2023 నుంచి నేను ....
2022 సంవత్సరం ఇంకో పక్షం రోజుల్లో అయిపోతోంది. కొత్త సంవత్సరం రాబోతోంది.
ఈ టైం లో రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు. కాలెండర్ మారడం తప్పించి ఇందులో ఏముంది అని లైట్ తీసుకొనే వారు.
రెండో రకం వ్యక్తులు కొత్త సంవత్సరం అంటే ఏదో కొత్త ఉత్సాహం ఫీల్ అవుతారు లేదా ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి ఈ సంవత్సరం అనుకుంటారు ... ఓ హోప్, రానున్న సంవత్సరం పట్ల బోలెడు ఆశలు, ఎలా ఉండబోతోంది అనే కుతూహలం ఉన్న వారు వీరు. సరిగ్గా ఇలాంటి వారే న్యూ ఇయర్ రెసొల్యూషన్స్ .. నూతన సంవత్సరం కోసం కొన్ని తీర్మానాలు తీసుకుంటారు.
నేను రెండో టైపు అని చెప్పడం నా కర్తవ్యం గా భావిస్తున్నాను.... ఎవరూ అడగకపోయినా.
కాలమహిమ లో మనం చెప్పుకున్నట్టు ఇంగ్లీష్ కాలెండర్ ని ఇష్టం వచ్చేసినట్టు మార్చేసిన చరిత్ర ఉంది. దాని దృష్ట్యా అసలు ఇప్పుడు వచ్చే జనవరి ఒకటి 2023 అసలు ఆ తేదీ ఏ నా అంటే కాదు మరి. రోడ్డు మీద పానీపూరి ఇష్టంగా తింటుంటే "ఇది అసలు ఎలా తయారు చేస్తారు తెలుసా" అని వీడియోలు చూపిస్తే ఏమంటాం? ఒక్కోసారి కఠినమైన ... లేదా ఆ టైం కి అనవసరమైన నిజం కంటే భ్రమే బాగుంటుంది .. అది కూడా ప్రపంచం అంతా మనతో పంచుకొనే భ్రమ అయితే మరీనూ! అసలు ఈ ప్రపంచమే భ్రమ కదండీ బాబూ మన వేదాంతం ప్రకారం. ఎండ్ అఫ్ ఆర్గ్యుమెంట్.
తమాషా ఏంటంటే హిందూ కాలెండర్ ఫాలో అయ్యే వాళ్ళకి రెండు కొత్త సంవత్సరాలు ఉగాది తో కలిపి. కానీ మన సంస్కృతి లో ఈ తీర్మానాలు తీసుకోవడం ఎక్కడా లేదు. మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తాం. అంటే ఏంటి ... మన రాశి వారికి నవగ్రహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది జ్యోతిష్కులు చెప్పేస్తారు. అంటే మన నవగ్రహాలు తీర్మానాలు తీసేసుకుంటాయి .. వీడికి ఈ సంవత్సరం ఇలా ఏడుస్తుందని. బాగుంటే నమ్మడం, బాలేకపోతే జ్యోతిష్య శాస్త్రాన్ని తీసిపారేయడం మినహా మనకి పెద్దగా ఆప్షన్స్ లేవు.
అదే ఈ ఇంగ్లీష్ న్యూ ఇయర్ లో మన విధి మనమే రాసుకోవచ్చు. కనీసం ఆన్ పేపర్. అది నిజమవుతుందా లేదా అన్నది తర్వాత విషయం. (ఇది మౌలికంగా తూర్పు పడమర సంస్కృతుల లో ఉన్న భేదానికి ప్రతిబింబంగా భావించచ్చు. తూర్పు లో కర్మ ఫిలాసఫీ, భగవంతుడికి సరెండర్ అయ్యే సంస్కృతి. పడమర లో మనిషే కేంద్ర బిందువు .. అతను అనుకున్నది జరగాలనుకొనే పంతం కనిపిస్తుంది).
ఇక్కడికొచ్చేసరికే పేచీ వస్తుంది. అందరూ కొత్త సంవత్సరం బోలెడు తీర్మానాలు తీసుకుంటారు. కానీ అందులో ఎంత మంది సక్సెస్ అవుతారు? అందుకనే అసలు ఈ టాపిక్ ఏ జోక్ అయిపోయింది ఈ మధ్య కాలంలో.
ఈ విషయంలో నేను ప్రాక్టికల్ గా చాలా అనుభవం సంపాదించాను. ఆ అనుభవ సారమే ఈ పోస్టు.
రెసొల్యూషన్స్ విషయం లో రెండు దశలు ఉంటాయి. అవి ఏంటో నిర్ణయించుకోవడం, ఆచరించడం. నా అనుభవం లో మొదటిది సరిగ్గా చేస్తే రెండోది ఈజీ అవుతుంది.
1. నిరుడు తీసుకున్న నిర్ణయాల్లో ఫెయిల్ అయినా సరే నిరుత్సాహ పడకుండా ప్రతి సంవత్సరం ఈ అలవాటు ని కంటిన్యూ చెయ్యాలి. ఇది చాలా ముఖ్యం. చిన్నవో, పెద్దవో ... మనం తీసుకొనే రెసొల్యూషన్స్ మన గురించి మనకి ఎన్నో విషయాలు చెప్తాయి. అలాగే ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మన తీర్మానాల్లో క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి అందరికీ బరువు తగ్గడం ఓ గోల్ ఏ. ఓ సంవత్సరం "జిమ్ కి రెగ్యులర్ గా వెళ్ళాలి' అని గోల్ పెట్టుకున్నారు అనుకుందాం. కానీ వెళ్లలేకపోయారు. వచ్చే సంవత్సరం 'బరువు తగ్గాలి' అని పెట్టుకోవాలి అని చెప్తుంది అనుభవం. అది జిమ్ లో అయితేనే, వాకింగ్ చేస్తూ అయితేనే, ఆరోగ్యంగా తినడం ద్వారా అయితేనే. ఇక్కడ సక్సెస్ కి ఛాన్స్ ఎక్కువ. పోనీ ఇది కూడా సరిగ్గా చేయలేకపోయారు అనుకుందాం. ఆ తర్వాత సంవత్సరం మిమ్మల్ని మీరు తెలుసుకున్న జ్ఞానం చెప్తుంది 'ఆరోగ్యంగా ఉండాలి' అని రాసుకో చాలు. అన్నీ అందులోనే వస్తాయి అని. ఇలా తీర్మానాల క్వాలిటీ పెరిగి మీకు మంచిదైన అలవాటు త్వరగా మీ లైఫ్ స్టైల్ లో భాగమవుతుంది.
2. పర్ఫెక్షనిజం, అతిగా అంచనాలు వేసుకోవడం ... ఇవి అనవసరమైన నిరుత్సాహాన్ని కలిగిస్తాయి ఈ దారిలో. ఓ కొత్త హాబీ నేర్చుకోవాలి అనుకున్నారు. మూడు నెలలు రెగ్యులర్ గానే నేర్చుకున్నారు కానీ ఇంక కుదర్లేదు. సున్నా కంటే మూడు నెలలు ఎక్కువే. ఏమీ చెయ్యని స్థానం నుంచి ఒక్క అడుగు ముందుకు వేసినా చాలు. ఇది తెలుసుకోవాలి.
3. తీర్మానాలన్నీ పాత అలవాట్లు మార్చుకోవడం/మానెయ్యడం, కొత్త అలవాట్లు చేస్కోవడం .. వీటి చుట్టే తిరుగుతాయి మీరు గమనించినట్లయితే. అలవాట్ల మీద బోల్డు పరిశోధనలు చేసి మనకి ఎన్నో చిట్కాలు చెప్తున్నారు ఈ మధ్య. అలవాట్ల గురించి అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే .. మన మెదడు లో కొన్ని నరాలు మన అలవాట్ల ప్రకారం ఓ రకంగా వైర్ అయిపోయి ఉంటాయి. వాటిని మార్చాలి అంటే ఎక్కువ రోజులు అదే పని వరసగా చేస్తూ మెదడు కి అలవాటు చెయ్యాలి .. అప్పుడు ఆ వైరింగ్ మారుతుందిట. కొంత మంది 21 రోజులు వరసగా చేస్తే ఓ అలవాటు స్థిరమై పోతుంది అంటారు. కొంత మంది 44 రోజులంటారు. నా అనుభవం ప్రకారం మెదడు మెదడు కి ఈ సంఖ్య మారుతుంది. వయసు ని బట్టీ కూడా. 100 రోజులు చేసాక మళ్ళీ మొదటికి వచ్చిన అనుభవం కూడా ఉంది నాకు. ఇది కూడా ప్రక్రియ లో భాగమే అని తెలుసుకుంటే చాలు. మనని మనం తిట్టుకోవడం మాని అలవాట్ల శాస్త్రాన్ని తెలుసుకొంటే జర్నీ సులువు అవుతుంది.
4. ఈ జర్నీ తిన్నగా ఉన్న రోడ్డు మీదుగా వెళ్తుంది అనుకోవడం ఇంకో పొరపాటు. రెండు అడుగులు ముందుకేసి ఓ అడుగు వెనక్కేయడం జరగవచ్చు ఒక్కో సారి. ఇది నార్మల్ అని అర్ధం చేసుకోవాలి.
5. కొన్ని చచ్చు పుచ్చు తీర్మానాలు ఉంటాయి. అంటే ఇవి మనకి అస్సలు అవసరం లేనివి. అందరూ తీస్కుంటున్నారనో, ఇవి ముఖ్యమని మనమే భ్రమ పడో మనం లిస్టు లో రాస్కుంటాం. వీటిని గుర్తించాలి అంటే మీకు దగ్గర వ్యక్తులు, మీ శ్రేయోభిలాషులకు మీ లిస్టు చూపించండి. వాళ్ళు ఇవి ఏరేస్తారు. నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, బరువేం తగ్గక్కర్లేదు .. దాని బదులు 'పొద్దున్నే లేవాలి' అని పెట్టుకో అని అన్నారనుకోండి .. మీకు నచ్చకపోయినా మీ మంచి కోరి చెప్తున్నారు కాబట్టి ఆ సలహా ని పరిగణన లో కి తీస్కోండి.
6. మనం ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా అయ్యి చావవు కొన్ని. వీటివల్ల మీ ఉత్సాహం డౌన్ అవుతూ ఉంటుంది. అవి నిజంగా మీకు అవసరమా అని ప్రశ్నించుకోండి. అవసరమే అంటే వాటిని అప్రోచ్ చేయడం లో మీ పంథా మార్చండి. ఆ తీర్మానాన్ని చిన్న చిన్న స్టెప్స్ గా విడదీసి కూడా సాధించచ్చు. పైన చెప్పినట్టు ఎడిట్ చేసి కూడా సాధించచ్చు.
7. రెసొల్యూషన్ తీస్కొని అందరికీ చెప్పమంటారు. వాళ్ళు మీకు గుర్తు చేస్తూ ఉంటారు అని. ఇది మంచిదే. సక్సెస్ అవ్వకపోయినా ఫర్వాలేదు. మీ జర్నీ మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరికి ప్రేరణ గా నిలుస్తుంది. కొత్త అలవాట్లు ఏర్పడే అప్పుడు .. పాత అలవాట్లు (ముఖ్యంగా చెడు అలవాట్లు) అయిన సర్కిల్ లోనే ఉండకూడదు అని గుర్తుంచుకోవాలి. వాళ్ళు వెనక్కి లాగేస్తారు. ఇది చాలా మంది తెలుసుకోలేక, ఆచరణ లో పెట్టడానికి మొహమాట పడి .. తమ తీర్మానాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు.
8. ఒకే సారి ఎక్కువ నిర్ణయాలు తీసేసుకోవడం కూడా ఓ ప్రాథమిక తప్పిదం. ఆరంభ శూరత్వమో, అత్యుత్సాహమో ... జనవరి ఒకటో తారీఖున ఐదింటికి లేచి, జింకెళ్ళిపోయి, ఆవేశంగా ఎక్కువ చేసేసి, శరీరం పట్టేసి, అయినా పట్టించుకోకుండా మిగిలిన రోజంతా అనుకున్న తీర్మానాలన్నీ ఒకే రోజు చేసేసి మిగిలిన 364 రోజులూ మానేసేకంటే ఒకే అలవాటు ని టార్గెట్ చేసి అది జీవితం లో భాగమయ్యాక ఇంకో దాని జోలికి వెళ్తే సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ.
9. తీర్మానాలు ఆచరణ లో పెట్టే తారీఖు జనవరి ఒకటి కాదు. ఇది సీక్రెట్ ట్రిక్. జనవరి ఒకటి కన్నా ఒకటి రెండు వారాల ముందే మీరనుకున్న తీర్మానాన్ని ట్రయల్ రన్ చేసుకోవాలి. అక్కడే మీకు తెలిసిపోతుంది .. ఇది కరెక్టా .. నేను చెయ్యగలుగుతానా .. ఇలాంటివన్నీ. జనవరి ఒకటికి అలవాటే అయిపోతుంది అసలు. కానీ ఆ రోజు మొదలు పెడితే నిరుత్సాహం మినహా ఇంకేమీ మిగలదు.
10. మెటీరియలిస్టిక్ తీర్మానాల తో పాటు కళాత్మకమైనవి, సేవా పరమైనవి, ఆధ్యాత్మికమైనవి... లేదా 'ఈ సంవత్సరం నేను ప్రశాంతంగా/హ్యాపీ గా ఉండాలనుకుంటున్నాను' ... ఇలాంటివి కూడా పెట్టుకుంటే బాగుంటుంది
ప్రతి మనిషి కి ఆయుష్షు ఉన్నంతవరకూ ఏదో ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది, ఏదో ఒక కోణం లో మెరుగవ్వాల్సి ఉంటుంది. ఇది తెలుసుకొని ఆ వైపు ప్రయత్నించే వాళ్ళు నిత్య విద్యార్థులుగా, మెరుగైన మానవులుగా కనిపిస్తూ ఉంటారు. వీరందరూ ధనవంతులు, మేధావులు, సన్నగా మెరుపు తీగలా కనిపించేవారు... ఇలా ఉండకపోవచ్చు. కానీ వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వీరు మరింత మెరుగు చేస్తారు అని మాత్రం నేను నమ్ముతాను.
ఆ మార్గం లో ఎంతో సహాయం చేసేవి ఈ రెసొల్యూషన్స్. చేతిలోంచి జారిపోతున్న సమయాన్ని ఓ సంఖ్య లో ఇమిడ్చి, దాన్ని సద్వినియోగం చేస్కొనే అవకాశం ఇస్తాయి ఇలాంటి అలవాట్లు.
చూస్తూ చూస్తూనే సంవత్సరాలు గడిచిపోతాయి. '2022... నేను గిటార్ మీద ఓ పాట వాయించిన సంవత్సరం ' ... '2021... స్మోకింగ్ మానేసిన సంవత్సరం' ... '2016.. అనుకున్న ప్రకారం డబ్బులు దాచుకొని తాజ్మహల్ చూసిన సంవత్సరం' ఇలా మైలు రాళ్లు గా మలచుకుంటే ఎంత బాగుంటుంది కదా!
తీర్మానాలు తీసుకొనే వారి లో నూటికి నలభై ఆరు మంది సక్సెస్ సాధిస్తారట. అస్సలు తీర్మానాలు తీస్కోని వారిలో తమ గోల్స్ ని రీచ్ అయ్యే వారి సంఖ్య కేవలం నూటికి నలుగురు!
ఈ సంవత్సరానికి ఇదే చివరి బ్లాగ్. వచ్చే సంవత్సరం కలుస్తాను!
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్లాగు బాంధవులందరికీ!
హ్యాపీ 2023!
Comments
Post a Comment