డూడ్లింగ్ అను పరధ్యాన చిత్రకళ

చిన్నప్పుడు స్కూల్ లో నో, పెద్దయ్యాక ఆఫీసు మీటింగ్స్ లోనో, లేదా ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతూనో చేతి లో పెన్ను పేపర్ ఉంటే ఏవో గీతాలు గీసేస్తూ ఉంటాం చూడండి ... 

ప్రతి చిన్న పని కి పేరు పెట్టేసే ఇంగ్లీష్ భాష లో దీని పేరు డూడ్లింగ్ ... (doodling). ఆ బొమ్మల్ని డూడుల్స్ (doodles) అంటారు. 

పిచ్చి గీతల్లా అనిపించే ఈ డూడుల్స్ కి మనస్తత్వ శాస్త్రానికి, ధ్యానానికి.. ఇలా చాలా లోతైన సంబంధాలున్నాయట .. వాటితో ఈ రోజు మిమ్మల్ని విసిగిస్తానన్నమాట. 😁

ఎప్పుడైనా గమనించండి .. ఇలా గీసే గీతల్లో ఎవరి స్టైల్ వారిది ఉంటుంది .. మా అక్క ఎక్కువగా కళ్ళు వేస్తుంది .... ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు అన్నట్టు మా అక్క ఆలోచిస్తుంటే పేజీ అంతా కళ్ళే ఉంటాయి! (దాని అనుమతి లేకుండా రాసేస్తున్నాను ... ఏం జరుగుతుందో ఏవిటో!) అలాగే కొంత మంది స్టిక్ ఫిగర్స్ .. అంటే ఓ నిలువు గీత .. దాని మీద గుండ్రంగా తల కాయ, ఆ గీత కి అటో రెండు ఇటో రెండు చేతులూ కాళ్ళలాగా గీస్తూ ఉంటారు. మా కజిన్ ఒకమ్మాయి పిచ్చి గీతాలు వెయ్యదు సరికదా ... కళాఖండాలే వేసేస్తూ ఉంటుంది.. ఆ డూడుల్స్ ఏ తాజ్ మహల్ మీదో చెక్కిన చిక్కటి డిజైన్ల లాగా ఉంటాయి .. చిక్కటి అంటే .. సునిశితమైన అల్లికలు, దగ్గర దగ్గర గా ఉండే సూక్ష్మమైన మెలికలు ఇలా అన్నమాట .. ఇంట్రికెట్ డిజైన్స్ .. కొంత మంది పువ్వులు వేస్తారు ... కొంత మంది ఓ చదరం వేసి దానికి 3 డి షేడింగ్ చేస్తూ ఉంటారు .. మీరేం వేస్తుంటారు జనరల్ గా? 

ఒక్కో సారి మనస్తత్వ నిపుణులు తమ దగ్గరికి వచ్చిన రోగి మానసిక స్థితి ని అర్ధం చేసుకోడానికి ఈ డూడుల్స్ ని ఉపయోగిస్తారట. సైకోపాత్ ల ని సైతం వీటి సహాయం తో పట్టుకోవచ్చట .. కొంత వరకూ. 

డూడుల్ సైకాలజీ ప్రకారం కొందరు స్ట్రెస్ కి కానీ, ఆందోళన కి కానీ లోనైపుడు డూడుల్స్ గీస్తూ ఉంటారట. కొందరు లోతైన ఆలోచన లో ఉన్నప్పుడు గీస్తారట. ఇంకొందరు మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇవి వేస్తూ ఉంటారట. 

ఏం వేస్తామో అది కూడా మన ఆంతర్యాల గురించి చెప్తుంది అంటారు. వీటి నిజానిజాలు ఎంత వరకూ అనేది తెలియదు కానీ .. గీసిన డూడుల్ మీదే మళ్ళీ గీయడం పనెక్కువైన వారు చేస్తారట .. సూటి గా ఉండే ఆకారాలు గీసే వారు పోటీ తత్వాన్ని కలిగి ఉండేవారై ఉంటారట.. ఆర్చ్ అంటే వంపు తిరిగిన డిజైన్ గీసేవారు ఏదో దాస్తున్నట్టు అట ... 

డూడుల్స్ మీద వికీ పేజీ ఇక్కడ చదువుకోవచ్చు .. ప్రఖ్యాత పరధ్యాన కళాకారుల్లో మన రవీంద్రనాథ్ టాగోర్ ఒకరట .. ఇది వికీ చెప్పింది అని కాదు కానీ మాకు టాగోర్ జీవితం నాన్ డిటైల్డ్ టెక్స్ట్ ఉండేది. అందులో ఇది చదివాను నేను. ఆయన కవిత్వం రాసిన పేజీ ని పెన్ తోనే గీతలు గీసి ఓ పెయింటింగ్ లాగా చేసే వారని. దాన్ని డూడుల్ అంటారని మాత్రం ఇప్పుడు తెలిసింది.  

గూగుల్ ఈ డూడుల్స్ అనే పదానికి బాగా పేరు తెచ్చి పెట్టింది. ఓ గొప్ప శాస్త్రవేత్తో, మానవహక్కుల ఉద్యమకారుడో, రచయితో పుట్టిన రోజులను, కాలెండర్ లో ప్రాముఖ్యత ఉన్న రోజుల్లోనూ గూగుల్ తన లోగో ని మార్చి ఆ టాపిక్ వ్యక్తమయ్యేలా బొమ్మలు పెడుతూ ఉంటుంది. ముందు కేవలం బొమ్మల్లానే ఉండేవి ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి చిన్న యానిమేషన్లు, గేమ్స్ కూడా అయ్యాయి ఈ గూగుల్ డూడుల్స్. కానీ ఈ డూడుల్స్ పిచ్చి గీతలు కావు .. సరదా బొమ్మలు అనే అర్ధం లో ఈ పేరు పెట్టి ఉండవచ్చు. పైగా డూడ్ల్ అనే పదం గూగుల్ అనే పదానికి ప్రాస కూడా కదా. 

రామకృష్ణ పరమహంస కి నాకు ఒక అలవాటు కామన్ ... ఇద్దరం ఏ పనీ మేము చేయనిదే చెప్పం .. (ఆ స్వీట్ కథ గుర్తుంది కదా. ఓ పిల్లవాడి తల్లి మా వాడు తెగ స్వీట్లు తినేస్తున్నాడు వద్దని చెప్పండి అంటే వారం ఆగి రమ్మంటారు రామకృష్ణులు .. వారం తర్వాత పిల్లవాడికి స్వీట్లు తినద్దని హితవు చెప్తారు ... ఇదేదో వారం క్రితం చెప్పచ్చు కదండీ అంటే నేను చేయనిదే ఎలా చెప్పగలనమ్మా .. ఈ వారం పాటు నేను కూడా మానేసాను కాబట్టే ఈ రోజు చెప్పగలిగాను అంటారు. ఇదే కథ గాంధీ గారికి కూడా ఆపాదిస్తారు. నన్ను ఇద్దరిలో ఎవరితో పోల్చినా అభ్యంతరమేమీ లేదు) 😊

అలాగే ఈ డూడుల్స్ తో  నాకూ అనుభవం ఉంది .. మంచి అనుభవం ఉంది. 

నా టాలెంట్స్ లిస్టు రాస్తే మొదటి పది లో చిత్ర కళ రాదు. చూసి కొన్ని రకాలైన బొమ్మలు,,, కార్టూన్స్ లాంటివి వేస్తా కానీ అంత కంటే పెద్ద ప్రవేశం లేదు. నేర్చుకోలేదు కూడా. నా అంతట నేను ఏ బొమ్మా వెయ్యలేను ... చూసి వెయ్యాల్సిందే. అది కూడా మనిషి, జంతువులు .. ఇవి కష్టం. గడ్డి, పువ్వులు, చూస్తే ఇది చెట్టే అని అర్ధమయ్యే విధంగా చెట్లు, మబ్బులు.. అందరూ వేసే రెండు కొండలు, దాని మధ్య సూర్యుడు .. ఇలాంటివి మేనేజ్ చెయ్యగలను.  ఏదో ఆలోచిస్తూ కొంత మంది వేసే లాగ అస్సలు బొమ్మలు వెయ్యలేను.

పైన చెప్పిన విధంగా ఒక్కొక్కరు ఒక్కో కారణానికి డూడుల్స్ వేస్తారు. 

ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ నా స్నేహితురాలి గైడెన్స్ లో చేసాన్నేను. అందులో ఈ డూడ్ల్ వెయ్యడం ఓ భాగం. మెదడు కి ఒక కొత్త అలవాటు ని చేసే అప్పుడు డూడ్ల్ వేస్తే త్వరగా అది మన తత్వం లో భాగమవుతుందిట. అలా పరిచయమయింది నాకు డూడ్ల్.  

తర్వాత మాత్రం ఈ పరధ్యాన చిత్ర కళ (ట్రేడ్ మార్క్ పెండింగ్ ఈ పేరు కి... నేనే పెట్టా గా మరి!) నాకు 'ధ్యాన' చిత్ర కళ లాగా ఎక్కువ పని చేసింది. 

ఒక్కో సారి కళ్ళు మూసుకొని కూర్చొనే ధ్యానం సాధ్యం కాదు ... మెదడు మొండికేస్తుంది .. చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలించవు ... అలాంటప్పుడు నేను ఇంటర్నెట్ లో ఓ డూడ్ల్ ఎంచుకొని వేస్తూ పోతాను .. వీలైతే ఏదైనా మెడిటేషన్ మ్యూజిక్ వింటూ .. లేదా మామూలుగానే. 

ఆ బొమ్మ వేసినంత సేపూ ధ్యానం దాని మీదే నిమగ్నమవుతుంది. నా అనుభవం - చిందరవందరగా ఉన్న ఆలోచన లు ఈ డూడ్ల్ డిజైన్ లాగా ఓ అమరిక లోకి వస్తాయి. చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. 

ధ్యానం చేసాక మనసు ఎలా ఉంటుందో కంటికి కనిపించదు. కానీ ఈ డూడ్ల్ ధ్యానం లో ప్రూఫ్ కనబడిపోతుంది.. 

ఒక్కో సారి మామూలు బాల్ పెన్ వాడాను. కొన్ని స్కెచ్ ల తో వేసాను. నాకు అన్నిటి కంటే నచ్చినది మాత్రం కలర్ జెల్ పెన్ల తో వేయడం. 

అలా అప్పుడప్పుడూ వేసిన డూడుల్స్ ని ఓ ఫ్రేమ్ లో అతికించుకొని నా వర్క్ టేబిల్ మీద పెట్టుకున్నాను. అవి చూసినప్పుడల్లా అందమైన డిజైన్ కనిపిస్తుంది .. ఎన్ని సార్లు ఎన్ని మానసిక గందరగోళాలని అధిగమించానో గుర్తుకొస్తుంది ... స్ఫూర్తి నింపుతుంది. 


డూడ్ల్ బోర్డు .. 'హకూనా మాటాటా' HAKUNA MATATA (ఎడమ వైపు ఉన్న అక్షరాలు) లయన్ కింగ్ సినిమా నుంచి.   


ఎక్కువ మాట్లాడే పాత్రల్లో ఉన్నవారు, చిన్న పిల్లల తల్లులు, టీచర్లు, మార్కెటింగ్ వాళ్ళు, మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు  .. ముఖ్యంగా అంతర్ముఖులు .. వీరికి మౌనంగా చేసుకొనే ఈ ధ్యానం మంచి రీఛార్జి అవుతుంది అని నా అభిప్రాయం. 

మన సనాతన విజ్ఞానాన్ని ప్రచారం చేసే బాధ్యత పశ్చిమ దేశాలు ఎప్పుడో భుజాన్నేసుకున్నాయి పాపం. మన యోగ శాస్త్రం లో, హైందవ సంప్రదాయాల్లో కనిపించే లాంటి ఆకారాలతో పోలిన 'మండలా' అనే బొమ్మల్ని తెగ వాడేస్తున్నారు అక్కడ. ఇంట్లో గోడల మీద, పిల్లో కవర్ల మీద, టీ షర్టుల మీద ... (గౌరవప్రదంగానే వాడుతున్నారండి నేను చూసినంత వరకూ.. ఈ బొమ్మలన్నీ అల్లికల్లాంటి డిజైన్లే తప్ప మన సంప్రదాయ చిహ్నాలు, అక్షరాలు లేవు) ఈ లెక్కలోనే 'మండల' కలరింగ్ పుస్తకాలు అని పెద్దవాళ్ళకి దొరుకుతున్నాయి మార్కెట్ లో ... ఇవి కొంచెం ఖర్చెక్కువ ఉంటాయి .. కావాలంటే ఫ్రీ గా ఇంటర్నెట్నుంచి ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. అవి కలరింగ్ చేస్కోవచ్చు. మండలాలే కాక అడల్ట్ కలరింగ్ పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్ లో. (ఇక్కడ అడల్ట్ అంటే వేరే అర్ధం ఏమీ లేదు అని మనవి. అందులో మంచి బొమ్మలే ఉంటాయి. ఆశ/భయ పడక్కర్లేదు 😉) అందులో రంగులు వెయ్యటం కూడా ఓ ధ్యానమే అనే అంటున్నారు. ఇది నేను అంగీకరిస్తాను కూడా. 

ముందే చెప్పినట్టు కళ్ళు మూసుకొని కూర్చోమంటే కూర్చోని మతి కి ఈ పని చెప్పేస్తే అది ఈ ఆకారాలని గీస్తూ పోతుంది ... అల్లరి పిల్లలకి ఐ పాడ్ ఇచ్చినట్టు, పని రాక్షసుడి కి కుక్క తోక సరి చెయ్యమని చెప్పినట్టు కాక ఇది ఆరోగ్యకరం. అది దాని ఎనెర్జీ అంతా అటు వైపు పెట్టినప్పుడు మనకి  కొంత సేపు ప్రశాంతత. 

Comments

  1. // “డూడుల్ సైకాలజీ” // మరో రకం కూడా ఉంటారండి. మీటింగుల్లో ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నది ఏమాత్రం ఆసక్తికరంగా లేనప్పుడు కూడా కొండొకచో డూడుల్స్ గీయబడును 🙂.

    “పరధ్యాన చిత్రకళ” ... సరిగ్గా అతికేలాగా భలే పేరు పెట్టారండి👌. వెంటనే పేటెంట్ రైట్స్ కోసం అప్లై చెయ్యండి 👍🙂.

    ReplyDelete
  2. అవును , ఈ అలవాటు చాల మంది లో చూసా , నాకు కూడా . దీనికి కూడా ఒక పేరు ఉందన్నమాట . తెలుగు లో , ఇవన్నీ పిచ్చ్చి గీతలు అని తీసి పారేస్తారు . ఈ తెల్లవాళ్లు దీనికి ఒక పేరు పెట్టి , దానికి పుస్తకాలు కూడా రాసేశారన్నమాట . మనమైతే అవన్నీ పిచ్చి గీతలు , పిచ్చ్చి అరుపులు , పిచ్చి వేషాలు , ఇలా హోల్ సేల్ గా పిచ్చి అనే కేటగిరీ లోకి తోసేస్తాం . వాళ్లేమో ప్రతీ గీతకి అర్ధం వెతుకుతారు , గీత వెనక రాతలేంటో చూస్తారు.
    : Venkat

    ReplyDelete
  3. Nice post thanks for sharing.

    ReplyDelete

Post a Comment