యే కౌన్ చిత్రకార్ హై ...

ఈ బ్లాగ్ పోస్ట్ లో నా పని చాలా సులువు.

నా ప్రయత్నం ఎప్పుడూ నా మనసు కి తాకిన అనుభూతులని పంచుకోవడమే. అది మాటల్లో పెట్టడం ఒక బాధ్యత గల పని గానే భావిస్తాను.

కానీ ఈ రోజు నేను పంచుకోబోతున్న అనుభూతిని నేను పరిచయం చేస్తే చాలు. వర్ణించక్కర్లేదు. మీకు మీరుగా అనుభూతి చెందే వీలుంది.



ఈ ఫోటో లో అమ్మాయి మోడల్ కాదు. యూట్యూబ్ లో ఒక ఛానెల్ నిర్వహిస్తుంది. ఈ ఛానెల్ లో ఒక్కొక్క వీడియో మన ని ఆమె లోకానికి తీస్కెళ్ళిపోతుందంటే నమ్మండి! 

ఆమె పేరు యోనా. Jonna Jinton. (వాళ్ళ భాష లో 'జె' అక్షరం 'య' గా పలుకుతారు) స్వీడన్ లో పది గడపలు ఉన్న పల్లెటూరిలో ఉంటుంది. ఈ పల్లె ప్రత్యేకత ఉత్తరధృవానికి దగ్గరగా ఉండటం. 

ఇక్కడ భూమి మనకి పరిచయం లేని ఎన్నో రంగులు చూపిస్తుంది .. అక్షరాలా.  ట్రావెలింగ్ ఆసక్తి ఉన్న ఎవరైనా నార్తర్న్ లైట్స్ గురించి వినుంటారు. ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఆకాశం కొన్ని కాలాల్లో రంగురంగులు గా మెరవటమే నార్తర్న్ లైట్స్ అంటే. 

ఇది చూడటానికి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి, కొన్ని లక్షలు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడరు ఔత్సాహికులు. అలాంటిది ఆమె ఇల్లు ఆ లైట్ల కిందే! 

ఇదంతా యాదృచ్చికంగా జరిగిపోయింది మాత్రం కాదు. 

ఆమె చదువు పూర్తయ్యాక సిటీ తనకి పడదని గ్రహించింది. నగరం లో ఉండటమే ఆమె కి స్ట్రెస్ కలిగించేదట. అందుకే ఆమె మనసు సూచించిన దిశ గా అడుగులు వేసింది ధైర్యంగా. 

చేతిలో డబ్బుల్లేవు, ఉద్యోగం లేదు. కేవలం పదిళ్లు ఉన్న పల్లెటూరి లో పెద్దగా సౌకర్యాలు లేవు. కానీ తన కుటుంబం లో పన్నెండు తరాల వారికి అనుబంధం ఉన్న ఊరు అది. అక్కడ ఒంటరిగా ఉండటం మొదలుపెట్టింది. 

బ్రతుకు తెరువు కోసం పక్కనే ఉన్న పొలం లో పని చేసేది. 

ఇలా ఉంటూనే తన చుట్టూ విరగకాచిన ప్రకృతి తో సహజీవనం మొదలుపెట్టింది. ప్రకృతి కూడా ఈ అమ్మాయి తో స్నేహం చేసింది అనిపిస్తుంది ఈమె వీడియో లు చూస్తే. 

వారి ప్రాంతం లో పశువుల కాపరులు సంప్రదాయంగా పశువుల్ని పిలిచే ఓ రకమైన పిలుపు ని సాధన చేసింది. 

ఆమె పిలుపు విని ఆవులు ఆమె వైపు వస్తున్న ఈ వీడియో చూడండి.

ఆమె పాడుతుంది, బ్లాగ్ రాస్తుంది, యూట్యూబ్ లో వ్లాగ్ (వీడియో బ్లాగ్) చేస్తుంది.. వారి ప్రాంతపు సంప్రదాయాలు పరిచయం చేస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రకృతి లో సహజంగా దొరికే పదార్ధాల నుంచి రంగులు తయారు చేసి ఆ రంగులతోనే పెయింటింగ్ వేస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాకపోయినా డ్రోన్ కెమెరా, ప్రొఫెషనల్ లెన్స్ అన్నీ మెల్లగా సమకూర్చుకొని తన ముంగిలి లోని ప్రకృతిని అత్యద్భుతంగా కాప్చర్ చేస్తుంది. 

ఏది చేసినా దానికి స్ఫూర్తి తన చుట్టూ ఉన్న ప్రకృతే అంటుంది. 

తను చేసే పని ఆ అమ్మాయి కి ఎంత ఇష్టం అంటే తన కుగ్రామం లో ఇంటర్నెట్ లేకపోతే 120 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ళ తమ్ముడి సిటీ కి వచ్చి ప్రతి వీడియో అప్లోడ్ చేసేది. 2019 డిసెంబర్ లో వాళ్ళకి ఫైబర్ ఇంటర్నెట్ వచ్చింది. అప్పటి వరకూ ఆమె ఇదే చేసేది. 

అక్కడ దొరికే బిర్చ్ (వీటిని తెలుగు లో ఏమంటారో తెలీదు) చెట్ల నుంచి శాప్ (అంటే ఒక రకమైన నీటి లాంటి ద్రవం) సేకరిస్తుంది. అది బాటిల్స్ లో నింపి తాగుతుంది. 

ఆమె దైనందిన జీవితం ఇదే. 

శివుడి కోసం హిమాలయాల్లో తపస్సు చేసిన పార్వతి ని నేను చూడలేదు. కానీ నాకు అనిపించింది ఆవిడ ఇలాగే జీవించి ఉంటారు అని. 

ఈమె వీడియో ప్రతీది మనని  ప్రకృతి ని ఓ అడుగు దగ్గరచేస్తుంది. మనం జీవిత కాలం లో ఇవన్నీ ప్రత్యక్షంగా చూడలేకపోవచ్చు.  పోనీ వెళ్ళే వీలు కలిగినా ఆ ప్రదేశాలలో ఇంత సమయం ఉండలేకపోవచ్చు. ఆ లోటు లేకుండా చేస్తోంది ఆ అమ్మాయి. ఒక వీడియో లో అంటుంది 'మీ అందర్నీ ఇలా ఈ వీడియో లోంచి లోపలి లాగేసి ఇక్కడ ఈ వాతావరణాన్ని చూపించగలిగితే ఎంత బాగుండో కదా' అని. ఆమెకి తెలియదు తను ఆ పనే చేస్తోందని. 

ఒక వీడియో లో మంచు పాటలు వినిపించింది. నీరు మంచు గడ్డ గా మారినప్పుడు దానిలో బీటలు ఏర్పడతాయి. అప్పుడు వాటి నుంచి వచ్చే సౌండ్స్ ని రికార్డ్ చేసింది ఈ అమ్మాయి. 

రెండు గంటల పాటు ఉన్న రికార్డింగ్ ఏ మెడిటేషన్ మ్యూజిక్ కి తీసిపోదు. (నేను అది వింటూనే ఈ బ్లాగంతా పూర్తి చేసాను) 

ఆ అమ్మాయి ఛానెల్ ద్వారా నే ఓ మంచి అబ్బాయి పరిచయం అయ్యాడు. యోహాన్ ఆ అబ్బాయి పేరు. అతని స్వభావం ఈ అమ్మాయి స్వభావం లాంటిదే. అతను వెండి తో నగలు డిజైన్ చేస్తాడు. ఇద్దరూ పెళ్లి చేస్కుని అక్కడే నార్తర్న్ లైట్స్ కింద కాపురం చేస్తున్నారు. 

ఆమె వ్లాగ్స్ లో అన్నీ వివరంగా చెప్తుంది. అక్కడ వాతావరణం మనకి పరిచయం లేనిది కాబట్టి చాలా సందేహాలు ఉంటాయి మనందరికీ. వాటన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్తుంది. 

అక్కడ ఎలుగుబంట్లు ఉంటాయా అని అడిగారొకరు. ఉంటాయి, నేను వాటి స్పేస్ వాటికి ఇస్తాను' అని చెప్పింది. నా కిలోమీటర్ రేడియస్ లో ఎలుగుబంట్లు ఉంటే నార్తర్న్ లైట్స్ మాట దేవుడెరుగు ... నేను ముందు అక్కడి నుంచి పారిపోతాను! ఈ అమ్మాయి స్పేస్ అంటోంది! ఆమె కి తన చుట్టూ ఉన్న పర్యావరణం తో సహజీవనం అంత బాగా అలవాటైంది. 

ఆమె అనుభవాలన్నీ ఆమె తీసిన ఫోటోలంత అందమైనవి కావు. ఒడిదుడుకులు బాగా ఉంటాయి అని కూడా షేర్ చేసుకుంది తను. ముఖ్యంగా ఆడపిల్ల ఒంటరిగా ఉండటం (పెళ్ళయ్యే ముందు వరకూ) మనందరికీ ముందు భయం కలిగిస్తుంది. అందులో ఆ అమ్మాయి ఒంటరి గా ఉండటమే కాదు అర్ధరాత్రి కెమెరా తీస్కొని ఆ ఊరి లో పారే సెలయేరు దగ్గరకి వెళ్తుంది. ఒక్కతే చుట్టూ ఉన్న అడవి ప్రాంతం లో తిరుగుతుంది. నాకు సెకండ్ హ్యాండ్ భయం బాగా వేసింది. (అంటే నేను ఆ సిట్యుయేషన్ లో లేకపోయినా ఆ అమ్మాయి కోసం భయం వేసింది). 

కానీ ఆమెకి ప్రకృతి నుంచి ఉన్న ప్రమాదాల కంటే ఓ మనిషే డేంజర్ గా మారాడు. 

ముందు ఆన్లైన్ లో ఆ తర్వాత ప్రత్యక్షంగా ఒకడు ఆమె ని స్టాక్ (stalking ... వెంటబడటం) మొదలుపెట్టాడు. ఆమె పోలీసులకి రిపోర్ట్ ఇచ్చి అతన్ని పట్టించింది. అప్పటికే ఆమె భర్త ఆమె తో ఉన్నాడు కూడా. 

ఈ అనుభవం అయ్యాక కూడా ఆమె ఏ మాత్రం బెదరలేదు. తన అనుభవాలు ఓ వీడియో లో షేర్ చేసుకుంది. అతను ఆమె పెయింటింగ్ స్టూడియో ని నాశనం చేస్తే అంతా శుభ్రం చేసుకొని అగర్బత్తులు పెట్టుకుంది. అంతే కానీ తన జీవన శైలిని మార్చుకోలేదు. ఇది చాలా గొప్ప విషయం అనిపించింది నాకు. 


ఇది ఆమె ఛానెల్. ఇయర్ ఫోన్స్ వాడండి వీలుంటే. కంటికి, మనసుకి, ఆత్మకి ఓ చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ రోహిణి కార్తె సమయం లో మరీ అవసరం కదూ మనకి! 

ఇంగ్లీష్ భాష అంత ధారాళంగా రాదు ఆ అమ్మాయికి. కొన్ని కొన్ని పదాలు తెలుసుకొని వాడుతూ ఉంటుంది. 

ఆమె స్వభావం ఎంత సరళంగా ఉంటుందో. వీడియోలు తీసేటప్పుడు ప్రకృతి ఆడే దోబూచులాట ని నవ్వుతూ లైట్ గా తీసుకుంటుంది. ఒక రోజు కుదరకపోతే ఇంకో రోజు ప్రయత్నిస్తుంది. ఆరు నెలల శీతాకాలం ... అరగంట మాత్రం కనిపించే సూర్యుడు, ఆరునెలల ఎండాకాలం ... అస్సలు అస్తమించని సూర్యుడు ... ఈ వాతావరణం లో అనుభవమయ్యే జీవత పాఠాలు మనతో పంచుకుంటూ ఉంటుంది. 

ఇటీవలే ఈమె ఛానెల్ సుబ్స్క్రైబర్స్ ఒక మిలియన్ మంది అయ్యారు. అంత అర్హత ఉంది ఆమెకి. 

ఆమె ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది. ఆమె పేరుతోనే. 

తను బ్రతికేది, మనం బ్రతికేది ఇదే భూమి. 

ఈ భూమి మీద మనం చూడని కొత్త ప్రపంచాలు ఇంకా ఎన్నో కదా! 

హిందీ లో ఓ పాట ఉంటుంది 

'యే కౌన్ చిత్రకార్ హై ... యే కౌన్ చిత్రకార్ హై ...'

ఆ పాట గుర్తొస్తోంది ... 

ఎవరా చిత్రకారుడు .. భూమి కి పచ్చ రంగు, ఆకాశానికి నీలం రంగు .. ప్రతి పువ్వు కి సింగారాలు అద్దిన ఆ చిత్రకారుడెవడు? 

ధ్వజ స్థంభాల్లాంటి దేవదారు వృక్షాలు, గులాబీ సౌరభాలు, వసంత వనాలు ... ఏ కవి కల్పనలో పుట్టిన చమత్కారాలో ఇవి 

ప్రకృతి పవిత్రత ని ఆరాధించు.... 
ఈ గుణాలని మనసు కి అలవర్చు ... 
నీ నుదుటి ఎరుపు మెరిపించు... 
ప్రతి కణం లోంచి తొంగి చూస్తున్న విరాట్రూపాన్ని వీక్షించు .. 
మన కన్ను ఒకటే ... కానీ వాడివి వేయి అని గ్రహించు! 



Comments

  1. Really inspiring story. Thanks for introducing her channel.

    ReplyDelete
  2. అవును చూసాను , చాలా మంచి ఛానల్. ఆ అమ్మాయి తీసే వీడియోస్ కూడా చాలా మంచి క్వాలిటీ లో ఉంటాయి .
    అంతే కాదు రాళ్లు మీద రాళ్లు నిలబెట్టడం అనేది తనకి మాత్రమే తెలిసిన విద్య . నేను చూసిన ఫస్ట్ వీడియో ఏంటంటే , ఆ అమ్మాయి ఐస్ లో స్నానం చేయడం . ఆ చలి లో ఉండటం , కేవలం వాళ్ళు ( స్కాండినేవియన్ , nomidac , etc ) మాత్రమే చేయగలరెమో , మనలాంటి ఉష్ణ మండలం లో పెరిగిన జనాలు కి కేరళ లాంటి ఊరే బెటర్ . మంచి ఛానల్ పరిచయం చేశారు .
    :Venkat

    ReplyDelete
  3. 40 సంవత్సరాల క్రితం డాక్టర్ సి నారాయణరెడ్డి గారు రాసిన మంచి పాట గుర్తుకొచ్చిం ది ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అనే పాట గుర్తుకు వచ్చింది

    ReplyDelete
    Replies
    1. ఆకులో ఆకునై... అన్న పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

      Delete
  4. ఆ పాట విని నిజంగా అలా ఉండగలిగితే ఎంత బాగుండు అనుకునే వాళ్లకు ఆ పాట నిజం చేసింది ఆ అమ్మాయి ఎంత అదృష్టం చాలా బాగుంది

    ReplyDelete
  5. రెండో సంగతేంటంటే నాకు వెంటనే గుర్తుకు వచ్చింది సీతమ్మవారు 14 సంవత్సరాలు ఆనందంగా వనవాసం చేశారట ఆవిడ రాజభోగాలు అనుభవించినా కూడా ఆ వనవాసం గుర్తు తెచ్చుకోవడానికి తిరిగి అక్కడికి వెళ్లి గడుపుదాం అనుకున్నారు. ప్రకృతి అంటే అంత ప్రేమ ఇది చదివితే అది గుర్తుకొచ్చాయి చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు

    ReplyDelete

Post a Comment