నాలుగు కళ్ళు రెండయినాయి ...
... రెండు మనసులు ఒకటయినాయి .. ఈ పాట గుర్తుందా? ఈ పోస్టు ఆ పాట గురించి కాదు.
విషయం ఏంటంటే నాకు కళ్ళజోడు ఉంది.
మనకి తెలిసి కళ్లజోడు తలనొప్పికి గాని, సైట్ కి గాని పెట్టుకుంటారు. సైట్ అన్నప్పుడు మనం ఉద్దేశం సైట్ ప్రాబ్లమ్ అని. సైట్ అంటే చూపు. అదే ఉంటే కళ్ళజోడు ఎందుకు? వాషింగ్ పౌడర్ ని సర్ఫ్ అనేసినట్టు, మధు అనే రాక్షసుడిని చంపి మధుసూదనుడైన విష్ణువు పేరు పెట్టుకున్న వ్యక్తి ని ఆ రాక్షసుడి పేరు తో మధు అని పిలిచినట్టు, కర్ణాటక సంగీతాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంగీతం అనుకున్నట్టు ... సైట్ ని కూడా అలా వేరే అర్ధం (పై పెచ్చు వ్యతిరేక అర్ధం) లో వాడటం మనకి అలవాటైపోయింది.
ఎలా వాడితే ఏం .. నాకు సైట్. అదే సైట్ ప్రాబ్లమ్.
చిన్న విషయం గా అనిపిస్తుంది కానీ, అద్దాలు ఉండటం వల్ల దైనందిన జీవితం వేరే వారి లా ఉండదు. ఇది అద్దాలు వాడే వారికే తెలుస్తుంది.
వేడి కాఫీ/టీ తాగే అప్పుడు ఉఫ్ అని ఊదగానే కళ్ళజోడు మీద ఆవిరి వచ్చేస్తుంది. కొన్ని రకాల మాస్క్ పెట్టుకుంటే కూడా కళ్ళజోడు మీద ఫాగ్ వచ్చేస్తుంది ఊపిరి వదిలినప్పుడల్లా. అదో న్యూసెన్స్. త్రీ డీ సినిమాలు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు త్రీ డీ గ్లాసెస్ ఇస్తారు కదా ... అవి మా కళ్ళజోడు మీద పెట్టుకోవాల్సి వస్తుంది. సైట్ ప్రాబ్లమ్ ని బట్టి, తీవ్రత ని బట్టి డ్రైవింగ్ లాంటివి చెయ్యలేం. పైలట్ లాంటి ఉద్యోగాలు చెయ్యలేం. డిఫెన్స్ లో కూడా కొన్ని పోస్టులకి సైట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళని తీసుకోరు. క్రీడల్లో అద్దాలున్న ఆటగాళ్లు లేకపోలేదు కానీ అంతగా సూటబుల్ ప్రొఫెషన్ కాదు అది కూడా. ఇంతలా లైఫ్ ఛాయిసెస్ ని మార్చేస్తుంది కళ్ళజోడు.
LASIK ఆపరేషన్ మినహా సైట్ ప్రాబ్లమ్ ఇంకెలాగూ తగ్గదు. అద్దాలు వాడుతూ ఉండాలి. అంతే. కానీ వాడకపోతే పెరుగుతుందట కూడా.
యోగా లో కొన్ని కంటి exercises చెప్పి వీటి వల్ల చూపు బెటర్ అవుతుంది అనటం చూసాను. కానీ అవి సాధన చెయ్యడం కుదర్లేదు.
ఆ లెవెల్ సమస్య కాదు కానీ నాకు అనిపించే ఇంకో సమస్య ... తెలుగు ట్రెడిషనల్ బట్టలు వేసుకొని, పాపిట తీస్కొని జడ వేసుకోని, పూలు పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకుంటే నప్పదు ఏంటో. సరే ... ఫాషన్ అంటే మనం అనుకొనేదే కదా అని సరిపెట్టుకుంటూ ఉంటాను నేను. ఇలాంటి ఫాషన్ సమస్య ఇంకోటి ... మేము స్టైల్ గా సన్ గ్లాసెస్ రెడీమేడ్ గా పెట్టుకోలేం. ప్రిస్క్రిప్షన్ వి చేయించుకోవాలి. కళ్ళజోడు పెట్టుకొని ఎండలోకి వెళ్తే కళ్ళజోడు షేప్ లో టాన్ అయిపోతాం తెలుసా .. చూడటానికి ఏం బాగోదు ఇది. అలా అని వానా కాలం కూడా బెటర్ కాదు .. వానలో తడవాల్సి వస్తే కళ్ళజోడు మీద పడ్డ చినుకులు తుడుచుకుంటూ కూర్చోవడం .. ఇంతే గా.
ఫ్రేమ్ లేని కళ్లజోళ్లు పోతే వెతకడం ఎంత కష్టమో తెలుసా. అసలు కళ్ళజోడు వెతకడం అంటేనే క్యాచ్ - 22 సిట్యుయేషన్. స్పష్టంగా కనిపించాలంటే కళ్ళజోడు కావాలి, కావాలంటే వెదకాలి, వెదకాలంటే స్పష్టంగా కనిపించాలి... పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లవ్వదు.
జోకుల్లో చెప్పినట్టు ఒక్కో సారి తలమీదే ఉంటుంది అనకండి. నిజానికి అద్దాలు తల మీద కొందరే పెట్టుకోగలరు. పెద్ద జుట్టున్న ఆడవారు తల మీద అద్దాలు పెట్టుకుంటే వాటి నోస్ పాడ్స్ లో జుట్టు చిక్కు పడిపోతుంది తెలుసా. బట్టతల/పొట్టి జుట్టు ఉన్నవారికే ఏం అవ్వదు. అయినా తల కి నూనె రాసుకున్నప్పుడు ఇలా జోళ్ళు పైకి పెట్టుకుంటే మసకబారిపోవూ?
కళ్ళజోడు కష్టాలకి మిడిల్ క్లాస్ కష్టాలు తోడైతే ఇంక చెప్పేదేముంది? చూస్కోకుండా కళ్ళజోడు మీద కూర్చోవడం, అది వంకర పోవడం, కానీ అది ఈ మధ్యే తీసుకున్నాం కదా అని అలా వంకర గానే పెట్టుకొని అడ్జస్ట్ అయిపోవడం!
నేను ఫొటోల్లో కళ్ళజోడు తీసేస్తాను. నేను ఫొటోల్లోనే కళ్ళజోడు తీస్తాను. కొంత మంది సైట్ ఉండి కూడా కళ్ళజోడు పెట్టుకోరు తెలుసా. కొంత మందికి తలనొప్పి వస్తుందట. ఇది అర్ధం చేస్కోవచ్చు. కానీ కొంతమందికి స్టైల్ కూడా ఒక కారణం.. ఇలాంటి వాళ్ళని నేను చాలామందినే చూసాను. దీనికి పూర్తి వ్యతిరేకం ఇంకో విచిత్ర జాతి. వీళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవడం సరదా. కానీ పాపం దేవుడు వీళ్ళకి సైట్ ప్రాబ్లమ్ ఇవ్వలేదు. వీళ్ళు ప్లెయిన్ గ్లాసెస్ పెట్టుకొని ఫీలయిపోతూ ఉంటారు. తిండి దొరకని వాళ్ళూ, తిన్నది అరగని వాళ్ళూ .. ఇలాగ .. ఈ ప్రపంచం లో ఈ రెండు రకాల వాళ్ళూ ఉన్నారు. ప్చ్ ..
ఖద్దరు వేసుకున్న ప్రతీవాడూ గాంధేయ వాది కాదన్నట్టు కళ్ళజోడు లేని ప్రతీ వ్యక్తి 20/20 విజన్ తో ఉన్నవారేమి కాదు. గాంధేయ వాదం అంటే గుర్తొచ్చింది... ఓ కళ్ళ జోడు కి ఎంత గౌరవం, విలక్షణత, ఐడెంటిటీ లభించగలదో గాంధీ గారి కళ్ళజోడు ని చూస్తే తెలుస్తుంది. కళ్లజోడుల ప్రపంచం లో ఈ కళ్ళజోడే మెగా స్టార్ అనుకోవచ్చు.
సినిమాల్లో కళ్ళజోడు చిత్రీకరణ గురించి నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో.
కవలల్లో ఒకడు మంచి బాలుడు, చదువుకున్న వాడు అని చెప్పడానికి కళ్ళ జోడు పెడతారు గమనించారా? అమాయకత్వానికి, చదువరితనమ్ చూపించడానికి కూడా దీన్ని వాడతారు.
హీరోలకి పైన చెప్పిన సందర్భాల్లోనే కాక వేషాలు మార్చినప్పుడు, గ్లామర్ తగ్గించాలి లేదా వయసు పెరిగింది అన్నప్పుడు తప్ప కళ్ళజోడు ఉండదు. హీరోయిన్ లకి కూడా. (ఇది ఇంకా పాపం గా భావిస్తారు ఏంటో). శుభలేఖ సినిమాలో సుమలత గారు కళ్ళజోడు తోనే కనిపిస్తారు. ఇలా ఇంకేమైనా ఉదాహరణలు ఉన్నాయా తెలుగు సినిమాలో? (ఒక సినిమాలో హీరోయిన్ కి కళ్ళజోడు ఉంటుంది కానీ ఒకటి రెండు సీన్ల వరకే ... మేక్ ఓవర్ లో ఆమె లెన్స్ లోకి వచ్చినట్టు చూపిస్తారు).
నాకు గుర్తుండీ హీరో కి కళ్ళజోడు ఉండి బాగా హిట్ అయి కోట్ల డాలర్లు వసూలు చేసిన సినిమా హారీ పాటర్. అతను అన్ని ఫైట్లు అలా కళ్ళజోడు తోనే చేస్తాడు. కళ్ళజోడు లేకపోతే ఎలా కనిపిస్తుందో ఆ సినిమాలో చాలా సార్లు చూపిస్తారు కూడా.
స్పైడర్ మాన్ పీటర్ పార్కర్ గా ఉన్నప్పుడు కళ్ళజోడు ఉంటుంది. కానీ అతన్ని సాలీడు కుట్టి స్పైడర్ మాన్ అయ్యాక సైట్ ప్రాబ్లమ్ పోయినట్టు చూపిస్తారు. మరి మాస్క్ మీద కళ్ళజోడు పెట్టుకున్నట్టు చూపించలేకేమో మరి.
సినిమాల్లో కళ్ళజోడు ఉన్న సీన్లలో కూడా వాటిని స్టైల్ కే ఎక్కువ వాడతారు ...
షాక్ అయినప్పుడు కళ్ళజోడు తీసి షాక్ అవుతారు ... షాక్ అంటేనే స్థబ్దుగా అయిపోవడం .. అలాంటప్పుడు కళ్ళజోడు తీసెయ్యటం ఎలా గుర్తుంటుంది మెదడు కి?
అలాగే కళ్ళజోడు ఒక చేత్తో తీసి దాని కాడ ని పంటి మధ్య పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు.
నేను గత ఇరవై ఏళ్ళ నుంచి కళ్ళజోడు వాడుతున్నాను. ఇలా ఒక్కసారి కూడా చెయ్యలేదు. తట్టక కాదు. ప్రాక్టికల్ గా ఇది పనికి రాదు. ఒక చేత్తో కళ్ళజోడు పదే పదే తీస్తే చెవుల దగ్గర లూజ్ అయిపోతుంది. నాకు అద్దాలు వచ్చినప్పుడు నా ఆప్టిషియన్ చెప్పిన మొదటి మాట ఇది. ఇంక చెవి వెనక భాగం లో జుట్టు ఉంటుంది. చెమట పడుతుంది. డాండ్రఫ్ సమస్య ఉండచ్చు. అక్కడ ఉండే కళ్ళజోడు కాడ ని నోట్లో ఎవడు పెట్టుకుంటాడు చెప్పండి?
ఇంకో కళ్ళజోడు మేనరిజం ..జారిన కళ్లజోడు ని ముక్కు పైకి తోసుకువడం. ఇది ఒకే .. ఇది నిజ జీవితం లో కూడా చేసేదే.
కళ్ళజోడు ఉన్న హీరోయిన్ ని హీరో ఇష్టపడితే ఆమె దగ్గరికి వెళ్లి ఆమె అద్దాలు తీసేస్తాడు. అవేవో ఆమె ఆకర్షణ ని తగ్గించేట్టు. పోనీ అలా తీసాక ఆమె ముక్కు మీద అద్దాల వల్ల కలిగిన నొక్కులు ఉండవు.
ఇన్ని సినిమాలు చూసాను.. ఒక్క సారి కూడా కళ్ళజోడు మీద కూర్చుంటే అవి ఎలా వంగిపోతాయో చూపించలేదు.
కొంత మంది నటులు, కొన్ని సినిమాల్లో మాత్రం సహజ సిద్ధంగా కళ్ళజోడు వాడారు. (నాకు హిందీ నటులు అశోక్ కుమార్ గారు గుర్తొస్తారు ఈ విషయంలో.)
సినిమాలు సమాజం యొక్క ప్రతిబింబాలు అనుకుంటే, ఈ విషయం లో సమాజం లో వివక్ష బానే ఉంది.
వెధవ జోకులు, కామెంట్లు .. ఎన్ని వినలేదు?
తెల్లగా ఉన్న వాళ్ళు 'కర్రోడా' అనడం ... డబ్బున్న వాడు 'బ్లడీ పూర్ పీపుల్' అనడం .... సన్నగా ఉన్న వాళ్ళు 'ఏ బోండం' అనడం ... కళ్ళజోడు లేకుండా స్పష్టంగా చూడగలిగే వాళ్ళు అద్దాలు ఉన్న వాళ్ళని 'నాలుగు కళ్ళు... సోడా బుడ్డి' అని, కళ్ళజోడు తీసేసినప్పుడు 'నేను కనిపిస్తున్నానా .. ఇవి ఎన్ని వేళ్ళు' అనడం, స్పెక్స్ తీస్కొని వాళ్ళు పెట్టుకొని 'అబ్బో ... నీకు చాలా సైట్ ఉంది' అనడం ... ఇవన్నీ ఒకే కేటగిరి కి చెందిన పాపాలు నా ప్రకారం. వీళ్ళకి నరకం లో ప్రత్యేకమైన శిక్షలు ఉంటాయి అని నా ప్రగాఢ విశ్వాసం. మాకేమీ సరదా అయ్యి సైట్ ప్రాబ్లమ్ తెచ్చుకోలేదు కదా మేము.
సైట్ గురించిన కొన్ని అపోహలు కూడా ఉండేవి. మైనస్ లో ఉంటే ఎక్కువ అని, ప్లస్ లో ఉంటే తక్కువ అని. అలాంటిదేమీ లేదట.
లేబుళ్లు: Sowmya Nittala, sowmyavadam, spectacles, Telugu blog, telugu blogger, telugu humour


19 కామెంట్లు:
ఆద్యంతం నవ్వించారు...ఎగతాళి కాదండోయ్...నిజంగానే.
>>>"ఇన్ని సినిమాలు చూసాను.. ఒక్క సారి కూడా కళ్ళజోడు మీద కూర్చుంటే అవి ఎలా వంగిపోతాయో చూపించలేదు." >>>
మీరు మరీను జంధ్యాల గారిలా నవ్వించి చంపేటట్లు ఉన్నారు.
కర్ణాటక సంగీతం అంటే కర్ణాటక రాష్ట్రం వాళ్ళదే అనుకున్నాను అండి. నాలాంటి అజ్ఞానులను క్షమించేయండి.
🙏🙏
సైట్ ఉంది లాంటిదే బిపి ఉంది అనడం కూడా 🙂.
కళ్ళజోడు ఎక్కువ సేపు ఎండలో ఉంటే ఫ్రేమ్ వేడెక్కి పోయి కలిగించే మంట కూడా ఉంటుందండోయ్. రిమ్ లెస్ అయితే ఇక చెప్పనక్కర లేదు. అవునూ ఫ్రేమ్ అంటే గుర్తొచ్చింది కనబడకపోయిన కళ్ళజోడుని వెదకటానికి ఫ్రేమున్న కళ్ళజోడయితే ఏమిటి, లేనిదయితే ఏమిటి?
కళ్ళజోడు తీస్తూ బరువుగా డయలాగ్ చెప్పే పాత్ర సినిమాల్లో ఆపరేషన్ ధియేటర్ లో నుండి బయటికొచ్చిన డాక్టర్.
కళ్ళజోడు వాళ్ళని ఎగతాళి చేసే వారికి ఒకటే శిక్ష - పైలోకాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి సోడాబుడ్డి కళ్ళద్దాలు తగిలించేసి మళ్ళీ జన్మ ఎత్తడానికి వెళ్ళే వరకు ఇవి తగిలించుకునే తిరుగుతుండు అని ఆదేశం ఇవ్వడమే.
మరోసారెప్పుడూ కళ్ళజోడు కాడ చివర్ని నోటిలో పెట్టుకోకుండా చేసారు కదా 😳.
మరచానండీ! నేటి కాలంలో పెద్ద ఫ్రేం ఉన్న కళ్ళద్దాలు పెట్టుకున్నవారంతా మేధావులుగా చలామణీ అవుతున్నారుటండి.ఇక గ్లాస్ అద్దాలు వెనకబడినట్టే! ముక్కు మీద బరువుపోవడంతో కళ్ళజోడెట్టుకున్నామో లేదో వెతుక్కోవలసొస్తోంది, ఫైబర్ గ్లాసులతో. ఇప్పుడంతా ఫైబర్ గ్లాస్ యుగం, దీనికీ రోజులు చెల్లినట్టున్నాయి. లేటెస్ట్ లాసిక్,ఇది బాగా నడుస్తోంది. కళ్ళజోడు గోలలేదు. మొన్నీ మధ్యనే ఒక టెకీ కుర్రాడికి లాసిక్ చేయించాం. కొంచం ఖరీదు నలభైవేలదాకా అవుతుంది. ఖర్చులతో నలభై ఐదనుకోండి. మరో మాట కూడా లాసిక్ సర్జరీ పెర్మనెంట్ కాదని నా నమ్మిక, ఇరవై ఏళ్ళ తరవాత మళ్ళీ చేయించుకోవాలి.
కామెంట్ పెద్దయిందాండీ
లసిక్ నలభై వేలు అంటే ఒక్కో కంటికా, శర్మ గారు (నిజంగానే అడుగుతున్నాను సుమండీ)?
రెండో పాయింట్ …. లసిక్ పెర్మనెంట్ కాదంటారా? గుండె బైపాస్ ఆపరేషన్ గురించి కూడా అదే అంటున్నారు ఈ మధ్య. ఇవన్నీ ఆపరేషన్ తరువాత కాలంలో సాగించే జీవన విధానం బట్టి కూడా ఉండచ్చేమో లెండి బహుశః?
Sir,
The boy was wearing cylindrical lenses, suppose he suffers from Astigmatism.
he was selected in campus and his BMI is more and sweating frequently causing him much discomfort. We observed him and gone for lasik as his further life is entirely connected with computer.
ఇక రెండు కళ్ళకి ఒకేసారి చేసారు. బాగుంది. రెండు కళ్ళకి నలభైవేలు. మందులు ఇతర ఖర్చులు మరో ఐదువేలు.చూపు బాగుంది కళ్ళజోడు బెడద తప్పింది. ఇది వయసులో వాళ్ళకి ఉపయోగం అనుకుంటాను, శరీరమార్పులు తక్కువగా వస్తాయి, మార్పుకి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అదే వయసుమళ్ళినవారికి శరీరం తొందరగా శిధిలమవుతుంది కదా! ఇది పనికిరాదని నా అభిప్రాయం. కుర్రాళ్ళకి కూడా ఇరవై ఏళ్ళ తరవాత మరో సారి పనిబడచ్చు, చెప్పలేం. ఇది నా అభిప్రాయం.మనకి తేలిగ్గా ఉండే పైబర్ గ్లాసు లెన్సులు పెద్ద ఫ్రేం కళ్ళజోడు, మేధావి అనే బిరుదిచ్చేస్తాయి. అందంగానూ ఉంటాయండి. వినదగునెవ్వరు చెప్పిన కదా! డాక్టర్ సలహా ఉత్తమం.
కామెంట్ పెద్దదైపోయి సౌమ్య గారి బ్లాగును కబ్జా చేసినట్టుంది, సౌమ్య గారు మన్నించండి
ఫ్రేమ్ లేని కళ్ళజోడు ఎక్కడ పెడితే ఆ బాక్గ్రౌండ్ లో కలిసిపోతుంది... ఊసరవెల్లి లాగా. అదీ తేడా :)
కామెంట్ పెద్దదా చిన్నదా కంటే కూడా ... పోస్టు రాసిన సబ్జెక్టు మీద భిన్న అభిప్రాయాలూ, దృష్టి కోణాలు చదవటం నాకు ఇష్టమేనండి :)
ఒకరికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అందించడానికి నా కామెంట్స్ సెక్షన్ ఉపయోగపడటం నాకు ఆనందమే అండి శర్మ గారు. :)
A.G.Gradener పూనినట్లు ఉన్నాడండీ మిమ్మల్ని. చాలా బాగుంది వ్యాసం.
Very well written post. Spects become part of the face for those having sight problem. It is a lifelong companion.
True
పెద్ద కాంప్లిమెంట్ అండి! Thank you very much ☺️
చాలా బాగుంది . సున్నితమైన హాస్యం తో అదరగొట్టేసారు .
సినిమాల్లో కళ్ళజోడు గురించి మాట్లాడుతూ ఆంధ్రుల అత్తగారు సూర్యకాంతాన్ని ప్రస్తావించకపోవడం అన్యాయం కదూ? వేషం బుక్ చేయడానికి వెళ్ళినప్పుడే ఆ పాత్రకి ఏ కళ్ళజోడు బాగుంటుందో ఎంచి పెట్టుకునే వారట (ముళ్ళపూడి 'కోతి కొమ్మచ్చి'). హీరోకి కళ్ళజోడు ఉంటే బుద్ధిమంతుడు/బడుద్ధాయి అని కూడా సినిమార్ధం అనుకుంటా (జంధ్యాల సినిమాల్లో 'శుభలేఖ' సుధాకర్). కళ్ళజోడు ఉండి, అలా ఉన్నందుకు న్యూనత ఫీలయ్యే హీరోయిన్ 'ఆయనకి ఇద్దరు' లో ఊహ. అన్నట్టు మీ నాయిక కమలినికి కళ్ళజోడు పెట్టారుగా 'గోదావరి' లో.. ఇలాంటివి ఇంకా చాలా.. మొత్తానికి భలే పోస్టు!!
Thank you :)
Thank you for sharing the tidbits :)
I really enjoyed reading this article. Pratyekam ga telugu lo meeru rasina ee vyasaniki pratyeka kruthaghnathalu, Sowmya akka. Mukhyam ga 'madhu' joke ki paka paka navvaanu.
Thank you Sahithya :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్