మూడు పాటల కథ

అనగనగా నేను. 

ఘజళ్ళ పిచ్చి దాన్ని. 

నాకు జరిగిన కథే ఇది. 

ఎన్నో మలుపులు, మిస్టరీ, నవలల్లో లాగా సంఘటనలు వెంటవెంటనే అవ్వకుండా ... మధ్యలో కొన్ని సంవత్సరాల గాప్ .... ఊహాతీతంగా, థ్రిల్ కలిగించిన కథ ఇది. 

పైన వర్ణించిన అనుభూతులన్నీ మీకు కూడా కలగుతాయి ఈ కథ మీరు చదివితే. మీరు సంగీత ప్రియులవ్వాలి అంతే. 

కథా క్రమం లో ముందుగా 2007-2008 ప్రాంతం ... 

మా అక్క సుష్మ వరల్డ్ స్పేస్ రేడియో లో రేడియో జాకీ, ప్రోగ్రాం డైరెక్టర్ (అసిస్టెంట్) గా చేస్తూ ఉండేది. 

లలిత సంగీత సామ్రాట్ చిత్తరంజన్ గారు ఆ రేడియో కి ఓ సంగీత పరమైన షో చేసేవారు. 

నేను అక్కడ పని చెయ్యకపోయినా మా అక్క ని పికప్ చేసుకోడానికి వెళ్లేదాన్ని. రచయిత్రి మృణాళిని గారు అప్పుడు అక్కడ ప్రోగ్రాం డైరెక్టర్. మా మధ్య చాలా సాహితీ, సంగీత చర్చలు జరుగుతూ ఉండేవి. 

ఒక సారి నేను వెళ్ళినప్పుడు చిత్తరంజన్ గారు వచ్చి ఉన్నారు. ఆయన ఓ తెలుగు సినిమా పాట  కి ఒరిజినల్ ఓ ఘజల్ అని ... ఆ ఘజల్ గుర్తు రావట్లేదు అని అన్నారు. నా ఘజళ్ళ పిచ్చి తెలిసిన మృణాళిని గారు ... ఇదిగో ఈ అమ్మాయి ని అడుగుదాం అన్నారు. 

ఆయన తెలుగు పాట పాడారు. అది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫేవరేట్ పాట! మా అమ్మ గారు చిన్నప్పుడే ఆ పాటని పరిచయం చేశారు మాకు. (ఇంకొంత సేపట్లో ఆ పాటేంటో చెప్తా). 

కానీ దానికి ఓ ఒరిజినల్ ఉంది అని నాకు తెలియదు. అప్పటి వరకూ నేను విన్న ఘజళ్ళ లో ఆ పాటకి దగ్గరగా వచ్చినవేవి నేను వినలేదు. అప్పటికీ అదే రాగం లో ఏమైనా ఉన్నాయా అని దగ్గర రాగం లో ఒకటి రెండు పాడితే ... 'ఇవి దగ్గరగా ఉన్నాయి కానీ అది అచ్చం అలాగే ఉంటుంది' అన్నారు. 

చివరికి ఆయనకే గుర్తొచ్చింది. వెంటనే యూట్యూబ్ లో కి వెళ్లి ఆ ఒరిజినల్ ఘజల్ విని నోరెళ్ళబెట్టేసాం ... మధ్య లో స్వరాలతో సహా అదే ఘజల్! 

ఇంతకీ ఆ తెలుగు పాట ... మంచు పల్లకీ లో మేఘమా దేహమా




దాని ఒరిజినల్ జగ్జీత్ సింగ్ గారి 'తుమ్ నహీ ఘం నహీ' 




లింక్స్ ఇస్తున్నాను ... ఎంజాయ్ చేయండి వాటి సారూప్యాన్ని! 

ఇక్కడి తో కథ అయిపోయిందనుకున్నాను నేను. కానీ ఇది ఇంటర్వెల్ మాత్రమే అని అప్పట్లో నాకు తెలియదు. 

నేను ఒరిజినల్ విని ఉన్నదాన్ని ఉన్నట్టుండక ... ఇది టిపికల్ జగ్జీత్ సింగ్ ఘజల్ లా లేదేంటి ... గులాం అలీ గారు పాడితే ఇంటర్నెట్ లో కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటున ఆయన బొమ్మ తో వీడియో ఎక్కించేసారా అని అనుమాన పడ్డాను. 

ఈ అనుమానానికి కొంత బాక్గ్రౌండ్ వివరించాలి. లేకపోతే నేను కొన్ని వర్గాల ఫాన్స్ మనోభావాల్ని కించపరిచిన దాన్నవుతాను. 

2007/2008 లో ఇంకా గూగుల్ ఇంత వికసించలేదు. చాలా పాటలకి సెర్చ్ రిజల్ట్స్ వచ్చేవే కావు అసలు. చాలా పాటలు తప్పుడు సమాచారం తో ఎక్కించేసేవారు. కామెంట్ పెట్టినా రెస్పాన్స్ ఉండేది కాదు. సోషల్ మీడియా కమ్యూనిటీ లు ఇంత ఆక్టివ్ గా లేరు. ఇది మొదటి వివరణ. 

నాకు ఘజళ్ళు నచ్చడం మొదలవ్వగానే నేను మొదట అభిమానించి ఫాలో అయిపోయిన గాయకులూ జగ్జీత్ సింగ్ గారు. ఆయన గాత్రం, గమకం, బాణీలు.. అన్నీ నాకు చాలా నచ్చేవి .  సో నేను కూడా ఫ్యాన్ నే. అందువల్లే ఆయన ఘజళ్ళు ఎలా ఉంటాయో బాగా తెలుసు. సామాన్యులకి ఘజల్ ని చేరువ చేసిన వారు జగ్జీత్. ఇది అందరూ ఒప్పుకుంటారు. 

అలాగ నేను గులాం అలీ ఫాన్ ని కూడా. ఆయన శైలి ... హిందుస్తానీ సంగీతానికి ఒక్క సెంటీమీటర్ దూరం లో ఉంటుంది. ఆయన కచేరీల్లో చెప్తారు కూడా. నేను బడే గులాం అలీ సాబ్ దగ్గర హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. నా ఘజళ్ళ  లో ఆ చిక్కని సంగీతాన్ని తెస్తూ ఉంటాను .. కానీ నాకే బోర్ కొట్టేలా సాగదీత ల తో కాక ... ఆడుతూ పాడుతూ స్వరాలతో, చమక్కుల తో ఉండేలా చూస్కుంటా అని. 

ఒకరి సంగీతం జలపాతం కింద నుంచున్నట్టు ఉంటుంది. చల్ల దనం తో పాటు ఉద్ధృతి కూడా ఉంటుంది. మరొకరిది సెలయేటి ఒడ్డున కూర్చున్నట్టు ఉంటుంది. హాయైన ప్రశాంతత. 

ఇదే తేడా. 

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జగ్జీత్ సింగ్ గారు స్వయంగా గులాం అలీ గారి ఫ్యాన్. ఆయన భారత దేశం లో కచ్చేరి ఇచ్చినప్పుడల్లా మొదటి వరస లో జగ్జీత్ సింగ్ గారు కూర్చొని ఉండేవారట! 

వారి ఆత్మీయ సంబంధానికి నా దగ్గర కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. 










(ఒక్క అనుమానానికి ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది.... మరి అనుమానించింది ఇద్దరు గొప్ప కళాకారుల్ని కదా!)

ఆవేశం ఆపుకోలేక నేను ఆ వీడియో పైన అప్పట్లో కామెంట్ పెట్టేసాను. ఇది గులాం అలీ గారిదేమో .. మీరు పొరబడుతున్నారేమో అని. ఆ కామెంట్ కి చాలా ఘాటైన విమర్శలు వచ్చాయి. నా పేరు గూగుల్ చేస్తే అప్పట్లో ఆ కామెంటే కనిపించేది. మా అక్క 'ఎందుకొచ్సిన గొడవ... తీసేయ్' అంది. నేను డిలీట్ చేసేసాను. 

ఆ తర్వాత గూగుల్ వికసించాక ఆ ఘజల్ ముమ్మాటికీ జగ్జీత్ సింగ్ గారిదే అని రూఢి అయింది. నేను నా ఇన్స్టింక్ట్స్ నోరు మూయించి కూర్చోపెట్టేసాను. 

కట్ టు 

2021 సంవత్సరం 

ఇప్పటికీ ఇద్దరికీ ఫ్యాన్ నే ... ఘజళ్ళ పిచ్చి కూడా అలాగే ఉంది ... జగ్జీత్ సింగ్ గారే లేరు. (నేను చాలా ఏడ్చాను ... అది వేరే సంగతి) గులాం అలీ గారు అన్నారట ... 'మొదటి వరస లో నువ్వు లేని లోటు తెలుస్తూ ఉంటుంది ఇంక నాకు' అని.  

ఇన్స్టా గ్రామ్ లో నేను చేరి గులాం అలీ, జగ్జీత్ సింగ్ గార్ల హాష్ టాగ్ ఫాలో అవుతున్నాను. 

ఒక రోజు ... ఈ ఘజల్ వీడియో కనిపించింది. 

దర్ద్ ఏ దిల్ దర్ద్ ఏ ఆష్నా జానే






ఏ కొద్దిపాటి సంగీతం తెలిసిన వారికైనా తెలిసిపోతుంది ... ఇది 'తుం నహీ' ని ముమ్మూర్తులా పోలి ఉంటుంది అని. 

తేడా ఏమయినా ఉంటే అది శైలి లోనే. గులాం అలీ గారు తన స్టైల్ లో ... చకితుల్ని చేసే  గమకాల తో, ఊహించని సంగతులతో ఈ ఘజల్ ని నింపేస్తే .... జగ్జీత్ సింగ్ గారు ... నెమ్మదైన నడక తో సాగేలా చేశారు. 

ఇద్దరూ ఎంచుకున్న సాహిత్యం కూడా వేరు. 

గులాం అలీ గారిది బహదూర్ షా జఫర్ సాహిత్యం 

జగ్జీత్ గారిది సయీద్ రాహీ గారి షాయరీ 

ఇది వినగానే ముందు నాకు మాటల్లేవు 

నాకు కలిగిన ఆలోచనలు/అనుభూతులు ఒక లిస్ట్ గా రాస్తే... 

1. రెండే ఉన్నాయనుకున్న అపురూపమైన వజ్రాలు ..  ఇంకోటి ఉందని తెలిస్తే కలిగే థ్రిల్! 

2. నా మ్యూజిక్ ఇన్స్టింక్ట్స్ అనండి .... ఎప్పుడూ కలిసి మాట్లాడని వారితో .. వారి  కళ తో నాకున్న అభిమానపు బంధం అనండి ... ఎవరి సంగీతం ఎలా ఉంటుందో  తెలిసిన ఆర్టిస్టిక్ ఇంటిమసీ అనండి ... ఏమైనా అనండి ...  నాకు అప్పుడు అనిపించింది నిజమే! ఇంత నిలకడ మీద తెలుస్తుంది అని నాకప్పుడు తెలీదు .. కానీ భలే ఫీలింగ్ కలిగింది!

3. రాజన్ నాగేంద్ర గారిది జగ్జీత్ సింగ్ గారి ఘజల్ నుంచి తీసుకున్న పాట అని తెలుసు. కానీ జగ్జీత్, గులాం అలీ లలో మొదట ఈ బాణీ కట్టింది ఎవరు? నా బెట్  అయితే గులాం అలీ గారే మొదట ఈ పాట కట్టారు అని. ఘజళ్ళు లైవ్ కచ్చేరిల్లో ఎక్కువ పాడతారు. అవే ఆల్బమ్స్ గా వస్తాయి. కచేరీ తారీఖు కి, ఆల్బమ్ రిలీజ్ కి సంబంధం ఉండదు. అందుకని మొదట ఎవరు పాడారో నేనైతే రుజువు చెయ్యలేను. కానీ జగ్జీత్ సింగ్ గారికి గులాం అలీ గారంటే ఉన్న గురు భావన వల్ల  ఈ బాణీ ని తనదైన శైలి లో కి తెచ్చుకొని పాడారు అంటే ఆశ్చర్యంగా అయితే లేదు. కానీ ఆ కథ తెలుసుకోవాలని మాత్రం ఉంది ... ఎప్పుడైనా చిత్రా జగ్జీత్ సింగ్ గారిని కలిసే అవకాశం వస్తే నేను ఖచ్చితంగా అడుగుతాను. 

4. ఇలా ఇంకేమైనా ఉన్నాయా? నా ఇద్దరు ఆరాధ్య గాయకుల బాణీల్లో ఇలాంటి ఇచ్చిపుచ్చుకోడాలు ఇంకేమైనా జరిగాయా? 

5. ఒక బాణీ ... కేవలం ఒక ట్యూన్ .... ఇంత మందిని కదిలించింది ... ఒకరు పాడితే ... ఇదే నేను పాడితే ఎలా ఉంటుంది ఇంకొకరు. వారి పాట విని ... మా సినిమా కి కరెక్ట్ గా ఉంటుంది అని మరొకరు ... ఇవేమీ తెలియని మనం .. తెలుగు పదాల్లో కూడా ఎంతో చక్కగా అల్లుకుపోయిన ఆ మెలోడీ ని వింటూ మైమరిచిపోవడం ... ఎవరన్నారు పాటలు జీవం లేనివని ... వాటికి కూడా ఓ డెస్టినీ, ఓ జర్నీ ఉంటాయి .. 

ఈ పాట .. నది లా .. ఒక చోట మొదలై ప్రవహిస్తూ మన తెలుగు వారి దాకా చేరుకుంది చూడండి... 

ఈ పాట జర్నీ లో నన్ను సాక్షి ని చేసుకున్నందుకు నాకు ఎవరికి  ధన్యవాదాలు చెప్పుకోవాలో అర్ధం కావట్లేదు. 

ఎప్పుడైనా డబ్బుల్లేనప్పుడు, ఒంట్లో బాలేనప్పుడు, చికాగ్గా ఉన్నప్పుడు 'నా లైఫ్ ఏంట్రా బాబు .. ఏం బాలేదు' అనిపిస్తుంది. 

కానీ ఇలాంటివి జరిగినప్పుడు 'ఐ లవ్ మై లైఫ్' అనిపిస్తుంది. 

ఏదో ఎమోషనల్ గా ఈ కథ చెప్పేసాను. 

ఇప్పుడు ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు ... 

నా కంటే వీర ఫాన్స్ ఉన్నారు నేను పైన చెప్పిన కళాకారులకి. ఎక్కడైనా వారికి నా ఈ పోస్ట్ అంత రుచించక పోయి ఉన్నట్టయితే క్షమించండి.  మన అభిమాన కళాకారుడంటే కొంత పొసెసివ్ నెస్ సహజం. మీరు వారిని చూసినట్టు నేను చూడక పోవచ్చు. Let's agree to disagree :) 

ఇంకొక ముఖ్య విషయం ... స్వయంగా మంచి విద్వత్తు ఉన్న రాజన్ నాగేంద్ర గార్లు కానీ, జగ్జిత్ సింగ్ గారు కానీ, లేదా గులాం అలీ గారు కానీ ... ఒక బాణీ నచ్చినప్పుడు ... భేషజాలు లేకుండా కేవలం ఆ బాణీ ని ప్రేమించి దాన్ని అనుభూతి చెందాలనుకొని ఇలా చేస్తారు కానీ పామర భాష లో 'కాపీ' అనే మాట అంటే నేను అస్సలు ఒప్పుకోను. అందుకే ఈ మాట నేను ఎక్కడా వాడలేదు కూడా. వారెవ్వరికీ ఆ అవసరం లేదు అని నా గట్టి నమ్మకం. 

ఇదండీ మూడు పాటల కథ. 

మొదట నేను దర్ద్ ఏ దిల్ ఘజల్ విన్నప్పుడు నేను ఇంట్లో ఎవరితో మాట్లాడట్లేదు ... యేవో గొడవలు పడుతున్నాను. 

ఈ విషయం చెప్పలేక... ఎవరితో షేర్ చేసుకోలేక ... ఇన్ని రోజులు నాలోనే పెట్టేసుకున్నాను. ఇప్పుడు చెప్పాక చాలా హాయిగా, తేలిక గా, ప్రశాంతంగా ఉంది.... ఈ పాట లాగే! 



Comments

  1. Original Tamil song https://www.youtube.com/watch?v=nF3Ihy3XEwU

    ReplyDelete
    Replies
    1. This just became 'నాలుగు పాటల కథ' ... hahha! ఇంకా మలయాళం లో కన్నడ లో కూడా ఉన్నాయో ఏంటో!

      Delete
  2. ఘజల్ వినడం అనేది ఒక acquired taste కదా! నాకు ఘజల్ లోని భాష, భావం చదవడం ఇష్టం, వినడం కన్నా. మీరు చేసిన అప(ర)-రాగ-పరిశోధనకి చప్పట్లు! నేనూ ఇల్లాటివే ఏవో చిన్నచిన్నవి చేస్తుంటా! Same pinch :)

    ReplyDelete
    Replies
    1. Not same pinch. Say same pichchi :)

      Delete
    2. ఓహ్... మీరు ఘజల్ అలా ఎంజాయ్ చేస్తారా Lalitha garu ... భలే:)

      Delete
  3. mee SaPaSa webseries enduku aapesaaru Madam ? aa channel lo kotha videos emi levu ?

    ReplyDelete

Post a Comment