Friday, September 21, 2018

గా .. మా .. నీ..

సాగర సంగమం నేను చూసిన/చర్చించిన ప్రతి సందర్భానికి నాకు పది రూపాయలు ఎవరైనా ఇచ్చినట్టైతే ఈ పాటికి నేను కోటీశ్వరురాలిని అయిపోయేదాన్ని. అప్పుడు ఇదే బ్లాగ్ నేను కేరళ backwaters దగ్గర కూర్చొని రాసేదాన్ని. సాగర సంగమం గురించి సాగర సంగమం జరిగే చోట అన్నమాట! 

కానీ నాకు ఆ పది రూపాయలు ఎవ్వరూ ఇవ్వలేదు. సినిమా మట్టుకు బోల్డు ఇచ్చింది.

తెలుగు సంస్కృతికి కన్యాశుల్కం ఎలాంటిదో సాగర సంగమం అలాంటిది అని జెనెరలైజ్డ్ స్టేట్మెంట్స్ నేను ఇవ్వను.

I can only say what it means to me.

నేను దీన్ని మొదటి సారి ఎప్పుడు చూశానో గుర్తు లేదు....  ఆవకాయ మొదటి సారి ఎప్పుడు తిన్నానో గుర్తు లేనట్టే.

కానీ ఇది జీవితం లో ఓ భాగం అయిపోయింది. ఇంటర్నెట్ వచ్చాక ఈ సినిమా మళ్ళీ ఒకటికి రెండు సార్లు చూసాను.

చాలా సార్లు సినిమా మొత్తం కాకుండా కొన్ని కొన్ని సీన్లు చూడటం అలవాటు.

ఓ కళాకారిణి గా చూసాను. నేను సినిమాల్లో పని చెయ్యడం మొదలు పెట్టాక ఓ టెక్నీషియన్ గా చూసాను.

అన్ని సార్లు చివరి సీన్ దగ్గర గొంతు choke అయిపోతుంది. ప్రతి సారి అవ్వక్కర్లేదు అంటుంది ఇగో. ఎమోషన్ ఒప్పుకోదు.

ఈ బాలు క్యారెక్టర్ మీద ఫస్ట్ లో జాలి ఉండేది. తర్వాత identify అయిపోవడం మొదలు పెట్టాను. ఆ తర్వాత కోపం. ఇలా ఉంటే ఎలా అయ్యా అనే బెంగ. ఈ ఎమోషన్స్ అన్నీ musical chairs లాగా మారుతూ ఉంటాయి తప్ప neutral గా మాత్రం ఉండలేకపోతాను.

మాధవి, రఘు ల లాగానే నేను కూడా బాలు ని అలా వదిలెయ్యలేకపోయాను.

అసలు బాలు ప్రాబ్లమ్ ఏంటి అని తెలుసుకోనిదే నాకు శాంతి లేదు అనిపించింది. 

నేను, అక్కా విశ్వనాథ్ గారి ముందు రెండు మూడు సార్లు పాడాము వారి ఇంట్లో. పాట, సాహిత్యం, సంగీతం .. వీటికి సంబంధించిన చర్చ నడిచేది. బాలు విషయం నేనెప్పుడూ చర్చ కి పెట్టలేదు. ఒక కారణం ... అది అలా ఎందుకు రాశారు? ఇలా ఎందుకు రాశారు? బాలు లాంటి వ్యక్తి మీకు తెలుసా అని అడగటం నాకు నచ్చదు. ఆయన ఓ క్యారెక్టర్ సృష్టించి చెప్పవలసింది అంతా స్క్రీన్ మీద చెప్పేసారు. అర్ధం చేస్కోవడం మన వంతు అన్పించింది.




స్క్రీన్ రైటింగ్ తెలిసిన దానిగా బాలు ఓ ట్రాజిక్ హీరో అని తెలుసు.

రకరకాల కథానాయకులలో ట్రాజిక్ హీరోలు ఓ కేటగిరి.

వీళ్ళు స్వతహా మంచి వాళ్ళు. కానీ వీళ్ళలో ఓ లోపం ఉంటుంది .. అదే వారి పతనానికి దారి తీస్తుంది. దీన్నే ఫేటల్ ఫ్లా (fatal flaw) అంటారు.

అదేంటో జనాలకి కూడా ఈ characters నచ్చుతారు. నచ్చడం కరెక్ట్ మాట కాకపోవచ్చు. జనాల్ని ఈ characters బాగా ఎఫెక్ట్ చేస్తారు.

దేవదాసు నే తీస్కోండి ... ఎన్ని సార్లు తీస్తే అన్ని సార్లు చూసేస్తూ ఉంటారు దేవదాసు ని. ప్రతి తరానికోసారి దేవదాసు తీయాల్సిందే!

లోపాలు గల ఇంకో హీరో ... హామ్లెట్. గ్రీకు డ్రామాల్లో ఇలాంటి వాళ్ళు కోకొల్లలు. 'చివరకు మిగిలేది' లో దయానిధి కూడా అంతేగా.

మళ్ళీ మన బాలు విషయానికొస్తే కేవలం సినిమా కోసం సృష్టించిన tragic హీరో పాత్ర ఇతను.
(సాహిత్యం, నాటకం నుంచి వచ్చిన వాడు కాదు) ఇతని fatal flaw నాకు ఒకటి కాదు .. బోల్డు కనిపించాయి.


యువ బాలు దగ్గర మొదలు పెడదాం. ఇతనికి డాన్స్ అంటే పిచ్చి ఇష్టం. కానీ ఎంత సేపూ 'ఇంకా నేర్చుకోవాలి' అంటూ ఉంటాడు. ప్రదర్శనల గురించి ఆలోచించడు. వంటల బాబాయి డైలాగు కూడా ఉంటుంది పెళ్లి లో 'జన్మంతా వాడికి నేర్చుకోడానికే సరిపోదు' అని. మాధవి తండ్రి 'ఇతను ఇంత గొప్ప డాన్సర్ అని తెలిస్తే పెళ్లి లో ఇతని performance యే  పెట్టించేవాళ్ళం కదా?' అన్నప్పుడు బాలు 'అంత వరకూ రాలేదండి .. ఇంకా నేను నేర్చుకుంటున్నాను' అంటాడు. మాధవి 'You are too modest' అంటుంది కూడానూ!


ఇతన్ని కర్తవ్యోన్ముఖుడ్ని చెయ్యడానికి పక్కన ఓ రఘు కావాలి. తల్లి ఇచ్చిన పాతిక రూపాయలు తీసుకుంటాడు. 'సిగ్గు లేదు? ఏదో ఉద్యోగం చేసి నువ్వు ఆవిడకి సంపాదించి ఇవ్వాల్సింది పోయి ఆవిడ ఇచ్చిన డబ్బులు తీస్కుంటావా?' అనే దాకా అతనికి ఉద్యోగం చెయ్యాలన్న దృష్టి లేదు. పాతికేళ్ళ తర్వాత శైలజ కి డాన్స్ నేర్పించడం కోసం అతన్ని ఊరు తీసుకెళ్తుంటే  'ఎవరికో నేను డాన్స్ నేర్పించడమేంటి?' అని రైలు దిగెయ్యబోతుంటే మళ్ళీ ఈ రఘు నే అతనికి కర్తవ్య బోధ చెయ్యాల్సి వస్తుంది.

తనకి ఎంతో ఇష్టమైన కళ  ని pursue చెయ్యడానికే ఇతనికి ఎవరో ఒకరు moral support కావాలి ... ముందు తల్లి అన్నాడు. తల్లి పోయాక మాధవి.  మాధవి వెళ్ళిపోయాక ఇంక కళ కి నీళ్ళొదిలేసాడు. నిజానికి కళ తల్లి ప్రేరేపించినందువల్ల నేర్చుకోలేదు. ఆమె కి అసలు ఆ డాన్స్ పేర్లే తెలియవంటుంది. అసలు కథక్ నేర్చుకోవడం లో పడి తల్లి ఊరికి వచ్చింది కూడా తెలీకుండా పోతుంది! చివరి నిముషం లో రైల్వే స్టేషన్ కి వెళ్తాడు.

ఇంక మాధవి. మాధవి అతనికి పరిచయం అవ్వక ముందునుంచే అతను కళా సాధకుడు. అసలు మాధవి కి అతని లో నచ్చినది, ఆమెని అతనికి చేరువ చేసింది కూడా అతని కళే. నృత్యం మీద అతనికున్న పట్టు, అతని passion. అంత ఇష్టమైన కళ ని ఎలా వదిలేసుకున్నాడు?

ఇంకో లోపం self -pity ... మాధవి, బాలు టైమర్ తో తీస్కున్న ఫోటో సరిగ్గా రాకపోతే 'మీ ఫోటో లో కూడా రాకపోతే ఇదేదో శాపమే' అంటాడు. అప్పటికే ఆమె కొన్ని అద్భుతమైన పిక్చర్స్ తీసి ఇచ్చింది కూడానూ! ఢిల్లీ డాన్స్ ఫెస్టివల్ చూడాలంటే నుదుటి రాత ని చూపించి 'ఉండాలండి' అంటాడు. తానో విధి వంచితుడిగా ఫీలవుతాడు సినిమా మొత్తం.

ఇక అతని అతి పెద్ద flaw ... అవకాశాలను అందుకోకపోవడం.

సినిమా డాన్స్ డైరెక్టర్ దగ్గర ఉద్యోగం గురించి నేను మాట్లాడను. అసలు అది బాలు కి తగ్గ ఉద్యోగం కానే కాదు.

Art critic కూడా అతనికి suitable job కాదు. అతను అతని కళ లో ఫెర్ఫార్మర్. Performers critics కాలేరు.

శైలజ గురువు అతనికి దొరికిన అవకాశాలన్నిటి లో కొంచెం బెటర్. 

మాధవి చెప్పిన proposal కూడా బాగుంటుంది. తల్లి పోయాక అతను డల్ గా ఉంటే సింగర్ గా తను, పాటల రచయిత గా  రఘు,డాన్సర్ గా బాలు ఓ ట్రూప్ గా ఏర్పడదామంటుంది మాధవి. అది పెద్దగా పట్టించుకోడు బాలు.


అన్నిటికంటే బెస్ట్ ఐడియా స్వయంగా బాలుదే. ఇండియా లో నృత్య రీతులన్నీ కలిపి భారతీయ నృత్యం అని ఓ నృత్య శైలి ని ప్రారంభిద్దామని. అది అతను విడవకండా సాధించి ఉంటే ఎంత బాగుండేది?

నాకు అన్నిటికంటే బాధ కలిగేది బాలు తల్లి పోవడం కాదు. అతను ఆ ఢిల్లీ డాన్స్ కచేరి కి వెళ్ళకపోవడం. ఆ నృత్య ప్రదర్శనని ఆవిడకి అంకితం చేసుంటే ఎంత బాగుండేది? ఆవిడ ఎక్కడున్నా ఎంత ఆనందించేది! పైగా అతని తల్లి పేరు, ఇతని పేరు మార్మోగిపోయుండేది! (సినిమా అక్కడే అయిపోయేది ... అది వేరే విషయం.)

అతను తాగుబోతు అయిపోయాడు అనేది నా లోపాల లిస్ట్ లో రాయను. వ్యసనం ఏదైతే నేమి. అసలు వ్యసనం వైపు నడిపేది ఓ escapism ... పలాయన వాదం. ఇది బాలు లో లోపం.

ఈ మొత్తం సినిమాలో ఆదర్శవంతమైన వ్యక్తి మాధవి. ఆమె జీవితమే తీస్కోండి. అసలు ఆమెని మొదట చూసినప్పుడు ఆమె పెళ్లి పెటాకులైంది ఎవరైనా అనుకుంటారా? నా మొగుడు నన్నొదిలేసాడురా దేవుడా అని ఆమె ఏడ్చింది లేదు ... చక్కగా అందంగా శుభ్రంగా తయారవ్వకుండా ఉన్నదీ లేదు .. బాధ పడింది లేదు. తను inspired గా ఉంటూ తన చుట్టూ ఉన్న వారిని కూడా inspire చేసింది మాధవి. పాతికేళ్ల తర్వాత బాలు వ్యసనపరుడు అయిపోయాడు అని తెలిసాక కూడా రఘు తాత్వికంగా ఏదో అంటే 'నిస్సహాయంగా కాలానికి ధర్మానికి వదిలెయ్యకూడదు' అని పట్టుబట్టి బాలు తో బాటు రఘుకి, సుమతి కి కూడా మంచిదయ్యే ఉపాయం ఆలోచిస్తుంది.

శైలజ తల్లి ని తప్పు పట్టి తనో, బాలునో తేల్చుకోమంటే సమాజానికి వెరవకుండా, mother సెంటిమెంట్లు పెట్టుకోకుండా 'ఎవరికి నా సాయం అవసరమో అక్కడే నేను ఉంటాను' అనేస్తుంది.

అసలు రఘు కూడా అంతే. స్నేహబంధాన్ని చివరి దాకా నిర్వహించాడు ... however difficult it was with Balu.

ఇంత మంది unconditional support గా ప్రేమించారు బాలు ని. అందరూ కోరుకుంది ఒక్కటే. అతన్ని స్టేజి మీద చూడటం. అసలు అతనకి కావాల్సింది కూడా అదే. చివర 'ఆ బాలకృష్ణుడ్ని నేనే' అన్నప్పుడు జనాలు చప్పట్లు కొడితే అప్పుడు బాలు కి ఈ విషయం తెలుస్తుంది.


కానీ అప్పటికే అతని జీవితం అయిపోయింది. ఇదే సీన్ లెక్కకి అందనన్నో సారి చూసిన నా గుండె మరో సారి పగిలిపోయింది. 

Friday, September 14, 2018

కొండలలో నెలకొన్న ..

ఒకే ఒక సారి ... రెండేళ్ల క్రితం ట్రెక్కింగ్ కి వెళ్లాను. 

ఓ ఆదివారం పొద్దున్న. ఖాజాగూడ హిల్స్ (హైదరాబాద్) లో.  

నాలుగు గంటల ట్రెక్. ఆరు... ఆరున్నర కి మొదలు పెడితే పది.. పదిన్నర కి పూర్తయింది. 

అప్పటికి కొన్ని నెలల నుంచి Hyderabad Trekking Club వారి సోషల్ మీడియా పేజెస్ ని తెగ ఫాలో అయిపోతున్నా నేను (ఇప్పటికీ!) 

నా లైఫ్ లో ఉన్న ఓ అసంతృప్తి ఏంటంటే నేను ఎక్కువ outdoor activities చేసే అవకాశం దొరకలేదు. 

స్కూల్ టైం తర్వాత రోడ్ల మీద పడి ఆడుకున్నది లేదు. (చాలా ఇష్టమైనా కూడా!) 

ప్రకృతి ని దగ్గరగా చూసింది అసలు లేదు.... సిటీ లోనే పెరగడం వల్ల. 

నాకు తెలిసిన ప్రకృతి మా పెరట్లో మందార మొక్క, కొన్ని పక్షులు (పేర్లు తెలియవు.. చెప్పాగా ప్రకృతి తో పరిచయం లేదని), ఇంటి ముందు చెట్టు మీద సీతాకోక చిలుకలు, వీధి లో కుక్కలు, పక్కింటి పిల్లి, మా ఇంటి మీద వాలే కాకి. 😒

పార్క్స్ ఉన్నాయి. కానీ మన సిటీ లో కొన్ని పార్కులే U certificate. మిగిలిన వాటిలో ప్రేమ పక్షులు, ఛిఛోరా గాళ్ళు.  

ఒక్కోసారి భలే suffocating గా అనిపిస్తుంది నాలుగు గోడల మధ్య. అలా అనిపించినప్పుడు ఈ Hyderabad Trekking Club ఫేస్బుక్ పేజీ కెళ్ళి వాళ్ళు ట్రెక్కింగ్ కి వెళ్లి పోస్ట్ చేసిన పిక్చర్స్ చూసే దాన్ని. 

రీసెర్చ్ చేసి ట్రెక్కింగ్ కి ఏం కావాలో తెలుసుకున్నాను. 

comfortable footwear .... sports shoes లాంటివాటి కంటే ట్రెక్కింగ్ కోసమే రూపొందించిన shoes ఉంటాయి అని తెలిసింది.. అవి sports shoes కంటే కొంచెం బరువు గా ఉంటాయి. సోల్స్ కింద గ్రిప్ బాగా ఉండేలా ఉంటాయి. ఇవి కూడా హైదరాబాద్ లో దొరుకుతాయి అనగానే I felt so proud of my city! 

Decathlon అని ఓ స్టోర్ ఉంది .. (నాలుగైదు బ్రాంచెస్ ఉన్నాయి ఒక్క హైద్రాబాద్ లోనే). ఈ స్టోర్ కి వెళ్లడమే ఓ అనుభవం. ఏ స్పోర్ట్ కి ఆ స్పోర్ట్ .. వాటికి సంబంధించిన షూస్, పరికరాలు, దుస్తులు అన్నీ ఉన్నాయి అక్కడ! 

నేను ట్రెక్కింగ్ సాండల్స్ తీసుకున్నాను ..4000 రూపాయలు పెట్టి. నా దగ్గర ఉన్న చెప్పుల్లో అత్యంత ఖరీదైనవి ఇవే! 

ఏ పని కి ఆ వస్తువు కొనడం నాకు ఇష్టమే కానీ ఇంత ఖరీదు పెట్టి కొని ఇంకోసారి ట్రెక్కింగ్ కి వెళ్లకపోతే గిట్టుబాటు అవుతుందా? అని నా మిడిల్ క్లాస్ బుర్ర నసిగింది. దీన్ని మామూలు అప్పుడు కూడా వేసుకోవచ్చులే అని దాన్ని సమాధానపరిచేసాను. 

ట్రాక్ పాంట్స్ మాత్రం ఏదో సేల్ లో మూడు వందల రూపాయలకి తీసేస్కున్నాను. భలే డబ్బులు సేవ్ చేసేసినట్టు ఫీల్ అయిపోయాను. 

ఆరింటికి రిపోర్ట్ చెయ్యాలి ఓ చోట అన్నారు. ఓ ఫ్రెండ్ ని వేస్కొని వెళ్ళిపోయాను. మేమే ఎర్లీ! ఆదివారం సూర్యుడు నన్ను ఆరింటికి చూసి ఆశ్చర్యపోయాడు. 

ఖాజాగూడ హిల్స్ తో అంత పరిచయం లేదు. కింద కార్ పార్క్ చేస్కున్నాము. ఒక కొండ కనిపిస్తోంది. దర్గా ఉంది కొండ మీద. మెట్లు కూడా ఉన్నాయి. 

కొంత మంది అప్పటికే మెట్ల మీద exercises చేసుకుంటున్నారు. 

I was so excited. I didn't know what to expect. ఏదైనా భయపడకూడదు అని మాత్రం అనుకున్నాను. 

Hyderabad Trekking Club నుంచి ఓ అబ్బాయి... ఈ ట్రెక్ లీడర్ .. మమ్మల్ని అందర్నీ ఓ సర్కిల్ లో నుంచోబెట్టి ఒక్కొక్కరిని ఒక్కో warm up exercise movement చెయ్యమన్నాడు .. ఒకళ్ళు చేసింది మిగిలిన అందరూ అనుకరించాలి. So far so good.

ట్రెక్ లీడర్ లీడ్ చేస్తూ కొండ మొదలు దగ్గర ఓ పొద లోంచి దారి తీసాడు. 

పొదలోంచి బయటకి రాగానే కొండ. 

నేను పరమ beginner ని కాబట్టి నాకు కొండ ఇలా ఎక్కాలి అని చూపించి .. next time ఎక్కుదురు గాని అంటాడేమో .. నేను మెట్ల మీద నుంచి కొండ పైకి వెళదాం అని అనుకుంటున్నా. 

కానీ అతనికి అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. 

కొండ steep గా ఉంది. ఏటవాలు గా ఉంటే బాగుండేది అనుకున్నా మనసులో. కానీ నాతోటి వాళ్ళు చకచకా కొండెక్కేస్తున్నారు. 

వాళ్ళు చెప్పిన పద్ధతి లో ..కొండ మీద weight వేస్తూ మోకాళ్ళు ఆన్చకుండా అరచేతుల తో, కాళ్ళ తో రెండడుగులు ఎక్కా . Actually it was easy. కానీ కొంచెం పైకి వెళ్ళగానే భయం వేసింది. జారిపోతానేమో! భయం నిజమైంది .. రెండు అంగుళాలు కిందికి జారగానే 'నేను జారిపోతున్నాను!' అని మా లీడర్ కి చెప్పా .. అతను నన్ను కిందికి దిగి మెట్ల మార్గం లో రమ్మంటాడేమో అనుకున్నా. 

అలాంటిదేమీ జరగలేదు. 

నా కాలి కింద అతని పాదం కాలు మెట్టు లాగా పెట్టి ఎక్కమన్నాడు. ఇంక పైకెళ్ళడం తప్ప దారి లేదు అని తెలిసి డ్రామాలు ఆపి టెక్నిక్ పట్టుకొని ఎక్కేసాను. అప్పటికే కొంత మంది రెండు సార్లు ఎక్కేసారు! 


అది నేనే. అవలీలగా నిటారు గా ఎక్కుతున్న వ్యక్తి మా ట్రెక్ లీడర్. 

కొండ పైకి ఎక్కి ఓ జారిపోని .. చదునైన ప్లేస్ చూసుకొని కూర్చుని చూసా. 

రెండు దృశ్యాలు కనిపించాయి 

1. నేను ఎక్కిన కొండ ... ఇంత steep గా ఉంది! ఎక్కింది నేనేనా? 
2. ఎదురుగా నగరం .. కిటికీ లోంచి చూసినట్టు  కాకుండా Imax పెద్ద Screen లాగా పరుచుకొని ఉంది!   




నేను ఇంత భావుకత్వంగా ఆలోచించుకుంటూ... next ఏం చేయిస్తారో అనుకుంటూ ఉండగా చెప్పారు .. ఇదే కొండ దిగాలి అని. 

ఈ సారి కూడా మెట్ల మార్గం లో కాదు. (అసలు మెట్లని ఆ రోజు మేము వాడనే లేదు) 

ఇదే steep కొండ.... జారిపోకుండా ఎలా దిగాలి? దానికి కూడా టెక్నిక్ ఉంది. చెప్పారు. 

పాదం కొండ మీద ఏటవాలు గా పెట్టి zig zag గా నడుస్తూ దిగాలి. 

ఒకబ్బాయి చివరి దాకా బాగా దిగి .. కొండ చివరికి వచ్చేసాం కదా అని తొందరపడ్డాడు .. పొదల్లో కి జారిపడ్డాడు. 

పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు కానీ నాకు ఓ పాఠం నేర్పాడు. 

ప్రతి అడుగు వేసే అప్పుడు ఆలోచించాల్సింది next అడుగు గురించే. అంత కన్నా దూరం ఆలోచిస్తే జారిపోతాం. Living moment to moment అన్నమాట. 

నేను కొంతే దిగాను. మళ్ళీ ఎక్కేసి ఇంకో చిన్న గుట్ట ఎక్కేసరికి దేవుడు కనిపించాడు .. అక్షరాలా .. అక్కడో గోపురం ఉంది మరి! ఇక్కడ కూడా ఓ బ్రహ్మాండమైన వ్యూ! 




ఇక్కడ నాకు ఇంకో కొత్త activity పరిచయం అయ్యింది .. caving. పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఏర్పడిన సందుల్లోంచి బయటికి రావడం. 

ఇది అస్సలు నేను చెయ్యను అనేస్కున్నా మనసులో. నాకెప్పుడూ భయం ఆ పెద్ద పెద్ద రాళ్లు కదిలి పడిపోతాయేమో అని. ఇంకో భయం .. ఆ సందుల్లో మనం పట్టమేమో అని... లేదా ఇరుక్కుపోతామేమో అని. ఇంకో భయం .. పాములు, తేళ్లు ఉంటాయేమో అని. 

మా కంటే ముందు మా లీడర్ ఆ సందులోంచి వెళ్లి బయటికి వచ్చి టెస్ట్ చేశాకే మమ్మల్ని ట్రై చెయ్యమంటున్నాడు. 

ఆ సందు  మొదలు విశాలంగానే ఉంది. సరే అని దూరిపోయాను. వెళ్లగా వెళ్లగా హైట్ బాగా తగ్గిపోయింది. ఆ బిలం లోంచి బయటికి రావాలంటే పూర్తి గా పడుకుండి పోవాలి. వీపు మీద పాకుతూ మాత్రమే బయటికి రాగలం. మట్టి, దుమ్ము ..ఇవేమీ అప్పుడు గుర్తు రాలేదు. బయటికి వచ్చెయ్యాలి. అంతే. వచ్చేసాను. మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. 

ఇదేదో ఈజీ గా ఉందే అనిపించింది. 

కానీ అప్పుడు నాకు తెలీదు .. ఏం రాబోతోందో. 

ఇంకో సందు .. ఇది చాలా పల్చటి గాప్స్ తో ఉంది... ఎలాగోలాగా లోపలి వెళ్లాం కానీ బయటికి వచ్చే దారి కింద లేదు .. పైన ఉంది!

మన శరీరాన్ని మనమే రాళ్ల ఆసరా తో, పాదాల ఆసరా తో పైకి తోసుకుంటూ వెళ్ళాలి. అక్కడ చెయ్యి అందించడానికి లీడర్, మిగిలిన ట్రెక్ టీం ఉన్నారు. కానీ అలా పైకి రావడం చాలా కష్టమైంది. పోనీ వెనక్కి వచ్చిన దారినే వెళ్ళిపోదాం అంటే .. నా వెనకాల క్యూ ఉన్నారు! ఇద్దరు పక్కపక్క పట్టే జాగా లేదని వేరే చెప్పక్కర్లేదు. 

నన్ను నేను పైకి తెచ్చుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఒక సారి ట్రై చేసాను .. కాలు స్లిప్ అయింది .. రాళ్లు గీసుకున్నాయి. మంచిదయింది. దెబ్బ తగులుతుంది అనే భయం పోయింది.  మళ్ళీ ట్రై చేసాను. మొత్తానికి అస్సలు సాధ్యం కాదు అని నేను అనుకున్నది సాధ్యం అయింది. (నేను ఈ రాళ్ళ మధ్య ఉండిపోతే పరిస్థితి ఏంటి? అని కూడా ఆలోచనలు వచ్చాయి!)

ఒక సారి వచ్చాక బాబోయ్ ఇంకో సారి ఈ caving చెయ్యకూడదు అనుకున్నాను .. కానీ ఆ satisfaction మాత్రం గొప్ప అనుభూతి.


మొహం మీద satisfaction తక్కువ రిలీఫ్ ఎక్కువా కనిపిస్తోంది కదూ😉


స్లిప్ అయినప్పుడు నా ట్రాక్ ప్యాంటు చిరిగింది. చెప్పులు మాత్రం చెక్కు చెదరలేదు. ఇంకో పాఠం... కొన్ని చోట్ల లోభిత్వం చూపించకూడదు. 

అక్కడి నుంచి ఇలాగే కొండలు ఎక్కుతూ, ఫోటోలు తీసుకుంటూ (ట్రెక్కింగ్ ట్రిప్స్ కి ఎక్కువమంది ఫోటోగ్రాఫర్స్ వస్తూ ఉంటారుట .. ఇంత అందమైన దృశ్యాలు వాళ్ళకి ఇంకేవిధంగా దొరుకుతాయి మరి?)  ముందుకెళ్లాం. అక్కడ ఓ కొండ అచ్చు జారుడు బండ లాగా ఉంది ... మా లీడర్ ఒకే కండిషన్ పెట్టాడు .. అరుస్తూ జారాలి అని. ఒకరి తర్వాత ఒకరం పిల్లల్లాగా అరుస్తూ జారుతుంటే భలే మజా వచ్చింది! 

నేను మొదట్లో avoid చేసాను కానీ తర్వాత తర్వాత కొండలు దిగాను .. ఒక రాయి మీద నుంచి ఇంకో రాయి మీదకి వెళ్లడం (కొంత మంది జంప్ చేశారు .. కొంత మంది చేయి ఊతం తీసుకున్నారు .. నేను పాకుతూ వెళ్లాను 😆) ..ఇలాంటివి చేసాక మా నాలుగు గంటల ట్రెక్ పూర్తయింది. 




వెళ్లిన దారిలో కాకుండా వేరే దారిలో కిందకి దిగాం. 

ప్రకృతి ని చూద్దాం అనుకున్నా. కానీ ప్రకృతి అమ్మ లాగే నన్నుచేతులతో ముట్టుకోనిచ్చింది.. చుట్టూ తిరగనిచ్చింది .. ఆడుకోనిచ్చింది ..బోల్డు పాఠాలు నేర్పింది .. జ్ఞాపకాలు మూటకట్టి ఇచ్చింది. 

HTC వాళ్ళు దీనికి వసూలు చేసిన డబ్బు ఎంతో తెలుసా? 50 రూపాయలు. నా లైఫ్ లో best deal ఇది! 

దేవుడు కొండలలో నెలకొని ఉండటానికి ఇదే కారణమట కదా? క్షేత్ర యాత్రలు ఒకప్పుడు ఇలాగే ఉండేవట కదా? కొండలు ఎక్కి...  గుట్టలు ఎక్కి ... తీర్ధాల చల్లని నీరు తాగుతూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ ... అలా కొండ పైకి చేరుకున్న వారు గుడి కట్టేసి ఉన్నా బాధ పడేవారు కాదట! ఎందుకంటే the journey is the destination! 

ఈ రెండేళ్లలో ఇంకో సారి ట్రెక్కింగ్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే .. ఒక సారి వెళ్లొచ్చాక ఏవిటో నాకు భయాలు ఎక్కువయ్యాయి .. already జరిగిపోయిన ట్రెక్ లో జరగని ప్రమాదకరమైన possibilities తలుచుకొని కొన్ని రోజులు భయం వేసింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇంకో సారి ట్రెక్కింగ్ కి వెళ్ళాలి అనిపిస్తోంది. 

వెళ్తాను. 

Friday, September 7, 2018

Happy (Self) Teacher's Day!!!

నాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ అంతగా రాదు. మా నాన్న గారు, మా తాతగారు, మా మావయ్య ఇంగ్లీష్ ఝాడించేసేవారు. వాళ్ళని అందరూ గొప్పగా చూసేవారు. మా నాన్నగారైతే ఇంగ్లీష్ లో crosswords, word puzzles ఈజీ గా పూర్తి చేసేస్తూ ఉంటారు. నాకు ఇదో super power లాగా అనిపించేది. ఇంగ్లీష్ బాగా నేర్చేసుకొని పేరు తెచ్చేసుకోవాలి అని నిర్ణయించేస్కున్నాను.

నా 15th సంవత్సరం అప్పుడు మొదలు పెట్టాను .. ఇంగ్లీష్ నేర్చుకోవడం .. నా అంతట నేనే. 

రోజూ ఇంగ్లీష్ newspaper చదివేదాన్ని. ఎక్కడ కొత్త word కనిపించినా వెంటనే దాన్ని ఎలాగో అలాగా వాడెయ్యాలని చూసేదాన్ని. (ఒక్క సారి ఓ పదం వాడగానే నా vocabulary లో అది భాగం అయిపోతుంది  అని అనుభవం మీద తెలుసుకున్నాను). Elocutions లో నా స్పీచ్ లు నేనే రాసుకొనే దాన్ని. వీలైనంత ఎక్కువ మాట్లాడేదాన్ని (ఇంగ్లీష్ లో 😁). నా school bag లో ఎప్పుడూ ఓ డిక్షనరీ ఉండేది. డాడ్ తో కలిసి word puzzles పూర్తి చెయ్యడం మొదలుపెట్టాను. ఇంగ్లీష్ newspapers కి ఆర్టికల్స్ రాసి పంపేదాన్ని. (ఒకసారి పబ్లిష్ అయ్యింది కూడా!) ఏదో ఒకటి రాస్తూ ఉండేదాన్ని ... నా డైరీ కూడా ఇంగ్లీష్ లో రాసేదాన్ని.

కొన్నేళ్ళకి, ఒక డేట్ అని చెప్పలేను కానీ ఇంగ్లీష్ పట్టుబడింది. కొంచెం అందరికీ అర్ధం అయ్యే పదాలు వాడు అని మావాళ్లు బ్రతిమాలించుకొనే స్థితి కి నా ఇంగ్లీష్ భాష వచ్చింది. 

ఇది నేను చాలా ఎంజాయ్ చేసిన process .. process of self-teaching. 

ఫ్రెండ్స్ తో మాట్లాడితే నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఏదో ఒక విద్య స్వయంగా నేర్చుకోవాల్సి వస్తుంది/నేర్చుకుంటారు. 

మా ఫ్రెండ్ ఒకబ్బాయి అరగంట లో తనంతట తనే కార్ నడపడం నేర్చుకున్నాడు. 

మా అమ్మ గారు వంట తనంతట తనే నేర్చుకున్నారంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని .. she is an amazing cook! (ఇది చాలా మంది అమ్మల పట్ల నిజం కూడానూ!) 

పల్లెటూళ్లలో ప్రత్యేకంగా స్విమ్మింగ్ క్లాసెస్ ఏమీ ఉండవు .. అయినా పిల్లలు ఈదేయడం నేర్చేసుకుంటారు .. వాళ్ళంతట వాళ్లే!

సంగీతం లో బేసిక్స్ కూడా రాకుండా కేవలం పాటలు విని, నేర్చుకొని బ్రహ్మాండంగా  పాడేవాళ్ళని ఎంతమందిని చూడలేదు?

ఈ self-education, self-teaching కి ఓ పేరు ఉంది ... ఆటోడిడాక్టిజం ... autodidactism. (చెప్పానా? పెద్ద మాటలు వాడే చెడలవాటు ఉందని!)

చరిత్ర లో మనకి తెలిసిన చాలా మంది  గొప్ప గొప్ప కళాకారులు, దేశాధినేతలు, ఇంజినీర్లు,  కొత్త విషయాలు కనిపెట్టిన వారు ఆటోడిడాక్టులే! తమంతట తాము నేర్చుకున్నవారే! (వారి లిస్ట్ ఇక్కడ చదువుకోవచ్చు.) 

మనకి మనమే టీచర్స్ అయ్యే ఈ process చాలా బాగుంటుంది. ఇందులో లాభాలు ఏంటంటే ప్రత్యేకించి స్టడీ టైం అంటూ ఉండదు. నిరంతర అధ్యయనం నడుస్తూ ఉంటుంది. మనకే interest అయిన సబ్జెక్టు ని నేర్చుకోడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ప్రత్యేకంగా  motivation అవసరం ఉండదు. బట్టీలు పట్టాల్సిన అవసరం ఉండదు .. అప్పజెప్పే అవసరం అసలు ఉండదు. బెత్తం దెబ్బలు ఉండవు. (కానీ తిట్లు బాగానే పడతాయి మనమీద మనకే!). ఒకళ్ళు మనకి రిపోర్ట్ కార్డు ఇవ్వడం ఏంటి .. మనకి ఆ విద్య వచ్చిందో రాలేదో కళ్ళ ముందు తెలిసిపోతూ ఉంటుంది.  

ఇంటర్నెట్ వచ్చాక ఎన్నో విషయాలు టీచర్ లేకుండా మనంతట మనమే నేర్చుకొనే అవకాశాలు ఎక్కువయ్యాయి. (ఒక రకంగా చూస్తే ఇంటర్నెట్ ఓ పెద్ద గురూ గారు!) చిన్న పిల్లలు ఇంటర్నెట్ చూసి యాప్స్ డెవెలప్ చేయగలుగుతున్నారు. ఏకలవ్యుడి example ఉండనే ఉంది!  Interesting fact: కర్ణాటక సంగీతం లో త్యాగరాజ పంచరత్నాలలో 'కనకన రుచిరా' అనే కృతి గురువు ద్వారా నేర్పించరు. తమంతట తామే శిష్యులు నేర్చుకోవాలి. (దీనికి కారణమైన కథ ఇంకోసారి ఎప్పుడైనా). మన ఫోటోలు మనమే తీసేసుకుంటున్న టైం లో self-teaching పెద్ద విషయం కాదేమో. (అసలు ఇది సరైన ఉపమానమేనా?)

అవసరమో, ఉత్సుకతో ... self-teaching వైపుకి తోస్తుంది మనని. ఒక్కోసారి టీచర్స్ అందుబాటులో లేకపోవడం/afford చేయలేకపోవడం కూడా కారణం అవుతుంది. 

మనంతట మనం నేర్చుకోడానికి, అదే విద్య ఓ టీచర్ ని పెట్టి నేర్చుకోడానికి తప్పకుండా తేడా ఉంటుంది. కానీ ఇంకో option లేనప్పుడు (ఉన్నా) self-teaching is one of the most effective ways of learning. 

ఎందుకో ఒక్కోసారి ఇది వర్కవుట్ అవ్వదు. నా ఇంగ్లీష్ ప్రాసెస్ ని maths కి apply చేసాను కానీ పెద్ద లాభం లేక పోయింది. మా ఫ్రెండ్ లాగా కార్ ఓ అరగంట నేర్చుకోవడం కూడా వర్కవుట్ కాలేదు. (ఇద్దరు టీచర్లు నేర్పించినా అది వర్కవుట్ కాలేదనుకోండి .. అది వేరే విషయం). మనకి స్వతహా instincts ఉన్న విద్యలు త్వరగా వస్తాయా? దీని మీద నేను ఇంకా రీసెర్చ్ చెయ్యవలసిన అవసరం ఉంది. 

అలాగే కొన్ని విద్యలు పర్యవేక్షణ లేకుండా నేర్చుకోకూడదేమో. Self-taught డాక్టర్ దగ్గరకి ఎవరు వెళ్తారు చెప్పండి?

ఇలాంటి కొన్ని exceptions తప్పించి teaching yourself అనేది రుచి చూడవల్సినదే. అసలు ఒక విషయం లో జ్ఞానం ఆర్జించడం అనేదే ఓ ఉత్తమ సంకల్పం. ఎవరి పేరు మీద ఈ టీచర్స్ డే జరుపుకుంటామో ఆయనే   అన్నారు 'A life of joy and happiness is possible only on the basis of knowledge and science' అని. 

ఈ జర్నీ లో మనకి మనమే బాధ్యులం. కొత్త విషయాలు నేర్చుకుంటూ, పడుతూ... మళ్ళీ మనమే లేస్తూ ... మధ్య మధ్య లో 'దారి ఇదేనా?' అని డౌట్లు పడుతూ ... తప్పిపోయామేమో అనుకున్నప్పుడు అనుకోని వైపు నుంచి సహాయం అందినప్పుడు రిలీఫ్ ఫీలవుతూ, తప్పులు చేస్తూ, చిన్నబోకుండా తప్పులు ఒప్పుకొని బట్టలు దులుపుకొని మళ్ళీ నడుస్తూ .. ఈ దారిలో ఒంటరినేమో అని భయపడిపోతూ ... ఏకాంతాన్ని ఎంజాయ్ చేస్తూ .. చివరికి ఆ విద్య పట్టులోకి వచ్చేసరికి తెలుస్తుంది ... ఈ జర్నీ మొదలు పెట్టినప్పుడు వ్యక్తి వేరు ... గమ్యం దగ్గర నుంచున్న వ్యక్తి వేరు అని. మన మీద మనమే ఫస్ట్ రాంక్ సాధించడం ఓ గొప్ప అనుభూతి! Proud of myself అంటారే ... అలాగ! 

ఇలా నేర్చుకున్న విద్య తనకి, (కొన్ని సందర్భాల్లో) నలుగురికీ ఉపయోగపడినప్పుడు ఆ ఆనందమే వేరు! 

ఇంతకీ నా తాపత్రయం ఏంటంటే టీచర్స్ డే కి మనకి మనం కూడా 'హ్యాపీ టీచర్స్ డే' చెప్పుకోవాలని! 

దీనివల్ల మన టీచర్లకి గానీ, ఈ టీచర్స్ డే స్పిరిట్ కి గానీ ఎటువంటి హాని కలగదని నా గ్యారంటీ. 

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నమ్మి, ప్రచారం చేసిన అద్వైత వేదాంతానికి self-education కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. 

'ఆత్మ, పరమాత్మ వేరు కాదు' అంటుంది అద్వైతం. జ్ఞానాలూ, రహస్యాలూ, శక్తులూ, సంకల్పాలూ, విధీ, ఇది స్ఫూరించకుండా చేసే అజ్ఞానం, అనిశ్చితి, భీతి, సందేహాలూ అన్నీ నీ అధీనంలో ఉన్నవే. 

అందుకే ... గురువూ నువ్వే .. శిష్యుడూ నువ్వే. 

Happy (Self) Teacher's Day!!!

Friday, August 31, 2018

స్రష్టకష్టాలు

అష్టకష్టాల గురించి మనందరికీ తెలుసు .. 

కష్టాల బ్యూటీ కాంటెస్ట్ లో అష్టకష్టాలకే కిరీటం తొడగబడుతుంది. 

కానీ వాటిని మించిన కష్టాలు కొన్ని ఉన్నాయి .. అవే కళాకారుల కష్టాలు .. కళను సృష్టించే కళా స్రష్టల కష్టాలు .. స్రష్టకష్టాలు. (అసలు కళ ఎందుకు అనేవారు చివరి పేరాగ్రాఫ్ చదివి మళ్ళీ ఇక్కడికి రావచ్చు) 

కళ ని జీవనశైలి గా, భుక్తి-ముక్తి మార్గంగా ఎంచుకొన్న వారి గురించే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. (వీకెండ్స్ లో కథక్  క్లాసెస్ కి వెళ్తున్న వారు, చిన్నప్పుడు ఎప్పుడో సంగీతం నేర్చుకుని ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళు, ఇంట్లో ఏదో ఒక musical instrument/డాన్స్ గజ్జెలు ఉన్నవారు, సరదా కి అప్పుడప్పుడూ బొమ్మలు వేసుకొనే వారు...  వీళ్ళని hobbyists అంటారు.)

స్రష్టకష్టాలు  = అష్టకష్టాలు  + ఇంకొన్ని కష్టాలు 

కష్టాల గురించి మాట్లాడుకొనే ముందు క్లుప్తంగా సుఖాల గురించి కూడా మాట్లాడుకుందాం (క్లుప్తంగా ఎందుకంటే కొన్నే ఉంటాయి కాబట్టి 😉)

కళ వల్ల తోటివారిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ఆ అమ్మాయి పాటలు బాగా పడుతుంది అనో, వాడు బాగా బొమ్మలు వేస్తాడు అనో స్కూల్ టైం నుంచీ వీరిని ప్రత్యేకంగా introduce చెయ్యడం జరుగుతూ ఉంటుంది. Performing arts అయితే ఇక చెప్పనే అక్కర్లేదు... స్టేజి మీద spot light లో ఉండే అవకాశం. సెలెబ్రిటీ స్టేటస్. యశస్సు. కళాకారులకి లభించే గొప్ప perks లో ఇది ఒకటి. అభిమానులు - మన కళని ఇష్టపడే మనుషులు .. మనం ఏది రాసినా, తీసినా, చేసినా తియ్యటి compliments తో అభిమానం పంచే వారు! బిరుదులూ సత్కారాలూ పురస్కారాలు, మీడియా లో ఇంటర్వ్యూలు... 

ఇంక ఏ ఇతర వృత్తి లో లేని attention ఈ రంగానికి ఉంది. 

కానీ తమాషా ఏంటంటే ఆ attention ఓ కళాకారుడి కష్టాల మీదకి ప్రసరించదు. 

కళని నమ్ముకుని జీవనం సాగించడం లో చాలా కన్నీళ్లు ఉన్నాయి. 

మాకు తెలుసు అన్నవారికి కూడా తెలియనివి ఉన్నాయి. 

ముందే చెప్పినట్టు గా ఇందులో అష్టకష్టాలు ఉన్నాయి ... 

అప్పు, యాచన, ముసలితనం, వ్యభిచారం, చోరత్వం, దారిద్య్రం, రోగం, ఎంగిలి భోజనం

కళను నమ్ముకోవడం లో మొదట వేధించే సమస్య Financial insecurity. కళ కి సంబంధించిన ఉద్యోగాలు చాలా తక్కువ. చాలా వరకూ art  teaching వైపు ఉంటాయి. వాటిలో job security ఉన్నవి ఇంకా తక్కువ. ఇంకొక ప్రమాదకరమైన పరిణామం ఏంటంటే ఇప్పుడు art = charity అన్నట్టు చూస్తున్నారు. కళాకారులు కూడా వేదిక లభిస్తే డబ్బులు అడగలేని పరిస్థితి. Opportunity ఇచ్చాము కాబట్టి డబ్బు ఇవ్వము అనే వైఖరి! సమాజం లో కూడా టికెట్టు కొని కళా ప్రదర్శన లకి వెళ్ళే కాలం చెల్లిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు, యాచన, దారిద్య్రం ఇవన్నీ పెద్ద ఆశ్చర్యకరమైన పరిణామాలేమీ కావు.

ముసలి తనం ... ఇది కళాకారులకి రెండు రకాలు. డబ్బులేని ముసలితనం ఒక ఎత్తైతే తమ ఆలోచనలు ప్రస్తుత తరానికి suit అవ్వక ఒక కళాకారుడు relevance కోల్పోవడం ... రెండో ముసలితనం - ఇష్టం లేకున్నా ఓ కళాకారుడిని forced retirement లోకి నెట్టేస్తుంది. ఇంకా ఎంతో చెయ్యాలనుకుంటాడు కళాకారుడు. కుదరదు అంటుంది కాలం. 

వ్యభిచారం - literally, figuratively దీని బారిన పడవలసి వస్తుంది కళలో... ఇష్టం లేకుండా, మనసు అంగీకరించకుండా డబ్బు కోసమో అవకాశం కోసమో. అంత ఆరాటం దేనికి? No చెప్పచ్చు గా అనచ్చు. కానీ అనద్దు ప్లీజ్. అంత కష్టమైన choice తీసుకున్నప్పుడే తెలియాలి .. వారు ఆ కళ పట్ల ఎంత passionate గా ఉన్నారో. 

చోరత్వం - ఏది పోయినా బాధే. కానీ నగలు, చీరలు, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఓ ఐడియా చోరీ అయితే ఇంక దాన్ని మర్చిపోవలసిందే. జీవితాంతం వేరే వారి పేరు మీద చెలామణీ అవుతున్న తన ఐడియా ని చూసి బాధ దిగమింగుకోవలసిందే. కోర్టులో కేసు వేయచ్చు కదా అనేవారు 'యాచన, దారిద్య్రం, అప్పు' అనే పేరా చూడుడు. 

రోగం - జరిగితే రోగం అంత సుఖం లేదన్నారు. ఒక కళాకారుడికి .. జరగదు. 

ఎంగిలి భోజనం - 'నా దగ్గరో కాన్సెప్ట్ వుందోయ్' అంటాడు డబ్బు పెట్టేవాడు. అది నా ఆలోచన కన్నా గొప్పదేం కాదు. Actually, అస్సలు గొప్పది కాదు. కానీ యెదుటనున్నవాడు డబ్బు పెట్టేవాడు. ఈ ఎంగిలి ఆలోచన ని నేను స్వీకరించాలి. నిజమే .. నో చెప్పే హక్కు ఉంది ... కానీ నో చెప్పే luxury ఉండద్దూ? 

ఇవి కేవలం అష్టకష్టాలు ... 

ఇవి కాక ఓ సగటు కళాకారుడు అనుభవించేవి 

 Indifference - తన కళ పట్ల సమాజం లో ఉన్న ఉదాసీనత ఒక కళాకారుడిని బాగా కుంగదీస్తుంది. 72 మేళకర్తల్లో కృతులు సాధన చేస్తాడు ఓ సంగీతజ్ఞుడు. 'carnatic music ఎవరు వింటున్నారండీ' అని తీసిపారేస్తే అతని కళ ఏం కావాలి? ఇప్పుడు సమాజం లో భారతీయ కళల పట్ల ఉన్న వైఖరి ఇదే కదా .. డబ్బు, కీర్తి, బిరుదులు .. వీటన్నిటి కంటే ముందు కళాకారుడికి కావాల్సింది audience ... వీళ్లేరి? ఓ మంచి ప్రాస రాస్తే 'భలే' అనేవారేరి? 'టెలుగు చదవడం రాదు' అనే వారు తప్ప! 

అర్ధం చేసుకోకపోవడం -  ఓ కళాకారుడి lifestyle చాలా భిన్నంగా ఉంటుంది .. ఇంట్లోనే ఎక్కువ సేపు గడపాల్సి రావచ్చు ... ఒంటరిగా ఉండవలసి రావచ్చు... తన కళకి ప్రస్తుతం గుర్తింపు లేకపోవచ్చు ... తన కళ లో తన శైలి ఏంటో ఇంకా ఆ కళాకారుడు కనుగొనకపోవచ్చు .. ఈ struggles మధ్య అతనికి కావాల్సింది కొంత support, కొంత understanding.  ఇది ముందు అతని కుటుంబం నుంచి, చుట్టాల నుంచి, స్నేహితుల నుంచి రావాలి. అలా రాని రోజు అతని కళ చాలా negative గా ఎఫెక్ట్ అవుతుంది. 

 Insensitivity - ఓ వైపు సున్నితమైన రచనలు చేసే వారిని పొగుడుతారు కానీ ఆ రాసే వ్యక్తిని మాత్రం 'మీరు ఇంత సున్నితంగా ఉండకూడదండి' అంటారు. అందరు కళాకారులు సున్నిత మనస్కులే. కానీ సమాజం వారి తో చాలా insensitive గా డీల్ చేస్తుంది. ప్రోత్సాహం లేకపోగా కళలని ఎంచుకున్నందుకు విమర్శించడం, art etiquette లేకపోవడం (ఏది ఒక పాట పాడు అని అడుగుతారు .. పాట అందుకోగానే వారిలో వారు మాట్లాడుకోవడం మొదలుపెడతారు!), హేళన చెయ్యడం (కవులకి, నటులకి ఇది బాగా అనుభవం)...  'పట్టించుకోకూడదు' అని అనచ్చు. ఓ హాస్య కళాకారుడు అన్నట్టు 'అబ్బా ఛా!' 

స్వాతంత్రం - తన ఆలోచనలని ఎటువంటి సంకోచం, compromise, overridings లేకుండా బయటికి తీసుకువచ్చే స్వాతంత్రం ఓ కళాకారుడికి సమాజం ఇవ్వాలి. కళాకారుడు స్వతంత్రుడు కాని సమాజాల గురించి చరిత్ర లో చదువుకున్నాం. కళాకారుడు తను అనుభవించిన నిజాన్ని తన కళ ద్వారా ప్రదర్శిస్తాడు. ఆ నిజాన్ని చూడలేకపోయినా, ఆ కళాకారుడి అభిప్రాయానికి tolerance చూపించలేకపోయినా అది ఆ కళాకారుడి problem కాదు సమాజానిది. కానీ ఇది చివరికి కళాకారుడి మెడకే చుట్టుకుంటుంది .. అందుకనే ఇక్కడ 'కళాకారుడి కష్టాలు' లో లిస్ట్ చేయవలసి వస్తోంది. 

Artists కి అసలే కొన్ని internal struggles ఉంటాయి. 

నిరంతర కళా సాధన (సినిమాలో చూపించినట్టు ఆ సాధన కొండల మీద, నదుల దగ్గర... అందమైన ప్రదేశాలలో రెండు నిముషాలలో పూర్తయ్యే montage లాగా ఏమీ జరగదు .. రోజూ ఒకే గది లో ... రకరకాల సమస్యల మధ్య  సాగాలి) 

Doubts ... అసలు నేను కళని నమ్ముకొని కరెక్టే చేస్తున్నానా? పోనీ ఏదైనా ఉద్యోగం చూసుకోనా? ఆమ్మో .. కళ లేకుండా ఉండగలనా? అవునూ ... ఈ ఐటం ఈ స్టేజ్ కి తగునా? ఇది చూసేవాళ్ళకి నచ్చుతుందా? అసలు ఎవరైనా వస్తారా? ఈ నెల ఎలా గడిచేది? ఓ కొత్త ఐడియా ... భలే ఉంది ఈ ఐడియా .. ఎవరికి చెప్తే పని అవుతుంది? వాళ్ళకి చెప్తే కొట్టేస్తారేమో! వీళ్ళు అసలు ఇలాంటి ఐడియాలు వింటారా? ఇది ఎలాగైనా చేస్తే అందరికీ నచ్చుతుంది .. నచ్చుతుందా? నేనే నచ్చుతుంది అనుకుంటున్నానా? ఇలా ఉంటుంది ఓ కళాకారుడి ఆలోచనా ప్రపంచం. ఇవి చాలక బయటి ప్రపంచం! 

ఇంత ఎందుకు? ఉద్యోగం చేస్కోవచ్చు కదా? అని అనచ్చు. 

చాలా మంది అలా చేస్తున్నారు కూడా. ఏదో ఒక కళ కలిగి ఉన్నా దాన్ని అప్పుడప్పుడూ సాధన చేస్తూ, ఆదాయ మార్గం గా ఆధార పడక వేరే ఉద్యోగం/వ్యాపారం  చేసుకొనే వారు ఆ కళని ఎంత మిస్ అవుతున్నారో వారినే అడగండి. 

Art is not a choice. It's a voice. దాని మాట విని తీరాల్సిందే. ఇంకో చోట ఆనందం దొరకదు. ఇమడలేం. మనం మనం కాదు. ఇది తెలిస్తే 'ఇంకో పని చేస్కోవచ్చు కదా' అనే సలహా ఇవ్వరు. ఇన్ని కష్టాలున్నా, ఏ విధంగా feasible కాకపోయినా ఇంకా కళాకారులు ఎందుకున్నారు అంటే ఇదే సమాధానం. 

నిజానికి ఇన్ని కష్టాలు ఉండవలసిన అవసరం లేదు. ఓ సమాజానికి కళ ఎంత అవసరమో ఆ సమాజానికి తెలిస్తే.   

కొన్ని రోజుల క్రితం ఈ చిన్న కథ చదివాను ఒక FB post లో. 

రాతి యుగం నాటి కాలం లో ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారట. మొదటి ఆవిడ 'మా వాడు చాలా బాధ్యత కలవాడు. రోజూ వేటకెళ్లి మా అందరికీ ఆహారం తెస్తాడు .. జీవితానికి కావాల్సిన విద్యలన్నీ నేర్చుకుంటాడు' అంది. రెండో ఆవిడ నిట్టూర్చి 'మా వాడూ ఉన్నాడు .. ఎందుకూ? రోజూ ఆ గుహల్లో కెళ్ళి యేవో పిచ్చి గీతాలు గీస్తూ ఉంటాడు' అని వాపోయిందట. కొన్ని శతాబ్దాలు గడిచాయి. మొదటి ఆవిడ కొడుకు చేసిన పనుల తాలూకు ఏ ఆనవాలూ మిగల్లేదు. కానీ రెండో ఆమె కొడుకు గీసిన 'పిచ్చి గీతలు' మానవ పరిణామక్రమాన్ని అర్ధం చేస్కోవడం లో దోహదపడ్డాయి. 

ఇదే కళ చేసేది. 

Art may not be something you want. It is something you NEED. 

Friday, August 24, 2018

నోబెల్ సాధించాలంటే ఏం చెయ్యాలి?

చిన్నప్పుడు ఓ కార్టూన్ నాకు ఓ గొప్ప విషయాన్ని పరిచయం చేసింది. 

ఆ కార్టూన్ లో ఓ సైంటిస్ట్ కి బండ రాళ్ళు కొట్టే పని చెయ్యవలసి వస్తుంది. మిగిలిన వాళ్ళు రోజులు రోజులు ఒకే బండ రాయిని సుత్తులతో కొట్టి కొట్టి చిన్న చిన్న ముక్కలు చేస్తూ ఉంటారు. ఈ సైంటిస్ట్ మాత్రం ఆ బండ రాతిని అన్ని వైపులా గమనించి, తడిమి దాని సెంటర్ పాయింట్ ని కనుక్కొని దాని మీద సుత్తి తో చిన్నగా తడతాడు. అంతే. అంత పెద్ద బండ రాయి పొడి పొడి అయిపోతుంది! 

నన్ను ఈ కార్టూన్ చాలా ప్రభావితం చేసింది. ఒక పని ని నేను approach చేసే విధమే మార్చేసింది. 

నా అనుభవం ప్రకారం hard work is over-rated అండి. 

కష్టపడటాన్ని ఎందుకో అనవసరంగా glorify చేసేసారు. 

కష్టపడి చదువుకోవాలి. కష్టపడి ఇల్లు కట్టుకోవాలి. కష్టపడి పెళ్లి చేసుకొని కష్టపడి భరించి కష్టపడి షష్టి పూర్తి జరుపుకోవాలి. కష్టపడి పిల్లల్ని పెంచాలి. ఆ పిల్లలకి...  కష్టపడి...  వాళ్ళు కష్టపడే చదువులు చెప్పిస్తే అతి కష్టం మీద ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ కష్టపడి పెళ్లిళ్ళు  చెయ్యాలి. ఎందుకండీ ఇంత కష్టం? 

అంటే చదువుకోవద్దా? ఉద్యోగాలు.. పెళ్లి ... పిల్లలు? 

కష్టపడద్దు అన్నాను కానీ మానెయ్యమనలేదు కదండీ .. కష్టం అనే పదం తో ఇవన్నీ ఎంత ముడిపడిపోయాయి అంటే కష్టపడకపోతే ఈ పనులు అసలు కావు అనే brain-washed స్థితి లో ఉన్నాం అన్న మాట! 

కష్టపడి పనిచేయడానికి వ్యతిరేక పదం .. బద్ధకించడం కాదు .. సులువు గా పనిచెయ్యడం.

Working with EASE  

దీనికి example గా ఓ కథ ఉంది. 

విక్రమార్కుణ్ణి స్వర్గం పిలిపించారట .. ఇద్దరు అప్సరస ల మధ్య ఎవరు గొప్పో తేల్చటానికి. 

అప్పటికి అందరూ వారిని పరీక్షించి .. ఇద్దరూ రూపం లో, నృత్య కళ లో సమానంగా ఉండటం చూసి ఎటూ తేల్చుకోలేకపోయారట. 

విక్రమార్కుడు ఇద్దరినీ పిలిపించి వారి మెడలో పూలమాలలు వేయించి నృత్యం చెయ్యమన్నాడట. 

ఇద్దరు అప్సరసలు గొప్పగా నృత్యం చేశారు. కొన్ని పగళ్లు, కొన్ని రాత్రులు .. అలా చేస్తూనే ఉన్నారట .. ఇద్దరిలో అలుపు కనపడటం లేదు. పోటాపోటీ గా చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత నృత్య ప్రదర్శన పూర్తయింది. మళ్ళీ చూసే వారికి ఎవరు గొప్పో తెలియలేదు. 

విక్రమార్కుడు మాత్రం వారి మెడలో వేసిన మాలలు తెప్పించుకొని చూశాడట. 

మొదటి అప్సరస మెడలో వేసిన మాల లో పూలు వాడిపోయిఉన్నాయి. రెండో అప్సరస మెడ లోని మాల తాజా గా ఉంది! 

మొదటి అప్సరస ఒత్తిడి కి లోనైంది .. ఆ వేడికి పూలు వాడిపోయాయి. రెండో అప్సరస కి నృత్యం మంచినీళ్ల ప్రాయం .. అందుకనే ఆమె పూలు తాజాగా ఉన్నాయి. కేవలం ఈ ఒక్క తేడా తోనే ఇద్దరి లో 'ఈజ్' తో ఉన్నది ఎవరో నిర్ణయించాడు విక్రమార్కుడు.

ఇది మన జీవితాల కి అన్వయించవచ్చు. అవే పనులు. కానీ ఆ పనులు చేసే విధం లో కొంత మంది మాత్రమే కనబరిచే సరళత్వం.

అయితే మనకి ఏళ్ళ తరబడి చేసిన brain wash ప్రకారం కష్టపడటం నిజాయితీ కి తార్కాణం. అంతే కాదు 'easy come, easy go' లాంటి సామెతల వల్ల సులువు గా వచ్చిన దానికి మనం విలువ ఇవ్వము అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.  

కానీ ఒక్క సారి చుట్టూ చూడండి .. ప్రకృతి వైపు. 

ప్రకృతి లోనే కష్టం లేదు. గడ్డి కష్టపడి మొలవట్లేదు. నీళ్లు 'నేను కష్టపడి పైకే వెళ్ళాలి' అనుకోవట్లేదు .. సులువుగా పల్లానికే ప్రవహిస్తున్నాయి. చేప పిల్ల ఈదడం కోసం కష్టపడట్లేదు. కోయిల కొన్ని సంవత్సరాలు కష్టపడి సాధన చేసి, ఆడిషన్ గట్రా ఇచ్చి పాటలు పడట్లేదు. వేట సింహానికి క్రీడే కానీ కష్టం కాదు. వేట సింహానికి కష్టమైన నాడు .. ప్రకృతి దాన్ని తనలో కలిపేసుకుంటోంది. 

చీమల్ని, తేనెటీగల్ని చూపించి కష్టపడమంటారు కానీ అసలు అవి కష్టపడట్లేదు .. వాటి పని అవి ఇష్టంగానే చేస్తున్నాయి. అవి ఇష్టంగా చేస్తున్నాయి అని నాకెలా తెలుసంటారా? వాటికి హై బిపి, హైపర్ టెన్షన్, stress వల్ల వచ్చే అనేక వ్యాధులు లేవు కనుక. (ఇంగ్లీష్ లో 'disease' అంటే రోగం. అసలు ఆ పదం ఎలా ఏర్పడింది తెలుసా? Dis -ease ... అంటే 'Ease' లేకపోవడమే.)

కావాలని కష్టపడేది మనిషొక్కడే. 

అది కూడా తనే సృష్టించుకున్న complications కి hard work అనే పేరు పెట్టి. 

సృష్టి లో ఏ పనీ కష్టం కాదు. కానీ అది కష్టంగా మార్చబడుతుంది. కారణాలు కొన్నే ఉంటాయి. 

1. ఇష్టాయిష్టాలు - ఒక పని చెయ్యడం అసలు నాకు ఇష్టం లేదు. మొక్కుబడి గానో, ఇంకో దారి లేకో చేస్తున్నాను. అంతే. ఇంక ఆ పని లో ease చచ్చినా రాదు. ఇష్టమైన పని చేయలేకపోవడం .. చేసే పనిని ఇష్టపడలేకపోవడం  

2. భయం - అసలు నేను ఈ పని చేయగలనా? అని భయపడగానే నా ఆలోచనా సామర్ధ్యం సగానికి సగం తగ్గిపోతుంది. ఇంక పనిని సులువు చేసే ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి? 

3. Conformism - అందరూ ఆ పని ఎలా చేస్తున్నారో నేను  కూడా ఆ పని అలాగే చెయ్యాలి అనుకోవడం .. నా వ్యక్తిత్వం, నా బలాలు.. ఇవేవీ పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేస్కుంటూ పోవడం 

4. ముతక పద్ధతులు - ఈ పని ఎన్నో ఏళ్ళ నుంచి ఇలాగే జరుగుతోంది .. ఇప్పుడు కూడా ఎంత కష్టమైనా ఇలాగే జరగాలి అనుకోవడం ... update చేసుకోకపోవడం. వాటిని పక్కన పెట్టలేని అధైర్యం. 

5. టైం పాస్ - ఇది షాకింగే కానీ నిజం .. ఒక పని సులువు గా అయిపోతే మిగిలిన టైం లో ఏం చెయ్యాలి? అని పని ని కష్టంగా ఉంచుకుంటూ ఉండటం. 

6. ఫలం తీపి - హిందీ లో 'మెహనత్ కా ఫల్ మీఠా హోతా హై' అని సామెత ఉంది కదా .. కష్టపడకపోతే ఆ పండు తియ్యగా ఉండదేమో అని కొంతమంది అనుమానం. కష్టపడిన వాళ్ళకి వచ్చే పేరు రాదేమో అని ఇంకో అనుమానం. 

ఇవి కాక ఈగోలు, పాలిటిక్స్, హిడెన్ అజెండాలు .. పని ని బోల్డు కష్టంగా మార్చేస్తాయి. 

చెయ్యాల్సిన పని లోంచి వీటన్నటిని తీసేస్తే వచ్చేదే EASE. 

పోపెయ్యడం దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు దాకా ఈ ఫార్ములా ఉపయోగించచ్చు.  

అందరూ కొంచెం కంగారు పడిపోయే పెళ్లి లాంటి తంతులని కొంత  మంది ఈజ్ తో ఎలా చేయగలుగుతున్నారు? మన దేశం లో చాలా కష్టాలకి గురి చేసే కొన్ని పనులు కొన్ని దేశాల్లో ఎందుకంత సులువుగా జరుగుతున్నాయి? 

ఇవి తీసెయ్యడం ఈజీ కాదు అని అనచ్చు. చూసారా? ease ని సాధించడం అంత 'ఈజీ' కాదు ... అసలు ఇదే కష్టమైన మార్గం (ఇలా అంటే అయినా ఈ దారిలోకి వస్తారని ఆశ 😒)

మనందరికీ ఈ సరళత్వం అనే కాన్సెప్ట్ తెలుసు. మనం admire చేసే వ్యక్తుల్లో ఇది ఉండి తీరుతుంది. 

ఆ హీరో ఎంత ఈజ్ తో డాన్స్ చేస్తాడు కదా అంటాం. 

ఎంత పని చేసినా ఆవిడ చిరునవ్వు చెక్కు చెదరదండి అని మెచ్చుకుంటాం. 

రిక్షా తొక్కి చెల్లి పెళ్లి చేద్దామనుకొనే హీరో ని చూసి నవ్వుకుంటాం. 

EFFORTLESS అనే పదాన్ని compliment గా వాడతాం. 

గాలిని బంధించడం, హఠ యోగం, క్రతువులు అంటూ కష్టపడక్కర్లేదు .. 'మాధవా మధుసూదనా అని మనసున తలచిన చాలు గా' అని భగవంతుణ్ణి పొందటానికే  సులువు మార్గం చెప్పేసాడు ప్రహ్లాదుడు! 

మరి ఈజీ అంటే అనీజీ ఎందుకు? 

ఎంత గొప్ప పనైనా ఈ సరళమార్గం లో చెయ్యచ్చు అనటానికి నేను సంధించే ఆఖరి అస్త్రం .. ఈ కింది ఫోటో. 






నోబెల్ సాధించడానికి ఏం చెయ్యాలి?

'కష్ట'పడకూడదు. 

Friday, August 17, 2018

మార్పుమాలక్ష్మి

శ్రావణ మాసం వచ్చేసింది. అన్నీ ఆడాళ్ళ పండగలే. ఆడాళ్ళు బోల్డు బిజీ. చూడటానికి చాలా బాగుంటుంది. 

కొత్త చీరలు, పసుపు పాదాలు, తల్లో పూలు... 

కానీ ఆ కొత్త చీరలు చూసే వాళ్ళకి తెలీవు .. ఎన్ని డిస్కౌంట్లు ఉన్నా బడ్జెట్ లో మంచి చీర తెచ్చుకోవడానికి ఆ అతివ ఎంత కష్టపడిందో. పసుపు పాదాలు చూసే వారికి తెలీదు ... టెయిలర్ల చుట్టూ పీకో, ఫాల్, బ్లౌజ్ కోసం, శ్రావణ మంగళవారాల నోముల కోసం కాళ్లరిగేలా ఆ పడతి ఎలా తిరిగిందో. 

అసలే బిజీ గా ఉన్న ఆడవాళ్ళ కాలెండర్ లో శ్రావణ మాసం ఇంకో హడావుడికారి. 

working women అయినా, house wives అయినా ఈ మాసం చాలా stressful గా ఉంటుంది .. శుక్రవారమే ఇంటెడు పని, ఆరోజే రాని domestic help, పిండి వంటలు, మామూలు పనుల మీద ఈ తమలపాకులు, వక్కలు, పళ్ళు, పూల షాపింగ్, పేరంటాలకి, నోములకి ఎక్కే గడప, దిగే గడప .. పోనీ ఓపిక లేక ఏదైనా తక్కువ చేస్తే గిల్టీ ఫీలింగ్ .. 

అయినా ఇష్టం గా చేసేది కష్టంగా అనిపించదు అనుకోండి. పైగా ఈ నెల చేసుకొనే వ్రతాలు,  పూజలు,నోములు అన్నీ వారి 'సౌభాగ్యం' ఉరఫ్ 'అత్తారింటి మేలు/భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలు/ముత్తయిదువతనం' మీద ఆధారపడి ఉన్నాయి మరి!   

అదేంటమ్మాయ్? భర్త, అత్తమామల బాగు కన్నా ఇంకా ఆడదానికి ఏం కావాలి అని అడిగే వారు ఇక్కడే చదవడం ఆపేయచ్చు. 

ఇంకా చదువుతున్నారా? Good. 

ముందుగా నేను clarify చేయాల్సినది ఏమిటంటే ... నాకు మన సంప్రదాయాల పట్ల అగౌరవం లేదు. మన సంస్కృతి అంటే చులకన భావం కూడా లేదు. 

కాలాల మార్పును, సాంఘిక అవసరాలను అందంగా పండగల్లో ఇమిడ్చిన సంస్కృతి మనది. మన సాంప్రదాయాల్లో కొన్నిటి అర్ధం తెలుసుకుంటే మన పెద్దవాళ్ళ మీద గౌరవం కలుగుతుంది.

ఈ గౌరవం తో వీటన్నిటినీ నేను పాటించాను... అమ్మ కి assistant గా. 

ముత్తయిదువ పాదాలకి పసుపు రాసే అప్పుడు ఏ భాగమూ పసుపు అంటకుండా ఉండకూడదు ... మడమలు, కాలి వేళ్ళ మధ్య, కాలి గోళ్ళ అంచులు .. ఏదీ మిస్ అవ్వకుండా పసుపు రాయాలి. కుంకుమ మొత్తెయ్యకూడదు .. అందంగా పెట్టాలి. చూపుడు వేలు ఉపయోగించకూడదు. శ్రావణ మాసం మరీ ముఖ్యంగా ఇంట్లో ఏదో ఒక పండు ఉంచుకోవాలి ... ముత్తైదువులు వస్తే బొట్టు పెట్టి పండు ఇవ్వకుండా పంపకూడదు. శ్రావణ శుక్రవారాలు పొద్దున్నే లేవాలి. తలంటు పోసుకోవాలి. అసుర సంధ్య వేళ ఇంట్లో దీపం ఉండాలి.  నోములు, వ్రతాల్లో పాల్గొన్నాను కూడా. 

అలా దగ్గర నుంచి చూసాకే కొన్ని ఆలోచనలు కలిగాయి. 

ఈ శ్రావణ మాసం నోములు, వ్రతాలు  ఇత్యాదివి 'ఆడవారు - పెళ్లి' .. ఈ సంబంధం లో నే నడుస్తాయి. 

పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త రావడానికి, పెళ్లయ్యాక అంతా బాగుండటానికి ఈ నోములు పడతారు (దీనికి మూల-ఆలోచన (దుష్ట సమాసం లా ఉంది) .. పెళ్లికాని పిల్లలు అందరి కళ్ళల్లో పడి మంచి సంబంధాలు రావాలి అని కదా .. అందుకే వారు పసుపు ఎట్లా రాస్తారో, కుంకుమ ఎట్లా పెడతారో, విస్తరాకు లో ఉప్పు ఎంత వడ్డిస్తారో అనే విషయాల మీద వారిని పెద్ద ముత్తైదువ లు judge చేసి సంబంధాలు చెప్తారు (దుష్ట సమాజం లా ఉంది)

పెళ్లి అయిన ఆడవారేమో ఇంతకు ముందు చెప్పినట్టు గా పెళ్లి-centric ప్రపంచాన్ని పదిలంగా ఉంచుకునేందుకు చేస్తారు ఈ పూజలని. 

అవునూ .. చేస్తారు .. ఇంతకీ నీ ప్రాబ్లమ్ ఏంటి? అని అడిగితే .. the following is my problem. 

సాంఘిక అవసరాలని బట్టీ ఏర్పడిన పండగలు ఆ అవసరాలు మారినప్పుడు మారాలి. 

పెళ్లి విషయానికొస్తే .. పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేని ఆడవారు, ఉద్దేశం ఉన్నా అవ్వని వాళ్ళు, divorcees, ముత్తయిదువలు కాని వారు .. వీళ్ళకి ఈ మాసం ఓ ఇబ్బందికరమైన సమయం. 

(ఒకప్పటి కంటే widows పట్ల మన సమాజం ప్రవర్తన మారింది. కానీ ఇప్పటికీ ఆడవారికి ఏర్పరిచిన hierarchy లో మొదటి స్థానం ముత్తైదువులదే. అంటే కేవలం భర్త బ్రతికి ఉండటమే ఆడవారి స్థానాన్ని నిర్ణయిస్తుంది. జీవన్మరణాలు are just a matter of chance కదా?

అలాగే పెరుగుతున్న divorces కి కారణం ఆడవారిలో సహనం, compromise అయ్యే తత్వం తగ్గుతూ ఉండటమే అన్న అభిప్రాయం ఉంది. నా అభిప్రాయం అడిగితే అసలు మనకి ఒకరి డివోర్స్ మీద అభిప్రాయం ఉండకూడదు అంటాను నేను. భార్యాభర్తలు పక్కపక్క నుంచుంటే వారి మధ్య నుంచి నడవకూడదు అంటారు మన పెద్దవాళ్ళు. మరి అంత close relationship లో మన అభిప్రాయాన్ని మాత్రం ఎందుకు దూర్చడం?) 


అదీ కాక ఆడవారి evolution లో ఇది చాలా ముఖ్యమైన టైం. మన చుట్టూ జరుగుతున్న ఉద్యమాలని చూస్తే తెలుస్తోందిది. అసలు మనతో మనమే చెప్పుకోడానికి భయపడే ఎన్నో విషయాలు social media లో షేర్ చేసుకోబడుతున్నాయి. అవి చదివి ...మనం ఒక్కరమే కాము అన్నమాట! అని తెలుస్తోంది. 

ఇప్పుడు పెళ్లి ఆడపిల్లల లైఫ్ గోల్స్ లో ఒకటి మాత్రమే. ఇప్పుడు ఆడవాళ్ళకి తానెవరో, తనకి ఏం కావాలో తెలుసుకోవడం  చాలా ముఖ్యం. ఆడవారి ఆరోగ్యం ఇప్పుడు చాలా challenges ని ఎదుర్కుంటోంది. వీటన్నిటి గురించి ఆడవాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వేదికల మీద కాదు ... చర్చా కార్యక్రమాల్లో కాదు ... డిబేట్ల లో కాదు .. చాలా ఆప్యాయంగా, ప్రేమ గా , understanding గా .. మనలో మనమే .. పేరంటాళ్లలో కబుర్లు చెప్పుకుంటాం చూడండి .. అలా అన్నమాట. 

ఇప్పుడు మీకు Bechdel Test గురించి చెప్పాలి. (బెక్ డెల్ టెస్ట్) 

సాధారణంగా ఈ టెస్ట్ సినిమాల కి అప్లై చేస్తారు. 

ఈ టెస్ట్ పాసవ్వాలంటే ఓ సినిమా లో ఈ మూడు విషయాలు ఉండాలి. 

1. సినిమాలో కనీసం రెండు స్త్రీ పాత్రలు ఉండాలి 
2. ఆ స్త్రీ పాత్రలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి 
3. వారు మాట్లాడుకొనే టాపిక్ మగాడి గురించి అయ్యుండకూడదు ...

సినిమాలలో స్త్రీ పాత్రల చిత్రణలో వెలితి ని ఈ టెస్ట్ ఎత్తి చూపించింది. రెండు కూడా స్త్రీ పాత్రలు లేని సినిమాలు ఉన్నాయని తెలిసింది .. ఆ పాత్రలు అసలు ఒకరి తో ఒకరు మాట్లాడుకొనే situations రాయబడలేదు, తీయబడలేదు అని తెలిసింది. పోనీ మాట్లాడుకున్నా - మగాడి గురించే మాట్లాడుకొనేలానే ఎక్కువ ఉంటాయి ఆ సీన్లు అని తెలిసింది. 

సినిమాల సంగతి వదిలేయండి. 

ఆడవారి గా మన రోజూ జీవితం లో... ముఖ్యంగా శ్రావణ మాసానికి ఈ టెస్ట్ ని అప్లై చేస్తే ఏం తెలుస్తుంది? 

పెళ్లి ని equation లోంచి తీసేస్తే ఆడవారి విలువ ఎంత? ఆడవారి ఆరోగ్యం, వారి personal goals, ambitions, వారి సర్వతోముఖాభివృద్ధి ... ఇలాంటి టాపిక్స్ కి  సమయం, సందర్భం ఏది? మారుతున్న సామాజిక పరిస్థితుల లో వాయినాలు. తాంబూలాలు ఎవరికి ఇవ్వాలో, పేరంటాలకి ఎవర్ని పిలవాలో ఎలా నిర్ణయించాలి? 

కొన్ని చోట్ల మారాం మనం. 

కాలి బొటన వేళ్ల కి పసుపు రాస్తే చాలు ఇప్పుడు. (సంప్రదాయాలు మర్చిపోతున్నామని నిట్టూర్చక్కర్లేదు ... ఐదు వేల రూపాయల ఉప్పాడ చీర కట్టుకున్నప్పుడు తెలుస్తుంది .. ఈ మార్పు చీర కి పసుపు అంటకుండా ఎలా ఉపయోగపడుతుందో. మరక కన్నా మార్పు మంచిది!)

కొంగున కట్టుకొచ్చే శనగలకి ఇప్పుడు కవర్లు ఇస్తున్నారు.  

శ్రావణ మాసం అంతా కేజీలు కేజీలు నిలవయిపోయే శనగల తో వడ, సుండల్ వంటి traditional వంటలే కాదు పంజాబీ ఛోలే, చనా మసాలా, ఫలాఫల్, చనా పులావు వంటి కొత్త వంటలు కూడా చేసుకుంటున్నారు. 

'శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు' నుంచి ఆశీర్వచనాలు 'ఇష్టకామ్యార్ధసిద్ధిరస్తు' కి మారుతున్నాయి. 

ఇవి చాలా మంచి పరిణామాలు. (ముఖ్యంగా శనగలు ... ఇంతకు ముందు అవే అవే తిని ఒకటే బోరు)  

మన జీవితం నాణ్యత ను పెంచే ఏ విషయాన్నైనా ఐశ్వర్యం గా కొలవడం మన అలవాటు. అష్టలక్ష్ములు అలాగే కదా ఏర్పడ్డారు ... ధనం, ధాన్యం, సంతానం, ధైర్యం... ఇలా.

అలాంటప్పుడు మార్పు ని కూడా మనం ఐశ్వర్యం గా పరిగణించాలి.

మన పండగలు, సంప్రదాయాలు, సంస్కృతి మన తో పాటే .. relevance కోల్పోకుండా సాగాలి అంటే .. ఈ శ్రావణ మాసం మార్పుమాలక్ష్మి ని కూడా బొట్టెట్టి పిలవాలి. 

ఈనాడు ఆదివారం లో నా కథ 'గాజు గోడ'

కార్పొరేట్ ప్రపంచం లో గ్లాస్ సీలింగ్ అనే చేదు నిజం ఉంది. విమెన్ ప్రొఫెషనల్స్ ని ఒక స్థాయి ని మించి ప్రోమోట్ చెయ్యకపోవడం ... అంటే అప్పర్ లెవె...