ఎందు'క్యూ'?
నాకు క్యూ ల తో అపారమైన అనుభవం ఉంది.
రేషన్ షాపు, బస్ పాస్ రెన్యూవల్, ఈ సేవ, సినిమా టికెట్, ట్రెయిన్ రిజర్వేషన్, సూపర్ మార్కెట్ బిల్ కౌంటర్, బ్యాంకులు, పాస్పోర్ట్ ఆఫీసు లలో కొన్నేళ్లు చెప్పులు అరగదీసియున్నాను (ఆన్లైన్ దయ వల్ల కొన్ని తప్పుతున్నాయి!)
మన సంప్రదాయం లో క్యూలన్నిటికి తలమానికమైనది తిరుమల క్యూ.
తిరుమల క్యూల నిలయం ... అసలు ముందు తిరుమల దర్శనానికి వెళ్లాలంటేనే బయో మెట్రిక్ క్యూ లో నుంచోవాలి. తర్వాత అకామడేషన్ క్యూ. దర్శనం క్యూ సరేసరి. తర్వాత లడ్డూ క్యూ. ఉచిత భోజనం చెయ్యాలంటే అక్కడ కూడా క్యూ.
ఇన్ని దైవిక, లౌకిక క్యూ లలో కొన్ని గంటలు గడిపిన అనుభవ సారం ... ఈ కింది 'క్యూ'లంకషమైన లిస్టు.
క్యూలలో కామన్ గా కనిపించే వివిధ రకాల మనుషులు:
అయోమయం జగన్నాధం - ఈ వ్యక్తి కి అన్నీ డౌట్లే .... అసలు ముందు తప్పు క్యూ లో అరగంట నుంచొని ఎవరో చెప్తే సరైన క్యూ లోకి వస్తారు. వచ్చాక కూడా ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది తో సలహా సంప్రదింపులు జరుపుతారు .. వీళ్ళ చేతిలోంచి పేపర్లు పడిపోతూ ఉంటాయి ... పెన్నుండదు... భీత హరిణాల వంటి చూపుల తో చుట్టూ చూస్తుంటారు ... వీళ్ళ పరిస్థితి ని చూసి ఎవరో ఒకరు వీళ్ళకి సాయం చేస్తూ ఉంటారు జనరల్ గా.
ఈగోయిస్టు - తాను ఈ లైన్ లో నుంచోవాల్సి రావడం ఓ అవమానం గా భావిస్తారు ... చికాకు, కోపం, అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు. సిబ్బంది ని అనర్హులని, అసమర్ధులని తిడుతూ ఉంటారు
మౌని - వీళ్ళ తరహా వాళ్ళకి ఇదంతా ఎలా నడుస్తుందో తెలుసు .. తిరుమల లాంటి క్యూలలో స్తోత్రాలు పుస్తకాలు, మంచినీళ్ల బాటిల్సు, పటిక బెల్లం (షుగర్ లో అవ్వకుండా) లాంటివన్నీ అమర్చిపెట్టుకొని 'మనకెందుకు ఈ ఆలోచన రాలేదా' అని అనుకొనేలా ప్రవర్తిస్తారు. మౌనంగా తమ పని చేసుకొని వెళ్ళిపోతారు ..
చూపరులు - లైన్ లో ఎవరేం చేస్తున్నారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి? ఇలాంటివి అన్నీ గమనిస్తూ, స్కాన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి క్యూ ఎంత సేపైనా ఫర్వాలేదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్నే టివి గా చేసుకుని గంటలు గంటలు నుంచోగలరు
లైన్ పోలీసు - లైన్ లో తమ కంటే ముందుగా/క్యూ మధ్యలో ఎవరైనా చొరబడబోతే వాళ్ళని తిట్టి లైన్ వెనక్కి పంపించే బాధ్యత వీళ్లది ... వీళ్లకి ఈగోయిస్టుల సహకారం ఉంటుంది
జోకర్ - ప్రతి క్యూ లో ఓ విదూషకుడు ఉంటాడు ... లైన్ కట్ చేసే వాళ్ళ మీద, కౌంటర్ వెనక ఉన్న సిబ్బంది మీద, అయోమయం జగన్నాధం కాండిడేట్ల మీద జోకులు వేసే బాధ్యత తీసుకుంటారు వీళ్ళు
విప్లవకారుడు - క్యూ గంటలు గంటలు కదలకపోతే తానూ రెచ్చిపోయి అందర్నీ రెచ్చగొట్టి గొడవ చేసే పవర్ ఉంటుంది వీళ్ళకి
స్పెషల్ కేసు - టెర్రరిస్ట్ అటాక్, బ్యాంకు దోపిడీ, hostage డ్రామా సినిమాల్లో ఓ గర్భిణీ స్త్రీ కంపల్సరీ ఉన్నట్టు గా క్యూ లలో ఓ 'స్పెషల్ కేసు' కంపల్సరీ గా ఉంటారు. వీళ్ళకి ఏదో ఒక ఎమర్జెన్సీ ఉంటుంది .. అది నిజంగా valid అయ్యుంటుంది ... అప్పటికి నాలుగైదు గంటల నుంచి నుంచున్న వారందరి సహనం, మానవత్వం ఈ 'స్పెషల్ కేసు' వచ్చి పరీక్షించినట్టవుతుంది.
ఇంక ఆఖరి కేటగిరి ...
లైన్ లో కనిపించని వారు - వీళ్ళకి ప్రతీ చోటా 'తెలిసిన' వాళ్ళుంటారు. లైన్ లో నుంచోవాల్సిన 'ఖర్మ' వీళ్ళకి పట్టదు ... వీళ్ళంటే అందరికీ ఒళ్ళు మంట.
నేను ఏ కేటగిరి అంటారా? సందర్భాన్ని బట్టి పై వాటిలో ఓ వేషం వేస్తూ ఉంటాను.
క్యూ లో నుంచోవడం ... ఇది మానవ సహజం కాని పని.
బెల్లం చుట్టూ ఈగలు క్యూ లో ఉండవు. ఒకరి తర్వాత ఒకరు అనేది అసలు ప్రకృతి లో లేదు.
అవసరార్ధం మనిషి తోటి మనిషి ని ట్రెయిన్ చేసి తెచ్చుకున్న పద్ధతి - క్యూ.
అందుకే మనకి ఇది అంత బాగా ఫాలో చెయ్యడం రాదు.
మన దేశంలోనే క్యూ లు ఇలా అనుకుంటే మీలో దేశభక్తి కొరవడినట్టే. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా క్యూలు పాటించేలా చెయ్యడం ఒక్కోసారి కష్టమే అవుతూ ఉంటుంది.
అమెరికా లో మాల్స్ లో కొన్ని బ్రహ్మాండమైన డిస్కౌంట్లు ఉన్న సేల్స్ జరుగుతూ ఉంటాయి క్రిస్మస్ టైం లో ... అప్పుడు తొక్కిసలాటలు, తోపులాటలు కామన్ గా చూడొచ్చు.
నాకు ఓ భయం ఉంది. కొన్ని సినిమాల్లో స్వర్గం ముందు, నరకం ముందు క్యూ ఉన్నట్టు చూపిస్తారు కదా. చచ్చిపోయి, ఆత్మ అయ్యాక కూడా క్యూ ల నుంచి ముక్తి లేదా?! అక్కడ 'తెలిసిన' వాళ్ళని పట్టుకోవడం ఎలా?
x
Comments
Post a Comment