వ్యసనానికి మందు

వ్యసనాల గురించి మనందరికీ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. 

వ్యసనపరుల్ని అసహ్యించుకుంటాం. బలహీనులు గా చూస్తాం. డిసిప్లిన్ లేని వాళ్ళు అని చులకన చేస్తాం. వాళ్ళు మారనందుకు కోప్పడతాం... విసిగిపోయి వాళ్ళని వెలేస్తాం.  

అలాగే వ్యసనం అనే హెడ్డింగ్ కింద కొన్ని పేర్లే రాస్తాం ... తాగుడు, డ్రగ్స్, జూదం... ఇలా. 

నేను చదివిన, చూసిన, అనుభవించిన విషయాలని పరిశీలిస్తే ఇది పూర్తి నిజం కాదు అని తెలిసింది. 

వ్యసనాలని ఈ మధ్య ఓ వ్యాధి గా పరిగణించడం మొదలు పెట్టారు. ('మహానటి' సినిమా లో డైలాగ్ గుర్తుందా?)

నాకు ఇది సబబు గా అనిపించింది. 

ఇది కూడా ఓ వ్యాధే అని తెలిస్తే మన కటువైన దృష్టి కోణం మారుతుంది. (తలనొప్పి వచ్చినవాడ్ని చూసి జాలి పడతాం, సహాయపడతాం కానీ అసహ్యించుకోము కదా)

ఇది జబ్బే. దీనికి చికిత్స కావాలి. అది కూడా ప్రొఫెషనల్ చికిత్స. 

తాగనని పెళ్ళాం బిడ్డల మీద, దేవుళ్ళ మీద ఒట్టేయించుకోవడం లాంటివి కాదు దీనికి మందు. 

వ్యసనానికి ఓ కారణం పలాయనవాదం. నిజ జీవితం భరింపరానిది గా మారినప్పుడు, ఎదుర్కొనే శక్తి లేనప్పుడు.. ఏదో ఎస్కేప్ వెతుక్కుంటాం. 

మనకి తోచిన వ్యసనాన్ని మనం ఎంచుకుంటాం. 

(ఇది ఇంకో కోణం ... ఎవరు ఏ వ్యసనాన్ని ఎందుకు ఎంచుకుంటారు? మద్యం ఎందుకు అన్నిటికంటే పాపులర్? అవైలబిలిటీ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది అనుకుంటా .. వీధి బాలలు వైట్నర్ ని ఎంచుకున్నట్టుగా) 

బయటికి కనిపించేవి కొన్ని. 

కానీ అసలు మనం గుర్తించని వ్యసనాలెన్నో. 

Renaissance Man అని ఓ ఇంగ్లీష్ సినిమా ఉంది. అందులో ఓ పాత్ర కి స్ట్రెస్ కలిగినప్పుడల్లా నిద్రపోతుంటాడు .. గంటలు గంటలు! అది అతని వ్యసనం. ఇది చూసి నేను ఆశ్చర్యపోయాను రెండు విషయాల్లో ... 

1. నిద్ర కూడా వ్యసనమేనా అని
2. నా అతి నిద్ర కి కారణం ఇదా అని 

ఒకప్పుడు ఆరోగ్యం, ప్రొఫెషనల్ లైఫ్ .. రెండూ అంతగా బాగోనప్పుడు నేను కూడా గంటలు గంటలు నిద్రపోయే దాన్ని. అది నా ఎస్కేప్. మెలకువ గా ఉంటే ఈ లోకం తో, నా ఆలోచనలతో, నా వైఫల్యాలతో డీల్ చెయ్యాలి .. నిద్రపోతే ఇవేవీ ఉండవు. 

ఫామిలీ హెల్ప్ తో నేను ఈ ఫేజ్ నుంచి బయటికొచ్చాననుకోండి. 

అప్పటి నుంచి వ్యసనాల బారిన పడిన వారి మీద ఎంపతీ పెరిగింది. అలాగే అందరూ గుర్తించని వ్యసనాల మీద కుతూహలం కూడా. 

కొంత మంది ఎమోషనల్ ఈటర్స్ ఉంటారు ... ఎక్కువ తింటూ ఉంటారు .. మనసుకి బాధ కలిగినప్పుడు ఇంకా ఎక్కువ తింటూ ఉంటారు. ఇదీ వ్యసనమే. 

కొన్ని మంచి విషయాలు మితిమీరినా వ్యసనమే ..... కొంత మంది పుస్తకాల ప్రపంచం లోంచి బయటికి రారు. రియాలిటీ లో ఉండటం ఇష్టపడరు. (ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ లో మిస్టర్ బెన్నెట్ పాత్ర లాగా) తులసీదాస్ .. పుట్టింట్లో ఉన్న భార్య ని ఎలాగైనా చూడాలని తుఫాను లో నానా కష్టాలూ పడి ... ఆమె మేడ ని దొంగ చాటు గా ఎక్కి .. ఆ ప్రయత్నం లో ఓ పాము ని ఊడ అనుకొని గోళ్ళతో రక్కి చంపేసి మరీ ఆమెని కలిస్తే ఆమెకి రొమాంటిక్ గా అనిపించదు సరికదా అసహ్యించుకుంటుంది. ఎందుకంటే భార్య పట్ల అతని ప్రేమ వ్యసనంగా మారింది. 

ఇలాంటిదే మిత్రుల వ్యసనం. వీళ్ళ చుట్టూ ఎప్పుడూ కొంత మంది ఉండాలి.. వాళ్ళకి అన్నీ వీళ్ళే కొంటారు .. ఆస్తులు కరిగించేస్తారు .. ఆ మిత్రులు వీళ్ళకి తిరిగి ఏమీ చెయ్యరు (వాళ్ళు నిజమైన మిత్రులు కారు కనుక). 

వర్కహాలిక్ అని ఇంగ్లిష్ లో ఓ మాట ఉంది... వీళ్ళకి పని ఓ వ్యసనం. వీళ్ళ జీవితం లో మిగిలిన డిపార్ట్మెంట్స్ (కుటుంబం, స్నేహితులు, సరదాలు, ఆరోగ్యం) ఇలాంటివి బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. 

షాపహాలిక్ అని ఇంకో రకం ... డబ్బులు అయిపోయి క్రెడిట్ కార్డుల వాళ్ళు వెంటపడుతూ ఉన్నా వీళ్ళు షాపింగ్ ఆపలేరు. తమ లో ఎంప్టీ ఫీలింగ్ ని కొత్త వస్తువుల తో నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 

ఇంకో తమాషా రకమైన వ్యసనం ఉంది. వ్యక్తుల వ్యసనం. ఫలానా వ్యక్తి అంటే మనకి ఇష్టం. కానీ వాళ్ళు మనని పట్టించుకోరు, ఇష్టపడరు, సహాయపడరు, వాళ్ళకి మన మీద ఇంటరెస్ట్ లేదు. (ఇది వాళ్ళ తప్పు కాదు కూడా) అయినా వాళ్ళ తో అలాగే ప్రేమ లేని బంధాల్లో చిక్కుకొని వదల్లేకుండా పడి ఉంటాం. ఇదీ వ్యసనమే. 

ఓ భర్త తాగుబోతు. అతని చేత ఎలాగైనా తాగుడు మాన్పించాలి అని భార్య ప్రయత్నం. ప్రాపంచికంగా అన్ని ప్రయత్నాలూ చేసి విఫలమయ్యాక దేవుడి వైపు తిరిగింది. గంటలు గంటలు పూజలు, కళ్ళు తిరిగిపోయి ఆరోగ్యం పాడయిపోతున్నా కఠోరమైన ఉపవాసాలు, దీక్షలు, మొక్కులు, బాబాలు, తాయత్తులు, లేహ్యాలు ... 

ఆ ఇంట్లో ఇద్దరు వ్యసనపరులు 

ఒకరు మద్యం 
ఒకరు మతం 

ఒకరికి తాగుడు 
ఒకరికి దేవుడు 

జ్యోతిషం లాంటి వాటిని మితిమీరి ఉపయోగించటం .. ఇది ఇంకో రకమైన ఆధ్యాత్మిక వ్యసనం ... 

'తప్పని తెలిసినా మానలేకపోతున్నాను' 'వద్దనుకుంటూనే చేసేస్తున్నాను' అనే మాటలు మీ నుంచి ఏ విషయం లో వచ్చినా అది వ్యసనమే అని హింట్. మీ అలవాటు ఏదైనా మీ కుటుంబాన్నీ, మీ మిత్రులని మీ పట్ల వర్రీ అయ్యేలా చేస్తుండటం మీకు ఇంకో హింట్. 

మనలో ఏదో ఖాళీ ని ఈ వ్యసనాలు పూరిస్తాయి అనుకోవడం వల్లే మనం వీటి బారిన పడతామేమో 

కానీ ఏ వ్యసనమైనా అడ్డదారే. గుర్రాల రేసులు, లాటరీల లాగా. But in life, there are no short cuts. 

ఆ ఖాళీ ఏదో తెలుసుకోవడం ముఖ్యం ... దేన్నుంచి పారిపోయి ఈ వ్యసన బిలం లో దాక్కుంటున్నామో తెలుసుకోవడం ముఖ్యం .. తెలిసాక దాన్ని వ్యసనం తోడు లేకుండా ఎదుర్కోడానికి రెడీ అవ్వడం ముఖ్యం 

ఈ విషయం లో మన సపోర్ట్ సిస్టమ్స్ .. మిత్రులు, కుటుంబం... 

వీళ్ళ మీద పాపం రెట్టింపు బాధ్యత ... మొదటిది... ఇదంతా అర్ధం చేస్కోవడం. (కొన్ని అర్ధం చేసుకోలేని భయంకరమైన అడిక్షన్స్ ఉంటాయి ... సెక్స్ అడిక్షన్ లాంటివి) రెండోది మన తప్పటడుగులని భరిస్తూ మనతో ఈ ప్రయాణం చేయడం. 

కొన్ని జీవితాలు ఈ వ్యసనాలని ఎదుర్కోకుండానే కడతేరిపోతూ ఉండటం చూస్తాం. వారి గురించి ఏం చెప్పాలో నాకు తెలియదు. 

వ్యసనపరులకి మనం ఒక్కో సారి ఏమీ సహాయం చెయ్యలేక పోవచ్చు... 

ఒకటి చెయ్యచ్చు. అదే అన్నిటికన్నా ముఖ్యమైన సహాయం కూడా. 

వారిని నైతికంగా పతనమైన వారిగా కాక చికిత్స అవసరమైన రోగి గా గుర్తించడం. 

Comments


  1. ఆలోచనాత్మకమైన విశ్లేషణతో మీదైన శైలిలో వ్రాశారు మీ ఈ మంచి టపా 👌. అవును, మీరన్నట్లు వ్యసనం ఒక రుగ్మతే. చికిత్స చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే అధికశాతం వ్యసనపరులు అంత తేలికగా చికిత్సకు ఒప్పుకోరు. ఆ, తలుచుకుంటే ఏ క్షణం నుంచైనా మానేయగలను, నా విల్ పవర్ అటువంటిది అంటూ దాటవేసే మాటలు చెబుతుంటారు. ఏమయినా మీరు కరక్ట్ గా అన్నట్లు ఇక్కడ కుటుంబ సభ్యుల పాత్ర అవసరం ఎంతైనా ఉంటుంది.

    వ్యసనాల్లో రకాల గురించి చాలా ఉదాహరణలు ఇచ్చారు మీరు. కొన్నిటి మీద నా అభిప్రాయాలు, సందేహాలు ఇక్కడ 👇.
    ------------------------------
    // "వీధి బాలలు వైట్నర్ ని ఎంచుకున్నట్టుగా)" // అన్నారు. అర్థం కాలే. "వైట్నర్" ఏమిటి?

    // " .. నిద్రపోతే ఇవేవీ ఉండవు."//. వేరే వ్యసనాలకు లోనవకుండా నిద్ర పోవడం మంచిదే అనుకోండి .. కానీ కావాలనుకున్నప్పుడల్లా నిద్ర పడుతుందా?

    // "మిత్రుల వ్యసనం. ........ (వాళ్ళు నిజమైన మిత్రులు కారు కనుక).".//. చాలా కరక్ట్ అండి. మీరు చెప్పిన వ్యసనం ఒకరకం అనుకోండి. అయితే మరొక రకం మిత్రులు ఉంటారు - ముఖ్యంగా విద్యార్థి దశలో. ఇటువంటి వారు ఇంటి దగ్గర తను చక్కగా చదువుకుని, హోంవర్క్ పూర్తి చేసేసుకుని అప్పుడు బయలుదేరి స్నేహితులింటికి వెళ్ళి కావాలని వాళ్ళ చదువుని చెడగొడుతుంటారు. అది గ్రహించలేక, ఇంట్లోవాళ్ళు చెప్పినా అటువంటి స్నేహం వదిలించుకోక కొనసాగించడం .... ఎస్, ఇదొక రకపు మిత్రుల వ్యసనం.

    // "వ్యక్తుల వ్యసనం. ఫలానా వ్యక్తి అంటే మనకి ఇష్టం." //. అహ్హా, మన సినిమా నటుల అభిమానులు ఇటువంటి వ్యసనపరులే 🙂. నిజానికి వీళ్ళకు వైద్యసహాయం ఎంతైనా అవసరం. "హీరోఅభిమానం డి-అడిక్షన్ సెంటర్" అని ఎవరైనా ఔత్సాహికులు ప్రారంభిస్తే బాగుంటుంది. మీరు చెప్పిన "వ్యక్తుల వ్యసనం" వేరే రకం అనుకోండి, అయినా వెర్రితలలు వేస్తున్న హీరోల అభిమానమే నాకు వెంటనే తట్టింది. ఇదొక పెద్ద సామాజిక రుగ్మతగా / జాడ్యంగా తయారవుతోంది.
    ------------------------
    చివరకు :-
    // "కొన్ని మంచి విషయాలు మితిమీరినా వ్యసనమే" //. అవునండి, బ్లాగులు చదవడం కూడా వ్యసనంలా తయారవుతోంది, ఎలా తగ్గించుకోవాలో / మానాలో తెలియడం లేదు 🙂😀 (j k).

    ReplyDelete
    Replies
    1. మీ స్పందన కి ధన్యవాదాలండీ .. అవును.. acceptance మొదటి మెట్టు చికిత్స కి. అదే కష్టం కూడానూ.

      వైట్నర్ అంటే స్టేషనరీ షాపుల్లో దొరుకుతుంది చూడండి... టైపు లో, ప్రింటులో తప్పులుంటే వాడతారు ... అది. దాని వాసన నెయిల్ పాలిష్ లాగా ఉంటుంది... అది పీలుస్తుంటారు ఓ వ్యసనంగా... వీధి బాలలు. అది చాలా చవక.. ఈజీ గా దొరుకుతుంది కూడా కదా.

      నిద్ర పట్టకపోవడం అంటూ ఉండదండి. .. వ్యసనమంటేనే అది.

      మిత్రుల వ్యసనం, వ్యక్తుల వ్యసనం గురించి మీరు చెప్పింది/అనుకుంది కూడా అయ్యుండొచ్చు. హాని కలిగించేది .. వదలలేనిది ఏదైనా అంతే కదా.

      బ్లాగుల వ్యసనం మంచిదేనేమోనండి హహ్హహా .. ఇందులో నా స్వార్ధం లేకపోలేదు!

      Delete
    2. థాంక్స్ సౌమ్య గారు. ఆ వైట్నర్ (correction fluid) గురించి నాకు తెలుసు, కాకపోతే మీరన్న “వీధిబాలల” context ఏమిటో అర్థం కాలేదు ... ఇప్పుడు మీరు వివరించేటంత వరకు. కాదేదీ వ్యసనానికి అనర్హం అన్నమాట 🙁.

      (అన్నట్లు, నేను పని చేసిన ఆఫీసులో నా డిపార్టుమెంటులో వైట్నర్ వాడకాన్ని నేను నిషేధించాను. సంతకం అయిపోయిన కాగితాల మీద కూడా కావలసినచోట వైట్నర్ పూసి అనధికార / చాటుమాటు దిద్దుబాట్లు చేసే ప్రమాదం ఉంటుంది కదా ... అందువల్లనన్నమాట. కరెక్షన్ అవసరమయితే తిరిగి టైప్ చెయ్యమనేవాడ్ని. టైపిస్ట్ తిట్టుకునేవాడనుకోండి, అది వేరే సంగతి 😀😀. సరే, కంప్యూటర్లు ఆఫీసుల్లోకి వచ్చిన తరువాత వైట్నర్ ను మర్చిపోయారు లెండి)

      సంక్రాంతి శుభాకాంక్షలు 🌾.

      Delete
    3. Sankranthi Subhakankshalu meeku koodaa andi!

      Delete
  2. 🦁 gaaru,

    >>బ్లాగులు చదవడం కూడా వ్యసనంలా తయారవుతోంది, ఎలా తగ్గించుకోవాలో / మానాలో తెలియడం లేదు.>>>

    డబ్బు ఖర్చుపెట్టి మరీ చదువుతున్నారుగా ....మీ శ్రీమతిగారు కలిస్తే మీ వ్యసనాన్ని ఎలా తగ్గించాలో నేర్పిస్తాను.

    ReplyDelete
    Replies
    1. @నీహారిక గారు,
      తప్పక నేర్పించే ప్రయత్నం చేయండి. సకుటుంబంగా మా ఇంటికి రండి, ఆ కిటుకులేవో మా శ్రీమతికి చెప్పండి 👍.
      సంక్రాంతి శుభాకాంక్షలు🌾.
      🦁
      📚😎⭐️

      Delete
    2. మీ అడ్రెస్ మెయిల్ చేయండి. తప్పక వస్తాము. మావారయితే వ్యసనాలకే పెద్ద వ్యసనమై తరిమేస్తారు. చిన్నగీత ప్రక్కన పెద్ద గీత గీయడమే...చదవడం మానేసి వ్రాయండి.

      Delete

Post a Comment