Friday, December 7, 2018

'చలన' చిత్రాలు

పోయిన వారం రెండు అద్భుతమైన సినిమాలు చూసాను. (లీగల్ గా .. హాట్ స్టార్ లో) 

కోకో, ఫెర్డినాండ్ .. రెండూ యానిమేటెడ్ సినిమాలే.  ఈ సినిమాల గురించి మాట్లాడుకునే ముందు నాకూ యానిమేటెడ్ సినిమాలకూ ఉన్న అనుబంధం గురించి చెప్పాలి. 

జీవితం లో కొన్ని గొప్ప విలువలని, ప్రపంచాన్ని గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలని, మానవత్వం, మనిషి చరిత్ర, నైజం, ప్రకృతి, వన్యప్రాణులు, ప్రేమ, పెళ్లి.. వీటిని ఎలా అర్ధం చేసుకోవాలి అనే విషయాలని నాకు యానిమేటెడ్ సినిమాలే నేర్పించాయి. 

ఈ సినిమాలు ఆల్రెడీ చూసే అలవాటు ఉన్నవాళ్లు ఇవి పిల్లలకి మాత్రమే కాదని ఒప్పుకుంటారు, నాలాగా. 

ఒక్కొక్క సినిమా ఒక్కొక్క భ్రమ/హింసాత్మకత/ముతక అలవాటు ని పటాపంచలు చేసే విధంగా ఉంటుంది. ఒక్కొక్క సినిమా కథ ది ఒక్కొక్క దేశం. ఆ దేశ భాష, సంస్కృతి ని పరిచయం చేసే విధంగా ఉంటాయి ఇవి. అన్నిటిలోకి కామన్ .... మంచి సంగీతం, సరదా జోకులు, బోల్డు wisdom! 

జెనరల్ గా యానిమేటెడ్ సినిమా అంటే ఫెయిరీ టేల్స్ అంటే పాత కాలం నాటి జానపద కథలు తీసేవాళ్ళు. తర్వాత రకరకాల నేపథ్యాల తో కేవలం ఈ సినిమాలకే కథ రాసుకొని తీస్తున్నారు. కొన్ని పిల్లల పుస్తకాలని కూడా సినిమాలు గా తీశారు. ఈ రోజు ఇలాంటివాటిలో ... అంటే యానిమేటెడ్ సినిమాల కోసమే రాసుకున్న కథలు/ పుస్తకాల నుంచి తీసిన సినిమాల లో నా జీవితాన్ని స్పృశించిన, నా ఆలోచనా విధానాన్ని మార్చిన సినిమాల గురించి చెప్తాను... 

కోకో - 

Image result for coco













మనకి మహాలయ పక్షాల్లాగా మెక్సికో దేశం లో వాళ్ళకి వాళ్ళ పెద్దల్ని తలుచుకొనే పండగ నేపథ్యం లో సాగుతుంది ఈ కథ. మన పూర్వీకులని మర్చిపోతే ఏం జరుగుతుంది, యేవో భయాల వల్ల పెద్ద వాళ్ళు పిల్లల టాలెంట్స్ ని అర్ధం చేసుకోకుండా వారిని కంట్రోల్ చేస్తే ఏం జరుగుతుంది, కళల్లో చౌర్యం .... ఇన్ని ఎలిమెంట్స్ చూపిస్తుంది ఈ కథ .. ఓ పిల్ల వాడు హీరో .  ఏం పాటలండీ బాబూ! ఈ సినిమా చూసాక మా నాన్నగారి తాతగారి గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఎంతో కష్టపడి వంశవృక్షం వేసి దాచుకున్న మా ఓ మావయ్యంటే మంచి గౌరవం కలిగింది. 


ఫెర్డినాండ్ - 

Image result for ferdinand

స్పెయిన్ లో బుల్ ఫైటింగ్ గురించి అందరం విన్నాం ... ఎద్దుని ఎర్ర బట్ట చూపించి రెచ్చగొట్టి అది కుమ్మితే చచ్చి, కుమ్మకపోతే దాన్ని చంపే ఆట బుల్ ఫైటింగ్. ఇది చేసే వాళ్ళని మెటాడోర్ అంటారు. ఎద్దుల్ని వీటి కోసమే పెంచుతారు కూడా. హింస అంటే పడని, పువ్వుల్ని ప్రేమించే ఎద్దు ఫెర్డినాండ్ .. దాని కథే ఈ సినిమా. ఈ సినిమా క్లైమాక్స్ లో నేను ఎంత ఏడ్చానో చెప్పలేను. (నా ఏడుపు కి కారణం అది చనిపోవడం కాదు... హీరో ని చంపి ఏడిపించడం ఈజీ. మనసు కదిలి ఏడుస్తాం చూడండి .. అలా ఏడిపించడం కష్టం!) కొన్ని రోజులు ఈ సినిమా ఎఫెక్ట్ నుంచి బయటకి రాలేకపోయాను. మనం నమ్మిన విలువలని ఎప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోకూడదు అని చెప్పింది నాకు ఈ సినిమా. 


మొఆనా - 

Image result for moana

పోలినేషియన్ ద్వీపాల (హవాయి ద్వీపాలు) నేపథ్యం లో సాగే ఈ కథ లో ప్రకృతి కోపిస్తే ఏం జరుగుతుంది ... మన సంస్కృతి ని మర్చిపోతే ఏం జరుగుతుంది అనే కథ ఇది. ఓ ఎర్లీ టీన్స్ లో ఉండే పిల్ల (మొఆనా) ఈ సినిమా హీరో. ఈ పాప లావణ్యంగా, తెల్లగా ఉండదు. ఆ జాతి వారి లాగే ఈ క్యారెక్టర్ ని డిజైన్ చెయ్యడం నాకు చాలా నచ్చింది! ఇందులో వారి భాష లో సాగే 'అవే అవే' పాట ని లూప్ లో కొన్ని వందల సార్లు వినుంటాను! దీని క్లైమాక్స్ అసలు నేను ఊహించలేదు! 

అప్ - 

Image result for up

పది నిముషాల్లో ఓ జంట లవ్ స్టోరీ మంచి మ్యూజిక్ మీద చూపించేస్తారు ఈ సినిమాలో ... వారు పిల్లలు గా మొదటి సారి కలిసినప్పటి నుంచి ... ముసలి వారై .. వారి లో ఒకరు పోయే వరకూ! ఈ ఒక్క క్లిప్ యూ ట్యూబ్ లో పెట్టారు .. ఎప్పుడైనా ప్రేమ, పెళ్లి మీద నమ్మకం పోతే ఈ క్లిప్ చూస్తే చాలు అనుకుంటాను. జీవితం పట్ల ఇంకేం ఇంట్రస్ట్ లేని ఓ కోపిష్టి ముసలాయన .. ఓ చిన్న బాబు చేసిన అడ్వెంచరే ఈ సినిమా. ఈ సినిమా లో విలన్ కి కూడా ఓ జస్టిఫికేషన్ ఉంటుంది! గతం తాలూకు భారాన్ని baggage ని ఎలా వదిలించుకోవాలో ... అలా వదిలించుకుంటే జీవితం ఎంత బాగుంటుందో ఈ సినిమా చూస్తే అర్ధం అయింది.

ఇన్సైడ్ అవుట్ - 

Image result for inside out

ఓ పదేళ్ల పాప మెదడు ఈ సినిమా నేపథ్యం. మెదడు అనే హెడ్ క్వార్టర్స్ లో ఐదు ఎమోషన్లు  ఉత్సాహం, కోపం, అసహ్యం, బాధ, భయం ... ఇవి పాత్రధారులు! సరదాగా ఉంటూనే మన మెదడు ఎలా పనిచేస్తుంది ...మనకి ఆనందం, ఉత్సాహం ఎంత అవసరం .. మనం బాగుండాలంటే కావాల్సిన/బాగా పనిచేయాల్సిన డిపార్టుమెంట్లు ఏంటి .. అన్నీ చూపిస్తుంది ఈ సినిమా! అందరూ ఆనందానికే విలువ ఇస్తారు .. బాధ అనే ఎమోషన్ విలువేంటో ఈ సినిమా చెప్తుంది ... ఎమోషన్లు లేకపోతే ఏమయిపోతామో కూడా చెప్తుంది!


ష్రెక్ - 

Image result for shrek
యానిమేటెడ్ సినిమాల్లో అందంగా కనిపించే మనుషులు, తీర్చిదిద్దినట్టుండే కవళికలు, అందానికి, గ్రేస్ కి ప్రాధాన్యం ఇవ్వటం ... ఇది జరుగుతూ ఉండేది. ఈ పంథా మార్చింది ష్రెక్. ష్రెక్ ఒక ogre ... అంటే ఓ రాక్షసుడి లాంటి ప్రాణి. చూడటానికేమీ బాగోడు. పైగా అతనికి ఎవ్వరూ పడరు కూడా. ఇలాంటి వాడి కథే ష్రెక్. అందానికి ప్రాధాన్యం ఎందుకు ఇవ్వకూడదో చెప్పే సినిమా.... ఒక పుస్తకం ఆధారంగా తీసిన సినిమా ఇది. ఫెయిరీ టేల్స్ లో హీరోలు వీరులు గా చెప్పబడిన వాళ్ళని వేరే కోణం లో చూపిస్తుంది ఈ సినిమా ... ఆ కోణం కూడా నిజమే అనిపిస్తుంది కూడా!

మెడగాస్కర్ - 

Image result for madagascar movie
జూ లో పెంచబడిన జంతువులు తమ సహజమైన instincts ని ఎలా కోల్పోతాయో ... వాటికి అడవి ఎంత కొత్త గా భయంగా అనిపిస్తుందో .. జూ లో స్నేహాలు అడవి లో ఎలా కుదరవో .... ఇన్ని విషయాల్ని సులువు గా చెప్పేస్తుంది ఈ కథ... ఈ సినిమాలో అన్నిటి కంటే నాకు నచ్చింది ఓ జిరాఫీ ఓ హిప్పోపొటమస్ ని ప్రేమించడం, అందరూ క్యూట్ గా చూసే పెంగ్విన్లు ఇందులో కపట విలన్లు గా ఉండటం, colonialism ఎలా వ్యాప్తి చెందిందో చూపించటం! 

ఐస్ ఏజ్ - 

Image result for ice age first movie
సాధారణంగా హెర్డ్ అంటే ఒకే రకమైన జంతువుల గుంపు. కానీ ఈ సినిమా లో ఓ ఏనుగు, ఓ పులి, ఓ స్లోత్ ఇలాంటి రకరకాల జంతువుల ఒకే హెర్డ్ గా ఎలా కలిసాయో చూపిస్తారు. ఇందులో ఎన్ని జోకులో! నేను మళ్ళీ మళ్ళీ చూసే సినిమాల్లో ఇది ఒకటి. 

కుంగుఫూ పాండా - 

Image result for kung fu panda

చైనా నేపథ్యంగా సాగే ఈ సినిమా లో అత్యంత క్లిష్టమైన ఆధ్యాత్మిక సూత్రాలు హాస్యం తో మేళవించి చూపిస్తారు .... ఈ సినిమా మూడు నాలుగు పార్ట్స్ వచ్చాయి అనుకుంటా ... ఒక్కో దాంట్లో ఒక్కో గొప్ప ఆధ్యాత్మిక సూత్రం. ప్రాచీన చైనీయుల ఆధ్యాత్మికత, వారి సంస్కృతి .. ఇవన్నీ తెలిసాయి నాకు ఈ సినిమా వల్ల. జ్ఞానులంటే గుంభనంగా, నిర్లిప్తంగా, ఎటువంటి ఎమోషన్ లేకుండా ఉంటారనే సూత్రానికి రివర్స్ లో .. జ్ఞానీ అంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది .. చైల్డిష్ నేచర్ ఉంటుంది .. అని చూపిస్తుంది ఈ సినిమా! ప్రతి పార్ట్ క్లైమాక్స్ అద్భుతమే! ఇందులో క్యారెక్టర్లు గా తీస్కున్నవన్నీ అంతరించిపోతున్న జంతువులే. 

రాటాటూయీ - 

Image result for ratatouille movie
Ratatouille (ఫ్రెంచ్ పదం కాబట్టి స్పెల్లింగ్ కి ఉచ్చారణ కి తేడా ఉంటుంది) - ఓ షెఫ్ కావాలనుకున్న ఎలక కథ. రాటాటూయీ ఓ వంటకం పేరు కూడా! ఎక్కడ ఎలా పుట్టినా నీ కల ఎంత అసంభవం అనిపించినా దాన్ని నిజం చేస్కోవచ్చు అనే స్ఫూర్తి నిస్తుంది ఈ కథ... ఇందులో ఓ ఫుడ్ క్రిటిక్ ఉంటాడు .. వాడికి ఈగో అని పేరు పెట్టడం నాకు భలే నచ్చింది! కానీ అతన్ని కూడా విలన్ లాగా చూపించరు .. అది ఈ సినిమా గొప్పదనం!

టాయ్ స్టోరీ - 

Image result for toy story
బొమ్మలకి అన్నిటికంటే ఏం కావాలి? మనం వాటితో ఆడుకోవడమే కావాలి అని చెప్తుంది ఈ సినిమా! నాకు నా బొమ్మలంటే బెంగ వచ్చేస్తుంది ఈ సినిమా చూస్తే! 😟

ప్రిన్సెస్ అండ్ ది ఫ్రాగ్ - 

Image result for princess and the frog

ఇది ఫెయిరీ టెల్ కానీ కథ చాలా మార్చారు ... జాజ్ సంగీతం ఈ సినిమా లో భలే ఉంటుంది. అమెరికా లో న్యూ ఓర్లీన్స్ లో కథ మొదలవుతుంది ... టియానా అని కష్టపడి రెండు ఉద్యోగాలు చేస్తూ తన రెస్టారంట్ పెట్టుకోవాలని కలలు కనే అమ్మాయి కథ! హీరో బాధ్యత లేని డబ్బు లేని రాకుమారుడు. హీరోయిన్ కి సుఖపడటం తెలియదు. హీరో కి కష్టపడటం తెలియదు! మామా ఓడీ అనే ముసలి మంత్రగత్తె వాళ్ళకి చెప్తుంది .. జీవితం నీకు అవసరమైనవి ఇస్తుంది .. కావాల్సినవి కాదు అని (ఈ మాట నా నేను పుట్టాను బ్లాగ్ లో రాసాను ... ఈ జ్ఞానం ఇచ్చింది ఈ సినిమానే!)
బాయూ (లోతట్టు ప్రాంతాల్లో నిశ్చలంగా ప్రవహించే నదిని అక్కడ అలా పిలుస్తారు) అంటే ఏంటో ఈ సినిమా చూస్తేనే తెలిసింది. ఇందులో ఓ మిణుగురు పురుగు లవ్ స్టోరీ సినిమాకే హైలైట్! ట్రంపెట్ వాయించే మొసలి కి జాజ్ ట్రూప్ లో జాయినవ్వాలని కోరిక! 

ఆంట్ బుల్లీ - 

Image result for the ant bully
ఓ పిల్లవాడ్ని కొంత మంది అబ్బాయిలు బుల్లీ చేస్తుంటారు. వాడు ఆ కోపం చీమల మీద చూపిస్తుంటాడు. చీమలు వాడ్ని చిన్నగా మార్చేసి వాడికి చీమ లాగా బతకమని శిక్ష విధిస్తాయి. ఈ సినిమా లో చీమల ప్రపంచాన్ని ఎంత బాగా చూపించారో! ఆ పిల్లవాడి కి ఆ శిక్ష ఎంత బాగా పనిచేసిందో .. చీమలు కూడా అతని వల్ల ఎలా లాభపడ్డాయో చూపిస్తుంది ఈ సినిమా! 


ఇవి కాక జూటోపియా, వాల్ - ఈ , ఫైండింగ్ నీమో, బ్రేవ్, ఫ్రోజెన్, ఎ బగ్స్ లైఫ్, క్లౌడీ విత్ ఎ ఛాన్స్ ఆఫ్ మీట్ బాల్స్, మూలాన్ .. ఇవి నాకు సినిమాలు కాదు .. అనుభూతులు! ఇవి నిజంగా 'చలన' చిత్రాలు ... ఎందుకంటే ఇవి  చలింపచేస్తాయి!

Friday, November 30, 2018

ఆనందాల జాడీ

ఎప్పుడైనా గమనించారా? 

కష్టం గుర్తున్నంత వివరంగా సుఖం గుర్తుండదు. 

కష్టాలు ఎన్ని గుర్తుంటాయో అన్ని సుఖాలు గుర్తుండవు. 

కష్టాలు మన మీద పడేసే ప్రభావం సుఖాలు పడెయ్యవు. 

సుఖాలు - 30 సెకన్ల యాడ్ లా, కష్టాలు డాక్యుమెంటరీ లాగా ఎందుకు అనిపిస్తాయి? 

సుఖాలు చిన్నగా, కష్టాలు పెద్దగా ఎందుకు కనిపిస్తాయి? 

ఈ పరిణామాన్ని 'నెగిటివిటీ బయాస్' (Negativity Bias) అంటారట. అంటే ప్రతికూలత పట్ల పక్షపాతం. 

అంటే, ఒక నెగిటివ్ సంఘటన/అనుభవం, అదే ఉధృతి గల పాజిటివ్ సంఘటన/అనుభవం మనకు జరిగితే, ఆ ప్రతికూల సంఘటనే మన మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది - ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది అని. 

ఓ పక్క నుంచొని 'బాగా పాడావమ్మాయి' అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే .. ఇంకో వైపు ఒకరు పెదవి విరిస్తే నేను కాంప్లిమెంట్ ని పట్టించుకోకుండా కేవలం ఆ విమర్శ నే గుర్తుంచుకొని పదే పదే నెమరువేసుకోవడం అన్నమాట (ఇది నా వ్యక్తిగత అనుభవం అని మీరు ఊహిస్తే మీరు కరెక్టే. బాగా పాడలేదు అనలేదు కానీ నేనెంచుకున్న పాట ఆ సందర్భానికి సరిపోలేదు అన్నారు) 

ఇది మన మెదడు కి బాగా అలవాటేనట. (మన తప్పు కాదన్నమాట! హమ్మయ్య!) 

రాతి యుగం మనిషి నాటి అలవాట్ల లో ఇదొకటి. అప్పటి మనిషి అడవి లో ప్రమాదాల మధ్య బతికేవాడు కదా .. అందుకే అతని మెదడు ప్రతికూల పరిస్థితుల పట్ల ఎక్కువ చురుకుగా తయారయింది .. అలా లేకపోతే చావే కదా! 

కానీ ఇప్పుడు మనం అంత ప్రమాదకర పరిస్థితుల్లో లేము. ఈ విషయం మెదడు కి ఎవరూ చెప్పలేదనుకుంటా. అది పాపం అదే మూస లో పోతోంది. 

దీని వల్ల జరిగే నష్టాల లో ఒకటేంటంటే .. మనని మనము టార్చర్ చేస్కోవడం. ఒకరు మనని చెంప దెబ్బ కొట్టి వెళ్లిపోయారు. ఇది మనం మర్చిపోక పదే పదే గుర్తుచేసుకుంటాం ... వాడు కొట్టింది ఒక సారే. మనం గుర్తుచేసుకుని వాడి చేత కొట్టించుకున్నది కొన్ని లక్షల సార్లు. ఇదే ఒక మంచి విషయమైతే అన్ని సార్లు గుర్తు చేస్కుంటామా? 

ఈ బయాస్ ని కరెక్ట్ గా అర్ధం చేసుకోవాలంటే మనల్ని మనం ఒక్క ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది. 'మీ జీవితం ఎలా గడిచిందనుకుంటున్నారు?' అని. టక్కున గుర్తొచ్చే మొదటి మూడు జ్ఞాపకాలలో పాజిటివ్ వి ఎన్ని? 

మనలో చాలా మందికి మన వైఫల్యాలు, కష్టాలు, మన పట్ల వేరే వాళ్ళు చేసిన ద్రోహాలు, నష్టాలు, రిగ్రెట్స్ ఇలాంటి నెగిటివ్ అంశాలే గుర్తుకు వస్తాయి. అలా గుర్తు రాలేందంటే -  

1. మీరు అబద్ధం చెప్తున్నారు
2. మీరు స్వతహా పాజిటివ్ మనిషి 
3. నెగిటివిటీ ని ఎదుర్కోడానికి మీరు మీ మెదడుని ట్రైన్ చేశారు!
4. మీకు నా ప్రశ్నే అర్ధం కాలేదు 

మెదడు ని ట్రైన్ చెయ్యడం సాధ్యమే. (నేను ఆ కాంప్లిమెంట్ నే మొదట గుర్తు తెచ్చుకోడానికి ట్రై చేస్తూ ఉంటాను... ఇంకా ట్రయల్ నడుస్తోంది). ఇలా ట్రైన్ చెయ్యడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనాలు ఉంటాయి .. మన జీవితాన్ని యథాతథంగా స్వీకరించడం, క్షమించడం, ప్రతీ విషయాన్నీ పాజిటివ్ దృష్టి తో చూడడం .. etc (వీటి గురించి మరో సారి) 

వీటి లో నాకు తెలిసిన ఓ మంచి సాధన .... JOY JAR (జాయ్ జార్)

దీనికి నేను తెలుగు లో 'ఆనందాల జాడీ' అని పేరు పెట్టాను. ఆవకాయ జాడీ లాగా అన్నమాట😋

ఆనందాల జాడీ కి కావాల్సిన పదార్ధాలు - 

1. ఒక కుటుంబం 
2. ఒక జాడీ 
3. పేపర్లు, పెన్నులు 
4. ఒక సంవత్సరం 
5. ఒక సంకల్పం 

ఆ సంకల్పం ఏంటంటే - ఆ కుటుంబం లో ప్రతి సభ్యులూ ఆ సంవత్సరం అంతా వారికి కలిగిన చిన్న పెద్ద ఆనందాల్ని అవి కలిగిన వెంటనే ఫ్రెష్ గా, మర్చిపోకుండా, విస్మరించకుండా, ఆ ఆనందం ఆవిరైపోక ముందే ఒక చీటీ మీద రాసి ఆ జాడీ లో వెయ్యాలి. సంవత్సరం తిరిగాక ఆ చీటీలు తీసి చదువుకోవాలి.  సింపుల్. 

(ఆనందం ఆవిరైపోయింది అంటారు ... ఇలాంటి పోలిక దుఃఖానికి లేదు .. అసలు ఆనందాన్ని ఆవిరయిపోయే పదార్ధం గా ఎందుకు ఊహించారు? ఇది నెగిటివిటీ బయాస్ కి పెద్ద ఉదాహరణ) 

మళ్ళీ సంవత్సరం అదే జాడీ .... మరికొన్ని ఆనందాలు .. 

ఏ రోజైనా కొంచెం మనసు బాలేక పోతే నిండా ఉన్న జాడీ ని చూస్తే బోలెడు ఉత్సాహం వస్తుంది! 

అయిపోయిన యేడు తాలూకు చీటీలని పాత చింతకాయ పచ్చడి లాగా సంవత్సరాల వారీ గా భద్రపరుచుకుంటే ...  అంతే ఆరోగ్యం కూడా! (చెంప దెబ్బ లాగా కాక) 

ఈ ఆనందం ఆవకాయ కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బీపీ, షుగర్, హృద్రోగం .. ఇంకే ఆరోగ్య సమస్య ఉన్నవారైనా ఇది చెయ్యవచ్చు. (చెయ్యాలి!)

ఆవకాయ చూసి నోటి లో నీళ్లు ఊరుతాయి ..  ఈ ఆనందాలు కొన్నేళ్ల తర్వాత చదువుకుంటే కళ్ళ నీరు ఊరుతాయి. (నాలోని కవి హృదయం మేల్కొని ఈ మాటనేసి మళ్ళీ పడుకుంది) 

ఇలా పబ్లిగ్గా కష్టాలైతే చెప్పుకోవచ్చు కానీ సుఖాలు చెప్పుకుంటే దిష్టి కొట్టదూ అనుకుంటే మీ వ్యక్తిగతమైన జాడీ మీరే పెట్టుకోవచ్చు... లేకపోతే ఓ పుస్తకం లో కేవలం పాజిటివ్ అనుభవాల గురించి రాసుకోవచ్చు. అది ఆనందాల జాబితా అవుతుంది అన్నమాట! 

నేను ఇది చేస్తూ ఉంటాను. ఆ అనుభవం మీదే చెప్తున్నాను. ఒక్కో సారి 'అబ్బా .. పోయిన సంవత్సరం ఎంత గడ్డు గా గడిచింది' అంటుంది రాతి యుగం మెదడు రిజిస్టర్ చేసుకున్న జ్ఞాపకం. అదే సంవత్సరం తాలూకు జాడీ నవ్వుకుంటుంది. అది నిజం కాదని. 

'ఉద్యోగం వచ్చింది' 'పెళ్లయింది' లాంటి పెద్ద పెద్ద ఆనందాలే కాదు (పెళ్లి ఆనందమా అనే జోకులొద్దు బాబూ 😐) 'ఆలూ దమ్ బిర్యానీ బాగా కుదిరింది' 'దారిలో అసలు ట్రాఫిక్ లేదు' 'షాపింగ్ భలే జరిగింది' 'టైం కి టీ దొరికింది' ఇలా మనసుకి ఆనందం కలిగించిన ప్రతి విషయం రాసుకోవచ్చు! 

ఇలాంటివి రాస్తుంటే పెరుగుతూ ఉంటాయి అనే ఓ సూత్రం కూడా ఉంది! (దాని గురించి ఇంకో సారి) 

'ఆ టక్కులాడి కి బాగైంది' 'వాడి నడ్డి విరిగింది .. నా కసి తీరింది' ఇలాంటివి కూడా రాసుకోవచ్చు కానీ ఈ కేటగిరి ఆనందాల వల్ల జాడీ కి బూజు పట్టి పాడయ్యి దాని రుచి మారచ్చు .. 

'నా జీవితం అంతా కష్టాలే... ఇందులో వెయ్యడానికి నాకు ఆనందమేమీ లేదు' అని ఎవరైనా అంటే నాకు బాధేస్తుంది. ఎన్ని మంచి విషయాలు వారి గుర్తింపు కి రాకుండా వెళ్లిపోయాయో అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవారైనా పూర్తి గా నెగిటివ్ అనుభవాల బారినే పడటం, ఒక్క చిన్న అందమైనా కలగకపోవడం అసంభవం. 

నా మాట నమ్మకపోతే ఆనీ ఫ్రాంక్ డైరీ చదవండి. 

Friday, November 23, 2018

పురుష సూక్తం

పంతొమ్మిది నవంబరు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అట.

ఇది తెలిసాక రెండు రకాల రియాక్షన్స్ వస్తాయి ..

1. 'అబ్బా .. ఈ మధ్య ప్రతి దానికి ఓ దినం తగలడింది' అని
2. 'అబ్బా! ఈ మగాళ్ళకి ఓ రోజెందుకో .. అసలు ఈ ప్రపంచమే వాళ్ళదైతే' అని

కొన్ని విషయాలు నా అనుభవం లోకి రాకపోతే నేనూ ఇలాగే రియాక్ట్ అయ్యే దాన్ని.

నాకు అసలు మగ, ఆడ అంటూ విడదీసి మాట్లాడటం నచ్చదు.

సినిమాల్లో కానీ, ఫ్రెండ్స్ లో కానీ 'బాయ్స్ బెస్ట్ ఆ గర్ల్స్ బెస్ట్ ఆ' అని సరదాగా అన్నా అక్కడి నుంచి లేచొచ్చేస్తాను నేను. అంత విసుగు.

కోతి నుంచి మనిషి evolve అవ్వటానికి ఎన్నేళ్లు పట్టిందో తెలియదు కానీ ఈ లింగభేదాల నుంచి లింగ వివక్ష ల నుంచి మనం ఎన్నేళ్లకు బయటపడతాం రా బాబూ అనిపిస్తుంది. (ఇంకా 63 లింగాలు ఉన్నాయిట మనుషుల్లోనే! ఇంక వాటిని అర్ధం చేసుకొని, స్వీకరించి, శాంతి తో కలిసి ఉండేదెప్పుడో! చాలా పనుందండి మనకి!)

ఇప్పుడు ఇది రాస్తోంది కూడా 'పురుషులారా ... ఓ పురుషులారా! మీరు ఎంత గొప్పవారు! చెమటోడ్చి... కుటుంబమనే రిక్షా ని కష్టాలనే భారం మోస్తూ .. పరిస్థితులనే ఎత్తు రోడ్డు ఎక్కుతూ .. ఎంత బాగా లాగుతున్నారు' అని చెప్పటానికి కాదు.

కొన్ని మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుకోవటం కోసం.

మా మంచి ఫ్రెండ్ ఒకబ్బాయి ఉండేవాడు. మన దేశం లో ఫ్రెండ్స్ మధ్య కూడా చుట్టరికాలు వచ్చేస్తాయి కదా ... మగాళ్లు ఫ్రెండ్స్ అయితే ఒకరినొకరు 'బాబాయి' అని పిలుచుకున్నట్లు మమ్మల్ని అక్కా అని పిలిచేవాడు. చాలా ఏళ్ళ పరిచయం తర్వాత మాకు ఓ సారి ఓ విషయం చెప్పాడు. తన చిన్నప్పుడు అతనికంటే పెద్దమ్మాయి అతన్ని లైంగికంగా వేధించింది అని. మేము షాక్ అయ్యాము. ఇలా అబ్బాయిలకి కూడా జరుగుతుందా అని.

కొన్నేళ్ల తర్వాత ఇంకో అబ్బాయి .. ఈ అబ్బాయి కి కూడా మేము అక్కలమే....  ఓ రాత్రి బస్ లో వేరే ఊరికి వెళ్తూండగా ఓ అంకుల్ వయసు వాడితో జరిగిన చేదు అనుభవం చెప్పాడు. అప్పటికి ఇతను ఇరవైల్లో ఉన్నాడు ... చిన్నవాడు కూడా కాదు!

'ఇలాంటి అనుభవాలు అబ్బాయిలకి జరగవనుకోవడం నీ అమాయకత్వం' అని మీరు అనచ్చు.

కానీ నా డౌటు వేరు ... అమ్మాయిలకి మానం, పరువు, సిగ్గు, భయం, సపోర్ట్ లేకపోవడం, అర్ధం చేసుకోకపోవడం అనే ఫాక్టర్స్ ఉండటం వల్ల వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు. కానీ వీళ్ళకి ఏంటి ప్రాబ్లమ్? ఇది మగాళ్ల ప్రపంచం కదా? మరి ఈ సమస్యల గురించి మాట్లాడరేంటి?

ఒక సారి ఓ క్రియేటివ్ మీటింగ్ జరుగుతోంది. మేము రాయబోయే ఏదో కథ గురించి డిస్కషన్ నడుస్తోంది. ఆ సందర్భం లో మేము ఇలా మగవాళ్ళకి కూడా జరుగుతాయి అని అన్నప్పుడు ఎంతో అనుభవం ఉన్న మహిళలు తెల్లబోవడం చూసాం. అదే డిస్కషన్ లో ఉన్న మగవాళ్ళు సైలెంట్ అయిపోవడం చూసాం!  

ఇది నిజంగా మగాళ్ల ప్రపంచమే అయితే వాళ్ళకి అంతా న్యాయం జరగాలి... వాళ్ళకి ఎటువంటి సామజిక సమస్యా ఉండకూడదు. అలా లేదెందుకు?

ఎందుకంటే లింగవివక్ష ఆడవారి సమస్య మాత్రమే కాదు అని.

ఈ పితృస్వామ్య వ్యవస్థ వల్ల మగాళ్ళకి ఒరిగింది ఏమీ లేదు.

అమ్మాయిలు ఇలానే ఉండాలి అనే అచ్చు తయారు చేసిన ఈ పితృస్వామ్య ఫాక్టరీ నుంచే 'మగ' అచ్చు కూడా తయారయింది. దాని లో ఇమడలేకపోయిన మగాళ్ళు చచ్చారే పాపం. (అక్షరాలా. ఆత్మహత్యల్లో మగవారి సంఖ్య ఆడవారికంటే ఎక్కువుంటోందిట! మగ వాళ్ళ ఆయుర్దాయం కూడా ఆడవారి తో పోలిస్తే తక్కువే!)

వీరుడు, ధీరుడు తప్ప మిగిలిన characterizations వాళ్ళని బతకనివ్వని ఈ వ్యవస్థ లో మగాళ్ళకి ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు!

అమ్మాయిలు, అబ్బాయిలు సైకిల్ చక్రాలైతే ఓ చక్రానికి బొత్తిగా గాలి తీసేసి ఇంకో చక్రానికి పేలిపోయేంత గాలి కొట్టేస్తోంది ఈ వ్యవస్థ. అందుకే ఈ బండి మీద సవారీ అంత ఇబ్బందిగా ఉంటుంది. 

సో ... మగవాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. ముందు ఈ స్పృహ కలిగించి .. వాటి గురించి మాట్లాడుకొని ... వాటిని అందరి దృష్టికి తెస్తోంది ఈ 'రోజు'.

ఇది మంచి ఉద్దేశం కదా. అందుకే - 

1. లైంగికంగా వేధించబడి 'మగాడివి .. లైట్ తీస్కో' అని సలహా ఇవ్వబడిన మగవారికి
2. స్త్రీ సమానత్వాన్ని నమ్మినందుకు, ఇంట్లో 'ఆడ' పనులు చేసినందుకు, భార్య చెప్పిన మంచి మాటలు విన్నందుకు/ఆమెని మంచికి సపోర్ట్ చేసినందుకు 'వాడేం మగాడ్రా?' అనిపించుకున్న మగవారికి
3. domestic abuse .. అంటే గృహ హింస అనుభవిస్తున్నా 'ఇదో సమస్య కాదు' అని జోక్ గా తీసిపారేయించుకున్న మగవారికి
4. ఇంట్లో పోరు పడలేక పెళ్లి చేసుకొని .. ఆ కుటుంబాన్ని పోషించేందుకు తనకిష్టం లేని ఉద్యోగాన్ని చేస్తూ, తమ కలల్ని మర్చిపోలేక మర్చిపోయిన మగవారికి
5. బట్ట తల, బాన పొట్ట, పొట్టి, సన్నం అంటూ బాడీ ఇమేజ్ ని దెబ్బ తీసే కామెంట్లు వేయించుకుంటున్న మగవారికి
6. కన్నీళ్లు దాచుకోవడం అలవాటైపోయిన మగవారికి
7. మీ వ్యక్తిత్వాన్ని చూపించద్దని 'be a man' అనిపించుకున్న మగవారికి
8. 'మగాడు' కాబట్టి లేనిపోని బాధ్యతల్ని/ఆరోపణల్ని మోపేయబడిన మగవారికి 

నా వైపు నుంచి పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. 

Friday, November 16, 2018

నేను పుట్టాను

పుట్టినరోజంటే తెగ ఎక్సైట్ అయిపోయేవాళ్ళ సంఘానికి మొన్నటి దాకా నేను కేవలం కమిటీ మెంబర్ ని. ఈ రోజు నుంచి స్పోక్స్ పర్సన్ ని కూడా. 

మా నాన్నగారన్నట్టు నా పుట్టిన రోజు మర్నాటి నుంచి మళ్ళీ నా పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని 364 రోజులు ఎదురు చూసే టైపు నేను.  

ప్రతి నెల పదిహేడో తారీఖు న ఇంకా నా పుట్టిన రోజుకి కరెక్ట్ గా ఎన్ని నెలలు ఉందో అని లెక్కకట్టి ఇంట్లో వాళ్ళకి విసుగు తెప్పించే తరహా నేను. 

ఈ విషయం లో ఎటువంటి గుంభనం, హుందాతనం, సిగ్గు లాంటివి లేకుండా ఇంగ్లీష్ డేట్ ప్రకారం, తిథుల ప్రకారం, నక్షత్రం ప్రకారం .. మూడు రోజులు పుట్టినరోజు జరుపుకునే రకం నేను. 

పుట్టిన రోజు ని ఓ రోజు గా కాక ముందొక ఐదారు రోజులు, తర్వాత ఒక ఐదారు రోజులు ..అసలు నవంబరు నెలంతా నాకే గుత్తగా రాసిచ్చినట్టు స్పెషల్ గా ఫీలయిపోయే జాతి నేను. 

ఎందుకు నాకింత excitement అంటే నేను చెప్పలేను. I am too excited to analyze!

చిన్నప్పుడు పుట్టిన రోజంటే కేక్, స్కూల్ ఫ్రెండ్స్ తో పార్టీ  అన్నట్టే ఉండేది. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి డాడ్ హాల్ లో రిబ్బన్స్ గట్రా పెట్టి డెకరేట్ చేసేవారు. కేక్ కట్ చెయ్యడం, డాడ్ కేసెట్ కలెక్షన్ లో 'Man machine' 'ABBA' లాంటి ఆల్బమ్స్ ఉండేవి .. వాటికి గంతులేసే వాళ్ళం. ఇదే బర్త్డే అంటే! 

కళ్ళల్లో ఉత్సాహం 😆


రెండో క్లాసు లో బర్త్డే పార్టీ కి నేను క్లాసు లో ఫ్రెండ్స్ ని కొంతమందిని పార్టీ కి పిలిచాను. మిగిలిన వాళ్ళు మేము కూడా రావచ్చా అంటే వాళ్ళకి వద్దు అని ఎలా చెప్పాలో తెలియక రమ్మన్నాను. మొత్తం క్లాసు క్లాసంతా పార్టీ కి వచ్చేసారు! మా వాళ్ళు పాపం పది పదిహేను మంది వరకూ ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ బయటికి వెళ్లి అన్నీ తీసుకురావాల్సి వచ్చింది. 

ఇప్పుడు అది తలుచుకుంటే embarrassed గా అనిపిస్తుంది.

ఆ వయసు దాటాక ఇప్పటి దాకా బర్త్డే కి నేనెవ్వరికీ పార్టీ ఇవ్వలేదు. ఇదేమీ పెద్ద principles.... 'ఉసూల్ .. ఆదర్శ్' లాంటి వాటి వల్లేమీ కాదు. కుదరక. 

ఒకప్పుడు నా పుట్టినరోజు ప్లాన్లు బ్రహ్మాండంగా ఉండేవి .. అన్నీ డబ్బు తో కూడుకున్నవే. అవి ఆ స్కేల్ లో కుదరనప్పుడు నేను disappoint అయ్యేదాన్ని అని చెప్పుకోడానికి సిగ్గు పడట్లేదు. కానీ నెమ్మదిగా (చాలా నెమ్మదిగా .. ఓ ఇరవై ఏళ్ళు పట్టింది)  కొన్ని విషయాలు అర్ధం అయ్యాయి. మనకు కావాల్సినవి కాదు ... మనకు అవసరమైనవి జీవితం ఇస్తుంది. 

Life gives you what you NEED. Not what you WANT. 

అది అర్ధం చేసుకుంటే ప్రతి పుట్టినరోజు భలే ఆనందంగా జరుపుకోవచ్చు అని తెలిసింది! అలాగే జరిగింది కూడా. జీవితమే నాకు బోల్డు surprise birthday treats ఇచ్చింది. 

ఓ పుట్టిన రోజుకి ఢిల్లీ లో నా షార్ట్ ఫీల్ 'హోమ్ స్వీట్ హోమ్' కి అవార్డు తీసుకోవడం ఓ మంచి మెమరీ. 

CHINH INTERNATIONAL KIDS FILM FESTIVAL - 2008
Early Education Category - Gold 'HOME SWEET HOME' 

ఇంకో సంవత్సరం నా పుట్టినరోజు కార్తీక సోమవారం నాడు వచ్చింది. మా సీతమ్మ ఆంటీ (ఈ ఆంటీ గురించి విశదంగా ఇంకో పోస్టులో రాస్తా) ఆధ్వర్యం లో మా ఇంటి మేడ మీద ఉసిరి మొక్క కింది ఆవిడే బోల్డు వండి అందర్నీ పిలిచి బ్రహ్మాండంగా జరిగేలా చేశారు! నా పుట్టినరోజని నేను ఆవిడకి ముందెప్పుడూ చెప్పనేలేదు .. అది విధి ఆడిన వినోదభరితమైన నాటకం! 

మెనూ : కొబ్బరి అన్నం, టమాటా పచ్చడి, అవియల్, పూరి, మిర్చి బజ్జి, ఆలూ బోండా, ఆవడలు, బొబ్బట్టు, పాయసం, దద్ధ్యోదనం అలియాస్ కర్డ్ రైస్ 

పోయిన సంవత్సరం నా తిథుల పుట్టినరోజు నాడే 'పెళ్ళివారమండి' షార్ట్ ఫిల్మ్ కి అవార్డు తీసుకున్నాం! 

ITSFF 2017 BEST COMEDY - Pellivaramandi 

I am really grateful for such blessings! 

నేను ప్లాన్ చేసుకున్నా ఇంత అందంగా ప్లాన్ చేస్కోలేనేమో అనిపించింది నాకు. 

ఈ సంవత్సరం పాండిచేరి కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను. కుదర్లేదు. కానీ ఇప్పుడే న్యూస్ లో చూసాను ... సైక్లోన్ గజా పుదుచ్చేరి చేరుతోంది, ఆ ప్రాంతం లో హై అలెర్ట్ ప్రకటించారు అని. 

సో నేనూ, జీవితం మా విధులు పంచేసుకున్నాం ... ఎక్సైట్ అవ్వడం నా వంతు .. ఎగ్జిక్యూట్ చెయ్యడం దాని వంతు. 

నాకు ఈ విషయం లో సిగ్గు లేదని ముందే చెప్పేసాను కాబట్టి .. 

HAPPY BIRTHDAY TO ME! 

Friday, November 9, 2018

మన 'చేతిలో' పని

అబద్ధానికి అనంతమైన అవతారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 'ఫేక్ న్యూస్' .. నకిలీ వార్త. 

సాంప్రదాయ వార్తా మాధ్యమాల లో నకిలీ వార్తల గురించి నేను మాట్లాడను. 

మన ఇన్వాల్వ్ మెంట్ ఉన్న, మన అదుపు లో ఉన్న సామాజిక మాధ్యమాల గురించే మాట్లాడతాను.  అది కూడా మన దైనందిన జీవితానికి సంబంధించిన, మన సామరస్యాన్ని, శాంతిని, మనశ్శాంతి ని  ప్రభావితం చేసే విషయాలు... వీటి గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాను.  వెరిఫై చేసుకోకుండా వారు నమ్మి .. పక్క వారికి సరఫరా చేస్తున్న ఈ తప్పుడు సమాచారవాహిని ని విని, కంగారు పడి.. రీసెర్చ్ చేసి .. కాదని తెలుసుకొని .. చివరికి వారిని బ్లాక్ చేసిన అనుభవం తో ఇది రాస్తున్నాను.  

మనం రోజూ చదువుతున్న, ఫార్వార్డ్ చేస్తున్న సమాచారం లో ఫేక్ న్యూస్ ల ఉధృతి నన్ను ఆశ్చర్యపరిచింది. 

బ్యాంకు, ఏటీఎం వ్యవహారాలు, ఆధార్ కార్డు ఈ ఫేక్ న్యూస్ ఫేవరేట్ టాపిక్స్. మొన్న జరిగిన నోట్ల రద్దు అప్పుడు అయితే ఈ ఫేక్ న్యూస్ లకి పండగే పండగ! (రెండు వేల రూపాయల్లో చిప్పు వార్త గుర్తుందా?) 

కొన్ని ఫేక్ న్యూస్ అంత ప్రమాదకరమైన వి కావు. 

ఫేస్ బుక్ మీ డేటా అంతా వాడేయబోతోంది... అలా వాడకుండా ఉండాలి అంటే 'ఏయ్ .. నువ్వు వాడద్దు' (exactly ఈ మాటల్లో కాదు .. ఏదో ఇంగ్లీష్ లో మేటర్ ఇచ్చార్లెండి) అని స్టేటస్ లో పెట్టండి అని ఆ మధ్య ఓ పోస్టు వైరల్ అయింది. నేను కూడా నా స్టేటస్  మార్చాను ఇది చదివి. తర్వాత గూగుల్ చేస్తే ఇది ఫేక్ అని తేలింది. నేను ఎంబరాస్ అయ్యాను. చదువు, వివేకం ఉండీ అలా ఎలా నమ్మేశా అని! (ఆ తర్వాత ఎవరైనా నాకు ఇలాంటివి ఫార్వర్డ్ చేస్తే వాళ్లకి దీని గురించి చెప్తూ ఉంటాను.)

మన జాతీయ గీతాన్ని అన్ని దేశాల జాతీయ గీతాలలోకి బెస్టు గా పరిగణించి యునెస్కో అవార్డు ఇచ్చింది అని ఇంకో ఫేక్ న్యూస్. మనోళ్లు చాలా మంది ఇది విని గర్వపడిపోయేసారు... అనవసరంగా. 

ముందే చెప్పినట్టు గా ఇవన్నీ అంత ప్రమాదకరమైనవి కావు. మహా అయితే మన ఈగో హర్ట్ అవుతుంది అంతే.  

కానీ కొన్ని న్యూస్ లు జనాల్లో భయాన్ని, ద్వేషాన్ని, హింస ని రగిలించేలా ఉంటాయి. కొన్ని అవమానజనకంగా ఉంటాయి. (ఒక్క సారి ఫేక్ న్యూస్ గురించి గూగుల్ చెయ్యండి .. ఇది ఎంత పెద్ద సమస్యో తెలుస్తుంది!)

నిజం చెప్పులేసుకొనే లోపు అబద్ధం ప్రపంచం చుట్టొచ్చేస్తుందనే ఓ సామెత ఉంది. ఇదే జరుగుతుంది. అసలైన వార్త 'నేనే నిజమైన వార్త'నని పాపం గొంతు చించుకొని చెప్పాల్సి వస్తుంది. అదీ ఏ కొద్దిమందికో వినిపిస్తుంది. ఒక్కోసారి అప్పటికే జరగకూడని అనర్ధాలు జరిగిపోతుంటాయి. 

ఇప్పుడు సామజిక మాధ్యమాల యజమాన్యాలన్నీ ఈ విషయం లో మేల్కొంటున్నాయి. 

వాట్సాప్ సంస్థ పత్రికలకి విడుదల చేసిన ప్రకటన 

ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో వాట్సాప్ గ్రూప్ పెట్టాలంటే పోలీసు అధికారి దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనే రూల్ పెట్టారు. అలాగే మధ్యప్రదేశ్ లోని భిండ్ ప్రాంతం లో కేవలం పాత్రికేయులు పెట్టే వాట్సాప్ గ్రూపులు రిజిస్టర్ చేసుకోవాలని మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. ఈ ఫార్వార్డ్ ఆ రాష్ట్రంతో ఆగకుండా దేశం అంతా వ్యాప్తి అయిపోయి మా ఇంటిక్కూడా వచ్చేసింది. అది కూడా అక్టోబర్ పదిహేను లోపు అనే లాస్ట్ డేట్ తో సహా. అలాంటిదేమీ లేదని క్లారిఫై చెయ్యాల్సి వచ్చింది! 

నాకనిపిస్తుంది ఈ నకిలీ వార్తలు సృష్టించేవారు మన సైకాలజీ మీదే ఆడుకుంటారని. 

మనందరి లో లుప్తంగా ఉండే భయాలు, డబ్బాశ, మతోన్మాదం, జాత్యహంకారం, prejudices, కామోద్రేకాలు, ఒకడు పడిపోతే ఆనందించే సేడిజం... civic illiteracy ... చదువు రాకపోవడం కాదు .. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఓ డెమోక్రసీ లో ఎలా మెలగాలో తెలియనితనం ... ఇవి ఫేక్ న్యూస్ బీజాలకి సారవంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. 

ఈ ఫేక్ న్యూస్ లకి మనం కేవలం బాధితులం మాత్రమే కాదు. వాట్సాప్, ఫేస్ బుక్ లు వచ్చాక మనందరం ఈ క్రైమ్ లో భాగస్వాములం అవుతున్నాం. 

ఇది క్రైమే. డౌట్ లేదు. ఒక అబద్ధం ఎంత హాని చేస్తుందో అనే స్పృహ లేకుండా ఆ అబద్ధాన్ని వ్యాప్తి చెయ్యడం నేరమే కదా? 

అది చిన్నదైనా, పెద్దదైనా. 

డెమోక్రసీ లో అతి బలవంతమైన శక్తి జనమే. మనమే. 

మన చైతన్యం చాలా మార్పులు తీసుకొస్తుంది. 

ఇది అక్షరాలా మన 'చేతిలో' పని. 

పొద్దున్న లేస్తే మనకి వచ్చే వాట్సాప్/ ఫేస్బుక్ ఫార్వార్డ్ లు మనం ఇంకొకరికి ఫార్వార్డ్ చేసే ముందు 'ఇది నిజమేనా' అని రూఢి చేస్కోవడం. దీనికి గూగుల్ ఉండనే ఉంది. 

అంత టైం లేకపోతే అసలు ఇంకొకరికి మన వైపు నుంచి ఫార్వార్డ్ చెయ్యకపోవడం. మరిన్ని వివరాలకి పై బొమ్మ చూడుడి. 

Friday, November 2, 2018

డియర్ దైనందినీ

స్కూల్ అయిపోయి ఇంటర్మీడియేట్ లో చేరినప్పుడు డైరీ రాయడం మొదలుపెట్టాను. 

ఆత్మ, పునర్జన్మ వంటివి నమ్మినట్లైతే నేనొక మహా ముసలి ఆత్మనని నాకు అనిపిస్తుంది. మా అక్క అప్పుడప్పుడు ఇదే తిట్టు తిడుతుంది కూడా. స్పిరిట్యుయల్ తిట్టు అన్నమాట ... 'ఒసేయ్ ముసలి ఆత్మా!' అనడం. 

మిగిలిన చాలా తిట్ల లాగా ఇది ఇంగిలీషు లో బాగుంటుంది వినడానికి. Old Soul. అందుకే నావన్నీ కొంచెం ముసలి హ్యాబిట్స్ అన్నమాట. నేను బాల్యం నుంచి స్ట్రెయిట్ గా వృద్ధాప్యం లోకి అడుగుపెట్టేసానేమో అని నా అనుమానం కూడా.  

లేకపోతే డైరీ రాయటం ఏంటి చెప్పండి? 'పదహారేళ్ళ వయసు' కి తగ్గ హాబిట్టేనా? పదహారేళ్ళ పడుచు పిల్ల కనే కలల మీద సినిమాలు తీసే వాళ్లు ఏమనుకుంటారో అనే విచక్షణ కూడా లేకుండా నేను డైరీ రాయడం మొదలు పెట్టాను. 

ఓ పది పదకొండేళ్ళు రాసాను. 

మొదటి సంవత్సరం మామూలు డైరీ లో రాసాను. తర్వాత ఎవరో ఇచ్చిన డైరీ లో కంటిన్యూ చేసాను. ఆ తర్వాత నుంచి మాత్రం ఒక్కో సంవత్సరం ఒక్కో డైరీ... గీతా ప్రెస్ వాళ్ళు 'గీతా దైనందినీ' అని ఓ డైరీ వేస్తారు. డైరీ కి ఎంత మంచి పేరు పెట్టారు చూడండి! అందులో ప్రతి రోజూ రెండు గీతా శ్లోకాలు ఉంటాయి. ఓ రెండేళ్లు ఆ డైరీ కొనుక్కున్నాను .. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాటుఫారం నంబర్ ఒకటి మీద వీరి దుకాణం ఉంటుంది. (చెప్పానా ముసలి ఆత్మనని) 

తర్వాత నుంచి సికింద్రాబాద్ లో శ్రద్ధా బుక్ డిపో లో కొనుక్కునే దాన్ని. అక్కడ కూడా సెలక్షన్ (మా అక్క భాష లో చెప్పాలంటే చాదస్తం). సెలక్షన్ ఎందుకంటే కొన్ని డైరీల్లో ఆదివారం పూర్తి పేజీ ఉండదు. సగం పేజీ ఇస్తారు ఏవిటో .. అంటే ఏవిటి వాళ్ళ అర్ధం? ఆదివారం సగం జీవితమే జీవించమనా? లేకపోతే ఆ రోజు ఏమి విశేషాలు జరగవు అని వీళ్ళే డిసైడ్ చేసేస్తారా? అక్కడ ఉన్న డైరీల్లో ఆదివారం పూర్తి పేజీ ఉన్న డైరీ కోసం వెదుకులాట .. దొరికాక సంతృప్తి! 

ఇంక డైరీ రాయటం. వీలైనంత వరకూ రోజూ రాసేదాన్ని కానీ ఒక్కో సారి కుదిరేది కాదు. ఒకటి రెండు రోజులు స్కిప్ అయితే ఫర్వాలేదు కానీ ఐదారు రోజులు స్కిప్ అయితే మెమరీస్ తారుమారు అయ్యేవి. అమ్మ గోంగూర పచ్చడి చేసింది మొన్నా?? అటు మొన్నా? లాంటి డౌట్లు వచ్చేవి. డైరీ, పెన్ను తీస్కొని మా ఇంటి హిస్టోరియన్ అయిన అమ్మ చుట్టూ తిరిగేదాన్ని.... అమ్మ కి డైరీ రాయకపోయినా అన్నీ గుర్తు ఏంటో!!! ఈ సిట్యుయేషన్ రివర్స్ కూడా అయ్యేది ఒక్కోసారి. 

డైరీ రాయాలంటే ఇంట్లో వాళ్ళ సహకారం ఉండాలి. మిస్ అయిన ఈవెంట్స్ గుర్తు చెయ్యడానికి మాత్రమే కాదు. మన ప్రయివసీ కాపాడేందుకు కూడానూ. మా ఇంట్లో ఒక్క సారి కూడా నా డైరీ ముట్టుకోవడం కానీ, చదవాలనుకోవడం కానీ, చదివేస్తా అని బెదిరించడం కానీ చెయ్యలేదు మా వాళ్ళు. (జోకులు మాత్రం బోల్డు వేసే వాళ్ళు). 

కొన్నేళ్ల క్రితం రాయడం ఆపేసాను. Maybe I outgrew it. 

కాకపోతే జర్నలింగ్ ఇప్పటికీ చేస్తుంటాను. కాకపోతే పేపర్ మీద పెన్ను పెట్టట్లేదు. 

ఆన్లైన్ లో జర్నలింగ్ ఆప్స్ , డౌన్లోడ్ చేసుకొనేందుకు వీలుగా సాఫ్ట్వేర్లు ఉంటాయి. నేను కొన్ని ట్రై చేసాను. వాటిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఫోటోలు పెట్టుకోవచ్చు, డైరీ లో లాగ పేజీ పరిమితి ఉండదు .. ఒక్కోసారి ఎక్కువ రాసుకోవచ్చు .. ఒక్కో రోజు ఓ లైన్ తో ముగించవచ్చు. పాస్వర్డ్ కూడా ఉంటుంది వీటికి. ఇవి అలవాటు అయ్యాక ఇంక డైరీలు కొనట్లేదు. 

ఉన్న డైరీలు మొన్నటి దాకా అటక మీద ఉండేవి. మొన్నే మీకు తెలుసు వాటిని కిందికి దించా అని. 

పుష్కరకాలం పాటు రాసిన నా దైనందినులు 

అప్పుడు వాటిని తిరగేస్తూ నాకనిపించింది కూడా ఇక్కడ రాసాను. 

నేను జీవితంలో ఏదైనా కొన్ని మంచి పనులు చేసి ఉంటే (చేసాను. ఊరికే వినయంగా ఉండడం కోసం అలా రాసాను) వాటిలో డైరీ రాయడం ఒకటి. నా వ్యక్తిత్వం యొక్క core ... కేంద్రబిందువు ఏంటో నాకు ఇంకా బాగా తెలిసింది అవి చదివినప్పుడు. 

డబ్బు తో కొనలేనివి ఉంటాయి అని ఎవరైనా చెప్తే నేను నమ్మే దాన్ని కాదు. డబ్బు లేని వాళ్ళు తమ ఆత్మతృప్తి కోసం చెప్పుకొనే మాటలు అనుకునేదాన్ని. కానీ ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. పాత డైరీలు చదువుకోవడం డబ్బు తో కొనలేనిది. డబ్బు కొత్త డైరీలని కొనిస్తుంది కానీ నీ పదహారేళ్లప్పుడు నవంబర్ రెండో తారీకు ఎలా గడిపావో చెప్పలేదు కదూ. 

Friday, October 26, 2018

ఎందు'క్యూ'?

నాకు క్యూ ల తో అపారమైన అనుభవం ఉంది. 

రేషన్ షాపు, బస్ పాస్ రెన్యూవల్, ఈ సేవ, సినిమా టికెట్, ట్రెయిన్ రిజర్వేషన్, సూపర్ మార్కెట్ బిల్ కౌంటర్, బ్యాంకులు, పాస్పోర్ట్ ఆఫీసు లలో కొన్నేళ్లు చెప్పులు అరగదీసియున్నాను  (ఆన్లైన్ దయ వల్ల కొన్ని తప్పుతున్నాయి!) 

మన సంప్రదాయం లో క్యూలన్నిటికి తలమానికమైనది తిరుమల క్యూ. 

తిరుమల క్యూల నిలయం ... అసలు ముందు తిరుమల దర్శనానికి వెళ్లాలంటేనే బయో మెట్రిక్ క్యూ లో నుంచోవాలి. తర్వాత అకామడేషన్ క్యూ. దర్శనం క్యూ సరేసరి. తర్వాత లడ్డూ క్యూ. ఉచిత భోజనం చెయ్యాలంటే అక్కడ కూడా క్యూ. 

ఇన్ని దైవిక, లౌకిక క్యూ లలో కొన్ని గంటలు గడిపిన అనుభవ సారం ... ఈ కింది 'క్యూ'లంకషమైన లిస్టు. 

క్యూలలో కామన్ గా కనిపించే వివిధ రకాల మనుషులు: 

అయోమయం జగన్నాధం - ఈ వ్యక్తి కి అన్నీ డౌట్లే .... అసలు ముందు తప్పు క్యూ లో అరగంట నుంచొని ఎవరో చెప్తే సరైన క్యూ లోకి వస్తారు. వచ్చాక కూడా ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది తో సలహా సంప్రదింపులు జరుపుతారు ..  వీళ్ళ చేతిలోంచి పేపర్లు పడిపోతూ ఉంటాయి ... పెన్నుండదు... భీత హరిణాల వంటి చూపుల తో చుట్టూ చూస్తుంటారు ... వీళ్ళ పరిస్థితి ని చూసి ఎవరో ఒకరు వీళ్ళకి సాయం చేస్తూ ఉంటారు జనరల్ గా. 

ఈగోయిస్టు - తాను ఈ లైన్ లో నుంచోవాల్సి రావడం ఓ అవమానం గా భావిస్తారు ... చికాకు, కోపం, అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు. సిబ్బంది ని అనర్హులని, అసమర్ధులని తిడుతూ ఉంటారు 

మౌని - వీళ్ళ తరహా వాళ్ళకి ఇదంతా ఎలా నడుస్తుందో తెలుసు .. తిరుమల లాంటి క్యూలలో స్తోత్రాలు పుస్తకాలు, మంచినీళ్ల బాటిల్సు, పటిక బెల్లం (షుగర్ లో అవ్వకుండా) లాంటివన్నీ అమర్చిపెట్టుకొని 'మనకెందుకు ఈ ఆలోచన రాలేదా' అని అనుకొనేలా ప్రవర్తిస్తారు. మౌనంగా తమ పని చేసుకొని వెళ్ళిపోతారు .. 

చూపరులు - లైన్ లో ఎవరేం చేస్తున్నారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి? ఇలాంటివి అన్నీ గమనిస్తూ, స్కాన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి క్యూ ఎంత సేపైనా ఫర్వాలేదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్నే టివి గా చేసుకుని గంటలు గంటలు నుంచోగలరు 

లైన్ పోలీసు - లైన్ లో తమ కంటే ముందుగా/క్యూ మధ్యలో ఎవరైనా చొరబడబోతే వాళ్ళని తిట్టి లైన్ వెనక్కి పంపించే బాధ్యత వీళ్లది ... వీళ్లకి ఈగోయిస్టుల సహకారం ఉంటుంది 

జోకర్ - ప్రతి క్యూ లో ఓ విదూషకుడు ఉంటాడు ... లైన్ కట్ చేసే వాళ్ళ మీద, కౌంటర్ వెనక ఉన్న సిబ్బంది మీద, అయోమయం జగన్నాధం కాండిడేట్ల మీద జోకులు వేసే బాధ్యత తీసుకుంటారు వీళ్ళు 

విప్లవకారుడు - క్యూ గంటలు గంటలు కదలకపోతే తానూ రెచ్చిపోయి అందర్నీ రెచ్చగొట్టి  గొడవ చేసే పవర్ ఉంటుంది వీళ్ళకి 

స్పెషల్ కేసు - టెర్రరిస్ట్ అటాక్, బ్యాంకు దోపిడీ, hostage డ్రామా సినిమాల్లో ఓ గర్భిణీ స్త్రీ కంపల్సరీ ఉన్నట్టు గా క్యూ లలో ఓ 'స్పెషల్ కేసు' కంపల్సరీ గా ఉంటారు. వీళ్ళకి ఏదో ఒక ఎమర్జెన్సీ ఉంటుంది .. అది నిజంగా valid అయ్యుంటుంది ...  అప్పటికి నాలుగైదు గంటల నుంచి నుంచున్న వారందరి సహనం, మానవత్వం ఈ 'స్పెషల్ కేసు' వచ్చి పరీక్షించినట్టవుతుంది. 

ఇంక ఆఖరి కేటగిరి ...  

లైన్ లో కనిపించని వారు - వీళ్ళకి ప్రతీ చోటా 'తెలిసిన' వాళ్ళుంటారు. లైన్ లో నుంచోవాల్సిన 'ఖర్మ' వీళ్ళకి పట్టదు ... వీళ్ళంటే అందరికీ ఒళ్ళు మంట. 

నేను ఏ కేటగిరి అంటారా? సందర్భాన్ని బట్టి పై వాటిలో ఓ వేషం వేస్తూ ఉంటాను. 

క్యూ లో నుంచోవడం ... ఇది మానవ సహజం కాని పని. 

బెల్లం చుట్టూ ఈగలు క్యూ లో ఉండవు. ఒకరి తర్వాత ఒకరు అనేది అసలు ప్రకృతి లో లేదు. 

అవసరార్ధం మనిషి తోటి మనిషి ని ట్రెయిన్ చేసి తెచ్చుకున్న పద్ధతి - క్యూ. 

అందుకే మనకి ఇది అంత బాగా ఫాలో చెయ్యడం రాదు. 

మన దేశంలోనే క్యూ లు ఇలా అనుకుంటే మీలో దేశభక్తి కొరవడినట్టే. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా క్యూలు పాటించేలా చెయ్యడం ఒక్కోసారి కష్టమే అవుతూ ఉంటుంది. 

అమెరికా లో మాల్స్ లో కొన్ని బ్రహ్మాండమైన డిస్కౌంట్లు ఉన్న సేల్స్ జరుగుతూ ఉంటాయి క్రిస్మస్ టైం లో ... అప్పుడు తొక్కిసలాటలు, తోపులాటలు కామన్ గా చూడొచ్చు. 

నాకు ఓ భయం ఉంది. కొన్ని సినిమాల్లో స్వర్గం ముందు, నరకం ముందు క్యూ ఉన్నట్టు చూపిస్తారు కదా. చచ్చిపోయి, ఆత్మ అయ్యాక కూడా క్యూ ల నుంచి ముక్తి లేదా?! అక్కడ 'తెలిసిన' వాళ్ళని పట్టుకోవడం ఎలా? 

x

Friday, October 19, 2018

అమ్మ కావాలి

తెలుగు ని 'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్'  అని నికోలో డి కాంటి (Niccolò de' Conti) అనే ఓ ఇటాలియన్ పదహారో శతాబ్దం లో అన్నాడు. ఇతను ఒక వర్తకుడు. సాహితీవేత్త కాదు. ఆ మాట కూడా కాంప్లిమెంట్ ఏమీ కాదు. అది ఒక ఫాక్ట్ మాత్రమే. 

ఇటాలియన్ పదాలు కూడా మన భాషలో పదాల లాగా అచ్చులతో ముగుస్తాయి అని ఉద్దేశం. మనోళ్లు దాన్ని ఓ కాంప్లిమెంట్ గా భాషా పరిరక్షణ వ్యాసాలలో, ఆవేశంగా వేదికల మీద ప్రసంగాల్లో వాడేస్తూ ఉంటారు. నిజానికి ఇలా అచ్చులతో ముగిసే పదాలున్న భాషలు చాలా ఉన్నాయి ప్రపంచం లో. విజయనగర సామ్రాజ్యం లో వాణిజ్యం నిమిత్తం వచ్చి 'మీ భాష కూడా మా భాషలానే ఉందిరోయ్' అన్నాడు అంతే. 

మనం 'ఒక తెల్ల వాడు మనని భలే పొగిడేసాడు' అనుకొనేసాం. ఇప్పుడు మనం భాష ని మర్చిపోయినట్టు అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ని మర్చిపోయాం. అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ మర్చిపోయాం కాబట్టే భాష ని కూడా వదిలేసుకుంటున్నాం అనిపిస్తుంది నాకు. 

అసలు ఒక భాష ని ఇంకో భాష తో పోలిస్తే దానికి విలువ రావడమేంటి ఖర్మ! 

తెలుగు భాష - ప్రపంచం లో ఉన్న భాషలన్నిటిలోకి గొప్పది, అందమైనది, శ్రావ్యమైనదేమీ కాదు. అన్ని భాషలూ తెలియకుండా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేం. అన్ని భాషలు తెలిస్తే ఈ స్టేట్మెంట్ అసలు ఇవ్వం. ఏ భాషలో అందం దానికి ఉందని తెలుస్తుంది కాబట్టి. 

తెలుగుకున్న ఏకైక ప్రత్యేకత మన మాతృభాష కావడం. 

మా అమ్మ అందరికంటే తెలివైనది, అందమైనది, డబ్బున్నది కానక్కర్లేదు.. నేను ఆవిడని ప్రేమ గా చూసుకోడానికి. అదే సూత్రం భాష కి కూడా వర్తిస్తుంది అనుకుంటాను. ఎందుకంటే తెలుగు ని వేరే భాషలతో పోల్చి దాని గొప్పతనాన్ని బలవంతంగా ప్రూవ్ చేసే బదులు దాన్ని ఎలా రక్షించుకోవాలో చూస్కుంటే బాగుంటుంది అంటాను. 

నా చేతి రాత లో ఓ అన్నమయ్య కీర్తన 

నేను నాలుగో తరగతి నుంచి సిటీ లో పెరిగాను. ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నాను. అయినా తెలుగు దూరం కాకపోడానికి కారణం ఖచ్చితంగా ఇంట్లో వాతావరణమే. (ఆ తర్వాత నాకు పర్సనల్ గా భాషల పిచ్చి పట్టిందనుకోండి. అది వేరే విషయం.)

తెలుగు భాష ని గురించిన బెంగ గురించి నేను వింటూ ఉన్నాను కానీ అది ఎంత పెద్ద సమస్యో తెలియలేదు ... సిటీ లో నా తెలుగు ఫ్రెండ్స్ లో తెలుగు చదవడం, రాయడం అతి తక్కువ మందికి వచ్చు అని తెలిసే దాకా. 

దానికంటే బాధ కలిగించే విషయం ... వాళ్ళకి అది నేర్చుకోవాలన్న ఇంటరెస్ట్ లేదని. ఒకే సారి తెలుగు లో రాయబడిన పుస్తకాలన్నీ ఓ నిట్టూర్పు వదిలినట్టు అనిపించింది. వాటి అందం వాళ్లకి చేరే అవకాశం లేదు కదా. 

ఇదే కదా సమస్య. భాష ని విస్మరిస్తే దాని తో పాటు వారసత్వంగా వచ్చే ఎన్నో గొప్ప విషయాలు కూడా మరుగున పడిపోతాయి. 

నేను సిటీలో గమనించిన కొన్ని విషయాలున్నాయి... భాషాపరంగా. 

2018 లో తెలంగాణ లో కంపల్సరీ గా అన్ని సిలబస్ ల వాళ్ళకి తెలుగు నేర్పించాలి అనే జి ఓ రాకముందు కాన్వెంట్స్ లో తెలుగు బాగా ఇగ్నోర్ అయింది. ఒకసారి తెలుగు పద్యాల వేసవి శిబిరం అని పెట్టాం మేము. అక్కడికి వచ్చిన పిల్లల్లో ఇదే గమనించాము. ఖరీదైన కార్పోరేట్ స్కూల్స్, కాన్వెంట్స్ లో చదివే పిల్లలు వాళ్ళు. వాళ్ళలో కొంతమందికి తెలుగు వరసగా మాట్లాడటం రాదు. తెలుగు పద్యం ఇంగిలీషు లో రాసి నేర్పవలసి వచ్చింది. ఆ శిబిరానికి వాళ్ళని తీసుకురావడం వారి తల్లిదండ్రుల తెలుగు ప్రేమ ని చాటింది. కానీ ఇలాంటివి పట్టించుకోనిది ఎంత మంది? 

తెలుగు రాష్ట్రాలలో లేని తెలుగు వారు కూడా భాష కి దూరమయ్యారు. ఆర్మీ, నేవీ లోని తెలుగు వారి పిల్లలకైతే అసలు తెలుగు తో టచ్ ఏ లేదు. (ఇంట్లో ఎవరో ఒకరు పట్టుబట్టి  తెలుగు నేర్పిస్తే తప్పించి)

ఆర్ధిక తరగతి పెరుగుతున్న కొద్దీ తెలుగు పరపతి తగ్గుతూ ఉండడం గమనించాను. 

ఇది ఒక్క మన భాష సమస్య మాత్రమే కాదు. భారత దేశం లో ప్రతి భాష ది. 

ఉగాండా లో అయితే కొత్త తరం మిడిల్ క్లాస్ తల్లి దండ్రులకి మన లాగా ఇంగ్లీష్ పిచ్చి పట్టుకుందిట. వారి భాషలంటే ఒకింత అసహ్యం కూడా ఉందిట వాళ్ళకి. అందుకే ఆ భాషలో అనర్గళంగా మాట్లాడే తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల నుంచి తమ పిల్లల్ని దూరం చేసేస్తున్నారట! యాభై భాషలు అక్కడ అంతరించిపోయే ప్రమాదం లో ఉన్నాయట! 

మీడియా లో ఉన్నప్పుడు, సినిమాలకి పని చేస్తున్నప్పుడు చాలా మంది తెలుగు నటీనటులకు తెలుగు చదవటం రాకపోవడం చూసాను. తమాషా గా తెలుగు వారు కాని వారు కొంతమంది తెలుగు అనర్గళంగా చదివేసి, మాట్లాడేసి, రాసేసి అర్ధం చేసేస్కోవడం కూడా చూసాను! 

భాష కి దూరమవ్వడం వల్ల చాలా సమస్యలు కనిపించాయి నాకు. ముందు చెప్పినట్టు గా కొన్ని గొప్ప పుస్తకాలు చదివి కొందరు గొప్ప తెలుగు రచయితల భావాలు అర్ధం చేసుకొనే అవకాశం ఉండదు. ఇది గొప్ప లోటు. దీన్ని ఎన్ని పరభాషా పుస్తకాలయినా పూడ్చలేవు. 

కొన్ని తెలుగు వాడుకలు, సామెతలు... ఇవన్నీ వాళ్ళకి అర్ధం కావు... మరుగున పడిపోతున్నాయి. 

ఏ ఆర్ధిక తరగతి నుంచి కంపెనీల సీఈఓ లు, మేధావులు, నిపుణులు, దాతలు, డెసిషన్ మేకర్స్ వస్తారో వారికి తెలుగు రాకపోవడం చాలా పెద్ద ట్రాజెడీ. 

ఇంకోసారి ఇంకో శిబిరం పెట్టాం మేము. తెలుగు దేశభక్తి గీతాలది. ఒక్కరే వచ్చారు ఈ సారి. అందులో కూడా తండ్రి తెలుగు, తల్లి ఇంకో భాష. ఆ పాప కి రెండేళ్లే. కానీ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతోంది. (ప్లే స్కూల్స్ లో ఇంగ్లీష్ ఉంటుంది.. తెలుగు ఉండదు కదా). 

వారికి మేము ఒకటే చెప్పాము .. పాప చాలా లక్కీ... తలిదండ్రుల ఇద్దరి మాతృభాషలు నేర్చుకొనే అవకాశం ఉంది అని. 

నాకు అదే అనిపిస్తుంది. ఎవరి మాతృభాష లో వాళ్ళకి మినిమమ్ చదివే రాసే జ్ఞానం ఉంటే ఎంత బాగుణ్ణు! ఏ భాషా చచ్చిపోకుండా ఉంటే ఎంత బాగుణ్ణు!

ముఖ్యంగా అందరూ తెలుగు చదవడం రాయడం గబగబా నేర్చేసుకొని నా బ్లాగు చదివితే ఎంత బాగుణ్ణు! (అసలు ఇదంతా రాయడానికి నా ఈ స్వార్ధమే కారణమా?)

జీవితం లో కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. రోజూ ఓ కుటుంబం అంతా కూర్చొని భోజనం చేస్తుంది. ఇది చిన్న విషయం. కానీ అలా కలిసి తినటం వల్ల ఆ కుటుంబం కలిసి ఉంటుంది... పిల్లలు సెక్యూర్ గా ఫీలవుతారు... భార్యాభర్తల బాండింగ్ పెరుగుతుంది. ఒక కుటుంబం ఎందుకు సంతోషంగా ఉంది అంటే 'వారు కలిసి తింటారు కాబట్టి' అని ఎవరూ గుర్తించలేకపోవచ్చు కూడా. 

మాతృభాష పరిరక్షణ కూడా ఇలాంటిదే అని నా అభిప్రాయం. మనం గ్రహించని చాలా లాభాలు ఉన్నాయి భాష ని రక్షించుకుంటే. మన ఊహకి అందని చాలా నష్టాలు ఉన్నాయి ... భాష ని మర్చిపోతే. కొన్ని మనం ఇప్పటికే అనుభవిస్తున్నాం కూడా. 

  • సాహిత్య పరంగా  - తెలుగులో గొప్ప  పుస్తకాలని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయడం, తెలుగు పద్యం, అవధానం లాంటి సాహితీ ప్రక్రియలని ప్రపంచానికి తెలియచేయటం వంటివి
  • సాంస్కృతికంగా - తెలుగు పద్ధతులు, కళలు, ప్రాచీన తెలుగు మేధస్సు, తెలుగు చరిత్ర మరుగున పడిపోవటం
  • ఆర్ధికంగా - ముందే చెప్పినట్టు స్పెండింగ్ పవర్ (ఖర్చు చేసే శక్తి) ఉన్న ఎగువ తరగతుల వారు తెలుగు కి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం/స్పాన్సర్ చెయ్యకపోవడం, తత్సంబంధమైన వస్తువులు కొనుగోలు చెయ్యకపోవడం, ఆదరించకపోవడం
  • మేధోపరంగా - కంప్యూటర్ లో/ఫోన్ లో తెలుగు టైప్ చెయ్యడం లో ఉన్న ఆనందమే వేరు.. ఇది సాధ్యం అయింది అంటే అర్ధం .. ఓ కంప్యూటర్ నిపుణుడికి తెలుగు భాష వచ్చు. ఇది చిన్న ఉదాహరణ. ఇంకా భాష ని కొత్త పుంతలు తొక్కించే అవకాశాలు ఎన్నో. (నా పర్సనల్ డిమాండ్ .. ఆన్లైన్ లో తెలుగు లో ఇంకా బోల్డు ఫాంట్స్ రావాలి ) ఇవన్నీ తెలుగు భాష రాకపోతే ఎలా సాధ్యమవుతాయి? 
చివరిగా..  
  • నైతికంగా - మాతృభాష ని మర్చిపోయే జాతి గురించి ఏం గొప్పగా చెప్పగలం? గతాన్ని మర్చిపోయే జాతి కి ఏ పాటి భవిష్యత్తు ఉంటుంది? 

Friday, October 12, 2018

#metoo

ఈ పోస్టు లో ప్రముఖుల పేర్లు, లైంగిక వేధింపుల వివరాలు ఆశిస్తే మీరు ఇక్కడే చదవడం ఆపేయచ్చు. 

నేను వ్యక్తిగతంగా చూసిన, సహించిన.. సహించని కొన్ని అనుభవాలు, వాటి వల్ల అమ్మాయిల జీవితాలు ఎలా negative గా ఎఫెక్ట్ అవుతున్నాయో చెప్తాను. 

ఇది చాలా వ్యక్తిగతమైన పోస్టు. రాయడం చాలా కష్టం కూడా అవుతోంది. కానీ ఎందుకో ఈ టాపిక్ avoid చెయ్యాలనిపించట్లేదు. 

#metoo అని బయటికొచ్చిన ఆడవాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు ... ఈ గుండె బరువు దింపేసుకోవాలని చెప్పుకుంటున్నామని. నేనూ అంతే. 

నాకు ఐదు-ఆరేళ్ళ వయసు అప్పుడు... వీధి చివర ఓ pervert రోడ్డు మీద నుంచొని వెకిలి చేష్టలు చేసేవాడు .. నలుగురు ఐదుగురం కలిసే స్కూల్ కి వెళ్ళేవాళ్ళం ... అయినా వాడు భయపడే వాడు కాదు. కానీ మా పిల్లలందరికీ వాడంటే భయం. వాడు చేసేవాటిలో ఏదో తప్పు ఉంది .. ఏదో harm ఉంది అని తెలుస్తూ ఉండేది. ఇంక ఒక్కళ్ళం వెళ్లాల్సి వస్తే బిక్కచచ్చిపోయేవాళ్ళం. వాడు రోడ్డు మీద లేకపోతే ఎంత రిలీఫ్ గా ఉండేదో. ఇది తాడేపల్లిగూడెం లో. 

హైదరాబాద్ లో మా వంటింటి కిటికీ లోంచి రైల్వే ట్రాక్ కనిపించేది. అక్కడా ఇలాంటి అనుభవమే. ఆ ఇంటి నుంచి మేము వెళ్ళిపోడానికి అది ముఖ్యకారణమైంది. 

నాలుగో తరగతి లో ఉండగా మా స్కూల్ లోనే ఏడో తరగతి చదువుకొనే ఓ అబ్బాయి ఆధ్వర్యం లో ఓ బాయ్స్ గ్యాంగ్ నేను ఇంటికొచ్చే దారంతా కామెంట్లు చేస్కుంటూ వెంట వచ్చేవారు. చాలా కోపంగా, భయంగా, చికాకుగా ఉండేది. చివరికి ఇంట్లో చెప్తే అమ్మ వాళ్ళని పిలిచి మాట్లాడింది. అప్పుడు ఆ సమస్య కొంచెం తగ్గింది. 

ఇంక ఎనిమిదో తరగతి లో సిటీ బస్సెక్కి స్కూల్ కి వెళ్లాల్సి వచ్చేది. బస్ స్టాప్ లో, బస్సులో, కాలనీ లో ... ఎవరో ఒకళ్ళు తగిలేవారు. ఎంత stressful గా ఉండేదో చెప్పలేను. 

స్కూల్ మారిపోయాను. ఇంటి దగ్గర స్కూల్ లో చేర్పించారు. 

పోకిరీలు ఇక్కడా ఉండేవారు. అమ్మ పిలిచి మాట్లాడినా వాళ్లలో మార్పు లేదు. 

ఇల్లు కూడా సేఫ్ కాదు ఇలాంటి వాటి నుంచి అనిపించే అనుభవాలు కూడా జరిగాయి. 

ఇంకా పెద్దయ్యాక పెరిగాయి కానీ తగ్గలేదు. Music students గా ఉన్నప్పుడు సంగీతం, డాన్స్  కచేరీలకి బాగా వెళ్ళేవాళ్ళం. రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియమ్స్ లో .. మా తోటి మగవాళ్లు ఉన్నా కూడా... ఈ perverts కి భయం ఉండదు. ఎన్ని కచేరీలు మధ్యలోంచి వచ్చేసామో. 

ఆడిటోరియమ్స్ లో కానీ, బస్సుల్లో కానీ కూర్చున్న సీటు కి కింద గాప్ ఉంటుంది. ఈ రోజుకీ అలా ఉంటే ముళ్ల మీద కూర్చున్నట్టే కూర్చుంటాను. వెనక ఎవరున్నారో చూసి గానీ ప్రశాంతంగా ఉండలేక పోతాను. థియేటర్ లో సినిమా చూడాలంటే అన్నిటికంటే వెనక రో బుక్ చేస్కుంటాం ఈ భయానికి... ఈ రోజుకి కూడా. 

వీళ్ళు ముక్కూమొహం తెలియని వాళ్ళు. వీళ్ళ మీద కోపం, కసి ఎలా తీర్చుకోవాలో తెలీదు. 

ఇంక మనకి బాగా తెలిసి, మనం respect చేసే వాళ్ళు కలిగించే బాధ వేరే కేటగిరి అని చెప్పచ్చు. 

మన కంటే చాలా పెద్దవాళ్ళు, పెళ్లయిన మగవాళ్ళు, సమాజం లో మంచి హోదాలో ఉన్నవాళ్లు, సత్కారాలు బిరుదులూ పొందిన టాలెంటెడ్ వాళ్ళూ   .. . flirting, కొంటె మాటలు మొదలుపెడతారు. ప్రొఫెషనల్ వాతావరణం లో కూడా ఇలాగే చేస్తారు. 

ఓ సారి music students గా ఉన్నప్పుడు కాలేజీ లో ఏదో కాన్ఫరెన్స్ జరిగింది...హెల్ప్ కోసం స్టూడెంట్స్ గా మమ్మల్ని రమ్మంటే వెళ్ళాం.  అందరూ సంగీత కళాకారులే కదా అని. వెళ్లకుండా ఉండాల్సింది అని ఎన్ని సార్లు అనుకున్నామో తర్వాత లైఫ్ లో. మనం గౌరవించే వాళ్ళ ని అసహ్యించుకోవడం అంత సులువైన పని కాదు. It was the end of our innocence. 

చిన్నప్పుడు అనుకునేదాన్ని .. పెద్దయితే ఇవేవీ ఉండవని. Wrong. 

పోనీ పెళ్లవ్వనందువల్ల ఇలా మాట్లాడతారేమో అనుకునేదాన్ని. Wrong.

ఈ వేధింపులు .. మాటల్లో అయినా చేష్టల్లో అయినా .. చాలా లైఫ్ ఛేంజింగ్ గా ఉంటాయి. 

ఇల్లు మారడాలు, స్కూల్ మారడాలు కాక ఇవి ఇంకా చాలా విషయాల్లో negative ప్రభావం చూపుతాయి. 

నాకు దేవుడి ఉనికి మీద అనుమానం కలిగింది ఈ సంఘటనల వల్లే. దయాసాగరుడు అని చెప్పుకొనే భగవంతుడు ఇవన్నీ ఎలా జరగనిస్తున్నాడు అని కోపం వచ్చేసేది. 

ఇందులో నా తప్పు ఉందేమో అని కుమిలిపోయిన రోజులున్నాయి.  

చూడటానికి బాగుంటే టార్గెట్ చేస్తారేమో అని జుట్టు సరిగ్గా దువ్వుకోకపోవడం, నచ్చిన బట్టలు వేసుకోకపోవడం, చాలా తక్కువగా మాట్లాడటం, invisible గా ఉండాలని కోరుకోవడం .. ఇవన్నీ ట్రై చేసాను. నా పర్సనాలిటీ నే మార్చేసుకున్నాను కొన్ని ఏళ్ళు.

తోటి ఆడవాళ్ళ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉండేది కాదు ఈ విషయం లో. బస్సుల్లో ఎన్నో సార్లు నేను మాట్లాడినా ఆడవాళ్లు మౌనంగా ఉండేవారు .. పైగా నన్ను విచిత్రంగా చూసేవారు. 

ఆఫీసుల్లో కూడా సీనియర్ పోస్టుల్లో ఉన్న ఆడవాళ్లు ఈ harrassment కి వాళ్ళ ఉదాసీనత తో ఒక రకంగా సపోర్ట్ చేసేవారు. మన గోడు చెప్పుకుంటే 'ఆయన అంతే' అనేవారు. పట్టించుకున్నందుకు, సద్దుకుపోనందుకు  మనకి క్లాస్ పీకుతారు.

కొన్ని శతాబ్దాల ఆడవారి తపస్సు ఫలించి ఈ #metoo movement లాంటివి వస్తున్నాయి అనిపించింది నాకు. 

ఇప్పుడు వాళ్ళ చేదు అనుభవాలతో బయటికి వస్తున్న ఆడవారిని 'ఇన్నేళ్లూ ఎందుకు మాట్లాడలేదు?' అని మాత్రం అడగకండి. వాళ్లు చెప్పుకోడానికి ఇప్పుడు రెడీ అయ్యారు. వినడానికి బహుశా ఈ ప్రపంచం కూడా ఇప్పుడే రెడీ అవుతోంది. 

Friday, October 5, 2018

ఎవరు చేసిన ఖర్మ ...

మనోళ్ళకి ఆధ్యాత్మిక IQ ఎక్కువ. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటివి పనికట్టుకు చదవకపోయినా కర్మ సిద్ధాంతాలు, స్థితప్రజ్ఞత్వాలు, పూర్వ జన్మ సుకృతాలు, సంచిత పాపాలు ఇలాంటివి తెలుసు. ఇవి మన డి ఎన్ ఏ లో ఉన్నాయేమో! 

మన జీవితం లో ట్రాజెడీ లని ప్రాసెస్ చేసే విషయం లో మన లోని ఈ ఆధ్యాత్మికత బాగా పనికొస్తుంది అనుకుంటాను. ఏదైనా దొరకకపోయినా, చేజారి పోయినా, బాధ కలిగినా, ఎవరైనా పోయినా ... ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా సరే .. ఆధ్యాత్మికత, వేదాంతం, తాత్వికత లు  సందు చివర దొరికే అరటి పళ్ళలాగా అన్ని సీజన్లలో పెద్ద ఖర్చు పెట్టకుండా అందుబాటులో ఉంటూ ఉంటాయి. 

మనం జీర్ణం చేసుకున్న ఈ ఆధ్యాత్మికత లో చాలా ముఖ్యమైనది - కర్మ సిద్ధాంతం. మన దేశం లో పుట్టిన పదేళ్ల వాడిని కర్మ సిద్ధాంతం గురించి అడిగితే చెప్తాడని నాకో గుడ్డి నమ్మకం.

అయితే ఎవరి దగ్గర ఏది ఎక్కువ ఉంటుందో, వాళ్ళు ఆ ఆస్తిని విచ్చలవిడిగా విచక్షణ లేకుండా వాడేస్తారని మనిషి చరిత్ర చెప్తుంది. 

అమెరికా తన అధికారాన్ని ఇలాగే వాడుతుంది. మనం మనం ఆధ్యాత్మికత ని అలాగే వాడతాం. 

అన్నిటికంటే నాకు ironical గా అనిపించేది ... ఎంతో ఉన్నతమైన ఈ ఆధ్యాత్మికత ని తోటి మనిషిని జడ్జ్ చెయ్యడానికి, హీనంగా చూడ్డానికి, స్వార్ధాన్ని కప్పి పుచ్చుకోడానికి వాడటం. 

 As you sow, so shall you reap అంటుంది కర్మ సిద్ధాంతం. (స్థూలంగా). 

మంచి చేస్తే మంచి. చెడు చేస్తే చెడు. 

అయితే ఆధ్యాత్మికత కి ఓ రూల్ ఉంది. It's personal. చాలా వ్యక్తిగతమైన విషయం ఇది. 

నీ జీవితానికి మాత్రమే ఆపాదించుకోవాలి. 

పక్కోళ్ళ జీవితం లో మనం చూసిన ముక్క ని తీస్కొని దానికి ఆపాదించకూడదు. 

వాడు ఎంత చెడ్డవాడు .. అయినా వాడికి ఏం కాదు చూడు అంటారు. పెద్దెదో వాడి లైఫ్ అంతా తెలిసిపోయినట్టు. త్రికాలజ్ఞానులు మాత్రమే నిజంగా ఆ చెడ్డవాడు ఎప్పుడు ఎలా కర్మఫలం అనుభవిస్తాడో చెప్పగలరు. (అయినా వాళ్ళు చెప్పరనుకోండి ... అలాంటి వాళ్ళకే త్రికాలజ్ఞానం వస్తుంది ఏవిటో) 

నాకు ఇంకా బాధ కలిగించేది ఏంటంటే వికలాంగులను, విధి వంచితులను చూసి 'వాళ్ళు ఏ  జన్మలో ఏం చేసారో మరి' అంటారు. అలా కర్మ సిద్ధాంతం భుజం మీద నుంచి జడ్జింగ్ అనే తుపాకీ పేలుస్తారు. 

ఇది రివర్స్ calculation. మంచి చేస్తే మంచి. చెడు చేస్తే చెడు. వాడికి చెడు జరిగింది కాబట్టి వాడు ఖచ్చితంగా ఏదో చెడు చేసుంటాడు అని లెక్కగట్టేస్తారు. 

ఇలా అన్నప్పుడు రెండు తప్పులు జరుగుతున్నాయి అని నా అభిప్రాయం 

1. కర్మ సిద్ధాంతం లో cause-effect ని అర్ధం చేస్కోవడం అంత సులువు కాదని పెద్దవాళ్ళు చెప్తారు. బౌద్ధులు Endless knot (అంతం లేని ముడి) అనే ఓ చిహ్నాన్ని వాడతారు .. అది చూస్తే తెలుస్తుంది ..కర్మ సిద్ధాంతం ఎంత సూక్షమైనదో. 

Image result for endless knot karma
Endless Knot 



Image result for endless knot
మన డి ఎన్ ఏ కి ఆధ్యాత్మికత ఉంది అనడానికి సాక్ష్యం మనం నిత్యం వేసే ఈ endless knot ముగ్గు 
దీని ఆది, అంతం ఎక్కడున్నాయి చెప్పండి? ఇలా సగం సగం అర్ధం చేసుకున్న సిద్ధాంతాలతో మనం జడ్జి చెయ్యడం మొదటి తప్పు. 

2. రెండోది, ఎంత గొప్ప జ్ఞానమైనా, సిద్ధాంతమైనా, వేదాంతమైనా మానవత్వానికి, ప్రేమకి అతీతమైనది కాదు. వాడి కర్మ ఫలం వాడు అనుభవిస్తున్నాడని పెదవి విరిచేస్తే compassion, empathy, సానుభూతి .. వీటికి స్థానం ఏది? 

ఒక్కోసారి మంచి చేసే వాళ్ళకి మంచి ఫలితాలే రావు అని మనం చూస్తుంటాం. ఈ సిద్ధాంతాన్ని దానికి ఆపాదించేసి 'ఇంకెందుకు మంచి చెయ్యడం' అని దారి తప్పేస్తూ ఉంటాం కూడా. 

సమాజం లో జరిగే చాలా వివక్షలని జస్టిఫై చేసుకోడానికి  కూడా కర్మ సిద్ధాంతాన్ని వాడేశారు. 

బానిసలు, బాల విధవలు, అంటరానివాళ్ళు, నిరుపేదలు, శారీరక మానసిక వికలాంగులు, రోగిష్టులు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అవకాశాలు రాని ఆర్టిస్టులు, అర్ధాయుష్కులు, రెక్కాడినా డొక్కాడని వాళ్ళు ...  వీళ్ళందరూ 'పూర్వజన్మ లో యేవో పాపాలు చేసిన వారే' అనేసారు. మళ్ళీ ఇదో వివక్ష! అదృష్టవంతులు vs దురదృష్టవంతులు. పూర్వ జన్మల్లో మేం మంచి చేసాం తెలుసా అని ఆధ్యాత్మికత ని కూడా ఈగో బూస్ట్ గా వాడేసేవాళ్ళు. ఎవరు చేసిన ఖర్మ వాళ్లే అనుభవించాలి అనే పీనల్ కోడ్ ముసుగు తొడుక్కున్నారు ఇంకొంత మంది స్వార్ధపరులు. 

కానీ కొంత మంది సానుభూతి తో, మానవతా దృక్పథం తో వారి కర్మ సంచితాలు, పూర్వజన్మ సు/దుష్కృతాలు బాలన్స్ షీట్ వెయ్యకుండా వాళ్ళ బాధల్ని అర్ధం చేసున్నారు. కొంత మంది వారి జీవితాలని మార్చే సంస్కరణలు తీసుకొచ్చారు. తీసుకొస్తున్నారు. 

కర్మయోగులంటే వాళ్ళు. ఎవరి కర్మ కి వాళ్ళని వదిలెయ్యని వాళ్ళు. 

Friday, September 28, 2018

అటక - ఒక టైం మెషీన్

కొన్ని రోజుల కిందట అటకెక్కాను. 

ఏదో craft కి కొన్ని వస్తువులు కావాలి. అవి ఏవైనా దొరుకుతాయేమో అని. 

ఎలక్షన్ మేనిఫెస్టో లో ఉన్నవి ఎన్నికలు అయిపోయాక మారిపోయినట్లే నేను అసలు ఎందుకు అటకెక్కానో ఆ ఉద్దేశం అటకెక్కించేసి ఓ ఐదారు కార్టన్లు దించుకున్నాను. 

ఈ కార్టన్ల లో నా బాల్యం, కౌమారం నిక్షిప్తమై ఉన్నాయి. యవ్వనం ఇంకా కార్టన్ల లో కి చేరలేదులెండి. I am not that old. 

నేను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు ... మా తాతగారు కొనిచ్చిన బిల్డింగ్ సెట్స్ .. ప్లాస్టిక్ వి. అమ్మ షోకేస్ లో పెట్టే కొన్ని బొమ్మలు రెండు జిరాఫీలు, రెండు జింకలు, రెండు కుందేళ్లు... ఓ కోర్టు రూమ్ సీన్ .. ఒక జడ్జి, ఒక ముద్దాయిలని నిలబెట్టే బోను, ఒక దొంగ.. అతనికి ఇరువైపులా అతన్ని గొలుసులతో పట్టుకున్న పోలీసు కానిస్టేబుళ్లు .. తమాషా ఏంటంటే దొంగ బొమ్మ ఆ మధ్య నుంచి ఊడిపోయింది .. బొమ్మల్లో కూడా దొంగ తప్పించేస్కున్నాడు! 

మా నాన్న గారు నాకు కొనిచ్చిన మొదటి బొమ్మ .. లియో కంపెనీ వాళ్ళ గూడ్స్ ట్రెయిన్ .. దాని నుంచి 'కీ' ఇస్తే వచ్చే మ్యూజిక్కు. ..ఆ ట్రెయిన్ బొమ్మ నుంచి వచ్చే సంగీతమే sound track of my childhood అండీ. It fills me with nostalgia. (నోస్టాల్జియా కి ఒక మంచి తెలుగు మాట చెప్పి పుణ్యం కట్టుకోండి ఎవరైనా ప్లీజ్)


భారత దేశం లాగానే ఈ ట్రెయిన్ కి ఓ పూర్వ వైభవం ఉంది. సంగీతం రావడం తో పాటు ఇది ముందుకి నడిచేది. ఓ ఎలుగు బంటి బొమ్మ స్టీమ్ వచ్చే దగ్గర ఉండేది .. అది పైకి కిందికి కదులుతూ ఉండేది. ఈ ట్రెయిన్ కి రెండు బోగీలు కూడా ఉండేవి. ఇప్పుడు...  

ఆ ఎలుగుబంటి లేదు .. 
ఓ బోగీ లేదు .. 
ఏ కదలికా లేదు.
ఈ ట్యూన్ మాత్రం మిగిలింది. 
ఊఁ . 

బొమ్మల తర్వాత బయటికొచ్చాయి నా పర్సనల్ డైరీలు. ఓ పదేళ్ల పాటు రాసాను డైరీలు. అవి అలా తిరగేసాను ... అప్పుడు రెండు విషయాలు అనిపించాయి. 

1. నేను చాలా మారానని.
2. నేను అస్సలు మారలేదని. 

ఆ తర్వాత నేను లెక్చరర్ గా పని చేసిన రెండేళ్లలో నా స్టూడెంట్స్ నాకిచ్చిన గిఫ్ట్స్ కనిపించాయి. 

నా మొదటి జీతం తో కొనుక్కున్న డ్రెస్సింగ్ టేబిల్ బిల్ కనిపించింది. 

నావి కొన్ని పాత స్క్రిప్ట్స్ కనిపించాయి. 

ఈ స్క్రిప్ట్స్ చదవడం భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. అప్పటి నా నమ్మకాలు, లెవెల్ అఫ్ ఎక్స్పీరియన్స్ .. ఇవన్నీ తెలుస్తాయి వాటి వల్ల. 

ఒక మంచి స్క్రిప్ట్ లక్షణం ఏంటంటే it has to age well. చింతకాయ పచ్చడి లాగా. మంచి స్క్రిప్ట్ కాకపోతే బూజు పడుతుంది.. అది పారేయడమే. మంచి స్క్రిప్ట్ అయితే ఇన్నేళ్ల తర్వాత కూడా అది చదివితే relevant గా అనిపించాలి. దాన్ని రాసిన ఉద్దేశం నెరవేరాలి. కామెడీ అయితే నవ్వు రావాలి. stale అయిపోకూడదు.  

అలా ఓ ఇంగ్లీష్ కామెడీ నాటకం బయటపడింది. ఆరేళ్ళ క్రితం రాసింది. It is still funny. ఆ స్క్రిప్ట్ కి 'discovery of the day' అవార్డు ఇచ్చాను. ఆ నాటకం వేసే ప్రయత్నాల్లో ఉన్నాను ఇప్పుడు. 

అలాగే నేను ఎమ్ ఏ ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు రాసుకున్న నోట్స్ .. మరీ ఇంత సిన్సియర్ గా చదివేసానా అనిపించాయి! 

కొన్ని రోజులు సంస్కృతం చదువుకున్నాను .. ఆ నోట్స్ కూడా ఉన్నాయి. 

గిటార్ రెండు క్లాసులకి వెళ్లాను .. ఆ నోట్సులు... 

ఇవన్నీ బాగుంటాయి కానీ కొన్ని వందల చిన్న చిన్న పేపర్లు చదివి అవసరమో లేదో చూసి చించి పారెయ్యడం అనే పని ఉంది చూశారూ .. అబ్బబ్బ .. అది విసుగు కలిగిస్తుంది. మళ్ళీ చూడకుండా చింపేస్తే .. అది ఇంపార్టెంట్ పేపర్ అయితే? ఎప్పుడో భవిష్యత్తులో ఏదో పేపర్ కోసం వెదుకులాట లో 'ఆ రోజు చూడకుండా చింపేసామే ... వాటిలో ఉందేమో' అనే అనుమానాలు .. అసలు ఆ పేపర్ ఆ రోజు చించినా చించకపోయినా. 

కొన్నేళ్ల క్రితం పేపర్ ఎంత వేస్ట్ అయ్యేదో! ప్రతి నెలా బ్యాంకు వాళ్ళు స్టేట్మెంట్స్ పంపించడం .. ప్రతి దానికి పేపర్ రూపం లో బిల్లు, పేపర్ ఇన్వాయిస్ లు ... మనం ఇప్పుడు ఎంత పేపర్లెస్ అయిపోయామో గుర్తించేలా చేశాయి ఈ పేపర్లు. 

చించీ చించీ చేతులు నొప్పులు. టెలిఫోన్ డైరెక్టరీ వట్టి చేతులతో చింపేసి గిన్నిస్ బుక్కులో కి ఎక్కేస్తుంటారు చూడండీ కొంత మంది  ..  అలాంటి వాళ్ళని ఈ పని కి పెట్టుకుంటే బాగుంటుంది. 

ఇవి కాక ఆడియో క్యాసెట్లు, హాండీ కామ్ తాలూకు మినీ క్యాసెట్లు, చిన్నప్పటి టేప్ రికార్డర్, వాక్ మాన్ ... ఇవన్నీ టెక్నాలజీ మార్పులని సూచించాయి. ఒక్క ఫోన్ తో నే ఇవన్నీ పనులు ఇప్పుడు చెయ్యగలుగుతున్నాం కదా అనిపించాయి! 

బిజినెస్, చెస్, పిన్ బోర్డు లాంటి బోర్డు గేమ్స్ వెలువడ్డాయి. Lexicon అనే కార్డు గేమ్ కనిపించింది. చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువ ఆడేవాళ్లు ఈ ఆట. ఇంగ్లీష్ అక్షరాలు ప్రింట్ చేసి ఉంటాయి ఒక్కో కార్డు మీద. ఒక్కొక్కరికి పది కార్డులు పంచుతారు. మనకి వచ్చిన పేక ల మీద అక్షరాల తో పదాలు చేసి చేతిలో ఉన్న ముక్కలని అందరి కంటే ముందు వదిలించుకొని వాళ్లే విన్నర్స్. 

ఈ అటక మీద నుంచి దిగిన గతం లో అమ్మా నాన్న ల శుభలేఖ, లగ్నపత్రిక కూడా కనబడ్డాయి. 

నా పుట్టుక కి వేదిక అది. ఆది మూలం అది. అంత వెనక్కి తీసుకెళ్లింది అటక. 

ముందే చెప్పినట్టు I am not that old. కానీ ఇన్ని పాత జ్ఞాపకాలు చూసి నేను ఇంత జీవించేశానా అనిపించింది. నా కంటే పెద్ద వాళ్ళు ఇది విని నవ్వుకోవచ్చు కానీ ఈ వయసుకే నాకు అలసట అనిపించింది. 

అటక నా చరిత్ర అంతా చూసేసింది. నేనూ అటక చరిత్ర చూడాలి కదా మరి... అటక ఇంగ్లీష్ లోని attic నుంచి వచ్చింది. ఆ పదానికి మూలం గ్రీకు వారి Attica. ఆ కట్టడం శైలి బట్టీ ఈ పేరు వచ్చింది. అంటే మన ఇళ్లలో అంతకు ముందు అటకలని ఏమనేవారు? అసలు మన కి అటకల కల్చర్ లేదా? నేలమాళిగ లు మన స్టైలా?  వీటి గురించి రీసెర్చ్ చెయ్యవలసిన అవసరం ఉంది. 

అటక ఒక టైం మెషీన్. ఇది అతిశయోక్తి. ఎందుకంటే - 

1. ఈ టైం మెషీన్ గతం వైపు మాత్రమే వెళ్తుంది. 

2. అది కూడా వ్యక్తిగత గతం. (కమలాక్షునర్చించు కరములు కరములు లాగా భలే కుదిరింది 'వ్యక్తిగత గతం'... లాటానుప్రాసాలంకారం .. పెద్దలు ఒప్పుకుంటే). 

3. అది కూడా మన జీవితకాలం మేరకే. వెనక్కి వెళ్లి గాంధీ ని చూసొస్తా అంటే చూపించదన్నమాట. 

ఇన్ని షరతులతో కూడి ఉన్నా అతిశయోక్తి అని ముందే చెప్పేసాను  కాబట్టి .. అటక ఒక టైం మెషీన్. 

ఈనాడు ఆదివారం లో నా కథ 'గాజు గోడ'

కార్పొరేట్ ప్రపంచం లో గ్లాస్ సీలింగ్ అనే చేదు నిజం ఉంది. విమెన్ ప్రొఫెషనల్స్ ని ఒక స్థాయి ని మించి ప్రోమోట్ చెయ్యకపోవడం ... అంటే అప్పర్ లెవె...