Sunday, August 2, 2026
ఈనాడు ఆదివారం అనుబంధం లో నేను రాసిన కథ 'అద్దె కి ఆకాశం'
Sunday, May 31, 2026
ఈనాడు ఆదివారం లో నా కథ ‘సప్తపది’
ఈ టాపిక్ మీద ఓ బ్లాగ్ రాసాను ఇదే టైటిల్ తో… https://sowmyavadam.blogspot.com/2025/11/blog-post.html
కానీ ఈ విషయం ఇంకా విస్తారంగా అందరికీ తెలియచెయ్యాలనే తపన తో ఓ కథ రూపం లో చెప్పాలనుకున్నాను. కొంచెం ఛాలెంజింగ్ గానే అనిపించింది ఈ పని. వ్యాసం లో లాగా ప్రశ్నలు రాసేయ్యలేం. అలాగే ఈ విషయం లో ప్రశ్నలు తెలియడమే ముఖ్యం. సమాధానాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా తెలుసుకుంటే చాలు.
ఎప్పట్నుంచో ఎక్కడో అక్కడ ప్రస్తావించదలచుకున్న ఇంకో విషయం… సోక్రటీసు, అతని ‘గయ్యాళి’ భార్య గురించి.
ఈ రెండు విషయాల వల్ల ఈ కథ బాగా తృప్తినిచ్చింది.
లింక్ ఇదిగో.
https://www.eenadu.net/telugu-article/sunday-magazine/sunday-item/7/326000617Sunday, December 14, 2025
ఈనాడు ఆదివారం లో నా కథ 'గాజు గోడ'

కార్పొరేట్ ప్రపంచం లో గ్లాస్ సీలింగ్ అనే చేదు నిజం ఉంది. విమెన్ ప్రొఫెషనల్స్ ని ఒక స్థాయి ని మించి ప్రోమోట్ చెయ్యకపోవడం ... అంటే అప్పర్ లెవెల్ మేనేజ్మెంట్ లో వారిని ఎంపిక చేయకపోవటం. అది కూడా కావాలని చూపించే లింగ వివక్ష. ఇది ఛేదించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆడవారికి ఎంతో కాలం పట్టింది. ఈ పోరాటం తర్వాతే ఇప్పుడు ఎక్కువ మంది మహిళా సి ఈ ఓ లని చూస్తున్నాం.
చాప కింద నీరు లాగ ఉండే ఇలాంటి వివక్ష ని పట్టుకోవడం కష్టం. ఇలాంటిదే ఇంకో రకం ... ఉన్నత విద్య అభ్యసిస్తున్న మహిళలు అదే సంఖ్య లో వర్క్ ఫోర్స్ లో కి రాకపోవటం. కాలేజీ లో కనిపించే సమానత ఆఫీసుల్లో కనిపించదు. దీని గురించి చదివాను ఎప్పుడో. చుట్టూ ఎన్నో ఉదాహరణలు చూసా కూడా. ఈ పాయింట్ మీద కథ రాయాలనిపించి రాసినదే 'గాజు గోడ'.
నేను రాసిన 'పెంపకాలు' కథ చదివి ఓ స్నేహితురాలు అన్నది ... "ఎండింగ్ మరీ పాజిటివ్ గా రాసావు" అని. ఒప్పుకుంటాను. మగవారిని మారే శక్తి ఉన్న వారి గా చూడటం నాకు ఇష్టం. నా చుట్టూ అలాంటి కొంతమంది మంచి మగవారిని చూసిన ఎఫెక్ట్ కూడా అయ్యుండొచ్చు.
కథ లింక్ .. ఇక్కడ ఇస్తున్నాను ... గాజు గోడ

Monday, November 10, 2025
సప్తపది
"Before you get married... discuss bills, parenting styles, credit, debt, religion, how to deal with family, what beliefs will be instilled in your children, childhood traumas, sexual expectations, partner expectations, financial expectations, family health history, mental health history, bucket list, dream home, careers and education, political views and whatever else comes to mind. Love alone is not enough"
పెళ్ళవ్వక ముందు 'అన్నీ' మాట్లాడుకోవాలి అంటారు కానీ ఇంత స్పష్టంగా ఆ 'అన్నీ' ఏంటో ఎవరూ చెప్పలేదు కదా.

కొన్నేళ్ల క్రితం అసలు ఈ ఆలోచనే సాధ్యం కాదు. కట్నాలు/కన్యా శుల్కాలూ, ఆస్తి కాపాడుకోవడానికి చేసే మేనరికాలు, మగవాడి జీవితానికి ఓ సపోర్టింగ్ క్యారెక్టర్ ని అతికించి 'పెళ్ళి' అని పేరు పెట్టే సంప్రదాయాల మధ్య ఈ ప్రశ్నలు అడిగే చోటెక్కడిది? ‘వంద అబద్ధాలు ఆడైనా పెళ్ళి చేసెయ్యాలి’ అనే వాడుక ఉన్న సంస్కృతి లో ఇంత నిజాయితీ గా మాట్లాడుకోడానికి అవకాశం ఎక్కడ? అప్పుడు పెళ్ళి నుంచి బైటికి రావటం సులభం కాదు కదా... ఊహాతీతం. అందుకే ఇలాంటి వాడుకలు వచ్చాయి అనుకుంటాను. ఈ వంద అబద్ధాల బారిన పడి పెళ్ళి తర్వాత ఎంత మంది మనసు చంపుకొని రాజీ పడిపోలేదూ?
ఇప్పుడు వివాహ వ్యవస్థ అలా లేదు. చాలా పోరాటాల తర్వాత వివాహం ముఖ్యోద్దేశం లో భారీ మార్పులు వచ్చాయి. చదువుకుని సంపాదించుకొనే అమ్మాయి/అబ్బాయి కి కేవలం జీవితం లో తోడు కోసం, ఓ కుటుంబం ఏర్పడటం కోసమే పెళ్ళి అవసరం ఇప్పుడు. మగవారికి పని మనిషి/వంట మనిషి స్థానం లో, ఆడవారికి ఏ టీ ఎమ్ గా మగవారు ఇప్పుడు అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలు గా వివాహ వ్యవస్థ లో వచ్చిన మంచి సంస్కరణ ఇది.
ఈ తరుణం లో ఇప్పుడు వివాహానికి సిద్ధపడుతున్న ఆడవారికి మగవారికి ఎంతో గైడెన్స్ అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకూ ఉన్న అనుభవాలూ, ఇన్ఫర్మేషన్ పాతబడిపోయాయి. ఇప్పుడు అమ్మాయిని కానీ అబ్బాయి ని కానీ 'ఓర్పు వహించు' అనలేం. 'కాంప్రమైజ్' అనే మాట వింటేనే చిర్రెత్తుకొచ్చేస్తుంది ఈ తరానికి .. తమ తల్లిదండ్రుల ని, చుట్టుపక్కల దాంపత్య జీవితాలని దగ్గరగా చూస్తూ పెరిగిన వీళ్ళకి ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. తమ ముందు తరాల వారు పడిన బాధ ఇంక మేము పడం అని.
అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. ఇన్ని సమస్యలున్నా మన వివాహ వ్యవస్థ ఇంకా నిలబడి ఉంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
దీని గురించి 'ప్రియమైన ఆవార్ గీ' https://udayini.com/2025/05/15/priyamaina-avargi/లో నేను ఇలా రాసాను
"ప్రేమ లోని మృగత్వాన్ని మచ్చిక చేసుకొని తమ అధీనం లో కి తెచ్చుకోవడమే పెళ్ళి అనే పద్ధతి కి నాంది ఏమో? అలాగే వదిలేస్తే ప్రేమ ఓ అడవి జంతువు. వావివరసలు, సమయాసమయాలూ, హద్దులూ ఏవీ తెలీని ఓ విశృంఖల శక్తి. దాని మెడకో బరువు, ముక్కుకో తాడూ వేసి ఓ జత ని వెదికి … ఇద్దరూ ఏదైనా పనికొచ్చేది చెయ్యండని సంసారవ్యవసాయం లో కి దింపారేమో పెద్దవాళ్ళు. ఇదిగో … వీడ్ని ప్రేమించచ్చు. వీడు నీ కుటుంబానికి కూడా నచ్చాడు. వీడి తో నువ్వు ఏ హద్దూ పెట్టుకోక్కర్లేదు. వీడి తో నీ ప్రేమ కి ఓ గమ్యం ఉంది. అది పిల్లలైనా, ఇద్దరికీ సమానంగా ఉన్న ఆశయాలైనా. ఇలా పెళ్ళి ని డిజైన్ చేశారేమో."
ఐడియల్ గా పెళ్ళి చాలా మంచి అరేంజ్మెంట్. ఓ జంట కి సెక్యూరిటీ - ఆస్తి పాస్తుల విషయాలలో, శారీరక సంబంధాల విషయం లో, దైనందిన జీవితాన్ని సాఫీ గా గడిపే విషయం లో, సంతానాన్ని కని పెంచే విషయం లో... ఇలా. మళ్ళీ ఆ సంతానానికి కూడా అన్ని విధాలు గా భద్రత కల్పిస్తుంది ఈ వ్యవస్థ.
మనుషుల మనస్తత్వాలలో, కుసంస్కృతుల్లో సమస్యల వల్ల ఇంత మంచి వ్యవస్థ కి చెడ్డ పేరొచ్చేసింది. జగ్గీ వాసుదేవ్ గారు అన్నారు.. వివాహానికి ప్రత్యామ్నాయం చూపెట్టండి.. అది దీనికంటే బాగుంటే ఇది తీసెయ్యండి అని. ఈ వ్యవస్థ ని సంస్కరించుకోగలిగామే కానీ ఇప్పటి వరకూ దీనికి ప్రత్యామ్నాయం ఏమీ కనిపెట్టలేకపోయాం కదా మనం. అందుకే నాకెప్పుడూ భయం వేయదు .... భవిష్యత్తు లో ఈ వ్యవస్థ ఉండదేమో అని.
ఇందులో నాకు తమాషా గా అనిపించే ఇంకో విషయం... LGBT కమ్యూనిటీ ల లో వారు వివాహం చేసుకొనే హక్కు కోసం పోరాడటం! 'మాకు కూడా వివాహం చేసుకొని కుటుంబం గా మారే హక్కు ని ఇవ్వండి' అని అడగటం ఈ వ్యవస్థ విజయం అనుకుంటాను.
పెళ్ళి లోనే మొదటి సారి చూసుకొనే రోజుల నుంచి పెద్దవాళ్ళే 'టైం స్పెండ్ చెయ్యండి పెళ్ళి కి ముందు' అని పర్మిషన్ ఇస్తున్న ఈ రోజుల వరకూ వచ్చాము. బానే ఉంది. కానీ నా అనుభవం లో, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొనే జంటలు చాలా తక్కువ. ఎలా ఉపయోగించుకోవాలో తెలీక పోవడం దానికి ముఖ్య కారణం అనిపిస్తుంది.
ఫోన్ కాల్స్ లోనో డేట్స్ లోనో ఏం మాట్లాడుకోవాలో తెలీక ... నువ్వు చెప్పంటే నువ్వు చెప్పని మాట్లాడుకొనే మాటలని స్వీట్ నథింగ్స్ అంటారు కదా. ఈ నథింగ్స్ మధ్య కొన్ని సంథింగ్స్ జొప్పించాల్సిందే.
ఈ సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసినప్పుడు దొరికిన అంశాలతో సప్తపది అని 'ఆరున్నొక్క' అత్యవసరమైన విషయాల తో ఓ లిస్టు తయారు చేసాను. (శుభమా అని పెళ్ళి అనుకుంటుంటే ఏడు అని ఎందుకు అనడం అని 😆)
సప్తపది
1. ఆర్ధికం - డివోర్స్ లాయర్స్ ని అడగండి... ఎన్ని వివాహాలు ఈ ఒక్క విషయం లో మనస్పర్ధలతో కూలిపోతున్నాయో. ఇద్దరూ సంపాదిస్తున్నా ఇలా జరుగుతోంది అంటే డబ్బు కాదు సమస్య... అవి ఎలా ఖర్చు పెట్టాలో ఓ దిశా నిర్దేశం లేనితనం వల్ల వస్తున్నాయి సమస్యలు. ఇద్దరిలో ఒకరే సంపాదిస్తున్నారనుకుందాం, అప్పుడు కూడా ఇద్దరికీ తెలియాల్సిన విషయం .... ఆ డబ్బు ఇద్దరిదీనూ. నిర్ణయాలు తీసుకొనే హక్కు ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరూ ఒక టీమ్ కాబట్టి. అప్పటి వరకూ వారి ఆర్ధిక అలవాట్లు ఏంటి, అందులో ఇంకొకరికి నచ్చనివి ఏంటి.... ఇవన్నీ తప్పకుండ మాట్లాడుకోవాలి. ఇద్దరిలో ఎవరి పేరు మీదైనా అప్పులు, ఆర్ధికపరమైన కమిట్మెంట్స్ ఉన్నాయా? ఇవి పారదర్శకంగా మాట్లాడుకోవాలి. ఇలాంటి విషయాలు ఒకరి గురించి ఒకరికి స్పష్టంగా తెలిసినప్పుడు పెళ్ళయ్యాక గొడవలు జరిగినా, విడదీసేంత సమస్య అవ్వదు.
2. కుటుంబ పరిధులు - డబ్బు తర్వాత ఎప్పుడూ వచ్చే సమస్య .. కొత్త గా కలుపుకున్న బంధాలతో నే. 'ఇన్ లా' ల తో గొడవలు. ఒక విషయం గుర్తు చేస్తే చాలా మంది షాక్ అవుతారు. పెళ్ళయ్యాక ఆ మొగుడూ, పెళ్ళామే కుటుంబం అంటే. మిగిలిన వాళ్ళందరూ బయట వాళ్ళే. తల్లిదండ్రులతో సహా. ఈ విషయం ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ముందు వీరిద్దరికీ తెలియాలి. తమ తల్లిదండ్రుల లో ఇబ్బంది కలిగించే స్వభావాలు పిల్లలుగా తెలిసే ఉంటాయి. అయినా భాగస్వామి ఆ లోపాల కి గురై బాధ పడకుండా ప్రొటెక్ట్ చెయ్యరు ఎందుకు? ఇక సమస్యలు ఏమీ లేని తల్లిదండ్రుల విషయం లో అయినా వారి వృద్ధాప్యం విషయం లో ఓ అభిప్రాయానికి ముందే రావాలి. కనీసం మాట్లాడుకోవాలి. తమ మీద ఆధారపడిన వారి గురించి ... చిన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ... వారి బాధ్యతలూ .... ఇవి భాగస్వామి కి ముందే తెలియాలి. (పెళ్ళి పుస్తకం లో సీన్ గుర్తుందా?)
3. పిల్లలు - ఒకప్పుడు 'ఎంత మంది' అనేదే ప్రశ్న. ఇప్పుడు అసలు కావాలా వద్దా అనే ఛాయిస్ కూడా తీసుకుంటున్నారు నవ తరం దంపతులు. పిల్లలు కావాలి అనుకున్నప్పుడు వారిని ఏ విలువల తో పెంచాలనే ఉద్దేశ్యాలు ఒకరికొకరు బాగా అర్ధం చేసుకోవాలి. అప్పుడు పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా, ఇంట్లో టాక్సిక్ గొడవలు లేని వాతావరణం లో పెరగగలుగుతారు. ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండే తల్లిదండ్రులనే కాక ఆ గొడవలు సామరస్యంగా తీర్చుకొనే తల్లిదండ్రులని చూసి పెరుగుతారు. తమ వంతు వచ్చాక పెళ్ళి అనే వ్యవస్థ ని వ్యతిరేకించరు.
4. ఎలా కొట్టుకోవాలి - ఇది నేను చదివినప్పుడు నాకు చాలా అబ్బురమనిపించింది. ఇది భార్యాభర్తలు కాదు .... ఏ బంధం లో ఉన్న వారైనా తెలుసుకోవాలి. జీవితాన్ని పంచుకునే క్రమం లో గొడవలు తప్పవు. ఇది అందరికీ తెలుసు. ఆ గొడవల్ని స్ట్రెస్ కి గురవ్వకుండా ఎలా తీర్చుకోవాలి అనే విషయాలలో ఎడ్యుకేట్ అవ్వాలి. గొడవ పడుతున్నప్పుడు భార్య vs భర్త గా ఉంటున్నారా? భార్య, భర్త vs సమస్య గా ఉంటున్నారా? రెండో విధం లో ఒకరినొకరు కోపం లోనైనా బ్లేమ్ చేస్కోవడం, హర్ట్ చేస్కోవడం ఉండదు. సమస్య ఆల్రెడీ బాధ పెడుతోంది ... నా పార్ట్నర్ కూడా బాధపెడితే ఎలాగ? అనుకోవక్కర్లేదు. సారీ ఎలా చెప్పాలి (...https://sowmyavadam.blogspot.com/2020/02/blog-post.html) తెలుసుకోవాలి. ఇంకా చాలా టూల్స్ ఉంటాయి ... ఈ సాధనాలు గొడవల్లోని వైషమ్యాన్ని తీసేస్తాయి. డ్రామా ని తీసేస్తాయి. అప్పుడు సమస్య స్పష్టంగా కనిపిస్తుంది.త్వరగా తీరుతుంది.
5. వ్యక్తిగత బలాలు/బలహీనతలు - ఒక అమ్మాయి విపరీతంగా షాపింగ్ చేస్తుంది, ఆమె క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడూ మాక్స్ అవుట్ అయ్యే ఉంటాయి... ఒకబ్బాయి ఎంత అనుకున్నా మందు మానలేడు... ఒకరికి ఫ్రెండ్స్ అటాచ్మెంట్ ఎక్కువ.. ఇంకొకరికి కోపమెక్కువ... ఇవి వ్యక్తిగత లోపాలు. పెళ్లయ్యాక ఏదో మంత్రం వేసినట్టు ఎవరూ మారిపోరు. నటిస్తారంతే. కొన్నాళ్ల కి ఆ నటన మానేస్తారు. ఇంక గొడవలు. పార్ట్నర్ కోసం మారకూడదు. నేను ఇలాంటిదాన్ని/ఇలాంటివాడ్ని అనే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. మన తో బ్రతకడానికి వచ్చిన వారికి ఇది నిజాయితీ గా చెప్పాలి. మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే విఫలమైనా పక్క వారికి తెలుస్తూ ఉంటుంది మీ ప్రయత్నం లో నిజాయితీ. ఒకరి తో జీవితం పంచుకోడానికి, వారి లోపాలని భరించడానికి ఈ నిజాయితీ చాలా సహకరిస్తుంది.
6. ఆరోగ్యం - ఒక భార్యా భర్తా ఉన్నంత క్లోజ్ గా ఇంకెవరూ ఉండరు భూమ్మీద. ప్రతి రోజూ ప్రతీదీ పంచుకోవాల్సిన వారు తమ ఆరోగ్యాన్ని గురించిన జెనెటిక్ సమస్యలు కానీ, ఇంకే విషయమైనా కానీ మాట్లాడుకోవాల్సిందే. ఇదే టాపిక్ లోకి వస్తుంది శారీరక బంధం. సెక్స్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేని దేశం మనది. సినిమాలో చూసిందే రొమాన్స్, నీలి చిత్రాలలో చూసిందే సెక్స్. పెళ్ళి కి ముందు ఈ కోణం లో తమకేం కావాలి తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. కానీ ఓ పార్ట్నర్ దొరికినప్పుడు వారి ఊహలకి మన ఊహలని మ్యాచ్ చేసుకుంటే చాలు కదా. కొంత మందికి అస్సలు సున్నితమైన భావాలు ఉండవు. అలాంటి వారికే రొమాంటిక్ గా ఆలోచించే పార్ట్నర్ దొరికితే ఎంత నరకం? ఇంకొకరి తో రొమాంటిక్ గా ఉండటం ఇల్లీగల్ మళ్ళీ! (నాకు తెలిసిన ఓ అబ్బాయి కి పెళ్ళి కుదిరింది. ఎంగేజ్మెంట్ జరిగింది. కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసింది అని తెలిసింది. అబ్బాయి మాకు తెలుసు .... అలవాట్లు లేవు, సంపాదనా పరుడు ... ఎందుకు అలా జరిగింది అని ఆరా తీస్తే .. ఆ అమ్మాయి సరదాగా మెసేజెస్ పంపిస్తే ఒక్క దానికీ రిప్లై ఇవ్వలేదట. కొంచెం కూడా రొమాన్స్ చూపించలేదట. ఆ అమ్మాయి 'నాకిలాంటబ్బాయి వద్దు' అని చెప్పేసిందట ధైర్యంగా. నాకైతే ఆ అమ్మాయి చాలా నచ్చింది. ఓ జీవితకాలపు నరకాన్ని తానూ తప్పించుకుంది... అతనికీ తప్పించింది!)
ఈ విషయాలు అసలు మాట్లాడుకోక 'గే' అయిన మగవారికి బలవంతంగా అమ్మాయినిచ్చి పెళ్ళి చేయడం, సెక్స్ అడిక్ట్స్/పర్వర్ట్స్ చేతిలో అమ్మాయిలు నరకం అనుభవించడం, పీడో ఫైల్స్ తమ సంతానాన్నే టార్గెట్ చెయ్యడం .. ఈ దారుణాల కి కారణం.. పెళ్ళి కాక ముందే కనీసం ఈ పార్శ్వాన్ని తట్టకపోవడం. ఎంత సున్నితమైన విషయమో... అంత అప్రమత్తంగా ఉండాల్సిన విషయం కూడా.
7. జీవితోద్దేశం - ఎందుకు బ్రతుకుతున్నాం అని ఇద్దరూ ఒక మాట అనుకోవాలి. నాకు తెలిసిన ఓ జంట ఉన్నారు. పెళ్ళి చేసుకొనే సరికి ఇద్దరికీ అంత చదువూ సంపాదనా లేదు. కానీ ఇద్దరూ ఒకరికొకరు రెండు విషయాలు ప్రామిస్ చేసుకున్నారట. ఒకటి, మనం పెళ్లయ్యాక కూడా ఎదుగుతూనే ఉందాం .... చదువుకుందాం, సంపాదన పెంచుకుందాం. రెండోది... ఎప్పుడూ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గానే ఉందాం .... ఈ లంపటాల్లో పడిపోయి మన మధ్య ప్రేమ ని పాతపరుచుకోవద్దు అని. వారి తోబుట్టువుల్లోనే డైవర్స్ లూ, రకరకాల సమస్యలూ ఉన్నా వీరి దాంపత్య జీవితానికి ఆ సెగలు అంటనివ్వలేదు ఇద్దరూ.
ఒక్క మాట. ఈ విషయాలు మాట్లాడుకున్నంత మాత్రాన ఆ సంసారం సుఖపడిపోతుందని గ్యారంటీ లేదు కదా. ఆ జంట నిజాయితీ పరులై ఉండాలి. ఓ మంచి దాంపత్య జీవనం కావాలి అని వాళ్ళూ కోరుకోవాలి... వారి చుట్టూ ఉన్న వారు ఇది పడనివ్వాలి! అలా పడనివ్వకపోతే వారితో వీరు తెగతెంపులు చేసుకొనే పరిస్థితులు, ధైర్యం ఉండాలి! అప్పుడు ఏ సాధనమైనా పనికొస్తుంది.
పెళ్ళయితే చాలు అని ఫిక్స్ అయిపోయిన వారు ఇవేవీ ఆలోచించరు. వీరే పెళ్లయ్యాక పార్ట్నర్స్ మీద జోకులు వేస్తారు .. తామెంత మోసపోయామో అని వాపోతారు.
Friday, September 5, 2025
జ్ఞానమొసగరాదా - (నేను రాసిన కథ)
శారద పాడనంటోందిట. గురువైన వసంత కి చెప్పి ఒకటే ఆందోళన పడిపోతున్నారు ఆమె తల్లిదండ్రులైన అరుణ, మురళి.
పదకొండేళ్ళుంటాయి శారద కి. అప్పటికే ఆరేళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటోంది వసంత దగ్గర. సంగీతం మీద పట్టున్న ప్రతీ ఒక్కరూ మంచి గురువు కాలేరు. దానికి కావాల్సిన నైపుణ్యాలు వేరే ఉంటాయి. ప్రతి పిల్ల/పిల్లాడు ఏదో ఒక సైకాలజీ లో ఉంటారు. వారిని అర్ధం చేస్కుంటూ ఓర్పుగా చెప్పుకురావాలి ఈ కళ ని. వసంత ఇందులో సిద్ధహస్తురాలు. ఆ విషయం ఆనందంగా వసంత క్లాసులకి వచ్చే పిల్లలని చూస్తే తెలిసిపోతుంది. వారు వేదిక మీద పాడటం మొదలు పెట్టాక మిగిలిన సంశయాలు కూడా తీరిపోతాయి ఎవరికైనా.
ఇలాంటి ప్రోగ్రాం ఒకటి చూసారు పెళ్ళైన కొత్తల్లో అరుణ, మురళి. అంతే, నిర్ణయం తీసేసుకున్నారు. తమకి పుట్టబోయే సంతానాన్ని ఆమె దగ్గరే సంగీతానికి పెట్టేయాలని. వారి సంకల్ప బలమో ఏమో శారద కూడా కంచు కంఠం తోనూ సంగీతం పట్ల ఆసక్తి తోనూ పుట్టేసింది. చిన్నప్పటి నుంచి ఏదైనా పాట వింటే పాడగలిగేది. ఇంకేం! అరుణ, మురళుల ఆనందానికి హద్దే లేదు!
తల్లిదండ్రుల చెయ్యి పట్టుకుని మొదటి సారి వసంత దగ్గరకి వచ్చింది ఐదేళ్ళ శారద. పెద్ద పెద్ద కళ్ళు, పసి బుగ్గలు, పరికిణి, రెండు పిలకలు, ఆ పిలకలు చుట్టూ పూలు, కళ్ళ కి కాటుక, కాళ్ళ కి వెండి పట్టీలు. అప్పటికి క్లాసు లో ఉంది వసంత. తన ఇంట్లో నే హాల్లో క్లాసులు చెప్తుంది. ఐదింటి నుంచి మొదలు పెడితే బ్యాచులు బ్యాచులు గా అయ్యేసరికి తొమ్మిదవుతుంది. శారద వచ్చినప్పుడు మొదటి బ్యాచ్ నడుస్తోంది. శారద అందర్నీ భయం భయం గా చూస్తూ నిలబడింది.
వసంత ‘రా … కూర్చో’ అనగానే వెళ్ళి వసంత ఒళ్ళో కూర్చుంది. పిల్లలందరూ ఒకటే నవ్వు.
అరుణ, మురళి షాక్ అయ్యారు. ఎక్కడ వసంత కి కోపం వచ్చి చేర్చుకోదో అని వారి భయం. మురళి అరుణ కి సైగ చేసాడు. అరుణ వెంటనే “అక్కడ కూర్చోకూడదు శారూ… అందరు పిల్లల తో ఇక్కడ చాప మీద కూర్చోవాలి” అని కూర్చోపెట్టింది. వసంత వైపు చూసి సారీ అన్నట్టు గా మొహం పెట్టింది.
వసంత నిజానికి నవ్వాపుకుంటోంది. ఓ ముప్ఫయి ఐదేళ్ళుంటాయి వసంత కి. అప్పటికే పదేళ్ళ నుంచి ఆ ఏరియా లో సంగీతం చెప్తోంది. ఆ అనుభవం తో నే గాంభీర్యం నటిస్తోంది. తను కూడా నవ్వేస్తే శారద కి సంగీతం పట్ల సీరియస్ నెస్ రాదు.
ఎలక్ట్రానిక్ శృతి బాక్స్ నుంచి నాదం పలుకుతోంది . ఐదున్నర శృతి.
తానొక్క సారి కళ్ళు మూసుకొని శృతి చూసుకుంది. ‘మ్ …’ అని హమ్ చేసుకుంది.
శారద ఇదంతా గమనిస్తోంది. శృతి బాక్స్ ని వింత గా చూస్తోంది.
వసంత “నేను సా అంటాను … నువ్వు కూడా అనాలి … సరేనా?”
శారద “సా” అంది. అందరూ మళ్ళీ నవ్వు.
అరుణ, మురళు లకి టెన్షన్ పెరిగిపోతోంది ఓ పక్క …
“సా అనమంటే ఊరికే అనటం కాదు.. శృతి లో పాడాలి…” అని అనగానే శారద “సా…” అని పాడింది. సరిగ్గా షడ్జమం లో గొంతు కలిపింది.
వసంత కి తెలిసిపోయింది. శారద కి శృతి జ్ఞానం ఉంది.
“పా …” పాడింది వసంత. శారద పంచమం కలిపింది.
పై షడ్జమం కూడా సరిగ్గా పాడింది.
అరుణ, మురళి వసంత కేసి చూస్తున్నారు. వాళ్ళకి తెలీదు శారద కరెక్ట్ గా పాడిందో లేదో.
గురువు ఎక్కువ మెచ్చుకోకూడదు అంటారు. వసంత గంభీరంగా “ఊఁ… శృతి లో కలుస్తోంది గొంతు” అని మాత్రం అంది పైకి.
అరుణ మురళి … ఇద్దరి ఆనందానికి అవధుల్లేవు. ఇంటర్నేషనల్ స్కూల్ లో సీట్ దొరికినట్టు ఆనందపడిపోయారు ఇద్దరూ. క్రమం తప్పకుండా క్లాసులకి పట్టుకొచ్చేవారు. “సంగీతం అంతా నేర్చుకోడానికి ఎంత టైమ్ పడుతుందండీ, మా అమ్మాయి సూర్య గాయత్రి లా ఎప్పుడు పాడుతుందండి” లాంటి ప్రశ్నలు అడగలేదు. వసంత మీద పూర్తి నమ్మకం ఉంచారు.
ఎనిమిదేళ్ళ వయసు వచ్చే సరికి కొంత కుదురుకుంది శారద. ఇక్కడ వచ్చిన చిక్కు.. సాధన. సంగీత సాధన ఎంత అవసరమో - అంత చెయ్యాలనిపించదు పిల్లలకి. ఒకే స్వరం మళ్ళీ మళ్ళీ పాడాలి. విసుగనిపిస్తుంది.
“నిద్దుర నిరాకరించి ముద్దు గా తంబుర పట్టి” అన్నారు త్యాగరాజ స్వామి. అలా సాధన చేయడం ఎంత కష్టం! అంత కన్నా కష్టం ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లని ఓ చోట కూర్చోపెట్టి ‘కాలాలు’, ‘అ కారం’ సాధన చేయించడం. పెద్ద పాఠాలు నేర్చుకుంటున్న శారద కీ - చిన్న వయసు లో ఉండే చాంచల్యానికీ అస్సలు పొసిగేది కాదు.
మరి ప్రతిభ కి సాధన తోడవకపోతే ఎలా? ఎన్నో విధాలు గా చెప్పి చూసింది సాధన చేయమని. తనకొచ్చినదే చాలు అన్నట్టు ఉండేది శారద. ప్రతి ప్రోగ్రాం లో ముందు వరస లో మైకు ముందు శారదే. ఆ వయసు కి ఆ పాటలే గొప్ప అని అందరూ ముద్దు చేసే వారు. తాళం తప్పులు, అక్కడక్కడా శృతి తప్పులు, పాఠాలని మర్చిపోవడం… ఇది ఎవరూ గమనించలేదు … వసంత తప్ప. శారద లో చిన్న గా అహంకారం ప్రవేశించింది. ఇది తెలుస్తోంది వసంత కి.
ఓ వైపు అరుణ, మురళులు తమ తపస్సు ఫలించింది అని మురిసిపోతున్నారు. శారద ప్రోగ్రాం లో పాడటం మొదలు పెట్టిన రోజు నుంచి ఓ కొత్త ఐ ఫోన్ కొనేశారు. అది కేవలం శారద ప్రదర్శనలకే! వసంత అంటే భయం తో ఎక్కడ పోస్టు చెయ్యట్లేదు కానీ శారద పేరు న ఎప్పుడో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసేసేవారే.
ఇప్పుడే విరుస్తున్న పుష్పం శారద. ఇంకా గుబాళింపు మొదలవ్వనే లేదు. ఈ నాజూకైన తరుణం లో వసంత కోప్పడితే ఆ గ్రీష్మానికి వడిలిపోవచ్చు ఈ పసి మొగ్గ. అలా అని వదిలేస్తే ఆ శిశిరానికి అసలు విచ్చుకోవడం ఆగిపోయే ప్రమాదం ఉంది. వసంతం లాగానే ఉండాలి తను. ఓ ముఖ్యమైన ప్రోగ్రాం వచ్చింది. ఓ పుణ్య క్షేత్రం లో. వసంత రాసిన పాటల లిస్టు లో శారద సాధన చెయ్యని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. రిహార్సల్స్ లోనే శారద తడబడటం మొదలయింది. ఒకటికి పది సార్లు సాధన చేసిన పిల్లలు మాత్రం కాన్ఫిడెంట్ గా పాడేస్తున్నారు. అంతే. శారద ని ఆ ప్రోగ్రాం నుంచి డ్రాప్ చేసేసింది వసంత. మిగిలిన పిల్లలందరి తో ట్రూప్ ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లి జయప్రదంగా ప్రోగ్రాం చేస్కొచ్చింది.
అరుణ, మురళి … ఇద్దరికీ వసంత అంటే కోపం కూడా వచ్చింది. స్టార్ స్టూడెంట్ లాంటి తమ కూతుర్ని అలా తీసేస్తుందా అని. తల్లిదండ్రుల నుంచి ప్రోగ్రామ్స్ సమయాల్లో ఈ కోపతాపాలు వసంత కి మామూలే. మైక్ ముందు, ముందు వరస లో తమ పిల్లల్ని కూర్చో పెట్టలేదని అలిగి క్లాసులు మాన్పించేసిన వారిని కూడా చూసింది తన అనుభవం లో. కానీ అక్కడ ప్రాధాన్యత వారికి కాదు.సంగీతానికి … సుస్వర బద్ధమైన ప్రదర్శన కి… చూడటానికి వచ్చే ఆహూతులకు. వారికి న్యాయం చెయ్యగలిగే వారే ముందు వరసలో కూర్చుంటారు, మైక్ లో పాడతారు.
ఈ టూర్ ముగించుకుని వచ్చాక శారద ని క్లాసు కి తీసుకొచ్చింది అరుణ. ముభావంగా ఉన్నది ఆవిడ. శారద మట్టుకు ఓ రెండు నిముషాలు మౌనంగా ఉండి ఏడ్చేసింది. “నేను ప్రాక్టీస్ చేస్తా మేడం… కోపంగా ఉండకండి” అని కన్నీరు కారుస్తూ వెక్కిళ్ళ మధ్య చెప్తోంది. వసంత కి లోపల ఆనందంగా అనిపించింది. శారద ని దగ్గర కి తీస్కొని కన్నీళ్లు తుడిచింది. “వెళ్ళి కొత్త పాఠం రాసుకో” అని పంపించి అరుణ తో తన ఆనందాన్ని పంచుకుంది వసంత “కళ కోసం కన్నీళ్లు వచ్చాయంటే ఇంక శారద ని ఎవరూ ఆపలేరు. శారద ని అద్భుతమైన శాస్త్రీయ సంగీత కళాకారిణి గా నేను తీర్చిదిద్దుతాను”.
అరుణ లో ఇందాకటి అలక పోయింది. “మాకు సంగీతం గురించి ఏమీ తెలీదు మేడం. మమ్మల్ని పట్టించుకోకండి. మీరు ఎలా చెప్తే అలానే మేడం” అని వెళ్లిపోయారు ఆవిడ.
ఇక అప్పటి నుంచి శారద సంగీతం పిల్ల కాలువ నుంచి సెలయేరు లాగా సాగడం మొదలుపెట్టింది. కృతుల వరకూ వచ్చేసింది శారద. ఫోన్ లు చూసీ చూసీ పిల్లల మెదళ్ళు మందమయిపోతున్న ఈ సమయం లో నొటేషన్ చూడకుండా, పుస్తకం ముందు లేకుండా సరళీ స్వరాల నుంచి వర్ణాల వరకూ పాడేయగలదు శారద. ఇంక నేర్పవలసింది … మనోధర్మ సంగీతం.. అంటే రాగాలాపనా, స్వరకల్పన, నెఱవు, ఇలాంటివి. అవి నేర్చుకోవటానికి శారద ఇంకొంత పెద్దవ్వాలి అనిపించింది వసంత కి. పైగా మనోధర్మానికి బాగా కచేరీలు వినాలి. రాగాల జ్ఞానం పెరగాలి. దానికి సమయం ఉంది.
ఇప్పుడు శారద కి కావాల్సింది ప్రదర్శనలు చేసే అనుభవం.. అది కూడా చిన్నప్పటి లాగా గ్రూప్ లో కాదు… ఒక్కతే. ఏ కళైనా ప్రదర్శనా ప్రధానమైనదే. క్లాసు లో గురువు దగ్గర పాడటం వేరు. తమకు తెలియని ప్రేక్షకుల ముందు వారిని మెప్పించేలా పాడటం వేరు. ప్రతీ గురువు కి తమ శిష్యుల్ని పెర్ఫార్మర్స్ చెయ్యడం ఓ ఛాలెంజ్. అది ఇంకో విద్య నిజానికి.
మైక్ లో పాడటం తెలియాలి. పక్క వాయిద్యాల తో పాడటం తెలియాలి. ఏ పాటలు ఎంచుకోవాలి, అరగంట పాడినా మొదటి పాట కి ఉన్న గొంతు చివరి పాట వరకూ అలిసిపోకుండా అలాగే ఉండాలి. అంటే ఎంత సాధన చేయించాలి? ఇది కాక వస్త్రధారణ కూడా గురువే చెప్పాలి. మన సాంప్రదాయ కళలకి సాంప్రదాయ వస్త్రధారణే వేసుకోవాలి అని చెప్పాలి. శారద వేదికనెక్కే వెనుక ఇంత కృషి జరిగింది.
వసంత తనకి తెలిసిన వేదికల తో మాట్లాడింది. తెలుగు నాట అచ్చమైన సంగీత అకాడమీలు, వారు నిర్వహించే వేడుకలు తక్కువ. దేవాలయాల్లో దసరా ఉత్సవాలు, వినాయక చవితి పండల్స్, ఇళ్లల్లో జరిగే ఫంక్షన్స్ …. ఇలాంటి వేదికలను కూడా ఉపయోగించుకోవాలి. అనుభవం వచ్చి ప్రొఫెషనల్ అయ్యి, తన కంటూ ఆడియన్స్ ఏర్పడే దాకా ఎక్కడైనా పాడగలగాలి.
ఇంకో వైపు అరుణ, మురళులు చక్కటి పట్టు పరికిణీలు కుట్టించారు శారద కి. పాత ఐఫోన్ స్థానం లో ఇప్పుడు DSLR కెమెరా, స్టాండ్ తో పాటు కొనుగోలు చేయబడింది. దీనికి వసంత కూడా పర్మిషన్ ఇచ్చింది. పెరఫార్మెన్స్ చూసుకొని సవరింపులు చేసుకోడానికి ఈ రికార్డింగ్స్ ఉపయోగపడతాయి. అసలు తాను పక్కన లేకుండా ఎలా పాడుతుందో శారద.. కానీ ఇలా మమకారాలు పెట్టుకుంటే తన శిష్యురాలు స్వతంత్రురాలు ఎలా అవుతుంది?
శ్రావణ మాసం మొదలుకొని వచ్చిన పర్వ దినాలు, ఆ సందర్భాల్లో జరిగే వేడుకలు, పుణ్య క్షేత్రాల్లో కార్యక్రమాలూ.. ఇలా ఓ నాలుగైదు నెలలు వరకూ ఎవరి బిజీ లో వారున్నారు శారదా, వసంతా. మళ్ళీ తీరుబడి దొరికేసరికి త్యాగరాజ ఆరాధన మాసం …. అదే జనవరి వచ్చేసింది. ఒక నాడు తీరిక దొరికాక కబురు చేసింది వసంత శారద ని రమ్మనమని. కచ్చేరి అనుభవాలు విందామని, రికార్డింగ్స్ చూద్దామని.
ఆ రోజు అరుణ, మురళి వచ్చారు.
“శారద రాలేదా?” వారి వెనక ఉందేమో అని వెదుకుతూ అడిగింది వసంత.
అరుణ, మురళి మొహాలు మొహాలు చూసుకున్నారు.
“రానంటోంది మేడం”
“కచేరీ ల తో ప్రయాణాల తో అలిసిపోయుంటుంది పాపం” నవ్వుతూ అన్నది వసంత.
“లేదు మేడం … ఇంక పాడదట”
షాక్ అయింది వసంత.
“ఏం జరిగింది?”
“ఏమో మేడం … మీరు చెప్పినట్టు చాలా స్టేజీస్ మీద పాడింది. కానీ ఉన్నట్టుండి ఓ రోజు ఇంక ప్రోగ్రామ్స్ ఇవ్వననేసింది మేడం. మేము ఫోర్స్ చేస్తే స్టేజ్ మీద కి వెళ్ళి నోరే విప్పలేదు.”
“అవునా? ఎందుకు?”
అరుణ, మురళి మళ్ళీ మొహాలు మొహాలు చూసుకున్నారు. “మాకైతే అంతా బాగానే జరిగింది అనిపించేది. శారద కి మాత్రం మూడవుట్ అయ్యేది. ఎందుకో చికాకు వచ్చేసేది. ఒక్కో సారి ప్రోగ్రాం మధ్యలోనే. ఇప్పుడు ప్రోగ్రాం కాదు కదా అసలు సంగీతమే వద్దంటోంది. ఇన్నేళ్లు నేర్చుకున్న విద్య వేస్ట్ అయిపోతుందని చెప్పినా వినట్లేదు … మాకేం చెయ్యాలో ఏమీ తెలీట్లేదు మేడం.”
వసంత కి సమస్యేంటో అర్ధం కాక రికార్డింగులు తెప్పించుకుంది. నాలుగు ప్రదర్శనలు చూసాక రహస్యం అర్ధమయింది.
శారద ఎలా పాడుతోందో తెలుసుకోడానికి పెట్టిన కెమెరా లో ప్రస్తుత సమాజం పోకడ రికార్డ్ అయింది. శారద అకారణంగా చిన్నబుచ్చుకోలేదు. ప్రదర్శన కి సిద్ధమైన కళాకారుడికి ఎదురయ్యే తొలి చేదు అనుభవమే శారద కూడా రుచి చూసింది. రసజ్ఞులైన ప్రేక్షకులు లేకపోవడం.
రకరకాల వేదికల మీద పాడింది శారద. ఆలయాల్లో, గణపతి పండల్స్ లో, చుట్టాల మధ్య, పెళ్లిళ్లలో, పేరంటాల లో. ఎక్కడ పాడినా, శారద పాట లో మార్పు లేదు. వేదిక నెక్కే ముందు నమస్కారం చేసుకుంది. తన ని పరిచయం చేసుకుంది. తాను పాడే అంశం గురించి చక్కగా చెప్పింది. శృతి లో నే పాడింది. తాళం తప్పలేదు. ఆహార్యం బాగుంది. కానీ కచేరీలు జరుగుతున్న కొద్దీ మొహం లో కళ తప్పడం మొదలయింది. ఎంతో అమాయకంగా, నవ్వుతూ మొదలుపెట్టింది మొదటి కచేరీ. చివరికొచ్చేసరికి యాంత్రికంగా మారిపోయింది.
ఏంటి కారణం? అంతా రికార్డ్ అయింది.
కచేరీ ఎక్కడైనా, ఎనభై శాతం శారద పాట ఎవరూ వినటం లేదు. ఓ ఫంక్షన్ లో శారద పాట మొదలు పెట్టగానే కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టేసారు. ఓ వ్రతం లో హారతి పాడుతోంది శారద. పూజారి గారు, ఆ భగవంతుడు తప్ప ఎవరూ వినలేదు. చుట్టాలెవరో వచ్చారని, కేటరింగ్ అనీ, ఫోటో అనీ ఒకటే హడావుడి. శారద కి పాపం పాడటం కొనసాగించాలో ఆపాలో తెలియలేదు. ఒక చోట ‘లంబోదర లకుమికర’ అనగానే వెకిలి నవ్వులు. ఇంకో చోట ‘సామజ వరగమనా’ పాడటమే తప్పయిపోయింది. ఆడియన్స్ లో కుర్రాళ్ళు సినిమా లో పాట ని గట్టి గా పాడటం మొదలు పెట్టారు గ్రూప్ గా. ఒక చోట శారద పాట మధ్య లో మైక్ లాక్కొని ‘మన టీం టోర్నమెంట్ గెలిచింది’ అని అనౌన్స్ చేసేసరికి ఇంక ఎవరూ కచేరీ వినలేదు.
పోనీ ఇవన్నీ సంగీత పరమైన వేదికలు కావు అనుకుంటే ఉన్న కొద్ది వేదికలలోనూ శారద పెద్ద ఆర్టిస్ట్ కాదన్న నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా తెలిసింది. కొన్ని చోట్ల మైక్ సడన్ గా పని చెయ్యడం ఆగిపోయింది. నిర్వాహకులతో సహా అది బాగు చేసే వారెవరూ అక్కడ లేరు. అలాగే పాడేసింది. ఇంకో చోట భో శంభో పాడింది … తారస్థాయి లో అద్భుతంగా ఆపింది పాటని. అక్కడ ఎవ్వరికీ అందులో చమక్కు తెలియలేదు. అప్పుడే శారద మొహం చిన్నబోవటం గమనించింది. సభా మర్యాద తెలీని ప్రేక్షకులు పిల్లల్ని స్టేజీ ముందు ఆడుకోటానికి వదిలేస్తే వాళ్ళు కచేరీ జరుగుతున్న సమయం లో పరుగుపందాలు, ముట్టించుకునే ఆటలు. వారి తల్లిదండ్రులు వారికి సంగీతం వినడం నేర్పించరు. కనీసం సభా సంస్కృతి… అంటే.. ఒకరు పాడుతుంటే మాట్లాడకూడదు, చివర్లో హర్షించాలి, కళాకారులని చప్పట్లతో గౌరవించాలి అని తెలీదు.
ఒక రికార్డింగ్ లో చూసింది … ఒకావిడ శారద పాడుతుండగా వచ్చి శారద బుగ్గ గిల్లి పక్కన కూర్చున్న అరుణ ని ‘లంగా ఎక్కడ కుట్టించారు, పాప ఏజ్ ఎంత” అని కబుర్లాడుతోంది! ఇంకో దగ్గర ఒకాయన రికార్డ్ చేస్తున్న మురళి దగ్గరకి వచ్చి ఒకరు “ఈ పాటలు బోర్ అంటున్నారండి, సినిమా పాటలు ఏమన్నా వచ్చా …?” అని అడుగుతున్నారు. శారద స్కూల్ లో పాడమని అడిగారట. చిన్న రాగం తో మొదలు పెట్టబోతే టీచర్ లు గట్టిగా నవ్వేస్తూ “అమ్మా .. నువ్వలా రాగాలు తీస్తే అందరూ పారిపోతారు .. ఏమన్నా సింపుల్ గా పాడు చాలు” అన్నారట.
ప్రతీ చోట ఒకే సలహా. టివి ప్రోగ్రామ్స్ లో జరిగే సినిమా పాటల పోటీ ల కి పంపించమని. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే విద్యార్థి ని పోనీ మెకానికల్ కూడా చేసేయమంటే ఎలా ఉంటుంది? ఏదైనా పాటే అనుకునే వారికి ఈ తేడా తెలీదు. చెప్పినా వినరు. వారికి తెలిసిన సంగీతం అదే. అది పాడితేనే మెచ్చుకోలు.
కొన్ని కచేరీల లో మాత్రం కొంత మంది సంస్కారవంతులు వచ్చి, శ్రద్ధగా విని శారద ని ఆశీర్వదించి వెళ్లారు. అప్పుడు శారద మొహం చూడాలి. ఎడారి లో మంచి నీళ్లు దొరికినట్టు. దురదృష్టవశాత్తు వీరి సంఖ్య చాలా తక్కువ. అరుణ, మురళులకి ఇందులో తప్పేమీ అర్ధం కాలేదు పాపం. ఒకటి రెండు సార్లు శారద చెప్పబోతే ‘అంత సెన్సిటివ్ గా ఉండకూడదు.. పద పద ప్రోగ్రాం టైం అయింది” అని తీస్కెళ్లిపోయారట. అందుకే ఇంక శారద మాటలు లేకుండా భీష్మించుక్కూర్చుంది.
వసంత బాధ పడింది. ఆ తర్వాత ఆలోచనలో పడింది. శారద సంగీతం మానేస్తుందేమో అనే బెంగ పడింది. ఇంకో వైపు.. ఓ చిన్న అపరాధ భావన.
“అసలు బైట ప్రపంచం లో వీసమెత్తు విలువ లేని కళ ని నా చేత అంత కూలంకషంగా ఎందుకు సాధన చేయించారు మేడం? ప్రతీ అనుస్వరం శృతి లో కలవాలి, తాళం తప్పకూడదు, కృతి నోటికి రావాలి, అపస్వరాలు దొర్లకూడదు అని చెప్పారే … అసలు వినేవాళ్ళకి ఇవన్నీ తెలుసా?
శాస్త్రీయ సంగీతం మీద జోకులేసే వారి ముందు ఎలా పాడాలి మీరు చెప్పలేదే మేడం?” అని శారద అడిగితే తనేం చెప్తుంది?
శారద కి ఏం చెప్పాలి అని ఆలోచిస్తోంది వసంత. పదేళ్ళ అనుభవం లో ఇలాంటి సంక్లిష్టత మొదటిసారి ఎదురైంది మరి. ‘నీకెందుకు ఆడియెన్స్ ఎలా అంటే’ అని శారద బాధ ని తీసిపారేయాలా? ‘ఇదేం చూసావు … ఇంకా ముందు ముందు చాలా బాధలు ఉంటాయి’ అని భయపెట్టాలా?
“త్యాగరాజ ఆరాధన కి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి… రమ్మన్నాని చెప్పండి” అని మాత్రం చెప్పి పంపించింది శారద తల్లిదండ్రులకి.
వస్తుందా శారద? రాకపోతే?
********
ఐదింటి క్లాసు కి బిలబిలమంటూ వచ్చేసారు పిల్లలు. వసంత మనసు మనసులో లేదు అస్సలు. ముఖ్యంగా మనసు బాగోనప్పుడే సంగీతం పాడాలి అని వసంత అనుభవపూర్వకంగా నేర్చుకున్న జీవిత పాఠం. అందుకే కూర్చుంది క్లాసు కి. ఈ రోజు వసంత అలవోకగా పిల్లల్ని అర్ధం చేసేస్కోనే గురువు కాదు. కొన్ని విషయాలు ఇంకా తెలీని నిత్య విద్యార్థిని.
ఎంతో ఆలోచించింది వసంత… ఏంటి ఈ సమస్య కి పరిష్కారం అని. ‘ఏ టాప్’ కళాకారులకు కూడా రసజ్ఞులైన ప్రేక్షకుల తో నిండిన హాల్ కష్టం ఈ కాలం లో. వయసు లో విద్యలో ఆ స్థాయి కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది శారద కి. ఈ లోపు ఏం చెయ్యాలి? కొన్ని వేదికల ని ఫిల్టర్ చేస్కోవచ్చు కానీ అది కాదు పరిష్కారం. అసలు ఇక్కడ మార్పు రావాల్సినది ఎవరిలో? సంగీతం వినే అలవాటు ఓ జాతి కి ఎలా నేర్పించాలి? అందులో రుచి ఎలా తెలపాలి? అది కళాకారుడి పనేనా?”
ఆమె కళ్ళు సంగీతం క్లాసు లో గోడ కి ఉన్న త్యాగరాజ స్వామి చిత్రం వైపు కి వెళ్లాయి. మనుషుల్ని నమ్ముకుంటే ఇంతే నని త్యాగరాజ స్వామి లాంటి వారు ఇందుకోసమే భగవంతుని కి తమ కళ ని అంకితం చేశారా? ఈ వైరాగ్యం పదకొండేళ్ళ పాప కి ఎలా చెప్పాలి?
ప్రశ్నల తో వసంత మనసంతా వికలమైపోయింది. శృతి వేసి కళ్ళు మూసేసుకుంది.
ఇంతలో వాకిలి లో అలికిడి… పిల్లలందరి లో గుసగుసలు. కళ్ళు తెరిచి చూసింది వసంత.
శారద వచ్చింది.
ఊపిరి పీల్చుకుంది వసంత. కళ కోసం కన్నీళ్ళు కార్చిన పిల్ల … సంగీతానికి ఎలా దూరం ఉండగలదు?
వసంత ‘కూర్చో’ అంది. శారద పిల్లలతో కూర్చుంది. ఈ రోజు శారద తన ఒళ్ళో కూర్చుంటే బాగుండనిపించింది. వీపు నిమిరి సాంత్వన చెప్పచ్చు. ఇంతలోనే వసంత కి గుర్తొచ్చింది. తాను తల్లి కాదు. గురువు.
ఎవరు మర్చిపోయినా, గురువు మర్చిపోనిది … శారద కి ముందు ఏం చెప్పాలి.
“రికార్డింగ్స్ చూసాను. బాగా వచ్చాయి పాటలు”. అంతకంటే పొగడదు వసంత.
అది చాలు శారద కి. “థాంక్యూ మేడం” అంది కళ్ళు మెరుస్తుండగా.
కళ్ళు మూసుకుంది వసంత. ఆ రోజు చెప్పవలసిన పాఠం ఆలోచించుకుంటోంది. ఓ రాగం తట్టింది మనసుకి.
“పూర్వీకల్యాణి”
ఆరోహణ, అవరోహణ రాయించింది… ‘స రి గ మ ప ద ప స… స ని ద ప మ గ రి స’
“వక్ర సంపూర్ణ రాగం .. వెళ్ళేటప్పుడు వంకర టింకర గా ఉంటుంది.. వచ్చేటప్పుడు సాఫీ గా దిగిపోతుంది” సరళమైన పదాల్లో చెప్పింది వసంత. పిల్లలకి గుర్తుండిపోయేలా, నవ్వొచ్చేలా ఇలాంటి పదాలు వాడుతుంది. పిల్లలు నవ్వారు. శారద కూడా నవ్వింది.
“ఈ రాగం లో ఈ రోజు మనం నేర్చుకునే కృతి .. జ్ఞానమొసగరాదా..”
పిల్లలందరూ రాసుకున్నారు.
“ఎంత గొప్పవాళ్ళైనా, చదువుకున్నవాళ్ళైనా ఎవరికీ అన్నీ తెలీవు. అలాంటప్పుడు ఎవర్ని అడుగుతాం జ్ఞానం ఇమ్మని? దేవుణ్ణి. ఇక్కడ త్యాగరాజ స్వామి రాముణ్ణి అడుగుతున్నారు… ఎలాంటి జ్ఞానం? సుజ్ఞానం… అంటే మంచి జ్ఞానం”
శారద వైపు చూసింది వసంత. అర్ధమయినట్టు చూసింది శారద.
పిల్లలు రాసుకుంటున్నారు వసంత చెప్తుంటే.
“పరిపూర్ణ.. నిష్కళంక నిరవధి సుఖదాయక.. వర త్యాగరాజార్చిత..”
క్లాసు నడుస్తోంది. శారద ఈ కొత్త కృతి నేర్చుకోవడం లో అంతా మర్చిపోయింది. నేర్పడం లో
నిమగ్నమయిపోయింది వసంత.
నాదానికి శక్తి ఉంటుంది. రాగానికి శక్తి ఉంటుంది. త్యాగరాజ స్వామి లాంటి తపోధనులు రాసిన అక్షరానికి శక్తి ఉంటుంది.
ఆ రోజు ఓ గురువు, ఆమె శిష్యులు ‘జ్ఞానమొసగరాదా?’ అని ఆర్తి తో ఆలపిస్తుంటే వింటోంది విశ్వం. ఆ తరంగాలకు మాటలు వస్తే ఇలా అంటాయేమో.
“దేశకాలమానపరిస్థితుల కన్నా తాము గొప్పవారం కాదని వినయంగా ఉంటూ, తమ చేతిలో లేని విషయాలని భగవంతుడికి అర్పించి, మళ్ళీ కళాసాధనా మార్గం లో నడిచే సుజ్ఞానం కళాకారులకి అలవర్చావు కదా రామా?
మరి ఈ సమాజానికి … కళలను వారసత్వం గా వచ్చిన ఆస్తులుగా, అపురూపంగా చూసుకుంటూ, కళాకారుల విలువనెరిగి గౌరవం చూపుతూ, మన కళల నుంచి పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖాన్ని పొందే జ్ఞానమొసగరాదా?”
___________
Sunday, May 18, 2025
'ప్రియమైన ఆవార్ గీ' - బహుమతి పొందిన నా కథ
Sunday, April 13, 2025
ఈనాడు ఆదివారం లో నా కథ - సతీ సావి 'త్రి' సూత్రాలు
Sunday, November 3, 2024
"ఆఖరి మైలు" ఈనాడు ఆదివారం లో నా కథ
ఈ రోజు ఈనాడు లో పబ్లిష్ అయిన కథ ఇది.
ఈనాడు ఈ - పేపర్ లింక్ ఇది - ఈ లింక్ లో అయితే చదువుకోడానికి సులభంగా ఉంటుంది.
ఈ కథ నిడివి పబ్లిషింగ్ స్పేస్ కోసం కొంచెం కుదించాల్సి వచ్చింది. ఎవరికైనా చదవాలని ఇంటరెస్ట్ ఉంటే , మీ ఇమెయిల్ ఐడి పంపించండి. పూర్తి కథ పి డి ఎఫ్ పంపిస్తాను. :)
కథ చదివి నాకు మంచి మెసేజెస్ పంపిస్తున్న అందరికీ ధన్యవాదాలండీ :)
Wednesday, October 16, 2024
పొంగనాలు-సాంబారు నేర్పిన జీవిత పాఠాలు
పొంగణాలు/పొంగనాలు/పొంగడాలు ఇలా రకరకాల వ్యవహారాలు ఉన్న ఈ తెలుగు టిఫిన్ సాంబారు తో కలిసి బోల్డు కబుర్లు చెప్పింది నిన్న రాత్రి నాకు. అవి మీకు కూడా చెప్దామని!
ముందుగా ఒక్క మాట. ఈ కాంబినేషన్ విధి రాత వల్ల కలిసి వచ్చింది కానీ మా ఇంట్లో ఈ సంప్రదాయం లేదు, నా ఫేవరెట్టూ కాదు. ఇది గమనించాలి.
అదుగో అదే మొదటి జీవిత సత్యం. దోసెల పిండి పులిసిపోక ముందే వాడేయాలి అనే తొందర, సాంబారు వ్యర్థం చేయకూడదనే తాపత్రయం, దోసెల తో సాంబారు తింటే తక్కువ ఖర్చవుతుంది కాబట్టి ఇలా ఇడ్లి సాంబారు, వడ సాంబారు లాగా పొంగనాల తో తింటే రెండూ ఖర్చవుతాయి అనే ఆలోచన నుంచి పుట్టింది ఈ కాంబినేషన్. జీవితం లో ఇలా ఎన్ని సార్లు జరగదు మనకి! పరిస్థితుల ప్రభావం వల్ల, కొన్ని మనమే పెట్టుకున్న పరిధులు/విలువల వల్ల కొన్ని చేసేస్తుంటాం. వాటి నుంచి ఒక్కో సారి ఇలా ముందు తెలియని కాంబినేషన్ పుట్టేస్తుంది. క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ నుంచే పుడుతుంది అని నిరూపితమవుతుంది!
హిరణ్యకశిపుడు ఓ వంద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు కదా .. నేను ఇలా చావను అలా చావను అని. అప్పుడు కదా నరసింహ అవతారం ఉద్భవించింది! అలా అన్నమాట! (నరసింహావతారాన్ని పొంగనాల తో పోల్చట్లేదు ... క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ .... దానికి ఉదాహరణ! నమో నరసింహ!)
![]() |
ఇక రెండో పాఠం. మొన్న ఒక కొటేషన్ చూసాను. మీరు మీ ప్రాబ్లమ్ లాగా కనిపించక్కర్లేదు అని. డబ్బుల్లేకపోతే డబ్బుల్లేనట్టు కనిపించక్కర్లేదు. శుభ్రమైన బట్టలు వేసుకొని తల దువ్వుకోవచ్చు! చెల్లగొట్టాల్సిన ఆహారం తినాలి అనుకున్నప్పుడు మొహం ఒకలా పెట్టుకొని చేతికి దొరికిన ప్లేట్ లో పెట్టుకుని అయిందనిపించక్కర్లేదు. ఓ మంచి ప్లేట్ తీస్కొని బాగా కనిపించేలా ప్రెజెంట్ చేసుకుంటే మనకి కూడా తినాలి అనిపిస్తుంది. ఇదిగో ఇలా ఫోటోలు పెట్టుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. :)
మూడో పాఠం... కళాకారులకి ప్రతీదీ ఓ ఇన్స్పిరేషనే! ఉదాహరణ కి ఈ కాంబినేషన్ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర ని గుర్తు చేసింది. సాంబారు నిజానికి ఇడ్లి కో, వడ కో, దోసె కో జతవ్వాలి. ఎన్టీఆర్ జమున గారిలా. పొంగనాలు పచ్చడి నో, పొడి నో పెళ్లి చేసుకోవాలి. కాంతారావు కె ఆర్ విజయ గారిలా. కానీ ముందే చెప్పినట్టు గా విధి వల్ల కలిసిన ఈ ఎన్టీఆర్ కె ఆర్ విజయ గార్ల జోడి ఎలా ఉంటుంది? వాళ్ళు అన్నీ మర్చిపోయి అన్యోన్యంగా ఉన్నా, ప్రపంచం వారిని ఇడ్లి సాంబారు కి ఇచ్చిన విలువ ఇస్తుందా? ఓ మంచి జోడీ గా గుర్తిస్తుందా? ఇలా కొంత సేపు ఆలోచిస్తూ ఉండిపోయాను నేను!
నాలుగో పాఠం. దేవుడెందుకో ఒకే ఫామిలీ లో ఒకలాంటి వాళ్ళని పుట్టించడు. ఒకరు పొద్దున్నే లేచేస్తారు. ఇంకొకరు రాత్రి మేల్కొనే ఉంటారు. వాళ్ళకీ వీళ్లకీ రోజూ గొడవ. అలాగే మా ఇంట్లో క్రిస్పీ గా ఉండే చిరు తిండి ని సాంబారు లో వేసేసి మెత్తగా చేసేస్తే అస్సలు నచ్చదు. నాకేమో అలాగే ఇష్టం! పకోడీ చేస్తే కడి-పకోడీ చేసుకుంటాను. కరకరలాడే కారప్పూస/జంతికల తో మరమరాల మసాలా చేసుకుంటాను. బిస్కెట్టైతే పాలలో ముంచుకొని తినాల్సిందే. ఇలా క్రిస్పీ వాటిని మెత్తగా చేసేస్తూ ఉంటే చూడటమే ఇబ్బంది మా ఇంట్లో వాళ్ళకి! ఎన్ని డిఫెరెన్సెస్ ఉన్నా కలిసే ఉండాలి మరి ... పొంగనాలు సాంబారు లాగా!
ఐదో పాఠం. నువ్వు జీవితం అంతా చూసేసా అనుకుంటున్నావు కానీ ఇంకా అంతా చూడలేదు. ప్రపంచాన్ని చుట్టేసిన వాళ్ళైనా, పుస్తకాలన్నీ చదివేసి వాళ్ళైనా .. ఇంకా ఏదో కొత్త అనుభవం, కొత్త కాంబినేషన్ ఉంటూనే ఉంటుంది మనని ఆశ్చర్యపరచడానికి! ఇది గుర్తుంచుకుంటే చాలు. జీవితం డెడ్ ఎండ్ లాగా బోర్ గా అనిపించదు. కొంచెం ఈగో కూడా కంట్రోల్ లో ఉంటుంది.... మనం అన్నీ చూసెయ్యలేదని!
ఇంక చివరిది, ముఖ్యమైనది అయిన పాఠం. ఆన్లైన్ లో మనం చూసేదేదో పూర్తి పిక్చర్ కాదు. నా పొంగనాల ఫోటో చూసి నోరూరుతుంది. ట్రై చెయ్యాలని కూడా అనిపించచ్చు. కానీ నిజం ఏంటంటే ఆ సాంబారు లో ఉప్పెక్కువైంది. నేను పొంగనాల పిండి లో ఉప్పు తక్కువేస్కున్నా లాభం లేకపోయింది. తర్వాత సాంబారు లో నీళ్లు కలిపి మరిగించాము. ఆ పల్చటి సాంబారు ఫోటో కి నోచుకోలేదు. అదీ పూర్తి కథ.
నేను ఈ సారి ఏం చేశా అంటే ఇదే భాగోతం ఇంగ్లిష్ లో వెళ్ళగక్కాను. అది నా ఇంగ్లిష్ బ్లాగ్ లో ఉంటుందన్న మాట. తెలుగు చదవటం రాదనే వంక తో నా రాతల్ని తప్పించుకోకుండా నేను వేసిన మాస్టర్ ప్లాన్ ఇది! కింద నా ఇంగ్లీష్ బ్లాగ్ కి లింక్ ఇచ్చాను. దాని పేరు సౌమ్యాటిక్ లైఫ్ :)
మళ్ళీ కలుద్దాం. మీరు ట్రై చేసిన/చెయ్యాల్సొచ్చిన కాంబినేషన్స్ ఏంటి? అవి మీకు నేర్పిన జీవిత పాఠాలేంటి? ప్లీజ్ చెప్పండి.
Tuesday, August 20, 2024
జో బాత్ తుజ్ మే హై .....
చాలా రోజుల నుంచి ఓ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నా.... ఇలా సందర్భం కుదిరింది....
ఒకప్పుడు కేవలం మెమరీ కోసం పనికొచ్చే ఫోటోలు ఇప్పుడు వాటి పరిధులు దాటి కొంచెం మితిమీరి మనశ్శాంతి పోగొడుతున్నాయి కదా ....
కొంత మందికి ఫోటో చూసాక స్ట్రెస్ మొదలవుతుంది.. యాంగిల్, బట్టలు, లైటింగ్... ఇవి మనం రూపాన్ని కెమెరా కి వేరేలా చూపిస్తాయి అని తెలీక ఆ కనిపించేదే నిజమనుకుని చాలా బాధపడుతున్నారు పాపం కొంతమంది. (మగవారు కూడా ఇలా ఫీలవుతున్నారా? ఎక్కువగా ఆడవారేనా? దీనికి జెండర్ తో సంబంధం లేదా? )
మీడియా లో పని చేసిన టెక్నీషియన్ గా ఒక ప్రొఫెషనల్ ఫోటో వెనక ఎంత శ్రమ, ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని జిమ్మిక్కులు ఉంటాయో తెలుసు నాకు. అలాంటిది నేను కూడా ఒకో సారి నా ఫోటో చూసి స్ట్రెస్ అయిన రోజులున్నాయి. అలాంటప్పుడు ఎవరు ఎంత చెప్పినా నమ్మబుద్ధి కాదు .. మనం బానే ఉంటామని.
కొంచెం పెద్దయ్యాక జీవితం బోల్డు కష్టాలు చూపించి ఈ కష్టాన్ని చిన్న గీత చేసినందువల్ల ఇలా ఉన్నా దేవుడి దయ వల్ల 😊
ఈ పాట విషయానికొస్తే నాకు చాలా ఇష్టమైన పాట .. తాజ్ర మహల్ (1963) చిత్రం లోనిది. రఫీ గారి గొంతు, రోషన్ గారి సంగీతం, సాహిర్ లుధియాన్వీ పలుకులు ....
ఇందులో 'జో వాదా కియా వో నిభానా పడేగా' పాట ఫేమస్ ..
'జో బాత్ తుజ్ మే హై' పాట గురించి ఎక్కువ మందికి తెలీదు ..
ఈ పాట భావం .. నీ లో ఉన్న విషయం నీ చిత్తరువు లో లేదు ... అని. వీడియో లో విశదంగా వివరించే అవకాశం దొరికింది. ఇదిగోండి లింక్
ఈ పాట కెమెరా లేదా ఓ చిత్రం యొక్క లిమిటేషన్స్ ని కవితాత్మకంగా భలే చూపిస్తుందండి!
వీలైతే పాట ఒరిజినల్ కూడా వినండి. చాలా బాగుంటుంది!
ఫోటోలు చూసి ట్రామా కి డ్రామా కి గురయ్యే అందరికీ అంకితం ఇస్తున్నాను ఈ పాట ని!!!
We are all beautiful!
Monday, August 14, 2023
విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్.....
Friday, July 28, 2023
కుళ్ళుమోతు మల్లిమీతు
ఈ సబ్జెక్టు తో నాకు చాలా అనుభవం ఉందండోయ్. అంటే నాకు కుళ్ళుకోవడం అలవాటు అని కాదు నేను చాలా భరించాను అని అర్ధం. అందరూ కొట్టి పడేస్తారు .. ఆ .. అందరికీ కలిగేదే అని. కానీ దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కుళ్ళు మన దగ్గర బంధాల్లోకి ప్రవేశిస్తే ఆ స్ట్రెస్ వేరు కదా.
నేను బలంగా నమ్మే విషయాల్లో ఒకటి ... లాజిక్ కాదు మనస్థితే మనిషి మనుగడ ని శాసిస్తుంది. లాజిక్ ని నమ్మే జాతి అయితే మనం యుద్ధం, క్షామం, ఆకలి లేకుండా చేసుకొనేవాళ్ళం. ఉండాల్సిన ఒకే భూమి ని సరిగ్గా చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు స్థితి ని చూసి ఏం చేస్తే ఇలా ఉన్నాం అని వెనక్కి calculate చేసుకుంటే తెలుస్తుంది.. పాలకుల, ధనికుల మనోవికారాల ఫలితమే ఈరోజు మన ప్రపంచం. అందులో అసూయ ఒక పెద్ద స్థానాన్ని ఆక్రమించుకుంది.
కుళ్ళు అనే ప్రాసెస్ ని విశదీకరిస్తే దాని మూలం పోల్చుకోవడం లో ఉంది. నువ్వు నీలా బ్రతికేస్తున్నావు .. ఏదో లాగా. ఈ లోపు ఓ చుట్టమో, ఫ్రెండో కనిపిస్తాడు.. లేదా ఏదో వార్త వస్తుంది వాళ్ళ గురించి. అంతే మొదలవుతుంది కుళ్ళు. ఈ మొదలైన జెలసీ ఒక మోతాదు లో చాలా కామన్. దీని వల్ల పెద్ద నష్టం లేదు కూడా. కానీ మోతాదు మించితేనే ఇబ్బంది..ఆ కుళ్ళు కలిగినవాడికీ, ఎవడి వల్ల కలిగిందో వాడికీ.
కుళ్ళు లోకి లింగభేదాలు ఉండవు. ఆడవాళ్ళకి అసూయెక్కువ అంటే నేను నిజమనుకునే దాన్ని. కానీ ఒక్కసారి ప్రొఫెషనల్ ప్రపంచం లోకి వచ్చాక అది ఎంత అబద్ధమో తెలిసింది. ఈ విషయం లో ఇద్దరూ సమానమే. నాకు ఇంకో అపోహ ఉండేది .. మగవాళ్ళకి మగవాళ్ళంటేనే జెలసీ... ఆడవాళ్ళకి ఆడవాళ్ళంటేనే జెలసీ అని. కానే కాదు.
నాకున్న ఇంకో అపోహ కూడా బాగా బుద్ధి వచ్చేలా పోగొట్టారు కొంత మంది మనుషులు. సమాజం లో స్థాయి లో ఉన్న వారికి ఇలాంటివి ఉండవనుకొనేదాన్ని నేను .. ముఖ్యంగా వాళ్ళకంటే తక్కువ (ఆర్ధికంగా, పేరుప్రఖ్యాతులు పరంగా etc). కానీ వీళ్ళే 1bhk కట్టుకున్న వాడి దగ్గరకి వచ్చి "నా బంగ్లా తుడుచుకోలేక చచ్చిపోతున్నాను.. నీ ఇల్లంటే నాకు అసూయ గా ఉంది" అంటారు.
ఒక ఆరోగ్యకరమైన మనసు, బుద్ధి ఉన్న వ్యక్తి కుళ్ళు ని ప్రాసెస్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఆ భావం కలగటం సహజం అని మొదట ఒప్పుకోవడం తో మొదలవుతుంది ఈ ప్రాసెస్. ఆ తర్వాత అదెక్కడి నుంచి వస్తోందో తెలుసుకోవడం ముఖ్యం. నీ తో పాటు పని చేసే కొలీగ్ ఇంకో పక్క పుస్తకం రాసారు అని తెలిసి అసూయ కలిగితే నీకు కూడా అలాంటి వ్యాపకం ఏదో పెట్టుకోవాలని ఉందన్నమాట. అందుకే నువ్వు చేయలేనిది వారు చేస్తే నీకు బాధ అనిపించింది. ఇలా అయితే ఫర్వాలేదు. మించిపోయిందేది లేదు. మనం కూడా అలాంటిది మొదలుపెట్టుకోవచ్చు. తనలో తనే విస్మరిస్తున్న కోణాలు తెలుసుకోడానికి ఈ కుళ్ళు అనే ఎమోషన్ ని డిటెక్టర్ గా వాడుకుంటుంది వివేకం.
కానీ అనారోగ్యంగా లేదా బలహీనంగా ఉన్న మనసు లో కుళ్ళు ప్రవేశిస్తే ... అబ్బా .. ఇంక వాళ్ళకి, చుట్టుపక్కవాళ్ళకి అందరికీ నరకం. వీళ్ళు సుఖంగా ఉండరు ... ఇంకొకళ్ళని ఉండనీరు.
ఇంకో జాతి ఉంటారు. వీళ్ళు చక్కగా పుట్టుకతో అసూయ అనే జీన్స్ తో పుడతారు. వీళ్ళ కుళ్లుకి అసలు లాజిక్ ఉండదు. అలాగే దానికి పరిష్కారం కూడా ఉండదు. వీళ్ళ సాంకేతిక నామం "కుళ్ళుమోతు మల్లిమీతు". మనకి తెలిసిన ఒకడు ఐ ఏ ఎస్ పాసయ్యాడు అనుకుందాం. ఈ మాట తెలీగానే కుళ్ళు కలిగింది. నువ్వు కూడా ఐ ఏ ఎస్ కి ప్రిపేర్ అవుతూ ఆ పరీక్ష ని క్రాక్ చెయ్యలేకపోతే ఆ కుళ్ళు కొంత వరకూ సబబు. కానీ అసలు నువ్వు ఆ పరీక్ష కి ప్రిపేర్ అవ్వట్లేదు సరి కదా ... అది నీ కెరీర్ ఏ కాదు. ఈ మల్లిమీతు టైప్ కుళ్ళు కి వయసు, వావి, వరస, సందర్భం, సంకోచం, విచక్షణ, వివేకం .. ఏవీ ఉండవు.
కుళ్ళు లో ఇంకో విసుగైన కోణం ... శ్రమ ని కాకుండా దానికి లభించిన ఫలితాలు చూసి కుళ్ళుకోవడం. ఓ వ్యక్తి మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాంగా అరవై ఏళ్ళ వయసు లో షుగర్ లాంటివి లేకుండా ఉన్నాడనుకోండి ... వీళ్ళు ఆహారం వైపు ఎటువంటి డిసిప్లిన్ చూపించకుండా వీళ్ళకి అవే ఫలితాలు కావాలి. ఆ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అంటే కుళ్ళు.
సత్యాగ్రహం లాగానే ఒక్కోసారి సత్యాసూయ కూడా ఉంటుంది అనిపిస్తుంది. లంచగొండి వాడో, స్వయంగా కుళ్ళుమోతు అయిన వాడో జీవితం లో అంచెలంచెలుగా ఎదుగుతూ పోతుంటే వాడ్ని చూసి కుళ్ళు కలగక మానదు. మనం మంచివాళ్ళయి చేసిందేంటి అనిపిస్తుంది.
నాకనిపిస్తుంది.. దుర్యోధనుడికి పాండవులతో ఉన్న ప్రధాన సమస్య కుళ్ళే అని. రాజ్యకాంక్ష ఒక్కటే అయితే వాళ్ళకి ఐదు ఊళ్ళు ఇచ్చేయచ్చు. ఆర్యావర్తం ఏలే చక్రవర్తి గా ఐదూళ్ళ రాజుల మీద పెత్తనం చేసి తన పవర్ చూపించుకోవచ్చు. కానీ అతనికి అసలు వాళ్లంత ప్రజ్ఞావంతులు బ్రతికుండడమే ఇష్టం లేదనిపిస్తుంది. (చిన్నప్పటి నుంచి అతను చేసిన హత్యాప్రయత్నాలు ఇందుకు సాక్ష్యం). దుర్యోధనుడు స్వయంగా ఇలాంటి వాడా, శకుని ప్రేరేపించాడా అంటే .. మనలో అంకురం కూడా లేని భావాన్ని ఎవ్వడూ ప్రేరేపించలేడు అంటా నేను. ఇప్పుడు మన భారతీయులకి రోడ్లు శుభ్రంగా ఉంచమని, లైన్ లో సరిగ్గా నుంచోమని, సమయపాలన చెయ్యమని ఎంత చెప్పినా వినరు చూడండి అలా.
దుర్యోధనుడి కుళ్ళు అతని వంశాన్ని నాశనం చేసింది. కానీ అది ద్వాపర యుగం. ఇప్పుడు అలా అవ్వట్లేదేమో అనిపిస్తోంది.
కుళ్ళు తీర్చుకోడానికి పరమ సాధారణమైన సాధకం - మాటలు. చాలా మంది తమ కుళ్ళు ని ఇలాగే ప్రదర్శిస్తారు. వంకర మాటలు, నొక్కులు, బాధాకరమైన కామెంట్లు, ఎదుటి వారి విజయాన్ని acknowledge చెయ్యకపోవడం ...
ఈర్ష్య, అసూయ, కుళ్ళు ఇలా మన తెలుగులో ఉన్నట్టే ఇంగ్లిష్ లో ఎన్వీ, జెలసీ లాంటి మాటలున్నాయి. కాకపోతే ఎన్వీ కి జెలసీ కి తేడా ఉందట. ఎన్వీ అంటే నువ్వు కావాలనుకున్నది, నీ దగ్గర లేనిది ఒకడి దగ్గర ఉంటే కలిగే భావన. జెలసీ అంటే నీదైన వస్తువుని వేరెవడో వచ్చి తీస్కెళ్ళిపోతాడనే భయం అట! మనం ఒకే అర్ధం లో రెండూ వాడేస్తూ ఉంటాం.
ఎన్వీ అంటే ఒనిడా టివి యాడ్ గుర్తొస్తుంది ... ఈ ఎమోషన్ ని కూడా సెల్లింగ్ పాయింట్ చేసేసుకున్నారు చూసారు వాళ్ళు! ప్రేమ కథల్లో కూడా ఇలాగే వాడుకుంటారు జెలసీ ని. ఇష్టమైన వ్యక్తి అటెన్షన్ ని పొందడానికి ఇంకొకరి తో చనువుగా ఉన్నట్టు నటించి వాళ్ళని 'జెలస్' చెయ్యడం ఓ నార్మల్ విషయం లో చూపిస్తారు కదా సినిమాల్లో. అలాగే ఒకమ్మాయి ముందు ఇంకొకమ్మాయి ని పొగిడితే ఆమె కి కుళ్ళు అంటారు. నాకనిపిస్తుంది వీళ్ళ ఉద్దేశమే ఆ అసూయ ని ప్రేరేపించడం అని.
అమ్మాయిల మధ్య అసూయ ని ఓ జోక్ గా కాక జెండర్ పాలిటిక్స్ కోణం నుంచి అర్ధం చేసుకోవాలి అంటాను నేను. వాళ్ళకి చేసిన కండిషనింగ్ లో భాగం ఏంటంటే నీ మగాడు, నీ సంసారం దీనికోసం నువ్వు పోరాడు ఇంకో ఆడదాన్నుంచి అని. ఏదో మగాడు లాలీపాప్ అయినట్టు. అతనిక్కూడా వివేకం ఉంటుంది కదా. తప్పు జరిగితే అది రెండు వైపులా కదా. ప్రేమ దశ లో కూడా మగవాడి అటెన్షన్ ఏదో ట్రోఫీ అయినట్టు దాని కోసం వేరే అమ్మాయిలతో పోటీ పడాలి అనే భావన సృష్టిస్తారు. అమ్మాయిల మనసులని, మెదడులని సంకుచితం చేసే ఇలాంటి పోకడల వల్లే "ఆడవాళ్ళకి అసూయ ఎక్కువ" అనే ప్రాపకం జరిగింది. మనోవికాసం చెందిన సాధికార స్త్రీ ఇంకో స్త్రీ కి చేయూతనిస్తుంది తప్పించి తొక్కేయాలనుకోదు. ఇంద్రా నూయి లాంటి వారు చెప్తోంది కూడా ఇదే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఛాలెంజ్ ఇదే. కొన్నేళ్ల కండిషనింగ్ నుంచి బైట పడి తోటి ఆడవారిలో పోటీ ని కాక సహకారాన్ని ఇవ్వడం, తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఏ క్లోజ్ బంధం లో ఉన్న వారైనా రకరకాల సందర్భాల్లో జెలస్ ఫీలవుతారు. ఈ రకమైన జెలసీ అసలు కేటగిరి నే వేరనిపిస్తుంది. తన కూతురొచ్చి వేరొకరి వంట పొగిడితే తల్లికి కుళ్ళు. కొలీగ్ వేసిన జోక్ గురించి నవ్వుతూ చెప్తే భర్త కి కుళ్ళు. తనతో కాక ఇంకొకరి తో కొంచెం చనువుగా ఉన్నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కుళ్ళు. ఎంత సెక్యూర్ గా ఉండే వ్యక్తికైనా ఈ భావన తప్పదేమో అనిపిస్తుంది.
ఒక కొటేషన్ చదివాను ఇటీవల. నువ్వు ఎవరితో సేఫ్ గా శుభవార్త ని షేర్ చేస్కోగలవో వాళ్ళే నీ శ్రేయోభిలాషులు అని. మిగిలిన వాళ్ళో? సాంకేతిక నామం ఉందిగా వాళ్ళకి!
ఈనాడు ఆదివారం అనుబంధం లో నేను రాసిన కథ 'అద్దె కి ఆకాశం'
ఈనాడు ఆదివారం అనుబంధం లో నేను రాసిన కథ 'అద్దె కి ఆకాశం' లింక్ ఇది https://www.eenadu.net/telugu-article/sunday-magazine/sunday-i...
-
ఓ రాత్రి రేడియో లో 'ఉమ్మడి కుటుంబం' సినిమా లోని సతీ సావిత్రి స్టేజీ నాటకం సీన్, పాట వినపడింది. అది వింటుండగా సతీ సావిత్రి కథ మీద దృష...
-
మొత్తానికి ఇంకో కథ రాసానండి. ఈనాడు ఆదివారం సంచిక వారు ప్రచురించినందుకు కృతజ్ఞతలు. ఇదిగో, ఇక్కడ షేర్ చేస్తున్నా.
-
చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టంగా చదివే ఈనాడు పుస్తకం లో నా కథ రావడం నా జీవితం లోని ఆనందాల్లో ఒకటి. ఆ కథ చదివి నన్ను ఆన్లైన్ లో వెతికి మ...







