హ్యాపీ వెయిటింగ్

తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...

ఎదురుచూడడం, వెయిటింగ్ .... వీటి గురించి రాద్దామనుకోగానే నాకు 'కలువ నిరీక్షణ' అనే సాహిత్యమే గుర్తొచ్చింది ఎందుకో. 

తుషార శీతల సరోవరం లాంటి అందమైన సెట్టింగ్ లో ఎవరైనా బానే ఎదురుచూస్తారు. కానీ విషయం విషమం అయిపోయి, పరిస్థితులు పీకల మీదకి వచ్చేసినప్పుడు, అలా వచ్చిన రాకపోయినా మనం వచ్చేసినట్టే ఆందోళన పడిపోతున్నప్పుడు ఏం చేయాలి? అసలు ఎదురుచూడటం అంటేనే విసుగు ఉన్న వారు ఏం చేయాలి? 

ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితం లో ఎదురుచూపులు తప్పవు కదా. 

బస్సు కోసం, డొమెస్టిక్ హెల్ప్ కోసం, ఓ మంచి అవకాశం కోసం, ప్రేమ ప్రతిపాదన చేసాక ఎదుటి వ్యక్తి సమాధానం కోసం, మెడికల్ రిపోర్ట్స్ కోసం, అవి పుచ్చుకొని డాక్టర్ దగ్గర మన వంతు కోసం, సమాజం లో మార్పు కోసం, ఓ సినిమా లో ఎప్పటికీ మొదలవ్వని కథ కోసం, సంతానం కోసం, ప్రొమోషన్ కోసం, లక్ తిరగడం కోసం, రివెంజ్ కోసం, అప్పు కోసం, ఆ అప్పు తీర్చడం కోసం, సొంత ఇంటి కోసం, కలల జీవితం కోసం, పుట్టినరోజు కోసం, బరువు తగ్గడం కోసం.... చివరికి మరణం కోసం... ఎదురుచూపులు తప్పవు కదా.

(పైన పేరా అనుకోకుండా దండకం ఛందస్సు లో వచ్చిందేమో అని అనుమానంగా ఉంది) 

హుందాగా ఎదురుచూడటం ఎలా? 

ముందుగా మనకి తెలియాల్సింది ఎక్కడ ఎదురు చూడాలో, ఎక్కడ చూడక్కర్లేదో. (ఈ విచక్షణ తెలీక నా జీవితం లో చాలా సమయం వృధా చేసుకున్నాను. )

రెండోది, వస్తుందో రాదో తెలీని భవిష్యత్తు కోసం ఈ రోజు పాడు చేసుకోకుండా, మానసిక ఆరోగ్యం చెడిపోకుండా ఎలా ఎదురుచూడాలి? ఇది నా సందేహం. 

థియరీ లో చిట్కాలు బానే ఉన్నాయి. కానీ అవి ప్రాక్టికల్ గా కూడా పని చెయ్యాలి కదా. 

ముందుగా తెలియల్సిన విషయం ... నిరీక్షణ కి కావాల్సింది ఓర్పు. 

ఒక్కో సారి ఈ ఓర్పు నేర్పించడానికీ జీవితం వెయిట్ చేసే పరిస్థితుల్ని కల్పిస్తుంది  అనేది నా అభిప్రాయం. 

రెండోది దేని కోసం ఎదురుచూస్తున్నామో అదే ఫోకస్ అవ్వకూడదు. నిజానికి దాని గురించి ఎంత మర్చిపోతే అంత త్వరగా ఆ విషయం అవుతుందని నేను గమనించాను. కానీ ఇది ఒక్కోసారి ప్రాక్టికల్ గా సాధ్య పడదు. ఓ అమ్మాయి కి ఓ అబ్బాయి ప్రపోజ్ చేస్తే, ఆ అమ్మాయి ని అతను రోజూ చూడాల్సి వస్తే ఎలా మర్చిపోగలడు పాపం! కానీ సాధ్యం చేసుకుంటే చాలా బాగుంటుంది. 

అలా సాధ్యం అవ్వాలంటే ఫోకస్ వేరే విషయాల మీద కి మార్చుకోవాలి. ఇది ఇంకో చిట్కా. 

సుదీర్ఘ రైలు, బస్సు ప్రయాణాల్లో గమ్యం  కోసం అదే పనిగా ఎదురుచూడకుండా పుస్తకం చదువుకోవడమో, ఎంబ్రాయిడరీ, అల్లికలు చేసుకోవడమో, ఎవరితోనైనా కబుర్లు చెప్పుకోవడమో ... ఇలా చేస్తే సమయం తెలీదు చూడండి.. అలాగన్నమాట. 

సమయాన్ని మరిపించేలా చేసుకొనే చిట్కా ఒకటైతే, దీనికంటే ఓ మెట్టు ఎక్కువ... నిరీక్షణ లో ఆనందం పొందడం. 

శబరి కూడా ఎంతో కాలం ఎదురుచూసింది తన వరం ఫలించడం కోసం. ఆమె కి ఓర్పు తో పాటు తోడైంది నమ్మకం. రాముడు వస్తాడో రాడో అని ఏనాడూ ఆమె అనుమానించిన దాఖలాలు కనపడవు. ఏ రోజు కా రోజు, ఆ రోజే రాముడొచ్చే రోజని ఇల్లు శుభ్రం చేసి, పళ్ళు కోసుకొచ్చి, పూల మాలల తో పాటు పాటలు కూడా కట్టి తరించింది శబరి. ఇది చాలా సాత్వికమైన నిరీక్షణ అనిపిస్తుంది. 

రూమి అంటాడు "ఓర్పు అంటే ఊరికే కూర్చొని ఎదురుచూడటం కాదు. భవిష్యత్తు ని ముందే చూడటం. ముల్లుని చూస్తూ గులాబీ ని ఊహించగలగటం. రాత్రిని చూస్తూ కూడా ఉదయం వస్తుంది అని నమ్మగలగటం. ప్రేమాత్ములందరూ ఓర్పు కలిగిన వారే. చంద్రుడు పూర్ణుడవ్వడానికి సమయం పడుతుందని వారికి తెలుసు". 

ఈ కోట్ చూస్తే శబరి గురించే చెప్పారేమో అనిపిస్తుంది నాకు. 

ఓర్పు కి ఇంకో ఉదాహరణ రామదాసు. ఈయన ఓర్పు పూర్తి సాత్వికమైన ఓర్పు కాదు. కానీ తక్కువ మాత్రం చెయ్యలేం. నిజానికి ఈయన ఎదురుచూసిన పరిస్థితులు శబరి గారి కంటే దారుణమైనవి. రామదాసుకి రాముడు వస్తాడో రాడో తెలీదు. వస్తాడని ఎవరూ చెప్పలేదు, వరమియ్యలేదు. అయినా నిరంతరం రామకీర్తన లో నే కాలం గడిపాడు తప్ప ఇంకో పని చెయ్యలేదు. తిట్టినా, పొగిడినా కీర్తనలోనే! "ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు ... రామచంద్రా... దెబ్బలకోర్వక అబ్బా తిట్టితినయ్యా రామచంద్రా" అంటాడు కదా... ఇది కొంచెం మన జీవితాలకి దగ్గరైన వెయిట్ స్టోరీ అనిపిస్తుంది. మానవ సహజంగా అనిపిస్తుంది... మనం అందుకోలేనంత ఆదర్శవంతంగా అనిపించదు. 

కర్మ సిద్ధాంతం వల్ల భారతీయులం చాలా బతికి పోయాం. 'నీకెందుకు ఏది వస్తుందో రాదో... నీ పని నువ్వు చూస్కో'  అని కృష్ణుడు అంత క్లియర్ గా చెప్పాక ఇంక ఏమీ చెయ్యకుండా ఎదురుచూస్తూ ఎందుకు కూర్చుంటాం? 

ఎదురుచూపులకి ఇంకో కోణం ఉంది. 

వేట లో పులి చేసే వెయిటింగ్... అవకాశం కోసం. ఇదే కుటిల నీతి కి కూడా వర్తిస్తుంది. స్లీపర్ సెల్ లాగా ఉంటూ అవకాశం రాగానే దాడి చెయ్యడం. 

పవర్ పాలిటిక్స్ ప్రకారం ఎంత సేపు వెయిట్ చేయిస్తే అంత పవర్ ఫుల్ అన్నట్టు. ఎదురుచూసే వాడు అంత బలహీనుడు లేదా అవసరం ఉన్నవాడు అన్నట్టు. 

సాహిత్యం, సినిమాల విషయానికొస్తే ... గజళ్ళు, ప్రేమ సాహిత్యం లో ఎదురుచూపులు అనే థీమ్ లేకుండా ఉండదు కదా. 

ఓ సినిమా ఉంటుంది. 'ది టర్మినల్' అని. ఓ కాల్పనిక దేశానికి చెందిన వ్యక్తి హీరో. న్యూ యార్క్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు. దిగాక తెలుస్తుంది.. అతని దేశం లో రాజకీయ సందిగ్ధం ఏర్పడి ఆ దేశాన్ని అమెరికా ఓ దేశం గా పరిగణించలేకపోతుంది. అందువల్ల ఇతని పాస్పోర్ట్ రద్దవుతుంది. ఇతను వెనక్కి వెళ్ళలేడు .... అలా అని అమెరికా లో ప్రవేశించలేడు. ఎయిర్పోర్ట్ లో నే తొమ్మిది నెలల పాటు ఉండిపోవాల్సి వస్తుంది... అయోమయ పరిస్థితుల్లో. కానీ ఆ సమయాన్ని అతను ఎంత అందంగా గడుపుతాడో, ఎంత మంచి స్నేహాలు చేస్కుంటాడో .... ఆ సినిమా చూపిస్తుంది. భాష రాకుండానే అతను నిర్మల మైన మనసుతో సృష్టించుకున్న బంధాలు అతని చివరికి ఎంతో సహాయ పడతాయి, త్యాగాలు చేస్తాయి. 



ఆ సినిమా కాప్షన్ చూసారా.. లైఫ్ ఇస్ వెయిటింగ్. 'జీవితం ఎదురుచూస్తోంది' అనేది ఒక అర్ధమైతే 'జీవితం అంటేనే ఎదురుచూపులు' అని ఇంకో అర్ధం! 

కుక్ చేసే వాళ్ళని కుక్కర్ అని ఎలా అనకూడదో వెయిట్ చేసే వాళ్ళని వెయిటర్ అని అనకూడదు ఏంటో. మరి యేమని పిలవాలి? 

నిరీక్షకులు అనే పదం ఉందనుకోండి. కార్పొరేట్ వాళ్ళైతే ఓ హడావుడి టైటిల్ పెట్టేస్తారు. నిరీక్షణా నిపుణులు, ఎక్స్పర్ట్ ఇన్ ఎదురుచూపులు ... ఇలా . 😀😂 

నేను జీవితం లో వెయిట్ చేసిన సమయం ఓ బస్సు కోసం 3-4 గంటలు, ఓ ప్రాజక్టు మొదలవ్వటం కోసం 2 సంవత్సరాలు. ఇప్పటికీ ఇవి నాకు తప్పనిపిస్తాయి. ఈ విషయం లో నన్ను నేను అంతగా క్షమించుకోలేను. ఇలాంటి జీవితానుభావాల దృష్ట్యా నాకు ఓ అభిప్రాయం ఏర్పడింది. ఎవరైనా లేదా ఏ పరిస్థితి అయినా నన్ను వెయిట్ చేయిస్తే అది నాకు కరెక్ట్ కాదని. 

జీవితం అంటే ఏంటి అంటే చాలా నిర్వచనాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది... ప్రస్తుతం నడుస్తున్న కాలమే జీవితం. గతం కాదు. భవిష్యత్తు కాదు. 

అర్ధం లేని నిరీక్షణ, అవసరం లేని ఎదురుచూపులు మన ఈ రోజుని మనకి కాకుండా చేస్తాయి అని నాకు అనిపిస్తుంది. 

చేస్తే శబరి లాంటి సాత్విక నిరీక్షణ చెయ్యాలి. లేదా రామదాసు లాంటి సంగీత సాహితీ ఆధ్యాత్మిక నిరీక్షణ చెయ్యాలి. ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు కానీ ఏవో ప్రేమ కథలు చెప్తారు చూడండి... వారి లాంటి నిరీక్షణ చెయ్యాలి. ఇంక దీనికి తక్కువ నాణ్యత ఉన్న వెయిటింగ్ చేస్తే జీవితం నాణ్యత తగ్గిపోతుంది. 

ఈ తరానికి ఓర్పు లేదు... ఎక్కువ ఎవరూ దేనికీ ఎదురుచూడట్లేదు... ఓ ఉత్తరం రాసి దాని కి జవాబు రావడం ... ఇలాంటి నిరీక్షణ లో ని ఆనందాన్ని ఈ తరం మిస్ అయిపోతోంది అని ఓ అభిప్రాయం ఉంది. అది కొంత నిజమే. కానీ ఈ తరానికి ఉన్న లాంటి ఎదురుచూపులు ఈ తరానికి ఉన్నాయ్ పాపం. ఎదురుచూసే విషయాలు మారాయి అంతే అనిపిస్తుంది నాకు. 

ఎలా ఎదురుచూడాలి అని ఇంగ్లిష్ లో గూగుల్ చేస్తే కొన్ని చిట్కాలు ఇచ్చారు. అందులో రెండు మూడు పైన ప్రస్తావించా కదా. ఆఖరి గా ఒకటి చెప్పారు. ఎదురుచూపులు తప్పవు అన్నప్పుడు మీతో పాటు ఎవరినైనా తోడు తెచ్చుకొండి అని. ఆ సపోర్టు, ఆ ధైర్యమే వేరు కదా. 

మనం ముఖ్యం అనుకున్న వారికోసం/వాటికోసం ... హ్యాపీ వెయిటింగ్!  

Comments

  1. సుబ్బారెడ్డి అడపాలSeptember 8, 2022 at 8:00 AM

    Sabari~Saburi = Patience, Perseverance, యాదృచ్చికమా

    ReplyDelete
  2. నేను మీ కామెంట్ ని అర్థం చేసుకోడానికి టైం పట్టింది! హహహ.. శబరి... సబురి... ఈ ప్రపంచం లో ఏదీ యాదృచ్చికం కాదు అని నమ్ముతాను నేను!

    ReplyDelete

Post a Comment