Monday, August 14, 2023
విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్.....
Friday, May 19, 2023
ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి ..
నాకు ఇంటి పని తో చాలా పేచీలున్నాయి.
ఒకటి ఆ పని కి ఉన్న రిపిటీటివ్ నేచర్. ఒక్క రోజు, ఒక్క సారి చేస్తే సరిపోదు. చేస్తూనే ఉండాలి. చేస్తే మామూలుగా ఉంటుంది కానీ చెయ్యకపోతే కనిపిస్తుంది ఏవిటో. ఇంటి శుభ్రానికి శత్రుత్రయం ... దుమ్ము, చెత్త, మట్టి. అందులో దుమ్ము రక్తబీజుడి జాతికి చెందినదే అనిపిస్తుంది నాకు. టెడ్డీ బేర్, బార్బీ బొమ్మలు ఇష్టంగా కొనుక్కొని ఈ రాక్షసుడికి భయపడే వాటికి ప్లాస్టిక్ కవర్ ముసుగులు వేసేస్తూ ఉంటాం కదా. ఈ దుమ్ము అటక ల మీదా, ఫాన్ల మీద ఓ రకంగా, నేల మీద ఇంకో రకంగా, ఎలక్ట్రానిక్స్ మీద మరో రకంగా ఏర్పడుతూ ఉంటుంది. ఒకదానికి ఉపయోగించిన ఆయుధం ఇంకో దానికి ఉపయోగించలేం. అమెజాన్ లో కి వెళ్తే దోమల మెష్ తుడవడానికి ఓ బ్రష్, కార్పెట్ తుడవడానికి ఇంకోటి ఇలా అమ్ముతాడు. కానీ మనం ఆ ట్రాప్ లో పడకూడదు. మా నాన్నగారు పాత దిండు గలీబు తో ఫాన్ తుడిచే వారు. ఇవి ఇండియా లో మనకే సాధ్యమైన జుగాడ్ చిట్కాలు.
కొంతలో కొంత చెత్త ఫర్వాలేదు. ఇంట్లో ఫంక్షన్ లాంటివి పెట్టుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది. లేకపోతే మామూలే. ఇంక మట్టి ... పిల్లలు, మొక్కలు, పెంపుడు జంతువులు ఉన్నప్పుడూ, వానాకాలం లోనూ వస్తుంది అనుకోవచ్చు. ఇవి కాక పొరపాటున కిందపడి పగిలిపోయేవి, పౌడర్ డబ్బాల్లాగా చిమ్మబడేవి, నూనెలాగా రుద్దిరుద్ది కడగాల్సి వచ్చేవి .. ఇలాంటివి బోనస్. చిట్కాలు అవసరం అయ్యే పనులు ఇవి!
ఈ మూడింటిని దాటితే ప్రత్యక్షమవుతాయి జీవులు... బొద్దింకలు, ఎలకలు, దోమలు, ఈగలు etc. నేను చచ్చిపోతాను.. మిమ్మల్ని కూడా తీసుకు పోతాను అనే సినిమా సైకోల్లాగా ఇవి పోవాలంటే మనక్కూడా ప్రమాదకరమైన కెమికల్స్ వాడాల్సిందే!
ఇంటికొచ్చిన ప్రతీ సామాను నువ్వు మెయింటైన్ చెయ్యాల్సిన ఇంకో వస్తువే అని తెలియడమే పెద్దరికమ్. ఇది తెలియక వస్తువులు కొనుక్కుంటూ వెళ్లిపోవడం కుర్రతనం. ఈ కుర్రతనమే ఫాబ్రిక్ సోఫా కొనమంటుంది. శిల్పారామం లో, హోమ్ సెంటర్ లో రకరకాల వస్తువులు కొనమంటుంది. మన దేశానికి సంబంధం లేని వాళ్ళు ఇళ్ళు ఎలా సద్దుకుంటారో చూసి వాళ్ళలాగా ఇల్లు సద్దుకోమంటుంది. వాళ్ళకి దుమ్ము తక్కువేమో.. అన్నీ ఓపెన్ గా ప్రదర్శించుకుంటారు. మన ఇళ్లలో ఒకేఒక షో కేస్ ఉంటుంది. అందులోనే అన్నీ పెట్టుకోవాలి. ఈ మధ్య ఈ రాగి పాత్రలు, ఇత్తడి బిందెలు,బాయిలర్లు హాల్లో పెట్టుకోవడం ఒక క్రేజ్. కానీ వాటిని అలా మెరిపించాలంటే రెగ్యులర్ గా చింతపండు తో తోముకుంటూ ఉండద్దూ! మళ్ళీ అదో పని!
అభిరుచి ఉండి, ఆసక్తి ఉండి, చేసుకోగలిగిన శక్తీ ఉంటే ఇవన్నీ పనుల్లా అనిపించవు. అలాంటి వారి ఇళ్ళు కూడా భలే చక్కగా చూడముచ్చట గా ఉంటాయి. May God bless them! అలాంటి ఓ ఆంటీ మాకు ఉన్నారు. ఆవిడ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో! మనిళ్ళలో ఓ వాడుక ఉంది చూడండి.. నేల మీద పడ్డ పాలెత్తుకు తాగచ్చు అని ... అలా అన్నమాట. ఇద్దరి ఇళ్ళకి ఒకే అమ్మాయి తడిగుడ్డ పెడుతుంది. కానీ ఆవిడ నేల మెరిసిపోతూ ఉంటుంది. మా నేల మీద తడిగుడ్డ పెట్టిన ఆనవాలు కనిపిస్తాయి. (ఇది ఓ మాప్ యాడ్ లాగా అనిపిస్తోంది కదూ. కానీ కాదు. మేము వాడే మాప్ కూడా ఒకే కంపెనీ.. ఎందుకంటే అది మా హెల్ప్ తనే తెచ్చుకుంటుంది) ఓ రోజు అంటీ ని అడిగితే చెప్పారు ... అమ్మాయి తడిగుడ్డ పెట్టాక ఆవిడ మళ్ళీ పెట్టుకుంటారట! ఇలా శ్రద్ధగా, ఓపిక గా చేసుకున్న ఇళ్ళు చూడగానే తెలుస్తూ ఉంటాయి.
ఓ వాడుక ఉంది చూసారా ... ఇల్లు చూసి ఇల్లాలిని చూడాలని.. చూడాలి, కానీ జడ్జ్ చెయ్యద్దు. ఇది నా పాయింటు. ప్రతి కుటుంబానికి ఓ లైఫ్ స్టైల్ ఉంటుంది. అది వారి పరిస్థితులని బట్టీ, ప్రయారిటీలని బట్టీ ఏర్పడుతుంది. అవి పూర్తిగా తెలుసుకోకుండా కేవలం ఇల్లు శుభ్రంగా లేదని ఒకరిని తక్కువ గా చూడకూడదు కదా.
ఇన్స్టాగ్రామ్ లో యూరోప్ కి చెందిన ఓ అమ్మాయి కి ఇళ్ళు క్లీన్ చెయ్యడం ఎంత ఇష్టమంటే వారాంతాల్లో వేరే వాళ్ళ ఇళ్ళు శుభ్రం చేసేస్తోంది. (ఆ అమ్మయి అకౌంట్ లింక్ ఇచ్చాను. పేరుకుపోయిన చెత్త చూడలేని సున్నితమైన సెన్సిబిలిటీ ఉంటే క్లిక్ చెయ్యకండి). వాళ్ళ ఇళ్ళలోకి బలవంతంగా దూరిపోయి కాదు లెండి. మానసిక పరిస్థితి బాలేకో, అంగ వైకల్యం వల్లో తమ ఇల్లు శుభ్రం చేసుకోలేక ఇల్లు చెత్త కుండీ లాగా అయిపోయిన వాళ్ళ ఇళ్ళు మంచి మనసు తో శుభ్రం చేసి పెడుతుంది. ఉచితంగానే. దేనితో ఏది తుడిస్తే ఎలా శుభ్రం అవుతుందో అనే కోర్స్ చేసింది కూడా ఆ అమ్మాయి! (మన దగ్గర హోమ్ సైన్స్ అంటారు... అది ఇలాంటి కోర్సెనా?). వారి దేశాల్లో మరీ పరిస్థితి ఘోరంగా ఉంది అని ఆ అమ్మాయి క్లీన్ చేసే ఇళ్ళు చూస్తే తెలుస్తుంది... మన దగ్గర మరీ పరిస్థితి అంత దిగజారదు.
దీనికి నాకు తోచిన ఓ కారణం ... ఇంటి శుభ్రత ని లక్ష్మి దేవి కి ముడిపెట్టేయడం. డబ్బులు మెండుగా ఉండాలంటే రోజూ ఇల్లు తుడుచుకోవాలి, పాచి చేసుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి అనేది మనకి బ్రెయిన్ వాష్ చేసేసారు. సాక్ష్యం కావాలంటే "ఉండమ్మా బొట్టు పెడతా" సినిమా చూడండి.
సొంత ఇళ్ళ వాళ్ళకి ఇల్లు వారిదే కాబట్టి శ్రద్ధ ఉంటుంది. అద్దె వాళ్ళకి ఇంటి వాళ్ళ భయం ఉంటుంది. ఇవేవీ లేకపోయినా పని చెయ్యడానికి డొమెస్టిక్ హెల్ప్ వ్యవస్థ ఉంది. వాళ్ళకి తోచినట్టు తుడిచి పెట్టేస్తారు.
పశ్చిమం లో మోటివేషన్ గురు లు ఈ మధ్య చెప్తున్నారు .. లేచాక వెంటనే పక్క శుభ్రంగా వేసేసుకోండి.. దాని వల్ల మీ రోజు బాగా గడుస్తుంది అని. ఇది ప్రత్యేకంగా చెపుతున్నారంటే వాళ్ళకి అలవాటు లేదా అనిపించింది నాకు. మన ఇళ్లలో పిల్లల వీపులు బద్దలు కొడతారు కదా పక్కలు తియ్యకపోతే! అది కూడా పొద్దున్నే!
నిజానికి శుభ్రంగా ఉన్న ఇల్లు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కొంత మంది విషయం లో ఈ మాట కి రివర్స్ కూడా పని చేస్తుంది. మనసు ప్రశాంతంగా అవ్వటానికి ఇల్లు క్లీన్ చేసే అలవాటు చాలా మందికి ఉంది మనలో. కానీ ముందు చెప్పినట్టు మానసిక స్థితి బాగోకపోతే అస్సలు ఇంటిని శుభ్రం చేసుకోలేం. ఆ పని భారంగా అనిపిస్తుంది. విసుగ్గా అనిపిస్తుంది. అలాగే కెరీర్ కొంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడు కూడా ఇంటి పని కి అస్సలు సమయం కేటాయించలేం. ఈగ ఇల్లలుకుతూ పేరు మర్చిపోయింది అనేది సామెత. ఇల్లలికే పనుల్లో పడితే పేరేంటి .. కెరీర్, వర్క్ గోల్స్ .. ఇవన్నీ మర్చిపోయే ప్రమాదం లేకపోలేదు.
ఇల్లలకడం అంటే గుర్తొచ్చింది... నేను ముందు చెప్పినట్టు ... ఈ ఇల్లు శుభ్రత విషయం లో బ్రెయిన్వాష్ చిన్నప్పుడే మొదలవుతుంది .. ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి .. అని మొదలవుతాయి కదా చిన్న పిల్లల ఆటలు. ఇల్లలకగానే పండగ కాదు అంటారు.. ఈ సామెత కి నాకు మొత్తం వ్యాసం లో ఎక్కడా సందర్భం కుదర్లేదు. ఊరికే పడుంటుంది అని రాస్తున్న అంతే 😄
ఇంటర్నెట్ లో ఇల్లు మైంటైన్ చెయ్యడానికి క్లీనింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. రోజూ గదులు తుడుచుకోవటం, వారానికోసారి బాత్రూమ్స్, నెలకోసారి మంచం దులుపుకోవడం, కర్టెన్స్ గట్రా మార్చుకోవటం.. ఇలా. కానీ ఈ షెడ్యూల్ ఇంటింటికీ మారుతుంది కదా. ఇంటి ముందు రోడ్డు వేసినా, కన్స్ట్రక్షన్ పని జరిగినా ఇంట్లోకి బోల్డు దుమ్ము, ధూళి వస్తుంది. అలాగే ఇంట్లో పిల్లలూ, పెంపుడు జంతువులూ ఉంటే ఆ షెడ్యూల్ వేరు! అందుకే అవి పెద్దగా ఉపయోగ పడవు మనకి. అలాగే వెస్ట్ వాళ్ళు కనిపెట్టిన వాక్యూం క్లీనర్లు, ఇల్లు తుడిచే రోబోలు కూడా మనకి పనిచేయవని నా అభిప్రాయం.
మన దగ్గర దీపావళి, ఉగాది లాంటి పండగలకి ఇళ్ళు నిగనిగలాడేలా చేసుకుంటాం. మంచు దేశాల్లో స్ప్రింగ్ క్లీనింగ్ అంటారు ... ఓహో ఓహో వసంతమా అంటూ బూజులు దులుపుకుంటారన్నమాట అక్కడి వారు.
ఇంటర్నెట్ లో అందరం చూసాం ఓ ఫార్వార్డ్ .. జపాన్ లో స్కూల్ పిల్లల కి టాయిలెట్స్ శుభ్రం చేయడం నేర్పిస్తారని. మన దగ్గర ఇది ఎంత పెద్ద వివాదం అవుతుందో నేను చెప్పక్కర్లేదు. గాంధీ సినిమా లో ఓ సీన్ ఉంటుంది... సబర్మతీ ఆశ్రమం లో టాయిలెట్స్ శుభ్రం చేసే పని వారానికి ఒకరు చెయ్యాలి. ఓ సారి కస్తూర్బా గారి వంతు వస్తుంది. ఆవిడ అస్సలు చెయ్యడానికి ఇష్టపడదు. గాంధీ ఆ సమయం లో ఆవిడ మీద కన్నెర్ర చేస్తారు కూడా!
సంపన్నుల ఇళ్లలో టీపాయ్ ల మీద, బల్లల మీద, గోడల మీద ఉండే ఖరీదైన గృహాలంకరణ వస్తువులు, ఇండోర్ ప్లాంట్స్ మీద ఆకులకి సైతం దుమ్ములేకుండా చూసినప్పుడు "తాజ్ మహల్ కు రాళ్ళెత్తిన కూలీలు" గుర్తొస్తారు నాకు. మనం సొంతగా మెయింటైన్ చేసుకోలేని ఇళ్ళు కట్టుకుని ఇంకో జాతి మీద మనం డిపెండ్ అయ్యి .. వారు మన మీద డిపెండ్ అయ్యేలా చేస్కున్నామని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కానీ నేను ఈ బ్లాగ్ ప్రశాంతంగా రాయగలుగుతున్నాను అంటే నా ఇల్లు శుభ్రం చేసుకొనే పని నుంచి నేను ఫ్రీ అవ్వడం వల్లే అని కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ విషయం గురించి మాట్లాడటానికి నా అనుభవం తక్కువ... ఇంటి మెయింటెనెన్స్ లాగే. 😁
Saturday, June 20, 2020
పదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన నా కథ
![]() |
| రెండో వరస ఆఖరు పేరా లో కొన్ని లైన్లు ప్రింట్ అవ్వలేదు. "గాభరాగా ఫోన్ ఎత్తితే 'లోన్ ఏమన్నా కావాలా అండీ?' అంటూ వినిపించింది అటు నుంచి. కొంచెం ప్రశాంతత...' |
Friday, October 19, 2018
అమ్మ కావాలి
![]() |
| నా చేతి రాత లో ఓ అన్నమయ్య కీర్తన |
- సాహిత్య పరంగా - తెలుగులో గొప్ప పుస్తకాలని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయడం, తెలుగు పద్యం, అవధానం లాంటి సాహితీ ప్రక్రియలని ప్రపంచానికి తెలియచేయటం వంటివి
- సాంస్కృతికంగా - తెలుగు పద్ధతులు, కళలు, ప్రాచీన తెలుగు మేధస్సు, తెలుగు చరిత్ర మరుగున పడిపోవటం
- ఆర్ధికంగా - ముందే చెప్పినట్టు స్పెండింగ్ పవర్ (ఖర్చు చేసే శక్తి) ఉన్న ఎగువ తరగతుల వారు తెలుగు కి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం/స్పాన్సర్ చెయ్యకపోవడం, తత్సంబంధమైన వస్తువులు కొనుగోలు చెయ్యకపోవడం, ఆదరించకపోవడం
- మేధోపరంగా - కంప్యూటర్ లో/ఫోన్ లో తెలుగు టైప్ చెయ్యడం లో ఉన్న ఆనందమే వేరు.. ఇది సాధ్యం అయింది అంటే అర్ధం .. ఓ కంప్యూటర్ నిపుణుడికి తెలుగు భాష వచ్చు. ఇది చిన్న ఉదాహరణ. ఇంకా భాష ని కొత్త పుంతలు తొక్కించే అవకాశాలు ఎన్నో. (నా పర్సనల్ డిమాండ్ .. ఆన్లైన్ లో తెలుగు లో ఇంకా బోల్డు ఫాంట్స్ రావాలి ) ఇవన్నీ తెలుగు భాష రాకపోతే ఎలా సాధ్యమవుతాయి?
- నైతికంగా - మాతృభాష ని మర్చిపోయే జాతి గురించి ఏం గొప్పగా చెప్పగలం? గతాన్ని మర్చిపోయే జాతి కి ఏ పాటి భవిష్యత్తు ఉంటుంది?
Friday, August 31, 2018
స్రష్టకష్టాలు
కష్టాల బ్యూటీ కాంటెస్ట్ లో అష్టకష్టాలకే కిరీటం తొడగబడుతుంది.
కానీ వాటిని మించిన కష్టాలు కొన్ని ఉన్నాయి .. అవే కళాకారుల కష్టాలు .. కళను సృష్టించే కళా స్రష్టల కష్టాలు .. స్రష్టకష్టాలు. (అసలు కళ ఎందుకు అనేవారు చివరి పేరాగ్రాఫ్ చదివి మళ్ళీ ఇక్కడికి రావచ్చు)
కళ ని జీవనశైలి గా, భుక్తి-ముక్తి మార్గంగా ఎంచుకొన్న వారి గురించే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. (వీకెండ్స్ లో కథక్ క్లాసెస్ కి వెళ్తున్న వారు, చిన్నప్పుడు ఎప్పుడో సంగీతం నేర్చుకుని ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళు, ఇంట్లో ఏదో ఒక musical instrument/డాన్స్ గజ్జెలు ఉన్నవారు, సరదా కి అప్పుడప్పుడూ బొమ్మలు వేసుకొనే వారు... వీళ్ళని hobbyists అంటారు.)
కష్టాల గురించి మాట్లాడుకొనే ముందు క్లుప్తంగా సుఖాల గురించి కూడా మాట్లాడుకుందాం (క్లుప్తంగా ఎందుకంటే కొన్నే ఉంటాయి కాబట్టి 😉)
కళ వల్ల తోటివారిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ఆ అమ్మాయి పాటలు బాగా పడుతుంది అనో, వాడు బాగా బొమ్మలు వేస్తాడు అనో స్కూల్ టైం నుంచీ వీరిని ప్రత్యేకంగా introduce చెయ్యడం జరుగుతూ ఉంటుంది. Performing arts అయితే ఇక చెప్పనే అక్కర్లేదు... స్టేజి మీద spot light లో ఉండే అవకాశం. సెలెబ్రిటీ స్టేటస్. యశస్సు. కళాకారులకి లభించే గొప్ప perks లో ఇది ఒకటి. అభిమానులు - మన కళని ఇష్టపడే మనుషులు .. మనం ఏది రాసినా, తీసినా, చేసినా తియ్యటి compliments తో అభిమానం పంచే వారు! బిరుదులూ సత్కారాలూ పురస్కారాలు, మీడియా లో ఇంటర్వ్యూలు...
ఇంక ఏ ఇతర వృత్తి లో లేని attention ఈ రంగానికి ఉంది.
కానీ తమాషా ఏంటంటే ఆ attention ఓ కళాకారుడి కష్టాల మీదకి ప్రసరించదు.
కళని నమ్ముకుని జీవనం సాగించడం లో చాలా కన్నీళ్లు ఉన్నాయి.
మాకు తెలుసు అన్నవారికి కూడా తెలియనివి ఉన్నాయి.
ముందే చెప్పినట్టు గా ఇందులో అష్టకష్టాలు ఉన్నాయి ...
అప్పు, యాచన, ముసలితనం, వ్యభిచారం, చోరత్వం, దారిద్య్రం, రోగం, ఎంగిలి భోజనం
కళను నమ్ముకోవడం లో మొదట వేధించే సమస్య Financial insecurity. కళ కి సంబంధించిన ఉద్యోగాలు చాలా తక్కువ. చాలా వరకూ art teaching వైపు ఉంటాయి. వాటిలో job security ఉన్నవి ఇంకా తక్కువ. ఇంకొక ప్రమాదకరమైన పరిణామం ఏంటంటే ఇప్పుడు art = charity అన్నట్టు చూస్తున్నారు. కళాకారులు కూడా వేదిక లభిస్తే డబ్బులు అడగలేని పరిస్థితి. Opportunity ఇచ్చాము కాబట్టి డబ్బు ఇవ్వము అనే వైఖరి! సమాజం లో కూడా టికెట్టు కొని కళా ప్రదర్శన లకి వెళ్ళే కాలం చెల్లిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు, యాచన, దారిద్య్రం ఇవన్నీ పెద్ద ఆశ్చర్యకరమైన పరిణామాలేమీ కావు.
ముసలి తనం ... ఇది కళాకారులకి రెండు రకాలు. డబ్బులేని ముసలితనం ఒక ఎత్తైతే తమ ఆలోచనలు ప్రస్తుత తరానికి suit అవ్వక ఒక కళాకారుడు relevance కోల్పోవడం ... రెండో ముసలితనం - ఇష్టం లేకున్నా ఓ కళాకారుడిని forced retirement లోకి నెట్టేస్తుంది. ఇంకా ఎంతో చెయ్యాలనుకుంటాడు కళాకారుడు. కుదరదు అంటుంది కాలం.
వ్యభిచారం - literally, figuratively దీని బారిన పడవలసి వస్తుంది కళలో... ఇష్టం లేకుండా, మనసు అంగీకరించకుండా డబ్బు కోసమో అవకాశం కోసమో. అంత ఆరాటం దేనికి? No చెప్పచ్చు గా అనచ్చు. కానీ అనద్దు ప్లీజ్. అంత కష్టమైన choice తీసుకున్నప్పుడే తెలియాలి .. వారు ఆ కళ పట్ల ఎంత passionate గా ఉన్నారో.
చోరత్వం - ఏది పోయినా బాధే. కానీ నగలు, చీరలు, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఓ ఐడియా చోరీ అయితే ఇంక దాన్ని మర్చిపోవలసిందే. జీవితాంతం వేరే వారి పేరు మీద చెలామణీ అవుతున్న తన ఐడియా ని చూసి బాధ దిగమింగుకోవలసిందే. కోర్టులో కేసు వేయచ్చు కదా అనేవారు 'యాచన, దారిద్య్రం, అప్పు' అనే పేరా చూడుడు.
రోగం - జరిగితే రోగం అంత సుఖం లేదన్నారు. ఒక కళాకారుడికి .. జరగదు.
ఎంగిలి భోజనం - 'నా దగ్గరో కాన్సెప్ట్ వుందోయ్' అంటాడు డబ్బు పెట్టేవాడు. అది నా ఆలోచన కన్నా గొప్పదేం కాదు. Actually, అస్సలు గొప్పది కాదు. కానీ యెదుటనున్నవాడు డబ్బు పెట్టేవాడు. ఈ ఎంగిలి ఆలోచన ని నేను స్వీకరించాలి. నిజమే .. నో చెప్పే హక్కు ఉంది ... కానీ నో చెప్పే luxury ఉండద్దూ?
ఇవి కేవలం అష్టకష్టాలు ...
ఇవి కాక ఓ సగటు కళాకారుడు అనుభవించేవి
Indifference - తన కళ పట్ల సమాజం లో ఉన్న ఉదాసీనత ఒక కళాకారుడిని బాగా కుంగదీస్తుంది. 72 మేళకర్తల్లో కృతులు సాధన చేస్తాడు ఓ సంగీతజ్ఞుడు. 'carnatic music ఎవరు వింటున్నారండీ' అని తీసిపారేస్తే అతని కళ ఏం కావాలి? ఇప్పుడు సమాజం లో భారతీయ కళల పట్ల ఉన్న వైఖరి ఇదే కదా .. డబ్బు, కీర్తి, బిరుదులు .. వీటన్నిటి కంటే ముందు కళాకారుడికి కావాల్సింది audience ... వీళ్లేరి? ఓ మంచి ప్రాస రాస్తే 'భలే' అనేవారేరి? 'టెలుగు చదవడం రాదు' అనే వారు తప్ప!
అర్ధం చేసుకోకపోవడం - ఓ కళాకారుడి lifestyle చాలా భిన్నంగా ఉంటుంది .. ఇంట్లోనే ఎక్కువ సేపు గడపాల్సి రావచ్చు ... ఒంటరిగా ఉండవలసి రావచ్చు... తన కళకి ప్రస్తుతం గుర్తింపు లేకపోవచ్చు ... తన కళ లో తన శైలి ఏంటో ఇంకా ఆ కళాకారుడు కనుగొనకపోవచ్చు .. ఈ struggles మధ్య అతనికి కావాల్సింది కొంత support, కొంత understanding. ఇది ముందు అతని కుటుంబం నుంచి, చుట్టాల నుంచి, స్నేహితుల నుంచి రావాలి. అలా రాని రోజు అతని కళ చాలా negative గా ఎఫెక్ట్ అవుతుంది.
Insensitivity - ఓ వైపు సున్నితమైన రచనలు చేసే వారిని పొగుడుతారు కానీ ఆ రాసే వ్యక్తిని మాత్రం 'మీరు ఇంత సున్నితంగా ఉండకూడదండి' అంటారు. అందరు కళాకారులు సున్నిత మనస్కులే. కానీ సమాజం వారి తో చాలా insensitive గా డీల్ చేస్తుంది. ప్రోత్సాహం లేకపోగా కళలని ఎంచుకున్నందుకు విమర్శించడం, art etiquette లేకపోవడం (ఏది ఒక పాట పాడు అని అడుగుతారు .. పాట అందుకోగానే వారిలో వారు మాట్లాడుకోవడం మొదలుపెడతారు!), హేళన చెయ్యడం (కవులకి, నటులకి ఇది బాగా అనుభవం)... 'పట్టించుకోకూడదు' అని అనచ్చు. ఓ హాస్య కళాకారుడు అన్నట్టు 'అబ్బా ఛా!'
స్వాతంత్రం - తన ఆలోచనలని ఎటువంటి సంకోచం, compromise, overridings లేకుండా బయటికి తీసుకువచ్చే స్వాతంత్రం ఓ కళాకారుడికి సమాజం ఇవ్వాలి. కళాకారుడు స్వతంత్రుడు కాని సమాజాల గురించి చరిత్ర లో చదువుకున్నాం. కళాకారుడు తను అనుభవించిన నిజాన్ని తన కళ ద్వారా ప్రదర్శిస్తాడు. ఆ నిజాన్ని చూడలేకపోయినా, ఆ కళాకారుడి అభిప్రాయానికి tolerance చూపించలేకపోయినా అది ఆ కళాకారుడి problem కాదు సమాజానిది. కానీ ఇది చివరికి కళాకారుడి మెడకే చుట్టుకుంటుంది .. అందుకనే ఇక్కడ 'కళాకారుడి కష్టాలు' లో లిస్ట్ చేయవలసి వస్తోంది.
Artists కి అసలే కొన్ని internal struggles ఉంటాయి.
నిరంతర కళా సాధన (సినిమాలో చూపించినట్టు ఆ సాధన కొండల మీద, నదుల దగ్గర... అందమైన ప్రదేశాలలో రెండు నిముషాలలో పూర్తయ్యే montage లాగా ఏమీ జరగదు .. రోజూ ఒకే గది లో ... రకరకాల సమస్యల మధ్య సాగాలి)
Doubts ... అసలు నేను కళని నమ్ముకొని కరెక్టే చేస్తున్నానా? పోనీ ఏదైనా ఉద్యోగం చూసుకోనా? ఆమ్మో .. కళ లేకుండా ఉండగలనా? అవునూ ... ఈ ఐటం ఈ స్టేజ్ కి తగునా? ఇది చూసేవాళ్ళకి నచ్చుతుందా? అసలు ఎవరైనా వస్తారా? ఈ నెల ఎలా గడిచేది? ఓ కొత్త ఐడియా ... భలే ఉంది ఈ ఐడియా .. ఎవరికి చెప్తే పని అవుతుంది? వాళ్ళకి చెప్తే కొట్టేస్తారేమో! వీళ్ళు అసలు ఇలాంటి ఐడియాలు వింటారా? ఇది ఎలాగైనా చేస్తే అందరికీ నచ్చుతుంది .. నచ్చుతుందా? నేనే నచ్చుతుంది అనుకుంటున్నానా? ఇలా ఉంటుంది ఓ కళాకారుడి ఆలోచనా ప్రపంచం. ఇవి చాలక బయటి ప్రపంచం!
ఇంత ఎందుకు? ఉద్యోగం చేస్కోవచ్చు కదా? అని అనచ్చు.
చాలా మంది అలా చేస్తున్నారు కూడా. ఏదో ఒక కళ కలిగి ఉన్నా దాన్ని అప్పుడప్పుడూ సాధన చేస్తూ, ఆదాయ మార్గం గా ఆధార పడక వేరే ఉద్యోగం/వ్యాపారం చేసుకొనే వారు ఆ కళని ఎంత మిస్ అవుతున్నారో వారినే అడగండి.
Art is not a choice. It's a voice. దాని మాట విని తీరాల్సిందే. ఇంకో చోట ఆనందం దొరకదు. ఇమడలేం. మనం మనం కాదు. ఇది తెలిస్తే 'ఇంకో పని చేస్కోవచ్చు కదా' అనే సలహా ఇవ్వరు. ఇన్ని కష్టాలున్నా, ఏ విధంగా feasible కాకపోయినా ఇంకా కళాకారులు ఎందుకున్నారు అంటే ఇదే సమాధానం.
నిజానికి ఇన్ని కష్టాలు ఉండవలసిన అవసరం లేదు. ఓ సమాజానికి కళ ఎంత అవసరమో ఆ సమాజానికి తెలిస్తే.
కొన్ని రోజుల క్రితం ఈ చిన్న కథ చదివాను ఒక FB post లో.
రాతి యుగం నాటి కాలం లో ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారట. మొదటి ఆవిడ 'మా వాడు చాలా బాధ్యత కలవాడు. రోజూ వేటకెళ్లి మా అందరికీ ఆహారం తెస్తాడు .. జీవితానికి కావాల్సిన విద్యలన్నీ నేర్చుకుంటాడు' అంది. రెండో ఆవిడ నిట్టూర్చి 'మా వాడూ ఉన్నాడు .. ఎందుకూ? రోజూ ఆ గుహల్లో కెళ్ళి యేవో పిచ్చి గీతాలు గీస్తూ ఉంటాడు' అని వాపోయిందట. కొన్ని శతాబ్దాలు గడిచాయి. మొదటి ఆవిడ కొడుకు చేసిన పనుల తాలూకు ఏ ఆనవాలూ మిగల్లేదు. కానీ రెండో ఆమె కొడుకు గీసిన 'పిచ్చి గీతలు' మానవ పరిణామక్రమాన్ని అర్ధం చేస్కోవడం లో దోహదపడ్డాయి.
ఇదే కళ చేసేది.
Art may not be something you want. It is something you NEED.
Friday, August 24, 2018
నోబెల్ సాధించాలంటే ఏం చెయ్యాలి?
ఆ కార్టూన్ లో ఓ సైంటిస్ట్ కి బండ రాళ్ళు కొట్టే పని చెయ్యవలసి వస్తుంది. మిగిలిన వాళ్ళు రోజులు రోజులు ఒకే బండ రాయిని సుత్తులతో కొట్టి కొట్టి చిన్న చిన్న ముక్కలు చేస్తూ ఉంటారు. ఈ సైంటిస్ట్ మాత్రం ఆ బండ రాతిని అన్ని వైపులా గమనించి, తడిమి దాని సెంటర్ పాయింట్ ని కనుక్కొని దాని మీద సుత్తి తో చిన్నగా తడతాడు. అంతే. అంత పెద్ద బండ రాయి పొడి పొడి అయిపోతుంది!
నన్ను ఈ కార్టూన్ చాలా ప్రభావితం చేసింది. ఒక పని ని నేను approach చేసే విధమే మార్చేసింది.
నా అనుభవం ప్రకారం hard work is over-rated అండి.
కష్టపడటాన్ని ఎందుకో అనవసరంగా glorify చేసేసారు.
కష్టపడి చదువుకోవాలి. కష్టపడి ఇల్లు కట్టుకోవాలి. కష్టపడి పెళ్లి చేసుకొని కష్టపడి భరించి కష్టపడి షష్టి పూర్తి జరుపుకోవాలి. కష్టపడి పిల్లల్ని పెంచాలి. ఆ పిల్లలకి... కష్టపడి... వాళ్ళు కష్టపడే చదువులు చెప్పిస్తే అతి కష్టం మీద ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ కష్టపడి పెళ్లిళ్ళు చెయ్యాలి. ఎందుకండీ ఇంత కష్టం?
అంటే చదువుకోవద్దా? ఉద్యోగాలు.. పెళ్లి ... పిల్లలు?
కష్టపడద్దు అన్నాను కానీ మానెయ్యమనలేదు కదండీ .. కష్టం అనే పదం తో ఇవన్నీ ఎంత ముడిపడిపోయాయి అంటే కష్టపడకపోతే ఈ పనులు అసలు కావు అనే brain-washed స్థితి లో ఉన్నాం అన్న మాట!
కష్టపడి పనిచేయడానికి వ్యతిరేక పదం .. బద్ధకించడం కాదు .. సులువు గా పనిచెయ్యడం.
Working with EASE
దీనికి example గా ఓ కథ ఉంది.
విక్రమార్కుణ్ణి స్వర్గం పిలిపించారట .. ఇద్దరు అప్సరస ల మధ్య ఎవరు గొప్పో తేల్చటానికి.
అప్పటికి అందరూ వారిని పరీక్షించి .. ఇద్దరూ రూపం లో, నృత్య కళ లో సమానంగా ఉండటం చూసి ఎటూ తేల్చుకోలేకపోయారట.
విక్రమార్కుడు ఇద్దరినీ పిలిపించి వారి మెడలో పూలమాలలు వేయించి నృత్యం చెయ్యమన్నాడట.
ఇద్దరు అప్సరసలు గొప్పగా నృత్యం చేశారు. కొన్ని పగళ్లు, కొన్ని రాత్రులు .. అలా చేస్తూనే ఉన్నారట .. ఇద్దరిలో అలుపు కనపడటం లేదు. పోటాపోటీ గా చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత నృత్య ప్రదర్శన పూర్తయింది. మళ్ళీ చూసే వారికి ఎవరు గొప్పో తెలియలేదు.
విక్రమార్కుడు మాత్రం వారి మెడలో వేసిన మాలలు తెప్పించుకొని చూశాడట.
మొదటి అప్సరస మెడలో వేసిన మాల లో పూలు వాడిపోయిఉన్నాయి. రెండో అప్సరస మెడ లోని మాల తాజా గా ఉంది!
మొదటి అప్సరస ఒత్తిడి కి లోనైంది .. ఆ వేడికి పూలు వాడిపోయాయి. రెండో అప్సరస కి నృత్యం మంచినీళ్ల ప్రాయం .. అందుకనే ఆమె పూలు తాజాగా ఉన్నాయి. కేవలం ఈ ఒక్క తేడా తోనే ఇద్దరి లో 'ఈజ్' తో ఉన్నది ఎవరో నిర్ణయించాడు విక్రమార్కుడు.
ఇది మన జీవితాల కి అన్వయించవచ్చు. అవే పనులు. కానీ ఆ పనులు చేసే విధం లో కొంత మంది మాత్రమే కనబరిచే సరళత్వం.
అయితే మనకి ఏళ్ళ తరబడి చేసిన brain wash ప్రకారం కష్టపడటం నిజాయితీ కి తార్కాణం. అంతే కాదు 'easy come, easy go' లాంటి సామెతల వల్ల సులువు గా వచ్చిన దానికి మనం విలువ ఇవ్వము అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
కానీ ఒక్క సారి చుట్టూ చూడండి .. ప్రకృతి వైపు.
ప్రకృతి లోనే కష్టం లేదు. గడ్డి కష్టపడి మొలవట్లేదు. నీళ్లు 'నేను కష్టపడి పైకే వెళ్ళాలి' అనుకోవట్లేదు .. సులువుగా పల్లానికే ప్రవహిస్తున్నాయి. చేప పిల్ల ఈదడం కోసం కష్టపడట్లేదు. కోయిల కొన్ని సంవత్సరాలు కష్టపడి సాధన చేసి, ఆడిషన్ గట్రా ఇచ్చి పాటలు పడట్లేదు. వేట సింహానికి క్రీడే కానీ కష్టం కాదు. వేట సింహానికి కష్టమైన నాడు .. ప్రకృతి దాన్ని తనలో కలిపేసుకుంటోంది.
చీమల్ని, తేనెటీగల్ని చూపించి కష్టపడమంటారు కానీ అసలు అవి కష్టపడట్లేదు .. వాటి పని అవి ఇష్టంగానే చేస్తున్నాయి. అవి ఇష్టంగా చేస్తున్నాయి అని నాకెలా తెలుసంటారా? వాటికి హై బిపి, హైపర్ టెన్షన్, stress వల్ల వచ్చే అనేక వ్యాధులు లేవు కనుక. (ఇంగ్లీష్ లో 'disease' అంటే రోగం. అసలు ఆ పదం ఎలా ఏర్పడింది తెలుసా? Dis -ease ... అంటే 'Ease' లేకపోవడమే.)
కావాలని కష్టపడేది మనిషొక్కడే.
అది కూడా తనే సృష్టించుకున్న complications కి hard work అనే పేరు పెట్టి.
సృష్టి లో ఏ పనీ కష్టం కాదు. కానీ అది కష్టంగా మార్చబడుతుంది. కారణాలు కొన్నే ఉంటాయి.
1. ఇష్టాయిష్టాలు - ఒక పని చెయ్యడం అసలు నాకు ఇష్టం లేదు. మొక్కుబడి గానో, ఇంకో దారి లేకో చేస్తున్నాను. అంతే. ఇంక ఆ పని లో ease చచ్చినా రాదు. ఇష్టమైన పని చేయలేకపోవడం .. చేసే పనిని ఇష్టపడలేకపోవడం
2. భయం - అసలు నేను ఈ పని చేయగలనా? అని భయపడగానే నా ఆలోచనా సామర్ధ్యం సగానికి సగం తగ్గిపోతుంది. ఇంక పనిని సులువు చేసే ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి?
3. Conformism - అందరూ ఆ పని ఎలా చేస్తున్నారో నేను కూడా ఆ పని అలాగే చెయ్యాలి అనుకోవడం .. నా వ్యక్తిత్వం, నా బలాలు.. ఇవేవీ పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేస్కుంటూ పోవడం
4. ముతక పద్ధతులు - ఈ పని ఎన్నో ఏళ్ళ నుంచి ఇలాగే జరుగుతోంది .. ఇప్పుడు కూడా ఎంత కష్టమైనా ఇలాగే జరగాలి అనుకోవడం ... update చేసుకోకపోవడం. వాటిని పక్కన పెట్టలేని అధైర్యం.
5. టైం పాస్ - ఇది షాకింగే కానీ నిజం .. ఒక పని సులువు గా అయిపోతే మిగిలిన టైం లో ఏం చెయ్యాలి? అని పని ని కష్టంగా ఉంచుకుంటూ ఉండటం.
6. ఫలం తీపి - హిందీ లో 'మెహనత్ కా ఫల్ మీఠా హోతా హై' అని సామెత ఉంది కదా .. కష్టపడకపోతే ఆ పండు తియ్యగా ఉండదేమో అని కొంతమంది అనుమానం. కష్టపడిన వాళ్ళకి వచ్చే పేరు రాదేమో అని ఇంకో అనుమానం.
ఇవి కాక ఈగోలు, పాలిటిక్స్, హిడెన్ అజెండాలు .. పని ని బోల్డు కష్టంగా మార్చేస్తాయి.
చెయ్యాల్సిన పని లోంచి వీటన్నటిని తీసేస్తే వచ్చేదే EASE.
పోపెయ్యడం దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు దాకా ఈ ఫార్ములా ఉపయోగించచ్చు.
అందరూ కొంచెం కంగారు పడిపోయే పెళ్లి లాంటి తంతులని కొంత మంది ఈజ్ తో ఎలా చేయగలుగుతున్నారు? మన దేశం లో చాలా కష్టాలకి గురి చేసే కొన్ని పనులు కొన్ని దేశాల్లో ఎందుకంత సులువుగా జరుగుతున్నాయి?
ఇవి తీసెయ్యడం ఈజీ కాదు అని అనచ్చు. చూసారా? ease ని సాధించడం అంత 'ఈజీ' కాదు ... అసలు ఇదే కష్టమైన మార్గం (ఇలా అంటే అయినా ఈ దారిలోకి వస్తారని ఆశ 😒)
మనందరికీ ఈ సరళత్వం అనే కాన్సెప్ట్ తెలుసు. మనం admire చేసే వ్యక్తుల్లో ఇది ఉండి తీరుతుంది.
ఆ హీరో ఎంత ఈజ్ తో డాన్స్ చేస్తాడు కదా అంటాం.
ఎంత పని చేసినా ఆవిడ చిరునవ్వు చెక్కు చెదరదండి అని మెచ్చుకుంటాం.
రిక్షా తొక్కి చెల్లి పెళ్లి చేద్దామనుకొనే హీరో ని చూసి నవ్వుకుంటాం.
EFFORTLESS అనే పదాన్ని compliment గా వాడతాం.
గాలిని బంధించడం, హఠ యోగం, క్రతువులు అంటూ కష్టపడక్కర్లేదు .. 'మాధవా మధుసూదనా అని మనసున తలచిన చాలు గా' అని భగవంతుణ్ణి పొందటానికే సులువు మార్గం చెప్పేసాడు ప్రహ్లాదుడు!
మరి ఈజీ అంటే అనీజీ ఎందుకు?
ఎంత గొప్ప పనైనా ఈ సరళమార్గం లో చెయ్యచ్చు అనటానికి నేను సంధించే ఆఖరి అస్త్రం .. ఈ కింది ఫోటో. నోబెల్ సాధించడానికి ఏం చెయ్యాలి? 'కష్ట'పడకూడదు. |
Friday, August 17, 2018
మార్పుమాలక్ష్మి
కొత్త చీరలు, పసుపు పాదాలు, తల్లో పూలు...
కానీ ఆ కొత్త చీరలు చూసే వాళ్ళకి తెలీవు .. ఎన్ని డిస్కౌంట్లు ఉన్నా బడ్జెట్ లో మంచి చీర తెచ్చుకోవడానికి ఆ అతివ ఎంత కష్టపడిందో. పసుపు పాదాలు చూసే వారికి తెలీదు ... టెయిలర్ల చుట్టూ పీకో, ఫాల్, బ్లౌజ్ కోసం, శ్రావణ మంగళవారాల నోముల కోసం కాళ్లరిగేలా ఆ పడతి ఎలా తిరిగిందో.
అసలే బిజీ గా ఉన్న ఆడవాళ్ళ కాలెండర్ లో శ్రావణ మాసం ఇంకో హడావుడికారి.
working women అయినా, house wives అయినా ఈ మాసం చాలా stressful గా ఉంటుంది .. శుక్రవారమే ఇంటెడు పని, ఆరోజే రాని domestic help, పిండి వంటలు, మామూలు పనుల మీద ఈ తమలపాకులు, వక్కలు, పళ్ళు, పూల షాపింగ్, పేరంటాలకి, నోములకి ఎక్కే గడప, దిగే గడప .. పోనీ ఓపిక లేక ఏదైనా తక్కువ చేస్తే గిల్టీ ఫీలింగ్ ..
అయినా ఇష్టం గా చేసేది కష్టంగా అనిపించదు అనుకోండి. పైగా ఈ నెల చేసుకొనే వ్రతాలు, పూజలు,నోములు అన్నీ వారి 'సౌభాగ్యం' ఉరఫ్ 'అత్తారింటి మేలు/భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలు/ముత్తయిదువతనం' మీద ఆధారపడి ఉన్నాయి మరి!
ఈ గౌరవం తో వీటన్నిటినీ నేను పాటించాను... అమ్మ కి assistant గా.
పెళ్లి విషయానికొస్తే .. పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేని ఆడవారు, ఉద్దేశం ఉన్నా అవ్వని వాళ్ళు, divorcees, ముత్తయిదువలు కాని వారు .. వీళ్ళకి ఈ మాసం ఓ ఇబ్బందికరమైన సమయం.
(ఒకప్పటి కంటే widows పట్ల మన సమాజం ప్రవర్తన మారింది. కానీ ఇప్పటికీ ఆడవారికి ఏర్పరిచిన hierarchy లో మొదటి స్థానం ముత్తైదువులదే. అంటే కేవలం భర్త బ్రతికి ఉండటమే ఆడవారి స్థానాన్ని నిర్ణయిస్తుంది. జీవన్మరణాలు are just a matter of chance కదా?
అలాగే పెరుగుతున్న divorces కి కారణం ఆడవారిలో సహనం, compromise అయ్యే తత్వం తగ్గుతూ ఉండటమే అన్న అభిప్రాయం ఉంది. నా అభిప్రాయం అడిగితే అసలు మనకి ఒకరి డివోర్స్ మీద అభిప్రాయం ఉండకూడదు అంటాను నేను. భార్యాభర్తలు పక్కపక్క నుంచుంటే వారి మధ్య నుంచి నడవకూడదు అంటారు మన పెద్దవాళ్ళు. మరి అంత close relationship లో మన అభిప్రాయాన్ని మాత్రం ఎందుకు దూర్చడం?)
ఇవి చాలా మంచి పరిణామాలు. (ముఖ్యంగా శనగలు ... ఇంతకు ముందు అవే అవే తిని ఒకటే బోరు)
మన జీవితం నాణ్యత ను పెంచే ఏ విషయాన్నైనా ఐశ్వర్యం గా కొలవడం మన అలవాటు. అష్టలక్ష్ములు అలాగే కదా ఏర్పడ్డారు ... ధనం, ధాన్యం, సంతానం, ధైర్యం... ఇలా.
అలాంటప్పుడు మార్పు ని కూడా మనం ఐశ్వర్యం గా పరిగణించాలి.
Friday, August 10, 2018
'ఫ్రెలసీ'
ఇంకో వైపు 'ఈ దినాలు ఏవిటండీ?' అంటూ అవే అవే వాపోవడాలు ...
అందుకే 'హ్యాపీ ఫ్రెండ్షిప్ డే' లోంచి 'డే' తీసేస్తున్నాను నేను ..
హ్యాపీ ఫ్రెండ్షిప్ గురించి మాత్రం మాట్లాడుకుందాం
ఫ్రెండ్షిప్ కి హ్యాపీ గా ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ అడుగడుగునా స్వేఛ్చ ఉంది. (ఈ గూగుల్ లో చ కి ఛ వత్తు ఇచ్చుకునే స్వేఛ్చ మాత్రం లేదు 😞)
1. స్నేహితుడ్ని ఎంచుకోవడం లో స్వేఛ్చ.. (బలవంతంగా మన మీద పడేసిన రక్తసంబంధాల్లా కాక)
2. ఆ స్నేహం ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేఛ్చ ... (మా మావయ్య ఫ్రెండ్ ఆదివారాలు ఇంటి కొచ్చి ఒక్క మాట మాట్లాడకుండా న్యూస్ పేపర్ మొత్తం చదువుకుని, కాఫీ తాగి వెళ్ళిపోయేవారు. ఇది వాళ్ళ ఫ్రెండ్షిప్.)
3. Quantity లో స్వేఛ్చ .... ఒకే సారి ఎంత మంది ఉన్నా 'యారో( కా యార్' అని పొగుడుతారు. ఒకరి తర్వాత ఒకరు అయినా ఎక్కువ మంది boy friends/girl friends ఉన్న వాళ్ళకి, ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళకి, ఎక్కువ మంది పిల్లల్ని కనేసిన వాళ్ళకి ఈ అదృష్టం లేదు కదా ..
4. ఒక స్నేహం టైం అయిపోయినప్పుడు చాలా అందంగా ఫేడ్ అవుట్ అయిపోతుంది ... పాటల్లో చివరి లైన్ లా గా ... స్కూల్ ఫ్రెండ్స్ తో 'టచ్' పోతుంది ... ఊరు మారిపోయినప్పుడు మాంఛి farewell party తో end అవుతుంది. Divorce లాంటి painful process లు ఉండవు. అలాగే తల్లిదండ్రుల నుంచి విడిపోయినప్పుడు ఉండే societal judgments ఉండవు.
ఈ వదిలేయబడ్డ ex-స్నేహితులు కూడా వదిలేయబడ్డ ప్రేమికుల్లాగా కాక హుందాగా ప్రవర్తిస్తారు ... ఫ్రెండ్ వదిలేసిన వాడు దేవదాసు అవ్వడం అరుదు. ఇంటి బయట నుంచొని హంగామా చేయడం ఇంకా అరుదు. ఫ్రెండ్షిప్ కి ఒప్పుకోకపోతే యాసిడ్ పోయాడాల్లాంటివి అరుదారుదు. (ఇది నేను కనిపెట్టిన పదం).
ముగింపు కూడా అందంగా ఉండే బంధం ఇది!
కానీ నేను కూడా ఎఫెమ్, మాల్స్, వాట్సాప్ చేసే తప్పే చేస్తున్నాను ..
నేను కూడా 'స్నేహబంధమూ ... ఎంత మధురమూ' 'స్నేహమేరా జీవితం .. స్నేహమేరా శాశ్వతం' అని ప్రతి సంవత్సరం వేసే పాటలే పాడుతూ, పిజ్జా హట్ లో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ డిస్కౌంట్ లో ఒకటికి రెండో పిజ్జా తింటూ, మళ్ళీ ఇద్దరు సినీ తారల మధ్య ఫ్రెండ్షిప్ మీద రాసిన ఆర్టికల్ చదువుతూ కూర్చుంటే friendship లో complications గురించి ఎవరు మాట్లాడతారు?
అవును, ఫ్రెండ్షిప్ లో complications ఉంటాయి.
అందులో నాకు తెలిసి జెలసీ ఒకటి ... ఫ్రెండ్స్ మధ్య జెలసీ కి నేను 'ఫ్రెలసీ' అని పేరు పెట్టాను.
ఇది చాలా కామన్. దీని గురించి మాట్లాడకపోవడం కూడా అంతే కామన్.
ఇది కామన్ కాబట్టి మాట్లాడకుండా ఉంటారు అనేది నిజం కాదు. జెలస్ ఫీలయినందుకు గిల్టీ ఫీలయ్యి మాట్లాడకుండా ఉంటారు అనుకుంటాను.
నా ఫ్రెండ్ మీద నేను అసూయ చెందాలి అని ఎవరూ ప్లాన్ చేసుకోరు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అలా జరుగుతూ ఉంటుంది.
మన ఫ్రెండ్ ఏదైనా గొప్పది సాధిస్తే చాలా ఆనందంగా ఫీలవుతాం.
కానీ అదే మీరు కూడా సాధించాలని చాలా ఏళ్ళు గా కృషి చేస్తూ అది మీకు అందకుండా మీ ఫ్రెండ్ కి అందేసినప్పుడు ... అప్పుడు అసూయ కలుగుతుంది.
మన తో ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్ ని పొగిడితే కొంచెం గర్వంగా అనిపించినా, కొంచెం అసూయ కూడా కలుగుతుంది.
ఒక్కో సారి ఈ అసూయ కి కారణం కూడా అక్కర్లేదు.
ఒకవేళ ఈ అసూయ కలగకపోతే మంచిదే.
కానీ కలగటం లో అసహజం ఏమి లేదు. సొంత అక్కా చెల్లెళ్ళ మధ్యా, అన్నదమ్ముల మధ్యా కూడా ఇలాంటివి కలుగుతాయి కదా.
అంత మాత్రాన మన స్నేహితుడి మీద మన కి ప్రేమ తగ్గిపోయినట్టు కాదు.
అసూయ కి పెట్టింది పేరైన దుర్యోధనుడు కర్ణుడి పట్ల ఎంత మంచి ఫ్రెండ్ గా ఉన్నాడో చూడండి ... ఇద్దరూ దారుణంగా చచ్చిపోయారనుకోండి .. (bad example 🙊)
సినిమా లో చూపిస్తే చూపించారు కానీ అసూయ చెందగానే నెగటివ్ క్యారెక్టర్ గా మనని మనం మాత్రం చూసుకోకూడదు అని నా అభిప్రాయం.
అసూయ కలిగింది. దానితో మనం ఏం చేస్తాం అన్నదే ముఖ్యం.
నేను మనిషినే కదా అని నవ్వుకొని ఆ ఫీలింగ్ ని పట్టించుకోకపోతే దానిలోంచి పవర్ తీసేసిన వాళ్ళం అవుతాం.
ఎవరి వల్ల అసూయ కలిగిందో వాళ్ళని ఏదో ఒకటి అంటే కసి తీరుతుంది అంటే .. ముందు ఆ 'కసి' అనే ఫీలింగ్ పోయే వరకూ ఆ వ్యక్తి ని కలవకపోవటమే బెటర్.
'అసలు ఈ అసూయ ని నేను ignore చెయ్యలేక పోతున్నాను' అంటే మీరు ఆ స్నేహం నుంచి తప్పుకోవడమే మంచిది.
మీ లో అనుక్షణం అసూయ ని కలిగించే స్నేహం మీకెందుకు? అలాగే అసూయ నిండిన ఫ్రెండ్ మీ స్నేహితుడికి ఎందుకు?
కానీ ఒక్క విషయం.
అసలు మీలో ఎటువంటి అసూయ కలిగించని ఫ్రెండ్ ఎందుకు? మిమ్మల్ని challenge చెయ్యని బంధాలు ఎందుకు? తను లక్ష్యాలు సాధిస్తూ మిమ్మల్ని కూడా ఘనకార్యాలు చెయ్యమని చెప్పకనే చెప్పే ఫ్రెండ్ కన్నా ఇంకేం కావాలి?
అంటే స్నేహం లో ఇంకో స్వేఛ్చ కూడా ఉంది ..
అసూయ పడే స్వేఛ్చ!
Friday, August 3, 2018
నేను రాసిన ఓ ఉర్దూ ఘజల్
నాకు సంగీతం ఎంత ఇష్టమో సాహిత్యం అంత ఇష్టం ... అందుకే ఈ ప్రక్రియ అంటే అంత అనుబంధం ఏర్పడింది.
మొహసిన్ నఖ్వీ , గాలిబ్, నాసిర్ కాజ్మి ఇలాంటి ఉర్దూ కవులు రాసిన పదాలకి ... జగ్జీత్ సింగ్, గులాం అలీ, మెహదీ హాసన్ వంటి వారి స్వరాలు, గళాలు తోడైనప్పుడు ఒక అందమైన ఘజల్ పుడుతుంది
(ఈ కింది ఘజల్స్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ కి వెళ్ళచ్చు )
దిల్ ధడక్ నే కా సబబ్ యాద్ ఆయా ..
వొ తేరి యాద్ థీ .. అబ్ యాద్ ఆయా
రంజిష్ హీ సహీ ... దిల్ హీ దుఖానే కేలియే ఆ ... ఆ ఫిర్ సే ముఝే ఛోడ్ కే జానే కేలియే ఆ .
తుమ్ నహీ ... ఘమ్ నహీ .. షరాబ్ నహీ ... ఏసి తన్ హాయి కా జవాబ్ నహీ ...
వివిధ భారతి లో అప్పుడప్పుడూ ఘజల్స్ వినిపిస్తూ ఉంటారు .. అలా surprise గా దొరికిన ఒక rare ఘజల్ .. రూపా గాంగూలి పాడిన 'తేరే కరీబ్ ఆకే .. బడీ ఉల్ఝనో( మే హూ .. మే దుష్మనో మే హూ కే తేరే దోస్తో మే హూ' అనే ఘజల్!
ఘజల్ అంటే చేతిలో మందు సీసా ఉండాల్సిందే అంటే నేను ఒప్పుకోను
ఘజలే ఒక మందు సీసా 😉😉
అన్ని ఘజల్స్ విరహం, రాతి గుండె ప్రేయసి, ఒంటరి తనం, మోస పోవటం .. ఇలాంటి వాటి చుట్టూనే ఉండవు .. కొన్ని కొన్ని సమాజం పోకడల్ని సున్నితంగా గుచ్చుతాయి .. కొన్ని జీవితం లోని అందాన్ని ఆస్వాదించమంటాయి .. కొన్ని 'నీకేమిటోయ్ .. నువ్వు గొప్పవాడివి' అని కూడా motivate చేస్తాయి.
ఘజల్స్ లో ఉపమానాలు, అతిశయోక్తులు, ప్రాసలు ... భలే ఉంటాయి
ఇంక నా ఘజల్ విషయానికి వస్తే ... ఇది ఈ మధ్యే రాసాను
ప్రేమ లో స్వార్ధం ఉండదు .. త్యాగం తప్ప అంటారు కదా ..
కానీ త్యాగం చేసే ముందు .. ఒక stage ఉంటుంది .. ప్రేమ లో.
ఎందుకు ఆ ప్రేమ నా సొంతం కాకూడదు? ఏ? నేనేం తక్కువ? అని అడిగే ego hurt అయిన ప్రేమ అది.
ఇంకా త్యాగం చేసేంత పరిణితి రాని ప్రేమ అది
ఇంకా ఆశలు వదులుకొని ప్రేమ అది
అలాంటి ప్రేమ గురించి ఉంటుంది నా ఈ ఘజల్ - 'అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై'
Urdu Ghazal in Telugu text:
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ యే నహీ కహా జాతా కె ... జావ్ ఖుష్ రహో
అభీ యే నహీ సహా జాతా కె .. జాకే తుమ్ ఖుష్ రహో
అభీ దిల్ - ఏ - నా(దా ( కో సంఝానా హై
కె కుర్బానీ మొహబ్బత్ కా ఫర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
మైనే తుఝే ఓర్ తూనే ముఝే సంఝా ... కుచ్ జ్యాదా భీ కుచ్ కమ్ భీ
యాదో ( కా వాదో ( కా బాతో ( కా రాతో ( కా
తుఝే చుకానే కర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
English Text:
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi ye nahin kahaa jaatha ke 'jaao, khush raho'
Abhi ye nahin sahaa jaatha ke jaake tum khush raho
Abhi dil-e-naadaa ko samjhaanaa hai
Ke qurbani mohabbat ka farz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Bahut saari khushiyaa dee hain tumne mujhe
Bahut saare ghum bhi
Maine tujhe aur tune mujhe samjhaa
Kuch zyaada bhi aur kuch kam bhi
Yaadon kaa.. vaadon kaa.. baathon kaa... raathon kaa..
Tumhe chukaane karz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Kuch mohabbatein haare huey... jinpe laachaari ka kaphan hai
Kuch mohabbatein aisi bhi ... jo sang-e-marmar main daphan hai
Ishq ke abr ko sabr kaa hawaa denaa
Kuch hi mohabbathon ka tarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Nibhaake dekha bhulaake bhi... paas rehke dekha door jaake bhi
Sehke dekha kehke bhi... thair ke dekha behke bhi
Ye ishq bhi kaisa bin-dawa-e-marz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Ye ishq mujhe nahin chodtha .. main tujhe nahin chodtha
Tu bhi kaha kam ho... tu bhi tho zidd nahin chodtha
Tum, main aur pyaar... sab ko apne aap se garz hain
Tabhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
ఈనాడు ఆదివారం లో నా కథ 'గాజు గోడ'
కార్పొరేట్ ప్రపంచం లో గ్లాస్ సీలింగ్ అనే చేదు నిజం ఉంది. విమెన్ ప్రొఫెషనల్స్ ని ఒక స్థాయి ని మించి ప్రోమోట్ చెయ్యకపోవడం ... అంటే అప్పర్ లెవె...
-
మొత్తానికి ఇంకో కథ రాసానండి. ఈనాడు ఆదివారం సంచిక వారు ప్రచురించినందుకు కృతజ్ఞతలు. ఇదిగో, ఇక్కడ షేర్ చేస్తున్నా.
-
చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టంగా చదివే ఈనాడు పుస్తకం లో నా కథ రావడం నా జీవితం లోని ఆనందాల్లో ఒకటి. ఆ కథ చదివి నన్ను ఆన్లైన్ లో వెతికి మ...
-
ఓ రాత్రి రేడియో లో 'ఉమ్మడి కుటుంబం' సినిమా లోని సతీ సావిత్రి స్టేజీ నాటకం సీన్, పాట వినపడింది. అది వింటుండగా సతీ సావిత్రి కథ మీద దృష...




