కానుకా శాస్త్రం

నాకు పుట్టినరోజులంటే ఎంత ఇష్టమో 'నేను పుట్టాను' అనే పోస్టు లో వెళ్లబోసుకున్నాను ... గుర్తుందా? 

పిచ్చి ముదిరి నా పుట్టినరోజులే కాక పక్క వాళ్ళ పుట్టినరోజులంటే కూడా బాగా ఉత్సాహం పెరిగిపోయింది అది రాసినప్పటి నుంచీ. 

నాకంటే చిన్న పిల్లలకి 'నేను మూడు పుట్టినరోజులు జరుపుకుంటాను... నువ్వు కూడా జరుపుకోవచ్చు' అని బాగా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాను. వాళ్ళ తల్లితండ్రులు నన్ను బాగా తిట్టుకున్నా సరే. అయితే నేను ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే ఈ తరం పిల్లల కి మూడు పుట్టిన రోజుల ఆశ చూపించి వారు పుట్టిన తిథి, నక్షత్రం, తెలుగు మాసం, తెలుగు సంవత్సరం పేరు తెలుసుకుని గుర్తుంచుకునేలా చేస్తున్నాను. ఐటం సాంగ్ లో మెసేజ్ ఓరియెంటెడ్ లిరిక్స్ పెట్టినట్టు అన్నమాట. 

పిల్లలు ఆల్రెడీ పుట్టినరోజులంటే excited గా ఉంటారు కాబట్టి అక్కడ నా పని సులువు. 

కానీ ఈ పెద్దవాళ్ళున్నారే ... అబ్బా.. ఎందుకో వీళ్ళకి పుట్టినరోజులంటే అంత నీరసం. 

మీరు ఏమైనా అనుకోండి.  బాగా డబ్బులు సంపాదించుకుంటూ, మంచి పొజిషన్ లో ఉన్నవాళ్లు పుట్టినరోజు జరుపుకోపోతే నాకు మహా చికాకు. ఏ... అంత కష్టం ఏం వచ్చిందని? త్రివిక్రమ్ గారు చెప్పినట్టు డబ్బున్న వాళ్ళ కష్టాలు నాకు అర్ధం అవ్వకపోవచ్చు. నాకు అర్ధం చేసుకోవాలని కూడా లేదు. కష్టాలు కష్టాలే... పుట్టిన రోజు పుట్టిన రోజే. 

అలా కాదు... పెద్దవారు అయ్యుండి కూడా పుట్టిన రోజు అంటే ఉత్సాహం కలిగి ఉన్నారు అంటే మీకివే నా వందనాలు. 

పుట్టినరోజుకి అందం .- కొత్త బట్టలు etc కాదు. అవన్నీ ఒకెత్తు. బహుమతులు ఒకెత్తు. 

చిన్నపిల్లలకి చాక్లెట్ లు, పెద్దవాళ్ళకి కవర్ లో వెయ్యి నూట పదహార్లు ... ఇవే బహుమతులు అంటే నాకు మళ్ళీ చికాకు. 

అలా అని మార్కెట్ లో దొరికే గ్రీటింగ్ కార్డులు అవీ కూడా సరైన బహుమతులు కావు నా ఉద్దేశం లో. 

అవి మనకి తెలిసీ తెలియని వాళ్ళకి ఒకే. 

కానీ ఆత్మీయులు అనుకున్న వాళ్ళకి అలా ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి? 

అసలు పుట్టినరోజుకి బహుమతులు ఏం ఇవ్వాలి అంటే ప్రాసెస్ మినిమమ్ రెండు నెలల ముందు నుంచీ మొదలు పెట్టాలి. 

గుర్తుంచుకోవలసిన విషయాలు 

1. బహుమతి అందుకొనే వారి వయసు, లింగం 

2. మనస్తత్వం - కొంత మందికి బహుమతి ఎంత ఖరీదైతే అంత నచ్చుతుంది.  కొంత మందికి 'లేటెస్ట్' వస్తువు ఏదైనా మొహం వెలిగిపోతుంది.  కొంత మందికి కళాత్మకత ఉంటుంది. కొంతమంది నిరాడంబరులు, మొహమాటస్తులు వారి కోసం మనం ఏదైనా ఖర్చు చేస్తే నొచ్చుకుంటారు ... 

3. వారు ఆ సంవత్సరం ఏ మూడ్ లో ఉన్నారు ... పిల్లలైతే ఏం కార్టూన్లు చూసి అభిమానిస్తున్నారు.. పెద్దవాళ్ళైతే 'అబ్బా ... ఆకుపచ్చ రంగు నాకు లేనే లేదు' అని మామూలుగా సంభాషణల్లో జరిగే డైలాగుల కి ట్యూన్ అయి ఉండటం లాంటివి 

4. వారి ఆర్ధిక హోదా .... ఒక్కో సారి కొంతమందికి అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏం ఇస్తాం? అనుకోకూడదు. హోదా తక్కువైతే పని సులువు. వాళ్ళ దగ్గర లేనివేవో ఇచ్చేయచ్చు 

ఎప్పుడైనా మీ బహుమతికి ఓ బడ్జెట్ పెట్టుకోవాలి. 

ఆ బడ్జెట్ సున్నా నుంచి మొదలవుతుంది అని మర్చిపోవద్దు. అంటే నో బడ్జెట్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. లో బడ్జెట్ కూడా ఇవ్వచ్చు.  ఐడియాలు బోల్డు ఉన్నాయి నా దగ్గర. 

స్ఫూర్తి ముఖ్యం. మనం ఆ బహుమతి లో పెట్టిన ఆలోచన ముఖ్యం. ఖరీదు కంటే కూడా. 

ఖరీదైన బహుమతులు ఇచ్చే అప్పుడు బహుమతి ఎలాగూ హిట్ కాబట్టి దాని చుట్టూ కొంత డ్రామా ఉండేలా చూసుకోవాలి. ఐ ఫోన్ ని కేక్ లో పెట్టి ఇవ్వడం (దీని కోసం ప్రత్యేకమైన కేకులు ఉన్నాయండి ... లక్ష రూపాయల ఐఫోన్ చుట్టూ కేక్ పిండి ని ఊహించుకోకండి. అసలే అంత పోసి ఇస్తున్నాం ... ఇంక మళ్ళీ కేక్ ఎందుకు అంటే .. నా బ్లాగ్ ఇక్కడ తో చదవడం ఆపేయండి ప్లీజ్) 

నా అనుభవం లో కి వచ్చిన కొన్ని మంచి బహుమతుల ఐడియాలు .. (ప్రైవసీ కారణాల వల్ల ఇవి నేను ఇచ్చుకున్నవో, పుచ్చుకున్నవో .. ఎవరికి .. ఎప్పుడు .. ఇలా చెప్పట్లేదు) 

పుట్టిన రోజు వయసు ని బట్టీ అన్ని వస్తువులని కొనియ్యడం ... ఆ వస్తువులు మామూలువైనా ఫర్వాలేదు. అదో సరదా. బహుమతులు ప్లాన్ చేసే టైం తక్కువున్నప్పుడు ఓ సూపర్ మార్కెట్ కి వెళ్లి కూడా ఈ లిస్టు పూర్తి చేయచ్చు. కాకపోతే అరవయ్యో పుట్టినరోజు లాంటివైతే ఇబ్బంది. అప్పుడు కూడా వ్రతాల్లో చెప్పినట్టు చిట్కా లేకపోలేదు. అరవై విభిన్నమైన వస్తువులు ఇచ్చే బదులు మొత్తం కలిపి అరవై .. అంటే మూడు పెన్నులు, నాలుగు పుస్తకాలు అలా అన్నమాట.. అలా  ఇచ్చుకోవచ్చు. ఫలితం తగ్గదు. 

ఓ తెల్ల టీ షర్టు కొని దాని మీద స్నేహితులందరూ/ఆత్మీయులందరూ మంచి మాటలు రాయడం ... విషెస్ రాసుకోవచ్చు, వారి మంచి గుణాలు రాయచ్చు ... ఏవైనా రాయచ్చు. అది ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది. 

కారు, ఐఫోన్, బంగారం, కెమెరా, సైకిల్, కుక్క పిల్ల, డైమండ్స్,  ... వారి చిరకాల వాంఛలు ... ఇలాంటివి ఉండనే ఉన్నాయి ... 

వారి మంచి ఫోటో ఒకటి ఎంచుకొని ఈ మధ్య వస్తున్న personalised gifts మీద ప్రింట్ చేయించడం ... మగ్స్ మీదా, టీ షర్టుల మీదా, ఫోటో ఫ్రేములు, పెన్నులు ఇలా 

ఇక కళాత్మక బహుమతుల దగ్గరకి వస్తే .... మన దగ్గరేమైనా కళ ఉంటే ఆ కళ తోనే బహుమతి ఇవ్వడం .. పాట, పెయింటింగ్, కవిత.. ఇలా 

నా దగ్గర బడ్జెట్ లేదు.. నా దగ్గర కళ కూడా లేదు అంటే ... మీ టైం ని ఇవ్వచ్చు. పుట్టిన రోజు  నాడు రెండు మంచి మాటలు కూడా బహుమానాలే కదా .. అలాగే వారి తో కూర్చొని ఆ సంవత్సరం ఏమైనా రెసొల్యూషన్స్ తీస్కుంటున్నారా అని అడిగి అవి రాసుకోవడం లో సాయం చేయడం, కలిసి సినిమా చూడటం (ఇంట్లోనే), ఏదైనా వండి పెట్టడం... 

చిన్నప్పుడు మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఓ కథ చదివాను. అమెరికా లో పల్లె లో ఉన్న ఓ సాధారణ కుటుంబం. తండ్రి ప్రతి రోజు నాలుగున్నర కి లేచి గొడ్ల చావిడి కి వెళ్లి పాలు పితుకుతాడు. ఏ రోజూ సెలవు తీసుకోటానికి లేదు పాపం. అతనికొడుకు ఆరేడేళ్ల వాడు. తండ్రి పుట్టినరోజు కి ఏవైనా చేయాలనుకుంటాడు. డబ్బు లేదు. తండ్రికి తెలీకుండా నాలుగింటికే అలారం పెట్టుకుంటాడు. పెట్టుకున్నాడే కానీ రాత్రంతా ఉత్సాహానికి నిద్ర పట్టదు వాడికి. అలారం మోగక ముందే ఆఫ్ చేసేసి శబ్దం చెయ్యకుండా పాలు పితికేసి, క్యాన్లలో నీట్ గా నింపేసి, గొడ్ల చావిడి శుభ్రం చేసేసి గబగబా తన గదిలోకి వెళ్లి ఏం తెలీకుండా దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. తండ్రి యధావిధి గా నాలుగున్నర కి లేచి చూస్తే .. తన పని అంతా ఎవరో చేసేసారు! తన తండ్రి ఆనందంగా మెట్లెక్కి తన గది వైపు వస్తుంటే ఇతని గుండె ఆ హడావుడి కి గట్టి గా కొట్టుకుంటూ ఉంటుంది. తండ్రి కళ్ళలో ఆనందం .... తండ్రికి పుట్టిన రోజు నాడు ఓ బహుమతి ఇచ్చానని చిన్నోడికి తృప్తి!

చెప్పానుగా ... బహుమతులకి డబ్బులక్కర్లేదని! 

నిజమైన బహుమతి తీసుకొనే వాళ్ళకి, ఇచ్చే వాళ్ళకి... ఇద్దరికీ ఆనందం  కలిగిస్తుంది. అదే గుర్తు!

బహుమతులంటే పుట్టినరోజులకే ఇవ్వరనుకోండి. పెళ్ళిళ్ళకి, ఇతరత్రా శుభకార్యాలకి కూడా ఇచ్చుకుంటాం. అవి  మరీ ఫార్మాలిటీ వ్యవహారాల్లాగా అయిపోయాయి ఈ మధ్య. ఫ్రీ గా తినకూడదు అని ఏవో తీసుకెళ్లడం. పెళ్లిళ్లలో అయితే మిక్సి లు, కుక్కర్ లు, వాల్ క్లాక్ లు ... యానివెర్సరీ కి వాట్సాప్ లో పువ్వుల జిఫ్ లు. ఇంతే గా. కానుకల శాస్త్రం లో వీటన్నిటివి రెండో స్థానం. 

మొదటి స్థానం మన పుట్టిన రోజు బహుమతులదే. 

ఈ బహుమతులకి సుగంధం అద్దే ముఖ్య కోణం - surprise aspect. వారికి తెలీకుండా ప్లాన్ చెయ్యడం.. ఇవ్వడం. దీనికోసం ఈ మధ్య వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పడిపోతున్నాయి తెలుసా?

మంచి బహుమతులు ఇవ్వడానికి ఓ ప్రమాదం కూడా ఉంది. హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్  కి ఉన్నదే. expectations. అంచనాలు పెరిగిపోతాయి. అవి మేనేజ్ చేసుకోవాలి. 

దీనిక్కూడా ఓ చిట్కా ఉంది. expect చేసిన రోజు గిఫ్ట్ ఇవ్వకూడదు. ముందో తర్వాతో ఇచ్చేయాలి. 

లవర్స్ గిఫ్ట్స్ ఓ పూర్తి సెపరేట్ అధ్యాయం.

గిఫ్ట్స్ కోసమే అమ్మాయిలు  అబ్బాయిలని తిప్పుకుంటారు అంటారు కదా.. అలాంటి వారి  మాట్లాడుకోవద్దు. 

నిజంగా ఓ మంచి బంధం ఉండి ప్రేమించుకునే వారికి ఈ కానుకలు ఓ మంచి మాధ్యమం తమ ప్రేమ ని వ్యక్తం చేసుకోడానికి. లవ్ లాంగ్వేజెస్ ... అంటే ఒక వ్యక్తి ప్రేమించే శైలి... భాషలు వేరు వేరు ఉంటాయట. అందులో గిఫ్ట్స్ కూడా ఒకటి అట. 

ఊరికే ఈ పోస్టు కి గాంభీర్యాన్ని అందించడం కోసం బహుమతుల ఇండస్ట్రీ విలువ ఎంత అనే అంకెలు రాసి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. 

నేనొక సర్వీస్ ఓపెన్ చేద్దామనుకుంటున్నాను. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకొని గిఫ్ట్ తట్టకపోతే నాకు మెయిల్ పెట్టండి.. ఎవరికి ఇద్దామనుకుంటున్నారు ... వారి గురించి ఓ పేరాగ్రాఫ్ .. మీ బడ్జెట్. నేను మీకు ఐడియాలు ఇస్తా అన్నమాట. ఇది పూర్తి ఉచితం. ... ప్రస్తుతానికి. ఈ సర్వీస్ బాగా అలవాటయ్యాక అప్పుడు ఛార్జ్ చెయ్యడం మొదలు పెడతా అన్నమాట. 

ఇంట్రస్ట్ ఉన్నవారికి ఇమెయిల్ ఐడి ఇస్తా. 

ఇది నా కానుక! 

Comments

  1. మీరేదో “ఓయ్” సినిమాలో సిద్ధార్థ్ బాపతులాగా ఉన్నారే 🙂?

    మొత్తానికి కానుకలు ఇవ్వడం అనే ప్రక్రియను కళ నుండి శాస్త్రం స్ధాయికి తీసుకు వెళ్ళారన్నమాట? థీసిస్ వ్రాస్తే PhD దొరకచ్చండోయ్ 👍🙂.

    సీరియస్ లీ ….. కానుక ఇవ్వడానికి ప్లాన్ చెయ్యడం, ఇవ్వడం అనే దానికి ultimate (నా అభిప్రాయంలో) ఓ హెన్రీ (O.Henry) గారు వ్రాసిన చాలా ఆర్ద్రమైన కథ “The Gift of the Magi” అనే సంగతి మీకు తెలిసే ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. అవునండీ....చాలా మంచి కథ అది!

      Delete
  2. మంచి సర్వీసు. స్నేహితులకు బహుమతులుగా పుస్తకాలు ఇవ్వడమే నా అలవాటు.ఇక పిల్లలకి కావలసినవి కొనివ్వడం అలవాటు. ఈ మధ్య బజారుకి వెళ్ళలేక, వాళ్ళనే ఏం కావాలని అడిగి తగిన దబ్బు లివ్వడం అలవాటు చేసుకున్నా :)

    మీ సర్వీసు పైడ్ సర్వీ అయ్యేదాకా నేను ఉండాలని కోరిక :)

    ReplyDelete
  3. మీ మెయిల్ ఐడీ చెప్పండి. సంవత్సరానికి ఒక్కరోజు గుర్తుపెట్టుకో లేని వారు తిథి, నక్షత్రం, మాసం గుర్తు పెట్టుకుంటారా? నా మెయిల్ id లో నా పుట్టినరోజు పెట్టినా కూడా మర్చిపోయిన రోజులు ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. అయ్యో .. ఆలా  మర్చిపోతున్నారా? ఈ ట్రెండ్ నాకు తెలీలేదే! మన ఇళ్లలో ఓ తాతాగారో మామ్మగారో ఉండేవారు ... మనవల మానవరాళ్ళ పుట్టినరోజులు తెలుగు కాలెండర్ ప్రకారం రాసి పెట్టేవారు ... వాళ్ళ జాతకాలు వేయించాల్సి వచ్చినపుడు వీళ్ళ నోట్స్ ఏ పనికి వచ్చేవి! 

      Delete
  4. ఈ తరం పిల్లల కి మూడు పుట్టిన రోజుల ఆశ చూపించి వారు పుట్టిన తిథి, నక్షత్రం, తెలుగు మాసం, తెలుగు సంవత్సరం పేరు తెలుసుకుని గుర్తుంచుకునేలా చేస్తున్నాను. ఐటం సాంగ్ లో మెసేజ్ ఓరియెంటెడ్ లిరిక్స్ పెట్టినట్టు అన్నమాట.

    ReplyDelete
  5. నేనొక సర్వీస్ ఓపెన్ చేద్దామనుకుంటున్నాను. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకొని గిఫ్ట్ తట్టకపోతే నాకు మెయిల్ పెట్టండి.

    నేను మాత్రం అందరి birthdays గుర్తు పెట్టుకుంటాను. Gifting ideas ఇస్తా అన్నారు కదా?

    ReplyDelete
    Replies
    1. Yes yes ofcourse... nittalasowmya@gmail.com

      Delete
  6. అటువంటివి గుర్తు పట్టడానికి నిశితమైన పరిశీలనా దృష్టి ఉండాలి, “నీహారిక” గారూ 🙂.

    మా పెదనాన్న గారి భార్యకు తన పిల్లల పుట్టినరోజులు వగైరాలతో బాటు తన మరిది గారి పిల్లలవి (అంటే మేం), తన ఆడపడుచుల పిల్లలవి (అంటే మా మేనత్తల పిల్లలు) పుట్టినరోజులు, పెళ్ళిరోజులే కాక వాళ్ళ పిల్లలవి కూడా గుర్తుండేవి - తిథుల లెక్కన, అంతే కానీ ఇంగ్లీష్ కాలెండర్ తేదీలు కాదు. ఎక్కడా వ్రాసి కూడా పెట్టుకోలేదు - చదువు రాదు. అద్భుతమైన జ్ఞాపకశక్తి. ఆమె ఒక అరుదైన వ్యక్తి 🙏.

    ReplyDelete
    Replies
    1. అవును... వాళ్ళని కదిలిస్తే .... అప్పుడు శ్రావణ మాసం వానలు పడే అప్పుడు పుట్టింది కదూ అది... ఇలా ఉంటాయి వాళ్ళ జ్ఞాపకాలు!

      Delete
    2. అబ్బే, ఆవిడ చెప్పేది అలా జనరల్ గా ఉండేది కాదండి. శ్రావణ మాసం వానల్లో పుట్టాడు అనో, మాయాబజార్ సినిమా వచ్చిన వారంలో పుట్టింది అనో చెప్పటం కాదు …. చాలా ఖచ్చితంగా ఆ రోజు తిథి, ఏ మాసం అని స్పష్టంగా చెప్పేది. ఆ తిథికి సంబంధించిన తేదీ ఏమిటో మనం ఆ నాటి వెంకట్రామా తెలుగు క్యాలెండర్ లోనో పంచాంగంలోనో చూసేసుకోవడమే. “అట్లుండేది” ఆవిడతో 🙂.

      Delete

Post a Comment