Saturday, May 9, 2020

ఆనందమే లేదా

ఒక స్క్రిప్ట్ రాసుకుందామని 'ఆనందం' మీద సమాచార సేకరణ మొదలు పెట్టాను ఆ మధ్య. అదింకా కొనసాగుతోంది.

దాన్నుంచి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి ... అవి ఇక్కడ పంచుకుంటున్నా ఈ రోజు. 


ఆనందం అని గూగుల్ లో కొడితే వచ్చిన రిజల్ట్స్ లో నాకు కుతూహలం కలిగించినవి ఇవి ..

పంచ విధ ఆనందములు 1. విషయానందము 2. యోగనందము 3. అద్వైతానందము 4. విదేహానందము 5. బ్రహ్మానందము

అష్టవిధ ఆనందములు 
1. బ్రహ్మానందం 2. వాసనానందం 3. విషయానందం 4. ఆత్మానందం 5. అద్వైతానందం 6. యోగానందం 7. సహజానందం 8. విద్యానందం

కానీ వీటి గురించి ఇంకేవిధమైన సమాచారమూ లేదు. ఇవి ఎవరు చెప్పారు .. ఏ పుస్తకం నుంచి గ్రహించారు లాంటి వివరాలు ఏమీ లేవు. పేర్లు చూస్తే కొన్ని అర్ధమయిపోతున్నాయి ... విషయానందము లాంటివి. కానీ రాసిన వారు ఎలా వీటిని డిఫైన్ చేశారో తెలుసుకోవాలని ఉంది.

(ఎవరికైనా ఈ వివరాలు తెలిస్తే చెప్తారు కదూ నాకు?)

చలం గారు ఆనందం మీద రాసిన వ్యాసం కూడా దొరికింది ఆన్లైన్ లోనే.  ఇక్కడ క్లిక్ చేసి చదువుకోవచ్చు.

బెర్ట్రాండ్ రస్సెల్ గారు రాసిన 'కాంక్వెస్ట్ అఫ్ హ్యాపీనెస్' (ఆనందం పై విజయం అనచ్చేమో) కూడా చాలా బాగుంది. దాని గురించి ఇంకెప్పుడైనా. ఎందుకంటే అందులో ఆనందమే కాదు .. ఇంకా ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. 1930 లో ఈ పుస్తకం వచ్చినా ఇప్పటికీ అందులో అంశాలు మనకి ఉపయోగపడతాయి.

ఇందులో కొన్ని సరదా కొటేషన్లు ఉంటాయి .. అందులో ఒకటి 'పుస్తకం చదవడానికి రెండు ఉద్దేశాలు ... ఒకటి దాన్ని ఎంజాయ్ చెయ్యడం ... రెండు .. అది చదివాము అని గొప్పగా చెప్పుకోవడం' 😄

ఈ ప్రాసెస్ లో తెలిసినదే దేశాల ఆనందాన్ని కొలిచే 'ఆనంద సూచిక'.

మనిషి ఎప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు.

అసలు దీన్ని కొలవగలమా (కొలత అనే అర్ధం... పూజించడం కాదు అని మనవి 😄) అని భావించే ప్రతి దాన్ని సంఖ్యల్లోకి తీస్కొచ్చేస్తాడు.

అకౌంట్స్ చదువుకొనే అప్పుడు .. కంపెనీ గుడ్ విల్ ఇంత అని బ్యాలెన్స్ షీట్ లో రాస్తాము. గుడ్ విల్... అంటే మనం అంటే ఉన్న మంచి భావన ని ఎలా నెంబర్ల లో పెట్టడం అని ఆశ్చర్య పోయేదాన్ని.

అలాగే ఆనందం కూడా.

అయితే ఇక్కడ వ్యక్తిగత ఆనందాన్ని కొలవట్లేదు. ఒక దేశం ఆనందాన్ని బేరీజు వేస్తున్నారు.

అసలు ఈ ఆలోచన వచ్చింది 2011 లో .. అంటే చాలా రీసెంట్ గా.

ఐక్య రాజ్య సమితి కి అనిపించిందట .. అభివృద్ధి అనే పదానికి సంపూర్ణత ని చేకూర్చాలి అని. అప్పటి వరకూ జిడిపి నే కొలబద్ద. అంటే ఒక సంవత్సరం లో ఆ దేశ ప్రజలు ఉత్పత్తి చేసిన వస్తువుల/సేవల ఆర్ధిక విలువ. అంటే ఒక కుటుంబం ఎంత బాగా బ్రతుకుతోంది అనడానికి కేవలం సంపాదన ఒక్కటే పరిగణన లో కి తీసుకున్నట్టు.

ఇది సరైన కొలత కాదు అని వారికి తట్టిన క్షణానికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను.

ఒక్క సారి ఆలోచించండి ... డబ్బే అభివృద్ధి కాదు, డబ్బు తోనే అంతా కాదు అనే విషయం మనిషి కి లోపల్లోపల తెలుస్తూ ఉన్నా ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఇన్ని శతాబ్దాలు పట్టింది.

కానీ ఓ దేశం మాత్రం ఎప్పట్నుంచో తమ అభివృద్ధి కి కొలమానం గా ఆనంద సూచిక నే వాడుతోంది ... ఆ దేశం భూటాన్. ఈ సూచిక ని అన్ని దేశాల కి అన్వయించే ముందు ఈ దేశ ప్రధానమంత్రిని పిలిపించుకొని వారి దేశ విజ్ఞానాన్ని, అనుభవాన్ని ఈ ప్రక్రియ లో ఉపయోగించుకున్నారు యూ ఎన్ వాళ్ళు.

భూటాన్ గురించి రకరకాల మ్యాగజైన్స్ ఆర్టికల్స్ రాశాయి. ప్రపంచం లో పొగాకు బాన్ చేసిన ఒకే ఒక దేశం అది. అలాగే టివి కి అనుమతి కేవలం 1999 లో ఇచ్చారు ... కొన్నే ఛానల్స్ వస్తాయి వారికీ. బౌద్ధ దేశం వారిది. పర్యావరణ పరంగా 70% అడవుల్ని అలాగే కాపాడుకోవడం వల్ల కర్బన ఉద్గారాలు లేకపోగా ప్రపంచ లో ఏకైక కార్బన్ నెగటివ్ దేశం అయింది అది. (అంటే కార్బన్ కంటే కూడా ఎక్కువ ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తోంది అన్నమాట). ఆ దేశానికీ సమస్యలు లేకపోలేదు ... కొన్ని మార్చుకోవాల్సిన పాలిసీలు లేకపోలేదు. అయినా తమ దేశ అభివృద్ధి ని జిడిపి .. అంటే డబ్బు తో కాక స్థూల జాతీయ ఆనందం ... జి ఎన్ హెచ్ (Gross National Happiness) తో నే కొలుచుకుంటున్న మొదటి (ప్రస్తుతానికి ఏకైక) దేశం అది.

2011 నుంచి యూ ఎన్ తమ సభ్య దేశాలన్నిటి ఆనందాల్ని కొలుస్తోంది. దానికి వారు కొన్ని నిర్ణాయక సూత్రాల ని పరిగణన లోకి తీసుకుంటారు.

ఆ దేశపు జిడిపి, సామజిక తోడ్పాటు, సగటు ఆరోగ్యకరమైన ఆయుర్దాయం, లైఫ్ ఛాయిసెస్ లో స్వేచ్ఛ, ఉదారత, అవినీతి

ఈ సబ్జెక్టుల్లో మార్కులు వేసి పర్శంటేజి తీస్తారు. ప్రపంచ దేశాలన్నిటికి ఈ టెస్ట్ పెట్టి ర్యాంకులు ఇస్తారు.

ఇది చదవగానే మన దేశం గుర్తొచ్చేస్తుంది కదూ .. నాకు కూడా మన రాంక్ తెలుసుకోవాలని కుతూహలం కలిగి ర్యాంకుల లిస్ట్ తీస్తే .. బాగానే స్క్రోల్ డౌన్ చేయాల్సొచ్చిందండోయ్!

ప్రతి సంవత్సరం చేసే ఈ లెక్క లో మార్చి 2020 (ప్రపంచ ఆనంద దినోత్సవం) కి మనం 145వ ర్యాంకు (2019 లో 140)

అసలు ఈ ఆనందాల లెక్కలు మొదలు పెట్టిన భూటాన్ ర్యాంకు 95. మనం ఫెయిలయితే బాధ ... సబ్జెక్టు లో టాప్ అన్న వాడు కూడా ఫెయిలయితే అదో 'ఆనందం'!

భూటాన్ వాళ్ళు స్ట్రిక్ట్ ఎక్కువ .. ఇంకా ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడం తక్కువ. స్వలింగ సంపర్కం నిషేధం. కాందిశీకులు సమస్యలున్నాయి వారికి. మానవ హక్కుల విషయం లో కొన్ని ఉల్లంఘనలు లేకపోలేదు. అందుకే ఆ దేశం ఈ త్రాసు లో తూగలేకపోయింది.

అమెరికా స్థానం 19. (
ఆనంద సాధన 'pursuit of happiness' ప్రతి అమెరికన్ పౌరుడి ప్రాథమిక హక్కని రాజ్యాంగం లో రాసుకుంది ఆ దేశం).

పాకిస్థాన్ 66. దీని లాజిక్ నాకయితే తట్టలేదు. నిపుణులకే తెలియాలి.

లిస్టు లో మన తర్వాత ఇంకో పదకొండు దేశాలే ఉన్నాయి. అంటే మనం బాటమ్ 15 లో ఉన్నామన్నమాట. సబ్జెక్ట్స్ లిస్టు చూస్తే మనం ఎక్కడ వీకో తెలియకపోదు. మన ర్యాంకు చూసి వేదాంతం గా ఓ చిరునవ్వు నవ్వుకోవడమే. (వేదాంతం ఓ సబ్జెక్ట్ అయితే బాగుండేది కదూ)


ఆఖరు స్థానం లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఈ ర్యాంకు కి ఏ వివరణా అవసరం లేదు. 

మరి టాప్ టెన్ లో ఏ దేశాలు ఉన్నాయి? 

ఫిన్లాండ్ నెంబర్ వన్. గత మూడేళ్లు గా విన్నర్ అదే. 

ఈ లిస్ట్ లో ఎప్పటి లాగే స్కాండినేవియన్ దేశాలని పిలవబడే డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ల ఆధిక్యత ఉంది. ఇవి ఎప్పుడూ టాప్ టెన్ లో ఉంటూ ఉంటాయి. ప్రకృతి తో క్లోజ్ గా జీవించే వారి సంస్కృతి ని వారు ఇంకా పాటిస్తూ ఉండటం, వారి ప్రభుత్వ పాలిసీలు (మగవారికి పెటర్నిటీ లీవ్ ఉంటుంది అక్కడ, స్వీడన్ పార్లమెంట్ లో సగం మంది మహిళలే), పేదవారికి సంపన్నులకి ఎక్కువ వ్యత్యాసం లేకపోవడం, ఉచిత విద్య, వైద్యం, తలసరి ఆదాయం బాగుండటం, క్రైం రేట్లు తక్కువగా ఉండటం...  ఇలా చాలా కారణాలు ఈ రాంక్ కి దోహద పడతాయి. 

వీటిలో ఒకటి రెండు దేశాలు మినహాయించి .. మిగిలిన వాటి గురించి ఎక్కువ వినం వార్తల్లో. అదే అనుకుంటా వాటి రహస్యం. వార్తల్లో వచ్చేలాంటి సమస్యలు వారికి లేవనుకుంటా. టచ్ వుడ్. వారు అలాగే ఆనంద రాజ్యాలు గా వర్ధిల్లు గాక. 

పూర్తి లిస్టు ఇక్కడ చదువుకోవచ్చు. ఇది చూస్తే మీకు మరిన్ని పాయింట్లు తట్టచ్చు! 

ఈ లెక్కలు పర్ఫెక్ట్ కాదు. టివి రేటింగ్స్ లాగా, ఎగ్జిట్ పోల్స్ లాగా ఈ సర్వే కూడా పూర్తి నిజాన్ని చూపించలేకపోవచ్చు. అలా అని తీసిపారెయ్యలేం కూడా.

పిల్లలకి కొని పెట్టిన బొమ్మలు, బట్టలు, స్కూలు, హాబీ క్లాసులు వీటి ఖరీదు తో, సాధించిన కప్పులు, ర్యాంకులతో వారి జీవన నాణ్యత ని కొలవలేం. కొలవకూడదు. వారు ఆనందంగా ఉన్నారా లేదా .. లేకపోతే ఎందుకు లేరు .. అనే విషయాలు తల్లిదండ్రులు ఎలా పట్టించుకుంటారో/పట్టించుకోవాలో దేశాధినేతలు, ప్రభుత్వాలు కూడా ఈ ప్రశ్న ని అడిగి సమాధానాన్ని విని దాని ప్రకారం తమ పాలిసీలు తయారుచేసుకోవడం ఆరోగ్యకరమైన ప్రక్రియే కదా. ఏ? ఇన్ని కొనిపెట్టినా ఆ ఏడుపు మొహం ఎందుకు? అని విసుక్కోకూడదు. వారికి అవసరమైనదేదో అందట్లేదు అని గ్రహించుకోవాలి.

నాది కూడా ఓ సర్వే లేకపోలేదు. ఆనందం అనే టాపిక్ మీద ఓ ప్రశ్నల పట్టిక రాసుకొని నాకు తెలిసిన వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నాను.

ఆ ప్రశ్నలు ఇవి.

1. మీ దృష్టి లో ఆనందం అంటే ఏంటి?
2. ఆనందానికి మీరు ఎంత ప్రాముఖ్యత ఇస్తారు?
3. ఆనందం లేకుండా బ్రతికేయొచ్చా?
4. మీకు ఆనందం కలిగించేవి ఏవి?
5. ఎప్పుడైనా ఏ కారణం లేని ఆనందాన్ని అనుభవించారా? unconditional happiness అంటారే.. అది.
6. మీకు తెలిసిన వారిలో అత్యంత ఆనందంగా ఉండేవారెవరు?
7. ఆనందం పొందడానికి ముఖ్య సూత్రం ఏది?
8. ఎప్పుడూ unhappy గా ఉండేవారెవరైనా తెలుసా? వాళ్ళలా ఉండడానికి కారణాలేంటి..మీఅభిప్రాయం లో?
9. మన సమాజం లో ఆనందానికి విలువ ఉందా? లేదు అంటే..ఎందుకు?
10. ఆనందం అనగానే మీకు తట్టే ఏదైనా కొటేషనో...పోయెమ్/పద్యం .. ఓ ..కథో.... డైలాగో ఉందా?

మీ అభిప్రాయాలు కామెంట్ల లో రాస్తే సంతోషిస్తాను! 


ఇప్పటికి ఓ యాభై మందిని అడిగి ఉంటాను. వయసులు, లింగాలు వేరు. కానీ అందరూ మిడిల్ క్లాసు, ఆ పైన ఆర్ధిక పరిస్థితుల వారే. అందరూ చదువుకున్న వారే. నాకు నిరక్షరాస్యులు, పేదవారి (నగరాల్లో, పల్లెల్లో) అంతరంగం కూడా తెలుసుకోవాలని ఉంది. ఆ వైపు ప్రయత్నిస్తాను.

ఇప్పటి వరకూ అందిన అభిప్రాయాలు కొన్ని విషయాలు తెలిపాయి.

నేను ఇవి చదవక ముందు అనుకునేదాన్ని .. ఎవరికీ ఆనందం గురించి ఆలోచించే టైం లేదేమో అని. అది తప్పని తెలిసింది. ఎవరి రీతిలో వారు ఆనంద సాధన చేస్తున్న వారే ... దాని గురించి ఆలోచించడమే కాదు ... తమ జీవిత నిర్ణయాల్లో దాన్ని భాగం చేసుకుంటున్నారు. ఇక సమాజం ఆనందానికి విలువ ఇస్తుందా అనే విషయం మీద రెండు రకాల జవాబులూ వచ్చాయి .. ఇస్తుందని .. ఇవ్వదని..

ఇక నా ఫేవరేట్ ప్రశ్న ఆఖరుది ... ఇప్పటి వరకూ కొంత మంది డైలాగులు చెప్పారు .. కొందరు కొటేషన్లు చెప్పారు... బాగున్నాయి. మంచి కవితలు గుర్తుచేసుకున్నారు కొందరు.

నాకు ఆనందం అనగానే గుర్తొచ్చే పాట ... బసవ రాజు అప్పారావు గారు రాసిన పాట ఇది .. సాలూరి రాజేశ్వర రావు గారు స్వరపరచి రావు బాల సరస్వతి గారి తో పాడిన  'ఆనందమే లేదా' అనే ప్రైవేట్ రికార్డింగ్ .. ఇది అక్కా నేను మా సా పా సా వెబ్ సిరీస్ లో పాడాము ... ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో చూడచ్చు 

రెండోది ఒక కొటేషన్. (ఇది హెన్రి డేవిడ్ థోరో ది అనుకుంటారు కానీ కాదట. ఒక అజ్ఞాతవ్యక్తి ది).

ఆనందం సీతాకోకచిలుక లాంటిది. వెంటపడితే చేతికి చిక్కదు. మన పనిలో మనం ఉంటే నెమ్మదిగా వచ్చి భుజం మీద వాలుతుంది.

Saturday, May 2, 2020

కలర్ కలర్.... వాట్ కలర్ డూ యూ వాంట్?

మనోళ్ళకి ఈ తెల్ల చర్మం పిచ్చి ఎందుకంటారు?    

ఒక సింపుల్ జవాబు - తెలుపు మంచికి నలుపు చెడ్డ కి సంకేతాలు గా భావిస్తాం. ఇది చర్మం రంగు కి కూడా ఆపాదించాలి అని ఎందుకు అనిపించిందో మనకి? మనిషి చర్మమే కాదు .. జంతువులని కూడా ఈ 'వర్ణ' విభేదాల నుంచి మినహాయించలేదు కదా ... నల్ల పిల్లి, నల్ల కుక్క, కర్రి ఆవు ... ఇలా. వీటిలో కొన్ని మంచి శకునాలు, కొన్ని దుశ్శకునాలూనూ. (కోడి లాంటివి ఈ కలర్ పాలిటిక్స్ నుంచి బానే తప్పించుకున్నాయి). మన వ్యవహార భాష లో కూడా 'ఆ పిల్ల మంచి రంగు' అంటే తెల్లగా ఉంటుందనే అర్ధం.  

ఇంగ్లీషు లో ఫెయిర్ అంటే తెలుపు అని, న్యాయం అని రెండు అర్ధాలు ఉన్నాయి కదా. వాళ్ళు అసలు రెండో అర్ధం లోనే ఫెయిర్ ఎక్కువ వాడతారు. మొదటి అర్ధం మన వాళ్ళు ఎక్కువ వాడతారు. సో, ఓ తెలుగు వాడు పెళ్లి సంబంధం చూసే అప్పుడు 'అమ్మాయి ఫెయిర్ గా ఉండాలండి' అంటే 'న్యాయంగా ఉండాలండి' అనే అర్ధం వస్తుందన్నమాట! హ్హహా! 😉

జీవితాన్ని ఏ కొంచెం చూసిన ఎవరైనా ఒప్పుకుంటారు .. చర్మం రంగు తో గుణానికి ఏ మాత్రం సంబంధం ఉండదని. అయినా తెలుపు వైపే మొగ్గు చూపిస్తారు. ఎందుకు? 

అందానికి కూడా రంగు తో సంబంధం లేదు. కాకపోతే శ్వేత వర్ణేతర అందాల ని ఎవ్వరూ సరిగ్గా గమనించనందువల్ల ఎక్కువ గుర్తింపు ఉండదు అంతే. (ఇందుకు ఓ మంచి మినహాయింపు బాపు గారు చూపించిన కథానాయికలు!) 

ఈ కలర్ పాలిటిక్స్ లో జెండర్ పాలిటిక్స్ కూడా కలిపితే మన ద్వంద్వ వైఖరి బట్టబయలవుతుంది. అబ్బాయిలు తెల్లగా ఉండనవసరం లేదు. అమ్మాయిలే ఉండాలి. (దీనిక్కూడా బాపు గారి కథానాయికలు మినహాయింపే!) 

పెళ్ళిళ్ళ మార్కెట్ లో 'తెలుపు' విలువ ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు. 

ఫెయిర్నెస్ క్రీములు మార్కెట్ అలా పెరిగిపోవడానికి పెళ్ళిళ్ళ మార్కెట్ అతి పెద్ద కారణం. 

పుట్టినప్పటి నుంచి గుచ్చి గుచ్చి రూపాల్లో లోపాలు ఎంచి, ఎంచి, మాస్ మీడియా ల లో అమ్మాయిల చిత్రీకరణ లాంటి వాటితో బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయిల్లో కలిగించిన ఆత్మ న్యూనత రెండో పెద్ద కారణం. 

ఇది సరిపోనట్టు ఇప్పుడు మగవారికి కూడా ఫెయిర్నెస్ క్రీములు వదులుతున్నారు. 

అవునులెండి ... ఆకలి, నిరక్షరాస్యత, కాన్సర్, మానసిక ఆరోగ్యం, శాంతి, బీద దేశాల నుంచి వలస పోతున్న కాందిశీకులు, హింస, యుద్ధం, లింగ వివక్ష - ఇవేవీ సమస్యలు కానే కావు... ఆడ వాళ్ళు వాడుతున్న ఫెయిర్నెస్ క్రీమే మగవారు వాడాల్సి రావడం పాపం అసలు కష్టం. 

ఇందులో ఓ మంచి వార్త ఏంటంటే మన ప్రభుత్వం ఈ రకమైన యాడ్స్ ని బాన్ చేస్తోందట. ఇది ఫిబ్రవరి వార్త. ఆ తర్వాత బోల్డు జరిగిపోయాయి కాబట్టి ఇంకా ఈ ఆలోచన అమలులోకి వచ్చిందో లేదో తెలియదు. నోట్: బాన్ చేస్తోంది యాడ్స్ ని, ప్రాడక్ట్స్ ని కాదు... ప్రాడక్ట్ ని తిరస్కరించాల్సింది మనమేమో.  

పర్సనల్ గా ఏ క్రీము వాడాలో ఎవరిష్టం వాళ్ళది. ఉన్న రంగు కంటే మంచి రంగు కావాలనుకోవడం కూడా వ్యక్తిగత నిర్ణయమే. కానీ ఆ నిర్ణయం సమాజం నుంచి ఒత్తిడి వల్లో, అనారోగ్యకరమైన న్యూనత నుంచో రాకూడదని నా అభిప్రాయం. 

ఇదంతా మాట్లాడే ముందు నా వ్యక్తిగత అనుభవాలు కూడా చెప్తాను. ఈ తెలుపు ప్రివిలేజి చిన్నప్పటి నుంచి అలవాటే నాకు. స్కూల్ లో టీచర్ల దగ్గర నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. వీళ్ళకి పెళ్లిళ్ల టైం కి టెన్షన్ పడక్కర్లేదు అని ఊపిరి పీల్చుకుంటారు పెద్దవాళ్ళు. ఉద్యోగం ఇంటర్వ్యూ లలో, పది మందీ కలిసే చోట విలువ ఎక్కువుంటుంది. ఏ రంగు బట్టలు వేసుకున్నా నప్పుతుంది అనేది ఓ అభిప్రాయం. డోర్స్ ఓపెన్ అవుతాయి మీటింగ్స్ కి. ఇది నిర్వివాదాంశం. 

ఈ నాణానికి రెండో వైపు లేకపోలేదు. తెలుపులో కూడా ఇంకొకరి తో పోల్చి ఎవరి తెలుపు బాగుంటుంది అనే కంపారిజన్స్ ఉంటాయి. తెల్ల చర్మం పల్చగా ఉంటుంది. ఎండ లాంటివి తట్టుకొనే శక్తి తక్కువ ఈ రకం చర్మానికి. అందుకే అర పూట ఎండలో ఉంటే టాన్ ఎక్కువయిపోతాం. ఆఖరి గా చెప్పవలసిన విషయం ... నా చర్మం రంగు వల్ల డోర్స్ ఓపెన్ అయ్యాయేమో కానీ డీల్స్ ఓకే అవ్వలేదు. (ఇదో అదృష్టం అనుకోండి!) 

కొంతమంది ఆటోమాటిక్ గా నేను తెలుపు కాబట్టి పొగరు గా ఉంటానేమో అని అనేసుకుంటారు.అది వారి తప్పు కానే కాదు. రంగు వల్ల పొగరు గా ప్రవర్తించే వారికి కొదువేం లేదు. 

నిజానికి ఈ ట్రాప్ లో పడిపోవడం చాలా ఈజీ. అందరూ ప్రత్యేకంగా చూడటం, మన చెయ్యి పక్కన వాళ్ళ చెయ్యి పెట్టి కంపేర్ చేసుకోవటం, బాగా పొగడటం ... భలే ఈగో కిక్కులు ఇవన్నీ. 

But in all fairness, what have I done for this 'fairness'? 

ఒక్క సారి ఫెయిర్ గా ఆలోచిస్తే నేనేం చేసాను ఈ ఫెయిర్ నెస్ రావడానికి? ఏం పాటు పడ్డాను? ఏం సాధన చేసాను? తెల్లగా పుట్టడం కాకతాళీయం .. ఆ రంగు ని గొప్పగా చూసే సమాజం లో పుట్టడం అంతే కాకతాళీయం. (ఒక్క సారి ఊహించండి ... తెలుపు ని నీచంగా చూసే వాతావరణం లో పుట్టి ఉంటే నా పరిస్థితి ఏంటి?😊) 

పైగా నా రంగు వల్ల కలిగిన పరిచయాల విలువ ఏం ఉంటుంది? అభిప్రాయాలూ, అభిరుచులు కలవాలి కానీ. 

తెలుపు నా అదృష్టం అనుకోను. అలా అనుకుంటే నలుపు దురదృష్టం అన్నట్టే కదా. నిజానికి అదృష్టం ఏంటంటే రంగు ఆధారంగా తేడాలు చూపించని సమాజం లో పుట్టడం. 

ఇది స్థానిక సమస్య అనుకున్నా చిన్నప్పుడు. చరిత్ర చదివాక నిజం తేట తెల్లమైంది. మనిషి వివక్ష వైఖరి ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే అని. 

తెల్లవారి పొగరు, నల్ల వారి న్యూనత ... జోడి సరిగ్గా కుదిరింది. మన దేశం తో సహా ముప్పావు ప్రపంచం శ్వేత జాతీయులకి బానిసయిపోయింది.

ఇప్పటికీ రోడ్డు మీద వైట్ ఫారినర్స్ కనిపించినప్పుడు మన వాళ్ళ ప్రవర్తన చూస్తే నాకు చాలా ఎంబరాస్సింగ్ గా అనిపిస్తుంది. తెల్ల వారు ఎలా మనని కంట్రోల్ చెయ్యగలిగారో అర్ధం అవుతుంది.  

మానవత్వానికి తీరని ద్రోహాలు చేసిన నాజీలు ఈ విషయం లో ఏం తక్కువ కాదు  .. వారి ప్రకారం మనుషులు రెండు రకాలు .. దొరలూ, బానిసలూ. వారి ప్రకారం దొరలు ఎవరు అంటే గుణం, నాయకత్వ లక్షణాలు, రాజకీయ నైపుణ్యం, వీరత్వం, కరుణ... ఇవి ఉన్నవారు కారు. తెల్ల చర్మం, నీలం రంగు కళ్ళు, బంగారు వర్ణం లో ఉన్న జుట్టు ఉంటే చాలు. ఇవి లేని వాళ్ళు ఎవరైనా బానిసలే. 

వర్ణ వివక్ష కి ఎన్నో షేడ్స్ ఉన్నాయి ... కలరిజం, రేసిజం, వైట్ సుప్రీమసి (శ్వేత ఆధిపత్య వైఖరి)... అన్నటి మూలాలు ఒక దగ్గరే .. మనిషి చేతిలో లేని చర్మం రంగు ఆధారంగా గొప్పో, దిబ్బో అని బేరీజు వేసేయడం .. వారి జీవితాలతో ఆడుకోవడం. 

మన సంస్కృతి రంగు గురించి ఏం చెప్తోంది? 

మన సంస్కృతి బంగార్తల్లండి బాబూ .... ఏ టాపిక్ తీసుకున్నా ముందు ఆ టాపిక్ మన సంస్కృతి లో ఎక్కడో ఉండే ఉంటుంది.. రెండు ఆ విషయం లో విశ్వజనీనమైన ఆలోచనలు కలిగి ఉంటుంది. 

'రామ నీలమేఘశ్యామ' అంటే ఏంటండీ? 

'కాళీ' ఎలా ఉంటుంది? 

'శ్యాం' అన్నా 'కృష్ణా' అన్నా పేరు లోనే ఆయన రంగు కూడా ఉంది .. ఆయనని అలాగే ప్రేమించేశారు అందరూ! 




Melanin formula
మనం సృష్టించుకున్న విభేదాల కి అమాయకమైన మూలం - మెలనిన్ 
Pic Courtesy: ClickChemist / CC BY-SA (https://creativecommons.org/licenses/by-sa/4.0)

మన కళ్ళు, జుట్టు, చర్మం రంగు ... వీటి వెనక ఉండేది మెలనిన్ అనే ఓ పిగ్మెంట్. 

దీని ఎక్కువ తక్కువల  వల్ల మన రంగుల్లో మార్పులు. అంతే.

మరి ఇన్ని గొడవలు ఎందుకో ఆ 'నల్లని మేని నగవు చూపుల వాడి'కే తెలియాలి.  

Saturday, April 25, 2020

(ఈ విషయం లో) అందరం ఒకటే!

చిన్నప్పటి నుంచి భిన్న సంస్కృతుల్ని పరిచయం చేస్కోవడం నాకు చాలా ఇష్టం. 

నేను పెరిగిన వాతావరణం కూడా నాకు అలాంటి అవకాశాలు కల్పించడం నా అదృష్టం. 

హైద్రాబాద్ లో ఉండటం వల్ల కలిగిన అలాంటి ఓ మంచి అవకాశం - ముస్లిం సంస్కృతి కి దగ్గరగా ఉండటం. 

మూడో క్లాసు నుంచి ఇంటర్మీడియేట్, డిగ్రీ, మళ్ళీ నేను లెక్చరర్ అయ్యే దాకా బోల్డు మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు నాకు. (చిన్నప్పటి స్నేహాల లాగే వీరి తో కొంచెం టచ్ పోయింది ... కానీ మనసులో స్నేహం అలాగే ఉంది). 

మా ఇంట్లో అమ్మా, నాన్నల నుంచి కూడా 'వీరి తో మాట్లాడద్దు, వీరి ని అక్కడే ఉంచు' .. ఇలాంటి ప్రెషర్ ఉండేది కాదు.... ఇది ఇంకో అదృష్టం గా భావిస్తాను. 

ఎన్ని పోరాటాలు, ఏ బిల్లులు, ఏ పరిస్థితులు, ఏ మహానుభావుల మానవతా స్పృహ - అందరూ కలిసి చదువుకొనే స్వాతంత్రాన్ని కలిగించాయో వాటికి/వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. 

ఎందుకంటే గిరి గీసుకొని మనలాంటి వాళ్ళే కలిసి ఉండాలి, కలిసి చదువుకోవాలి అంటే వారి ప్రపంచం మనకి తెలిసే అవకాశం ఉండదు... దీని వల్ల దూరాలు పెరుగుతాయి కానీ తగ్గవు .. ఇంకో ప్రాబ్లమ్ ...  మనం గీసుకున్న గిరి అక్కడే ఆగదు ... సబ్ - కేటగిరీ లు పెరిగి ఇంకా ఇంకా చిన్నది అయిపోతుంది. 

నా మొదటి ముస్లిం ఫ్రెండ్ నాకు బాగా గుర్తు. నాలుగో తరగతి లో ఆసియా. మొదటి సారి మాట్లాడటం లోనే అప్పటి హిట్ అయిన చిరంజీవి గారి పాట స్టెప్ వేసి చూపించింది! ఆమెకి తెలిసిన తెలుగు ఆ పాట వరకే. అక్కడ చదువుకున్నంత కాలం మంచి ఫ్రెండ్స్ మేము. 

ఆ తర్వాత ఎంతో మంది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. 

అసలు స్కూల్ లో ముస్లిం ఫ్రెండ్స్ ఇంత మంది, హిందూ ఫ్రెండ్స్ ఇంత మంది అని లెక్క పెట్టం కదా ... అలాగే మైనారిటీ రిజర్వేషన్ సిస్టం స్నేహాలకి వర్తించదు కదా... ఇవి లెక్కల్ని మించిన అపురూప బంధాలు. 

స్కూల్ లో నన్ను సినిమాల్లో లాగా 'మూ బోలి బెహెన్' అంటే 'మాట పిలుపు వల్ల అయిన చెల్లి' అని పిలిచే వాడు ఓ ఫ్రెండు. అలా నాకు రాజకీయ నాయకులు అన్నట్టు అక్షరాలా ఓ 'ముస్లిం సోదరుడు' సంభవించాడు. ఎన్నేళ్ళైనా నన్ను మర్చిపోకుండా మళ్ళీ ఈ మధ్యే నన్ను వెతికి పట్టుకున్నాడు ఎఫ్ బి లో. 

ఇంటర్ నుంచి నేను గర్ల్స్ కాలేజీల్లో నే చదువుకున్నాను. అప్పుడు నా స్నేహితుల్లో బోల్డు మంది ముస్లిం అమ్మాయిలు ఉండేవారు. అప్పుడు నాకు అనిపించింది ...  అసలు అమ్మాయిలు ఎక్కడ పుట్టినా కష్టసుఖాలు ఒకటే అని. ఆ అమ్మాయిలు కూడా మిడిల్ క్లాస్ (ఒక్కో సారి అంత కన్నా తక్కువ ఆర్ధిక స్థాయి) లో పుట్టిన వారే. వారి కి కూడా తెలివి, పట్టుదల, ఆంబిషన్, కష్టపడే తత్వం అందరిలాగే ఉండేవి. వారి లో కూడా సిగ్గరులు, చలాకీ పిల్లలు, అల్లరి పిడుగులు ఉండేవారు. మరీ ముఖ్యంగా 'మా అమ్మాయి కూడా చదువుకోవాలి' అని వారి తల్లిదండ్రులు కూడా భావించి, కష్టపడి, ఒక్కో సారి చుట్టాల ప్రెషర్ ని తట్టుకొని, ఆర్ధిక ఇబ్బందులు అనుభవిస్తూ అయినా సరే చదివించేవారు. 

నేను లెక్చరర్ గా ఓ రెండేళ్లు పని చేశాను .. నేను డిగ్రీ చేసిన కాలేజీ లోనే. అప్పుడు నా క్లాసు లో ఫస్ట్ ర్యాంకర్ ఓ ముస్లిం పిల్లే. 

కాలేజీ గెట్ టుగెదర్స్ లో ఓ సారి 'పాట్ లక్' పార్టీ చేసుకున్నాం. అందరం వారి ఇంటి నుంచి ఓ డిష్ చేసి తీసుకు రావాలి. నేను సాంబారు తీసుకెళ్లా. పార్టీ లో ఖర్చవగా సగం మిగిలితే వంతులేస్కోని బాటిల్స్ లో నింపుకొని మరీ తీసుకెళ్లిపోయారు మా ముస్లిం ఫ్రెండ్స్. నేను వాళ్ళ లౌకీ కా ఖీర్, డబుల్ కా మీఠా అలాగే తీసేస్కున్నా మరి! 

ముఖ్యంగా ఆ లౌకీ కా ఖీర్ (ఆనపకాయ పాయసం) గురించి చెప్పుకోవాలి ... మా ఫ్రెండ్స్ వాళ్ళమ్మ గారి స్పెషాలిటీ అట అది ... నేను అలాంటి రుచి పెళ్ళిళ్ళల్లో కూడా తినలేదు! 

రోజూ వారీ మాటల్లో మీ సంప్రదాయాలు ఎలా ఉంటాయి .. మావి ఇలా ఉంటాయి అనే మాటలొచ్చేవి. పెద్దవాళ్ళ ప్రెజుడీస్ లు కొన్ని మా మాటల్లో కూడా తొంగి చూసేవి. కానీ అవి మా బంధాన్ని ఎన్నడూ బలహీనం చేయలేకపోయాయి. 

నాకు ఉర్దూ అంటే వల్లమాలిన అభిమానం. సంస్కృతం అంటే ఎంత ఇష్టమో అంత. నాకు వారి పేర్ల అర్ధాలు తెలుసుకోవడం ఇష్టంగా ఉండేది. నేను విన్న గజల్స్ లో మాటల అర్ధాలు వాళ్ళని అడిగి తెలుసుకొనే దాన్ని. 

మా డిగ్రీ కాలేజీ లో గీతా శ్లోకాలే ప్రేయర్. ఆ శ్లోకాలు వాళ్ళు కూడా చెప్పే వారు. 

డిగ్రీ లో నే ఇర్ఫానా బానో అని ఓ మంచి స్నేహితురాలు ఉండేది. చాలా మంచి పిల్ల. బాగా చదువుకొనేది. అందమైన పిల్ల. ఇంగ్లీష్ బాగా మాట్లాడేది. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. నేను చేరిన కొత్త లో తనంతట తానే పరిచయం చేసుకుంది నన్ను.  

తనకి డిగ్రీ ఫైనల్ ఇయర్ లో పెళ్లయ్యింది. 

వాళ్ళ ఇల్లు కాలేజీ నుంచి మా ఇంటి కి వెళ్ళే దారే. 

నేను లెక్చరర్ అయ్యాక ఓ రోజు అలా వెళ్తుంటే వాళ్ళ నాన్నగారు కనిపించారు. ఆయన అంతకు ముందు నా తో మాట్లాడింది లేదు. స్కూటర్ ఆపి ఇర్ఫానా పురిటికి ఇంటికి వచ్చింది ... ఒక సారి వస్తావా అమ్మా అని అడిగారు .... నేను చాలా ఆనందించాను.. వెళ్ళాను అప్పుడే ఆయన తోటి. 

ఇర్ఫానా, నేనూ చాలా సేపు మాట్లాడుకున్నాం ...పాత జోకులు గుర్తు చేసుకొని నవ్వుకున్నాం ... ఇంక నేను ఇంటికి వెళ్ళే టైం వచ్చినప్పుడు తెలిసింది. తను కొంచెం వీక్ గా ఉందని ... డాక్టర్లు జాగ్రత్త గా ఉండమన్నారని. వాళ్ళ నాన్నగారి కి నన్ను చూసి ప్రాణం లేచొచ్చినట్టయి వాళ్ళమ్మాయి నా తో అయితే కొంచెం సేపు అన్నీ మర్చిపోయి నవ్వుతుంది, హాయి గా ఉంటుంది అనే తాపత్రయం తో నన్ను తీసుకెళ్లారని. 

ఇన్నేళ్లకి ఈ సంఘటన గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తుంది ... ఏ తండ్రికైనా బిడ్డ బిడ్డే ... తాపత్రయం తాపత్రయమే ... ఇందులో మతాల ప్రసక్తి ఎక్కడుంది? 

(తర్వాత అంతా బాగానే జరిగింది అని తెలిసింది. మా స్నేహితురాలు ఆరోగ్యంగా ఉంది, పిల్లా పాపలతో) 

ఇంకో ఫ్రెండ్ షబానా అని ... గోరింటాకు అద్భుతంగా పెట్టేది. కాలేజీ పోటీలో పాల్గొనాలంటే సిగ్గు. నా చేతి మీద అయితే పెడతా అంది. నాకు డబుల్ ఆనందం. నా అర చేతిలో అందమైన అరబిక్ డిజైన్ .. మా స్నేహితురాలి చేతిలో బహుమతి!

నా స్నేహం మనుషుల తో నే కాక ఉర్దూ సాహిత్యం, సంస్కృతి తో కూడా.  

(గజల్స్ తో నా అనుబంధం, నేను రాసిన గజల్స్ ఇదే బ్లాగ్ లో ఇది వరకూ పోస్ట్ చేశాను .. 
1. ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ .... 
2. నేను రాసిన ఓ ఉర్దూ ఘజల్ )

హైద్రాబాద్ లో ఉంటూ వారి చరిత్ర, సంస్కృతి అంటక పోవడం కష్టం. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఆ భవంతి చూసి భలే అనిపించింది. నాకసలు చారిత్రక కట్టడాలంటే ఓ రకమైన అభిమానం! చౌ మహల్లా ప్యాలెస్, తారామతి బారాదరీ చూసినప్పుడూ అలాగే అనిపించింది. 

ఇంత అనుబంధం ఉండీ రంజాన్ నెలలో చార్మినార్ దగ్గర జరిగే ఈద్ బజార్ కి వెళ్ళడానికి నాకు బోల్డు సంవత్సరాలు పట్టింది! 2017 లో మొదటి సారి వెళ్లాను ... అక్కడికి అర్ధరాత్రి వెళ్తేనే థ్రిల్లు. 

(అమ్మాయిలు అర్ధరాత్రి బయటికెళ్లాలంటే ఇంత వేడుక జరగాలో ఏంటో మరి!) 


చార్మినార్ ఎదురుగా పాత కొత్తలకి కాంట్రాస్ట్ గా ఓ కెఫె కాఫీ డే ఉంటుంది ..
అక్కడి నుంచి వ్యూ ఇది (2017 నాటి పిక్) 

మామూలుగా ఎక్కడా దొరకనివి అక్కడ దొరుకుతాయి లాంటివేమీ ఆ ఉత్సాహానికి కారణాలు కావు. చార్మినార్ లోగిలి లో ... అర్ధరాత్రి అనే తలపే రాని మిరిమిట్లు గొలిపే వెలుగులతో, వారికున్న అతి పెద్ద పండగ సమయం లో కుటుంబాలతో వచ్చి వారు చేసే షాపింగ్ తో కళకళలాడిపోయే ఆ వాతావరణం చాలా ముచ్చటగా ఉంటుంది. అది చూడటానికే వెళ్ళేది. 

నేను అక్కడ మొత్తం కొనుక్కున్నవాటి వెల వెయ్యి రూపాయలు దాటి ఉండదు .. (చిరు తిండి తో సహా!) ... వంద రూపాయల గాజులు, యాభై రూపాయలకి మన ఆయుర్వేద కాటుక ని పోలిన సుర్మా (ఇది పెట్టుకుంటే కళ్ళు మండుతాయి కానీ కళ్ళకి మంచిది అట!), ఓ చిన్న అత్తరు సీసా, బాదుషా లాంటి ఏదో స్వీటు, మెరుపుల చెప్పులు ఓ జత, గాజు తో చేసిన రంగు రంగుల ఉంగరాలు (ఒక్కోటి ఐదు రూపాయలు) ... అన్నీ ఇలాంటివే. కానీ ఆ experience విలువ చాలా ఎక్కువ. 

ఈ సారి రంజాన్ ఇలా సందడి లేకుండా జరుపుకోవలసి రావడం మా ఫ్రెండ్స్ ఏమో కానీ నేను తెగ బాధపడిపోతున్నాను. ఈద్ కి వారి పెద్దలు 'ఈదీ' అని పిల్లల చేతిలో బహుమతో, డబ్బో పెడతారు. నాకు ఈ సంప్రదాయం అంటే భలే ఇష్టం! రంజాన్ మాసాంతం లోపు అంతా బాగయిపోవాలనే కోరుకుంటాను. 

నేను ఇప్పటి వరకూ రాసిన అనుభవాలు అమాయకమైనవే అయ్యుండొచ్చు.

మన మధ్య ఎన్నో చారిత్రక, రాజకీయ వైషమ్యాలు ఉండి ఉండవచ్చు. జీవన శైలి లో, చట్టాల్లో భేదాలు ఉండవచ్చు. ఒకరి ప్రపంచం ఇంకొకరికి అర్ధం అవ్వక పోవచ్చు. 

నానా పాటేకర్ హిందీ సినిమా లో ఆవేశంగా ఓ ముస్లిం ఆయన చేతి వేలు, తన చేతి వేలు చితక్కొట్టేసుకొని, ఇద్దరి రక్తాలు కలిపేసి 'చెప్పు ... ముస్లిం రక్తమేదో .. హిందూ రక్తమేదో' లాంటి ఆవేశపూరితమైన డైలాగులు చెప్పడం వల్ల ఏ మార్పూ రాకపోవచ్చు. 

కానీ చరిత్ర కొన్ని పాఠాలు నేర్పుతుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఘోరాలు జాతి వివక్ష తోనే మొదలయ్యాయి అని గుర్తుంచుకోవాలి. మనుషులన్న వారందరికీ చెరగని మచ్చ - అప్పుడు జరిగిన అన్యాయాలు, హింస. ఎన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు తీసినా, నవలలు, కథలు, కవితలు రాసుకున్నా తీరని పాపం అది. 

ఆనీ ఫ్రాన్క్ డైరీ, ది బాయ్ ఇన్ స్ట్రైప్డ్ పైజామాస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (ఇటాలియన్ సినిమా) లాంటి వి చదివినప్పుడు, చూసినప్పుడు అసలు మామూలు మనుషులం కాలేం కొన్ని రోజుల వరకూ. అంత మనసు ని కలచి వేస్తాయి అవి. అదంతా కల్పనా కాదు నిజంగా జరిగిందే అనే ఆలోచనే నిద్రపట్టనివ్వదు ఎలాంటి వారికైనా. 

ఇదే చరిత్ర ఇంకో పాఠం నేర్పుతుంది. ఇది నేను పర్సనల్ గా తెలుసుకోవలసినది. శాంతి శాంతి అన్న వాళ్ళనే ఎక్కువ హింస పెట్టేసారేంటో మనుషులు గతం లో. కేవలం 'కలిసుండండండ్రా బాబు' అన్నందుకు చంపేయబడిన వాళ్ళు బానే ఉన్నారు. 

నాకేమో ఇంకొంత కాలం బ్రతకాలని ఉంది. ఆ విషయం ఇదంతా రాసే ముందే  ఆలోచించుకోవలసింది అంటారా? ఏం చేస్తాం .. ఈ విషయం లో అందరం ఒకటే! మనమెవ్వరం చరిత్ర నుంచి ఏవీ నేర్చుకోము! 😄 

రంజాన్ శుభాకాంక్షలు! 

Saturday, April 18, 2020

కాలమహిమ

'టైం ని మనిషి సృష్టించాడు' అని ఎవరో అన్నారు నా తో కొన్నేళ్ల క్రితం. 

అదెంత వరకూ నిజమో తెలుసుకుందామని యధావిధి గా రీసెర్చ్ చేస్తే మహా ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి! 

ఉదాహరణ కి ఇది చూడండి. 

కాంతి మనని చేరడానికి టైం పడుతుంది. అందుకే మనం చూసేదంతా గతమేనట! కిటికీ బయట మనం చూస్తున్న సూర్యుడు ఎనిమిది నిముషాల ఇరవై సెకన్ల క్రితం సూర్యుడు! భూమి కి అతి దగ్గరగా కనిపించే నక్షత్రం మీరు ఈ రోజు చూస్తున్నట్టయితే మీరు చూస్తోంది నాలుగేళ్ళ క్రితం నక్షత్రాన్ని. 

క్రికెట్ లాంటివి లైవ్ టెలికాస్ట్ చేసే అప్పుడు ఏడున్నర నిముషాలు ఆపి చేస్తారు ... ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే కవర్ చేసుకోవచ్చని ... నాకు సూర్యుడి నిజం తెలిసాక ఇది గుర్తొచ్చి నవ్వొచ్చింది ... కారణం ఏదైనా మన లైవ్ టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ కాదన్నమాట!!!  

టైం గురించిన విషయాలు ఈ టైం లో మీకు టైం తెలీకుండా ఉండేందుకు... 

భూమి మీద ఎప్పుడూ సంవత్సరానికి 365 రోజులు లేవు. డైనోసార్ల కాలం లో సంవత్సరానికి 370 రోజులుట. కానీ రోజుకి 23 గంటలే. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రుడి ఆకర్షణ ఎక్కువై , భూమి ఆత్మ ప్రదక్షిణ స్లో అవుతోంది ... ప్రతి వందేళ్ల కి 1.7 మిల్లీ సెకన్ల మేరకు ఒక రోజు నిడివి పెరుగుతోంది ట!  అలా ఇప్పటికి రోజుకి 24 గంటలకి వచ్చాము. 

సైన్స్ ప్రకారం 'కాలం' ఎప్పుడూ ఉంది. సృష్టి మొదలైనప్పటి నుంచి. 

'సమయం' మాత్రం మనిషి కనిపెట్టుకున్నాడు తన సౌకర్యం కోసం. అలా పుట్టినవే గడియారాలు, క్యాలెండర్లు. 

నాగరికత లో మొదటి కాలెండర్ మన భారతీయులు ఇప్పటికీ ఫాలో అయ్యే చాంద్రమానమే. ఇది రాసుకున్న వారు  సుమేరియన్లు - ఇప్పటి ఇరాక్ అప్పటి మెసపటోమియా లో ఉండేవారు. మొట్టమొదట గా లిపి కనిపెట్టింది కూడా వీరే అంటారు. 

పశ్చిమం లో ప్రతి ఊరు కి వారి గడియారాలు వాళ్ళకి ఉండేవి. కానీ ట్రైన్లు మొదలైనప్పటి నుంచి కన్ఫ్యూషన్ పెరిగి రెండు గడియారాలు పెట్టుకొనే వారట .. ఒకటి వారి ఊరి సమయం ఒకటి ట్రైన్ టైం. ఇంక ఇలా కాదని ట్రెయిన్ టైమే మొదటి దాన్ని తినేసింది. అందరూ ఒకే టైం ఫాలో అయ్యే పద్ధతి అలా వచ్చింది. 

పారిశ్రామిక విప్లవం నుంచి టైం 'విలువ' పెరిగింది ... 'టైం అంటే డబ్బు' అనే పరిస్థితి వచ్చింది ఇక్కడి నుంచే కదా. టైం తీసేస్తే లేబర్ ఎంత సేపు పని చేస్తే ఎంత ఇవ్వాలి, ఒక నిముషం లో ఓ కార్మికుడు (తర్వాత కాలం లో  యంత్రాలు) ఎన్ని వస్తువులు తయారు చేయగలరు, ఈ రోజు నేను ఓ పైసా బ్యాంకు లో వేస్తే ఎన్ని నెలలకి రూపాయ అవుతుంది ... నేను అప్పిచ్చిన వాడికి వారానికి ఎంత వడ్డీ వేయచ్చు ... ఈ లెక్కలకి 'సమయం' తప్పని సరి అయిపోయింది. 

టైమ్ జోన్స్ ఇంకో సమస్య. ఒకే అమెరికా లో ఆరు టైం జోన్స్ ఉన్నాయి. భారత దేశం లో కూడా అలా చేద్దాం అనుకున్నారట ఒకప్పుడు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇది ప్రాక్టికల్ కాదు అని ఊరుకున్నారు. 

ఇంక క్యాలెండర్ల విషయానికి వస్తే, అసలు ఈ రోజు 2020 ఏప్రిల్ 18 వ తారీకు కానే కాదు. సౌరమానం ఆధారంగా ఏర్పడ్డ క్యాలెండర్ల లో అప్పటి చక్రవర్తులు, మత పెద్దల అవైజ్ఞానిక ప్రభావాలు ఉండేవి. కొంతమంది రాజులు ఎనిమిది రోజుల వారాలు పాటిస్తే కొంత మంది కొన్ని రోజులు తీయించేశారంటారు. మనం ఇప్పుడు పాటిస్తున్న గ్రెగోరియన్ కాలెండర్ కన్నా ముందు ప్రచారం లో ఉన్న జూలియన్ కాలెండర్ లో లీపు సంవత్సరం విషయం లో లెక్కల్లో తేడాలుండేవిట. పైగా వారి కొత్త సంవత్సరం మర్చి 25 నుంచి ఏప్రిల్ 1 మధ్య ఉండేది (ఇంచుమించు మన వసంత మాసారంభం ఉగాది లాగా) ... రకరకాల కారణాల వల్ల గ్రెగోరియన్ కాలెండర్ దాన్ని తోసిరాజని జనవరి మొదటి రోజు నూతన సంవత్సరం మొదలు అని మార్చింది. ఇది చాలా దేశాలు పాటించకుండా, ఒప్పుకోకుండా, లేక అలవాటు ప్రకారం ఏప్రిల్ ఒకటి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే వారిని ఫూల్స్ అనడం ప్రారంభమైంది. అలా వచ్చిందే ఏప్రిల్ ఫూల్స్ డే. ఎంత అన్యాయం! 

ఇంకో ఇంచుమించు అన్యాయం గురించి మాట్లాడాలంటే 'డే లైట్ సేవింగ్స్' కథ చెప్పుకోవాలి. అమెరికా లో ఉన్న ప్రతి ఒక్కరికి, వారి వల్ల మనకి కూడా ఈ పదాలు తెలిసిపోయాయి. అక్కడి ఉంచి వచ్చిన గాడ్జెట్స్ లో ఈ ఫీచర్ ఉంటుంది గమనించారా? వసంత మాసం మొదలవగానే ఓ రోజు గడియారాలని ఓ గంట ముందుకి జరుపుతారు. (జరిపిన రోజు వారికి 23 గంటలే ఉంటాయి.) 
చలి దేశాలలో సూర్యుడి వేడి అరుదైన విషయం కాబట్టి ఆ రోజుల్ని పొడిగించుకుంటే పని ఎక్కువ చేస్కోవచ్చు. ఇది స్థూలంగా దీని ఉద్దేశం. అమెరికా ప్రెసిడెంట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ జోక్ గా 'ఈ రోజు నేను లేచే సరికి అప్పటికే తెల్లవారిపోయింది .. ఇలాంటి రోజులు ముందే లేచి పని చేసుకుంటే బాగుంటుంది కదా, కొవ్వొత్తులు ఆదా అవుతాయి  ... ఓ రెండు మూడు రోజులు అందరూ నసుగుతారు కానీ నాలుగో రోజు కి అలవాటయిపోతుందిలే' అన్నారట ఆయన. అప్పటికీ ఈ విషయాన్ని రెండు మూడు సార్లు గవర్నమెంట్ కి విన్నవించుకున్న ఒకాయన ఈ వంక తో విజృంభించి  అందరిని ఒప్పిస్తే కలిగిన ఫలితమే డే లైట్ సేవింగ్స్. మళ్ళీ ఆకు రాలు కాలం మొదలయ్యే రోజు ఓ గంట వెనక్కి జరిపిస్తారు గడియారాన్ని. ఆ రోజు వాళ్ళకి 25 గంటలు ఉంటాయి. 

ఇదంతా 'సమయం' కథ. 

కాలం కథ లో మలుపు తీసుకొచ్చింది మాత్రం ఐన్ స్టీనే అంటారు. ఆయన ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం టైం ఒక్కొక్కరికి ఒక్కోలా గడుస్తుంది. టైం ని, స్పేస్ ని అనుసంధానం చేస్తూ ఆయన చెప్పిన సిద్ధాంతం ఇది. చాలా కొత్త ఆలోచనలకి, ప్రయోగాలకి, ఫలితాలకు దారి తీసింది ఈ సిద్ధాంతం. 

కొంచెం అర్ధం చేసుకోటానికి కష్టం గా అనిపించి అప్పటి పాత్రికేయులు ఆయన సెక్రటరీ ని విసిగించేస్తే ఆయన ఈ సిద్ధాంతాన్ని ఈ విధం గా సరళమైన మాటల్లో చెప్పి ఉంటారు అని ఓ కథ. 

"మండుతున్న బొగ్గుల మీద కూర్చుంటే ఒక నిముషం గంట లాగా, అందమైన అమ్మాయి తో మాట్లాడుతుంటే గంట నిముషం లాగా అనిపించడమే సాపేక్ష సిద్ధాంతం" అని. 

అంటే కష్ట కాలం నెమ్మదిగా, ఆనంద భరిత సమయం వేగంగా గడిచిపోతుంది అని. (లాక్ డౌన్ సమయం ఈ సిద్ధాంతాన్ని నిజమో అబద్ధమో రుజువు చెయ్యడానికి కరెక్ట్ కదూ) 

నాకు గీతోపదేశం గుర్తొచ్చింది. కృష్ణుడికి అర్జునుడికి 700 శ్లోకాల సంభాషణ జరుగుతుంటే మిగిలిన సైన్యం అంతా ఏం చేస్తోంది అనిపించేది. ఈ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం అర్జునుడికి గడిచిన సమయం నిడివి వేరు.. మిగిలిన వారందరూ అనుభవించిన సమయం నిడివి వేరు అయ్యుండొచ్చు కదా. 

ఇందాక చెప్పినట్టు మొదట్లో మతాలే కాలధర్మాలని నిర్ణయించాయి. ఆసక్తి కరమైన విషయం ఏంటంటే హిందువులు, బౌద్ధులు, జైనులు, సనాతన గ్రీకులు మొదలైన వాళ్ళం కాలాన్ని చక్రం గా భావిస్తామాట. అంటే యుగాలు పునరావృతమవుతాయి కదా .. అలాగ.  

యూదులు, క్రిస్టియన్లు, ముస్లింల ప్రకారం సృష్టి, దానికి అంతం... ఇలా లీనియర్ గా రేఖా మాత్రంగా భావిస్తారు టైం ని. అందుకే హాలీవుడ్ లో సృష్టి అంతం గురించి వచ్చిన సినిమాల లాంటివి మనం తియ్యం. మనకి కలియుగం తర్వాత మళ్ళీ సత్య యుగం వస్తుందని తెలుసు. కొన్ని లెక్కల ప్రకారం కలియుగం ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలుసు. 

పెద్ద బాలశిక్ష లో రాసున్న హైందవ కాల విజ్ఞానం 

సైన్స్ విషయం లో మన సగటు భారతీయుల వైఖరి  ఎలా ఉంటుందంటే రచ్చ బండ దగ్గర కూర్చొని ఏడు పదులు దాటిన ముసలి వాళ్ళు - కుర్ర కుంకలు ఏవో సందేహాలు అడుగుతూ, వాళ్ళకి తోచిన ప్రయోగాలు చేస్కుంటూ అప్పుడప్పుడూ వీళ్ళు చెప్పింది కాదంటూ ఒక్కో సారి వీళ్ళు చెప్పిందే నిజమని రుజువవుతూ, అలా రుజువవ్వనప్పుడు ప్రయోగమే తప్పు అని కొట్టి పారేసేలాగా ఉంటుంది. లేదా ఆ కొత్తగా రుజువయ్యింది కూడా మాకు తెలిసినదేలే అని బుకాయించేలాగా ఉంటుంది. 

ఇది తప్పో ఒప్పో అని జడ్జ్ చెయ్యట్లేదు. ఇలా ఉంటుందని నా అభిప్రాయం అంతే. 

ఒక రకంగా వారి wisdom ని తీసిపారెయ్యలేం. మనకి ఇప్పటి దాకా దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా అల్లుకున్న చరిత్ర కథ లో మన వైపు సనాతన శాస్త్రం ఉంది. కొన్ని దేశాల్లో మతానికి, విజ్ఞానానికి జరిగిన ఘర్షణ మనకి అంత గా తెలీదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని నిరూపించిన గెలీలియో (1564- 1642) ని మత విరోధి అనేసారు. 

'భానో భాస్కర మార్తాండ చండ రశ్మి దివాకరః 
ఆయురారోగ్యమైశ్వర్యం దేహిమే కమలాలయా 
దేవ దేవా జగన్నాథా ప్రత్యక్షా పురుషోత్తమా 
జ్యోతిర్మండల మధ్యాయ భాస్కరాయ నమో నమః'  

అనే శ్లోకం లో 'జ్యోతిర్మండల మధ్యాయ' అంటే కాంతి సమూహం మధ్యలో ఉండే వాడు సూర్యుడు అని వర్ణించారు. (కాకపోతే ఈ శ్లోకం ఏ స్తోత్రం లో నుంచి గ్రహించబడిందో నాకు తెలియలేదు. ఆదిత్య హృదయం చెక్ చేసాను. కనిపించలేదు. గెలీలియో తర్వాతి కాలం లో కాక మన పూర్వ విజ్ఞానం నుంచి గ్రహించబడిన శ్లోకమే అయితే మనకి సోలార్ సిస్టం గురించిన సూక్ష్మ జ్ఞానం ఉందని రూఢి అవుతుంది. ఏదైనా మనమే గొప్ప అని గుడ్డిగా వాదించకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు. అంతే) 

ఈ శ్లోకం ఎప్పటిదైనా మనకి విజ్ఞానం, మతం వేరు వేరు కాదు. వాళ్ళు సయింటిస్టులు అంటారు మనం మహర్షులు అనే వాళ్ళం. 

క్యాలెండర్ల విషయం లో ఇన్ని అవకతవకలు కూడా మన దగ్గర తక్కువనుకుంటా. శాలివాహన శకం, విక్రమ శకం ఇలా చక్రవర్తుల పేరిట విడిగా క్యాలెండర్లు లేకపోలేదు కానీ ఎవరు ఫాలో అయ్యేవి వాళ్ళు ప్రశాంతంగా ఫాలో అయిపోతున్నారు. (అన్నీ ఒకే క్యాలండర్ లో అచ్చేసుకుంటున్నాం కూడా!) మాదే అందరూ ఒప్పుకొని తీరాలని గొడవలు జరగడం నేను ఎప్పుడూ చదవలేదు. 

కాలం గురించి మాట్లాడుతూ టైం ట్రావెల్ గురించి మాట్లాడకపోతే ఎలా. ఎవెంజర్స్, హారీ పాటర్ లాంటి సినిమాల్లో (టైం ట్రావెలింగ్ మీద తీసిన సినిమాలు కాక) ఈ విషయం టచ్ చేశాయి. ఇంటర్ స్టెల్లార్ అయితే ఓ అడుగు ముందుకి వేసేసి బ్లాక్ హొల్స్ వల్ల కలిగే కాలభేదాల గురించి కూడా మాట్లాడింది. బ్లాక్ హోల్ వల్ల కొన్ని ఏళ్ళ కాలం భూమి సమయం లో కొన్ని గంటలే అవుతుంది. 

అన్ని సినిమాల్లో ఒక విషయం మాత్రం చెప్తారు .. కాలం తో ఆటలు ఆడద్దని. గతం లో కి వెళ్లినా, భవిష్యత్తు లోకి వెళ్లినా ఏదీ మార్చకుండా రూల్స్ ఉంటాయి  .. 

ఒక సిద్ధాంతం ప్రకారం మనం కావాలన్నా ఏం మార్చలేమట. 'grandfather paradox' (గ్రాండ్ ఫాదర్ పారడాక్స్) ప్రకారం ఓ వ్యక్తి గతం లో కి వెళ్లి తన తాత ని చంపేశాడు అనుకుందాం ... మరి తాత లేకపోతే తండ్రి లేడు  .. తాను కూడా పుట్టి ఉండడు కదా .. అసలు పుట్టని వాడు గతం లో కి వెళ్లి ఎలా తాత ని చంపగలడు? ఇలా అన్నమాట. 

కాలం చేతికి చిక్కదు... ఒక్కో సారి బుద్ధికి కూడా చిక్కదు. నిరంతరంగా ప్రవహించే ఓ వాహిని అది .. ఏ పోకడ ఇంకో దాని తో పోలదు... మనం చక్రం అన్నా, ఇంకొకరు రేఖ అన్నా ... కాలం పట్టించుకోదు. 

మనం మాత్రం ఏం తక్కువ? 

ఎనిమిది నిముషాల 20 సెకన్లు లేటు గా సూర్యుణ్ణి చూస్తూ, ఉందో లేదో అంటున్న ప్రస్తుత సమయం లో బ్రతుకుతూ, పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పడిన సమయ పట్టిక ప్రకారం విధులు నిర్వహిస్తూ, రాజు గారు చెప్పారు కాబట్టి ఏప్రిల్ పద్దెనిమిదే అయ్యుంటుంది అని మౌనంగా అందరూ పాటించే కాలెండర్ పాటించేస్తూ, నిముషానికి ఇంత విలువ అని మన అప్పుల్ని, మదుపుల్ని లెక్క కట్టుకుంటూ, ప్రత్యక్షంగా కాదు కానీ ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా వీలైనంత గతం లోకి, జ్యోతిషం, విజువలైషన్ ద్వారా భవిష్యత్తు లోకి టైం ట్రావెల్ చేస్తూ, కొన్ని రోజులు గడియారాలు మార్చుకుంటూ, టైం జోన్ల కి అతీతంగా, అనుగుణంగా వ్యవహారాలు నడిపేసుకుంటూ, సమయ పాలన మీద ఎస్సే లు చదూకుంటూ టైం పాస్ చేసేయట్లే? 

అన్నట్టు సాపేక్ష సిద్ధాంతం ఈ పోస్టు కి అన్వయిస్తే ఫలితాలు ఎలా ఉంటాయంటారు? 😄

Saturday, April 11, 2020

స్వాభినందన మందార మాల

కొందరి మాటలు వింటున్నప్పుడు .... చెవి లోపల నొప్పి కాదు కానీ బయట కి కనిపించే చెవి దొప్పలు నొప్పి రావడం ఎప్పుడైనా అనుభవించారా? అది ఎవరూ ఎప్పుడూ అనుభవించకూడదనే ఆశిస్తాను. ఇలాంటి అనుభవాలు అయ్యాయి నాకు. అన్ని సార్లూ ఒకే కామన్ పాయింట్... ఎవరు మాట్లాడగా అయితే నేను వింటున్నానో వారు ఒకటే స్వోత్కర్ష! గంటల తరబడి! 

ముందు పావు గంట "అలాగా! భలే! చాలా మంచి విషయం" అని మనస్ఫూర్తి గానే అభినందించాను. అది అగ్ని లో ఆజ్యం పోసినట్టయింది. ఇంక వారు ఆపే ప్రయత్నం చెయ్యలేదు.  

రెండో సారి అయితే మరీ అన్యాయం ... ఓ పర్సనల్ ట్రాజెడీ మధ్య మొదలెట్టేసారో వ్యక్తి ఈ ధోరణి!

ఈ వ్యక్తులు చిన్న పిల్లలేమీ కారు .. 

ఒక వ్యక్తి తాను ఎంత అదృష్టవంతులో .... అన్నీ తనకి ఎలా కలిసొచ్చేసాయో ... సొంతిల్లు జేబులో వంద రూపాయలుండగా ఎలా కొనగలిగారో ఇలా చెప్పుకొస్తే ... ఇంకొక వ్యక్తి తాను ఆఫీసులో ఎంత బాగా పని చేస్తానో  ... అందరూ తనని ఎలా  పొగుడుతారో చెప్పుకుంటూనే ఉన్నారు. 

ముందే చెప్పినట్టు, నా వయసు వాళ్ళు, ఒకే చోట కూర్చొని జీవితం లో విజయాలు షేర్ చేసుకొనే సందర్భం అయితే ఎందుకు వినం ... ఎందుకు ఆనందించం? కానీ సమయం, సందర్భం చూస్కోకుండా ... మంచి మర్యాద ఎంచకుండా ... వింటున్నారు కదా అని (ఒక్కో సారి అది పట్టించుకొనే పరిస్థితి కూడా లేదు... వినాల్సి వచ్చే పరిస్థితి లో పట్టేసుకోవడం ... బస్సులో కలిసి ప్రయాణించే అప్పుడో .. అలా అన్నమాట .. దిగి పారిపోలేనట్టుగా!)... మన కంటే అనుభవం లో, వయసు లో చిన్న వారితో మన గొప్పలు చెప్పేసుకుంటూ పోవడం ఎంత అన్యాయం! 

విని అనుభవించిన పిల్ల గా నేను వారిని క్షమిస్తానో లేదో తెలియదు కానీ ఈ ప్రవర్తన, ఈ నైజం చాలా మందిలో చాలా సార్లు చూసాక ఓ అనధికారిక మానవ ప్రవర్తనా విశ్లేషకురాలి గా నా బుర్ర లో కొన్ని చక్రాలు తిరిగాయి. 

ముందు వీరి లిస్టు లోంచి ఇగోయిస్టులని తీసేద్దాం ... వారికెలాగూ వారే ప్రపంచం .... ఈ కాంతి మండలం సూర్యుడి చుట్టూ కాక వారి చుట్టే తిరుగుతుందని వారి ప్రబల విశ్వాసం. వారు నోరు తెరిచినప్పుడల్లా వారి గురించే మాట్లాడుకుంటారు. వారిని విశ్లేషిస్తే ... అసలు ఇగోయిస్టులు గా వారెందుకు అయ్యారు అనే దోవ లో పోవాలి. అది మన ప్రస్తుత విషయానికి అప్రస్తుతం. 

సహజంగా ఇగోయిస్టులు కాని వారు మనిషి కనిపిస్తే పట్టుకొని తమ డబ్బా కొట్టేసుకుంటున్నారు...  పైగా ఎందరికి తమ గురించి చెప్పినా తనివి తీరట్లేదు. ఎందుకు? 

వీరి లో కష్టసుఖాలు రెండూ పంచుకొనే వారిని తీసేద్దాం ... అసలు వీరికి పాపం మాట వినేవారే కరువయిపోయారన్నమాట. అందుకే ఎవరు దొరుకుతారా మాట్లాడటానికి అని చూస్తున్నారు. హమ్మయ్య వీళ్ళని కూడా విశ్లేషించేసాం. 

ఇంక మిగిలింది .. కేవలం తమ ప్రతిభా పాటవాలని, ఘనకార్యాలని, తాము చేశామనుకుంటున్న గొప్ప పనులని గురించి మాత్రమే మాట్లాడేవారు.... అది కూడా సేమ్ మ్యాటర్ మళ్ళీ మళ్ళీ అందరితో (కేవలం నాతోనే కాకుండా అన్నమాట.) 

నా చెవి దొప్పలు నొప్పి పుట్టక ముందు నేను విన్నంత వరకూ వీరు అబద్ధాలు చెప్పట్లేదు ... వీరి ఘనకార్యాలు రోజూ వారీ జీవితం లో జరిగేవే ... ఓ కస్టమర్ వస్తే ఎవరూ హెల్ప్ చెయ్యకపోతే తాను ముందుకెళ్లి హెల్ప్ చేసి అతనికి ఆనందం కలిగించారొకరు. ఇంట్లో పెద్దగా సరుకులు లేకపోయినా హఠాత్తుగా వచ్చిన అతిథులకు కడుపు, మనసు నిండా భోజనం పెట్టి పంపించారొకరు, తమ చిట్టి జీతం తో ఉద్యోగం వచ్చిన కొత్తలో చేసిన ఓ గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఫలాలు నేడు అనుభవిస్తున్నారొకరు ... 

అసత్యాలు కావు. అతిశయోక్తులు కూడా కావు. అసందర్భాలు.. అననుగుణాలు (inappropriate అనే మాట కి తెలుగు ఇదేనా?) అంతే. 

భూకంపానికి ఓ కేంద్ర బిందువు ఉన్నట్టే వీరి స్వోత్కర్ష కి ఓ మూలం ఉందని నాకనిపించింది. మనోవ్యాధులు వేరు, మనోవికారాలు వేరు. మనోవ్యాధులు లోతైనవి .. ఒక్కోసారి పుట్టుకతో సంక్రమించేస్తాయి. కానీ మనోవికారాలు మన పెంపకం, మన చుట్టూ ఉన్న సమాజం, దాని ప్రభావం .. కుటుంబం ... వీటి వల్ల కలుగుతాయి. కొంత మంది ఎడతెగని స్వోత్కర్ష మనోవికారమే అయితే దాని మూలం - మెచ్చుకోలు లేకపోవడం. 

మనందరం పెద్దోళ్ల లా నటిస్తున్న చిన్నపిల్లలం అన్నారొక గొప్ప వ్యక్తి. అది నిజం అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. 

అరవై ఏళ్ళ కి కూడా తను జీవితం లో సాధించిన ఎన్నో చిన్న, పెద్ద ఘనకార్యాలు ఎవరికి చెప్పుకోవాలి .. ఎలా ప్రశంస పొందాలి అని ఆరాట పడేవారిని చూసి ఇంకేమంటాం చెప్పండి?

చిన్నప్పుడైతే ఓ పిచ్చి బొమ్మ వేసి అమ్మ కి పరిగెత్తికెళ్ళి చూపిస్తే 'మా బాబే! ఎంత బాగా వేసావురా!!!' అని ఆవిడ ఆనందపడిపోయి .. ఇప్పటి తల్లయితే ఇన్స్టా గ్రామ్ లో పెట్టేసి హాష్ టాగ్ మా చిన్నారి పికాసో అని రాసేసి ఆ బొమ్మ కి ఓ పటం కట్టించి ఇంట్లో గోడ మీద తగిలించేసేది! ఆ వయసు లో అనుభవించిన సత్కారం, గుర్తింపు, మెచ్చుకోలు ఇంక జన్మలో దొరకదు ... మూడు దాటి నాలుగు వయసు వచ్చిందా .. 'ఇంత పెద్దదానివయ్యావు .. ఇది చెయ్యలేవా' అనే మాటలే వింటూ పెరుగుతాం. ఈ నాలుగేళ్ళ చంటి వాడికో చంటి దానికో చెల్లో తమ్ముడా పుడితే బాల్యం ముగిసి పేరెంట్ హుడ్ మొదలైపోతుంది పాపం వీళ్ళకి!  

కానీ జీవితం లో మనం సాధించేవి ఆ వయసు తో ముగిసిపోవు. మొదటి అడుగు, మొదటి అక్షరం, మొదటి 'మొదటి ప్రయిజు' ... ఇవి దాటాక ఇంకా ఎన్నో ఉంటాయి .. మొదటి ఉద్యోగం ... మొదటి విదేశీ ప్రయాణం.. మొదటి దీర్ఘకాలిక అప్పు తీర్చడం .. మొదటి ఐదు/ఆరంకెల సంపాదన ... ప్రేమ ని గెలిపించుకుని జీవిత భాగస్వామి ని ఎంచుకోవడం ... అనుకున్న కొన్ని నిర్ణయాలకు కట్టుబడి ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ ఉండటం ... కుటుంబ శాంతి కోసం చిన్న చిన్న త్యాగాలు, పెద్ద పెద్ద త్యాగాలు, ఇంట్లో ఆరోగ్యం బాగాలేని పెద్దవారిని కంటికి రెప్ప లా చూసుకోవడం, కాన్సర్ లాంటి రోగాలని జయించడం, పిల్లల జీవితం లో తాము తీసుకున్న మంచి నిర్ణయాలు, ఉద్యోగస్తులు గా, గృహిణి /గృహస్థు గా .. గుప్తదానాలు చేసే మంచి మానవుడిగా .. కులమత భేదం మనసులోకి రానివ్వని మంచి మనిషి గా .. మిత్రుల మధ్య వివాదాలు తీర్చి దానికి క్రెడిట్ కూడా తీస్కోని మంచి స్నేహితులు గా ... తనకి ఒక్కో సారి చిన్న నష్టం కలిగినా దేశ ప్రయోజనాల దృష్ట్యా పట్టించుకోని మంచి పౌరులు గా ... ఎన్ని సాధించట్లేదు రోజూ మనం! 

మన లోని చిన్నారి ఈ విజయాలకు గుర్తింపు లేక చిన్నబోతోందేమో .. అందుకే వయసు తో వచ్చే గాంభీర్యాన్ని, మెచ్యూరిటీ ని పక్కన పడేసి బాల్య చాపల్యం చూపిస్తోందేమో...  

కానీ ఆ చిన్నారి కి తెలియని విషయాలేంటంటే ఇందాక చెప్పినట్టు కొన్ని విజయాలు మనం బయటికి చెప్పుకోలేం... ఎవరైనా గమనించి మెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ మన వెన్నంటి ఉండే ఇంట్లో వాళ్ళకి కూడా ఇంత సునిశితమైన దృష్టి ఉండదు ... ఉన్నా గమనించే టైం, ఓపిక ఉండవు. కొంత మందికి ఉద్దేశం కూడా ఉండదనుకోండి... అలాగే ప్రపంచ శాంతికి నోబెల్ ఉన్నట్టు కుటుంబ శాంతికి ఏ అవార్డూ లేదు ... లేకపోతే ఎంత మంది ఆ సత్కారం పొందే వారున్నారో కదా! కళాకారులకి వేదిక మీద బిరుదులు ప్రదానం చేసి శాలువా కప్పుతారు కానీ ఓ కుటుంబాన్ని నిలబెట్టిన కుటుంబ పెద్ద కి ఇవేవీ ఇవ్వరే ... పైగా 'నీ కుటుంబం నువ్వు నిలబెట్టుకోవడం కూడా పెద్ద ఘనకార్యం ఏవిటి' అనే ఎత్తిపొడుపులు ... ఏ? కాదా? అలా చెయ్యకుండా బాధ్యతారహితంగా ఎంతమంది లేరు? ఆడవారి విషయానికొస్తే 'ఆడవారు - గుర్తింపు' అనే విషయం మీద గ్రంథాలే రాసేయచ్చు ... అయినా సరిపోదు. 

ఇంకా ఎన్నో వ్యక్తిగత యుద్ధాలు చేసి వీరులుగా నిలిచిన వారికి గుర్తింపు ఏది? 

కొన్నేళ్ళు ఇలా మన వ్యక్తిగత విజయాలు గుర్తింపు లేకుండా పోయినప్పుడు ఎన్నో వికారాలు పుడతాయి .. స్వోత్కర్ష ఒకటైతే, నైరాశ్యం ఇంకొకటి .. నిష్కారణమైన కోపం, చికాకు కూడా (నిష్కారణం ఏముంది లెండి ... ఇంత చేసి మెచ్చుకోకపోతే రాదా కోపం) ... 

మరి ఏం చెయ్యాలి? 

ఓ చాలా మంచి కిటుకుంది. 

ఓ కొత్త పుస్తకం, పెన్ను కొనుక్కోండి. 

ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు డేట్ వేయండి. 

నెంబరు వేస్తూ ఆ రోజు మీరు సాధించా అనుకున్న విషయాలు రాసుకోండి. 

'పాలు పొంగక ముందే కట్టేసా' దగ్గర నుంచి 'తమ్ముడి ఇంటి కరెంటు బిల్లు కట్టేసా' వరకూ రాసుకోవచ్చు. 

డిప్రెషన్ లాంటి మనోవ్యాధులతో బాధపడుతున్న వాళ్ళైతే 'నేను ఇవ్వాళ నిద్ర లేచి స్నానం చేశా' అని కూడా రాసుకోవచ్చు... ఆ రోజు కి మీరు సాధించగలిగిన అతి గొప్ప ఘనకార్యం అదే కదా! 

ఇంకొక చిన్న పని చేసి చూడండి. ఏ రోజుకి ఆరోజు మళ్ళీ మొదటి నెంబరు వెయ్యకుండా ముందు రోజు విజయాల నెంబరు నుంచి సంఖ్య కంటిన్యూ చేయండి .... మీ విజయాలు సెంచరీ ఎన్ని రోజులకి కొట్టాయో తెలిసిపోతుంది! 

ఈ పుస్తకం మీ వ్యక్తిగతం కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన విజయం రాసుకోవచ్చు ... మీకు మీరే ఏదైనా బిరుదు కూడా ఇచ్చుకోవచ్చు ... తప్పేం ఉంది? ఫామిలీస్టార్ <మీ పేరు> .. డైనమిక్ గృహిణి /గృహస్థు <మీ పేరు> , వజ్రోద్యోగి <మీ పేరు> ... పుత్రరత్న <మీ పేరు>, పుత్రికాశిరోమణి <మీ పేరు> ... 

మీ ఇష్టం అండి! ఇంకా నేను బోల్డు కేటగిరి లు మర్చిపోతున్నానేమో ... కొన్ని ఇక్కడ పొందుపరచలేకపోతున్నానేమో ... అయినా విజయం విజయమే! ఆ విజయానికి గుర్తింపు ఉండాల్సిందే. 

ఆమ్మో ... ఇలా రోజూ మనని మనమే పొగిడేస్కుంటే ఈగో వచ్చెయ్యదూ? అనే ప్రశ్న మీకు తడితే అసలు మీకు ఈగో వచ్చే సమస్య లేదన్నమాట. అహంకారం లేదనుకోవడమే అహంకారం అంటారు కదా .. అలాగే అహంకారం వచ్చేస్తుందేమో అని భయపడటమే నిరహంకారం. అదే ఇగోయిస్టు అనుకోండి .. 'పుస్తకం లో రాస్తే ఎవరికీ తెలుస్తుంది' అని రాయరు ... పైగా 'నాకు ఓ పుస్తకం ఏం సరిపోతుంది' అని జోకులేస్తారు. వీళ్ళకి ఈ సలహా వర్తించదు అని నా సవినయ మనవి. 

కొన్ని రోజుల తర్వాత మీకు ఈ పుస్తకం అవసరం పడకపోవచ్చు కూడా. ఎందుకంటే  మీకు మీరున్నారు... ఎవరు గమనించినా గమనించకపోయినా మిమ్మల్ని మీరు గమనించుకొని చప్పట్లు కొట్టుకుంటున్నారు అని మీకు నమ్మకం కుదురుతుంది కాబట్టి. 

ఇంగ్లీష్ లో అప్ప్రీసియేషన్ అనే మాట ఉంది కదా ... దానికి రెండు అర్ధాలు .. ఒకటి మెచ్చుకోలు.. ఒకటి పెరుగుదల ... ఈ రెండు పదాలు ఇక్కడ వర్తిస్తాయి. మనని మనం ముందు గుర్తించుకుంటే, మెచ్చుకుంటే .. మనం ఎదుగుతాం, వ్యక్తిత్వం లో పెరుగుతాం అన్న మాట నిజం. 

తెలుగు లో కూడా 'స్వ' తీసేస్తే ఉత్కర్ష ఎంత మంచి పదం .. దానికి కూడా ఇంచుమించు పెరుగుదల అనే అర్ధం వస్తుంది అనుకుంటాను .. సరైన చోట చేసుకొనే స్వోత్కర్ష .. ఉత్కర్ష గా ఉపయోగిస్తుంది. 

అప్పుడు గుర్తింపు కోసం బయటికి చూడటం ఆపేస్తాం ... ఆ ఆరాటం బాగా తగ్గుతుంది. ఎందుకంటే మనలోని చిన్నారికి ముందు కావాల్సింది మనం పట్టించుకోవడమే కదా. డబ్బు డబ్బుని ఆకర్షిస్తుంది అంటారు. రెండు నెలలు జీతం బ్యాంకు లో పడగానే మేము అప్పిస్తాం అంటే మేము అప్పిస్తాం అంటూ వచ్చేస్తారు! అలాగే డబ్బుల్లేని వాళ్ళకి చెప్పని ఎన్నో స్కీమ్ లు ఇంటికొచ్చి మరీ చెప్తారు. 

గుర్తింపు విషయం లో ఒకంత వరకూ అది వర్తిస్తుంది. ఆరాటం మానేసి, మనని మనమే అభినందించుకుంటున్నందుకు తృప్తి గా ఉండటం మొదలవ్వగానే బయట నుంచి కాంప్లిమెంట్స్ అవే మొదలవుతాయి! 

పోనీ ఆలా జరగక .. ఎవరూ మనని మెచ్చి మేక తోలు కప్పకపోయినా .. మన మెడ లో మనమే అల్లి వేసుకున్న అభినందన మందార మాల ఉండనే ఉంది! ఈ మందారాలకి గుబాళింపు ఉంటుందండోయ్ ... అది మన పరిపూర్ణ వ్యక్తిత్వం తాలూకు సువాసన! 

Saturday, April 4, 2020

'కోట్ల' ఆస్తి

స్కూల్ లో కొటేషన్స్ సేకరించే అలవాటుండేది నాకు. ఎక్కడెక్కడ కనిపించినవి, వినిపించినవి ముందు రఫ్ గా రాసేసుకొని ఒక పుస్తకం లో తర్వాత నీట్ గా కాపీ చేసుకొనే దాన్ని. ఇంగ్లీష్ లిటరేచర్ చదవాలని కోరిక ఆ కోట్స్ వల్లే కలిగిందని చెప్పచ్చు. ఆ రచయితల చిన్న వాక్యాలే ఇంత బాగుంటే పూర్తి రచన ఇంకా ఎంత బాగుంటుందో అనే కుతూహలం తోనే ఎమ్మే ఇంగ్లీష్ చేసాన్నేను.

ఇప్పటికీ కంటికి ఓ కొటేషన్ కనిపిస్తే, నాకు నచ్చితే ఏదో ఒక రకంగా రికార్డ్ చేసుకుంటాను ... ఇమేజ్ గానో, స్క్రీన్ షాట్ గానో.. ఏదో ఒక పుస్తకం లోనో.

అక్షరం యొక్క విశ్వ రూపం ఈ కొటేషన్స్ లోనే కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు. కేవలం కొన్ని పదాల లో ఒక మనిషిని ఉత్తేజపరచడమో, ధైర్యం చెప్పడమో, నవ్వించడమో, దిశా నిర్దేశం చేయడమో, దిగంతలకావల ఉన్న ప్రపంచాన్ని పరిచయం చేయడమో చేసేస్తాయి ఇవి.

చరిత్ర లో కొంత మంది గొప్ప వాళ్ళు తమ అనుభవ సారాన్ని రంగరించి చెప్పిన పంచ్ డైలాగులే కదా కొటేషన్లంటే!

నాకు కొటేషన్లు ఆసక్తి కరమైన థియరీలని, కొంత మంది మేధావులని, వారు ఆలోచించే తీరు తెన్నుల్ని పరిచయం చేశాయి. ఈ కొటేషన్స్ కాల్పనిక సాహిత్యం.. అంటే నవలలు, చిన్న కథల నుంచి తీసుకున్నవి కావు. ఆ వ్యక్తులు రచించిన నాన్ ఫిక్షన్ పుస్తకాలు, ప్రసంగాలు, ఛలోక్తులు, సంభాషణల నుంచి బయటికి వచ్చి పాపులర్ అయినవి. నాకు నచ్చిన, నా జీవితాన్ని, ఆలోచనలని ప్రభావితం చేసిన కొటేషన్స్ కొన్ని.

"What you seek is seeking you" 

- Rumi

రూమి ని నాకు పరిచయం చేసిన కొటేషన్ ఇది. "నువ్వు వెతికేది నిన్ను వెతుకుతోంది". జీవితం లో ఎన్నిటి వెనకో పరుగు తీస్తాం ... అది కావాలి ఇది కావాలి అని ... అలా పరుగులు తీసినందుకు గిల్టీ కూడా ఫీలవుతాం ఒక్కోసారి .. అది దొరకడం ఆలస్యమైతే నిరుత్సాహపడిపోతాం ... కానీ సినిమాలో చూపించినట్టు నువ్విటు నుంచి పరిగెడుతుంటే నువ్వు కోరుకున్నది అటు నుంచి పరిగెడుతోంది అని తెలిస్తే ఎంత ఆనందం కలుగుతుంది! ఒక్క మాట లో చెప్పాలంటే మనం ప్రేమించిన వ్యక్తి మనని తిరిగి ప్రేమిస్తున్నారని తెలిస్తే కలిగే ఆనందం. అంతే.

"As I walked out the door toward the gate
that would lead to my freedom, 

I knew if I didn't leave my bitterness and hatred behind, 
I'd still be in prison."
- Nelson mandela 


ఓ జాతి కి దాస్య విముక్తి గావించడానికి 27 సంవత్సరాలు జైలు లో మగ్గిన నెల్సన్ మండేలా విడుదలైనప్పుడు తన భావాలేంటో చెప్పిన కొటేషన్ ఇది. "జైలు గోడలు దాటి నా స్వేచ్ఛ కి దారి తీసే ద్వారం వైపు నడుస్తుంటే నాకు తెలిసింది ... నా అనుభవాల తాలూకు చేదుని, ద్వేషాన్ని అక్కడే వదిలేయకపోతే నేనింకా జైల్లోనే ఉన్నట్టు అని."

ఒకరి కష్టాలు ఇంకొకరి తో ఎప్పుడూ పోల్చుకోకూడదు కానీ ఆ అనుభవ సారాన్ని మనకి తప్పక అన్వయించుకోవచ్చు. ఒక చీకటి అనుభవం అంతమయ్యాక ఎంత ఆరోగ్యంగా దాన్ని ప్రాసెస్ చేసుకోవచ్చో ఈ కొటేషన్ చెప్తుంది.


"Darkness cannot drive out darkness; 
only light can do that.
Hate cannot drive out hate; 

only love can do that."
- Martin Luther King Jr


"చీకటి చీకటిని తరిమేయలేదు; ఆ పని కాంతి మాత్రమే చేయగలదు. ద్వేషం ద్వేషాన్ని తరిమేయలేదు; ఆ పని ప్రేమ మాత్రమే చేయగలదు" - మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.  నల్లవారి కష్టాలు కష్టాలు కాదు బాబోయ్. అలాంటిది కొన్ని తరాల పాటు అణగదొక్కేయబడినా కూడా సులువుగా వచ్చే ఆగ్రహం, తిరుగుబాటు, ప్రతీకార కాంక్ష, హింసా ప్రవృత్తి .. వీటన్నిటికీ అతీతంగా ఇలా ఆలోచించగలిగారంటే గొప్పే కదా.

"If you want your children to be intelligent, 
read them fairy tales.
If you want them to be very intelligent, 

read them more fairy tales." 
- Einstein


మీ పిల్లలు తెలివి గా పెరగాలంటే వారికి కథలు చదివి వినిపించండి. చాలా తెలివి గల వారవ్వాలంటే బోల్డు కథలు వినిపించండి" - ఐన్ స్టీన్

భూమి మీద తిరిగిన మేధావుల లో ఐన్ స్టీన్ ఒకరు అంటారు. ఆయన చెప్పిన సలహా తెలివితక్కువది అయితే అవ్వదు కదా. మన దేశం లో అపారమైన కథా సంపద ఉంది .. జానపదమైతే నేమి .. పురాణాల నుంచి అయితే నేమి. ప్రతి సంస్కృతి కి వారి కథలు వారికున్నాయి. అవి పిల్లలకి తెలియడం చాలా చాలా ముఖ్యం. (తెలివి పెరుగుతుంది అని నమ్మిస్తే పాలలో కలిపే పొడి ఎంత ఖరీదైన కొనేస్తున్నాం కదా. ఇది ట్రై చెయ్యడం లో నష్టం లేదనుకుంటా. ) 

నా అంతట నేను పుస్తకాలు చదివి అర్ధం చేస్కోవడం వచ్చే దాకా నేను రకరకాల కథలు విన్నాను .. నా కుటుంబం లో పెద్దల దగ్గర్నుంచి. ఇది నా అదృష్టాలలో ఒకటి గా లెక్కిస్తాను. ఎమ్మే ఇంగ్లీష్ లో మొదటి పాఠం సెనెకా రాసిన ఫీడ్రా అనే నాటకం. ఆ కథ విని 'అరె ... ఇది అచ్చు చిత్రాంగి సారంగధర కథ లాగానే ఉందే' అనిపించింది ... ఇంక పురాణ గాథలు అయితే చెప్పనక్కర్లేదు. శాస్త్ర నిర్ధారణ ప్రయోజనాల కోసం వినయశీలత ని కాసేపు పక్కన పెట్టి నేను తెలివి గానే పెరిగానని ఒప్పుకోవచ్చు. హెన్స్ ప్రూవ్డ్. 


"I did then what I knew how to do. 
Now that I know better, I do better."
- Maya Angelou

అన్నీ తెలిసిన వారు ఎవరూ ఉండరు. కాలం, అనుభవం... వీటి వల్ల కొన్ని తెలిసొస్తాయి. మరి అప్పుడు అలా ఎందుకు చేసావు అన్న దానికి మాయ ఆంజెలు ఇచ్చిన సరళమైన సమాధానం "అప్పుడు నాకు తెలిసింది నేను చేసాను. ఇప్పుడు నాకు ఇంకా బాగా తెలుసు కాబట్టి ఇంకా బాగా చేస్తాను." 

"I am not afraid of an opponent 
who practiced ten thousand kicks once. 
What I am afraid of is an opponent 
who practiced one kick, 
ten thousand times."
- Bruce Lee


మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని తరాలని ప్రభావితం చేసిన బ్రూస్ లీ చెప్పిన కొటేషన్ ఇది. "పది వేల కిక్కులు ఒక సారి సాధన చేసిన ప్రత్యర్థి అంటే నాకు భయం లేదు. ఒకే కిక్కు ని పదివేల సార్లు సాధన చేసిన ప్రత్యర్థి అంటేనే భయం". సాధన విషయం లో ఎంతో ఉపయోగపడే మాట ఇది.


"Tradition is not the worship of ashes, 
but the preservation of fire."
- Gustav Mahler
మా తరం, మా తర్వాతి తరాల వారు మన సంప్రదాయాలను అర్ధం చేసుకోవడానికి ప్రయతిస్తున్నాం... ఏవి ఎందుకు పుట్టాయి, ఎందుకు పాటించాలి, వేటికి కాలం చెల్లింది... ఇలాంటి ప్రశ్నలు వేస్కుంటున్నాం ... ముఖ్యంగా ఈ క్వారంటీన్, సామాజిక దూరం .. ఇవన్నీ పాటించవలసిన సమయం లో 'మడి' ఎలా పుట్టిందో అర్ధమవుతోంది ... ప్రతీది చేతికి తీసుకోకపోవడం, నీళ్లు చల్లుకోవడం... అమానవీయ కోణాలు రాకముందు సంప్రదాయం ఎలా ఉంది అని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాం .... ఇటువంటి తరుణం లో ఈ కొటేషన్ ఎంతో సాయపడుతుంది ... "సంప్రదాయం అంటే బూడిద ని కొలవడం కాదు, అగ్ని ని పరిరక్షించడం".

"People often say motivation doesn't last.
Neither does bathing—that's why 

we recommend it daily."
- Zig Ziglar


పర్సనాలిటీ డెవలప్మెంట్ గురు అయిన జిగ్ జిగ్లర్ చెప్పిన మాట ఇది. నాకు భలే నవ్వొస్తుంది ఇది చదివితే. "మోటివేషన్ (ప్రేరణ, దాని తాలూకు ఉత్సాహం) ఎక్కువ కాలం నిలవట్లేదు అంటుంటారు జనం. స్నానం కూడా అంతే కదా ... అందుకే కదా రోజూ చేయమని చెప్తాము" అంటాడాయన!

నేను కొటేషన్స్ కలెక్ట్ చేస్తానని తెలిసి జోషి సార్ అని మా ఫిజిక్స్ మాస్టారు నాకు తెచ్చిచ్చిన కొటేషన్ ఇది (ఇలాంటి టీచర్లందరికీ వందనాలు).

"Man is a complex being; 
he makes deserts bloom - and lakes die" 
- Gil Scott Heron 

మనిషి ఓ సంక్లిష్ట జీవి; ఎడారులను పూయిస్తాడు - తటాకాలను ఎండగొట్టేస్తాడు. ఇది స్కూల్ లో అర్ధం కాలేదు. తర్వాత అర్ధం అయింది.

కొటేషన్ల విషయంలో కొన్ని కాట్రవర్సీలు కూడా ఉన్నాయి .. ఆ మాట అసలు ఆయన/ఆవిడ అననే లేదు లాంటివి ... ఫ్రెంచి మహారాణి అయినా 'మారి ఆంట్వానెట్' (Marie Antoinette) కొటేషన్ కథ అయితే ఫ్రెంచి విప్లవాన్నే రగిల్చింది ... 'మహారాణి .. జనాలు బ్రెడ్ (రొట్టె) లేక మలమలా మాడిపోతున్నారు' అని మంత్రులు విన్నవించుకుంటే 'అయితే కేక్ తినమనండి' అందట ఆవిడ... ఇది విని అసలే ఘోర పరిస్థితుల్లో ఉన్న జనం రెచ్చిపోయి రాచకుటుంబాన్ని ఊచకోత కోసేశారు. నిజానికి ఆవిడ ఆ మాట అననే లేదట.

ఈ రోజు ఈ టాపిక్ రాసే ముందు నా హోమ్ వర్క్ నేను చేసుకుంటుండగా నాకు తెలిసింది .. నాకు నచ్చిన రచయితల కొటేషన్లు సగం అసలు వాళ్ళు చెప్పినవి కావని... మార్క్ ట్వేయిన్, బెర్నార్డ్ షా, ఆస్కర్ వైల్డ్ వి అని చెప్పబడుతున్న కొన్ని మాటలు వారివే కాదట.

కోట్ ఇన్వెస్టిగేటర్ అని ఒక వెబ్ సైట్ ఉంది ... వారు చక్కగా మనం సబ్మిట్ చేసిన కోట్ చరిత్ర అంతా కూపీ లాగి ఈ వివరాలు చెప్తున్నారు.

అందుకే ఈ రోజు నాకు తెలిసినంత వరకూ వారే చెప్పారని రూఢి అయిన కోట్లు ఇక్కడ రాసాను. ఎప్పుడైనా వీటిలో కూడా ఏవైనా తప్పులు దొర్లాయి అని తెలిస్తే పైన రాసిన మాయ ఆంజెలు కొటేషన్ చెప్పుకుని తల మీద నీళ్లు చల్లుకుంటాను. 

Maya Angelou - మాయ ఆంజెలు
Pic Courtesy: Flickr.com

ఇంకా చాలా చాలా కొటేషన్లు ఉన్నాయండి బాబు .. ఇవి కేవలం ఇంగ్లీష్ వి. మన భారత దేశం లో గొప్ప వారు చెప్పినవి, ఇంక తెలుగు లో కి వస్తే ఎన్నో ఉన్నాయి. అలాగే నా ఫేవరేట్ కేటగిరి అయిన ఫన్నీ కోట్స్ కి నేను రానే లేదు ...


టైటిల్ లో చెప్పినట్టు కొన్ని తరాలు కూర్చొని 'విన్నా' తరగని 'కోట్ల' ఆస్తి ఇది!

Saturday, March 28, 2020

రొటీన్ కి భిన్నం గా ...

నేనేంటో సరదాగా సినిమా చూడలేను ... 

ఏ స్టైల్ బట్టలు వేసుకోవాలో ముందే ఆలోచించుకొని అలాంటివి ఎక్కడ దొరుకుతాయో రీసెర్చ్ చేసి, వీలైతే  ట్రై చేసి, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని, బడ్జెట్ కి కరెక్ట్ గా ఫిట్ అయ్యేవే ఎలా సెలెక్ట్ చేస్కుంటానో సినిమాల కి కూడా అంతే ప్రాసెస్ ఫాలో అవుతాను. (నోట్ టు సెల్ఫ్: నేను అసలు ఏ పనైనా సరదాగా, లైట్ గా చేస్తానా? ఆలోచించాలి.) 

దీన్ని పర్ఫెక్షనిజం అనచ్చు, చాదస్తం అనచ్చు... కానీ నిజం ఏంటంటే నాకు నచ్చని సినిమాలు భరించే/సహించే శక్తి తక్కువ. కొంతమంది లైట్ గా ఏదైనా చూసి వచ్చెయ్యగలరు. ఇదో సూపర్ పవర్ నా ఉద్దేశం లో. నాకది లేదు కాబట్టి, ముందు ఆ సినిమా ట్రైలర్ చూసి, కథ తెలుసుకొని, ఇంటర్వ్యూలు చూసి, ఒక్కోసారి నేను ఎవరి అభిప్రాయాలని గౌరవిస్తానో వాళ్ళు కూడా స్టాంప్ వేసాక గానీ నేను ఓ సినిమా చూడను. ఈ లోగా కొత్త సినిమా అయితే థియేటర్ లోంచి వెళ్ళిపోతుంది అనే భయం అక్కర్లేదు .. ఇన్ని ఫిల్టర్ లు దాటిన సినిమా ఆడుతూ ఉంటుంది ఇంకా థియేటర్ల లో. అప్పుడు వెళ్లి చూస్తాను. పాత సినిమా అయితే అది వెబ్ ప్లాట్ఫారం లో వచ్చాక చూస్తూ ఉంటాను. ఇలా చూసిన సినిమాలన్నీ పూర్తిగా ఎంజాయ్ చేసాన్నేను.

ఒకటి రెండు సందర్భాల లో మొహమాటం కోసం సినిమాలు చూడాల్సి వచ్చింది. అందులో ఒకటి మంచిదే కానీ నాకు థియేటర్ లో నచ్చలేదు ఆ సినిమా.. తర్వాత మళ్ళీ చూసా .. పర్సనల్ గా .. అప్పుడు చాలా నచ్చింది. ఇంకో సినిమా నా సహనానికి పరీక్ష పెట్టింది. ఇంకేం చెయ్యడానికి తోచక ఆ రోజు థియేటర్ లో ఎప్పుడూ తిననంత పాపకార్న్, ఎప్పుడూ తాగనంత కోక్ తాగేసాను .. అదే ఆఖరు ... ఇంకెప్పుడూ మొహమాటానికి సినిమా చూడలేదు.

సినిమా ఎంత మాస్ మీడియమో అంతే పర్సనల్ మీడియం అని అనిపిస్తుంది నాకు. అందరూ సినిమా ఒకేలా చూడరు. వాళ్ళకి అందులో ఏదో ఒక పాయింట్ నచ్చుతుంది .. అది వాళ్ళు అనుభవించింది అయ్యుండచ్చు, ఇంకేదైనా విధంగా వారిని తాకి ఉండచ్చు. అప్పుడే ఓ సినిమా ఒకరి ఫేవరేట్ సినిమా అవుతుంది.

అలాంటి సినిమాల లిస్ట్ మనందరి దగ్గరా ఒకటి ఉంటుంది. నా లిస్ట్ లో ఓ సినిమా గురించి ఈ రోజు.

1993 లో ఓ ఇంగ్లీష్ సినిమా వచ్చింది.... దాని పేరు 'గ్రౌండ్ హాగ్ డే' Groundhog Day

నేను చూసింది మాత్రం 2012 తర్వాత ఎప్పుడో. ఎప్పుడు, ఎక్కడ, ఏ మాధ్యమం లో చూశానో గుర్తులేదు కానీ సినిమా మాత్రం గుర్తుండిపోయింది. దాని కథ అలాంటిది!

(ఆ సినిమా డైరెక్టర్ (Harold Ramis), రచయిత (Danny Rubin) ... వీళ్ళ సినిమాలు నాకు అంతగా పరిచయం లేవు. ప్రధాన తారాగణం అయిన బిల్ మర్రే (Bill Murray), ఆండీ మెక్ డవెల్ (Andie McDowell) వి ఒకటి రెండు సినిమాలు చూసా అంతే.)

ఇదో ఫాంటసీ కామెడీ.

Groundhog Day (1993) - IMDb
No copyright infringement intended 

'ఫిల్' అనే వ్యక్తి అమెరికా లో పెన్సిల్వేనియా రాష్ట్రం, పిట్స్ బర్గ్ లో ఓ న్యూస్ ఛానల్ లో వెదర్ మాన్ (వాతావరణ నిపుణుడు). పొగరు, సుపీరియారిటీ కాంప్లెక్స్, పని చేస్తున్న ఛానెల్ అన్నా, కొలీగ్స్ అన్నా చులకన. సినిమా ప్రారంభం లోనే ఓ మంచు తుఫాను వారి రాష్ట్రం తాకకుండా వెళ్ళిపోతుంది అని ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పేస్తాడు.

అదే రోజు ఆ రాష్ట్రం లో ఉన్న 'పక్సిటానీ' అనే చిన్న ఊరికి అతను, అతని ప్రొడ్యూసర్ 'రీటా', కెమెరామన్ 'లారీ' ముగ్గురూ ఓ ఈవెంట్ కవర్ చెయ్యడానికి  బయల్దేరతారు.

ఆ మర్నాడే  అంటే ఫిబ్రవరి 2 - గ్రౌండ్ హాగ్ డే. గ్రౌండ్ హాగ్ అంటే ఉడత జాతికి చెందిన ఓ జంతువు .. ఉడత కంటే పెద్దది గా ఉంటుంది. గ్రౌండ్ హాగ్ డే నాడు ఆ పల్లె వారందరూ ఒక చోట చేరతారు. వారి ఊరి ఉడత అయిన 'ఫిల్' (ఉడత పేరు కూడా ఫిల్ ఏ) ఆ రోజు  తన కలుగు లోంచి బయటికి వస్తుంది. ఈ ఉడత తన నీడ తను చూస్కుంటే శీతాకాలం ఇంకో ఆరు వారలు కొనసాగుతుంది ... నీడ కనిపించక అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే వసంత ఋతువు త్వరగా రాబోతోందన్నమాట. ఇది అక్కడి వారి నమ్మకం.

ఇదంతా కల్పితం కాదు. పెన్సిల్వేనియా లో ఈ ఊరు ఉంది ... ఈ సంప్రదాయం ఉంది ... ఈ సినిమా తీసే ముందు మహా అయితే 2000 మంది ఈ వేడుక లో పాల్గొనేవారట ... సినిమా తర్వాత ఇదొక పర్యాటక కేంద్రం అయిందట!

ఇంతకీ ఫిల్ కి ఆ ఊరన్నా, ఈ సంప్రదాయం అన్నా చులకన. వాళ్ళని పల్లెటూరి బైతులంటాడు. అప్పటికే కొన్నేళ్లు నుంచి అతను ఇదే రోజున ఇదే ఈవెంట్ రిపోర్ట్ చేస్తూ ఉండటం అతనికి ఇంకా విసుగు పుట్టిస్తుంది. అతని ప్రొడ్యూసర్ రీటా చాలా మంచమ్మాయి. ఆ అమ్మాయి కి ఈ వేడుక అంత తమాషా గా అనిపిస్తుంది.

పొద్దున్న ఈ పని చూసేస్కోని ఇంకొక్క క్షణం ఆ పల్లెటూరు లో ఉండకుండా మళ్ళీ పిట్స్ బర్గ్ వెళ్లిపోవాలని ఫిల్ తాపత్రయం.  సాయంత్రం వరకూ ఉండి మిగిలిన చిన్న చిన్న ఈవెంట్స్ కూడా కవర్ చేద్దామనే ఉత్సాహం లో ఉంటుంది రీటా.

ఫిల్ కి రీటా అంటే గౌరవం ఏ మాత్రం లేదు. పైగా అభ్యంతరకరంగా మాట్లాడుతుంటాడు కూడా. ఇతని గురించి బాగా  తెలిసిన ఆమె మాత్రం అతని వెకిలి మాటలు భరిస్తూ, అతని పొగరు సహిస్తూ ప్రొఫెషనల్ గా ఉంటుంది.

సరే, తెల్లారుతుంది .. ఫిబ్రవరి 2, గ్రౌండ్ హాగ్ డే ... అలారం మోగుతుంది .. ఎఫ్ ఎం రేడియో మొదలవుతుంది ... ఆ రోజు విశేషం గురించి ఇద్దరు ఆర్జే లు మాట్లాడుతుంటారు, ఫిల్ లేచి తయారయి ఈవెంట్ జరిగే చోటుకి బయల్దేరతాడు ... దారి లో ఇద్దరు ముగ్గురు తటస్థ పడతారు ..  రూమ్ బయట ఒకాయన సరదాగా ఏదో అంటాడు, హోటల్ హోస్టెస్ ఆత్మీయంగా ఏదో మాట్లాడుతుంది ... ఓ చిన్నప్పటి ఫ్రెండ్ కలుస్తాడు (ఇతను గుర్తుపట్టడు అతన్ని), ఓ బిచ్చగాడు కనిపిస్తాడు (అతనికి ఇతనేం ఇవ్వడు) ... ఈవెంట్ జరిగే చోటుకి వెళ్లి వ్యంగ్యం గా ఓ రెండు మాటలు చెప్పి రిపోర్ట్ పూర్తి చేస్తాడు. వెంటనే తిరిగి వెళ్లిపోవాలని బయల్దేరతారు కానీ ఏ మంచు తుఫాను తమ రాష్ట్రాన్ని తాకదని చెప్పాడో దాని వల్ల హైవేలు మూసివేయబడతాయి. మళ్ళీ పల్లెటూరి కి తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇతని ఆటిట్యూడ్ ఇంకా పెంకి గా ఉంటుంది ఆ పరిస్థితిలో.

మొత్తానికి ఆ రోజు అయిందనిపిస్తాడు. మర్నాడు అలారం మోగుతుంది. ఎఫ్ ఎం రేడియో మొదలవుతుంది ...ముందు రోజు విన్న మాటలే మళ్ళీ వస్తూ ఉంటాయి .. నిన్నటి టేప్ ప్లే చేస్తున్నారేమో అనుకుంటాడు ... అన్నీ సరిగ్గా ముందు రోజు జరిగినట్టే జరుగుతాయి. మళ్ళీ ఆ వ్యక్తులే తటస్థ పడతారు ... అవే పలకరింపులు ... అవే మాటలు ... కలగంటున్నాడా లేక ఇదంతా నిజమా అనే అయోమయం లో ఆ రోజు గడిచిపోతుంది. తెల్లవారుతుంది. అలారం మోగుతుంది. మళ్ళీ అవే మాటలు రేడియో లోంచి.

ఇలా అతను గ్రౌండ్ హాగ్ డే ని లెక్కలేనన్ని సార్లు గడుపుతూ ఉంటాడు. 

ముందు కొన్ని రోజులు అయోమయం లో ఉంటాడు. తర్వాత అతనికి అనిపిస్తుంది ... రోజు రీసెట్ అయిపోతోంది అంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని. దొంగతనాలు చేస్తాడు, అరెస్ట్ అవుతాడు, ఓ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ ఓ సారి కనుక్కుంటాడు .. ఇంకోసారి రోజు రీప్లే అయిపోయినప్పుడు ఆ అమ్మాయి తనకి ఎప్పటినుంచో తెలిసినట్టుగా మాట్లాడి ఆమెని బుట్టలో పడేస్తాడు.

ఇదే టాక్టిక్ రీటా మీద కూడా ఉపయోగిస్తాడు .. ఆమెని డేట్ కి తీసుకెళ్లి ఒక్కోసారి ఒక్కో తప్పు చేసి మళ్ళీ డే రీప్లే అయినప్పుడు ఆ తప్పు సవరించుకొని స్టెప్ బై స్టెప్ ఆమె కి దగ్గరవుదామనుకుంటాడు. ఒక స్టేజి వరకూ ఈ పన్నాగం పారుతుంది కానీ ఆ అమ్మాయి కి ఇతనిది ప్రేమ కాదు అని తెలిసిపోతూ ఉంటుంది.... ప్రతి సారి. ఆమె చేతిలో కొన్ని వందల చెంప దెబ్బలు తింటాడు. ఆమె కి నిజం చెప్తాడు ఓ రోజు .. తను చిక్కుకున్న టైం లూప్ (సమయ వలయం) గురించి .. ఆమె అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది కానీ మళ్ళీ మర్నాడు అంతా మామూలే. కానీ ఆమె వ్యక్తితం పూర్తిగా తెలుసుకున్న అతనికి ఆమె అంటే ప్రేమ ఏర్పడుతుంది.

ఇక్కడి నుంచి అతనికి అలుపొచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే రోజు .. అదే ఊరు, అవే సంఘటనలు .. ఇలా కాదని ఓ సారి ఆ ఉడత ని తీస్కొని కారు ని ఓ కొండ మీదనుంచి కిందకి క్రాష్ చేసేస్తాడు. కారు నిప్పంటుకొని కాలిపోతుంది. అతను చనిపోతాడు. కానీ మళ్ళీ మర్నాడు అలారం మోగే అప్పటికి మళ్ళీ బతుకుతూ ఉంటాడు.

చాలా సార్లు ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. కానీ మళ్ళీ మర్నాడు బ్రతికే ఉంటాడు.

ఇంక ఆత్మహత్య పనికి రాదని తెలిసి అతనిలో ఏదో మార్పు మొదలవుతుంది. ఓ పియానో టీచర్ దగ్గరకి వెళ్లి పియానో లెసన్స్ నేర్చుకోవడం మొదలుపెడతాడు, మంచు శిల్పాలు చేయడం నేర్చుకుంటూ ఉంటాడు, తనకి ఇన్ని రోజుల్లో తెలిసిన సమాచారాన్ని మంచి కి ఉపయోగించడం మొదలుపెడతాడు .. వృద్ధ మహిళల కారు టైర్ రిపేర్ చేస్తాడు, ఒక పిల్లవాడు చెట్టు మీద నుంచి పడిపోయే సమయానికి కింద ఉండి పట్టుకుంటూ ఉంటాడు, ఒకాయన కి హార్ట్ అటాక్ రాబోతోందని ముందే తెలుసు కాబట్టి అతని ప్రాణం కాపాడతాడు ...

అతని చిన్న నాటి మిత్రుడి తో మునుపటి లాగా కాక ఆత్మీయంగా మాట్లాడతాడు ... అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అని తెలిసి అన్ని ఇన్షురెన్సులు కొనేస్తాడు... పియానో అద్భుతంగా వాయించేస్తూ ఉంటాడు, మంచు శిల్పాలు చేయడం లో కూడా చేయి తిరిగిపోతూ ఉంటుంది అతనికి .... అదే రోజు మళ్ళీ మళ్ళీ జీవించినా దాన్ని ఎంత బాగా జీవించవచ్చో తెలుసుకుంటాడు.

కాకపోతే ఇన్ని పనులలో రెండు అతను కంట్రోల్ చెయ్యలేకపోతాడు. ఒకటి, రీటా తనని ప్రేమించేలా చేయలేకపోతాడు. తను డబ్బులివ్వని బిచ్చగాడి మరణం ఆపలేకపోతాడు ... అప్పటికీ అతన్ని ఓ సారి ఆసుపత్రి లో జాయిన్ చేస్తాడు, తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తాడు, హోటల్ కి తీసుకెళ్లి కడుపు నిండా వేడి వేడి ఆహరం పెట్టిస్తాడు.... ఎన్ని చేసినా ఆ బిచ్చగాడు ఆ రాత్రి మరణిస్తూనే ఉంటాడు.

తన అదుపు లో లేని సమయం అతనికి acceptance, వినయం నేర్పిస్తుంది. కళ సహనం నేర్పిస్తుంది. ఆ బిచ్చగాడి మరణం జీవితం గురించి నేర్పిస్తుంది.

ఇప్పుడు ఫిల్ పూర్తిగా మారిన మనిషి. ఈ సారి రిపోర్టింగ్ కి వెళ్ళే అప్పుడు లారీ కి, రీటా కి వేడి వేడి  కాఫీ (వాళ్ళకి  నచ్చినది), స్నాక్స్ తీసుకెళ్తాడు. అదే రిపోర్ట్ ఎంతో భావుకత్వం తో చెప్తాడు. రీటా, లారీ ల తో గౌరవం గా మాట్లాడతాడు. 24 గంటల్లో ఈ మార్పు ఏంటని ఇద్దరూ ఆశ్చర్యపోతారు.

రీటా అతని తో రోజంతా గడుపుతుంది. అతను ఆమె ని ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయాస పడడు. ఆమె రూపం తో ఓ మంచు శిల్పం చేస్తాడు. 'రేపు ఎలా ఉన్నా, ఈ రోజు నేను ఆనందంగా ఉన్నాను ... ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను' అంటాడు. అతని లో మొదటి సారి నిజాయితీ చూస్తుంది రీటా. ఇద్దరూ ఫిల్ హోటల్ రూమ్ కి వెళ్తారు. కబుర్ల తో నే రాత్రి గడిచిపోతుంది.  అతను అలిసిపోయి నిద్రపోతాడు.

తెల్లవారుతుంది ... అలారం మోగుతుంది .. ఈ సారి ఆర్జే మాటలు మారతాయి .. అతను పక్కన చూస్తే రీటా పడుకొని ఉంటుంది .. అతనికి అర్ధం అవుతుంది ... తాను ఆ వలయం నుంచి బయటికి వచ్చేసా అని. ఆ పల్లెటూరి లో నే ఆమె తో ఉండిపోవాలని ఉంది అని ఫిల్ చెప్పడం తో సినిమా ముగుస్తుంది.

నాకు ఇష్టమైన సినిమాల టాప్ టెన్ లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసే నాటికి నేను కూడా ఓ టైం లూప్ లో ఉన్నా అనిపించేది నాకు. అసలు టైం లూప్ అంటూ ఒకటి ఉంటుందని ... జీవితం నిస్సారమైనప్పుడు అలా అందరికీ అనిపిస్తుందని ... అలాంటప్పుడు జీవితం లో మళ్ళీ సారం నింపడం మన చేతిలోనే ఉందని ఈ సినిమా చెప్పింది నాకు. నన్ను పూర్తిగా ఇంప్రెస్ చేసిన పాయింట్ మాత్రం ఫిల్ పియానో, శిల్ప కళ నేర్చుకోవడం ... కళలు సాధన చేసిన వారికే తెలుస్తుంది ఈ పాయింట్.

జీవితం లో ఖాళీ ని కళ చాలా బాగా పూరిస్తుంది .. ఓ కళ ని సాధన చెయ్యాలంటే కొన్ని గంటల సమయం అవసరం ... పైగా ఆ సమయం భారీ గా కాక తన లో పూర్తి గా లీనమయ్యే లా, ప్రపంచాన్ని, చుట్టూ ఉన్న దుర్భర పరిస్థితులని మర్చిపోయేలా చేయగలదు కళ.

అలాగే పక్కవారికి సాయపడటం .. ఇది కూడా కళ లాంటిదే ... మన జీవితానికి మనకే తెలియని సార్ధకత చేకూరుస్తుందిది.

చివరికి అతను 'నేడు' లోనే జీవించాలని తెలుసుకుంటాడు ... అది ఇంకో అందమైన కోణం.

ఈ సినిమా తర్వాత ఈ పేరు నే రొటీన్ లైఫ్ కి మారుపేరు గా ఉపయోగించడం మొదలుపెట్టారట!

బోర్ కొడుతున్న జీవితాలన్నీ గ్రౌండ్ హాగ్ డేస్ ఏ అయితే, ఆ వలయం నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలో తెలుసు కదా?

Saturday, March 21, 2020

పోస్ట్!

ఒక కష్టం వచ్చింది.

ఒక రోజు గడిచింది... రెండు రోజులు... వారం ... నెల .. గడిచిపోయాయి. పోవట్లేదు. ఇబ్బంది పెట్టేస్తోంది.

మనకి తోచినవన్నీ చేసి చూసాం. అయినా లాభం లేదు. మొండిగా అలానే ఉంది. (లేదా ఇంకా పెరుగుతోంది)

ఏం చేయాలి?
ఒక సిద్ధాంతం ఉంది.

(సిద్ధాంతం ఏంటో చెప్పే ముందు కొన్ని హెచ్చరికలు. మనలో ప్రతి ఒక్కరం మన జీవితానుభవాలు మలిచిన మూర్తులము. ఒకరి వ్యక్తిత్వం ఇంకొకరితో పోలదు. జీవితమంతా నిరర్థకమైన సంఘటనల సమాహారం, మనమే వ్యర్ధంగా దానిలో అర్ధం వెతుక్కుంటాం అని అనుకొనే వారికి ఈ సిద్ధాంతం నచ్చకపోవచ్చు. ఇంకా ఎన్నో మనస్తత్వాల కి ఇది సయించకపోవచ్చు. ఐ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండ్.

నా పంథా ఏంటంటే, ఎప్పుడైనా ఓ సిద్ధాంతం ప్రతిపాదిస్తే దాన్ని వాడి చూడాలి. మనకి పనికొస్తేనే నమ్మాలి. లేకపోతే అది మన సిద్ధాంతం కాదన్నమాట. ఏం ఫర్వాలేదు .. ఈ ప్రపంచం లో శతకోటి కి అనంతకోటి.)

మనని ఇబ్బంది పెడుతున్నది ఏదైనా .. బయట నుంచి వచ్చిన కష్టమైనా, ఓ వ్యక్తయినా, అనారోగ్యమైనా, ఆర్ధిక ఇబ్బందైనా, మన లో ఉన్న ఆంగ్జైటీ, డిప్రెషన్, అణుచుకోలేని కోరికలు, ఒకరి ని చూస్తే కలిగే అసూయ, ఏహ్య భావన, ... ఏవైనా ...

అవి నాకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి అని అడగాలట.

ఈ ప్రశ్న లో చాలా పవర్ ఉంది.

సమస్య ని ఓ రాక్షసుడి గా చిత్రీకరిస్తే మనలో ఉన్న ప్రాణి 'అయ్య బాబోయ్ ... పారిపో పారిపో" అనే చెప్తుంది. అందుకే మనం మన శక్తినంతా పారిపోడానికి ఉపయోగిస్తాం. ఆ సమస్య మనని వేటాడుతూనే ఉంటుంది. దీని వల్ల ప్రయోజనం సున్నా. పైగా అలిసిపోతాం.

అదే సమస్య ని పోస్ట్ మాన్ గా చిత్రీకరించుకుంటే? ఒక్క సారి ఊహించండి ... పోస్ట్ మాన్ నుంచి పారిపోతున్నాం మనం. పాపం అతనేమో మన చేతికే ఆ సందేశం ఇయ్యాలి కాబట్టి మన వెనక పరిగెడుతున్నాడు. ఆ ఉత్తరం మనకి అందించడమే అతని ఉద్యోగం. అందుకే అతను మనం ఉత్తరం తీసుకొనే దాకా వదలడు. ఇలా అనుకుంటే నవ్వొస్తుంది మన మీద మనకే. పరిగెత్తడం ఆపి ముందు ఉత్తరం తీసుకుంటాం.

ఇక్కడి నుంచి అసలు కష్టం మొదలవుతుంది.

ఆ ఉత్తరం లో ఎప్పుడూ మనకి రుచించే సమాచారం ఉండదు. ఇది గ్యారంటీ.

ఒక్కో సారి ఇన్స్టింక్టివ్ గా ...  అంతర్గతంగా ఆ సమాచారం ఏంటో మనకి తెలిసే ఉంటుంది. కోర్టు సమన్ల లాగా. క్రెడిట్ కార్డు బిల్లు/బ్యాంకు స్టేట్మెంట్ లాగా. ఏం నేరం చేసాం, ముందు వెనక చూడకుండా మనం ఎంత ఖర్చుపెట్టేసాం మనకు లోపల్లోపల తెలుసు. అందుకే వాటిని ఫేస్ చెయ్యాలంటే భయం.

ఒక్కోసారి తెలియదు.

ఏది ఏమైనా ఉత్తరం తీసుకోక తప్పదు.

సమాచారం దొరికాక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు ... వారి వారి స్వభావాలని బట్టి.

కొంతమంది కి కోపం రావచ్చు .. వారి మీద వారికే.

కొంత మంది సమస్య తాలూకు బాధ్యత తాము తీసుకోకుండా పరిస్థితులనీ, తమ చుట్టూ ఉన్న వారినీ బ్లేమ్ చెయ్యడం మొదలు పెట్టవచ్చు.

కొంత మంది డిప్రెషన్ లో కి వెళ్లిపోవచ్చు.

కొంత మంది ఆ ఇన్ఫర్మేషన్ ని హుందాగానే స్వీకరించారు గానీ వారికి ఆ సమస్య ఏం చెప్పడానికి ట్రై చేస్తోందో తట్టక పోవచ్చు.

కొంత మంది ... అసలు ఇది నా ఉత్తరం కాదు వేరే వాళ్లకి వెళ్ళాల్సింది అని చించి పారేయచ్చు .. దీన్నే denial .. తిరస్కృతి ... అని అంటారు. అంటే సమస్య ఉందనే ఒప్పుకోరన్నమాట.

కొంతమంది ఉత్తరం తర్వాత చదువుదాం అని పక్కన పెట్టేయచ్చు. ఇది బద్ధకం కాదు .. దాన్ని స్వీకరించడానికి కావాల్సిన శక్తి వారిలో ఆ టైం లో లేకపోవచ్చు.

ఇక్కడ మనం పెద్ద మనసు చేసుకొని అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ... పైన రియాక్షన్స్ లో ఏదీ తప్పు కాదు. అవి మొదటి మెట్టు కిందే లెక్కించాలి.

అక్కడే ఆగిపోకుండా ఇంకో అడుగు వేసినంత కాలం మన మనస్థితి ని బట్టి రియాక్ట్ అయ్యే హక్కు మనకి ఉంది.

మరి రెండో మెట్టు ఏంటి?

ఆత్మవంచన చేసుకోకుండా మన మొదటి రియాక్షన్ కి ఆరోగ్యకరంగా ఎంత టైం ఇవ్వాలో ఇవ్వడం.

ఆత్మవంచన చేసుకోకుండా అని ఎందుకన్నానంటే 'ఓకే .. ఈ టైం చాలు ..' అని అనిపించినా కూడా మొదటి మెట్టులో ఉండిపోకూడదు అని.

ఒక తమాషా ఏంటంటే కొన్ని సమస్యలకి అది ఉందని  ఒప్పుకోవడమే పరిష్కారం అట. అంటే మనం ఇంకేం చెయ్యక్కర్లేదన్నమాట ... కొంచెం సమయం, సహనం ఇస్తే దానంతట అదే సమసిపోతుందిట. అంటే కొన్ని రకాల సమస్యలకి రెండో మెట్టే ఆఖరి మెట్టు!

కొన్ని మొండివి ఉంటాయి .. వాటిని మనం ఎక్కువ కాలం అలక్ష్యం చేసేసాం. వాటికి మూడో మెట్టు అవసరం.

సమస్యలకి, మార్పు కి అవినాభావ సంబంధం ఉంది. నూటికి నూరు సార్లు ఈ మార్పు మనలో రావాల్సినదే.

ఈ మార్పు ఏంటి? దానికి ఎంత సమయం పడుతుంది? ఒక వేళ మార్పు మొదలైనా ఆ మార్పు చంచలం గా కాక స్థిరంగా ఉందా? అసలు ఆ మార్పు కి కావాల్సిన సంకల్పబలం, నిగ్రహం, ఆత్మబలం మనలో ఉన్నాయా? ఇవన్నీ ప్రతీ వ్యక్తీ తమతో తామే తేల్చుకోవాల్సిన విషయాలు.

కానీ ఒక్క విషయం అందరికీ వర్తిస్తుంది. ఈ మెట్లు ఎక్కాక ఆ సమస్య ఇంక ఉండదు.

ఉన్నా దాన్ని మనం పట్టించుకోము .. అంటే మన జీవితాన్ని శాసించే పవర్  దాన్నుంచి తీసేసినట్టే  కదా.

ఈ ప్రాసెస్ మొదట్లో, మధ్యలో మహా కష్టం గా ఉంది. కానీ చివరికి వచ్చే సరికి ఎంతో ఫలదాయకంగా, హాయిగా ఉంటుంది. (స్వానుభవమున చాటు సందేశమిదియే!)

ఇన్ని రోజులు మనని భయపెట్టి, ఇబ్బంది పెట్టి, ఒక్కో సారి అవమానాలకు గురి చేసిన సమస్య అది చెప్పాల్సినది చెప్పి నేర్పించాల్సినది నేర్పించి వెళ్లిపోయే సమయం .... ఎంత బాగుంటుందో.. అగరుబత్తి ధూపం లాగా గాల్లో కలిసిపోతుందంతే. (బూడిద, దాని తాలూకు పుల్లా  కూడా ఉంటాయి ... కాకపోతే తుడిచేస్కొవచ్చు కవితాత్మకత కి అడ్డు రాకుండా). కొన్నాళ్ళు గడిచాక వెనక్కి తిరిగి చూస్కుంటే 'అబ్బో .. అప్పుడు ఆ విషయాన్నో సమస్య అనుకున్నాం' అనిపిస్తుంది. ఇప్పటి దాకా మనం అధిగమించిన సమస్యలని ఒక సారి విశ్లేషించుకున్నా మనకి తెలియకుండా మనం పాటించిన స్టెప్స్ ఇవే అయ్యుండొచ్చు!

terracemuse: “These pain you feel are messengers. Listen to them. (Rumi) ”
Pic Courtesy: Unknown (will update if I find out)
మనం అనుభవిస్తున్న బాధలు సమాచారాన్ని మోసుకొచ్చిన దూతలు, వార్తాహరులు.
వాటిని ఆలకించమని చెప్తున్నారు  'రూమి'.

సమస్యలని అధిగమించిన వాళ్ళకి ఈ సమాజం లో ఏంటో ఓ గౌరవం ఉంది. (మన సమాజం లో మనకి తెలియకుండానే ఉన్న మంచి అలవాట్లలో ఇది ఒకటి!) ఈ గౌరవం అదనపు బోనస్.

ఆత్మబలం లో పెంపు ఇంకో బోనస్. మన మీద మనకే నమ్మకం కలగడం, పెరగడం ఇంకో బోనస్.

(స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బానే ఉంది కానీ నాకసలు ఏమీ తట్టట్లేదు ... అన్న వారికి ఒక మాట చెప్తాను. మనందరిలో ఓ చైతన్యం ఉంది. దానికి అన్నీ తెలుసు. అది మాట్లాడట్లేదు అంటే దాని నోరు మనం నొక్కేసాం అన్నమాట. దానికి సారీ చెప్తే అది మళ్ళీ శక్తీ పుంజుకుంటుంది. అదే ఏం చెయ్యాలో చెప్తుంది.)

అసలు ఇదంతా ఎలా సాధ్యమయింది? ఒకే చిన్న పని తో.  పోస్ట్ మాన్ నుంచి భయపడకుండా ఉత్తరం తీసుకోవడం తో.

ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించి రాక్షసంగా కనిపిస్తున్న ఓ మహమ్మారి నిజానికి మనందరికీ ఉత్తరాలు పట్టుకొచ్చింది.

అందులో కొన్ని నర జాతికి అడ్రెస్ చేసినవి.
కొన్ని దేశాధినేతలకి, ప్రభుత్వాలకి అడ్రెస్ చేసినవి.
కొన్ని బిజినెస్ నడుపుతున్న వారికి అడ్రెస్ చేసినవి.
కొన్ని మెడికల్ కేర్ ప్రొఫెషనల్స్ కి అడ్రెస్ చేసినవి.
కొన్ని పిల్లల తల్లిదండ్రులకు అడ్రెస్ చేసినవి.
కొన్ని టీచర్లకు అడ్రెస్ చేసినవి.
కొన్ని పని చేసే వ్యవస్థ కి అడ్రెస్ చేసినవి.
కొన్ని మనలోని మానవత్వానికి, సానుభూతి కి అడ్రెస్ చేసినవి.
కొన్ని వ్యక్తిగతంగా నాకు, మీకు అడ్రెస్ చేసినవి.

మనకి మనమే ఓ ఉపకారం చేసుకుందాం.
ముందు ఈ ఉత్తరాలు తీసుకుందాం.  

Saturday, March 14, 2020

తల్లి ఆరాటం

నేను కిందటి వారం లిటిల్ విమెన్ నవల గురించి రాసాను కదా .. ఆ నవల ఐప్యాడ్ లో  ఆపిల్ బుక్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని చదివాను. 

ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ పఠనానుభవం బహు సౌలభ్యంగానున్నది. 

నేను చదివిన నవల మన మాతృ భాష కాదు ...పైగా 152 ఏళ్ళ క్రితం రాసినది. నాకు అంతగా పరిచయం లేని కొన్ని పదాలు, వాడుకలు, అలవాట్లు, నవల్లో పాత్రలు ప్రస్తావించిన నాటకాలు, పుస్తకాలు... ఇవి ఎదురైనప్పుడల్లా ...  వెంటనే గూగుల్ చేసుకొనే అవకాశం కల్పించింది ఐ ప్యాడ్. 

ఉదాహరణ కి 



అసలు SARTOR RESARTUS అనే మాట నేను ఎప్పుడూ వినలేదు .. అది ఇంగ్లీష్ అని ఎవరైనా చెప్తే నేను నమ్మేదాన్ని కూడా కాదు. మరి ఇక్కడ ఆ పదానికి అర్ధం తెలియకుండా భావం తెలియడం కష్టమే. అప్పుడు ఆ పదాన్ని సెలెక్ట్ చేసుకొని 'లుక్ అప్' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. 

అప్పుడు తెలిసిన విషయం ఇది. . 


థామస్ కార్లైల్ అనే ఆయన బట్టల ప్రాముఖ్యత మీద రాసిన ఓ కామెడీ పుస్తకం అది అని. ఇప్పుడు భావం కూడా అర్ధం అయింది. 

అలాగే పుస్తకం లో నాకు నచ్చిన అంశాలు హైలైట్ చేసుకొనే వీలు కల్పించింది. మామూలు పుస్తకాల్లాగే బుక్మార్క్ చేస్కోవచ్చు. మనం రీడింగ్ గోల్ రోజు కి ఇన్ని నిముషాలు అని పెట్టుకుంటే మనం చదువుతుండగా అన్ని నిముషాలు అవ్వగానే 'కంగ్రాట్యులేషన్స్ ... ఈ రోజు గోల్ పూర్తి చేసారు!" అని మెసేజ్ వస్తుంది స్క్రీన్ మీద. ఇది భలే ఎంకరేజింగ్ గా ఉంటుంది!

ఇదంతా నా దగ్గర ఐప్యాడ్ ఉందని చెప్పుకోడానికి రాసినది కాదు. నా అసలు ఉద్దేశం ఇది. 

ప్రతిభ గల పిల్ల ఉన్న తల్లి  ... అదే ఈడు గల ఇంకో పిల్ల ఏం చేసినా ... 'మా అమ్మాయి కూడా చేస్తుందండి .. మా అమ్మాయి పేరు కూడా రాసుకోండి" అని ముందుకి తోసి ఆరాటపడిపోతుంది చూడండి ... అలాగే నాకు తెలుగు పుస్తకాల కి కూడా ఇలాంటి వైభవం రావాలని ఉంది. 

మన భాష లో రచనలు ప్రపంచ సాహిత్యం లో దేనికి తక్కువ? 

ఛందోబద్ధ పద్యాలు, వచన కవిత్వం, చిన్న కథ, నవల, వ్యాసాలు, సమీక్షలు, కళలకి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు, బాల సాహిత్యం, బాలశిక్షలు, నిఘంటువులు, ఏ కోవ కీ చెందని ప్రయోగాత్మక రచనలు ... ఎన్ని లేవు? 

రాశిపోసిన ఇంతటి జ్ఞానానికి విజ్ఞానం తోడైతే ఎంత బాగుంటుంది? 

పుస్తకం పట్టుకోవడం లో ఆనందమే వేరు అనుకొనే వారు అలాగే చదువుకోవచ్చు. కానీ గాడ్జెట్స్ మీద గంటలు గంటలు టైం గడుపుతున్న వారికి యధాలాపంగా అయినా ఇవి కనిపిస్తే ఓ కొత్త తరం చదువరులను సృష్టించుకున్నట్టు అవుతుంది కదా? 

చదివే వారు ఎప్పుడూ ఉంటారండి. వారికి కొన్ని సులభతరం చెయ్యాలి. 

పన్నెండు నెలలు పన్నెండు పుస్తకాల పథకం లో ఫిబ్రవరి లో  నేను చదివిన తెలుగు నవల జలంధర గారి 'పున్నాగ పూలు'. (దీని గురించిన నా ఏక వాక్య సమీక్ష - తప్పకుండా చదవండి, అంతే.) 

ఈ పుస్తకం ఆన్లైన్ లో తెప్పించుకున్నాం. తెలుగు పుస్తకానికి ఓ ఈ కామర్స్ వెబ్సైట్ ఏర్పాటై ఇలా ఇంటి కి చిన్న క్లిక్ తో తెప్పించుకోగలము అని కొన్నేళ్ల క్రితం ఊహించగలిగామా? 

స్కూల్ లో చాలా మంది ఆబ్సెంట్ అయిన రోజు, టీచర్ 'ఇంత మంది ఆబ్సెంట్ అయితే ఎలా ... మీకసలు లక్ష్యం లేకుండా పోతోంది' అని తిడుతూ ఉంటారు. ఈ లాజిక్ నాకర్ధం కాదు. ప్రెజెంట్ అయిన వాళ్ళకి ఈ తిట్లు అనవసరం కదా. ఓ రోజు ఆగి ఆబ్సన్ట్ అయిన వాళ్ళు తిరిగి వచ్చాక వాళ్ళని తిట్టచ్చు కదా. 

అలాగే ఇప్పటికే తమ వంతు కృషి చేస్తూ, తెలుగు పుస్తకాన్ని విజ్ఞానం తో జోడించి ముందుకి తీసుకువెళ్తున్న వారు ఎంతో  మంది ఉన్నారు. ఈ-బుక్స్, ఇందాక చెప్పినట్టు పుస్తకాలకి ఆన్లైన్ స్టోర్స్, ఆడియో పుస్తకాలు ఆప్ ద్వారా అందించడం ... ఇవి జరుగుతున్నాయి. అలాగే తెలుగు వికీ ని మరింత సుసంపన్నం చేస్తున్న ఎంతో మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు.  అసలు నేను ఒక బ్లాగు ని తెలుగు అక్షరాల్లో రాయగలుగుతున్నాను. ఈ బ్లాగు ఫోన్ల తో సహా అన్నిట్లో ఓపెన్ అవటం ఎంత అద్భుతం! దీనికి ఎంత మంది కారణమయ్యారు! ఇటువంటి వారందరికీ నా వందనాలు. More power to you, ladies and gentleman. 

కానీ నేను వారి గురించి మాట్లాడట్లేదు. 

మనకున్నంత మంది కంప్యూటర్ నిపుణులు ఇంకెక్కడా లేరు కదా.... ఆ నెంబర్ కి, మన భాష పురోభివృద్ధి జరుగుతున్న వేగానికి సంబంధం ఎందుకు లేకుండా పోతోంది అనేది నా ప్రశ్న.

ఈ రోజు వరకూ కిండిల్ లో తెలుగు లేదు. మరి భారతీయ భాషలే లేవా అంటే ఎందుకు లేవు (ఐదు భాషలు ఉన్నాయి ...  హిందీ,  మలయాళం, గుజరాతీ, తమిళ్, మరాఠీ. బెంగాలీ లేకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది సుమండీ) 

ఆపిల్ బుక్ స్టోర్ లో కూడా అంతే. 

సామెత చెప్పినట్టు ఈ-పుస్తకాలే లేవు. ఇంక నేను ముందు ప్రస్తావించిన ఫెసిలిటీస్ ఎక్కడుంటాయి చెప్పండి? 

ఎంత మాతృ భాష అయినా, దానికీ మనకీ కొంత గాప్ వచ్చేసింది. మాండలికాలు, కొన్ని పదాలు అర్ధమవ్వక పోవడం సహజం. మొన్న కొంత మంది పదేళ్ల లోపు పిల్లలకి 'బడి శలవు',  'షికార్లు' అనే పదాలు తెలియలేదు.

నేను చదివిన తెలుగు పుస్తకాల్లో  నాకూ కొన్ని పదాలకి అర్ధాలు తెలియలేదు. 

ముళ్ళపూడి వారు వాడే 'రికామీ'  'అవటా' 
గొల్లపూడి గారి కథా సంకలనం (దీని గురించి ప్రత్యేకంగా ఓ పోస్ట్ రాస్తాను) లో కొలకలూరి ఇనాక్ వారి  'పిండీకృత శాటీ' అనే కథ అసలు టైటిల్ ఏ అర్ధం కాలేదు ... కథ చాలా బాగుంది.

అలాగే అదే పుస్తకం లో కాళీపట్నం రామారావు గారు రాసిన 'యజ్ఞం' లో 'మ్లాణ' అనే పదం ... (ఈ కథ కూడా అద్భుతం అండి)

మొదటి సారి కన్యాశుల్కం చదివినప్పుడు 'యాంటీ నాచ్చి' అనే పదాలు .. (నిజానికి ఇది  ఇంగ్లీషే .. కానీ తెలుగు లో రాసేసరికి స్పెల్లింగ్ ఏమయ్యుంటుందో గ్రహించడం కష్టం అయింది. అలాగే నేను పుట్టే అప్పటికే ఈ సామజిక సమస్య లేదు కదా  .. అందుకే పేపర్లలో కూడా చదివే అవకాశం లేదు) 

వీటన్నికీ చచ్చి చెడి ఎలాగోలాగా అర్ధాలు తెలుసుకున్నాలెండి తర్వాత. కొన్ని కాంటెక్స్ట్ లో అర్ధం చేసుకోవాల్సి వచ్చింది. కొన్నిటి కోసం చరిత్ర తెలుసుకోవాల్సి వచ్చింది. (రికామీ, అవటా ల కి అర్ధం స్వయంగా బాపూరమణల శిష్యులైన  బ్నిమ్ గారిని అడిగి తెలుసుకోగలగడం ఒక ప్రివిలేజ్ గా భావిస్తాను)

ఈ రోజుకీ ... ఈ పదాలు సరదాగా గూగుల్ చేస్తే ... ఒక్కదానికీ సరైన సమాధానం దొరకదు సరికదా బాగా నవ్వుకోవచ్చు.

అసలు రచయిత పేరు కానీ కథ కానీ రాలేదు చూసారా ...
అసలు 'శాటీ' ఏ లేదంటూంటేనూ

నిముషానికి కొన్ని మిలియన్ల పేజీలు జోడింపబడే గూగుల్ లో
ఒకే రిజల్ట్ వచ్చిన పదం ... అవటా 


ఇది కూడా అంతే..

పోనీ ఇవన్నీ కష్టమైన పదాలు.. ఇది చూడండి 



ఇంగ్లీష్ అంటే అంతర్జాతీయ భాష .. దానితో మనకి పోలికా అని మీరు నన్ను నిలదీయచ్చు. 

మన జాతి అతి పెద్ద ఎగుమతి కంప్యూటర్ నిపుణులు. వంటొచ్చిన వాళ్ళుండీ, వంట సామాగ్రి ఉండీ పోషణ కరువయిపోతున్న భాష మనది. 

(ఎప్పుడైనా ఆనందం ఎక్కువై ఏం చేసుకోవాలో తెలియనప్పుడు 'తెలుగు' అని కానీ 'telugu' అని కానీ గూగుల్ చేయండి. మొదటి పేజీ లో కనిపించే ఇమేజ్, వీడియో, లింకుల జాబితా లో మన జాతి విలువల ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత మీ తత్వాన్ని బట్టి ఆగ్రహమో, దుఃఖమో, నిర్వేదమో కలిగి బ్యాలెన్స్ అయిపోతారన్నమాట. )  

SEO అని ఒకటి ఉంది .... సెర్జ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ ... దీనికోసం ప్రత్యేకంగా నిపుణులు ఉంటారు . ఇందులో కూడా తెలుగు వారు ముందున్నారండోయ్. వాళ్ళ పనల్లా మనం డబ్బులిస్తే మన వెబ్సైట్ మొదటి పది గూగుల్ రిజల్ట్స్ లో వచ్చేలా చెయ్యడమే. మన వెబ్సైట్ పదాలు అటూ ఇటూ చేసినా మన పేరే వచ్చేలా కూడా చెయ్యగలరు వీళ్ళు! అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఫర్వాలేదన్నమాట. 

పాపం తెలుగు తల్లి కే వాళ్ళకి ఇవ్వడానికి డబ్బుల్లేవు. అందుకే రచయితల పేరు, వారు రాసిన నిధి లాంటి సాహిత్యం, అమృత తుల్యమైన తెలుగు పదాలు ... వీటికి సంబంధించిన వెబ్ పేజీలు ఉండవు .. ఉన్నా కనబడవు. 

నేను కూడా ఆశ చావని ఆప్టిమిస్టుని కాబట్టి... ఏదో ఒక రోజు ... కిండిల్ లో నో , ఆపిల్ బుక్ స్టోర్ లోనో ఎవరో ఒక తెలుగు వ్యక్తి కన్యాశుల్కం కొనుక్కొని చదవడం ప్రారంభించి నాటకం లో రెండో పదం ఐన 'పూటకూళ్ళమ్మ' అనే పదం అర్ధం కాక అది సెలెక్ట్ చేసుకొని 'లుకప్' అనే ఆప్షన్ choose చేసుకుంటే ఒక నాలుగు రకాల నిఘంటువు అర్ధాలు, సరైన వాడుక, పూటకూళ్ళమ్మలు ... వారి చరిత్ర మీద వికీ పేజీ...  వింటేజ్ ఫొటోగ్రాఫులు/చిత్రాలు, దీని మీద చర్చ జరుపుతున్న సాహిత్య ఫోరాలు .. ఒకప్పుడు దీనికి అర్ధం గూగుల్ లో లేదు అని రాసిన నా బ్లాగ్ .. ఇవి రిజల్ట్స్ గా కనపడతాయని ఆశిస్తున్నాను.

ఈ రోజు ఇలా సెర్చ్ చేస్తే ఏం వస్తుందో చూడాలనుంటే సరదాగా 'పూటకూళ్ళమ్మ meaning' అని గూగుల్ చేయండి 😊 

ఈనాడు ఆదివారం లో నా కథ 'గాజు గోడ'

కార్పొరేట్ ప్రపంచం లో గ్లాస్ సీలింగ్ అనే చేదు నిజం ఉంది. విమెన్ ప్రొఫెషనల్స్ ని ఒక స్థాయి ని మించి ప్రోమోట్ చెయ్యకపోవడం ... అంటే అప్పర్ లెవె...