ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి ..


నాకు ఇంటి పని తో చాలా పేచీలున్నాయి. 

ఒకటి ఆ పని కి ఉన్న రిపిటీటివ్ నేచర్. ఒక్క రోజు, ఒక్క సారి చేస్తే సరిపోదు. చేస్తూనే ఉండాలి. చేస్తే మామూలుగా ఉంటుంది కానీ చెయ్యకపోతే కనిపిస్తుంది ఏవిటో. ఇంటి శుభ్రానికి శత్రుత్రయం ... దుమ్ము, చెత్త, మట్టి. అందులో దుమ్ము రక్తబీజుడి జాతికి చెందినదే అనిపిస్తుంది నాకు. టెడ్డీ బేర్, బార్బీ బొమ్మలు ఇష్టంగా కొనుక్కొని ఈ రాక్షసుడికి భయపడే వాటికి ప్లాస్టిక్ కవర్ ముసుగులు వేసేస్తూ ఉంటాం కదా. ఈ దుమ్ము అటక ల మీదా, ఫాన్ల మీద ఓ రకంగా, నేల మీద ఇంకో రకంగా, ఎలక్ట్రానిక్స్ మీద మరో రకంగా ఏర్పడుతూ ఉంటుంది. ఒకదానికి ఉపయోగించిన ఆయుధం ఇంకో దానికి ఉపయోగించలేం. అమెజాన్ లో కి వెళ్తే దోమల మెష్ తుడవడానికి ఓ బ్రష్, కార్పెట్ తుడవడానికి ఇంకోటి ఇలా అమ్ముతాడు. కానీ మనం ఆ ట్రాప్ లో పడకూడదు. మా  నాన్నగారు పాత దిండు గలీబు తో ఫాన్ తుడిచే వారు. ఇవి ఇండియా లో మనకే సాధ్యమైన జుగాడ్ చిట్కాలు. 

కొంతలో కొంత చెత్త ఫర్వాలేదు. ఇంట్లో ఫంక్షన్ లాంటివి పెట్టుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది. లేకపోతే మామూలే. ఇంక మట్టి ...  పిల్లలు, మొక్కలు, పెంపుడు జంతువులు ఉన్నప్పుడూ, వానాకాలం లోనూ వస్తుంది అనుకోవచ్చు. ఇవి కాక పొరపాటున కిందపడి పగిలిపోయేవి, పౌడర్ డబ్బాల్లాగా చిమ్మబడేవి, నూనెలాగా రుద్దిరుద్ది కడగాల్సి వచ్చేవి .. ఇలాంటివి బోనస్. చిట్కాలు అవసరం అయ్యే పనులు ఇవి! 

ఈ మూడింటిని దాటితే ప్రత్యక్షమవుతాయి జీవులు... బొద్దింకలు, ఎలకలు, దోమలు, ఈగలు etc. నేను చచ్చిపోతాను.. మిమ్మల్ని కూడా తీసుకు పోతాను అనే సినిమా సైకోల్లాగా ఇవి పోవాలంటే మనక్కూడా ప్రమాదకరమైన కెమికల్స్ వాడాల్సిందే! 

ఇంటికొచ్చిన ప్రతీ సామాను నువ్వు మెయింటైన్ చెయ్యాల్సిన ఇంకో వస్తువే అని తెలియడమే పెద్దరికమ్. ఇది తెలియక వస్తువులు కొనుక్కుంటూ వెళ్లిపోవడం కుర్రతనం. ఈ కుర్రతనమే ఫాబ్రిక్ సోఫా కొనమంటుంది.  శిల్పారామం లో, హోమ్ సెంటర్ లో రకరకాల వస్తువులు కొనమంటుంది. మన దేశానికి సంబంధం లేని వాళ్ళు ఇళ్ళు ఎలా సద్దుకుంటారో చూసి వాళ్ళలాగా ఇల్లు సద్దుకోమంటుంది. వాళ్ళకి దుమ్ము తక్కువేమో.. అన్నీ ఓపెన్ గా ప్రదర్శించుకుంటారు. మన ఇళ్లలో ఒకేఒక షో కేస్ ఉంటుంది. అందులోనే అన్నీ పెట్టుకోవాలి. ఈ మధ్య ఈ రాగి పాత్రలు, ఇత్తడి  బిందెలు,బాయిలర్లు హాల్లో పెట్టుకోవడం ఒక క్రేజ్. కానీ వాటిని అలా మెరిపించాలంటే రెగ్యులర్ గా చింతపండు తో తోముకుంటూ ఉండద్దూ! మళ్ళీ అదో పని!

అభిరుచి ఉండి, ఆసక్తి ఉండి, చేసుకోగలిగిన శక్తీ ఉంటే ఇవన్నీ పనుల్లా అనిపించవు. అలాంటి వారి ఇళ్ళు కూడా భలే చక్కగా చూడముచ్చట గా ఉంటాయి. May God bless them! అలాంటి ఓ ఆంటీ మాకు ఉన్నారు. ఆవిడ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో! మనిళ్ళలో ఓ వాడుక ఉంది చూడండి.. నేల మీద పడ్డ పాలెత్తుకు తాగచ్చు అని ... అలా అన్నమాట. ఇద్దరి ఇళ్ళకి ఒకే అమ్మాయి తడిగుడ్డ పెడుతుంది. కానీ ఆవిడ నేల మెరిసిపోతూ ఉంటుంది. మా నేల మీద తడిగుడ్డ పెట్టిన ఆనవాలు కనిపిస్తాయి. (ఇది ఓ మాప్ యాడ్  లాగా అనిపిస్తోంది కదూ. కానీ కాదు. మేము వాడే మాప్ కూడా ఒకే కంపెనీ.. ఎందుకంటే అది మా హెల్ప్ తనే తెచ్చుకుంటుంది) ఓ రోజు అంటీ ని అడిగితే చెప్పారు ... అమ్మాయి తడిగుడ్డ పెట్టాక ఆవిడ మళ్ళీ పెట్టుకుంటారట! ఇలా శ్రద్ధగా, ఓపిక గా చేసుకున్న ఇళ్ళు చూడగానే తెలుస్తూ ఉంటాయి.  

ఓ వాడుక ఉంది చూసారా ... ఇల్లు చూసి ఇల్లాలిని చూడాలని.. చూడాలి, కానీ జడ్జ్ చెయ్యద్దు. ఇది నా పాయింటు.  ప్రతి కుటుంబానికి ఓ లైఫ్ స్టైల్ ఉంటుంది. అది వారి పరిస్థితులని బట్టీ,  ప్రయారిటీలని బట్టీ ఏర్పడుతుంది. అవి పూర్తిగా తెలుసుకోకుండా కేవలం ఇల్లు శుభ్రంగా లేదని ఒకరిని తక్కువ గా చూడకూడదు కదా. 

ఇన్స్టాగ్రామ్ లో యూరోప్ కి చెందిన ఓ అమ్మాయి కి ఇళ్ళు క్లీన్ చెయ్యడం ఎంత ఇష్టమంటే వారాంతాల్లో వేరే వాళ్ళ ఇళ్ళు శుభ్రం చేసేస్తోంది.  (ఆ అమ్మయి అకౌంట్ లింక్ ఇచ్చాను. పేరుకుపోయిన చెత్త చూడలేని సున్నితమైన సెన్సిబిలిటీ ఉంటే క్లిక్ చెయ్యకండి). వాళ్ళ ఇళ్ళలోకి బలవంతంగా దూరిపోయి కాదు లెండి. మానసిక పరిస్థితి బాలేకో, అంగ వైకల్యం వల్లో తమ ఇల్లు శుభ్రం చేసుకోలేక ఇల్లు చెత్త కుండీ లాగా అయిపోయిన వాళ్ళ ఇళ్ళు మంచి మనసు తో శుభ్రం చేసి పెడుతుంది. ఉచితంగానే. దేనితో ఏది తుడిస్తే ఎలా శుభ్రం అవుతుందో అనే కోర్స్ చేసింది కూడా ఆ అమ్మాయి! (మన దగ్గర హోమ్ సైన్స్ అంటారు... అది ఇలాంటి కోర్సెనా?). వారి దేశాల్లో మరీ పరిస్థితి ఘోరంగా ఉంది అని ఆ అమ్మాయి క్లీన్ చేసే ఇళ్ళు చూస్తే తెలుస్తుంది...  మన దగ్గర మరీ పరిస్థితి అంత దిగజారదు. 

దీనికి నాకు తోచిన ఓ కారణం ... ఇంటి శుభ్రత ని లక్ష్మి దేవి కి ముడిపెట్టేయడం. డబ్బులు మెండుగా ఉండాలంటే రోజూ ఇల్లు తుడుచుకోవాలి, పాచి చేసుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి అనేది మనకి బ్రెయిన్ వాష్ చేసేసారు. సాక్ష్యం కావాలంటే "ఉండమ్మా బొట్టు పెడతా" సినిమా చూడండి.  

సొంత ఇళ్ళ వాళ్ళకి ఇల్లు వారిదే కాబట్టి శ్రద్ధ ఉంటుంది. అద్దె వాళ్ళకి ఇంటి వాళ్ళ భయం ఉంటుంది. ఇవేవీ లేకపోయినా పని చెయ్యడానికి డొమెస్టిక్ హెల్ప్ వ్యవస్థ ఉంది. వాళ్ళకి తోచినట్టు తుడిచి పెట్టేస్తారు.

పశ్చిమం లో మోటివేషన్ గురు లు ఈ మధ్య చెప్తున్నారు .. లేచాక వెంటనే పక్క శుభ్రంగా వేసేసుకోండి.. దాని వల్ల మీ రోజు బాగా గడుస్తుంది అని. ఇది ప్రత్యేకంగా చెపుతున్నారంటే వాళ్ళకి అలవాటు లేదా అనిపించింది నాకు. మన ఇళ్లలో పిల్లల వీపులు బద్దలు కొడతారు కదా పక్కలు తియ్యకపోతే! అది కూడా పొద్దున్నే!  

నిజానికి శుభ్రంగా ఉన్న ఇల్లు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కొంత మంది విషయం లో ఈ మాట కి రివర్స్ కూడా పని చేస్తుంది. మనసు ప్రశాంతంగా అవ్వటానికి ఇల్లు క్లీన్ చేసే అలవాటు చాలా మందికి ఉంది మనలో. కానీ ముందు చెప్పినట్టు మానసిక స్థితి బాగోకపోతే అస్సలు ఇంటిని శుభ్రం చేసుకోలేం. ఆ పని భారంగా అనిపిస్తుంది. విసుగ్గా అనిపిస్తుంది. అలాగే కెరీర్ కొంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడు కూడా ఇంటి పని కి అస్సలు సమయం కేటాయించలేం. ఈగ ఇల్లలుకుతూ పేరు మర్చిపోయింది అనేది సామెత. ఇల్లలికే పనుల్లో పడితే పేరేంటి .. కెరీర్, వర్క్ గోల్స్ .. ఇవన్నీ మర్చిపోయే ప్రమాదం లేకపోలేదు. 

ఇల్లలకడం అంటే గుర్తొచ్చింది... నేను ముందు చెప్పినట్టు ... ఈ ఇల్లు శుభ్రత విషయం లో బ్రెయిన్వాష్ చిన్నప్పుడే మొదలవుతుంది .. ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి .. అని మొదలవుతాయి కదా చిన్న పిల్లల ఆటలు. ఇల్లలకగానే పండగ కాదు అంటారు.. ఈ సామెత కి నాకు మొత్తం వ్యాసం లో ఎక్కడా సందర్భం కుదర్లేదు. ఊరికే పడుంటుంది అని రాస్తున్న అంతే 😄

ఇంటర్నెట్ లో ఇల్లు మైంటైన్ చెయ్యడానికి క్లీనింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. రోజూ గదులు తుడుచుకోవటం, వారానికోసారి బాత్రూమ్స్, నెలకోసారి మంచం దులుపుకోవడం, కర్టెన్స్ గట్రా మార్చుకోవటం.. ఇలా. కానీ ఈ షెడ్యూల్ ఇంటింటికీ మారుతుంది కదా. ఇంటి ముందు రోడ్డు వేసినా, కన్స్ట్రక్షన్ పని జరిగినా ఇంట్లోకి బోల్డు దుమ్ము, ధూళి వస్తుంది. అలాగే ఇంట్లో పిల్లలూ, పెంపుడు జంతువులూ ఉంటే ఆ షెడ్యూల్ వేరు! అందుకే అవి పెద్దగా ఉపయోగ పడవు మనకి. అలాగే  వెస్ట్ వాళ్ళు కనిపెట్టిన వాక్యూం క్లీనర్లు, ఇల్లు తుడిచే రోబోలు కూడా మనకి పనిచేయవని నా అభిప్రాయం. 

మన దగ్గర దీపావళి, ఉగాది లాంటి పండగలకి ఇళ్ళు నిగనిగలాడేలా చేసుకుంటాం. మంచు దేశాల్లో స్ప్రింగ్ క్లీనింగ్ అంటారు ... ఓహో ఓహో వసంతమా అంటూ బూజులు దులుపుకుంటారన్నమాట అక్కడి వారు. 

ఇంటర్నెట్ లో అందరం చూసాం ఓ ఫార్వార్డ్ .. జపాన్ లో స్కూల్  పిల్లల కి టాయిలెట్స్ శుభ్రం చేయడం నేర్పిస్తారని. మన దగ్గర ఇది ఎంత పెద్ద వివాదం అవుతుందో నేను చెప్పక్కర్లేదు. గాంధీ సినిమా లో ఓ సీన్ ఉంటుంది... సబర్మతీ ఆశ్రమం లో టాయిలెట్స్ శుభ్రం చేసే పని వారానికి ఒకరు చెయ్యాలి. ఓ సారి కస్తూర్బా గారి వంతు వస్తుంది. ఆవిడ అస్సలు చెయ్యడానికి ఇష్టపడదు. గాంధీ ఆ సమయం లో ఆవిడ మీద కన్నెర్ర చేస్తారు కూడా!   

సంపన్నుల ఇళ్లలో టీపాయ్ ల మీద, బల్లల మీద, గోడల మీద ఉండే ఖరీదైన  గృహాలంకరణ వస్తువులు, ఇండోర్ ప్లాంట్స్ మీద ఆకులకి సైతం దుమ్ములేకుండా చూసినప్పుడు "తాజ్ మహల్ కు రాళ్ళెత్తిన కూలీలు" గుర్తొస్తారు నాకు.  మనం సొంతగా మెయింటైన్ చేసుకోలేని ఇళ్ళు కట్టుకుని ఇంకో జాతి మీద మనం డిపెండ్ అయ్యి .. వారు మన మీద డిపెండ్ అయ్యేలా చేస్కున్నామని  అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కానీ నేను ఈ బ్లాగ్ ప్రశాంతంగా రాయగలుగుతున్నాను అంటే నా ఇల్లు శుభ్రం చేసుకొనే పని నుంచి నేను ఫ్రీ అవ్వడం వల్లే అని కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ విషయం గురించి మాట్లాడటానికి నా అనుభవం తక్కువ... ఇంటి మెయింటెనెన్స్ లాగే. 😁

ఇంటి పని అదే పని గా చేసి కొంతమంది మైండ్సెట్ ఇరుకైపోతుందని అని నా అబ్సర్వేషన్.  తమ ఇల్లు తుడుచుకొని రోడ్డు మీద దుమ్ము పడేసే వాళ్ళు ఈ బ్యాచే అనిపిస్తుంది. బతుకంతా ఇంటి శుభ్రత చుట్టే తిరుగుతుంది ఇలాంటి వాళ్ళకి.  దానికి అనువైన నిర్ణయాలే తీసుకుంటూ ఉంటారు కూడా. ఇల్లు పాడవుతుంది అని కుక్కని పెంచుకోకపోవడం, సోషల్ లైఫ్ లేకుండా ఇల్లు అదే పనిగా తుడుచుకుంటూ ఉండటం, ఇంటికొచ్చిన అతిథుల వల్ల ఏదైనా ఒలికినా, మరక పడినా నిర్మొహమాటంగా వాళ్ళ ముందే మొహం మటమట పెట్టుకోవడం, పిల్లల్నయితే తిట్టేయడం... ఇవన్నీ ఈ మైండ్సెట్ వల్ల కలిగే పైత్యాలే.  ఫ్రెండ్స్ సీరియల్ లో మోనికా పాత్ర ఈ బాపతే. 

ఆడవాళ్లు ఇంటిపనులు, ఆఫీసు పనులూ 'బ్యాలెన్స్' చెయ్యలేక చస్తూ ఉంటే 'మగవాళ్ళు చీపురు పట్టుకోకూడదు' అనే మాటలు విన్నా, అసలు ఆ సదరు మగవాళ్ళకి ఇంట్లో చీపురు కట్ట ఎక్కడుందో తెలీదన్నా నాకు వారి మీద ఈర్ష్య, ఆగ్రహం ఒకేసారి వస్తాయి. ఇదే మగవాడికి ఓ షాపు ఉండి ఆ రోజు బాయ్ రాకపోతే చీపురుతో తన కార్యక్షేత్రాన్ని తుడుచుకుంటాడు! ఇప్పుడు పరిస్థితి లో చాలా మార్పు వచ్చింది .. కాదనట్లేదు. కానీ ఇప్పటికీ ఇంటి నిర్వహణ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేని ప్రివిలేజ్ లో ఎంతమంది మగవారు ఉన్నారో కదా! 

జీవితాన్ని కాచి వడబోయలేదు కానీ ... గోరువెచ్చ గా సిప్ చేసిన అనుభవం తో నాకు తెలిసిందేంటంటే .. దీపం కిందే చీకటి ఉన్నట్టు ...మనం సుఖం అనుకునే ప్రతి దాని వెనక ఓ నస ఉంటుంది. సౌకర్యం కోసం, సెక్యూరిటీ కోసం మనిషి ఇళ్ళు నిర్మించుకుంటే ఆ వెనకే వస్తుంది ఎడతెగని ఇంటిపని. కనిపించదు కానీ మన దినచర్య లో చాలా భాగం ఇదే ఆక్రమించుకుంటుంది. ఇష్టంగా చేసుకున్న రోజు exercise, టైం పాస్. లేనిరోజు విసుగు, చాకిరీ.  

Comments

  1. ఇప్పుడు నేను ఇల్లంతా సర్దాలి , వాక్యూమ్ పెట్టాలి , అది తప్పించుకోడానికి , బ్లాగ్స్ ఓపెన్ చేస్తే, మీరు కూడా అదే రాశారు .
    కొంతమంది ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటాయంటే , లోపాలకి వెళ్లాలంటే గిల్టీ గా అనిపిస్తుంది , ఎక్కడ మాసిపోతుందేమో అని భయం .

    ఈ దేశం లో అన్ని అలానే ఉంటాయి , విసుగొస్తుంది , అంత ఆర్గనైజ్డ్ గా ఎంత ట్రై చేసినా నేను ఉండలేకపోతున్నాను . ఆ చిరాకు లో , ఇండియా వెళ్లిన తరువాత పూరిళ్లు, మట్టి అరుగులు , ఒక చాప , దిండు , ఒక చీపురు ఇలాంటి ఇల్లు కట్టుకుంటే, అప్పుడు ఇలా అద్దం లా ఉంచాల్సిన అవసరం ఉండదు కదా అని అనిపిస్తుంది .

    ReplyDelete
  2. ఎంత బాగా వ్రాసారండి. ఈ సబ్జెక్ట్ మీద ఎంత వ్రాసినా సరిపోదు. ఒక ఇంటికి 12 కిటికీలు ఉంటే ఒక్కొదానికి 3 గ్రిల్స్ ఉంటే 3 కిటికీ గ్లాస్ రెక్కలు 3 దోమల మేష్ లు 12×3×3=108.
    12 తలుపులు ఉంటే రెండు రెక్కలు కలిపి
    12 ×2=24. ఇంటి పైన జాలిలు కలిపి 120.ఇదంతా ఒక్క ఫ్లోర్ ఉంటేనే... రెండు ఫ్లోర్ లు అయితే 240.
    ఇదంతా తలుపులు కిటికీల లెక్క అయితే ఫ్లోరింగ్ లెక్క, గేట్లు లెక్క, మెట్ల కున్న గ్రిల్స్ లెక్క వేరే లెవల్ లో ఉంటుంది. ఇదంతా అయిన తరువాత మొక్కల ప్రేమికుల లెక్క పీక్స్ లో ఉంటుంది.
    ఇవన్నీ శుభ్రం చేయాలి అంటే ఒక ఫ్యామిలి ని పోషించాలి.
    ఇంట్లో కళాత్మక వస్తువులు చూసినపుడు ఇవన్నీ ఎవరు శుభ్రం చేస్తారు అని అనిపిస్తుంది.
    కొన్ని యుట్యూబ్ వీడియో ల్లో విదేశాల్లో ఉంటున్న అబ్బాయిలు శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు కానీ ఇండియా లో ఉంటున్న అబ్బాయిలు శుభ్రం చేస్తున్నట్లు కన్నిపించలేదు. ఇదంతా కాదు కానీ ఈ దుమ్ము ధూళి ఆడవాళ్ళ కళ్లకే ఎందుకు కనిపించి చికాకు పరచాలి ? చీర కొంగు దోపేసి చీపురు పట్టే బుద్ధి ఆడవాళ్ళకే ఎందుకు కలుగుతుంది ?






    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. యూరోప్ అమ్మాయి వీడియో లు చూసాను. విదేశాల్లో అంత దరిద్రంగా ఉండేవాళ్లు ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ప్రతి వీడియో లో కుప్పలు కుప్పలు గా చెత్త ఇల్లంతా పరిచి ఉంది. ఆఖరికి వాళ్ళ అమ్మ గారి ఇల్లు వీడియో లో కూడా అలాగే ఉంది. వీడియో ల కోసం ఇదొక వ్యూహం అనిపిస్తుంది. Harsha sai లాగా అన్నమాట.

      Delete
    2. ఈ ప్రశ్న చాలా మంది అడిగారు. ఆ అమ్మాయి మాత్రం అంతా అలాగే ఉంటోంది అని చెప్తోంది మరి

      Delete
  4. ఇంట్లో వంట చేస్తే ఇల్లు కంపు కొడుతుందని బయటికి వెళ్లి తినే వాళ్ళు , తింటానికి బయటనుండి తెప్పించుకొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.

    ReplyDelete
  5. గత సంవత్సరంలో ఒక రామకీర్తనలో ఇంటిపని ప్రసక్తి వచ్చింది. ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా అని.

    ReplyDelete

Post a Comment