2023 నుంచి నేను ....
2022 సంవత్సరం ఇంకో పక్షం రోజుల్లో అయిపోతోంది. కొత్త సంవత్సరం రాబోతోంది.
లేబుళ్లు: 2023, 2023 resolutions, Sowmya Nittala, sowmyavadam, Telugu blog
నా అనుభవం లో కి వచ్చిన అంశాల మీద నా అభిప్రాయాలు
2022 సంవత్సరం ఇంకో పక్షం రోజుల్లో అయిపోతోంది. కొత్త సంవత్సరం రాబోతోంది.
లేబుళ్లు: 2023, 2023 resolutions, Sowmya Nittala, sowmyavadam, Telugu blog
... రెండు మనసులు ఒకటయినాయి .. ఈ పాట గుర్తుందా? ఈ పోస్టు ఆ పాట గురించి కాదు.
విషయం ఏంటంటే నాకు కళ్ళజోడు ఉంది.
మనకి తెలిసి కళ్లజోడు తలనొప్పికి గాని, సైట్ కి గాని పెట్టుకుంటారు. సైట్ అన్నప్పుడు మనం ఉద్దేశం సైట్ ప్రాబ్లమ్ అని. సైట్ అంటే చూపు. అదే ఉంటే కళ్ళజోడు ఎందుకు? వాషింగ్ పౌడర్ ని సర్ఫ్ అనేసినట్టు, మధు అనే రాక్షసుడిని చంపి మధుసూదనుడైన విష్ణువు పేరు పెట్టుకున్న వ్యక్తి ని ఆ రాక్షసుడి పేరు తో మధు అని పిలిచినట్టు, కర్ణాటక సంగీతాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంగీతం అనుకున్నట్టు ... సైట్ ని కూడా అలా వేరే అర్ధం (పై పెచ్చు వ్యతిరేక అర్ధం) లో వాడటం మనకి అలవాటైపోయింది.
ఎలా వాడితే ఏం .. నాకు సైట్. అదే సైట్ ప్రాబ్లమ్.
చిన్న విషయం గా అనిపిస్తుంది కానీ, అద్దాలు ఉండటం వల్ల దైనందిన జీవితం వేరే వారి లా ఉండదు. ఇది అద్దాలు వాడే వారికే తెలుస్తుంది.
వేడి కాఫీ/టీ తాగే అప్పుడు ఉఫ్ అని ఊదగానే కళ్ళజోడు మీద ఆవిరి వచ్చేస్తుంది. కొన్ని రకాల మాస్క్ పెట్టుకుంటే కూడా కళ్ళజోడు మీద ఫాగ్ వచ్చేస్తుంది ఊపిరి వదిలినప్పుడల్లా. అదో న్యూసెన్స్. త్రీ డీ సినిమాలు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు త్రీ డీ గ్లాసెస్ ఇస్తారు కదా ... అవి మా కళ్ళజోడు మీద పెట్టుకోవాల్సి వస్తుంది. సైట్ ప్రాబ్లమ్ ని బట్టి, తీవ్రత ని బట్టి డ్రైవింగ్ లాంటివి చెయ్యలేం. పైలట్ లాంటి ఉద్యోగాలు చెయ్యలేం. డిఫెన్స్ లో కూడా కొన్ని పోస్టులకి సైట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళని తీసుకోరు. క్రీడల్లో అద్దాలున్న ఆటగాళ్లు లేకపోలేదు కానీ అంతగా సూటబుల్ ప్రొఫెషన్ కాదు అది కూడా. ఇంతలా లైఫ్ ఛాయిసెస్ ని మార్చేస్తుంది కళ్ళజోడు.
LASIK ఆపరేషన్ మినహా సైట్ ప్రాబ్లమ్ ఇంకెలాగూ తగ్గదు. అద్దాలు వాడుతూ ఉండాలి. అంతే. కానీ వాడకపోతే పెరుగుతుందట కూడా.
యోగా లో కొన్ని కంటి exercises చెప్పి వీటి వల్ల చూపు బెటర్ అవుతుంది అనటం చూసాను. కానీ అవి సాధన చెయ్యడం కుదర్లేదు.
ఆ లెవెల్ సమస్య కాదు కానీ నాకు అనిపించే ఇంకో సమస్య ... తెలుగు ట్రెడిషనల్ బట్టలు వేసుకొని, పాపిట తీస్కొని జడ వేసుకోని, పూలు పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకుంటే నప్పదు ఏంటో. సరే ... ఫాషన్ అంటే మనం అనుకొనేదే కదా అని సరిపెట్టుకుంటూ ఉంటాను నేను. ఇలాంటి ఫాషన్ సమస్య ఇంకోటి ... మేము స్టైల్ గా సన్ గ్లాసెస్ రెడీమేడ్ గా పెట్టుకోలేం. ప్రిస్క్రిప్షన్ వి చేయించుకోవాలి. కళ్ళజోడు పెట్టుకొని ఎండలోకి వెళ్తే కళ్ళజోడు షేప్ లో టాన్ అయిపోతాం తెలుసా .. చూడటానికి ఏం బాగోదు ఇది. అలా అని వానా కాలం కూడా బెటర్ కాదు .. వానలో తడవాల్సి వస్తే కళ్ళజోడు మీద పడ్డ చినుకులు తుడుచుకుంటూ కూర్చోవడం .. ఇంతే గా.
ఫ్రేమ్ లేని కళ్లజోళ్లు పోతే వెతకడం ఎంత కష్టమో తెలుసా. అసలు కళ్ళజోడు వెతకడం అంటేనే క్యాచ్ - 22 సిట్యుయేషన్. స్పష్టంగా కనిపించాలంటే కళ్ళజోడు కావాలి, కావాలంటే వెదకాలి, వెదకాలంటే స్పష్టంగా కనిపించాలి... పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లవ్వదు.
జోకుల్లో చెప్పినట్టు ఒక్కో సారి తలమీదే ఉంటుంది అనకండి. నిజానికి అద్దాలు తల మీద కొందరే పెట్టుకోగలరు. పెద్ద జుట్టున్న ఆడవారు తల మీద అద్దాలు పెట్టుకుంటే వాటి నోస్ పాడ్స్ లో జుట్టు చిక్కు పడిపోతుంది తెలుసా. బట్టతల/పొట్టి జుట్టు ఉన్నవారికే ఏం అవ్వదు. అయినా తల కి నూనె రాసుకున్నప్పుడు ఇలా జోళ్ళు పైకి పెట్టుకుంటే మసకబారిపోవూ?
కళ్ళజోడు కష్టాలకి మిడిల్ క్లాస్ కష్టాలు తోడైతే ఇంక చెప్పేదేముంది? చూస్కోకుండా కళ్ళజోడు మీద కూర్చోవడం, అది వంకర పోవడం, కానీ అది ఈ మధ్యే తీసుకున్నాం కదా అని అలా వంకర గానే పెట్టుకొని అడ్జస్ట్ అయిపోవడం!
నేను ఫొటోల్లో కళ్ళజోడు తీసేస్తాను. నేను ఫొటోల్లోనే కళ్ళజోడు తీస్తాను. కొంత మంది సైట్ ఉండి కూడా కళ్ళజోడు పెట్టుకోరు తెలుసా. కొంత మందికి తలనొప్పి వస్తుందట. ఇది అర్ధం చేస్కోవచ్చు. కానీ కొంతమందికి స్టైల్ కూడా ఒక కారణం.. ఇలాంటి వాళ్ళని నేను చాలామందినే చూసాను. దీనికి పూర్తి వ్యతిరేకం ఇంకో విచిత్ర జాతి. వీళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవడం సరదా. కానీ పాపం దేవుడు వీళ్ళకి సైట్ ప్రాబ్లమ్ ఇవ్వలేదు. వీళ్ళు ప్లెయిన్ గ్లాసెస్ పెట్టుకొని ఫీలయిపోతూ ఉంటారు. తిండి దొరకని వాళ్ళూ, తిన్నది అరగని వాళ్ళూ .. ఇలాగ .. ఈ ప్రపంచం లో ఈ రెండు రకాల వాళ్ళూ ఉన్నారు. ప్చ్ ..
ఖద్దరు వేసుకున్న ప్రతీవాడూ గాంధేయ వాది కాదన్నట్టు కళ్ళజోడు లేని ప్రతీ వ్యక్తి 20/20 విజన్ తో ఉన్నవారేమి కాదు. గాంధేయ వాదం అంటే గుర్తొచ్చింది... ఓ కళ్ళ జోడు కి ఎంత గౌరవం, విలక్షణత, ఐడెంటిటీ లభించగలదో గాంధీ గారి కళ్ళజోడు ని చూస్తే తెలుస్తుంది. కళ్లజోడుల ప్రపంచం లో ఈ కళ్ళజోడే మెగా స్టార్ అనుకోవచ్చు.
సినిమాల్లో కళ్ళజోడు చిత్రీకరణ గురించి నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో.
కవలల్లో ఒకడు మంచి బాలుడు, చదువుకున్న వాడు అని చెప్పడానికి కళ్ళ జోడు పెడతారు గమనించారా? అమాయకత్వానికి, చదువరితనమ్ చూపించడానికి కూడా దీన్ని వాడతారు.
హీరోలకి పైన చెప్పిన సందర్భాల్లోనే కాక వేషాలు మార్చినప్పుడు, గ్లామర్ తగ్గించాలి లేదా వయసు పెరిగింది అన్నప్పుడు తప్ప కళ్ళజోడు ఉండదు. హీరోయిన్ లకి కూడా. (ఇది ఇంకా పాపం గా భావిస్తారు ఏంటో). శుభలేఖ సినిమాలో సుమలత గారు కళ్ళజోడు తోనే కనిపిస్తారు. ఇలా ఇంకేమైనా ఉదాహరణలు ఉన్నాయా తెలుగు సినిమాలో? (ఒక సినిమాలో హీరోయిన్ కి కళ్ళజోడు ఉంటుంది కానీ ఒకటి రెండు సీన్ల వరకే ... మేక్ ఓవర్ లో ఆమె లెన్స్ లోకి వచ్చినట్టు చూపిస్తారు).
నాకు గుర్తుండీ హీరో కి కళ్ళజోడు ఉండి బాగా హిట్ అయి కోట్ల డాలర్లు వసూలు చేసిన సినిమా హారీ పాటర్. అతను అన్ని ఫైట్లు అలా కళ్ళజోడు తోనే చేస్తాడు. కళ్ళజోడు లేకపోతే ఎలా కనిపిస్తుందో ఆ సినిమాలో చాలా సార్లు చూపిస్తారు కూడా.
స్పైడర్ మాన్ పీటర్ పార్కర్ గా ఉన్నప్పుడు కళ్ళజోడు ఉంటుంది. కానీ అతన్ని సాలీడు కుట్టి స్పైడర్ మాన్ అయ్యాక సైట్ ప్రాబ్లమ్ పోయినట్టు చూపిస్తారు. మరి మాస్క్ మీద కళ్ళజోడు పెట్టుకున్నట్టు చూపించలేకేమో మరి.
సినిమాల్లో కళ్ళజోడు ఉన్న సీన్లలో కూడా వాటిని స్టైల్ కే ఎక్కువ వాడతారు ...
షాక్ అయినప్పుడు కళ్ళజోడు తీసి షాక్ అవుతారు ... షాక్ అంటేనే స్థబ్దుగా అయిపోవడం .. అలాంటప్పుడు కళ్ళజోడు తీసెయ్యటం ఎలా గుర్తుంటుంది మెదడు కి?
అలాగే కళ్ళజోడు ఒక చేత్తో తీసి దాని కాడ ని పంటి మధ్య పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు.
నేను గత ఇరవై ఏళ్ళ నుంచి కళ్ళజోడు వాడుతున్నాను. ఇలా ఒక్కసారి కూడా చెయ్యలేదు. తట్టక కాదు. ప్రాక్టికల్ గా ఇది పనికి రాదు. ఒక చేత్తో కళ్ళజోడు పదే పదే తీస్తే చెవుల దగ్గర లూజ్ అయిపోతుంది. నాకు అద్దాలు వచ్చినప్పుడు నా ఆప్టిషియన్ చెప్పిన మొదటి మాట ఇది. ఇంక చెవి వెనక భాగం లో జుట్టు ఉంటుంది. చెమట పడుతుంది. డాండ్రఫ్ సమస్య ఉండచ్చు. అక్కడ ఉండే కళ్ళజోడు కాడ ని నోట్లో ఎవడు పెట్టుకుంటాడు చెప్పండి?
ఇంకో కళ్ళజోడు మేనరిజం ..జారిన కళ్లజోడు ని ముక్కు పైకి తోసుకువడం. ఇది ఒకే .. ఇది నిజ జీవితం లో కూడా చేసేదే.
కళ్ళజోడు ఉన్న హీరోయిన్ ని హీరో ఇష్టపడితే ఆమె దగ్గరికి వెళ్లి ఆమె అద్దాలు తీసేస్తాడు. అవేవో ఆమె ఆకర్షణ ని తగ్గించేట్టు. పోనీ అలా తీసాక ఆమె ముక్కు మీద అద్దాల వల్ల కలిగిన నొక్కులు ఉండవు.
ఇన్ని సినిమాలు చూసాను.. ఒక్క సారి కూడా కళ్ళజోడు మీద కూర్చుంటే అవి ఎలా వంగిపోతాయో చూపించలేదు.
కొంత మంది నటులు, కొన్ని సినిమాల్లో మాత్రం సహజ సిద్ధంగా కళ్ళజోడు వాడారు. (నాకు హిందీ నటులు అశోక్ కుమార్ గారు గుర్తొస్తారు ఈ విషయంలో.)
సినిమాలు సమాజం యొక్క ప్రతిబింబాలు అనుకుంటే, ఈ విషయం లో సమాజం లో వివక్ష బానే ఉంది.
వెధవ జోకులు, కామెంట్లు .. ఎన్ని వినలేదు?
తెల్లగా ఉన్న వాళ్ళు 'కర్రోడా' అనడం ... డబ్బున్న వాడు 'బ్లడీ పూర్ పీపుల్' అనడం .... సన్నగా ఉన్న వాళ్ళు 'ఏ బోండం' అనడం ... కళ్ళజోడు లేకుండా స్పష్టంగా చూడగలిగే వాళ్ళు అద్దాలు ఉన్న వాళ్ళని 'నాలుగు కళ్ళు... సోడా బుడ్డి' అని, కళ్ళజోడు తీసేసినప్పుడు 'నేను కనిపిస్తున్నానా .. ఇవి ఎన్ని వేళ్ళు' అనడం, స్పెక్స్ తీస్కొని వాళ్ళు పెట్టుకొని 'అబ్బో ... నీకు చాలా సైట్ ఉంది' అనడం ... ఇవన్నీ ఒకే కేటగిరి కి చెందిన పాపాలు నా ప్రకారం. వీళ్ళకి నరకం లో ప్రత్యేకమైన శిక్షలు ఉంటాయి అని నా ప్రగాఢ విశ్వాసం. మాకేమీ సరదా అయ్యి సైట్ ప్రాబ్లమ్ తెచ్చుకోలేదు కదా మేము.
సైట్ గురించిన కొన్ని అపోహలు కూడా ఉండేవి. మైనస్ లో ఉంటే ఎక్కువ అని, ప్లస్ లో ఉంటే తక్కువ అని. అలాంటిదేమీ లేదట.
లేబుళ్లు: Sowmya Nittala, sowmyavadam, spectacles, Telugu blog, telugu blogger, telugu humour
నాకు పుట్టినరోజులంటే ఎంత ఇష్టమో 'నేను పుట్టాను' అనే పోస్టు లో వెళ్లబోసుకున్నాను ... గుర్తుందా?
పిచ్చి ముదిరి నా పుట్టినరోజులే కాక పక్క వాళ్ళ పుట్టినరోజులంటే కూడా బాగా ఉత్సాహం పెరిగిపోయింది అది రాసినప్పటి నుంచీ.
నాకంటే చిన్న పిల్లలకి 'నేను మూడు పుట్టినరోజులు జరుపుకుంటాను... నువ్వు కూడా జరుపుకోవచ్చు' అని బాగా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాను. వాళ్ళ తల్లితండ్రులు నన్ను బాగా తిట్టుకున్నా సరే. అయితే నేను ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే ఈ తరం పిల్లల కి మూడు పుట్టిన రోజుల ఆశ చూపించి వారు పుట్టిన తిథి, నక్షత్రం, తెలుగు మాసం, తెలుగు సంవత్సరం పేరు తెలుసుకుని గుర్తుంచుకునేలా చేస్తున్నాను. ఐటం సాంగ్ లో మెసేజ్ ఓరియెంటెడ్ లిరిక్స్ పెట్టినట్టు అన్నమాట.
పిల్లలు ఆల్రెడీ పుట్టినరోజులంటే excited గా ఉంటారు కాబట్టి అక్కడ నా పని సులువు.
కానీ ఈ పెద్దవాళ్ళున్నారే ... అబ్బా.. ఎందుకో వీళ్ళకి పుట్టినరోజులంటే అంత నీరసం.
మీరు ఏమైనా అనుకోండి. బాగా డబ్బులు సంపాదించుకుంటూ, మంచి పొజిషన్ లో ఉన్నవాళ్లు పుట్టినరోజు జరుపుకోపోతే నాకు మహా చికాకు. ఏ... అంత కష్టం ఏం వచ్చిందని? త్రివిక్రమ్ గారు చెప్పినట్టు డబ్బున్న వాళ్ళ కష్టాలు నాకు అర్ధం అవ్వకపోవచ్చు. నాకు అర్ధం చేసుకోవాలని కూడా లేదు. కష్టాలు కష్టాలే... పుట్టిన రోజు పుట్టిన రోజే.
అలా కాదు... పెద్దవారు అయ్యుండి కూడా పుట్టిన రోజు అంటే ఉత్సాహం కలిగి ఉన్నారు అంటే మీకివే నా వందనాలు.
పుట్టినరోజుకి అందం .- కొత్త బట్టలు etc కాదు. అవన్నీ ఒకెత్తు. బహుమతులు ఒకెత్తు.
చిన్నపిల్లలకి చాక్లెట్ లు, పెద్దవాళ్ళకి కవర్ లో వెయ్యి నూట పదహార్లు ... ఇవే బహుమతులు అంటే నాకు మళ్ళీ చికాకు.
అలా అని మార్కెట్ లో దొరికే గ్రీటింగ్ కార్డులు అవీ కూడా సరైన బహుమతులు కావు నా ఉద్దేశం లో.
అవి మనకి తెలిసీ తెలియని వాళ్ళకి ఒకే.
కానీ ఆత్మీయులు అనుకున్న వాళ్ళకి అలా ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి?
అసలు పుట్టినరోజుకి బహుమతులు ఏం ఇవ్వాలి అంటే ప్రాసెస్ మినిమమ్ రెండు నెలల ముందు నుంచీ మొదలు పెట్టాలి.
గుర్తుంచుకోవలసిన విషయాలు
1. బహుమతి అందుకొనే వారి వయసు, లింగం
2. మనస్తత్వం - కొంత మందికి బహుమతి ఎంత ఖరీదైతే అంత నచ్చుతుంది. కొంత మందికి 'లేటెస్ట్' వస్తువు ఏదైనా మొహం వెలిగిపోతుంది. కొంత మందికి కళాత్మకత ఉంటుంది. కొంతమంది నిరాడంబరులు, మొహమాటస్తులు వారి కోసం మనం ఏదైనా ఖర్చు చేస్తే నొచ్చుకుంటారు ...
3. వారు ఆ సంవత్సరం ఏ మూడ్ లో ఉన్నారు ... పిల్లలైతే ఏం కార్టూన్లు చూసి అభిమానిస్తున్నారు.. పెద్దవాళ్ళైతే 'అబ్బా ... ఆకుపచ్చ రంగు నాకు లేనే లేదు' అని మామూలుగా సంభాషణల్లో జరిగే డైలాగుల కి ట్యూన్ అయి ఉండటం లాంటివి
4. వారి ఆర్ధిక హోదా .... ఒక్కో సారి కొంతమందికి అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏం ఇస్తాం? అనుకోకూడదు. హోదా తక్కువైతే పని సులువు. వాళ్ళ దగ్గర లేనివేవో ఇచ్చేయచ్చు
ఎప్పుడైనా మీ బహుమతికి ఓ బడ్జెట్ పెట్టుకోవాలి.
ఆ బడ్జెట్ సున్నా నుంచి మొదలవుతుంది అని మర్చిపోవద్దు. అంటే నో బడ్జెట్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. లో బడ్జెట్ కూడా ఇవ్వచ్చు. ఐడియాలు బోల్డు ఉన్నాయి నా దగ్గర.
స్ఫూర్తి ముఖ్యం. మనం ఆ బహుమతి లో పెట్టిన ఆలోచన ముఖ్యం. ఖరీదు కంటే కూడా.
ఖరీదైన బహుమతులు ఇచ్చే అప్పుడు బహుమతి ఎలాగూ హిట్ కాబట్టి దాని చుట్టూ కొంత డ్రామా ఉండేలా చూసుకోవాలి. ఐ ఫోన్ ని కేక్ లో పెట్టి ఇవ్వడం (దీని కోసం ప్రత్యేకమైన కేకులు ఉన్నాయండి ... లక్ష రూపాయల ఐఫోన్ చుట్టూ కేక్ పిండి ని ఊహించుకోకండి. అసలే అంత పోసి ఇస్తున్నాం ... ఇంక మళ్ళీ కేక్ ఎందుకు అంటే .. నా బ్లాగ్ ఇక్కడ తో చదవడం ఆపేయండి ప్లీజ్)
నా అనుభవం లో కి వచ్చిన కొన్ని మంచి బహుమతుల ఐడియాలు .. (ప్రైవసీ కారణాల వల్ల ఇవి నేను ఇచ్చుకున్నవో, పుచ్చుకున్నవో .. ఎవరికి .. ఎప్పుడు .. ఇలా చెప్పట్లేదు)
పుట్టిన రోజు వయసు ని బట్టీ అన్ని వస్తువులని కొనియ్యడం ... ఆ వస్తువులు మామూలువైనా ఫర్వాలేదు. అదో సరదా. బహుమతులు ప్లాన్ చేసే టైం తక్కువున్నప్పుడు ఓ సూపర్ మార్కెట్ కి వెళ్లి కూడా ఈ లిస్టు పూర్తి చేయచ్చు. కాకపోతే అరవయ్యో పుట్టినరోజు లాంటివైతే ఇబ్బంది. అప్పుడు కూడా వ్రతాల్లో చెప్పినట్టు చిట్కా లేకపోలేదు. అరవై విభిన్నమైన వస్తువులు ఇచ్చే బదులు మొత్తం కలిపి అరవై .. అంటే మూడు పెన్నులు, నాలుగు పుస్తకాలు అలా అన్నమాట.. అలా ఇచ్చుకోవచ్చు. ఫలితం తగ్గదు.
ఓ తెల్ల టీ షర్టు కొని దాని మీద స్నేహితులందరూ/ఆత్మీయులందరూ మంచి మాటలు రాయడం ... విషెస్ రాసుకోవచ్చు, వారి మంచి గుణాలు రాయచ్చు ... ఏవైనా రాయచ్చు. అది ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది.
కారు, ఐఫోన్, బంగారం, కెమెరా, సైకిల్, కుక్క పిల్ల, డైమండ్స్, ... వారి చిరకాల వాంఛలు ... ఇలాంటివి ఉండనే ఉన్నాయి ...
వారి మంచి ఫోటో ఒకటి ఎంచుకొని ఈ మధ్య వస్తున్న personalised gifts మీద ప్రింట్ చేయించడం ... మగ్స్ మీదా, టీ షర్టుల మీదా, ఫోటో ఫ్రేములు, పెన్నులు ఇలా
ఇక కళాత్మక బహుమతుల దగ్గరకి వస్తే .... మన దగ్గరేమైనా కళ ఉంటే ఆ కళ తోనే బహుమతి ఇవ్వడం .. పాట, పెయింటింగ్, కవిత.. ఇలా
నా దగ్గర బడ్జెట్ లేదు.. నా దగ్గర కళ కూడా లేదు అంటే ... మీ టైం ని ఇవ్వచ్చు. పుట్టిన రోజు నాడు రెండు మంచి మాటలు కూడా బహుమానాలే కదా .. అలాగే వారి తో కూర్చొని ఆ సంవత్సరం ఏమైనా రెసొల్యూషన్స్ తీస్కుంటున్నారా అని అడిగి అవి రాసుకోవడం లో సాయం చేయడం, కలిసి సినిమా చూడటం (ఇంట్లోనే), ఏదైనా వండి పెట్టడం...
చిన్నప్పుడు మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఓ కథ చదివాను. అమెరికా లో పల్లె లో ఉన్న ఓ సాధారణ కుటుంబం. తండ్రి ప్రతి రోజు నాలుగున్నర కి లేచి గొడ్ల చావిడి కి వెళ్లి పాలు పితుకుతాడు. ఏ రోజూ సెలవు తీసుకోటానికి లేదు పాపం. అతనికొడుకు ఆరేడేళ్ల వాడు. తండ్రి పుట్టినరోజు కి ఏవైనా చేయాలనుకుంటాడు. డబ్బు లేదు. తండ్రికి తెలీకుండా నాలుగింటికే అలారం పెట్టుకుంటాడు. పెట్టుకున్నాడే కానీ రాత్రంతా ఉత్సాహానికి నిద్ర పట్టదు వాడికి. అలారం మోగక ముందే ఆఫ్ చేసేసి శబ్దం చెయ్యకుండా పాలు పితికేసి, క్యాన్లలో నీట్ గా నింపేసి, గొడ్ల చావిడి శుభ్రం చేసేసి గబగబా తన గదిలోకి వెళ్లి ఏం తెలీకుండా దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. తండ్రి యధావిధి గా నాలుగున్నర కి లేచి చూస్తే .. తన పని అంతా ఎవరో చేసేసారు! తన తండ్రి ఆనందంగా మెట్లెక్కి తన గది వైపు వస్తుంటే ఇతని గుండె ఆ హడావుడి కి గట్టి గా కొట్టుకుంటూ ఉంటుంది. తండ్రి కళ్ళలో ఆనందం .... తండ్రికి పుట్టిన రోజు నాడు ఓ బహుమతి ఇచ్చానని చిన్నోడికి తృప్తి!
చెప్పానుగా ... బహుమతులకి డబ్బులక్కర్లేదని!
నిజమైన బహుమతి తీసుకొనే వాళ్ళకి, ఇచ్చే వాళ్ళకి... ఇద్దరికీ ఆనందం కలిగిస్తుంది. అదే గుర్తు!
బహుమతులంటే పుట్టినరోజులకే ఇవ్వరనుకోండి. పెళ్ళిళ్ళకి, ఇతరత్రా శుభకార్యాలకి కూడా ఇచ్చుకుంటాం. అవి మరీ ఫార్మాలిటీ వ్యవహారాల్లాగా అయిపోయాయి ఈ మధ్య. ఫ్రీ గా తినకూడదు అని ఏవో తీసుకెళ్లడం. పెళ్లిళ్లలో అయితే మిక్సి లు, కుక్కర్ లు, వాల్ క్లాక్ లు ... యానివెర్సరీ కి వాట్సాప్ లో పువ్వుల జిఫ్ లు. ఇంతే గా. కానుకల శాస్త్రం లో వీటన్నిటివి రెండో స్థానం.
మొదటి స్థానం మన పుట్టిన రోజు బహుమతులదే.
ఈ బహుమతులకి సుగంధం అద్దే ముఖ్య కోణం - surprise aspect. వారికి తెలీకుండా ప్లాన్ చెయ్యడం.. ఇవ్వడం. దీనికోసం ఈ మధ్య వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పడిపోతున్నాయి తెలుసా?
మంచి బహుమతులు ఇవ్వడానికి ఓ ప్రమాదం కూడా ఉంది. హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ కి ఉన్నదే. expectations. అంచనాలు పెరిగిపోతాయి. అవి మేనేజ్ చేసుకోవాలి.
దీనిక్కూడా ఓ చిట్కా ఉంది. expect చేసిన రోజు గిఫ్ట్ ఇవ్వకూడదు. ముందో తర్వాతో ఇచ్చేయాలి.
లవర్స్ గిఫ్ట్స్ ఓ పూర్తి సెపరేట్ అధ్యాయం.
గిఫ్ట్స్ కోసమే అమ్మాయిలు అబ్బాయిలని తిప్పుకుంటారు అంటారు కదా.. అలాంటి వారి మాట్లాడుకోవద్దు.
నిజంగా ఓ మంచి బంధం ఉండి ప్రేమించుకునే వారికి ఈ కానుకలు ఓ మంచి మాధ్యమం తమ ప్రేమ ని వ్యక్తం చేసుకోడానికి. లవ్ లాంగ్వేజెస్ ... అంటే ఒక వ్యక్తి ప్రేమించే శైలి... భాషలు వేరు వేరు ఉంటాయట. అందులో గిఫ్ట్స్ కూడా ఒకటి అట.
ఊరికే ఈ పోస్టు కి గాంభీర్యాన్ని అందించడం కోసం బహుమతుల ఇండస్ట్రీ విలువ ఎంత అనే అంకెలు రాసి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు.
నేనొక సర్వీస్ ఓపెన్ చేద్దామనుకుంటున్నాను. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకొని గిఫ్ట్ తట్టకపోతే నాకు మెయిల్ పెట్టండి.. ఎవరికి ఇద్దామనుకుంటున్నారు ... వారి గురించి ఓ పేరాగ్రాఫ్ .. మీ బడ్జెట్. నేను మీకు ఐడియాలు ఇస్తా అన్నమాట. ఇది పూర్తి ఉచితం. ... ప్రస్తుతానికి. ఈ సర్వీస్ బాగా అలవాటయ్యాక అప్పుడు ఛార్జ్ చెయ్యడం మొదలు పెడతా అన్నమాట.
ఇంట్రస్ట్ ఉన్నవారికి ఇమెయిల్ ఐడి ఇస్తా.
ఇది నా కానుక!
లేబుళ్లు: art of gifting, birthday gifts, birthday planning, birthday surprises, Sowmya Nittala, sowmyavadam
గిరీశం ఫక్కీ లో చెప్పాలంటే ఈ మధ్య పోయెట్రీ భలే చదివేస్తున్నానండోయ్!
ఇంగ్లీష్ పోయెట్రీ .
చిన్నప్పుడు పద్యాలంటే చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని. ఎం ఏ ఇంగ్లీష్ చేసే అప్పుడు కూడా నవలలు ఇష్టంగా చదివే దాన్ని కానీ షేక్స్పియర్ పద్య నాటకాలు, కీట్స్ ... వీళ్ళ దగ్గరకి వచ్చేసరికి ముక్కున పట్టి ఏదో అయిందనిపించేసాను.
ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో పోయెట్రీ అకౌంట్స్ కనబడ్డాయి కొన్ని. కవి ఫోటో వేసి మరీ వారు రాసిన కొన్ని లైన్లు ఉంచుతారు పోస్టు లో.
ఏవో కొన్ని లైన్లు అనుకుంటాం కానీ ... అమ్మో! చాలా లోతుంది వాటిలో. అలాగే ప్రపంచాన్ని ఓ కవి ఎలా చూస్తాడో తెలుసుకోవచ్చు. భిన్న ఆలోచనా ధోరణులు తెలిసాయి కూడా నాకు. కొన్ని అయితే, భలే ఇలా కూడా ఆలోచించచ్చా అనిపించేలా ఉన్నాయి!
నచ్చినవి, భలే అనిపించినవి సేవ్ చేసుకుంటాను ఇంస్టా లో. లేదంటే స్క్రీన్ షాట్ తీస్కొని పెట్టుకుంటాను.
మా అమ్మ గారు అన్నట్టు ఏదైనా మంచి చూస్తే అందరికీ చెప్పేయాలి అనే పిచ్చి ఉంది కాబట్టి, నేను చదివిన మంచి పోయెట్రీ లో కొన్ని మీకోసం ఈ రోజు. :)
లారా గిల్పిన్
ఈ కవిత లో శీర్షిక ఎంత ఆశ్చర్యకరంగా ఉందో, ఆఖరు లైన్ అంతే తమాషా గా ఉంది! ఆ ఆఖరు లైన్ నా మనసు గెలిచేసింది!
స్థూలంగా అనువాదం. ప్రకృతి సృష్టించిన ఈ విచిత్రాన్ని రేపు రైతు కూలీల చూస్తారు. న్యూస్పేపర్ లో దాన్ని చుట్టి మ్యూసియం కి తీస్కెళ్ళిపోతారు. కానీ ఈ రాత్రి అయితే అది బతికే ఉంది.... ఉత్తరం వైపు పొలం లో... దాని తల్లితో. ఎంతో మంచి వేసవి సంధ్య... తోట లోంచి చంద్రోదయం కనిపిస్తోంది... గాలికి కి గడ్డి ఊగుతోంది. ఆ దూడ ఆకాశానికేసి చూసినప్పుడు .. ఎప్పటికంటే రెండింతల నక్షత్రాలు కనపడుతున్నాయి!
మంద లో కలిసిపోకుండా ఏ చిన్న ప్రత్యేకత ఉన్నా దాన్ని వికారంగానే చూస్తుంది మానవ సమాజం. దాన్ని చూస్తే భయమో, ఏం చెయ్యాలో తెలీని తనమో, జుగుప్సో మరి. నిజానికి రెండు తలల దూడ ఎవరికీ ప్రమాదమేమీ కాదు. మరి ఎందుకు దాన్ని మ్యూజియం కి తీసుకెళ్తున్నారు? అక్కడ ఏం చేస్తారో ఊహించడం కష్టమేమీ కాదు. జూ కాదు, సర్కస్ కాదు. మ్యూజియం. అంటే దాన్ని చంపి, స్టఫ్ చేసి ఓ వింత వస్తువు గా ప్రదర్శిస్తారన్నమాట. తెల్లవారితే దాని రేపు అంత భయంకరంగా ఉంది. అయినా దానికి అది తెలీదు. మర్నాటికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ రోజు రాత్రి రెండింతల నక్షత్రాల తో ఎంత అందంగా ఉందో చెప్పింది కవయిత్రి. రెండు తలల దూడ ని మామూలు సమాజం అలా చూస్తే తారలని రెట్టింపు చేసిన జీవి గా చూసింది కవయిత్రి. కవి హృదయం అంటే ఇది కదా!
ఏడుపు
గాల్వే కిన్నెల్
ఏదో కొద్దిగా ఏడిస్తే లాభం లేదు.
ఏడిస్తే తలగడ తడిసిపోవాల్సిందే!
అప్పుడింక లేచి నవ్వుకోవచ్చు.
అప్పుడింక స్నానానికి వెళ్లి ... జల్ జల్ జల్.!
అప్పుడింక కిటికీ తెరిచి "హహ్హ్హహ్హ"!
ఎవరైనా "ఏమోయ్ .. ఏం జరుగుతోందక్కడ?" అని అడిగితే
'హ హ" అని ఎలుగెత్తి చెప్పండి "ఆనందం ఆఖరి కన్నీటి చుక్కలో దాక్కొని ఉంది!
దాన్ని నేను ఏడ్చేసాను! హహ్హ!"
ఈ కవిత లో మొదటి లైన్ నన్ను బాగా ఆకర్షించింది. పెద్దయ్యాక ఎక్కువ ఏడవం. దాన్నేదో టఫ్ గా ఉండటం అనుకుంటాం. రెండు కన్నీటి చుక్కలు కార్చి అయిందనిపిస్తాం. కూలంకషంగా ఓ ఎమోషన్ ని అనుభవించి పూర్తిగా ఏడవం.
నిన్న ఏదో జరిగి గొంతు గద్గదమైంది. ఫోన్ లో ఈ కవిత చదవగానే ఇంకా గుండెలో చాలా ఏడుపు ఉంది అనిపించి ఏడ్చేసా. తర్వాత కవి చెప్పినట్టే చాలా హాయి గా అనిపించింది.
కవిత అంటే ప్రౌఢ పదాలే కాకుండా ఇలా లల్లాయి పదాల తో కూడా మంచి భావం పలికించారనిపించింది కవి. నేను ఈ బ్లాగ్ లో ఊరికే హ హాహా అని రాస్తూ ఉంటా చాలా సార్లు. అది ఓ కవిత లో కూడా కనిపించడం బాగా అనిపించింది నాకు! ఆనందం చివరి కన్నీటి చుక్కలో దాక్కోవడం ఇంకో హైలైట్ ఈ కవిత కి. కదా! ఆనందాన్ని ఏడ్చేయ్యడం ఇంక సరే సరి! భలే కవిత!
ముచ్చట గా మూడోది
మామూలు వస్తువుల ఓర్పు
పాట్ శ్నయిడర్
ఇదో రకమైన ప్రేమ కదా?
ఓ కప్పు తనలో టీ ని నింపుకునే తీరు
నిలకడగా నలు చదరంగా నిలబడే కుర్చీ
మన బూట్ల సోళ్ళని, కాలి వేళ్ళని స్వీకరించే నేల
అసలు మన పాదామూలాలకెలా తెలుసు వాటి స్థానమేదో?
మామూలు వస్తువులు చూపించే ఓర్పు గురించి ఆలోచిస్తున్నా ...
బట్టలు అలమరల్లో ఎంత మర్యాదగా ఎదురుచూస్తుంటాయో
సబ్బు తన పాత్ర లో ఎంత నిశ్శబ్దంగా ఆరుతుందో
మన వీపు చర్మం మీంచి తేమ ని టవళ్లు ఎలా తాగుతాయో
ఇంకా .. మెట్ల అందమైన పునరావృత్తి ....
మరి కిటికీ కంటే ఉదారమైనది ఇంకేదైనా ఉందా?
ప్రతి వస్తువు లో జీవం చూడటం ఆర్టిస్టులకే చెల్లింది. సైన్సు ఎంత వాటిని జీవం లేని వస్తువులని వక్కాణించినా, కవులూ కళాకారులూ ఒప్పుకోరుగా.
ఈ కవిత లో మనకి ప్రతి రోజూ ఉపయోగపడే వస్తువులకు ఎంతటి గౌరవం ఇచ్చారో అనిపించింది. నిజమే, మనకోసం బట్టలు అలమరల్లో మర్యాదగా ఎదురుచూస్తాయి!
అన్నిటిని వర్ణించి కిటికీ కి కవి ఇచ్చిన పర్స్పెక్టివ్ .. చిన్న కిటికీ మొత్తం ప్రపంచాన్ని చూపించగలదు ... అందుకే అంత కంటే ఉదారమైనది ఇంకేదీ ఉండదు గా!
ఇంత సున్నితమైన భావాలు, ఇంత ప్రత్యేకమైన దృష్టికోణం .. ఇందుకే అందరూ కవితలు చదువుతారు కదా. నేను లేట్ గా మొదలు పెట్టాను. అర్ధం చేసుకోడానికి జీవితానుభవం కూడా కావాలి కదా.. అది సంపాదించుకున్నా ఇన్నాళ్లూ. హహ్హ.
ఇలా తెలుగు కవితల అకౌంట్లు ఉన్నాయా? మీకు తెలిస్తే నాకు చెప్తారా?
ఓ కవిత ని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చదవచ్చు. నేను రాసిన అనువాదాలు నాకర్ధమైనవి. మీకు వేరేగా అనిపిస్తే నాకు చెప్తారు గా?
ఇలాంటి కవితలు ఇంకొన్ని కనిపించాక పార్ట్ - 2 రాస్తాను. ఉంటాను.
లేబుళ్లు: ఇంగ్లీషు కవితలు తెలుగులో, galway kinnell, laura gilpin, pat schneider, poetry
తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...
ఎదురుచూడడం, వెయిటింగ్ .... వీటి గురించి రాద్దామనుకోగానే నాకు 'కలువ నిరీక్షణ' అనే సాహిత్యమే గుర్తొచ్చింది ఎందుకో.
తుషార శీతల సరోవరం లాంటి అందమైన సెట్టింగ్ లో ఎవరైనా బానే ఎదురుచూస్తారు. కానీ విషయం విషమం అయిపోయి, పరిస్థితులు పీకల మీదకి వచ్చేసినప్పుడు, అలా వచ్చిన రాకపోయినా మనం వచ్చేసినట్టే ఆందోళన పడిపోతున్నప్పుడు ఏం చేయాలి? అసలు ఎదురుచూడటం అంటేనే విసుగు ఉన్న వారు ఏం చేయాలి?
ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితం లో ఎదురుచూపులు తప్పవు కదా.
బస్సు కోసం, డొమెస్టిక్ హెల్ప్ కోసం, ఓ మంచి అవకాశం కోసం, ప్రేమ ప్రతిపాదన చేసాక ఎదుటి వ్యక్తి సమాధానం కోసం, మెడికల్ రిపోర్ట్స్ కోసం, అవి పుచ్చుకొని డాక్టర్ దగ్గర మన వంతు కోసం, సమాజం లో మార్పు కోసం, ఓ సినిమా లో ఎప్పటికీ మొదలవ్వని కథ కోసం, సంతానం కోసం, ప్రొమోషన్ కోసం, లక్ తిరగడం కోసం, రివెంజ్ కోసం, అప్పు కోసం, ఆ అప్పు తీర్చడం కోసం, సొంత ఇంటి కోసం, కలల జీవితం కోసం, పుట్టినరోజు కోసం, బరువు తగ్గడం కోసం.... చివరికి మరణం కోసం... ఎదురుచూపులు తప్పవు కదా.
(పైన పేరా అనుకోకుండా దండకం ఛందస్సు లో వచ్చిందేమో అని అనుమానంగా ఉంది)
హుందాగా ఎదురుచూడటం ఎలా?
ముందుగా మనకి తెలియాల్సింది ఎక్కడ ఎదురు చూడాలో, ఎక్కడ చూడక్కర్లేదో. (ఈ విచక్షణ తెలీక నా జీవితం లో చాలా సమయం వృధా చేసుకున్నాను. )
రెండోది, వస్తుందో రాదో తెలీని భవిష్యత్తు కోసం ఈ రోజు పాడు చేసుకోకుండా, మానసిక ఆరోగ్యం చెడిపోకుండా ఎలా ఎదురుచూడాలి? ఇది నా సందేహం.
థియరీ లో చిట్కాలు బానే ఉన్నాయి. కానీ అవి ప్రాక్టికల్ గా కూడా పని చెయ్యాలి కదా.
ముందుగా తెలియల్సిన విషయం ... నిరీక్షణ కి కావాల్సింది ఓర్పు.
ఒక్కో సారి ఈ ఓర్పు నేర్పించడానికీ జీవితం వెయిట్ చేసే పరిస్థితుల్ని కల్పిస్తుంది అనేది నా అభిప్రాయం.
రెండోది దేని కోసం ఎదురుచూస్తున్నామో అదే ఫోకస్ అవ్వకూడదు. నిజానికి దాని గురించి ఎంత మర్చిపోతే అంత త్వరగా ఆ విషయం అవుతుందని నేను గమనించాను. కానీ ఇది ఒక్కోసారి ప్రాక్టికల్ గా సాధ్య పడదు. ఓ అమ్మాయి కి ఓ అబ్బాయి ప్రపోజ్ చేస్తే, ఆ అమ్మాయి ని అతను రోజూ చూడాల్సి వస్తే ఎలా మర్చిపోగలడు పాపం! కానీ సాధ్యం చేసుకుంటే చాలా బాగుంటుంది.
అలా సాధ్యం అవ్వాలంటే ఫోకస్ వేరే విషయాల మీద కి మార్చుకోవాలి. ఇది ఇంకో చిట్కా.
సుదీర్ఘ రైలు, బస్సు ప్రయాణాల్లో గమ్యం కోసం అదే పనిగా ఎదురుచూడకుండా పుస్తకం చదువుకోవడమో, ఎంబ్రాయిడరీ, అల్లికలు చేసుకోవడమో, ఎవరితోనైనా కబుర్లు చెప్పుకోవడమో ... ఇలా చేస్తే సమయం తెలీదు చూడండి.. అలాగన్నమాట.
సమయాన్ని మరిపించేలా చేసుకొనే చిట్కా ఒకటైతే, దీనికంటే ఓ మెట్టు ఎక్కువ... నిరీక్షణ లో ఆనందం పొందడం.
శబరి కూడా ఎంతో కాలం ఎదురుచూసింది తన వరం ఫలించడం కోసం. ఆమె కి ఓర్పు తో పాటు తోడైంది నమ్మకం. రాముడు వస్తాడో రాడో అని ఏనాడూ ఆమె అనుమానించిన దాఖలాలు కనపడవు. ఏ రోజు కా రోజు, ఆ రోజే రాముడొచ్చే రోజని ఇల్లు శుభ్రం చేసి, పళ్ళు కోసుకొచ్చి, పూల మాలల తో పాటు పాటలు కూడా కట్టి తరించింది శబరి. ఇది చాలా సాత్వికమైన నిరీక్షణ అనిపిస్తుంది.
రూమి అంటాడు "ఓర్పు అంటే ఊరికే కూర్చొని ఎదురుచూడటం కాదు. భవిష్యత్తు ని ముందే చూడటం. ముల్లుని చూస్తూ గులాబీ ని ఊహించగలగటం. రాత్రిని చూస్తూ కూడా ఉదయం వస్తుంది అని నమ్మగలగటం. ప్రేమాత్ములందరూ ఓర్పు కలిగిన వారే. చంద్రుడు పూర్ణుడవ్వడానికి సమయం పడుతుందని వారికి తెలుసు".
ఈ కోట్ చూస్తే శబరి గురించే చెప్పారేమో అనిపిస్తుంది నాకు.
ఓర్పు కి ఇంకో ఉదాహరణ రామదాసు. ఈయన ఓర్పు పూర్తి సాత్వికమైన ఓర్పు కాదు. కానీ తక్కువ మాత్రం చెయ్యలేం. నిజానికి ఈయన ఎదురుచూసిన పరిస్థితులు శబరి గారి కంటే దారుణమైనవి. రామదాసుకి రాముడు వస్తాడో రాడో తెలీదు. వస్తాడని ఎవరూ చెప్పలేదు, వరమియ్యలేదు. అయినా నిరంతరం రామకీర్తన లో నే కాలం గడిపాడు తప్ప ఇంకో పని చెయ్యలేదు. తిట్టినా, పొగిడినా కీర్తనలోనే! "ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు ... రామచంద్రా... దెబ్బలకోర్వక అబ్బా తిట్టితినయ్యా రామచంద్రా" అంటాడు కదా... ఇది కొంచెం మన జీవితాలకి దగ్గరైన వెయిట్ స్టోరీ అనిపిస్తుంది. మానవ సహజంగా అనిపిస్తుంది... మనం అందుకోలేనంత ఆదర్శవంతంగా అనిపించదు.
కర్మ సిద్ధాంతం వల్ల భారతీయులం చాలా బతికి పోయాం. 'నీకెందుకు ఏది వస్తుందో రాదో... నీ పని నువ్వు చూస్కో' అని కృష్ణుడు అంత క్లియర్ గా చెప్పాక ఇంక ఏమీ చెయ్యకుండా ఎదురుచూస్తూ ఎందుకు కూర్చుంటాం?
ఎదురుచూపులకి ఇంకో కోణం ఉంది.
వేట లో పులి చేసే వెయిటింగ్... అవకాశం కోసం. ఇదే కుటిల నీతి కి కూడా వర్తిస్తుంది. స్లీపర్ సెల్ లాగా ఉంటూ అవకాశం రాగానే దాడి చెయ్యడం.
పవర్ పాలిటిక్స్ ప్రకారం ఎంత సేపు వెయిట్ చేయిస్తే అంత పవర్ ఫుల్ అన్నట్టు. ఎదురుచూసే వాడు అంత బలహీనుడు లేదా అవసరం ఉన్నవాడు అన్నట్టు.
సాహిత్యం, సినిమాల విషయానికొస్తే ... గజళ్ళు, ప్రేమ సాహిత్యం లో ఎదురుచూపులు అనే థీమ్ లేకుండా ఉండదు కదా.
ఓ సినిమా ఉంటుంది. 'ది టర్మినల్' అని. ఓ కాల్పనిక దేశానికి చెందిన వ్యక్తి హీరో. న్యూ యార్క్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు. దిగాక తెలుస్తుంది.. అతని దేశం లో రాజకీయ సందిగ్ధం ఏర్పడి ఆ దేశాన్ని అమెరికా ఓ దేశం గా పరిగణించలేకపోతుంది. అందువల్ల ఇతని పాస్పోర్ట్ రద్దవుతుంది. ఇతను వెనక్కి వెళ్ళలేడు .... అలా అని అమెరికా లో ప్రవేశించలేడు. ఎయిర్పోర్ట్ లో నే తొమ్మిది నెలల పాటు ఉండిపోవాల్సి వస్తుంది... అయోమయ పరిస్థితుల్లో. కానీ ఆ సమయాన్ని అతను ఎంత అందంగా గడుపుతాడో, ఎంత మంచి స్నేహాలు చేస్కుంటాడో .... ఆ సినిమా చూపిస్తుంది. భాష రాకుండానే అతను నిర్మల మైన మనసుతో సృష్టించుకున్న బంధాలు అతని చివరికి ఎంతో సహాయ పడతాయి, త్యాగాలు చేస్తాయి.
ఆ సినిమా కాప్షన్ చూసారా.. లైఫ్ ఇస్ వెయిటింగ్. 'జీవితం ఎదురుచూస్తోంది' అనేది ఒక అర్ధమైతే 'జీవితం అంటేనే ఎదురుచూపులు' అని ఇంకో అర్ధం!
కుక్ చేసే వాళ్ళని కుక్కర్ అని ఎలా అనకూడదో వెయిట్ చేసే వాళ్ళని వెయిటర్ అని అనకూడదు ఏంటో. మరి యేమని పిలవాలి?
నిరీక్షకులు అనే పదం ఉందనుకోండి. కార్పొరేట్ వాళ్ళైతే ఓ హడావుడి టైటిల్ పెట్టేస్తారు. నిరీక్షణా నిపుణులు, ఎక్స్పర్ట్ ఇన్ ఎదురుచూపులు ... ఇలా . 😀😂
జీవితం అంటే ఏంటి అంటే చాలా నిర్వచనాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది... ప్రస్తుతం నడుస్తున్న కాలమే జీవితం. గతం కాదు. భవిష్యత్తు కాదు.
అర్ధం లేని నిరీక్షణ, అవసరం లేని ఎదురుచూపులు మన ఈ రోజుని మనకి కాకుండా చేస్తాయి అని నాకు అనిపిస్తుంది.
చేస్తే శబరి లాంటి సాత్విక నిరీక్షణ చెయ్యాలి. లేదా రామదాసు లాంటి సంగీత సాహితీ ఆధ్యాత్మిక నిరీక్షణ చెయ్యాలి. ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు కానీ ఏవో ప్రేమ కథలు చెప్తారు చూడండి... వారి లాంటి నిరీక్షణ చెయ్యాలి. ఇంక దీనికి తక్కువ నాణ్యత ఉన్న వెయిటింగ్ చేస్తే జీవితం నాణ్యత తగ్గిపోతుంది.
ఈ తరానికి ఓర్పు లేదు... ఎక్కువ ఎవరూ దేనికీ ఎదురుచూడట్లేదు... ఓ ఉత్తరం రాసి దాని కి జవాబు రావడం ... ఇలాంటి నిరీక్షణ లో ని ఆనందాన్ని ఈ తరం మిస్ అయిపోతోంది అని ఓ అభిప్రాయం ఉంది. అది కొంత నిజమే. కానీ ఈ తరానికి ఉన్న లాంటి ఎదురుచూపులు ఈ తరానికి ఉన్నాయ్ పాపం. ఎదురుచూసే విషయాలు మారాయి అంతే అనిపిస్తుంది నాకు.
ఎలా ఎదురుచూడాలి అని ఇంగ్లిష్ లో గూగుల్ చేస్తే కొన్ని చిట్కాలు ఇచ్చారు. అందులో రెండు మూడు పైన ప్రస్తావించా కదా. ఆఖరి గా ఒకటి చెప్పారు. ఎదురుచూపులు తప్పవు అన్నప్పుడు మీతో పాటు ఎవరినైనా తోడు తెచ్చుకొండి అని. ఆ సపోర్టు, ఆ ధైర్యమే వేరు కదా.
మనం ముఖ్యం అనుకున్న వారికోసం/వాటికోసం ... హ్యాపీ వెయిటింగ్!
లేబుళ్లు: ఎదురుచూపులు, ఎలా ఎదురుచూడాలి, ది టర్మినల్, నిరీక్షణ, how to wait
లేటెస్ట్ సినిమాలు చూసి రివ్యూ లు పెట్టడం అలవాటు లేదు నాకు. కానీ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమా గురించి తప్పకుండా రాయాలనిపించింది.
దీని ట్రైలర్ చూసి థియేటర్ లో చూద్దామనుకున్నా. కుదర్లేదు. ఇంట్లో అమెజాన్ లో చూసాను.
ఇది అంత హిట్ సినిమా కాదు ..... కానీ ఈ కాలానికి చాలా అవసరమైన సినిమా.
ఎప్పుడూ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లని విమర్శిస్తాం కదా .... మీరు కోట్లలో బిజినెస్ చేస్తారు .. పెద్ద స్టార్లందరూ మీ గుప్పెట్లో ఉంటారు .. మంచి సినిమా తీయచ్చు కదా అని. ఈ సినిమా అలంటి విమర్శల కి యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ జవాబు అనిపిస్తుంది. (యష్ రాజ్ కి నాకూ ఏ సంబంధం లేదండి బాబు ... నిజంగా నచ్చే చెప్తున్నా).
ఈ సినిమా హీరో రణ్వీర్ సింగ్. హీరోయిన్ అర్జున్ రెడ్డి లో హీరోయిన్ అయిన షాలినీ పాండే. రత్నా పాఠక్ షా, బోమన్ ఇరానీ ల తో పాటు కొత్త వాళ్ళు మంచి నటులు కనిపించారు ఇందులో.
కథ ఏంటంటే బోమన్ ఇరానీ గుజరాత్ లో ఓ పల్లెటూరి సర్పంచ్. కరడు గట్టిన పురుషాహంకారం, లింగ వివక్ష, పితృస్వామ్యం లో ఉన్న చెత్త అంతా మూర్తీభవించిన వాడు. స్కూల్ ముందు మందు దుకాణం మూయించండి, తాగి ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు అంటే 'ఆడపిల్లలు వాసన వచ్చే సబ్బులు వాడటమే ఇందుకు కారణం .. సబ్బుల్ని బాన్ చేస్తున్నాను' అని తీర్పు ఇస్తాడు. (ఇలాంటి స్టేట్మెంట్స్ రాజకీయ నాయకులు ఇవ్వటం ఎన్ని సార్లు వినలేదు? ఎన్ని ఫత్వాలు చూడలేదు)
అతని కొడుకు హీరో రణ్వీర్ సింగ్. జయేష్ అతని పేరు. ఇతని భావాలు తండ్రికి పూర్తి వ్యతిరేకం. భార్య అంటే ఎంతో ఇష్టం, ఆమె కి రహస్యంగా డ్రైవింగ్ నేర్పిస్తాడు. పదేళ్ల కూతుర్ని ఎంతో ముద్దు గా చూసుకుంటాడు. కానీ తండ్రి అంటే భయం.
జయేష్ వివాహం కుండ మార్పిడి సంప్రదాయం లో జరిపిస్తారు. జయేష్ చెల్లి ని షాలిని పాండే అన్నకే ఇస్తారు. ఇది ఇన్సూరెన్సు కోసం అని వాయిస్ ఓవర్ లో హీరో అంటాడు. షాలిని పాండే అన్న జయేష్ చెల్లిని కొడుతూ ఉంటాడు. ఆమె వీడియో కాల్ లో ఆమె దెబ్బలని చూపించి ఏడుస్తూ ఉంటుంది. దానికి బోమన్ ఇరానీ చెప్పే న్యాయం ఏంటంటే జయేష్ షాలిని పాండే ని కొట్టాలి అని. ఆ ఇంట్లో నా ఆడ బిడ్డ దెబ్బలు తింటే, ఈ ఇంట్లో వాళ్ళ ఆడ బిడ్డ తన్నులు తినాలి. అంతే గాని తన కూతరుని ఆ నరకం నుంచి తప్పించాలి అని మాత్రం అనుకోడు.
జయేష్ హింస కి దూరం. అందులో ఆడదాని మీద అస్సలు చెయ్యి ఎత్తడు. కానీ తండ్రిని నమ్మించడం కోసం తలుపులు వేసి దిండుని కొట్టి భార్య ని అరిచి నటించమంటాడు. కూతురు కూడా కొట్టద్దు "నాన్న అమ్మని కొట్టద్దు నాన్న" అని కేకలు వేస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఉంటుంది.
ఇలా అటు తండ్రినీ, ఇటు భార్య నీ నొప్పించకుండా మేనేజ్ చేసేస్తూ ఉంటాడు జయేష్.
ఇంతలో వీరి పంచాయితీ సీటు ఆడవారి కి రిజర్వ్ చేస్తారు. బోమన్ కోడలైన షాలిని ని ఆ సీట్ లో నిలబెట్టి గెలిపించి తానే యేలేస్తూ ఉంటాడు. ఆమె డమ్మీ కాండిడేటు.
షాలినీ నిండు గర్భవతి. లింగ నిర్ధారణ పరీక్ష నేరం అని తెలిసినా ఉత్తర భారత దేశం లో కొన్ని పల్లెల్లో ఇంకా జరుగుతోందట. డాక్టర్ 'జై మాతా దీ' అంటే ఆడ పిల్ల అని కోడ్. 'జై శ్రీ కృష్ణ' అంటే పుట్టబోయే శిశువు మగ పిల్లవాడు అని. (బాలికా వధు అనే సీరియల్ లో కూడా ఈ దారుణం గురించి చూపించారు) బోమన్ ఇరానీ కి వంశోద్ధారకుడు కావాలి. ఇప్పటికే షాలినీ కి నాలుగైదు అబార్షన్లు అయ్యాయి అని చెప్తారు. ఇంక ఆమె శరీరానికి ఇంకో కాన్పు ని తట్టుకొనే శక్తి లేదని హెచ్చరిస్తుంది లేడీ డాక్టర్.
అల్ట్రా సౌండ్ లో స్పష్టంగా ఏదీ తెలియట్లేదు అని అబద్ధం చెప్తుంది డాక్టర్ పెద్దవాళ్ళ ముందు. జయేష్ ఒక్కడూ ఉన్నప్పుడు 'జై మాతాదీ' అంటుంది.
జయేష్ కి అర్థమయిపోతుంది. తన తండ్రి ఈ బిడ్డని కననివ్వడు. ఇంక షాలిని కి కనే శక్తి లేదు కాబట్టి తనకి ఇంకో పెళ్ళి కూడా చేసేస్తాడు.
షాలిని ని, తన పుట్టబోయే బిడ్డ ని కాపాడుకోడానికి అతను పడే పాట్లే మిగిలిన సినిమా అంతా.
ఈ సినిమా రాసుకొనే అప్పుడు 'యాక్షన్ హీరో' అనే పేరు పెట్టుకున్నారట వర్కింగ్ టైటిల్. ఇది వ్యంగ్యార్థం. ఎందుకంటే అస్సలు ఈ సినిమా లో ఒక్క ఫైట్ కూడా చెయ్యడు హీరో. వీరోచితమైన సీన్లు ఎక్కడా ఉండవు. ఒక బలహీనమైన వ్యక్తి తన కుటుంబాన్ని రక్షించుకోడానికి ఏం చేస్తాడు, ఎలా ఆలోచిస్తాడు ... అలాగే ఉంటుంది సినిమా. పోనీ ఆ ప్లాన్లు అతి తెలివి గా కూడా ఉండవు.
హర్యానా లో ఓ పల్లెటూరిలో ఆడపిల్లలు లేక ఊరు ఊరంతా బ్రహ్మచారులే. వాళ్ళు యూట్యూబ్ లో ఓ వీడియో చేస్తారు ... ఎవరైనా ఆడపిల్లలు తమ ఊరికి వస్తే కంటికి రెప్పలా చూసుకుంటాం అని, వారికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని. వాళ్ళందరూ వస్తాదులు. ఆ ఊరికి తన కుటుంబాన్ని తీసుకెళదామని జయేష్ ప్లాన్. (ఇలాంటి ఊరిని ఆమిర్ ఖాన్ 'సత్యమేవ జయతే' షో లో చూపించారు.)
ఆడవారి సమస్యలు చూపించే అప్పుడు నూటికి తొంభై సినిమాల్లో చాలా తప్పులు దొర్లుతాయి. ఇది రాసే వారికీ తెలీదు ... చూసే వారికీ తెలీదు. (నాకు చాలా ఆవేశం కలిగించే విషయం ఇది .... దీని మీద నేను ఓ సెపరేట్ బ్లాగు పోస్టు రాసినా ఆశ్చర్యపోక్కర్లేదు)
అందులో ప్రప్రథమం .... ఆడవారిని రక్షించడానికి ఓ మగాడు రావడం. దీని వల్ల ఆడవారిని మళ్ళీ బలహీనులుగా, రక్షించాల్సిన అవసరం ఉన్నవారి గా చూపిస్తున్నారు అని ఎవరూ గ్రహించరు.
ఆ రక్షించడానికి వచ్చే మగాడు తను కూడా ఎన్నో తప్పులు చేస్తాడు కానీ అతన్ని ఎవరూ తప్పు పట్టరు ... ఉదాహరణ కి అతను హీరోయిన్ ని వెంటాడి వేధించి ప్రేమిస్తాడు. అదే పని ఇంకోడు చేస్తే ఇతను వెళ్లి కొడతాడు.
అలాగే స్త్రీ సమస్యలు చూపించే అప్పుడు విలన్లు మగాళ్ళే ఉంటారు ... నిజానికి పితృస్వామ్యాన్ని జీర్ణించుకున్న ఆడవాళ్ళు కూడా సమస్య లో భాగమే.
కమర్షియల్ సినిమా పరిధి లో 'మార్పు' కి అవకాశం లేదు. తప్పు చేసిన వాడు విలన్, వాడ్ని చంపేయాలి. కానీ కుటుంబ సమస్యల్లో తండ్రి, తల్లి మారాలి అని కోరుకుంటాం కానీ చచ్చిపోవాలి అనుకోము కదా.
ఒక వేళ కమర్షియల్ సినిమా లో ఎవరైనా మారితే ఆ మార్పు నమ్మశక్యం కాకుండా ఉంటుంది ... అప్పుడే ఎలా మారిపోయారు అనిపిస్తుంది.
ఇలాంటి తప్పుల్ని జయేష్ భాయ్ జోర్దార్ సినిమా చెయ్యలేదు.
ఫెమినిజం టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ సినిమా తీశారనిపిస్తుంది.
భార్య పట్ల ప్రేమ, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని తపన తప్పించి హీరో కి ఇంకే శక్తులు లేవు ఈ సినిమా లో. ఇది చూడటానికి అందరికీ చాలా కొత్త గా ఉండచ్చు. కానీ ఇలాంటి హీరో పాత్రలు రావాల్సిన అవసరం చాలా ఉంది. అందరు ఆడవారి మధ్య కూర్చొని ఏడుస్తూ ఉంటాడు జయేష్. బోమన్ ఇరానీ ఇది చూసి 'ఏడవటం ఆపు' అంటాడు. అతనికి తల కొట్టేసినట్టు ఉంటుంది. పితృస్వామ్యం మగవారిని నుంచి లాగేసుకున్న సున్నితత్వాన్ని హీరో వ్యక్తీకరిస్తే, అదే పితృస్వామ్యానికి ప్రతీక అయినా బోమన్ అస్సలు భరించలేకపోతాడు. ఇది చూపించడం చాలా ముఖ్యం.
హీరోయిన్ పాత్ర కేవలం బాధిత, అమాయకురాలు కాదు. ఓ వైపు 'నేను మీకు కొడుకునివ్వలేకపోయాను' అని ఏడుస్తుంది బేలగా. (అప్పుడు జయేష్ అంటాడు ... కొడుకు పుట్టడానికి కావాల్సిన వై క్రోమోసోమ్ నా నుంచే రావాలి .. కాబట్టి సారీ.. నేనే నీకు కొడుకునివ్వలేకపోయాను అని ... ఈ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. నిజమే కదా మరి!) ఇంకో వైపు వీళ్ళు తప్పించుకొని పారిపోదాం అనుకునే అప్పుడు 'మరి ఊళ్ళో మిగిలిన ఆడవాళ్ళ సంగతి ఏంటి?' అని జయేష్ ని అడుగుతుంది. వారు అలా కష్టాలు పేరుతో ఉండాల్సిందేనా అని బాధపడుతుంది.
జయేష్ పెద్ద కూతురి క్యారెక్టర్ కూడా బాగా రాశారు. అది సీమ టపాకాయ. తండ్రి లో లేని వీరత్వం ఆ పిల్ల లో ఉంటుంది. తండ్రి ని చాలా సార్లు మోటివేట్ చేస్తుంది కూడా.
రత్నా పాఠక్ షా షాలిని అత్తగారు. ఇందాక చెప్పినట్టు పితృస్వామ్యాన్ని జీర్ణించుకున్న స్త్రీ. జయేష్ ఆమె తో చెప్పే మాటలు చాలా బాగుంటాయి. 'అమ్మా .. నిన్నెవరూ సరిగ్గా ప్రేమించలేదమ్మా' అంటాడు. ఆమె ఆ మాటలు విని అతన్ని చెళ్ళున కొడుతుంది. వెంటనే ఆ మాటలు యాక్సెప్ట్ చేయలేకపోతోంది. ఇది చాలా నాచురల్ గా చూపించారనిపిస్తుంది.
సినిమా అంతా ఓ పెద్ద సమస్య కి హీరో చేసే సిల్లీ చిట్కాలు, కలిసొచ్చే కలిసిరాని ప్రయోగాలు .. ఇలాగే గడిచిపోతుంది. వాళ్ళ మూఢ నమ్మకాల ని వాళ్ళకే వ్యతిరేకంగా వాడటం చాలా మంచి పాయింట్ సినిమా లో ...( షాలిని, కూతురు పారిపోతుంటే వాళ్ళ ని వెంబడించడం లో నల్ల పిల్లి ఎదురొస్తే చచ్చినట్టు ఆగి, వెనక్కి రెండు అడుగులు వేసి మళ్ళీ వెంబడించే లోపు వాళ్ళిద్దరికీ తప్పించుకొనే అవకాశం వస్తుంది!! )
జయేష్ చెల్లిని మొగుడు కొడుతూ ఉంటాడు కదా ... ఆ సమస్య కి కూడా సరైన పరిష్కారం చూపించారు. ఆ అమ్మాయి కి ఆ వస్తాదుల్లో ఒకడు నచ్చి పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుంది. అంతే తప్ప మొగుడు ఎలాంటి వాడైనా కాపురం చేసుకోమ్మా అనో .. ఆ మొగుడు మారినట్టో, ఈమో హీరోనో అతన్ని మార్చినట్టో చూపించలేదు.
అన్ని అబార్షన్లు అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టినా భార్య ని కనీసం ముద్దు పెట్టుకోలేదని వాపోతాడు జయేష్. మనవరాలు పుట్టి, కొడుకు కనువిప్పు చేసాక, భార్య నిలదీసి మాట్లాడక తన మంచాన్ని ఆమెకి దగ్గరగా జరుపుతాడు బోమన్. ప్రేమ లేని పెళ్లిళ్లు, సున్నితత్వం లేని సంసారాల్లో ఆడవారు ఎంత బాధ పడుతున్నారో బాగా చూపించారు అనిపించింది.
ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం అవసరం.
ఏ సినిమా అయినా చెయ్యగల స్టార్ ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం అవసరం.
హీరో వీరత్వం కాదు .. అతని స్టార్డం ని ఓ సమస్య ని హైలైట్ చెయ్యడానికి వాడుకోవడం అవసరం.
ప్రధాన తారాగణం తప్ప సహనటులందరూ కొత్తవాళ్ళే. చాలా బాగా చేశారనిపించింది.
సినిమాలో అనవసరంగా పాటల్లేవు. ఇది ఇంకో మంచి విషయం.
సినిమా చూసినంత సేపు వారితో నవ్వడం, ఏడవడం .. ఎమోషనల్ అవ్వడం జరిగింది. కానీ సినిమా సింక్ అయ్యాక చాలా తృప్తి గా అనిపించింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఉంది ఈ సినిమా. తెలుగు సబ్ టైటిల్స్ సౌకర్యం కూడా ఉంది.
నాకు నచ్చిన సినిమాల గురించి ఇంతకు ముందు రాసిన పోస్ట్లు కొన్ని ఇక్కడ లింక్ ఇస్తున్నాను.
http://sowmyavadam.blogspot.com/2020/03/blog-post_28.html
http://sowmyavadam.blogspot.com/2018/12/blog-post.html
http://sowmyavadam.blogspot.com/2018/09/blog-post.html
ఉంటాను. మళ్ళీ కలుస్తాను. జై మాతాదీ ... జై శ్రీ కృష్ణ!
లేబుళ్లు: film criticism, film review, Jayeshbhai Jordaar, Telugu blog, telugu blogger, telugu review, yashraj films
మొన్న ఇనార్బిట్ మాల్ కి వెళ్ళినప్పుడు ఒక చిన్న షాపు కనిపించింది. 'మేక్ యువర్ ఓన్ పెర్ఫ్యూమ్' ... మీ అత్తరు మీరే తయారు చేస్కోండి అని. అక్కడ ఉన్న పెర్ఫ్యూమర్ (పెర్ఫ్యూమ్ అమ్మే వారిని అలా పిలుస్తారని ఇప్పుడే తెలిసింది) రకరకాల వాసనలు ఒక దళసరి పేపర్ ముక్క మీద జల్లి చూపించాడు. అన్ని వాసనలు వరసగా చూసి confuse అవ్వకుండా మధ్య మధ్య లో కాఫీ గింజలు వాసన చూపిస్తారు. అది మళ్ళీ మన ముక్కు ని రీసెట్ చేస్తుందన్నమాట!
వాటిలో మనకి నచ్చింది ఒకటి కానీ, రెండిటి మిశ్రమం కానీ తయారు చేస్కోవచ్చు. వాటిని తగు పాళ్ళలో ఓ బాటిల్ లో వేసి ఇస్తాడు. అంతే. అదే మన కోసం మనం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న పెర్ఫ్యూమ్ అన్నమాట. ధర 2500 రూపాయల నుంచి మొదలవుతుంది. మనం ఎంచుకున్న అత్తరు బట్టీ. నేను కొనలేదు కానీ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనిపించింది.
నేనసలు పెర్ఫ్యూమ్ వాడే దాన్ని కాదు ....
ఒకటి... మధ్య తరగతి ఇళ్లలో ఇలాంటి విషయాల్లో ఇంట్రస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పించి ఇవి అలవాటు అవ్వవు. నెలసరి బడ్జెట్ లో రెండు, మూడు వేల రూపాయలు లేదా అంత కంటే ఖరీదు చేసే వస్తువు ... ముఖ్యంగా ప్రాక్టికల్ యూజ్ లేనిది అస్సలు కొనేవారు కాదు.
పెద్దయిన తరవాత అవి పర్యావరణానికి ... ముఖ్యంగా ఓజోన్ పొర కి ఎంత హానికరమో తెలిసి అసలు వాటి జోలికి పోయే దాన్ని కాదు.
కానీ ఇంకొంత పెద్దయ్యాక, మనం వాడే ఇంకా చాలా వస్తువుల నుంచి ... అంటే ఇంట్లో వాడే ఫినాయిల్ లాంటివి కూడా ... పర్యావరణానికి హానికరమే అని .... ఇలా పట్టించుకుంటూ పోతే అసలు బతకలేం అని ... కొంత బాధ్యతాయుతం గా ప్రవర్తిస్తే లైఫ్ లో అన్నీ ఎంజాయ్ చేయచ్చు అనే నిర్ణయానికి వచ్చి ఎవరైనా బహుమతి గా ఇస్తే వాటిని వాడటం లాంటివి మొదలు పెట్టాను.
ఏ విషయం అయినా కూలంకషంగా తెలుసుకోవాలనే అనవసరమైన అలవాటు వల్ల ఈ అత్తరు పరిశ్రమ గురించిన చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గరకి వచ్చి పడిపోయింది. ఆ సంచి ఈ రోజు ఈ పోస్టు లో బోర్లిస్తున్నా అన్నమాట
ముక్కు కి వాసన చూడటం వచ్చని గ్రహించిన రోజు నుంచి కోట్ల రూపాయల అత్తరు బాటిళ్ళు అమ్మే వరకూ మనిషి చాలా దూరం వచ్చాడు. నాకిదే నచ్చుతుంది మనిషి లో. కళాత్మకత ఎక్కడ జొప్పించడానికి వీలుండే అక్కడల్లా జొప్పించేస్తాడు.
ముందు ప్రకృతి లో మంచి వాసనలు చూసి ఉంటాడు. మల్లె, గులాబీ, మరువం, సంపెంగ... ఇలా. అవి ఒక్క పూట లో వదిలిపోవడం చూసి బాధ పడి ఉంటాడు. తన కంట్రోల్ లో లేని వస్తువు ని ఎలాగైనా పట్టు లోకి తెచ్చుకోవాలనే మనస్తత్వం ఇక్కడ కూడా పని చేసి ఉంటుంది. ఒక్క పూట లో వాడిపోయే పువ్వుల నుంచి ఎల్లకాలం ఉండిపోయే సుగంధంగా మార్చి అక్షరాలా వాటిని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. (ఇది మనిషి లో నాకు నచ్చనిది)
ఎవరి సంస్కృతుల పరిమళాలు మళ్ళీ వారివే ...
మన భారతీయ సుగంధాలు ... జవ్వాజి, సాంబ్రాణి, గులాబీ, మల్లె, గంధం, మరువం, కర్పూరం ... ఇలా ఉంటాయి కదా. ప్రకృతి కి దగ్గరగా, ఆయుర్వేదానికి అనుసంధానంగా. ఇందులో అన్నీ దేవుడికి సమర్పించడానికి కూడా సంకోచించం .. అంత పవిత్రంగా భావిస్తాం. ఇవి పర్యావరణానికి హానికరం కానివి. పైగా దోమలు, చిన్న చిన్న పురుగులు రాకుండా, ఎక్కువ మంది ఒక చోట చేరినప్పుడు వైరస్ లాంటివి వ్యాపించకుండా చేసే గుణాలు కూడా కలవి!
ఇక ముస్లిం సంస్కృతి విషయానికి వస్తే ... అసలు 'అత్తరు' అనే పదం వాళ్ళ 'ఇత్ర్' అనే పదానికి మనం ఇచ్చిన తెలుగు రూపమే కదా ... బజారు లాగా. వారికి అత్తరు ఒక అవసరం. ఇస్లాం పుట్టిన దేశాలు ఎడారి దేశాలు. నీటి ఎద్దడి. రోజూ స్నానం చేయడం కష్టం. అలాంటప్పుడు అత్తరు లేకపోతే పని అవ్వదు మరి!
చార్మినార్ నైట్ బజార్ కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న అత్తరు సీసాలు తెచ్చుకున్నాను. ఇవి చాలా ఘాటు బాబోయ్. కొంత రాసుకుంటే ఆ బట్ట ఉతికినా వాసన పోదు!
ఈ సంస్కృతుల కి అతీతం అత్తరు పరిశ్రమ. వాళ్ళ విధానాలు వేరు (రావు రమేష్ గారు అన్నట్టు). ఏదైనా మాస్ ప్రొడక్షన్ లోకి రాగానే కెమికల్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. కానీ దాన్లో కూడా కళాత్మకత, ఓ శాస్త్రం లేకపోలేదు. సుగంధాలని వాళ్ళు కొన్ని రకాలుగా విభజించారు.
ఫ్లోరల్ - పూల పరిమళాలు
ఫ్రూటీ - ఫలాల పరిమళాలు (మళ్ళీ ఇందులో నిమ్మ లాంటి సిట్రస్ పళ్ళు వేరే కేటగిరి, స్ట్రా బెర్రీ, మామిడి పండు లాంటి మధుర ఫలాలు వేరే కేటగిరి)
వుడీ - చెక్క కి సంబంధించిన పరిమళాలు (గంధం లాంటివే కాదు... చెట్టు బెరడు పరిమళాలు కూడా)
ఆక్వా - నీటికి సంబంధించిన పరిమళాలు
ఇవి కాక లావెండర్, బెర్గామోట్, వెనిల్లా లాంటి పరిమాళాలు.
ఒక పెర్ఫ్యూమ్ జల్లుకున్నాక ముందు ఏం వాసన వస్తుంది, కొంత సేపయ్యాక ఏం వాసన మిగిలి ఉంటుంది ఇలాంటి వాటిని వర్ణించడానికి 'నోట్స్' అనే పదాలని వాడతారు. సంగీతం లో శుద్ధ రిషభం, ప్రతి మధ్యమం లాగా అన్నమాట. బేస్ నోట్స్, హార్ట్ నోట్స్, టాప్ నోట్స్ ఇలాగ. పెర్ఫ్యూమ్ బాటిల్స్ మీద ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవగాహన ఉన్నవాళ్లు ఈ ఇన్ఫర్మేషన్ చూసి వాసన టెస్ట్ చేయకుండా ఆన్లైన్ కూడా పెర్ఫ్యూమ్ కొనుక్కోవచ్చు!
![]() |
| నా స్నేహితురాలు బహుమతి గా ఇచ్చిన పెర్ఫ్యూమ్ లో 'నోట్స్' వివరాలు ఇవి .. గులాబీ, మల్లె, మస్క్ ల మిశ్రమం ఈ సుగంధం |
లోతు కి వెళ్తే ఇంకా చాలా విభజనలు ఉన్నాయి. పెర్ఫ్యూమ్ అని దేన్ని అంటారు, eau de cologne అని దేన్ని అంటారు (దీన్ని మనవాళ్ళు ఉడుకులోన్ అంటారు ... ఏదో తెలుగు పదం అన్నట్టు గా!) అవి మనకి ఇక్కడ అనవసరం.
అభిరుచి ఉన్న వారిని పక్కన బెడితే ఇదంతా అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ వాళ్ళ ప్రపంచం.
ఖరీదు వేలల్లో ఉంటుంది కదా. అప్పుడప్పుడూ లక్షల్లో కూడా. వేలం పాటల్లో ఏ చనిపోయిన రాజో, రాణో, హాలీవుడ్ సినీ తారో, ప్రెసిడెంటో వాడిన బాటిళ్లు, బంగారం, వజ్రం తాపడం చేసినవైతే కోట్లకి అమ్ముడు పోవడం చూస్తూ ఉంటాం కూడా!
ఈ పెర్ఫ్యూమ్ బాటిల్స్ ని కలెక్ట్ చేసే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ బాటిల్స్ ని చూడటానికి చాలా ముచ్చట గా ఉండేలా డిజైన్ చేస్తారు. డిస్ప్లే లో పెట్టుకునేంత అందంగా!
నేను ఈ ఖరీదైన పెర్ఫ్యూమ్ లు ఎక్కువ వాసన చూడలేదు. చిన్నప్పుడు వీటి గురించి తెలీక సారా వాసన లాగా అనిపించేది ... వీటిలో ఉన్న ఆల్కహాల్ వల్ల. కానీ ఇప్పుడు నా కల్చర్డ్ ముక్కు కి తేడా తెలుసు. మొన్న ఆ షాపు అతను టొబాకో వాసన చూపించాడు. మన చుట్ట, సిగరెట్.... ఇలా అస్సలు లేదు ఏంటో!
నాకేం పెర్ఫ్యూమ్ నచ్చుతుంది అని కుతూహలం కలిగింది. నాకు మధుర ఫలాల పరిమళం నచ్చింది. ఫ్రూటీ. సిట్రస్ వాసనలు కూడా నచ్చాయి. అలాగే తినే వాటికి సంబంధించిన గౌర్మాండ్ వాసనలు అంటే వెనిల్లా, చాక్లెట్ లాంటివి నచ్చుతున్నాయి అని తెలిసింది.
ఇంకా అలాంటివి తయారు చేయలేదు కానీ సాంబారు మరుగుతున్న వాసన, మాగాయి లో పోపు వేసిన వాసన, గుమ్మడి వడియాలు వేయించినప్పుడు వచ్చే వాసన.. ఇవి కూడా నచ్చుతాయనుకుంటా నాకు! హహ్హా! ఎవరైనా తెలుగు వారు ఈ పరిశ్రమ లోకి వస్తే ఇలాంటివి తయారు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కొంటారు అని నా నమ్మకం!
ఇలా రకరకాల సుగంధాలు వాసన చూసి, వాడాక మనకి ఏదో ఒకటి నచ్చుతుందట. అదే మన సిగ్నేచర్ సెంట్ అవుతుందట. అంటే అదే మన వాసన అయిపోతుంది. ఆ వాసన చూడగానే అందరికీ మనం గుర్తొస్తాము అన్నమాట!
వాసనలకి దగ్గరగా ఉండే ఇంకో బ్రాంచ్ ఆరోమా థెరపీ .. ఎస్సెంషల్ ఆయిల్స్ అంటారు .. లావెండర్, టీ ట్రీ ఆయిల్, యూకలిఫ్టస్ (నీలగిరి తైలం).. ఇలా. వీటిని తలనొప్పి వచ్చినప్పుడు వాడచ్చు. క్యాండిల్స్ గా వాడచ్చు. అమెజాన్ లో ఆరోమా ఆయిల్స్ ని గదంతా ప్రసరింపజేసే చిన్న మెషీన్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి సరైన చోట కొంటే పూర్తి సేఫ్.
నాకు మా ఎల్ కె జీ టీచర్ వాడే పెర్ఫ్యూమ్ బాగా గుర్తు. ఎవరైనా ఆ పెర్ఫ్యూమ్ వాడితే నాకు కలిగే ఎమోషన్ - టెన్షన్. ఆవిడని చూస్తే నాకు భయం నెర్వస్ గా అనిపించేది చిన్నప్పుడు.
అలాగే లిల్లీ పూల వాసన కూడా నాకు హడావుడి భావన కలిగిస్తుంది. చిన్నప్పుడు స్టేజ్ మీద పాట పాడినప్పుడు లిల్లీ పూల దండ వేశారు. బోల్డు మంది జనం, కోలాహలం .. నా మెదడు హడావుడి ని లిల్లీ పూల పరిమళానికి అసోసియేట్ చేసేసింది ఏవిటో!
గులాబీ పూలు, బంతి, చేమంతి వాసనలు పండగ వాతావరణాన్ని తలపిస్తాయి ఎప్పుడు వాసన చూసినా.
కొన్ని ఖరీదైన సెంటు వాసనలు మాల్ లో ఉన్న భావన కలిగిస్తాయి.
వాసన కి జ్ఞాపకాలకి ఇంత దగ్గర సంబంధం ఉందన్నమాట!
నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అందులో గాలి ని యేమని వర్ణించారో తెలుసా 'గంధ వహ రథము' అని. గంధాలను మోసుకొచ్చే రథం గాలి అయితే...ఎన్నో అనుభూతులను, హాయిని, జ్ఞాపకాలను, కొంతమందికి తలనొప్పిని మోసుకొచ్చే రథం గంధం... కదా!
బ్లాగు మొదలు పెట్టిన చాలా రోజులకి ఈ తరుణం వచ్చినా ... మైలు స్టోన్ మైలు స్టోనే కదా! అసలు యాభై ఇన్నేళ్లకి వస్తుందనుకోలేదు. అసలు యాభై వస్తుందనీ అనుకోలేదు. ఈ రెండు కారణాల పరంగా ఇది చాలా గుర్తుండిపోయే పోస్టు.
అయితే ఈ సందర్భంగా ఏ విజయ గాధో, మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమో చెయ్యాలి కానీ ఇలా ఒకరి చేత పరాభవం చెందిన విషయం తలుచుకోవడం ఏంటి అనుకోవచ్చు. కానీ పరాభవించింది ప్రకృతి. ఇంకెవరో అయితే నేను ఎందుకు పట్టించుకుంటాను .. పట్టించుకుని ఫీల్ అయినా ఇలా ఎందుకు అందరి ముందు చెప్పుకుంటాను?
సంగతేంటంటే ... నాకొక నమ్మకం ఉంది .... నాకూ ప్రకృతికి అంత మంచి స్నేహం లేదని.
నేను పల్లెటూరి లో పెరగలేదు. కొన్ని ఊళ్ళు కొండల పక్కన, వాగుల పక్కన, సముద్రం పక్కన ఉంటాయి చూడండి ... అలాంటి ఊళ్ల లో అసలే పెరగలేదు. అంత పెద్ద ట్రావెలింగ్ కూడా చేసెయ్యలేదు.
కొంత మంది బాగా మొక్కలు పెంచుతారు. లేదా పెంపుడు జంతువులు ఉంటాయి. వాటి తో మంచి బంధం ఉన్నందువల్ల సిటీల్లో ఉండి కూడా ప్రకృతి తో టచ్ లో ఉంటారు.
నేను పువ్వులు, మబ్బులు, ఆవులు, చెట్లు... వీటిని చూసి ఆనందించగలను, పులకించగలను, వాటి గురించి వర్ణించి రాయగలను, పాడగలను, కెమెరా లో చూపించగలను. ఇంతే. ఇంతకంటే ఆవిడ కి నేను తెలియను అని నా అభిప్రాయం.
ఎవరి తో ఎలా ఉండాలో తెలిసిన జాణ లాగా ప్రకృతి మాత నన్ను ఇంత వరకే పరిచయం చేసుకున్నారు.
నేను ఆ మధ్య ఈ పరిచయం కొంచెం పెంచుకుందాము అని ఆశ పడ్డా. దీని గురించి ఈ బ్లాగు లో ఓ సారి రాసా కూడా .. చెత్త టాపిక్ అనే పోస్టు లో.
చాలా రోజుల నుంచి నేను వంటింటి లో వచ్చే చెత్త ని కంపోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మే నెలలో మొత్తానికి ధైర్యం చేసి ఈ దిశ గా ఓ అడుగు వేసాను.
నాకు తోట పని అంటే ఇంట్రస్ట్ ఉంది టైం లేదు, ఓపిక లేదు. టాలెంట్ కూడా లేదు. పోనీ సాధన చేసే ఓర్పు, దానికి కావాల్సిన మైండ్ సెట్ కూడా లేదు ఏంటో. నేను మొక్కని పెంచింది లేదు. గింజ వేస్తే మొలిచిందీ లేదు. మొక్క నాటితే బతికిందీ లేదు.
అలాంటి నేను ... కంపోస్ట్ చేయాలనుకోవడం. ఇక్కడే గ్రామర్ మిస్టేక్ జరిగింది అసలు. కానీ భారత దేశం లాంటి కర్మ భూమి లో పుట్టాం కదా .... కర్మ చేయక తప్పదు కదా... అందుకే ఏమీ లేకపోయినా ధైర్యం మాత్రం ఉండటం తో ఉపక్రమించా ఈ పనికి.
చాలా రీసెర్చ్ చేశా ఈ విషయం లో.
యూట్యూబ్ లో మంచి వీడియోలు ఉన్నాయి ఈ టాపిక్ మీద. అసలే కొరుకుడు పడని సబ్జెక్టు... పరభాష కూడా ఎందుకని తెలుగు వీడియోలే చూసాను. (అసలు ఎంత మంది ఉన్నారండి బాబు .. చక్కగా తమ తోట వీడియోలు చూపిస్తూ, వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చి మరీ అందరి సందేహాలు తీరుస్తూ!)
అందులో నాకు నచ్చిన పద్ధతి ఎంచుకున్నాను.
నిజానికి కంపోస్ట్ చేయాలంటే మనం వేసే చెత్త ని చిన్న చిన్న పదార్ధాలు గా కరిగించడానికి ప్రకృతి ఎంతో ప్రాసెస్ చేస్తుంది. అందులో పుల్ల మజ్జిగ నుంచి వాన పాముల దాకా చాలా క్యారెక్టర్లు తమ పాత్ర నిర్వహించాలి.
నాకేమో పాములంటే భయం. వాన పాములంటే అసహ్యం. చిన్నప్పటి మట్టి ముట్టుకున్నది లేనే లేదు.
(ఇదంతా చెప్తుంటే నేనేదో మహల్లో పెరిగిన రాజకుమారి లాగా అనిపిస్తున్నాను కానీ కాదండీ బాబు. విచారకరమైన విషయం ఏంటంటే పట్టణం లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల లో చదివే పిల్లలు మట్టి లో కాదు దుమ్ములో పెరుగుతారు. తింటున్న తిండి ఎక్కడినుంచి వస్తోంది అనే సంగతే తెలీకుండా పెంచుతారు ఏంటో! ఒక్క పొలానికి తీసుకెళ్లరు.... బియ్యం వడ్ల రూపం లో ఎలా మొలుస్తుంది ఇప్పటి దాకా చూడలేదు నేను. ఆవాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. ధనియాల మొక్క ఎలా ఉంటుందో తెలియదు. ధనియాల నుంచి కొత్తిమీర వస్తుందని మాత్రం తెలుసు. కానీ ధనియాలు ఎక్కడి నుంచి వస్తాయి? తెలీదు. దూరదర్శన్ లో చిన్నప్పుడు చూసిన రైతుల కార్యక్రమాలు తప్ప. ఆ మధ్య ఓ రోడ్ ట్రిప్ లో పత్తి తోట కనిపిస్తే ఆగి, ముట్టుకొని ఫోటో తీసుకున్నాం. అక్కడే వరి పొలాలు కూడా ఉన్నాయి కానీ అప్పటికే ధాన్యం కుప్పలు గా పోసేసారు. అక్కడ ఉన్న ఒకాయన 'అదేం బియ్యం చెప్పు' అన్నాడు చనువుగా. నా చదువంతా వేస్ట్ అనిపించింది ఆ క్షణం లో .... నేను, నా ముందు కనీసం ఓ పది తరాల వారు రోజూ తినే బియ్యం లో ఏ రకాలు ఉంటాయి, చూసి ఎలా చెప్పచ్చు ... తెలీదు. మా లాంటి వాళ్ళకి రైతు సమస్యలు తెలీక పోవడం లో ఆశ్చర్యం లేదు. ఒకే భూమి మీద ఉంటూ వేరే ప్రపంచాల్లో ఉండటం ... ఎందుకిలా జరుగుతుందో! )
సరే ఇంక ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు అని మనసు దిటవు చేసుకున్నాను.
నా దగ్గర ఉన్న రిసోర్సెస్ తో ఎలా మొదలు పెట్టచ్చో తెలుసుకున్నాను. నా దగ్గర మట్టి ఎక్కువ గా ఉంది. మట్టి తో కూడా కంపోస్ట్ చేయచ్చు అని చెప్పారు. అప్పుడు మనం వేసే చెత్త లో దుర్గంధం, decompose అయ్యే అప్పుడు కారే రసాలు .. అన్నీ మట్టే పీల్చుకుంటుంది అన్నారు.
ఒక బకెట్ తీస్కొని పొరలు పొరలు గా చెత్త, మట్టి, చెత్త, మట్టి ... బర్త్ డే కేక్ లాగా వేసుకుంటూ పోవడమే అని చెప్పారు.
నాకు కొంత ప్రోత్సాహ కరంగా అనిపించింది ఈ పద్ధతి.
ఈ పద్ధతి తో పుల్ల మజ్జిగ లాంటి వి వేయక్కర్లేదు. అలాగే ఎంత గ్రీన్ చెత్త వేస్తున్నామో అంత బ్రౌన్ చెత్త ఉండేలా చూస్కోక్కర్లేదు. పరమ సింపుల్ అన్నమాట.
ఇంగ్లీష్ లో కొన్ని పుస్తకాలుంటాయి. 'ఫర్ డమ్మీస్' అని. 'ఫిలిం మేకింగ్ ఫర్ డమ్మీస్' 'కుకింగ్ ఫర్ డమ్మీస్' 'మ్యూజిక్ ఫర్ డమ్మీస్' ఇల్లా.
అంటే ఏవీ తెలియని పామరులకు అని.
నాకు ఈ పద్ధతి నాలాంటి డమ్మీస్ కే అనిపించింది.
మేము శాకాహారులమే కాబట్టి వంటింటి చెత్త తొంభై శాతం వేసేయచ్చు కంపోస్ట్ లో. వండాక మిగిలిపోయినవి మాత్రం వేయద్దన్నారు. పాచిపోయినవి కూడా. కూరగాయలు, పళ్ళ తొక్కులే ఎక్కువ కదా రోజూ వచ్చే వంటింటి చెత్త లో. అలాగే కొబ్బరి కాయ పీచు కూడా వేసుకోవచ్చు అన్నారు.
ఓ రెండు మూడు రోజులు చాలా జోరుగా జరిగింది వ్యవహారం. నేను వేసే మట్టి లో అప్పటికే వాన పాములు ఉన్నాయి .. నాకు ఇది శుభ సూచకంగా తోచింది. వాటికేం కాకుండా, నాకూ అవి తగలకుండా ....ఎలాగో మేనేజ్ చేసి వేసేసాను.
బకెట్ నిండాక అది పక్కన పెట్టేసి ఇంకోటి తీస్కోండి. ఆ మొదటి బకెట్ ఇరవై రోజుల తర్వాత చూస్కోండి అన్నారు.
వంటింటి చెత్త అంతా అటు వెళ్తూ ఉంటే భలే తృప్తి కలిగిందండీ ఆ రెండు మూడు రోజులు.
ఏమేం వేసానో నాకు గుర్తుంది కూడా.
ఇదే కదా కంపోస్ట్ అంటే! అనిపించింది.
కరెక్ట్ గా నాలుగో రోజు జోరున వాన.
కంపోస్ట్ లో వాన నీళ్లు పడకూడదు అని క్లియర్ గా చెప్పారు.
నేను ఆ ముందు రాత్రి అనుకుంటూనే ఉన్నా .. మూత పెట్టాలి అని. అంత చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష భరించాల్సి వచ్చింది.
వాన నీళ్ళ వల్ల అంతా మురుగు వాసన వచ్చేయడం మొదలు పెట్టింది.
ముళ్ళపూడి రమణ గారు ఓ కథ లో ఓ ఉపమానం వాడారు. 'పై షడ్జమం దాకా రాగాలాపన చేసి ఆ పైన ఏం చెయ్యాలో తెలియని గాయకుడి లాగా' అని. నాదీ అదే పరిస్థితి.
పారేయడానికి అదే పూర్తి గా చెత్త కాదు. బోల్డు మట్టి కూడా ఉంది. ఆ మట్టి ని తూములో పారబోస్తే బ్లాక్ అయిపోదూ! అలాగని అలా వదిలెయ్యలేం. వాసన! ఆ బకెట్ కి డ్రైనేజీ చిల్లు లేదు. అలా ఉండక్కర్లేదని అన్నారు.
ఏ మురుగు వాసన ని అస్సలు అనుభవించకుండా కంపోస్ట్ చేద్దామనుకున్నానో నాలుగో రోజు అదే ఎదుర్కోవాల్సి వచ్చింది. సరే ప్రకృతి తో పెట్టుకుంటే ఇంతే అని మనసు రాయి చేసుకున్నాను.
పైన నిలిచిన నీళ్లు పారబోసేసాను. ఎండ బాగా పడేలా చూస్కుంటే సరిపోతుంది అనుకున్నాను. కానీ ఆ వారమంతా వానలు, మబ్బే.
తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం - కొత్త చెత్త వేయకపోవడం.
ఆ మట్టి ఇరవై రోజులు ఉంచి అదొక శాంపిల్ గా అనుకుందాం. ఎలా కంపోస్ట్ అయిందీ చూద్దాం అని అలా వదిలేసాను.
ఈ లోపు మంచి ఎండలు. ఎప్పటికప్పుడు తీసి చూద్దాం అనుకుంటూండగానే వానా కాలం వచ్చేసింది. దానికొక మూత లాంటిది పెట్టాను కానీ మొన్న వరుసగా నగరం లో కురిసిన వానలకి ఆ మూత నిలబడలేదు.
రెండు నెలలు కంపోస్ట్ అయిన మట్టి లో మళ్ళీ వాన నీరు. మళ్ళీ మురుగు వాసన.
ఈ సారి నేనైతే బాధ్యతా రహితంగా ప్రవర్తించాను. దాని సంగతే పట్టించుకోవడం మానేసాను. నన్ను కన్న పాపానికి మా అమ్మ గారు ఈ సారి దాని పని చూసారు.
ఇంగ్లీష్ సినిమాల్లో డాన్ ల అనుయాయులు వచ్చి 'ఇట్స్ టేకెన్ కేర్ ఆఫ్' అంటారు. డాన్ తలూపుతాడు. అంటే ఎవడినైనా చంపేసారా, కిడ్నాప్ చేసారా, బెదిరించారా .... ఈ వివరాలు డాన్ అడగడు, వీళ్ళు చెప్పరు.
నేను కూడా ఏం చేసావని మా అమ్మ గారిని వివరాలు అడగలేదు. అది ప్రకృతి మాత కి, నా మాత కి మధ్య ఉండిపోయే రహస్యం.
నాకు ఈ పరాజయం ... అంటే నేచర్ చేతిలో ఓడిపోవడం కొత్త కాదు. అందుకే ఎక్కువ అవమానం అనిపించలేదు. ఆవిడ మళ్ళీ నాకు నా ప్లేస్ చూపించింది అంతే. 'నువ్వు పాటలు పాడుకోవే .. నీకెందుకు ఇవన్నీ' అన్నట్టుగా.
నాకిప్పుడే ఒక ఆలోచన తట్టింది .. మొక్కలు పెంచడం తెలిసిన వాళ్ళు ఇదంతా చదివితే? ఈ అమ్మాయి ఏంటి ఇంత అజ్ఞాని! అనుకుంటారు కదా. నిజమే నండి.
ఈ ఉదంతం తర్వాత నాకు అర్ధమైన విషయాలు కొన్ని ఉన్నాయి
1. ఈ తోట పని, కంపోస్టు .. వీటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. అలా బాధ్యత తీసుకుంటేనే మొదలెట్టాలి. లైఫ్ స్టైల్ లో ఓ భాగం అవ్వాలి.
2. నలుగురు పెద్ద వాళ్ళు, శాకాహారులు ఉన్న ఇంట్లో వంటింటి చెత్త ఎక్కువ గా వస్తుంది. దానికి సరిపడా మట్టి, బకెట్లు రెడీ చేసుకోవాలి కంపోస్ట్ కి.
3. నాకు ఇప్పుడిప్పుడే వీటికి అస్సలు టైం లేదు.
4. ప్రకృతి లో ఎవరి పాత్రలు వారికి ఉన్నాయి. చేప ఎగరదు. ఎగరక్కర్లేదు. నేను మొక్కలు పెంచక్కర్లేదు. ప్రకృతి తో పరిచయం నాకు ఇచ్చిన టాలెంట్ల తో చేసుకున్నా చాలు.
నాలుగు రోజులు కంపోస్ట్ చేసి ఫెయిల్ అయ్యా ... అయినా నాలుగు మంచి విషయాలు నేర్పింది మట్టి తల్లి.
ఆ మధ్య ఓ క్యాబేజి తరుగుతున్నాను. సగానికి కోసినప్పుడు గమనించాను ... గులాబీ రేకుల్లా అందంగా అమర్చినట్టున్నాయి పొరలు. అంత పర్ఫెక్ట్ క్యాబేజి నేనెప్పుడూ చూడలేదు. అదే నా వాట్సాప్ బాక్గ్రౌండ్ గా పెట్టుకున్నాను.
ఇదే నా ప్రకృతి ఆరాధన. ప్రస్తుతానికి :)
లేబుళ్లు: compost, compost fail, Sowmya Nittala, sowmyavadam, Telugu blog, telugu humour
అనగనగా నేను.
లేబుళ్లు: Dard e dil Dard e aashna, Ghulam Ali, Jagjit Singh, meghama dehama, tum Nahin gham Nahin
రెండేళ్లు
2020 జులై నాలుగో తారీఖు న అమెరికా మీద బ్లాగు రాసినప్పుడు నేను ఊహించలేదు .. ఇంత పెద్ద గాప్ వస్తుంది అని. దీని వెనక అమెరికా కుట్ర కూడా ఉండి ఉండవచ్చు
ఎందుకు రాయలేదు అని అడిగితే ... నిజమే చెప్తాను. అది కొంత వ్యక్తిగతమైనా.
ప్రొఫెషనల్ గా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చిందండి. ప్రశాంతంగా రాసే మానసిక స్థితి లేదు.
నా పని సినిమా. నేను అష్టా చెమ్మా, మిథునం సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి అవార్డులు అందుకున్నాను. రైటర్ డైరెక్టర్ గా మూడు సార్లు సినిమా సైన్ చేసాను కానీ అవి ముందుకు కదల్లేదు. ఈ లోపు కరోనా. చాలా నిరాశలోకి వెళ్ళిపోయాను.
ఇప్పుడు రాయడం మొదలు పెడుతున్నాను అంటే సినిమా సైన్ చేసేసాను అని కాదు. పరిస్థితి ని accept చేసాను అని.
ఆ మధ్య నలభయ్యో పుట్టిన రోజు జరుపుకున్నాను. కొంత పరిపక్వత వచ్చి పడిపోయింది. జీవితం లో దేని దారి దానిదే అనిపించింది.
ఈ బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు నాకేం కావాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక ఆలోచన వచ్చింది.. ఫ్రీ ప్లాట్ఫారం ఉంది కదా అని రాసేసాను. అలా 48 వారాలు రాసాను.
తెలుగు బ్లాగింగ్ కమ్యూనిటీ ఇంత బాగుంది అని అప్పుడు నాకు తెలియదు. మాలిక లాంటి బ్లాగ్ అగ్గ్రిగేటర్స్ ఉండటం వల్ల నా బ్లాగ్ తొందరగా ఎక్కువ మందిని, సరైన వారిని రీచ్ అయింది అని నా అభిప్రాయం. కామెంట్స్ లో కూడా ప్రోత్సాహకరమైన స్పందనే లభించింది నాకెప్పుడూ... అది ఒప్పుకొని తీరాలి.
ఒక సాహితీ సభ కి వెళ్తే ఒక పిల్లవాడు కర్ణాటక సంగీత కచేరీ చేస్తున్నాడు ముచ్చట గా ... అతన్ని కచేరీ తర్వాత కలిసి ఫోటో తీయించుకుంటుండగా వాళ్ళ అమ్మ గారు "మీరు సౌమ్యవాదం సౌమ్య గారా ... మీ ఆనందాల జాడీ మేము చదివి చాలా ఆనందించామండి" అనడం నా బ్లాగ్ జర్నీ లో చాలా ఆనందకరమైన ఘట్టం గా అనుకున్నాను!
ఇక్కడ అందరూ రాసే కామెంట్స్ కూడా. బ్లాగ్ రాసినప్పుడు సరే... రాయనప్పుడు కూడా రాయమని ప్రేరేపించే వారు ఎంత మంది ఉంటారు చెప్పండి. నా బ్లాగ్ కింద రాసే ప్రతి కామెంట్ నాకు చాలా విలువైనది.
ఆ మధ్య sowmyavadam.com అనే డొమైన్ కొన్నాను. దాని మీద ఇంకా పని మొదలు పెట్టలేదు.
ఇక్కడ నా బ్లాగ్ బాంధవులందరికీ ఒక సమాధానం బాకీ ఉన్నాను అని అనిపిస్తూనే ఉంది ఈ రెండేళ్లు.
ఈ సారి గాప్ వచ్చినా నేను తీసుకోదలుచుకోలేదండి. నో థాంక్స్ అని చెప్పేయదల్చుకున్నాను.
అలాగే పర్సనల్ బ్లాగ్స్ తో బాటు ఒక సీరియల్ రాయాలనుంది ... అది నా కథ అయినా ... ఇంగ్లీష్ నుంచి అనువదించిన నవల అయినా.
జేన్ ఆస్టెన్ నవలల పుస్తకం తీసుకున్నాను. ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ నవల తో మొదలు పెడదామని.
ఆలోచన ఎలా ఉందో చెప్పండి. ఏది చెప్పినా భరించాల్సింది మీరే అని మర్చిపోకండి ... 😀
కాదు ఇంకేమైనా కొత్త ఆలోచనలు ఉంటే చెప్పండి. నా చేతనైనదైతే తప్పకుండా చేస్తాను.
వచ్చే బ్లాగ్ లో మళ్ళీ కలిసేంత వరకు ... సెలవు... అంటా అనుకున్నారా... ఇంక నో సెలవ్. ఓన్లీ లవ్. (ఇది తెలుగు సినిమా పంచ్ డైలాగ్ అన్నమాట) 😁