పన్నీటి జల్లు
మొన్న ఇనార్బిట్ మాల్ కి వెళ్ళినప్పుడు ఒక చిన్న షాపు కనిపించింది. 'మేక్ యువర్ ఓన్ పెర్ఫ్యూమ్' ... మీ అత్తరు మీరే తయారు చేస్కోండి అని. అక్కడ ఉన్న పెర్ఫ్యూమర్ (పెర్ఫ్యూమ్ అమ్మే వారిని అలా పిలుస్తారని ఇప్పుడే తెలిసింది) రకరకాల వాసనలు ఒక దళసరి పేపర్ ముక్క మీద జల్లి చూపించాడు. అన్ని వాసనలు వరసగా చూసి confuse అవ్వకుండా మధ్య మధ్య లో కాఫీ గింజలు వాసన చూపిస్తారు. అది మళ్ళీ మన ముక్కు ని రీసెట్ చేస్తుందన్నమాట!
వాటిలో మనకి నచ్చింది ఒకటి కానీ, రెండిటి మిశ్రమం కానీ తయారు చేస్కోవచ్చు. వాటిని తగు పాళ్ళలో ఓ బాటిల్ లో వేసి ఇస్తాడు. అంతే. అదే మన కోసం మనం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న పెర్ఫ్యూమ్ అన్నమాట. ధర 2500 రూపాయల నుంచి మొదలవుతుంది. మనం ఎంచుకున్న అత్తరు బట్టీ. నేను కొనలేదు కానీ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనిపించింది.
నేనసలు పెర్ఫ్యూమ్ వాడే దాన్ని కాదు ....
ఒకటి... మధ్య తరగతి ఇళ్లలో ఇలాంటి విషయాల్లో ఇంట్రస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పించి ఇవి అలవాటు అవ్వవు. నెలసరి బడ్జెట్ లో రెండు, మూడు వేల రూపాయలు లేదా అంత కంటే ఖరీదు చేసే వస్తువు ... ముఖ్యంగా ప్రాక్టికల్ యూజ్ లేనిది అస్సలు కొనేవారు కాదు.
పెద్దయిన తరవాత అవి పర్యావరణానికి ... ముఖ్యంగా ఓజోన్ పొర కి ఎంత హానికరమో తెలిసి అసలు వాటి జోలికి పోయే దాన్ని కాదు.
కానీ ఇంకొంత పెద్దయ్యాక, మనం వాడే ఇంకా చాలా వస్తువుల నుంచి ... అంటే ఇంట్లో వాడే ఫినాయిల్ లాంటివి కూడా ... పర్యావరణానికి హానికరమే అని .... ఇలా పట్టించుకుంటూ పోతే అసలు బతకలేం అని ... కొంత బాధ్యతాయుతం గా ప్రవర్తిస్తే లైఫ్ లో అన్నీ ఎంజాయ్ చేయచ్చు అనే నిర్ణయానికి వచ్చి ఎవరైనా బహుమతి గా ఇస్తే వాటిని వాడటం లాంటివి మొదలు పెట్టాను.
ఏ విషయం అయినా కూలంకషంగా తెలుసుకోవాలనే అనవసరమైన అలవాటు వల్ల ఈ అత్తరు పరిశ్రమ గురించిన చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గరకి వచ్చి పడిపోయింది. ఆ సంచి ఈ రోజు ఈ పోస్టు లో బోర్లిస్తున్నా అన్నమాట
ముక్కు కి వాసన చూడటం వచ్చని గ్రహించిన రోజు నుంచి కోట్ల రూపాయల అత్తరు బాటిళ్ళు అమ్మే వరకూ మనిషి చాలా దూరం వచ్చాడు. నాకిదే నచ్చుతుంది మనిషి లో. కళాత్మకత ఎక్కడ జొప్పించడానికి వీలుండే అక్కడల్లా జొప్పించేస్తాడు.
ముందు ప్రకృతి లో మంచి వాసనలు చూసి ఉంటాడు. మల్లె, గులాబీ, మరువం, సంపెంగ... ఇలా. అవి ఒక్క పూట లో వదిలిపోవడం చూసి బాధ పడి ఉంటాడు. తన కంట్రోల్ లో లేని వస్తువు ని ఎలాగైనా పట్టు లోకి తెచ్చుకోవాలనే మనస్తత్వం ఇక్కడ కూడా పని చేసి ఉంటుంది. ఒక్క పూట లో వాడిపోయే పువ్వుల నుంచి ఎల్లకాలం ఉండిపోయే సుగంధంగా మార్చి అక్షరాలా వాటిని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. (ఇది మనిషి లో నాకు నచ్చనిది)
ఎవరి సంస్కృతుల పరిమళాలు మళ్ళీ వారివే ...
మన భారతీయ సుగంధాలు ... జవ్వాజి, సాంబ్రాణి, గులాబీ, మల్లె, గంధం, మరువం, కర్పూరం ... ఇలా ఉంటాయి కదా. ప్రకృతి కి దగ్గరగా, ఆయుర్వేదానికి అనుసంధానంగా. ఇందులో అన్నీ దేవుడికి సమర్పించడానికి కూడా సంకోచించం .. అంత పవిత్రంగా భావిస్తాం. ఇవి పర్యావరణానికి హానికరం కానివి. పైగా దోమలు, చిన్న చిన్న పురుగులు రాకుండా, ఎక్కువ మంది ఒక చోట చేరినప్పుడు వైరస్ లాంటివి వ్యాపించకుండా చేసే గుణాలు కూడా కలవి!
ఇక ముస్లిం సంస్కృతి విషయానికి వస్తే ... అసలు 'అత్తరు' అనే పదం వాళ్ళ 'ఇత్ర్' అనే పదానికి మనం ఇచ్చిన తెలుగు రూపమే కదా ... బజారు లాగా. వారికి అత్తరు ఒక అవసరం. ఇస్లాం పుట్టిన దేశాలు ఎడారి దేశాలు. నీటి ఎద్దడి. రోజూ స్నానం చేయడం కష్టం. అలాంటప్పుడు అత్తరు లేకపోతే పని అవ్వదు మరి!
చార్మినార్ నైట్ బజార్ కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న అత్తరు సీసాలు తెచ్చుకున్నాను. ఇవి చాలా ఘాటు బాబోయ్. కొంత రాసుకుంటే ఆ బట్ట ఉతికినా వాసన పోదు!
ఈ సంస్కృతుల కి అతీతం అత్తరు పరిశ్రమ. వాళ్ళ విధానాలు వేరు (రావు రమేష్ గారు అన్నట్టు). ఏదైనా మాస్ ప్రొడక్షన్ లోకి రాగానే కెమికల్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. కానీ దాన్లో కూడా కళాత్మకత, ఓ శాస్త్రం లేకపోలేదు. సుగంధాలని వాళ్ళు కొన్ని రకాలుగా విభజించారు.
ఫ్లోరల్ - పూల పరిమళాలు
ఫ్రూటీ - ఫలాల పరిమళాలు (మళ్ళీ ఇందులో నిమ్మ లాంటి సిట్రస్ పళ్ళు వేరే కేటగిరి, స్ట్రా బెర్రీ, మామిడి పండు లాంటి మధుర ఫలాలు వేరే కేటగిరి)
వుడీ - చెక్క కి సంబంధించిన పరిమళాలు (గంధం లాంటివే కాదు... చెట్టు బెరడు పరిమళాలు కూడా)
ఆక్వా - నీటికి సంబంధించిన పరిమళాలు
ఇవి కాక లావెండర్, బెర్గామోట్, వెనిల్లా లాంటి పరిమాళాలు.
ఒక పెర్ఫ్యూమ్ జల్లుకున్నాక ముందు ఏం వాసన వస్తుంది, కొంత సేపయ్యాక ఏం వాసన మిగిలి ఉంటుంది ఇలాంటి వాటిని వర్ణించడానికి 'నోట్స్' అనే పదాలని వాడతారు. సంగీతం లో శుద్ధ రిషభం, ప్రతి మధ్యమం లాగా అన్నమాట. బేస్ నోట్స్, హార్ట్ నోట్స్, టాప్ నోట్స్ ఇలాగ. పెర్ఫ్యూమ్ బాటిల్స్ మీద ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవగాహన ఉన్నవాళ్లు ఈ ఇన్ఫర్మేషన్ చూసి వాసన టెస్ట్ చేయకుండా ఆన్లైన్ కూడా పెర్ఫ్యూమ్ కొనుక్కోవచ్చు!
నా స్నేహితురాలు బహుమతి గా ఇచ్చిన పెర్ఫ్యూమ్ లో 'నోట్స్' వివరాలు ఇవి .. గులాబీ, మల్లె, మస్క్ ల మిశ్రమం ఈ సుగంధం |
లోతు కి వెళ్తే ఇంకా చాలా విభజనలు ఉన్నాయి. పెర్ఫ్యూమ్ అని దేన్ని అంటారు, eau de cologne అని దేన్ని అంటారు (దీన్ని మనవాళ్ళు ఉడుకులోన్ అంటారు ... ఏదో తెలుగు పదం అన్నట్టు గా!) అవి మనకి ఇక్కడ అనవసరం.
అభిరుచి ఉన్న వారిని పక్కన బెడితే ఇదంతా అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ వాళ్ళ ప్రపంచం.
ఖరీదు వేలల్లో ఉంటుంది కదా. అప్పుడప్పుడూ లక్షల్లో కూడా. వేలం పాటల్లో ఏ చనిపోయిన రాజో, రాణో, హాలీవుడ్ సినీ తారో, ప్రెసిడెంటో వాడిన బాటిళ్లు, బంగారం, వజ్రం తాపడం చేసినవైతే కోట్లకి అమ్ముడు పోవడం చూస్తూ ఉంటాం కూడా!
ఈ పెర్ఫ్యూమ్ బాటిల్స్ ని కలెక్ట్ చేసే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ బాటిల్స్ ని చూడటానికి చాలా ముచ్చట గా ఉండేలా డిజైన్ చేస్తారు. డిస్ప్లే లో పెట్టుకునేంత అందంగా!
నేను ఈ ఖరీదైన పెర్ఫ్యూమ్ లు ఎక్కువ వాసన చూడలేదు. చిన్నప్పుడు వీటి గురించి తెలీక సారా వాసన లాగా అనిపించేది ... వీటిలో ఉన్న ఆల్కహాల్ వల్ల. కానీ ఇప్పుడు నా కల్చర్డ్ ముక్కు కి తేడా తెలుసు. మొన్న ఆ షాపు అతను టొబాకో వాసన చూపించాడు. మన చుట్ట, సిగరెట్.... ఇలా అస్సలు లేదు ఏంటో!
నాకేం పెర్ఫ్యూమ్ నచ్చుతుంది అని కుతూహలం కలిగింది. నాకు మధుర ఫలాల పరిమళం నచ్చింది. ఫ్రూటీ. సిట్రస్ వాసనలు కూడా నచ్చాయి. అలాగే తినే వాటికి సంబంధించిన గౌర్మాండ్ వాసనలు అంటే వెనిల్లా, చాక్లెట్ లాంటివి నచ్చుతున్నాయి అని తెలిసింది.
ఇంకా అలాంటివి తయారు చేయలేదు కానీ సాంబారు మరుగుతున్న వాసన, మాగాయి లో పోపు వేసిన వాసన, గుమ్మడి వడియాలు వేయించినప్పుడు వచ్చే వాసన.. ఇవి కూడా నచ్చుతాయనుకుంటా నాకు! హహ్హా! ఎవరైనా తెలుగు వారు ఈ పరిశ్రమ లోకి వస్తే ఇలాంటివి తయారు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కొంటారు అని నా నమ్మకం!
ఇలా రకరకాల సుగంధాలు వాసన చూసి, వాడాక మనకి ఏదో ఒకటి నచ్చుతుందట. అదే మన సిగ్నేచర్ సెంట్ అవుతుందట. అంటే అదే మన వాసన అయిపోతుంది. ఆ వాసన చూడగానే అందరికీ మనం గుర్తొస్తాము అన్నమాట!
వాసనలకి దగ్గరగా ఉండే ఇంకో బ్రాంచ్ ఆరోమా థెరపీ .. ఎస్సెంషల్ ఆయిల్స్ అంటారు .. లావెండర్, టీ ట్రీ ఆయిల్, యూకలిఫ్టస్ (నీలగిరి తైలం).. ఇలా. వీటిని తలనొప్పి వచ్చినప్పుడు వాడచ్చు. క్యాండిల్స్ గా వాడచ్చు. అమెజాన్ లో ఆరోమా ఆయిల్స్ ని గదంతా ప్రసరింపజేసే చిన్న మెషీన్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి సరైన చోట కొంటే పూర్తి సేఫ్.
నాకు మా ఎల్ కె జీ టీచర్ వాడే పెర్ఫ్యూమ్ బాగా గుర్తు. ఎవరైనా ఆ పెర్ఫ్యూమ్ వాడితే నాకు కలిగే ఎమోషన్ - టెన్షన్. ఆవిడని చూస్తే నాకు భయం నెర్వస్ గా అనిపించేది చిన్నప్పుడు.
అలాగే లిల్లీ పూల వాసన కూడా నాకు హడావుడి భావన కలిగిస్తుంది. చిన్నప్పుడు స్టేజ్ మీద పాట పాడినప్పుడు లిల్లీ పూల దండ వేశారు. బోల్డు మంది జనం, కోలాహలం .. నా మెదడు హడావుడి ని లిల్లీ పూల పరిమళానికి అసోసియేట్ చేసేసింది ఏవిటో!
గులాబీ పూలు, బంతి, చేమంతి వాసనలు పండగ వాతావరణాన్ని తలపిస్తాయి ఎప్పుడు వాసన చూసినా.
కొన్ని ఖరీదైన సెంటు వాసనలు మాల్ లో ఉన్న భావన కలిగిస్తాయి.
వాసన కి జ్ఞాపకాలకి ఇంత దగ్గర సంబంధం ఉందన్నమాట!
నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అందులో గాలి ని యేమని వర్ణించారో తెలుసా 'గంధ వహ రథము' అని. గంధాలను మోసుకొచ్చే రథం గాలి అయితే...ఎన్నో అనుభూతులను, హాయిని, జ్ఞాపకాలను, కొంతమందికి తలనొప్పిని మోసుకొచ్చే రథం గంధం... కదా!
The creative way you presented this article made more interesting.
ReplyDeleteThank you!
Delete