బృంద పాకం
నాకు వంట చేయడం చాలా ఇష్టం. కొత్త రెసిపీలు ట్రై చేయడం ఇంకా ఇష్టం. ఎప్పుడైనా బాగా స్ట్రెస్ గా ఉంటే వంట చేస్తే హాయి గా అనిపిస్తుంది.
నేను నాకు తెలిసినంత వరకూ శాకాహారిని. (నాకు తెలియకుండా నేను తిన్న ఆహరం లో, దినుసుల్లో ఏవైనా ingredients ఉండి ఉంటే మరి .. నాకు తెలియదు). చిన్నప్పుడు ఇంట్లో సంప్రదాయం వల్ల అయినా పెద్దయ్యాక మాత్రం బై ఛాయిస్ శాకాహారిని. వెజిటేరియన్ లో ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే నాకు కుతూహలం కూడా కలగలేదు నాన్ వెజ్ వైపు! ఇలా అంటే నాకు తెలిసిన చాలా మంది నాన్ వెజ్ తినే మిత్రులు నవ్వుకుంటారనుకోండి. అయినా ఫర్వాలేదు. 😄
వేగన్ అని ఇంకో జాతి ఉన్నారు .. అసలు వీళ్ళు పాల ఉత్పత్తులు ముట్టరు. నేను అంత గొప్ప కాదండి! వీళ్ళ వల్లే నాన్ వెజిటేరియన్లని నేను ఎక్కువగా అర్ధం చేసుకోగలిగాను. నన్ను పాల ఉత్పత్తులు మానెయ్యమంటే నేను ఎలా ఫీలవుతానో వాళ్ళు మాంసాహారం వదిలెయ్యమంటే అలాగే ఫీలవుతారు కదా!
ఫుడీలకి వంట వచ్చేస్తూ ఉంటుంది ఏవిటో ... ఆహారం అంటే అభిరుచి ఉన్న చాలా మందిని చూసాను ... వారి లో దాదాపు అందరూ వంటకారులే!
వంట లో నాకు అమ్మ మొదటి గురువు. ఇంటర్నెట్ రెండో గురువు.
అమ్మ బ్రహ్మాండంగా వండుతారు. మా నాయనమ్మ గారు కూడా గొప్ప పాకశాస్త్ర విద్వాంసురాలట! ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి ఏం ఇష్టమో గుర్తుంచుకొని అదే చేసి పెట్టేవారట. మైసూర్ పాక్ (మైసూర్ పా అనేది కరెక్ట్ పేరట) వేడి వేడి గా మనిషిని కూర్చోపెట్టి చేసేసేవారట! (ఈ అట అట లు ఎందుకంటే నేను పుట్టకముందే ఆవిడ పోయారు)
అమ్మ వంటలో నేను గమనించింది రుచే కాదు.. మన ప్రాచీన పాక జ్ఞానం తాలూకు అలవాట్లు కూడా. వానా కాలం లో ఆకు కూరలు చెయ్యదు అమ్మ. రాత్రి పూట పప్పు వండదు. ఆవ పెట్టిన కూర చేసిన రోజు చలవ చేసేందుకు ఏదో ఒకటి చేస్తుంది. నువ్వుల పొడి చల్లిన కూరలు వేసవి లో చెయ్యదు. (అక్క ఓ సంవత్సరమంతా అమ్మ చేసిన వంటల్ని డైరీ గా రాసి సంవత్సరం చివర్న అమ్మకి గిఫ్ట్ గా ఇచ్చింది!)
వంటింట్లో చిన్న చిన్న పనులు అమ్మే చెప్పేది. కొంచెం పెద్దయ్యాక వేసవి లో రస్నా కలపడం, ఎవరైనా వస్తే నిమ్మకాయ రసం ఇవ్వడం అలవాటు చేసింది. నేను నిమ్మ రసం చేస్తే చాలా మెచ్చుకొనేది అమ్మ. పంచదార, నీళ్లు కరెక్ట్ గా వేసావే అనేది. దీంతో నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది! అమ్మ ఎప్పుడూ అవే తెలుగు వంటలు చేస్తుందని నార్త్ ఇండియన్ వంటలు ట్రై చెయ్యడం తో నా వంట మొదలు పెట్టాను.
ఓ సారి మా ఫ్రెండ్ ఒకమ్మాయి రగడా చేస్కొచ్చింది. భలే ఉంది నాకు రెసిపీ చెప్పవా అంటే ఇష్టం లేకుండానే చెప్పింది. (ఒకప్పుడు రెసిపీలు దాచుకొనేవారు చాలా మంది వంటొచ్చినవాళ్లు ... ఇప్పుడు ఇంటర్నెట్ లో చిట్కాలు, ప్రొఫెషనల్ ట్రిక్స్ తో సహా పెట్టేస్తున్నారు .. అమ్మా, నేనూ అనుకుంటూ ఉంటాం .. ఇది ఎంత మంచి పరిణామమో కదా అని!) నేను ఆ రగడా ట్రై చేసాను .. ఎంత సేపటికీ ఆ అమ్మాయి చేసిన టేస్ట్ రాదే! తర్వాత తెలిసింది నేను చేసిన తప్పు .. ఆ అమ్మాయి శనగలు నానపెట్టమని చెప్పలేదు. నేను పెట్టలేదు. అవి ఎంతకీ ఉడకలేదు!
ఇలాంటి డిజాస్టర్స్ నుంచి చాలా దూరమే వచ్చానిప్పుడు.
కొంత మంది ఎక్కువమందికి భలే వంట చేసేస్తుంటారు.
కొంత మంది ఎలాంటి వంటయినా ఐదు నిముషాల్లో చేసేస్తుంటారు (మా అక్క లాగా)
నాకు ఈ రెండూ రావు (ప్రస్తుతానికి).
టైం తీసుకుంటాను కానీ రుచి గ్యారంటీ 😄
వంట లో నా పరిణామ క్రమం బయట దొరికే జంక్ ఫుడ్ (శాండ్విచ్ లు, బర్గర్ లు, పులావులు.... తవా పులావు ... సేమ్యా పులావు ... కుక్కర్ పులావు ... పుదీనా, పనీర్ పులావు) లని ఇంట్లో ట్రై చేసే దగ్గర నుంచి తెలుగు వంటలు ... (కారం పెట్టి కూరలు, తీపి కూరలు, పచ్చళ్ళు, కంద బచ్చలి .. ఇవి తెలియకపోతే నువ్వు తెలుగమ్మాయివే కావు అనేలాంటివి), , నిల్వ పచ్చళ్ళు (కొత్తిమీర, పుదీనా, ఉసిరి) ... కొర్రలు వండటం ... వాటి తో కొబ్బరి అన్నం, కరివేపాకు అన్నం లాంటివి చేయడం... ఇక్కడకొచ్చి ఆగింది.
![]() |
స్వీట్లు చెయ్యడం నేర్చుకోవాలండి ... నిల్వ ఉంచేలాంటివి (సున్నుండలు, అరిసెలు గట్రా), అప్పటికప్పుడు తినేవి (పాయసం, డబుల్ కా మీఠా లాంటివి). జంతికలు, చేగోడీలు గట్రా కూడా నేర్చుకోవాలి. దోసె తిప్పడం ఇంకా రాదు. చపాతీ లు అక్క చేసినంత బాగా రావు (నిజానికి అసలు రావు... పిండి రాయి లా వస్తుంది .. చపాతీలు మందంగా ఉడికీ ఉడక కుండా వస్తాయి... చపాతీలు నేర్చుకున్నాక పరాఠాలు నేర్చుకోవాలి ఇంకా).
చిన్నప్పుడు బీట్రూట్, కారట్ లాంటివి తినకుండా అమ్మని బాగా సతాయించే దాన్ని. నేనే వంట మొదలు పెట్టినప్పటి నుంచి కొంచెం ఇలాంటివి తగ్గాయి. తప్పదనుకుంటే అవే కూరల్ని నా ఇష్టం వచ్చిన రెసిపీ లో వండుకుంటా అన్నమాట (బీట్రూట్ సాంబార్ లాగా).
ఇంటర్నెట్ లో నేను ఫాలో అయ్యే వంట ఛానెళ్లు .. బాబాయి హోటల్ లో రాళ్ళపల్లి గారి ఎపిసోడ్లు .... ఆయన నూనె వంకాయ, గుత్తి వంకాయ, గుండమ్మగారి గోంగూర అన్నం రెసెపీలు భలే బాగుంటాయి. అలాగే హెబ్బార్స్ కిచెన్ అనే ఇంకో ఛానెల్. ఎంత పెద్ద రెసిపీ అయినా ఎంతో సులువుగా చూపిస్తుంది ఆ అమ్మాయి. మాటలు ఉండవు ... కేవలం రెండు నిముషాల రెసిపీ వీడియో... ఆమె ఛానెల్ లో చాలా రెసిపీలు చేసేసా నేను. ఇడ్లి కి, దోసె కి ఒకే పిండి రెసిపీ ఆమె దగ్గరే మొదట చూసా!
ఏ వంట కి ఆ మసాలా వాడటం నా అలవాటు. ఛోలే కి, పావ్ భాజీ కి, రాజ్మా కి, వాంగీ బాత్ కి, బిసిబెళె బాత్ కి ఆయా మసాలాలు వాడితేనే రుచిలో తేడా కనిపిస్తుంది.
అలాగే ప్రాంతీయ వంటలు ట్రై చేసినప్పుడు వాళ్ళ చరిత్ర లాంటివి కూడా తెలుస్తూ ఉంటాయి! (బెంగాల్ కరువు లోంచి అవసరార్ధం మనకి పరిచయమైన దినుసు గసగసాలు! అలాగే మనం తినే కూరల్లో సగం అసలు మనవే కావు ... బంగాళా దుంప, పచ్చిమిరపల్లాగా. పావ్ భాజీ ముంబై లో ఫాక్టరీ వర్కర్ల కోసం 1850ల్లో కనిపెట్టబడిన వంటకం. రాజస్థాన్ లో వేడి ఇసక నే ఓవెన్ గా చేసుకొని పిండి ఉండలు కప్పెట్టేసి ఉడికాక బయటికి తీస్తారు. వీటిని 'బాటీ' అంటారు .. దాల్, చూర్మా ల తో తింటారు .. ఈ బాటీ ల మీద మనం బూరెల్లో వేసుకున్నట్టు బోల్డు నెయ్యి పోసుకొని తింటారు!)
మహారాష్ట్ర వారి మసాలాలు వేరే గా ఉంటాయి, రాజస్థాన్ వారి మసాలాలు వేరే గా ఉంటాయి. వెజిటేరియన్ వంటకాలు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర క్యూజిన్స్ లో బాగా కనిపిస్తాయి. (సౌత్ ఇండియా కాక). మన హైదరాబాద్ దక్కన్ మసాలాలు ఇంకోలా ఉంటాయి. వెజిటేరియన్ ఆప్షన్లు ఎక్కువ ఉన్న అంతర్జాతీయ క్యూజిన్ నాకు తెలిసినంత వరకూ ఇటాలియన్. వాళ్ళు తులసి వాడతారు వంటల్లో! పిజ్జా, స్పగెట్టి, బ్రుషెట్ట... ఇవన్నీ ఒరిజినల్ గా వెజిటేరియన్ వంటకాలే (మన హైదరాబాదీ వెజ్ బిర్యానీ లాగా కాక). ఇంటర్నేషనల్ షెఫ్ ల ప్రకారం వెజిటేరియన్ అంటే అందులో గుడ్డు సర్వ సాధారణం ఏంటో!
ఎంత వంట ఇష్టమైనా రోజూ .. మూడు పూట్లా చెయ్యమంటే నేను చెయ్యలేను. అలా చేసే వారిని ఆరాధన తో చూస్తాను.
ఇప్పుడు మనకి వినిపిస్తోంది .. వంటలు నగరాల్లో ఎక్కువగా చేసుకోవట్లేదని... కర్రీ పాయింట్లు సామజిక శాస్త్రవేత్తలకు వర్రీ పాయింట్లు గా తయారయ్యాయి. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఇంటి భోజనం క్యారేజీలు కట్టి ఇంటికే డెలివర్ చేయించుకొని ... వారికి నెలకి ఇంతని ఇస్తున్న వారున్నారు. వర్కింగ్ విమెన్ పెరగడం వల్ల ఈ పరిణామాలు అనే అభిప్రాయం కూడా ఉంది (ఇది నిజం కూడా).
వంటంటే కేవలం వంట కాదు ... కూరలు/దినుసులు తెచ్చుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, తరుక్కోవాలి. నాలుగు బర్నర్ల స్టవ్, మిక్సీ లు ఉన్నా నలుగురికి మూడు ఐటమ్స్ వండాలంటే మినిమమ్ గంట పడుతుంది. వంట అయ్యాక ఎక్కడివక్కడ వదిలేయలేం కదా ... మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంటికి దూరంగా ఉండే ఆఫీసుకి వెళ్లి, ఎనిమిది నుంచి పది గంటలు పని చేసి, తిరిగి వచ్చి ఇదంతా చేయడం కష్టం కదా!
బృంద పాకం చేస్కోవచ్చు .. ఒకరు కూరలు తెచ్చి, తరిగిస్తే ఇంకొకరు వంట చేసి క్లీన్ చేస్కోవచ్చు. భలే ఫామిలీ బాండింగ్ ఎక్సర్సైజ్ ఇది! (స్వానుభవమున చాటు నా సందేశమిదే) ... అయినా కూడా ఇదే పని మూడు పూట్ల (పోనీ రెండు పూట్ల), రోజూ చేస్కోవడం కష్టం.
అలాంటప్పుడు ఇంటి వంట చేస్కోలేకపోతున్నామని బాధ పడి ఆ ఇంటి గృహిణి ని గిల్టీ ఫీలయ్యేలా చేసే బదులు బయట ఇన్ని ఆప్షన్లు ఉన్నాయని ఆనందించడమే బెటర్ కదా!
కొన్ని విషయాలు నేను ఫర్ గ్రాంటెడ్ తీసుకోను.
అమ్మ చేతి వంట తినే భాగ్యం.
కూరలు సులభంగా దొరకడం... కొనగలగడం.
వంటింట్లో సౌకర్యాలు... అవి వాడుకోడానికి కరెంటు.
మూడు పూట్లా కడుపు నిండే భోజనం.
ఇవి వరాలే. వీటికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను.
భూమి మీద ప్రతి మనిషి కీ, ప్రతి రోజూ... మనసు, కడుపు నిండే భోజనం దొరకాలని ప్రార్థిస్తాను.
లేబుళ్లు: సౌమ్యవాదం, cooking, Sowmya Nittala, sowmyavadam, vegetarian


