జీవిత పరమావధి
ముందుగా ఓ బొమ్మ చూద్దాం.
Made into Telugu by Sowmya Nittala for sowmyavadam.blogspot.com Feel free to use it. ఎవరైనా వాడుకోవచ్చు ఈ బొమ్మని. |
ఆ మధ్య లో ఉన్న పదం 'ఐకగై' IKIGAI అనే జపనీస్ పదం. దీని గురించి మన తెలుగు లోనే మంచి వీడియో చేశారు ఒకళ్ళు. ఇక్కడ చూడండి. ఈ యూట్యూబ్ ఛానల్ లో చాలా మంచి కంటెంట్ ఉంది ... ముఖ్యంగా స్టూడెంట్స్ కి. ఇది వారి ఛానెల్. Telugugeeks
రెండు విషయాలు ముందే చెప్పాలి.
ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూసి ఇకిగై అనకూడదు .. ఐకగై అనేది సరైన ఉచ్చారణ
రెండోది ... ఈ బొమ్మ పూర్తిగా 'ఐకగై' అనే జపాన్ వారి లైఫ్ ఫిలాసఫీ కి సూచిక కాదు. వారి ఫిలాసఫీ ఇంకా లోతుగా, ఇంకా రిలాక్స్ డ్ గా ఉంటుంది.
ఈ బొమ్మ జీవితం లో పర్పస్ వెతుక్కోడానికి ఉపయోగపడేది ... దాన్ని ఐకగై .. (అంటే జపనీస్ భాష లో 'పొద్దున్నే నువ్వు ఎందుకు నిద్ర లేస్తావో ఆ కారణం' .. ఎందుకు జీవిస్తున్నామో ఆ ఉద్దేశం) కి జోడించారన్నమాట.
ఇది ఒక అభిప్రాయం లేదా ఒక థియరీ గా మాత్రమే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం.
మానవ జీవితానికి ఉద్దేశం ఏంటి? మనం నమ్మే సిద్ధాంతాల బట్టీ దీనికి జవాబు ఉంటుంది. ఏ ప్రయోజనమూ లేదు .. మనం ఆక్సిడెంట్స్ మాత్రమే అనుకోవచ్చు. సేవ (పరులకో, తల్లిదండ్రులకో, దేశానికో) అనుకోవచ్చు. అసలు సమాధానం ఏమీ తట్టకనూ పోవచ్చు... ఏ ఒక్క సమాధానం ఈ ప్రశ్నకి పూర్తి గా ఆన్సర్ చెయ్యదు అని నా అభిప్రాయం.
ఎలాగూ పుట్టాం కాబట్టి ఈ జన్మ ని పూర్తి గా సార్ధకం చేసుకొనే ప్రయత్నం చేద్దాం అనుకొనే వారికి మాత్రం ఈ బొమ్మ బాగా ఉపయోగపడుతుంది.
నాకు ఈ బొమ్మ లో నచ్చిన మొదటి అంశం. .. ఉద్యోగం, వృత్తి, ఆశయం, అభిరుచి .. వీటిని డిఫైన్ చేసిన తీరు.
రెండోది .... మనకి కెరీర్ పరంగా కలిగే భావాలని కరెక్ట్ గా పట్టుకోవడం.
9 to 5 ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళం .. అబ్బా . లైఫ్ బోర్ గా ఉంటోంది అని ఎన్ని సార్లు అనుకోలేదు ... అదేంటి? నెల నెలా జీతం వస్తుంటే ఇంకేం కావాలి అని ఎవరైనా అడిగితే సరైన సమాధానం చెప్పలేకపోయే వాళ్ళం కూడా.
కొంతమందిమి ఆ ఫీలింగ్ ని ఇగ్నోర్ చెయ్యలేక ఉద్యోగం మానేసి మన అభిరుచి లో పడితే మళ్ళీ అక్కడ కూడా ఓ లోటు .... తృప్తి ఉంటుంది కానీ డబ్బులూ ఉండవు .. మన పని మనం చేస్కుంటూ మన లోకం లో ఉంటున్నాం .. జీవితం అంటే ఇంకా ఏదో ఉందనే ఆలోచన.
ఇంక ఆశయాల వెనక పరిగెడితే చెప్పేదేముంది .. ఆక్టివిస్టు ల కి జీతాలుండవు .... బోల్డు సంతృప్తి ఉంటుందనుకోండి ... కానీ జీవితం లో ఏ సౌకర్యాలూ ఉండవు.
నాలుగోది .. ప్రపంచానికి అవసరమయ్యేది, డబ్బులొచ్చేది .. ఉద్యోగం.. నాకు తెలిసి ఇది మహా సేఫ్ ఆప్షన్ వీటన్నిటి లోకి. అందుకే ఎక్కువమందిమి ఇక్కడ ఉంటూ ఉంటాం. ఈ బొమ్మ లో నాకు అర్ధం కాని పాయింట్ కూడా ఇక్కడే ఉంది. అనిశ్చితి ఉంటుందని ఎందుకు రాశారు? అంటే ప్రపంచానికి ఆ అవసరం తీరిపోతే ఇంక మన తో పనుండదు అనా? కానీ ఈ పని లో అనిశ్చితి కన్నా కూడా మన తో మనం టచ్ కోల్పోవడం ఒక లోటు.
(నాకిప్పుడే తట్టింది .. నేను పైన ఉన్నవన్నీ చేసాను... అన్ని ఫీలింగ్స్ అనుభవించాను అని!)
ఇక్కడ వరకూ మన కి చూచాయ గా తెలుసు ... జీవితం లో ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదులుకోవాలి అనే థియరీ ప్రకారం ఇందులో ఎక్కడో అక్కడ ఇమిడిపోతాం.
ఇంత వరకూ చెప్పేసి ఊరుకుంటే ఇంతకంటే డిప్రెసింగ్ వ్యాసం ఇంకోటి ఉండదు.
పేషేంట్ ని కూర్చోపెట్టి నీకు వేడి గా అనిపిస్తున్న దాన్ని జ్వరం అంటారు .. నీకు ముక్కు మీద వచ్చిన దాన్ని సెగ్గడ్డ అంటారు అని మన బాధల కి పేర్లు చెప్పినట్టు అవుతుంది. పేర్లెవడికి కావాలండి ఏదైనా మందు కావాలి కానీ.
ఇక్కడే వస్తుంది నాకు ఈ బొమ్మ లో నచ్చిన అద్భుతమైన పాయింట్.
వీటన్నిటి సెంటర్ లో శ్రీ చక్రం మధ్య లో అమ్మవారిలా ఉన్న ఆశ - ఐకగై (ఏంటో ఈ మాట వింటే 'అయి ఖగ వాహిని మోహిని చక్రిణి' అనే లైన్ గుర్తొస్తోంది హహ్హ)
అంటే .. కోరుకుంటే, ప్రయత్నిస్తే .. ఇవన్నీ కలిసొచ్చే పని ఒకటి దొరకకపోదు.
ఎన్ని సార్లు ఇంటర్వ్యూల లో వినలేదు .. ఈ పని నాకిష్టమైనది.. దానికి ఎదురు డబ్బు రావడం నా అదృష్టం అని ... వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే ఎవరో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు .. అంటే వారు చేస్తున్న పని లో వాళ్ళు నిపుణులు, పైగా వారి మాటలు ప్రపంచానికి కావాలి .. అందరూ వినాలనుకుంటున్నారు. మరి ఇదేగా అయి ఖగ వాహిని అంటే! 😊
నాకనిపిస్తుంది .. టెన్త్ అయ్యాక ఏ కోర్సు చేస్తావు అని ప్రెషర్ పెట్టి అప్పట్లో ఏ డిగ్రీ ఫాషన్ అయితే ఆ చదువులోకి నెట్టేసి బలవంతంగా చదివించేసి, ఉద్యోగం లో కి అంతే బలవంతంగా నెట్టేసి 'మీకు తెలీదు .. ఇదంతా వారి మంచి కోసమే' అని అబద్ధాలు చెప్పుకొని .. ఆనందంగా లేని మనుషులని, మనసు పని లో లేని వర్క్ ఫోర్స్ ని పెంచేసే కంటే... ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది కదూ... ఈ స్పృహ ముందే కలిగిస్తే నిర్ణయం తీసుకోవాల్సిన వయసు కల్లా ఓ క్లారిటీ వస్తుంది ... స్టూడెంట్ కైనా, పేరెంట్ కైనా.
ఆ వయసు దాటిపోయి ఏదో ఒక ఉద్యోగం లేదా వృత్తి లో కుదిరిపోయిన వారు కూడా నిరుత్సాహపడక్కర్లేదు .. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమి లేదు. రిటైర్ అయినా, పదేళ్లు ఉద్యోగం చేసిన, ఇప్పటికి వారం రోజులే చేసినా .. ఈ సూత్రం అప్లై చేస్కోవచ్చు.
ఈ మార్గం లో నడిచే ముందు పారాహుషార్ ... మార్గం సుగమం కాదు .. అన్నిటికి కంటే కష్టమైన ప్రయాణం మన అంతరంగం లోకి మనం చేస్కొనేదే. అందులో ఎన్నో చిక్కు ముడులు ఉంటాయి. మనకి నచ్చిన పని మనకి వచ్చిన పని అయ్యుండక పోవచ్చు. అసలు ఈ రెండూ ఉన్న పని ప్రపంచానికి అవసరం లేకపోవచ్చు ఆ టైం లో. వంట బాగా వచ్చిన వారు ఎపుడూ ఉంటారు కానీ ఇప్పటి లాగా యూట్యూబ్ లో తమ నైపుణ్యం చూపించి డబ్బు సంపాదించే విధానం లాంటివి లేవు ఒకప్పుడు లేవు కదా పాపం... అన్నిటికి కన్నా కష్టం అన్ని బాక్సు లూ టిక్ అయ్యి డబ్బు మాత్రం రాకపోవడం ... నా బ్లాగు లాగా 😁 (వీటన్నిటికీ భయపడే కదా ఈజీ గా ఉండే ఆప్షన్స్ ఎంచేస్కుంటాం.) కానీ అగాధమవు జలనిధి లోన ఆణిముత్యమున్నటులే .. ఈ ప్రయాణానికి చివర్న నిధి ఉంటుంది.
ఆఫ్ కోర్స్ .. ఆ నిధి దొరికాక కూడా అంతా సుఖాంతమేమీ కాదు. ఓ వ్యక్తి మనసుకి నచ్చని ఉద్యోగం లో లక్ష రూపాయలు సంపాదిస్తే ఇక్కడ ముప్ఫయి వేలే సంపాదించచ్చు. కానీ ఆ ప్రతి ఒక్క రూపాయి ఆమె కి లక్ష కంటే విలువ అనిపించచ్చు. లక్ష రూపాయల లైఫ్ స్టయిల్ నుంచి ముప్ఫయి వేల లైఫ్ స్టయిల్ కి రావడం కాంప్రమైజే కావచ్చు .. కానీ ఆమె కి అందులో ఏ బాధా ఉండకపోవచ్చు.
అలాగే బ్రతుకు తెరువు కోసం రోజు భత్యం మీద బ్రతుకుతున్న వాడు ఐకగై ని వెతుక్కొనే క్రమం లో ఇంకా కష్టపడచ్చు. చేతిలో ఉన్న పని .. తిండి పెట్టే పని ... అది లేకపోతే పస్తులే .. అయినా మనసు ఒక్క సారి 'ఈ పని నాది కాదు .. ఇంకా ఏదో ఉంది' అనుకున్నప్పుడు పస్తులు కూడా పెద్ద కష్టమనిపించవు.
ఓ కొటేషన్ ఉంది .. నీకు నచ్చిన పని ఎంచుకున్నావా నువ్వు జీవితం లో ఒక్క రోజు కూడా 'పని' చెయ్యక్కర్లేదు .. అంటే నీ పని 'పని' అనిపించదు అని.
ఒక్క సారి ఊహించండి ... ఉత్సాహంగా ఎగురుకుంటూ పని లో కి వెళ్లే పౌరులు ఎంత ఆనందంగా ఉంటారు ... డెస్క్ కి అవతల కూర్చున్న వ్యక్తి తన పనిని ప్రేమించిన వాడైతే కస్టమర్లకు, కంపెనీ కి ఎంత లాభం! విసుగులు, స్ట్రెస్ ఉండనే ఉండవు. ప్రొడక్టివిటీ అని డెడ్ లైన్స్ అని భయపెట్టక్కర్లేదు. ఎంప్లొయీ మోటివేషన్ అని, రిక్రియేషన్ ని లక్షలు లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు .. ఇన్సెంటివ్ ల కోసం పని చెయ్యడు ఎవడూ ఇంక... వర్క్, లైఫ్ బ్యాలెన్స్ లాంటివి పెద్ద ఛాలెంజ్ కాదు .. నచ్చిన, వచ్చిన పని చెయ్యడానికి అంత సమయం పట్టదు కదా ... స్ట్రెస్ కీ గురవ్వము ... ఇంటికి బాడ్ మూడ్ లో రాము .. అలిసిపోయి రాము!
ఆఖరు గా ఓ కేస్ స్టడీ ..
కటిక పేదరికం లో పుట్టి, ప్లాట్ఫారం మీద పడుకొని, ఎలాగోలాగ పార్ట్ టైం ఉద్యోగం చేస్కుంటూ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి IAS లో 101 వ ర్యాంకు సాధించారు శివగురు ప్రభాకరన్ (అతని కథ ఇక్కడ చదుకోవచ్చు)
1. ఎన్ని కష్టాలు వచ్చినా పట్టు వదల్లేదు కాబట్టి ఇది అతనికి నచ్చిన పని
2. ర్యాంక్ సాధించాడు కాబట్టి అతనికి బాగా వచ్చిన పని
3. ఇన్ని కష్టాలు అనుభవించినవాడు మంచి పరిపాలన సాగించే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇది ప్రపంచానికి కావాల్సిన పని
4. IAS ఆఫీసర్ల కి గౌరవం తో బాటు జీతం కూడా ఉంటుంది కాబట్టి డబ్బులు తెచ్చే పని!
ఐకగై థియరీ .. హెన్స్ ప్రూవ్డ్ 😊
baagundandi mee Ikagai explanation.
ReplyDeleteI faced lot of conflicts during working and non working days. inkaa cheppaali ante, ippatiki.
Anduke maa annayya eppudu oka maata cheppevaadu. "Buddhi karmaanusaarini" ani.
Manam ishtam vunnaa lekunna pani chestoo pote, manaku teliyakundaa manam chese pani meeda ishtam perugutundi ani.
More or less meeru ichina conclusion kooda ade anipinchindi naa percedption ki. :)
One more thing,
vooruko budhi kaaka raastunnaanu... Anyadhaa bhaavinchakandi.
youtube channel lo vantalu pettina andariki dabbulu raavu. vachinaa naamamaatram. ippati restrictions valla, small players andariki idi oka vyaapakam tappa monetization scope ekkuva ledu.