జ్ఞానమొసగరాదా - (నేను రాసిన కథ)
శారద పాడనంటోందిట. గురువైన వసంత కి చెప్పి ఒకటే ఆందోళన పడిపోతున్నారు ఆమె తల్లిదండ్రులైన అరుణ, మురళి.
పదకొండేళ్ళుంటాయి శారద కి. అప్పటికే ఆరేళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటోంది వసంత దగ్గర. సంగీతం మీద పట్టున్న ప్రతీ ఒక్కరూ మంచి గురువు కాలేరు. దానికి కావాల్సిన నైపుణ్యాలు వేరే ఉంటాయి. ప్రతి పిల్ల/పిల్లాడు ఏదో ఒక సైకాలజీ లో ఉంటారు. వారిని అర్ధం చేస్కుంటూ ఓర్పుగా చెప్పుకురావాలి ఈ కళ ని. వసంత ఇందులో సిద్ధహస్తురాలు. ఆ విషయం ఆనందంగా వసంత క్లాసులకి వచ్చే పిల్లలని చూస్తే తెలిసిపోతుంది. వారు వేదిక మీద పాడటం మొదలు పెట్టాక మిగిలిన సంశయాలు కూడా తీరిపోతాయి ఎవరికైనా.
ఇలాంటి ప్రోగ్రాం ఒకటి చూసారు పెళ్ళైన కొత్తల్లో అరుణ, మురళి. అంతే, నిర్ణయం తీసేసుకున్నారు. తమకి పుట్టబోయే సంతానాన్ని ఆమె దగ్గరే సంగీతానికి పెట్టేయాలని. వారి సంకల్ప బలమో ఏమో శారద కూడా కంచు కంఠం తోనూ సంగీతం పట్ల ఆసక్తి తోనూ పుట్టేసింది. చిన్నప్పటి నుంచి ఏదైనా పాట వింటే పాడగలిగేది. ఇంకేం! అరుణ, మురళుల ఆనందానికి హద్దే లేదు!
తల్లిదండ్రుల చెయ్యి పట్టుకుని మొదటి సారి వసంత దగ్గరకి వచ్చింది ఐదేళ్ళ శారద. పెద్ద పెద్ద కళ్ళు, పసి బుగ్గలు, పరికిణి, రెండు పిలకలు, ఆ పిలకలు చుట్టూ పూలు, కళ్ళ కి కాటుక, కాళ్ళ కి వెండి పట్టీలు. అప్పటికి క్లాసు లో ఉంది వసంత. తన ఇంట్లో నే హాల్లో క్లాసులు చెప్తుంది. ఐదింటి నుంచి మొదలు పెడితే బ్యాచులు బ్యాచులు గా అయ్యేసరికి తొమ్మిదవుతుంది. శారద వచ్చినప్పుడు మొదటి బ్యాచ్ నడుస్తోంది. శారద అందర్నీ భయం భయం గా చూస్తూ నిలబడింది.
వసంత ‘రా … కూర్చో’ అనగానే వెళ్ళి వసంత ఒళ్ళో కూర్చుంది. పిల్లలందరూ ఒకటే నవ్వు.
అరుణ, మురళి షాక్ అయ్యారు. ఎక్కడ వసంత కి కోపం వచ్చి చేర్చుకోదో అని వారి భయం. మురళి అరుణ కి సైగ చేసాడు. అరుణ వెంటనే “అక్కడ కూర్చోకూడదు శారూ… అందరు పిల్లల తో ఇక్కడ చాప మీద కూర్చోవాలి” అని కూర్చోపెట్టింది. వసంత వైపు చూసి సారీ అన్నట్టు గా మొహం పెట్టింది.
వసంత నిజానికి నవ్వాపుకుంటోంది. ఓ ముప్ఫయి ఐదేళ్ళుంటాయి వసంత కి. అప్పటికే పదేళ్ళ నుంచి ఆ ఏరియా లో సంగీతం చెప్తోంది. ఆ అనుభవం తో నే గాంభీర్యం నటిస్తోంది. తను కూడా నవ్వేస్తే శారద కి సంగీతం పట్ల సీరియస్ నెస్ రాదు.
ఎలక్ట్రానిక్ శృతి బాక్స్ నుంచి నాదం పలుకుతోంది . ఐదున్నర శృతి.
తానొక్క సారి కళ్ళు మూసుకొని శృతి చూసుకుంది. ‘మ్ …’ అని హమ్ చేసుకుంది.
శారద ఇదంతా గమనిస్తోంది. శృతి బాక్స్ ని వింత గా చూస్తోంది.
వసంత “నేను సా అంటాను … నువ్వు కూడా అనాలి … సరేనా?”
శారద “సా” అంది. అందరూ మళ్ళీ నవ్వు.
అరుణ, మురళు లకి టెన్షన్ పెరిగిపోతోంది ఓ పక్క …
“సా అనమంటే ఊరికే అనటం కాదు.. శృతి లో పాడాలి…” అని అనగానే శారద “సా…” అని పాడింది. సరిగ్గా షడ్జమం లో గొంతు కలిపింది.
వసంత కి తెలిసిపోయింది. శారద కి శృతి జ్ఞానం ఉంది.
“పా …” పాడింది వసంత. శారద పంచమం కలిపింది.
పై షడ్జమం కూడా సరిగ్గా పాడింది.
అరుణ, మురళి వసంత కేసి చూస్తున్నారు. వాళ్ళకి తెలీదు శారద కరెక్ట్ గా పాడిందో లేదో.
గురువు ఎక్కువ మెచ్చుకోకూడదు అంటారు. వసంత గంభీరంగా “ఊఁ… శృతి లో కలుస్తోంది గొంతు” అని మాత్రం అంది పైకి.
అరుణ మురళి … ఇద్దరి ఆనందానికి అవధుల్లేవు. ఇంటర్నేషనల్ స్కూల్ లో సీట్ దొరికినట్టు ఆనందపడిపోయారు ఇద్దరూ. క్రమం తప్పకుండా క్లాసులకి పట్టుకొచ్చేవారు. “సంగీతం అంతా నేర్చుకోడానికి ఎంత టైమ్ పడుతుందండీ, మా అమ్మాయి సూర్య గాయత్రి లా ఎప్పుడు పాడుతుందండి” లాంటి ప్రశ్నలు అడగలేదు. వసంత మీద పూర్తి నమ్మకం ఉంచారు.
ఎనిమిదేళ్ళ వయసు వచ్చే సరికి కొంత కుదురుకుంది శారద. ఇక్కడ వచ్చిన చిక్కు.. సాధన. సంగీత సాధన ఎంత అవసరమో - అంత చెయ్యాలనిపించదు పిల్లలకి. ఒకే స్వరం మళ్ళీ మళ్ళీ పాడాలి. విసుగనిపిస్తుంది.
“నిద్దుర నిరాకరించి ముద్దు గా తంబుర పట్టి” అన్నారు త్యాగరాజ స్వామి. అలా సాధన చేయడం ఎంత కష్టం! అంత కన్నా కష్టం ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లని ఓ చోట కూర్చోపెట్టి ‘కాలాలు’, ‘అ కారం’ సాధన చేయించడం. పెద్ద పాఠాలు నేర్చుకుంటున్న శారద కీ - చిన్న వయసు లో ఉండే చాంచల్యానికీ అస్సలు పొసిగేది కాదు.
మరి ప్రతిభ కి సాధన తోడవకపోతే ఎలా? ఎన్నో విధాలు గా చెప్పి చూసింది సాధన చేయమని. తనకొచ్చినదే చాలు అన్నట్టు ఉండేది శారద. ప్రతి ప్రోగ్రాం లో ముందు వరస లో మైకు ముందు శారదే. ఆ వయసు కి ఆ పాటలే గొప్ప అని అందరూ ముద్దు చేసే వారు. తాళం తప్పులు, అక్కడక్కడా శృతి తప్పులు, పాఠాలని మర్చిపోవడం… ఇది ఎవరూ గమనించలేదు … వసంత తప్ప. శారద లో చిన్న గా అహంకారం ప్రవేశించింది. ఇది తెలుస్తోంది వసంత కి.
ఓ వైపు అరుణ, మురళులు తమ తపస్సు ఫలించింది అని మురిసిపోతున్నారు. శారద ప్రోగ్రాం లో పాడటం మొదలు పెట్టిన రోజు నుంచి ఓ కొత్త ఐ ఫోన్ కొనేశారు. అది కేవలం శారద ప్రదర్శనలకే! వసంత అంటే భయం తో ఎక్కడ పోస్టు చెయ్యట్లేదు కానీ శారద పేరు న ఎప్పుడో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసేసేవారే.
ఇప్పుడే విరుస్తున్న పుష్పం శారద. ఇంకా గుబాళింపు మొదలవ్వనే లేదు. ఈ నాజూకైన తరుణం లో వసంత కోప్పడితే ఆ గ్రీష్మానికి వడిలిపోవచ్చు ఈ పసి మొగ్గ. అలా అని వదిలేస్తే ఆ శిశిరానికి అసలు విచ్చుకోవడం ఆగిపోయే ప్రమాదం ఉంది. వసంతం లాగానే ఉండాలి తను. ఓ ముఖ్యమైన ప్రోగ్రాం వచ్చింది. ఓ పుణ్య క్షేత్రం లో. వసంత రాసిన పాటల లిస్టు లో శారద సాధన చెయ్యని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. రిహార్సల్స్ లోనే శారద తడబడటం మొదలయింది. ఒకటికి పది సార్లు సాధన చేసిన పిల్లలు మాత్రం కాన్ఫిడెంట్ గా పాడేస్తున్నారు. అంతే. శారద ని ఆ ప్రోగ్రాం నుంచి డ్రాప్ చేసేసింది వసంత. మిగిలిన పిల్లలందరి తో ట్రూప్ ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లి జయప్రదంగా ప్రోగ్రాం చేస్కొచ్చింది.
అరుణ, మురళి … ఇద్దరికీ వసంత అంటే కోపం కూడా వచ్చింది. స్టార్ స్టూడెంట్ లాంటి తమ కూతుర్ని అలా తీసేస్తుందా అని. తల్లిదండ్రుల నుంచి ప్రోగ్రామ్స్ సమయాల్లో ఈ కోపతాపాలు వసంత కి మామూలే. మైక్ ముందు, ముందు వరస లో తమ పిల్లల్ని కూర్చో పెట్టలేదని అలిగి క్లాసులు మాన్పించేసిన వారిని కూడా చూసింది తన అనుభవం లో. కానీ అక్కడ ప్రాధాన్యత వారికి కాదు.సంగీతానికి … సుస్వర బద్ధమైన ప్రదర్శన కి… చూడటానికి వచ్చే ఆహూతులకు. వారికి న్యాయం చెయ్యగలిగే వారే ముందు వరసలో కూర్చుంటారు, మైక్ లో పాడతారు.
ఈ టూర్ ముగించుకుని వచ్చాక శారద ని క్లాసు కి తీసుకొచ్చింది అరుణ. ముభావంగా ఉన్నది ఆవిడ. శారద మట్టుకు ఓ రెండు నిముషాలు మౌనంగా ఉండి ఏడ్చేసింది. “నేను ప్రాక్టీస్ చేస్తా మేడం… కోపంగా ఉండకండి” అని కన్నీరు కారుస్తూ వెక్కిళ్ళ మధ్య చెప్తోంది. వసంత కి లోపల ఆనందంగా అనిపించింది. శారద ని దగ్గర కి తీస్కొని కన్నీళ్లు తుడిచింది. “వెళ్ళి కొత్త పాఠం రాసుకో” అని పంపించి అరుణ తో తన ఆనందాన్ని పంచుకుంది వసంత “కళ కోసం కన్నీళ్లు వచ్చాయంటే ఇంక శారద ని ఎవరూ ఆపలేరు. శారద ని అద్భుతమైన శాస్త్రీయ సంగీత కళాకారిణి గా నేను తీర్చిదిద్దుతాను”.
అరుణ లో ఇందాకటి అలక పోయింది. “మాకు సంగీతం గురించి ఏమీ తెలీదు మేడం. మమ్మల్ని పట్టించుకోకండి. మీరు ఎలా చెప్తే అలానే మేడం” అని వెళ్లిపోయారు ఆవిడ.
ఇక అప్పటి నుంచి శారద సంగీతం పిల్ల కాలువ నుంచి సెలయేరు లాగా సాగడం మొదలుపెట్టింది. కృతుల వరకూ వచ్చేసింది శారద. ఫోన్ లు చూసీ చూసీ పిల్లల మెదళ్ళు మందమయిపోతున్న ఈ సమయం లో నొటేషన్ చూడకుండా, పుస్తకం ముందు లేకుండా సరళీ స్వరాల నుంచి వర్ణాల వరకూ పాడేయగలదు శారద. ఇంక నేర్పవలసింది … మనోధర్మ సంగీతం.. అంటే రాగాలాపనా, స్వరకల్పన, నెఱవు, ఇలాంటివి. అవి నేర్చుకోవటానికి శారద ఇంకొంత పెద్దవ్వాలి అనిపించింది వసంత కి. పైగా మనోధర్మానికి బాగా కచేరీలు వినాలి. రాగాల జ్ఞానం పెరగాలి. దానికి సమయం ఉంది.
ఇప్పుడు శారద కి కావాల్సింది ప్రదర్శనలు చేసే అనుభవం.. అది కూడా చిన్నప్పటి లాగా గ్రూప్ లో కాదు… ఒక్కతే. ఏ కళైనా ప్రదర్శనా ప్రధానమైనదే. క్లాసు లో గురువు దగ్గర పాడటం వేరు. తమకు తెలియని ప్రేక్షకుల ముందు వారిని మెప్పించేలా పాడటం వేరు. ప్రతీ గురువు కి తమ శిష్యుల్ని పెర్ఫార్మర్స్ చెయ్యడం ఓ ఛాలెంజ్. అది ఇంకో విద్య నిజానికి.
మైక్ లో పాడటం తెలియాలి. పక్క వాయిద్యాల తో పాడటం తెలియాలి. ఏ పాటలు ఎంచుకోవాలి, అరగంట పాడినా మొదటి పాట కి ఉన్న గొంతు చివరి పాట వరకూ అలిసిపోకుండా అలాగే ఉండాలి. అంటే ఎంత సాధన చేయించాలి? ఇది కాక వస్త్రధారణ కూడా గురువే చెప్పాలి. మన సాంప్రదాయ కళలకి సాంప్రదాయ వస్త్రధారణే వేసుకోవాలి అని చెప్పాలి. శారద వేదికనెక్కే వెనుక ఇంత కృషి జరిగింది.
వసంత తనకి తెలిసిన వేదికల తో మాట్లాడింది. తెలుగు నాట అచ్చమైన సంగీత అకాడమీలు, వారు నిర్వహించే వేడుకలు తక్కువ. దేవాలయాల్లో దసరా ఉత్సవాలు, వినాయక చవితి పండల్స్, ఇళ్లల్లో జరిగే ఫంక్షన్స్ …. ఇలాంటి వేదికలను కూడా ఉపయోగించుకోవాలి. అనుభవం వచ్చి ప్రొఫెషనల్ అయ్యి, తన కంటూ ఆడియన్స్ ఏర్పడే దాకా ఎక్కడైనా పాడగలగాలి.
ఇంకో వైపు అరుణ, మురళులు చక్కటి పట్టు పరికిణీలు కుట్టించారు శారద కి. పాత ఐఫోన్ స్థానం లో ఇప్పుడు DSLR కెమెరా, స్టాండ్ తో పాటు కొనుగోలు చేయబడింది. దీనికి వసంత కూడా పర్మిషన్ ఇచ్చింది. పెరఫార్మెన్స్ చూసుకొని సవరింపులు చేసుకోడానికి ఈ రికార్డింగ్స్ ఉపయోగపడతాయి. అసలు తాను పక్కన లేకుండా ఎలా పాడుతుందో శారద.. కానీ ఇలా మమకారాలు పెట్టుకుంటే తన శిష్యురాలు స్వతంత్రురాలు ఎలా అవుతుంది?
శ్రావణ మాసం మొదలుకొని వచ్చిన పర్వ దినాలు, ఆ సందర్భాల్లో జరిగే వేడుకలు, పుణ్య క్షేత్రాల్లో కార్యక్రమాలూ.. ఇలా ఓ నాలుగైదు నెలలు వరకూ ఎవరి బిజీ లో వారున్నారు శారదా, వసంతా. మళ్ళీ తీరుబడి దొరికేసరికి త్యాగరాజ ఆరాధన మాసం …. అదే జనవరి వచ్చేసింది. ఒక నాడు తీరిక దొరికాక కబురు చేసింది వసంత శారద ని రమ్మనమని. కచ్చేరి అనుభవాలు విందామని, రికార్డింగ్స్ చూద్దామని.
ఆ రోజు అరుణ, మురళి వచ్చారు.
“శారద రాలేదా?” వారి వెనక ఉందేమో అని వెదుకుతూ అడిగింది వసంత.
అరుణ, మురళి మొహాలు మొహాలు చూసుకున్నారు.
“రానంటోంది మేడం”
“కచేరీ ల తో ప్రయాణాల తో అలిసిపోయుంటుంది పాపం” నవ్వుతూ అన్నది వసంత.
“లేదు మేడం … ఇంక పాడదట”
షాక్ అయింది వసంత.
“ఏం జరిగింది?”
“ఏమో మేడం … మీరు చెప్పినట్టు చాలా స్టేజీస్ మీద పాడింది. కానీ ఉన్నట్టుండి ఓ రోజు ఇంక ప్రోగ్రామ్స్ ఇవ్వననేసింది మేడం. మేము ఫోర్స్ చేస్తే స్టేజ్ మీద కి వెళ్ళి నోరే విప్పలేదు.”
“అవునా? ఎందుకు?”
అరుణ, మురళి మళ్ళీ మొహాలు మొహాలు చూసుకున్నారు. “మాకైతే అంతా బాగానే జరిగింది అనిపించేది. శారద కి మాత్రం మూడవుట్ అయ్యేది. ఎందుకో చికాకు వచ్చేసేది. ఒక్కో సారి ప్రోగ్రాం మధ్యలోనే. ఇప్పుడు ప్రోగ్రాం కాదు కదా అసలు సంగీతమే వద్దంటోంది. ఇన్నేళ్లు నేర్చుకున్న విద్య వేస్ట్ అయిపోతుందని చెప్పినా వినట్లేదు … మాకేం చెయ్యాలో ఏమీ తెలీట్లేదు మేడం.”
వసంత కి సమస్యేంటో అర్ధం కాక రికార్డింగులు తెప్పించుకుంది. నాలుగు ప్రదర్శనలు చూసాక రహస్యం అర్ధమయింది.
శారద ఎలా పాడుతోందో తెలుసుకోడానికి పెట్టిన కెమెరా లో ప్రస్తుత సమాజం పోకడ రికార్డ్ అయింది. శారద అకారణంగా చిన్నబుచ్చుకోలేదు. ప్రదర్శన కి సిద్ధమైన కళాకారుడికి ఎదురయ్యే తొలి చేదు అనుభవమే శారద కూడా రుచి చూసింది. రసజ్ఞులైన ప్రేక్షకులు లేకపోవడం.
రకరకాల వేదికల మీద పాడింది శారద. ఆలయాల్లో, గణపతి పండల్స్ లో, చుట్టాల మధ్య, పెళ్లిళ్లలో, పేరంటాల లో. ఎక్కడ పాడినా, శారద పాట లో మార్పు లేదు. వేదిక నెక్కే ముందు నమస్కారం చేసుకుంది. తన ని పరిచయం చేసుకుంది. తాను పాడే అంశం గురించి చక్కగా చెప్పింది. శృతి లో నే పాడింది. తాళం తప్పలేదు. ఆహార్యం బాగుంది. కానీ కచేరీలు జరుగుతున్న కొద్దీ మొహం లో కళ తప్పడం మొదలయింది. ఎంతో అమాయకంగా, నవ్వుతూ మొదలుపెట్టింది మొదటి కచేరీ. చివరికొచ్చేసరికి యాంత్రికంగా మారిపోయింది.
ఏంటి కారణం? అంతా రికార్డ్ అయింది.
కచేరీ ఎక్కడైనా, ఎనభై శాతం శారద పాట ఎవరూ వినటం లేదు. ఓ ఫంక్షన్ లో శారద పాట మొదలు పెట్టగానే కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టేసారు. ఓ వ్రతం లో హారతి పాడుతోంది శారద. పూజారి గారు, ఆ భగవంతుడు తప్ప ఎవరూ వినలేదు. చుట్టాలెవరో వచ్చారని, కేటరింగ్ అనీ, ఫోటో అనీ ఒకటే హడావుడి. శారద కి పాపం పాడటం కొనసాగించాలో ఆపాలో తెలియలేదు. ఒక చోట ‘లంబోదర లకుమికర’ అనగానే వెకిలి నవ్వులు. ఇంకో చోట ‘సామజ వరగమనా’ పాడటమే తప్పయిపోయింది. ఆడియన్స్ లో కుర్రాళ్ళు సినిమా లో పాట ని గట్టి గా పాడటం మొదలు పెట్టారు గ్రూప్ గా. ఒక చోట శారద పాట మధ్య లో మైక్ లాక్కొని ‘మన టీం టోర్నమెంట్ గెలిచింది’ అని అనౌన్స్ చేసేసరికి ఇంక ఎవరూ కచేరీ వినలేదు.
పోనీ ఇవన్నీ సంగీత పరమైన వేదికలు కావు అనుకుంటే ఉన్న కొద్ది వేదికలలోనూ శారద పెద్ద ఆర్టిస్ట్ కాదన్న నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా తెలిసింది. కొన్ని చోట్ల మైక్ సడన్ గా పని చెయ్యడం ఆగిపోయింది. నిర్వాహకులతో సహా అది బాగు చేసే వారెవరూ అక్కడ లేరు. అలాగే పాడేసింది. ఇంకో చోట భో శంభో పాడింది … తారస్థాయి లో అద్భుతంగా ఆపింది పాటని. అక్కడ ఎవ్వరికీ అందులో చమక్కు తెలియలేదు. అప్పుడే శారద మొహం చిన్నబోవటం గమనించింది. సభా మర్యాద తెలీని ప్రేక్షకులు పిల్లల్ని స్టేజీ ముందు ఆడుకోటానికి వదిలేస్తే వాళ్ళు కచేరీ జరుగుతున్న సమయం లో పరుగుపందాలు, ముట్టించుకునే ఆటలు. వారి తల్లిదండ్రులు వారికి సంగీతం వినడం నేర్పించరు. కనీసం సభా సంస్కృతి… అంటే.. ఒకరు పాడుతుంటే మాట్లాడకూడదు, చివర్లో హర్షించాలి, కళాకారులని చప్పట్లతో గౌరవించాలి అని తెలీదు.
ఒక రికార్డింగ్ లో చూసింది … ఒకావిడ శారద పాడుతుండగా వచ్చి శారద బుగ్గ గిల్లి పక్కన కూర్చున్న అరుణ ని ‘లంగా ఎక్కడ కుట్టించారు, పాప ఏజ్ ఎంత” అని కబుర్లాడుతోంది! ఇంకో దగ్గర ఒకాయన రికార్డ్ చేస్తున్న మురళి దగ్గరకి వచ్చి ఒకరు “ఈ పాటలు బోర్ అంటున్నారండి, సినిమా పాటలు ఏమన్నా వచ్చా …?” అని అడుగుతున్నారు. శారద స్కూల్ లో పాడమని అడిగారట. చిన్న రాగం తో మొదలు పెట్టబోతే టీచర్ లు గట్టిగా నవ్వేస్తూ “అమ్మా .. నువ్వలా రాగాలు తీస్తే అందరూ పారిపోతారు .. ఏమన్నా సింపుల్ గా పాడు చాలు” అన్నారట.
ప్రతీ చోట ఒకే సలహా. టివి ప్రోగ్రామ్స్ లో జరిగే సినిమా పాటల పోటీ ల కి పంపించమని. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే విద్యార్థి ని పోనీ మెకానికల్ కూడా చేసేయమంటే ఎలా ఉంటుంది? ఏదైనా పాటే అనుకునే వారికి ఈ తేడా తెలీదు. చెప్పినా వినరు. వారికి తెలిసిన సంగీతం అదే. అది పాడితేనే మెచ్చుకోలు.
కొన్ని కచేరీల లో మాత్రం కొంత మంది సంస్కారవంతులు వచ్చి, శ్రద్ధగా విని శారద ని ఆశీర్వదించి వెళ్లారు. అప్పుడు శారద మొహం చూడాలి. ఎడారి లో మంచి నీళ్లు దొరికినట్టు. దురదృష్టవశాత్తు వీరి సంఖ్య చాలా తక్కువ. అరుణ, మురళులకి ఇందులో తప్పేమీ అర్ధం కాలేదు పాపం. ఒకటి రెండు సార్లు శారద చెప్పబోతే ‘అంత సెన్సిటివ్ గా ఉండకూడదు.. పద పద ప్రోగ్రాం టైం అయింది” అని తీస్కెళ్లిపోయారట. అందుకే ఇంక శారద మాటలు లేకుండా భీష్మించుక్కూర్చుంది.
వసంత బాధ పడింది. ఆ తర్వాత ఆలోచనలో పడింది. శారద సంగీతం మానేస్తుందేమో అనే బెంగ పడింది. ఇంకో వైపు.. ఓ చిన్న అపరాధ భావన.
“అసలు బైట ప్రపంచం లో వీసమెత్తు విలువ లేని కళ ని నా చేత అంత కూలంకషంగా ఎందుకు సాధన చేయించారు మేడం? ప్రతీ అనుస్వరం శృతి లో కలవాలి, తాళం తప్పకూడదు, కృతి నోటికి రావాలి, అపస్వరాలు దొర్లకూడదు అని చెప్పారే … అసలు వినేవాళ్ళకి ఇవన్నీ తెలుసా?
శాస్త్రీయ సంగీతం మీద జోకులేసే వారి ముందు ఎలా పాడాలి మీరు చెప్పలేదే మేడం?” అని శారద అడిగితే తనేం చెప్తుంది?
శారద కి ఏం చెప్పాలి అని ఆలోచిస్తోంది వసంత. పదేళ్ళ అనుభవం లో ఇలాంటి సంక్లిష్టత మొదటిసారి ఎదురైంది మరి. ‘నీకెందుకు ఆడియెన్స్ ఎలా అంటే’ అని శారద బాధ ని తీసిపారేయాలా? ‘ఇదేం చూసావు … ఇంకా ముందు ముందు చాలా బాధలు ఉంటాయి’ అని భయపెట్టాలా?
“త్యాగరాజ ఆరాధన కి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి… రమ్మన్నాని చెప్పండి” అని మాత్రం చెప్పి పంపించింది శారద తల్లిదండ్రులకి.
వస్తుందా శారద? రాకపోతే?
********
ఐదింటి క్లాసు కి బిలబిలమంటూ వచ్చేసారు పిల్లలు. వసంత మనసు మనసులో లేదు అస్సలు. ముఖ్యంగా మనసు బాగోనప్పుడే సంగీతం పాడాలి అని వసంత అనుభవపూర్వకంగా నేర్చుకున్న జీవిత పాఠం. అందుకే కూర్చుంది క్లాసు కి. ఈ రోజు వసంత అలవోకగా పిల్లల్ని అర్ధం చేసేస్కోనే గురువు కాదు. కొన్ని విషయాలు ఇంకా తెలీని నిత్య విద్యార్థిని.
ఎంతో ఆలోచించింది వసంత… ఏంటి ఈ సమస్య కి పరిష్కారం అని. ‘ఏ టాప్’ కళాకారులకు కూడా రసజ్ఞులైన ప్రేక్షకుల తో నిండిన హాల్ కష్టం ఈ కాలం లో. వయసు లో విద్యలో ఆ స్థాయి కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది శారద కి. ఈ లోపు ఏం చెయ్యాలి? కొన్ని వేదికల ని ఫిల్టర్ చేస్కోవచ్చు కానీ అది కాదు పరిష్కారం. అసలు ఇక్కడ మార్పు రావాల్సినది ఎవరిలో? సంగీతం వినే అలవాటు ఓ జాతి కి ఎలా నేర్పించాలి? అందులో రుచి ఎలా తెలపాలి? అది కళాకారుడి పనేనా?”
ఆమె కళ్ళు సంగీతం క్లాసు లో గోడ కి ఉన్న త్యాగరాజ స్వామి చిత్రం వైపు కి వెళ్లాయి. మనుషుల్ని నమ్ముకుంటే ఇంతే నని త్యాగరాజ స్వామి లాంటి వారు ఇందుకోసమే భగవంతుని కి తమ కళ ని అంకితం చేశారా? ఈ వైరాగ్యం పదకొండేళ్ళ పాప కి ఎలా చెప్పాలి?
ప్రశ్నల తో వసంత మనసంతా వికలమైపోయింది. శృతి వేసి కళ్ళు మూసేసుకుంది.
ఇంతలో వాకిలి లో అలికిడి… పిల్లలందరి లో గుసగుసలు. కళ్ళు తెరిచి చూసింది వసంత.
శారద వచ్చింది.
ఊపిరి పీల్చుకుంది వసంత. కళ కోసం కన్నీళ్ళు కార్చిన పిల్ల … సంగీతానికి ఎలా దూరం ఉండగలదు?
వసంత ‘కూర్చో’ అంది. శారద పిల్లలతో కూర్చుంది. ఈ రోజు శారద తన ఒళ్ళో కూర్చుంటే బాగుండనిపించింది. వీపు నిమిరి సాంత్వన చెప్పచ్చు. ఇంతలోనే వసంత కి గుర్తొచ్చింది. తాను తల్లి కాదు. గురువు.
ఎవరు మర్చిపోయినా, గురువు మర్చిపోనిది … శారద కి ముందు ఏం చెప్పాలి.
“రికార్డింగ్స్ చూసాను. బాగా వచ్చాయి పాటలు”. అంతకంటే పొగడదు వసంత.
అది చాలు శారద కి. “థాంక్యూ మేడం” అంది కళ్ళు మెరుస్తుండగా.
కళ్ళు మూసుకుంది వసంత. ఆ రోజు చెప్పవలసిన పాఠం ఆలోచించుకుంటోంది. ఓ రాగం తట్టింది మనసుకి.
“పూర్వీకల్యాణి”
ఆరోహణ, అవరోహణ రాయించింది… ‘స రి గ మ ప ద ప స… స ని ద ప మ గ రి స’
“వక్ర సంపూర్ణ రాగం .. వెళ్ళేటప్పుడు వంకర టింకర గా ఉంటుంది.. వచ్చేటప్పుడు సాఫీ గా దిగిపోతుంది” సరళమైన పదాల్లో చెప్పింది వసంత. పిల్లలకి గుర్తుండిపోయేలా, నవ్వొచ్చేలా ఇలాంటి పదాలు వాడుతుంది. పిల్లలు నవ్వారు. శారద కూడా నవ్వింది.
“ఈ రాగం లో ఈ రోజు మనం నేర్చుకునే కృతి .. జ్ఞానమొసగరాదా..”
పిల్లలందరూ రాసుకున్నారు.
“ఎంత గొప్పవాళ్ళైనా, చదువుకున్నవాళ్ళైనా ఎవరికీ అన్నీ తెలీవు. అలాంటప్పుడు ఎవర్ని అడుగుతాం జ్ఞానం ఇమ్మని? దేవుణ్ణి. ఇక్కడ త్యాగరాజ స్వామి రాముణ్ణి అడుగుతున్నారు… ఎలాంటి జ్ఞానం? సుజ్ఞానం… అంటే మంచి జ్ఞానం”
శారద వైపు చూసింది వసంత. అర్ధమయినట్టు చూసింది శారద.
పిల్లలు రాసుకుంటున్నారు వసంత చెప్తుంటే.
“పరిపూర్ణ.. నిష్కళంక నిరవధి సుఖదాయక.. వర త్యాగరాజార్చిత..”
క్లాసు నడుస్తోంది. శారద ఈ కొత్త కృతి నేర్చుకోవడం లో అంతా మర్చిపోయింది. నేర్పడం లో
నిమగ్నమయిపోయింది వసంత.
నాదానికి శక్తి ఉంటుంది. రాగానికి శక్తి ఉంటుంది. త్యాగరాజ స్వామి లాంటి తపోధనులు రాసిన అక్షరానికి శక్తి ఉంటుంది.
ఆ రోజు ఓ గురువు, ఆమె శిష్యులు ‘జ్ఞానమొసగరాదా?’ అని ఆర్తి తో ఆలపిస్తుంటే వింటోంది విశ్వం. ఆ తరంగాలకు మాటలు వస్తే ఇలా అంటాయేమో.
“దేశకాలమానపరిస్థితుల కన్నా తాము గొప్పవారం కాదని వినయంగా ఉంటూ, తమ చేతిలో లేని విషయాలని భగవంతుడికి అర్పించి, మళ్ళీ కళాసాధనా మార్గం లో నడిచే సుజ్ఞానం కళాకారులకి అలవర్చావు కదా రామా?
మరి ఈ సమాజానికి … కళలను వారసత్వం గా వచ్చిన ఆస్తులుగా, అపురూపంగా చూసుకుంటూ, కళాకారుల విలువనెరిగి గౌరవం చూపుతూ, మన కళల నుంచి పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖాన్ని పొందే జ్ఞానమొసగరాదా?”
___________
Comments
Post a Comment