12, నవంబర్ 2024, మంగళవారం

నా 'పాఠ్య'పుస్తకప్రేమ

ఈ మధ్య ఇంగ్లీష్ బ్లాగు లో రెండు భాగాలు గా రాసిన ఓ టాపిక్ ఇక్కడ కూడా పంచుకుందామని ఈ పోస్టు రాస్తున్నాను. 

మీరు ఇంగ్లీష్ లో చదవాలనుకుంటే ఇదిగోండి లింకులు ... 

https://sowmyaticlife.blogspot.com/2024/10/the-textbooklover-part-1.html

https://sowmyaticlife.blogspot.com/2024/10/the-textbooklover-part-2.html

నేనేదో నా మానాన నేనున్నా. సండే హిందూ పేపర్ గురువారం రోజు తాపీగా చదువుతున్నా. అందులో శ్రీ కేకీ దారువాలా అనే రచయిత కి నివాళి అర్పిస్తూ ఓ ఆర్టికల్ రాశారు. ఈయన పేరు ఎక్కడో విన్నాను అనిపించింది. కానీ వెంటనే గుర్తు రాలేదు. అలా అని వదిలెయ్యబుద్ది కాలేదు. అదిగో అక్కడ మొదలైంది ఈ యవ్వారమంతా. 

మనం జ్ఞాపకాలు నీట్ గా సద్ది ఉన్న అలమార లాగా ఉండవు. కేబుల్ బాక్స్ లో చిక్కు పడిపోయిన వైర్లలాగా ఉంటాయి ఏంటో. ఒకటి లాగితే రాదు, ఇంకోటి వస్తుంది. ఆ వచ్చిందానికీ దీనికీ సంబంధం ఉండదు. ఒక్కోసారి ఒకటి లాగితే చిక్కుపడిపోయిన వైర్లన్నీ దానితోనే వచ్చేస్తాయి. అలా అని వదిలేస్తే ఆ బైటికొచ్చిన జ్ఞాపకం ఏ పంటిలో ఇరుక్కుందో తెలీని ఆహార పదార్ధం లాగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది .. ఓ ఛాలెంజ్ గా వెక్కిరిస్తుంటుంది. ఓపికగా ఒకే వైర్ ని గుర్తు పట్టి, దాని వెంట పడి, గుర్తించి పైకి లాగేసరికి ఇదిగో... ఇలా ఒకటికి మూడు బ్లాగులవుతాయన్నమాట! 😁

కేకీ దారువాలా గారి జ్ఞాపకము తాలూకు వైరు నన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్లింది. ఈ అందమైన 'వైర్ ట్రిప్' ని అందరితో షేర్ చేసుకుందామని నా తాపత్రయం! 

ఆ నివాళి ఆర్టికల్ సరిగ్గా చదివితే ఆయనెవరో గుర్తొచ్చేసేది గా అని మీకు ఈ పాటికి అనిపించచ్చు. జీవితం అంత సులభమైతే ఎంత బాగుండు! ఆ ఆర్టికల్ లో వారు రాసినదేదీ నేను చదివినది కాదు. కవి గా, నవలా రచయిత గా, ఇంకొన్ని కోణాల్లో ఆయన్ని పొగిడారు అందులో. నేను ఆ రెండూ తక్కువ చదువుతాను. మరి ఆయన పేరు ఎందుకు గుర్తుండిపోయింది నాకు? 

గూగుల్ సెర్చ్ లో ఏమీ తేలలేదు. అన్నీ దొరికే అమెజాన్ లో నే నా ప్రశ్న కు సమాధానం దొరికింది! ఆయన రాసిన ఓ కథా సంపుటి దొరికింది. పుస్తకాల కి రీడింగ్ శాంపిల్ ఉండటం ఎంత ఉపయోగపడిందో నాకు ఇక్కడ! ఆయన కథా సంపుటి లో నేను చదివిన కథ కనిపించింది. ""How the Quit India movement came to Alipur". ( క్విట్ ఇండియా ఉద్యమం అలీపూర్ కి వచ్చిన వైనం) 

టైటిల్ చూస్తే సీరియస్ కథ లాగ ఉంటుంది కానీ నిజానికి ఇదో తమాషా కథ! అలీపూర్ లో బ్రిటిష్ అధికారి కి, అక్కడి లోకల్ లీడర్లకీ మంచి సంబంధాలుంటాయి నిజానికి. అతను కథా ప్రారంభం లో ఒకింత ఆందోళన లో ఉంటాడు. లోకల్ లీడర్లు ఆయన్ని కలవడానికి వస్తున్నారు మరి. అతనికి తెలుసు ఇది చాలా సున్నితంగా డీల్ చెయ్యాల్సిన విషయం అని. తనకి తన ఎస్టేట్ లో పొద్దున్నే గుర్రపు స్వారీ మీద వెళ్ళటం అలవాటు. ఆ ఉదయం కూడా అలాగే వెళ్తాడు. ఈ లోపు లీడర్లు అతని బంగ్లా కి వస్తే పని వాడు కూర్చోపెడతాడు. వాళ్ళకి టీ, బిస్కెట్లు తెచ్చి పెడతాడు. ఇక్కడే తమాషా! పని వాడు తెలీక పొరపాటున కుక్క బిస్కెట్లు సెర్వ్ చేసేస్తాడు. ఇది తెలీని కొంత మంది తినేస్తారు కూడా. సరిగా అదే సమయానికి అధికారి తన స్వారీ  ముగించుకొని వస్తాడు. చూస్తే తన అతిధులు, లోకల్ లీడర్లు కుక్క బిస్కట్లు తింటూ ఉంటారు! ఎలాగో గుర్తులేదు కానీ ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. అంతే .... దీన్ని పరాభవంగా భావించి లీడర్లు క్విట్ ఇండియా నినాదాలు చేస్కుంటూ వెళ్ళిపోతారు. అలా క్విట్ ఇండియా ఉద్యమం అలీపూర్ కి వ్యాపిస్తుంది! 

ఈ కథ నేను చదివింది ఓ పాఠ్య పుస్తకం లో. నాది కాదు. మా అక్కడి. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పిజి లెవెల్లోనో, డిగ్రీ లెవెల్లోనో ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్ యొక్క కథలని ఓ సంపుటి గా సిలబస్ లో ఇచ్చారు. ఇక్కడే నా జ్ఞాపకాల వైర్లు కలిసిపోయాయి. ఈ కథ గుర్తు రావడం తో మిగిలిన ఇంకొన్ని కథలు గుర్తొచ్చేసాయి. వాటి తో పాటు, ఇందాక చెప్పినట్టు తగుదునమ్మా అంటూ సంబంధం లేని ఇంకో వైరు నా చేతికి అల్లుకు పోయింది ... రెండు పుస్తకాల జ్ఞాపకాలు నా మెదడులో గజిబిజీ గందరగోళం చేసేశాయి. సరిగ్గా ఇంగ్లీష్ బ్లాగు రాస్తున్నప్పుడే అవి రెండూ విడిపోయాయి. 

ఇంతకీ నాకు గుర్తొచ్చినవి రెండు పుస్తకాలు. 

1. భారతీయ ఆంగ్ల రచయితల కథల సంపుటి 

2. భారతీయ రచయితల కథల ఆంగ్లానువాదాల సంపుటి 

చెప్పాగా ఒకేలాంటి వైర్లు ... కానీ వేరు వేరు. 

భారతీయ ఆంగ్ల సాహిత్యం ఓ ప్రత్యేక శాఖ లిటరేచర్ లో. భారతీయులై ఉంది డైరెక్ట్ గా ఆంగ్లం లో రాసేవారన్నమాట. అందులో కేకీ దారువాలా గారొకరు. ఆ సంపుటి లో నాకు గుర్తొచ్చిన మిగిలిన కథలు 

1. అనితా దేశాయి రాసిన "ది అకెంపనిస్ట్" - హిందూస్థానీ సంగీత నేపథ్యం లో సాగుతుందీ కథ. ఓ ప్రసిద్ధ సంగీత విద్వాంసుడి ట్రూప్ లో ఓ చిన్న పాత్ర వహిస్తున్న ఓ వ్యక్తి తన ఉనికి ని ప్రశ్నించుకుంటాడు కానీ చివరికి ఎంత చిన్న పనైనా ఆ విద్వాంసుడి తో ఉండటమే తన జన్మకి సార్ధకం అనుకుంటాడు. 

2. ముల్క్ రాజ్ ఆనంద్ "ది లాస్ట్ చైల్డ్" - ఓ మేళా లో తప్పిపోయిన పిల్లవాడి చిన్నపాటి అడ్వెంచర్ కథ. వాడికి చివరికి తల్లిదండ్రులు కనిపిస్తారనుకోండి. 

3. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ "ది స్పారోస్" - ఉత్తరభారత దేశం లో ని ఓ పల్లె లో ఓ చిన్న రైతు కథ. భార్యని, పిల్లల్ని, ఎద్దుల్ని చావబాది అందర్నీ దూరం చేసుకొని చివరికి ఒంటరిగా మిగులుతాడు. ఆఖరి దశ లో తన గుడిసె చూరు మీద గూడు కట్టుకున్న పక్షి పిల్లల్ని సాకి తన పిల్లల పేర్ల తో వారిని పిలుచుకుంటూ ఉంటాడు. ఓ రోజు వాన కి చూరు కారుతుంటే రాత్రంతా పైకప్పు ని బాగుచేసి జ్వరం తెచ్చుకుంటాడు... ఆ పక్షులనే తలుచుకుంటూ కన్నుమూస్తాడు. అతను పోయే సరికి ఆ పక్షులే అతనితో ఉంటాయి. 

ఈ రచయిత సినిమాలు కూడా తీశారు. అమితాబ్ బచ్చన్ గారి మొదటి సినిమా అయినా "సాత్ హిందూస్థానీ" తీసింది ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ గారే! ఆ సినిమా తప్పకుండా చూడండి.. ఆ కథా వస్తువు ఇప్పటి దాకా ఎవరూ మళ్ళీ టచ్ కూడా చెయ్యలేదు. 

నాలుగో కథ ఇంతకు ముందు చెప్పిన కేకీ దారువాలా గారిది. తమాషా ఏంటంటే ఈయన రాసిన నవల ఆధారం గానే అభిషేక్ బచ్చన్ మొదటి సినిమా 'refugee' తీసారట! రెండు తరాల నటులను పరిచయం చేసిన సాహిత్య, సినీ దిగ్గజాలు ఒకే పుస్తకం లో ఉన్నారు చూడండి! కాక కనీసం రెండు మూడు కథలున్నాయండి .. అవి ఎంతకీ గుర్తు రావట్లేదు! ఈ పాఠ్య పుస్తకాల తో వచ్చిన చిక్కేంటంటే సిలబస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. నా తో చాన్నాళ్లు ఉన్న ఆ పుస్తకాలు నేనేమో జీవిత చక్రం లో పడి ఎక్కడో ఎడబాసాను! My loss! 

ఇక రెండో సంపుటి - భారతీయ కథల ఆంగ్ల అనువాదాలు ... ఇది కూడా భలే సంపుటి! ఇందులో నాకు గుర్తొచ్చిన కథలు - 

1. అమృత ప్రీతం రాసిన "ది స్టెంచ్ ఆఫ్ కిరోసిన్" (కిరోసిన్ కంపు) - గ్రామీణ నేపథ్యం. మొదటి భార్య ని పిల్లలు కలగలేదని సాధిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. రెండో పెళ్లి చేస్తే ఆ అమ్మాయి పండంటి బిడ్డని కాని తండ్రికి ఇస్తుంది. వాడు ఆ బిడ్డని చేతిలో కి తీస్కొని "కిరోసిన్ కంపు కిరోసిన్ కంపు" అని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు! 

2. టాగోర్ "ది హోమ్ కమింగ్" - కౌమార దశ లో ఉన్న తండ్రి లేని పిల్లవాడ్ని పల్లె నుంచి పట్నానికి మావయ్య ఇంటికి తీసుకెళ్తే అక్కడ ఇమడలేక పోతాడు. ఇల్లు వదిలి పారిపోతాడు. తల్లిని, తమ్ముడ్ని, పల్లె లో స్నేహాలని తలుచుకుంటూ ఓ రోజు వానలో తడుస్తూ చనిపోతాడు. చాలా బాధ కలిగించే కథ ఇది! 

3. చాగంటి సోమయాజులు "ది వయోలిన్" - (చాసో కథ నేను ఇంగ్లిష్ లో చదవడం ఐరనీ కదా! తెలుగు లో ఇంకా చాలా చదవాలండీ నేను!)  ఇది పూర్తి ట్రాజెడీ కాదు కానీ ఓ దిగువ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం లో వయోలిన్ వాయించే ఒకావిడ కథ. ఆవిడకి జబ్బు చేసి చేతిలో డబ్బు లేకపోతే ఆ వయోలిన్ అక్కరకొస్తుంది. ఆవిడ కోలుకున్నాక వాళ్ళాయన చెప్తాడు... నన్ను క్షమించు, వయోలిన్ అమ్మేసాను, ఇదిగో నీకు చీర, పూలూ తెచ్చాను అని. ఆ వయోలిన్ నా తల్లి లాంటిది. చూడండి... వెళ్తూ వెళ్తూ కూడా నాకు చీర పెట్టి వెళ్ళింది అని భర్త ని ఓదారుస్తుంది ఆ భార్య. 

ఈ సంపుటి లో కూడా ఇంకొన్ని కథలుండాలి.  ఈ పుస్తకం కూడా నేను ఎడబాసాను. 

ఈ రెండిట్లో ఎందులోదో తెలీదు కానీ ఇంకో కథ గుర్తొచ్చిందండి. సిటీ లో ఓ చిన్న కుటుంబం. ఇద్దరు పిల్లలు, కొత్తగా ఇంకోడు పుట్టుకొస్తాడు. ఆర్ధిక సమస్యలు భరించలేక భార్యాభర్తలు కుటుంబమందరం విషం తాగి చనిపోదాం అనుకుంటారు. అతను విషం తేవడానికి బైటికి వెళ్లొచ్చేసరికి భార్య చంటి పిల్లవాడికి పాలిస్తూ పడుకుండిపోతుంది. మిగిలిన ఇద్దరు పిల్లలూ మంచి నిద్ర లో ఉంటారు. భర్త మీద కి వెళ్తాడు చల్లగాలికి. ఎప్పుడూ అతను చూసే ఎండిన చెట్టు కి ఆ రాత్రి చిన్న మొలకలు కనిపిస్తాయి. అవి చూడగానే అతనికి కూడా బ్రతుకంటే ఆశ కలుగుతుంది. ఆత్మహత్య ఆలోచన మానుకుంటాడు. ఇది మీరెవరైనా చదివి ఉంటే నాకు చెప్తారు కదూ! మీకు బోల్డు పుణ్యం గ్యారంటీ! 

పాఠ్య పుస్తకాల పట్ల నా ప్రేమ, అనుబంధం ఇప్పటిది కాదు. దీని గురించి ఇది వరకూ కూడా రాసాను. 

https://sowmyavadam.blogspot.com/2018/12/blog-post_28.html

https://sowmyavadam.blogspot.com/2023/01/blog-post_24.html

ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ పిల్లల్ని టెక్స్ట్ బుక్స్ చూపించమంది అడుగుతుంటాను. నా ఎం ఏ పాఠ్య పుస్తకాలు నేను దాచుకుంటే మా ఇంట్లో వాళ్ళు అమ్మేశారు. నాకు మళ్ళీ కొనిచ్చారు కానీ అప్పటికి సిలబస్ మారిపోయింది! ఇప్పటికీ నేను వాళ్ళమీద ఆ కసి పెట్టుకున్నాను ఫాక్షన్ వాళ్ళలాగా. 

ఇప్పటికీ టెక్స్ట్ బుక్స్ లాగా బొమ్మలూ, కొత్త పదాల అర్ధాలు తెలిపే ఫుట్ నోట్స్ అన్ని పుస్తకాలకీ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది!  

లేబుళ్లు: , , , , , ,

3, నవంబర్ 2024, ఆదివారం

"ఆఖరి మైలు" ఈనాడు ఆదివారం లో నా కథ



ఈ రోజు ఈనాడు లో పబ్లిష్ అయిన కథ ఇది. 

ఈనాడు ఈ - పేపర్ లింక్ ఇది - ఈ లింక్ లో అయితే చదువుకోడానికి సులభంగా ఉంటుంది. 

 ఈ కథ నిడివి పబ్లిషింగ్ స్పేస్ కోసం కొంచెం కుదించాల్సి వచ్చింది. ఎవరికైనా చదవాలని ఇంటరెస్ట్ ఉంటే , మీ ఇమెయిల్ ఐడి పంపించండి. పూర్తి కథ పి డి ఎఫ్ పంపిస్తాను. :)

కథ చదివి నాకు మంచి మెసేజెస్ పంపిస్తున్న అందరికీ ధన్యవాదాలండీ :) 




లేబుళ్లు: , , , , ,

16, అక్టోబర్ 2024, బుధవారం

పొంగనాలు-సాంబారు నేర్పిన జీవిత పాఠాలు

పొంగణాలు/పొంగనాలు/పొంగడాలు ఇలా రకరకాల వ్యవహారాలు ఉన్న ఈ తెలుగు టిఫిన్ సాంబారు తో కలిసి బోల్డు కబుర్లు చెప్పింది నిన్న రాత్రి నాకు. అవి మీకు కూడా చెప్దామని! 

ముందుగా ఒక్క మాట. ఈ కాంబినేషన్ విధి రాత వల్ల కలిసి వచ్చింది కానీ మా ఇంట్లో ఈ సంప్రదాయం లేదు, నా ఫేవరెట్టూ కాదు. ఇది గమనించాలి. 

అదుగో అదే మొదటి జీవిత సత్యం. దోసెల పిండి పులిసిపోక ముందే వాడేయాలి అనే తొందర, సాంబారు వ్యర్థం చేయకూడదనే తాపత్రయం, దోసెల తో సాంబారు తింటే తక్కువ ఖర్చవుతుంది కాబట్టి ఇలా ఇడ్లి సాంబారు, వడ సాంబారు లాగా పొంగనాల తో తింటే రెండూ ఖర్చవుతాయి అనే ఆలోచన నుంచి పుట్టింది ఈ కాంబినేషన్. జీవితం లో ఇలా ఎన్ని సార్లు జరగదు మనకి! పరిస్థితుల ప్రభావం వల్ల, కొన్ని మనమే పెట్టుకున్న పరిధులు/విలువల వల్ల కొన్ని చేసేస్తుంటాం. వాటి నుంచి ఒక్కో సారి ఇలా ముందు తెలియని కాంబినేషన్ పుట్టేస్తుంది. క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ నుంచే పుడుతుంది అని నిరూపితమవుతుంది! 

హిరణ్యకశిపుడు ఓ వంద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు కదా .. నేను ఇలా చావను అలా చావను అని. అప్పుడు కదా నరసింహ అవతారం ఉద్భవించింది! అలా అన్నమాట! (నరసింహావతారాన్ని పొంగనాల తో పోల్చట్లేదు ... క్రియేటివిటీ రెస్ట్రిక్షన్స్ .... దానికి ఉదాహరణ! నమో నరసింహ!)


ఇక రెండో పాఠం. మొన్న ఒక కొటేషన్ చూసాను. మీరు మీ ప్రాబ్లమ్ లాగా కనిపించక్కర్లేదు అని. డబ్బుల్లేకపోతే డబ్బుల్లేనట్టు కనిపించక్కర్లేదు. శుభ్రమైన బట్టలు వేసుకొని తల దువ్వుకోవచ్చు!  చెల్లగొట్టాల్సిన ఆహారం తినాలి అనుకున్నప్పుడు మొహం ఒకలా పెట్టుకొని చేతికి దొరికిన ప్లేట్ లో పెట్టుకుని అయిందనిపించక్కర్లేదు. ఓ మంచి ప్లేట్ తీస్కొని బాగా కనిపించేలా ప్రెజెంట్ చేసుకుంటే మనకి కూడా తినాలి అనిపిస్తుంది. ఇదిగో ఇలా ఫోటోలు పెట్టుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. :) 

మూడో పాఠం... కళాకారులకి ప్రతీదీ ఓ ఇన్స్పిరేషనే! ఉదాహరణ కి ఈ కాంబినేషన్ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర ని గుర్తు చేసింది. సాంబారు నిజానికి ఇడ్లి కో, వడ  కో, దోసె కో జతవ్వాలి.  ఎన్టీఆర్ జమున గారిలా. పొంగనాలు పచ్చడి నో, పొడి నో పెళ్లి చేసుకోవాలి. కాంతారావు కె ఆర్ విజయ గారిలా. కానీ ముందే చెప్పినట్టు గా విధి వల్ల కలిసిన ఈ ఎన్టీఆర్ కె ఆర్ విజయ గార్ల జోడి ఎలా ఉంటుంది? వాళ్ళు అన్నీ మర్చిపోయి అన్యోన్యంగా ఉన్నా, ప్రపంచం వారిని ఇడ్లి సాంబారు కి ఇచ్చిన విలువ ఇస్తుందా? ఓ మంచి జోడీ గా గుర్తిస్తుందా? ఇలా కొంత సేపు ఆలోచిస్తూ ఉండిపోయాను నేను! 

నాలుగో పాఠం. దేవుడెందుకో ఒకే ఫామిలీ లో ఒకలాంటి వాళ్ళని పుట్టించడు. ఒకరు పొద్దున్నే లేచేస్తారు. ఇంకొకరు రాత్రి మేల్కొనే ఉంటారు. వాళ్ళకీ వీళ్లకీ రోజూ గొడవ. అలాగే మా ఇంట్లో క్రిస్పీ గా ఉండే చిరు తిండి ని సాంబారు లో వేసేసి మెత్తగా చేసేస్తే అస్సలు నచ్చదు. నాకేమో అలాగే ఇష్టం! పకోడీ చేస్తే కడి-పకోడీ చేసుకుంటాను.  కరకరలాడే కారప్పూస/జంతికల తో మరమరాల మసాలా చేసుకుంటాను.  బిస్కెట్టైతే పాలలో ముంచుకొని తినాల్సిందే. ఇలా క్రిస్పీ వాటిని మెత్తగా  చేసేస్తూ ఉంటే చూడటమే ఇబ్బంది మా ఇంట్లో వాళ్ళకి! ఎన్ని డిఫెరెన్సెస్ ఉన్నా కలిసే ఉండాలి మరి ... పొంగనాలు సాంబారు లాగా! 

ఐదో పాఠం. నువ్వు జీవితం అంతా చూసేసా అనుకుంటున్నావు కానీ ఇంకా అంతా చూడలేదు. ప్రపంచాన్ని చుట్టేసిన వాళ్ళైనా, పుస్తకాలన్నీ చదివేసి వాళ్ళైనా .. ఇంకా ఏదో కొత్త అనుభవం, కొత్త కాంబినేషన్ ఉంటూనే ఉంటుంది మనని ఆశ్చర్యపరచడానికి! ఇది గుర్తుంచుకుంటే చాలు. జీవితం డెడ్ ఎండ్ లాగా బోర్ గా అనిపించదు. కొంచెం ఈగో కూడా కంట్రోల్ లో ఉంటుంది.... మనం అన్నీ చూసెయ్యలేదని! 

ఇంక చివరిది, ముఖ్యమైనది అయిన పాఠం. ఆన్లైన్ లో మనం చూసేదేదో పూర్తి పిక్చర్ కాదు. నా పొంగనాల ఫోటో చూసి నోరూరుతుంది. ట్రై చెయ్యాలని కూడా అనిపించచ్చు. కానీ నిజం ఏంటంటే ఆ సాంబారు  లో ఉప్పెక్కువైంది. నేను పొంగనాల పిండి లో ఉప్పు తక్కువేస్కున్నా లాభం లేకపోయింది. తర్వాత సాంబారు లో నీళ్లు కలిపి మరిగించాము. ఆ పల్చటి సాంబారు ఫోటో కి నోచుకోలేదు. అదీ పూర్తి కథ. 

నేను ఈ సారి ఏం చేశా అంటే ఇదే భాగోతం ఇంగ్లిష్ లో వెళ్ళగక్కాను. అది నా ఇంగ్లిష్ బ్లాగ్ లో ఉంటుందన్న మాట. తెలుగు చదవటం రాదనే వంక తో నా రాతల్ని తప్పించుకోకుండా నేను వేసిన మాస్టర్ ప్లాన్ ఇది! కింద నా ఇంగ్లీష్ బ్లాగ్ కి లింక్ ఇచ్చాను. దాని పేరు సౌమ్యాటిక్ లైఫ్ :)

My English Blog

మళ్ళీ కలుద్దాం. మీరు ట్రై చేసిన/చెయ్యాల్సొచ్చిన కాంబినేషన్స్ ఏంటి? అవి మీకు నేర్పిన జీవిత పాఠాలేంటి? ప్లీజ్ చెప్పండి. 

లేబుళ్లు: , , , , , , ,

20, ఆగస్టు 2024, మంగళవారం

జో బాత్ తుజ్ మే హై .....

 చాలా రోజుల నుంచి ఓ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నా.... ఇలా సందర్భం కుదిరింది.... 

ఒకప్పుడు కేవలం మెమరీ కోసం పనికొచ్చే ఫోటోలు ఇప్పుడు వాటి పరిధులు దాటి కొంచెం మితిమీరి మనశ్శాంతి పోగొడుతున్నాయి కదా .... 

కొంత మందికి ఫోటో చూసాక స్ట్రెస్ మొదలవుతుంది.. యాంగిల్, బట్టలు, లైటింగ్... ఇవి మనం రూపాన్ని కెమెరా కి వేరేలా చూపిస్తాయి అని తెలీక ఆ కనిపించేదే నిజమనుకుని చాలా బాధపడుతున్నారు పాపం కొంతమంది. (మగవారు కూడా ఇలా ఫీలవుతున్నారా? ఎక్కువగా ఆడవారేనా? దీనికి జెండర్ తో సంబంధం లేదా? ) 

మీడియా లో పని చేసిన టెక్నీషియన్ గా ఒక ప్రొఫెషనల్ ఫోటో వెనక ఎంత శ్రమ, ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని జిమ్మిక్కులు ఉంటాయో తెలుసు నాకు. అలాంటిది నేను కూడా ఒకో సారి నా ఫోటో చూసి స్ట్రెస్ అయిన రోజులున్నాయి. అలాంటప్పుడు ఎవరు ఎంత చెప్పినా నమ్మబుద్ధి కాదు .. మనం బానే ఉంటామని. 

కొంచెం పెద్దయ్యాక జీవితం బోల్డు కష్టాలు చూపించి ఈ కష్టాన్ని చిన్న గీత చేసినందువల్ల ఇలా ఉన్నా దేవుడి దయ వల్ల 😊 

ఈ పాట విషయానికొస్తే నాకు చాలా ఇష్టమైన పాట .. తాజ్ర మహల్ (1963) చిత్రం లోనిది. రఫీ గారి గొంతు, రోషన్ గారి సంగీతం, సాహిర్ లుధియాన్వీ పలుకులు .... 

ఇందులో 'జో వాదా కియా వో నిభానా పడేగా' పాట ఫేమస్ .. 

'జో బాత్ తుజ్ మే హై' పాట గురించి ఎక్కువ మందికి తెలీదు .. 


ఈ పాట భావం .. నీ లో ఉన్న విషయం నీ చిత్తరువు లో లేదు ... అని. వీడియో లో విశదంగా వివరించే అవకాశం దొరికింది. ఇదిగోండి లింక్ 


ఈ పాట కెమెరా లేదా ఓ చిత్రం యొక్క లిమిటేషన్స్ ని కవితాత్మకంగా భలే చూపిస్తుందండి! 

వీలైతే పాట ఒరిజినల్ కూడా వినండి. చాలా బాగుంటుంది! 

ఫోటోలు చూసి ట్రామా కి డ్రామా కి గురయ్యే అందరికీ అంకితం ఇస్తున్నాను ఈ పాట ని!!! 

We are all beautiful!

లేబుళ్లు: , , , , ,