Saturday, March 28, 2020

రొటీన్ కి భిన్నం గా ...

నేనేంటో సరదాగా సినిమా చూడలేను ... 

ఏ స్టైల్ బట్టలు వేసుకోవాలో ముందే ఆలోచించుకొని అలాంటివి ఎక్కడ దొరుకుతాయో రీసెర్చ్ చేసి, వీలైతే  ట్రై చేసి, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని, బడ్జెట్ కి కరెక్ట్ గా ఫిట్ అయ్యేవే ఎలా సెలెక్ట్ చేస్కుంటానో సినిమాల కి కూడా అంతే ప్రాసెస్ ఫాలో అవుతాను. (నోట్ టు సెల్ఫ్: నేను అసలు ఏ పనైనా సరదాగా, లైట్ గా చేస్తానా? ఆలోచించాలి.) 

దీన్ని పర్ఫెక్షనిజం అనచ్చు, చాదస్తం అనచ్చు... కానీ నిజం ఏంటంటే నాకు నచ్చని సినిమాలు భరించే/సహించే శక్తి తక్కువ. కొంతమంది లైట్ గా ఏదైనా చూసి వచ్చెయ్యగలరు. ఇదో సూపర్ పవర్ నా ఉద్దేశం లో. నాకది లేదు కాబట్టి, ముందు ఆ సినిమా ట్రైలర్ చూసి, కథ తెలుసుకొని, ఇంటర్వ్యూలు చూసి, ఒక్కోసారి నేను ఎవరి అభిప్రాయాలని గౌరవిస్తానో వాళ్ళు కూడా స్టాంప్ వేసాక గానీ నేను ఓ సినిమా చూడను. ఈ లోగా కొత్త సినిమా అయితే థియేటర్ లోంచి వెళ్ళిపోతుంది అనే భయం అక్కర్లేదు .. ఇన్ని ఫిల్టర్ లు దాటిన సినిమా ఆడుతూ ఉంటుంది ఇంకా థియేటర్ల లో. అప్పుడు వెళ్లి చూస్తాను. పాత సినిమా అయితే అది వెబ్ ప్లాట్ఫారం లో వచ్చాక చూస్తూ ఉంటాను. ఇలా చూసిన సినిమాలన్నీ పూర్తిగా ఎంజాయ్ చేసాన్నేను.

ఒకటి రెండు సందర్భాల లో మొహమాటం కోసం సినిమాలు చూడాల్సి వచ్చింది. అందులో ఒకటి మంచిదే కానీ నాకు థియేటర్ లో నచ్చలేదు ఆ సినిమా.. తర్వాత మళ్ళీ చూసా .. పర్సనల్ గా .. అప్పుడు చాలా నచ్చింది. ఇంకో సినిమా నా సహనానికి పరీక్ష పెట్టింది. ఇంకేం చెయ్యడానికి తోచక ఆ రోజు థియేటర్ లో ఎప్పుడూ తిననంత పాపకార్న్, ఎప్పుడూ తాగనంత కోక్ తాగేసాను .. అదే ఆఖరు ... ఇంకెప్పుడూ మొహమాటానికి సినిమా చూడలేదు.

సినిమా ఎంత మాస్ మీడియమో అంతే పర్సనల్ మీడియం అని అనిపిస్తుంది నాకు. అందరూ సినిమా ఒకేలా చూడరు. వాళ్ళకి అందులో ఏదో ఒక పాయింట్ నచ్చుతుంది .. అది వాళ్ళు అనుభవించింది అయ్యుండచ్చు, ఇంకేదైనా విధంగా వారిని తాకి ఉండచ్చు. అప్పుడే ఓ సినిమా ఒకరి ఫేవరేట్ సినిమా అవుతుంది.

అలాంటి సినిమాల లిస్ట్ మనందరి దగ్గరా ఒకటి ఉంటుంది. నా లిస్ట్ లో ఓ సినిమా గురించి ఈ రోజు.

1993 లో ఓ ఇంగ్లీష్ సినిమా వచ్చింది.... దాని పేరు 'గ్రౌండ్ హాగ్ డే' Groundhog Day

నేను చూసింది మాత్రం 2012 తర్వాత ఎప్పుడో. ఎప్పుడు, ఎక్కడ, ఏ మాధ్యమం లో చూశానో గుర్తులేదు కానీ సినిమా మాత్రం గుర్తుండిపోయింది. దాని కథ అలాంటిది!

(ఆ సినిమా డైరెక్టర్ (Harold Ramis), రచయిత (Danny Rubin) ... వీళ్ళ సినిమాలు నాకు అంతగా పరిచయం లేవు. ప్రధాన తారాగణం అయిన బిల్ మర్రే (Bill Murray), ఆండీ మెక్ డవెల్ (Andie McDowell) వి ఒకటి రెండు సినిమాలు చూసా అంతే.)

ఇదో ఫాంటసీ కామెడీ.

Groundhog Day (1993) - IMDb
No copyright infringement intended 

'ఫిల్' అనే వ్యక్తి అమెరికా లో పెన్సిల్వేనియా రాష్ట్రం, పిట్స్ బర్గ్ లో ఓ న్యూస్ ఛానల్ లో వెదర్ మాన్ (వాతావరణ నిపుణుడు). పొగరు, సుపీరియారిటీ కాంప్లెక్స్, పని చేస్తున్న ఛానెల్ అన్నా, కొలీగ్స్ అన్నా చులకన. సినిమా ప్రారంభం లోనే ఓ మంచు తుఫాను వారి రాష్ట్రం తాకకుండా వెళ్ళిపోతుంది అని ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పేస్తాడు.

అదే రోజు ఆ రాష్ట్రం లో ఉన్న 'పక్సిటానీ' అనే చిన్న ఊరికి అతను, అతని ప్రొడ్యూసర్ 'రీటా', కెమెరామన్ 'లారీ' ముగ్గురూ ఓ ఈవెంట్ కవర్ చెయ్యడానికి  బయల్దేరతారు.

ఆ మర్నాడే  అంటే ఫిబ్రవరి 2 - గ్రౌండ్ హాగ్ డే. గ్రౌండ్ హాగ్ అంటే ఉడత జాతికి చెందిన ఓ జంతువు .. ఉడత కంటే పెద్దది గా ఉంటుంది. గ్రౌండ్ హాగ్ డే నాడు ఆ పల్లె వారందరూ ఒక చోట చేరతారు. వారి ఊరి ఉడత అయిన 'ఫిల్' (ఉడత పేరు కూడా ఫిల్ ఏ) ఆ రోజు  తన కలుగు లోంచి బయటికి వస్తుంది. ఈ ఉడత తన నీడ తను చూస్కుంటే శీతాకాలం ఇంకో ఆరు వారలు కొనసాగుతుంది ... నీడ కనిపించక అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే వసంత ఋతువు త్వరగా రాబోతోందన్నమాట. ఇది అక్కడి వారి నమ్మకం.

ఇదంతా కల్పితం కాదు. పెన్సిల్వేనియా లో ఈ ఊరు ఉంది ... ఈ సంప్రదాయం ఉంది ... ఈ సినిమా తీసే ముందు మహా అయితే 2000 మంది ఈ వేడుక లో పాల్గొనేవారట ... సినిమా తర్వాత ఇదొక పర్యాటక కేంద్రం అయిందట!

ఇంతకీ ఫిల్ కి ఆ ఊరన్నా, ఈ సంప్రదాయం అన్నా చులకన. వాళ్ళని పల్లెటూరి బైతులంటాడు. అప్పటికే కొన్నేళ్లు నుంచి అతను ఇదే రోజున ఇదే ఈవెంట్ రిపోర్ట్ చేస్తూ ఉండటం అతనికి ఇంకా విసుగు పుట్టిస్తుంది. అతని ప్రొడ్యూసర్ రీటా చాలా మంచమ్మాయి. ఆ అమ్మాయి కి ఈ వేడుక అంత తమాషా గా అనిపిస్తుంది.

పొద్దున్న ఈ పని చూసేస్కోని ఇంకొక్క క్షణం ఆ పల్లెటూరు లో ఉండకుండా మళ్ళీ పిట్స్ బర్గ్ వెళ్లిపోవాలని ఫిల్ తాపత్రయం.  సాయంత్రం వరకూ ఉండి మిగిలిన చిన్న చిన్న ఈవెంట్స్ కూడా కవర్ చేద్దామనే ఉత్సాహం లో ఉంటుంది రీటా.

ఫిల్ కి రీటా అంటే గౌరవం ఏ మాత్రం లేదు. పైగా అభ్యంతరకరంగా మాట్లాడుతుంటాడు కూడా. ఇతని గురించి బాగా  తెలిసిన ఆమె మాత్రం అతని వెకిలి మాటలు భరిస్తూ, అతని పొగరు సహిస్తూ ప్రొఫెషనల్ గా ఉంటుంది.

సరే, తెల్లారుతుంది .. ఫిబ్రవరి 2, గ్రౌండ్ హాగ్ డే ... అలారం మోగుతుంది .. ఎఫ్ ఎం రేడియో మొదలవుతుంది ... ఆ రోజు విశేషం గురించి ఇద్దరు ఆర్జే లు మాట్లాడుతుంటారు, ఫిల్ లేచి తయారయి ఈవెంట్ జరిగే చోటుకి బయల్దేరతాడు ... దారి లో ఇద్దరు ముగ్గురు తటస్థ పడతారు ..  రూమ్ బయట ఒకాయన సరదాగా ఏదో అంటాడు, హోటల్ హోస్టెస్ ఆత్మీయంగా ఏదో మాట్లాడుతుంది ... ఓ చిన్నప్పటి ఫ్రెండ్ కలుస్తాడు (ఇతను గుర్తుపట్టడు అతన్ని), ఓ బిచ్చగాడు కనిపిస్తాడు (అతనికి ఇతనేం ఇవ్వడు) ... ఈవెంట్ జరిగే చోటుకి వెళ్లి వ్యంగ్యం గా ఓ రెండు మాటలు చెప్పి రిపోర్ట్ పూర్తి చేస్తాడు. వెంటనే తిరిగి వెళ్లిపోవాలని బయల్దేరతారు కానీ ఏ మంచు తుఫాను తమ రాష్ట్రాన్ని తాకదని చెప్పాడో దాని వల్ల హైవేలు మూసివేయబడతాయి. మళ్ళీ పల్లెటూరి కి తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇతని ఆటిట్యూడ్ ఇంకా పెంకి గా ఉంటుంది ఆ పరిస్థితిలో.

మొత్తానికి ఆ రోజు అయిందనిపిస్తాడు. మర్నాడు అలారం మోగుతుంది. ఎఫ్ ఎం రేడియో మొదలవుతుంది ...ముందు రోజు విన్న మాటలే మళ్ళీ వస్తూ ఉంటాయి .. నిన్నటి టేప్ ప్లే చేస్తున్నారేమో అనుకుంటాడు ... అన్నీ సరిగ్గా ముందు రోజు జరిగినట్టే జరుగుతాయి. మళ్ళీ ఆ వ్యక్తులే తటస్థ పడతారు ... అవే పలకరింపులు ... అవే మాటలు ... కలగంటున్నాడా లేక ఇదంతా నిజమా అనే అయోమయం లో ఆ రోజు గడిచిపోతుంది. తెల్లవారుతుంది. అలారం మోగుతుంది. మళ్ళీ అవే మాటలు రేడియో లోంచి.

ఇలా అతను గ్రౌండ్ హాగ్ డే ని లెక్కలేనన్ని సార్లు గడుపుతూ ఉంటాడు. 

ముందు కొన్ని రోజులు అయోమయం లో ఉంటాడు. తర్వాత అతనికి అనిపిస్తుంది ... రోజు రీసెట్ అయిపోతోంది అంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని. దొంగతనాలు చేస్తాడు, అరెస్ట్ అవుతాడు, ఓ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ ఓ సారి కనుక్కుంటాడు .. ఇంకోసారి రోజు రీప్లే అయిపోయినప్పుడు ఆ అమ్మాయి తనకి ఎప్పటినుంచో తెలిసినట్టుగా మాట్లాడి ఆమెని బుట్టలో పడేస్తాడు.

ఇదే టాక్టిక్ రీటా మీద కూడా ఉపయోగిస్తాడు .. ఆమెని డేట్ కి తీసుకెళ్లి ఒక్కోసారి ఒక్కో తప్పు చేసి మళ్ళీ డే రీప్లే అయినప్పుడు ఆ తప్పు సవరించుకొని స్టెప్ బై స్టెప్ ఆమె కి దగ్గరవుదామనుకుంటాడు. ఒక స్టేజి వరకూ ఈ పన్నాగం పారుతుంది కానీ ఆ అమ్మాయి కి ఇతనిది ప్రేమ కాదు అని తెలిసిపోతూ ఉంటుంది.... ప్రతి సారి. ఆమె చేతిలో కొన్ని వందల చెంప దెబ్బలు తింటాడు. ఆమె కి నిజం చెప్తాడు ఓ రోజు .. తను చిక్కుకున్న టైం లూప్ (సమయ వలయం) గురించి .. ఆమె అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది కానీ మళ్ళీ మర్నాడు అంతా మామూలే. కానీ ఆమె వ్యక్తితం పూర్తిగా తెలుసుకున్న అతనికి ఆమె అంటే ప్రేమ ఏర్పడుతుంది.

ఇక్కడి నుంచి అతనికి అలుపొచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే రోజు .. అదే ఊరు, అవే సంఘటనలు .. ఇలా కాదని ఓ సారి ఆ ఉడత ని తీస్కొని కారు ని ఓ కొండ మీదనుంచి కిందకి క్రాష్ చేసేస్తాడు. కారు నిప్పంటుకొని కాలిపోతుంది. అతను చనిపోతాడు. కానీ మళ్ళీ మర్నాడు అలారం మోగే అప్పటికి మళ్ళీ బతుకుతూ ఉంటాడు.

చాలా సార్లు ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. కానీ మళ్ళీ మర్నాడు బ్రతికే ఉంటాడు.

ఇంక ఆత్మహత్య పనికి రాదని తెలిసి అతనిలో ఏదో మార్పు మొదలవుతుంది. ఓ పియానో టీచర్ దగ్గరకి వెళ్లి పియానో లెసన్స్ నేర్చుకోవడం మొదలుపెడతాడు, మంచు శిల్పాలు చేయడం నేర్చుకుంటూ ఉంటాడు, తనకి ఇన్ని రోజుల్లో తెలిసిన సమాచారాన్ని మంచి కి ఉపయోగించడం మొదలుపెడతాడు .. వృద్ధ మహిళల కారు టైర్ రిపేర్ చేస్తాడు, ఒక పిల్లవాడు చెట్టు మీద నుంచి పడిపోయే సమయానికి కింద ఉండి పట్టుకుంటూ ఉంటాడు, ఒకాయన కి హార్ట్ అటాక్ రాబోతోందని ముందే తెలుసు కాబట్టి అతని ప్రాణం కాపాడతాడు ...

అతని చిన్న నాటి మిత్రుడి తో మునుపటి లాగా కాక ఆత్మీయంగా మాట్లాడతాడు ... అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అని తెలిసి అన్ని ఇన్షురెన్సులు కొనేస్తాడు... పియానో అద్భుతంగా వాయించేస్తూ ఉంటాడు, మంచు శిల్పాలు చేయడం లో కూడా చేయి తిరిగిపోతూ ఉంటుంది అతనికి .... అదే రోజు మళ్ళీ మళ్ళీ జీవించినా దాన్ని ఎంత బాగా జీవించవచ్చో తెలుసుకుంటాడు.

కాకపోతే ఇన్ని పనులలో రెండు అతను కంట్రోల్ చెయ్యలేకపోతాడు. ఒకటి, రీటా తనని ప్రేమించేలా చేయలేకపోతాడు. తను డబ్బులివ్వని బిచ్చగాడి మరణం ఆపలేకపోతాడు ... అప్పటికీ అతన్ని ఓ సారి ఆసుపత్రి లో జాయిన్ చేస్తాడు, తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తాడు, హోటల్ కి తీసుకెళ్లి కడుపు నిండా వేడి వేడి ఆహరం పెట్టిస్తాడు.... ఎన్ని చేసినా ఆ బిచ్చగాడు ఆ రాత్రి మరణిస్తూనే ఉంటాడు.

తన అదుపు లో లేని సమయం అతనికి acceptance, వినయం నేర్పిస్తుంది. కళ సహనం నేర్పిస్తుంది. ఆ బిచ్చగాడి మరణం జీవితం గురించి నేర్పిస్తుంది.

ఇప్పుడు ఫిల్ పూర్తిగా మారిన మనిషి. ఈ సారి రిపోర్టింగ్ కి వెళ్ళే అప్పుడు లారీ కి, రీటా కి వేడి వేడి  కాఫీ (వాళ్ళకి  నచ్చినది), స్నాక్స్ తీసుకెళ్తాడు. అదే రిపోర్ట్ ఎంతో భావుకత్వం తో చెప్తాడు. రీటా, లారీ ల తో గౌరవం గా మాట్లాడతాడు. 24 గంటల్లో ఈ మార్పు ఏంటని ఇద్దరూ ఆశ్చర్యపోతారు.

రీటా అతని తో రోజంతా గడుపుతుంది. అతను ఆమె ని ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయాస పడడు. ఆమె రూపం తో ఓ మంచు శిల్పం చేస్తాడు. 'రేపు ఎలా ఉన్నా, ఈ రోజు నేను ఆనందంగా ఉన్నాను ... ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను' అంటాడు. అతని లో మొదటి సారి నిజాయితీ చూస్తుంది రీటా. ఇద్దరూ ఫిల్ హోటల్ రూమ్ కి వెళ్తారు. కబుర్ల తో నే రాత్రి గడిచిపోతుంది.  అతను అలిసిపోయి నిద్రపోతాడు.

తెల్లవారుతుంది ... అలారం మోగుతుంది .. ఈ సారి ఆర్జే మాటలు మారతాయి .. అతను పక్కన చూస్తే రీటా పడుకొని ఉంటుంది .. అతనికి అర్ధం అవుతుంది ... తాను ఆ వలయం నుంచి బయటికి వచ్చేసా అని. ఆ పల్లెటూరి లో నే ఆమె తో ఉండిపోవాలని ఉంది అని ఫిల్ చెప్పడం తో సినిమా ముగుస్తుంది.

నాకు ఇష్టమైన సినిమాల టాప్ టెన్ లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసే నాటికి నేను కూడా ఓ టైం లూప్ లో ఉన్నా అనిపించేది నాకు. అసలు టైం లూప్ అంటూ ఒకటి ఉంటుందని ... జీవితం నిస్సారమైనప్పుడు అలా అందరికీ అనిపిస్తుందని ... అలాంటప్పుడు జీవితం లో మళ్ళీ సారం నింపడం మన చేతిలోనే ఉందని ఈ సినిమా చెప్పింది నాకు. నన్ను పూర్తిగా ఇంప్రెస్ చేసిన పాయింట్ మాత్రం ఫిల్ పియానో, శిల్ప కళ నేర్చుకోవడం ... కళలు సాధన చేసిన వారికే తెలుస్తుంది ఈ పాయింట్.

జీవితం లో ఖాళీ ని కళ చాలా బాగా పూరిస్తుంది .. ఓ కళ ని సాధన చెయ్యాలంటే కొన్ని గంటల సమయం అవసరం ... పైగా ఆ సమయం భారీ గా కాక తన లో పూర్తి గా లీనమయ్యే లా, ప్రపంచాన్ని, చుట్టూ ఉన్న దుర్భర పరిస్థితులని మర్చిపోయేలా చేయగలదు కళ.

అలాగే పక్కవారికి సాయపడటం .. ఇది కూడా కళ లాంటిదే ... మన జీవితానికి మనకే తెలియని సార్ధకత చేకూరుస్తుందిది.

చివరికి అతను 'నేడు' లోనే జీవించాలని తెలుసుకుంటాడు ... అది ఇంకో అందమైన కోణం.

ఈ సినిమా తర్వాత ఈ పేరు నే రొటీన్ లైఫ్ కి మారుపేరు గా ఉపయోగించడం మొదలుపెట్టారట!

బోర్ కొడుతున్న జీవితాలన్నీ గ్రౌండ్ హాగ్ డేస్ ఏ అయితే, ఆ వలయం నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలో తెలుసు కదా?

Saturday, March 21, 2020

పోస్ట్!

ఒక కష్టం వచ్చింది.

ఒక రోజు గడిచింది... రెండు రోజులు... వారం ... నెల .. గడిచిపోయాయి. పోవట్లేదు. ఇబ్బంది పెట్టేస్తోంది.

మనకి తోచినవన్నీ చేసి చూసాం. అయినా లాభం లేదు. మొండిగా అలానే ఉంది. (లేదా ఇంకా పెరుగుతోంది)

ఏం చేయాలి?
ఒక సిద్ధాంతం ఉంది.

(సిద్ధాంతం ఏంటో చెప్పే ముందు కొన్ని హెచ్చరికలు. మనలో ప్రతి ఒక్కరం మన జీవితానుభవాలు మలిచిన మూర్తులము. ఒకరి వ్యక్తిత్వం ఇంకొకరితో పోలదు. జీవితమంతా నిరర్థకమైన సంఘటనల సమాహారం, మనమే వ్యర్ధంగా దానిలో అర్ధం వెతుక్కుంటాం అని అనుకొనే వారికి ఈ సిద్ధాంతం నచ్చకపోవచ్చు. ఇంకా ఎన్నో మనస్తత్వాల కి ఇది సయించకపోవచ్చు. ఐ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండ్.

నా పంథా ఏంటంటే, ఎప్పుడైనా ఓ సిద్ధాంతం ప్రతిపాదిస్తే దాన్ని వాడి చూడాలి. మనకి పనికొస్తేనే నమ్మాలి. లేకపోతే అది మన సిద్ధాంతం కాదన్నమాట. ఏం ఫర్వాలేదు .. ఈ ప్రపంచం లో శతకోటి కి అనంతకోటి.)

మనని ఇబ్బంది పెడుతున్నది ఏదైనా .. బయట నుంచి వచ్చిన కష్టమైనా, ఓ వ్యక్తయినా, అనారోగ్యమైనా, ఆర్ధిక ఇబ్బందైనా, మన లో ఉన్న ఆంగ్జైటీ, డిప్రెషన్, అణుచుకోలేని కోరికలు, ఒకరి ని చూస్తే కలిగే అసూయ, ఏహ్య భావన, ... ఏవైనా ...

అవి నాకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి అని అడగాలట.

ఈ ప్రశ్న లో చాలా పవర్ ఉంది.

సమస్య ని ఓ రాక్షసుడి గా చిత్రీకరిస్తే మనలో ఉన్న ప్రాణి 'అయ్య బాబోయ్ ... పారిపో పారిపో" అనే చెప్తుంది. అందుకే మనం మన శక్తినంతా పారిపోడానికి ఉపయోగిస్తాం. ఆ సమస్య మనని వేటాడుతూనే ఉంటుంది. దీని వల్ల ప్రయోజనం సున్నా. పైగా అలిసిపోతాం.

అదే సమస్య ని పోస్ట్ మాన్ గా చిత్రీకరించుకుంటే? ఒక్క సారి ఊహించండి ... పోస్ట్ మాన్ నుంచి పారిపోతున్నాం మనం. పాపం అతనేమో మన చేతికే ఆ సందేశం ఇయ్యాలి కాబట్టి మన వెనక పరిగెడుతున్నాడు. ఆ ఉత్తరం మనకి అందించడమే అతని ఉద్యోగం. అందుకే అతను మనం ఉత్తరం తీసుకొనే దాకా వదలడు. ఇలా అనుకుంటే నవ్వొస్తుంది మన మీద మనకే. పరిగెత్తడం ఆపి ముందు ఉత్తరం తీసుకుంటాం.

ఇక్కడి నుంచి అసలు కష్టం మొదలవుతుంది.

ఆ ఉత్తరం లో ఎప్పుడూ మనకి రుచించే సమాచారం ఉండదు. ఇది గ్యారంటీ.

ఒక్కో సారి ఇన్స్టింక్టివ్ గా ...  అంతర్గతంగా ఆ సమాచారం ఏంటో మనకి తెలిసే ఉంటుంది. కోర్టు సమన్ల లాగా. క్రెడిట్ కార్డు బిల్లు/బ్యాంకు స్టేట్మెంట్ లాగా. ఏం నేరం చేసాం, ముందు వెనక చూడకుండా మనం ఎంత ఖర్చుపెట్టేసాం మనకు లోపల్లోపల తెలుసు. అందుకే వాటిని ఫేస్ చెయ్యాలంటే భయం.

ఒక్కోసారి తెలియదు.

ఏది ఏమైనా ఉత్తరం తీసుకోక తప్పదు.

సమాచారం దొరికాక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు ... వారి వారి స్వభావాలని బట్టి.

కొంతమంది కి కోపం రావచ్చు .. వారి మీద వారికే.

కొంత మంది సమస్య తాలూకు బాధ్యత తాము తీసుకోకుండా పరిస్థితులనీ, తమ చుట్టూ ఉన్న వారినీ బ్లేమ్ చెయ్యడం మొదలు పెట్టవచ్చు.

కొంత మంది డిప్రెషన్ లో కి వెళ్లిపోవచ్చు.

కొంత మంది ఆ ఇన్ఫర్మేషన్ ని హుందాగానే స్వీకరించారు గానీ వారికి ఆ సమస్య ఏం చెప్పడానికి ట్రై చేస్తోందో తట్టక పోవచ్చు.

కొంత మంది ... అసలు ఇది నా ఉత్తరం కాదు వేరే వాళ్లకి వెళ్ళాల్సింది అని చించి పారేయచ్చు .. దీన్నే denial .. తిరస్కృతి ... అని అంటారు. అంటే సమస్య ఉందనే ఒప్పుకోరన్నమాట.

కొంతమంది ఉత్తరం తర్వాత చదువుదాం అని పక్కన పెట్టేయచ్చు. ఇది బద్ధకం కాదు .. దాన్ని స్వీకరించడానికి కావాల్సిన శక్తి వారిలో ఆ టైం లో లేకపోవచ్చు.

ఇక్కడ మనం పెద్ద మనసు చేసుకొని అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ... పైన రియాక్షన్స్ లో ఏదీ తప్పు కాదు. అవి మొదటి మెట్టు కిందే లెక్కించాలి.

అక్కడే ఆగిపోకుండా ఇంకో అడుగు వేసినంత కాలం మన మనస్థితి ని బట్టి రియాక్ట్ అయ్యే హక్కు మనకి ఉంది.

మరి రెండో మెట్టు ఏంటి?

ఆత్మవంచన చేసుకోకుండా మన మొదటి రియాక్షన్ కి ఆరోగ్యకరంగా ఎంత టైం ఇవ్వాలో ఇవ్వడం.

ఆత్మవంచన చేసుకోకుండా అని ఎందుకన్నానంటే 'ఓకే .. ఈ టైం చాలు ..' అని అనిపించినా కూడా మొదటి మెట్టులో ఉండిపోకూడదు అని.

ఒక తమాషా ఏంటంటే కొన్ని సమస్యలకి అది ఉందని  ఒప్పుకోవడమే పరిష్కారం అట. అంటే మనం ఇంకేం చెయ్యక్కర్లేదన్నమాట ... కొంచెం సమయం, సహనం ఇస్తే దానంతట అదే సమసిపోతుందిట. అంటే కొన్ని రకాల సమస్యలకి రెండో మెట్టే ఆఖరి మెట్టు!

కొన్ని మొండివి ఉంటాయి .. వాటిని మనం ఎక్కువ కాలం అలక్ష్యం చేసేసాం. వాటికి మూడో మెట్టు అవసరం.

సమస్యలకి, మార్పు కి అవినాభావ సంబంధం ఉంది. నూటికి నూరు సార్లు ఈ మార్పు మనలో రావాల్సినదే.

ఈ మార్పు ఏంటి? దానికి ఎంత సమయం పడుతుంది? ఒక వేళ మార్పు మొదలైనా ఆ మార్పు చంచలం గా కాక స్థిరంగా ఉందా? అసలు ఆ మార్పు కి కావాల్సిన సంకల్పబలం, నిగ్రహం, ఆత్మబలం మనలో ఉన్నాయా? ఇవన్నీ ప్రతీ వ్యక్తీ తమతో తామే తేల్చుకోవాల్సిన విషయాలు.

కానీ ఒక్క విషయం అందరికీ వర్తిస్తుంది. ఈ మెట్లు ఎక్కాక ఆ సమస్య ఇంక ఉండదు.

ఉన్నా దాన్ని మనం పట్టించుకోము .. అంటే మన జీవితాన్ని శాసించే పవర్  దాన్నుంచి తీసేసినట్టే  కదా.

ఈ ప్రాసెస్ మొదట్లో, మధ్యలో మహా కష్టం గా ఉంది. కానీ చివరికి వచ్చే సరికి ఎంతో ఫలదాయకంగా, హాయిగా ఉంటుంది. (స్వానుభవమున చాటు సందేశమిదియే!)

ఇన్ని రోజులు మనని భయపెట్టి, ఇబ్బంది పెట్టి, ఒక్కో సారి అవమానాలకు గురి చేసిన సమస్య అది చెప్పాల్సినది చెప్పి నేర్పించాల్సినది నేర్పించి వెళ్లిపోయే సమయం .... ఎంత బాగుంటుందో.. అగరుబత్తి ధూపం లాగా గాల్లో కలిసిపోతుందంతే. (బూడిద, దాని తాలూకు పుల్లా  కూడా ఉంటాయి ... కాకపోతే తుడిచేస్కొవచ్చు కవితాత్మకత కి అడ్డు రాకుండా). కొన్నాళ్ళు గడిచాక వెనక్కి తిరిగి చూస్కుంటే 'అబ్బో .. అప్పుడు ఆ విషయాన్నో సమస్య అనుకున్నాం' అనిపిస్తుంది. ఇప్పటి దాకా మనం అధిగమించిన సమస్యలని ఒక సారి విశ్లేషించుకున్నా మనకి తెలియకుండా మనం పాటించిన స్టెప్స్ ఇవే అయ్యుండొచ్చు!

terracemuse: “These pain you feel are messengers. Listen to them. (Rumi) ”
Pic Courtesy: Unknown (will update if I find out)
మనం అనుభవిస్తున్న బాధలు సమాచారాన్ని మోసుకొచ్చిన దూతలు, వార్తాహరులు.
వాటిని ఆలకించమని చెప్తున్నారు  'రూమి'.

సమస్యలని అధిగమించిన వాళ్ళకి ఈ సమాజం లో ఏంటో ఓ గౌరవం ఉంది. (మన సమాజం లో మనకి తెలియకుండానే ఉన్న మంచి అలవాట్లలో ఇది ఒకటి!) ఈ గౌరవం అదనపు బోనస్.

ఆత్మబలం లో పెంపు ఇంకో బోనస్. మన మీద మనకే నమ్మకం కలగడం, పెరగడం ఇంకో బోనస్.

(స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బానే ఉంది కానీ నాకసలు ఏమీ తట్టట్లేదు ... అన్న వారికి ఒక మాట చెప్తాను. మనందరిలో ఓ చైతన్యం ఉంది. దానికి అన్నీ తెలుసు. అది మాట్లాడట్లేదు అంటే దాని నోరు మనం నొక్కేసాం అన్నమాట. దానికి సారీ చెప్తే అది మళ్ళీ శక్తీ పుంజుకుంటుంది. అదే ఏం చెయ్యాలో చెప్తుంది.)

అసలు ఇదంతా ఎలా సాధ్యమయింది? ఒకే చిన్న పని తో.  పోస్ట్ మాన్ నుంచి భయపడకుండా ఉత్తరం తీసుకోవడం తో.

ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించి రాక్షసంగా కనిపిస్తున్న ఓ మహమ్మారి నిజానికి మనందరికీ ఉత్తరాలు పట్టుకొచ్చింది.

అందులో కొన్ని నర జాతికి అడ్రెస్ చేసినవి.
కొన్ని దేశాధినేతలకి, ప్రభుత్వాలకి అడ్రెస్ చేసినవి.
కొన్ని బిజినెస్ నడుపుతున్న వారికి అడ్రెస్ చేసినవి.
కొన్ని మెడికల్ కేర్ ప్రొఫెషనల్స్ కి అడ్రెస్ చేసినవి.
కొన్ని పిల్లల తల్లిదండ్రులకు అడ్రెస్ చేసినవి.
కొన్ని టీచర్లకు అడ్రెస్ చేసినవి.
కొన్ని పని చేసే వ్యవస్థ కి అడ్రెస్ చేసినవి.
కొన్ని మనలోని మానవత్వానికి, సానుభూతి కి అడ్రెస్ చేసినవి.
కొన్ని వ్యక్తిగతంగా నాకు, మీకు అడ్రెస్ చేసినవి.

మనకి మనమే ఓ ఉపకారం చేసుకుందాం.
ముందు ఈ ఉత్తరాలు తీసుకుందాం.  

Saturday, March 14, 2020

తల్లి ఆరాటం

నేను కిందటి వారం లిటిల్ విమెన్ నవల గురించి రాసాను కదా .. ఆ నవల ఐప్యాడ్ లో  ఆపిల్ బుక్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని చదివాను. 

ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ పఠనానుభవం బహు సౌలభ్యంగానున్నది. 

నేను చదివిన నవల మన మాతృ భాష కాదు ...పైగా 152 ఏళ్ళ క్రితం రాసినది. నాకు అంతగా పరిచయం లేని కొన్ని పదాలు, వాడుకలు, అలవాట్లు, నవల్లో పాత్రలు ప్రస్తావించిన నాటకాలు, పుస్తకాలు... ఇవి ఎదురైనప్పుడల్లా ...  వెంటనే గూగుల్ చేసుకొనే అవకాశం కల్పించింది ఐ ప్యాడ్. 

ఉదాహరణ కి 



అసలు SARTOR RESARTUS అనే మాట నేను ఎప్పుడూ వినలేదు .. అది ఇంగ్లీష్ అని ఎవరైనా చెప్తే నేను నమ్మేదాన్ని కూడా కాదు. మరి ఇక్కడ ఆ పదానికి అర్ధం తెలియకుండా భావం తెలియడం కష్టమే. అప్పుడు ఆ పదాన్ని సెలెక్ట్ చేసుకొని 'లుక్ అప్' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. 

అప్పుడు తెలిసిన విషయం ఇది. . 


థామస్ కార్లైల్ అనే ఆయన బట్టల ప్రాముఖ్యత మీద రాసిన ఓ కామెడీ పుస్తకం అది అని. ఇప్పుడు భావం కూడా అర్ధం అయింది. 

అలాగే పుస్తకం లో నాకు నచ్చిన అంశాలు హైలైట్ చేసుకొనే వీలు కల్పించింది. మామూలు పుస్తకాల్లాగే బుక్మార్క్ చేస్కోవచ్చు. మనం రీడింగ్ గోల్ రోజు కి ఇన్ని నిముషాలు అని పెట్టుకుంటే మనం చదువుతుండగా అన్ని నిముషాలు అవ్వగానే 'కంగ్రాట్యులేషన్స్ ... ఈ రోజు గోల్ పూర్తి చేసారు!" అని మెసేజ్ వస్తుంది స్క్రీన్ మీద. ఇది భలే ఎంకరేజింగ్ గా ఉంటుంది!

ఇదంతా నా దగ్గర ఐప్యాడ్ ఉందని చెప్పుకోడానికి రాసినది కాదు. నా అసలు ఉద్దేశం ఇది. 

ప్రతిభ గల పిల్ల ఉన్న తల్లి  ... అదే ఈడు గల ఇంకో పిల్ల ఏం చేసినా ... 'మా అమ్మాయి కూడా చేస్తుందండి .. మా అమ్మాయి పేరు కూడా రాసుకోండి" అని ముందుకి తోసి ఆరాటపడిపోతుంది చూడండి ... అలాగే నాకు తెలుగు పుస్తకాల కి కూడా ఇలాంటి వైభవం రావాలని ఉంది. 

మన భాష లో రచనలు ప్రపంచ సాహిత్యం లో దేనికి తక్కువ? 

ఛందోబద్ధ పద్యాలు, వచన కవిత్వం, చిన్న కథ, నవల, వ్యాసాలు, సమీక్షలు, కళలకి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు, బాల సాహిత్యం, బాలశిక్షలు, నిఘంటువులు, ఏ కోవ కీ చెందని ప్రయోగాత్మక రచనలు ... ఎన్ని లేవు? 

రాశిపోసిన ఇంతటి జ్ఞానానికి విజ్ఞానం తోడైతే ఎంత బాగుంటుంది? 

పుస్తకం పట్టుకోవడం లో ఆనందమే వేరు అనుకొనే వారు అలాగే చదువుకోవచ్చు. కానీ గాడ్జెట్స్ మీద గంటలు గంటలు టైం గడుపుతున్న వారికి యధాలాపంగా అయినా ఇవి కనిపిస్తే ఓ కొత్త తరం చదువరులను సృష్టించుకున్నట్టు అవుతుంది కదా? 

చదివే వారు ఎప్పుడూ ఉంటారండి. వారికి కొన్ని సులభతరం చెయ్యాలి. 

పన్నెండు నెలలు పన్నెండు పుస్తకాల పథకం లో ఫిబ్రవరి లో  నేను చదివిన తెలుగు నవల జలంధర గారి 'పున్నాగ పూలు'. (దీని గురించిన నా ఏక వాక్య సమీక్ష - తప్పకుండా చదవండి, అంతే.) 

ఈ పుస్తకం ఆన్లైన్ లో తెప్పించుకున్నాం. తెలుగు పుస్తకానికి ఓ ఈ కామర్స్ వెబ్సైట్ ఏర్పాటై ఇలా ఇంటి కి చిన్న క్లిక్ తో తెప్పించుకోగలము అని కొన్నేళ్ల క్రితం ఊహించగలిగామా? 

స్కూల్ లో చాలా మంది ఆబ్సెంట్ అయిన రోజు, టీచర్ 'ఇంత మంది ఆబ్సెంట్ అయితే ఎలా ... మీకసలు లక్ష్యం లేకుండా పోతోంది' అని తిడుతూ ఉంటారు. ఈ లాజిక్ నాకర్ధం కాదు. ప్రెజెంట్ అయిన వాళ్ళకి ఈ తిట్లు అనవసరం కదా. ఓ రోజు ఆగి ఆబ్సన్ట్ అయిన వాళ్ళు తిరిగి వచ్చాక వాళ్ళని తిట్టచ్చు కదా. 

అలాగే ఇప్పటికే తమ వంతు కృషి చేస్తూ, తెలుగు పుస్తకాన్ని విజ్ఞానం తో జోడించి ముందుకి తీసుకువెళ్తున్న వారు ఎంతో  మంది ఉన్నారు. ఈ-బుక్స్, ఇందాక చెప్పినట్టు పుస్తకాలకి ఆన్లైన్ స్టోర్స్, ఆడియో పుస్తకాలు ఆప్ ద్వారా అందించడం ... ఇవి జరుగుతున్నాయి. అలాగే తెలుగు వికీ ని మరింత సుసంపన్నం చేస్తున్న ఎంతో మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు.  అసలు నేను ఒక బ్లాగు ని తెలుగు అక్షరాల్లో రాయగలుగుతున్నాను. ఈ బ్లాగు ఫోన్ల తో సహా అన్నిట్లో ఓపెన్ అవటం ఎంత అద్భుతం! దీనికి ఎంత మంది కారణమయ్యారు! ఇటువంటి వారందరికీ నా వందనాలు. More power to you, ladies and gentleman. 

కానీ నేను వారి గురించి మాట్లాడట్లేదు. 

మనకున్నంత మంది కంప్యూటర్ నిపుణులు ఇంకెక్కడా లేరు కదా.... ఆ నెంబర్ కి, మన భాష పురోభివృద్ధి జరుగుతున్న వేగానికి సంబంధం ఎందుకు లేకుండా పోతోంది అనేది నా ప్రశ్న.

ఈ రోజు వరకూ కిండిల్ లో తెలుగు లేదు. మరి భారతీయ భాషలే లేవా అంటే ఎందుకు లేవు (ఐదు భాషలు ఉన్నాయి ...  హిందీ,  మలయాళం, గుజరాతీ, తమిళ్, మరాఠీ. బెంగాలీ లేకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది సుమండీ) 

ఆపిల్ బుక్ స్టోర్ లో కూడా అంతే. 

సామెత చెప్పినట్టు ఈ-పుస్తకాలే లేవు. ఇంక నేను ముందు ప్రస్తావించిన ఫెసిలిటీస్ ఎక్కడుంటాయి చెప్పండి? 

ఎంత మాతృ భాష అయినా, దానికీ మనకీ కొంత గాప్ వచ్చేసింది. మాండలికాలు, కొన్ని పదాలు అర్ధమవ్వక పోవడం సహజం. మొన్న కొంత మంది పదేళ్ల లోపు పిల్లలకి 'బడి శలవు',  'షికార్లు' అనే పదాలు తెలియలేదు.

నేను చదివిన తెలుగు పుస్తకాల్లో  నాకూ కొన్ని పదాలకి అర్ధాలు తెలియలేదు. 

ముళ్ళపూడి వారు వాడే 'రికామీ'  'అవటా' 
గొల్లపూడి గారి కథా సంకలనం (దీని గురించి ప్రత్యేకంగా ఓ పోస్ట్ రాస్తాను) లో కొలకలూరి ఇనాక్ వారి  'పిండీకృత శాటీ' అనే కథ అసలు టైటిల్ ఏ అర్ధం కాలేదు ... కథ చాలా బాగుంది.

అలాగే అదే పుస్తకం లో కాళీపట్నం రామారావు గారు రాసిన 'యజ్ఞం' లో 'మ్లాణ' అనే పదం ... (ఈ కథ కూడా అద్భుతం అండి)

మొదటి సారి కన్యాశుల్కం చదివినప్పుడు 'యాంటీ నాచ్చి' అనే పదాలు .. (నిజానికి ఇది  ఇంగ్లీషే .. కానీ తెలుగు లో రాసేసరికి స్పెల్లింగ్ ఏమయ్యుంటుందో గ్రహించడం కష్టం అయింది. అలాగే నేను పుట్టే అప్పటికే ఈ సామజిక సమస్య లేదు కదా  .. అందుకే పేపర్లలో కూడా చదివే అవకాశం లేదు) 

వీటన్నికీ చచ్చి చెడి ఎలాగోలాగా అర్ధాలు తెలుసుకున్నాలెండి తర్వాత. కొన్ని కాంటెక్స్ట్ లో అర్ధం చేసుకోవాల్సి వచ్చింది. కొన్నిటి కోసం చరిత్ర తెలుసుకోవాల్సి వచ్చింది. (రికామీ, అవటా ల కి అర్ధం స్వయంగా బాపూరమణల శిష్యులైన  బ్నిమ్ గారిని అడిగి తెలుసుకోగలగడం ఒక ప్రివిలేజ్ గా భావిస్తాను)

ఈ రోజుకీ ... ఈ పదాలు సరదాగా గూగుల్ చేస్తే ... ఒక్కదానికీ సరైన సమాధానం దొరకదు సరికదా బాగా నవ్వుకోవచ్చు.

అసలు రచయిత పేరు కానీ కథ కానీ రాలేదు చూసారా ...
అసలు 'శాటీ' ఏ లేదంటూంటేనూ

నిముషానికి కొన్ని మిలియన్ల పేజీలు జోడింపబడే గూగుల్ లో
ఒకే రిజల్ట్ వచ్చిన పదం ... అవటా 


ఇది కూడా అంతే..

పోనీ ఇవన్నీ కష్టమైన పదాలు.. ఇది చూడండి 



ఇంగ్లీష్ అంటే అంతర్జాతీయ భాష .. దానితో మనకి పోలికా అని మీరు నన్ను నిలదీయచ్చు. 

మన జాతి అతి పెద్ద ఎగుమతి కంప్యూటర్ నిపుణులు. వంటొచ్చిన వాళ్ళుండీ, వంట సామాగ్రి ఉండీ పోషణ కరువయిపోతున్న భాష మనది. 

(ఎప్పుడైనా ఆనందం ఎక్కువై ఏం చేసుకోవాలో తెలియనప్పుడు 'తెలుగు' అని కానీ 'telugu' అని కానీ గూగుల్ చేయండి. మొదటి పేజీ లో కనిపించే ఇమేజ్, వీడియో, లింకుల జాబితా లో మన జాతి విలువల ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత మీ తత్వాన్ని బట్టి ఆగ్రహమో, దుఃఖమో, నిర్వేదమో కలిగి బ్యాలెన్స్ అయిపోతారన్నమాట. )  

SEO అని ఒకటి ఉంది .... సెర్జ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ ... దీనికోసం ప్రత్యేకంగా నిపుణులు ఉంటారు . ఇందులో కూడా తెలుగు వారు ముందున్నారండోయ్. వాళ్ళ పనల్లా మనం డబ్బులిస్తే మన వెబ్సైట్ మొదటి పది గూగుల్ రిజల్ట్స్ లో వచ్చేలా చెయ్యడమే. మన వెబ్సైట్ పదాలు అటూ ఇటూ చేసినా మన పేరే వచ్చేలా కూడా చెయ్యగలరు వీళ్ళు! అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఫర్వాలేదన్నమాట. 

పాపం తెలుగు తల్లి కే వాళ్ళకి ఇవ్వడానికి డబ్బుల్లేవు. అందుకే రచయితల పేరు, వారు రాసిన నిధి లాంటి సాహిత్యం, అమృత తుల్యమైన తెలుగు పదాలు ... వీటికి సంబంధించిన వెబ్ పేజీలు ఉండవు .. ఉన్నా కనబడవు. 

నేను కూడా ఆశ చావని ఆప్టిమిస్టుని కాబట్టి... ఏదో ఒక రోజు ... కిండిల్ లో నో , ఆపిల్ బుక్ స్టోర్ లోనో ఎవరో ఒక తెలుగు వ్యక్తి కన్యాశుల్కం కొనుక్కొని చదవడం ప్రారంభించి నాటకం లో రెండో పదం ఐన 'పూటకూళ్ళమ్మ' అనే పదం అర్ధం కాక అది సెలెక్ట్ చేసుకొని 'లుకప్' అనే ఆప్షన్ choose చేసుకుంటే ఒక నాలుగు రకాల నిఘంటువు అర్ధాలు, సరైన వాడుక, పూటకూళ్ళమ్మలు ... వారి చరిత్ర మీద వికీ పేజీ...  వింటేజ్ ఫొటోగ్రాఫులు/చిత్రాలు, దీని మీద చర్చ జరుపుతున్న సాహిత్య ఫోరాలు .. ఒకప్పుడు దీనికి అర్ధం గూగుల్ లో లేదు అని రాసిన నా బ్లాగ్ .. ఇవి రిజల్ట్స్ గా కనపడతాయని ఆశిస్తున్నాను.

ఈ రోజు ఇలా సెర్చ్ చేస్తే ఏం వస్తుందో చూడాలనుంటే సరదాగా 'పూటకూళ్ళమ్మ meaning' అని గూగుల్ చేయండి 😊 

Saturday, March 7, 2020

లిటిల్ విమెన్ (Little Women)

ఈ సంవత్సరం పన్నెండు నెలల్లో పన్నెండు పుస్తకాలు చదవాలని సంకల్పం చేసుకున్నాను.

రెండు నెలలు రెండు పుస్తకాలు అయ్యాయి.

అందులో ఒక పుస్తకం గురించి ఈ రోజు.

పుస్తకం:  నవల
పేరు: లిటిల్ విమెన్ (Little Women)
భాష: ఇంగ్లీష్
రచయిత్రి: లూయీజా మే ఆల్కాట్ (Louisa May Alcott)
దేశం: అమెరికా
అచ్చయిన సంవత్సరం: 1868 - 1869 ( ఆమె అప్పుడు రెండు భాగాలు గా రాసినది ఇప్పుడు ఒక నవల గా చదువుకుంటున్నాం మనం)

ఎప్పటి నుంచో చదవాలి చదవాలి అనుకుంటే ఇన్నేళ్లకి కుదిరింది.

వందేళ్లు (ఇంకా ఏవో లెక్కలు ఉన్నాయి లెండి) దాటాక ఓ పుస్తకం పబ్లిక్ డొమెయిన్ లోకి వస్తుందట. (పుస్తకమనే కాదు .. కాపీ రైట్ ఉన్న క్రియేటివ్ వర్క్ ఏదైనా). అంటే మనకి ఫ్రీ గా దొరుకుతుంది.

మీరు నవల చదివి ఆ ఆనందాన్ని స్వయంగా అనుభవించాలనుకుంటే ఇంతే చదవండి. ఎందుకంటే ఇంక కథ చెప్పేస్తాను ... అందులో స్పాయిలర్స్ (కథ లో కీలకమైన మలుపులు ముందే చెప్పేయడాన్ని స్పాయిలర్స్ అంటారు కదా) ఉంటాయి. మరి మీ ఇష్టం.

మధ్య తరగతి కి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్ళ కథ ఇది. మెగ్, జో, బెత్, ఏమి ... నవల ప్రారంభం లో వీళ్ళ వయసులు 16, 15, 13, 12. పదేళ్ల పాటు వారి జీవితాన్ని ఫాలో చేస్తుంది నవల. ఆర్ధిక పరమైన, ఆరోగ్య పరమైన, ఇంకా అనేక రకాల ఇబ్బందుల నుంచి నలుగురి Coming of age .. పరిణితి ...ని చూపిస్తుంది.

ఈ కుటుంబం ఇంటి పేరు 'మార్చ్'.  ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం కానీ మంచివాడైన తండ్రి ఎవరికో సహాయం చేసి వారు డబ్బు తిరిగివ్వలేకపోవడం చేత ఇప్పుడు లేమి లో బ్రతుకుతుంటారు. తండ్రి నవల ప్రారంభం లో సివిల్ వార్ (నల్లవారి బానిసత్వాన్ని నిషేధించడానికి అమెరికా లో అంతర్గతంగా జరిగిన యుద్ధమిది) లో పాలుపంచుకుంటూ ఉంటాడు. సగం పుస్తకం అసలు ఈయన మనకి కనిపించడు.

తల్లి మంచి విలువల తో పిల్లల్ని పెంచుతుంది.

ఒక్కొక్క పిల్ల దీ ఒక్కో తరహా .

అందరికంటే పెద్ద మెగ్ .. అందమైనది. డబ్బుల కోసం ఒకరింట్లో గవర్నెస్ (ట్యూషన్ చెప్పే అమ్మాయి) గా పని చేస్తూ ఉంటుంది. పదహారేళ్ళ అమ్మాయిలకి ఉండే కోరికలు, సంశయాలు .. అన్నీ ఉంటాయి మెగ్ కి. మనకే డబ్బుంటే నేను ఆ పెంకి పిల్లలకి ట్యూషన్లు చెప్పాల్సిన అవసరం లేదు కదా అనుకుంటూ ఉంటుంది.

రెండోది జో. ఈ పాత్ర ప్రపంచ సాహిత్యం లో స్త్రీ పాత్రలన్నిటిలో యెంచదగినది. రచయిత్రి తన వ్యక్తిత్వం మేళవించి రంగరించిన పాత్ర ఇది. జో మగరాయుడి లాగా తిరుగుతూ ఉంటుంది. అందంగా తయారవడం ఇష్టం ఉండదు. కుట్లు, అల్లికలు అంటే పారిపోతుంది. పైగా బాగా ఆవేశం. మొహం మీద కొట్టినట్టు మాట్లాడటం ... ఈ కుటుంబాన్ని నేనే పోషించేయాలి అనే బాధ్యత భుజాన వేసేసుకుంటుంది. ఆ బాధ్యత నిర్వర్తిస్తుంది కూడా.

మూడోది బెత్. ఈ పిల్ల సుగుణాల రాశి. ఎప్పుడూ ఒక్క వంకర మాట మాట్లాడదు. ప్రతి విషయం లో పాజిటివ్ చూస్తుంది. సిగ్గరి. పియానో అద్భుతంగా వాయిస్తుంది. అక్కాచెల్లెళ్ల లో జో, బెత్ ఒక జట్టు.

ఆఖరుది ఏమి. ఈ పిల్ల ఓ కామిక్ క్యారెక్టర్ సగం నవల వరకూ. ఒక పదం బదులు ఇంకో పదం వాడుతూ ఉంటుంది. స్పెల్లింగులు సరిగ్గా రావు. పెయింటింగ్ బాగా చేస్తుంది. కానీ అసలు తనకి ఆ టాలెంట్ ఉందా లేదా అని ఎప్పుడూ డౌట్ చేసుకుంటూనే ఉంటుంది.  హై సొసైటీ లో మెలగాలని ... టేస్ట్ ఉన్న లైఫ్ గడపాలని కోరుకుంటుంది. మెగ్ కి క్లోజ్ ఏమి.

ఇంట్లో క్రిస్మస్ కి నాటకాలు వేస్తూ ఉంటారు నలుగురు. ఇదంతా జో చూసుకుంటూ ఉంటుంది. డబ్బు లేదు .. సమస్యలు ఉన్నాయి .. అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి ... కానీ వీటన్నిటిని ఎదుర్కోడానికి అమ్మ చెప్పే పాఠాలు కూడా ఉన్నాయి. క్రిస్మస్ నాడు వీరి కంటే హీనంగా బతుకుతున్న ఓ జర్మన్ కుటుంబం తో పండగ విందు ని షేర్ చేసుకుంటారు. వీరికి బ్రెడ్, పాలు, పళ్ళు మిగులుతాయి పాపం. అయినా ఇవ్వడం లో ఉండే ఆనందాన్ని అనుభవిస్తారు.

వీరి పక్క ఇల్లు ఓ సంపన్నుల బంగ్లా. ఆ ఇంట్లో ఓ తాతగారు .. మనవడు (లారీ .. Laurie) ఉంటారు. మనవడు ఆ పిల్లల వయసు. వీరి మంచి తనం తో ఆ కుటుంబానికి వీరు ఆత్మీయులవుతారు. ఆ పిల్లవాడికి Mrs. March ఇంకో తల్లి అవుతుంది. తల్లితండ్రి లేని పిల్లవాడికి ఎదిగే వయసు లో ప్రేమ ఎంత అవసరమో చాలా అందంగా చెప్తుంది రచయిత్రి.

మెగ్ ఓ సారి .. వారి కంటే సంపన్నులైన కజిన్స్ ఇంటికి వెళ్లొచ్చి వాళ్ళ లాంటి బట్టలు తనకి లేవే అని బాధపడుతూ ఉంటుంది.  తన దగ్గర ఒకటే మంచి డ్రెస్ ఉంటుంది ... మూడు రోజుల పార్టీలకి అదే వేస్కుంటుండటం చూసి ఆమె కజిన్స్ 'మేము నిన్ను తయారు చేస్తాం' అని ఆమె కి వాళ్ళ బట్టలిచ్చి, మేకప్పేసి తయారు చేస్తారు.  అద్దం లో చూసుకొని తను ఇంత అందంగా ఉంటానా అని మురిసిపోతుంది మెగ్. ముందు రెండు రోజులు తనని అంత గా పట్టించుకోని అబ్బాయిలు ఈ రోజు తన తో పోటీ పడి మరీ డాన్స్ చేయటం చూసి ఆశ్చర్యపోతుంది.

పక్కింటి డబ్బున్న 'లారీ' ని బానే బుట్టలో వేస్కున్నారే అనే కామెంట్లు వింటుంది. బోల్డు ఆలోచనల తో ఇంటికి వస్తే ఆమె తల్లి గమనించి కొన్ని మాటలు చెప్తుంది.

"ఒక మంచి అబ్బాయి చేత ప్రేమించబడటం, అతన్ని పెళ్లి చేసుకొని ఓ ఇంటిదానివవడం.. అతని తో జీవితాన్ని పంచుకోవడం .. ఇవన్నీ అందమైన అనుభూతులు. వీటి గురించి నీ వయసు లో కలలు కనటం కూడా చాలా సహజం. నేను కోరుకొనేది కూడా ఇదే. కానీ నేను నీకు డబ్బున్నవాడు రావాలని కోరుకోను. డబ్బు అవసరమైనది, అపురూపమైనది. సరిగ్గా వాడితే ఉన్నతమైనది. కానీ అదే మీ ధ్యేయం కాకూడదు. ఆత్మాభిమానం, మనశ్శాంతి లేకుండా సింహాసనం మీద కూర్చున్న మహారాణులయ్యేకన్నా నా కూతుళ్లు పేదింట్లో అయినా సంతోషం గా, ప్రేమ ని పొందుతూ, తృప్తిగా ఉండటమే నాకు కావాలి.."

"మరి డబ్బుల్లేని ఆడపిల్లలు యేవో ట్రిక్స్ చేసి అబ్బాయిలని పడేయకపోతే గానీ పెళ్లిళ్లు కావట కదా" అని మెగ్ అంటే "ఏం ఫర్వాలేదు ... వృద్ధ కన్యలు గా మిగిలిపోదాం" అంటుంది కుండ బద్దలుకొట్టినట్టు జో.

తల్లి ఓ మంచి మాట చెప్తుంది. "నిన్ను నిజాయితీ గా ప్రేమించేవాడిని నీ పేదరికం ఆపలేదు. ఇలాంటి విషయాలని కాలానికే వదిలేయాలి. మీరు ఇంకో ఇంటివారయ్యే వరకూ ఈ ఇంటిని ఆనందంగా ఉంచండి. అప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ అనుభవం మీ ఇంటిని స్వర్గం చేస్కోవడం లో ఉపయోగపడుతుంది. లేకపోతే ఇక్కడే తృప్తిగా ఉండండి. మా కూతుళ్లు మాకు ఎప్పుడూ గర్వం, సాంత్వన కలగచేస్తారనే నమ్మకం నాకు, మీ నాన్నగారికి ఉంది ... మీకు పెళ్ళైనా, కాకపోయినా".

ఈ మాటలు ప్రతి ఆడపిల్లా వినాలి. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు అనాలి.

ఇంకో ముఖ్య విషయమేంటంటే ఈ సంభాషణ వీరి ముగ్గురి మధ్యే ఉంటుంది. ఇంకా టీన్స్ లో కి రాని ఆఖరి పిల్లలు లేని సమయం లోనే జరుగుతుంది. వారికి ఇంకా ఇది చెప్పే సమయం కాదు కాబట్టి.

ఈ తల్లి పాత్ర చాలా మంచి పాత్ర. జో కి ఆవేశం తగ్గించుకోమని, అర్ధం చేసుకొనే తత్వం, సహనం పెంచుకోమని చెప్తుంది. కానీ జో తన దగ్గరకి వచ్చి మాట్లాడే వరకూ ఏమి అనదు ఆవిడ. అలాగే వేరే అమ్మాయిల్లా ఉండు అని ఎప్పుడూ ఫోర్స్ చెయ్యదు. ఇది నాకు చాలా నచ్చిన విషయం. ఆమె వ్యక్తిత్వాన్ని చంపేయకుండా ప్రవర్తనలో మాత్రమే మార్పులు సూచిస్తుంది.

నలుగురు అక్కాచెల్లెళ్లు ఎన్నో భరిస్తారు. తండ్రి యుద్ధం లో సీరియస్ గా గాయపడతాడు. ఇంత సపోర్ట్ గా ఉండే తల్లి ఆయన దగ్గరకి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆమె ఇచ్చిన డిసిప్లిన్, విలువలు  ఇప్పుడు పరీక్షకి వస్తాయి. కొన్ని బాధ్యతలు విస్మరించబడతాయి. వీరి అండ లో ఉన్న ఆ జర్మన్ కుటుంబం లో ఓ చిన్నారి కి ఓ అంటు వ్యాధి సోకి చనిపోతాడు. వాడినే చూసుకుంటున్న బెత్ కి కూడా అది సోకుతుంది. మెగ్, జో కి ఆ జ్వరం చిన్నప్పుడు వచ్చింది కాబట్టి వారికి ఫర్వాలేదు కానీ ఏమి ని వాళ్ళ చుట్టాలావిడ ఇంటికి పంపిస్తారు.  ఆవిడ డబ్బున్నది. వీళ్ళ కుటుంబమంటే చిన్న చూపు.

ఈ పరిస్థితుల్లో మెగ్ తల్లి తరువాత తల్లి అవుతుంది ఆ ఇంటికి. జో బెత్ ని కంటికి రెప్ప లాగా సాకుతుంది. ఏమి ఇంటికి దూరమయి బాధ లో ఉంటుంది కానీ ప్రతికూలమైన వాతావరణం లో కూడా సహనం గా ఎలా ఉండాలో నేర్చుకుంటుంది.

ఇంత కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. బెత్ చావు అంచు దాకా వెళ్లి బతికి వస్తుంది. తండ్రి తో తల్లి తిరిగి వస్తుంది. మెగ్ అంతగా డబ్బు లేని కానీ ఓ మంచి వ్యక్తిత్వం ఉండి తనని మనసారా ప్రేమించిన మిస్టర్ బ్రూక్ ని పెళ్లి చేసుకుంటుంది. దీనితో మొదటి భాగం పూర్తవుతుంది.

ఇంత వరకూ రాసి వదిలేసారట లూయీజా. అచ్ఛయ్యీ అవ్వగానే సక్సెస్ అయిపోయిందట ఈ నవల. ఈ పాత్రల జీవితం లో నెక్స్ట్ ఏం జరిగింది అని అందరూ తెలుసుకోవాలనుకోవడం తో మూడే నెలల్లో రెండో భాగం రాసెయ్యాల్సి వచ్చిందట రచయిత్రికి.

రెండో భాగం లో మెగ్ కి ట్విన్స్ పుడతారు.  కొత్త గా తల్లి అయిన మెగ్ పూర్తిగా భర్త ని నెగ్లెక్ట్ చెయ్యడం మొదలుపెడుతుంది. అతను కూడా పిల్లల్ని పెంచడం లో తన పాత్ర ఏంటో తెలియక సతమతమవుతూ ఉంటాడు. ఇద్దరి మధ్యా దూరం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా తల్లి మెగ్  కి చెప్పే మాటలు చాలా బాగుంటాయి.

జో రచయిత్రి అవ్వాలి, డబ్బులు సంపాదించెయ్యాలి అని సెన్సేషనల్ నవలలు రాయడం మొదలుపెడుతుంది కలం పేరుతో. వాటిలో ఓ విలువ, ఓ నిజాయితీ ఉండవు. కానీ డబ్బులు బాగా వస్తూ ఉంటాయి. అప్పుడు ఆమె మనసు ఎలా, ఎందుకు మారింది? చిన్నప్పటి నుంచి ఆమె ని ఇష్టపడే లారీ ఆమెకి ప్రపోజ్ చేసినప్పుడు ఆమె ఎలా రెస్పాండ్ అయింది? ఏమి కి ప్యారిస్ వెళ్లే అవకాశం ఎలా కలిగింది .. ఆమె అక్కడ ఏం తెలుసుకుంది .... ఆమె చివరికి ఎవర్ని పెళ్లాడింది (ఇది మనం ఊహించం).. బెత్ జబ్బు పూర్తిగా నయమయ్యిందా? ఆమె బ్రతికిందా? జో కి ఎవరైనా దొరికారా లేక ఆమె అన్నట్టు వృద్ధ కన్య లాగా మిగిలిపోయిందా... ఇవన్నీ రెండో భాగం లో ఉంటాయి.

అమెరికన్లకి ఈ పుస్తకం చాలా ఇష్టం .. వాళ్ళ సినిమాల్లో, సీరియల్స్ లో దీని ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఈ నవల ని ఏడెనిమిది సార్లు సినిమాలు గా తీసుకున్నారు వాళ్ళు. సైలెంట్ ఫిలిం దగ్గర నుంచి మొన్న మొన్నటి దాకా. 2019 లో మరో సారి ఓ మహిళా డైరెక్టర్ (గ్రెటా గెర్విగ్ - Greta Gerwig) ఈ నవల ని సినిమా తీసారు ... కొన్ని మార్పుల తో. ఆస్కర్ బెస్ట్ పిక్చర్ నామినేషన్స్ లో ఈ సినిమా స్థానం సంపాదించుకుంది (ఇంకో ఐదు కేటగిరీ ల తో సహా).

ఈ నవల చాలా వరకూ రచయిత్రి ఆత్మకథే అట. తనకి కూడా ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు. తన రచనలతోనే ఇల్లు గడిచేది. ఈ నవల్లో జో లాగా ఇంటి పై కప్పు లో ఉన్న ఇరుకైన గది లో రాసేవారట ఆవిడ. నవల రాసిన ఇల్లు, నవల్లో రాసిన ఇల్లు ఒకటే.

ఆ ఇల్లు ఇప్పటికీ ఉందండోయ్!

By User:victorgrigas - Own work, CC BY-SA 3.0, https://commons.wikimedia.org/w/index.php?curid=27754775

https://en.wikipedia.org/wiki/Orchard_House

Concord, Massachusetts లో. ఆవిడ జ్ఞాపకార్ధం ఇంటిని అలాగే ఉంచారు. నేను అమెరికా కి వెళ్ళినప్పుడు ఇక్కడికి తప్పకుండా వెళ్తాను. మీరు వెళ్తే పిక్చర్స్ తీసి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్ బుక్ లో #sowmyavadam అని టాగ్ చేస్తారు కదూ.

అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! 

Saturday, February 29, 2020

సారీ చెప్పేద్దాం...

కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

అవి మనం జీవితం లో ఎప్పుడూ చేయలేకపోయినా.

విదేశాల్లో  రోజు కి కొన్ని వేల డాలర్లు ఖర్చయ్యే లగ్జరీ హోటల్ రూమ్ లో ఉండలేం అని తెలుసు ... కాని ఆ రూమ్ ఫోటోలు చూస్తాం కదా ... అలా అన్నమాట.

అంతే అ/సాధ్యమయిన విషయం  .... సరిగ్గా 'సారీ' చెప్పడం.

అసాధ్యం ఎందుకంటే ఈ ఈగో మనదే తప్పు అని ఒప్పుకోనివ్వదు ముందు.

ఏదో తప్పు చేసాం .. అందరూ చెయ్యట్లేదా ...

నా కంటే ఫలానా వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసాడో తెలుసా ... వాడెప్పుడైనా సారీ చెప్పగా విన్నావా?

అయినా ఇప్పుడు సారీ చెప్తే తప్పొప్పుకున్నట్టే కదూ ...  చులకన అయిపోమూ ఎదుటి వ్యక్తి ముందు? రిలేషన్షిప్ లో మన పవర్ తగ్గిపోదూ?

అయినా ఈ తప్పు తన తప్పు కి నా జవాబు .. కాబట్టి సరి కి సరి.

అసలు అయినా ఆ వ్యక్తి నేను చేసిన దానికి అలా రెస్పాండ్ అయితే ... తప్పు నాది కాదు వాళ్ళది ...

ఇలాంటివి భార్యాభర్తల మధ్య/స్నేహితుల మధ్య/ఆఫీసు లో పని చేసే వాళ్ళ మధ్య/చుట్టాల్లో/పాలిటిక్స్ లో/బిజినెస్ లో /ప్రొఫెషన్ లో /ఏదో ఒక బంధం ఉన్నవారి తో మామూలే ... ఇంతోటి దానికి సారీ చెప్పక్కర్లేదు

పిల్లలకి సారీ చెప్పడం ఏమిటి? వాళ్లకేం తెలుసు?

నేను సారీ చెప్పడానికి అసలు నాకు సారీ చెప్పారా ఎప్పుడైనా ఎవరైనా?

ఇతి ఈగో ఉవాచ.

'సారీ చెప్పేద్దాం' ,, క్షణక్షణం లో ఈ సీన్ గుర్తుందా 😁

ఇంక రెండో వైపు .. తప్పు చేశామనే అపరాధ భావన న్యూనత వైపు నెట్టేసి (ముఖ్యంగా ఇది మొదటి తప్పు కాకపోతే మరీనూ) ... సారీ చెప్పినా ఏమి లాభం లే ... నా మీద నమ్మకం పోయాక అనిపిస్తుంది.

ఒక్కో సారి ఎవరికి  'సారీ' చెప్పాలో వాళ్ళు విలనీయులై... మన 'సారీ' ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని మన ఆత్మ గౌరవాన్ని కాలి కింద వేసి తొక్కేసే వాళ్ళైతే!

ఇంకా చాలా కారణాలు ఉండవచ్చు 'సారీ' చెప్పక/చెప్పలేక పోవడానికి. (మన తప్పు తెలిసేసరికి వాళ్ళు మన జీవితంలో  .. ఈ ప్రపంచం లో ఉండకపోవచ్చు కూడా.)

ఇన్ని అడ్డంకుల మధ్య రెండక్షరాలు బయటికి రాకుండా ఎక్కడో తప్పిపోతాయి.

'సారీ' చెప్పడం తప్పించుకోడానికి ఐస్ క్రీమ్ నుంచి ఏరో ప్లేన్ దాకా ఏది కొనిపెట్టినా శ్రీ కృష్ణ తులాభారం లో లాగా ఆ రెండక్షరాలకి సరి తూగవు.

మనకి ఎవరైనా 'సారీ' చెప్పే పరిస్థితి వచ్చి వాళ్ళు ఎన్నేళ్ళైనా చెప్పకపోతే ఏమనిపిస్తుంది ... ఈ బాధ వర్ణనాతీతం.

అర్ధం లేని  'సారీ' స్వీకరించాల్సి రావడం ఇంకో బాధ.

మరి అర్ధవంతమైన 'సారీ' అంటే ఏది?

ఆరోగ్యకరమైన 'సారీ' ఎలా ఉంటుంది?

సైకాలజిస్టులు వీటి మీద ఆర్టికల్స్ రాసారు. అన్నిట్లో అందరూ ఒప్పుకొనే కామన్ పాయింట్స్ ఇవి.


1. ప్రశాంతమైన మనసు నుంచి వచ్చినదే సరైన 'సారీ' కి పునాది 

గొడవ జరిగిన కోపం లో, ఆవేశం లో, ఇదేదో చెప్తే అయిపోతుందని మొక్కుబడిగా అసలు ఎదుటి వ్యక్తి కి ఏం కోపం తెప్పించిందో కూడా తెలుసుకోకుండా 'సారీ' చెప్తే ఏంటో వారి మనసు కి తాకదు. అక్కడి నుంచి మళ్ళీ 'నేను సారీ చెప్పినా నీకు సరిపోదు' లాంటివి మొదలవుతాయి. అందుకే ముందు జరిగిన సంఘటన తాలూకు అలలు శాంతపడి .. పిక్చర్ క్లియర్ అయ్యేదాకా ఆగడం మంచిది. ఇన్స్టంట్ కాఫీ కంటే డికాషన్ కాఫీ బాగున్నట్టు ... ఇన్స్టంట్ సారీ కంటే బాగా ఆలోచించిన చిక్కటి 'సారీ' రుచిస్తుంది ఎదుటి వారికి.

(మరీ ఎక్కువ టైం తీసుకుని కాఫీ చల్లారిపోయి .. తొరక ఏర్పడితే బాగోదు కూడా)


2. తప్పు ఏంటో క్లియర్ గా చెప్పడం, ఒప్పుకోవడం  ... పూర్తి బాధ్యత తీసుకోవడం 

'నేనేం తప్పు చేసానో నాకైతే అర్ధం కాలేదు ... అయినా నీ సంతోషం కోసం .. 'సారీ'... ఇలాంటివి పనికి రావు. (ఎనభై - తొంభై శాతం మన తప్పు మన ఆత్మసాక్షి కి  తెలిసే ఉంటుంది)

'నేను చేసింది నీకు బాధ కలిగించి ఉంటే..' ... 'నేనలా అనలేదు .. నువ్వే అలా అర్ధం చేసుకున్నావు .. ' ... 'అయినా ఇంత సెన్సిటివ్ అయితే ఎలా ...' ..... 'నువ్వు అది ఒప్పుకుంటే నేను ఇది ఒప్పుకుంటా' .... లాంటివి కూడా పనికి రావు ...

నేను <చేసిన తప్పు> చేశాను. దాని వల్ల <జరిగిన పరిణామాలు> జరిగాయి. దీనికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను.... అనే మాటలు వినిపించాలి.

'సారీ' అని క్లియర్ గా చెప్పాలట కూడా ...

ఇది చాలా కష్టమైన పని.

అయితే ఈ ప్రకృతి ఏ కష్టం ఉంచుకోదటలెండి ... ఎంత కష్టమైన పని చేస్తే అంతకు అంతా మంచి చేస్తుందట ..

ఇలాంటి నమ్మకాలు లేకపోయినా ఇంకో అసలైన లాభం ఉంది. ఇంత ఓపెన్ గా, షరతులు లేకుండా తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి లేదా ఈ సంఘటన చూసిన ఎవరికైనా మీ మీద గౌరవం పెరుగుతుంది. అసలు ఇంత కష్టమైన పని చేసాక మన మీద మనకే గౌరవం పెరుగుతుంది!


3. టైం ఇవ్వాలి 

'సారీ' చెప్పేసాను కదా ... ఇంక నవ్వాలి మరి... అని మీద పడి కితకితలు పెట్టేసి బలవంతంగా నవ్వించేయకూడదు మరి సినిమాల్లో లాగా.

ఆ తప్పు యొక్క తాకిడి అనుభవిస్తున్న వారికి 'సారీ' ఒక మానసిక ఉపశమనం. చాలా అవసరం. అయినా వారు ఈ క్షమాపణ స్వీకరించే స్థితి లో ఉండకపోవచ్చు ... వారికి  టైం, స్పేస్ ఇవ్వడం ముఖ్యం.

మీ పని మీరు చేసారని తెలుసుకొని సైలెంట్ అయిపోవడమే తక్షణ కర్తవ్యమ్.


4. మార్పే అసలైన క్షమాపణ 

ఇంత అందంగా 'సారీ' చెప్పేసి మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ అంతే అందంగా 'సారీ' చెప్తే దాన్ని మోసం అంటారు. (నా అనుభవం లో ఈజీ గా 'సారీ' చెప్పేసే వారు ఈ విషయం పూర్తి గా మర్చిపోతారు. 'సారీ' చెప్పేస్తే చాలు అనుకుంటారు...)

ఏ ప్రవర్తన ఇంత హాని కలిగించిందో ఆ ప్రవర్తన లో మార్పే క్షమాపణ కి అసలైన అర్ధాన్ని చేకూరుస్తుంది.


5. స్వీయ క్షమాపణ (ఈ మాట ఉందో లేదో తెలియదు ... సెల్ఫ్ ఫర్గివ్ నెస్ అనే అర్ధం లో వాడుతున్నా నేను)

తప్పు చేసిన వారు వారిని వారు క్షమించుకోవడం చాలా ముఖ్యం. ఓ తప్పు చేసాం. అది ఇప్పుడు మనం వెనక్కి తీసుకోలేనిది.

హిందీ హీరో ధర్మేంద్ర రాసిన ఓ కవిత లో

'गलतियों का पुतला, आखिर इक इंसान हूं मैं। Galtiyon ka putla, aakhir insaan hoon main' ...

తప్పులు చేసే బొమ్మ ని ... మనిషి ని కదా నేను! అంటాడు.

ఒక్కో సారి ఈ సైకాలజిస్టులు మరీ చాదస్తం గా చెప్తారు అన్నీ అనిపిస్తుంది.

మనం తప్పులు చేసే స్పీడ్ కి ఇలా ఐదు స్టెప్పుల ప్రాసెస్లు చేస్కుంటూ పోతే ఉద్యోగం, సద్యోగం, ఇంటి పని, పిల్లల పని .. వీటన్నిటికీ టైం ఎక్కడుంటుంది చెప్పండి? మానసిక ఆరోగ్యం... బంధాల్లో ఆరోగ్యం అంటూ కూర్చుంటే తొంభై తొమ్మిది శాతం పనులు చెయ్యలేం... ఎలాగూ అందరం రాటుదేలిపోయాం ... ఎవరో 'సారీ' చెప్పలేదు అని ఎవరూ జీవితాలు ఆపేసుకొని కూచోవట్లేదు .. ఇవన్నీ ఎవరూ expect కూడా చెయ్యట్లేదు. ఎందుకు కొత్తవి అలవాటు చెయ్యాలి?

మరెందుకు ఇదంతా రాసావు అంటే .... అయామ్ సారీ. 

Friday, February 1, 2019

బృంద పాకం

నాకు వంట చేయడం చాలా ఇష్టం. కొత్త రెసిపీలు ట్రై చేయడం ఇంకా ఇష్టం. ఎప్పుడైనా బాగా స్ట్రెస్ గా ఉంటే వంట చేస్తే హాయి గా అనిపిస్తుంది. 

నేను నాకు తెలిసినంత వరకూ శాకాహారిని. (నాకు తెలియకుండా నేను తిన్న ఆహరం లో, దినుసుల్లో ఏవైనా ingredients ఉండి ఉంటే మరి .. నాకు తెలియదు). చిన్నప్పుడు ఇంట్లో సంప్రదాయం వల్ల అయినా పెద్దయ్యాక మాత్రం బై ఛాయిస్ శాకాహారిని. వెజిటేరియన్ లో ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే నాకు కుతూహలం కూడా కలగలేదు నాన్ వెజ్ వైపు! ఇలా అంటే నాకు తెలిసిన చాలా మంది నాన్ వెజ్ తినే మిత్రులు నవ్వుకుంటారనుకోండి. అయినా ఫర్వాలేదు. 😄

వేగన్ అని ఇంకో జాతి ఉన్నారు .. అసలు వీళ్ళు పాల ఉత్పత్తులు ముట్టరు. నేను అంత గొప్ప కాదండి! వీళ్ళ వల్లే నాన్ వెజిటేరియన్లని నేను ఎక్కువగా అర్ధం చేసుకోగలిగాను. నన్ను పాల ఉత్పత్తులు మానెయ్యమంటే నేను ఎలా ఫీలవుతానో వాళ్ళు మాంసాహారం వదిలెయ్యమంటే అలాగే ఫీలవుతారు కదా! 

ఫుడీలకి వంట వచ్చేస్తూ ఉంటుంది ఏవిటో ... ఆహారం అంటే అభిరుచి ఉన్న చాలా మందిని చూసాను ... వారి లో దాదాపు అందరూ వంటకారులే! 

వంట లో నాకు అమ్మ మొదటి గురువు. ఇంటర్నెట్ రెండో గురువు. 

అమ్మ బ్రహ్మాండంగా వండుతారు. మా నాయనమ్మ గారు కూడా గొప్ప పాకశాస్త్ర విద్వాంసురాలట! ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి ఏం ఇష్టమో గుర్తుంచుకొని అదే చేసి పెట్టేవారట. మైసూర్ పాక్ (మైసూర్ పా అనేది కరెక్ట్ పేరట) వేడి వేడి గా మనిషిని కూర్చోపెట్టి చేసేసేవారట! (ఈ అట అట లు ఎందుకంటే నేను పుట్టకముందే ఆవిడ పోయారు) 

అమ్మ వంటలో నేను గమనించింది రుచే కాదు.. మన ప్రాచీన పాక జ్ఞానం తాలూకు అలవాట్లు కూడా. వానా కాలం లో ఆకు కూరలు చెయ్యదు అమ్మ. రాత్రి పూట పప్పు వండదు. ఆవ పెట్టిన కూర చేసిన రోజు చలవ చేసేందుకు ఏదో ఒకటి చేస్తుంది. నువ్వుల పొడి చల్లిన కూరలు వేసవి లో చెయ్యదు. (అక్క ఓ సంవత్సరమంతా అమ్మ చేసిన వంటల్ని డైరీ గా రాసి సంవత్సరం చివర్న అమ్మకి గిఫ్ట్ గా ఇచ్చింది!) 

వంటింట్లో చిన్న చిన్న పనులు అమ్మే చెప్పేది. కొంచెం పెద్దయ్యాక వేసవి లో రస్నా కలపడం, ఎవరైనా వస్తే నిమ్మకాయ రసం ఇవ్వడం అలవాటు చేసింది. నేను నిమ్మ రసం చేస్తే చాలా మెచ్చుకొనేది అమ్మ. పంచదార, నీళ్లు కరెక్ట్ గా వేసావే అనేది. దీంతో నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది! అమ్మ ఎప్పుడూ అవే తెలుగు వంటలు చేస్తుందని నార్త్ ఇండియన్ వంటలు ట్రై చెయ్యడం తో నా వంట మొదలు పెట్టాను. 

ఓ సారి మా ఫ్రెండ్ ఒకమ్మాయి రగడా చేస్కొచ్చింది. భలే ఉంది నాకు రెసిపీ చెప్పవా అంటే ఇష్టం లేకుండానే చెప్పింది. (ఒకప్పుడు రెసిపీలు దాచుకొనేవారు చాలా మంది వంటొచ్చినవాళ్లు ... ఇప్పుడు ఇంటర్నెట్ లో చిట్కాలు, ప్రొఫెషనల్ ట్రిక్స్ తో సహా పెట్టేస్తున్నారు .. అమ్మా, నేనూ అనుకుంటూ ఉంటాం .. ఇది ఎంత మంచి పరిణామమో కదా అని!) నేను ఆ రగడా ట్రై చేసాను .. ఎంత సేపటికీ ఆ అమ్మాయి చేసిన టేస్ట్ రాదే! తర్వాత తెలిసింది నేను చేసిన తప్పు .. ఆ అమ్మాయి శనగలు నానపెట్టమని చెప్పలేదు. నేను పెట్టలేదు. అవి ఎంతకీ ఉడకలేదు! 

ఇలాంటి డిజాస్టర్స్ నుంచి చాలా దూరమే వచ్చానిప్పుడు. 

కొంత మంది ఎక్కువమందికి భలే వంట చేసేస్తుంటారు. 

కొంత  మంది ఎలాంటి వంటయినా ఐదు నిముషాల్లో చేసేస్తుంటారు (మా అక్క లాగా)

నాకు ఈ రెండూ రావు (ప్రస్తుతానికి). 

టైం తీసుకుంటాను కానీ రుచి గ్యారంటీ 😄

వంట లో నా పరిణామ క్రమం బయట దొరికే జంక్ ఫుడ్ (శాండ్విచ్ లు, బర్గర్ లు, పులావులు.... తవా పులావు ... సేమ్యా పులావు ... కుక్కర్ పులావు ... పుదీనా, పనీర్ పులావు) లని ఇంట్లో ట్రై చేసే దగ్గర నుంచి తెలుగు వంటలు ... (కారం పెట్టి కూరలు, తీపి కూరలు, పచ్చళ్ళు, కంద బచ్చలి .. ఇవి తెలియకపోతే నువ్వు తెలుగమ్మాయివే కావు అనేలాంటివి), , నిల్వ పచ్చళ్ళు (కొత్తిమీర, పుదీనా, ఉసిరి) ... కొర్రలు వండటం ... వాటి తో కొబ్బరి అన్నం, కరివేపాకు అన్నం లాంటివి చేయడం... ఇక్కడకొచ్చి ఆగింది. 




స్వీట్లు చెయ్యడం నేర్చుకోవాలండి ... నిల్వ ఉంచేలాంటివి (సున్నుండలు, అరిసెలు గట్రా), అప్పటికప్పుడు తినేవి (పాయసం, డబుల్ కా మీఠా లాంటివి). జంతికలు, చేగోడీలు గట్రా కూడా నేర్చుకోవాలి. దోసె తిప్పడం ఇంకా రాదు. చపాతీ లు అక్క చేసినంత బాగా రావు (నిజానికి అసలు రావు... పిండి రాయి లా వస్తుంది .. చపాతీలు మందంగా ఉడికీ ఉడక కుండా వస్తాయి... చపాతీలు నేర్చుకున్నాక పరాఠాలు నేర్చుకోవాలి ఇంకా). 

చిన్నప్పుడు బీట్రూట్, కారట్ లాంటివి తినకుండా అమ్మని బాగా సతాయించే దాన్ని. నేనే వంట మొదలు పెట్టినప్పటి నుంచి కొంచెం ఇలాంటివి తగ్గాయి. తప్పదనుకుంటే అవే కూరల్ని నా ఇష్టం వచ్చిన రెసిపీ లో వండుకుంటా అన్నమాట (బీట్రూట్ సాంబార్ లాగా). 

ఇంటర్నెట్ లో నేను ఫాలో అయ్యే వంట ఛానెళ్లు .. బాబాయి హోటల్ లో రాళ్ళపల్లి గారి ఎపిసోడ్లు .... ఆయన నూనె వంకాయ, గుత్తి వంకాయ, గుండమ్మగారి గోంగూర అన్నం రెసెపీలు భలే బాగుంటాయి. అలాగే హెబ్బార్స్ కిచెన్ అనే ఇంకో ఛానెల్. ఎంత పెద్ద రెసిపీ అయినా ఎంతో సులువుగా చూపిస్తుంది ఆ అమ్మాయి. మాటలు ఉండవు ... కేవలం రెండు నిముషాల రెసిపీ వీడియో... ఆమె ఛానెల్ లో చాలా రెసిపీలు చేసేసా నేను. ఇడ్లి కి, దోసె కి ఒకే పిండి రెసిపీ ఆమె దగ్గరే మొదట చూసా! 

ఏ వంట కి ఆ మసాలా వాడటం నా అలవాటు. ఛోలే కి, పావ్ భాజీ కి, రాజ్మా కి, వాంగీ బాత్ కి, బిసిబెళె బాత్ కి ఆయా మసాలాలు వాడితేనే రుచిలో తేడా కనిపిస్తుంది. 

అలాగే ప్రాంతీయ వంటలు ట్రై చేసినప్పుడు వాళ్ళ చరిత్ర లాంటివి కూడా తెలుస్తూ ఉంటాయి! (బెంగాల్ కరువు లోంచి అవసరార్ధం మనకి పరిచయమైన దినుసు గసగసాలు! అలాగే మనం తినే కూరల్లో సగం అసలు మనవే కావు ... బంగాళా దుంప, పచ్చిమిరపల్లాగా. పావ్ భాజీ ముంబై లో ఫాక్టరీ వర్కర్ల కోసం 1850ల్లో కనిపెట్టబడిన వంటకం. రాజస్థాన్ లో వేడి ఇసక నే ఓవెన్ గా చేసుకొని పిండి ఉండలు కప్పెట్టేసి ఉడికాక బయటికి తీస్తారు. వీటిని 'బాటీ' అంటారు .. దాల్, చూర్మా ల తో తింటారు .. ఈ బాటీ ల మీద మనం బూరెల్లో వేసుకున్నట్టు బోల్డు నెయ్యి పోసుకొని తింటారు!) 

 మహారాష్ట్ర వారి మసాలాలు వేరే గా ఉంటాయి, రాజస్థాన్ వారి మసాలాలు వేరే గా ఉంటాయి. వెజిటేరియన్ వంటకాలు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర క్యూజిన్స్ లో బాగా కనిపిస్తాయి. (సౌత్ ఇండియా కాక). మన హైదరాబాద్ దక్కన్ మసాలాలు ఇంకోలా ఉంటాయి. వెజిటేరియన్ ఆప్షన్లు ఎక్కువ ఉన్న అంతర్జాతీయ క్యూజిన్ నాకు తెలిసినంత వరకూ ఇటాలియన్. వాళ్ళు తులసి వాడతారు వంటల్లో! పిజ్జా, స్పగెట్టి, బ్రుషెట్ట... ఇవన్నీ ఒరిజినల్ గా వెజిటేరియన్ వంటకాలే (మన హైదరాబాదీ వెజ్ బిర్యానీ లాగా కాక). ఇంటర్నేషనల్ షెఫ్ ల ప్రకారం వెజిటేరియన్ అంటే అందులో గుడ్డు సర్వ సాధారణం ఏంటో! 

ఎంత వంట ఇష్టమైనా రోజూ .. మూడు పూట్లా చెయ్యమంటే నేను చెయ్యలేను. అలా చేసే వారిని ఆరాధన తో చూస్తాను. 

ఇప్పుడు మనకి వినిపిస్తోంది .. వంటలు నగరాల్లో ఎక్కువగా చేసుకోవట్లేదని... కర్రీ పాయింట్లు సామజిక శాస్త్రవేత్తలకు వర్రీ పాయింట్లు గా తయారయ్యాయి. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఇంటి భోజనం క్యారేజీలు కట్టి ఇంటికే డెలివర్ చేయించుకొని ... వారికి నెలకి ఇంతని ఇస్తున్న వారున్నారు. వర్కింగ్ విమెన్ పెరగడం వల్ల ఈ పరిణామాలు  అనే అభిప్రాయం కూడా ఉంది (ఇది నిజం కూడా). 

వంటంటే కేవలం వంట కాదు ... కూరలు/దినుసులు తెచ్చుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, తరుక్కోవాలి. నాలుగు బర్నర్ల స్టవ్, మిక్సీ లు ఉన్నా నలుగురికి మూడు ఐటమ్స్ వండాలంటే మినిమమ్ గంట పడుతుంది. వంట అయ్యాక ఎక్కడివక్కడ వదిలేయలేం కదా ... మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంటికి దూరంగా ఉండే ఆఫీసుకి వెళ్లి, ఎనిమిది నుంచి పది గంటలు పని చేసి, తిరిగి వచ్చి ఇదంతా చేయడం కష్టం కదా! 

బృంద పాకం చేస్కోవచ్చు .. ఒకరు కూరలు తెచ్చి, తరిగిస్తే ఇంకొకరు వంట చేసి క్లీన్ చేస్కోవచ్చు. భలే ఫామిలీ బాండింగ్ ఎక్సర్సైజ్ ఇది! (స్వానుభవమున చాటు నా సందేశమిదే) ... అయినా కూడా ఇదే పని మూడు పూట్ల (పోనీ రెండు పూట్ల), రోజూ చేస్కోవడం కష్టం. 

అలాంటప్పుడు ఇంటి వంట చేస్కోలేకపోతున్నామని బాధ పడి ఆ ఇంటి గృహిణి ని గిల్టీ ఫీలయ్యేలా చేసే బదులు బయట ఇన్ని ఆప్షన్లు ఉన్నాయని ఆనందించడమే బెటర్ కదా! 

కొన్ని విషయాలు నేను ఫర్ గ్రాంటెడ్ తీసుకోను. 

అమ్మ చేతి వంట తినే భాగ్యం. 
కూరలు సులభంగా దొరకడం... కొనగలగడం. 
వంటింట్లో సౌకర్యాలు... అవి వాడుకోడానికి కరెంటు. 
మూడు పూట్లా కడుపు నిండే భోజనం. 

ఇవి వరాలే. వీటికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను. 

భూమి మీద ప్రతి మనిషి కీ, ప్రతి రోజూ...  మనసు, కడుపు నిండే భోజనం దొరకాలని ప్రార్థిస్తాను. 

Friday, January 25, 2019

నా టీవీ

టీవీ లో మన దేశం, రాష్ట్రాల కి చెందినవే కాక అంతర్జాతీయ ప్రోగ్రామ్స్ చూడటం నాకు  అలవాటు ... చిన్నప్పుడు దూరదర్శన్  ప్రసారం చేసిన జపాన్ దేశపు సీరియల్  'ఓషీన్'  లాంటి వాటి తో పాటు నేటి అమెరికన్ టీవీ షోల వరకూ. బిబిసి వాళ్ళ షెర్లాక్ హోమ్స్, ప్రైడ్ అండ్ ప్రెజుడీస్, అగాథా క్రిస్టీ 'పాయిరో' (Poirot) సీరియళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను! 

కాకపోతే ఇప్పుడు అమెరికన్ టీవీ షోలు టీవీ లో కాక అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటివాటి లో నే చూస్తుంటాను. కమర్షియల్ బ్రేక్స్ లేకుండా .. ఎన్ని ఎపిసోడ్లు ఏక బిగిన చూడగలిగితే అన్ని ఎపిసోడ్లు (దీన్నే ఇంగ్లీష్ లో binge watching (బిన్జ్ వాచింగ్) అంటారు!) 

అంతర్జాతీయ టీవీ.... (అమెరికన్ టీవీ, బ్రిటిష్ టీవీ) .. ముఖ్యంగా అక్కడి సిట్ కామ్స్ (సిట్యుయేషనల్ కామెడీలని కుదించి ఆ పేరు పెట్టారు) నాకు చాలా ఇష్టం. డిటెక్టివ్, క్రైమ్, పీరియడ్, హిస్టారికల్ .. ఇలా చాలా రకాల షోలు ఉంటాయి వాళ్ళవి. అక్కడ టీవీ సినిమా కంటే పెద్దది. టీవీ లోనే వినూత్నమైన ప్రయోగాలు మొదట చేయబడతాయి. 

అక్కడ షో క్రియేటర్స్ అని వేరే రకం వాళ్ళు ఉంటారు.  వాళ్ళ పని ఓ కొత్త షోలో పాత్రల్ని, వాళ్ళ ప్రపంచాన్ని సృష్టించడమే. (Chuck Lorre, Marta Kaufman, Nigel Lythgoe, Julian Fellowes, Simon Cowell ఈ కోవ కి చెందిన వాళ్ళు) ఎపిసోడ్లు కొన్ని మాత్రమే వాళ్ళు రాస్తారు. వాళ్ళ నుంచి రైటర్స్, డైరెక్టర్స్ సలహాలు తీస్కొని ఎపిసోడ్ కంటెంట్ క్రియేట్ చేస్తారు. 

వాళ్ళు ఒక షో మొదలు పెట్టే ముందే ఈ కథ ఎన్ని ఎపిసోడ్లు అని అనేసుకుంటారు. ఒక్కో సారి కొన్ని ఎపిసోడ్లు మాత్రమే షూట్ చేసి ప్రసారం చేస్తారు. వాటిని సీజన్స్ అంటారు. ఈ ఎపిసోడ్లు సంవత్సరానికి 24 వరకూ ఉంటాయి. మళ్ళీ ఆ షో చూడాలంటే ఇంకో సంవత్సరం ఎదురు చూడాల్సిందే! ఈ ఎదురుచూపులు వాళ్ళకి అలవాటే! ఒక సీజన్ కి ఆదరణ లేకపోతే షో కాన్సెల్ చేసేస్తారు.... నిర్దాక్షిణ్యం గా. 

(కొన్ని సంవత్సరాల తరబడి నిర్విరామంగా ఉన్న డైలీ సీరియళ్లు వాళ్ళకి కూడా లేకపోలేదు. అవి కూడా మెలోడ్రామాటిక్ గా ఉంటాయి అని వాళ్లే ఒప్పుకుంటారు .. జోకులేసుకుంటారు కూడా.)

అక్కడ వాళ్ళు టీవీ షోలకి ఎంత అభిమానం చూపిస్తారంటే ... ఇంటర్నెట్ లో వాటికి ఫాన్ సైట్లు ఉంటాయి. ఫాన్ ఫిక్షన్ అనే ఇంకో తమాషా అలవాటు ఉంది వాళ్ళకి. షో లో వచ్చే సీజన్  ఏం జరగబోతోందో ...ఏం జరిగితే బాగుంటుందో (అయిపోయిన ఎపిసోడ్లలో ఏం జరిగితే బాగుండేదో)... ఊహాగానాలు, వీళ్ళ సొంత స్క్రీన్ ప్లేలు లాంటివి బ్లాగుల్లో, ఇంటర్నెట్ ఫారమ్స్ లో రాసేసుకుంటూ ఉంటారు! 

వాళ్ళకి హాలోవీన్ అనే పండగ ఉంది కదా ... ఆ రోజు విచిత్ర వేషధారణ లో తిరుగుతూ ఉంటారు .. ఆ వేషాల్లో టీవీ పాత్రల వేషాలు కూడా వేస్తారు! అంతగా ప్రజల జీవితాల్లో భాగమయిపోతాయి అక్కడి టీవీ కార్యక్రమాలు! 

అందులో వాళ్ళ తప్పు లేదు ..😉. అవి ఎంత తమాషా/ముఖ్యమైన/నవ్వించే/అలరించే విషయాలను స్పృశిస్తూ ఉంటాయి అంటే నచ్చక మానవు! ఈ దేశం లో ఉండే నాలాంటి చాలా మంది అభిమానులు ఉన్నారు అమెరికన్ టీవీ కి! 

నాకు నచ్చిన కొన్ని షోలు .. నేను మళ్ళీ మళ్ళీ చూసేవి, ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. 

1. ఫ్రెండ్స్ - నాదొక కొటేషన్ ఉంది .... ప్రపంచం లో రెండే జాతులు ఉన్నాయి ... 'ఫ్రెండ్స్' షో నచ్చినవారు .. 'ఫ్రెండ్స్' షో చూడనివారు అని. ఆ షో అంత ఇష్టం నాకు. ఈ షో కి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇందులో ఉన్న ఆరుగురు ముఖ్య పాత్రలకి పదేళ్ల క్రితమే ఎపిసోడ్ కి ఒక మిలియన్ డాలర్లు చెల్లించే వారు. అంత హిట్ ఈ షో.  1994 నుంచి 2004 వరకూ ఓ పదేళ్ల పాటు .. సంవత్సరానికి 24 ఎపిసోడ్ల చప్పున నడిచిందీ సిట్ కామ్. మన్హట్టన్ లో ఉండే ఆరుగురి మంచి మిత్రుల కథ. ఇది నేను కొన్ని పదుల సార్లు మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ చూసేసి ఉంటాను. అన్ని సార్లు చివరి ఎపిసోడ్ చూసి బాధేస్తుంది... I miss them badly! 

2.  క్రిమినల్ మైండ్స్ - సీరియల్ కిల్లర్ల సైకాలజీ ని అర్ధం చేస్కుంటూ వాళ్ళని పట్టుకోవడమే పని గా ఉండే FBI లో ఓ టీం కి వచ్చే కేసులే ఈ షో ఎపిసోడ్లు. ఈ షో ఒకే సారి ఎక్కువ ఎపిసోడ్లు చూడలేం .. కొంచెం గుండె దిటవు చేసుకోవాలి! యదార్ధాల తో సంబంధం ఉన్న కేసులు ఇవి .. అయినా హింస ని ఎంత వరకూ చూపించాలో అంత వరకే చూపిస్తారు. సైకోలని, సేడిస్టులని పట్టుకొనే వాళ్ళ జీవితాలు కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయో ఇందులో చూపిస్తారు. 

3. మాడర్న్ ఫామిలీ - ఈ షో ఇంకా నడుస్తోంది. అమెరికా లో ఉండే ఓ నేటి తరం ఫామిలీ ... వారి జీవితాల్లో జరిగే కామెడీ ... ఈ సీరియల్ లో మొదటి సారి ఓ గే కపుల్ ని చూపించారు. వాళ్ళు ఈ మాడర్న్ ఫామిలీ లో ముఖ్య పాత్రధారులు .. వాళ్ళ సంసారం చూస్తే మనకి చాలా నార్మల్ గా అనిపిస్తుంది .. దంపతుల మధ్య ఉండే పోట్లాటలు, అలకలు, పిల్లల్ని పెంచడం ... అన్నీ మామూలు గా ఉంటాయి .. ఇందులో ఆశ్చర్యం ఏముంది .. వాళ్ళూ మనుషులే కదా అనిపిస్తుంది! 

4. సో యూ థింక్ యూ కెన్ డాన్స్ - ఇదొక డాన్స్ రియాలిటీ షో. కళ ... దాని అత్యంత ప్యూర్ రూపం లో ఈ షో లో కనిపిస్తుంది. డ్రామా అస్సలు ఉండదు. ప్రపంచ నాట్య రీతులన్నీ ...  ఒక్కొక్క వారం చెయ్యాలి సెలెక్ట్ అయినవాళ్లు. ఒకే రీతి లో ట్రెయిన్ అయిన వాళ్ళు ఒక్కో వారం వాళ్ళకి అంత వరకూ పరిచయం లేని ఓ కొత్త నాట్య రీతి లో కేవలం ఏడు రోజుల్లో ట్రెయిన్ అయ్యి చేస్తూ ఉంటే చూడటానికి భలే ఉంటుంది! అక్కడి డాన్సర్లు ఫిట్ నెస్ కి ఎంత విలువ ఇస్తారు .. శరీరాన్ని ఎంత చక్కగా చూసుకుంటారు .. ఇలాంటివి చూస్తే ముచ్చటేస్తుంది. మన దేశం లో మొదలైన ఎన్నో డాన్స్ రియాలిటీ షోలకి, డాన్సర్లకి, ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్లకి ఈ షో నే స్ఫూర్తి! 

5. మాస్టర్ షెఫ్ - ఇది అమెరికన్ షో కాదు .. ఆస్ట్రేలియన్ షో. ఇది కూడా రియాలిటీ షో యే. వంటలకి సంబంధించింది. ప్రొఫెషనల్ అనుభవం లేని ఇంట్లో వంటలు వండుకుంటూ వేరే ఏదో ఉద్యోగం చేస్కుంటూ కుకింగ్ అంటే పాషన్ ఉన్న అమెచ్యూర్ కుక్స్ ని కొంత మందిని సెలెక్ట్ చేసి వారి మధ్య పోటీ పెడతారు. ఇందులో కూడా డ్రామా ఉండదు. పాక కళ ని ఎంత కూలంకషంగా ఈ షో చూపిస్తుందో! ఈ షో లో ఓ విషయం చూసి ఆశ్చర్యపోయా నేను ... ప్రతి వారం గెస్ట్ జడ్జి లు గా షెఫ్ లని పిలుస్తూ ఉంటారు. ఈ పోటీదారులందరికి ఆ షెఫ్ లు తెలియడమే కాదు .. మనం సినీ తారల్ని అభిమానిస్తాం చూడండి .. ఆ లెవెల్లో ఉంటుంది వీళ్ళ అభిమానం! 

6. ది బిగ్ బ్యాంగ్ థియరీ - ఇది కూడా ఇంకా వస్తోంది. అమెరికా లో బాగా చదువుకొనే వాళ్ళని గీక్స్ అనీ, నెర్డ్స్ అనీ వెక్కిరిస్తారు. మనం పుస్తకాల పురుగులు అంటాం చూడండి .. అలా అన్నమాట. వీళ్ళకి పుస్తకాలే తప్ప ప్రపంచం లో ఎలా ఉండాలో తెలియదు అని, వీళ్ళకి అమ్మాయిలు పడరు అని నవ్వుకుంటారు. అలాంటి నలుగురు కుర్ర మేధావుల కథ ఇది. (అందులో ఒకడు భారతీయుడే!) ఇందులో నాకు చాలా విషయాలు ఇష్టం. అమ్మాయి మేధావుల  పాత్రలు (ఏమీ, బెర్నాడెట్ అనే ఇద్దరు ఆడ సైంటిస్ట్ లు) ఇందులో ముఖ్య పాత్రధారులు. సైన్స్ రంగం లో మేధావులు, నోబెల్ గెలిచిన వారు ఇందులో గెస్ట్ స్టార్స్ గా వస్తూ ఉంటారు ... (స్టీఫెన్ హాకింగ్ వస్తారు ఓ ఎపిసోడ్ లో!) 

7. డౌన్ టన్ ఆబీ - ఇది ఓ బ్రిటిష్ టీవీ షో. ఆరు సీజన్ల పాటు వచ్చింది. 1900 ల్లో ఓ ఎస్టేట్ లో జరిగే కథ. రెండో ప్రపంచ యుద్ధ కాలం కూడా కవర్ చేస్తుంది ఈ షో. బ్రిటిష్ వాళ్ళ భేషజపు జీవితం, సర్వెంట్ సిస్టం, యుద్ధం వాళ్ళని మార్చిన తీరు, ఆడవారి జీవితాల్లో వచ్చిన మార్పు, అప్పటి హెయిర్ స్టైల్స్, కార్లు, చెప్పులు, బట్టలు, భావజాలాలు  ... ఒకప్పుడు పరిస్థితి ఇంత భయంకరంగా ఉండేదా అని అనిపిస్తుంది ఈ సీరియల్ చూస్తే! ఈ షో షూట్ చెయ్యడం కోసం ఓ నిజమైన కాజిల్ ని తీసుకున్నారు .. లండన్ కి కొద్ది దూరం లో ఉంటుందట అది. నేను ఈ సీరియల్ మీద వచ్చిన ఓ పుస్తకం కొనేసాను .. ఎప్పటికైనా High Clere Castle ని చూడాలనే ప్లాన్ వేసుకున్నాను! 



8. గేమ్ ఆఫ్ థ్రోన్స్ - దీని గురించి మాట్లాడకపోతే ఎలా? ఇది ఆఖరి సీజన్ ఏప్రిల్ లో వస్తోంది. సంవత్సరంన్నర నుంచి వెయిటింగ్ దీని కోసం! రాచరికపుటెత్తులు ... రణరంగపు జిత్తులు .. చరిత్ర లో నిజంగా జరిగిన జుగుప్సాకరమైన హింస ... వీటిని చూపిస్తుంది ఈ సీరియల్. ఒక పుస్తకం ఆధారంగా తీశారు. పుస్తకం లో ఉన్న హింసే ఎక్కువట .. అది చూపించలేక సీరియల్ లో తగ్గించారట!! ఇప్పటికే ఆఖరి సీజన్ ఎలా ఉండబోతోందో అని అభిమానుల ఊహాగానాలు మొదలయిపోయాయి. నాకు మాత్రం డైరెక్ట్ గా షో చూడటమే ఇష్టం. ఇలాంటివాటి లో పాల్గొనేంత ఓపిక లేదు! 

ఇవి కాక Castle, White Collar, How I met your mother, Lie to me, Glee.. డిస్నీ ఛానల్ లో వచ్చిన 'That's so raven', 'Lizzie Mcguire', 'The Suite Life of Zack and Cody', 'Wizards of Waverly Place' నాకు నచ్చిన టీవీ షోలలో కొన్ని. 


ఈ షోలు రాస్తున్న, డైరెక్ట్ చేస్తున్న, ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్లంటే నాకు చాలా గౌరవం. నేను సోషల్ మీడియా లో ఫాలో అయ్యే వాళ్లలో ఎక్కువ వీళ్ళే ఉంటారు. 

ఓ పుస్తకం చదివితే ఎంత మనసు వికసిస్తుందో ఈ సీరియల్స్ కూడా నాకు ఈ ప్రపంచపు పరిజ్ఞానం తెలుసుకోవడం లో అంతే హెల్ప్ చేశాయి. అమెరికన్ల షోలు ఎన్ని చూసా అంటే హాలోవీన్, థాంక్స్ గివింగ్ లాంటి వాళ్ళ పండగల గురించి తెలిసింది!. బ్లాక్ హిస్టరీ మంత్ లాంటి వాటి గురించి తెలిసింది. వాళ్ళ మాండలికాలు తెలిసాయి (సదరన్ ఆక్సెంట్ లాంటివి). న్యూ యార్క్ కి ఎప్పుడూ వెళ్లకపోయినా అక్కడ రోడ్లని గుర్తుపట్టగలనని నా నమ్మకం 😁

ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మీద ఉండే అపోహలు తొలగిపోయాయి. వాళ్ళకి కూడా కుటుంబాలంటే ఇష్టమే. వాళ్ళు లూజ్ క్యారెక్టర్లు కారు. వాళ్ళ దగ్గర డైవోర్సులు ఎక్కువే .. కానీ  అది వాళ్ళు లైట్ తీసుకొనే విషయమేమీ కాదు. 

వాళ్ళ సీరియల్స్ లో కూడా తల్లిదండ్రులు వర్రీ అవుతూనే ఉంటారు .. మిడిల్ క్లాస్ డబ్బు కష్టాలు వాళ్ళకీ ఉంటాయి ... 

ప్రపంచమంతా కుగ్రామంగా మారుతున్న ఈ కాలం లో ఇలాంటి ప్రిజుడిస్ లు తొలగడమే మంచిది కదూ ... వాళ్ళు ఇంకా భారత దేశాన్ని పాములాడించేవాళ్ళ దేశమనుకుంటే మనకి కోపం రాదూ?

Friday, January 18, 2019

నుమాయిషీవైభవం

హైదరాబాద్ లో ఉంటూ నుమాయిష్ కి వెళ్ళకపోతే ఈ నగరానికి ద్రోహం చేసినట్టే. 

రోడ్డు మీద, బిల్డింగ్ మెట్ల మీద జర్దా ఉమ్ములు ఉమ్మే వాళ్ళ పాపం కంటే పెద్దది ఇది. 

పాప భీతి తో కాకపోయినా షాపింగ్ ప్రీతి తో ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరుల్లో నాంపల్లి లో జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఉరఫ్ ఎగ్జిబిషన్ అని పిలుచుకోబడే నుమాయిష్ కి నేను తప్పనిసరిగా వెళ్తాను. 

గత 20 ఏళ్ళు గా ఏదో ఒకటో రెండో సంవత్సరాలు మిస్ అయ్యుంటానేమో. 

నాకు ఆ వాతావరణం చాలా నచ్చుతుంది. (పైగా మా ఇంటికి దగ్గర.)

మాల్స్ రాక దశాబ్దాల మునుపే ప్రారంభమైన షాపింగ్ కల్చర్ ఇది! 

నగరం లో జరిగే ఈ జాతర సజావు గా సాగడానికి పోలీసులు చాలా కష్టపడతారు! 

ఏసీ లేకపోయినా చలికాలం అవ్వడం వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణం. అంత మంది జనం... అన్ని లైట్ల వల్లనో ఏమో చలి అనిపించదు. 

నుమాయిష్ లో నాకు అత్యంత ప్రీతికరమైన విషయం... పాత హిందీ పాటలు నిరంతరాయంగా స్పీకర్లలో వస్తూ ఉండటం! అంత కన్నా ఇష్టం .. మన చుట్టూ ఉన్న కొంత మంది వాటి తో పాడుతూ ఉండటం!

నిన్న కిషోర్ కుమార్ పాట వస్తోంది 'తేరీ దునియా సే ... హోకే మజ్బూర్ చలా .... మే బహుత్ దూర్ ... బహుత్ దూర్ ... బహుత్ దూర్ .. చలా' 

నేనూ, అక్కా ఆ పాట తో బాటే పాడుకున్నాం సరే ... మా పక్క నుంచి వెళ్తున్న ఇద్దరు ముగ్గురు కూడా అదే హమ్మింగ్ చేస్తూ వెళ్ళారు! 

ఆ హిందీ సినిమా .. ఆ పాట ... ఆ సంగీత దర్శకుడు .. ఆ పాట రాసినయన .. రాయించిన డైరెక్టరు ... పాడినాయన ... ఎంత ఆనందించి ఉంటారు! ఇలా జనాల జీవితాలలో కలిసిపోడానికే కదా కళాకారుడు కళను సృష్టించేది! 

నాకు నుమాయిష్ లో నచ్చేది ఇంకోటి. దాని ముఖ్య ఉద్దేశం. నుమాయిష్ అంటే ప్రదర్శన ... అంటే కొనే ప్రెషర్ లేదు! 

కొనకపోతే కనీసం అటువైపు చూడకూడదు అనే మొహమాటం మా అక్కకి. నాకేమో అన్నీ చూసి తెలుసుకోవాలని కుతూహలం. మేమిద్దరం స్టాల్స్ ముందు తచ్చాడుతుంటే  'ఆయియే మేడమ్ ...దేఖియే ... దేఖ్నే కే పైసే నహీ లగ్తె' (రండి మేడమ్ ... చూడండి .. చూడటానికి డబ్బులేం తీస్కోములెండి) అంటూ ఉంటారు ఫ్రెండ్లీ గా ఉండే స్టాల్ వాళ్ళు! ఇంకేం కావాలి చెప్పండి నాలాంటి పిచ్చోళ్ళకి! 😉

కశ్మీర్, లక్నౌ చికాన్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా వాళ్ళ స్టాల్స్ నాకు చాలా ఇష్టం. శిల్పారామం లాంటివి రాక ముందు ఆ రాష్ట్రాల నుంచి వస్తువులను చూసే, కొనే అవకాశం నుమాయిష్ లోనే ఉండేది. 

డ్వాక్రా, మెప్మా, ఖాదీ ఉద్యోగ్ లాంటి స్టాల్స్ కూడా నచ్చుతాయి. తెలుగు రాష్ట్రాల జిల్లాల నుంచి వారు తీసుకొచ్చే హస్తకళలు, వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు, తేనె, జున్ను, స్నాక్స్ చాలా బాగుంటాయి. ఈ సారి గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళ స్టాల్ లో కొత్తిమీర పచ్చడి (టేస్ట్ కి పెట్టారు ఆవిడ .. ఎంత బాగుందో!), ఊరి మిరపకాయలూ తీసుకున్నాం. ఒక చోట పూర్తిగా తృణధాన్యాల తో చేసిన స్నాక్స్ .. జొన్న, కొర్ర జంతికలు, రాగి మిక్చర్,  లాంటివి మేము మొహమాట పడుతున్నా టేస్ట్ కి పెట్టారు. రుచిగా ఉన్నాయి! జొన్న జంతికలు తీసుకున్నాం. 

కారాగార శాఖ వారి స్టాల్ మేము తప్పకుండా చూస్తాం ప్రతి సంవత్సరం. ఏ ఏటికి ఆ ఏడు ఏదో  ఒక కొత్త వస్తువు కనిపిస్తుంది వారి ఉత్పత్తుల్లో. గత కొన్నేళ్లుగా ఆకు కూరలు, కాయగూరలు, పళ్ళు పెడుతున్నారు. అక్కడ కొన్న తోటకూర నేను జీవితం లో తిన్న బెస్ట్ తోటకూర! ఈ  మధ్య పెయింటింగ్స్ పెడుతున్నారు ఖైదీలు వేసినవి. Stools లాంటి చిన్న ఫర్నిచర్ ఎప్పుడూ ఉండేది .. ఈ సారి అలమరలు, వార్డ్ రోబ్స్ కూడా కనిపించాయి. 

నిన్న తెలంగాణ గిరిజనుల అభివృద్ధి శాఖ వారి చిన్న స్టాల్ కనబడింది. తేనె, సహజమైన పదార్ధాల తో చేసిన సబ్బులు అవ్వీ ఉన్నాయి. 

చిన్నప్పుడు జైంట్ వీల్ ఎక్కేదాన్ని కానీ అసలు ఇప్పుడు పెద్ద ఇంట్రస్ట్ లేదు (భయం అనేకంటే ఇంట్రస్ట్ లేదు అనడం బాగుంది కదూ). వాటి ముందు నుంచొని కొంచెం సేపు చూస్తాను అంతే! ఫన్నీ మిర్రర్స్ ఉండేవి ... ఒక సారి వెళ్ళాను. చాలా నవ్వొచ్చింది .. నేను ఒక్కొక్క అద్దం లో వింత వింతగా కనిపిస్తుంటే! ఎగ్జిబిషన్ ట్రైన్ లో ఇన్ని సార్లలో ఒక్క సారి కూడా ఎక్కలేదు (దీనికి భయం కారణం కాదు లెండి.... ఆ టికెట్ లైన్ లో నుంచోడం బోరు ). కొన్నేళ్ల క్రితం వరకూ ఈ ట్రైన్ పట్టాల మీదే నడిచేది! ఈ మధ్య మామూలు బండి లాగే టైర్ల మీద నడుస్తోంది. 

నేను ఎగ్జిబిషన్ కి ఎందుకు వెళ్తాను అని ఓ ఐదు కారణాలు రాస్తే అందులో ఒకటి .. అక్కడి 'సాత్విక్ ఆహార్' షాపు. ఇది స్టాల్ కాదు. ఖాదీ గ్రామోద్యోగ్ వారి షాపు. ఎప్పుడూ అక్కడే ఉంటుంది. వారు 30 రూపాయలకి వేడి వేడి కిచిడి పెడతారు ... చాలా బాగుంటుంది. వాళ్ళది స్టాండర్డ్ మెనూ అన్నేళ్ళ నుంచి. పెరుగు వడ, అరటి పండు గుజ్జు తో చేసే ఫ్రూట్ సలాడ్, చారు/రసం లాంటి వేడి వేడి సూప్, మొలకలు/ఉడకపెట్టిన పల్లీలు.... ఇలాంటివే. ఇక్కడ తినందే నా యాత్ర కి ఫలితం దక్కదని ఫీలవుతుంటాను. 

నాకు ఎగ్జిబిషన్ లో నచ్చేది ఇంకోటి. డబ్బు తో సంబంధం లేకుండా వినోదాన్నిస్తుంది. నేను టికెట్ డబ్బులు ప్లస్ ఇంకో వంద రూపాయలు తప్ప ఇంకేం ఖర్చు పెట్టనప్పుడు ... ఓ రెండు వేలు ఖర్చు పెట్టినప్పుడు...  అదే ఆనందాన్ని పొందాను. 

ఎడమ నుంచి కుడికి: అక్కా, నేను, నుమాయిష్ వెలుగులు 

కొన్ని కుటుంబాలు పులిహోరలు, పులావులు ఇంట్లో వండుకొచ్చి ఎగ్జిబిషన్ మధ్య ప్లేస్ చూసుకుని దుప్పటి పరుచుకొని పిక్నిక్ చేస్కోవడం చూసాన్నేను. (సినిమా హాల్స్, మాల్స్ లో లాగా కాక ఇంటి నుంచి ఫుడ్ ని అనుమతిస్తారు ఇక్కడ). ఈ మధ్య ఈ ట్రెండ్ బాగా తగ్గింది. వండటానికి ఓపిక తగ్గడం ... బయట ఇన్ని రుచులు దొరకడం .. పిల్లలు బయటి ఫుడ్డే ప్రిఫర్ చెయ్యడం, పర్చేసింగ్ పవర్ పెరగడం లాంటి కారణాలు అయ్యుండొచ్చు.

ఇన్నేళ్ళ నుంచి వెళ్తున్నా నేను చూడని కొన్ని కోణాలున్నాయి ఈ ఎగ్జిబిషన్ కి .. ఉదాహరణ కి ... ఓ రోజు కేవలం ఆడవాళ్లకే ఉంటుందట. ఈ సారి ఆ రోజు వెళ్లి చూడాలి. ఇందాక చెప్పినట్టు ట్రైన్ ఎక్కాలి. మౌత్ కా కువా అనే షో చూడాలి (బావి లాంటి దాంట్లో మోటర్ సైకిల్ నడుపుతారు చూడండి .. అది). 

ఈ సంవత్సరం 'ఎగ్జిబిషన్ మూసే టైం అయింది' అనే అనౌన్స్మెంట్ వినడం కొత్త అనుభవం. (యే నుమాయిష్ కీ ఆవాజ్ హై ... అని మొదలవుతాయి అనౌన్సుమెంట్లు!) ఎప్పుడూ ఇంత లేట్ వరకూ ఉండలేదు! 

ఎగ్జిట్ దగ్గరకి రాగానే యాదృచ్చికంగా స్పీకర్స్ లో ఈ పాట 'చల్తే చల్తే యూన్ హీ కోయీ మిల్ గయా థా .....' 

Friday, January 11, 2019

వ్యసనానికి మందు

వ్యసనాల గురించి మనందరికీ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. 

వ్యసనపరుల్ని అసహ్యించుకుంటాం. బలహీనులు గా చూస్తాం. డిసిప్లిన్ లేని వాళ్ళు అని చులకన చేస్తాం. వాళ్ళు మారనందుకు కోప్పడతాం... విసిగిపోయి వాళ్ళని వెలేస్తాం.  

అలాగే వ్యసనం అనే హెడ్డింగ్ కింద కొన్ని పేర్లే రాస్తాం ... తాగుడు, డ్రగ్స్, జూదం... ఇలా. 

నేను చదివిన, చూసిన, అనుభవించిన విషయాలని పరిశీలిస్తే ఇది పూర్తి నిజం కాదు అని తెలిసింది. 

వ్యసనాలని ఈ మధ్య ఓ వ్యాధి గా పరిగణించడం మొదలు పెట్టారు. ('మహానటి' సినిమా లో డైలాగ్ గుర్తుందా?)

నాకు ఇది సబబు గా అనిపించింది. 

ఇది కూడా ఓ వ్యాధే అని తెలిస్తే మన కటువైన దృష్టి కోణం మారుతుంది. (తలనొప్పి వచ్చినవాడ్ని చూసి జాలి పడతాం, సహాయపడతాం కానీ అసహ్యించుకోము కదా)

ఇది జబ్బే. దీనికి చికిత్స కావాలి. అది కూడా ప్రొఫెషనల్ చికిత్స. 

తాగనని పెళ్ళాం బిడ్డల మీద, దేవుళ్ళ మీద ఒట్టేయించుకోవడం లాంటివి కాదు దీనికి మందు. 

వ్యసనానికి ఓ కారణం పలాయనవాదం. నిజ జీవితం భరింపరానిది గా మారినప్పుడు, ఎదుర్కొనే శక్తి లేనప్పుడు.. ఏదో ఎస్కేప్ వెతుక్కుంటాం. 

మనకి తోచిన వ్యసనాన్ని మనం ఎంచుకుంటాం. 

(ఇది ఇంకో కోణం ... ఎవరు ఏ వ్యసనాన్ని ఎందుకు ఎంచుకుంటారు? మద్యం ఎందుకు అన్నిటికంటే పాపులర్? అవైలబిలిటీ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది అనుకుంటా .. వీధి బాలలు వైట్నర్ ని ఎంచుకున్నట్టుగా) 

బయటికి కనిపించేవి కొన్ని. 

కానీ అసలు మనం గుర్తించని వ్యసనాలెన్నో. 

Renaissance Man అని ఓ ఇంగ్లీష్ సినిమా ఉంది. అందులో ఓ పాత్ర కి స్ట్రెస్ కలిగినప్పుడల్లా నిద్రపోతుంటాడు .. గంటలు గంటలు! అది అతని వ్యసనం. ఇది చూసి నేను ఆశ్చర్యపోయాను రెండు విషయాల్లో ... 

1. నిద్ర కూడా వ్యసనమేనా అని
2. నా అతి నిద్ర కి కారణం ఇదా అని 

ఒకప్పుడు ఆరోగ్యం, ప్రొఫెషనల్ లైఫ్ .. రెండూ అంతగా బాగోనప్పుడు నేను కూడా గంటలు గంటలు నిద్రపోయే దాన్ని. అది నా ఎస్కేప్. మెలకువ గా ఉంటే ఈ లోకం తో, నా ఆలోచనలతో, నా వైఫల్యాలతో డీల్ చెయ్యాలి .. నిద్రపోతే ఇవేవీ ఉండవు. 

ఫామిలీ హెల్ప్ తో నేను ఈ ఫేజ్ నుంచి బయటికొచ్చాననుకోండి. 

అప్పటి నుంచి వ్యసనాల బారిన పడిన వారి మీద ఎంపతీ పెరిగింది. అలాగే అందరూ గుర్తించని వ్యసనాల మీద కుతూహలం కూడా. 

కొంత మంది ఎమోషనల్ ఈటర్స్ ఉంటారు ... ఎక్కువ తింటూ ఉంటారు .. మనసుకి బాధ కలిగినప్పుడు ఇంకా ఎక్కువ తింటూ ఉంటారు. ఇదీ వ్యసనమే. 

కొన్ని మంచి విషయాలు మితిమీరినా వ్యసనమే ..... కొంత మంది పుస్తకాల ప్రపంచం లోంచి బయటికి రారు. రియాలిటీ లో ఉండటం ఇష్టపడరు. (ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ లో మిస్టర్ బెన్నెట్ పాత్ర లాగా) తులసీదాస్ .. పుట్టింట్లో ఉన్న భార్య ని ఎలాగైనా చూడాలని తుఫాను లో నానా కష్టాలూ పడి ... ఆమె మేడ ని దొంగ చాటు గా ఎక్కి .. ఆ ప్రయత్నం లో ఓ పాము ని ఊడ అనుకొని గోళ్ళతో రక్కి చంపేసి మరీ ఆమెని కలిస్తే ఆమెకి రొమాంటిక్ గా అనిపించదు సరికదా అసహ్యించుకుంటుంది. ఎందుకంటే భార్య పట్ల అతని ప్రేమ వ్యసనంగా మారింది. 

ఇలాంటిదే మిత్రుల వ్యసనం. వీళ్ళ చుట్టూ ఎప్పుడూ కొంత మంది ఉండాలి.. వాళ్ళకి అన్నీ వీళ్ళే కొంటారు .. ఆస్తులు కరిగించేస్తారు .. ఆ మిత్రులు వీళ్ళకి తిరిగి ఏమీ చెయ్యరు (వాళ్ళు నిజమైన మిత్రులు కారు కనుక). 

వర్కహాలిక్ అని ఇంగ్లిష్ లో ఓ మాట ఉంది... వీళ్ళకి పని ఓ వ్యసనం. వీళ్ళ జీవితం లో మిగిలిన డిపార్ట్మెంట్స్ (కుటుంబం, స్నేహితులు, సరదాలు, ఆరోగ్యం) ఇలాంటివి బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. 

షాపహాలిక్ అని ఇంకో రకం ... డబ్బులు అయిపోయి క్రెడిట్ కార్డుల వాళ్ళు వెంటపడుతూ ఉన్నా వీళ్ళు షాపింగ్ ఆపలేరు. తమ లో ఎంప్టీ ఫీలింగ్ ని కొత్త వస్తువుల తో నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 

ఇంకో తమాషా రకమైన వ్యసనం ఉంది. వ్యక్తుల వ్యసనం. ఫలానా వ్యక్తి అంటే మనకి ఇష్టం. కానీ వాళ్ళు మనని పట్టించుకోరు, ఇష్టపడరు, సహాయపడరు, వాళ్ళకి మన మీద ఇంటరెస్ట్ లేదు. (ఇది వాళ్ళ తప్పు కాదు కూడా) అయినా వాళ్ళ తో అలాగే ప్రేమ లేని బంధాల్లో చిక్కుకొని వదల్లేకుండా పడి ఉంటాం. ఇదీ వ్యసనమే. 

ఓ భర్త తాగుబోతు. అతని చేత ఎలాగైనా తాగుడు మాన్పించాలి అని భార్య ప్రయత్నం. ప్రాపంచికంగా అన్ని ప్రయత్నాలూ చేసి విఫలమయ్యాక దేవుడి వైపు తిరిగింది. గంటలు గంటలు పూజలు, కళ్ళు తిరిగిపోయి ఆరోగ్యం పాడయిపోతున్నా కఠోరమైన ఉపవాసాలు, దీక్షలు, మొక్కులు, బాబాలు, తాయత్తులు, లేహ్యాలు ... 

ఆ ఇంట్లో ఇద్దరు వ్యసనపరులు 

ఒకరు మద్యం 
ఒకరు మతం 

ఒకరికి తాగుడు 
ఒకరికి దేవుడు 

జ్యోతిషం లాంటి వాటిని మితిమీరి ఉపయోగించటం .. ఇది ఇంకో రకమైన ఆధ్యాత్మిక వ్యసనం ... 

'తప్పని తెలిసినా మానలేకపోతున్నాను' 'వద్దనుకుంటూనే చేసేస్తున్నాను' అనే మాటలు మీ నుంచి ఏ విషయం లో వచ్చినా అది వ్యసనమే అని హింట్. మీ అలవాటు ఏదైనా మీ కుటుంబాన్నీ, మీ మిత్రులని మీ పట్ల వర్రీ అయ్యేలా చేస్తుండటం మీకు ఇంకో హింట్. 

మనలో ఏదో ఖాళీ ని ఈ వ్యసనాలు పూరిస్తాయి అనుకోవడం వల్లే మనం వీటి బారిన పడతామేమో 

కానీ ఏ వ్యసనమైనా అడ్డదారే. గుర్రాల రేసులు, లాటరీల లాగా. But in life, there are no short cuts. 

ఆ ఖాళీ ఏదో తెలుసుకోవడం ముఖ్యం ... దేన్నుంచి పారిపోయి ఈ వ్యసన బిలం లో దాక్కుంటున్నామో తెలుసుకోవడం ముఖ్యం .. తెలిసాక దాన్ని వ్యసనం తోడు లేకుండా ఎదుర్కోడానికి రెడీ అవ్వడం ముఖ్యం 

ఈ విషయం లో మన సపోర్ట్ సిస్టమ్స్ .. మిత్రులు, కుటుంబం... 

వీళ్ళ మీద పాపం రెట్టింపు బాధ్యత ... మొదటిది... ఇదంతా అర్ధం చేస్కోవడం. (కొన్ని అర్ధం చేసుకోలేని భయంకరమైన అడిక్షన్స్ ఉంటాయి ... సెక్స్ అడిక్షన్ లాంటివి) రెండోది మన తప్పటడుగులని భరిస్తూ మనతో ఈ ప్రయాణం చేయడం. 

కొన్ని జీవితాలు ఈ వ్యసనాలని ఎదుర్కోకుండానే కడతేరిపోతూ ఉండటం చూస్తాం. వారి గురించి ఏం చెప్పాలో నాకు తెలియదు. 

వ్యసనపరులకి మనం ఒక్కో సారి ఏమీ సహాయం చెయ్యలేక పోవచ్చు... 

ఒకటి చెయ్యచ్చు. అదే అన్నిటికన్నా ముఖ్యమైన సహాయం కూడా. 

వారిని నైతికంగా పతనమైన వారిగా కాక చికిత్స అవసరమైన రోగి గా గుర్తించడం. 

Friday, January 4, 2019

దిల్ మే ఏక్ లెహెర్ సీ ఉఠీ హై అభీ...





సముద్రమంటే ఇష్టమైన వారిలో నేనూ ఒకదాన్ని. మొదటి సారి వైజాగ్ లో ఉండే మావయ్య తీసుకెళ్లాడు... దూరం నుంచి 'అదిగో అదే సముద్రం' అన్నాడు.  నాకు ఆకాశం తప్ప యేమ్ కనబడదే!

అప్పుడు మా మావయ్య  'ఆకాశం అని నువ్వు అనుకుంటున్న చోటు ని జాగ్రత్త గా గమనించు...ఓ సన్నటి లైన్ కింద నించి నీలం రంగు కొంచెం ముదురు గా కనిపించట్లేదు? అదే సముద్రం' అన్నాడు ... నేను థ్రిల్ల్ అయిపోయాను ....అప్పుడు ... I fell in love 


పిల్లల తో ఎవరైనా అదే పని గా ఆడలేరు .... అలిసిపోతారు .... ఒక్క ప్రకృతే పిల్లలు అలిసిపోయే వరకూ ఎంటెర్టైన్ చెయ్యగలదు అనిపిస్తుంది!


ఆ ఘోష .... ఎడతెరిపి లేని అలలు .... ఇసక... గవ్వలు ... ఆల్చిప్ప లు... వాటిలో ముత్యాలు ఉండచ్చేమో అనే వెర్రి ఆశ ... ఇష్టం లేకుండా ఉండేందుకు యేమీ లేదు సముద్రం లో 

నాకు అలల తో కబడ్డీ ఆడటం ఇష్టం.... మొన్న 
వచ్చిన ఓ హిందీ సినిమా లో ఈ సీన్ చూసి అందరికీ ఈ ఆట తెలుసన్నమాట అనుకున్నా ☺

ఇంత ఇష్టమైన సముద్రాన్ని ఎక్కువ సార్లు చూసే అవకాశం కలగలేదు నాకు. .. విధి చేసే వింత కాకపొతే భూమి మీద మూడొంతులు నిండిన సముద్రాన్ని చూడటం అంత కష్టమా? 

ఆ విధే ఇంకో వింత చేసింది. పోయిన వారం ఏకంగా ఐదు రోజులు సముద్రం పంచనే గడిపే అవకాశం దొరికింది! (వివరాలు త్వరలో)

కొన్ని రాళ్లు, గవ్వ లు, ఙ్ఞాపకాలూ, అనుభూతులూ యేరుకొని దాచుకున్నా ....సముద్రం అంటే స్పందించే ఫ్రెండ్స్ కి ఫొటో లు పంపించా ..కబడ్డీ ఆడలేదు కాని కొన్ని పాటలు పాడి వినిపించా సముద్రానికి. 

దిల్ మే ఏక్ లెహెర్ సీ ఉఠీ హై అభీ ... 

నన్ను పిచ్చి దాన్ని అనుకున్నా సరే,  తీసి పారేసినా సరే, లాజికల్ కాకపొయినా సరే .... నాకున్న నమ్మకం చెప్తాను ... 

సముద్రం ప్రతి మనిషికి ప్రత్యేకంగా స్పందిస్తుంది ...

ఓ సారి ....మా వైజాగ్ ట్రిప్ పూర్తయింది...       హైదరాబాద్ వచ్చేస్తున్నాం. ... ఐదు నిముషాలైనా గడపాలి అని బీచ్ కి వచ్చా .... టైం అయిపోవడం తో 'వెళ్తున్నా మరి... బై చెప్పవా' అనగానే అలలకి దూరంగా నుంచున్న నన్ను ఓ పెద్ద అల వచ్చి సగం తడిపేసి వెళ్లింది! 






Friday, December 28, 2018

కథాలాపం

స్కూల్ లో కొత్త సంవత్సరం టెక్స్ట్ బుక్స్ రాగానే హిందీ, ఇంగ్లీష్, తెలుగు టెక్స్ట్ లు  వరస పెట్టి చదివేసే దాన్ని నేను. (సైన్స్, మ్యాథ్స్  పుస్తకాలు సంవత్సరం చివరికి కూడా కొన్నప్పటి లాగే కొత్తగానే ఉండేవి ... అది వేరే సంగతి. ) ఫస్ట్ క్లాస్ నుంచి ఇదే అలవాటు.  

ముఖ్యంగా ఇంగ్లీషు టెక్స్ట్ లు. నావి చదవడం అయిపోయాక అక్కవి. అక్క దాని టెక్స్ట్ లో కథలు చదివి explain చేసేది... నన్నూ అమ్మని కూర్చోబెట్టి! 'ప్రైడ్ అండ్ ప్రెజుడీస్' గురించి అక్క ద్వారానే ఫస్ట్ విన్నాను నేను. 

పోయెట్రీ కంటే ఫిక్షన్ వైపే ఎక్కువ ఇంట్రస్ట్ ఉండేది. 

అలాగే షార్ట్ స్టోరీస్ .. చిన్న కథలనే రచనా ప్రక్రియ ని పరిచయం చేసినవి కూడా స్కూల్ పుస్తకాలే! 

ఇప్పటికీ నేను వదలలేని రచయితలని మొదట పరిచయం చేసింది స్కూల్ టెక్స్ట్ బుక్కులే ... డికెన్స్, టాల్స్టాయ్, జేన్ ఆస్టెన్, ఓ హెన్రీ, ఆస్కార్ వైల్డ్, ఆర్థర్ కానన్ డోయల్, మపాసా... 

నాకు ఓ ప్రాబ్లెమ్ ఉంది. కథ ని కథ లాగా చదవలేను. బాగా మనసుకి పట్టించేస్కుంటూ ఉంటాను. 

అలా నా జీవితం లో పెద్ద మార్పుల్ని తీసుకొచ్చిన చిన్న కథలని ఈ రోజు గుర్తుచేసుకుంటున్నాను. 

1. God sees the truth, but waits - లియో టాల్స్టాయ్ కథ ఇది. బాబోయ్ ... ఇది నెంబర్ వన్ స్థానం లో ఊరికే రాయలేదు ... ఇది చదివాక నేను కొన్నేళ్ళు దేవుడ్ని నమ్మడం మానేసాను. ఈ కథ లో హీరో కి తాగుడు అలవాటు ఉంటుంది కానీ మానేస్తాడు ఫామిలీ కోసం. ఇతనున్న దగ్గరే ఓ హత్య జరిగితే ఇతనికున్న హిస్టరీ వల్ల ఇతనే చేసాడని జైల్లో పెడతారు. కాదని ఎంత చెప్పినా వినరు. యవ్వనం లో జైలు కెళ్లిన హీరో కి వృద్ధాప్యం వచ్చేస్తుంది. 26 ఏళ్ళు! యవ్వనం లో లైవ్లీ గా ఉండే వాడు ఇప్పుడు సాధు జీవి అయిపోతాడు.  ఇంతలోపు ఆ హత్య నిజంగా చేసిన వాడు ఈ జైలు కే  వచ్చి పడతాడు. వాడు పారిపోడానికి ట్రై చేస్తూ పట్టుబడతాడు. హీరో ని జైలరు అడిగితే 'ఈ విషయం లో నేను మాట్లాడకూడదు' అని గుంభనంగా ఉంటాడు. హత్య చేసిన వాడు పశ్చాత్తాపపడి తన నేరాన్ని ఒప్పుకుంటాడు. హీరో ని క్షమాపణ కోరుకుంటాడు. హీరో క్షమించేస్తాడు. హీరో ని రిలీజ్ చేసే ప్రాసెస్ మొదలు పెడతారు జైలర్లు. కానీ రిలీజ్ చేసే రోజే హీరో చనిపోయి ఉంటాడు. నా లాంటి వాళ్ళు తిట్టి పోయకుండా 'ప్రశాంతంగా మరణించాడు' అని రాసాడు టాల్స్టాయ్. ఏవిటండీ ఈ కథ? నాకు పదిహేనేళ్ళప్పుడు ఇది చదివాను. ఓ పదేళ్ల పాటు దేవుడ్ని నమ్మలేదు. 

2. The Necklace - ఈ కథ కూడా అంతే దారుణం. హీరోయిన్ ఓ అందమైన కానీ అంతగా డబ్బులేని కుటుంబం లో పుట్టిన అమ్మాయి. ఓ క్లర్క్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆమె కలలన్నీ తన భర్త తాహతు కి మించినవే. ఓ సారి భర్త ఆఫీసులో ఓ పార్టీ కి పిలుపొస్తుంది. వేసుకోడానికి ఏమీ మంచి బట్టలు, నగలు లేవు అని వెళ్లనంటుంది. భర్త కొత్త డ్రెస్ కొనిస్తాడు. కానీ నగ? తన రిచ్ ఫ్రెండ్ దగ్గరికెళ్తుంది హీరోయిన్. ఆమె దగ్గర అన్ని రకాల నగలుంటాయి. నీకిష్టమొచ్చింది తీస్కో అని అలమార తలుపులు బార్లా తెరుస్తుంది ఫ్రెండ్. ఈమె కి కళ్ళు తిరిగిపోతాయి! అన్నిటిలోకి ఓ రవ్వల నెక్లెస్ నచ్చుతుంది. అది ఇవ్వదేమో అని సంశయంగా అడుగుతుంది. 'ఓస్ అంతేనా .. తీస్కో' అని ఇచ్చేస్తుంది ఫ్రెండు. పార్టీ రోజు అందంగా తయారవుతుంది హీరోయిన్. పార్టీ లో భర్త బాస్ తో సహా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈమెవరో అని అచ్చెరువొందుతూ ఈమె తో డాన్స్ చెయ్యడానికి వరుస కట్టేస్తారు! అంత గొప్పగా పార్టీ జరిగాక ఇంటికొచ్చి చూస్కుంటే మెడలో నెక్లెస్ లేదు... అంతా వెతుకుతారు. కనపడదు. అంత ఖరీదైన నెక్లెస్ పోగొట్టానని ఫ్రెండు కి చెప్పడం ఇష్టం లేక నగల దుకాణం లో అలాంటి నగ వెతికి నలభై  వేల ఫ్రాన్కు లు అప్పు చేసి నగ కొని ఫ్రెండు కి ఇచ్చేస్తారు. అప్పటి నుంచి మొదలవుతుంది అప్పు తీర్చే ప్రక్రియ ... చిన్న ఇంట్లోకి మారిపోతారు .. సున్నితంగా ఉండే ఈమె వేళ్ళు అంట్లు తోమి తోమి కరుకుగా అయిపోతాయి. హుందాగా ఉండే అమ్మాయి పైసా పైసా కీ రోడ్డు మీద గొడవలు! ఈ అప్పులు తీరడానికి పదేళ్లు పడుతుంది. ఈ అమ్మాయి అందమంతా పోతుంది. ఓ సారి మార్కెట్ లో రిచ్ ఫ్రెండ్ కనపడుతుంది... ఆమె పదేళ్ల క్రితం లానే ఉండటం ఈమె కి బాధ కలిగిస్తుంది. నెక్లెస్ విషయం లో నిజం చెప్పి 'నీకు తెలియలేదు కదూ' అని నవ్వుతుంది. 'ఓసి పిచ్చి దానా ... ఆ నెక్లెస్ నకిలీదే .... ఐదువందల కంటే చెయ్యద'ని రిచ్ ఫ్రెండు చెప్పడం తో కథ ముగిసిపోతుంది. మపాసా అనే ఆయన రాసిన చెత్త పిచ్చి కథ ఇది.  

3. Tin Soldier and the paper Ballerina - ఓ పిల్లవాడికి కొన్ని బొమ్మలు బహుమతి గా వస్తాయి. అందులో టిన్ను తో చేసిన కొంత మంది సైనికుల బొమ్మలుంటాయి. అందులో ఆఖరు సైనికుడికి ఒకే కాలు ఉంటుంది .... టిన్ను సరిపోక అలా చేశారు. అతను పక్కనే ఉన్న కాగితపు డాన్సర్ బొమ్మని ప్రేమిస్తాడు. ఈ బొమ్మల్లోనే ఓ విలన్ నానా రకాలు గా వీళ్ళని విడదీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ఒంటి కాలు సైనికుడు ఎక్కడెక్కడో పారవేయబడి చివరికి ఓ చేప మింగితే ఆ చేప ని ఓ జాలరి పడితే ఈ ఇంటికే వచ్చి చేరుతుంది. చేపని చీరితే టిన్ను సోల్జరుడు! మళ్ళీ బొమ్మలల్లో స్థానం సంపాదిస్తాడు. ఇక్కడితో కథ ఆపేయచ్చు కదా... లేదు. నన్ను ఏడిపించనిదే హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ నిద్రపోడు కదా. టిన్ను సైనికుడు విలన్ వల్ల నిప్పు లో పడతాడు .... అతని ప్రేయసి పేపర్ నర్తకి కూడా నిప్పుల్లోకి దూకేస్తుంది. మర్నాడు గది తుడిచే వాళ్ళకి కాలి మసైన పేపర్ పక్కన ఓ ఇనప గుండె కనిపిస్తుంది. 


ఈ కథలు చదివి బెంగెట్టేసుకొని కలలు కంటే ఇంతే .. ప్రేమిస్తే ఇంతే .. ఇలాంటి భయాలన్నీ పట్టుకున్నాయి అప్పట్లో నాకు. 


కొన్ని హాపీ కథలు కూడా ఉన్నాయి. 

4. The New Blue Dress - ఒక స్లమ్స్ లాంటి ఏరియా నుంచి వచ్చే అమ్మాయి కి ఒక టీచర్ కొత్త నీలం రంగు డ్రెస్ ప్రెసెంట్ చేస్తుంది. ఈ ఒక్క పని ఓ చెయిన్ ఆఫ్ ఈవెంట్స్ కి కారణం అవుతుంది. ఆ పాప కొత్త డ్రెస్ వేసుకుందని ఆ పాప తల్లి ఇల్లు సద్ది నీట్ గా పెడుతుంది. పాప తండ్రి ఇంటి బయట శుభ్రం చేసి తోట వేస్తాడు. ఇది చూసిన పక్కింటి వాళ్ళు కూడా మారతారు .. ఇలా కొంత మంది కుటుంబాలు మారతారు .. అటే వెళ్తున్న ఓ చర్చి ఫాదర్ ఇది చూసి వాళ్ళకి పై అధికారుల సహాయం తీసుకొస్తాడు .. చూస్తూ చూస్తుండగానే ఆ వీధి రూపు రేఖలు మారిపోతాయి .. అంతా ఓ పాప కొత్త డ్రెస్ వల్ల! ఇది క్లీవ్ ల్యాండ్ ఓహైయో లో జరిగిన నిజం కథ అట! 

5. In Celebration of Being Alive - ప్రపంచం లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసిన డా. క్రిస్టియన్ బెర్నార్డ్ రాసిన వ్యాసం లోది ఈ కథ. డాక్టర్ గారికే ఓ ఆక్సిడెంట్ జరుగుతుంది. ఎంత డాక్టర్ అయినా పేషేంట్ పడే అన్ని బాధలు పడతారు ఈయన. భయం, డిప్రెషన్, ఆక్సిడెంట్ తాలూకు భౌతిక బాధ ... ఇలా ఉండగా పిల్లల వార్డు లో ఓ రోజు గోల గోల గా ఉంటుంది. ఓ కళ్ళు పోయిన పిల్లాడు, ఓ చెయ్యి, కాలు కోల్పోయిన పిల్లాడు ఓ ఫుడ్ ట్రాలీ ని దొరకబుచ్చుకొని హాస్పిటల్ వార్డు లో రేస్ చెయ్యడం మొదలు పెడతారు. పేషేంట్లందరూ వాళ్ళని ఛీర్ చెయ్యడం .. వాళ్ళు ఫుల్ స్పీడ్ లో ట్రాలీ నడపడం! చివరికి ఓ గోడ తగిలి అందులో సామాననంతా కిందపడి నర్సులు వచ్చి ఈ పిల్లల్ని తిట్టి మళ్ళీ పడుకోబెట్టే దగ్గర వీళ్ళ అల్లరి ఆగుతుంది. డాక్టర్ గారికి ఈ ఇద్దరు పిల్లలూ తెలుసు. ఒకడి తల్లి తాగొచ్చిన భర్త మీద కి లాంతరు విసిరితే వీడికి తగిలి కళ్ళు పోయాయి. ఇంకొకడికి హార్ట్ లో హోల్ డాక్టర్ గారే మూసారు .. కానీ వాడికి కాన్సర్ వల్ల కాలు చేయి తీసేయాల్సి వచ్చింది. వాళ్ళు మాత్రం డాక్టరు గారు కనపడగానే 'భలే రేస్ చేసాం కదండీ' అని మురిసిపోవడం డాక్టర్ గారికి బ్రతుకు పాఠం నేర్పింది .. 'జీవించి ఉండటమే ఓ వేడుక అని తెలిపింది' అని రాస్కున్నారాయన!

6. Snapshot of a Dog - జేమ్స్ థర్బర్ రాసిన కథ ఇది. ఓ పాత ఫోటో కంటబడి పాతికేళ్ల క్రితం చనిపోయిన తన పెంపుడు కుక్క 'రెక్స్' గురించి నెమరువేసుకొనే ఓ వ్యక్తి కథ ఇది. కుక్కల్ని పెంచుకున్న వాళ్ళకి ఈ కథ బాగా హత్తుకుంటుంది. ఈ మధ్యే కుక్కల్ని ముట్టుకొనే ధైర్యం చేసి, ఫేస్ బుక్ లో 'ది డోడో' పేజీ లో వీడియోలు తెగ చూసేస్తూ కుక్క ని అడాప్ట్ చేసుకోవాలని భయం భయం గా ... సంకోచంగా కల కంటున్న నాలాంటి వాళ్ళకి కూడా ఈ కథ బాగా నచ్చుతుంది. 

ఇప్పటికీ ప్రయత్నిస్తుంటాను .. కథ కథ లాగా చదవాలని.. మనసుకి పట్టించుకోకూడదని. 

ఎంత వరకూ సక్సెస్ అయ్యాను? 

అది వేరే కథ! 

ఈనాడు ఆదివారం లో నా కథ 'గాజు గోడ'

కార్పొరేట్ ప్రపంచం లో గ్లాస్ సీలింగ్ అనే చేదు నిజం ఉంది. విమెన్ ప్రొఫెషనల్స్ ని ఒక స్థాయి ని మించి ప్రోమోట్ చెయ్యకపోవడం ... అంటే అప్పర్ లెవె...