అమ్మ కావాలి

తెలుగు ని 'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్'  అని నికోలో డి కాంటి (Niccolò de' Conti) అనే ఓ ఇటాలియన్ పదహారో శతాబ్దం లో అన్నాడు. ఇతను ఒక వర్తకుడు. సాహితీవేత్త కాదు. ఆ మాట కూడా కాంప్లిమెంట్ ఏమీ కాదు. అది ఒక ఫాక్ట్ మాత్రమే. 

ఇటాలియన్ పదాలు కూడా మన భాషలో పదాల లాగా అచ్చులతో ముగుస్తాయి అని ఉద్దేశం. మనోళ్లు దాన్ని ఓ కాంప్లిమెంట్ గా భాషా పరిరక్షణ వ్యాసాలలో, ఆవేశంగా వేదికల మీద ప్రసంగాల్లో వాడేస్తూ ఉంటారు. నిజానికి ఇలా అచ్చులతో ముగిసే పదాలున్న భాషలు చాలా ఉన్నాయి ప్రపంచం లో. విజయనగర సామ్రాజ్యం లో వాణిజ్యం నిమిత్తం వచ్చి 'మీ భాష కూడా మా భాషలానే ఉందిరోయ్' అన్నాడు అంతే. 

మనం 'ఒక తెల్ల వాడు మనని భలే పొగిడేసాడు' అనుకొనేసాం. ఇప్పుడు మనం భాష ని మర్చిపోయినట్టు అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ని మర్చిపోయాం. అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ మర్చిపోయాం కాబట్టే భాష ని కూడా వదిలేసుకుంటున్నాం అనిపిస్తుంది నాకు. 

అసలు ఒక భాష ని ఇంకో భాష తో పోలిస్తే దానికి విలువ రావడమేంటి ఖర్మ! 

తెలుగు భాష - ప్రపంచం లో ఉన్న భాషలన్నిటిలోకి గొప్పది, అందమైనది, శ్రావ్యమైనదేమీ కాదు. అన్ని భాషలూ తెలియకుండా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేం. అన్ని భాషలు తెలిస్తే ఈ స్టేట్మెంట్ అసలు ఇవ్వం. ఏ భాషలో అందం దానికి ఉందని తెలుస్తుంది కాబట్టి. 

తెలుగుకున్న ఏకైక ప్రత్యేకత మన మాతృభాష కావడం. 

మా అమ్మ అందరికంటే తెలివైనది, అందమైనది, డబ్బున్నది కానక్కర్లేదు.. నేను ఆవిడని ప్రేమ గా చూసుకోడానికి. అదే సూత్రం భాష కి కూడా వర్తిస్తుంది అనుకుంటాను. ఎందుకంటే తెలుగు ని వేరే భాషలతో పోల్చి దాని గొప్పతనాన్ని బలవంతంగా ప్రూవ్ చేసే బదులు దాన్ని ఎలా రక్షించుకోవాలో చూస్కుంటే బాగుంటుంది అంటాను. 

నా చేతి రాత లో ఓ అన్నమయ్య కీర్తన 

నేను నాలుగో తరగతి నుంచి సిటీ లో పెరిగాను. ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నాను. అయినా తెలుగు దూరం కాకపోడానికి కారణం ఖచ్చితంగా ఇంట్లో వాతావరణమే. (ఆ తర్వాత నాకు పర్సనల్ గా భాషల పిచ్చి పట్టిందనుకోండి. అది వేరే విషయం.)

తెలుగు భాష ని గురించిన బెంగ గురించి నేను వింటూ ఉన్నాను కానీ అది ఎంత పెద్ద సమస్యో తెలియలేదు ... సిటీ లో నా తెలుగు ఫ్రెండ్స్ లో తెలుగు చదవడం, రాయడం అతి తక్కువ మందికి వచ్చు అని తెలిసే దాకా. 

దానికంటే బాధ కలిగించే విషయం ... వాళ్ళకి అది నేర్చుకోవాలన్న ఇంటరెస్ట్ లేదని. ఒకే సారి తెలుగు లో రాయబడిన పుస్తకాలన్నీ ఓ నిట్టూర్పు వదిలినట్టు అనిపించింది. వాటి అందం వాళ్లకి చేరే అవకాశం లేదు కదా. 

ఇదే కదా సమస్య. భాష ని విస్మరిస్తే దాని తో పాటు వారసత్వంగా వచ్చే ఎన్నో గొప్ప విషయాలు కూడా మరుగున పడిపోతాయి. 

నేను సిటీలో గమనించిన కొన్ని విషయాలున్నాయి... భాషాపరంగా. 

2018 లో తెలంగాణ లో కంపల్సరీ గా అన్ని సిలబస్ ల వాళ్ళకి తెలుగు నేర్పించాలి అనే జి ఓ రాకముందు కాన్వెంట్స్ లో తెలుగు బాగా ఇగ్నోర్ అయింది. ఒకసారి తెలుగు పద్యాల వేసవి శిబిరం అని పెట్టాం మేము. అక్కడికి వచ్చిన పిల్లల్లో ఇదే గమనించాము. ఖరీదైన కార్పోరేట్ స్కూల్స్, కాన్వెంట్స్ లో చదివే పిల్లలు వాళ్ళు. వాళ్ళలో కొంతమందికి తెలుగు వరసగా మాట్లాడటం రాదు. తెలుగు పద్యం ఇంగిలీషు లో రాసి నేర్పవలసి వచ్చింది. ఆ శిబిరానికి వాళ్ళని తీసుకురావడం వారి తల్లిదండ్రుల తెలుగు ప్రేమ ని చాటింది. కానీ ఇలాంటివి పట్టించుకోనిది ఎంత మంది? 

తెలుగు రాష్ట్రాలలో లేని తెలుగు వారు కూడా భాష కి దూరమయ్యారు. ఆర్మీ, నేవీ లోని తెలుగు వారి పిల్లలకైతే అసలు తెలుగు తో టచ్ ఏ లేదు. (ఇంట్లో ఎవరో ఒకరు పట్టుబట్టి  తెలుగు నేర్పిస్తే తప్పించి)

ఆర్ధిక తరగతి పెరుగుతున్న కొద్దీ తెలుగు పరపతి తగ్గుతూ ఉండడం గమనించాను. 

ఇది ఒక్క మన భాష సమస్య మాత్రమే కాదు. భారత దేశం లో ప్రతి భాష ది. 

ఉగాండా లో అయితే కొత్త తరం మిడిల్ క్లాస్ తల్లి దండ్రులకి మన లాగా ఇంగ్లీష్ పిచ్చి పట్టుకుందిట. వారి భాషలంటే ఒకింత అసహ్యం కూడా ఉందిట వాళ్ళకి. అందుకే ఆ భాషలో అనర్గళంగా మాట్లాడే తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల నుంచి తమ పిల్లల్ని దూరం చేసేస్తున్నారట! యాభై భాషలు అక్కడ అంతరించిపోయే ప్రమాదం లో ఉన్నాయట! 

మీడియా లో ఉన్నప్పుడు, సినిమాలకి పని చేస్తున్నప్పుడు చాలా మంది తెలుగు నటీనటులకు తెలుగు చదవటం రాకపోవడం చూసాను. తమాషా గా తెలుగు వారు కాని వారు కొంతమంది తెలుగు అనర్గళంగా చదివేసి, మాట్లాడేసి, రాసేసి అర్ధం చేసేస్కోవడం కూడా చూసాను! 

భాష కి దూరమవ్వడం వల్ల చాలా సమస్యలు కనిపించాయి నాకు. ముందు చెప్పినట్టు గా కొన్ని గొప్ప పుస్తకాలు చదివి కొందరు గొప్ప తెలుగు రచయితల భావాలు అర్ధం చేసుకొనే అవకాశం ఉండదు. ఇది గొప్ప లోటు. దీన్ని ఎన్ని పరభాషా పుస్తకాలయినా పూడ్చలేవు. 

కొన్ని తెలుగు వాడుకలు, సామెతలు... ఇవన్నీ వాళ్ళకి అర్ధం కావు... మరుగున పడిపోతున్నాయి. 

ఏ ఆర్ధిక తరగతి నుంచి కంపెనీల సీఈఓ లు, మేధావులు, నిపుణులు, దాతలు, డెసిషన్ మేకర్స్ వస్తారో వారికి తెలుగు రాకపోవడం చాలా పెద్ద ట్రాజెడీ. 

ఇంకోసారి ఇంకో శిబిరం పెట్టాం మేము. తెలుగు దేశభక్తి గీతాలది. ఒక్కరే వచ్చారు ఈ సారి. అందులో కూడా తండ్రి తెలుగు, తల్లి ఇంకో భాష. ఆ పాప కి రెండేళ్లే. కానీ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతోంది. (ప్లే స్కూల్స్ లో ఇంగ్లీష్ ఉంటుంది.. తెలుగు ఉండదు కదా). 

వారికి మేము ఒకటే చెప్పాము .. పాప చాలా లక్కీ... తలిదండ్రుల ఇద్దరి మాతృభాషలు నేర్చుకొనే అవకాశం ఉంది అని. 

నాకు అదే అనిపిస్తుంది. ఎవరి మాతృభాష లో వాళ్ళకి మినిమమ్ చదివే రాసే జ్ఞానం ఉంటే ఎంత బాగుణ్ణు! ఏ భాషా చచ్చిపోకుండా ఉంటే ఎంత బాగుణ్ణు!

ముఖ్యంగా అందరూ తెలుగు చదవడం రాయడం గబగబా నేర్చేసుకొని నా బ్లాగు చదివితే ఎంత బాగుణ్ణు! (అసలు ఇదంతా రాయడానికి నా ఈ స్వార్ధమే కారణమా?)

జీవితం లో కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. రోజూ ఓ కుటుంబం అంతా కూర్చొని భోజనం చేస్తుంది. ఇది చిన్న విషయం. కానీ అలా కలిసి తినటం వల్ల ఆ కుటుంబం కలిసి ఉంటుంది... పిల్లలు సెక్యూర్ గా ఫీలవుతారు... భార్యాభర్తల బాండింగ్ పెరుగుతుంది. ఒక కుటుంబం ఎందుకు సంతోషంగా ఉంది అంటే 'వారు కలిసి తింటారు కాబట్టి' అని ఎవరూ గుర్తించలేకపోవచ్చు కూడా. 

మాతృభాష పరిరక్షణ కూడా ఇలాంటిదే అని నా అభిప్రాయం. మనం గ్రహించని చాలా లాభాలు ఉన్నాయి భాష ని రక్షించుకుంటే. మన ఊహకి అందని చాలా నష్టాలు ఉన్నాయి ... భాష ని మర్చిపోతే. కొన్ని మనం ఇప్పటికే అనుభవిస్తున్నాం కూడా. 

  • సాహిత్య పరంగా  - తెలుగులో గొప్ప  పుస్తకాలని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయడం, తెలుగు పద్యం, అవధానం లాంటి సాహితీ ప్రక్రియలని ప్రపంచానికి తెలియచేయటం వంటివి
  • సాంస్కృతికంగా - తెలుగు పద్ధతులు, కళలు, ప్రాచీన తెలుగు మేధస్సు, తెలుగు చరిత్ర మరుగున పడిపోవటం
  • ఆర్ధికంగా - ముందే చెప్పినట్టు స్పెండింగ్ పవర్ (ఖర్చు చేసే శక్తి) ఉన్న ఎగువ తరగతుల వారు తెలుగు కి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం/స్పాన్సర్ చెయ్యకపోవడం, తత్సంబంధమైన వస్తువులు కొనుగోలు చెయ్యకపోవడం, ఆదరించకపోవడం
  • మేధోపరంగా - కంప్యూటర్ లో/ఫోన్ లో తెలుగు టైప్ చెయ్యడం లో ఉన్న ఆనందమే వేరు.. ఇది సాధ్యం అయింది అంటే అర్ధం .. ఓ కంప్యూటర్ నిపుణుడికి తెలుగు భాష వచ్చు. ఇది చిన్న ఉదాహరణ. ఇంకా భాష ని కొత్త పుంతలు తొక్కించే అవకాశాలు ఎన్నో. (నా పర్సనల్ డిమాండ్ .. ఆన్లైన్ లో తెలుగు లో ఇంకా బోల్డు ఫాంట్స్ రావాలి ) ఇవన్నీ తెలుగు భాష రాకపోతే ఎలా సాధ్యమవుతాయి? 
చివరిగా..  
  • నైతికంగా - మాతృభాష ని మర్చిపోయే జాతి గురించి ఏం గొప్పగా చెప్పగలం? గతాన్ని మర్చిపోయే జాతి కి ఏ పాటి భవిష్యత్తు ఉంటుంది? 

Comments

  1. మంచి వ్యాసం.
    భాష అంటే సమాచారం మర్పిడికి ఒక పనిముట్టు మాత్రమే అని వాదించే మేధావుల్ని చాలామందినే చూసాను.
    ఎవరికైనా మాతృభాష అమ్మే. మాతృభాష అంటే అమ్మ నేర్పిన అని భాష కాదు అర్థం - అమ్మే ఐన భాష అని.
    అమ్మను గౌరవించుకోలేని వాడు ఏం మనిషి చెప్పండి!
    అటువంటి వాడా ఇతరమైన విలువల గురించి మాట్లాడేది మనతో!

    ReplyDelete
  2. ganesh devy మన దేశం లో భాషల పై పరిశోధన చేస్తున్న ఓ భాషా శాస్త్రవేత్త అభిప్రాయాలు ఈ లింక్ లో ఉన్నాయి ..

    ReplyDelete
  3. భాష పరిస్థితిని చక్కగా తెలియచెప్పారు, అర్ధంలేని మోజుతో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకొని అనువైన ఆస్తి అండతో ముందుకు వెళ్లే మార్గాన్ని మా చేతులారా మనమే పాడుచేసుకున్నాం... చదివినప్పుడు నిజమే అనిపించింది, బాధ కూడా వేసింది, కానీ బాగుంటుంది అనే ఆశ అయితే పుట్టలేదు... కానీ ఆశను వదులుకునే సాహసం అయితే చేయను... చూసి చూసి మనదైన దాన్ని ఎలా వదులుకోను... ధన్యవాదాలు

    ReplyDelete

Post a Comment