Sunday, May 18, 2025
'ప్రియమైన ఆవార్ గీ' - బహుమతి పొందిన నా కథ
Sunday, April 13, 2025
ఈనాడు ఆదివారం లో నా కథ - సతీ సావి 'త్రి' సూత్రాలు
Tuesday, November 12, 2024
నా 'పాఠ్య'పుస్తకప్రేమ
ఈ మధ్య ఇంగ్లీష్ బ్లాగు లో రెండు భాగాలు గా రాసిన ఓ టాపిక్ ఇక్కడ కూడా పంచుకుందామని ఈ పోస్టు రాస్తున్నాను.
మీరు ఇంగ్లీష్ లో చదవాలనుకుంటే ఇదిగోండి లింకులు ...
https://sowmyaticlife.blogspot.com/2024/10/the-textbooklover-part-1.html
https://sowmyaticlife.blogspot.com/2024/10/the-textbooklover-part-2.html
నేనేదో నా మానాన నేనున్నా. సండే హిందూ పేపర్ గురువారం రోజు తాపీగా చదువుతున్నా. అందులో శ్రీ కేకీ దారువాలా అనే రచయిత కి నివాళి అర్పిస్తూ ఓ ఆర్టికల్ రాశారు. ఈయన పేరు ఎక్కడో విన్నాను అనిపించింది. కానీ వెంటనే గుర్తు రాలేదు. అలా అని వదిలెయ్యబుద్ది కాలేదు. అదిగో అక్కడ మొదలైంది ఈ యవ్వారమంతా.
మనం జ్ఞాపకాలు నీట్ గా సద్ది ఉన్న అలమార లాగా ఉండవు. కేబుల్ బాక్స్ లో చిక్కు పడిపోయిన వైర్లలాగా ఉంటాయి ఏంటో. ఒకటి లాగితే రాదు, ఇంకోటి వస్తుంది. ఆ వచ్చిందానికీ దీనికీ సంబంధం ఉండదు. ఒక్కోసారి ఒకటి లాగితే చిక్కుపడిపోయిన వైర్లన్నీ దానితోనే వచ్చేస్తాయి. అలా అని వదిలేస్తే ఆ బైటికొచ్చిన జ్ఞాపకం ఏ పంటిలో ఇరుక్కుందో తెలీని ఆహార పదార్ధం లాగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది .. ఓ ఛాలెంజ్ గా వెక్కిరిస్తుంటుంది. ఓపికగా ఒకే వైర్ ని గుర్తు పట్టి, దాని వెంట పడి, గుర్తించి పైకి లాగేసరికి ఇదిగో... ఇలా ఒకటికి మూడు బ్లాగులవుతాయన్నమాట! 😁
కేకీ దారువాలా గారి జ్ఞాపకము తాలూకు వైరు నన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్లింది. ఈ అందమైన 'వైర్ ట్రిప్' ని అందరితో షేర్ చేసుకుందామని నా తాపత్రయం!
ఆ నివాళి ఆర్టికల్ సరిగ్గా చదివితే ఆయనెవరో గుర్తొచ్చేసేది గా అని మీకు ఈ పాటికి అనిపించచ్చు. జీవితం అంత సులభమైతే ఎంత బాగుండు! ఆ ఆర్టికల్ లో వారు రాసినదేదీ నేను చదివినది కాదు. కవి గా, నవలా రచయిత గా, ఇంకొన్ని కోణాల్లో ఆయన్ని పొగిడారు అందులో. నేను ఆ రెండూ తక్కువ చదువుతాను. మరి ఆయన పేరు ఎందుకు గుర్తుండిపోయింది నాకు?
గూగుల్ సెర్చ్ లో ఏమీ తేలలేదు. అన్నీ దొరికే అమెజాన్ లో నే నా ప్రశ్న కు సమాధానం దొరికింది! ఆయన రాసిన ఓ కథా సంపుటి దొరికింది. పుస్తకాల కి రీడింగ్ శాంపిల్ ఉండటం ఎంత ఉపయోగపడిందో నాకు ఇక్కడ! ఆయన కథా సంపుటి లో నేను చదివిన కథ కనిపించింది. ""How the Quit India movement came to Alipur". ( క్విట్ ఇండియా ఉద్యమం అలీపూర్ కి వచ్చిన వైనం)
టైటిల్ చూస్తే సీరియస్ కథ లాగ ఉంటుంది కానీ నిజానికి ఇదో తమాషా కథ! అలీపూర్ లో బ్రిటిష్ అధికారి కి, అక్కడి లోకల్ లీడర్లకీ మంచి సంబంధాలుంటాయి నిజానికి. అతను కథా ప్రారంభం లో ఒకింత ఆందోళన లో ఉంటాడు. లోకల్ లీడర్లు ఆయన్ని కలవడానికి వస్తున్నారు మరి. అతనికి తెలుసు ఇది చాలా సున్నితంగా డీల్ చెయ్యాల్సిన విషయం అని. తనకి తన ఎస్టేట్ లో పొద్దున్నే గుర్రపు స్వారీ మీద వెళ్ళటం అలవాటు. ఆ ఉదయం కూడా అలాగే వెళ్తాడు. ఈ లోపు లీడర్లు అతని బంగ్లా కి వస్తే పని వాడు కూర్చోపెడతాడు. వాళ్ళకి టీ, బిస్కెట్లు తెచ్చి పెడతాడు. ఇక్కడే తమాషా! పని వాడు తెలీక పొరపాటున కుక్క బిస్కెట్లు సెర్వ్ చేసేస్తాడు. ఇది తెలీని కొంత మంది తినేస్తారు కూడా. సరిగా అదే సమయానికి అధికారి తన స్వారీ ముగించుకొని వస్తాడు. చూస్తే తన అతిధులు, లోకల్ లీడర్లు కుక్క బిస్కట్లు తింటూ ఉంటారు! ఎలాగో గుర్తులేదు కానీ ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. అంతే .... దీన్ని పరాభవంగా భావించి లీడర్లు క్విట్ ఇండియా నినాదాలు చేస్కుంటూ వెళ్ళిపోతారు. అలా క్విట్ ఇండియా ఉద్యమం అలీపూర్ కి వ్యాపిస్తుంది!
ఈ కథ నేను చదివింది ఓ పాఠ్య పుస్తకం లో. నాది కాదు. మా అక్కడి. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పిజి లెవెల్లోనో, డిగ్రీ లెవెల్లోనో ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్ యొక్క కథలని ఓ సంపుటి గా సిలబస్ లో ఇచ్చారు. ఇక్కడే నా జ్ఞాపకాల వైర్లు కలిసిపోయాయి. ఈ కథ గుర్తు రావడం తో మిగిలిన ఇంకొన్ని కథలు గుర్తొచ్చేసాయి. వాటి తో పాటు, ఇందాక చెప్పినట్టు తగుదునమ్మా అంటూ సంబంధం లేని ఇంకో వైరు నా చేతికి అల్లుకు పోయింది ... రెండు పుస్తకాల జ్ఞాపకాలు నా మెదడులో గజిబిజీ గందరగోళం చేసేశాయి. సరిగ్గా ఇంగ్లీష్ బ్లాగు రాస్తున్నప్పుడే అవి రెండూ విడిపోయాయి.
ఇంతకీ నాకు గుర్తొచ్చినవి రెండు పుస్తకాలు.
1. భారతీయ ఆంగ్ల రచయితల కథల సంపుటి
2. భారతీయ రచయితల కథల ఆంగ్లానువాదాల సంపుటి
చెప్పాగా ఒకేలాంటి వైర్లు ... కానీ వేరు వేరు.
భారతీయ ఆంగ్ల సాహిత్యం ఓ ప్రత్యేక శాఖ లిటరేచర్ లో. భారతీయులై ఉంది డైరెక్ట్ గా ఆంగ్లం లో రాసేవారన్నమాట. అందులో కేకీ దారువాలా గారొకరు. ఆ సంపుటి లో నాకు గుర్తొచ్చిన మిగిలిన కథలు
1. అనితా దేశాయి రాసిన "ది అకెంపనిస్ట్" - హిందూస్థానీ సంగీత నేపథ్యం లో సాగుతుందీ కథ. ఓ ప్రసిద్ధ సంగీత విద్వాంసుడి ట్రూప్ లో ఓ చిన్న పాత్ర వహిస్తున్న ఓ వ్యక్తి తన ఉనికి ని ప్రశ్నించుకుంటాడు కానీ చివరికి ఎంత చిన్న పనైనా ఆ విద్వాంసుడి తో ఉండటమే తన జన్మకి సార్ధకం అనుకుంటాడు.
2. ముల్క్ రాజ్ ఆనంద్ "ది లాస్ట్ చైల్డ్" - ఓ మేళా లో తప్పిపోయిన పిల్లవాడి చిన్నపాటి అడ్వెంచర్ కథ. వాడికి చివరికి తల్లిదండ్రులు కనిపిస్తారనుకోండి.
3. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ "ది స్పారోస్" - ఉత్తరభారత దేశం లో ని ఓ పల్లె లో ఓ చిన్న రైతు కథ. భార్యని, పిల్లల్ని, ఎద్దుల్ని చావబాది అందర్నీ దూరం చేసుకొని చివరికి ఒంటరిగా మిగులుతాడు. ఆఖరి దశ లో తన గుడిసె చూరు మీద గూడు కట్టుకున్న పక్షి పిల్లల్ని సాకి తన పిల్లల పేర్ల తో వారిని పిలుచుకుంటూ ఉంటాడు. ఓ రోజు వాన కి చూరు కారుతుంటే రాత్రంతా పైకప్పు ని బాగుచేసి జ్వరం తెచ్చుకుంటాడు... ఆ పక్షులనే తలుచుకుంటూ కన్నుమూస్తాడు. అతను పోయే సరికి ఆ పక్షులే అతనితో ఉంటాయి.
ఈ రచయిత సినిమాలు కూడా తీశారు. అమితాబ్ బచ్చన్ గారి మొదటి సినిమా అయినా "సాత్ హిందూస్థానీ" తీసింది ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ గారే! ఆ సినిమా తప్పకుండా చూడండి.. ఆ కథా వస్తువు ఇప్పటి దాకా ఎవరూ మళ్ళీ టచ్ కూడా చెయ్యలేదు.
నాలుగో కథ ఇంతకు ముందు చెప్పిన కేకీ దారువాలా గారిది. తమాషా ఏంటంటే ఈయన రాసిన నవల ఆధారం గానే అభిషేక్ బచ్చన్ మొదటి సినిమా 'refugee' తీసారట! రెండు తరాల నటులను పరిచయం చేసిన సాహిత్య, సినీ దిగ్గజాలు ఒకే పుస్తకం లో ఉన్నారు చూడండి! కాక కనీసం రెండు మూడు కథలున్నాయండి .. అవి ఎంతకీ గుర్తు రావట్లేదు! ఈ పాఠ్య పుస్తకాల తో వచ్చిన చిక్కేంటంటే సిలబస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. నా తో చాన్నాళ్లు ఉన్న ఆ పుస్తకాలు నేనేమో జీవిత చక్రం లో పడి ఎక్కడో ఎడబాసాను! My loss!
ఇక రెండో సంపుటి - భారతీయ కథల ఆంగ్ల అనువాదాలు ... ఇది కూడా భలే సంపుటి! ఇందులో నాకు గుర్తొచ్చిన కథలు -
1. అమృత ప్రీతం రాసిన "ది స్టెంచ్ ఆఫ్ కిరోసిన్" (కిరోసిన్ కంపు) - గ్రామీణ నేపథ్యం. మొదటి భార్య ని పిల్లలు కలగలేదని సాధిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. రెండో పెళ్లి చేస్తే ఆ అమ్మాయి పండంటి బిడ్డని కాని తండ్రికి ఇస్తుంది. వాడు ఆ బిడ్డని చేతిలో కి తీస్కొని "కిరోసిన్ కంపు కిరోసిన్ కంపు" అని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు!
2. టాగోర్ "ది హోమ్ కమింగ్" - కౌమార దశ లో ఉన్న తండ్రి లేని పిల్లవాడ్ని పల్లె నుంచి పట్నానికి మావయ్య ఇంటికి తీసుకెళ్తే అక్కడ ఇమడలేక పోతాడు. ఇల్లు వదిలి పారిపోతాడు. తల్లిని, తమ్ముడ్ని, పల్లె లో స్నేహాలని తలుచుకుంటూ ఓ రోజు వానలో తడుస్తూ చనిపోతాడు. చాలా బాధ కలిగించే కథ ఇది!
3. చాగంటి సోమయాజులు "ది వయోలిన్" - (చాసో కథ నేను ఇంగ్లిష్ లో చదవడం ఐరనీ కదా! తెలుగు లో ఇంకా చాలా చదవాలండీ నేను!) ఇది పూర్తి ట్రాజెడీ కాదు కానీ ఓ దిగువ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం లో వయోలిన్ వాయించే ఒకావిడ కథ. ఆవిడకి జబ్బు చేసి చేతిలో డబ్బు లేకపోతే ఆ వయోలిన్ అక్కరకొస్తుంది. ఆవిడ కోలుకున్నాక వాళ్ళాయన చెప్తాడు... నన్ను క్షమించు, వయోలిన్ అమ్మేసాను, ఇదిగో నీకు చీర, పూలూ తెచ్చాను అని. ఆ వయోలిన్ నా తల్లి లాంటిది. చూడండి... వెళ్తూ వెళ్తూ కూడా నాకు చీర పెట్టి వెళ్ళింది అని భర్త ని ఓదారుస్తుంది ఆ భార్య.
ఈ సంపుటి లో కూడా ఇంకొన్ని కథలుండాలి. ఈ పుస్తకం కూడా నేను ఎడబాసాను.
ఈ రెండిట్లో ఎందులోదో తెలీదు కానీ ఇంకో కథ గుర్తొచ్చిందండి. సిటీ లో ఓ చిన్న కుటుంబం. ఇద్దరు పిల్లలు, కొత్తగా ఇంకోడు పుట్టుకొస్తాడు. ఆర్ధిక సమస్యలు భరించలేక భార్యాభర్తలు కుటుంబమందరం విషం తాగి చనిపోదాం అనుకుంటారు. అతను విషం తేవడానికి బైటికి వెళ్లొచ్చేసరికి భార్య చంటి పిల్లవాడికి పాలిస్తూ పడుకుండిపోతుంది. మిగిలిన ఇద్దరు పిల్లలూ మంచి నిద్ర లో ఉంటారు. భర్త మీద కి వెళ్తాడు చల్లగాలికి. ఎప్పుడూ అతను చూసే ఎండిన చెట్టు కి ఆ రాత్రి చిన్న మొలకలు కనిపిస్తాయి. అవి చూడగానే అతనికి కూడా బ్రతుకంటే ఆశ కలుగుతుంది. ఆత్మహత్య ఆలోచన మానుకుంటాడు. ఇది మీరెవరైనా చదివి ఉంటే నాకు చెప్తారు కదూ! మీకు బోల్డు పుణ్యం గ్యారంటీ!
పాఠ్య పుస్తకాల పట్ల నా ప్రేమ, అనుబంధం ఇప్పటిది కాదు. దీని గురించి ఇది వరకూ కూడా రాసాను.
https://sowmyavadam.blogspot.com/2018/12/blog-post_28.html
https://sowmyavadam.blogspot.com/2023/01/blog-post_24.html
ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ పిల్లల్ని టెక్స్ట్ బుక్స్ చూపించమంది అడుగుతుంటాను. నా ఎం ఏ పాఠ్య పుస్తకాలు నేను దాచుకుంటే మా ఇంట్లో వాళ్ళు అమ్మేశారు. నాకు మళ్ళీ కొనిచ్చారు కానీ అప్పటికి సిలబస్ మారిపోయింది! ఇప్పటికీ నేను వాళ్ళమీద ఆ కసి పెట్టుకున్నాను ఫాక్షన్ వాళ్ళలాగా.
ఇప్పటికీ టెక్స్ట్ బుక్స్ లాగా బొమ్మలూ, కొత్త పదాల అర్ధాలు తెలిపే ఫుట్ నోట్స్ అన్ని పుస్తకాలకీ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది!
Sunday, November 3, 2024
"ఆఖరి మైలు" ఈనాడు ఆదివారం లో నా కథ
ఈ రోజు ఈనాడు లో పబ్లిష్ అయిన కథ ఇది.
ఈనాడు ఈ - పేపర్ లింక్ ఇది - ఈ లింక్ లో అయితే చదువుకోడానికి సులభంగా ఉంటుంది.
ఈ కథ నిడివి పబ్లిషింగ్ స్పేస్ కోసం కొంచెం కుదించాల్సి వచ్చింది. ఎవరికైనా చదవాలని ఇంటరెస్ట్ ఉంటే , మీ ఇమెయిల్ ఐడి పంపించండి. పూర్తి కథ పి డి ఎఫ్ పంపిస్తాను. :)
కథ చదివి నాకు మంచి మెసేజెస్ పంపిస్తున్న అందరికీ ధన్యవాదాలండీ :)
Wednesday, October 16, 2024
పొంగనాలు-సాంబారు నేర్పిన జీవిత పాఠాలు
పొంగణాలు/పొంగనాలు/పొంగడాలు ఇలా రకరకాల వ్యవహారాలు ఉన్న ఈ తెలుగు టిఫిన్ సాంబారు తో కలిసి బోల్డు కబుర్లు చెప్పింది నిన్న రాత్రి నాకు. అవి మీకు కూడా చెప్దామని!
ముందుగా ఒక్క మాట. ఈ కాంబినేషన్ విధి రాత వల్ల కలిసి వచ్చింది కానీ మా ఇంట్లో ఈ సంప్రదాయం లేదు, నా ఫేవరెట్టూ కాదు. ఇది గమనించాలి.
అదుగో అదే మొదటి జీవిత సత్యం. దోసెల పిండి పులిసిపోక ముందే వాడేయాలి అనే తొందర, సాంబారు వ్యర్థం చేయకూడదనే తాపత్రయం, దోసెల తో సాంబారు తింటే తక్కువ ఖర్చవుతుంది కాబట్టి ఇలా ఇడ్లి సాంబారు, వడ సాంబారు లాగా పొంగనాల తో తింటే రెండూ ఖర్చవుతాయి అనే ఆలోచన నుంచి పుట్టింది ఈ కాంబినేషన్. జీవితం లో ఇలా ఎన్ని సార్లు జరగదు మనకి! పరిస్థితుల ప్రభావం వల్ల, కొన్ని మనమే పెట్టుకున్న పరిధులు/విలువల వల్ల కొన్ని చేసేస్తుంటాం. వాటి నుంచి ఒక్కో సారి ఇలా ముందు తెలియని కాంబినేషన్ పుట్టేస్తుంది. క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ నుంచే పుడుతుంది అని నిరూపితమవుతుంది!
హిరణ్యకశిపుడు ఓ వంద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు కదా .. నేను ఇలా చావను అలా చావను అని. అప్పుడు కదా నరసింహ అవతారం ఉద్భవించింది! అలా అన్నమాట! (నరసింహావతారాన్ని పొంగనాల తో పోల్చట్లేదు ... క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ .... దానికి ఉదాహరణ! నమో నరసింహ!)
![]() |
ఇక రెండో పాఠం. మొన్న ఒక కొటేషన్ చూసాను. మీరు మీ ప్రాబ్లమ్ లాగా కనిపించక్కర్లేదు అని. డబ్బుల్లేకపోతే డబ్బుల్లేనట్టు కనిపించక్కర్లేదు. శుభ్రమైన బట్టలు వేసుకొని తల దువ్వుకోవచ్చు! చెల్లగొట్టాల్సిన ఆహారం తినాలి అనుకున్నప్పుడు మొహం ఒకలా పెట్టుకొని చేతికి దొరికిన ప్లేట్ లో పెట్టుకుని అయిందనిపించక్కర్లేదు. ఓ మంచి ప్లేట్ తీస్కొని బాగా కనిపించేలా ప్రెజెంట్ చేసుకుంటే మనకి కూడా తినాలి అనిపిస్తుంది. ఇదిగో ఇలా ఫోటోలు పెట్టుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. :)
మూడో పాఠం... కళాకారులకి ప్రతీదీ ఓ ఇన్స్పిరేషనే! ఉదాహరణ కి ఈ కాంబినేషన్ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర ని గుర్తు చేసింది. సాంబారు నిజానికి ఇడ్లి కో, వడ కో, దోసె కో జతవ్వాలి. ఎన్టీఆర్ జమున గారిలా. పొంగనాలు పచ్చడి నో, పొడి నో పెళ్లి చేసుకోవాలి. కాంతారావు కె ఆర్ విజయ గారిలా. కానీ ముందే చెప్పినట్టు గా విధి వల్ల కలిసిన ఈ ఎన్టీఆర్ కె ఆర్ విజయ గార్ల జోడి ఎలా ఉంటుంది? వాళ్ళు అన్నీ మర్చిపోయి అన్యోన్యంగా ఉన్నా, ప్రపంచం వారిని ఇడ్లి సాంబారు కి ఇచ్చిన విలువ ఇస్తుందా? ఓ మంచి జోడీ గా గుర్తిస్తుందా? ఇలా కొంత సేపు ఆలోచిస్తూ ఉండిపోయాను నేను!
నాలుగో పాఠం. దేవుడెందుకో ఒకే ఫామిలీ లో ఒకలాంటి వాళ్ళని పుట్టించడు. ఒకరు పొద్దున్నే లేచేస్తారు. ఇంకొకరు రాత్రి మేల్కొనే ఉంటారు. వాళ్ళకీ వీళ్లకీ రోజూ గొడవ. అలాగే మా ఇంట్లో క్రిస్పీ గా ఉండే చిరు తిండి ని సాంబారు లో వేసేసి మెత్తగా చేసేస్తే అస్సలు నచ్చదు. నాకేమో అలాగే ఇష్టం! పకోడీ చేస్తే కడి-పకోడీ చేసుకుంటాను. కరకరలాడే కారప్పూస/జంతికల తో మరమరాల మసాలా చేసుకుంటాను. బిస్కెట్టైతే పాలలో ముంచుకొని తినాల్సిందే. ఇలా క్రిస్పీ వాటిని మెత్తగా చేసేస్తూ ఉంటే చూడటమే ఇబ్బంది మా ఇంట్లో వాళ్ళకి! ఎన్ని డిఫెరెన్సెస్ ఉన్నా కలిసే ఉండాలి మరి ... పొంగనాలు సాంబారు లాగా!
ఐదో పాఠం. నువ్వు జీవితం అంతా చూసేసా అనుకుంటున్నావు కానీ ఇంకా అంతా చూడలేదు. ప్రపంచాన్ని చుట్టేసిన వాళ్ళైనా, పుస్తకాలన్నీ చదివేసి వాళ్ళైనా .. ఇంకా ఏదో కొత్త అనుభవం, కొత్త కాంబినేషన్ ఉంటూనే ఉంటుంది మనని ఆశ్చర్యపరచడానికి! ఇది గుర్తుంచుకుంటే చాలు. జీవితం డెడ్ ఎండ్ లాగా బోర్ గా అనిపించదు. కొంచెం ఈగో కూడా కంట్రోల్ లో ఉంటుంది.... మనం అన్నీ చూసెయ్యలేదని!
ఇంక చివరిది, ముఖ్యమైనది అయిన పాఠం. ఆన్లైన్ లో మనం చూసేదేదో పూర్తి పిక్చర్ కాదు. నా పొంగనాల ఫోటో చూసి నోరూరుతుంది. ట్రై చెయ్యాలని కూడా అనిపించచ్చు. కానీ నిజం ఏంటంటే ఆ సాంబారు లో ఉప్పెక్కువైంది. నేను పొంగనాల పిండి లో ఉప్పు తక్కువేస్కున్నా లాభం లేకపోయింది. తర్వాత సాంబారు లో నీళ్లు కలిపి మరిగించాము. ఆ పల్చటి సాంబారు ఫోటో కి నోచుకోలేదు. అదీ పూర్తి కథ.
నేను ఈ సారి ఏం చేశా అంటే ఇదే భాగోతం ఇంగ్లిష్ లో వెళ్ళగక్కాను. అది నా ఇంగ్లిష్ బ్లాగ్ లో ఉంటుందన్న మాట. తెలుగు చదవటం రాదనే వంక తో నా రాతల్ని తప్పించుకోకుండా నేను వేసిన మాస్టర్ ప్లాన్ ఇది! కింద నా ఇంగ్లీష్ బ్లాగ్ కి లింక్ ఇచ్చాను. దాని పేరు సౌమ్యాటిక్ లైఫ్ :)
మళ్ళీ కలుద్దాం. మీరు ట్రై చేసిన/చెయ్యాల్సొచ్చిన కాంబినేషన్స్ ఏంటి? అవి మీకు నేర్పిన జీవిత పాఠాలేంటి? ప్లీజ్ చెప్పండి.
Tuesday, August 20, 2024
జో బాత్ తుజ్ మే హై .....
చాలా రోజుల నుంచి ఓ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నా.... ఇలా సందర్భం కుదిరింది....
ఒకప్పుడు కేవలం మెమరీ కోసం పనికొచ్చే ఫోటోలు ఇప్పుడు వాటి పరిధులు దాటి కొంచెం మితిమీరి మనశ్శాంతి పోగొడుతున్నాయి కదా ....
కొంత మందికి ఫోటో చూసాక స్ట్రెస్ మొదలవుతుంది.. యాంగిల్, బట్టలు, లైటింగ్... ఇవి మనం రూపాన్ని కెమెరా కి వేరేలా చూపిస్తాయి అని తెలీక ఆ కనిపించేదే నిజమనుకుని చాలా బాధపడుతున్నారు పాపం కొంతమంది. (మగవారు కూడా ఇలా ఫీలవుతున్నారా? ఎక్కువగా ఆడవారేనా? దీనికి జెండర్ తో సంబంధం లేదా? )
మీడియా లో పని చేసిన టెక్నీషియన్ గా ఒక ప్రొఫెషనల్ ఫోటో వెనక ఎంత శ్రమ, ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని జిమ్మిక్కులు ఉంటాయో తెలుసు నాకు. అలాంటిది నేను కూడా ఒకో సారి నా ఫోటో చూసి స్ట్రెస్ అయిన రోజులున్నాయి. అలాంటప్పుడు ఎవరు ఎంత చెప్పినా నమ్మబుద్ధి కాదు .. మనం బానే ఉంటామని.
కొంచెం పెద్దయ్యాక జీవితం బోల్డు కష్టాలు చూపించి ఈ కష్టాన్ని చిన్న గీత చేసినందువల్ల ఇలా ఉన్నా దేవుడి దయ వల్ల 😊
ఈ పాట విషయానికొస్తే నాకు చాలా ఇష్టమైన పాట .. తాజ్ర మహల్ (1963) చిత్రం లోనిది. రఫీ గారి గొంతు, రోషన్ గారి సంగీతం, సాహిర్ లుధియాన్వీ పలుకులు ....
ఇందులో 'జో వాదా కియా వో నిభానా పడేగా' పాట ఫేమస్ ..
'జో బాత్ తుజ్ మే హై' పాట గురించి ఎక్కువ మందికి తెలీదు ..
ఈ పాట భావం .. నీ లో ఉన్న విషయం నీ చిత్తరువు లో లేదు ... అని. వీడియో లో విశదంగా వివరించే అవకాశం దొరికింది. ఇదిగోండి లింక్
ఈ పాట కెమెరా లేదా ఓ చిత్రం యొక్క లిమిటేషన్స్ ని కవితాత్మకంగా భలే చూపిస్తుందండి!
వీలైతే పాట ఒరిజినల్ కూడా వినండి. చాలా బాగుంటుంది!
ఫోటోలు చూసి ట్రామా కి డ్రామా కి గురయ్యే అందరికీ అంకితం ఇస్తున్నాను ఈ పాట ని!!!
We are all beautiful!
Wednesday, November 8, 2023
చూడాలని ఉంది
పర్యాటకాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎకో టూరిజం, హెరిటేజ్ టూరిజం ఇలా. నాకు సాంసృతిక పర్యాటకం, ఆహార పర్యాటకం చాలా ఇష్టం.
ఈ పోస్టు ద్వారా దేవుడికో బహిరంగ లేఖ రాస్తున్నా అన్నమాట ..ఈ కోరికలు తీర్చమని!
ముందుగా సాహితీ-సాంస్కృతిక పర్యాటకం ...
కవులు, రచయితలు, గాయకులూ జీవించిన ఇళ్ళూ ఊళ్ళూ నన్ను చాలా ఆకర్షిస్తాయి.
మన తెలుగు రాష్ట్రాల తో మొదలు పెడితే ...
1. తాళ్ళపాక - అసలు అన్నమయ్య పుట్టిన ఊరు ఎలా ఉంటుంది ... ఆ గాలి, ఆ నీరు, ఆ మట్టి... అన్ని కీర్తనలు రాస్తే పర్యావరణమే మారిపోయి ఉంటుంది అని నాకనిపిస్తుంది. అన్నమయ్య కీర్తనలు పాడటం మూడో ఏటే మొదలుపెట్టినా ఆ ప్రదేశం మాత్రం ఇప్పటి వరకూ చూడలేదు.
2. భద్రాచలం, గోల్కొండ - ఇవి లక్కీ గా రెండూ చూసాను. గోల్కొండ కోట లో రామదాసు చెర, ఏ రంధ్రం ద్వారా ఆహరం పంపేవారో చూసాక "ఎవడబ్బ సొమ్మని" అని రాసేంత కోపం ఎందుకు వచ్చిందో అర్ధం అయ్యింది. అయినా రామభక్తి విడువని ఆయన అసిధారావ్రతానికి అబ్బురం అనిపించింది. భద్రాచలం ఈ మొత్తం అల్లరి కి కారణం అయిన నగలు చూడటం ఇంకో అనుభవం
3. రాజమండ్రి లో నేను బాల్యావస్థ లో ఉన్నప్పుడు ఓ నాలుగేళ్లు ఉన్నాం. నేను చదువుకున్నది శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తిక పాఠశాల లోనే. (SRI KANDUKURI VEERESALINGAM THEISTIC SCHOOL... SKVT అంటారు దానవాయిపేట లో). కానీ ఆ వయసు లో నాకు వీరేశలింగం గారి గొప్పతనం ఆయన రచనలు .. ఏమీ తెలీవు. ఒకప్పుడు వితంతువుల కి ఆ స్కూల్ స్థలం లోనే ఆశ్రమం ఉండేది అని విన్నాను (ఎంత వరకూ నిజమో తెలీదు). మా పిల్లల ల్లో మాత్రం పిచ్చి రూమర్స్ ఉండేవి .. ఆ వితంతువులు ఆత్మలై తెల్ల బట్టలేస్కోని స్కూల్ లేని టైం లో తిరుగుతూ ఉండేవారని మా ఒకటో క్లాసు లో ప్రభు గాడు చెప్పాడు. (వాడే కొంగ ని అడిగితే గోళ్ళ మీద గుడ్లు పెడుతుంది అని కూడా చెప్పాడు. అప్పుడే నాకు అర్ధమయ్యి ఉండాల్సింది వాడు ఉత్త అబద్ధాలకోరని.) ఎంతో సామజిక, సాహితీ చరిత్ర ఉన్న రాజమండ్రి లో అసలు ఎన్నో చూడనే లేదు. ఓ సారి అవి చూడాలి
4. గురజాడ అప్పారావు గారి ఇల్లు చూడాలని ఉంది. విజయనగరం అట కదా.
5. తనికెళ్ళ భరణి గారితో ఓ సారి ఆంధ్రా సైడ్ వెళ్లాం ఓ కార్యక్రమం లో భాగంగా. మేము పాల్గొన్నది ఓ ఆలయ సంస్థాపన లో. ఆ ఊరి పేరు ఎంత గుర్తుచేసుకున్నా గుర్తురావట్లేదు. అక్కడికి దగ్గరే యండగండి ... తిరుపతి వెంకట కవుల లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి ఊరు అని తెలిసింది కానీ వెళ్లలేకపోయాం.
6. తంజావూరు లో తిరువయ్యురు .. మా త్యాగరాజ స్వామి కోవెల ఉన్న ఊరు. ఎన్నో కీర్తనలు నేర్చుకున్నాం. ఆ కీర్తనలలో ఆయనని చూసాం. ఆయన తిరిగిన ఊరు కూడా చూడాలని కోరిక. ఆరాధన టైం లో కాకుండా ప్రశాంతమైన టైం లో వెళ్ళి మైక్, ఆడియన్స్ తో సంబంధం లేకుండా కావేరి తీరాన ఆయన కీర్తనలు చక్కగా పాడుకోవాలని!
7. హైదరాబాద్ లో నే బడే గులాం అలీ ఖాన్ సాబ్ సమాధి ఉంది. ఆయన చివరి రోజుల్లో బషీర్ బాగ్ ప్యాలెస్ లోనే ఆయనకి ఆశ్రయం లభించింది. నా ఫేవరేట్ ఘజల్ గాయకులూ, ఆయన శిష్యులూ అయిన గులాం అలీ గారు హైద్రాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన దర్శనం చేస్కుంటారట. నేను మాత్రం ఇప్పటివరకూ ఆ ప్రదేశం చూడలేదు. అక్కడికెళ్లి "కా కరూ సజ్ని" పాట పాడాలి!
హైద్రాబాద్ లోనే ఇంకా చూడవలసినవి చూడలేదు అంటే ఇంక నెక్స్ట్ వచ్చేవి ఎలా చూస్తానో మరి! ఎందుకంటే ఇవన్నీ ఖండాంతరాల్లో ఉన్న స్థలాలు. ముఖ్యంగా అమెరికా లో, యూరోప్ లో ఉన్నవి.
8. వాల్డెన్ - హెన్రీ డేవిడ్ థోరో రాసిన పుస్తకం .. ఈయన అమెరికన్ రచయిత. సమాజం తో నాకేంటని అన్నీ త్యజించి వాల్డెన్ తటాకం ఒడ్డున ఓ చెక్క కాబిన్ లో ఓ రెండేళ్ల పాటు ఉన్న ఆయన తన అనుభవాలతో 'వాల్డెన్' రాసారు. ఆ కాబిన్ ఇంకా ఉందట. కాంకర్డ్ మసాచుసెట్స్ లో. అక్కడి వెళ్లాలని నా కోరిక.
9. అలాగే లిటిల్ విమెన్ రాసిన Louisa May Alcott గృహం. ఇది కూడా కాంకర్డ్ లోనే ఉందట.
10. ఇక షేక్స్పియర్ పుట్టిన ఊరు.. Stratford upon Avon. Avon నది ఒడ్డున ఉన్న Stratford అని అర్ధం. అక్కడి ఊరు పేర్లు అలాగే ఉంటాయి.
11. కాన్సాస్ సిటీ, మిస్సోరి లో పుస్తకాల షేప్ లో ఓ గ్రంధాలయం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి.
12. యూరప్ లో ఇక్కడ నేను లిస్ట్ చెయ్యలేని చాలా గ్రంధాలయాలు ఉన్నాయి. అవి చూడాలి. నాలాంటి దానికి జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళడానికి ఒక్కో గ్రంథాలయానికి మూడు రోజులు పడుతుంది అని నా అభిప్రాయం.
13. L.A లో అయితే చాలా పనుంది. నేను చూసిన ఎన్నో ఇంగ్లీష్ సీరియల్స్, సినిమాల లొకేషన్లు అక్కడ ఉన్నాయి. Bosch అనే సిరీస్ లో ఆ డిటెక్టివ్ ఉండే ఇల్లు ...
14. లండన్ కి ఓ గంట దూరం లో ఉండే Highclere castle... 'Downton abbey' అనే సీరియల్ తీసిన చోటు
Monday, August 14, 2023
విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్.....
Friday, July 28, 2023
కుళ్ళుమోతు మల్లిమీతు
ఈ సబ్జెక్టు తో నాకు చాలా అనుభవం ఉందండోయ్. అంటే నాకు కుళ్ళుకోవడం అలవాటు అని కాదు నేను చాలా భరించాను అని అర్ధం. అందరూ కొట్టి పడేస్తారు .. ఆ .. అందరికీ కలిగేదే అని. కానీ దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కుళ్ళు మన దగ్గర బంధాల్లోకి ప్రవేశిస్తే ఆ స్ట్రెస్ వేరు కదా.
నేను బలంగా నమ్మే విషయాల్లో ఒకటి ... లాజిక్ కాదు మనస్థితే మనిషి మనుగడ ని శాసిస్తుంది. లాజిక్ ని నమ్మే జాతి అయితే మనం యుద్ధం, క్షామం, ఆకలి లేకుండా చేసుకొనేవాళ్ళం. ఉండాల్సిన ఒకే భూమి ని సరిగ్గా చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు స్థితి ని చూసి ఏం చేస్తే ఇలా ఉన్నాం అని వెనక్కి calculate చేసుకుంటే తెలుస్తుంది.. పాలకుల, ధనికుల మనోవికారాల ఫలితమే ఈరోజు మన ప్రపంచం. అందులో అసూయ ఒక పెద్ద స్థానాన్ని ఆక్రమించుకుంది.
కుళ్ళు అనే ప్రాసెస్ ని విశదీకరిస్తే దాని మూలం పోల్చుకోవడం లో ఉంది. నువ్వు నీలా బ్రతికేస్తున్నావు .. ఏదో లాగా. ఈ లోపు ఓ చుట్టమో, ఫ్రెండో కనిపిస్తాడు.. లేదా ఏదో వార్త వస్తుంది వాళ్ళ గురించి. అంతే మొదలవుతుంది కుళ్ళు. ఈ మొదలైన జెలసీ ఒక మోతాదు లో చాలా కామన్. దీని వల్ల పెద్ద నష్టం లేదు కూడా. కానీ మోతాదు మించితేనే ఇబ్బంది..ఆ కుళ్ళు కలిగినవాడికీ, ఎవడి వల్ల కలిగిందో వాడికీ.
కుళ్ళు లోకి లింగభేదాలు ఉండవు. ఆడవాళ్ళకి అసూయెక్కువ అంటే నేను నిజమనుకునే దాన్ని. కానీ ఒక్కసారి ప్రొఫెషనల్ ప్రపంచం లోకి వచ్చాక అది ఎంత అబద్ధమో తెలిసింది. ఈ విషయం లో ఇద్దరూ సమానమే. నాకు ఇంకో అపోహ ఉండేది .. మగవాళ్ళకి మగవాళ్ళంటేనే జెలసీ... ఆడవాళ్ళకి ఆడవాళ్ళంటేనే జెలసీ అని. కానే కాదు.
నాకున్న ఇంకో అపోహ కూడా బాగా బుద్ధి వచ్చేలా పోగొట్టారు కొంత మంది మనుషులు. సమాజం లో స్థాయి లో ఉన్న వారికి ఇలాంటివి ఉండవనుకొనేదాన్ని నేను .. ముఖ్యంగా వాళ్ళకంటే తక్కువ (ఆర్ధికంగా, పేరుప్రఖ్యాతులు పరంగా etc). కానీ వీళ్ళే 1bhk కట్టుకున్న వాడి దగ్గరకి వచ్చి "నా బంగ్లా తుడుచుకోలేక చచ్చిపోతున్నాను.. నీ ఇల్లంటే నాకు అసూయ గా ఉంది" అంటారు.
ఒక ఆరోగ్యకరమైన మనసు, బుద్ధి ఉన్న వ్యక్తి కుళ్ళు ని ప్రాసెస్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఆ భావం కలగటం సహజం అని మొదట ఒప్పుకోవడం తో మొదలవుతుంది ఈ ప్రాసెస్. ఆ తర్వాత అదెక్కడి నుంచి వస్తోందో తెలుసుకోవడం ముఖ్యం. నీ తో పాటు పని చేసే కొలీగ్ ఇంకో పక్క పుస్తకం రాసారు అని తెలిసి అసూయ కలిగితే నీకు కూడా అలాంటి వ్యాపకం ఏదో పెట్టుకోవాలని ఉందన్నమాట. అందుకే నువ్వు చేయలేనిది వారు చేస్తే నీకు బాధ అనిపించింది. ఇలా అయితే ఫర్వాలేదు. మించిపోయిందేది లేదు. మనం కూడా అలాంటిది మొదలుపెట్టుకోవచ్చు. తనలో తనే విస్మరిస్తున్న కోణాలు తెలుసుకోడానికి ఈ కుళ్ళు అనే ఎమోషన్ ని డిటెక్టర్ గా వాడుకుంటుంది వివేకం.
కానీ అనారోగ్యంగా లేదా బలహీనంగా ఉన్న మనసు లో కుళ్ళు ప్రవేశిస్తే ... అబ్బా .. ఇంక వాళ్ళకి, చుట్టుపక్కవాళ్ళకి అందరికీ నరకం. వీళ్ళు సుఖంగా ఉండరు ... ఇంకొకళ్ళని ఉండనీరు.
ఇంకో జాతి ఉంటారు. వీళ్ళు చక్కగా పుట్టుకతో అసూయ అనే జీన్స్ తో పుడతారు. వీళ్ళ కుళ్లుకి అసలు లాజిక్ ఉండదు. అలాగే దానికి పరిష్కారం కూడా ఉండదు. వీళ్ళ సాంకేతిక నామం "కుళ్ళుమోతు మల్లిమీతు". మనకి తెలిసిన ఒకడు ఐ ఏ ఎస్ పాసయ్యాడు అనుకుందాం. ఈ మాట తెలీగానే కుళ్ళు కలిగింది. నువ్వు కూడా ఐ ఏ ఎస్ కి ప్రిపేర్ అవుతూ ఆ పరీక్ష ని క్రాక్ చెయ్యలేకపోతే ఆ కుళ్ళు కొంత వరకూ సబబు. కానీ అసలు నువ్వు ఆ పరీక్ష కి ప్రిపేర్ అవ్వట్లేదు సరి కదా ... అది నీ కెరీర్ ఏ కాదు. ఈ మల్లిమీతు టైప్ కుళ్ళు కి వయసు, వావి, వరస, సందర్భం, సంకోచం, విచక్షణ, వివేకం .. ఏవీ ఉండవు.
కుళ్ళు లో ఇంకో విసుగైన కోణం ... శ్రమ ని కాకుండా దానికి లభించిన ఫలితాలు చూసి కుళ్ళుకోవడం. ఓ వ్యక్తి మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాంగా అరవై ఏళ్ళ వయసు లో షుగర్ లాంటివి లేకుండా ఉన్నాడనుకోండి ... వీళ్ళు ఆహారం వైపు ఎటువంటి డిసిప్లిన్ చూపించకుండా వీళ్ళకి అవే ఫలితాలు కావాలి. ఆ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అంటే కుళ్ళు.
సత్యాగ్రహం లాగానే ఒక్కోసారి సత్యాసూయ కూడా ఉంటుంది అనిపిస్తుంది. లంచగొండి వాడో, స్వయంగా కుళ్ళుమోతు అయిన వాడో జీవితం లో అంచెలంచెలుగా ఎదుగుతూ పోతుంటే వాడ్ని చూసి కుళ్ళు కలగక మానదు. మనం మంచివాళ్ళయి చేసిందేంటి అనిపిస్తుంది.
నాకనిపిస్తుంది.. దుర్యోధనుడికి పాండవులతో ఉన్న ప్రధాన సమస్య కుళ్ళే అని. రాజ్యకాంక్ష ఒక్కటే అయితే వాళ్ళకి ఐదు ఊళ్ళు ఇచ్చేయచ్చు. ఆర్యావర్తం ఏలే చక్రవర్తి గా ఐదూళ్ళ రాజుల మీద పెత్తనం చేసి తన పవర్ చూపించుకోవచ్చు. కానీ అతనికి అసలు వాళ్లంత ప్రజ్ఞావంతులు బ్రతికుండడమే ఇష్టం లేదనిపిస్తుంది. (చిన్నప్పటి నుంచి అతను చేసిన హత్యాప్రయత్నాలు ఇందుకు సాక్ష్యం). దుర్యోధనుడు స్వయంగా ఇలాంటి వాడా, శకుని ప్రేరేపించాడా అంటే .. మనలో అంకురం కూడా లేని భావాన్ని ఎవ్వడూ ప్రేరేపించలేడు అంటా నేను. ఇప్పుడు మన భారతీయులకి రోడ్లు శుభ్రంగా ఉంచమని, లైన్ లో సరిగ్గా నుంచోమని, సమయపాలన చెయ్యమని ఎంత చెప్పినా వినరు చూడండి అలా.
దుర్యోధనుడి కుళ్ళు అతని వంశాన్ని నాశనం చేసింది. కానీ అది ద్వాపర యుగం. ఇప్పుడు అలా అవ్వట్లేదేమో అనిపిస్తోంది.
కుళ్ళు తీర్చుకోడానికి పరమ సాధారణమైన సాధకం - మాటలు. చాలా మంది తమ కుళ్ళు ని ఇలాగే ప్రదర్శిస్తారు. వంకర మాటలు, నొక్కులు, బాధాకరమైన కామెంట్లు, ఎదుటి వారి విజయాన్ని acknowledge చెయ్యకపోవడం ...
ఈర్ష్య, అసూయ, కుళ్ళు ఇలా మన తెలుగులో ఉన్నట్టే ఇంగ్లిష్ లో ఎన్వీ, జెలసీ లాంటి మాటలున్నాయి. కాకపోతే ఎన్వీ కి జెలసీ కి తేడా ఉందట. ఎన్వీ అంటే నువ్వు కావాలనుకున్నది, నీ దగ్గర లేనిది ఒకడి దగ్గర ఉంటే కలిగే భావన. జెలసీ అంటే నీదైన వస్తువుని వేరెవడో వచ్చి తీస్కెళ్ళిపోతాడనే భయం అట! మనం ఒకే అర్ధం లో రెండూ వాడేస్తూ ఉంటాం.
ఎన్వీ అంటే ఒనిడా టివి యాడ్ గుర్తొస్తుంది ... ఈ ఎమోషన్ ని కూడా సెల్లింగ్ పాయింట్ చేసేసుకున్నారు చూసారు వాళ్ళు! ప్రేమ కథల్లో కూడా ఇలాగే వాడుకుంటారు జెలసీ ని. ఇష్టమైన వ్యక్తి అటెన్షన్ ని పొందడానికి ఇంకొకరి తో చనువుగా ఉన్నట్టు నటించి వాళ్ళని 'జెలస్' చెయ్యడం ఓ నార్మల్ విషయం లో చూపిస్తారు కదా సినిమాల్లో. అలాగే ఒకమ్మాయి ముందు ఇంకొకమ్మాయి ని పొగిడితే ఆమె కి కుళ్ళు అంటారు. నాకనిపిస్తుంది వీళ్ళ ఉద్దేశమే ఆ అసూయ ని ప్రేరేపించడం అని.
అమ్మాయిల మధ్య అసూయ ని ఓ జోక్ గా కాక జెండర్ పాలిటిక్స్ కోణం నుంచి అర్ధం చేసుకోవాలి అంటాను నేను. వాళ్ళకి చేసిన కండిషనింగ్ లో భాగం ఏంటంటే నీ మగాడు, నీ సంసారం దీనికోసం నువ్వు పోరాడు ఇంకో ఆడదాన్నుంచి అని. ఏదో మగాడు లాలీపాప్ అయినట్టు. అతనిక్కూడా వివేకం ఉంటుంది కదా. తప్పు జరిగితే అది రెండు వైపులా కదా. ప్రేమ దశ లో కూడా మగవాడి అటెన్షన్ ఏదో ట్రోఫీ అయినట్టు దాని కోసం వేరే అమ్మాయిలతో పోటీ పడాలి అనే భావన సృష్టిస్తారు. అమ్మాయిల మనసులని, మెదడులని సంకుచితం చేసే ఇలాంటి పోకడల వల్లే "ఆడవాళ్ళకి అసూయ ఎక్కువ" అనే ప్రాపకం జరిగింది. మనోవికాసం చెందిన సాధికార స్త్రీ ఇంకో స్త్రీ కి చేయూతనిస్తుంది తప్పించి తొక్కేయాలనుకోదు. ఇంద్రా నూయి లాంటి వారు చెప్తోంది కూడా ఇదే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఛాలెంజ్ ఇదే. కొన్నేళ్ల కండిషనింగ్ నుంచి బైట పడి తోటి ఆడవారిలో పోటీ ని కాక సహకారాన్ని ఇవ్వడం, తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఏ క్లోజ్ బంధం లో ఉన్న వారైనా రకరకాల సందర్భాల్లో జెలస్ ఫీలవుతారు. ఈ రకమైన జెలసీ అసలు కేటగిరి నే వేరనిపిస్తుంది. తన కూతురొచ్చి వేరొకరి వంట పొగిడితే తల్లికి కుళ్ళు. కొలీగ్ వేసిన జోక్ గురించి నవ్వుతూ చెప్తే భర్త కి కుళ్ళు. తనతో కాక ఇంకొకరి తో కొంచెం చనువుగా ఉన్నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కుళ్ళు. ఎంత సెక్యూర్ గా ఉండే వ్యక్తికైనా ఈ భావన తప్పదేమో అనిపిస్తుంది.
ఒక కొటేషన్ చదివాను ఇటీవల. నువ్వు ఎవరితో సేఫ్ గా శుభవార్త ని షేర్ చేస్కోగలవో వాళ్ళే నీ శ్రేయోభిలాషులు అని. మిగిలిన వాళ్ళో? సాంకేతిక నామం ఉందిగా వాళ్ళకి!
Friday, June 9, 2023
మరపురాని పావుగంట
ఏడేళ్ళ క్రితం ఇదే రోజున ప్రసాద్స్ ఐమాక్స్ లో మా షార్ట్ ఫిల్మ్ 'పెళ్ళివారమండి' ప్రదర్శించాం.
ఆ సినిమా నిడివి పావుగంట. అయినా దానితో ముడిపడిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవి గుర్తుచేసుకుంటూ ఈ పోస్టు.
నేను మొదట తీసిన షార్ట్ ఫిలిం 2007 లో. అప్పటికి యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్ ... ఈ హవా ఇంకా మొదలవ్వనే లేదు. ఈ బుజ్జి సినిమా గురించి ఇంకో సారి చెప్తాను.
కట్ టు 2016.
ఓ ఫ్రెండ్ చాలా ఏళ్ళ తర్వాత కలిసి మేము సినిమాల్లో ఉన్నాం అని తెలిసి "మీరు ఎందుకు షార్ట్ ఫిలిం చెయ్యట్లేదు?" అని అడిగారు. "అబ్బా... ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసేస్తున్నారు... ప్రొఫెషనల్స్ అయిన మేము కూడా ఈ మూస లో పడితే బాగోదేమో" అని నసిగాను. కానీ ఆ ఫ్రెండ్ ఊరుకోలేదు. నేను డబ్బు పెడతాను, తియ్యమన్నారు. ఇంక నఖరాలు చెయ్యకుండా అక్కా, నేను పనిలోకి దిగాం.
నిజానికి ఇది ఓ డ్రీం ప్రాజెక్ట్ అయింది. ఎలా అంటే, డబ్బు పెట్టిన వ్యక్తి ఎవరైనా కథలో వేలు పెడతారు కానీ మా ఫ్రెండ్ అస్సలు ఏమీ పట్టించుకోలేదు. నేను తక్కువలో తీద్దాం అనుకున్నాను. కానీ కథ రెడీ అయ్యాక నిడివి, అది బాగా వచ్చిందనిపించి మూడు రెట్లు బడ్జెట్ పెంచారు మా ఫ్రెండ్. అందుకే దీన్ని సినిమా లెవెల్లో ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రసాద్స్ ఐమాక్స్ లో 'విడుదల' చేయగలిగాము. (ఒక్క షో అయినా. అది కూడా ఫ్రీ టికెట్😆).
అక్కా, నేను బాగా ఎంజాయ్ చేసే genre కామెడీ కాబట్టి అదే తీద్దామనుకున్నాం. సబ్జెక్టు గురించి ఓవర్ థింక్ చెయ్యద్దు అనుకున్నాం. సరదాగా ఏది వస్తే అదే రాద్దాం అని నియమం పెట్టుకున్నాం. రెండు మూడు వెర్షన్లు రాసుకోవడం లాంటి చాదస్తాలు కూడా పెట్టుకోవద్దనుకున్నాం. అలాగే చేసే ఫ్రీడమ్ దొరికింది మా ఫ్రెండ్ వల్ల.
2012 లో 'ఫైవ్ విమెన్ అండ్ ఏ బిల్" అనే ఇంగ్లీష్ నాటకం నేను రాసి డైరెక్ట్ చేసాను. ఆ నాటకం తారాగణం నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ నాటకం లో అందరూ స్త్రీ పాత్రలే. వారినే ఈ సినిమాలో తీసుకున్నాను. (ప్రొఫెషనల్ ఆక్టర్స్ తో చేసేంత కాంటాక్ట్స్ కానీ, బడ్జెట్ గానీ లేకపోవడం ఓ కారణం అయితే, తెలిసిన వారితో అయితే comfortable గా ఉంటుంది అనుకోవడం ఇంకో కారణం). వారు కాక ఇంకొంత మంది పరిచయస్తులు కలిశారు. ఇందులో టీనేజర్ గా చేసిన పిల్లవాడు నా మొదటి షార్ట్ ఫిల్మ్ లో కూడా చేసాడు. వాడిని చూస్తే "మనం ఇంత పెద్దవాళ్ళం అయిపోయామా" అనిపించింది!
షార్ట్ ఫిలిం లో వారి పాత్రలు కూడా వారి నిజజీవితానికి దగ్గరగా ఉంటాయి. ఎవరి పేర్లు వారివే. అవి మార్చలేదు. మలయాళం మాట్లాడే ఆవిడ మలయాళీ.. తెలుగు అబ్బాయి ని పెళ్ళి చేసుకోవడం కూడా అలాగే సినిమా లోకి తీసుకున్నాం. నాట్యం చేసే ఇద్దరూ నిజంగా నాట్యం నేర్చుకున్నవారే. ఫ్రెంచ్ మాట్లాడే అమ్మాయి కి ఫ్రెంచ్ వచ్చు. పంజాబీ అబ్బాయి పాత్ర నిజజీవితం లో మంచి తెలుగు మాట్లాడతాడు. (ఈ షార్ట్ ఫిల్మ్ అతనికి మొదటి అనుభవం. అతనికి ఈ ఫీల్డ్ ఎంతో నచ్చి మా కెమరామెన్ దగ్గరే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని ఆ ఫీల్డ్ లో కొనసాగుతున్నాడు!) ఇలా వాళ్ళ పాత్రల మూలాలు మాత్రం తీస్కొని దాని మీద కథ అల్లుకున్నాం. అందుకే వీరే ఈ పాత్రలు చెయ్యడం కరెక్ట్ అనిపించింది.
కాస్ట్ కుదిరింది. అందరికీ స్క్రిప్ట్ బట్టీ వచ్చే దాకా రిహార్సల్స్ చేసుకున్నాం. ఇది చాలా కష్టమయ్యేది .. అందరికీ టైం ఓ సారి కుదరడం చాలా కష్టమయ్యేది. కానీ సాధించాం.
అందరూ ఒకరికొకరు తెలిసుండటం వల్ల, అంతకు ముందు పని చేసిన అనుభవం ఉండటం వల్ల, నటులకి అక్క మీద నా మీద గౌరవం ఉండటం వల్ల మా పని బాగా సులువైంది. మేకప్, హెయిర్ డ్రెస్ చెయ్యడానికి వచ్చిన వాళ్ళు "మేడం, మిగిలిన షూటింగ్స్ లో షాట్స్ మధ్య ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు... వీళ్ళందరూ భలే సఖ్యత గా ఉన్నారు మేడం" అనడం మా నిర్ణయం మీద మాకు ధీమానిచ్చింది.
బడ్జెట్ కారణాల వల్ల తాపీగా షూటింగ్ చెయ్యడం కుదరదు కాబట్టి 48 గంటల పాటు కేవలం 4-5 గంటల విరామం (నిద్ర కోసం) తప్ప వరసగా షూటింగ్ చేసాం. ఇందులోనే ఓ పాట షూట్ చేసాం! మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేనేజర్ లాంటివారెవ్వరూ లేరు. డైరెక్షన్ మేమే. క్యాటరింగ్ లాంటివి చూసుకోవడం మేమే. షార్ట్ ఫిలిం లో పిల్లవాడి పంచె అక్కే ఇస్త్రీ చేసింది కూడాను.
షూటింగ్ లో చాలా సవాళ్లు ... మొదటి షాట్ కి భోరున ఏడుపు మొదలుపెట్టాడు చైల్డ్ ఆర్టిస్ట్. కష్టపడి సవరం పెట్టాక ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందని గుర్తొచ్చి అది తీసి ఓ రెండు గంటల పాటు పెర్మిషన్ పెట్టి వెళ్ళిపోయింది ఓ పాత్రధారిణి. ఇంకో ఫ్రెండ్ మాకు ఒకటిన్నర రోజు కాల్షీట్ ఇచ్చింది... మర్నాడు వాళ్ళ చెల్లి పెళ్లి. ఇలాంటి చాలా ఇబ్బందుల వల్ల స్క్రిప్ట్ లో సెట్ మీదే కొన్ని మార్పులు కూడా చెయ్యాల్సి వచ్చింది.
మొత్తానికి షూటింగ్ అయిందనిపించాం. 48 గంటలు నిర్విరామంగా పనిచేసినా అక్కకి, నాకూ అస్సలు అలుపు రాలేదు. ఇష్టమైన పని, చేతొచ్చిన పని చేస్తే అలాగే ఉంటుంది కదా!
ఈ సినిమా కి నిజంగా మాకు కాస్ట్ కుదిరినట్టే టెక్నిషన్స్ కూడా మంచివారు కుదిరారు. ఎడిటర్ మాకు ముందు నుంచి తెలిసిన వారే. కెమెరామెన్ మాకు మా సీనియర్ ఈ సినిమా కోసం పరిచయం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ మొదలవ్వక ముందు అక్కకి నాకు కొంత సంశయం ఉంది .. చిన్న సినిమా కదా... ఏదో ముక్కున పట్టి చేసి పడేస్తారేమో అని. కానీ సబ్జెక్టు చూసి ఇంప్రెస్ అయ్యారో, హైదరాబాద్ లో ప్రొఫెషనల్స్ అంత బాగున్నారో కానీ .. పెద్ద సినిమా కి చూపించినంత శ్రద్ధ మా సినిమాకు కూడా చూపించారు. మేము పెద్ద సినిమాల లాబ్స్ లోనే చేయించాం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్. కలర్ కరెక్షన్, సౌండ్, డబ్బింగ్ ... అన్నీ టైం కి చాలా బాగా కుదిరాయి.
అప్పటికే అక్కా, నేనూ కొన్నేళ్లు గా సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాం . ఆ ప్రయత్నాలు ఫలిస్తే ప్రసాద్స్ ఐమాక్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది అని ఎదురు చూసేవాళ్ళం. ఈ సినిమా ఇంత మంచి టెక్నీకల్ విలువలతో వచ్చే సరికి "ఎందుకు ఎదురుచూడాలి?" అనిపించి ఓ థియేటర్ బుక్ చేసి ఓ షో వేసాం. అదే ఈ రోజు ఏడేళ్ల క్రితం.
అలా ఐమాక్స్ లో సినిమా వేయాలంటే డివిడి తీసుకెళ్తే సరిపోదు. దాన్ని ఐమాక్స్ లో ప్లే అయ్యే ఫైల్ గా కన్వర్ట్ చేసుకోవాలి. శబ్దాలయ లో 'స్క్రాబుల్' ఆఫీస్ కి వెళ్లి అది చేయించుకున్నాం. రాత్రి ఒంటిగంట కి రమ్మన్నారు. మేముండేది సికింద్రాబాద్ లో. అమ్మని, నాన్నగారిని తీసుకెళ్లాం జూబిలీహిల్స్ కి. వాళ్ళిచ్చిన డ్రైవ్ ని రాత్రే ఐమాక్స్ లో చెక్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఐమాక్స్ కి వెళ్తే థియేటర్ లో కేవలం మేము నలుగురం. సినిమా వేశారు. ఆ సినిమా టైటిల్స్ లో అమ్మ,నాన్నల పెళ్ళి ఫోటోలు ఉంటాయి. అది వాళ్ళకి చెప్పలేదు. surprise గా ఉంచాం. పెద్ద తెర మీద వాళ్ళ ఫోటోలు చూసుకొని ఎంతో ఆనందించారు అమ్మా, నాన్న. మేము వాళ్ళిద్దరికీ ఇవ్వగలిగిన ఆనందాల్లో అదొకటి.
ఇప్పుడనిపిస్తుంది... మంచి పని చేసాం అలా చేసి అని. డాడ్ పోయారు. మా సినిమా విడుదల చూడకుండానే. కానీ ఆ షార్ట్ ఫిలిం కొంత వరకైనా ఆ కల నిజం చేసింది.
ఐమాక్స్ తర్వాత ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా వేసాం. మరికొంత మంది చూడగలిగేలా. అయితే ఈ స్క్రీనింగ్ కి టిక్కెట్లు పెట్టాం. షార్ట్ ఫిలిం చూడటానికి ఎవరు డబ్బిస్తారు అనే భయం ఉన్నా, ఎక్స్పెరిమెంటల్ గా అలా చేసాం. మాకు తెలిసిన వారే ఎక్కువ వచ్చారు. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వలేదు కానీ ఎంతో కొంత వసూలైంది 😆
ఈ చిన్న సినిమా 'బెస్ట్ కామెడీ' అవార్డును గెల్చుకుంది. అదే ప్రసాద్ లాబ్స్ వేదిక పై ఆ అవార్డును అక్కా, నేనూ తీస్కున్నాము.
![]() |
| ITSFF (ఇంటెర్నేషనల్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ కామెడీ అవార్డు అందుకుంటూ అక్కా,నేను |
ఈ అవార్డు తో సరితూగుతూ ఓ రివ్యూ కూడా వచ్చింది... కేవలం ఫేస్బుక్ పరిచయం తో మా మీద ఎంతో అభిమానం చూపిస్తూ జర్నలిస్ట్ అయిన భరద్వాజ రంగావజ్ఝల గారు మా సినిమా గురించి ఇలా రాశారు.
ఓ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎన్నో అసంతృప్తులు ఉంటాయి. ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి. ఇదే సినిమా యూట్యూబ్ లో ఎక్కించి ఇన్నేళ్ళవుతున్నా ఐదంకెల వ్యూస్ ఏమీ లేవు. ఇందులో మేము రాసుకున్న కథ మా బెస్ట్ ఏమీ కాదు. అసలు రాసుకున్న స్క్రిప్ట్ పూర్తిగా తియ్యలేకపోయాం. మేము గౌరవమిచ్చే ఒక సీనియర్ రచయిత కి ఈ సినిమా అస్సలు నచ్చలేదు. (సున్నితంగానే చెప్పారు ఆ విషయం).
అయినా ఊహించని ఎన్నో గిఫ్ట్స్ ని ఇచ్చింది ఈ సినిమా. ఎడిటింగ్ స్టూడియో నుంచే కాంప్లిమెంట్లు మొదలవడం మాలాంటి బిగినర్స్ కి చాలా ఊతం ఇచ్చింది. అందరూ చూసేది ఓ పావుగంట చిత్రాన్ని. దాని వెనక ఎన్నో చిత్రాలు చూపించింది ఈ ప్రాసెస్ మాకు!
ఇంతా చెప్పి సినిమా కి లింక్ ఇవ్వకపోతే ఎలా?
ఇదిగోండి https://www.youtube.com/watch?v=VF5U61ANQ5s&t=1s
ఇంత రాసాను కాబట్టి ఈ సినిమా చూడాలని గానీ, నచ్చాలని గానీ మొహమాటం పెట్టుకోవద్దని నా మనవి. 😊
Friday, May 19, 2023
ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి ..
నాకు ఇంటి పని తో చాలా పేచీలున్నాయి.
ఒకటి ఆ పని కి ఉన్న రిపిటీటివ్ నేచర్. ఒక్క రోజు, ఒక్క సారి చేస్తే సరిపోదు. చేస్తూనే ఉండాలి. చేస్తే మామూలుగా ఉంటుంది కానీ చెయ్యకపోతే కనిపిస్తుంది ఏవిటో. ఇంటి శుభ్రానికి శత్రుత్రయం ... దుమ్ము, చెత్త, మట్టి. అందులో దుమ్ము రక్తబీజుడి జాతికి చెందినదే అనిపిస్తుంది నాకు. టెడ్డీ బేర్, బార్బీ బొమ్మలు ఇష్టంగా కొనుక్కొని ఈ రాక్షసుడికి భయపడే వాటికి ప్లాస్టిక్ కవర్ ముసుగులు వేసేస్తూ ఉంటాం కదా. ఈ దుమ్ము అటక ల మీదా, ఫాన్ల మీద ఓ రకంగా, నేల మీద ఇంకో రకంగా, ఎలక్ట్రానిక్స్ మీద మరో రకంగా ఏర్పడుతూ ఉంటుంది. ఒకదానికి ఉపయోగించిన ఆయుధం ఇంకో దానికి ఉపయోగించలేం. అమెజాన్ లో కి వెళ్తే దోమల మెష్ తుడవడానికి ఓ బ్రష్, కార్పెట్ తుడవడానికి ఇంకోటి ఇలా అమ్ముతాడు. కానీ మనం ఆ ట్రాప్ లో పడకూడదు. మా నాన్నగారు పాత దిండు గలీబు తో ఫాన్ తుడిచే వారు. ఇవి ఇండియా లో మనకే సాధ్యమైన జుగాడ్ చిట్కాలు.
కొంతలో కొంత చెత్త ఫర్వాలేదు. ఇంట్లో ఫంక్షన్ లాంటివి పెట్టుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది. లేకపోతే మామూలే. ఇంక మట్టి ... పిల్లలు, మొక్కలు, పెంపుడు జంతువులు ఉన్నప్పుడూ, వానాకాలం లోనూ వస్తుంది అనుకోవచ్చు. ఇవి కాక పొరపాటున కిందపడి పగిలిపోయేవి, పౌడర్ డబ్బాల్లాగా చిమ్మబడేవి, నూనెలాగా రుద్దిరుద్ది కడగాల్సి వచ్చేవి .. ఇలాంటివి బోనస్. చిట్కాలు అవసరం అయ్యే పనులు ఇవి!
ఈ మూడింటిని దాటితే ప్రత్యక్షమవుతాయి జీవులు... బొద్దింకలు, ఎలకలు, దోమలు, ఈగలు etc. నేను చచ్చిపోతాను.. మిమ్మల్ని కూడా తీసుకు పోతాను అనే సినిమా సైకోల్లాగా ఇవి పోవాలంటే మనక్కూడా ప్రమాదకరమైన కెమికల్స్ వాడాల్సిందే!
ఇంటికొచ్చిన ప్రతీ సామాను నువ్వు మెయింటైన్ చెయ్యాల్సిన ఇంకో వస్తువే అని తెలియడమే పెద్దరికమ్. ఇది తెలియక వస్తువులు కొనుక్కుంటూ వెళ్లిపోవడం కుర్రతనం. ఈ కుర్రతనమే ఫాబ్రిక్ సోఫా కొనమంటుంది. శిల్పారామం లో, హోమ్ సెంటర్ లో రకరకాల వస్తువులు కొనమంటుంది. మన దేశానికి సంబంధం లేని వాళ్ళు ఇళ్ళు ఎలా సద్దుకుంటారో చూసి వాళ్ళలాగా ఇల్లు సద్దుకోమంటుంది. వాళ్ళకి దుమ్ము తక్కువేమో.. అన్నీ ఓపెన్ గా ప్రదర్శించుకుంటారు. మన ఇళ్లలో ఒకేఒక షో కేస్ ఉంటుంది. అందులోనే అన్నీ పెట్టుకోవాలి. ఈ మధ్య ఈ రాగి పాత్రలు, ఇత్తడి బిందెలు,బాయిలర్లు హాల్లో పెట్టుకోవడం ఒక క్రేజ్. కానీ వాటిని అలా మెరిపించాలంటే రెగ్యులర్ గా చింతపండు తో తోముకుంటూ ఉండద్దూ! మళ్ళీ అదో పని!
అభిరుచి ఉండి, ఆసక్తి ఉండి, చేసుకోగలిగిన శక్తీ ఉంటే ఇవన్నీ పనుల్లా అనిపించవు. అలాంటి వారి ఇళ్ళు కూడా భలే చక్కగా చూడముచ్చట గా ఉంటాయి. May God bless them! అలాంటి ఓ ఆంటీ మాకు ఉన్నారు. ఆవిడ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో! మనిళ్ళలో ఓ వాడుక ఉంది చూడండి.. నేల మీద పడ్డ పాలెత్తుకు తాగచ్చు అని ... అలా అన్నమాట. ఇద్దరి ఇళ్ళకి ఒకే అమ్మాయి తడిగుడ్డ పెడుతుంది. కానీ ఆవిడ నేల మెరిసిపోతూ ఉంటుంది. మా నేల మీద తడిగుడ్డ పెట్టిన ఆనవాలు కనిపిస్తాయి. (ఇది ఓ మాప్ యాడ్ లాగా అనిపిస్తోంది కదూ. కానీ కాదు. మేము వాడే మాప్ కూడా ఒకే కంపెనీ.. ఎందుకంటే అది మా హెల్ప్ తనే తెచ్చుకుంటుంది) ఓ రోజు అంటీ ని అడిగితే చెప్పారు ... అమ్మాయి తడిగుడ్డ పెట్టాక ఆవిడ మళ్ళీ పెట్టుకుంటారట! ఇలా శ్రద్ధగా, ఓపిక గా చేసుకున్న ఇళ్ళు చూడగానే తెలుస్తూ ఉంటాయి.
ఓ వాడుక ఉంది చూసారా ... ఇల్లు చూసి ఇల్లాలిని చూడాలని.. చూడాలి, కానీ జడ్జ్ చెయ్యద్దు. ఇది నా పాయింటు. ప్రతి కుటుంబానికి ఓ లైఫ్ స్టైల్ ఉంటుంది. అది వారి పరిస్థితులని బట్టీ, ప్రయారిటీలని బట్టీ ఏర్పడుతుంది. అవి పూర్తిగా తెలుసుకోకుండా కేవలం ఇల్లు శుభ్రంగా లేదని ఒకరిని తక్కువ గా చూడకూడదు కదా.
ఇన్స్టాగ్రామ్ లో యూరోప్ కి చెందిన ఓ అమ్మాయి కి ఇళ్ళు క్లీన్ చెయ్యడం ఎంత ఇష్టమంటే వారాంతాల్లో వేరే వాళ్ళ ఇళ్ళు శుభ్రం చేసేస్తోంది. (ఆ అమ్మయి అకౌంట్ లింక్ ఇచ్చాను. పేరుకుపోయిన చెత్త చూడలేని సున్నితమైన సెన్సిబిలిటీ ఉంటే క్లిక్ చెయ్యకండి). వాళ్ళ ఇళ్ళలోకి బలవంతంగా దూరిపోయి కాదు లెండి. మానసిక పరిస్థితి బాలేకో, అంగ వైకల్యం వల్లో తమ ఇల్లు శుభ్రం చేసుకోలేక ఇల్లు చెత్త కుండీ లాగా అయిపోయిన వాళ్ళ ఇళ్ళు మంచి మనసు తో శుభ్రం చేసి పెడుతుంది. ఉచితంగానే. దేనితో ఏది తుడిస్తే ఎలా శుభ్రం అవుతుందో అనే కోర్స్ చేసింది కూడా ఆ అమ్మాయి! (మన దగ్గర హోమ్ సైన్స్ అంటారు... అది ఇలాంటి కోర్సెనా?). వారి దేశాల్లో మరీ పరిస్థితి ఘోరంగా ఉంది అని ఆ అమ్మాయి క్లీన్ చేసే ఇళ్ళు చూస్తే తెలుస్తుంది... మన దగ్గర మరీ పరిస్థితి అంత దిగజారదు.
దీనికి నాకు తోచిన ఓ కారణం ... ఇంటి శుభ్రత ని లక్ష్మి దేవి కి ముడిపెట్టేయడం. డబ్బులు మెండుగా ఉండాలంటే రోజూ ఇల్లు తుడుచుకోవాలి, పాచి చేసుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి అనేది మనకి బ్రెయిన్ వాష్ చేసేసారు. సాక్ష్యం కావాలంటే "ఉండమ్మా బొట్టు పెడతా" సినిమా చూడండి.
సొంత ఇళ్ళ వాళ్ళకి ఇల్లు వారిదే కాబట్టి శ్రద్ధ ఉంటుంది. అద్దె వాళ్ళకి ఇంటి వాళ్ళ భయం ఉంటుంది. ఇవేవీ లేకపోయినా పని చెయ్యడానికి డొమెస్టిక్ హెల్ప్ వ్యవస్థ ఉంది. వాళ్ళకి తోచినట్టు తుడిచి పెట్టేస్తారు.
పశ్చిమం లో మోటివేషన్ గురు లు ఈ మధ్య చెప్తున్నారు .. లేచాక వెంటనే పక్క శుభ్రంగా వేసేసుకోండి.. దాని వల్ల మీ రోజు బాగా గడుస్తుంది అని. ఇది ప్రత్యేకంగా చెపుతున్నారంటే వాళ్ళకి అలవాటు లేదా అనిపించింది నాకు. మన ఇళ్లలో పిల్లల వీపులు బద్దలు కొడతారు కదా పక్కలు తియ్యకపోతే! అది కూడా పొద్దున్నే!
నిజానికి శుభ్రంగా ఉన్న ఇల్లు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కొంత మంది విషయం లో ఈ మాట కి రివర్స్ కూడా పని చేస్తుంది. మనసు ప్రశాంతంగా అవ్వటానికి ఇల్లు క్లీన్ చేసే అలవాటు చాలా మందికి ఉంది మనలో. కానీ ముందు చెప్పినట్టు మానసిక స్థితి బాగోకపోతే అస్సలు ఇంటిని శుభ్రం చేసుకోలేం. ఆ పని భారంగా అనిపిస్తుంది. విసుగ్గా అనిపిస్తుంది. అలాగే కెరీర్ కొంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడు కూడా ఇంటి పని కి అస్సలు సమయం కేటాయించలేం. ఈగ ఇల్లలుకుతూ పేరు మర్చిపోయింది అనేది సామెత. ఇల్లలికే పనుల్లో పడితే పేరేంటి .. కెరీర్, వర్క్ గోల్స్ .. ఇవన్నీ మర్చిపోయే ప్రమాదం లేకపోలేదు.
ఇల్లలకడం అంటే గుర్తొచ్చింది... నేను ముందు చెప్పినట్టు ... ఈ ఇల్లు శుభ్రత విషయం లో బ్రెయిన్వాష్ చిన్నప్పుడే మొదలవుతుంది .. ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి .. అని మొదలవుతాయి కదా చిన్న పిల్లల ఆటలు. ఇల్లలకగానే పండగ కాదు అంటారు.. ఈ సామెత కి నాకు మొత్తం వ్యాసం లో ఎక్కడా సందర్భం కుదర్లేదు. ఊరికే పడుంటుంది అని రాస్తున్న అంతే 😄
ఇంటర్నెట్ లో ఇల్లు మైంటైన్ చెయ్యడానికి క్లీనింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. రోజూ గదులు తుడుచుకోవటం, వారానికోసారి బాత్రూమ్స్, నెలకోసారి మంచం దులుపుకోవడం, కర్టెన్స్ గట్రా మార్చుకోవటం.. ఇలా. కానీ ఈ షెడ్యూల్ ఇంటింటికీ మారుతుంది కదా. ఇంటి ముందు రోడ్డు వేసినా, కన్స్ట్రక్షన్ పని జరిగినా ఇంట్లోకి బోల్డు దుమ్ము, ధూళి వస్తుంది. అలాగే ఇంట్లో పిల్లలూ, పెంపుడు జంతువులూ ఉంటే ఆ షెడ్యూల్ వేరు! అందుకే అవి పెద్దగా ఉపయోగ పడవు మనకి. అలాగే వెస్ట్ వాళ్ళు కనిపెట్టిన వాక్యూం క్లీనర్లు, ఇల్లు తుడిచే రోబోలు కూడా మనకి పనిచేయవని నా అభిప్రాయం.
మన దగ్గర దీపావళి, ఉగాది లాంటి పండగలకి ఇళ్ళు నిగనిగలాడేలా చేసుకుంటాం. మంచు దేశాల్లో స్ప్రింగ్ క్లీనింగ్ అంటారు ... ఓహో ఓహో వసంతమా అంటూ బూజులు దులుపుకుంటారన్నమాట అక్కడి వారు.
ఇంటర్నెట్ లో అందరం చూసాం ఓ ఫార్వార్డ్ .. జపాన్ లో స్కూల్ పిల్లల కి టాయిలెట్స్ శుభ్రం చేయడం నేర్పిస్తారని. మన దగ్గర ఇది ఎంత పెద్ద వివాదం అవుతుందో నేను చెప్పక్కర్లేదు. గాంధీ సినిమా లో ఓ సీన్ ఉంటుంది... సబర్మతీ ఆశ్రమం లో టాయిలెట్స్ శుభ్రం చేసే పని వారానికి ఒకరు చెయ్యాలి. ఓ సారి కస్తూర్బా గారి వంతు వస్తుంది. ఆవిడ అస్సలు చెయ్యడానికి ఇష్టపడదు. గాంధీ ఆ సమయం లో ఆవిడ మీద కన్నెర్ర చేస్తారు కూడా!
సంపన్నుల ఇళ్లలో టీపాయ్ ల మీద, బల్లల మీద, గోడల మీద ఉండే ఖరీదైన గృహాలంకరణ వస్తువులు, ఇండోర్ ప్లాంట్స్ మీద ఆకులకి సైతం దుమ్ములేకుండా చూసినప్పుడు "తాజ్ మహల్ కు రాళ్ళెత్తిన కూలీలు" గుర్తొస్తారు నాకు. మనం సొంతగా మెయింటైన్ చేసుకోలేని ఇళ్ళు కట్టుకుని ఇంకో జాతి మీద మనం డిపెండ్ అయ్యి .. వారు మన మీద డిపెండ్ అయ్యేలా చేస్కున్నామని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కానీ నేను ఈ బ్లాగ్ ప్రశాంతంగా రాయగలుగుతున్నాను అంటే నా ఇల్లు శుభ్రం చేసుకొనే పని నుంచి నేను ఫ్రీ అవ్వడం వల్లే అని కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ విషయం గురించి మాట్లాడటానికి నా అనుభవం తక్కువ... ఇంటి మెయింటెనెన్స్ లాగే. 😁
Sunday, March 19, 2023
"పెంపకాలు" (ఈనాడు ఆదివారం లో నా కథ)
Wednesday, February 15, 2023
విశ్వనాథ్ గారికి స్మృత్యంజలి
విశ్వనాథ్ గారి తో నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పుకోవడం ఓ అదృష్టం గా భావిస్తున్నాను.
తెలుగు వారి గా పుట్టి విశ్వనాథ్ గారి గొప్పతనం తెలియకపోవడం అసంభవం. మన ఇళ్లలో పిల్లలకి పరిచయం చేసే తెలుగు సంస్కృతి లో ఆయన సినిమాలు, పాటలు, సన్నివేశాలు ఎప్పుడో ఓ భాగమైపోయాయి.
నా పోస్టు గా .. మా .. నీ.. లో విశ్వనాథ్ గారు సృష్టించిన సాగర సంగమం లో 'బాలు' పాత్ర గురించి రాసే అప్పుడు 'మొదటి సారి సాగర సంగమం ఎప్పుడు చూశానో గుర్తులేదు ... .. మొదటి ఆవకాయ ఎప్పుడు తిన్నానో గుర్తులేనట్లే' అని రాసుకున్నాను.
విశ్వనాథ్ గారి సినిమా ఆయన పాటల ద్వారా అమ్మ వల్ల పరిచయమయింది. విశ్వనాథ్ గారు అనగానే కొన్ని శంకరాభరణం .. తదనంతర సినిమాలు ఎక్కువ తలుచుకుంటాం కానీ అంతకు ముందు ఆయన తీసిన సినిమాలు అమ్మ మాకు చెప్పడం వల్ల బాగా తెలుసు. ముఖ్యంగా 'ఉండమ్మా బొట్టు పెడతా' 'చెల్లెలి కాపురం' 'శారద' ... ఇలా.
ఇంట్లో కర్ణాటక సంగీతం, సాహిత్యం .. ఈ వాతావరణం ఉన్నందువల్ల ఆయన సినిమాలు చిన్నప్పుడు పరిచయమయ్యాయి. పెద్దయ్యాక నేను సినిమా రంగం ఎంచుకోవడం వల్ల ఇంకొంత అనుబంధం పెరిగింది అని చెప్పవచ్చు. చిన్నప్పుడు నచ్చిన ఆయన సినిమాలు పెద్దయ్యాక అధ్యయనం చేసే అవకాశం కలిగింది.
ఒకప్పుడు నా నైజం ఎలా ఉండేదంటే నాకెవరైనా కళాకారులు బాగా నచ్చినా, వారి కళను నేను ఎంత admire చేసినా, వారిని కలవాలని అనుకొనే దాన్ని కాదు. కలిసినా మాట కలిపే దాన్ని కాదు. వారి కళ నాకెందుకు ఇష్టమో వారితో షేర్ చేసుకొనేదాన్ని కాదు. బిడియమో మొహమాటమో తెలీదు. 'వాళ్ళకి చెప్పేవాళ్ళు తక్కువుంటారా' అని కూడా అనిపించేది. కానీ నన్ను వారి కళ ఎలా ప్రభావితం చేసిందో అది నేనే చెప్పగలను అని తర్వాత తెలిసింది. నేను కళాకారిణి అయ్యాక మన కళ నచ్చి genuine గా ఎవరైనా appreciate చేస్తే ఆ మాటల విలువ ఏంటో కూడా తెలిసింది. కొంచెం ఓపెన్ అయ్యాను ఈ విషయంలో.
ఓ సినిమా ప్రివ్యూ లో విశ్వనాథ్ గారు నా వెనక సీటే. ఇంటర్వెల్ లో వెళ్లి ఆయన పక్కన కూర్చొని మాట్లాడేసాను. మా ఇంట్లో అనుకునే వాళ్ళం .. అయన పాత్రలు ఎప్పుడూ .. కూర్చొని డైలాగ్ చెప్పరు ... ఏదో ఒక పని చేస్తూ మాట్లాడతారు.. మనం నిజ జీవితం లో మాట్లాడినట్టే. మొక్కలకి నీళ్లు పోస్తూనో, కళ్ళజోడు తుడుచుకుంటూనో, ఏదైనా చాక్లెట్ రాపర్ విప్పి తింటూనో ... ఇలా. అదే ఆయనకి చెప్పాను. సినిమాల్లో దాన్ని 'బిజినెస్' అంటారు. ఓ పాత్ర ఏదో ఒక బిజినెస్ ఇవ్వడం. దాని గురించి మాట్లాడుకున్నాము.
ఇంట్లో ఇంకో విషయం కూడా అనుకొనే వాళ్ళం .. ఆయనకి సంగీతం వచ్చేమో .. అందుకే ఇంత బాగా అర్ధం చేసుకుంటారు కళాకారులని .. అందుకే అంత మంచి సంగీతం కూడా బయటికి వస్తుంది అని. అదే మాట ఆయన్ని అడిగా. నాకు రాదు కానీ ఇయర్ (చెవి) ఉంది .. నేను సంగీతాన్ని బాగా గ్రహించగలను అన్నారు.
స్వాతి కిరణం లో మమ్ముట్టి లాంటి క్యారెక్టర్ కళాకారుల జీవితం లో చాలా పరిచయమైన పాత్రే. అన్ని రంగాల్లో లాగే ఇక్కడ అసూయ ఉంటుంది. కానీ ఆయనకి అలాంటి వ్యక్తి ఎవరైనా తెలుసా అని అడుగుదామనుకున్నా. కుదర్లేదు.
ఇంతలో ఎవరో బిస్కెట్లు తెచ్చిచ్చారు ఆయనకి టీ తో పాటు. ఆయన 'ఈ బిస్కెట్లలో ఏది బాగుంటుంది' అన్నారు. గ్లూకోజ్ బిస్కెట్లు వద్దు, కుకీ లాంటివి తీస్కోండి అని అవి తీసిచ్చా. ఆయనకి ఇచ్చిన వాటిలో నాకోటి ఇచ్చారు. నేను ఆ కుకీ ని తినకుండా ఫోటో తీస్కొని నా బాగ్ లో పెట్టుకున్నా చాలా రోజులు. (ఆ ఫోటో దొరకలేదు ఏంటో .. హార్డ్ డిస్కులు వెదికినా). నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని అని చెప్తే.. నన్ను పెట్టి సినిమా తియ్యి మరి అన్నారు. బాలు ని మాధవి తిట్టినట్టు నేను ఎంత మాడెస్ట్ అంటే 'ఆ.. నేను ఆయన్ని పెట్టి తియ్యడమేంటి' అని నవ్వుకున్నాను. పిచ్చి దాన్ని.
నేను బిడియం వదిలి ఇంత మాట్లాడటమే ఎక్కువ. ఇంక పరిచయం ఏర్పరుచుకోవడం ఇవన్నీ తెలీదు. అందుకే ఆ తర్వాత గ్యాప్ వచ్చింది.
లక్కీ గా మరో సారి జీవితం ఇంకో అవకాశం ఇచ్చింది. ఈ సారి గాయని గా.
అక్కా, నేను బాపు రమణ గారి స్మృతి సభలో 'సా పా సా' చేసాం . (అంటే ఒక థీమ్ తీస్కొని దాని గురించి మాట్లాడుతూ పాటలు పాడతాం అన్నమాట) అక్కడ మమ్మల్ని విన్న ఒకాయన విశ్వనాథ్ గారి ఇంట్లో ఆయన పుట్టిన రోజు సందర్బంగా మా కచ్చేరి పెట్టించారు. విశ్వనాథ్ గారి ముందు పాడటానికి మేము ఎంచుకున్న థీమ్ 'విశ్వనాథ శ్రీకృష్ణ తత్వం'. ఆయన సినిమాల్లో కృష్ణుడి మీద పాటల్ని ఎంచుకొని 'సా పా సా' చేసాం. అక్కడ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి లాంటి ఒక గూటి పక్షులు చాలా మంది ఉన్నారు ఆ రోజు. వారి ముందు వారి పాటల గురించి మేము వివరిస్తూ పాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.
విశ్వనాథ్ గారి సినిమాలు, వాటిలో సంగీతం మాకు ఎంత విలువైనదో, అది మాకు ఎంత ఇష్టమో ఆయనతో స్వయంగా షేర్ చేసుకున్న మధుర క్షణాలవి. అంత కన్నా ఓ అభిమాని కి ఏం కావాలి?
మళ్ళీ పిచ్చి 'మాడెస్టీ' వల్ల 'ఆ .. ఆయన ఎంత గొప్ప కళాకారులని వినలేదు .. మనం కూడా ఈ రోజు తర్వాత మళ్ళీ కలుస్తామా ఏంటి' అనుకున్నాం. కానీ ఆ తర్వాత విశ్వనాథ్ గారి గణం లో ఆయన మమ్మల్ని లెక్కపెట్టేసుకున్నారు ఆ రోజు నుంచి!
ఆయన కి 'దాదాసాహెబ్ ఫాల్కే' ప్రకటించిన రోజు మళ్ళీ ఆయన నుంచి పిలుపు వచ్చింది. ఆరోజు ఖర్మ కాలి మేము ఇంకో చోట కి వెళ్లాల్సిన పరిస్థితి. మళ్ళీ మేము 'ఆ.. ఇంత మంది లో మనని పట్టించుకుంటారా ... ఆయనకి అభినందనలు చెప్పి జారుకోవచ్చు' అని అనుకున్నాం. సబిత గారు (సప్తపది లో హీరోయిన్) అంటూనే ఉన్నారు .. ఆయన పాడకుండా మమ్మల్ని పంపించరు అని. అదే జరిగింది. అభినందనల వెల్లువ మధ్యే ఎన్నో పాటలు పాడించుకున్నారు. మాకు ఆ పాటల వెనక కథలు చెప్పారు. మేము తొందరగా వెళ్ళాలి అని తెలిసి అలిగారు కూడా! కార్యక్రమం అయ్యాక 'ఇంక మీరు పరిగెత్తండి' అన్నారు. మేము ఆ రెండో చోటకి వెళ్లలేకపోయాం. ఏం నష్టం లేదు అనిపించింది. ఇదే ముఖ్యం అనిపించింది.
విశ్వనాథ్ గారితో ఇంకో అనుభవం ... ఆయన తో కూర్చొని స్వర్ణ కమలం చూడటం. ఆ రోజు సినిమా స్క్రీనింగ్ అయ్యాక మా ఫామిలీ తో కూర్చొని మా అమ్మ గారిని కూడా పాడమని ఎన్నో పాటలు పాడించుకున్నారు.
విశ్వనాథ్ గారి వల్లే సీతారామశాస్త్రి గారి ప్రేమ ను కూడా పొందే అవకాశం కలిగింది. ఆయన ఏదో ఇంటర్వ్యూ లో మా ఇద్దరి సిస్టర్స్ గురించి ప్రస్తావించారని విన్నాను. మేము విశ్వనాథ్ గారి ముందు పాడిన మొదటి సారి ఆయనే శాలువాలు కప్పి సత్కరించారు. ఎంత భాగ్యం!
కోవిడ్ తర్వాత విశ్వనాథ్ గారిని ఇంక కలిసే అవకాశం కలగలేదు. సముద్రం దగ్గర ఎంత సేపు కూర్చున్నా తనివి తీరనట్టే వారిలాంటి కళాకారుల దగ్గర ఎన్ని సార్లు సమయం గడిపినా సరిపోదు. కానీ నాకు ఆయన తో దొరికిన జ్ఞాపకాల విలువ తెలుసు. అందుకే తృప్తి గా ఉంది.
విశ్వనాథ్ గారు ఎంత గొప్ప దర్శకులో నాకన్నా పెద్దవారు ఇంకా బాగా చెప్పగలరు. కానీ ఆయన నాకేంటో నేనే చెప్పగలను.
సినిమా కి నేను ఆకర్షితురాలిని అయ్యాను అంటే అది ఆయన సినిమాల వల్లే. సంగీతం, సాహిత్యం, నృత్యం .. వీటిలో పెరిగిన నాకు .. ఆయన సినిమాలు చాలా బాగా అర్ధమయ్యేవి .. ఆ హాస్యం.. ఆ కథలు..
ఓ మంచి సినిమా తన రహస్యాలన్నీ ఒకే సారి విప్పదు అని ఓ కొటేషన్ ఉంది. విశ్వనాథ్ గారి సినిమా అలాంటిదే. వయసు పెరిగే కొద్దీ ఆయన సినిమాల్లో ఇంతకు ముందు చూడని, అర్ధమవ్వని అంశం ఇంకోటేదో కనిపిస్తుంది. ఆయన సినిమాల మీద థీసిస్ రాసేంత మ్యాటర్ ఉంది అక్కడ.
సినిమా తియ్యాలనుకుంటున్న ఓ వర్ధమాన దర్శకురాలిగా ఆయన దగ్గర్నుంచి నేను నేర్చుకున్నది చాలా ఉంది. నీకు తెలిసిన కథ .. నువ్వు చెప్పాలనుకున్న కథ .. అది మార్కెట్ లో ట్రెండ్ లోనిది కాకపోయినా సరే .. అది తియ్యాలి అనే ధైర్యం ఆయనే ఇచ్చారు.
వంద కోట్లు వసూల్ చేసిన సినిమా గురించి మహా అయితే ఐదేళ్లు చెప్పుకుంటాం. ఈ లోపు దాని రికార్డ్ ని ఇంకో సినిమా బద్దలు కొట్టేస్తుంది. కానీ విలువలున్న సినిమా ఎంత కాలమైనా నిలబడుతుంది అని అనడానికి ఆయన సినిమానే సాక్ష్యం. ఇప్పటికీ క్లాస్ సినిమా మాస్ హిట్ అయింది అంటే శంకరాభరణం ఒక్కటే ఉదాహరణ ఏంటో.
ఈ మధ్యే ఓ ఇంగ్లీష్ పదానికి అర్ధం తెలుసుకున్నాను. seminal .. సెమినల్ . సెమినల్ వర్క్ అంటే .. దాని తర్వాత ఎన్నో మార్పులకి కారణమైంది అని అర్ధమట. ఆయన సినిమా కి ఇదే కరెక్ట్ పదం.
'అడుగడుగున గుడి ఉంది' పాట మా అమ్మగారు సంగీతం పిల్లలకి ఇప్పటికీ నేర్పిస్తారు .. కీర్తనలు, కృతులతో బాటు. ఆయన సినిమా పాటలు సంప్రదాయ కృతి కీర్తనలకు దీటుగా ఉంటాయి మరి!
ఆయన స్మృతులతో ఓ వీడియో చేసాం. ఆయన ముందు పాడిన 'విశ్వనాథ కృష్ణ తత్వం' కొంత భాగం కూడా ఇందులో చూడచ్చు.
ప్రభావశీలురైన ఇటువంటి మహనీయులు వెళ్ళిపోయాక .. ఓ శకం ముగిసింది అంటాం. కానీ ఈ శకం ముగియకూడదు. ఆయన చూపించిన విలువల సినిమాలు ఇంకా రావాలి. ఇదే నా ప్రార్ధన.
Tuesday, January 31, 2023
నేను పాడిన ఓ ఘజల్
ఘజల్స్ కి సంబంధించి ఇంతకు ముందు ఓ రెండు మూడు పోస్ట్స్ రాసాను.
ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ ,
అలాగే ఘజల్స్ నుంచి వచ్చిన ఓ తెలుగు సినిమా పాట ని విశ్లేషించిన మూడు పాటల కథ ఇవి తెలిసే ఉంటాయి.
యూ ఉన్ కీ బజ్మ్ మే ఖామోషియో నే కామ్ కియా
సబ్ హీ నే మేరీ మొహబ్బత్ కా ఏతరాం కియా ..
ఇలా సాగుతుంది ఆ ఘజల్.
ఆ వీడియో లోనే ఘజల్ అర్ధం కూడా ఉంటుంది.
నేను రెండు మాత్రం పాడాను. మొదటిది, ఆఖరిది.
Tuesday, January 24, 2023
చదువులలో మర్మమెల్ల ...
ఈనాడు ఆదివారం లో నా కథ 'గాజు గోడ'
కార్పొరేట్ ప్రపంచం లో గ్లాస్ సీలింగ్ అనే చేదు నిజం ఉంది. విమెన్ ప్రొఫెషనల్స్ ని ఒక స్థాయి ని మించి ప్రోమోట్ చెయ్యకపోవడం ... అంటే అప్పర్ లెవె...
-
మొత్తానికి ఇంకో కథ రాసానండి. ఈనాడు ఆదివారం సంచిక వారు ప్రచురించినందుకు కృతజ్ఞతలు. ఇదిగో, ఇక్కడ షేర్ చేస్తున్నా.
-
చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టంగా చదివే ఈనాడు పుస్తకం లో నా కథ రావడం నా జీవితం లోని ఆనందాల్లో ఒకటి. ఆ కథ చదివి నన్ను ఆన్లైన్ లో వెతికి మ...
-
ఓ రాత్రి రేడియో లో 'ఉమ్మడి కుటుంబం' సినిమా లోని సతీ సావిత్రి స్టేజీ నాటకం సీన్, పాట వినపడింది. అది వింటుండగా సతీ సావిత్రి కథ మీద దృష...









.jpeg)
.jpeg)