here😊🙏
Accidentally visited your take on Mukkoti Devathalu and from there accessed your blog and finally enjoyed your short film- Pellivaramandi. In one word, it was superb; excellent commentary on the Indian marriage system and the Telugu practices at deception. I am spreading the good word by sharing the link to the short film with my friends, who, I know, will enjoy the subtle humour. Looking forward to many more such short films, and, of course, a full length film - Wishing the two sisters all the best - Rama Rao Malladi, writer, journalist and commentator, Meherabad, Ahmednagar, Maharashtra, ph:9350807939
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్