కవి హృదయం - 1

 గిరీశం ఫక్కీ లో చెప్పాలంటే ఈ మధ్య పోయెట్రీ భలే చదివేస్తున్నానండోయ్! 

ఇంగ్లీష్ పోయెట్రీ . 

చిన్నప్పుడు పద్యాలంటే చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని. ఎం ఏ ఇంగ్లీష్ చేసే అప్పుడు కూడా నవలలు ఇష్టంగా చదివే దాన్ని కానీ షేక్స్పియర్ పద్య నాటకాలు, కీట్స్  ... వీళ్ళ దగ్గరకి వచ్చేసరికి ముక్కున పట్టి ఏదో అయిందనిపించేసాను. 

ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో పోయెట్రీ అకౌంట్స్ కనబడ్డాయి కొన్ని. కవి ఫోటో వేసి మరీ వారు రాసిన కొన్ని లైన్లు ఉంచుతారు పోస్టు లో. 

ఏవో కొన్ని లైన్లు అనుకుంటాం కానీ ... అమ్మో! చాలా లోతుంది వాటిలో. అలాగే ప్రపంచాన్ని ఓ కవి ఎలా చూస్తాడో తెలుసుకోవచ్చు. భిన్న ఆలోచనా ధోరణులు తెలిసాయి కూడా నాకు. కొన్ని అయితే, భలే ఇలా కూడా ఆలోచించచ్చా అనిపించేలా ఉన్నాయి!

నచ్చినవి, భలే అనిపించినవి సేవ్ చేసుకుంటాను ఇంస్టా లో. లేదంటే స్క్రీన్ షాట్ తీస్కొని పెట్టుకుంటాను. 

మా అమ్మ గారు అన్నట్టు ఏదైనా మంచి చూస్తే అందరికీ చెప్పేయాలి అనే పిచ్చి ఉంది కాబట్టి, నేను చదివిన మంచి పోయెట్రీ లో కొన్ని మీకోసం ఈ రోజు. :) 


రెండు తలల దూడ 

లారా గిల్పిన్ 
 

ఈ కవిత లో శీర్షిక ఎంత ఆశ్చర్యకరంగా ఉందో, ఆఖరు లైన్ అంతే తమాషా గా ఉంది! ఆ ఆఖరు లైన్ నా మనసు గెలిచేసింది! 

స్థూలంగా అనువాదం. ప్రకృతి సృష్టించిన ఈ విచిత్రాన్ని రేపు రైతు కూలీల చూస్తారు. న్యూస్పేపర్ లో దాన్ని చుట్టి మ్యూసియం కి తీస్కెళ్ళిపోతారు. కానీ ఈ రాత్రి అయితే అది బతికే ఉంది.... ఉత్తరం వైపు పొలం లో... దాని తల్లితో. ఎంతో మంచి వేసవి సంధ్య... తోట లోంచి చంద్రోదయం కనిపిస్తోంది... గాలికి కి గడ్డి ఊగుతోంది. ఆ దూడ ఆకాశానికేసి చూసినప్పుడు .. ఎప్పటికంటే రెండింతల నక్షత్రాలు కనపడుతున్నాయి! 

మంద లో కలిసిపోకుండా ఏ చిన్న ప్రత్యేకత ఉన్నా దాన్ని వికారంగానే చూస్తుంది మానవ సమాజం. దాన్ని చూస్తే భయమో, ఏం చెయ్యాలో తెలీని తనమో, జుగుప్సో మరి. నిజానికి రెండు తలల దూడ ఎవరికీ ప్రమాదమేమీ కాదు. మరి ఎందుకు దాన్ని మ్యూజియం కి తీసుకెళ్తున్నారు? అక్కడ ఏం చేస్తారో ఊహించడం కష్టమేమీ కాదు. జూ కాదు, సర్కస్ కాదు. మ్యూజియం. అంటే దాన్ని చంపి, స్టఫ్ చేసి ఓ వింత వస్తువు గా ప్రదర్శిస్తారన్నమాట. తెల్లవారితే దాని రేపు అంత భయంకరంగా ఉంది. అయినా దానికి అది తెలీదు. మర్నాటికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ రోజు రాత్రి రెండింతల నక్షత్రాల తో ఎంత అందంగా ఉందో చెప్పింది కవయిత్రి. రెండు తలల దూడ ని మామూలు సమాజం అలా చూస్తే తారలని రెట్టింపు చేసిన జీవి గా చూసింది కవయిత్రి. కవి హృదయం అంటే ఇది కదా! 





ఏడుపు 

గాల్వే కిన్నెల్ 


ఏదో కొద్దిగా ఏడిస్తే లాభం లేదు. 

ఏడిస్తే తలగడ తడిసిపోవాల్సిందే!

అప్పుడింక లేచి నవ్వుకోవచ్చు. 

అప్పుడింక స్నానానికి వెళ్లి ... జల్ జల్ జల్.!

అప్పుడింక కిటికీ తెరిచి "హహ్హ్హహ్హ"!

ఎవరైనా "ఏమోయ్ .. ఏం జరుగుతోందక్కడ?" అని అడిగితే 

'హ హ" అని ఎలుగెత్తి చెప్పండి "ఆనందం ఆఖరి కన్నీటి చుక్కలో దాక్కొని ఉంది!

దాన్ని నేను ఏడ్చేసాను! హహ్హ!"


ఈ కవిత లో మొదటి లైన్ నన్ను బాగా ఆకర్షించింది. పెద్దయ్యాక ఎక్కువ ఏడవం. దాన్నేదో టఫ్ గా ఉండటం అనుకుంటాం. రెండు కన్నీటి చుక్కలు కార్చి అయిందనిపిస్తాం. కూలంకషంగా ఓ ఎమోషన్ ని అనుభవించి పూర్తిగా ఏడవం. 

నిన్న ఏదో జరిగి గొంతు గద్గదమైంది. ఫోన్ లో ఈ కవిత చదవగానే ఇంకా గుండెలో చాలా ఏడుపు ఉంది అనిపించి ఏడ్చేసా. తర్వాత కవి చెప్పినట్టే చాలా హాయి గా అనిపించింది. 

కవిత అంటే ప్రౌఢ పదాలే కాకుండా ఇలా లల్లాయి పదాల తో కూడా మంచి భావం పలికించారనిపించింది కవి. నేను ఈ బ్లాగ్ లో ఊరికే హ హాహా అని రాస్తూ ఉంటా చాలా సార్లు. అది ఓ కవిత లో కూడా కనిపించడం బాగా అనిపించింది నాకు! ఆనందం చివరి కన్నీటి చుక్కలో దాక్కోవడం ఇంకో హైలైట్ ఈ కవిత కి. కదా! ఆనందాన్ని ఏడ్చేయ్యడం ఇంక సరే సరి! భలే కవిత!


ముచ్చట గా మూడోది 



మామూలు వస్తువుల ఓర్పు 

పాట్ శ్నయిడర్ 


ఇదో రకమైన ప్రేమ కదా? 

ఓ కప్పు తనలో టీ ని నింపుకునే తీరు 

నిలకడగా నలు చదరంగా నిలబడే కుర్చీ 

మన బూట్ల సోళ్ళని, కాలి వేళ్ళని స్వీకరించే నేల 

అసలు మన పాదామూలాలకెలా తెలుసు వాటి స్థానమేదో?

మామూలు వస్తువులు చూపించే ఓర్పు గురించి ఆలోచిస్తున్నా ... 

బట్టలు అలమరల్లో ఎంత మర్యాదగా ఎదురుచూస్తుంటాయో 

సబ్బు తన పాత్ర లో ఎంత నిశ్శబ్దంగా ఆరుతుందో 

మన వీపు చర్మం మీంచి తేమ ని టవళ్లు ఎలా తాగుతాయో 

ఇంకా .. మెట్ల అందమైన పునరావృత్తి .... 

మరి కిటికీ కంటే ఉదారమైనది ఇంకేదైనా ఉందా? 


ప్రతి వస్తువు లో జీవం చూడటం ఆర్టిస్టులకే చెల్లింది. సైన్సు ఎంత వాటిని జీవం లేని వస్తువులని వక్కాణించినా, కవులూ  కళాకారులూ ఒప్పుకోరుగా. 

ఈ కవిత లో మనకి ప్రతి రోజూ ఉపయోగపడే వస్తువులకు ఎంతటి గౌరవం ఇచ్చారో అనిపించింది. నిజమే, మనకోసం బట్టలు అలమరల్లో మర్యాదగా ఎదురుచూస్తాయి! 

అన్నిటిని వర్ణించి కిటికీ కి కవి ఇచ్చిన పర్స్పెక్టివ్ .. చిన్న కిటికీ మొత్తం ప్రపంచాన్ని చూపించగలదు ... అందుకే అంత కంటే ఉదారమైనది ఇంకేదీ ఉండదు గా! 

ఇంత సున్నితమైన భావాలు, ఇంత ప్రత్యేకమైన దృష్టికోణం .. ఇందుకే అందరూ కవితలు చదువుతారు కదా. నేను లేట్ గా మొదలు పెట్టాను. అర్ధం చేసుకోడానికి జీవితానుభవం కూడా కావాలి కదా.. అది సంపాదించుకున్నా ఇన్నాళ్లూ. హహ్హ. 

ఇలా తెలుగు కవితల అకౌంట్లు ఉన్నాయా? మీకు తెలిస్తే నాకు చెప్తారా? 

ఓ కవిత ని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చదవచ్చు. నేను రాసిన అనువాదాలు నాకర్ధమైనవి. మీకు వేరేగా అనిపిస్తే నాకు చెప్తారు గా? 

ఇలాంటి కవితలు ఇంకొన్ని కనిపించాక పార్ట్ - 2 రాస్తాను. ఉంటాను. 

Comments

  1. రవి గాంచని చోట కవి గాంచును ……అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

    ReplyDelete

Post a Comment