పొంగనాలు-సాంబారు నేర్పిన జీవిత పాఠాలు

పొంగణాలు/పొంగనాలు/పొంగడాలు ఇలా రకరకాల వ్యవహారాలు ఉన్న ఈ తెలుగు టిఫిన్ సాంబారు తో కలిసి బోల్డు కబుర్లు చెప్పింది నిన్న రాత్రి నాకు. అవి మీకు కూడా చెప్దామని! 

ముందుగా ఒక్క మాట. ఈ కాంబినేషన్ విధి రాత వల్ల కలిసి వచ్చింది కానీ మా ఇంట్లో ఈ సంప్రదాయం లేదు, నా ఫేవరెట్టూ కాదు. ఇది గమనించాలి. 

అదుగో అదే మొదటి జీవిత సత్యం. దోసెల పిండి పులిసిపోక ముందే వాడేయాలి అనే తొందర, సాంబారు వ్యర్థం చేయకూడదనే తాపత్రయం, దోసెల తో సాంబారు తింటే తక్కువ ఖర్చవుతుంది కాబట్టి ఇలా ఇడ్లి సాంబారు, వడ సాంబారు లాగా పొంగనాల తో తింటే రెండూ ఖర్చవుతాయి అనే ఆలోచన నుంచి పుట్టింది ఈ కాంబినేషన్. జీవితం లో ఇలా ఎన్ని సార్లు జరగదు మనకి! పరిస్థితుల ప్రభావం వల్ల, కొన్ని మనమే పెట్టుకున్న పరిధులు/విలువల వల్ల కొన్ని చేసేస్తుంటాం. వాటి నుంచి ఒక్కో సారి ఇలా ముందు తెలియని కాంబినేషన్ పుట్టేస్తుంది. క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ నుంచే పుడుతుంది అని నిరూపితమవుతుంది! 

హిరణ్యకశిపుడు ఓ వంద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు కదా .. నేను ఇలా చావను అలా చావను అని. అప్పుడు కదా నరసింహ అవతారం ఉద్భవించింది! అలా అన్నమాట! (నరసింహావతారాన్ని పొంగనాల తో పోల్చట్లేదు ... క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ .... దానికి ఉదాహరణ! నమో నరసింహ!)


ఇక రెండో పాఠం. మొన్న ఒక కొటేషన్ చూసాను. మీరు మీ ప్రాబ్లమ్ లాగా కనిపించక్కర్లేదు అని. డబ్బుల్లేకపోతే డబ్బుల్లేనట్టు కనిపించక్కర్లేదు. శుభ్రమైన బట్టలు వేసుకొని తల దువ్వుకోవచ్చు!  చెల్లగొట్టాల్సిన ఆహారం తినాలి అనుకున్నప్పుడు మొహం ఒకలా పెట్టుకొని చేతికి దొరికిన ప్లేట్ లో పెట్టుకుని అయిందనిపించక్కర్లేదు. ఓ మంచి ప్లేట్ తీస్కొని బాగా కనిపించేలా ప్రెజెంట్ చేసుకుంటే మనకి కూడా తినాలి అనిపిస్తుంది. ఇదిగో ఇలా ఫోటోలు పెట్టుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. :) 

మూడో పాఠం... కళాకారులకి ప్రతీదీ ఓ ఇన్స్పిరేషనే! ఉదాహరణ కి ఈ కాంబినేషన్ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర ని గుర్తు చేసింది. సాంబారు నిజానికి ఇడ్లి కో, వడ  కో, దోసె కో జతవ్వాలి.  ఎన్టీఆర్ జమున గారిలా. పొంగనాలు పచ్చడి నో, పొడి నో పెళ్లి చేసుకోవాలి. కాంతారావు కె ఆర్ విజయ గారిలా. కానీ ముందే చెప్పినట్టు గా విధి వల్ల కలిసిన ఈ ఎన్టీఆర్ కె ఆర్ విజయ గార్ల జోడి ఎలా ఉంటుంది? వాళ్ళు అన్నీ మర్చిపోయి అన్యోన్యంగా ఉన్నా, ప్రపంచం వారిని ఇడ్లి సాంబారు కి ఇచ్చిన విలువ ఇస్తుందా? ఓ మంచి జోడీ గా గుర్తిస్తుందా? ఇలా కొంత సేపు ఆలోచిస్తూ ఉండిపోయాను నేను! 

నాలుగో పాఠం. దేవుడెందుకో ఒకే ఫామిలీ లో ఒకలాంటి వాళ్ళని పుట్టించడు. ఒకరు పొద్దున్నే లేచేస్తారు. ఇంకొకరు రాత్రి మేల్కొనే ఉంటారు. వాళ్ళకీ వీళ్లకీ రోజూ గొడవ. అలాగే మా ఇంట్లో క్రిస్పీ గా ఉండే చిరు తిండి ని సాంబారు లో వేసేసి మెత్తగా చేసేస్తే అస్సలు నచ్చదు. నాకేమో అలాగే ఇష్టం! పకోడీ చేస్తే కడి-పకోడీ చేసుకుంటాను.  కరకరలాడే కారప్పూస/జంతికల తో మరమరాల మసాలా చేసుకుంటాను.  బిస్కెట్టైతే పాలలో ముంచుకొని తినాల్సిందే. ఇలా క్రిస్పీ వాటిని మెత్తగా  చేసేస్తూ ఉంటే చూడటమే ఇబ్బంది మా ఇంట్లో వాళ్ళకి! ఎన్ని డిఫెరెన్సెస్ ఉన్నా కలిసే ఉండాలి మరి ... పొంగనాలు సాంబారు లాగా! 

ఐదో పాఠం. నువ్వు జీవితం అంతా చూసేసా అనుకుంటున్నావు కానీ ఇంకా అంతా చూడలేదు. ప్రపంచాన్ని చుట్టేసిన వాళ్ళైనా, పుస్తకాలన్నీ చదివేసి వాళ్ళైనా .. ఇంకా ఏదో కొత్త అనుభవం, కొత్త కాంబినేషన్ ఉంటూనే ఉంటుంది మనని ఆశ్చర్యపరచడానికి! ఇది గుర్తుంచుకుంటే చాలు. జీవితం డెడ్ ఎండ్ లాగా బోర్ గా అనిపించదు. కొంచెం ఈగో కూడా కంట్రోల్ లో ఉంటుంది.... మనం అన్నీ చూసెయ్యలేదని! 

ఇంక చివరిది, ముఖ్యమైనది అయిన పాఠం. ఆన్లైన్ లో మనం చూసేదేదో పూర్తి పిక్చర్ కాదు. నా పొంగనాల ఫోటో చూసి నోరూరుతుంది. ట్రై చెయ్యాలని కూడా అనిపించచ్చు. కానీ నిజం ఏంటంటే ఆ సాంబారు  లో ఉప్పెక్కువైంది. నేను పొంగనాల పిండి లో ఉప్పు తక్కువేస్కున్నా లాభం లేకపోయింది. తర్వాత సాంబారు లో నీళ్లు కలిపి మరిగించాము. ఆ పల్చటి సాంబారు ఫోటో కి నోచుకోలేదు. అదీ పూర్తి కథ. 

నేను ఈ సారి ఏం చేశా అంటే ఇదే భాగోతం ఇంగ్లిష్ లో వెళ్ళగక్కాను. అది నా ఇంగ్లిష్ బ్లాగ్ లో ఉంటుందన్న మాట. తెలుగు చదవటం రాదనే వంక తో నా రాతల్ని తప్పించుకోకుండా నేను వేసిన మాస్టర్ ప్లాన్ ఇది! కింద నా ఇంగ్లీష్ బ్లాగ్ కి లింక్ ఇచ్చాను. దాని పేరు సౌమ్యాటిక్ లైఫ్ :)

My English Blog

మళ్ళీ కలుద్దాం. మీరు ట్రై చేసిన/చెయ్యాల్సొచ్చిన కాంబినేషన్స్ ఏంటి? అవి మీకు నేర్పిన జీవిత పాఠాలేంటి? ప్లీజ్ చెప్పండి. 

Comments

  1. ఈ మధ్య నా బ్లాగ్ పోస్ట్ మాలిక లో కనిపించట్లేదు. కొన్ని కామెంట్స్ చదివితే కొంత విషయం అర్ధమయింది. ఏది ఏమైనా మాలిక వల్ల ఎన్నో మంచి తెలుగు బ్లాగ్స్ పరిచయం అయ్యాయి. నా బ్లాగ్ కూడా మంచి పాఠకులకు నోచుకుంది. అందుకు మాలిక కి మనస్ఫూర్తి గా ధన్యవాదాలు. Thank you very much! సౌమ్యవాదం ఇన్ని రోజులూ చదివిన, చదువుతున్న మిత్రులకి ఓ రిక్వెస్ట్. బ్లాగ్ లో ఫాలో బటన్ ఉంటుంది. (ఎడమ చేతి వైపు పైన మూడు గీతాల్ని క్లిక్ చేస్తే కనిపిస్తుంది). అప్పుడు నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు తెలిసే అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను రాయలేదు అనుకుంటారని చెప్తున్నా :)

    ReplyDelete
    Replies
    1. ఇంత లేట్ గానా చెప్పేది? Following😊

      Delete
  2. దీని తో బాటు జిలేబీ ముక్కలను నంజుకుంటే హాట్ హాట్ గా మంచి కాంబినేషన్‌~ సూపర్ డూపర్ హిట్ అవుతుందండి :)

    ReplyDelete
  3. మీరు రాస్తూనే ఉండండి .. మాలిక లో రావట్లేదని ఆపేస్తారా .. ఏం

    ReplyDelete
  4. పొంగణాలకు జీవితానికి బలే ముడి పెట్టారే : )

    ReplyDelete
  5. ఈరోజు ఈనాడు ఆదివారంలో మీ కథ చదివానండి. సమస్యను చాలా బాగా చెప్పారు. కథ బాగా నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. Thank you! కథ లింక్ తో ఓ పోస్టు పెట్టాను... చదవాలనుకున్నవారికి :)

      Delete

Post a Comment