ఈ 'గడ్డ' పై మమకారం

బంగాళా దుంప లేదా ఆలు గడ్డ - ఇది నచ్చని వారిని నేను అనుమానిస్తాను. వీళ్ళు చాలా తేడా మనుషులై ఉంటారు నా అభిప్రాయం లో. కేవలం వాళ్ళకొక ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవటం  కోసం 'ఆ .. మాకు ఆలు అంత గా నచ్చదు' అని అనే రకం. లేకపోతే జీవితం లో అసలైన ఆనందం ఇచ్చేవి - వాన, ఇంద్రధనుస్సు, పువ్వులు .. వీటి తో పాటు 'ఆలు' కూడా పడని రకం. లేకపోతే ఈ దుంప ఎంత తినేసారంటే ఇంక వెగటు పుట్టేసిన రకం. ఇది విశ్వామిత్ర సృష్టి అని జడ్జి చేసే రకం. లేదా మనసు లో ఇష్టం ఉన్నా డైటింగ్ పేరుతో దూరం పెడుతున్న రకం. ఏ రకమైనా వీళ్ళ తో స్నేహం చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. 

లేకపోతే ఏవిటండి .. బంగాళా దుంప ఎంత అపురూపమైన సృష్టి! ఇది లేకపోతే మాత్రం ఖచ్చితంగా సృష్టి లో ఏదో లోపం ఉండేది. అయినా దాని గొప్పతనం వర్ణించ నేనెంత! 

నేను ఈ మధ్యే ఓ ప్రొమోషన్ సంపాదించాను. వంటింట్లో. వంట లో నెక్స్ట్ స్థాయి కి వెళ్ళాను అని అప్పటి నుంచి తెగ విర్రవీగుతున్నాను. 

ఆ ప్రొమోషన్ గురించి చెప్పే ముందు కొంత నేపథ్యం, స్థల పురాణం ... ఇలాంటివి చెప్పుకోవడం చాలా ముఖ్యం. 

బంగాళా దుంపల్లో చాలా రకాలున్నాయి. పంట పండించే వాళ్ళకి, వంట వండే వాళ్ళకి తెలిసిన నిజం ఇది. 

కొన్ని బంగాళా దుంపలకి తొక్కు ఈజీ గా వచ్చేస్తుంది చూసారా .. ఇంకొన్ని బ్రౌన్ రంగులో ఉంటాయి.  కొన్ని బంగారు వర్ణం లో ఉంటాయి. 

కొని ఆలు గడ్డలు కోలగా ఉంటే కొన్ని గుండ్రంగా ఉంటాయి. 

ఇవన్నీ కలిపి అమ్మేస్తూ ఉంటారు కొన్ని సార్లు. లేదంటే ఒక్కో సారి ఒక్కోటి వస్తాయి. 

మనం మాత్రం పెద్ద భేదం చూపకుండా వాడేస్తూ ఉంటాం. చెఫ్ లు, హాట్ చిప్స్ లాంటి ప్రొఫెషనల్స్ కొంత మందే తమకి కావాల్సిన రకాన్ని ఎంచుకుని వాడతారు. 

అవును. కొన్ని రకాల ఆలు గడ్డలు కరకరలాడవు ... వాటిని ఫ్రై చెయ్యడానికి ట్రై చేస్తే మూకుడికి అతుక్కుపోతాయి. 

ఆలు లో రకాలు ఉన్నాయి అని తెలియని వాళ్ళం మన తప్పే అనుకుంటాం. కాదు. 

చిప్స్ కి వాడే ఆలు వేరు. అవి బ్రౌన్ రంగులో ఉంటాయి. 

అలాగే రోస్ట్ పొటాటోస్ అంటే వేపుడు కి కావాల్సిన ఆలుగడ్డ వెరైటీ ని రస్సెట్ పొటాటోస్ అంటారు. ఇవి మన దగ్గర పండవట. 

కానీ వేపుడు కి కావాల్సిన రకాలు మన వాళ్ళు నానా తంటాలు పడీ మొత్తానికి పండించారనుకోండి. 

ఇంతకీ మన దగ్గరకి మార్కెట్ లో వచ్చేవి ఇంత శాస్త్రీయంగా ఒకే రకం లో ఉండవు. వచ్చినవి వాడుకోవాలి. అంతే. 

అయితే ఇక్కడే నేను నా అనుభవాలతో ఎంటర్ ది డ్రాగన్ అవుతాను. 

ఆలు ఫ్రై ఎవరు వండుతున్నారో వాళ్ళే తరుక్కోవాలి. 

తరిగే అప్పుడు కత్తి వీటిలోకి మెత్తగా దిగితే ఇవి ఫ్రై కి అంతగా పనికి రావు అని. 

కత్తి కష్టం గా దిగితే .. (ఆలు రాయి లా ఉండాలన్నమాట) ఇది ఫ్రై కి పర్ఫెక్ట్. 

ఆలు ఫ్రై కి ఫర్ఫెక్ట్ అయితే సరిపోదు .. వండే వాళ్ళు కూడా చాలా విషయాల్లో పెర్ఫెక్ట్ గా ఉండాలి. 

ముందు కళ్ళు మూసుకొని బంగారు వర్ణం లో అన్ని వైపులా ఒకే లా వేగిన, ఉప్పు, కారం సరిపోయిన బంగాళా దుంప ముక్కల్ని మనసులో నిలిపి ధ్యానం చెయ్యాలి. దీన్నే ఈ మధ్య visualization అని కూడా అంటున్నారు. 


(పాత చిత్రం)

ఇప్పుడు సంకల్పం చేసుకోవాలి. 

నేను ఈ పూట ఈ ఆలుగడ్డ ఫ్రై ని తలపెట్ట బోతున్నాను. చేస్తున్నంత సేపు 'ఇది తిని నేను ఎంత లావైపోతున్నాను, ఇది ఈ వారం లో అప్పుడే రెండో సారి, ఎంత నూనె పోస్తున్నానో, దీనిలో ఎన్ని కాలరీలు ఉన్నాయో' అనే తలపులు తలవను. ఆనందంగా చేసుకున్న ఏ పదార్ధమైనా బాగా కుదురుతుంది, శరీరానికి బాగా పడుతుంది అనే నిజాన్ని మననం చేస్కుంటూ ఉంటాను. 

ఇది సంకల్పం. 

ఇప్పుడు కళ్ళు తెరిచి ఆలు ఫ్రై కి సరిపోయే మూకుడు చూసుకోవాలి. ఏ మూకుడంటే ఆ మూకుడు లో ఆలు ఫ్రై చెయ్యలేం అని గుర్తుంచుకోవాలి. ఇష్ట దైవానికి ప్రత్యేక ఆసనం ఏర్పరిచినట్టే దీనికి సరిపడే సరైన మూకుడు ఉండాలి. 

ఇప్పుడు మూకుడు బర్నర్ మీద పెట్టి హై లో ఉంచాలి ... నూనె కావాల్సినంత పోయాలి ... సత్యనారాయణ కథ లో చెప్పినట్టు లోభిత్వం చూపకూడదు. 

ఈ నూనె కూడా హై లోనే కాగాలి. 

కాగాక ముక్కలు వేసేయాలి. మిగిలిన బర్నర్ల మీద అవీ ఇవీ పెట్టి  అష్టావధానం లాగాచేయకూడదు. మనోవాక్కాయకర్మ లు, ఇంద్రియాలన్నీ దీనికే కేటాయించాలి. అదే ధ్యానం అంటే. 

నిముషానికో.. అంత కన్నా తక్కువ సమయానికొక్క సారి కలుపుకోవాలి. 

చూస్తుండగానే రంగు మారి గలగలలాడుతూ బంగారు వర్ణం లో కి వస్తాయి. 

సరైన సమయానికి ఉప్పు, కారం వేసి స్టవ్ ఆఫ్ చేసెయ్యాలి. పూజ పూర్తయింది. ఇంక నైవేద్యమే తరువాయి. 

ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. నైవేద్యం పెట్టడం లో ఆదిత్యాది నవగ్రహ దిక్పాలకులు, ఇంద్రాది సకల దేవతలు - ఎవ్వరికీ ఎలా తక్కువ చెయ్యకూడదో ఇంట్లో ఉన్న వారికీ అంతే. ముందే భాగాలు చేసేయాలి ... ముక్కలు లెక్కపెట్టి భాగాలు చెయ్యవలసి వచ్చినా చాదస్తం కాదని గ్రహించండి. ఇది మీ నిబద్ధత అని గుర్తుంచుకోండి. 

ఆస్తులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. స్థలాలు, నగలు, ఇళ్ళూ, డిపాజిట్లు.. ఒకటి పోతే ఇంకొకటి. 

కానీ ఆలు ఫ్రై అలా కాదు. ఈ రోజు కుదిరినట్టు రేపు కుదరకపోవచ్చు. 

వరస గా ఆలు తినకూడదని అమ్మ ఆంక్ష పెట్టచ్చు. 

ఆలు రేపు స్టాక్ లేకపోవచ్చు. లేదా వరసగా మెత్తటి రకం వే రావచ్చు. 

అందుకే ఈ రోజే.. ఇప్పుడే చేతిలో ఉన్న ఈ ఆలు ఫ్రై విలువ తెలుసుకోవాలి. 

దీని కోసం తండ్రి తో, సోదరుల తో పోరాడవచ్చు .. (ఆలు గీత... పదమూడో అధ్యాయం ఐదవ శ్లోకం). ఇది ధర్మం గానే ఎంచబడుతుంది. 

ఆలు పంపకాలు అయ్యాయి. 

ఇంక నెయ్యి అన్నం లో తింటారో, ఉట్టివే తినేస్తారో... వారి వారి ప్రాంతాల సంప్రదాయాలు, అలవాట్లని బట్టీ. ఇంత శ్రద్ధగా చేసిన వేపుడు మీద మూత పెట్టినా (ఆవిరి కి ముక్కలు మెత్తబడిపోతాయి), కంచం లో వేసినా టివి చూస్తూనో, వీడియో గేమ్ ఆడుతూనో అశ్రద్ధ చేసినా, ఉసిరి పచ్చడి, శొంఠి, వాము పొడుల లాగా మొదటి ముద్ద లో తినకపోయినా అపరాధం అపచారం. అప్పుడు వీరి వాటా వేపుడు నుంచి కొంత తీసేసి ఇష్టంగా తినే కుటుంబ సభ్యులకి పంచవచ్చు అని పొటాటో పీనల్ కోడ్ లో స్పష్టంగా రాసి ఉన్నది.  అలాగే 'మేకర్స్ బోనస్' అంటే వండిన వాళ్ళు కొంత ఎక్కువ వాటా తీసుకోవచ్చు అనే వెసులుబాటు ఉన్నది 'పండించే వాడిదే భూమి' అనే రూలు ని అనుసరించి. 

ఇవండీ ఆలు ఫ్రై కి సంబంధించిన అ 'ఆలు'. ఇవేవీ చేయకుండా యాంత్రికంగా చేసేసుకుంటే కాలరీలు మాత్రం దక్కి తృప్తి దక్కకుండా పోతుంది అని పురాణం హెచ్చరిస్తోంది. 

మీరు నమ్మండి నమ్మకపోండి నాకు ఇది రాస్తుండగా ఆలు ఫ్రై చేసిన వాసన వస్తోంది! 

అన్నట్టు ఓ ముఖ్యమైన గమనిక -  ఈ పోస్టు స్పాన్సర్డ్ పోస్టు కాదు .. ఆలుగడ్డ రైతులు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నాకు డబ్బులిస్తే రాసినది కాదు. 

ఇంతకీ నా ప్రొమోషన్ గురించి చెప్పనే లేదు కదూ. 

ప్రతి కళ లోనూ నైపుణ్యానికి స్థాయులు ఉంటాయి. 

అందులో పతాక స్థాయి .. అంటే మాస్టర్ స్థాయి .. ఈ స్థాయి లో పదార్ధం కంటే చేసే వారి చేతి మహిమ ఎక్కువవుతుంది. 

ఈ స్థాయి కి ఒక మెట్టు దగ్గరకి వచ్చాను. 

మెత్తటి ఆలు గడ్డ ల తో కూడా కరకరలాడే వేపుడు చేసేసాను మొన్న! 

నా టిప్స్ ... మొదటిది ... వండే ముందు గిల్టీ ఫీలింగ్ తీసేయండి. రెండోది నూనె లో ముందు పసుపు వేస్తే ఆలు లో ఉండే తేమ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది. యూ ఆర్ వెల్కమ్. (మీరు థాంక్స్ చెప్పి ఉంటారని గెస్ చేశా)

బంగాళా దుంప వేపుడు లో హీరో స్నేహితుడి స్థానం జీలకర్ర. చిన్న రోలే కానీ కథ కి చాలా ఇంపార్టెంట్ అండి. 

అలాగే ఆప్షనల్ - ఉల్లిపాయ. ఇది వాడితే వేపుడు మెత్తబడుతుంది అంటారు కొంత మంది. లేదు రుచి ఇనుమడిస్తుంది అంటారు ఇంకొంతమంది. ఇది సినిమా లో పాటల్లా అనుకోండి. 

బంగాళా దుంప మీద ఇంత రాయడం అవసరమా అని ఎవరికైనా అనిపిస్తే ఈ పోస్టు ప్రారంభం లో నేను చెప్పిన రకం వాళ్ళన్నమాట వాళ్ళు. 

చూడండి మీకు రెండు విషయాలు చెప్తాను. 

ఒకటి - నేను ఇంకా పిల్లకాకి ని. వీర్ సింఘ్వి లాంటి ప్రముఖ వ్యక్తి బంగాళా దుంప మీద ఎంత పెద్ద వ్యాసం రాసి తన వెబ్ సైట్ లో పెట్టుకున్నారో తెలుసా ... ఈ లింక్ చూడండి కావాలంటే 

రెండోది - నా అభిప్రాయం మార్చుకుంటున్నానండి. మీ లాంటి వాళ్ళతో నేను స్నేహం చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా కలిసి సినిమా కెళ్ళినా, పార్టీలకెళ్లినా నా చిప్స్ పాకెట్ మీతో షేర్ చేస్కో అక్కర్లేకుండా, ఏ కాంపిటీషన్ లేకుండా తినచ్చు కదా! కనుక ఆలు ద్వేషులకి ఇదే నా స్నేహ హస్తం! 

ఇక బంగాళా దుంప ప్రేమికులకి ..ఈ 'గడ్డ' పై మమకారం ఇలాగే వర్ధిల్లాలి అని కోరుకుంటూ .. జై హింద్.  

Comments

  1. బంగాళా భౌ భౌ లా ఉంది వ్యా‌సం. JK.
    ఒకప్పుడు ఎంతో రుచిగా వుండే ఆలుగడ్డ ఇప్పుడు చప్పగా, ఒకోసారి తియ్యగా ఉంటోంది. దీనికి కారణం హైబ్రిడ్ అని నా పరిశోధనలో తేలింది.
    ఉత్తరాదిలో ఉన్నప్పుడు దేశీ అంటే నాటు దుంపలు దొరికేవి, మన చిన్నప్పటిలా. అవి కమ్మగా, కొద్దిగా వగరుగా చాలా రుచిగా ఉంటాయి. తొక్క దళసరిగా ఉంటుంది.

    ReplyDelete
  2. బంగాళా దుంప ప్రశస్తి ఎంత చేసినా తరగదు. అది యొక రాజా లాంటి శాకము.

    మరొక మహత్తరమైన టిఫిన్ “ఉప్మా” గురించి టపా వ్రాసినది మీ ఈ బ్లాగులోనేనా? నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. వెదుకుదామంటే మీ బ్లాగులో Blog Archive కనబడడం లేదు. ఉప్మా మాకు నచ్చదు అనే వాళ్లు కూడా అనేకులు, అదేమిటో.

    ReplyDelete
  3. ఆలుగడ్డ మీద ఇంత ప్రేమ ఉన్న మీరు ఇంకా ఆ గడ్డ మీదే ఎందుకు ఉండిపోయారో అర్ధం కావడం లేదు . మీరు ఉండాల్సింది జర్మన్ గడ్డ మీద .. . ఆలు ని ఆలి కన్నా ఎక్కువగా ప్రేమించే దేశం . :Venkat

    ReplyDelete

Post a Comment