కాలమహిమ
'టైం ని మనిషి సృష్టించాడు' అని ఎవరో అన్నారు నా తో కొన్నేళ్ల క్రితం.
అదెంత వరకూ నిజమో తెలుసుకుందామని యధావిధి గా రీసెర్చ్ చేస్తే మహా ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి!
ఉదాహరణ కి ఇది చూడండి.
కాంతి మనని చేరడానికి టైం పడుతుంది. అందుకే మనం చూసేదంతా గతమేనట! కిటికీ బయట మనం చూస్తున్న సూర్యుడు ఎనిమిది నిముషాల ఇరవై సెకన్ల క్రితం సూర్యుడు! భూమి కి అతి దగ్గరగా కనిపించే నక్షత్రం మీరు ఈ రోజు చూస్తున్నట్టయితే మీరు చూస్తోంది నాలుగేళ్ళ క్రితం నక్షత్రాన్ని.
క్రికెట్ లాంటివి లైవ్ టెలికాస్ట్ చేసే అప్పుడు ఏడున్నర నిముషాలు ఆపి చేస్తారు ... ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే కవర్ చేసుకోవచ్చని ... నాకు సూర్యుడి నిజం తెలిసాక ఇది గుర్తొచ్చి నవ్వొచ్చింది ... కారణం ఏదైనా మన లైవ్ టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ కాదన్నమాట!!!
టైం గురించిన విషయాలు ఈ టైం లో మీకు టైం తెలీకుండా ఉండేందుకు...
భూమి మీద ఎప్పుడూ సంవత్సరానికి 365 రోజులు లేవు. డైనోసార్ల కాలం లో సంవత్సరానికి 370 రోజులుట. కానీ రోజుకి 23 గంటలే. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రుడి ఆకర్షణ ఎక్కువై , భూమి ఆత్మ ప్రదక్షిణ స్లో అవుతోంది ... ప్రతి వందేళ్ల కి 1.7 మిల్లీ సెకన్ల మేరకు ఒక రోజు నిడివి పెరుగుతోంది ట! అలా ఇప్పటికి రోజుకి 24 గంటలకి వచ్చాము.
సైన్స్ ప్రకారం 'కాలం' ఎప్పుడూ ఉంది. సృష్టి మొదలైనప్పటి నుంచి.
'సమయం' మాత్రం మనిషి కనిపెట్టుకున్నాడు తన సౌకర్యం కోసం. అలా పుట్టినవే గడియారాలు, క్యాలెండర్లు.
నాగరికత లో మొదటి కాలెండర్ మన భారతీయులు ఇప్పటికీ ఫాలో అయ్యే చాంద్రమానమే. ఇది రాసుకున్న వారు సుమేరియన్లు - ఇప్పటి ఇరాక్ అప్పటి మెసపటోమియా లో ఉండేవారు. మొట్టమొదట గా లిపి కనిపెట్టింది కూడా వీరే అంటారు.
పశ్చిమం లో ప్రతి ఊరు కి వారి గడియారాలు వాళ్ళకి ఉండేవి. కానీ ట్రైన్లు మొదలైనప్పటి నుంచి కన్ఫ్యూషన్ పెరిగి రెండు గడియారాలు పెట్టుకొనే వారట .. ఒకటి వారి ఊరి సమయం ఒకటి ట్రైన్ టైం. ఇంక ఇలా కాదని ట్రెయిన్ టైమే మొదటి దాన్ని తినేసింది. అందరూ ఒకే టైం ఫాలో అయ్యే పద్ధతి అలా వచ్చింది.
పారిశ్రామిక విప్లవం నుంచి టైం 'విలువ' పెరిగింది ... 'టైం అంటే డబ్బు' అనే పరిస్థితి వచ్చింది ఇక్కడి నుంచే కదా. టైం తీసేస్తే లేబర్ ఎంత సేపు పని చేస్తే ఎంత ఇవ్వాలి, ఒక నిముషం లో ఓ కార్మికుడు (తర్వాత కాలం లో యంత్రాలు) ఎన్ని వస్తువులు తయారు చేయగలరు, ఈ రోజు నేను ఓ పైసా బ్యాంకు లో వేస్తే ఎన్ని నెలలకి రూపాయ అవుతుంది ... నేను అప్పిచ్చిన వాడికి వారానికి ఎంత వడ్డీ వేయచ్చు ... ఈ లెక్కలకి 'సమయం' తప్పని సరి అయిపోయింది.
టైమ్ జోన్స్ ఇంకో సమస్య. ఒకే అమెరికా లో ఆరు టైం జోన్స్ ఉన్నాయి. భారత దేశం లో కూడా అలా చేద్దాం అనుకున్నారట ఒకప్పుడు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇది ప్రాక్టికల్ కాదు అని ఊరుకున్నారు.
ఇంక క్యాలెండర్ల విషయానికి వస్తే, అసలు ఈ రోజు 2020 ఏప్రిల్ 18 వ తారీకు కానే కాదు. సౌరమానం ఆధారంగా ఏర్పడ్డ క్యాలెండర్ల లో అప్పటి చక్రవర్తులు, మత పెద్దల అవైజ్ఞానిక ప్రభావాలు ఉండేవి. కొంతమంది రాజులు ఎనిమిది రోజుల వారాలు పాటిస్తే కొంత మంది కొన్ని రోజులు తీయించేశారంటారు. మనం ఇప్పుడు పాటిస్తున్న గ్రెగోరియన్ కాలెండర్ కన్నా ముందు ప్రచారం లో ఉన్న జూలియన్ కాలెండర్ లో లీపు సంవత్సరం విషయం లో లెక్కల్లో తేడాలుండేవిట. పైగా వారి కొత్త సంవత్సరం మర్చి 25 నుంచి ఏప్రిల్ 1 మధ్య ఉండేది (ఇంచుమించు మన వసంత మాసారంభం ఉగాది లాగా) ... రకరకాల కారణాల వల్ల గ్రెగోరియన్ కాలెండర్ దాన్ని తోసిరాజని జనవరి మొదటి రోజు నూతన సంవత్సరం మొదలు అని మార్చింది. ఇది చాలా దేశాలు పాటించకుండా, ఒప్పుకోకుండా, లేక అలవాటు ప్రకారం ఏప్రిల్ ఒకటి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే వారిని ఫూల్స్ అనడం ప్రారంభమైంది. అలా వచ్చిందే ఏప్రిల్ ఫూల్స్ డే. ఎంత అన్యాయం!
ఇంకో ఇంచుమించు అన్యాయం గురించి మాట్లాడాలంటే 'డే లైట్ సేవింగ్స్' కథ చెప్పుకోవాలి. అమెరికా లో ఉన్న ప్రతి ఒక్కరికి, వారి వల్ల మనకి కూడా ఈ పదాలు తెలిసిపోయాయి. అక్కడి ఉంచి వచ్చిన గాడ్జెట్స్ లో ఈ ఫీచర్ ఉంటుంది గమనించారా? వసంత మాసం మొదలవగానే ఓ రోజు గడియారాలని ఓ గంట ముందుకి జరుపుతారు. (జరిపిన రోజు వారికి 23 గంటలే ఉంటాయి.)
చలి దేశాలలో సూర్యుడి వేడి అరుదైన విషయం కాబట్టి ఆ రోజుల్ని పొడిగించుకుంటే పని ఎక్కువ చేస్కోవచ్చు. ఇది స్థూలంగా దీని ఉద్దేశం. అమెరికా ప్రెసిడెంట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ జోక్ గా 'ఈ రోజు నేను లేచే సరికి అప్పటికే తెల్లవారిపోయింది .. ఇలాంటి రోజులు ముందే లేచి పని చేసుకుంటే బాగుంటుంది కదా, కొవ్వొత్తులు ఆదా అవుతాయి ... ఓ రెండు మూడు రోజులు అందరూ నసుగుతారు కానీ నాలుగో రోజు కి అలవాటయిపోతుందిలే' అన్నారట ఆయన. అప్పటికీ ఈ విషయాన్ని రెండు మూడు సార్లు గవర్నమెంట్ కి విన్నవించుకున్న ఒకాయన ఈ వంక తో విజృంభించి అందరిని ఒప్పిస్తే కలిగిన ఫలితమే డే లైట్ సేవింగ్స్. మళ్ళీ ఆకు రాలు కాలం మొదలయ్యే రోజు ఓ గంట వెనక్కి జరిపిస్తారు గడియారాన్ని. ఆ రోజు వాళ్ళకి 25 గంటలు ఉంటాయి.
ఇదంతా 'సమయం' కథ.
కాలం కథ లో మలుపు తీసుకొచ్చింది మాత్రం ఐన్ స్టీనే అంటారు. ఆయన ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం టైం ఒక్కొక్కరికి ఒక్కోలా గడుస్తుంది. టైం ని, స్పేస్ ని అనుసంధానం చేస్తూ ఆయన చెప్పిన సిద్ధాంతం ఇది. చాలా కొత్త ఆలోచనలకి, ప్రయోగాలకి, ఫలితాలకు దారి తీసింది ఈ సిద్ధాంతం.
కొంచెం అర్ధం చేసుకోటానికి కష్టం గా అనిపించి అప్పటి పాత్రికేయులు ఆయన సెక్రటరీ ని విసిగించేస్తే ఆయన ఈ సిద్ధాంతాన్ని ఈ విధం గా సరళమైన మాటల్లో చెప్పి ఉంటారు అని ఓ కథ.
"మండుతున్న బొగ్గుల మీద కూర్చుంటే ఒక నిముషం గంట లాగా, అందమైన అమ్మాయి తో మాట్లాడుతుంటే గంట నిముషం లాగా అనిపించడమే సాపేక్ష సిద్ధాంతం" అని.
అంటే కష్ట కాలం నెమ్మదిగా, ఆనంద భరిత సమయం వేగంగా గడిచిపోతుంది అని. (లాక్ డౌన్ సమయం ఈ సిద్ధాంతాన్ని నిజమో అబద్ధమో రుజువు చెయ్యడానికి కరెక్ట్ కదూ)
నాకు గీతోపదేశం గుర్తొచ్చింది. కృష్ణుడికి అర్జునుడికి 700 శ్లోకాల సంభాషణ జరుగుతుంటే మిగిలిన సైన్యం అంతా ఏం చేస్తోంది అనిపించేది. ఈ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం అర్జునుడికి గడిచిన సమయం నిడివి వేరు.. మిగిలిన వారందరూ అనుభవించిన సమయం నిడివి వేరు అయ్యుండొచ్చు కదా.
ఇందాక చెప్పినట్టు మొదట్లో మతాలే కాలధర్మాలని నిర్ణయించాయి. ఆసక్తి కరమైన విషయం ఏంటంటే హిందువులు, బౌద్ధులు, జైనులు, సనాతన గ్రీకులు మొదలైన వాళ్ళం కాలాన్ని చక్రం గా భావిస్తామాట. అంటే యుగాలు పునరావృతమవుతాయి కదా .. అలాగ.
యూదులు, క్రిస్టియన్లు, ముస్లింల ప్రకారం సృష్టి, దానికి అంతం... ఇలా లీనియర్ గా రేఖా మాత్రంగా భావిస్తారు టైం ని. అందుకే హాలీవుడ్ లో సృష్టి అంతం గురించి వచ్చిన సినిమాల లాంటివి మనం తియ్యం. మనకి కలియుగం తర్వాత మళ్ళీ సత్య యుగం వస్తుందని తెలుసు. కొన్ని లెక్కల ప్రకారం కలియుగం ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలుసు.
పెద్ద బాలశిక్ష లో రాసున్న హైందవ కాల విజ్ఞానం |
సైన్స్ విషయం లో మన సగటు భారతీయుల వైఖరి ఎలా ఉంటుందంటే రచ్చ బండ దగ్గర కూర్చొని ఏడు పదులు దాటిన ముసలి వాళ్ళు - కుర్ర కుంకలు ఏవో సందేహాలు అడుగుతూ, వాళ్ళకి తోచిన ప్రయోగాలు చేస్కుంటూ అప్పుడప్పుడూ వీళ్ళు చెప్పింది కాదంటూ ఒక్కో సారి వీళ్ళు చెప్పిందే నిజమని రుజువవుతూ, అలా రుజువవ్వనప్పుడు ప్రయోగమే తప్పు అని కొట్టి పారేసేలాగా ఉంటుంది. లేదా ఆ కొత్తగా రుజువయ్యింది కూడా మాకు తెలిసినదేలే అని బుకాయించేలాగా ఉంటుంది.
ఇది తప్పో ఒప్పో అని జడ్జ్ చెయ్యట్లేదు. ఇలా ఉంటుందని నా అభిప్రాయం అంతే.
ఒక రకంగా వారి wisdom ని తీసిపారెయ్యలేం. మనకి ఇప్పటి దాకా దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా అల్లుకున్న చరిత్ర కథ లో మన వైపు సనాతన శాస్త్రం ఉంది. కొన్ని దేశాల్లో మతానికి, విజ్ఞానానికి జరిగిన ఘర్షణ మనకి అంత గా తెలీదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని నిరూపించిన గెలీలియో (1564- 1642) ని మత విరోధి అనేసారు.
'భానో భాస్కర మార్తాండ చండ రశ్మి దివాకరః
ఆయురారోగ్యమైశ్వర్యం దేహిమే కమలాలయా
దేవ దేవా జగన్నాథా ప్రత్యక్షా పురుషోత్తమా
జ్యోతిర్మండల మధ్యాయ భాస్కరాయ నమో నమః'
అనే శ్లోకం లో 'జ్యోతిర్మండల మధ్యాయ' అంటే కాంతి సమూహం మధ్యలో ఉండే వాడు సూర్యుడు అని వర్ణించారు. (కాకపోతే ఈ శ్లోకం ఏ స్తోత్రం లో నుంచి గ్రహించబడిందో నాకు తెలియలేదు. ఆదిత్య హృదయం చెక్ చేసాను. కనిపించలేదు. గెలీలియో తర్వాతి కాలం లో కాక మన పూర్వ విజ్ఞానం నుంచి గ్రహించబడిన శ్లోకమే అయితే మనకి సోలార్ సిస్టం గురించిన సూక్ష్మ జ్ఞానం ఉందని రూఢి అవుతుంది. ఏదైనా మనమే గొప్ప అని గుడ్డిగా వాదించకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు. అంతే)
ఈ శ్లోకం ఎప్పటిదైనా మనకి విజ్ఞానం, మతం వేరు వేరు కాదు. వాళ్ళు సయింటిస్టులు అంటారు మనం మహర్షులు అనే వాళ్ళం.
క్యాలెండర్ల విషయం లో ఇన్ని అవకతవకలు కూడా మన దగ్గర తక్కువనుకుంటా. శాలివాహన శకం, విక్రమ శకం ఇలా చక్రవర్తుల పేరిట విడిగా క్యాలెండర్లు లేకపోలేదు కానీ ఎవరు ఫాలో అయ్యేవి వాళ్ళు ప్రశాంతంగా ఫాలో అయిపోతున్నారు. (అన్నీ ఒకే క్యాలండర్ లో అచ్చేసుకుంటున్నాం కూడా!) మాదే అందరూ ఒప్పుకొని తీరాలని గొడవలు జరగడం నేను ఎప్పుడూ చదవలేదు.
కాలం గురించి మాట్లాడుతూ టైం ట్రావెల్ గురించి మాట్లాడకపోతే ఎలా. ఎవెంజర్స్, హారీ పాటర్ లాంటి సినిమాల్లో (టైం ట్రావెలింగ్ మీద తీసిన సినిమాలు కాక) ఈ విషయం టచ్ చేశాయి. ఇంటర్ స్టెల్లార్ అయితే ఓ అడుగు ముందుకి వేసేసి బ్లాక్ హొల్స్ వల్ల కలిగే కాలభేదాల గురించి కూడా మాట్లాడింది. బ్లాక్ హోల్ వల్ల కొన్ని ఏళ్ళ కాలం భూమి సమయం లో కొన్ని గంటలే అవుతుంది.
అన్ని సినిమాల్లో ఒక విషయం మాత్రం చెప్తారు .. కాలం తో ఆటలు ఆడద్దని. గతం లో కి వెళ్లినా, భవిష్యత్తు లోకి వెళ్లినా ఏదీ మార్చకుండా రూల్స్ ఉంటాయి ..
ఒక సిద్ధాంతం ప్రకారం మనం కావాలన్నా ఏం మార్చలేమట. 'grandfather paradox' (గ్రాండ్ ఫాదర్ పారడాక్స్) ప్రకారం ఓ వ్యక్తి గతం లో కి వెళ్లి తన తాత ని చంపేశాడు అనుకుందాం ... మరి తాత లేకపోతే తండ్రి లేడు .. తాను కూడా పుట్టి ఉండడు కదా .. అసలు పుట్టని వాడు గతం లో కి వెళ్లి ఎలా తాత ని చంపగలడు? ఇలా అన్నమాట.
కాలం చేతికి చిక్కదు... ఒక్కో సారి బుద్ధికి కూడా చిక్కదు. నిరంతరంగా ప్రవహించే ఓ వాహిని అది .. ఏ పోకడ ఇంకో దాని తో పోలదు... మనం చక్రం అన్నా, ఇంకొకరు రేఖ అన్నా ... కాలం పట్టించుకోదు.
మనం మాత్రం ఏం తక్కువ?
ఎనిమిది నిముషాల 20 సెకన్లు లేటు గా సూర్యుణ్ణి చూస్తూ, ఉందో లేదో అంటున్న ప్రస్తుత సమయం లో బ్రతుకుతూ, పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పడిన సమయ పట్టిక ప్రకారం విధులు నిర్వహిస్తూ, రాజు గారు చెప్పారు కాబట్టి ఏప్రిల్ పద్దెనిమిదే అయ్యుంటుంది అని మౌనంగా అందరూ పాటించే కాలెండర్ పాటించేస్తూ, నిముషానికి ఇంత విలువ అని మన అప్పుల్ని, మదుపుల్ని లెక్క కట్టుకుంటూ, ప్రత్యక్షంగా కాదు కానీ ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా వీలైనంత గతం లోకి, జ్యోతిషం, విజువలైషన్ ద్వారా భవిష్యత్తు లోకి టైం ట్రావెల్ చేస్తూ, కొన్ని రోజులు గడియారాలు మార్చుకుంటూ, టైం జోన్ల కి అతీతంగా, అనుగుణంగా వ్యవహారాలు నడిపేసుకుంటూ, సమయ పాలన మీద ఎస్సే లు చదూకుంటూ టైం పాస్ చేసేయట్లే?
అన్నట్టు సాపేక్ష సిద్ధాంతం ఈ పోస్టు కి అన్వయిస్తే ఫలితాలు ఎలా ఉంటాయంటారు? 😄
అన్ని సినిమాల్లో ఒక విషయం మాత్రం చెప్తారు .. కాలం తో ఆటలు ఆడద్దని. గతం లో కి వెళ్లినా, భవిష్యత్తు లోకి వెళ్లినా ఏదీ మార్చకుండా రూల్స్ ఉంటాయి Bio Rockers
ReplyDeleteమనం రోజు చూసే గడియారం వెనక ఇంత ఉన్నదా ? ఇందులో నాకు తెలిసింది కొంతే ఆ 8 నిమిషాల 20సెకండ్ . బాగా వ్రాసారు .
ReplyDelete:venkat