కలర్ కలర్.... వాట్ కలర్ డూ యూ వాంట్?

మనోళ్ళకి ఈ తెల్ల చర్మం పిచ్చి ఎందుకంటారు?    

ఒక సింపుల్ జవాబు - తెలుపు మంచికి నలుపు చెడ్డ కి సంకేతాలు గా భావిస్తాం. ఇది చర్మం రంగు కి కూడా ఆపాదించాలి అని ఎందుకు అనిపించిందో మనకి? మనిషి చర్మమే కాదు .. జంతువులని కూడా ఈ 'వర్ణ' విభేదాల నుంచి మినహాయించలేదు కదా ... నల్ల పిల్లి, నల్ల కుక్క, కర్రి ఆవు ... ఇలా. వీటిలో కొన్ని మంచి శకునాలు, కొన్ని దుశ్శకునాలూనూ. (కోడి లాంటివి ఈ కలర్ పాలిటిక్స్ నుంచి బానే తప్పించుకున్నాయి). మన వ్యవహార భాష లో కూడా 'ఆ పిల్ల మంచి రంగు' అంటే తెల్లగా ఉంటుందనే అర్ధం.  

ఇంగ్లీషు లో ఫెయిర్ అంటే తెలుపు అని, న్యాయం అని రెండు అర్ధాలు ఉన్నాయి కదా. వాళ్ళు అసలు రెండో అర్ధం లోనే ఫెయిర్ ఎక్కువ వాడతారు. మొదటి అర్ధం మన వాళ్ళు ఎక్కువ వాడతారు. సో, ఓ తెలుగు వాడు పెళ్లి సంబంధం చూసే అప్పుడు 'అమ్మాయి ఫెయిర్ గా ఉండాలండి' అంటే 'న్యాయంగా ఉండాలండి' అనే అర్ధం వస్తుందన్నమాట! హ్హహా! 😉

జీవితాన్ని ఏ కొంచెం చూసిన ఎవరైనా ఒప్పుకుంటారు .. చర్మం రంగు తో గుణానికి ఏ మాత్రం సంబంధం ఉండదని. అయినా తెలుపు వైపే మొగ్గు చూపిస్తారు. ఎందుకు? 

అందానికి కూడా రంగు తో సంబంధం లేదు. కాకపోతే శ్వేత వర్ణేతర అందాల ని ఎవ్వరూ సరిగ్గా గమనించనందువల్ల ఎక్కువ గుర్తింపు ఉండదు అంతే. (ఇందుకు ఓ మంచి మినహాయింపు బాపు గారు చూపించిన కథానాయికలు!) 

ఈ కలర్ పాలిటిక్స్ లో జెండర్ పాలిటిక్స్ కూడా కలిపితే మన ద్వంద్వ వైఖరి బట్టబయలవుతుంది. అబ్బాయిలు తెల్లగా ఉండనవసరం లేదు. అమ్మాయిలే ఉండాలి. (దీనిక్కూడా బాపు గారి కథానాయికలు మినహాయింపే!) 

పెళ్ళిళ్ళ మార్కెట్ లో 'తెలుపు' విలువ ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు. 

ఫెయిర్నెస్ క్రీములు మార్కెట్ అలా పెరిగిపోవడానికి పెళ్ళిళ్ళ మార్కెట్ అతి పెద్ద కారణం. 

పుట్టినప్పటి నుంచి గుచ్చి గుచ్చి రూపాల్లో లోపాలు ఎంచి, ఎంచి, మాస్ మీడియా ల లో అమ్మాయిల చిత్రీకరణ లాంటి వాటితో బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయిల్లో కలిగించిన ఆత్మ న్యూనత రెండో పెద్ద కారణం. 

ఇది సరిపోనట్టు ఇప్పుడు మగవారికి కూడా ఫెయిర్నెస్ క్రీములు వదులుతున్నారు. 

అవునులెండి ... ఆకలి, నిరక్షరాస్యత, కాన్సర్, మానసిక ఆరోగ్యం, శాంతి, బీద దేశాల నుంచి వలస పోతున్న కాందిశీకులు, హింస, యుద్ధం, లింగ వివక్ష - ఇవేవీ సమస్యలు కానే కావు... ఆడ వాళ్ళు వాడుతున్న ఫెయిర్నెస్ క్రీమే మగవారు వాడాల్సి రావడం పాపం అసలు కష్టం. 

ఇందులో ఓ మంచి వార్త ఏంటంటే మన ప్రభుత్వం ఈ రకమైన యాడ్స్ ని బాన్ చేస్తోందట. ఇది ఫిబ్రవరి వార్త. ఆ తర్వాత బోల్డు జరిగిపోయాయి కాబట్టి ఇంకా ఈ ఆలోచన అమలులోకి వచ్చిందో లేదో తెలియదు. నోట్: బాన్ చేస్తోంది యాడ్స్ ని, ప్రాడక్ట్స్ ని కాదు... ప్రాడక్ట్ ని తిరస్కరించాల్సింది మనమేమో.  

పర్సనల్ గా ఏ క్రీము వాడాలో ఎవరిష్టం వాళ్ళది. ఉన్న రంగు కంటే మంచి రంగు కావాలనుకోవడం కూడా వ్యక్తిగత నిర్ణయమే. కానీ ఆ నిర్ణయం సమాజం నుంచి ఒత్తిడి వల్లో, అనారోగ్యకరమైన న్యూనత నుంచో రాకూడదని నా అభిప్రాయం. 

ఇదంతా మాట్లాడే ముందు నా వ్యక్తిగత అనుభవాలు కూడా చెప్తాను. ఈ తెలుపు ప్రివిలేజి చిన్నప్పటి నుంచి అలవాటే నాకు. స్కూల్ లో టీచర్ల దగ్గర నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. వీళ్ళకి పెళ్లిళ్ల టైం కి టెన్షన్ పడక్కర్లేదు అని ఊపిరి పీల్చుకుంటారు పెద్దవాళ్ళు. ఉద్యోగం ఇంటర్వ్యూ లలో, పది మందీ కలిసే చోట విలువ ఎక్కువుంటుంది. ఏ రంగు బట్టలు వేసుకున్నా నప్పుతుంది అనేది ఓ అభిప్రాయం. డోర్స్ ఓపెన్ అవుతాయి మీటింగ్స్ కి. ఇది నిర్వివాదాంశం. 

ఈ నాణానికి రెండో వైపు లేకపోలేదు. తెలుపులో కూడా ఇంకొకరి తో పోల్చి ఎవరి తెలుపు బాగుంటుంది అనే కంపారిజన్స్ ఉంటాయి. తెల్ల చర్మం పల్చగా ఉంటుంది. ఎండ లాంటివి తట్టుకొనే శక్తి తక్కువ ఈ రకం చర్మానికి. అందుకే అర పూట ఎండలో ఉంటే టాన్ ఎక్కువయిపోతాం. ఆఖరి గా చెప్పవలసిన విషయం ... నా చర్మం రంగు వల్ల డోర్స్ ఓపెన్ అయ్యాయేమో కానీ డీల్స్ ఓకే అవ్వలేదు. (ఇదో అదృష్టం అనుకోండి!) 

కొంతమంది ఆటోమాటిక్ గా నేను తెలుపు కాబట్టి పొగరు గా ఉంటానేమో అని అనేసుకుంటారు.అది వారి తప్పు కానే కాదు. రంగు వల్ల పొగరు గా ప్రవర్తించే వారికి కొదువేం లేదు. 

నిజానికి ఈ ట్రాప్ లో పడిపోవడం చాలా ఈజీ. అందరూ ప్రత్యేకంగా చూడటం, మన చెయ్యి పక్కన వాళ్ళ చెయ్యి పెట్టి కంపేర్ చేసుకోవటం, బాగా పొగడటం ... భలే ఈగో కిక్కులు ఇవన్నీ. 

But in all fairness, what have I done for this 'fairness'? 

ఒక్క సారి ఫెయిర్ గా ఆలోచిస్తే నేనేం చేసాను ఈ ఫెయిర్ నెస్ రావడానికి? ఏం పాటు పడ్డాను? ఏం సాధన చేసాను? తెల్లగా పుట్టడం కాకతాళీయం .. ఆ రంగు ని గొప్పగా చూసే సమాజం లో పుట్టడం అంతే కాకతాళీయం. (ఒక్క సారి ఊహించండి ... తెలుపు ని నీచంగా చూసే వాతావరణం లో పుట్టి ఉంటే నా పరిస్థితి ఏంటి?😊) 

పైగా నా రంగు వల్ల కలిగిన పరిచయాల విలువ ఏం ఉంటుంది? అభిప్రాయాలూ, అభిరుచులు కలవాలి కానీ. 

తెలుపు నా అదృష్టం అనుకోను. అలా అనుకుంటే నలుపు దురదృష్టం అన్నట్టే కదా. నిజానికి అదృష్టం ఏంటంటే రంగు ఆధారంగా తేడాలు చూపించని సమాజం లో పుట్టడం. 

ఇది స్థానిక సమస్య అనుకున్నా చిన్నప్పుడు. చరిత్ర చదివాక నిజం తేట తెల్లమైంది. మనిషి వివక్ష వైఖరి ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే అని. 

తెల్లవారి పొగరు, నల్ల వారి న్యూనత ... జోడి సరిగ్గా కుదిరింది. మన దేశం తో సహా ముప్పావు ప్రపంచం శ్వేత జాతీయులకి బానిసయిపోయింది.

ఇప్పటికీ రోడ్డు మీద వైట్ ఫారినర్స్ కనిపించినప్పుడు మన వాళ్ళ ప్రవర్తన చూస్తే నాకు చాలా ఎంబరాస్సింగ్ గా అనిపిస్తుంది. తెల్ల వారు ఎలా మనని కంట్రోల్ చెయ్యగలిగారో అర్ధం అవుతుంది.  

మానవత్వానికి తీరని ద్రోహాలు చేసిన నాజీలు ఈ విషయం లో ఏం తక్కువ కాదు  .. వారి ప్రకారం మనుషులు రెండు రకాలు .. దొరలూ, బానిసలూ. వారి ప్రకారం దొరలు ఎవరు అంటే గుణం, నాయకత్వ లక్షణాలు, రాజకీయ నైపుణ్యం, వీరత్వం, కరుణ... ఇవి ఉన్నవారు కారు. తెల్ల చర్మం, నీలం రంగు కళ్ళు, బంగారు వర్ణం లో ఉన్న జుట్టు ఉంటే చాలు. ఇవి లేని వాళ్ళు ఎవరైనా బానిసలే. 

వర్ణ వివక్ష కి ఎన్నో షేడ్స్ ఉన్నాయి ... కలరిజం, రేసిజం, వైట్ సుప్రీమసి (శ్వేత ఆధిపత్య వైఖరి)... అన్నటి మూలాలు ఒక దగ్గరే .. మనిషి చేతిలో లేని చర్మం రంగు ఆధారంగా గొప్పో, దిబ్బో అని బేరీజు వేసేయడం .. వారి జీవితాలతో ఆడుకోవడం. 

మన సంస్కృతి రంగు గురించి ఏం చెప్తోంది? 

మన సంస్కృతి బంగార్తల్లండి బాబూ .... ఏ టాపిక్ తీసుకున్నా ముందు ఆ టాపిక్ మన సంస్కృతి లో ఎక్కడో ఉండే ఉంటుంది.. రెండు ఆ విషయం లో విశ్వజనీనమైన ఆలోచనలు కలిగి ఉంటుంది. 

'రామ నీలమేఘశ్యామ' అంటే ఏంటండీ? 

'కాళీ' ఎలా ఉంటుంది? 

'శ్యాం' అన్నా 'కృష్ణా' అన్నా పేరు లోనే ఆయన రంగు కూడా ఉంది .. ఆయనని అలాగే ప్రేమించేశారు అందరూ! 




Melanin formula
మనం సృష్టించుకున్న విభేదాల కి అమాయకమైన మూలం - మెలనిన్ 
Pic Courtesy: ClickChemist / CC BY-SA (https://creativecommons.org/licenses/by-sa/4.0)

మన కళ్ళు, జుట్టు, చర్మం రంగు ... వీటి వెనక ఉండేది మెలనిన్ అనే ఓ పిగ్మెంట్. 

దీని ఎక్కువ తక్కువల  వల్ల మన రంగుల్లో మార్పులు. అంతే.

మరి ఇన్ని గొడవలు ఎందుకో ఆ 'నల్లని మేని నగవు చూపుల వాడి'కే తెలియాలి.  

Comments

  1. బాగా చెప్పారు.

    మన దేశంలో చర్మం తెల్లబడటానికి, జుట్టు నల్లబడ టానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ దానికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి.

    ReplyDelete
  2. A letter to son
    నలుపు
    నిన్న శ్యామల అత్త వచ్చారు రాజమండ్రి నుండి నిన్ను చూడ్డానికి. మళ్ళీ రంగు గురించి ప్రస్తావన వచ్చింది. బహుశా ఈ మనుషుల జీవితాల్లో అది ఎప్పటికి చరిగిపోలేని జాడ్యామేమో ! నువ్వు పుట్టిన దగ్గరనుండి ఇప్పటివరకు దాని ప్రస్తావన లేని రోజు ఒక్కటి లేదు . దానికి ఎవ్వరూ అతీతులు కారు. అందరికి నీకు చివరికి ఏ రంగు మిగులుతుందని అంచనాలు వేసేవారే ! ఇంత వ్యత్యాసమా ! ఇంత చిన్న చూపా ! నాకు సర్దిచెపుతున్నట్లు చెప్తూ ఆ రంగు పట్ల తమ ఉదాసీనతను నాకు తెలియచెప్తున్నారు. మన చుట్టూ మనకి తెలియకుండా మన హృదయాల్లో ఇంత నల్లని చీకటి అలముకొందా !

    పి.స్.: ఈ పోస్ట్ కి మొదట టైటిల్ రంగు అని పెట్టా. చూసావా నేను కూడా ఎంత బయపడ్డానో నలుపు అని పెట్టడానికి. ఆ ఆలోచనే మనల్ని తక్కువ చేస్తుందనే నూన్యత .పూర్తి చేసిన తర్వాత గాని ధైర్యం రాలేదు.

    ReplyDelete
  3. చాలా "ఫెయిర్‌"గా వ్రాసారు..
    తెల్ల వాళ్ళ నుండి స్వాతంత్ర్యం వచ్చినా తెల్ల చర్మం లేని వాళ్ళని తక్కువగా చూసే భావ దారిద్ర్యం చాలా మంది లో ఉంది.

    ReplyDelete

Post a Comment